
కల్యాణ తంతును తిలకించడానికి పోటెత్తిన భక్తజనం
హాజరైన మాజీ కేంద్రమంత్రి కపిల్ పాటిల్, ప్రముఖ రాజకీయ నాయకులు
సాయంత్రం పల్లకి ఊరేగింపు.. 108 గంగా జలాలతో కూడిన
కలశాలతో పాల్గొన్న మహిళలు
సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. కల్యాణ తంతును తిలకించడానికి పట్టణంలోని నలుమూలల నుంచి తెలుగు భక్తులు, ఉత్తరాది ప్రజలతో పాటు రాజకీయ నాయకులు వందల సంఖ్యలో విచ్చేసి దర్శన భాగ్యాన్ని పొందారు. పట్టణంలోని ప్రసిద్ధిగాంచిన పద్మనగర్ ప్రాంతంలో గల శ్రీరామ మందిరంలో సీతారామ కల్యాణ మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. శ్రీరామ మందిర్ ట్రస్ట్ నేతృత్వంలో 36వ వార్షికోత్సవ వేడుకలు గత వారం రోజులుగా నిర్వహిస్తున్నారు. ఆదివారం ఉదయం 11.45 గంటలకు సీతారాములకు కల్యాణం వేద పండితులు గాజుల చంద్రశేఖర్, ద్యావణపెల్లి ఆనందం, వడిగొప్పుల శంకర్, గెంట్యాల గంగాధర్, శ్యావు మహారాజ్ పంతులు భద్రాచలంలో జరిపించే విధంగా మందిరం ప్రాంగణంలో ప్రత్యేక అలంకరణలతో మంగళవాయిద్యాల మధ్య కల్యాణ తంతు ఘనంగా నిర్వహించారు. మాజీ కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయక మంత్రి కపిల్ పాటిల్, బీజేపీ పట్టణ అధ్యక్షుడు హర్శల్ పాటిల్, మాజీ స్థానిక కార్పొరేటర్లు సంతోష్ శెట్టి, సుమిత్ పాటిల్, స్థానిక మీనా బాలకిషన్ కల్యాడపు, పద్మ భూమేశ్ కల్యాడపు, అఖిల పద్మశాలీ సమాజ్ అధ్యక్షుడు పొట్టబత్తిని రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి కల్యాడపు బాలకిషన్, కోశాధికారి యెల్లే సాగర్, కార్యాధ్యక్షుడు గాజెంగి రాజు, మాజీ అధ్యక్షుడు యేముల నర్సయ్య, కొంక మల్లేశం, సుంక శశిధర్, నిష్కం భైరి, భీమనాథిని శివప్రసాద్, బాలె శ్రీనివాస్, ట్రస్టీలు ఎస్.మల్లేశం, పాశికంటి లచ్చయ్య, పద్మశాలీ సమాజ్ యువక్ మండలి అధ్యక్షుడు వాసం రాజేందర్, మందిర కార్యవర్గ సభ్యులతో పాటు పలు స్వచ్ఛంద సంస్థల పదాధికారులు, పట్టణ వ్యాప్తంగా కామత్‌ఘర్, బాలాజీనగర్, బండారి కంపౌండ్, కన్నేరి, పాంజలాపూర్, నయీబస్తీ నుంచి తెలుగు భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సీతారాముల కల్యాణతంతు అనంతరం భక్తులు అమ్మవారికి ఒడిబియ్యం, కానుకలు సమర్పించుకున్నారు. అనంతరం చేపట్టిన అన్నదానం కార్యక్రమంలో సుమారు 12 వేల మంది భక్తులు హాజరయ్యారని శ్రీరామ మందిర ధర్మదాయ విశ్వస్త సంస్థ ట్రస్టీ డాక్టర్ అంకం నర్సయ్య తెలిపారు.
పల్లకి ఊరేగింపు..
సాయంత్రం 6 గంటలకు స్వామి వారి పల్లకి ఊరేగింపు నిర్వహించారు. ఈ ఊరేగింపులో 108 గంగా జలాలతో కూడిన కలశాలను మహిళలు తలపై పెట్టుకొని రామ నామం జపిస్తూ పద్మనగర్ పుర వీధులు రామ మందిరం నుంచి కన్నేరి, పీటీ హైసూ్కల్, పాయల్ టాకీజ్, ధామన్‌కర్ నాక, బాజీ మార్కెట్, బాలాజీ మందిరం, దత్తా మందిరం నుంచి తిరిగి రామ మందిరాన్ని రాత్రి 10 గంటల వరకు జరిగింది. ఊరేగింపులోని ప్రతి పురవీధిలో డీజే సౌండ్ సిస్టమ్‌ల మధ్య నృత్యాలు చేస్తూ స్వామివారి పల్లకికి స్వాగతం పలికారు. అలాగే చిన్నారుల నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. భజన మండలి వారి శ్రీరామనామ కీర్తలను ఆలకించారు. స్వామివారిని దారి మధ్యలో భక్తులు మంగళ హారతులు పట్టి, టెంకాయలను కానుకలు సమర్పించు కున్నారు. రాత్రి ఊరేగింపులో పాల్గొన్న సుమారు వేయి మందికి నిర్వాహకులు అన్నదానం నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ మైన సంఘటనలు చోటు చేసుకోకుండా పట్టణ పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు.
హనుమాన్ సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో..
ప్రతి సంవత్సరం మాదిరిగానే హనుమాన్ మాలధారణ ధరించిన భక్తులు 56 అడుగుల భక్తాంజనేయ స్వామి మందిరంలో సీతారాముల కల్యాణం గురుస్వామి కోడూరి మల్లేశం, అధ్యక్షుడు గుండేటి నాగేశ్ నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు. 41 రోజుల పాటు మాలధారణ ధరించిన దీక్షాస్వాములు వారం రోజులుగా హోమాలు, అభిõÙకాలు నిర్వహించారు. ఆదివారం ఉదయం సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వాములకు ప్రత్యేక అలంకరణలతో పాటు అభిషేకాలు, హోమాలు నిర్వహించారు. చైత్రశుద్ధ నవమి, అభిజిత్ లగ్న ముహూర్తమున సీతారాముల తలలపై జీలకర్ర, బెల్లం ఉంచి, తంతు నిర్వహించారు. అనంతరం స్వామి వారికి భక్తులు కానుకలు, ఒడిబియ్యం సమర్పించుకున్నారు. అనంతరం జరిగిన అన్నదానంలో సుమారు 2 వేల మంది పాల్గొన్నారని వడ్లకొండ రాము తెలిపారు.