డుమ్మాల నుంచి సొమ్ములు
డుమ్మాల నుంచి సొమ్ములు
Published Fri, Mar 24 2017 11:57 PM | Last Updated on Tue, Sep 5 2017 6:59 AM
-కాకినాడ నగర పాలక సంస్థలో అవినీతి బాగోతం
-మస్తర్ల మాయాజాలంతో శానిటరీ ఇన్‌స్పెక్టర్ల దందా
-గైర్హాజరుకు ఇంత అని రేటు నిర్ణయించి వసూళ్లు
-నిత్యం 20 శాతం మంది విధులకు రాకున్నా పట్టించుకోని అధికారులు
సాక్షి ప్రతినిధి, కాకినాడ : ఎక్కడైనా విధులకు డుమ్మా కొడితే పైనుంచి చర్యలుంటాయని భయపడతారు. కానీ కాకినాడ కార్పొరేషన్‌లో మాత్రం అందుకు పూర్తిగా భిన్నంగా జరుగుతోంది. నెలనెలా మస్తర్ల మాయాజాలంతో మామూళ్ల దందా నడుస్తోంది. ఇక్కడ పారిశుద్ధ్య విభాగంలో కొందరు అధికారులు.. ఎంతమంది డుమ్మా కొడితే అంత మంచిదనుకుంటున్నారు. అలా అయితేనే తాము నాలుగు డబ్బులు వెనకేసుకోవచ్చని ఆరాటపడుతున్నారు.
కాకినాడ నగర పాలక సంస్థ పారిశుద్ధ్య విభాగం అడుగడుగునా అవినీతి కంపుకొడుతోంది. చిరుద్యోగుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని పర్యవేక్షకులు నెలనెలా మామూళ్లు దండుకుంటున్నారు. ఈ విభాగంలో విధులకు రాకున్నా ఫర్వాలేదు. కానీ వచ్చినట్టు మస్తర్ మాత్రం పడిపోతుంది. అలాగని మస్తర్ ఉచితంగా వేస్తారనుకుంటే పొరపాటే. డుమ్మా కొట్టే చిరుద్యోగుల నుంచి మస్తర్, మస్తర్‌కు ఒకో రేటు నిర్ణయించి ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. ఈ మస్తర్‌ల బాగోతంలో మొత్తం శానిటరీ విభాగం అంతటినీ ఒకే గాట కట్టలేము. కానీ కొందరు జేబులు నింపుకునేందుకు చేస్తున్న అవినీతి శానిటరీ ఇనస్పెక్టర్‌లందరికీ మచ్చ తెస్తోంది.
కాకినాడ జనాభా నాలుగున్నర లక్షలు. నగరంలో రోజూ సేకరించే చెత్త 175 టన్నులు. పారిశుద్ధ్య నిర్వహణ కోసం 14 సర్కిళ్లు ఉన్నాయి. ఒక సర్కిల్‌కు ఒక ఎస్‌ఐ(శానిటరీ ఇన్‌స్పెక్టర్)ఉంటారు. శానిటరీ వర్కర్‌లలో సీనియర్‌లు, మాట వినే వారిని మేస్త్రీలుగా నియమించుకుని తమ ఆదేశాలు అమలు చేసేలా చూసుకుంటారు. ఇది నగరంలో నడుస్తున్న ప్రక్రియ. ఒక సర్కిల్ పరిధిలో 40 నుంచి 60 మంది పారిశుద్ధ్య కార్మికులు, ఇద్దరు లేదా ముగ్గురు మేస్త్రీలు పనిచేస్తున్నారు. నగరంలో ఆయా సర్కిళ్లలో సుమారు 850 మంది కార్మికులు పనిచేస్తుండగా వీరిలో 450 మంది పర్మనెంట్ కార్మికులు, మిగిలిన వారు ఆయా సొసైటీల నుంచి కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్నారు. పర్మనెంట్ వారికి రూ.18 వేల నుంచి రూ.35 వేల వరకు వేతనాలుండగా, కాంట్రాక్ట్ వర్కర్‌లకు రూ.12,000 నుంచి రూ.15,000 ఉన్నాయి. నెలనెలా వేతనాలు ఎవరి ఖాతాలకు వారికి వేసేస్తారు. కార్మికులు పనిచేస్తున్నారో, లేదో పర్యవేక్షించి మస్తర్ వేయాల్సింది శానిటరీ ఇన్‌స్పెకర్. శానిటరీ ఇన్‌స్పెక్టర్ క్షేత్రస్థాయికి వెళ్లి తెల్లవారుజామున 5 గంటలకు ఆ సర్కిల్ పరిధిలో పనిచేసే వారి మస్తర్ తీసుకోవాలి. ఇదివరకు రిజిస్టర్‌లో సంతకం తీసుకునే వారు. ఇప్పుడు వేలిముద్రలు తీసుకుంటున్నారు. అలా తెల్లవారుజామున ఒకటి, మధ్యాహ్నం మరొకటి మస్తర్ తీసుకుంటారు. కొన్ని సర్కిళ్లలో కొందరు శానిటరీ ఇన్‌స్పెక్టర్‌లు మస్తర్ల ప్రక్రియను మేస్త్రీలకు విడిచిపెట్టేసి తీరిగ్గా తొమ్మిది, 10 గంటలకు బయటకు వస్తున్నారనే విమర్శలున్నాయి.
మస్తరు పడగానే హుష్‌కాకి
కొన్ని సర్కిళ్ల పరిధిలో కొందరు మస్తర్‌లు తీసుకునే సమయానికి వచ్చి మస్తర్ వేసేసి ఆనక డుమ్మా కొట్టేస్తున్నారు. ఇలా నగరం మొత్తం మీద 15 నుంచి 20 శాతం మంది డుమ్మా కొడుతున్నా కార్పొరేషన్ అధికారులు దీనిపై దృష్టి పెట్టడం లేదనే విమర్శలున్నాయి. అలా కార్మికులు డుమ్మా కొట్టేయడమే కావాలని కొందరు ఎస్‌ఐలు ఆశిస్తున్నారు. ఎందుకంటే మస్తర్ వేయించుకున్నాక డుమ్మా కొట్టేసే కార్మికుడు అలా ఎన్ని రోజులు ఎగనామం పెడితే అన్ని రోజులకు అక్కడి ఎస్‌ఐకి తాంబూలం ఇచ్చుకుంటున్నారు. డుమ్మా కొట్టే కార్మికులకు ఒక్కొక్కరికి ఒకో రేటు నిర్ణయించారు. కొన్ని సర్కిళ్లలో ఎస్‌ఐల పేరు చెప్పి మేస్త్రీలు కూడా ఈ తతంగం నడిపిస్తున్నారు. నెలలో 20 రోజులు ఎగనామం పెడితే పర్మనెంట్ వర్కర్ రూ.11 వేలు, కాంట్రాక్ట్ వర్కర్ రూ.6 వేలు, ఒక రోజు ఎగనామం పెడితే కాంట్రాక్ట్ వర్కర్ రూ.200, పర్మనెంట్ వర్కర్ రూ.500 చొప్పున మామూళ్లు ఇచ్చుకుంటున్నారు. అదే ఒక పూట ఎగనామం పెడితే కాంట్రాక్ట్ వర్కర్ రూ.100, పర్మనెంట్ వర్కర్ రూ.200 చెలించుకునే విధానం నడుస్తోంది. ఇలా ప్రతి నెలా పలువురు ఎగనామం పెడుతున్న కారణంగా వారు చేసే పని కూడా తాము చేయాల్సి వస్తోందని, తమపై పనిభారం రెట్టింపు అయిపోతోందని మిగిలిన కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మిగిలిన వారిపై పనిభారం
ఇప్పుడున్న 850 మందికి అదనంగా మరో 200 మంది కార్మికుల అవసరం ఉంది. కార్మికుడెవరైనా చనిపోతే ఆ కుటుంబం నుంచి మరొకరికి పోస్టింగ్ ఇస్తున్నారు తప్ప కొత్తగా నియామకాలు ఉండటం లేదు. ఈ కారణంగా పెరిగిపోతున్న పని భారానికి తోడు డుమ్మా కొట్టే వారి భారం కూడా తమపై పడుతోందని కార్మికులు పేర్కొంటున్నారు. పండుగలు, ఆగస్టు 15, రిపబ్లిక్ డే.. ఇలా పలు ముఖ్యమైన సందర్భాలతో పాటు అవసరమైనప్పుడు అడుగుతున్నా క్యాజువల్ లీవ్‌లు ఇవ్వకపోవడంతో సెలవులు పెట్టక తప్పడం లేదని డుమ్మా కొడుతున్న కార్మికులు పేర్కొంటున్నారు.
చర్యలు తీసుకుంటాం..
ఈ విషయమై నగరపాలక సంస్థ ఆరోగ్య అధికారి శ్రీనివాస్ నాయక్‌ను వివరణ కోరగా తాను కొత్తగా వచ్చానని చెప్పారు. పారిశుద్ధ్య విభాగంలో సరిపడినంత వర్కర్‌లు లేకపోవడంతో పనిభారం పెరిగిన మాట వాస్తవమేనన్నారు.విధులకు హాజరు కాకపోయినా మస్తరు వేసి అవకతవకలకు పాల్పడుతున్న విషయం తమ దృష్టికి రాలేదన్నారు. రోజూ ఉదయం 5 గంటల నుంచి మస్తర్లు తనిఖీ చేస్తున్నామన్నారు. ఎక్కడైనా ఆరోపణలు ఉన్నా, లోపాలు జరుగుతున్నా తక్షణమే చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Advertisement
Advertisement