Migrant workers killed
-
Kuwait Fire Incident: భారత్‌కు చేరుకున్న‘కువైట్’ బాధితుల మృతదేహాలు
కొచ్చి: మూడు రోజుల క్రితం ఎడారి దేశం కువైట్‌లో వలసకార్మికులు ఉంటున్న భవంతిలో సంభవించిన అగ్నిప్రమాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 31 మంది భారతీ యుల మృతదేహాలు స్వదేశానికి చేరుకు న్నాయి. వీరిలో అత్యధికంగా 23 మంది కేరళీయులు ఉన్నారు. మృతుల్లో కర్ణాటక సంబంధించి ఒకరు, తమిళనాడుకు చెందిన ఏడుగురి మృతదేహాలనూ తీసుకొచ్చారు. మృతదేహాలను తొలుత శుక్రవారం ఉదయం కేరళలోని కొచ్చి అంతర్జాతీయ విమానా శ్రయానికి తీసుకొచ్చారు. ఎయిర్‌పోర్ట్‌లోనే రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ వారికి నివాళులర్పించారు. ‘‘ జీవనోపాధి కోసం విదేశం వెళ్లి విగతజీవులైన బడుగుజీవుల కష్టాలను కేంద్రప్రభుత్వం పట్టించుకోవాలి. మృతుల కుటుంబాలకు ఇచ్చే ఆర్థికసాయం సరిపోదు’ అని సీఎం అన్నారు. కువైట్ నుంచి మృతదేహాల తరలింపు ప్రక్రియను దగ్గరుంచి చూసుకున్న విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్‌తోపాటు తమిళనాడు మైనారిటీ సంక్షేమ మంత్రి కేఎస్ మస్తాన్లు సైతం పార్థివదేహాల వద్ద నివాళులర్పించారు.మృతుల్లో ముగ్గురు తెలుగువారుఅగ్నిప్రమాదంలో ముగ్గురు తెలుగువ్యక్తులు సైతం చనిపోయారని ఆంధ్రప్రదేశ్ నాన్– రెసిడెంట్ తెలుగు సొసైటీ(ఏపీఎన్ఆర్టీఎస్) ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన టి. లోకనాథం, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఎం.సత్యనారాయణ, ఎం.ఈశ్వరుడు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారని ఏపీఎన్ఆర్టీఎస్ పేర్కొంది. ‘‘ సొంత పనిమీద స్వదేశానికి వచ్చిన లోకనాథం తిరిగి కువైట్ బయల్దేరారు. స్వస్థలం నుంచి తొలుత జూన్ 5న హైదరాబాద్‌కు వచ్చి నాలుగు రోజులు ఉండి తర్వాత జూన్ 11న కువైట్ చేరుకున్నారు. ఆయన భవంతికి వచ్చి బసచేసిన అదే రోజున అగ్నిప్రమాదం జరిగి తుదిశ్వాస విడిచారు’’ అని లోకనాథం బంధువు శాంతారావు చెప్పారు. -
ట్రక్ యాక్సిడెంట్.. 53 మంది దుర్మరణం
మెక్సికో: ప్రాణాలను పణంగా పెట్టి యునైటెడ్ స్టేట్స్ సరిహద్దుకు చేరుకోవడానికి ప్రయత్నించారా వలసదారులు. కానీ ట్రక్కు తిరగబడటంతో వారిని మృత్యువు కబలించింది. దక్షిణ మెక్సికోలో గురువారం చోటుచేసుకున్న ఈ హృదయవిదారక దుర్ఘటనలో దాదాపు 53 మంది అమెరికన్ వలసదారులు మరణించారు. మృతుల్లో పురుషులు, మహిళలు, పిల్లలు ఉన్నారని చియాపాస్ సివిల్ ప్రొడక్షన్ తెలిపింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.చియాపాస్ రాష్ట్రంలోని టక్స్ట్లా గుటిరెజ్ నగరం వెలుపల ఒక పదునైన వంపులో ట్రక్కు క్రాష్ కావడంతో ఈ ప్రమాదం జరిగిందని చియాపాస్ సివిల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అధిపతి లూయిస్ మాన్యువల్ గార్సియా తెలిపారు. వాహనంలో కనీసం 107 మంది ఉంటారని ప్రాధమిక అంచనా. దక్షిణ మెక్సికోలో వారిని రవాణా చేస్తున్న ట్రక్కు ఓవర్‌లోడ్, అతివేగం కారణంగా ఫుట్‌పాత్‌ను ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. కాగా మెక్సికో నుంచి అమెరికాకు అక్రమంగా వలస వెళ్లడం సాధారణంగా జరుగుతుంది. గత నెలలో 652 మందితో అక్రమ వలసదారులతో వెళ్తున్న 6 ట్రక్కులను పట్టుకున్నారు. మానవ అక్రమ రవాణా సంఘటనలు తరచూ జరుగుతూ ఉంటాయి. ఇరుగు పొరుగు దేశాల నుంచి మెక్సికో నుంచి అమెరికాలో ప్రవేశించేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ ట్రక్కు కూడా అలాంటిదే. కాగా మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యువల్ లోపెజ్ ఒబ్రాడోర్ ట్విటర్ ద్వారా సంఘటనపై సంతాపం తెలిపారు. చదవండి: ప్రేమ వివాహం చేసుకున్నాడు.. బలవంతంగా సూసైడ్‌నోట్ రాయించి.. -
చితికిన బతుకులు
ఔరైయా/భోపాల్: పొట్ట చేతపట్టుకొని రాష్ట్రం కాని రాష్ట్రానికి వలసవెళ్లిన బడుగుజీవుల బతుకుల్లో మరో విషాదం. లాక్‌డౌన్‌తో వలస వచ్చిన ప్రాంతంలో పనిలేక సొంత రాష్ట్రానికి పయనమైన వారిని రోడ్డు ప్రమాదాలు కబళించాయి. శనివారం ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లలో జరిగిన పలు రోడ్డు ప్రమాదాలు 33 మందిని విగతజీవులుగా మార్చాయి. ఢిల్లీ నుంచి మధ్యప్రదేశ్‌లోని చత్తర్‌పూర్‌నకు సరుకులతో వెళ్తున్న లారీలో 22 మంది వలస కూలీలు ఎక్కారు. ఈ లారీ శనివారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో 19వ నంబర్ జాతీయ రహదారిపై ఔరైయా–కాన్పూర్ దెహాట్ ప్రాంతంలో ధాబా వద్ద ఆగింది. అదే సమయంలో గోధుమ పిండి లోడుతో వెళ్తున్న ట్రయిలర్ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ట్రయిలర్లో రాజస్తాన్ నుంచి సొంతూళ్లకు వెళ్తున్న ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు చెందిన 43 మంది వలస కూలీలున్నారు. ఈ ఘటనలో 25 మంది మృతి చెందగా మరో 40 మంది గాయపడ్డారని కాన్పూర్ ఐజీ మోహిత్ అగర్వాల్ తెలిపారు. ప్రమాద తీవ్రతకు రెండు ట్రక్కులు నుజ్జయి రోడ్డు పక్కనే ఉన్న గుంతలో పడిపోయాయి. పరిస్థితి విషమంగా ఉన్న 15 మందిని ఇటావా జిల్లా సైఫైలో ఏర్పాటు చేసిన కోవిడ్ ఆస్పత్రికి మిగతా వారిని ఔరైయా ఆస్పత్రికి తరలించారు. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటిం చారు. సొంతూళ్లకు వెళ్లే కార్మికుల కోసం రాష్ట్ర సరిహద్దుల్లో 200 బస్సులను సిద్ధంగా ఉంచామనీ, అయినా కూలీలు ట్రక్కులు, లారీల్లో ప్రయాణిస్తున్నా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు ఎస్‌హెచ్‌వోలను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ ప్రమాదంపై రాష్ట్రపతి కోవింద్ విచారం వ్యక్తం చేశారు. ఘటనపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ‘ఔరైయా ఘటన విచారకరం. వలస కార్మికుల సహాయక చర్యలను ప్రభుత్వం మరింత వేగవంతం చేస్తుంది’అని ప్రధాని మోదీ ట్విట్టర్లో పేర్కొన్నారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మధ్యప్రదేశ్‌లో... మధ్యప్రదేశ్‌లో జరిగిన మూడు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 8 మంది వలస కార్మికులు మృతి చెందగా 29 మంది గాయాలపాలయ్యారు. మహారాష్ట్ర నుంచి యూపీకి వలస కార్మికులతో వెళ్తున్న ఓ ట్రక్కు సాగర్ జిల్లాలో పల్టీ కొట్టడంతో అందులోని నలుగురు మహిళలు సహా ఆరుగురు చనిపోగా 18 మంది గాయపడ్డారు. అదేవిధంగా, గుణ జిల్లాలోని బదోరా వద్ద ట్రక్కు బోల్తా పడి అందులోని ఒక వ్యక్తి చనిపోగా 11 మంది కూలీలు గాయపడ్డారు. మరో ఘటన..ముంబై నుంచి వలస కూలీలతో యూపీ వైపు వెళ్తున్న ట్రక్కు భర్వానీ జిల్లా గౌఘాటి వద్ద మరో ట్రక్కును ఢీకొట్టగా ఒకరు చనిపోయారు. -
రైలు పట్టాలపై నిద్రిస్తే ఎలా ఆపగలం?
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా స్వస్థలాలకు తరలివెళుతోన్న వలస కార్మికులను నిలువరించడం, పర్యవేక్షించడం కోర్టులకు సాధ్యం కాదని, ఆపని చేయాల్సింది ప్రభుత్వాలేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వలస కార్మికులకు తగిన రవాణా సౌకర్యాలు కల్పించేంత వరకు ఆహారం, వసతి సౌకర్యాలు కల్పించేలా కేంద్రం చర్యలు చేపట్టేలా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీచేయాలని దాఖలైన పిటిషన్‌ని కోర్టు తిరస్కరించింది. దేశవ్యాప్తంగా వలస కార్మికుల కదలికలను ఆపలేమనీ, ఈ విషయంలో రాష్ట్రప్రభుత్వాలే తగిన చర్యలు చేపట్టాలని కోర్టు అభిప్రాయపడింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు, వలస కార్మికులు పట్టాలపైనే నిద్రిస్తోంటే ఎలా ఆపగలమని ప్రశ్నించింది. జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం రహదారులపై నడచివెళుతోన్న వలస కార్మికులను ఆపడానికి ఏమైనా మార్గం ఉందా అని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాని ప్రశ్నించింది. వలస కార్మికులకు ప్రయాణ ఏర్పాట్లు చేస్తున్నారనీ, అంత వరకు వేచి ఉండకుండా కార్మికులు వెళుతున్నారని తుషార్ మెహతా కోర్టుకి తెలిపారు. వారిని కాలినడకన వెళ్ళొద్దని అధికారులు కోరగలరేగానీ, బలవంతంగా ఆపలేరన్నారు. -
కూలీలను చిదిమేసిన రైలు
ఔరంగాబాద్: మహారాష్ట్రలో విషాదం చోటు చేసుకుంది. లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి సొంతూళ్లకు పయనమయిన వలస కార్మికులను గూడ్స్ రైలు చిదిమేసింది. కాలినడకన రైలు పట్టాల వెంబడి నడిచి వెళ్తూ అలసిపోయి పట్టాలపై పడుకున్నవారిపై నుంచి శుక్రవారం తెల్లవారు జామున ఒక గూడ్స్ రైలు దూసుకెళ్లింది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లా కర్మాడ్ వద్ద ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 16 మంది వలస కూలీలు ప్రాణాలు కోల్పోయారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. పట్టాలకు కొద్ది దూరంలో పడుకున్న ముగ్గురు ప్రాణాలు దక్కించుకున్నారు. మహారాష్ట్రలోని జల్నాలో ఉన్న ఒక స్టీలు ఫ్యాక్టరీలో పని చేసే మధ్యప్రదేశ్‌కు చెందిన కార్మికులు గురువారం రాత్రి కాలినడకన సుమారు 150 కిలో మీటర్ల దూరంలోని సొంతూళ్లకు ప్రయాణమయ్యారు. రైలు పట్టాల వెంబడి దాదాపు 40 కి.మీ.లు నడిచిన తరువాత ఔరంగాబాద్‌కు దగ్గరలో అలసిపోయి, ఆగిపోయారు. అక్కడే రైలు పట్టాలపై నిద్రించారు. ముగ్గురు మాత్రం పట్టాలకు కొద్ది దూరంలో పడుకున్నారు. తెల్లవారు జాము 5.15 గంటల ప్రాంతంలో ఒక గూడ్స్ రైలు వారిపై నుంచి దూసుకెళ్లింది. రైలు రావడాన్ని పట్టాలకు దూరంగా పడుకున్నవారు గుర్తించారు. పట్టాలపై పడుకున్నవారిని అప్రమత్తం చేసేందుకు గట్టిగా అరిచారు. కానీ, పట్టాలపై నిద్రిస్తున్నవారు ప్రమాదాన్ని గుర్తించేలోపే దుర్ఘటన జరిగిపోయింది. నాందేడ్ డివిజన్లోని బద్నాపూర్– కర్మాడ్ స్టేషన్ల మధ్య ఈ దుర్ఘటన జరిగింది. చెల్లాచెదురుగా పడి ఉన్న వలస కూలీల మృతదేహాలు, వారి వస్తువులతో ఘటనాస్థలి భీతావహంగా మారింది. ఆ దృశ్యాలున్న వీడియో ఒకటి వైరల్‌గా మారింది. దూరంగా పట్టాలపై మనుషులున్నట్లు గుర్తించిన రైలు లోకోపైలట్.. హారన్ మోగిస్తూ, రైలు ఆపేందుకు విఫలయత్నం చేశాడని స్థానిక మీడియా పేర్కొంది. లాక్డౌన్ కారణంగా రైళ్లు నడవవన్న ధీమాతోనే వారు పట్టాలపై పడుకున్నారని బాధితులను ఉటంకిస్తూ వివరించింది. పోలీసులు ఆపకుండా ఉండేందుకే.. ఈ ఘటనపై రైల్వే శాఖ సమగ్ర విచారణకు ఆదేశించింది. కార్మికులు మహారాష్ట్రలోని జల్నా నుంచి మధ్యప్రదేశ్‌లోని భుసావల్‌కు వెళ్తున్నారని ఎస్పీ మోక్షద పాటిల్ తెలిపారు. లాక్డౌన్ కారణంగా పోలీసులు తమను అడ్డుకోకుండా ఉండేందుకే వారు రోడ్డు మార్గాలను కాకుండా, పట్టాలను అనుసరించి ప్రయాణించాలని నిర్ణయించుకున్నట్లు తెలిసిందన్నారు. మృతుల కుటుంబాలకు మహారాష్ట్ర ప్రభుత్వం రూ. 10 లక్షల చొప్పున, మధ్యప్రదేశ్ ప్రభుత్వం రూ. 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించాయి. మానవ హక్కుల కమిషన్ నోటీసులు రైలు ప్రమాద ఘటనపై జాతీయ మానవహక్కుల కమిషన్ స్పందించింది. మీడియా కథనాలను సుమోటోగా తీసుకుని మహారాష్ట్ర ప్రధాన కార్యదర్శికి, ఔరంగాబాద్ జిల్లా కలెక్టర్‌కు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది. లాక్డౌన్ సమయంలో కార్మికులకు అందిస్తున్న ఆహార, వసతి, ఇతర సౌకర్యాల వివరాలను కూడా తెలపాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. ప్రముఖుల సంతాపం ఈ దుర్ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. కార్మికుల మృతి తనను కలచివేసిందని రాష్ట్రపతి ఆవేదన వ్యక్తం చేశారు. ‘రైలు ప్రమాదంలో కార్మికులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం. రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌తో మాట్లాడాను. ఆయన స్వయంగా పరిస్థితిని సమీక్షిస్తున్నారు’అని మోదీ ట్వీట్ చేశారు. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘కార్మికులను సొంత ప్రాంతాలకు పంపించేందుకు మరిన్ని రైళ్లు కావాలని కేంద్రాన్ని కోరాం. త్వరలో ఆ ఏర్పాట్లు చేస్తాం’అని ఠాక్రే అభ్యర్థించారు. విపక్షాల విమర్శలు జాతి నిర్మాతలైన కార్మికులతో కేంద్రం వ్యవహరిస్తున్న తీరుకు దేశమంతా సిగ్గుతో తలదించుకోవాలని రాహుల్ గాంధీ విమర్శించారు. ఇవి ప్రభుత్వం చేసిన హత్యలని స్థానిక ఎంఐఎం ఎంపీ ఇమ్తియాజ్ జలీల్ విమర్శించారు. ఇందుకు కారణమైన ప్రధానమంత్రి కార్యాలయం, రైల్వే శాఖ, మహారాష్ట్ర ప్రభుత్వాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. -
ఆ కూలీల మృతికి మీ వైఖరే కారణం: హైకోర్టు
* పరిహారం చెల్లించి చేతులు దులుపుకొంటారా? * పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయండి * పురపాలక శాఖ, జీహెచ్ఎంసీ, సీవరేజీ బోర్డులకు హైకోర్టు ఆదేశం * తదుపరి విచారణ జూన్ 1కి వాయిదా సాక్షి, హైదరాబాద్: ఇద్దరు వలస కూలీల మృతి ఘటనపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం చెల్లించారంటే తప్పును ఒప్పుకొన్నట్లేనని, మళ్లీ ఇటువంటి ఘటనలే జరిగితే అప్పుడు కూడా ఇలా పరిహారం ఇచ్చి చేతులు దులుపుకొంటారా.. అంటూ ప్రశ్నించింది. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో వివరించాలని పురపాలకశాఖ, జీహెచ్ఎంసీ, సీవరేజీ బోర్డులను ఆదేశించింది. ఆయా శాఖలు చేయాల్సిన పనులను ప్రైవేటు వ్యక్తులు చేస్తుంటే మీరేం చేస్తున్నారంటూ నిలదీసింది. డ్రైనేజీలను శుభ్రపరిచే విషయంలో అనుసరిస్తున్న విధానం ఏమిటో కూడా స్పష్టంగా వివరించాలని హైకోర్టు తేల్చి చెప్పింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ తదుపరి విచారణను జూన్ 1కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్, జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్, సుల్తాన్‌బజార్ కాపాడియా లేన్‌లో డ్రైనేజీని శుభ్రపరిచేందుకు మ్యాన్‌హోల్‌లో దిగిన వలస కార్మికులు వీరాస్వామి, సాకలి కోటయ్య ఈ నెల ఒకటిన విషవాయువుల వల్ల మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై పత్రికల్లో వచ్చిన కథనాలను సుమోటోగా పరిగణించి విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం మరోసారి విచారణ చేపట్టింది.