employe
-
ఏటీఎంల్లో డిపాజిట్ చేయాల్సిన రూ.2 కోట్లతో ఉద్యోగి పరార్
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రి దానవాయిపేటలో ఘరానా మోసం జరిగింది. హెచ్డీఎఫ్సీ బ్రాంచ్ పరిధిలో ఉన్న ఏటీఎంలలో డిపాజిట్ చేయాల్సిన రూ.2 కోట్లతో హిటాచి క్యాష్ మేనేజ్మెంట్ సంస్థ ఉద్యోగి వాసంశెట్టి అశోక్ పరారయ్యాడు. 19 ఏటీఎంల్లో ఫిల్లింగ్ చేయాల్సి ఉండగా డబ్బుతో హుడాయించాడు. అశోక్‌పై 'ఇటాచి ప్రైవేట్ ఏజెన్సీ' అధికారులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన రాజమండ్రి సౌత్ జోన్ పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. సమీపంలో ఉన్న టోల్ గేట్లు వద్ద తనిఖీలు చేస్తున్నారు. -
బెల్ట్‌తో కొట్టి.. చితకబాది... పొట్టన పెట్టుకున్నాడు!
బెంగళూరు: కర్నాటకలో సంచలనం సృష్టించిన ఫార్మసీ ఉద్యోగి రేణుస్వామి హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం కన్నడ నటుడు దర్శన్, అతని అభిమానులు రేణుస్వామిని దారుణంగా కొట్టి చంపారు! రేణుస్వామికి తగిన ‘బుద్ధి’ చెప్పాలంటూ నటి పవిత్ర దర్శన్‌ను ఉసిగొలి్పందని తెలుస్తోంది. తన అభిమాన సంఘాల సమన్వయకర్త రాఘవేంద్రను ఈ పనికి దర్శన్ పురమాయించారు. రాఘవేంద్ర తన భర్తను ఇంటి సమీపంలో వాహనం ఎక్కించుకుని తీసుకెళ్లాడని రేణుస్వామి భార్య చెప్పారు. అతన్ని బెంగళూరు సమీపంలో ఒక షెడ్డులో దర్శన్ బెల్ట్‌తో చితకబాదారు. అభిమానులు కర్రలతో కొట్టారు. ఎముకలు విరిగి, సున్నిత ప్రాంతాల్లో అంతర్గత గాయాలై రేణుస్వామి అక్కడిక్కడే మరణించారు. మృతదేహాన్ని మురికికాలువలో పడేశారు. దాన్ని వీధి కుక్కలు తినడం చూసి ఫుడ్ డెలివరీ బాయ్ పోలీసులకు సమాచారమిచ్చారు. ఈ కేసులో దర్శన్, పవిత్రతో పాటు 13 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారందరినీ బుధవారం ఘటనా స్థలికి తీసుకెళ్లి సీన్ రీ కన్స్ట్రక్ట్ చేశారు. -
యువతకు జాక్‌పాట్.. భారీ వేతనంతో ఉద్యోగాలు!
హర్యానాకు చెందిన యువతకు ఇజ్రాయెల్‌లో అత్యధిక వేతనంలో కూడిన ఉద్యోగాలు లభించాయి. దీంతో 530 మంది యువకుల బృందం హర్యానా నుండి ఇజ్రాయెల్‌కు బయలుదేరింది. వీరిని హర్యానా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎంపిక చేసింది. ఇంతకుముందే వీరికి ఇంటర్వ్యూలు పూర్తికాగా, ఇప్పుడు వీరంతా ఇజ్రాయెల్‌కు పయనమయ్యారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం మంగళవారం 530 మంది యువకులు న్యూఢిల్లీ నుండి ఇజ్రాయెల్‌కు వెళ్లారు. దీనికి ముందు హర్యానా సీఎం నయాబ్ సైనీ, మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఈ యువకులతో మాట్లాడారు. ఇజ్రాయెల్‌లో ఉద్యోగాల భర్తీకి హర్యానా ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. ఈ క్రమంలో గత జనవరిలో రోహ్తక్లో ఆరు రోజుల పాటు జరిగిన రిక్రూట్మెంట్ ప్రక్రియలో పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు. మొత్తం 8,199 మంది యువకులు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరు ఇజ్రాయెల్ వెళ్లే ముందు హర్యానా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ ఈ యువకులను అభినందించారు. ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం జరుగుతోంది. ఈ నేపధ్యంలో ఇజ్రాయెల్‌లో కార్మికుల కొరత తలెత్తింది. దీంతో కార్మికులను తమ దేశానికి పంపాలని ఇజ్రాయెల్ భారతదేశాన్ని అభ్యర్థించింది. ఇజ్రాయెల్‌లో 10 వేల మంది నిర్మాణ కార్మికుల అవసరం ఉంది. వీరికి నెలకు రూ.1,37,000 జీతం లభించనుంది. దీంతో పాటు వైద్య బీమా, ఆహారం, వసతి సౌకర్యాలు కూడా కల్పించనున్నారు. -
ఉద్యోగం నుంచి తొలగించింది.. మళ్లీ చేరొచ్చంటూ 4 సార్లు ఆఫర్, రిజెక్ట్ చేసిన ఉద్యోగి!
ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీ అమెజాన్ చరిత్రలోనే తొలిసారి ఈ ఏడాది ప్రారంభంలో 18,000 మందిని ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అ తర్వాత సైతం పలు రౌండ్లలో సిబ్బందిని ఇంటికి సాగనంపింది. అయితే, వారిలో కొంతమందిని తిరిగి మళ్లీ విధుల్లోకి తీసుకుంది. అలా ఓ ఉద్యోగిని తొలగించిన అమెజాన్ తిరిగి తీసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేసింది. చివరికి విఫలైమంది. అమెజాన్‌లో మళ్లీ చేరడాన్ని ససేమిరా అన్నాడు. ఇప్పుడు ఇదే అంశం దిగ్గజ టెక్ కంపెనీల్లో హాట్ టాపిగ్గా మారింది. ఆర్ధిక అనిశ్చితి, సంస్థ పునర్నిర్మాణం, కాస్ట్ కటింగ్, పలు జాతీయ అంతర్జాతీయ సమస్యల కారణంగా అనేక చిన్న చిన్న స్టార్టప్‌ల నుంచి దిగ్గజ టెక్ కంపెనీలతో పాటు ఈకామర్స్ సేలవందించే అమెజాన్ సైతం వర్క్ ఫోర్స్‌ని తగ్గించుకోక తప్పలేదు. మెల్లిమెల్లిగా పరిస్థితులు చక్కబడుతుండడం, మార్కెట్లో డిమాండ్ పెరిగిపోవడం, కొత్త ప్రాజెక్ట్‌లు క్యూ కట్టడంతో పలు కంపెనీలు తొలగించిన ఉద్యోగుల్ని మళ్లీ తిరిగి విధుల్లోకి (Re Hiring) తీసుకుంటున్నాయి. సాధారణంగా ‘మీ సేవలు చాలు ఇక వెళ్లిపోండి’ అంటూ తొలగించి.. మళ్లీ రీజాయిన్ చేయించుకుంటామని రెడ్ కార్పెట్ పరిస్తే.. ఆర్ధిక అనిశ్చితితో ఎవరైనా సరే సంస్థ ఇచ్చిన ఆఫర్ వైపు మొగ్గు చూపుతారు. కానీ, బిజినెస్ అనలిస్ట్‌గా పనిచేసిన ఈ మాజీ అమెజాన్ ఉద్యోగి అలా కాదు. నీ సంస్థ వద్దూ.. నువ్విచ్చే జీతం వద్దంటూ జనవరిలో కంపెనీ తనకి పింక్ స్లిప్ ఇచ్చింది. ఆ తర్వాత అతని స్కిల్స్ చూసి ముచ్చట పడి.. తిరిగి వెనక్కి తీసుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేసింది. సదరు ఉద్యోగి మాత్రం ‘నీవ్వు వద్దూ.. నువ్విచ్చే జీతం వద్దంటూ’ నాలుగు సార్లు కంపెనీ ఇచ్చిన ఆఫర్‌ను రిజెక్ట్ చేశారు. ఎందుకని? ప్రశ్నిస్తే అమెజాన్‌లో పని చేసే సమయంలో తాను ఎలాంటి సంతృప్తి చెందలేదని సమాధానం ఇచ్చారు. అందుకు కారణాల్ని వివరించారు. మేనేజర్ మాటలు పచ్చి అబద్ధం ఈ ఏడాది జనవరిలో సదరు ఉద్యోగిని అమెజాన్ ఫైర్ చేసింది. అందుకు గానూ రెండు నెలల వేతనం ఇస్తామని మెయిల్ పంపింది. అంతవరకు బాగున్నా.. ఆ మెయిల్లో తన మేనేజర్..‘మీ పనితీరు అమోఘం. మిగిలిన సభ్యులతో పోలిస్తే మీలో ఉన్న స్కిల్స్ అద్భుతం.. ఉద్యోగ భద్రత గురించి మీరేం ఆలోచించొద్దు’ అంటూ కొన్ని హామీలు ఇవ్వడం షాక్ గురి చేసింది. ఎందుకంటే? అది నిజం కాదని తర్వాత తేలింది. సంస్థ (అమెజాన్) లేఆఫ్స్‌పై మేనేజర్ల అభిప్రాయాలు తీసుకోవడం లేదు కాబట్టి. తొలగింపుకు రెండు నెలల ముందు తొలగింపులకు రెండు నెలల ముందు, ఉద్యోగులు తమ పని, ప్రాజెక్ట్‌లను డాక్యుమెంట్ చేయమని అమెజాన్ కోరినట్లు ఆయన వెల్లడించారు. అయితే, మేనేజర్లు ‘నేను చేసిన పనిలో మార్పులు చేయడం, నా పేరుకు బదులు వారి పేరు ఎంట్రీ చేయడం, అసలు తాను చేసిన ప్రాజెక్ట్‌లో ఏమాత్రం సంబంధం లేని వారు కూడా.. ఆ ప్రాజెక్ట్‌లో తామే కీరోల్ పోషించామని చెప్పుకోవడం, ఆ పనికి నాకు సంబంధం లేదని తప్పుగా ప్రచారం చేశారని’ వాపోయారు సంస్థే గుర్తించలేదు ఆ తర్వాత కొద్ది కాలానికి తొలగించిన ఉద్యోగులకు అమెజాన్ ఇతర సంస్థల్లో అవకాశాలు కల్పించింది. తిరిగి సంస్థలోకి తీసుకుంది. అందులో లేఆఫ్స్ గురైన ఈ మాజీ ఉద్యోగి కూడా ఉన్నాడు. ‘నా మేనేజర్ ఎప్పుడూ నీ మంచి కోరే వాడిని అని ఎప్పుడూ చెబుతుండే వారు. కానీ అది పచ్చి అబద్ధం. ఎందుకంటే ఇది నాకు చెంప దెబ్బలాంటిది’ అని పేర్కొన్నారు. చివరిగా.. అమెజాన్‌లో ఉద్యోగం కోల్పోయినా.. ఇతర సంస్థల్లో ఉన్నత ఉద్యోగం సంపాదించే టాలెంట్ నాలో ఉంది. సంస్థే అది గుర్తించలేదు. నాలుగు సార్లు కంపెనీలోకి తీసుకోవాలని ప్రయత్నించింది. కానీ నేనే అమెజాన్‌లో చేరలేదంటూ తన సోషల్ మీడియా పోస్ట్‌ని ముగించాడు. చదవండి👉 మెటాలో ఊడిన ఉద్యోగం.. ఆనందంలో తేలిపోయిన మేనేజర్ -
వొడాఫోన్‌లో ఉద్యోగుల తొలగింపు.. 11 వేల మందిపై వేటు!
ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్ లేఆఫ్స్ ప్రకటించింది. రానున్న 3 ఏళ్లలో 11వేల మంది ఉద్యోగుల్ని తొలగించనున్నట్లు ఆ సంస్థ సీఈఓ మార్గరీటా డెల్లా వల్లే తెలిపారు. తమ సామర్ధ్యం తగినంతగా లేదని, నిరంతరం మెరుగైన సేవలు అందించే క్రమంలో వొడాఫోన్ విధిగా మారాలని డెలా వలె స్పష్టం చేశారు. ‘కస్టమర్లు, సరళత, వృద్ధి ఈ మూడు అంశాలే మా లక్ష్యం. వీటి ఆధారంగా మార్కెట్లో నెలకొన్న పోటీని ధీటుగా ఎదుర్కొనేందుకు సంస్థను తీర్చిదిద్దుతామని చెప్పారు. అంతేకాదు కస్టమర్లకు నాణ్యమైన సేవల్ని అందించేలా వనరులను కేటాయిస్తూ మరింత వృద్ధి సాధిస్తామని మార్గరీటా డెల్లా ధీమా వ్యక్తం చేశారు. సంస్థ సైతం ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్ధిక అనిశ్చితి నేపథ్యంలో వొడాఫోన్ ఈ నిర్ణయం తీసుకోవడం టెలికాం రంగానికి చెందిన ఉద్యోగులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కాగా, గత ఏడాది వొడాఫోన్‌లో 104,000 మంది సిబ్బంది ఉండగా.. తాజాగా మొత్తం వర్క్ ఫోర్స్‌లో 10శాతానికి పైగా సిబ్బందిని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. చదవండి👉 అమెజాన్‌లో లేఆఫ్స్.. భారత్‌లో 500 మంది ఉద్యోగుల తొలగింపు! -
ఎంజాయ్ చేయడం లేదని జాబ్ పీకేశారు.. కోర్టుకెక్కిన ఉద్యోగి!
ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక మాంద్యం భయాలు వెంటాడుతున్నాయి. భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని సంస్థలు ఖర్చుల్ని తగ్గించుకుంటున్నాయి. లాభదాయకంగా లేని వ్యాపారాల్ని మూసివేస్తున్నాయి. ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. కానీ ఈ సంస్థ మాత్రం ఉద్యోగులు నవ్వలేదని ఫైర్ చేస్తుంది. 2015లో జర్మనీకి చెందిన మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ క్యూబిక్ పార్టనర్స్ సంస్థ ‘మిస్టర్ టి’ అనే ఉద్యోగికి పింక్ స్లిప్ జారీ చేసింది. అతను చేసిన తప్పల్లా ఒక్కటే. ఆఫీస్‌లో ఫన్‌గా ఉండక పోవడం, వీకెండ్స్‌లో ఆఫీస్ అయిపోయిన తర్వాత సహచర ఉద్యోగులతో కలిసి మందు కొట్టకపోవడంలాంటి కారణాలు చూపెట్టి అతన్ని ఇంటికి పంపించేసింది. దీంతో సంస్థ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించారు. తాజాగా ఆ కేసు విచారణలో భాగంగా ఉద్యోగి పారిస్ చట్టాలను ఉల్లంఘిస్తున్నాడని, సంస్థ సిబ్బందితో వీకెండ్స్‌లో పబ్‌లు, పార్టీలకు రావడం లేదని క్యూబిక్ ప్రతినిధులు కోర్టుకు తెలిపారు. కాబట్టే ‘వృత్తిపరమైన అసమర్థత’గా పరిగణలోకి తీసుకుంటూ అతనిపై వేటు వేసినట్లు విన్నవించింది. సంస్థ వివరణపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘మిస్టర్ టి’ని సెమినార్లు, పబ్స్ బలవంతంగా పాల్గొనేలా హక్కు కంపెనీకి లేదని కోర్టు తన తీర్పులో పేర్కొంది. విచ్చలవిడితనం, బెదిరింపులు, రెచ్చగొట్టడం, గొడవ పెట్టుకోవడంలాంటివి ప్రతి ఒక్కరికీ సాధ్యం కాదు. ఏదేమైనా పని గంటల తరువాత ఆఫీస్ నిర్వహించే పార్టీల్ని నిరాకరించే హక్కు ఆ ఉద్యోగికి ఉందని స్పష్టం చేసింది. కాబట్టి తన మాజీ ఉద్యోగికి నష్టపరిహారంగా 2,574 పౌండ్లు (సుమారు రూ. 2.54 లక్షలు) చెల్లించాలని క్యూబిక్ పార్ట్నర్స్ను ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణలో నష్టపరిహారాల రూపంలో మరో 395,630 పౌండ్లు (సుమారు రూ. 3.90 కోట్లు) కావాలన్న మిస్టర్ టి డిమాండ్‌ను కోర్టు పరిశీలించడానికి సిద్ధంగా ఉంది. మిస్టర్ టి 2011లో సంస్థలో చేరారు. అంచలంచెలుగా ఎదుగుతూ 2014లో డైరెక్టర్ స్థాయికి చేరుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు ఆ మరుసటి ఏడాది ఉద్యోగం నుంచి క్యూబిక్ తొలగి౦చింది. చదవండి👉 ‘ట్విటర్లో మా ఉద్యోగాలు ఊడాయ్’..లైవ్‌లో చూపించిన ఉద్యోగులు -
ట్విట్టర్ ఆర్థిక పరిస్థితిపై ఎలాన్ మస్క్ హెచ్చరిక
-
వర్క్‌ఫ్రం హోం వద్దంటే ఎలా?
కరోనా కష్ట కాలం వచ్చిన తర్వాత వర్క్ ఫ్రం హోం అనేది కామన్ అయిపోయింది. కానీ అంతకు ముందు అత్యవసర పని ఉన్నా, ఆపత్కాలం వచ్చినా ఇంటి నుంచి పని అంటే యాజమన్యాలు ఒప్పుకునేవి కావు. పని జరగడం కంటే పాలసీలే ముఖ్యం అన్నట్టుగా కర్ర పెత్తనం చలాయించేవి. ఇలాంటి ఓ సంఘటనకు సంబంధించిన విషయాలను ఓ ఉద్యోగి @బౌసర్డేంజర్ యూజర్ నేమ్‌తో రెడ్డిట్‌లో షేర్ చేయగా నెట్టింట వైరల్‌గా మారింది. బౌసర్డేంజర్ అనే రెడ్డిట్ యూజర్ నేమ్ కలిగిన వ్యక్తి అమెరికాలోని ఓ న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌లో పని చేసేవాడు. అతడు నివసిస్తున్న ఇంటి నుంచి న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌కి కనీసం గంట ప్రయాణం. ఎప్పటిలాగే ఒక రోజు ప్లాంటుకు వెళ్లేందుకు రెడీ అవగా.. బయట దట్టమైన మంచు కురుస్తోంది. కారుతో సహా రోడ్లన్నీ మంచుతో కప్పబడి ఉన్నాయి. వర్క్ ఫ్రం హోం చేస్తాను మంచు వల్ల ఆఫీసుకు రాలేకపోతున్న విషయాన్ని వెంటనే ప్లాంటులో తన సూపర్ వైజర్కి ఈమెయిల్ ద్వారా తెలిపాడా ఉద్యోగి.. ఆ మెయిల్లో బయట మంచు తీవ్రంగా కురుస్తోందని, ప్రయాణం చేసేందుకు వీలుగా బయట పరిస్థితులు లేవని, కాబట్టి ఈ రోజు నేను ప్లాంటుకు వచ్చి స్వయంగా చేయదగ్గ పనులు కూడా లేనందున వర్క్ ఫ్రం హోంకి అనుమతి ఇవ్వాలని కోరాడు. తనకు అప్పగించిన పేపర్ వర్క్‌ని ఇంటి దగ్గరే ఉంటూ ల్యాప్‌ట్యాప్‌లో పూర్తి చేసి పంపిస్తానంటూ వివరించాడు. మన పాలసీ అది కాదు ఉద్యోగి నుంచి వచ్చిన ఈమెయిల్‌కి సూపర్వైజర్ స్పందిస్తూ.. ఒక ఉద్యోగిగా ఆఫీస్‌కు రావడం నీ బాధ్యత, ఎక్కడి నుంచి అంటే అక్కడి నుంచి పని చేస్తామంటూ కుదరదు. ఆఫీసుకు వస్తున్నందుకే నీకు జీతం చెల్లిస్తోంది. కంపెనీ పాలసీ ఇదే విషయం చెబుతుంది. ఏదో కారణం చెప్పి ఆఫీసుకు రానంటే ఎలా.. అయినా నీవు చెప్పినంత దారుణంగా బయట పరిస్థితులు లేవు. నేను ఆఫీసులోనే ఉన్నారు. నువ్వు రావడమే మంచిది. నీకు రావడం వీలు కాని పక్షంలో నిరంభ్యతరంగా సెలవు తీసుకోవచ్చు. కానీ వర్క్ ఫ్రం హోం చేస్తానంటూ కోరడం సంస్థ పాలసీలకు విరుద్ధం. కాబట్టి నీ రిక్వెస్ట్‌ను ఆమోదించడం లేదంటూ బదులిచ్చాడు. చేయగలిగిందేం లేదు సూపర్వైజర్ వర్క్ ఫ్రం హోంకి అంగీకరించకపోవడంతో... వెంటనే బటయకు వచ్చి చూస్తే ఊహించనదాని కంటే మంచు ఎక్కువగా ఉంది. అతి కష్టం మీద సమీపంలో ఉన్న స్టోరుకి వెళ్లి మంచును తొలగించే వస్తువులను తీసుకుని వచ్చి ఇంటి ప్రాంగణం శుభ్రం చేసుకునే పనిలో మునిగిపోయాడు. ఆ తర్వాత మంచు కురిసే సమయంలో వేడివేడి స్నాక్స్ తింటూ ఆ వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నాడు. ఇంటి దగ్గరయినా పని చేయ్ ప్లీజ్ ఇంతలో సూపర్ వైజర్ నుంచి ఫోన్ వచ్చింది. నువ్వు ఆఫీసకు వస్తున్నావా ? లేదా అంటూ ప్రశ్నించాడు. దానికి బదులుగా ‘ బయట మంచు ఎక్కువగా ఉంది. నేను సంస్థ పాలసీ రూల్స్‌ను పాటిస్తూ ఈ రోజు సెలవు తీసుకున్నాను. కాబట్టి ఆఫీసుకు రావరడం లేదంటూ బదులిచ్చాడు. వెంటనే ఆఫీసుకు రానక్కర్లేదు అర్జంటుగా చేయాల్సిన పేపర్ వర్క్ ఉంది. నువ్వు ఇంటి దగ్గరి నుంచైనా ఆ పని చేసి త్వరగా పంపించు అంటూ రిక్వెస్ట్ చేశాడా సూపర్వైజర్. ఇప్పుడు పాలసీలో భాగం పై అధికారి కోరినట్టు సంస్థ అవసరాలకు తగ్గట్టుగా సెలవు రోజున కూడా ఇంటి దగ్గర పని చేసినట్టు ఆ ఉద్యోగి తెలిపాడు. ఈ ఘటన 2018లో జరిగింది. కరోనాకి ముందు వర్క్ ఫ్రం హోం అంటే యజమాన్యాలు సహించేవి కావు. ఇంట్లో ఏ పని చేయకుండా ఉంటారనే అపోహా ఉండేది. కానీ కరోనా తర్వాత పరిస్థితులు మారిపోయాయి. వర్క్ ఫ్రం హోం అనేది కామన్‌గా మారింది. చాలా సంస్థలు ఇప్పడు వర్క్ ఫ్రంహోంను తమ పాలసీలో భాగంగా చేశాయి. కేవలం రెండేళ్లలోనే ఊహించని మార్పులు చోటు చేసుకున్నాయి. చదవండి: ఐటీ కంపెనీ 'యాక్షన్ స్టెప్' బంపరాఫర్, ఎన్ని సెలవులు కావాలంటే అన్నీ తీసుకోవచ్చు! -
ట్రాన్స్ఫర్ అడిగిన ఉద్యోగి.. అతడి భార్యపై కన్నేసి..
లక్నో: ఉద్యోగం చేస్తున్నప్పడు బదిలీలు అనేవి సహజం. ఈ క్రమంలోనే ఓ ఉద్యోగి తనను బదిలీ చేయాలని ఉన్నతాధికారిని అడిగాడు. అనంతరం సదరు ఉన్నతాధికారి.. బదిలీ కావాలంటే తన భార్యను ఓ రాత్రికి పంపమని షరతు పెట్టాడు. దీంతో సదరు ఉద్యోగి తీవ్ర ఆవేదనతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. గోకుల్ ప్రసాద్(45) విద్యుత్ శాఖలో విధులు నిర్వర్తిస్తున్నాడు. కాగా, అతను ప్రతీరోజు లఖింపూర్ నుంచి అలీగంజ్‌కు ప్రయాణం చేసి ఉద్యోగం చేయాల్సి వస్తోంది. ఈ క్రమంలో తనను బదిలీ చేయాలని ఉన్నతాధికారులను కోరాడు. ఆ సమయంలో జూనియర్ ఇంజినీర్.. ట్రాన్స్ఫర్ కావాలంటే తన భార్యను ఓ రాత్రికి తన వద్దకు పంపమని అడిగాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన గోకుల్.. ఆఫీసు బయట ఒంటిపై డీజిల్‌పోసుకుని నిప్పంటించుకున్నాడు. అనంతరం తోటి ఉద్యోగులు అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. ఈ నేపథ్యంలో మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సందర్బంగా నిందితులు గత మూడేళ్లుగా గోకుల్‌ను చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఆరోపించింది. దీంతో అతను డిప్రెషన్లోకి వెళ్లిపోయాడని పేర్కొంది. కానీ, వారు మాత్రం అతనిని విడిచిపెట్టలేదని ఆవేదన వ్యక్తం చేసింది. వారిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు జూనియర్ ఇంజినీర్‌ను అదుపులోకి తీసుకున్నట్టు పేర్కొన్నారు. ఇక, ఈ ఘటనతో జూనియర్ ఇంజినీర్, క్లర్క్‌ను సస్పెండ్ చేస్తున్నట్టు తెలిపారు. -
చంద్రబాబు పర్యటన: సానుభూతి కోసం టీడీపీ సరికొత్త డ్రామా
సాక్షి ప్రతినిధి, తిరుపతి : రాష్ట్రంలో 2019 ఎన్నికలతో పాటు ఆ తర్వాత వరుసగా జరిగిన అన్ని ఎన్నికల్లోనూ చంద్రబాబు తలకు బొప్పి కట్టడంతో అధికార పార్టీ శ్రేణులను రెచ్చగొట్టి, అరాచకం సృష్టించడం ద్వారా ప్రజల సానుభూతి పొందేందుకు సరికొత్త డ్రామాకు తెరలేపారు. సీఎంను బూతులు తిట్టించడంతో మొదలైన ఈ డ్రామా తాజాగా కుప్పంలో కూడా కొనసాగింది. టీడీపీ శ్రేణులు రెచ్చిపోయేలా వ్యాఖ్యలు చేస్తూ తన కసిని వ్యక్తం చేశారు. ఏదో జరిగిపోతోందని, తనపై ఎవరో దాడి చేయనున్నారని బీద అరుపులు అరుస్తూ ఆ పార్టీ కార్యకర్తలను తీవ్రంగా రెచ్చగొట్టారు. ఉద్రిక్త వాతావరణం సృష్టించారు. కుప్పం హరిత టూరిజం హోటల్లో అసిస్టెంట్ మేనేజర్ మోహన్ మరో తొమ్మిది నెలల్లో పదవీ విరమణ పొందనున్నారు. తన సొంతూరు చంద్రగిరికి బదిలీ కోరుతూ.. స్థానిక ఎమ్మెల్యే అయిన చంద్రబాబు సిఫార్సు కోసం ఆయన్ను కలిసేందుకు వచ్చారు. బస్టాండ్ వేదిక వద్ద జనం ఉండటంతో తొక్కిసలాటలో ఆయన చేతి బ్యాగ్‌లో ఉన్న వోలినీ స్ప్రే బాటిల్ (ఒంటి నొప్పులకు వాడతారు) ఒత్తిడికి గురయ్యి కాస్త శబ్దం వచ్చింది. అంతే.. ఆయన బాంబు తెచ్చాడంటూ టీడీపీ మూకలు రెచ్చిపోయాయి. వయస్సు కూడా చూడకుండా ఆయనపై దాడి చేశారు. నాపై రాళ్లు వేస్తున్నారు.. కళ్తెదుటే ఓ వ్యక్తిని కొడుతున్నా కనీసంగా స్పందించని చంద్రబాబు.. సెక్యూరిటీ వలయంలోకి వెళ్ళి.. ‘చూశారా తమ్ముళ్లూ నాపై దాడి చేయడానికి వచ్చారు.. తిరుపతిలో రాళ్లేశారు.. ఇక్కడకు కూడా రాళ్లు తెచ్చారు..’ అంటూ మరింతగా రెచ్చగొట్టారు. దీంతో అక్కడున్న వారు ఆ ఉద్యోగికి రక్తం చిందేట్టు చితక్కొట్టారు. పోలీసులు అడ్డుకోవడంతో వారిపై మండిపడ్డారు. తీరా అతని బ్యాగ్ చెక్ చేస్తే డెట్టాల్ బాటిల్, వోలినీ స్ప్రే బాటిల్, ఎనర్జీ డ్రింక్, టాబ్లెట్లు ఉన్నాయి. గాయపడిన మోహన్‌ను పోలీసులు పీఈఎస్ మెడికల్ కళశాల ఆస్పత్రిలో చేర్పించారు. ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. వాస్తవానికి ఇతన్ని బాబు వద్దకు లక్ష్మీపురానికి చెందిన పార్టీ నేత సుబ్బు తీసుకురావడం కొసమెరుపు. టీడీపీ శ్రేణుల హల్చల్ టీడీపీ శ్రేణులు చంద్రబాబుకు స్వాగతం చెప్పడానికి వెళుతూ కుప్పంలో కనిపించిన వైఎస్సార్సీపీ ఫ్లెక్సీలన్నింటినీ చింపివేశారు. అడ్డుకోబోయిన ఎఆర్ పోలీసులపై దౌర్జన్యం చేశారు. వైఎస్సార్సీపీ నేతలను అసభ్య పదజాలంతో దూషించారు. మద్యం మత్తులో ‘జోహార్ టీడీపీ.. జోహార్ బాబు’ అంటూ నినాదాలు హోరెత్తించారు. జిల్లా నలుమూలల నుంచి, కర్ణాటక నుంచి పెద్ద ఎత్తున జనాన్ని తీసుకొచ్చారు. ముందు జాగ్రత్తగా ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్ద జనరేటర్ ఏర్పాటు చేస్తే విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిస్తున్నారంటూ రెచ్చిపోయారు. వాస్తవానికి ఒక్క సెకను కూడా కరెంటు పోలేదు. -
18 నెలలుగా వేతనం లేదు.. ఇప్పించండి సార్
భవనేశ్వర్: జిల్లాలోని కలిమెల పంచాయతీ ఈఓగా పని చేస్తున్న తనకు గత 18 నెలలుగా వేతనం అందడం లేదని మధు హంతాల్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పలుమార్లు ఉన్నతాధికారులకు విన్నవించినా ప్రయోజనం లేకపోవడంతో సోమవారం సమితి కార్యాలయం ముందు బైఠాయించారు. గిరిజనుడినైన తన ఎల్‌పీసీని అధికారులు కలిమెల సమితికి పంపక పోవడంతో జీతం నిలిచి పోయిందని వాపోయారు. తనకు న్యాయం చేయాలని ఎన్ని వినతులు పెట్టుకున్నా ప్రయోజనం లేకపోయిందని, గత ఏడాదిన్నరగా అప్పులు చేసి, కుటుంబాన్ని పోషించుకోవాల్సి వస్తోందని వాపోయారు. పిల్లల చదువులు సైతం భారంగా మారిందన్నారు. తన తండ్రిని మావోయిస్టులు నాలుగేళ్ల క్రితం హత్య చేశారని, అధికారులు స్పందించకపోతే కుటంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటానని స్పష్టంచేశారు. -
ఈడీఎల్ఐ పరిమితి రూ. 7 లక్షలకు పెంపు
న్యూఢిల్లీ: కరోనా కాలంలో ఉద్యోగులకు ఊరటనిచ్చేలా ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పథకం(ఈడీఎల్ఐ) కింద పొందే గరిష్ట ప్రయోజన పరిమితిని ఈపీఎఫ్ఓ రూ. 7 లక్షలకు పెంచింది. దీంతో ఈపీఎఫ్ సభ్యులు అనారోగ్యం, యాక్సిడెంట్ లేదా సహజ కారణాలతో మరణించినట్లయితే వారి నామినీకి రూ.7 లక్షల వరకు చెల్లిస్తారు. ఈపీఎఫ్ఓ సభ్యులందరికీ ఈ పథకం వర్తిస్తుంది. గతంలో డెత్ ఇన్సూరెన్స్ పరిమితి 2–6 లక్షల రూపాయలుండగా, తాజాగా ఈ పరిమితిని రూ.2.5–7 లక్షల రూపాయలకు పెంచినట్లు ఈపీఎఫ్ఓ తెలిపింది. మరణానికి 12 నెలల ముందు ఉద్యోగి పొందిన సరాసరి జీతం ఆధారంగా కవరేజ్ వర్తిస్తుంది. చదవండి:పూచీకత్తు లేకుండానే రూ.5 లక్షల పర్సనల్ లోన్ -
ఓయో రూమ్‌కు వస్తే ఉద్యోగం ఇస్తా..
సాక్షి, బంజారాహిల్స్: ఉద్యోగం కావాలంటే ఓయో రూమ్‌కు రావాలంటూ ఓ ఉద్యోగి అసభ్యంగా చాటింగ్ చేశాడని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు నిందితుడిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హిమాయత్‌నగర్‌కు చెందిన యువతి(28) వారం క్రితం జూబ్లీహిల్స్ రోడ్ నెం.36లోని ఓ ఇమ్మిగ్రేషన్ సంస్థలో ఉద్యోగానికి హాజరైంది. ఇక్కడ పని చేస్తున్న మాజీ మేనేజర్ సుమంత్ మూడ్రోజుల క్రితం ఆమెతో చాటింగ్‌లో చేయసాగాడు. ఓయో రూమ్ బుక్ చేశానని ఉద్యోగం అక్కడే ఇస్తానంటూ చెప్పాడు. ఆందోళన చెందిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. సదరు ఇమ్మిగ్రేషన్ సెంటర్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ సుమంత్‌పై పోలీసులు ఐపీసీ 509 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ( చదవండి: మహిళ ఫిర్యాదు.. యాంకర్ శ్యామల భర్త అరెస్ట్ ) -
అవే.. ఆ తండ్రి చివరి మాటలు!
సాక్షి, గద్వాల: ‘20 నిమిషాల్లో వస్తా.. నువ్వు, తమ్ముడు, అమ్మ రెడీగా ఉండండి.. బయటకు వెళ్దాం’ అని ఆ తండ్రి తన కొడుకుతో ఫోన్లో మాట్లాడిన ఆ మూడు మాటలే.. కడసారి మాటలయ్యాయి. విధుల్లో భాగంగా వెళ్లిన ఆ ప్రభుత్వ ఉద్యోగి.. సాయంత్రం తిరిగి ఇంటికి బైక్‌పై వస్తున్న సమయంలో లారీ రూపంలో మృత్యువు వెంటాడింది. ఇంటికి వస్తున్నా అని మాటిచ్చిన అతడు.. ప్రమాదంలో తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు. ఈ ఘటనతో అప్పటి వరకు సంతోషాలతో నిండిన ఆ కుటుంబం ఒక్కసారిగా దుఃఖ సాగరంలో మునిగిపోయింది. ఈ ఘటన గద్వాల మండలం అనంతపురం శివారులో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన కథనం మేరకు.. గద్వాల పట్టణానికి చెందిన విజయ్‌బాబు (39) విద్యుత్ లైన్మెన్గా ఇటిక్యాల మండలం కొండేరులో విధులు నిర్వహిస్తున్నాడు. రోజువారి విధుల్లో భాగంగా ద్విచక్ర వాహనంపై ఉదయం విధులకు వెళ్లాడు. అయితే సాయంత్రం తిరుగు ప్రయాణంలో ద్విచక్ర వాహనంపై గద్వాలకు బయల్దేరాడు. ఈక్రమంలో గద్వాల నుంచి ఎర్రవల్లి వైపు వెళ్తున్న లారీని డ్రైవర్ అజాగ్రత్తగా నడుపుతూ ఎదురుగా వస్తున్న బైక్‌ను కొట్టాడు. ఈ ప్రమాదంలో విజయ్‌బాబు అక్కడిక్కడే దుర్మరణం చెందాడు. దుఃఖసాగరంలో కుటుంబసభ్యులు 20నిమిషాల్లో ఇంటికి వస్తున్నానని చెప్పిన భర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని తెలియడంతో విజయ్‌బాబు భార్య పద్మ నిశ్చేష్టురాలైంది. కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. విజయ్‌బాబు స్వగ్రామం ఇటిక్యాల మండలం పెద్దదిన్నె కాగా.. గత కొన్నేళ్లుగా కుటుంబ సభ్యులతో కలిసి రెండవ రైల్వేగేటు బృందవన్ కాలనీలో అద్దె ఇంట్లో నివాసముంటున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. తొటి ఉద్యోగి మరణ వార్త తెలుసుకొని కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానూభూతి తెలిపారు. సంఘటనపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
కేఎఫ్సీలో ఉద్యోగి హత్య
బొమ్మనహళ్లి : దోపిడీకి వచ్చిన నలుగురు దుండగులు కేఎఫ్‌సీ సెంటర్లోకి దూరి ఓ వ్యక్తిని హత్య చేసిన సంఘటన సోమవారం రాత్రి హోసూరు రోడ్డులోని హెబ్బగోడి బొమ్మసంద్రలో ఉన్న కేఎఫ్‌సీ సెంటర్లో చోటు చేసుకుంది. దుండగుల దాడిలో హత్యకు గురైన యువకుడు ఒరిస్సాకు చెందిన సమీర్ (25)గా గుర్తించారు. వివరాలు... సోమవారం రాత్రి 10 గంటల సమయంలో రెండు బైకుల్లో వచ్చిన నలుగురు దుండగులు కేఎఫ్‌సీ సెంటర్లో జొరబడ్డారు. అందులో ఉన్న యువకులపై దాడి చేయడంతో పాటు నగదు, మొబైల్ ఫోన్ లాక్కున్నారు. అక్కడే విధులు నిర్వహిస్తున్న సమీర్ వారిని అడ్డుకోవడానికి యత్నించగా వారు చాకుతో సమీర్ కడుపులో పొడిచి హత్య చేసి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆధారాలు చేపట్టారు. సమీర్ మృతదేహాన్ని విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
ఉద్యోగులకు గుడ్‌న్యూస్
సాక్షి,న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఉద్యోగులకు తీపికబురు అందనుంది. అరకొర వేతన పెంపుపై అసంతృప్తితో ఉన్న ఉద్యోగులకు 2018లో మాత్రం ఊరట కలగనుంది. 2017లో భారత ఉద్యోగుల వేతనాలు 8-10 శాతం పెరిగితే..2018లో పలు రంగాల ఉద్యోగులకు 10-15 శాతం వరకూ వేతన పెంపు ఉంటుందని ప్రముఖ మానవనరుల కన్సల్టెన్సీ గ్రూప్ అంచనా వేసింది. మరోవైపు నియామకాలు సైతం వచ్చే ఏడాది భారీగా ఊపందుకోనున్నాయనే అంచనాలూ జాబ్ మార్కెట్లో ఉత్తేజం నింపుతున్నాయి. టెక్నాలజీ, ఫైనాన్షియల్ సేవలు, రిటైల్, మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగాల్లో పెద్ద ఎత్తున నియామకాలు చోటుచేసుకోనున్నాయి. ఐటీలో సంప్రదాయ ఉద్యోగాలతో పాటు డిజిటల్, డేటా సైన్స్ వంటి నైపుణ్యాలకు డిమాండ్ నెలకొందని నిపుణులు పేర్కొంటున్నారు. వచ్చే ఏడాది ప్రధానంగా మౌలిక, టెలికాం, తయారీ, ఐటీ రంగాల్లో గణనీయమైన వృద్ధి నమోదవుతుందని, ఫలితంగా నియామకాలు భారీగా పెరుగుతాయని హెచ్ఆర్ నిపుణులు అంచనా వేస్తున్నారు. -
డుమ్మాల నుంచి సొమ్ములు
-కాకినాడ నగర పాలక సంస్థలో అవినీతి బాగోతం -మస్తర్ల మాయాజాలంతో శానిటరీ ఇన్స్పెక్టర్ల దందా -గైర్హాజరుకు ఇంత అని రేటు నిర్ణయించి వసూళ్లు -నిత్యం 20 శాతం మంది విధులకు రాకున్నా పట్టించుకోని అధికారులు సాక్షి ప్రతినిధి, కాకినాడ : ఎక్కడైనా విధులకు డుమ్మా కొడితే పైనుంచి చర్యలుంటాయని భయపడతారు. కానీ కాకినాడ కార్పొరేషన్లో మాత్రం అందుకు పూర్తిగా భిన్నంగా జరుగుతోంది. నెలనెలా మస్తర్ల మాయాజాలంతో మామూళ్ల దందా నడుస్తోంది. ఇక్కడ పారిశుద్ధ్య విభాగంలో కొందరు అధికారులు.. ఎంతమంది డుమ్మా కొడితే అంత మంచిదనుకుంటున్నారు. అలా అయితేనే తాము నాలుగు డబ్బులు వెనకేసుకోవచ్చని ఆరాటపడుతున్నారు. కాకినాడ నగర పాలక సంస్థ పారిశుద్ధ్య విభాగం అడుగడుగునా అవినీతి కంపుకొడుతోంది. చిరుద్యోగుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని పర్యవేక్షకులు నెలనెలా మామూళ్లు దండుకుంటున్నారు. ఈ విభాగంలో విధులకు రాకున్నా ఫర్వాలేదు. కానీ వచ్చినట్టు మస్తర్ మాత్రం పడిపోతుంది. అలాగని మస్తర్ ఉచితంగా వేస్తారనుకుంటే పొరపాటే. డుమ్మా కొట్టే చిరుద్యోగుల నుంచి మస్తర్, మస్తర్కు ఒకో రేటు నిర్ణయించి ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. ఈ మస్తర్ల బాగోతంలో మొత్తం శానిటరీ విభాగం అంతటినీ ఒకే గాట కట్టలేము. కానీ కొందరు జేబులు నింపుకునేందుకు చేస్తున్న అవినీతి శానిటరీ ఇనస్పెక్టర్లందరికీ మచ్చ తెస్తోంది. కాకినాడ జనాభా నాలుగున్నర లక్షలు. నగరంలో రోజూ సేకరించే చెత్త 175 టన్నులు. పారిశుద్ధ్య నిర్వహణ కోసం 14 సర్కిళ్లు ఉన్నాయి. ఒక సర్కిల్‌కు ఒక ఎస్ఐ(శానిటరీ ఇన్స్పెక్టర్)ఉంటారు. శానిటరీ వర్కర్లలో సీనియర్లు, మాట వినే వారిని మేస్త్రీలుగా నియమించుకుని తమ ఆదేశాలు అమలు చేసేలా చూసుకుంటారు. ఇది నగరంలో నడుస్తున్న ప్రక్రియ. ఒక సర్కిల్ పరిధిలో 40 నుంచి 60 మంది పారిశుద్ధ్య కార్మికులు, ఇద్దరు లేదా ముగ్గురు మేస్త్రీలు పనిచేస్తున్నారు. నగరంలో ఆయా సర్కిళ్లలో సుమారు 850 మంది కార్మికులు పనిచేస్తుండగా వీరిలో 450 మంది పర్మనెంట్ కార్మికులు, మిగిలిన వారు ఆయా సొసైటీల నుంచి కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్నారు. పర్మనెంట్ వారికి రూ.18 వేల నుంచి రూ.35 వేల వరకు వేతనాలుండగా, కాంట్రాక్ట్ వర్కర్లకు రూ.12,000 నుంచి రూ.15,000 ఉన్నాయి. నెలనెలా వేతనాలు ఎవరి ఖాతాలకు వారికి వేసేస్తారు. కార్మికులు పనిచేస్తున్నారో, లేదో పర్యవేక్షించి మస్తర్ వేయాల్సింది శానిటరీ ఇన్స్పెకర్. శానిటరీ ఇన్స్పెక్టర్ క్షేత్రస్థాయికి వెళ్లి తెల్లవారుజామున 5 గంటలకు ఆ సర్కిల్ పరిధిలో పనిచేసే వారి మస్తర్ తీసుకోవాలి. ఇదివరకు రిజిస్టర్లో సంతకం తీసుకునే వారు. ఇప్పుడు వేలిముద్రలు తీసుకుంటున్నారు. అలా తెల్లవారుజామున ఒకటి, మధ్యాహ్నం మరొకటి మస్తర్ తీసుకుంటారు. కొన్ని సర్కిళ్లలో కొందరు శానిటరీ ఇన్స్పెక్టర్లు మస్తర్ల ప్రక్రియను మేస్త్రీలకు విడిచిపెట్టేసి తీరిగ్గా తొమ్మిది, 10 గంటలకు బయటకు వస్తున్నారనే విమర్శలున్నాయి. మస్తరు పడగానే హుష్‌కాకి కొన్ని సర్కిళ్ల పరిధిలో కొందరు మస్తర్లు తీసుకునే సమయానికి వచ్చి మస్తర్ వేసేసి ఆనక డుమ్మా కొట్టేస్తున్నారు. ఇలా నగరం మొత్తం మీద 15 నుంచి 20 శాతం మంది డుమ్మా కొడుతున్నా కార్పొరేషన్ అధికారులు దీనిపై దృష్టి పెట్టడం లేదనే విమర్శలున్నాయి. అలా కార్మికులు డుమ్మా కొట్టేయడమే కావాలని కొందరు ఎస్ఐలు ఆశిస్తున్నారు. ఎందుకంటే మస్తర్ వేయించుకున్నాక డుమ్మా కొట్టేసే కార్మికుడు అలా ఎన్ని రోజులు ఎగనామం పెడితే అన్ని రోజులకు అక్కడి ఎస్ఐకి తాంబూలం ఇచ్చుకుంటున్నారు. డుమ్మా కొట్టే కార్మికులకు ఒక్కొక్కరికి ఒకో రేటు నిర్ణయించారు. కొన్ని సర్కిళ్లలో ఎస్ఐల పేరు చెప్పి మేస్త్రీలు కూడా ఈ తతంగం నడిపిస్తున్నారు. నెలలో 20 రోజులు ఎగనామం పెడితే పర్మనెంట్ వర్కర్ రూ.11 వేలు, కాంట్రాక్ట్ వర్కర్ రూ.6 వేలు, ఒక రోజు ఎగనామం పెడితే కాంట్రాక్ట్ వర్కర్ రూ.200, పర్మనెంట్ వర్కర్ రూ.500 చొప్పున మామూళ్లు ఇచ్చుకుంటున్నారు. అదే ఒక పూట ఎగనామం పెడితే కాంట్రాక్ట్ వర్కర్ రూ.100, పర్మనెంట్ వర్కర్ రూ.200 చెలించుకునే విధానం నడుస్తోంది. ఇలా ప్రతి నెలా పలువురు ఎగనామం పెడుతున్న కారణంగా వారు చేసే పని కూడా తాము చేయాల్సి వస్తోందని, తమపై పనిభారం రెట్టింపు అయిపోతోందని మిగిలిన కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన వారిపై పనిభారం ఇప్పుడున్న 850 మందికి అదనంగా మరో 200 మంది కార్మికుల అవసరం ఉంది. కార్మికుడెవరైనా చనిపోతే ఆ కుటుంబం నుంచి మరొకరికి పోస్టింగ్ ఇస్తున్నారు తప్ప కొత్తగా నియామకాలు ఉండటం లేదు. ఈ కారణంగా పెరిగిపోతున్న పని భారానికి తోడు డుమ్మా కొట్టే వారి భారం కూడా తమపై పడుతోందని కార్మికులు పేర్కొంటున్నారు. పండుగలు, ఆగస్టు 15, రిపబ్లిక్ డే.. ఇలా పలు ముఖ్యమైన సందర్భాలతో పాటు అవసరమైనప్పుడు అడుగుతున్నా క్యాజువల్ లీవ్‌లు ఇవ్వకపోవడంతో సెలవులు పెట్టక తప్పడం లేదని డుమ్మా కొడుతున్న కార్మికులు పేర్కొంటున్నారు. చర్యలు తీసుకుంటాం.. ఈ విషయమై నగరపాలక సంస్థ ఆరోగ్య అధికారి శ్రీనివాస్ నాయక్‌ను వివరణ కోరగా తాను కొత్తగా వచ్చానని చెప్పారు. పారిశుద్ధ్య విభాగంలో సరిపడినంత వర్కర్లు లేకపోవడంతో పనిభారం పెరిగిన మాట వాస్తవమేనన్నారు.విధులకు హాజరు కాకపోయినా మస్తరు వేసి అవకతవకలకు పాల్పడుతున్న విషయం తమ దృష్టికి రాలేదన్నారు. రోజూ ఉదయం 5 గంటల నుంచి మస్తర్లు తనిఖీ చేస్తున్నామన్నారు. ఎక్కడైనా ఆరోపణలు ఉన్నా, లోపాలు జరుగుతున్నా తక్షణమే చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
ఈడో రకం వసూల్ రాజా
- రోజువారీ మెనూగా మార్చేశాడు - శాకాహారం సరే..మాంసాహారంతో బెంబేలు - ఇవ్వకపోతే వేధింపులు...బండ బూతులే - కమిషనర్‌కు, ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం - చర్యలు తీసుకోకపోతే దీర్ఘకాలిక సెలువులోకి వెళ్తామని బాధితుల హెచ్చరిక ఇంటిల్లపాదికి సరిపడేలా రోజూ రెండు లీటర్ల పాలు...కావల్సినన్ని కూరలు...వారానికి రెండు, మూడు రోజులు రెండు పూటలకు ఫుల్‌గా చికెన్...ఆదివారం వస్తే చాలు బొంతకోడి లేదా నాటుకోడి..ఇదేదో ఒక హోటల్లో మెనూ అనుకునేరు. అలా అనుకుంటే తప్పులో కాలేసినట్టే...ఇదంతా కాకినాడ కార్పొరేషన్లో ఒక పారిశుద్ధ్య ఉద్యోగి రోజువారీ వసూళ్ల మెనూ ఇదీ. తన కింద పనిచేసే వారికి ఇండెంట్లమీద ఇండెంట్లు వేస్తున్న కార్పొరేషన్ ఉద్యోగి వ్యవహార శైలిదీ... ఇప్పుడు ఇదే హాట్‌టాపిక్ మారింది. వివరాలిలా ఉన్నాయి... సాక్షిప్రతినిధి, కాకినాడ : కాకినాడ నగరపాలక సంస్థలో పారిశుద్ధ్య విభాగంలో ఒక ఉద్యోగి కోరిన కోర్కెలు తీర్చకపోతే తన కింద పనిచేసే ఉద్యోగులు నరకం కళ్లచూడాల్సిందే. రాజకీయంగా మంచి పలుకుబడి ఉండటంతో ఏళ్ల తరబడి ఒకే చోట పాతుకుపోయి అధికారుల ఆదేశాలు బేఖాతరు చేస్తున్నారనే విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. తాను చెప్పిన పనులు చెప్పినట్టు చేయని వారికి వేధింపులు తప్పడం లేదు. అతని గొంతెమ్మ కోర్కెలు తీర్చలేక దిగువ కేడర్‌లో పనిచేసే ఉద్యోగులు లబోదిబోమంటున్నారు. మార్కెట్ నుంచి తెచ్చే వాటిలో పై అధికారులకు కూడా వాటాలు వెళుతుండటంతో అతని ఆగడాలు మితిమీరిపోయాయని సిబ్బంది గగ్గోలు పెడుతున్నారు. . కాకినాడ నగర పాలక సంస్థ పరిధిలోని పెద్ద మార్కెట్ ఉన్న ప్రాంతమంతా కలిపి ఒక పారిశుద్ధ్య సర్కిల్ అంటారు. ఆ సర్కిల్ అంటే మంచి గిరాకీ ఉన్న ప్రాంతం. ఎందుకంటే అక్కడ నిత్యం లక్షల రూపాయలు కూరగాయల వ్యాపారం జరుగుతుంటుంది. ఆ ప్రాంత పారిశుద్ధ్య నియంత్రణ కోసం పనిచేస్తున్న ఉద్యోగి నిత్యం కిందిస్థాయిలోని మేస్త్ర్రీలు కార్మికులకు నిత్యావసర సరుకులు, కూరలు, ఇతర వస్తువులు తీసుకురావాలని చాలా కాలంగా వేధింపులకు గురిచేస్తున్నట్టు ఆరోపణలు న్నాయి. ఆ ఉద్యోగికి తమపై పర్యవేక్షణాధికారం ఉండడంతో ప్రారంభంలో అడిగినవన్నీ అక్కడా ఇక్కడ వ్యాపారులను బతిమిలాడి చక్కబెట్టేవారు. అదికాస్తా రోజువారీ వసూళ్ల దందాగా మారిపోయిందని దిగులు చెందుతున్నారు. ఇప్పుడు సిబ్బందికి మింగుడుపడని పరిస్థితి నెలకొంది. అడిగిన వస్తువులు రాకపోతే అయ్యవారిలో కోపం కట్టలు తెచ్చుకుని రాయడానికి, వినడానికి వీలులేని విధంగా తిట్ల పురాణం లంకింంచుకోవడంతో సిబ్బంది హడలిపోతున్నారు. ధైర్యం చేసిన కొందరు కార్పొరేషన్ కమిషనర్ అలీమ్‌భాషా, సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు దృష్టికి ఇటీవల తీసుకువెళ్ళారు. అతని ఆగడాలు నిలువరించలేకపోతే దీర్ఘకాలిక సెలవులపై వెళ్ళిపోవడం తప్ప మరో మార్గం కనిపించడం లేదని లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా చర్యలు లేకపోవడంతో కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. . మస్తర్లలోనూ మాయాజాలమే.. ఆ సర్కిల్లో పారిశుద్ధ్య సిబ్బంది హాజరుకు సంబంధించిన మస్తర్లలో కూడా ఆ ఉద్యోగి చేతిలో పెద్ద మాయాజాలమే నడుస్తోంది. ఆ సర్కిల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు మొక్కుబడిగా హాజరై వేలిముద్రలు వేసి వెళ్ళిపోతున్నారనే ఆరోపణలున్నాయి. పనిచేయకుండా తీసుకునే జీతాలలో సంబంధిత కార్మికులు రూ.1200లు, రూ.1500లు వంతున నెలవారీగా ఆ ఉద్యోగికి ముట్టజెబుతున్నారు. ఇలా నెలకు లక్ష జేబులో వేసుకుని పై అధికారులకు సగం ఇవ్వాల్సి వస్తోందని కార్మికులకు ఎదురు చెబుతుండటం విశేషం. ట్రేడ్ లైసెన్సులలోనూ అదే పరిస్థితి... ట్రేడ్ లైసెన్సు ఫీజు వసూళ్ళలో కూడా ఇటీవల అతని ఆగడాలు మితిమీరిపోయాయని మార్కెట్లో విమర్శలు వినిపిస్తున్నాయి. అతని నిర్వాకంతో కార్పొరేషన్ ఆదాయానికి గండిపడుతుందంటున్నారు. పెద్ద, చిన్న దుకాణాల తారతమ్యం లేకుండా వ్యాపారుల నుంచి సొమ్ములు గుంజుతున్నట్టు ఆరోపణలున్నాయి. వ్యాపారాన్ని బట్టి ట్రేడ్‌లైసెన్సు కింద రూ.5 నుంచి రూ.10వేలు చెల్లించాల్సి ఉంటుందని చెబుతూ రెండు, మూడు వేలు మించి నగరపాలక సంస్థకు జమ చేయడం లేదంటున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండడం పలు అనుమానాలకు తావిస్తోందంటున్నారు. కార్పొరేషన్ ఆరోగ్య అధికారి శ్రీనివాస్ నాయక్‌ను వివరణ కోరగా ఈ ఆరోపణలు విషయం తమ దృష్టికి రాలేదన్నారు. లిఖితపూర్వకంగా ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటామన్నారు.