sitamma
-
సీతమ్మకొండపై హర్ శిఖర్ తిరంగా
సాక్షి, పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా): రాష్ట్రంలో అత్యంత ఎత్తయిన సీతమ్మ కొండపై ‘హర్ శిఖర్ తిరంగా’కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. కొండపై ఆర్మీ బృందం జాతీయ జెండాను విజయవంతంగా ఆవిష్కరించింది. దీంతో సీతమ్మకొండకు జాతీయస్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్ అండ్ అడ్వెంచర్ స్పోర్ట్స్ (నిమాస్) డైరెక్టర్ కల్నల్ రణవీర్‌సింగ్ జమ్వాల్ ఆధ్వర్యంలో 14 మందితో కూడిన ఆర్మీ బృందం సోమవారం మధ్యాహ్నం హుకుంపేట మండలంలోని మారుమూల ఓలుబెడ్డ గ్రామానికి చేరుకుంది. సర్పంచ్ పాంగి బేస్ ఆధ్వర్యంలో గిరిజనులంతా వారికి పూలమాలలతో స్వాగతం పలికారు. థింసా నృత్యాలతో ఆర్మీ బృందం కూడా సందడి చేసింది. మధ్యాహ్నం 1.30గంటలకు సీతమ్మ కొండపైకి బయలుదేరిన ఆర్మీ బృందం... గంటన్నరలో కొండపైకి చేరుకుని జాతీయ జెండాను ఎగురవేసింది. ఈ సందర్భంగా కల్నల్ రణవీర్‌సింగ్ జమ్వాల్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎత్తయిన శిఖరంగా గుర్తించిన సీతమ్మ కొండపై జాతీయ జెండాను ఎగురవేయడం సంతోషంగా ఉందన్నారు. తమ యాత్ర, జాతీయ జెండా ఆవిష్కరణకు రాష్ట్ర ప్రభుత్వం, పర్యాటకశాఖ, స్థానిక గిరిజనులు ఎంతో సహకరించినట్లు తెలిపారు. ఈ ఏడాది ఆగస్టు ఒకటో తేదీన హర్ శిఖర్ తిరంగా యాత్రను ప్రారంభించామన్నారు. సీతమ్మ కొండతో కలిపి ఇప్పటి వరకు 22 రాష్ట్రాల్లోని ఎత్తయిన పర్వత శిఖరాల్లో జాతీయ జెండాను విజయవంతంగా ఎగురవేశామన్నారు. మరో 6 రాష్ట్రాల్లో హర్ శిఖర్ తిరంగాను అక్టోబర్ 15వ తేదీకి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎవరెస్ట్ అధిరోహకుడు ఆనంద్‌కుమార్, టూరిజం అడ్వంచర్ స్పోర్ట్స్ ప్రతినిధి కుంతూరు కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. -
సీతమ్మ తల్లి తనువు చాలించిన ప్రదేశం ఎక్కడో తెలుసా!
సీతమ్మ తల్లి తనువు చాలించిన ప్రదేశం సీతా సమాహిత్ స్థల్. సీతాదేవి తన అవతారం చాలించినప్పుడు తన మాతృమూర్తి అయిన భూమాతలో ఐక్యం అయ్యిందన్న విషయం అందరికీ తెలుసు. కానీ ఆ ప్రదేశం ఎక్కడుందో చాలా మందికి తెలియదు. మరి అదెక్కడుంది? ఆ ప్రాంత విశేషాలేమిటి వంటివి చూద్దామా ..! ఆ పవిత్ర స్థలం ఎక్కడో కాదు .. అలహబాద్ మరియు వారణాసిలను కలిపే రెండవ జాతియ రహదారికి సుమారు 4 కి. మీ. దూరంలో దక్షిణాన ఉంటుంది. రెండవ జాతియ రహదారి పైన ఉన్న జంగిగంజ్ నుండి 14 కి.మీ ప్రయాణం చేస్తే అక్కడికి సులభంగా చేరుకోవచ్చు. ఆ ప్రదేశాన్ని 'సీత సమాహిత్ స్థల్' అని 'సీత మారి' అని పిలుస్తారు. సీతా సమాహిత్ స్థల్లో చూడటానికి ఒకేఒక గుడి ఉన్నది. ఆ గడ్డిని పశువులు కూడా తినేవి కావు బహుశా ..! దీన్ని చూస్తే గుడి అని అనిపించదేమో! ... స్మారకం అనాలేమో ..!! తమసా నది పరిసర ప్రాంతంలో ప్రశాంత వాతావరణంలో 90వ దశకంలో నిర్మించిన అందమైన స్మారక కట్టడం ఒకటుంది. ఈ స్మారక కట్టడం నిర్మాణం జరుగక ముందు ఇక్కడ అమ్మ వారి జుట్టుని తలపించేట్టుగా కేశ వాటిక ఉండేదని అక్కడి స్థానికులు చెబుతారు. అక్కడ మొలిచిన గడ్డిని పశువులు కూడా తినేవి కాదట. స్మారకాన్ని నిర్మించేటప్పుడు 'సీతా కేశ వాటిక' ను పాడు చెయకుండ అలాగే ఉంచారు. స్మారకం ఉన్న ప్రదేశానికి సమీపంలోనే వాల్మీకి ఆశ్రమం ఉన్నది. ఈ ఆశ్రమంలోనే జానకి దేవి మళ్లీ అడవుల పాలైనప్పుడు నివాసము ఉన్నది ఇక్కడే. ఆశ్రమానికి పక్కనే లవ కుశలకు జన్మనిచ్చిన స్థలం అయిన సీత వటవృక్షం కూడ ఉంటుంది. ఇక స్మారకం విషయానికి వస్తే, అది ముచ్చటగా రెండు అంతస్థుల నిర్మాణం. పై అంతస్తులోని అద్దాల మంటపంలో అమ్మ వారి పాల రాతి విగ్రహం ఉంటుంది. అలాగే కింద భాగంలో జీవకళ ఉట్టిపడే విధంగా భూమిలోకి చేరుకుంటున్నట్టుగా చూపిస్తున్న అమ్మ వారి ప్రతిమను చూస్తుంటే ... ఎంతటి వారికైన బాధ కలిగించే విధంగా ఉంటుంది. వెనక గోడల మీద ఆ సంఘటనలను చూపిస్తున్న సన్నివేశపు శిలా చిత్రం కనిపిస్తుంది. గుడి లేదా స్మారక వివరాల్లోకి వెళితే, దీన్ని స్వామి జితేంద్రానంద తీర్థులవారి ఆదేశం మేరకు ఇక్కడ నిర్మించారు. సీతా సమాహిత్ స్థల్ చేరుకొను మార్గం సీతా సమాహిత్ స్థల్ కి బస్సు మార్గం చక్కగా ఉంటుంది. అలహాబాద్ నుండి 55 కిలోమీటర్ల దూరంలో, వారణాసి నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ పుణ్య క్షేత్రం. రైళ్లలో వచ్చే వారు అలహాబాద్ లేదా వారణాసి (ఏది దగ్గర అనుకుంటే అది) రైల్వే స్టేషన్లో దిగి సీతా సమాహిత్ స్థల్ చేరుకోవచ్చు. విమాన మార్గం ద్వారా వచ్చే వారు అలహాబాద్ లేదా వారణాసి విమానాశ్రయాలకు చేరుకొని క్యాబ్ లేదా ప్రభుత్వ బస్సులో ప్రయాణించి చేరుకోవచ్చు. (చదవండి: కలియుగ శ్రవణుడిలా..తల్లిని భుజాలపై మోస్తూ..) -
Sitamma Sagar: కేసీఆర్ సర్కార్‌కు షాక్
సాక్షి, ఢిల్లీ/భద్రాద్రి: తెలంగాణ సర్కార్‌కు ఎన్జీటీ నుంచి మరో ఝలక్ తగిలింది. ప్రతిష్టాత్మకంగా నిర్మించతలబెట్టిన సీతమ్మ సాగర్ బ్యారేజ్ ప్రాజెక్టుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ బ్రేకులు వేసింది. పర్యావరణ అనుమతులు లేకుండా నిర్మిస్తున్న ప్రాజెక్టు పనుల్ని వెంటనే నిలిపివేయాలని, అనుమతులు తీసుకోవాల్సిందేనంటూ ఎన్జీటీ చెన్నై బెంచ్ తీర్పు ఇచ్చింది ట్రిబ్యునల్. గోదావరి నీటి నిల్వతో పాటు జల విద్యుదుత్పత్తికి ఉపయోగపడేలా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం వద్ద కేసీఆర్ సర్కార్.. ఈ ప్రాజెక్టును నిర్మించ తలపెట్టింటి. దుమ్ముగూడెం ఆనకట్టకు ఎగువన భద్రాచలం సీతమ్మ వారి పర్ణశాలకు దగ్గరగా బ్యారేజీ నిర్మాణం చేపడుతున్న నేపథ్యంలో.. సీతమ్మ సాగర్‌గా నామకరణం చేసింది. 37 టీఎంసీల నీరు నిల్వ ఉండేలా బ్యారేజీ, 320 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేసేలా ప్లాంటు నిర్మించాలని ప్రభుత్వం భావించింది. అయితే.. ఒకవైపు బ్యారేజీ నిర్మాణ పనులు నెమ్మదిగా కొనసాగుతుండగా.. పర్యావరణ అనుమతులు వచ్చాకే ప్రాజెక్టు పనులు కొనసాగించాలని ఇప్పుడు ఎన్జీటీ ఆదేశించడం గమనార్హం. ఈ మేరకు తదుపరి విచారణను ఏప్రిల్ 26వ తేదీకి వాయిదా వేసింది. ఇదీ చదవండి: మా మెట్రో ఏం పాపం చేసింది? -
సీతమ్మ కష్టం తీరింది
సాక్షి, విజయవాడ: చుట్టూ ఎంతమంది ఉన్నా కుటుంబ సభ్యులు దగ్గర లేకపోతే మనస్సు స్థిమితపడదు. విజయనగరం జిల్లా పార్వతీపురానికి చెందిన సీతమ్మ వయస్సు 70 సంవత్సరాలు. కృష్ణాజిల్లా పెనమలూరులోని తన కుమార్తె ఇంటికి వచ్చింది. అదే సమయంలో లాక్డౌన్ విధించడంతో ఆమె అక్కడే ఉండిపోయింది. అయితే వలస కూలీలను ప్రభుత్వం తమ స్వస్థలాలకు పంపించేందుకు అనుమతి ఇస్తుండటంతో తనను కూడా స్వగ్రామానికి పంపాలంటూ సబ్ కలెక్టర్ కార్యాలయానికి నిన్న (మంగళవారం) నడుచుకుంటూ వచ్చి విన్నవించుకుంది. (శ్రామిక్ రైళ్లలో స్వస్థలాలకు వలస కూలీలు) ఆధార్ కార్డు, ఫోటో, దరఖాస్తు చేతపట్టుకుని వచ్చిన ఆమె విజ్ఞాపనను అక్కడ సిబ్బంది పరిశీలించి స్వస్థలానికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వడంతో ఆనందం వ్యక్తం చేసింది. గమ్యం చేరాలనుకునే బాటసారి అలుపెరగడు... అలాగే విజయం సాధించాలనుకునే వ్యక్తి నిరాశ చెందడన్నట్లుగా సీతవ్వ కథ ఎట్టకేలకు సుఖాంతమైంది. (సాక్షి ఫోటోగ్రాఫర్, విజయవాడ) -
మమజీవనహేతునా...
‘‘సీతమ్మా! నీ భర్త అంత రాజ్యాన్ని వదిలిపెట్టి అరణ్యవాసానికి వస్తుంటే, ఆయనను అనుగమించి వచ్చేసావు... అలా వస్తుంటే నీ భర్త చేతకానివాడిలా అనిపించలేదా... రాజ్యాన్ని సముపార్జించుకోలేడూ, తండ్రిని ధిక్కరించలేడూ... ఆయన ధర్మానికి కట్టుబడ్డాడని ప్రశంసాపూర్వకంగా వెంట వచ్చావా తల్లీ... ఎంత గొప్పపని అమ్మా నీవు చేసింది...’’ అని అనసూయమ్మ(అత్రి మహర్షి భార్య) తమ ఆశ్రమానికి వచ్చిన సీతమ్మతో అన్నది. మెచ్చుకుని భర్తను అనుగమించడం కేవలం గుడ్డితనంగా కాదు. అదేదో అయనది అధికారమనీ కాదు, ఆ భర్త పట్ల గౌరవాన్ని వ్యక్తం చేసింది. ఒక తండ్రి ఆడపిల్లను కంటాడు. నోములు పట్టిస్తాడు, వ్రతాలు చేయిస్తాడు... మంచి భర్త కోసం. ఆ తరువాత... పెళ్ళయి పోయాక వ్రతాలు పడుతుంది... ఎవరి కోసం? భర్తకోసం, అత్తామామల కోసం, పుట్టింటివారి కోసం... సరే.. మరి తనకోసం??? ఏమీ ఉండదు. వాళ్ళ సుఖమే తన సుఖం. అది ఆడపిల్ల గొప్పతనం. అందుకే స్త్రీ వైశిష్ట్యం వేరు. అదే పురుషుడయితే... ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం... అలా తనకోసం చాలా చెబుతాడు. ఆమెకో!!! తనకోసం అంటూ ఏమీ ఉండదు. ఆయన దీర్ఘాయుష్షుతో ఉండాలి. పిల్లలు బాగుండాలి. అత్తమామలు, అమ్మానాన్నలు, తోబుట్టువులు, ఆడపడుచులు, బావగార్లూ, మరుదులూ బాగుండాలి... మరి నువ్వో... ‘అందరూ బాగుండడమే నేను బాగుండడం’... అనుకుంటుంది. అందుకే నెలకు పడే మూడువానల్లో ఒక వాన ఉత్తములయిన స్త్రీలవలన పడుతున్నది అన్నది శాస్త్రం. అటువంటి ఔదార్యం కలిగిన ఆడపిల్లకు తండ్రి పరిమితంగానే ఇస్తాడు. పెళ్ళయ్యేవరకు ఉత్తముడయిన వరుణ్ణి చూస్తాడు. పుట్టింటికి వస్తే పసుపు కుంకుమలు ఇస్తారు.. అలా ఆమెకు రక్త సంబంధీకులు కానీ, బంధుగణం కానీ ఎవరిచ్చినా అది పరిమితమే... ఇంత అని చెప్పడానికి వీలు లేనంత అపరిమితమయిన దాన్ని ఇచ్చేవాడు ఎవరంటే... భర్త ఒక్కడే. కారణం– శాస్త్రంలో ఒక మర్యాదుంది. నేను ఎంత ఐశ్వర్యవంతుడిని అయినా, నేను నా భార్య పాణిగ్రహణం చేయగానే, ఆమె నా పత్ని కాగానే నా ఐశ్వర్యం అంతా ఆమెదయిపోతుంది. నిజానికి నా ఆయుర్దాయం కూడా ఆమె వలన నిర్ణయింపబడుతుంది. ఆమె సౌశీల్యం వల్ల నా ఆయుర్దాయం నిలబడుతుంది. అందుకే ‘మమజీవనహేతునా’ అని చెప్పి మంగళసూత్రం కడుతున్నారు. అందుకే అనసూయమ్మ అంటున్నది... ‘‘అమ్మా! భర్త తాను చేసిన పుణ్యంలో సగభాగం భార్యకిస్తున్నాడు. ఆయన ఐశ్వర్యం అంతా ఆమెదే. ఆయన ఆయుర్దాయానికి నేను కర్త. విశేషించి నేను లేని నాడు ఆయనకు ధర్మం లేదు. నేను తల్లినయి అమ్మా అని పిలిపించుకుని ఆనందాన్ని పొందానంటే దానికి కారణం–ధార్మికమైన సంతానాన్ని ఆయన వలన పొందాను కాబట్టి. నేను ఎంత నాసిరకం చీర కట్టినా ‘సువాసిని’ అని గౌరవించడానికి కారణం– ఆయన ఉండబట్టే. ఇవన్నీ మరెవరి వలనా సంభవించవు... అందువలననే కులకాంతలు, ఉత్తమమైన స్త్రీలను గౌరవిస్తారమ్మా... శాస్త్రం ఎరిగినవారు.‘‘ఒక్కొక్క మహా పతివ్రత ఈ దేశంలో సూర్యోదయ, సూర్యాస్తమయాలను శాసించింది. రేపు తెల్లవారితే నీ భర్త మరణిస్తాడంటే... ‘‘సూర్యోదయమవకుండు గాక’’ అని ఆదేశించింది. ధర్మచక్రం నిలబడిపోయిందంతే. అది ఎన్ని యజ్ఞయాగాది క్రతువులు చేసినా పురుషుడు పొందగలడో లేదో కానీ పతివ్రతాధర్మంతో స్త్రీ సాధించింది. -బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
అదిగో భద్రాద్రి ...గౌతమి ఇదిగో చూడండి!
రాములవారి కోవెల లేని ఊరు లేదు. రామ నామం పలకని వాడ లేదు. ధర్మమూర్తిగా శ్రీరాముడికి, సహనశీలిగా సీతమ్మకు ఆసేతుహిమాచలం బ్రహ్మరథం పడుతూనే ఉంది. త్రేతాయుగాన జరిగిన వారి కల్యాణం లోక కల్యాణంగా ఇప్పటికీ ప్రతి ఏటా చైత్రశుద్ధ నవమినాడు దక్షిణ సాకేతపురిగా ప్రసిద్ధిగాంచిన భద్రాచలంలో కన్నులపండువగా జరుగుతుంది. సుందర దృశ్యధామమైన ఆ భద్రాద్రి రాముని క్షేత్రాన్ని, పరమపవిత్రమైన గోదావరి నదీ తీరాన్ని, ఆ ధర్మమూర్తి నడయాడిన పరిసర ప్రాంతాలను శ్రీరామనవమినాడు దర్శించుకోవాలని ఉవ్విళ్లూరని భక్తులు, పర్యాటకులు ఉండరు. వారి కోసం ఈ సమాచారం. రాష్ట్రంలో జిల్లా కేంద్రమైన ఖమ్మం నుంచి 105 కి.మీ.ల దూరంలో ఉన్న భద్రాచలం భక్తరామదాసు నిర్మించిన రామాలయంగా ప్రసిద్ధి. పరమపవిత్రమైన గోదావరి నది దక్షిణ తీరాన శ్రీరామచంద్రుడు సీతా, లక్ష్మణ, హన్మత్ సమేతుడై ధనుర్బాణ శంఖుచక్రాలను ధరించి స్వయంభువుగా భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఈ ప్రాంతంలోనే శ్రీరామచంద్రుడు సీతాసమేతుడై వనవాసం చేశాడని ప్రతీతి. పూర్వం భద్రుడు అనే భక్తుడు తపస్సు చేసి, తను ఒక కొండగా మారి తనపై శ్రీరాముడు వెలసే విధంగా వరం పొందాడని బ్రహ్మాండ పురాణం, గౌతమీ మాహాత్మ్యం చెబుతున్నాయి. ఆ కొండ భద్రుడి పేరు మీద భద్రగిరి అనీ, తరువాత కాలంలో భద్రాచలం అనీ ప్రసిద్ధి కెక్కింది. తహసీల్దారుగా ఉంటూ భద్రాద్రి ఆలయాన్ని నిర్మింపజేసినవాడు భక్తరామదాసు. ఈయన అసలు పేరు కంచర్ల గోపన్న. కనులు రెండు సరిపోవు... శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో శ్రీరాముడు కొలువున్న తీరును చూడటానికి రెండు కళ్లూ సరిపోవు అంటారు భక్తజనం. ఆ వైకుంఠరాముని దర్శనం అనంతరం ఆయన నడయాడిన ప్రదేశాలను తిలకించడానికి, నాటి ధర్మమూర్తి అడుగుజాడలను గుర్తుచేసుకుంటూ తమ ప్రయాణాన్ని కొనసాగిస్తారు. పర్ణశాల.. వర్ణరంజితం భద్రాచలానికి సుమారు 35 కి.మీ.ల దూరంలో ఉంది పర్ణశాల. దండకారణ్యంలో ఒక భాగమైన ఈ ప్రాంతంలో వనవాస సమయంలో శ్రీరాముడు పర్ణశాల ఏర్పాటుచేసుకొని ఇక్కడే ఉన్నాడట. అప్పుడు జరిగిన సన్నివేశాలు ఇప్పుడు శిలా రూపంలో దర్శనమిస్తున్నాయి. ఆ పక్కనే వేణుగోపాలస్వామి ఆలయం ఉంది. సీతమ్మవాగు... కళ్లకు కట్టే నాటి గుర్తులు వేణుగోపాలస్వామి ఆలయం పక్కనే ఉన్న వాగు గోదావరి నదిలో కలుస్తోంది. ఈ వాగుకున్న ప్రత్యేకతను చెవులారా విని, కనులారా వీక్షించి ధన్యులవుతుంటారు జనులు. సీతమ్మవారు వాగులో స్నానం చేసి తన నారచీరలను ఈ వాగు గట్టుమీదే ఆరేసుకునేదట. అందుకే ఈ వాగును సీతమ్మవాగు అంటారు. విశేషమేమిటంటే ఇప్పటికీ సీతమ్మవారు ఆరేసిన ప్రాంతంలో చీర గుర్తులు 20 అడుగుల మేర కనిపిస్తాయి. ఇంకా అమ్మవారు పసుపు, కుంకుమకు ఉపయోగించిన రాళ్లను కూడా చూడొచ్చు. ఇక్కడే వామనగుంటలుగా పిలిచే మరో ప్రదేశం ఉంది. ప్రతిరోజూ సీతారాములు కాలక్షేపానికి ఇక్కడ వామనగుంటలు ఆడుకున్నారని చెబుతారు. అలాగే భోజనం చేయడానికి వీలుగా ఉన్న నాటి రాతి పళ్లెం కూడా ఒకటి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడే నలభై అడుగుల పొడవున ఓ నల్ల రాయి ఉంటుంది. రాములవారు కట్టుకుంటే పులకించిన పంచె ఇది అంటారు. సీతమ్మవారు స్నానం చేస్తున్నప్పుడు రాక్షసుల నుంచి రక్షణగా రాములవారు రాతి మీద కూర్చున్న చోటును ఆయన సింహాసనంగా చెబుతుంటారు. సీతమ్మవారు స్నానం చేసి, చెట్టుకింద కూర్చొని జుట్టు ఆరబెట్టుకునేవారట. ఆ చెట్టును సీతమ్మ తల్లి వృక్షం అంటారు. ఈ నివాస కాలంలోనే శూర్పణఖ వచ్చి వారిని బాధలకు లోనుచేసిందని, లక్ష్మణుడు శూర్పణఖ ముక్కుచెవులు కోసిన ప్రదేశం ఇదేనంటారు. గోదావరి నది: పర్ణశాల పక్కనే గోదావరి నది ప్రవహిస్తోంది. ఇక్కడికి వచ్చిన యాత్రికులు గోదావరి నది అందాలను వీక్షించడానికి వీలుగా మర పడవల ఏర్పాటు ఉంది. దుమ్ముగూడెం... ఆత్మారాముడు భద్రాచలానికి 25 కి.మీ.ల దూరంలో ఉంటుందీ ప్రాంతం. రాములవారు ఈ ప్రాంతంలోనే పదివేల మంది రాక్షసులను సంహరించి, దహనకాండ చేశాడట. వారి చితాభస్మాల ధూళి ఆ ప్రాంతమంతా కమ్మేయడంతో దీనికి దుమ్ముగూడెం అని పేరువచ్చిందని చెబుతారు. రాములవారు అంతమంది రాక్షసులను సంహరించడంతో సీతమ్మ వారి ఆత్మ సంతోషపడిందట. అందుకే ఆ ప్రాంతంలో కొలువైన రాములవారిని ఆత్మారాముడిగా పిలుచుకుంటారు. ఇతర ఆలయాలు గోవిందరాజులస్వామి ఆలయం, నరసింహ ఆలయం, యోగానంద నరసింహస్వామి ఆలయం, శ్రీరామదాసు ధ్యానమందిరం, శ్రీ రంగనాయక స్వామి ఆలయం, వేణుగోపాలస్వామి ఆలయం, హరనాథ ఆలయం. రాష్ట్రం నలుమూల నుంచి... హైదరాబాద్ నుండి ఖమ్మం మీదుగా, విజయవాడ నుండి కొత్తగూడెం మీదుగా, రాజమండ్రి నుండి మోతుగూడెం మీదుగా, విశాఖపట్నం నుండి సీలేరు, చింతపల్లి మీదుగా, వరంగల్లు నుండి ఏటూరు నాగారం మీదుగా రోడ్డు మార్గాలు, బస్సు సౌకర్యాలు ఉన్నాయి. భద్రాచలానికి 35 కి.మీ దూరంలోని కొత్తగూడెంలో రైల్వే స్టేషన్ ఉంది. రాజమండ్రిలో డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ ఉంది. శ్రీరామగిరి.. మరో భద్రాద్రి భద్రాచలానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీరామగిరిలో శ్రీసీతారామాలయం ఉంది. సీతాన్వేషణలో భాగంగా ఈ ప్రాంతంలో శ్రీరాముడు ఏకశిల మీద తపస్సు చేశాడట. అందుకని ఇక్కడ స్వామిని ఏకరాముడు అని కూడా పిలుస్తుంటారు. ఇక్కడ గుడి వద్ద నిల్చుని చూస్తే ఒకవైపు వాలి పర్వతం. మరొకవైపు సుగ్రీవుని పర్వతం కనిపిస్తాయి. ఇక్కడే వాలి సుగ్రీవులకు యుద్ధాలు జరిగాయట. ఇక్కడే సుగ్రీవునికి, రాముడికి మైత్రి కుదిరిందట. శ్రీరాముల వారు జటాయువుకు దహనసంస్కారాలు చేసి, పిండప్రదానం చేసే సమయంలో పడిన పాదాలు, మోకాలి ముద్రల ఆనవాళ్లు భక్తులతో ఇప్పటికీ పూజలందుకుంటున్నాయి. జటాయువు పాక.. యటపాక భద్రాచలానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది యటపాక. పర్ణశాల నుండి సీతమ్మవారిని రావణాసురుడు అపహరించి ఎత్తుకుపోతుండగా జటాయువు తన ప్రాణాలకు తెగించి రావణాసురుడితో పోరాడుతున్నప్పుడు రెక్కభాగం తెగి పడిన ప్రదేశం ఇదని చెబుతారు. అప్పటి నుంచి ఈ ప్రాంతం జటపాకగా ఆ తర్వాత జటాయువుపాకగా కాలక్రమేణా యటపాకగా ప్రసిద్ధిగాంచింది. జటాయువు పక్షి రావణాసురుడితో పోరాడుతున్నప్పుడు ఒక రెక్క యటపాకలో తెగిపడగా రెండో రెక్క రేఖపల్లిలో పడిందట. మొదట రెక్కపల్లిగా ఉన్న ఈ ఊరి పేరు కాలక్రమేణా రేఖపల్లిగా మారిందని ప్రతీతి. వేడినీటి చలమలు.. ఉష్ణగుండాలు: గోదావరి నది ఒడ్డున ఉష్ణగుండాలు ఉన్నాయి. ఇక్కడ ఎప్పుడు తవ్వినా వేడినీరు ఉబికి వస్తుంది. వనవాస సమయంలో సీతమ్మవారి స్నానానికి శ్రీరాముడు భూమిలోకి బాణాన్ని వెయ్యగానే వేడినీరు ఉబికి వచ్చిందట. వాటినే ఉష్ణగుండాలుగా పిలుస్తున్నారు. ఇక్కడ తప్ప మరెక్కడ తవ్వినా చల్లని నీరు వస్తుంది. చుట్టూ వరదలొచ్చినా ఉష్ణగుండం వద్ద మాత్రం వేడి వేడి పొగలు వస్తాయని ప్రజలు చెబుతుంటారు. శబరి సంగమం: శ్రీరాముల వారు శబరికి మోక్షం ప్రసాదించిన ప్రదేశం ఇదే! ఇక్కడే గోదావరి, శబరి నదుల సంగమం జరిగింది. భక్తురాైలైన శబరి శ్రీరాములవారికి ప్రసాదంగా పండ్లు రుచి చూసి పెట్టగా, మిగిలిన పండ్లు ఇక్కడ వేయడం వల్ల ఈ నీళ్లు తియ్యగా, గోదావరి నీళ్లు చప్పగా ఉంటాయని చెబుతూ ఉంటారు. చుట్టుపక్కల చూడదగిన ప్రదేశాలు: కిన్నెరసాని: భద్రాచలం పట్టణానికి 32 కి.మీ దూరంలో కిన్నెరసాని నది ప్రవహిస్తుంది. నదిపై డ్యామ్ ఉంది. ఇక్కడ జింకలపార్క్ ఉంది. పాపికొండలు: సుందరమైన గోదావరి నది, కొండలు, ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడి ప్రత్యేకత. భద్రాచలం నుంచి పడవలో ఇక్కడికి వెళ్లే సౌకర్యం ఉంది. ఎక్కడ ఉండాలి? భద్రాచలంలో అన్నిరకాల ప్రజలకు వారి వారి స్తోమతమేరకు వసతి సౌకర్యం ఉంది. ప్రభుత్వ సత్రాలు, కాటేజ్‌లు, గెస్ట్‌హౌజ్‌లు, హోటల్స్ ఉన్నాయి. వృద్ధులు, వికలాంగులు, నడవలేని వారు భద్రాచలం సీతారామచంద్రస్వామి వారి ఆలయం చేరటానికి లిఫ్ట్ సౌకర్యం ఉంది. దక్షిణం వైపు మెట్ల నుంచి ఈ లిఫ్ట్ ఆలయగాలిగోపురం ముందుకు చేరుస్తుంది.