చెన్నై: అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తప్పుకోవడంతో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి ఎవరనే ఉత్కంఠ నెలకొంది. ఈలోపు బైడెన్ భారతీయ మూలాలున్న ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పేరును ప్రతిపాదించారు. ప్రస్తుతం ఆమె డెమోక్రట్ల మద్దతును కూడగట్టుకునే పనిలో ఉన్నారు. అయితే..
కమలా హారిస్‌కు తమిళనాడుతో సంబంధం ఉంది. పైంగనాడు-తులసేంద్రపురం.. ఆమె తాతల ఊరు. ఈ గ్రామ ప్రజలు ఆమె అగ్రరాజ్యం అధ్యక్ష అభ్యర్థిగా బరిలో ఉండాలని కోరుకుంటున్నారు. సోమవారం ఆమె గెలుపు కోసం గ్రామంలోని ధర్మ శాస్తా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కమలా దేవి గెలిచేంతవరకు తమ పూజలు కొనసాగుతాయని చెబుతున్నారు.
‘‘అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పీవీ గోపాలన్ గారి మనవరాలు (కమలా హారిస్) ప్రెసిడెంట్ అభ్యర్థి బరిలో ఉంటటం చాలా ఆనందంగా ఉంది. ఆమె డొనాల్డ్ ట్రంప్‌పై విజయం సాధించాలని మేము గ్రామంలో ప్రత్యేక పూజలు చేశాం’’ అని ఓ గ్రామస్తుడు అంటున్నాడు. ‘‘ఈ ఆలయ పునరుద్ధరణ కోసం ఒక్కొక్కరు రూ. 5,000 విరాళం ఇచ్చిన వ్యక్తుల జాబితాలో కమలా హ్యారిస్ మామ బాలచంద్రన్ గోపాలన్ ఉన్నారు. ఆలయం మేనేజ్‌మెంట్ వారికి తరచూ విభూతి, కుంకుమ పంపిస్తుంది. ఆలయంలో జరిగే కార్యక్రమాలకు వారిని ఆహ్వానిస్తాం. వారు ఇక్కడి నుంచి మరో ప్రాంతానికి వెళ్లినప్పటికీ ఈ గ్రామంతో సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఆలయం పునరుద్ధరణకు విరాళం ఇచ్చారు. ఆలయం కార్యక్రమాలకు హాజరవుతారు’’అని గ్రామస్తులు తెలిపారు.
చెన్నైకి 350 కిలోమీట్లర్ల దూరంలో ఉన్న ఈ గ్రామ ప్రజలు.. 2020లో కమలా అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైనప్పుడు కూడా సంబరాలు చేసుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు, పలు కార్యక్రమాలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment