'ఆమె ధర్మపత్ని'! గృహస్థాశ్రమ వైశిష్ట్యం!!
అహం ఎప్పుడూ కూడా మనిషిని పాషాణం అయ్యేట్టు చేస్తుంది. కామం తీరలేదనుకోండి. శత్రుభావం పెంచుకుని అవతలి వాళ్ళమీద కఠినంగా వ్యవహరించేటట్లు చేస్తుంది. అయితే ప్రేమ మాత్రం కరిగిపోయే లక్షణాన్ని పొంది ఉంటుంది. అవతలివాళ్ళల్లో ఎన్ని లోపాలున్నా వారి నాశనాన్ని ప్రేమ కోరుకోదు. వారు బాగుపడాలి, సంస్కరింపబడాలి, జీవితంలో వృద్ధిలోకి రావాలి... అని కోరుకుంటుంది తప్ప వారిపట్ల ద్వేషం పెంచుకోదు. అందుకే ప్రేమ అవసరం. దానికి పూర్వ పరిచయం లేదు, భవిష్యత్తు మాత్రం ఉంది. దానికి పునాది ప్రేమలోనే ఉంది తప్ప కామంలో లేదు. అందుకే ఆమె ‘ధర్మపత్ని’ తప్ప కామపత్ని కాదు. ఇంత పెద్దప్రాతిపదికచేసి గృహస్థాశ్రమ ప్రవేశం చేయిస్తారు. కాబట్టి వివాహం నిర్ణయించేటప్పుడు పెద్దలు ముందుగా శీలం, వయసు, వృత్తి పరిశీలిస్తారు... తరువాత అభిజనం... అంటే రెండు పక్కల వంశాలు ఎంత గొప్పవి! ఆ వంశాలలో పూర్వీకులు ఎంత గొప్పగా ప్రవర్తించారో అన్న జిజ్ఞాసతో ఆ వంశానికి కీర్తిప్రతిష్ఠలు జోడించేలా ప్రవర్తించాలి. అందువల్ల వాటిని కూడా పెద్దలు పరిశీలిస్తారు.
రామాయణంలో... రామచంద్రమూర్తి శివధనుర్భంగం చేయగానే జనకమహారాజు వచ్చి సీతను అప్పగించాడు, రాముడు వెంట తీసుకెళ్ళాడు... అని చాలామంది అనుకుంటూంటారు. కానీ అది సరికాదు. బాలకాండను అయోధ్యకాండతో కలిపి చదివితే... ఆశ్చర్యపోతాం.. వారి సంస్కారం చూసి... శివధనుర్భంగం కాగానే జనకమహారాజు జలకలశంతో గబగబా వచ్చి..‘‘మొదట ఇచ్చిన మాట ప్రకారం శివధనుర్భంగం చేసినవారికి నా కూతురును ఇస్తానని చె΄్పాను... ఆ పని నీవు విజయవంతంగా చేశావు కాబట్టి ఇదుగో నా కుమార్తె..స్వీకరించు’’... అన్నాడు.
దానికి రాముడు.... ‘‘ఒక పిల్ల నాకు భార్య కావాలంటే చూడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అవి మా తండ్రిగారు చూడాలి. మా పురోహితులు, పెద్దలు, బంధువులను సంప్రదించి ఆయన నిర్ణయిస్తారు. దానికి నేను కట్టుబడతాను. అందువల్ల మా తండ్రిగారికి కబురు పంపండి’ అన్నాడు. కబురందుకుని దశరథ మహారాజు వచ్చారు.
‘నేను స్వయంవరం ఏర్పాటు చేస్తే భూమండలంలోని రాజులందరూ వచ్చిపోటీపడ్డారు. కానీ మీ రాముడు మాత్రమే శివధనుర్భంగం చేయగలిగాడు. ముందు చెప్పిన షరతు ప్రకారం నా కుమార్తెని ఇస్తున్నా. మీ కోడలిగా స్వీకరించండి’ అని జనకుడు కోరాడు. దశరథుడు వెంటనే ఎగిరి గంతేసి అంగీకరించలేదు. ఆయన అన్నాడు కదా... ‘ఈమె నా ఇంటి కోడలిగా రావడానికి ముందు మన రెండు వంశాలు సరిపోతాయా.. దానికి అర్హతలు మనకున్నాయా..’’ అంటూ మరో గొప్పమాటంటాడు..
‘‘రాముడు గొప్పవాడు ... పిల్లనివ్వడం మా అదృష్టం’’ అంటూ వంగి మాట్లాడకండి, జనక మహారాజా! మీరు పిల్లనిస్తేనే కదా మా వంశం నిలబడేది. అప్పుడే కదా రుణవిమోచనం. ఇచ్చేవారు మీరు, పుచ్చుకునేవాడిని నేను. ఇప్పుడు వినయంగా ఉండాల్సింది నేను మహారాజా !’’ అన్నాడు. ఆ తరువాత దశరథ మహారాజు కోరికపై వశిష్ఠుడు, జనకుడి కోరికపై వారి పురోహితుడు వారి వారి వంశాలను వివరించారు. అలా ఒకరి నుంచి మరొకరు క్షుణ్ణంగా తెలుసుకుని నిర్ణయించిన వివాహాలు కాలంలో ఆదర్శంగా నిలిచిపోయాయి. అందుకే గృహస్థాశ్రమానికి రామాయణం ఆదర్శం – అని కంచి మహాస్వామి అంటూండేవారు. – బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు
Comments
Please login to add a commentAdd a comment