కొచ్చి: మూడు రోజుల క్రితం ఎడారి దేశం కువైట్‌లో వలసకార్మికులు ఉంటున్న భవంతిలో సంభవించిన అగ్నిప్రమాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 31 మంది భారతీ యుల మృతదేహాలు స్వదేశానికి చేరుకు న్నాయి. వీరిలో అత్యధికంగా 23 మంది కేరళీయులు ఉన్నారు. మృతుల్లో కర్ణాటక సంబంధించి ఒకరు, తమిళనాడుకు చెందిన ఏడుగురి మృతదేహాలనూ తీసుకొచ్చారు. మృతదేహాలను తొలుత శుక్రవారం ఉదయం కేరళలోని కొచ్చి అంతర్జాతీయ విమానా శ్రయానికి తీసుకొచ్చారు.
ఎయిర్‌పోర్ట్‌లోనే రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ వారికి నివాళులర్పించారు. ‘‘ జీవనోపాధి కోసం విదేశం వెళ్లి విగతజీవులైన బడుగుజీవుల కష్టాలను కేంద్రప్రభుత్వం పట్టించుకోవాలి. మృతుల కుటుంబాలకు ఇచ్చే ఆర్థికసాయం సరిపోదు’ అని సీఎం అన్నారు. కువైట్ నుంచి మృతదేహాల తరలింపు ప్రక్రియను దగ్గరుంచి చూసుకున్న విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్‌తోపాటు తమిళనాడు మైనారిటీ సంక్షేమ మంత్రి కేఎస్ మస్తాన్‌లు సైతం పార్థివదేహాల వద్ద నివాళులర్పించారు.
మృతుల్లో ముగ్గురు తెలుగువారు
అగ్నిప్రమాదంలో ముగ్గురు తెలుగువ్యక్తులు సైతం చనిపోయారని ఆంధ్రప్రదేశ్ నాన్– రెసిడెంట్ తెలుగు సొసైటీ(ఏపీఎన్‌ఆర్‌టీఎస్) ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన టి. లోకనాథం, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఎం.సత్యనారాయణ, ఎం.ఈశ్వరుడు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారని ఏపీఎన్‌ఆర్‌టీఎస్ పేర్కొంది. ‘‘ సొంత పనిమీద స్వదేశానికి వచ్చిన లోకనాథం తిరిగి కువైట్ బయల్దేరారు. స్వస్థలం నుంచి తొలుత జూన్ 5న హైదరాబాద్‌కు వచ్చి నాలుగు రోజులు ఉండి తర్వాత జూన్ 11న కువైట్ చేరుకున్నారు. ఆయన భవంతికి వచ్చి బసచేసిన అదే రోజున అగ్నిప్రమాదం జరిగి తుదిశ్వాస విడిచారు’’ అని లోకనాథం బంధువు శాంతారావు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment