
సాటి మనిషిని ప్రేమించే తత్వాన్ని రామాయణం నేర్పుతుంది
రామాయణ నృత్యరూపక కార్యక్రమంలో జస్టిస్ బి.ఎన్.కృష్ణ
సీతారాముల కల్యాణం సందర్భంగా రామాయణం నృత్యరూప ప్రదర్శన మంత్రముగ్ధులైన ప్రేక్షకులు
భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తాం: మాదిరెడ్డి కొండారెడ్డి
‘భారతీయ సంస్కృతి ఎంతో గొప్పది. రామాయణాది పౌరాణికాలు మానవజాతికి దిక్సూచి లాంటివి. మనిషి సాటి మనిషిని ప్రేమించే తత్వాన్ని అలవర్చుకోవాలని రామాయణం మనకు నేర్పుతుంది. ఇందులో ప్రతి పాత్ర ఆదర్శవంతమే’ అని జస్టిస్ బి.ఎన్.కృష్ణ ఉద్ఘాటించారు. శ్రీరామ నవమిని పురస్కరించుకొని ఆంధ్ర మహాసభ, వేంకటేశ్వర పూజా మందిరం ట్రస్ట్ సంయుక్తంగా, శనివారం సాయంత్రం దాదర్ హిందూ కాలనీలోని ఆచార్య బి.ఎన్.వైద్య సభాగహంలో నిర్వహించిన రామాయణం నృత్యరూపక కార్యక్రమానికి ఆయన విశిష్ట అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘తెలుగులో ప్రదర్శించిన ఈ నృత్యరూపకం కనులపండువగా సాగింది. దర్శకత్వంతో పాటు కళాకారుల అభినయం అద్భుతంగా ఉంది’ అని కొనియాడారు. తొలుత ఆంధ్ర మహాసభ ప్రధాన కార్యదర్శి యాపురం వెంకటేశ్వర్ సభకు స్వాగతం పలికారు. ముందుగా పరిచయాత్మకంగా జరిగిన వేదిక కార్యక్రమంలో స్థానిక లోక్‌సభ సభ్యులు అనిల్ దేశాయ్, ఎమ్మెల్సీ సునీల్ శిందే పాల్గొన్నారు. అనిల్ దేశాయ్ మాట్లాడుతూ ఆంధ్ర మహాసభ గత తొమ్మిది దశాబ్దాలుగా సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో అసామాన్యమైన సేవలందిస్తోందని, తెలుగువారికి, మరాఠీయులకు పురాతన కాలం నుంచి అవినాభావ సంబంధాలున్నాయని, ఆంధ్ర మహాసభ అభివృద్ధి పనుల కోసం ఎంపీ ల్యాడ్స్ నుంచి తప్పకుండా సహాయం అందిస్తానని సభాముఖంగా ప్రకటించారు. ధర్మకర్తల మండలి చైర్మన్ మంతెన రమేశ్, అధ్యక్షుడు మాదిరెడ్డి కొండారెడ్డి, ప్రధాన కార్యదర్శి యాపురం వెంకటేశ్వర్ తదితరులు అనిల్ దేశాయ్‌ని, సునీల్ శిందేని ఘనంగా సన్మానించారు.
కనువిందు చేసిన నృత్యరూపకం
తర్వాత జగన్నాథాచార్యులు రచించగా, సూర్యారావు సంగీత దర్శకత్వంలో, సూర్యనారాయణ గాత్ర సహకారంతో, భాగవతుల వెంకట రామశర్మ దర్శకత్వంలో ప్రదర్శించిన రామాయణం నృత్యరూపకం సభికుల్ని అక్షరాలా మంత్ర ముగ్ధుల్ని చేసింది. సంగీతం, గానానికి అనుగుణంగా నటీ నటుల అభినయం వీక్షించిన రసికుల్ని అబ్బురపరిచింది. రామాయణంలోని సీతా స్వయంవరం, పరుశరామ గర్వభంగం, మందర కైకేయి సంవాదం, శూర్పణక నాసికా ఖండనం, సీతాపహరణ దశ్యం, వాలి వధ, రామ రావణ యుద్ధం, చివరికి శ్రీరామ పట్టాభిõÙకం తదితర ప్రధాన ఘట్టాల్ని కళ్ళకు కట్టినట్టుగా ప్రదర్శించారు. ఆయా ఘట్టాల్లో సభికులు కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. ఆయా సందర్భాల్లో ఎంతో భావోద్వేగాలకు గురయ్యారు. దశాబ్దాల తర్వాత ఇంతటి అద్భుతమైన నృత్యరూపకాన్ని చూశామని ప్రేక్షకులు కొనియాడారు. విజయవాడకు చెందిన శ్రీనత్య అకాడమీ వారు ప్రదర్శించిన ఈ నృత్యరూపకంలో రాముడిగా, బి.ఎన్.ఎన్.సౌమ్య, సీతగా అలకనందాదేవి, రావణుడిగా సీహెచ్ రామకృష్ణ అనితరసాధ్యంగా నటించారు. తతిమ్మ నటీనటులు కూడా తమతమ పాత్రల్లో జీవించారు.

ప్రముఖ రచయిత్రి తురగా జయశ్యామల, రవీంద్ర దంపతులు రూపకం తీరుకు ఆనందించి అప్పటికప్పుడే ఆర్థిక సహాయం అందించారు. రూపకం ప్రదర్శనానంతరం అధ్యక్షుడు మాదిరెడ్డి కొండారెడ్డి మాట్లాడుతూ, చక్కటి కార్యక్రమాలకు ప్రేక్షకాదరణ ఉంటుందని రుజువైందని, భవిష్యత్తులో కూడా వివిధ ప్రక్రియలకు సంబంధించిన నాణ్యమైన కార్యక్రమాల నిర్వహణకు ఆంధ్ర మహాసభ కట్టుబడి ఉందని ప్రకటించారు. తెలుగేతర నేలపై తెలుగు భాషా సంస్కృతుల్ని పరిరక్షించడమే కాకుండా, వాటి వికాసానికి కూడా మహాసభ తప్పకుండా ప్రయతి్నస్తుందన్నారు. ఈ కార్యక్రమానికి ముంబైలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా జనం తరలివచ్చారు. కాగా, ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి చైర్మన్ మంతెన రమేశ్, కార్యదర్శి కస్తూరి హరిప్రసాద్, ధర్మకర్తలు బోగ సహదేవ్, ద్యావరిశెట్టి గంగాధర్, సంగం ఏక్‌నాథ్, అధ్యక్షుడు మాదిరెడ్డి కొండారెడ్డి, ప్రధాన కార్యదర్శి యాపురం వెంకటేశ్వర్, పరిపాలన విభాగ ఉపాధ్యక్షుడు తాల్ల నరేశ్, సాహిత్య విభాగ ఉపాధ్యక్షుడు బొమ్మకంటి కైలాశ్, సాంస్కృతిక శాఖ ఉపాధ్యక్షుడు గాజెంగి వేంకటేశ్వర్, సంయుక్త కార్యదర్శి అల్లె శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు కొక్కుల రమేశ్, చిలుక వినాయక్, కూచన్ బాలకృష్ణ, శేర్ల ప్రహ్లాద్, మహిళా శాఖ అధ్యక్షురాలు మంచికంటి మేఘమాల, కార్యదర్శి పిల్లమారపు పద్మ, ఉపాధ్యక్షురాలు వి.శ్యామల రామ్‌మోహన్, సభ్యులు బోగ జ్యోతిలక్షి్మ, వీరబత్తిని రాజశ్రీ, తాళ్ల వనజ, పూజా మందిరం ట్రస్ట్ చైర్మన్ జి.హరికిషన్, కార్యదర్శి నూకల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. సాంస్కృతిక శాఖ ఉపాధ్యక్షుడు గాజెంగి వేంకటేశ్వర్ సభకు వందన సమర్పణ చేశారు.