
పాపాలు చేస్తే శాపాలు తప్పవు.. రావణ వృత్తాంతం చెప్పేదిదే..
ప్రవచన విరించి సామవేదం షణ్ముఖశర్మ
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవ రం రూరల్): ‘ఇతరులను హేళన చేస్తే పరాభవం తప్పదు. అధర్మవర్తనంతో తపోబలం క్షీణిస్తుంది. పాపాలు చేస్తే శాపాలు తప్పవు’ అని ప్రవచన విరించి సామవేదం షణ్ముఖశర్మ అన్నా రు. ఋషిపీఠం సత్సంగం ఆధ్వర్యాన స్థానిక టి.నగర్‌లోని హిందూ సమాజంలో ఉత్తరకాండపై మూడో రోజు ప్రవచనాన్ని ఆయన కొనసాగించారు. ‘నీది వానరముఖం అని నందీశ్వరుడిని హేళన చేసిన రావణునికి వానరుల చేతిలో పరాభవం తప్పదన్న శాపం ఎదురైంది. వేదవతిని పరాభవించినప్పుడు ఆమె మరుసటి జన్మలో అయోనిజగా జన్మించి, సపరివారంగా రావణుడు నశించడానికి కారకురాలినవుతానని శపించింది. ఇక‌్ష్వాకువంశానికి చెందిన రాజు అనరణ్యుడు.. రావణుని చేతిలో పరాజితుడై, మా వంశంలో జన్మించే శ్రీరాముని చేతిలో నీవు మరణిస్తావని శపించాడు. రావణుని చేతిలో బందీలుగా చిక్కిన ఎందరో దేవకాంతలు, ఋషి కన్యలు, మానవకాంతల కన్నీరే రావణుని పాలిట పెనుశాపంగా మారింది’ అని సామ వేదం అన్నారు. ధర్మాచరణతో అల్పాయుష్కుడు కూడా దీర్ఘాయువు పొందగలడని, దీనికి విలోమంగా దీర్ఘాయువు వరంగా గలవాడు కూడా పాపకృత్యాలతో అల్పాయుష్కుడు కాగలడని చెప్పారు.
‘కైలాసగిరిని పెకలించబోయి భంగపాటుకు గురైన రావణుడు పెద్దగా రోదించినప్పుడు, దయాళువు అయిన పరమ శివుడు అతనికి విడుదల ప్రసాదించి, ఇక నుంచి నీవు రావణుడిగా పేరు పొందుతావని అన్నాడు. అప్పటి నుంచీ రావణ శబ్దం వ్యాప్తిలోకి వచ్చింది. రామ అనే శబ్దానికి అందరికీ ఆనందాన్ని కలిగించేదని అర్థమైతే, రావణ శబ్దానికి అందరినీ ఏడిపించడం అనే అర్థం ఉంది’ అని వివరించారు. వేదవతి తామర పూవులో శిశువుగా ఉద్భవించడం, రావణుడు ఆ శిశువును సముద్రంలో పడవేయడం ప్రాచీన రామాయణ ప్రతుల్లో లేదని, ఇది ప్రక్షిప్తమని చెప్పారు. కృతయుగాంతంలో వేదవతిని పరాభవించిన రావణుడు త్రేతాయుగంలో శ్రీరాముని చేతిలో మరణించాడంటే.. ఆయన ఎప్పటివాడో మనం ఊహించుకోవచ్చునని సామవేదం అన్నారు. తొలుత భాగవత విరించి డాక్టర్ టీవీ నారాయణరావు స్వాగత వచనాలు పలికారు.