ఉత్కంఠ... ఉరుకులు... పరుగులు
♦ నామినేషన్ల చివరి రోజు హైడ్రామా
♦ అభ్యర్థులకు బి ఫారాలు అందజేత
♦ బరిలో మొత్తం అభ్యర్థులు 241 మంది...
♦ నేటి నుంచి ఊపందుకోనున్న ప్రచారం
కాకినాడ: కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాపై వివిధ రాజకీయ పార్టీల్లో నామినేషన్ల చివరి రోజైన ఆదివారం తీవ్ర ఉత్కంఠకు దారితీసింది. అప్పటికే ఆశావాహులు నామినేషన్లు దాఖలు చేయడం...అభ్యర్థిత్వాల ఖరారుపై కసరత్తులు కొనసాగుతున్న నేపద్యంలో అభ్యర్థులతోపాటు నాయకులకు కూడా టెన్షన్ తప్పలేదు. అభ్యర్థిత్వాలను ఖరారు చేయడంతో ఆగమేఘాలపై మధ్యాహ్నం మూడు గంటల లోపు బి-ఫారాలను అందజేసే పనిలో కొందరు నిమగ్నమైతే... రెబల్స్‌గా ఉండిపోతారన్న భయంతో అప్పటికే నామినేషన్లు వేసిన అభ్యర్థులతో ఉపసంహరింపచేసే దిశగా మరికొంత మంది ఉరుకులు...పరుగులు పెట్టారు. చివరి క్షణం వరకూ బి - ఫారం అందజేత, నామినేషన్ల ఉపసంహరణపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అధికారికంగా అభ్యర్థిత్వాలు ఖరారయ్యాక రెబల్స్‌గా ఉంటారన్న భయంతో కొంతమందిని పార్టీ నేతలు బుజ్జగింపులపర్వం కూడా కొనసాగించారు. భవిష్యత్తులో మంచి పదవులిస్తామంటూ నచ్చజెప్పడం వంటి సంఘటనలు కూడా చోటుచేసుకున్నాయి.
బరిలో 241 మంది...
నామినేషన్ల ఉపసంహరణ అనంతరం కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో 241 మంది బరిలో నిలిచారు. మొత్తం 449 నామినేషన్లు దాఖలుకాగా బుధవారం నాటికి 209 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. చివరి రోజైన బుధవారం ఒక్కరోజే 158 మంది నామినేషన్లు వెనక్కి తీసుకున్నారు.
పోటీలో ఉన్న అభ్యర్థుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి 48 మంది, టీడీపీ నుంచి 39, కాంగ్రెస్ 17, టీడీపీ మిత్రపక్షమైన బీజేపీ నుంచి 9 మంది, సీపీఎం 2, సీపీఐ 2, బీఎస్పీ 4, శివసేన 1 కలిపి 122 మంది ప్రధాన పార్టీ అభ్యర్థులు రంగంలో నిలిచారు. మిగిలిన 119 మంది స్వతంత్య్ర అభ్యర్థులుగా పోటీలో ఉన్నారు.
వైఎస్సార్‌సీపీ తుది జాబితా...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మంగళవారం 40 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. మిగిలిన 8 మంది అభ్యర్థుల జాబితాను పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి బుధవారం పత్రికలకు విడుదల చేశారు. ఆ ఎనిమిది మందిలో వాసిరెడ్డి సూరిబాబు (1), సంగిశెట్టి జాహ్నవి(2), గుర్రాల వెంకటేష్ (స్టీఫెన్, 3), పేర్ల జోగారావు (16), కోనాడ సత్యనారాయణ (18 ), వాసిరెడ్డి వరలక్ష్మి (28) బోరా అరుణ(33), రమణాతి మురళి (49) వార్డుల్లో బరిలో నిలిచారు.