ఈడో రకం వసూల్‌ రాజా | kakinada corporation employe issue | Sakshi
Sakshi News home page

ఈడో రకం వసూల్‌ రాజా

Published Wed, Mar 22 2017 11:59 PM | Last Updated on Tue, Sep 5 2017 6:48 AM

ఈడో రకం వసూల్‌ రాజా

ఈడో రకం వసూల్‌ రాజా

- రోజువారీ మెనూగా మార్చేశాడు
- శాకాహారం సరే..మాంసాహారంతో బెంబేలు
- ఇవ్వకపోతే వేధింపులు...బండ బూతులే
- కమిషనర్‌కు, ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం
- చర్యలు తీసుకోకపోతే దీర్ఘకాలిక సెలువులోకి వెళ్తామని బాధితుల హెచ్చరిక
 
ఇంటిల్లపాదికి సరిపడేలా రోజూ రెండు లీటర్ల పాలు...కావల్సినన్ని కూరలు...వారానికి రెండు, మూడు రోజులు రెండు పూటలకు ఫుల్‌గా చికెన్‌...ఆదివారం వస్తే చాలు బొంతకోడి లేదా నాటుకోడి..ఇదేదో ఒక హోటల్‌లో మెనూ అనుకునేరు. అలా అనుకుంటే తప్పులో కాలేసినట్టే...ఇదంతా కాకినాడ కార్పొరేషన్‌లో ఒక పారిశుద్ధ్య ఉద్యోగి రోజువారీ వసూళ్ల మెనూ ఇదీ. తన కింద పనిచేసే వారికి ఇండెంట్లమీద ఇండెంట్లు వేస్తున్న కార్పొరేషన్‌ ఉద్యోగి వ్యవహార శైలిదీ... ఇప్పుడు ఇదే హాట్‌టాపిక్‌ మారింది. వివరాలిలా ఉన్నాయి... 
 
సాక్షిప్రతినిధి, కాకినాడ : కాకినాడ నగరపాలక సంస్థలో పారిశుద్ధ్య విభాగంలో ఒక ఉద్యోగి కోరిన కోర్కెలు తీర్చకపోతే తన కింద పనిచేసే ఉద్యోగులు నరకం కళ్లచూడాల్సిందే. రాజకీయంగా మంచి పలుకుబడి ఉండటంతో ఏళ్ల తరబడి ఒకే చోట పాతుకుపోయి అధికారుల ఆదేశాలు బేఖాతరు చేస్తున్నారనే విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. తాను చెప్పిన పనులు చెప్పినట్టు చేయని వారికి వేధింపులు తప్పడం లేదు. అతని గొంతెమ్మ కోర్కెలు తీర్చలేక దిగువ కేడర్‌లో పనిచేసే ఉద్యోగులు లబోదిబోమంటున్నారు. మార్కెట్‌ నుంచి తెచ్చే వాటిలో పై అధికారులకు కూడా వాటాలు వెళుతుండటంతో అతని ఆగడాలు మితిమీరిపోయాయని సిబ్బంది గగ్గోలు పెడుతున్నారు.
.
 కాకినాడ నగర పాలక సంస్థ పరిధిలోని పెద్ద మార్కెట్‌ ఉన్న ప్రాంతమంతా కలిపి ఒక పారిశుద్ధ్య సర్కిల్‌ అంటారు. ఆ సర్కిల్‌ అంటే మంచి గిరాకీ ఉన్న ప్రాంతం. ఎందుకంటే అక్కడ నిత్యం లక్షల రూపాయలు కూరగాయల వ్యాపారం జరుగుతుంటుంది. ఆ ప్రాంత పారిశుద్ధ్య నియంత్రణ కోసం పనిచేస్తున్న ఉద్యోగి నిత్యం కిందిస్థాయిలోని మేస్త్ర్రీలు కార్మికులకు నిత్యావసర సరుకులు, కూరలు, ఇతర వస్తువులు తీసుకురావాలని చాలా కాలంగా వేధింపులకు గురిచేస్తున్నట్టు ఆరోపణలు న్నాయి. ఆ ఉద్యోగికి తమపై పర్యవేక్షణాధికారం ఉండడంతో ప్రారంభంలో అడిగినవన్నీ అక్కడా ఇక్కడ వ్యాపారులను బతిమిలాడి చక్కబెట్టేవారు. అదికాస్తా రోజువారీ వసూళ్ల దందాగా మారిపోయిందని దిగులు చెందుతున్నారు. ఇప్పుడు సిబ్బందికి మింగుడుపడని పరిస్థితి నెలకొంది. అడిగిన వస్తువులు రాకపోతే అయ్యవారిలో కోపం కట్టలు తెచ్చుకుని రాయడానికి, వినడానికి వీలులేని విధంగా తిట్ల పురాణం లంకింంచుకోవడంతో సిబ్బంది హడలిపోతున్నారు. ధైర్యం చేసిన కొందరు కార్పొరేషన్‌ కమిషనర్‌ అలీమ్‌భాషా, సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు దృష్టికి ఇటీవల తీసుకువెళ్ళారు. అతని ఆగడాలు నిలువరించలేకపోతే దీర్ఘకాలిక సెలవులపై వెళ్ళిపోవడం తప్ప మరో మార్గం కనిపించడం లేదని లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా చర్యలు లేకపోవడంతో కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
.
మస్తర్లలోనూ మాయాజాలమే..
ఆ సర్కిల్‌లో పారిశుద్ధ్య సిబ్బంది హాజరుకు సంబంధించిన మస్తర్లలో కూడా ఆ ఉద్యోగి చేతిలో పెద్ద మాయాజాలమే నడుస్తోంది. ఆ సర్కిల్‌లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు మొక్కుబడిగా హాజరై వేలిముద్రలు వేసి వెళ్ళిపోతున్నారనే ఆరోపణలున్నాయి. పనిచేయకుండా తీసుకునే జీతాలలో సంబంధిత కార్మికులు రూ.1200లు, రూ.1500లు వంతున నెలవారీగా ఆ ఉద్యోగికి ముట్టజెబుతున్నారు. ఇలా నెలకు లక్ష జేబులో వేసుకుని పై అధికారులకు సగం ఇవ్వాల్సి వస్తోందని కార్మికులకు ఎదురు చెబుతుండటం విశేషం. 
ట్రేడ్‌ లైసెన్సులలోనూ అదే పరిస్థితి...
ట్రేడ్‌ లైసెన్సు ఫీజు వసూళ్ళలో కూడా ఇటీవల అతని ఆగడాలు మితిమీరిపోయాయని మార్కెట్‌లో విమర్శలు వినిపిస్తున్నాయి. అతని నిర్వాకంతో కార్పొరేషన్‌ ఆదాయానికి గండిపడుతుందంటున్నారు. పెద్ద, చిన్న దుకాణాల తారతమ్యం లేకుండా వ్యాపారుల నుంచి సొమ్ములు గుంజుతున్నట్టు ఆరోపణలున్నాయి. వ్యాపారాన్ని బట్టి ట్రేడ్‌లైసెన్సు కింద రూ.5 నుంచి రూ.10వేలు చెల్లించాల్సి ఉంటుందని చెబుతూ రెండు, మూడు వేలు మించి నగరపాలక సంస్థకు జమ చేయడం లేదంటున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండడం పలు అనుమానాలకు తావిస్తోందంటున్నారు. కార్పొరేషన్‌ ఆరోగ్య అధికారి శ్రీనివాస్‌ నాయక్‌ను వివరణ కోరగా ఈ ఆరోపణలు విషయం తమ దృష్టికి రాలేదన్నారు. లిఖితపూర్వకంగా ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement