Chaganti Koteshwara Rao
-
అవి రెండే.. కానీ ఒకటయిపోతాయి!
అతిథిని పూజించేవాడు ఒక్క గృహస్థు మాత్రమే. అలా గౌరవించడంలో ఎంత లీనమయి ఉంటారంటే అసలు భగవంతుడే స్వయంగా వచ్చినా ఏమరుపాటు పొందుతారు. సీతారాముల విగ్రహాలను అలంకరించడానికి తులసీదాసు గంధం తీస్తుంటాడు. రామలక్ష్మణులు స్వయంగా అతిథులుగా వస్తారు. వచ్చి ఆ గంధం తమకు పూయమంటారు. ఇది సీతారాములకే మీకు కాదు వెళ్ళండంటాడు. వారు వెళ్ళబోతుంటే.. హనుమ చిలకరూపంలో వచ్చి అసలు విషయం చెబుతాడు. రాజకుమారుల రూపంలో ఉన్న వారిని అప్పుడు చందనాదులతో సేవించి దర్శనం పొందుతాడు తులసీదాసు.ఇక్కడ నీకున్నదేదో ఇక్కడ శరీరం వదిలిపెట్టేయడంతోనే సరి. కానీ ఈ శరీరంతో ఉండగా నలుగురికి పనికివచ్చే మంచి పని చేసినప్పుడు అది మాత్రమే పుణ్యంగా నీ వెంట వస్తుంది. మనం ఈ శరీరాన్నిగానీ, ద్రవ్యాన్నిగానీ, శక్తినిగానీ దేనిని వాడకుండా దాచుకోవడం సాధ్యమయ్యేది కాదు. అది కాలంతో వెళ్ళి΄ోవలసిందే. మెరుపు ఎలా వచ్చిపోతుంటుందో అలా భోగాలు వచ్చి పోతుంటాయి తప్ప వాటి వలన ఏ ఫలితమూ ఉండదంటారు శంకరాచార్యుల వారు. సూర్యోదయాలు, చంద్రోదయాలు వస్తుంటాయి, పోతుంటాయి.. ఆయుర్దాయం కరిగిపోతుంటుంది. ఆయువు ఉన్న కాలంలో ఎవరు తమ జీవితాన్ని పండించుకుంటారో వారు గట్టెక్కుతారు. ఆ అదృష్టం అతిథిపూజ చేసిన గృహస్థుకు సులభంగా దక్కుతుంది. అతిథి కూడా ఏ అవసరం వచ్చినా గృహస్థుదగ్గరకే ΄ోతాడు తప్ప ఇతర ఆశ్రమాలవారిని ఆశ్రయించడు. మన దేశ ద్రవ్యం మన దేశంలోనే చెల్లుబాటవుతుంది కదా. ఇతర దేశాలకు ΄ోవాలంటే విదేశీమారక ద్రవ్యం అవసరం. అలాగే ఇక్కడ చేసిన మంచిపని .. మారక ద్రవ్యంలాగా శరీరం విడిచిపెట్టినా పుణ్యం రూపంలో నీ వెంట వస్తుంది.గృహస్థాశ్రమంలో మరో విశేషం ఉంది. దంపతుల మనసు ఏకీకృతమయితే పరమ సంతోషంగా, పరమ ప్రశాంతంగా జీవితం హాయిగా గడుస్తుంది. సాధారణంగా ఇద్దరున్నప్పుడు ఒకరు మరొకరితో ముఖాముఖి మాట్లాడితే తప్ప ఒకరి భావాలు మరొకరికి అర్థం కావు. కానీ దాంపత్యంలో అది పండిందని గుర్తు ఏమిటంటే – ఆయన ఆమెతో, ఆమె ఆయనతో నోరు విప్పి మాట్లాడనక్కరలేదు. అలా చూపులు చాలు భావ ప్రసరణకు,. ఆ స్థాయికి చేరుకోవడం అంటే రెండు మనసులు ఒకటి కావడం.సీతమ్య ఏ పని చేసినా దీనివలన మా ఆయన కీర్తినిలబడుతుంది గదా అని ఆలోచిస్తుందట. రాముడు ఏ పని చేసినా దీనివల్ల సీత సంతోషిస్తుంది గదా! అని ఆలోచిస్తుంటాడట. కొంతకాలం గడిచాక ఒకరికి ఏ అవసరం వచ్చినా మరొకరు అడగాల్సిన పనిలేకుండానే దానిని నెరవేరుస్తారు. పట్టాభిషేక ఘట్టం. అందరికీ అన్నీ ఇచ్చేసారు. చిట్టచివర సీతమ్మ తన మెడలోంచి హారం తీసి పట్టుకున్నది. నీ ప్రశాంతతకు, మన దాంపత్యానికి, మన కలయికకు కారుకులయిన వారికి దానిని అనుగ్రహించు అన్నాడు రాముడు. వెంటనే సీతమ్మ దానిని హనుమకు ఇచ్చేసింది. రాముడు ఫలానా అని పేరు చెప్పక΄ోయినా ఆమె గ్రహించేసింది. దాంపత్యం పండినప్పుడు ఆయన మనసు ఆవిడ దగ్గర, ఆవిడ మనసు ఆయన దగ్గర ఉంటాయి. కారణం – రెండంటూ ఉంటే కదూ.. ఉన్నది ఒకటే అయిపోతుంది. - చాగంటి కోటేశ్వరరావు -
ధర్మ చక్రం: నాలుగు ఆశ్రమాలలో ఏది గొప్పది?
గృహస్థాశ్రమంలో నిత్యం జరిగే పంచ మహా యజ్ఞాలలో మూడవది – హోమోదైవో.. దేవ యజ్ఞం. వేదమంత్రాల పఠనంతో భగవంతుడిని ఉద్దేశించి హోమం చేస్తూ నైవేద్యాలను సమర్పించాలి – హుతో హోమః... అంటే యజ్ఞయాగాది క్రతువులు. మహాభారతంలో శాంతిపర్వంలో అంపశయ్యమీద పడుకుని భీష్మాచార్యుల వారంటారు..‘‘అసలు ధర్మానికంతటికీ ఇరుసువంటివాడు గృహస్థు... ఓ ధర్మరాజా! గృహస్థులేని నాడు ఈ సృష్టే లేదు. గృహస్థులేని నాడు ఈ ధర్మచక్రం తిరగనే తిరగదు.’’ అని. అగ్ని ద్వారా దేవతలకు హవిస్సును గృహస్థే ఇస్తాడు. ఇతర ఆశ్రమాల వాళ్ళు ఇవ్వరు. గృహస్థు ఇచ్చిన హవిస్సును దేవతలు తిని సంతుష్ఠులై వర్షం కురిపిస్తారు... ఎక్కడ..? గృహస్థు ఇంట్లోకాదు, ఆ ్ర΄ాంతమంతా కురిపిస్తారు. ‘‘అన్నద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః/ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మసముద్భవః... ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహ యః/ అఘాయురింద్రియారామో మోఘం పార్థ స జీవతి’’... అంటే ఇది ఒక చక్రం. తిరుగుతోంది. ప్రాణులు పుట్టాలి అంటే అన్నం (ఆహారం) తినాలి. అన్నసారం స్త్రీలో శోణితంగా, పురుషునిలో శుక్రంగా మారి రెండూ కలిసి సృష్టి జరగాలి. బిడ్డలు పుట్టాలి. దీనికంతటికీ మూలమైన అన్నం పుట్టాలంటే పంటలు పండాలి.. అంటే వర్షం పడాలి... వర్షం పడాలంటే... యజ్ఞం జరగాలి.అన్నం, నీరు ఎంత కాలం దొరుకుతాయో అంతకాలమే ధర్మం ఉంటుంది. వాటిలో మొదట నీరు. ఇవి దొరకనప్పుడు ఎన్ని ధర్మాలు, నీతులు, ప్రవచనాలు చెప్పినా వినేవారు కానీ, ΄ాటించేవారు కానీ లోకంలో ఉండరు. ధర్మం తప్పి΄ోతుంది. ‘ఆ΄ోవా ఇదగుం సర్వం...అమృతం వా ఆపః...’’ నీరు అమృతం. ్ర΄ాణులన్నీ ఆ నీటి మీదే ఆధారపడి ఉన్నాయి. అన్నం, నీరు కావాలంటే వర్షం పడాలి... అలా పడాలంటే యజ్ఞం చేయాలి. యజ్ఞ కర్మ సముద్భవమ్... కర్మ చేస్తే వస్తుంది. అదెవరు చేయాలి?... ఒక్క గృహస్థు మాత్రమే.. పక్కన ధర్మపత్నితో కూడుకుని ఉన్నవాడు మాత్రమే యజ్ఞాన్ని చేస్తాడు. అప్పుడు ఈ సృష్టి ఏర్పడుతుంది, నిలబడుతుంది, లయమవుతుంది. ప్రశాంతత కలుగుతుంది. అందరూ నిర్వర్తించాల్సిన ధర్మాన్ని అందరూ నిర్వర్తిస్తున్నారు. కాబట్టి ధర్మచక్రం సవ్యంగా తిరుగుతుంది.ఎంత సంపన్న కుటుంబంలో పుట్టిన వాడయినా తల్లిపా లమీద ఆధారపడాల్సిందే. తల్లి లేకపోతే సృష్టి లేదు. అలాగే గృహస్థాశ్రమం మిగిలిన అన్ని ఆశ్రమాలకు తల్లిలాంటిది. ఆ గృహస్థులేని నాడు మిగిలిన ఆశ్రమాల వాళ్ళకు భిక్ష లేనే లేదు... ఈ మాటలు నావి కావు.. మహాభారతంలో శాంతిపర్వంలో భీష్ముడు చెప్పినవి. రామాయణంలో అయోధ్యకాండలో భరతుడు కూడా ఇదే అంటాడు..‘‘అన్నయ్యా ! నీకు తెలుసు కదా! గార్హస్థ్యం శ్రేష్టమాశ్రమం... నాలుగు ఆశ్రమాలలో గృహస్థాశ్రమమే గొప్పది.’’ ‘హోమో దైవో బలిర్భౌతో...’’ హవిస్సు ద్వారా దేవతలకు అన్నం పెట్టిన గృహస్థుకు సమస్త భూతములు, ప్రాణులను కూడా పోషించే కర్తవ్యం ఉంది. భీష్ముడు మరో మాట కూడా చెప్పాడు... గృహస్థాశ్రమంలో ఉన్నవారు ఎప్పడూ సంసార లంపటంలో పడి ఉంటారు, వారు అగాధంలో పడి΄ోయారని అనుకుంటున్నావేమో ... గృహస్థుకు మోక్షం లేదని ఎవరన్నారు !!! దేవతలకు అన్నం పెడుతున్న గృహస్థుకు కూడా మోక్షం లభిస్తుంది.-చాగంటి కోటేశ్వరరావు -
పిందె.. పండు...వైరాగ్యం
రుషిరుణం, పితృరుణం, దేవరుణం... ఈ మూడు రుణాలు తీరాలంటే ధర్మపత్ని సహకారం ఉండి తీరాలి. అంటే నీవు గృహస్థాశ్రమ ప్రవేశం చేస్తున్నావు. అప్పుడు నీవు ఏమి చేసినా అవి ధర్మంతో కట్టుబడి ఉంటాయి. చేయవలసినవి చేస్తూ తరించి΄ోతుంటావు. కారణం– అడుగున ధర్మం ప్రవహిస్తూ ఉంటుంది. అందువల్ల నీ కర్మలన్నీ శాపాలను విప్పేస్తుంటాయి. అందుకే ఈ తేలిక మార్గాన్ని నిర్దేశించారు. అది లేక΄ోతే ఇంద్రియాలు అకస్మాత్తుగా కాటువేసే అవకాశం ఉంది. అంటే ధర్మచట్రంలో ఉన్న అర్ధకామాలు దేనినయినా అనుభవించు... క్రమ క్రమంగా ఒక వయసు వచ్చేసిన తరువాత ధర్మానుష్ఠాన బలం వైరాగ్య సుఖాన్నిస్తుంది. క్రమేణా ఒక నిరాసక్తత, ఒక అనుభవం బయల్దేరుతుంది లోపల. అంటే బలవంతంగా అంటించుకున్నది కాదు, అది ఈశ్వర కృపతో వచ్చేది. వైరాగ్యమంటే.. ఈ సుఖాలన్నీ ఒక సుఖాలా... అనిపించడం... ఏమీ పట్టించుకోకుండా అని కాదు. గాలి తన పని తాను చేసుకు΄ోతుంటుంది. జాజి పందిరి మీదినుంచి ΄ోతే పరిమళభరితం అవుతుంది..అప్పుడు గాలిని అభినందిస్తే ΄÷ంగి΄ోదు. ఒక కళేబరం మీది నుంచి΄ోయినప్పుడు దుర్గంధాన్ని వ్యాపింపచేస్తుందని అభిశంసిస్తే అది కృంగి΄ోదు. దాని పని అది చేసుకుంటూ ΄ోతుంది. అలా ΄÷ంగి΄ోవడాలు, కుంగి΄ోవడాలు లేకుండా... నీ కర్తవ్యం నీవు చెయ్యాలి. నీ నిజాయితీ నీ అంతరాత్మకు, ఈశ్వరుడికి తెలిస్తే చాలు..‘‘లోకుల్ నన్గని మెచ్చనీ యలగనీ లోలోన నిందించనీ/ చీకాకున్ బడనీ మహాత్ముడననీ../ మూకీభావమునన్ తిట్టనీ త్రోయనీ / నీ కారుణ్యము కల్గి ఉండినను అంతేచాలు నోశంకరా!’’ అంటారు శంకరాచార్యులు. నీ స్వచ్ఛత ఈశ్వరుడికి తెలిసినంత కాలం నీవు దిగులు పడాల్సిన అవసరం లేదు. ఆయన ముందు కూడా నీవు తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తే... పూజామందిరంలోకి వెళ్ళు.. లెంపలేసుకుని క్షమాపణలడుగు.‘ఈశ్వరా! నా వల్ల ఇటువంటి అపరాధం మళ్ళీ జరగకుండు గాక!’ అని శరణువేడుకో. చాలు.ఎవరయితే ద్వంద్వాలకు అతీతులయిపోతున్నారో వారు నాకు దగ్గరవుతున్నట్లు.. అంటాడు గీతాచార్యుడు. వైరాగ్యం క్రమంగా సత్యాన్ని అంగీకరించే స్థాయికి తీసుకువెడుతుంది. సూర్యోదయ సూర్యాస్తమయాల్లో ఆయుర్దాయం కరిగిపోతున్నది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో. ఈ శరీరం ఉండగానే నీవు చేయవలసిన కర్తవ్యాలు నెరవేర్చు. సద్వినియోగం చేసుకో. అంటే మంచి విషయాల్లోనే అనురక్తి ఉంటుంది తప్ప లౌకిక విషయాలపట్ల నిరాసక్తత పెరగడమే వైరాగ్యం. ‘కోటిమంది వైద్యులు కూడి వచ్చినకాని మరణమన్న వ్యాధి మాన్పలేరు’. అంటే ఈ వైరాగ్యం ఎప్పుడు వస్తుంది..?. పిందెకూ పండుకూ తేడా తెలుసుకుంటే ఈ ప్రశ్నకు జవాబు దొరుకుతుంది. పిందె పట్టుకుని ఉండాలి. పండు తనంతటతాను విడి΄ోయి పడి΄ోవడానికి సిద్ధంగా ఉండాలి. అంటే పట్టుకోవాల్సిన వయసులో అన్నీ పట్టుకో... ధర్మబద్ధంగా. విడవాల్సి వచ్చినప్పుడు నిస్సంకోచంగా విడిచేసెయ్. కొబ్బరికన్నా పెంకును గట్టిగా పట్టుకునే వాళ్ళు ఎవరుంటారు... నీళ్ళు లోపలికి ఎప్పుడు ఎలా వెళ్ళాయో తెలియదు, ఎలా ఆవిరయ్యాయో తెలియదు. లోపల గురుగుడుమంటూ ఉంది... అంటే విడిపోయింది. పూర్ణాహుతికి పనికొస్తుంది. అంటే ఈ శరీరం నేను కాదు...ఆత్మ అని అనుభవంలోకి రావడమే వైరాగ్యం. దీనికి ఈశ్వరకృప ప్రధానమయినా, నీ కర్మాచరణ లేకుండా ఈశ్వర కృప ఉండదు. -
గృహస్థాశ్రమ వైశిష్ట్యం : అర్థము అంటే..!!!
సుఖాన్ని... కామాన్ని ధర్మము చేత కట్టాలి. అప్పుడు ధర్మబద్ధమైన అర్థం ప్రభవిస్తుంది. అందుకే కన్యాదాత కన్యను తీసుకొచ్చి ధర్మపత్నిగా ఇచ్చేటప్పుడు వరుడితో... ‘కన్యామిమాం ప్రదాస్యామి పితౄణాం తారణాయవై’ అంటాడు. ఒక్కొక్క కార్యానికి ఒక్కొక్క ప్రయోజనం ఉంది. ఆకలితో ఉన్నవాడికి అన్నం, దాహంతో ఉన్నవాడికి నీరు... అలాగే కామం ఒక ప్రయోజనం కోసం... అందువల్ల అది ధర్మంచేత కట్టబడాలి. ఆయనకు సంతానం కలిగి పితృరుణంనుండి విముక్తుడు కావాలి. ఆయన యజ్ఞం చేయాలంటే పక్కన భార్య ఉండాలి. వివాహం చేయాలంటే పత్ని ఉండాలి. ఆమె లేనప్పుడు ఈ కార్యక్రమాలు వేటికీ కూడా ఆయన అర్హుడు కాడు... ఈ నియమాలు ఎవరో ఒకరు పెట్టినవి కావు. శాస్త్రం నిర్దేశించినవి. అంటే ధర్మపత్నిని స్వీకరించకుండా పుణ్యకార్యాలు చేయడం, తరించడం ఎలా సాధ్యం? అందుకే జీవితం పండించుకోవడానికి అవసరమయిన సాధనాన్ని కన్యాదాత ఇస్తున్నాడు. నిజం చె΄్పాలంటే ... కొడుకు పుడితే.. వాడు ప్రయోజకుడయితే.. వాడు ధార్మికంగా బతికితే... అప్పుడు తల్లీదండ్రీ, ఆపైన ఉన్నవాళ్ళు .. తరువాత అత్తగారు, మామగారు తరిస్తారు. పుత్ అను పేరుగల నరకం నుంచి త్రాయతే.. రక్షిస్తాడు కాబట్టి పుత్రుడు అన్నారు. కుమార్తెను కన్యాదానం చేశాను.. అనుకోండి. అప్పుడు నాకు పది తరాల ముందూ, పది తరాల వెనకా నాతో కలిపి 21 తరాలు తరించి΄ోతాయి. ఈ సంతానం కలగడానికి కారణం ఎవరు? నా ధర్మపత్ని. ఆమె వల్ల సంతానం కలిగితే ఇంత గొప్ప ప్రయోజనం సిద్ధించింది. అందువల్ల కామము ఎప్పుడూ ధర్మబద్ధంగా ఉండాలంటే.. భార్యాభర్తలు చెలియలికట్ట దాటకూడదు. విశ్వనాథ సత్యనారాయణ గారు ‘చెలియలికట్ట’ అనే సాంఘిక నవల రాశారు. అందులో... వివాహం ద్వారా కామము ధర్మం చేత ఎందుకు కట్టబడుతుందో ప్రతి΄ాదించారు. సముద్రం అనంత జలరాశి. చాలా శక్తిమంతం. అది అనుకుంటే ఊళ్ళను సునాయాసంగా ముంచేయగలదు. అయినా దానికదిగా .. చెలియలికట్ట దాటకూడదని.. ఒక నియమం పెట్టుకుంది. ఆడుకుంటున్నట్లుగా అక్కడిదాకా వస్తాయి. ఎదురుగా వచ్చిన వాళ్ళ ఆచారాలు కడిగి అలలు వెనక్కి వెళ్ళిపోతాయి. కాళ్ళు కడిగాయి కదా అని అతి చేసి తెగించి మరింత ముందుకు వెడితే.. ప్రమాదం ముంచుకొస్తుంది.‘ధర్మేచ, అర్థేచ, కామేచ ఏషా నాతి చరితవ్యా..’ – ఇది ప్రమాణం. ‘మామగారూ! ఇప్పుడు నాకు అర్థమయింది. మీరు నాకు ఇంతటి మహోపకరణాన్ని ఇచ్చారు. నేను ఈమెను అతిక్రమించను. ఈమె నాకు ప్రధానంగా ధర్మబద్ధ జీవితానికి ఒక సాధనం. ఈమెను నేను ధర్మపత్నిగా స్వీకరించినందుకు నా జీవితం పండాలి. చేయగలిగిన పుణ్యకార్యాలు చేయాలి. అసలు నేను నా భార్యతో కలిసి చేయవలసివేమిటో నాకు తెలియాలి. మేమిద్దరం చేయీచేయీ పట్టుకుని ప్రయాణించాలి. తద్వారా నేనూ తరించాలి, ఆమే తరించాలి.’ అనుకుని ఆచరిస్తాడు. అలా కామము ధర్మము తో కలిసినప్పుడు అర్థము ప్రభవిస్తుంది. అర్థము – అంటే? బంగారం, ఇళ్ళు, వస్తు, వాహనాలు కాదు... మరి నిజమైన సంపద ఏది? పిల్లలకు తల్లిదండ్రులు, తల్లిదండ్రులకు పిల్లలే అసలు సిసలైన సంపద. అదే అర్థము ప్రభవించడం అంటే.-బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
గృహస్థాశ్రమ వైశిష్ట్యం: ఎన్ని చదివాం, ఎన్ని విన్నామనేది కాదు! అసలు..
మనం ఏ విషయాన్ని నిర్ణయించాల్సి వచ్చినా ‘‘తస్మాచ్ఛాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యవ్యవస్థితౌ...’’ శాస్త్రమే ప్రమాణం. మనకు బుద్ధికి తోచిన దానితో నిర్ణయం చేయడం సనాతన ధర్మంలో భక్తి అనిపించుకోదు. మనం ఎన్ని చదివాం, ఎన్ని విన్నాం... అని కాదు ఎన్ని ఏ మేరకు పాటిస్తాం అన్నది ప్రధానం. ఈ విషయాన్నే రామాయణంలో సీత ‘ఇహ సంతో న వా సంతి సతో వా నానువర్తనే / తథా హి విపరీతా తే బుద్ధిరాచార వర్జితా..’ అంటూ రావణాసురుడికి బోధ చేస్తుంది.అలా మనం ఏదయినా ఒక పని చేయాలనుకున్నప్పుడు మనకు ప్రమాణం శాస్త్రం. పుట్టుకతో ప్రతివారికీ మూడు రుణాలుంటాయి.. అని శాస్త్రం అంటుంది. అవి రుషి రుణం, దేవరుణం, పితృరుణం. ‘నేనెప్పుడు చేశానండీ ఈ రుణాలు, నేనెలా రుణగ్రస్తుడనయ్యాను’ అన్న ప్రశ్న అన్వయం కాదు. శాస్త్రవాక్కు కనుక అందరికీ ఉంటుంది. వీటిలో ఒక రుణం విషయంలో మాత్రం దానిని తీర్చుకోవడానికి గృహస్థాశ్రమ అవసరం ఉండదు. అది రుషిరుణం. సనాతన ధర్మంలో మనందరం రుణపడి΄ోయింది రుషులకు. మంత్రానికి రుషి ద్రష్ట. వేదమంత్రాలను ధ్యానంతో దర్శించి, విని మనకు స్వరంతో అందించాడు. ఆయన కూడా మనలాగే జీవించినవాడే అయినా రుషి తర్పణం అని... రుషికి వేరు తర్పణం ఉంటుంది.రుషి మన నుంచి ఏ విధమైన ఫలాన్ని ఆశించలేదు, ఏ సత్కారాన్నీ, ఏ బిరుదునూ కోరుకోలేదు. కేవలం మనల్ని ఉద్ధరించడం కోసమని, మనందరికీ కటికచీకటిలో కాంతిరేఖ కనపడాలని, మన జీవితాలు సుసంపన్నం కావాలని, మార్గం చూపించాలని వేదాల ద్వారా అందించి ధర్మానుష్ఠానికి ప్రమాణాన్ని కల్పించాడు. అలాగే ఒకవేళ మనం ఇవన్నీ చదవగలమో లేదో, స్వరంతో మంత్రం చెప్పగలమో లేదో, మంత్రభాష్యాన్ని అర్థం చేసుకోగలమో లేదో, అసలు ఇది అందరికీ అందుబాటులో ఉంటుందో ఉండదో అన్న అనుమానంతో రుషులు పురాణాలను ఇతిహాసాలుగా అందించారు.వ్యాసభగవానుడు 18 పురాణాలను అందించాడు. ‘‘నమో’స్తు తే వ్యాస విశాల–బుద్ధే/ఫుల్లరవిందయత –పత్ర–నేత్ర/యేన త్వయా భారత–తైల–పూర్ణః/ప్రజ్వలితో జ్ఞాన–మయః ప్రదీపః’’ అంటారు. అంతటితో ఆగకుండా ఆయన పరమ దయాళువై వేదాల సారాన్ని అందరూ చదువుకుని అనుష్ఠించడానికి వీలుగా పంచమ వేదంగా మహాభారతాన్ని రచించి లోకానికి అందించారు. వేదం చదువుకుంటే ఏది తెలుస్తుందో మహాభారతం చదువుకున్నా అదే తెలుస్తుంది.సూర్యవంశాన్ని అంతటినీ కూడా శ్రీరామాయణం ద్వారా వాల్మీకి మహర్షి వర్ణించాడు. ‘‘వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే /వేదః ప్రచేతసదాచిత్ సాక్షాత్ రామాయణాత్మనాః’’ వేదములు ప్రతి΄ాదించిన బ్రహ్మము రామచంద్రమూర్తిగా వస్తే ఆ వేదమే రామాయణ కావ్యంగా వచ్చింది. వేదం ఏం చెప్పిందో తెలియనప్పుడు రామాయణం చదువుకుంటే చాలు. మనకు ఆ ప్రయోజనం నెరవేరుతుంది. రాముడు ఏ పరిస్థితుల్లో ఏం చేసాడో, మానవాళికి అదే వేదం విధించిన కర్తవ్యం కూడా. అందుకే ఎవరయినా అత్యంత విశ్వాసంతో ఒక విషయాన్ని తదేక దృష్టితో నమ్మి ఆచరించేవారయితే ‘రుషి సమానులు’ అంటారు. ఆయన ఒక ‘రుషి’ అంటారు. – బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
అదీ.. దాంపత్యం అంటే..!
పిల్లలకు వివాహం నిర్ణయించేటప్పుడు పెద్దలు పాటించే ప్రామాణికాల్లో శీలం, వయస్సు, వ్యక్తిత్వం, అభిజనం తరువాత చివరిది లక్షణం. లక్షణం అంటే భౌతికమైన అందం. లోకంలో గుణాలు ఎంత గొప్పవో, అందం కూడా అంత గొప్పది. దానికి ఎక్కువ ప్రాధాన్యత ఉండాలి. రుక్మిణీదేవి శ్రీ కృష్ణ పరమాత్మను ఇష్టపడింది కేవలం ఆయన బాహ్య సౌందర్యం చూసి కాదు.ఎన్నో గుణాలు వివరించి... ‘కృష్ణా! ఇన్ని గుణాలు నీలో ఉన్నాయి కాబట్టే నాకు నీవంటే అంత ప్రీతి’’ అని ఆమె ప్రకటించింది. భౌతికమైన అందం ఉండాలి. వధూవరులు ఒకరికి ఒకరు తగినవారయి ఉండాలి. నూతన దంపతులను చూసినప్పుడు ‘ఆ పిల్ల చేసుకున్న అదృష్టం’ అనో, ‘ఆ పిల్లవాడిది అదృష్టం అంటే’... అని అనకూడదు. ఒకరికొకరు సరిగ్గా సరిపోయారు’ అనాలి. ఆ తరువాత ప్రేమతో, ఆర్ద్రతతో గృహస్థాశ్రమాన్ని పండించుకోవడం ఆ దంపతుల వంతు.దేవుడి విషయంలో అయినా సరే, ఇదే మర్యాద పాటిస్తారు. శంకరాచార్యులవారు శివానందలహరిలో పార్వతీ పరమేశ్వరుల అన్యోన్యతను ప్రస్తావిస్తూ.. ‘‘ఆమె ఎంత తపస్సు చేసిందో ఈయనకు భార్య కాగలిగింది. ఈయన ఎంత తపస్సు చేసాడో అటువంటి భార్య లభించింది. అదీ దాంపత్యం అంటే. అలా అల్లుకుపోవాలని భగవంతుడే మనకు నేర్పాడు.– బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
'ఆమె ధర్మపత్ని'! గృహస్థాశ్రమ వైశిష్ట్యం!!
అహం ఎప్పుడూ కూడా మనిషిని పాషాణం అయ్యేట్టు చేస్తుంది. కామం తీరలేదనుకోండి. శత్రుభావం పెంచుకుని అవతలి వాళ్ళమీద కఠినంగా వ్యవహరించేటట్లు చేస్తుంది. అయితే ప్రేమ మాత్రం కరిగిపోయే లక్షణాన్ని పొంది ఉంటుంది. అవతలివాళ్ళల్లో ఎన్ని లోపాలున్నా వారి నాశనాన్ని ప్రేమ కోరుకోదు. వారు బాగుపడాలి, సంస్కరింపబడాలి, జీవితంలో వృద్ధిలోకి రావాలి... అని కోరుకుంటుంది తప్ప వారిపట్ల ద్వేషం పెంచుకోదు. అందుకే ప్రేమ అవసరం. దానికి పూర్వ పరిచయం లేదు, భవిష్యత్తు మాత్రం ఉంది. దానికి పునాది ప్రేమలోనే ఉంది తప్ప కామంలో లేదు. అందుకే ఆమె ‘ధర్మపత్ని’ తప్ప కామపత్ని కాదు. ఇంత పెద్దప్రాతిపదికచేసి గృహస్థాశ్రమ ప్రవేశం చేయిస్తారు. కాబట్టి వివాహం నిర్ణయించేటప్పుడు పెద్దలు ముందుగా శీలం, వయసు, వృత్తి పరిశీలిస్తారు... తరువాత అభిజనం... అంటే రెండు పక్కల వంశాలు ఎంత గొప్పవి! ఆ వంశాలలో పూర్వీకులు ఎంత గొప్పగా ప్రవర్తించారో అన్న జిజ్ఞాసతో ఆ వంశానికి కీర్తిప్రతిష్ఠలు జోడించేలా ప్రవర్తించాలి. అందువల్ల వాటిని కూడా పెద్దలు పరిశీలిస్తారు.రామాయణంలో... రామచంద్రమూర్తి శివధనుర్భంగం చేయగానే జనకమహారాజు వచ్చి సీతను అప్పగించాడు, రాముడు వెంట తీసుకెళ్ళాడు... అని చాలామంది అనుకుంటూంటారు. కానీ అది సరికాదు. బాలకాండను అయోధ్యకాండతో కలిపి చదివితే... ఆశ్చర్యపోతాం.. వారి సంస్కారం చూసి... శివధనుర్భంగం కాగానే జనకమహారాజు జలకలశంతో గబగబా వచ్చి..‘‘మొదట ఇచ్చిన మాట ప్రకారం శివధనుర్భంగం చేసినవారికి నా కూతురును ఇస్తానని చె΄్పాను... ఆ పని నీవు విజయవంతంగా చేశావు కాబట్టి ఇదుగో నా కుమార్తె..స్వీకరించు’’... అన్నాడు.దానికి రాముడు.... ‘‘ఒక పిల్ల నాకు భార్య కావాలంటే చూడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అవి మా తండ్రిగారు చూడాలి. మా పురోహితులు, పెద్దలు, బంధువులను సంప్రదించి ఆయన నిర్ణయిస్తారు. దానికి నేను కట్టుబడతాను. అందువల్ల మా తండ్రిగారికి కబురు పంపండి’ అన్నాడు. కబురందుకుని దశరథ మహారాజు వచ్చారు.‘నేను స్వయంవరం ఏర్పాటు చేస్తే భూమండలంలోని రాజులందరూ వచ్చిపోటీపడ్డారు. కానీ మీ రాముడు మాత్రమే శివధనుర్భంగం చేయగలిగాడు. ముందు చెప్పిన షరతు ప్రకారం నా కుమార్తెని ఇస్తున్నా. మీ కోడలిగా స్వీకరించండి’ అని జనకుడు కోరాడు. దశరథుడు వెంటనే ఎగిరి గంతేసి అంగీకరించలేదు. ఆయన అన్నాడు కదా... ‘ఈమె నా ఇంటి కోడలిగా రావడానికి ముందు మన రెండు వంశాలు సరిపోతాయా.. దానికి అర్హతలు మనకున్నాయా..’’ అంటూ మరో గొప్పమాటంటాడు..‘‘రాముడు గొప్పవాడు ... పిల్లనివ్వడం మా అదృష్టం’’ అంటూ వంగి మాట్లాడకండి, జనక మహారాజా! మీరు పిల్లనిస్తేనే కదా మా వంశం నిలబడేది. అప్పుడే కదా రుణవిమోచనం. ఇచ్చేవారు మీరు, పుచ్చుకునేవాడిని నేను. ఇప్పుడు వినయంగా ఉండాల్సింది నేను మహారాజా !’’ అన్నాడు. ఆ తరువాత దశరథ మహారాజు కోరికపై వశిష్ఠుడు, జనకుడి కోరికపై వారి పురోహితుడు వారి వారి వంశాలను వివరించారు. అలా ఒకరి నుంచి మరొకరు క్షుణ్ణంగా తెలుసుకుని నిర్ణయించిన వివాహాలు కాలంలో ఆదర్శంగా నిలిచిపోయాయి. అందుకే గృహస్థాశ్రమానికి రామాయణం ఆదర్శం – అని కంచి మహాస్వామి అంటూండేవారు. – బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
గృహస్థాశ్రమ వైశిష్ట్యం: ‘నీవు నాతో ఏడు అడుగులు నడిచావు'! ఇకపైన..
గృహస్థాశ్రమ ప్రవేశం చేయడానికి యువతీ యువకు లకు ఉండవలసిన సాధారణ లక్షణాలు ఐదింటిని రామాయణం నిర్దేశించింది. వాటిలో వ్యక్తిత్వం ఒకటి. భార్య ప్రవర్తన దగ్గరికి వచ్చేసరికి... ఆమె నీతో కలిసి పుట్టలేదు. నీతో కలిసి పెరగలేదు. వేరొకరి ఇంట పుట్టింది. ఎవరికో కూతురు. ఆమెకూ ఆశలు ఉంటాయి. కోరికలున్నాయి, సంతోషం కావాలి, ఆమె నీ ఇంటి కోడలిగా వచ్చింది. ఆమె సంతోషం గా ఉండేటట్టు చూడవలసిన మొట్టమొదటి కర్తవ్యం మామగారిది. తరువాత భర్తది. రామాయణంలో మామగారి పేరు చెప్పగానే ఆయన ఆ΄్యాయతను తలచుకుని సీతమ్మ పరవశించిపోతుంది. ఇది మానవీయ సంబంధాలకు భారతదేశం చేసిన పట్టాభిషేకం.అందుకే సప్తపది మంత్రాల్లో ఒక విశిష్టమైన విషయాన్ని చెప్పారు. సప్తపది అయితే తప్ప వివాహ తంతు పూర్తి అయినట్టు కాదు.. అంటారు. ఏడడుగులు నడిచిన తరువాత వరుడు – వధువుతో ఒక మాట అంటాడు. ‘నీవు నాతో కలిసి ఏడు అడుగులు నడిచావు కాబట్టి ఇకపైన ‘నీవు నాకు మంచి స్నేహితురాలివికా. నా మనసు ఎరిగి ప్రవర్తించు’ అంటాడు. అంటే – జన్మతః అనుబంధం కాదు. కానీ ఇప్పుడు జీవితంలో మధ్యలో ప్రవేశించింది. ఇక జీవితానికి నిర్ణయాత్మక శక్తి ఆమెయే.స్నేహమంటే మనసు మనసుతో కలవాలి. ఒకరు మరొకరికి అర్థం కావాలి. వారి సంతోషం కోసం... ఇవతలివారి వైపునుంచి కొంత త్యాగం ఉంటుంది. అలాగే వీరి సంతోషం కోసం అవతలివారి వైపునుండి కొంత త్యాగం ఉంటుంది. ఇలా జరిగితేనే దాంపత్యం సంతోషంగా సాగుతుంది.అలా కాక నీకిది సంతోషం కాకపోయినా నాకిది ఇష్టం, నేనిది చేస్తాను.. అన్నప్పడు గృహస్థాశ్రమం అర్థం ఏమిటి? దాంపత్య లక్ష్యం నీరుకారిపోతుంది. అది కాదు... ఒకరి సంతోషానికి మరొకరు కారణం కాగలగాలి. సుమనస్క... అంటారు. అంటే నీవు మంచి మనసుతో ప్రవర్తించు, నేను మంచి మనసుతో ప్రవర్తిస్తా. అలా మనిద్దరం అరమరికలు లేకుండా సఖ్యంగా సంతోషంగా మంచి స్నేహితులుగా ఉందాం. నాకున్న బలహీనతలేమిటో, బలమేమిటో నీవు తెలుసుకోవాలి.అలాగే నీ బలాలు, బలహీనతలు నేను తెలుసుకోవాలి. వాటికి తగిన విధంగా మనం నడుచుకుంటూ, తప్పులు చేస్తే మన్నించుకుని సర్దుకుపోతూ ప్రేమగా ఉండాలి. అంతే తప్ప ఒకరి తప్పులు మరొకరు వెతకడమే ధ్యేయంగా సంసారం చేస్తూ, ఇద్దరి పరువును, కుటుంబ గౌరవాన్ని, వంశ ప్రతిష్ఠను బజారుకీడ్చవద్దు. ఒకరిపట్ల మరొకరు అవగాహనతో, ఆప్యాయతతో, ప్రేమతో సంతోషంగా బతకడానికి ఇంటిని శాంతి స్థానం చేసుకుందాం.బయట ఎన్ని ఒత్తిడులున్నా, ఎన్ని కష్టాలు పడుతున్నా... ఇంటికొచ్చి ఒకరి ముఖం మరొకరం చూసుకోగానే ఉపశమనం పొందగలగాలి. సాహచర్యంలో పరస్పరం శాంతి పొందాలి. ఒకరం తప్పు చేస్తే మరొకరం ప్రేమ తో మందలించుకోగలగాలి. అరమరికలొద్దు. వాటిని అర్థం చేసుకుని ఎవరికి వారం సంస్కరించుకుందాం.’’ అనుకోవాలి.అంటే నిజానికి గృహస్థాశ్రమ ప్రవేశం చేసేటప్పుడు ఇద్దరి మధ్య ఎంత అవగాహనతో ప్రారంభం కావాలో, సుఖమయమైన సంసార జీవితానికి ప్రేమ ఎంత అవసరమో పెద్దలు తెలియపరుస్తారు.– బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
గృహస్థాశ్రమ వైశిష్ట్యం : ఇష్టాయిష్టాలు కలిసాయా!?
గృహస్థాశ్రమ ప్రవేశం చేయడానికి ఒక యువకుడికి, ఒక యువతికి ఉండవలసిన సాధారణ లక్షణాలు ఐదింటిని శ్రీరామాయణం నిర్దేశించింది. వాటిలో మొదటిది శీలం. అంటే స్వభావం. అది పుట్టుకతో వస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్వభావం ఉంటుంది. కొంతమందికి సంగీతం, కొంతమందికి ఆధ్యాత్మిక చింతన, మరికొందరికి చిత్రలేఖనం.... అలా అది వారికి బాగా ఇష్టమైన విషయంగా ఉంటుంది. పెళ్ళి సంబంధం చూసేటప్పుడు ఒకరికి ఇష్టమైన విషయం మరొకరికి కూడా ఇష్టమేనా, అయిష్టం లేదు కదా.. అని చూస్తారు. ఆ పరిశీలన పెద్దలు చేస్తారు.తరువాత వయస్సు. ఇద్దరిలో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అన్నది ఉండదు. రెండు కళ్ళల్లో ఏది మంచిదంటే ఏమని చెప్పగలం? బండి చక్రాలు రెండూ సమన్వయంతో పనిచేయాలి. జీవితం నుండి మొదట ఆయన నిష్క్రమిస్తే.. ఆవిడ పుణ్యకార్యం చేయదు. ఆమె వెళ్ళి΄ోతే...ఆయన తమ కడుపున పుట్టిన కూతురును కూడా కన్యాదానం చేయలేడు. ఆవిడ నిష్క్రమణతోనే ఆయనకు పుణ్యకార్యం చేసే అధికారం కూడా ΄ోతుంది. అందువల్ల ఇద్దరూ సమానమే. ఇద్దరూ కలిసి ఉంటేనే సౌభాగ్యం, సంతోషం. అంటే వాళ్ళ వయసులో ఎవరు పెద్దయితే గొప్ప అన్నదానికన్నా ప్రధానమైనది– ఒకరు నడిపించాలి, మరొకరు నడవాలి–అనేది. ఇక్కడ నడిపించేవారిది ఎక్కువ, నడిచేవారిది తక్కువ అనుకోకూడదు. అన్వయం జాగ్రత్తగా చేసుకోవాలి. వరుడి వయసు పెద్దదయి ఉండాలి–అన్నారు. వయస్సు అంటే కాలం. కాలం అనుభవానికి, అవగాహనకు గుర్తు. ఎవరు ముందు ప్రపంచంలోకి వచ్చారో.. వాళ్ళుఅనుభవాన్ని, అవగాహనను ఎక్కువ సాధిస్తారు. మనం ఎంత చదివాం అన్నదానికన్నా... దానికి అనుభవం ఎంత తోడయింది... అన్నది ప్రధానం. ఒక ఉద్యోగానికి వెడితే అనుభవం ఎంత అన్నదాని ప్రాధాన్యత ఇస్తారు. అలాగే వివాహం విషయంలో.. లోకజ్ఞానం, లోక ప్రవృత్తిని సరిగా అర్థం చేసుకుని భార్యకు అవగాహన కలిగించగలిగిన వాడయి ఉండాలి.అనుభవం అన్నమాటలోనే అంతర్లీనంగా ఉండే విషయం– భార్యపట్ల పరమ ప్రేమతో మెలుగుతూ ఆమెకు రక్షకుడయి ఉండాలన్నది. ఆమె గుణాలు, ప్రతిభ ప్రకాశించడానికి ఆయన అవకాశం కల్పించగలగాలి. ఆమె బలహీనతలు... శారీరకం కావచ్చు, నడవడిరీత్యా కావచ్చు... వాటిని కప్పగలగడంతోపాటూ ఆమె గౌరవమర్యాదలు తగ్గకుండా చూడగలగాలి. సంసారాన్ని సాఫీగా నడపడంలో ఆమెకు ఆయన అనుక్షణం అండగా నిలవాలి. ఒక అమాయకురాలైన కూతురు తెలిసీ తెలియక చేసే తప్పులను తల్లిదండ్రులు ఎలా సరిదిద్దుతూ కాపాడుతుంటారో భార్యను అలా కాపాడుకోగలిగి ఉండాలి. అది భర్త లక్షణం. భార్యది – అంకిత భావం. పిచ్చి ప్రేమ. భర్త ప్రేమకు కారణం ఉంటుంది. భార్య ప్రేమకు కారణం ఉండదు. అనుగమించడం, అంకితభావంలో మసులు కోవడం ఆమె కర్తవ్యం. ఆమెకు ప్రేమను పంచడం, ప్రతి కష్టంలో ఆమెకు రక్షణగా నిలవడం ఆయన బాధ్యత. ఆమెది పాతివ్రత్యం. ఆయనది ఏకపత్నీవ్రతం. అందువల్ల ఎక్కువ తక్కువలను వారి మధ్య ΄ోల్చిచూడకూడదు. కామసంబంధమైన ప్రవత్తి కలిగినా ఆయన దృష్టిలో ఆమె వినా మరొకరికి స్థాన ఉండదు. ఆమెకు ఆయనే సర్వస్వం. ఇది దాంపత్యం. ఇదే గృహస్థాశ్రమం. ఇది సనాతన ధర్మ వైభవం.-చాగంటి కోటేశ్వరరావు -
‘అమ్మా గంగమ్మా! నన్ను రక్షించు!’ నిజానికి ఆమె శక్తి ఏపాటిది అంటే..?
'సర్వసాధారణంగా మనం ఏదయినా ఒక విషయాన్ని పరిశీలించాలనుకుంటే అనేక గ్రంథాలు చూడాల్సి ఉంటుంది. కానీ ప్రత్యక్షంగా అటువంటి అనుబంధం కలిగిన ఒక మహాపురుషుని నోటివెంట వచ్చిన కీర్తన అదే పెద్ద గంగ. శాబ్దిక గంగ. గంగలాగే ముత్తుస్వామి దీక్షితార్ చేసిన కీర్తన .. శాబ్దిక గంగ కూడా ప్రవహించింది. అది పెద్ద పల్లవి, పెద్ద పెద్ద చరణాలతో ఉండదు. సులభంగా ఉంటుంది. గంగే మాం పాహి.. అంటారు ఆయన. ‘ఓ గంగమ్మా! నన్ను రక్షించు’ అని. నిజానికి రక్షించేది ఎవరు? దేవతలు. ఎప్పుడయినా ఏదయినా దుష్కర్మ అనుభవించాల్సి వస్తే, కష్టం తరుముకొస్తుంటే.. దానిని తొలగించగలిగిన వాడు భగవంతుడు. కానీ గంగమ్మ కూడా అలాగే రక్షించగలదు – అన్న నమ్మకంతో దీక్షితార్ వారు ‘అమ్మా గంగమ్మా! నన్ను రక్షించు’ అన్నారు. నిజానికి ఆమె శక్తి ఏపాటిది అంటే..' భాగవతంలో పరీక్షిత్తు ఏడు రోజుల్లో మరణిస్తానని గంగానదీతీరంలో ప్రాయోపవేశం చేసాడు. దాన్ని ఆంధ్రీకరించిన పోతన ఎంత గొప్పగా చెప్పారంటే.. ‘‘అమ్మా! నిను? జూచిన నరు? బొమ్మా యని ముక్తి కడకు? బుత్తు వ?ట కృపన్ లెమ్మా నీ రూపముతో రమ్మా నా కెదుర గంగ! రమ్యతరంగా!" అర్థం.. అమ్మా! అని తన వంక చూస్తే చాలట. పామ్మా.. అని మోక్షానికి పంపించివేస్తుందట. అంతే.. పూజలు మరేమీ అఖ్కర్లేదు.‘ నీ రూపంతో ఒక్కసారి నాకు ఎదురుగా రామ్మా... గంగమ్మా... నిన్ను చూడాలని ఉందమ్మా.. అంటారు. ఆమె శక్తి అంత గొప్పది. శ్రీనాథుడు కాశీఖండంలో ఓ మాటంటారు.. ‘‘గంగానది, గంగానది, గంగానది..’’ అని ఉచ్చరిస్తే చాలు.. అక్కడికి వెళ్ళి స్నానం కూడా చేయనక్కరలేదు. రాత్రి పడుకోబోయేముందో.. పాద్దున లేస్తున్నప్పుడో.. ఆ గంగానది వైభవాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటూ.. ‘గంగానది గంగానది గంగానది’ అని ఎవరు తలచుకుంటారో వారి పాపాలన్నీ ఆమె తీసేస్తుంది.. అంటారు. అదీ ఆమె ఘనత. గంగానదిలో ఉన్నది నీరు కాదు.. ఆ నదికి ఒక అధిష్ఠాన దేవత ఉంది. ఆమె అనుగ్రహిస్తుందన్న నమ్మకం సనాతన ధర్మానిది. దీక్షితార్ వారు‘గంగే మాం పాహి’ అన్నారంటే... ఆయనకు అంత నమ్మకం. మరి ఆ నమ్మకాన్ని కలిగించినది ఎవరు.. ఆయన ఏ కావ్యాలూ పఠించలేదు.. ఎక్కడా చేరి చదువుకోలేదు. గురువుగారయిన చిదంబర యోగి శుశ్రూషలో తెలుసుకున్న విషయాలు అవి. గురువు గారి మీద నమ్మకం అంత గట్టిగా ఉండబట్టే... ఆయన నీవు గంగానదిలో మునిగి చెయ్యిపెట్టి తడుము.. అనగానే మారుమాట మాట్టాడ కుండా వెళ్ళి వెతికితే.. ఆయనకు వీణ లభించింది.. అది ఆయనను వాగ్గేయకారుణ్ణి చేసింది. ఆ నమ్మకంతోనే ఆయన గంగమ్మను కొనియాడుతూ కీర్తన చేస్తూ.. గంగేమాం పాహి! అన్నారు. అది ఆయన నోటివెంట గంగా ప్రవాహంలా.. శాబ్దికగంగగా ప్రవహించింది. ఆయన ఎక్కడా శాస్త్రాలు చదువుకోక పోయినా ఈ కీర్తనలో ఆయన ఎన్నో పౌరాణిక విషయాలను.. అవి కూడా గాఢతతో ఉన్న విషయాలను సులభమైన భాషలో ప్రస్తావించారు. – బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
ప్రజల ఆనందం ఆయన కళ్లలో చూశా.. : చాగంటి కోటేశ్వరరావు
సంగారెడ్డి: చాగంటి కోటేశ్వరరావు మూడు రోజుల పాటు ఇచ్చిన ప్రవచనాలతో సిద్దిపేట గడ్డ పునీతమైందని, ఆధ్యాత్మిక విలువలకు సిద్దిపేట భవిష్యత్తులో నిలయంగా మారనుందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. స్థానిక డిగ్రీ కళాశాల మైదానంలో చాగంటి కోటేశ్వరరావు మూడో రోజు చేసిన ప్రవచనాలను మంత్రి హరీశ్‌రావు సుమారు రెండు గంటల పాటు ఆలకించారు. ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మూడు రోజుల పాటు చాగంటి ఇచ్చిన ప్రవచనాల భావం భావి తరాలకు అందించేలా ప్రయత్నిస్తామని చెప్పారు. ఆధ్యాత్మిక, సామాజిక సేవలో సిద్దిపేట ఎప్పుడూ ముందు ఉంటుందన్నారు. చాగంటి కోటేశ్వరరావుది మధుర స్వరం అని, తన ప్రవచనాల ద్వారా తలరాత మార్చుకునేలా చేస్తున్న దిశా నిర్దేశకుడని పేర్కొన్నారు. చాగంటి అంటే స్నేహాన్ని పెంపొందించుకునే వ్యక్తిత్వం అని, తన మాటలతో కోట్లాది ప్రజల మనస్సు గెలిచి ఇంటిపేరు సార్థకత చేసుకున్నట్టు పేర్కొన్నారు. ప్రవచనం చెప్పడానికి ఒక్క నయా పైసా తీసుకోని కోటేశ్వరరావు కోట్లాది ప్రజల ప్రేమ పొంది. నిజంగా కోటీశ్వరుడు అయ్యాడని కొనియాడారు. ఒక సామాజిక, ఆధ్యాత్మిక ఉద్యమకారుడుగా చాగంటిని మంత్రి అభివర్ణించారు. సీఎం కేసీఆర్ చాగంటి కి గొప్ప అభిమాని అని, అప్పుడప్పుడు చాగంటి ప్రవచనాలు వింటారని చెప్పారు. మళ్లీ అవకాశం ఉంటే సిద్దిపేటకు రావాలని మంత్రి కోరారు. ప్రజల ఆనందం ఆయన కళ్ల్లలో చూశా.. నియోజకవర్గ ప్రజలు ఆనందంగా, సంతోషంగా ఉండాలనే గొప్ప మనస్సు మంత్రి హరీశ్‌రావులో ఉందని, రంగనాయక సాగర్ నీటి రిజర్వాయర్ గురించి కరువు శాశ్వత సెలవు అంటూ వివరిస్తున్న సమయంలో ప్రజల సంతోషం తన కళ్లలో చూసినట్టు చాగంటి కోటేశ్వరరావు పేర్కొన్నారు. అది ఒక సేవ చేయాలనే గుణం ఉన్న వారికి నిదర్శనమని పేర్కొన్నారు. మూడో రోజు మానవీయ విలువలు అంశంపై ఆయన ప్రవచనాలు చెప్పారు. మాట ఒక వజ్రం లాంటిదని, మనిషి విలువ మాటల్లో ఇట్టే తెలిసి పోతుందన్నారు. ఒక మంచి మాట కష్టాన్ని దూరంచేస్తే, అదే మాట ఇతరులకు కష్టం తెస్తుందని పేర్కొన్నారు. మాట్లాడే సమయంలో జాగ్రత్తగా మాట రావాలని సూచించారు. కొన్ని జీవులకు పలుకులు వస్తాయి కానీ బుద్ధి ఉండదని, అదే మనిషికి పలుకులు, బుద్ధి రెండూ ఉంటాయని చెప్పారు. పది మంది కోసం పడిన కష్టం, చేసిన దానం మనిషి వెంట పుణ్యంగా వస్తుందని, సిద్దిపేట అన్నదాతలకు నిలయంగా ఉందని కొనియాడారు. అందరినీ కలుపుకుని ప్రయాణం చేయడం మనిషి ఉన్నత విలువన్నారు. అనంతరం మంత్రి హరీశ్‌రావు చాగంటి కోటేశ్వరరావు దంపతులను ఘనంగా సన్మానించారు. -
మనసుకు హత్తుకునేలా...
గొప్ప వాక్కును కొందరు మహాత్ములు పద్యరూపంలో చెప్పారు. మరి కొందరు గద్యరూపంలో చెప్పారు, ఇంకొందరు గీతం రూపంలో చెప్పారు. పోతన భాగవతాన్ని పద్య, గద్యరూపంలో చెప్పారు. ప్రధానంగా పద్య రూపంలో చెప్పారు. పద్యానికి ఉన్న లక్షణం –అది ఛందోబద్దం. నాలుగుసార్లు చదివితే అది నోటికొచ్చేస్తుంది. జ్ఞాపకంలో ఉండిపోతుంది. జీవితంలో ఏది ప్రధానంగా జ్ఞాపకం ఉంచుకోవాలో, అలా ఉంచుకుని సందర్భాన్నిబట్టి గుర్తు తెచ్చుకుని సానుకూలంగా ఆచరణలో పెట్టుకోగలిగిన వాటిని ఛందోబద్దంగా ఇస్తే అవి మనసుకు హత్తుకుని మనకు అవసరాన్నిబట్టి ప్రయోజనం కలిగిస్తాయి. కానీ అంత జ్ఞాపకం పెట్టుకోవలసిన అవసరం లేని వాటిని గద్యరూపంలో(వచనంగా) అందించాడు పోతన, పద్యం, గద్యం కలిసి రాసినప్పుడు. తెలుగులో పద్యరూపంలో చెప్పినట్టుగానే, సంస్కృతంలో శ్లోకరూపంలో చెప్పారు. ఒక పద్యాన్ని చదవడంకన్నా, ఒక శ్లోకాన్ని చదవడంకన్నా, మేము వాక్యరూపంలో ఉన్న వచనాన్ని(గద్యాన్ని) చదువుకుని ప్రయోజనం పొందుతామని ఇష్టపడేవారికి గద్యంలో కూడా అందుబాటులో ఉంచారు. మరికొందరు చాలా తేలికగా అవతలివారికి బోధ చేయడానికి గీతం రూపంలో అందించారు. గీతం అంటే పాట. పాట మనసును రంజింప చేస్తుంది. సహజంగా పుట్టుకచేత క్రౌర్యం ఉన్నవి కూడా సంగీతం వినబడేటప్పటికి అవి వాటి క్రూరత్వాన్ని ఆ కాసేపు పక్కనబెట్టేస్తాయి. అలాగే గాఢమైన అజ్ఞానంతో ఏమీ తెలియనివారు కూడా సంగీతంతో కూడిన గీతం వినేటప్పటికి గొప్ప శాంతిని పొందుతారు. పశువులు కావచ్చు, పసిబిడ్డలు కావచ్చు .. పాటవినేటప్పటికి ఒక తన్మయావస్థకు లోనుకావడం జరుగుతుంది. ఏడుస్తున్న వాళ్ళు కూడా ఆ కాసేపు ఏడుపు ఆపేస్తారు. మనసు శాంతిని పొందుతుంది. సమాజ హితం కోసం పద్యరూపంలోగానీ, గద్య, గీత రూపాల్లో కానీ ఎవరు ఏమీ ఆశించకుండా వాక్కులుగా వెచ్చించారో వారు శాశ్వత్వాన్ని పొందారు. ‘ఇమ్మనుజేశ్వరాధములకిచ్చి పురంబులు వాహనంబులున్/ సొమ్ములు? గొన్ని పుచ్చుకొని సొక్కి శరీరము? బాసి కాలుచే/ సమ్మెట పోటులం బడక సమ్మతి శ్రీహరి కిచ్చి చెప్పె నీ/ బమ్మెర పోతరాజొకడు భాగవతంబు జగద్ధితంబుగన్.’ అంటాడు పోతన. నేను సమాజహితాన్ని కోరి పలుకుతున్నాను తప్ప నేనేమీ ఆశించడంలేదన్నాడు.. అదే శాశ్వతమైనది. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
అలా చేయవచ్చా... అది అవమానం కదూ !!!
మన దేశం కష్టాల్లో ఉన్నప్పుడు సనాతన ధర్మానికి పూర్వ వైభవం తీసుకురావడంలో ఎనలేని కృషి చేసిన సమర్ధ రామదాసు గారు చెప్పిన మరో సూత్రం – జ్ఞాన సముపార్జన, ప్రచారం. ఇంట్లో మంచి మంచి చిత్తరువులు, మంచి పరుపులు, మంచి మంచాలు, కుర్చీలు, ఇతర అలంకార సామాగ్రి ఎలా ఉంచుకుంటామో... ప్రతి ఇంటా కూడా చదవదగిన పుస్తకాలు కొన్ని ఉండి తీరాలి. చదివిన పుస్తకాల మీద చర్చ కూడా జరుగుతుండాలి. ఇంటి పెద్ద ఒక మంచి పుస్తకం చదివి దానిలో తనకు నచ్చిన అంశాలు ఏ పేజీల్లో ఉన్నాయో ఆ పుస్తకం ముందుండే తెల్లకాగితంపై రాసి ఉంచాలి. పిల్లలు ఆ పుస్తకం తెరిచినప్పుడల్లా వాటిని చదివి పుస్తకంపట్ల ఆసక్తి పెంచుకుంటారు. చదివిన పుస్తకంపై కుటుంబ సభ్యులతో చర్చిస్తూండాలి. అప్పడు తీరికసమయాల్లో వాటిని చదవడానికి అందరికీ ప్రేరణ కలుగుతుంది. నిజానికి ఇంటి సంపద వృద్ధిలోకి రావాలన్నా, ఇంటి గౌరవం ఆచంద్రార్కం కొనసాగాలన్నా.. ఆ ఇంటి యజమాని ఎన్ని పుస్తకాలు చదివి, ఎన్ని పుస్తకాలగురించి అలా రాసి భద్రపరిచి ఉంచాడన్నది ముఖ్యం. అదే వారికి నిజమైన ఆస్తి. అదే తరువాత తరాలవారిలో స్ఫూర్తి రగిలిస్తుంది, వారినీ ఉత్తములుగా తీర్చిదిద్దుతుంది. పుస్తకాలు కొనడం పెద్ద కష్టమేమీ కాదు, పుస్తకాలు భద్రపరచడం భారం కూడా కాదు. ‘మా ఇంట్లో పుస్తకాలు చదివేవారు లేరండీ.. అని ఇచ్చేయడం ఆ కుటుంబానికి చాలా అవమానకరమైన విషయం. చదివే వాళ్ళు లేకపోవడమేమిటి! చదివేవాళ్ళు ఉండాలి. ప్రతివాళ్లూ పుస్తకాలు ఒక నియమంగా చదవాలి. ప్రతిరోజూ మనం ఎదుర్కొనే ఎన్నో సమస్యలనుంచి బయటపడడానికి అవి ఎంతగానో ఉపయోగ పడతాయి. అవి మనకు మనశ్శాంతినిస్తాయి. ఒక్క ఆధ్యాత్మిక పుస్తకాలే కాదు... మన జీవితాలను, మన పిల్లల జీవితాలను ఉద్ధరించడానికి ఇది పనికొస్తుంది–అని అనుకున్న ప్రతి పుస్తకం ఆ ఇంట తప్పనిసరిగా ఉండాలి. పుస్తకాలు లేని జ్ఞానాన్ని ఇస్తాయి, ఉన్న జ్ఞానాన్ని అనేక రెట్లు పెంచుతాయి. ఆ జ్ఞానాన్ని పదిమందితో పంచుకున్నప్పుడు అది మరింత పెరుగుతుందే కానీ తరిగేది కూడా కాదు. అందరూ వేదికలెక్కి ఉపన్యాసాలు ఇవ్వక్కర్లేదు. కానీ కుటుంబ సభ్యులతో, ఇంటికొచ్చిన అతిథులతో, ఆత్మీయులతో జరిపే సమావేశాల్లో, విందులు, వినోదాల్లో కలిసిన సన్నిహితులతో వారు చదివిన మంచి పుస్తకాలపై చర్చ పెట్టాలి. అలాగే పిల్లలున్న ఇంటికి వెళ్ళినప్పుడు, ఇతరత్రా శుభకార్యాల్లో, దూరప్రయాణాలు వెళ్ళేవారికి మంచి మంచి పుస్తకాలు బహూకరించడం అలవాటు చేసుకోవాలి. వీలయితే ఆ పుస్తకాల ప్రాధాన్యతను, వాటిని ఎందుకు బహూకరిస్తున్నది వాటిపై రాసి సంతకం చేసి ఇస్తే... వారితో మీ బంధం మరింత గట్టిపడుతుంది. మీపట్ల వారికి, వారి కుటుంబానికి ఎనలేని గౌరవం ఏర్పడుతుంది. వారు కూడా వాటిని చదివి ఎంత ప్రభావితమవుతారో, ఎంత శాంతి పొందుతారో మాటల్లో చెప్పలేం. సమర్ధ రామదాసుగారి లాగా గురుస్థానాల్లో ఉన్న వారు ఇటువంటి విషయాలను ప్రబోధం చేయాలి, ప్రచారం చేయాలి... సమాజ అభ్యున్నతికి ఇది అవసరం. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
గురువాణి: పాతకొత్తల గొడవ మనకెందుకు!!!
అభ్యుదయం అంటే సమాజానికి మేలు చేయడం. మనుషులలో మంచి గుణాలు ఏర్పడితే అది అభ్యుదయానికి కారణమవుతుంది. మేలు జరగడానికి పాతదా కొత్తదా అని కాదు... పాతదంతా మంచీ కాదు, కొత్తదంతా చెడూ కాదు. అలాగే పాతదంతా చెడూ కాదు, కొత్తవన్ని మంచివీ కావు. రామాయణ భారతాల్లో అన్నీ ఉన్నాయండీ అని కొత్త వాఙ్మయం దేనికండీ అనడం మంచిదికాదు. కొత్తగా వచ్చిన గ్రంథాలలో ఎన్నో మంచి విషయాలుంటాయి. ‘‘పురాణమిత్యేవ న సాధు సర్వం/ నా చాపి కావ్యం నవమిత్యవద్యమ్/ సంతః పరీక్ష్యాన్యతరత్ భజంతే/ మూఢఃపరప్రత్యయనేబుద్ధిః’’ అంటారు మాళవికాగ్నిమిత్రంలో మహాకవి కాళిదాసు. అంటే పాతకాలానికి సంబంధించినది కాబట్టి ఇందులో ఏదీ పనికొచ్చేదీ, మంచిదీ ఉండదు – అనకూడదు. పాతవన్నీ చెడ్డవని ఎలా సిద్ధాంతీకరిస్తారు! ఈ రచన ఇప్పుడు కొత్తగా వచ్చింది, వీటిలో మన మేలు కోరేవి ఏం ఉంటాయి, వీటిని మనం ఆదరించక్కరలేదు... అని చెప్పడమూ కుదరదు. వివేకవంతులు ఏం చేస్తారంటే... అందులో ఏదయినా మంచి చెప్పారా.. అని పరిశీలిస్తారు. జీవితాలకు అభ్యున్నతిని కల్పించే మాటలు ఏవయినా వాటిలో ఉన్నాయా... అని చూస్తారు. కానీ ఎవరో ఏదో చెప్పారని తన స్వంత బుద్ధిని ఉపయోగించకుండా, మంచీ చెడూ విచారణ చెయ్యకుండా వాటినే అనుకరిస్తూ, అనుసరిస్తూ నిర్ణయాలు తీసుకోవడం మూఢుల లక్షణం. ..అంటున్నాడు కాళిదాసు. మనకు పనికొచ్చే విషయాలు ఎన్ని ప్రతిపాదింపబడ్డాయి.. అన్నదానిని పరిశీలించడం నిజమైన అభ్యుదయం. దాని విషయానికొస్తే అది పాతదా, కొత్తదా అని కాదు ఆలోచించాల్సింది, అందులో మంచి ఏముంది, ఇందులో మంచి ఏముంది? అని అంతకన్నా దాటి ఇక పరిశీలన చేయవలసిన అవసరం నాబోటివాడికి అక్కర లేదు. నా వరకు నాకు కావలసినది – అది ఎవరు రాసింది అయినా పాత కాలపుదయినా, కొత్తకాలపుదయినా, ఇప్పుడు సమాజంలో ఉన్న వ్యక్తులు రాసినది అయినా, పాతకాలంలో రుషుల వాఙ్మయం అయినా... అందులో అభ్యుదయానికి చెప్పబడిన మంచి విషయాలు ఏమున్నాయి? అనే. వాటిని స్వీకరించి, జీర్ణం చేసుకుని బాగుపడడానికి ప్రయత్నం చేయడం వరకే. పాతకాలంలో కూడా ఆదరణీయం కానివి, అంగీకారయోగ్యం కానివి, సమాజానికి ఉపయుక్తం కానివి ఎన్నో ఉండవచ్చు. అంతమాత్రం చేత పాతకాలంలో ఉన్న వాఙ్మయంలో పనికొచ్చేవి ఏవీ లేవు.. అని చెప్పడం సాధ్యం కాదు. ‘పురాణమిత్యేవ న సాధు సర్వం ...’ ఇది... ఆకాలంలో కాళిదాసు చెప్పిన మాట. ఈ మాట ఇప్పటికి పనికి రాదా!!! ఇది నేర్చుకుంటే అభ్యుదయం కాదా!!! ఇది నేర్చుకున్నవాడి జీవితం ... చేత దీపం పట్టుకుని నడుస్తున్న వాడిలా ఉండదా? పువ్వు పువ్వు లోంచి తేనెబొట్టు స్వీకరించిన తేనెటీగకాడా !!! అందువల్ల మంచి విషయాలు స్వీకరించడం ప్రధానం కావాలి. అవి ప్రాచీన వాఙ్మయం నుంచి కావచ్చు, కొత్తగా వెలువడుతున్న గ్రంథాలనుంచి కావచ్చు. వ్యక్తులందరూ అలా స్వీకరించాలి, మంచి గుణాలు అలవర్చుకోవాలి, ఆ వ్యక్తుల సమూహమే సమాజ అభ్యుదయానికి కారణమవుతుంది. ఎవరో ఏదో చెప్పారని తన స్వంత బుద్ధిని ఉపయోగించకుండా, మంచీ చెడూ విచారణ చెయ్యకుండా వాటినే అనుకరిస్తూ, అనుసరిస్తూ నిర్ణయాలు తీసుకోవడం మూఢుల లక్షణం అంటున్నాడు కాళిదాసు. -
ఓ చెంచాడు అయినా లేకపోతే...
కష్టం వచ్చినప్పుడు భగవంతుడు మన పక్షాన లేడు.. అనుకుంటాం. దేముడు చల్లగా చూసాడు–అని సుఖం కలిగినప్పుడు అనుకుంటుంటాం. కానీ భగవంతుడికి ఏ పక్షపాతమూ లేదు, ఆయన ఎవరిపక్షాన ఉండడు. ‘‘దృషద్విచిత్రతల్పయో ర్భుజంగమౌక్తికస్రజో/ ర్గరిష్ఠరత్న లోష్టయోః సహృద్విపక్ష పక్షయో:/ తృణారవింద చక్షుషోః ప్రజామహీ మహేంద్రయోః / సమప్రవత్తికః కదా సదాశివం భజామ్యహమ్.’’ కటిక నేలనుంచీ, హంసతూలికా తల్పం వరకూ, మహారాజు నుండి సామాన్యుడి వరకు, మిత్రపక్షం అనీ, శత్రుపక్షం అనీ తేడా లేకుండా అన్నిటినీ సమాన దృష్టితో చూసే ఆ సదాశివుడికి నమస్కారం.. అంటాం. వివేకానందుడు చెప్పినట్టు – ఈ ప్రపంచమంతా నీ పూజా మందిరంగా చూసే శక్తి రావాలి. భగవంతుడిని ఏమార్చి ఆయనను మన పక్షానికి తీసుకురావడం ఎప్పటికీ సాధ్యమయ్యేది కాదు. ఆయన ప్రీతి పొందేది మన నడవడికనుబట్టే. మన నడవడి ధర్మాన్ని ఆశ్రయించి ఉండాలి. మనం సముద్రమంత ప్రయత్నం చేయవచ్చుగాక, కానీ ఓ చెంచాడంత భగవదనుగ్రహం ఉండకపోతే కార్యాలు సఫలీకృతం కావు. ‘ఆచార్య ప్రభవో ధర్మః. ధర్మం అనేది కేవలం పుస్తకాలలో చదువుకుంటేనో, అన్నీ నాకు తెలుసనుకుంటేనో అన్వయం కాదు. నీవు ఎంత అనుష్ఠించావో అదే ధర్మం. ధర్మాత్ముడు.. అనిపించుకోవాలంటే నీ నడవడిక మొత్తం ధర్మబద్ధంగా ఉండాలి. ఆచరించినది ధర్మం. ఆచరించనిది ఎప్పటికీ ధర్మం కాదు. అమెరికాకు అధ్యక్షులుగా చేసినవారిలో చిరస్మరణీయుడైన అబ్రహాం లింకన్ ఒక మాటన్నారు...‘‘దేముడు నీ పక్షాన ఉన్నాడా అని ఆలోచించడం కాదు, దేముడి మార్గంలో నీవు ఉన్నావా !’’ అని చూసుకొమ్మన్నారు. ఆయన బాల్యంనుంచీ అలానే బతికారు. నిరుపేద. చిన్నతనంలో ఒక దుకాణంలో పనిచేస్తుండేవాడు.. ఒక వినియోగదారుడి దగ్గర తీసుకోవాల్సిన దానికంటే ఎక్కువ సొమ్ము తీసుకున్నారు. ఆ తరువాత లెక్కలు చూసుకుంటుంటే తెలిసింది. దుకాణం మూసేసి అర్థరాత్రి వినియోగదారుడి ఇల్లు వెతుక్కుంటూ పోయి తాను ఎక్కువగా తీసుకొన్న మొత్తాన్ని ఇచ్చేసి మరీ వచ్చాడు. అదీ అనుష్ఠానం లో ధర్మం అంటే... ఈ పరిణతి ఆయన ఎంతసేపు పూజ చేసాడు, ఎంత సేపు ప్రార్థన చేసాడు.. అన్న దానినిబట్టి రాలేదు... చిన్నతనం నుంచి అదే నిబద్ధతతో బతకబట్టి వచ్చింది. మీకు ధర్మంపట్ల అనురక్తి ఉండి ఆచరించినదేదో అదే ధర్మం. అదే సదాచారం. ధర్మంపట్ల అనురక్తి లేకుండా స్వప్రయోజనం చూసుకుంటే అది దురాచారం. ఎక్కడ సదాచారం ఉన్నదో అక్కడ భగవదనుగ్రహం ఉండి తీరుతుంది. ఎక్కడ సదాచారం లేదో అక్కడ దేముని కృప ఎలా సాధ్యం! నీకు ఆకలేస్తే నువ్వే తినాలి. నీకు నిద్రవస్తే నీవే నిద్రపోవాలి. అలాగే నీ నడవడికలో దోషాలను నీవే దిద్దుకోవాలి. సదాచారం పెరుగుతూ ఉండాలి, దురాచారం తగ్గుతూ పోవాలి. ధర్మం చెప్పేది కూడా... నీవు నన్ను కాపాడు.. నేను నీ పక్షాన ఉండి నిన్ను కాపాడతా...అనే. -
ఆగు! జవాబు చెప్పి ముందుకు కదులు!!!
ఏదయినా ఒక ముఖ్యమైన పని చేద్దామనుకున్నప్పుడు మనలోంచి అనేక భావాలు ఒక్కసారి బయటికి వస్తాయి. ఎలా అంటే...మండుతున్న కట్టెను నేలకేసి కొడితే చెలరేగే నిప్పురవ్వల్లాగా అవి లేస్తాయి. అప్పుడు మనలో ఘర్షణ మొదలవుతుంది. ఈ ఘర్షణ మీలో ఉన్న మిమ్మల్ని ఐదు ప్రశ్నలతో నిలదీస్తుందనీ, వాటిలో ఏది మీరు ఎంచుకుంటారో దాన్ని బట్టి మీ స్వభావాన్ని సమాజం అంచనా కడుతుంది. మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త అబ్దుల్ కలాం కూడా తన స్వీయరచన ‘ఇండామిటబుల్ స్పిరిట్’లో ఇదే చెప్పారు. మీరేదయినా పని సంకల్పించుకుని దాని అమలుపై మీమాంసలో ఉన్నప్పుడు మొదట మీలోని పిరికితనం ఒక ప్రశ్న వేస్తుంది..ఇది నీకు ప్రమాదకరం కాదు కదా! అని... అంటే ‘నాకు ఏ ఇబ్బందీ లేదు, నా క్షేమానికి భంగపాటు కలగదు’ అని జవాబు ఇచ్చుకుని ముందుకు సాగారనుకోండి. ఎప్పుడూ తన క్షేమం గురించే చూసుకొనేవాడు...ఇతరుల క్షేమం గురించి పట్టించుకోడని సమాజం అర్థం చేసుకుంటుంది. మీలో ఉన్న దురాశ మిమ్మల్ని ఆపి ‘ఈ పని చేస్తే మనకేమిటి లాభం? మనకేమయినా మిగులుతుందా?’ అంటుంది. ‘నాకు బాగా కలిసొస్తుంది. బాగా వెనకేసుకోవచ్చు కూడా’ అని జవాబిచ్చారనుకోండి. ఇంత ఆశబోతు, ప్రతిదానికీ నాకేమిటని చూసుకునేవాడివల్ల నలుగురికీ ఉపయోగం లేకపోయినా వీడితో జాగ్రత్తగా ఉండాలనుకుంటుంది సమాజం. వెంటనే గర్వం మీ దారికి అడ్డు తగిలి ‘క్షేమం, లాభంసంగతి దేముడెరుగు. కనీసం నీకు పేరయినా వస్తుందా.. నిన్ను గురించి నలుగురు మంచిగా చెప్పుకుంటారా?’ అని అడుగుతుంది. ఎంతసేపూ పేరుకోసం ఆరాటపడతాడు తప్ప మిగిలినవి పట్టించుకోడు... అని సమాజం అనుకుని మిమ్మల్ని దూరంగా ఉంచుతుంది. దాటుకుని పోబోతున్న మీకు మీ ఆకాంక్ష అడ్డుతగులుతుంది. ‘‘అవన్నీ వస్తాయో రావో నాకు తెలియదు. కనీసం సుఖపడతావా.. నీ శరీరానికికానీ, మనసుకు కానీ సుఖం లభిస్తుందా?’ అంటుంది. ‘తనవరకు సుఖంగా ఉంటేచాలనుకుంటాడు.. మిగతావారు ఎటుబోయినా నాకేమిటి అనుకుంటాడు.’ అనుకుని ఇరుగూ పొరుగూ కూడా ఎవరూ దగ్గరకు రానీయరు. చివరగా తనవంతుకోసం వేచి చూస్తూ ఉన్న అంతరాత్మ అప్పుడు కాస్తగట్టిగానే అడుగుతుంది ‘‘నీవు చేస్తున్న పని సరైనదేనా, ధర్మమేనా..ఆలోచించు’’ అంటుంది. ‘ఎందుకు ఆ పని చేస్తావు, తప్పుకదా, నీకు నాలుగు డబ్బులు మిగలొచ్చు, నీకు సుఖమివ్వవచ్చు, పేరు కూడా రావచ్చేమో.. కానీ దానివల్ల ఎంతమందికి నష్టం, ఎందరికి కడుపుకోత..? ఆలోచించు, తొందరపడకు’ అని పదేపదే హెచ్చరిస్తుంది. నీవు జీవితంలో ఎవ్వరికీ జవాబుదారీ కాకపోవచ్చు. కానీ నీ అంతరాత్మను దాటుకుని, దాని మాటలు ఖాతరు చేయకుండా పోయిననాడు... అపరాధభావంతో నలుగురిలో ఉన్నా ఒంటరివైపోతావు...అది ఎప్పుడూ శాపమే. అంతరాత్మ ప్రబోధం విని నడుచుకున్న నాడు, నీవు ముందుంటావు, సమాజం నీ వెనుక నడుస్తుంటుంది, నిన్ను అనుసరిస్తూ, నీకు బాసటగా కూడా. -
సీఎం జగన్‌ను కలిసిన ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు
-
ఆ రుతువు వచ్చేవరకూ ఆగాలి... తప్పదు
మామిడి కాయలంటే ఇష్టం. మొక్క తెచ్చావు. నీళ్ళుపోసావు... ఇంకా కాయలు రాలేదని రోజూ బిందెలకు బిందెలు నీళ్ళుపోస్తే కాయలు రావు. మొక్క చెట్టు కావాలి... అయినా వసంత రుతువుకూడా రావాలి.. అప్పుడే పూత పూస్తుంది, అది పిందెగా మారుతుంది. ఆ పిదప కొంత కాలానికి కాయ... ఆ తరువాతే పండు... అప్పటిదాకా ఓర్పు ఉండాలి. వేచి చూడాలి. ఎప్పుడో కాయ కాస్తుందని ఇప్పటినుంచే నీళ్ళెందుకు పోయడం.. అని మానేస్తే మొక్క బతకదు... అంటే ఓర్పుతోపాటు నీ ప్రయత్నం కూడా పూర్తిగా ఉండాలి. ప్రతి దానికీ ఒక నియమం, ఒక సమయం ఉంటాయి. అప్పటిదాకా వేచి చూడగల ఓర్పు ఉండడంతో పాటూ ప్రయత్నం కూడా పూర్తిగా ఉండాలి. వెనకటికి ఓ రాజుపై శత్రువులు విరుచుకు పడ్డారు. రాజు ఓడిపోయాడు. నిరాశతో రాజు అన్నీ వదిలేసుకొని ఒంటరిగా వెళ్ళిపోతుంటే... సైనికులు, ఆంతరంగికులు అందరూ నచ్చచెప్పారు. మనం కొంతకాలం ఆగుదాం.. మళ్ళీ శత్రువుపై యుద్ధం ప్రకటిద్దాం.. అని చెప్పినా వినకుండా అడవుల్లోకి వెళ్ళిపోయాడు. ఓరోజున రాజు ఒక చెట్టుకింద కూర్చుని... దగ్గర్లోనే ఒక సాలెపురుగు గూడు అల్లడానికి నానా తంటాలు పడడాన్ని ఆసక్తిగా గమనించాడు.. అది గూడు అల్లే క్రమంలో చాలాసార్లు పోగు తెగి కిందపడిపోతున్నది... పలుమార్లు అలా చేసిన తరువాత చివరికి అది గూడు పూర్తిగా అల్లి మధ్యలో సౌకర్యవంతంగా కూర్చుని గూడుకు చిక్కుకున్న పురుగులను హాయిగా తింటున్నది. ఇది చూసిన రాజుకు జ్ఞానోదయమయింది. వెంటనే వెళ్ళి తన పరివారాన్ని చేరదీసి సర్వసన్నద్ధం అయ్యేవరకు ఆగి... ఓ రోజున యుద్ధం ప్రకటించాడు. శత్రురాజును సునాయాసంగా ఓడించి తిరిగి తన రాజ్యాన్ని పొందాడు. ప్రతిదానికీ ఒక నియమం ఉంటుంది. ఆ నియమాన్ని అర్థం చేసుకుని ప్రయత్నం ఎక్కడా ఆపకుండా పూర్తిచేయాలి, ఫలితం వచ్చేవరకూ ఓర్పుగా వేచి చూడాలి. తొలితరానికి చెందిన ప్రఖ్యాత భారతీయ శాస్త్రవేత్తల్లో ఒకరైన సర్ జగదీశ్ చంద్రబోస్ ఆంగ్లేయ ప్రొఫెసర్లతో సమానమైన అర్హతలు, ప్రతిభాపాటవాలు కలిగినా, వారితో సమానంగా తనకు వేతనం ఇవ్వనందుకు నిరసనగా జీతం ముట్టుకోకుండా తన వృత్తిని మూడేళ్ళపాటు ఆర్థికంగా ఇబ్బందులు పడుతూనే అదే అంకితభావంతో కొనసాగిస్తే... చివరకు అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం దిగొచ్చి ఆయన్ని సన్మానించి పెంచిన జీతం పాత బకాయిలతో సహా చెల్లించింది. కార్యసాధనలో ఓర్పు ఎంత ముఖ్యమో... ప్రయత్నాలను చివరిదాకా కొనసాగించడం కూడా అంతే ముఖ్యం. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
గురువాణి: ఒక్క చెట్టు పెట్టు... పుణ్యం మూటకట్టు
చెట్టు అనేది ఎంత గొప్పది... ఒక మొక్క నాటడం, దానికి నీళ్ళు పోయడం, చెట్టయ్యేదాకా దానిని సంరక్షించడం... అది చెట్టుగా మారిననాడు అది నాటినవాడికి, పెంచినవాడికి, సంరక్షించినవాడికి ఎంత ఫలితం లభిస్తుందనే దానికి మన శాస్త్రాలు ఏమని చెబుతున్నాయంటే... లోకంలో శరీరం కలిగిన ప్రాణులు ఎన్నో ఉన్నాయి. మనుష్యులే కానక్కరలేదు. శరీరం ఉన్న ప్రతి ప్రాణికీ దాని పోషణకు ఆహారం కావాలి. అది సమయానికి పడకపోతే ఆకలికి విలవిల్లాడిపోతాయి. ఆకలి గొప్ప బాధ.. క్షుత్ అగ్ని.. అది అగ్నిహోత్రం, మంట. ఆ మంట తట్టుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. ఆకలేస్తే మొదట ఏది పోతుంది... ధర్మం. ఆకలేసిన వాడికి ధర్మ విచక్షణ ఉండదు. అయ్యా! నా ప్రాణం పోయినా సరే ధర్మాన్ని కాపాడతాను, ఏదీ దొంగిలించను అనడు కదా ! చివరకు తెగించి దొంగతనానికి పాల్పడి అయినా ఆ బాధ తీర్చుకుంటాడు. ఆ మంట అటువంటిది. దహించి వేస్తుంది. అందుకే ఆకలి అన్నది ఎక్కడా ఉండడానికి వీల్లేదు. మనుష్యులకే కాదు, సమస్త ప్రాణులకూ ఆహారం కావాలి. పక్షులు, జంతువులు, క్రిమికీటకాదులు... ఆకలితో ఉన్న మనుష్యులకు వారి ఆర్తిని చూసి జాలిపడి ఎవరయినా ఆహారమిస్తారు.. వీటి ఆకలి ఎవరు తీరుస్తారు? చెట్టు. దానికి కాండం ఉంటుంది, ఆకులు ఉంటాయి, పూలు ఉంటాయి, కాయలు, పళ్ళను కూడా ఇస్తుంది. దానిని ఆశ్రయించి మనుష్యులే కాదు, క్రిమికీటకాదులు, జంతువులు, పక్షులు తమ ఆకలిని తీర్చుకుంటాయి. దాని బెరడులో చేరిన వందలాది క్రిములు వాటి ఆకలిని అక్కడ తీర్చుకొంటాయి. జంతువులు ఆకులు తింటాయి. పక్షులు గూళ్ళు కట్టుకోవడమే కాక కాయలు, పండ్లు తింటాయి. కొన్ని చిగుళ్ళను తింటాయి. ఎన్నో రెక్కల పురుగులు దాని పూలమీద వాలి ఆకలి తీర్చుకుంటాయి. రాలిన కొమ్మలు, ఆకులు, పూలు, పండ్లు భూమిలో కలిసి అక్కడున్న ఎన్నో పురుగులకు ఆహారమవుతాయి. ఒక చెట్టు... ఒక్క చెట్టే ఇన్నింటికి జీవాధారమవుతున్నది. మొక్కనాటిన వాడు, చెట్టుగా చేసినవాడు తరువాత కాలంలో శరీరాన్ని వదిలివేయవచ్చు గాక. కానీ అసంఖ్యాకమైన జీవులకు కేవలం ఆకలి తీర్చడమే కాక, వాటి ప్రాణాలను కూడా నిలబెట్టాడు, ఎన్నో జీవులు సేదదీరడానికి కారణమయ్యాడు. చెట్టు ప్రాణవాయువు వదులుతుంది. ప్రకృతి సమతౌల్యతను కాపాడుతుంది. అది మనుష్యులతోపాటూ అనేక జీవులకు ప్రాణాధారంగా నిలబడుతుంది. అటువంటి మంచి పనికి కారణమయ్యాడు కనుక వాడికి పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది. వారి శరీరం పతనమయిన తరువాత దేవతలు స్వాగతం పలికి వారిని ఉన్నత లోకాలకు తీసుకువెడతారట. అంతేకాదు ఎన్నో ప్రాణులకు కొన్ని సంవత్సరాల పాటు ఆకలిబాధ తీర్చాడు కనుక వారిని మేం సేవిస్తాం అని దేవతలు అంటారట. చెట్లను పెంచే పనిని ప్రోత్సహించడానికి, మనుషులు తమకే కాకుండా సమస్త జీవకోటిపట్ల బాధ్యతాయుతంగా మెలగడానికి, ప్రకృతి సమతుల్యత కాపాడేవిధంగా పర్యావరణాన్ని పరిరక్షించడానికి మన పూర్వీకులు‘‘యావంతి ఖాసంతి ఫలాని వృక్షాత్ క్షుద్వహ్ని దగ్ధా ...’’ అంటూ ఒక శ్లోకం ద్వారా చేసిన ధర్మబోధ ఇది. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
గురువాణి: అమ్మ ప్రేమకన్నా...
పసిపిల్లలకు లోకంలో తల్లికన్నా ప్రియమైనది ఏదీ ఉండదు. అమ్మతో మాట్లాడడం, అమ్మని ముట్టుకోవడం, అమ్మతో ఆడుకోవడం, అమ్మ పాట వినడం, అమ్మ స్పర్శ... వీటికన్నా ప్రియమైనవి లోకంలో ఉండవు. సమస్త జీవకోటినీ సష్టించే పరబ్రహ్మ స్వరూపం అమ్మే. ఈ లోకంలోకి రాగానే పాలిచ్చి, ఆహారమిచ్చి పోషించే మొట్టమొదటి విష్ణు స్వరూపం అమ్మయే. అన్ని ప్రాణులను తన వెచ్చటి స్పర్శతో నిద్రపుచ్చే ప్రేమైకమూర్తి అయిన హర స్వరూపం కూడా అమ్మయే. అందుకే అమ్మ సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త సమాహార స్వరూపం. అటువంటి అమ్మకన్నా ప్రియమైనది ప్రపంచంలో మరేముంటుంది? అయితే ఒకటి గమనించాలి. అమ్మకడుపులోంచి వచ్చిన వాడు మళ్లీ అమ్మ కడుపులోకి పోలేడు. కానీ ఈ దేశం మట్టిలో పుట్టి... మళ్ళీ చిట్ట చివర ఈదేశం మట్టిలో కలిసిపోతాం. అందువల్ల జన్మభూమి తల్లికన్నా గొప్పది. తల్లికన్నా ప్రియమైనది. అందునా భారత దేశం. ఇంత గొప్పదేశంలో పుట్టినవాళ్ళం...భరతమాత బిడ్డలం. ఇది సామాన్యమైన భూమినా..!!! ఇది వేదభూమి, ఇది కర్మ భూమి(వేద సంబంధమైన క్రతువులు జరుపుకోవడానికి అర్హమైన భూమి)... ఎన్ని పుణ్యనదులు ప్రవహిస్తున్నాయో ఇక్కడ ఈ భావనలతో ఉప్పొంగిన ఓ మహాకవి పరవశించిపోయి ........ జయ జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్య ధాత్రి జయ జయ జయ శత సహస్ర నర నారీ హృదయ నేత్రి జయ జయ సశ్యామల సు శ్యామచలా చేలాంచల జయ వసంత కుసుమలతా చరిత లలిత చూర్ణ కుంతల జయ మదీయ హృదయాశ్రయ లాక్షారుణ పద యుగళా జయ దిశాంత గత శకుంత దివ్యగాన పరితోషణ జయ గాయక వైతాళిక గళ విశాల పద విహరణ జయ మదీయ మధుర గేయ చుంబిత సుందర చరణ.... ... ఇలా అల్లి ఓ పాట రాసేసాడు. ఆయనే దేవులపల్లి కృష్ణ శాస్త్రి.. ఈ అమ్మకు పుట్టిన బిడ్డలు అనంతం. వారందరికీ అమ్మ పోలికలే వచ్చాయట... ఏమిటా పోలికలు... త్యాగం, పదిమందికీ పెట్టడం, పరోపకారం, కృతజ్ఞత, ఆతిథ్యం...ఉపకారం చేసినవాడికి ఉపకారం చేయడమే కాదు, అపకారికి కూడా ఉపకారం చేయగల విశాల హృదయం... వీటన్నింటికీ మించి ఓర్పు... ఓర్పును మించిన ధర్మం, ఓర్పును మించిన సత్యం, ఓర్పును మించిన యజ్ఞం ఉండవు... అంత గొప్ప ఓర్పు కలిగి ఉండడం, అరిషడ్వర్గాలను జయించడం, తనలో ఉన్న పరబ్రహ్మాన్ని తెలుసుకోవడం.. అమ్మకున్న ఈ లక్షణాలన్నీ బిడ్డలకొచ్చాయి. అందుకే వారి హృదయాలలో ఆమె ఎప్పుడూ పచ్చని చీర కట్టుకుని వెలిగిపోతూ కన్పిస్తూంటుంది. పరమ పవిత్రమైన ఆమె పాదాలు.. ఈ సృష్టిలో ఆమె పాదాలను ముద్దాడడం పసిపిల్లవాడి పారవశ్యం. కవిగా దేవులపల్లి ఎంత పరవశించిపోయారంటే ‘‘అక్షరమక్షరం నా మనసు కరిగితే ఈ పాటయిందమ్మా..’’.అని చెప్పుకుని ఆమె పాదపద్మాలకు సమర్పించుకున్నారు. అత్యంత పవిత్రమైన ఈ అమృతోత్సవాల సందర్భంగా ఇంత మధురమైన దేశభక్తి గేయాన్ని రాసిన దేవులపల్లి కృష్ణశాస్త్రిగారిని స్మరించుకుంటే... మనం కూడా ఆయనలా చిన్నపిల్లలమై ఆమె పాదాలను ముద్దాడే అనుభూతిని పొందుదాం. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
Chaganti Koteswara Rao: సహవాస ఫలం
కొంచెపు నరు సంగతిచే /నంచితముగ గీడు వచ్చు నది యెట్లన్నన్ ...అంటున్న బద్దెన పద్యం ఇస్తున్న సందేశం ఏమిటంటే.. దుర్జనులతో స్నేహం చేయద్దని! అగ్నిహోత్రం కట్టెను పట్టుకుని కాల్చడం మొదలుపెడుతుంది. మంట వ్యాపించేకొద్దీ ఆ కట్టెను ఆశ్రయించి ఉన్న పురుగూపుట్రా అన్నీ పారిపోతాయి. అగ్నితో సంపర్కం పొందాక ఒక్క పురుగు కూడ లోపల ఉండలేదు. అలాగే సత్పురుషులతో సహవాసం చెయ్యడం మొదలుపెడితే నీలో ఉన్న దుర్గుణాలన్నీ ఒక్కొక్కటిగా పడిపోతాయి. ఈశ్వర భక్తిచేత మారని గుణాలు కూడా మంచివారితో కలిసి ఉంటే తొలగిపోతాయి. మహాత్ముల చెంత చేరిన లోభిలో కూడా మార్పు వస్తుంది. తాను కూడా ఒక రూపాయి దానం చేసి సమాజం కోసం నిలబడాలన్న ఆలోచనలతో పరివర్తన చెందుతాడు. రావణాసురుడిని నమ్ముకున్న వారందరూ నశించిపోయారు. ఒక్కడు మిగల్లేదు. రామచంద్ర మూర్తిని నమ్ముకుని ఆయనతో కలిసున్న వారి సంగతి ఏమిటి! కొన్ని కోట్ల వానరాలు చచ్చిపోయినా, చిట్టచివర దేవేంద్రుడు ప్రత్యక్షమయి రాముడిని వరం కోరుకొమ్మంటే...‘నాకోసమని యుద్ధం చేయడానికి వచ్చి ఏ వానరాలు మరణించాయో అవన్నీ తిరిగి బతకాలి’ అని కోరుకున్నాడు. అటువంటి సత్పురుషుడిని ఆశ్రయించినందుకు చివరకు క్షేమంగా తిరిగి వెళ్లగలిగాయి. ‘‘కళత్రాణి సౌమ్యాని మిత్రవర్గం తథైవచ యధైచ్ఛసి చిరం భోక్తుం మా కృథారామ విప్రియమ్... ’ దుర్మార్గుడయిన వ్యక్తి ఇంట్లో ఉంటే– తల్లికీ తండ్రికీ మనశ్శాంతి ఉండదు. భార్యాబిడ్డలు ప్రశాంతంగా బతకలేరు. ఇటువంటి దుర్మార్గుడు మా కుటుంబ సభ్యుడైనాడని బంధువులు, మిత్రులు అందరూ తలదించుకుంటారు. ఆయన ఉండే వీథిలోని వాళ్ళు, ఆ దుర్మార్గుడి ఊరివాళ్ళు కూడా విసుక్కుంటారు. ఒకవేళ ఆ దుర్మార్గుడే పాలకుడయితే ఆ జిల్లా, ఆ రాష్ట్రం పాడయిపోతుంది. అలా దుర్మార్గుడు ఏ స్థాయిలో ఉంటే ఆ స్థాయిలో ఉన్న ఇతరులు కూడా అతని ప్రభావానికి బలయిపోతారు. దుర్జనులతోడి సంపర్కం ప్రమాదకరం. వర్షపునీటితో గలాగలా పారినా ఏటినీళ్ళు ఎవరూ తాగరు, పుణ్యస్నానాలు చేయరు. అది వెళ్ళి గంగానదితో కలిస్తే...అది కూడా గంగే అయిపోతుంది. దానికీ ఆ పవిత్రత దక్కుతుంది. అక్కడ పవిత్ర స్నానాలు చేస్తారు. అదే గంగానది వెళ్లి సముద్రంలో కలుస్తుంది. ఆ సముద్రంలోంచి నీళ్ళు ఇంటికి కూడా తెచ్చుకోం. గంగ... గంగగా ఉపయుక్తం. ఏరు గంగలో కలిస్తే గంగయిపోయింది. గంగ సముద్రంలో కలిస్తే సముద్రమయింది. తాత్వికంగా అది గొప్పదే..కానీ గంగ గంగగా ఉన్నప్పటి ప్రయోజనం సముద్రంలో కలిసిన తరువాత ఉండదు. ఒక చీమ పూలదండలో ఉన్నది. ఆ దండను రాజు మెడలో వేసారు. చీమ నెమ్మదిగా పాకుతూ కిరీటం పైకి చేరుకుంది. దానిని చూసినా ఎవ్వరూ అక్కడనుండి తొలగించే సాహసం చేయలేదు. రాజు స్వయంగా గ్రహిస్తే తప్ప దాన్ని ముట్టుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. అంటే నువ్వు ఎవరితో ఉన్నావన్నదాన్నిబట్టి నీ స్థాయి, గౌరవం మారిపోతుంటుంది. కాబట్టి త్యజదుర్జన సంసర్గమ్... భజసాధు సమాగమమ్... మహాత్ములతో, సత్పురుషులతో కలిసి ఉండండి... వారు మిమ్మల్ని నిందించినా, వారి సాంగత్యాన్ని వదులుకోకండి. వారితో కలిసి ఉన్న కారణంగా మీ దుర్గుణాలు పోగొట్టుకోవడమే కాకుండా, మీరు కూడా గౌరవ మర్యాదలు పొందగలుగుతారు. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
కర్ణుడు స్వతహాగా మంచివాడే...కానీ...!!!
మహాభారతంలో కర్ణుడి వ్యక్తిత్వాన్ని పరిశీలిస్తే.... ఆయన పుట్టుకతో చెడ్డవాడు కాడు. కుంతీదేవికి, సూర్యభగవానుడికి జన్మించిన వాడు. నిజానికి పాండవులు యుద్ధంలో గెలుస్తారని ముందే తెలిసున్నవాడు. కురుసభలో రాయబారం ముగించుకుని శ్రీ కృష్ణ పరమాత్మ తిరిగి వెడుతూ కర్ణుడిని రథం ఎక్కించుకుని మాట్లాడుతూ వెళ్ళాడు. అప్పుడు కర్ణుడు –‘‘ధర్మరాజు నిజంగా ధర్మం ఎరిగినవాడు. దాన్ని పాటించేవాడు. ధర్మం అంతా పాండవులవైపే ఉంది. అందుకే సాక్షాత్ భగవంతుడవయిన నువ్వు ఆ పక్షాన ఉన్నావు. వారు గెలిచి తీరుతారు. ధర్మరాజు పట్టాభిషిక్తుడవుతాడు. దుర్యోధనాదులందరూ కూడా యుద్ధభూమిలో మడిసిపోతారు. ఎవరూ మిగలరు. కానీ దుర్యోధనుడిని నమ్మి ఇంతకాలం ఉండి అతడిని విడిచిపెట్టి రాలేను. నాకు కూడా మరణమే శరణ్యం. నేను కూడా అక్కడ మరణించాల్సిందే’’ అన్నాడు. అంటే – పాండవుల పక్షాన ధర్మం ఉందనీ, వారు గెలుస్తారని, వారి చేతిలో కౌరవులు మరణిస్తారని, తాను కూడా అక్కడే చనిపోతానని కర్ణుడికి ముందే తెలుసు. ఇన్ని తెలిసిన యోధానుయోధుడయిన కర్ణుడు జీవితాంతం తప్పులు చేస్తూ, ఎందుకు ప్రవర్తించాల్సి వచ్చింది !!! దుర్యోధనుడు పరమ క్రూరుడు. దుర్మార్గుడు. బద్దెనగారే మరొక పద్యంలో ‘‘తలనుండు విషము ఫణికిని, వెలయంగా తోకనుండు వశ్చికమునకున్ తలతోక యనకనుండును ఖలునకు నిలువెల్ల విషము..’’ అంటారు... ఖలుడు అంటే దుర్మార్గుడు. అటువంటి వాడికి మంచి ఆలోచనలు ఎలా వస్తాయి? అదే ధర్మరాజు పక్కన ఉంటే ...మంచి పనులు చేస్తూ ఉంటాడు.. అప్పడు ఆయన పక్కన ఉన్నవారికి కూడా అటువంటి మంచి పనులు చేయడానికి లేదా కలిసి పాలు పంచుకొనే అవకాశం దొరుకుతుంది. అలా చేస్తే ధర్మరాజు కూడా సంతోషిస్తూ ఉంటాడు. దుర్యోధనుడితో కలిసి ఉన్నందుకు అతని మెప్పుకోసం కర్ణుడు చేయకూడని పనులన్నీ చేస్తూ వెళ్ళాడు. చిట్టచివరకు ఏమయ్యాడు ...యుద్ధభూమిలో అర్జునుడి చేతిలో మరణాన్ని పొందాడు. అలాగే మనిషి ఎంత మంచివాడయినా, ఎంత చదువు చదువుకొన్నవాడయినా, ఎన్ని ఉత్తమ గుణాలు కలిగిఉన్నా... ఒక దుర్మార్గుడితో స్నేహం చేస్తే మాత్రం ఉన్న పేరుప్రతిష్ఠలు కూడా నశించిపోతాయి. సన్మార్గంలో ఉన్న వ్యక్తి దుర్మార్గులతో చేరితే... నల్లులు పట్టిన మంచం ఎలా దెబ్బలు తింటుందో అలాగే ఉంటుందని సుమతీ శతకకారుడు బద్దెనచెబుతూ ‘‘కొంచెపు నరు సంగతిచే /నంచితముగ గీడు వచ్చు నది యెట్లన్నన్ /గించిత్తు నల్లి కుట్టిన/ మంచమునకు జేటు వచ్చు మహిలో సుమతీ’’ అంటున్నారు. శవం మీద ఉన్న పూలదండనే కాదు, కింద జారిపడినా దాన్ని ఎవరూ తీసుకుని వాడుకోరు సరికదా... అసలు వేలితో ముట్టుకోరు. కర్రతో పక్కకు నెట్టేస్తారు. అదే దేవుడి మెడలో పడిన పూలదండ... మరుసటి రోజువరకు ఉన్నా, వాడిపోయినా.. కళ్ళకద్దుకుని తీసుకుని తలమీద పెట్టుకుంటారు, కొప్పుల్లో తురుముకుంటారు. పూలదండ తనంత తానుగా చేసిన మంచీ లేదు, చెడూ లేదు. శవంతో చేరితే గౌరవాన్ని పోగొట్టుకుంది, భగవంతుడి మెడను అలంకరిస్తే పవిత్ర ప్రసాదమయింది. ఎవరితో కలిసున్నామన్న దాన్నిబట్టి గౌరవమయినా, ఛీత్కారమయినా ఉంటుంది. ఇనుప ఊచ ఎంత గట్టిగా ఉంటుంది!!! అగ్నితో చేరితే మెత్తబడి ఇంటికి కిటీకీ ఊచవుతుంది, నీటితో చేరితే తుప్పుపట్టి నేలరాలిపోతుంది. అందుకే ఎప్పుడూ కూడా దుర్మార్గులతో స్నేహం చేయకూడదు. అలా చేస్తే మనం పాడయిపోవడమే కాదు, మనచుట్టూ ఉన్నవారిని కూడా భ్రష్టుపట్టించే ప్రమాదం ఉంటుందని తెలుసుకుని జీవితంలో ప్రతి క్షణం ఆచితూచి అడుగేస్తుండాలి. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
శతక నీతి – సుమతిమీ కింకరులం ..
‘‘ఏరకుమీ కసుగాయలు దూరకుమీ బంధుజనుల దోషము సుమ్మీ...’’ అంటూ బద్దెనగారు ఇంకా ... ‘‘పాఱకుమీ రణమందున మీరకుమీ గురువులాజ్ఞ మేదిని సుమతీ!... అని కూడా అంటున్నారు. పాఱకుమీ రణమందున అంటే... యుద్ధరంగంలోకి దిగినవాడు యుద్ధం చేసితీరవలసిందే... శరీరత్యాగానికి సిద్ధపడే పోతాడు. అసలు నిజానికి ఆ ఆలోచన కూడా రాదు వీరుడికి...విజయ సాధనే ఏకైక లక్ష్యం.. దాన్ని సాధించాలన్న ఆలోచన తప్ప మరొకటి ఉండదు, ఉండకూడదు కూడా. ఒకవేళ సగంలో వెనుదిరిగితే... అది అత్యంత హేయమైన చర్య. వీరుడిగా గౌరవం పొందడు. కురుక్షేత్ర సంగ్రామ సమయం లో ‘నేను అర్జునుడిని ఓడిస్తా..’ అని కర్ణుడు మాట్లాడినప్పుడల్లా.. భీష్మాచార్యుడు... ‘‘గతంలో ఎన్నిమార్లు నువ్వు అర్జునుడితో తలపడ్డావు.. ద్రౌపదీ స్వయంవరమప్పుడు అర్జునుడి చేతిలో ఓడిపోయావు, ఉత్తర గోగ్రహణ సమయంలో అర్జునుడు బాణప్రయోగం చేస్తే పారిపోయావు, ఘోష యాత్ర జరుగుతున్నప్పుడు చిత్రసేనుడితో పోరాడలేక నువ్వు పారిపోతే అర్జునుడు వచ్చి చిత్రసేనుణ్ణి ఓడించి అందర్నీ కాపాడాడు... ఇన్నిసార్లు ఓడినవాడివి నీవిప్పుడు అర్జునుడిని ఓడిస్తానని ప్రగల్భాలు ఎందుకు పలకడం...’’ అనేవాడు. అయితే ఇప్పుడు యుద్ధాలు లేవు కానీ అంతకంటే క్లిష్టమైన జీవిత సమస్యలున్నాయి... ఏదయినా పోరాటమే... పోరాటానికి దిగేటప్పుడు దాని అంతు తేలుస్తా... అనే ఉక్కు సంకల్పంతో పోరాడాలి.. ఒకసారి పోరాడడం మొదలయిన తరువాత దాన్ని మధ్యలో వదిలేయకూడదన్నదే బద్దెన సందేశం. ఆయన ఇంకా ఏమంటున్నారు... ‘మీరకుమీ గురువలాజ్ఞ మేదిని సుమతీ’... పూర్తిగా పక్వానికి రాని పండ్లను తినడం, బంధువులను దూషించడం, ఒక పనిని మొదలుపెట్టి మధ్యలో వదిలేయడం ఎంతగా నిషిద్ధమో... అలాగే గురువుగారు చెప్పిన మాటలను పూర్తి శ్రద్ధతో ఆలకించి, ఆచరించడం కూడా అంతే అవసరం. ఆత్మబుద్ధి సుఖంచైవ... కొన్ని సంక్లిష్ట సందర్భాల్లో మనం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. అప్పుడు మన మనసు కు తట్టిన ఆలోచనలు మంచివే, వాటిని ఆచరించడానికే మనసు మొగ్గు చూపుతుంటుంది కానీ... గురుబుద్ధిర్విశేషతః... అటువంటప్పుడు సందర్భాన్నిబట్టి గురువుగారు గతంలో చెప్పిన విషయాలు ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకోవాలి. అవి మన ఆలోచనలకంటే మెరుగ్గా ఉంటాయి కనుక వాటిని కూడా శ్రద్ధగా పరిశీలించాలి. అప్పుడు మంచి నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంటుంది. అందువల్ల గురువుగారికి ఆయన మాటలకు ఎప్పుడూ ఆ గౌరవం ఇవ్వాలి. తాటక సంహారం తరువాత సుబాహుణ్ణి చంపగా, మారీచుణ్ణి దూరంగా తరిమికొట్టాడు రామచంద్రమూర్తి. రుషులందరూ వచ్చి పిల్లవాడివయినా దేవేంద్రుడిలాగా పోరాడావయ్యా... అంటూ బాగా పొగిడారు. సాధారణంగా పిల్లలను అందరిముందు పొగిడితే కించిత్ గర్వం వస్తుంది. విశ్వామిత్రుడు వారి గురువు. మరుసటిరోజు ఉదయాన రామలక్ష్మణులు చేతులు కట్టుకుని ఆయన ముందు నిలబడి ‘‘ఇమౌ స్మ ముని శార్దూల కింకరౌ సముపస్థితౌ, ఆజ్ఞాపయ మునిశ్రేష్ఠ శాసనం కరవావ కిం..’’ అన్నారు వినయ విధేయతలతో. అంటే–‘‘హే గురువర్యా! దశరథ మహారాజుగారి కుమారులు, కోసల రాజ్యానికి రాకుమారులు..అనే దృష్టితో మమ్మల్ని చూడకండి. మీ కింకరులం..అంటే మీ సేవకులం.. ఇది చేసి పెట్టు .. అని శాసించండి. అది అలా చెయ్యడం మా జీవితానికి అదృష్టంగా భావిస్తాం.. మీరలా ఆజ్ఞాపిస్తే.. మేము మీ అనుగ్రహానికి పాత్రులయినట్టు లెక్క...’’ అన్నారు. అదీ గురువులపట్ల ఉండాల్సిన గౌరవం, విధేయత... బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
నిన్ను సంతోషంగా కానీ.. దుఃఖంతో కానీ.. ఉంచేది నీ మనసే!
మీరు పిల్లలు... మార్పు మీ దగ్గరే ప్రారంభం కావాలి. ప్రయత్న పూర్వకంగా కొన్ని మంచి లక్షణాలు పసి వయసులోనే అలవాటు చేసుకోవాలి. దీనికి ఉపకరించేవి పెద్దలు, గురువులు చెప్పే మాటలు.. అలాటిదే శతక నీతి కూడా... ఇప్పడు మనం తెలుసుకుంటున్న ‘తన కోపమె తన శత్రువు...’ సూక్తి సుమతీ శతకం లోనిది. మన కోపం ఎక్కువగా మనల్నే నష్టపరుస్తుంది, మనం ప్రశాంతంగా ఉంటే మనం నేర్చుకునే విషయాలపట్ల మనకు ఏకాగ్రత కుదురుతుంది. ఎదుటివారు కష్టంలో ఉంటే ఆదుకునే మనస్తత్వాన్ని పెంపొందించుకోవాలి... అంటూ మన సంతోషమే మనకు స్వర్గం, మన దుఃఖమే మనకు నరకం అంటారు బద్దెన గారు. పోతన గారు ఓ మాటంటారు... ‘‘వ్యాప్తిం బొందక వగవక /ప్రాప్తంబగు లేశమైన బదివే లనుచుం/దృప్తిం జెందని మనుజుడు/ సప్తద్వీపముల నయిన? జక్కంబడునే?’’ అంటే...లభించినది కొంచెం అయినా అదే పదివేలుగా భావించి తృప్తి పొందాలి. అలా తృప్తి పడనివారికి సప్తద్వీపాల సంపదలు వచ్చిపడినా కూడా తృప్తి తీరదు....అంటారు. ‘నన్ను ప్రేమగా చూసుకునే తల్లిదండ్రులున్నారు, నాకు మంచి స్నేహితు లున్నారు. నేను మంచి పాఠశాలలో చదువుతున్నా. నాకు మంచి గురువులున్నారు..అలా మనకు ఉన్నవేవో వాటిలోని మంచిని తలుచుకుంటూ మన ప్రయత్నం, మన అభ్యాసం మటుకు నిజాయితీగా చేయాలి. ఇది చేయకుండా అంటే ఉన్నవాటిలోని మంచిని చూడకుండా... లేనివి ఏవో పనిగట్టుకుని ప్రతిక్షణం గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ కూర్చుంటే ఏమొస్తుంది? ఉన్న పుణ్యకాలం గడిచిపోతుంది. అలా నిత్యం దిగాలుగా ఉండి చేతిలో ఉన్న సమయాన్ని కూడా వృథా చేసుకునేవాడిని ఆ దేముడు కూడా కాపాడలేడు. నిన్ను సంతోషంగా కానీ దుఃఖంతో కానీ ఉంచేది నీ మనసే. దానిని అదుపు చేసుకో, దానికి నచ్చ చెప్పు. దాని మాట నీవు వినడం కాదు, నీ మాట అది వినేటట్లు చేసుకో. అది నీ చేతిలో ఉంది. అది ఇతరుల వల్ల సాధ్యం కాదు. అలా ఆలోచించి నిత్యం తృప్తిగా, సంతోషంగా ఉంటూ పనులు చక్కబెట్టు కుంటుంటే అదే నీకు స్వర్గం. మీకొక రహస్యం చెబుతా. మనం అందరం చెప్పుకునే స్వర్గలోకం శాశ్వతం కాదు.. మనం చేసిన మంచి పనుల వల్ల మనం స్వర్గం చేరుకునేది నిజమే అయినా... అది మన ఖాతాలో పుణ్యం ఉన్నంతవరకే. అది అయిపోగానే ... మనం పడిపోతాం. కానీ ఇక్కడ ఈ మనుష్య జన్మ నీకు దక్కింది... 84 లక్షల జీవరాశుల్లో దేనికీ దక్కని అదృష్టం వల్ల నీకు దక్కిన ఈ జన్మ సార్థకం చేసుకోవాలంటే ... నీవు దొరికిన దానితో తృప్తిపడి... నిత్యం సంతోషంగా ఉంటే... నీ జీవితాంతం అలా ఉండగలిగితే... ఇక్కడే నీకు స్వర్గ సుఖాలు లభించినట్లు. అలాకాక నా స్నేహితుడు మంచి మార్కులతో ఉత్తీర్ణుడవుతున్నాడు, నేను కాలేకపోతున్నా... అని తలుచుకుంటూ నువ్వు ఏడుస్తూ కూర్చుంటే... నీ నరకాన్ని దేముడు కాకుండా నీవే సృష్టించు కున్నట్లయింది. జన్మజన్మలకూ నీవు కూడా సంతోషంగా ఉండాలంటే, నీకు కూడా నీ స్నేహితుడి లాగా సరస్వతీ కటాక్షం పొందాలంటే.. కష్టపడు, బాగా చదువు. ఈ జన్మలో నీకు వచ్చిన విద్య పదిమందికి పంచు, కష్టంలో ఉన్నవాడికి నీకు చేతనయినంత సహాయం చెయ్యి. నిత్యోత్సాహంతో ఉండు. ఫెయిల్ అయ్యావు... అంత మాత్రానికే లోకం తల్లకిందులయిపోయినంతగా దిగాలు పడొద్దు... అబ్దుల్ కలాం గారు.. ఎఫ్.ఎ..ఐ.ఎల్..ఫెయిల్ అంటే ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్... అన్నారు. అంటే నీవు నేర్చుకోవడానికి నీవు చేసిన మొదటి ప్రయత్నం అది అన్నారు.. ఇప్పుడు నీవేం చేయాలి.. రెండో ప్రయత్నం. పట్టుదలతో, ఏకాగ్రతతో సాధించు... అంతే తప్ప నీ అరచేతిలో నీవు సృష్టించుకోగలిగిన స్వర్గాన్ని నీవే కిందకు నెట్టేసి నరకాన్ని చేతులారా తెచ్చిపెట్టుకోవద్దు. -బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
Chaganti Koteswara Rao: ఈ తమ్ముడు మళ్ళీ దొరకడు!
‘ఇమ్ముగ చదువనినోరును, అమ్మాయని పిలిచి అన్నమడుగని నోరున్, తమ్ముల పిలువని నోరును...’’ అన్న సుమతీ శతకంలోని పద్యం గురించి తెలుసుకుంటున్నాం. లోకంలో స్నేహితులు ఎక్కడికెళ్ళినా దొరుకుతారు. చిన్నతరగతులనుంచీ, కళాశాలలు ...ఆ తరువాత ఉద్యోగాల్లో ...అలా అన్ని స్థాయుల్లో, అన్ని ప్రాంతాల్లో, అన్ని వేళ ల్లో దొరుకుతారు. పెళ్ళిళ్ళు తదితరాలతో బాంధవ్యాలు కలిసి బంధువులు కూడా కొత్తగా దొరుకుతుంటారు. పుట్టగానే పరమేశ్వరుడిచ్చిన బంధుత్వం మాత్రం అమ్మానాన్నలతోనే. వాళ్ళ ఆఖరి ఊపిరి వరకు వాళ్ళు కోరుకునేది, నీవు వాళ్ళకు ఏదో చేయాలని కాదు, నీకు వాళ్ళేం చేయగలరని...! ఆ ఆర్తి సహజంగా వాళ్లకు తప్ప వేరెవరికీ ఉండనే ఉండదు. అటువంటి వాటిలో ఒకటి అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళతో ఉండే అనుబంధం. నాతో కలిసి పుట్టిన వాళ్ళతో అనుబంధం అపూర్వం. నా తమ్ముడు ఈ జన్మకంతటికీ వాడే నా తమ్ముడు. అక్క ఈ జన్మకు ఆమే అక్క. నేను చాలామందిని చెల్లెళ్ళగా చూడవచ్చు. కానీ మా అమ్మానాన్నల కడుపున నాతో కలిసి పుట్టిన చెల్లి అదొక్కతే. దానితో సమానం మాత్రం ఎవరూ కారు, కాలేరు. వాచికంగా.. ఆమె నా చెల్లెలి తో సమానం అంటాం. కానీ ఆమె స్థానాన్ని భర్తీ చేయడం మాత్రం సాధ్యం కాదు. తోడబుట్టినవాడు అంటే ఆ అనుబంధం మరొకరితో ఉండదుగాక ఉండదు. శ్రీ రామాయణం లో రావణాసురుడు ప్రయోగించిన శక్త్యాయుధం ఒకటి లక్ష్మణుడిని తాకి ఆయన కిందపడి మూర్ఛిల్లాడు. యుద్ధంలో ఉన్న రాముడు వెంటనే వచ్చి తమ్ముణ్ణి పట్టుకుని బావురుమని ఏడ్చాడు. ‘‘దేశేదేశే కళత్రాణి దేశేదేశే చ బాంధవః తం తూ దేశ నా పశ్యామి యాత్ర భ్రాత్ర సహోదరః’’ అన్నాడు. భార్య దొరుకుతుంది, బంధువులు ఎక్కడికెళ్ళినా దొరుకుతారు. కానీ వాడొక్కడే ఈ జీవితానికి. అంత అపురూపం రా అన్నదమ్ములు. నువ్వే లేకపోతే నాకెందుకురా ఈ రాజ్యాలు, ఈ సుఖాలు? నాకోసం అడవికి వచ్చావు, నా కోసం యుద్ధానికి వెళ్లావు, నువ్వే పడిపోయిన నాడు నాకు మిగిలిన సుఖాలు అన్నీ ఏకమై తిరిగి లభించినా, వాటివల్ల ప్రయోజనమేమిటి?’’ అని అడిగాడు. తోడబుట్టినవాడు వెళ్ళిపోయిన తరువాత బతుకు శూన్యమని భావించాడు. రామలక్ష్మణ భరత శ్రత్రుఘ్నులు నలుగురూ పట్టాభిషేక సమయానికి బతికే ఉన్నారు. వాలి సుగ్రీవుల్లో వాలి మరణించాడు. రావణ కుంభకర్ణులు ఇద్దరూ పోగా విభీషణుడొక్కడు మిగిలాడు. రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల మైత్రీబంధం చూసి అక్కడే ఉన్న విభీషణుడు ‘మేం మా సోదరులతో ఇలా బతకలేక పోయాం...’ అని చాటుగా కళ్ళొత్తుకున్నాడు. సుగ్రీవుడి కళ్ళు చెమర్చాయి. అన్నగారు బాగా పెద్దవాడయి పోయిన తరువాత కూడా నెమ్మదిగా వాహనం దిగుతుంటే తమ్ముళ్ళు గబగబా వెళ్ళి చెయ్యి ఆసరాగా ఇచ్చి ‘అన్నయ్యా! జాగ్రత్త’ అంటూ తీసుకువస్తుంటే, ఏ విషయమైనా అన్నయ్యకు చెప్పి చేస్తుంటే.. తమ్ముళ్ళ మంచీచెడూ విచారించే అన్నయ్య ఎప్పుడూ వాళ్ళకు తోడుగా ఉంటే అసలు ఆ ఇంట ఎంత ఆరోగ్యం, ఎంత ఆయుర్దాయం ఉంటుందో... ఆ రక్తసంబంధం ఉన్నవాళ్లు కలుసుకోవడం ఎంత సంతోషంగా ఉంటుందో..!!!