అదిగో భద్రాద్రి ...గౌతమి ఇదిగో చూడండి! | Behold, I see the bhadradri ... denied! | Sakshi
Sakshi News home page

అదిగో భద్రాద్రి ...గౌతమి ఇదిగో చూడండి!

Published Thu, Apr 3 2014 11:06 PM | Last Updated on Tue, Nov 6 2018 5:52 PM

Behold, I see the bhadradri ... denied!

రాములవారి కోవెల లేని ఊరు లేదు. రామ నామం పలకని వాడ లేదు. ధర్మమూర్తిగా శ్రీరాముడికి, సహనశీలిగా సీతమ్మకు ఆసేతుహిమాచలం బ్రహ్మరథం పడుతూనే ఉంది. త్రేతాయుగాన జరిగిన వారి కల్యాణం లోక కల్యాణంగా ఇప్పటికీ ప్రతి ఏటా చైత్రశుద్ధ నవమినాడు దక్షిణ సాకేతపురిగా ప్రసిద్ధిగాంచిన భద్రాచలంలో కన్నులపండువగా జరుగుతుంది. సుందర దృశ్యధామమైన ఆ భద్రాద్రి రాముని క్షేత్రాన్ని, పరమపవిత్రమైన గోదావరి నదీ తీరాన్ని, ఆ ధర్మమూర్తి నడయాడిన పరిసర ప్రాంతాలను శ్రీరామనవమినాడు దర్శించుకోవాలని ఉవ్విళ్లూరని భక్తులు, పర్యాటకులు ఉండరు. వారి కోసం ఈ సమాచారం.
 
రాష్ట్రంలో జిల్లా కేంద్రమైన ఖమ్మం నుంచి 105 కి.మీ.ల దూరంలో ఉన్న భద్రాచలం భక్తరామదాసు నిర్మించిన రామాలయంగా ప్రసిద్ధి. పరమపవిత్రమైన గోదావరి నది దక్షిణ తీరాన శ్రీరామచంద్రుడు సీతా, లక్ష్మణ, హన్‌మత్ సమేతుడై ధనుర్బాణ శంఖుచక్రాలను ధరించి స్వయంభువుగా భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఈ ప్రాంతంలోనే శ్రీరామచంద్రుడు సీతాసమేతుడై వనవాసం చేశాడని ప్రతీతి. పూర్వం భద్రుడు అనే భక్తుడు తపస్సు చేసి, తను ఒక కొండగా మారి తనపై శ్రీరాముడు వెలసే విధంగా వరం పొందాడని బ్రహ్మాండ పురాణం, గౌతమీ మాహాత్మ్యం చెబుతున్నాయి. ఆ కొండ భద్రుడి పేరు మీద భద్రగిరి అనీ, తరువాత కాలంలో భద్రాచలం అనీ ప్రసిద్ధి కెక్కింది. తహసీల్దారుగా ఉంటూ భద్రాద్రి ఆలయాన్ని నిర్మింపజేసినవాడు భక్తరామదాసు. ఈయన అసలు పేరు కంచర్ల గోపన్న.
 
కనులు రెండు సరిపోవు...
 
శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో శ్రీరాముడు కొలువున్న తీరును చూడటానికి రెండు కళ్లూ సరిపోవు అంటారు భక్తజనం. ఆ వైకుంఠరాముని దర్శనం అనంతరం ఆయన నడయాడిన ప్రదేశాలను తిలకించడానికి, నాటి ధర్మమూర్తి అడుగుజాడలను గుర్తుచేసుకుంటూ తమ ప్రయాణాన్ని కొనసాగిస్తారు.
 
పర్ణశాల.. వర్ణరంజితం
 
భద్రాచలానికి సుమారు 35 కి.మీ.ల దూరంలో ఉంది పర్ణశాల. దండకారణ్యంలో ఒక భాగమైన ఈ ప్రాంతంలో వనవాస సమయంలో శ్రీరాముడు పర్ణశాల ఏర్పాటుచేసుకొని ఇక్కడే ఉన్నాడట. అప్పుడు జరిగిన సన్నివేశాలు ఇప్పుడు శిలా రూపంలో దర్శనమిస్తున్నాయి. ఆ పక్కనే వేణుగోపాలస్వామి ఆలయం ఉంది.
 
సీతమ్మవాగు... కళ్లకు కట్టే నాటి గుర్తులు
 
వేణుగోపాలస్వామి ఆలయం పక్కనే ఉన్న వాగు గోదావరి నదిలో కలుస్తోంది. ఈ వాగుకున్న ప్రత్యేకతను చెవులారా విని, కనులారా వీక్షించి ధన్యులవుతుంటారు జనులు. సీతమ్మవారు వాగులో స్నానం చేసి తన నారచీరలను ఈ వాగు గట్టుమీదే ఆరేసుకునేదట. అందుకే ఈ వాగును సీతమ్మవాగు అంటారు. విశేషమేమిటంటే ఇప్పటికీ సీతమ్మవారు ఆరేసిన ప్రాంతంలో చీర గుర్తులు 20 అడుగుల మేర కనిపిస్తాయి. ఇంకా అమ్మవారు పసుపు, కుంకుమకు ఉపయోగించిన రాళ్లను కూడా చూడొచ్చు. ఇక్కడే వామనగుంటలుగా పిలిచే మరో ప్రదేశం ఉంది.

ప్రతిరోజూ సీతారాములు కాలక్షేపానికి ఇక్కడ వామనగుంటలు ఆడుకున్నారని చెబుతారు. అలాగే భోజనం చేయడానికి వీలుగా ఉన్న నాటి రాతి పళ్లెం కూడా ఒకటి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడే నలభై అడుగుల పొడవున ఓ నల్ల రాయి ఉంటుంది. రాములవారు కట్టుకుంటే పులకించిన పంచె ఇది అంటారు. సీతమ్మవారు స్నానం చేస్తున్నప్పుడు రాక్షసుల నుంచి రక్షణగా రాములవారు రాతి మీద కూర్చున్న చోటును ఆయన సింహాసనంగా చెబుతుంటారు.

సీతమ్మవారు స్నానం చేసి, చెట్టుకింద కూర్చొని జుట్టు ఆరబెట్టుకునేవారట. ఆ చెట్టును సీతమ్మ తల్లి వృక్షం అంటారు. ఈ నివాస కాలంలోనే శూర్పణఖ వచ్చి వారిని బాధలకు లోనుచేసిందని, లక్ష్మణుడు శూర్పణఖ ముక్కుచెవులు కోసిన ప్రదేశం ఇదేనంటారు.
 
గోదావరి నది: పర్ణశాల పక్కనే గోదావరి నది ప్రవహిస్తోంది. ఇక్కడికి వచ్చిన యాత్రికులు గోదావరి నది అందాలను వీక్షించడానికి వీలుగా మర పడవల ఏర్పాటు ఉంది.
 
దుమ్ముగూడెం... ఆత్మారాముడు
 
భద్రాచలానికి 25 కి.మీ.ల దూరంలో ఉంటుందీ ప్రాంతం. రాములవారు ఈ ప్రాంతంలోనే పదివేల మంది రాక్షసులను సంహరించి, దహనకాండ చేశాడట. వారి చితాభస్మాల ధూళి ఆ ప్రాంతమంతా కమ్మేయడంతో దీనికి దుమ్ముగూడెం అని పేరువచ్చిందని చెబుతారు. రాములవారు అంతమంది రాక్షసులను సంహరించడంతో సీతమ్మ వారి ఆత్మ సంతోషపడిందట. అందుకే ఆ ప్రాంతంలో కొలువైన రాములవారిని ఆత్మారాముడిగా పిలుచుకుంటారు.
 
ఇతర ఆలయాలు
గోవిందరాజులస్వామి ఆలయం, నరసింహ ఆలయం, యోగానంద నరసింహస్వామి ఆలయం, శ్రీరామదాసు ధ్యానమందిరం, శ్రీ రంగనాయక స్వామి ఆలయం, వేణుగోపాలస్వామి ఆలయం, హరనాథ ఆలయం.
 
రాష్ట్రం నలుమూల నుంచి...
హైదరాబాద్ నుండి ఖమ్మం మీదుగా, విజయవాడ నుండి కొత్తగూడెం మీదుగా, రాజమండ్రి నుండి మోతుగూడెం మీదుగా, విశాఖపట్నం నుండి సీలేరు, చింతపల్లి మీదుగా, వరంగల్లు నుండి ఏటూరు నాగారం మీదుగా రోడ్డు మార్గాలు, బస్సు సౌకర్యాలు ఉన్నాయి. భద్రాచలానికి 35 కి.మీ దూరంలోని కొత్తగూడెంలో రైల్వే స్టేషన్ ఉంది. రాజమండ్రిలో డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్ ఉంది.
 
 శ్రీరామగిరి.. మరో భద్రాద్రి
 భద్రాచలానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీరామగిరిలో శ్రీసీతారామాలయం ఉంది. సీతాన్వేషణలో భాగంగా ఈ ప్రాంతంలో శ్రీరాముడు ఏకశిల మీద తపస్సు చేశాడట. అందుకని ఇక్కడ స్వామిని ఏకరాముడు అని కూడా పిలుస్తుంటారు. ఇక్కడ గుడి వద్ద నిల్చుని చూస్తే ఒకవైపు వాలి పర్వతం. మరొకవైపు సుగ్రీవుని పర్వతం కనిపిస్తాయి. ఇక్కడే వాలి సుగ్రీవులకు యుద్ధాలు జరిగాయట. ఇక్కడే సుగ్రీవునికి, రాముడికి మైత్రి కుదిరిందట. శ్రీరాముల వారు జటాయువుకు దహనసంస్కారాలు చేసి, పిండప్రదానం చేసే సమయంలో పడిన పాదాలు, మోకాలి ముద్రల ఆనవాళ్లు భక్తులతో ఇప్పటికీ పూజలందుకుంటున్నాయి.
 
 జటాయువు పాక.. యటపాక
 భద్రాచలానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది యటపాక. పర్ణశాల నుండి సీతమ్మవారిని రావణాసురుడు అపహరించి ఎత్తుకుపోతుండగా జటాయువు తన ప్రాణాలకు తెగించి రావణాసురుడితో పోరాడుతున్నప్పుడు రెక్కభాగం తెగి పడిన ప్రదేశం ఇదని చెబుతారు. అప్పటి నుంచి ఈ ప్రాంతం జటపాకగా ఆ తర్వాత జటాయువుపాకగా కాలక్రమేణా యటపాకగా ప్రసిద్ధిగాంచింది. జటాయువు పక్షి రావణాసురుడితో పోరాడుతున్నప్పుడు ఒక రెక్క యటపాకలో తెగిపడగా రెండో రెక్క రేఖపల్లిలో పడిందట. మొదట రెక్కపల్లిగా ఉన్న ఈ ఊరి పేరు కాలక్రమేణా రేఖపల్లిగా మారిందని ప్రతీతి.
 
 వేడినీటి చలమలు.. ఉష్ణగుండాలు:
గోదావరి నది ఒడ్డున ఉష్ణగుండాలు ఉన్నాయి. ఇక్కడ ఎప్పుడు తవ్వినా వేడినీరు ఉబికి వస్తుంది. వనవాస సమయంలో సీతమ్మవారి స్నానానికి శ్రీరాముడు భూమిలోకి బాణాన్ని వెయ్యగానే వేడినీరు ఉబికి వచ్చిందట. వాటినే ఉష్ణగుండాలుగా పిలుస్తున్నారు. ఇక్కడ తప్ప మరెక్కడ తవ్వినా చల్లని నీరు వస్తుంది. చుట్టూ వరదలొచ్చినా ఉష్ణగుండం వద్ద మాత్రం వేడి వేడి పొగలు వస్తాయని ప్రజలు చెబుతుంటారు.
 
శబరి సంగమం: శ్రీరాముల వారు శబరికి మోక్షం ప్రసాదించిన ప్రదేశం ఇదే! ఇక్కడే గోదావరి, శబరి నదుల సంగమం జరిగింది. భక్తురాైలైన శబరి శ్రీరాములవారికి ప్రసాదంగా పండ్లు రుచి చూసి పెట్టగా, మిగిలిన పండ్లు ఇక్కడ వేయడం వల్ల ఈ నీళ్లు తియ్యగా, గోదావరి నీళ్లు చప్పగా ఉంటాయని చెబుతూ ఉంటారు.
 
 చుట్టుపక్కల చూడదగిన ప్రదేశాలు:
కిన్నెరసాని: భద్రాచలం పట్టణానికి 32 కి.మీ దూరంలో కిన్నెరసాని నది ప్రవహిస్తుంది. నదిపై డ్యామ్ ఉంది. ఇక్కడ జింకలపార్క్ ఉంది.
 
పాపికొండలు: సుందరమైన గోదావరి నది, కొండలు, ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడి ప్రత్యేకత. భద్రాచలం నుంచి పడవలో ఇక్కడికి వెళ్లే సౌకర్యం ఉంది.
 
 ఎక్కడ ఉండాలి?
 భద్రాచలంలో అన్నిరకాల ప్రజలకు వారి వారి స్తోమతమేరకు వసతి సౌకర్యం ఉంది. ప్రభుత్వ సత్రాలు, కాటేజ్‌లు, గెస్ట్‌హౌజ్‌లు, హోటల్స్ ఉన్నాయి.
 
 వృద్ధులు, వికలాంగులు, నడవలేని వారు భద్రాచలం సీతారామచంద్రస్వామి వారి ఆలయం చేరటానికి లిఫ్ట్ సౌకర్యం ఉంది. దక్షిణం వైపు మెట్ల నుంచి ఈ లిఫ్ట్ ఆలయగాలిగోపురం ముందుకు చేరుస్తుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement