సుఖాన్ని... కామాన్ని ధర్మము చేత కట్టాలి. అప్పుడు ధర్మబద్ధమైన అర్థం ప్రభవిస్తుంది. అందుకే కన్యాదాత కన్యను తీసుకొచ్చి ధర్మపత్నిగా ఇచ్చేటప్పుడు వరుడితో... ‘కన్యామిమాం ప్రదాస్యామి పితౄణాం తారణాయవై’ అంటాడు. ఒక్కొక్క కార్యానికి ఒక్కొక్క ప్రయోజనం ఉంది. ఆకలితో ఉన్నవాడికి అన్నం, దాహంతో ఉన్నవాడికి నీరు... అలాగే కామం ఒక ప్రయోజనం కోసం... అందువల్ల అది ధర్మంచేత కట్టబడాలి. ఆయనకు సంతానం కలిగి పితృరుణంనుండి విముక్తుడు కావాలి. ఆయన యజ్ఞం చేయాలంటే పక్కన భార్య ఉండాలి. వివాహం చేయాలంటే పత్ని ఉండాలి. ఆమె లేనప్పుడు ఈ కార్యక్రమాలు వేటికీ కూడా ఆయన అర్హుడు కాడు... ఈ నియమాలు ఎవరో ఒకరు పెట్టినవి కావు. శాస్త్రం నిర్దేశించినవి. అంటే ధర్మపత్నిని స్వీకరించకుండా పుణ్యకార్యాలు చేయడం, తరించడం ఎలా సాధ్యం?
అందుకే జీవితం పండించుకోవడానికి అవసరమయిన సాధనాన్ని కన్యాదాత ఇస్తున్నాడు. నిజం చె΄్పాలంటే ... కొడుకు పుడితే.. వాడు ప్రయోజకుడయితే.. వాడు ధార్మికంగా బతికితే... అప్పుడు తల్లీదండ్రీ, ఆపైన ఉన్నవాళ్ళు .. తరువాత అత్తగారు, మామగారు తరిస్తారు. పుత్ అను పేరుగల నరకం నుంచి త్రాయతే.. రక్షిస్తాడు కాబట్టి పుత్రుడు అన్నారు. కుమార్తెను కన్యాదానం చేశాను.. అనుకోండి. అప్పుడు నాకు పది తరాల ముందూ, పది తరాల వెనకా నాతో కలిపి 21 తరాలు తరించి΄ోతాయి. ఈ సంతానం కలగడానికి కారణం ఎవరు? నా ధర్మపత్ని. ఆమె వల్ల సంతానం కలిగితే ఇంత గొప్ప ప్రయోజనం సిద్ధించింది.
అందువల్ల కామము ఎప్పుడూ ధర్మబద్ధంగా ఉండాలంటే.. భార్యాభర్తలు చెలియలికట్ట దాటకూడదు. విశ్వనాథ సత్యనారాయణ గారు ‘చెలియలికట్ట’ అనే సాంఘిక నవల రాశారు. అందులో... వివాహం ద్వారా కామము ధర్మం చేత ఎందుకు కట్టబడుతుందో ప్రతి΄ాదించారు. సముద్రం అనంత జలరాశి. చాలా శక్తిమంతం. అది అనుకుంటే ఊళ్ళను సునాయాసంగా ముంచేయగలదు. అయినా దానికదిగా .. చెలియలికట్ట దాటకూడదని.. ఒక నియమం పెట్టుకుంది. ఆడుకుంటున్నట్లుగా అక్కడిదాకా వస్తాయి. ఎదురుగా వచ్చిన వాళ్ళ ఆచారాలు కడిగి అలలు వెనక్కి వెళ్ళిపోతాయి. కాళ్ళు కడిగాయి కదా అని అతి చేసి తెగించి మరింత ముందుకు వెడితే.. ప్రమాదం ముంచుకొస్తుంది.
‘ధర్మేచ, అర్థేచ, కామేచ ఏషా నాతి చరితవ్యా..’ – ఇది ప్రమాణం.
‘మామగారూ! ఇప్పుడు నాకు అర్థమయింది. మీరు నాకు ఇంతటి మహోపకరణాన్ని ఇచ్చారు. నేను ఈమెను అతిక్రమించను. ఈమె నాకు ప్రధానంగా ధర్మబద్ధ జీవితానికి ఒక సాధనం. ఈమెను నేను ధర్మపత్నిగా స్వీకరించినందుకు నా జీవితం పండాలి. చేయగలిగిన పుణ్యకార్యాలు చేయాలి. అసలు నేను నా భార్యతో కలిసి చేయవలసివేమిటో నాకు తెలియాలి. మేమిద్దరం చేయీచేయీ పట్టుకుని ప్రయాణించాలి. తద్వారా నేనూ తరించాలి, ఆమే తరించాలి.’ అనుకుని ఆచరిస్తాడు. అలా కామము ధర్మము తో కలిసినప్పుడు అర్థము ప్రభవిస్తుంది. అర్థము – అంటే? బంగారం, ఇళ్ళు, వస్తు, వాహనాలు కాదు... మరి నిజమైన సంపద ఏది? పిల్లలకు తల్లిదండ్రులు, తల్లిదండ్రులకు పిల్లలే అసలు సిసలైన సంపద. అదే అర్థము ప్రభవించడం అంటే.
-బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు
Comments
Please login to add a commentAdd a comment