ఎవరైనా ఏదైనా ఒక పని చేస్తే దాన్ని చూసిన మనం అతడు అలా చేయటం మంచిదనో లేదా చెడ్డదనో వెంటనే తీర్పుచెబుతూ ఉంటాం. అలా చేయటం తగదని శ్రీ రామకృష్ణ పరమహంస రామాయణ, మహాభారతాల నుంచి కొన్ని ఉదాహరణలు చూపారు. రామరావణ యుద్ధంలో రావణ కుంభకర్ణాది యుద్ధ వీరులంతా చనిపోయారు. రావణుని తల్లి కైకశి ప్రాణభయంతో పారిపోసాగింది.
లక్ష్మణుడు అలా పారిపోతున్న ఆ వృద్ధ స్త్రీని గమనించి శ్రీరామ చంద్రునితో, ‘అన్నయ్యా! ఏమిటీ వింత? అనేక మంది పుత్రులను, బంధువులను కోల్పోయి పుత్ర శోకాన్ని అనుభవిస్తూ ఇప్పుడు స్వీయ ప్రాణ రక్షణార్థం ఈ వృద్ధురాలు ఇలా ఎందుకు పారిపోతోంది?’ అని అడిగాడు. అందుకు రాముడు ‘ఆమెనే అడిగి కారణం కనుక్కొందాం’ అన్నాడు. ‘శ్రీరాముడు అభయమిచ్చాడని తెలిపి ఆమెను గౌరవంగా నా కడకు తోడ్కొని రండి అని కొందరిని ఆమె కడకు పంపాడు. వారు అలాగే చేశారు.
‘నీవు ప్రాణ భీతితో అలా పారిపోతున్నావా? నిజం చెప్పు’ అన్నాడు శ్రీరామ చంద్రుడు ఆమెతో. అప్పుడామె, ‘ఓ రామా! నేను జీవించి ఉన్నందునే నీ ఈ లీలలను తిలకించ గల్గుతున్నాను. ఈ భూమ్మీద నీవు ఇంకా జరుపబోయే లీలలను కూడా చూడగోరి ఇంకా కొంత కాలం జీవించాలని అభిలషిస్తున్నాను’ అని చెప్పింది. దీంతో సత్యమేమిటో అందరికీ తెలిసి వచ్చింది.
మహాభారత ఉదాహరణ చూద్దాం. భీష్ముడు అంపశయ్యపై ఉన్నాడు. శ్రీకృష్ణుడు, పంచ పాండవులు ఆయన చుట్టూ నిలబడి ఉన్నారు. మహావీరుడైన భీష్మాచార్యుల వారి కళ్ళ నుండి అశ్రువులు స్రవించటం వారు గమనించారు. అర్జునుడు శ్రీకృష్ణునితో, ‘సఖా! ఎంత విచిత్రంగా ఉంది. కురు పితామహులైన భీష్ములు మరణ సమయంలో మాయలో పడి దుఃఖిస్తున్నా రేమిటి?’ అన్నాడు. కృష్ణుడే భీష్ముడిని దాన్నిగూర్చి అడిగాడు.
అప్పుడు భీష్ముడు, ‘ఓ కృష్ణా! మరణ భయంతో నేను దుఃఖించటం లేదని నీకు బాగా తెలుసు, స్వయంగా భగవంతుడే పాండవులకు సారథిగా ఉన్నప్పటికీ వారి కష్టాలకు అంతులేకుండా ఉందే! ఇలాంటి ఆలోచన వచ్చినప్పుడు భగవంతుడి లీలలను కించిత్తూ తెలుసుకోలేకుండా ఉన్నానే అని తలచుకొని దుఃఖిస్తున్నాను’ అన్నాడు (శ్రీ రామకృష్ణ కథామృతం–01). కాబట్టి దేన్ని చూసినా, విన్నా త్వరపడి విమర్శించ కూడదు. నిజం నిలకడ మీద తేలుతుంది. – రాచమడుగు శ్రీనివాసులు
Comments
Please login to add a commentAdd a comment