సహ‘కారమే’
పొత్తు తలనొప్పిగా మారిందా!
ప్రచారానికి దూరంగానే బీజేపీ నాయకులు
బోట్‌క్లబ్(కాకినాడ సిటీ) : కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ పొత్తు పేరుతో స్థానికంగా ఐక్యతా రాగం తీసినా ఆ రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. టీడీపీ నాయకులకు మద్దతుగా డివిజన్‌లో ప్రచారం చేసేందుకు బీజేపీ నాయకులు ససేమిరా! అంటున్నారు. ఇప్పటి వరకూ ప్రభుత్వ పథకాల్లో తమ వారు చెప్పిన వారికి ఒక్కరికీ కూడా ఏ పథకం అందకుండా చేసిన టీడీపీ నాయకులపై బీజేపీ నేతలు గుర్రుగా ఉన్నారు. ఎన్నికలు వచ్చే సరికి పొత్తు పేరు చెప్పి కలిసి పనిచేయడమంటే కుదరదని బీజేపీ నాయకులు తెగేసీ చెబుతున్నారు. తమను ఇప్పటి వరకు బద్ధవిరోధుల్లా చూసి ప్రస్తుతం మీ అవసరమ వచ్చిందని స్నేహగీతం పాడితే సరిపోతుందా? అని బీజేపీ కార్యకర్తలు, టీడీపీ నాయకులపై మండిపడుతున్నారు. తాము సీట్లు ఆశించి భంగపడ్డామని, సీట్లు తమకు ఇవ్వకుండా టీడీపీ తమకు అన్యాయం చేసిందని ఇది మనస్సులో పెట్టుకుని వారితో ప్రచారం చేయడమెలా అన్ని ప్రశ్నిస్తున్నారు.
ఆది నుంచి అంతే
కాకినాడ నగరంలో టీడీపీ, బీజేపీ నాయకులు ఎప్పుడూ సఖ్యత లేదు. కేవలం పార్టీ అధిష్టానం పొత్తు రాగం పాడింది తప్ప, క్షేత్రస్థాయిలో ఇరుపార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఎప్పుడు పొసగలేదు. నగరంలో రెండు దేవస్థానాల్లో బీజేపీ నాయకులకు పాలకవర్గసభ్యులుగా నియమించినా టీడీపీ నాయకులు వారితో ప్రమాణస్వీకారం చేయించకుండా అడ్డుకున్నారంటే ఆ రెండుపార్టీ కార్యకర్తల మధ్య విభేదాలు ఏమేరకు ఉన్నాయో వేరే చెప్పనవసరం లేదు. రాష్ట్ర దేవాదాయశాఖమంత్రి పైడికొండల మాణిక్యాలరావు బీజేపీ నాయకుల వైపు నిలబడినా వారిని ఆలయంలోకి కూడా రానీయకుండా అడ్డుకున్నారు. నగరంలో బాలత్రిపుర సుందరి సమేత రామలింగేశ్వరస్వామి దేవస్థానంలో బీజేపీకి చెందిన కర్రి పాపారావును, జగన్నాథపురంలోని వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో బీజేపీకి చెందిన కొక్కిలగడ్డ గంగరాజును పాలకవర్గ సభ్యులుగా నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా స్థానిక టీడీపీ నాయకులు బీజేపీ వారిని దరిచేరనీయలేదు. దీనికి తోడు నగరంలో కేంద్రప్రభుత్వం మంజూరు చేసిన ప్రధానమంత్రి ఆవాస్‌యోజన0 పథకంలో మంజూరైన 4608 ఇళ్ల మంజూరులో కూడా టీడీపీ నాయకులు పెత్తనమే చెల్లింది. కేంద్ర ప్రభుత్వ పథకమైనా బీజేపీ నాయకులు సిఫారసులు చేసిన వారికి ఒక్కరికీ కూడా ఇళ్లు మంజూరు చేయలేదు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని తాము ఏ ముఖం పెట్టుకొని టీడీపీ నాయకులతో కలిసి ప్రచారానికి వెళ్లేది లేదంటూ బీజేపీ నాయకులు వద్ద ఆ పార్టీ కార్యకర్తలు వాపోతున్నారు.
పొత్తు.. తలనొప్పిగా మారింది
బీజేపీ, టీడీపీ పొత్తు ఇప్పుడు తలనొప్పిగా మారింది. టీడీపీ అభ్యర్థులు బరిలో ఉన్న డివిజన్లో బీజేపీ నాయకులు అటువైపు తొంగిచూడడం లేదు. అలాగే ఇటు బీజేపీకి కేటాయించిన తొమ్మిది డివిజన్లలోనూ టీడీపీ నాయకులు కూడా ఎక్కడ కనిపించడం లేదు. ఇప్పటి వరకు ఒకరిపై ఒకరు కారాలు, మిరియాలు నూరుకొని కలిసి పనిచేయడం చాలా కష్టమని ఇరుపార్టీ నాయకులు చెప్పకనే చెబుతున్నారు.