ఇవ్వాళ ప్రభుత్వాలూ, సంఘసేవకులూ మహిళా సాధికారత గురించి ఎంతగానో మాట్లాడుతున్నారు. కానీ, దాదాపు 140 సంవత్సరాల క్రితమే శ్రీ రామకృష్ణ పరమహంస స్త్రీ జనోద్ధరణపై దృష్టి పెట్టారు. సాక్షాత్తూ భార్యలోనే కాళీ మాతను దర్శించగలిగిన పరమహంస స్త్రీ జనోద్ధరణకు తన శిష్యులను ప్రోత్సహించారు.
ఒకరోజు గౌరీమా అనే భక్తురాలు పువ్వులు సేకరిస్తుండగా గురుదేవులు ఒక నీటికుండతో అక్కడకు వచ్చి ఒక చేత్తో చెట్టుకొమ్మను పట్టుకొని మరో చేత్తో చెట్టుకు నీరు పోస్తూ ‘గౌరీ, నేను నీరు పోస్తూ ఉంటే నువ్వు మట్టిని కలుపు’ అన్నాడు. అప్పుడామే ‘ఇక్కడ బంక మట్టి లేదు. ఎలా మట్టిని కలప గలన’ని పలికింది.
ఆ మాట విని గురుదేవులు ‘నేను ఏ అర్థంలో చెప్పానూ, నువ్వు ఏ రకంగా అర్థం చేసుకొన్నావూ? ఈ దేశంలో స్త్రీల పరిస్థితి శోచనీయంగానూ, బాధాకరంగానూ ఉంది. వారికోసం నువ్వు పాటుపడాలి’ అన్నారు. అంటే... తాను దేశ స్త్రీల అభివృద్ధికి నడుం బిగించి కృషి ఆరంభిస్తే, గురుదేవులు అందుకు తగిన తోడ్పాటు అందిస్తారన్నమాట అనుకున్నారు గౌరీమా. అప్పుడామె ‘కొద్ది మంది బాలికలను నాకు ఇవ్వండి. వారిని హిమాలయాలకు తోడ్కొని వెళ్ళి వారిని సౌశీల్యవంతులుగా తీర్చి దిద్దుతాను’ అంది. గురుదేవులు తన తలను అడ్డంగా ఊపుతూ, ‘కాదు, కాదు, నువ్వు నగరంలోనే ఉంటూ పని చేయాలి. నువ్వు అనుష్ఠించిన ఆధ్యాత్మిక సాధనలు చాలు. ఆధ్యాత్మిక శక్తితో నువ్వు స్త్రీలను సేవించాలి’ అన్నారు.
గురుదేవుల ఆదేశాన్ని శిరసావహించిన గౌరీమా కలకత్తాలో బాలికల నిమిత్తం ఒక పాఠశాలను స్థాపించి భారతీయ స్త్రీలను విద్యావంతులను గావించడంలోనూ, తద్వారా వారిని ఉద్ధరించడంలోనూ ఎంతో కృషి చేసింది. (పుటలు 248, 249 – శ్రీ రామకృష్ణ లీలామృతం). రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు స్వామి వివేకానందుడు కూడా మహిళా ఉద్ధరణకు ఎంతగానో కృషి చేయడం గమనార్హం. – రాచమడుగు శ్రీనివాసులు
Comments
Please login to add a commentAdd a comment