మంచిమాట
ప్రతిమనిషి, సరిగా చెప్పాలంటే ప్రతి జీవి ప్రపంచం అంతా తన వంటిదనే అనుకుంటుంది. తన దృష్టికోణం లోనే చూస్తుంది. అందుకే అబద్ధాలాడేవారికి అందరూ అబద్ధాలు చెపుతారనే అభిప్రాయమే ఉంటుంది. ఎవరి మాటనీ ఒక పట్టాన నమ్మరు. తాను అబద్ధం చెప్పనప్పుడు ఎదుటివారు అబద్ధం చెపుతున్నారేమో అనే అనుమానం ఎందుకు వస్తుంది? పైగా తను చెప్పేది నిజం అని నమ్మమని ఒకటికి పదిసార్లు నొక్కి వక్కాణిస్తూ ఉంటారు. అవతలి వారు నమ్మరేమోననే సందేహం ఎందుకు వస్తుంది? తాను చెప్పే మాట మీద తనకే నమ్మకం లేదు కనుక.
ఇతరులని మోసం చేసే గుణం ఉన్నవారు ఇతరులు తమని మోసం చేస్తారేమో నని భయపడుతూనే ఉంటారు. మోసం చేసే బుద్ధి తనకి లేక పోతే ఎదుటివారు తనని మోసం చేస్తారేమో ననే అనుమానం కూడా రాదు. పరాయి ఆడపిల్లలని చెడుదృష్టితో చూసేవారు తమ ఇంటి ఆడవారిని బయటకు పంపటానికి ఇష్టపడరు. దీనికి పెద్ద ఉదాహరణ రావణుడే. కనపడిన ప్రతి స్త్రీని కామదృష్టితో చూసి, చేజిక్కించుకోవా లనుకునే గుణం ఉన్నవాడు కనుకనే తన భార్యలని కట్టడిలో ఉంచాడు. మేలిముసుగు లేకుండా వారిని బయటికి రానిచ్చేవాడు కాదు.
ఆ విషయాన్ని రావణ వధానంతరం యుద్ధభూమిలో పడి ఉన్న రావణుణ్ణి చూసి మండోదరి ‘‘మేలిముసుగు లేకుండా నీ భార్యల మైన మేము ఇక్కడికి వస్తే ఏమి అనటం లేదేమి?’’ అని ప్రశ్నించటంలో తెలుస్తుంది. అదే రావణుడు తన చెల్లెలు శూర్పణఖ విషయంలో అవేవీ పాటించ నక్కర లేదని చెప్పి స్వేచ్ఛగా వదిలేశాడు. రాక్షసవంశంలోనే పుట్టిన ప్రహ్లాదుణ్ణి ‘‘కన్నుదోయి కన్యకాంత లడ్డం బైన మాతృభావము చేసి మరలువాడు’’ అని పోతనామాత్యుల వారు వర్ణించారు. స్త్రీల పట్ల సద్భావం కలవాడు కనుక తన తల్లిని, ఇతర స్త్రీలని కూడా గౌరవభావంతో చూడటం తటస్థించింది.
జంతువులన్నీ ఇతర జంతువులు, ముఖ్యంగా మనుషుల మీద దాడి చేయటానికి కారణం వాటికి ఉన్న అభద్రతా భావం. అవి ఎదుటి జంతువులని తినటమో, బాధించటమో చేస్తాయి కనుక ఎదుటి జంతువులు కూడా తమని బాధిస్తాయేమోనని ఎదురు దాడి చేస్తాయి. నాగుపాముని చూస్తే ఈ విషయం బాగా అర్థ మౌతుంది. మంచి జాతి సర్పం ఎదురు పడగానే మనిషి భయపడితే అది కూడా భయ పడుతుంది.
దాని వంక ప్రేమగా, లేక భక్తితో చూస్తే అది కూడా అదే భావంతో చూసి తొలగిపోతుంది. అందుకే త్రాచుపాము కనపడగానే చేతులు జోడించి నమస్కారం చేసి కదలకుండా ఉండమని చెపుతారు. తేలుకి ఎదుటి ్ప్రాణి తనని బాధిస్తుందనే సందేహం ఉంటుంది కనుక ఏది అడ్డు తగిలితే దానిని కుట్టుకుంటూ పోతుంది. ఇటువంటి లక్షణాలే మనుషులలో కూడా కనిపిస్తాయి. అకారణంగా ఇతరులని బాధించేవారు, భయం వల్లనే బాధిస్తారు. పచ్చకామెర్ల రోగికి లోకం అంతా పచ్చగా కనిపిస్తుంది కదా!
అదేవిధంగా ‘‘ఆత్మవత్ సర్వభూతాని’’ అని భావించి ఎదుటివారి కష్టం తనది భావించి తదనుగుణంగా స్పందించేవారు, ఎవరికి మేలు కలిగినా తమకే కలిగి నంతగా సంతోషించేవారు ఉన్నారు. ఎవరికి ఆపద కలిగినా వీరి కళ్ళలో నీళ్ళు వస్తాయి. ఎవరికి మంచి జరిగినా వీరు పండగ చేసుకుంటారు. అంటే, ఈ కోవకి చెందిన వారు జంతు ప్రవృత్తి నుండి కొంత ఎదిగినట్టు చెప్పవచ్చు.
ఈ విధంగా ఉండి అందరు తన లాగానే ఉంటారు అనుకోవటం వల్ల లౌకికంగా నష్టపోయిన వారూ ఉన్నారు. కాని, మానవతా దృక్పథంలో వారు ఉన్నత స్థానానికి చేరుకున్నారని అర్థం. ప్రతిస్పందన కన్న సహ అనుభూతి ఉత్తమ స్థాయి.
– ఎన్. అనంతలక్ష్మి
Comments
Please login to add a commentAdd a comment