‘‘సీతమ్మా! నీ భర్త అంత రాజ్యాన్ని వదిలిపెట్టి అరణ్యవాసానికి వస్తుంటే, ఆయనను అనుగమించి వచ్చేసావు... అలా వస్తుంటే నీ భర్త చేతకానివాడిలా అనిపించలేదా... రాజ్యాన్ని సముపార్జించుకోలేడూ, తండ్రిని ధిక్కరించలేడూ... ఆయన ధర్మానికి కట్టుబడ్డాడని ప్రశంసాపూర్వకంగా వెంట వచ్చావా తల్లీ... ఎంత గొప్పపని అమ్మా నీవు చేసింది...’’ అని అనసూయమ్మ(అత్రి మహర్షి భార్య) తమ ఆశ్రమానికి వచ్చిన సీతమ్మతో అన్నది. మెచ్చుకుని భర్తను అనుగమించడం కేవలం గుడ్డితనంగా కాదు. అదేదో అయనది అధికారమనీ కాదు, ఆ భర్త పట్ల గౌరవాన్ని వ్యక్తం చేసింది. ఒక తండ్రి ఆడపిల్లను కంటాడు. నోములు పట్టిస్తాడు, వ్రతాలు చేయిస్తాడు... మంచి భర్త కోసం. ఆ తరువాత... పెళ్ళయి పోయాక వ్రతాలు పడుతుంది... ఎవరి కోసం? భర్తకోసం, అత్తామామల కోసం, పుట్టింటివారి కోసం... సరే.. మరి తనకోసం??? ఏమీ ఉండదు. వాళ్ళ సుఖమే తన సుఖం.
అది ఆడపిల్ల గొప్పతనం. అందుకే స్త్రీ వైశిష్ట్యం వేరు. అదే పురుషుడయితే... ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం... అలా తనకోసం చాలా చెబుతాడు. ఆమెకో!!! తనకోసం అంటూ ఏమీ ఉండదు. ఆయన దీర్ఘాయుష్షుతో ఉండాలి. పిల్లలు బాగుండాలి. అత్తమామలు, అమ్మానాన్నలు, తోబుట్టువులు, ఆడపడుచులు, బావగార్లూ, మరుదులూ బాగుండాలి... మరి నువ్వో... ‘అందరూ బాగుండడమే నేను బాగుండడం’... అనుకుంటుంది. అందుకే నెలకు పడే మూడువానల్లో ఒక వాన ఉత్తములయిన స్త్రీలవలన పడుతున్నది అన్నది శాస్త్రం. అటువంటి ఔదార్యం కలిగిన ఆడపిల్లకు తండ్రి పరిమితంగానే ఇస్తాడు. పెళ్ళయ్యేవరకు ఉత్తముడయిన వరుణ్ణి చూస్తాడు. పుట్టింటికి వస్తే పసుపు కుంకుమలు ఇస్తారు.. అలా ఆమెకు రక్త సంబంధీకులు కానీ, బంధుగణం కానీ ఎవరిచ్చినా అది పరిమితమే... ఇంత అని చెప్పడానికి వీలు లేనంత అపరిమితమయిన దాన్ని ఇచ్చేవాడు ఎవరంటే... భర్త ఒక్కడే. కారణం– శాస్త్రంలో ఒక మర్యాదుంది.
నేను ఎంత ఐశ్వర్యవంతుడిని అయినా, నేను నా భార్య పాణిగ్రహణం చేయగానే, ఆమె నా పత్ని కాగానే నా ఐశ్వర్యం అంతా ఆమెదయిపోతుంది. నిజానికి నా ఆయుర్దాయం కూడా ఆమె వలన నిర్ణయింపబడుతుంది. ఆమె సౌశీల్యం వల్ల నా ఆయుర్దాయం నిలబడుతుంది. అందుకే ‘మమజీవనహేతునా’ అని చెప్పి మంగళసూత్రం కడుతున్నారు. అందుకే అనసూయమ్మ అంటున్నది... ‘‘అమ్మా! భర్త తాను చేసిన పుణ్యంలో సగభాగం భార్యకిస్తున్నాడు. ఆయన ఐశ్వర్యం అంతా ఆమెదే. ఆయన ఆయుర్దాయానికి నేను కర్త. విశేషించి నేను లేని నాడు ఆయనకు ధర్మం లేదు. నేను తల్లినయి అమ్మా అని పిలిపించుకుని ఆనందాన్ని పొందానంటే దానికి కారణం–ధార్మికమైన సంతానాన్ని ఆయన వలన పొందాను కాబట్టి.
నేను ఎంత నాసిరకం చీర కట్టినా ‘సువాసిని’ అని గౌరవించడానికి కారణం– ఆయన ఉండబట్టే. ఇవన్నీ మరెవరి వలనా సంభవించవు... అందువలననే కులకాంతలు, ఉత్తమమైన స్త్రీలను గౌరవిస్తారమ్మా... శాస్త్రం ఎరిగినవారు.‘‘ఒక్కొక్క మహా పతివ్రత ఈ దేశంలో సూర్యోదయ, సూర్యాస్తమయాలను శాసించింది. రేపు తెల్లవారితే నీ భర్త మరణిస్తాడంటే... ‘‘సూర్యోదయమవకుండు గాక’’ అని ఆదేశించింది. ధర్మచక్రం నిలబడిపోయిందంతే. అది ఎన్ని యజ్ఞయాగాది క్రతువులు చేసినా పురుషుడు పొందగలడో లేదో కానీ పతివ్రతాధర్మంతో స్త్రీ సాధించింది.
-బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు
Comments
Please login to add a commentAdd a comment