కార్పొరేషన్ ఎన్నికలకు సర్వం సన్నద్ధం
- 1300 మంది సిబ్బంది నియామకం
- మద్యం, డబ్బు పంపిణీ నిరోధానికి బృందాలు
కాకినాడ: కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణకు నగరపాలక సంస్థ సర్వసన్నద్దమైంది. అభ్యర్థుల ప్రచారం ప్రారంభమైన నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా,నియమావళి, పోలింగ్ సహా వివిధ అంశాల్లో విధులు నిర్వర్తించేందుకు సుమారు 1300 మంది సిబ్బందిని నియమించారు. రిటర్నింగ్ అధికారులు, అసిస్టెట్ రిటర్నింగ్ అధికారులు, ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, ఇతర సిబ్బందికి గురువారం ఉత్తర్వులు కూడా పంపారు. దాదాపు 196 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. సమస్యాత్మక, అతిసమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను గుర్తించేందుకు పోలీస్, రెవెన్యూ, నగరపాలక సంస్థ యంత్రాంగం కసరతు చేస్తోంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మరో వైపు ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీ నిరోధానికి ప్లైయింగ్‌స్క్వాడ్స్ ఏర్పాటు చేశారు. ఇక కొత్తగా నియమించే జోనల్ అధికారులు, ఎన్నికల ప్రవర్తనా నియమావళికి సంబంధించిన అధికారులకు మెజిస్టీరియల్ అధికారాలు ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించి న్యాయశాఖ ఆమోదానికి పంపారు. ఇక ఎన్నిక నిర్వహణకు సంబంధించి ఈ నెల 19 నుంచి 22 వరకు శిక్షణ ఇవ్వనున్నారు. అందుబాటులో ఉన్న 400 ఈవీఎంలను మొదటి విడత పరిశీలన పూర్తి చేశారు. బ్యాలెట్ పత్రాల ప్రింటింగ్ కూడా సిద్ధం చేస్తున్నారు.