ఆ కూలీల మృతికి మీ వైఖరే కారణం: హైకోర్టు Migrant workers killed | Sakshi
Sakshi News home page

ఆ కూలీల మృతికి మీ వైఖరే కారణం: హైకోర్టు

Published Fri, May 13 2016 1:14 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM

ఆ కూలీల మృతికి మీ వైఖరే కారణం: హైకోర్టు - Sakshi

* పరిహారం చెల్లించి చేతులు దులుపుకొంటారా?
* పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయండి
* పురపాలక శాఖ, జీహెచ్‌ఎంసీ, సీవరేజీ బోర్డులకు హైకోర్టు ఆదేశం
* తదుపరి విచారణ జూన్ 1కి వాయిదా

సాక్షి, హైదరాబాద్: ఇద్దరు వలస కూలీల మృతి ఘటనపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం చెల్లించారంటే తప్పును ఒప్పుకొన్నట్లేనని, మళ్లీ ఇటువంటి ఘటనలే జరిగితే అప్పుడు కూడా ఇలా పరిహారం ఇచ్చి చేతులు దులుపుకొంటారా.. అంటూ ప్రశ్నించింది.

భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో వివరించాలని పురపాలకశాఖ, జీహెచ్‌ఎంసీ, సీవరేజీ బోర్డులను ఆదేశించింది. ఆయా శాఖలు చేయాల్సిన పనులను ప్రైవేటు వ్యక్తులు చేస్తుంటే మీరేం చేస్తున్నారంటూ నిలదీసింది. డ్రైనేజీలను శుభ్రపరిచే విషయంలో అనుసరిస్తున్న విధానం ఏమిటో కూడా స్పష్టంగా వివరించాలని హైకోర్టు తేల్చి చెప్పింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ తదుపరి విచారణను జూన్ 1కి వాయిదా వేసింది.

ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్, జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్, సుల్తాన్‌బజార్ కాపాడియా లేన్‌లో డ్రైనేజీని శుభ్రపరిచేందుకు మ్యాన్‌హోల్‌లో దిగిన వలస కార్మికులు వీరాస్వామి, సాకలి కోటయ్య ఈ నెల ఒకటిన విషవాయువుల వల్ల మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై పత్రికల్లో వచ్చిన కథనాలను సుమోటోగా పరిగణించి విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం మరోసారి విచారణ చేపట్టింది.

Advertisement
 
Advertisement
 
Advertisement