
కొలంబో: పహల్గాంలో కాల్పులు జరిపిన ఉగ్రవాదులు కొలంబో చేరుకున్నట్లు అనుమానాలు కలుగుతున్నాయి. కొలంబో ఎయిర్‌పోర్టులో భారీ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. చెన్నై నుంచి కొలంబో వెళ్లిన విమానంలో ఎయిర్‌పోర్ట్ సిబ్బంది, స్థానిక పోలీసులు తనిఖీలు చేపట్టారు. భారత్ నిఘా వర్గాల సమాచారంతో సోదాలు చేపట్టారు. శ్రీలంక ఎయిర్‌లైన్స్ చెందిన యూఎల్ 122 విమానంలో చేపట్టిన విస్తృత తనిఖీల్లో ఆరుగురు అనుమానితులను పోలీసులు అదుపులో తీసుకున్నారు. పహల్గాం దాడితో సంబంధాలున్నట్లు అనుమానం వ్యక్తమవుతున్నాయి.
కాగా, పహల్గాం ఉగ్రదాడిపై ఎన్‌ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) తన దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇప్పటివరకు 3వేల మందికి పైగా ఎన్‌ఐఏ విచారించింది. ఇప్పటికే 90 మంది ఓవర్ గ్రౌండ్ వర్కర్లపై కేసులు నమోదుచేసింది. 100కుపైగా ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. రేపు(ఆదివారం) కేంద్ర హోంశాఖకు నివేదిక ఇవ్వనుంది. ఈ కేసులో భాగంగా 2023లో రాజౌరీలో జరిగిన ఉగ్రదాడి కేసులో అరెస్టయిన ఇద్దరు వ్యక్తుల్ని ప్రశ్నించింది. ప్రస్తుతం జమ్ములోని కోట్ భల్వాల్ జైల్లో ఉన్న లష్కరే తోయిబా ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ నిస్సార్ అహ్మద్, ముస్తాక్ హుస్సేన్‌ను విచారించింది. పహల్గాం ఉగ్రదాడిలో వీరికి సంబంధాలు ఉన్నాయా? అనే అనుమానంతోనే వారిని ఎన్‌ఐఏ అధికారులు విచారించినట్లు సమాచారం.
పహల్గాం దాడి ఘటనపై ఎన్‌ఐఏ దర్యాప్తులోపలు సంచలన విషయాలు వెలుగులో వస్తున్నాయి. ఈ దాడి వెనుక పాకిస్థాన్‌కు చెందిన నిషేధిత ఉగ్రసంస్థ లష్కరే తోయిబా, పాక్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ హస్తం ఉన్నట్లు ప్రాథమిక నివేదికలో పేర్కొంది. లష్కరే తోయిబా ఉగ్రవాదులే ఈ దాడికి పాల్పడినట్లు తేల్చింది. ఈ దాడికి పాకిస్థాన్‌లోని లష్కరే ప్రధాన కార్యాలయంలోనే ప్లాన్ చేసినట్లు ఎన్‌ఐఏ వెల్లడించింది.