Inspirational Stories
-
ఊరకరారు మహాత్ములు...
గృహస్థాశ్రమంలో నిత్యం జరిగే పంచ మహా యజ్ఞాలలో ఐదవది – ‘....నృయజ్ఞోతిథిపూజనమ్’. అతిథిని పూజించేవాడు ఒక్క గృహస్థు మాత్రమే. నేను ఆహ్వానిస్తే నా ఇంటికి వచ్చినవాడు అతిథి. నేను ఆహ్వానించకుండా వచ్చినవాడు– అభ్యాగతుడు. అతిథి పూజనమ్...పూజించడం అంటే గౌరవించడం. ఇంటికి వచ్చినవారిపట్ల మర్యాదగా మెలుగుతూ గౌరవించి పంపడం నేర్చుకో... తన ఇంటికి వచ్చినవాడు గొప్పవాడా, నిరక్షరాస్యుడా, సామాన్యుడా అన్న వివక్ష గృహస్థుకు ఉండదు. భోజనం వేళకు వచ్చాడు. భోజనం పెట్టు. లేదా ఏ పండో కాయో లేదా కాసిని మంచినీళ్లయినా ఇవ్వు.. అన్ని వేళలా అన్ని పెట్టాలనేం లేదు. వచ్చిన వారిని ప్రేమగా పలకరించు. నీకూ పరిమితులు ఉండవచ్చు. వాటికి లోబడే ఎంత సమయాన్ని కేటాయించగలవో అంతే కేటాయించు. కానీ ఒట్టి చేతులతో పంపకు. పండో ఫలమో ఇవ్వు. లేదా కనీసం గుక్కెడు చల్లటి నీళ్ళయినా ఇవ్వు. నీకు సమయం లేక΄ోతే ఆ బాధ్యతలను కుటుంబ సభ్యులకు అప్పగించు. అతిథి సేవతో గృహస్థు పాపాలు దహించుకు ΄ోతున్నాయి. కారణం – ఆయన ఏది పెడుతున్నాడో దానిని ‘నేను పెడుతున్నాను’ అన్న భావనతో పెట్టడు. వచ్చిన అతిథి నీ దగ్గరకు వచ్చి గుక్కెడు నీళ్ళు తాగాడు, ఫలహారం చేసాడు, భోజనం చేసాడు...అంటే అవి అతనికి లేక దొరకక రాలేదు నీదగ్గరికి. ఆయన హాయిగా అవన్నీ అనుభవిస్తున్న స్తోమత ఉన్నవాడే. కానీ ఆయన ఏదో కార్యం మీద వచ్చాడు. భగవంతుడు శంఖ చక్ర గదా పద్మాలు పట్టుకుని రాడు నీ ఇంటికి. అతిథి రూపంలో వస్తాడు. ఆ సమయంలో నీవిచ్చిన నీళ్ళు తాగవచ్చు, పట్టెడన్నం తినవచ్చు, బట్టలు కూడా పుచ్చుకోవచ్చు. కానీ ఆయన పుచ్చుకున్న వాడిగా ఉంటాడు. అలా ఉండి నీ ఉద్ధరణకు కారణమవుతాడు. అందునా నీవు పిలవకుండానే వచ్చాడు. అభ్యాగతీ స్వయం విష్ణుః– విష్ణుమూర్తే నీ ఇంటికి వచ్చాడని గుర్తించు. మహితాత్ములైనవారు, భాగవతోత్తములు, భగవద్భక్తి కలవారు నీ ఇంటికి వస్తే.. గృహదేవతలు కూడా సంతోషిస్తారు.అంటే దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి సులువైన మార్గం అతిథి పూజనమే. అతిథికి నీవు పెట్టలేదు. భగవంతుడే అతిథి రూపంలోవచ్చి నీదగ్గర తీసుకున్నాడు. అతిథిని మీరు విష్ణు స్వరూపంగా భావించి పెట్టినప్పుడు మీ అభ్యున్నతికి కారణమవుతుంది. మహాత్ములయినవారు మనింటికి వస్తూండడమే దానికి సంకేతం. శ్రీ కృష్ణుడి క్షేమ సమాచారం తెలుసుకురమ్మని వసుదేవుడు పంపిన పురోహితుడితో నందుడు ‘‘ఊరకరారు మహాత్ములు/ వారథముల యిండ్ల కడకు వచ్చుట లెల్లం/గారణము మంగళములకు/ నీ రాక శుభంబు మాకు, నిజము మహాత్మా !’’ అంటాడు. అతిథి ఇంట అడుగు పెట్టడం అంత గొప్పగా భావిస్తుంది మన సమాజం.రామకార్యంమీద పోతున్న హనుమకు మైనాకుడు ఆతిథ్యం స్వీకరించమని అర్ధిస్తాడు. ఇప్పుడు వీలుపడదంటే...కనీసం ఒక్క పండయినా తిని కాసేపు విశ్రాంతయినా తీసుకువెళ్ళమంటాడు. ఇంటి ముందు నిలిచిన బ్రహ్మచారి ‘భవతీ భిక్షాందేహి’ అంటే... ఇంట్లో ఏవీ లేవంటూ ఇల్లంతా వెతికి ఒక ఎండి΄ోయిన ఉసిరికాయ తెచ్చి శంకరుడి భిక్షా΄ాత్రలో వేస్తుంది ఒక పేదరాలు. ఆ మాత్రం అతిథి పూజకే ఆమె ఇంట బంగారు ఉసిరికకాయలు వర్షంలా కురిసాయి. -
ఒక అడవిలో తాబేళ్లు... చేపలు... కోతులు
ఒక అడవిలో గుబురుగా ఉన్న చెట్ల మీద ఒక కోతుల జంట నివసిస్తోంది. పెద్దకోతులు మంచివే కానీ పిల్ల కోతులు నాలుగు మాత్రం చాలా అల్లరి చేస్తూ దారిలో వెళ్ళే అందరినీ ఇబ్బంది పెట్టసాగాయి. ఆ చెట్లకు కాస్త దూరంలో ఒక సెలయేరు ఉంది. అందులో కొన్ని తాబేళ్లు, చేపలు నివసిస్తున్నాయి. చేపలు, తాబేళ్లు నీటి మీద తేలియాడగానే కోతులు చెట్ల పైనుంచి పండ్లు, కాయలు, ఎండుకొమ్మలు వాటి మీదకు విసిరి బాధ పెట్టసాగాయి.‘కోతి నేస్తాలూ! మేము మీకు ఏ విధంగానూ అడ్డురావడం లేదు. మరి మీరెందుకు మమ్మల్ని నీటి పైకి రానివ్వకుండా గాయపరుస్తున్నారు?’ అని ఒకరోజు ఒక చేప ప్రశ్నించింది. ‘మేము పిల్లలం, అల్లరి చేస్తూ ఆటలు ఆడుకుంటున్నాం. మేము తినగా మిగిలినవి గిరాటు వేస్తుండగా అవి పొరపాటుగా నీళ్లల్లో పడుతున్నాయి’ అని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చింది ఓ పిల్లకోతి.‘చేప నేస్తాలూ! పిల్లకోతులు కావాలని అలా గిరాటు వేస్తున్నాయి. మనం వాటిని అడగడం వల్ల ఏమీ ఉపయోగం ఉండదు’ అంది ఓ తాబేలు.రోజురోజుకు కోతుల ఆగడాలు పెరగసాగాయి. పాపం! తాబేళ్లు, చేపలు ఏమీ చేయలేక అలాగే అవస్థపడసాగాయి. ఒక రోజున పిల్ల కోతులు ఒక కొమ్మ మీద కూర్చుని ఉయ్యాలూగుతున్నాయి. ఆ కొమ్మ బలహీనంగా ఉండటం వలన ఫెళ్లున విరిగిపోయింది. ఊగుతున్న కోతులు ఆ వేగానికి సెలయేటి నీళ్లల్లో పడిపోయాయి. వాటికి ఈత రాకపోవడంతో ‘కాపాడండి.. కాపాడండి..’ అంటూ పెద్దగా అరవసాగాయి. ఆ అరుపులకు నీళ్లల్లో ఉన్న చేపలు, తాబేళ్లు బయటకు వచ్చాయి. ‘అయ్యో! పిల్ల కోతులు నీళ్లల్లో మునిగిపోతున్నాయి, వాటిని కాపాడుదాం’ అంది ఒక తాబేలు.‘పిల్లకోతులూ! ఇలా మా వీపు మీద కూర్చోండి’ అంటూ నాలుగు పెద్ద తాబేళ్లు వాటి దగ్గరకు వెళ్ళాయి. అవి తాబేళ్ల మీద కూర్చోగానే ఈదుతూ వాటిని ఒడ్డుకు చేర్చాయి. ‘మేము మిమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా మీరు మా ప్రాణాలను రక్షించారు. ఇక నుంచి మనం మంచి మిత్రులుగా ఉందాం’ అన్నాయి పిల్ల కోతులు. ‘అలాగే!’ అన్నాయి తాబేళ్లు.అప్పటి నుంచి అవన్నీ చాలా స్నేహంగా ఉండసాగాయి. ఒకరోజు అడవికి ఒక బెస్తవాడు సెలయేటిలో చేపలు పట్టడానికి వచ్చాడు. అతణ్ణి చెట్టు మీద ఉన్న పిల్లకోతులు చూశాయి. ఈలోగా బెస్తవాడు వలను నీటిలోకి విసిరాడు. ఆదమరచి ఉన్న చేపలు, తాబేళ్లు వలలో చిక్కుకున్నాయి.‘ఈ రోజు నా అదృష్టం పండింది. చాలా చేపలు, తాబేళ్లు కూడా దొరికాయి’ అంటూ బెస్తవాడు సంబరపడి వాటిని తనతో తెచ్చుకున్న బుట్టలో వేసుకున్నాడు. ‘అయ్యో! మన నేస్తాలను ఇతను తీసుకెళ్లిపోతున్నాడు’ అని పిల్ల కోతులు మాట్లాడుకున్నాయి. అన్నీ కూడబలుక్కుని ఒక్కసారిగా బెస్తవాడి మీదకు దూకాయి. ఊహించని పరిణామానికి అతను కంగారుపడ్డాడు. తప్పించుకోవడానికి ప్రయత్నించినా.. కోతులు అతని శరీరాన్ని రక్కేశాయి. బుట్ట, వల అక్కడే వదిలేసి పరుగెత్తుకుంటూ పారిపోయాడు. కోతులు బుట్టను తెరిచి చేపలను, తాబేళ్లను సెలయేటిలోకి వదిలేశాయి. అవి పిల్ల కోతులకు కృతజ్ఞతలు తెలిపి హాయిగా ఊపిరి పీల్చుకున్నాయి. ‘మనం ఎప్పుడూ ఇలాగే ఒకరికి ఒకరం స్నేహంగా ఉండాలి’ అనుకున్నాయి అన్నీ! మనం ఒకరికి సహాయపడితే మనకు దేవుడు సహాయపడతాడు. – కైకాల వెంకట సుమలత -
కాకి హంసల కథ! పూర్వం ఒకానొక ద్వీపాన్ని..
పూర్వం ఒకానొక ద్వీపాన్ని ధర్మవర్తి అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రాజుగారు ఉండే నగరంలోనే ఒక సంపన్న వర్తకుడు ఉండేవాడు. అతడు ఉత్తముడు. ఒకరోజు ఒక కాకి అతడి పెరటి గోడ మీద వాలింది. వర్తకుడి కొడుకులు ఆ కాకికి ఎంగిలి మెతుకులు పెట్టారు. అప్పటి నుంచి కాకి ఆ ఇంటికి అలవాటు పడింది. వర్తకుడి కొడుకులు రోజూ పెట్టే ఎంగిలి మెతుకులు తింటూ బాగా బలిసింది. బలిసి కొవ్వెక్కిన కాకికి గర్వం తలకెక్కింది. లోకంలోని పక్షులేవీ బలంలో తనకు సాటిరావని ప్రగల్భాలు పలుకుతుండేది.ఒకనాడు వర్తకుని కొడుకులు ఆ కాకిని వ్యాహ్యాళిగా సముద్ర తీరానికి తీసుకెళ్లారు. సముద్రతీరంలో కొన్ని రాజహంసలు కనిపించాయి. వర్తకుని కొడుకులు ఆ రాజహంసలను కాకికి చూపించి, ‘నువ్వు వాటి కంటే ఎత్తుగా ఎగరగలవా?’ అని అడిగారు. ‘చూడటానికి ఆ పక్షులు తెల్లగా కనిపిస్తున్నాయే గాని, బలంలో నాకు సాటిరాలేవు. అదెంత పని, అవలీలగా వాటి కంటే ఎత్తుగా ఎగరగలను’ అంది కాకి.‘సరే, వాటితో పందేనికి వెళ్లు’ ఉసిగొల్పారు వర్తకుడి కొడుకులు. ఎంగిళ్లు తిని బలిసిన కాకి తారతమ్యాలు మరచి, హంసల దగ్గరకు డాంబికంగా వెళ్లింది. తనతో పందేనికి రమ్మని పిలిచింది. కాకి తమను పందేనికి పిలవడంతో హంసలు పకపక నవ్వాయి. ‘మేం రాజహంసలం. మానససరోవరంలో ఉంటాం. విహారానికని ఇలా ఈ సముద్రతీరానికి వచ్చాం. మేం మహాబలవంతులం. హంసలకు సాటి అయిన కాకులు ఉండటం లోకంలో ఎక్కడైనా విన్నావా?’ అని హేళన చేశాయి.కాకికి పౌరుషం పొడుచుకొచ్చింది.‘నేను నూటొక్క గతులలో ఎగరగలను. ఒక్కో గతిలో ఒక్కో యోజనం చొప్పున ఆగకుండా వంద యోజనాలు అవలీలగా ఎగరగలను. మీరెలా కావాలంటే అలా ఎగురుదాం. కావాలంటే పందెం కాద్దాం’ కవ్వించింది కాకి.‘మేము నీలా రకరకాల గతులలో ఎగరలేం. నిటారుగా ఎంతదూరమైనా ఎగరగలం. అయినా, నీతో పోటీకి మేమంతా రావడం దండగ. మాలో ఏదో ఒక హంస నీతో పోటీకి వస్తుంది’ అన్నాయి హంసలు.ఒక హంస గుంపు నుంచి ముందుకు వచ్చి, ‘కాకితో పందేనికి నేను సిద్ధం’ అని పలికింది.పందెం ప్రారంభమైంది.కాకి, హంస సముద్రం మీదుగా ఎగరసాగాయి.హంస నెమ్మదిగా నిటారుగా ఎగురుతూ వెళుతుంటే, కాకి వేగంగా హంసను దాటిపోయి, మళ్లీ వెనక్కు వచ్చి హంసను వెక్కిరించసాగింది. ఎగతాళిగా ముక్కు మీద ముక్కుతో పొడవడం, తన గోళ్లతో హంస తల మీద జుట్టును రేపడం వంటి చేష్టలు చేయసాగింది. కాకి వెక్కిరింతలకు, చికాకు చేష్టలకు హంస ఏమాత్రం చలించకుండా, చిరునవ్వు నవ్వి ఊరుకుంది. చాలాదూరం ఎగిరాక కాకి అలసిపోయింది. అప్పుడు హంస నిటారుగా ఎగసి, పడమటి దిశగా ఎగరసాగింది. కాకి ఎగరలేక బలాన్నంతా కూడదీసుకుని ఎగురుతూ రొప్పసాగింది. హంస నెమ్మదిగానే ఎగురుతున్నా, కాకి ఆ వేగాన్ని కూడా అందుకోలేక బిక్కమొహం వేసింది. ఎటు చూసినా సముద్రమే కనిపిస్తోంది. కాసేపు వాలి అలసట తీర్చుకోవడానికి ఒక్క చెట్టయినా లేదు. సముద్రంలో పడిపోయి, చనిపోతానేమోనని కాకికి ప్రాణభీతి పట్టుకుంది. కాకి పరిస్థితిని గమనించిన హంస కొంటెగా, ‘నీకు రకరకాల గమనాలు వచ్చునన్నావు. ఆ విన్యాసాలేవీ చూపడం లేదేం కాకిరాజా?’ అని అడిగింది.కాకి సిగ్గుపడింది. అప్పటికే అది సముద్రంలో పడిపోయేలా ఉంది. ‘ఎంగిళ్లు తిని కొవ్వెక్కి నాకెవరూ ఎదురులేరని అనుకునేదాన్ని. నా సామర్థ్యం ఏమిటో ఇప్పుడు తెలిసి వచ్చింది. సముద్రంలో పడిపోతున్నాను. దయచేసి నన్ను కాపాడు’ అని దీనాలాపాలు చేసింది. కాకి పరిస్థితికి హంస జాలిపడింది. సముద్రంలో పడిపోతున్న కాకి శరీరాన్ని తన కాళ్లతో పైకిలాగింది. ఎగురుకుంటూ వెళ్లి ఒడ్డుకు చేర్చింది.‘ఇంకెప్పుడూ లేనిపోని డాంబికాలు పలుకకు’ అని బుద్ధిచెప్పింది హంస. ఈ కథను కురుక్షేత్రంలో శల్యుడు కర్ణుడికి చెప్పాడు.‘కర్ణా! నువ్వు కూడా వర్తకుడి పుత్రుల ఎంగిళ్లు తిన్న కాకిలాగ కౌరవుల ఎంగిళ్లు తిని అర్జునుణ్ణి ధిక్కరిస్తున్నావు. అనవసరంగా హెచ్చులకుపోతే చేటు తప్పదు! బుద్ధితెచ్చుకుని మసలుకో’ అని కర్ణుణ్ణి హెచ్చరించాడు. – సాంఖ్యాయన -
నిదానమే.. ప్రధానం!
మేధాతిథి అనే తాపసుని పుత్రుడు చిరకారి. అతడు ఏ పనిని తొందర పడి చేయడు. చక్కగా అలోచించి చేస్తాడు. అందువలన అందరూ అతనిని చిరకారి అని పిలిచేవారు. ఒకసారి మేధాతిథికి భార్యపై బాగా కోపం వచ్చింది. కొడుకును పిలిచి ఆమెను చంపమని ఆజ్ఞాపించి అతడు ఎక్కడికో వెళ్ళిపోయాడు. చిరకారి చాలా సేపు ఇలా ఆలోచించాడు..‘తండ్రి ఆజ్ఞను ఉల్లంఘించటం మంచిది కాదు. అలాగని తల్లిని చంపటం యుక్తం కాదు. తల్లి నెలాగైనా కాపాడుకోవాలి. తల్లిదండ్రుల మధ్య పుత్రత్వం అనేది స్వేచ్ఛ లేనిదిగా ఉంది. నేను ఇద్దరికీ చెందినవాడను. ఈ క్లిష్ట పరిస్థితిలో వీరిద్దరిలో ఎవరిని వదులుకోవాలి? కొడుకు ఏ వయ సులో ఉన్నా తల్లి ప్రేమ, రక్షణ బాధ్యత ఒకే విధంగా ఉంటాయి. తల్లి లేకపోతే లోకం శూన్యమై పోతుంది. ఇంతటి పూజ్యురాలైన తల్లిని వధించటానికి నాకు చేతులెలా వస్తాయి?’ అనుకుంటూ చిరకారి సుదీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు.‘మాతృ దేవోభవ’ అనే సూక్తి కూడా తల్లినే ప్రథమ దైవంగా భావించమని బోధించింది. చిరకారి తండ్రి మాట కాదనలేక, తల్లిని చంపలేక కత్తి చేత్తో పట్టుకుని ఆలోచిస్తూ ఉండగా, మేధాతిథిలో పశ్చా త్తాప భావన మొదలైంది. చిన్న తప్పుకు కోపించి భార్యను చంపమని కొడుకుని ఆజ్ఞాపించాను. చిరకారి ఏ పనైనా దీర్ఘంగా అలోచించి కాని చేయడు. మాతృ వధకు పూనుకోకుండా తన పేరు సార్థకం చేసుకుంటే బాగుండును అనుకుంటూ ఇంటికి వస్తాడు. చిరకారి చేతిలో ఖడ్గాన్ని వదిలి తండ్రి పాదాలకు నమస్కరించాడు. భార్య కూడా ఆయనకు నమస్కరించింది. ఆయన వారిద్దరినీ దీవించాడు. ఏ పనైనా తొందరపడక, ఆలోచించి ధీరత్వంతో చేసేవాడు సమస్త శుభాలు పొందు తాడని మేధాతిథి చెబుతాడు.ధర్మరాజు కార్యాచరణలో అవసరమైనది బహు దీర్ఘ సమయమా? అత్యల్ప సమయమా అని భీష్ముని అడిగినప్పుడు ఆయన చిరకారి కథ చెప్పి అలా చేయమని చెబుతాడు. ఏ పనినైనా తొందరపాటుతో చేస్తే అనర్థాలు కలుగుతాయి. అలోచించి చేస్తే సత్ఫలితాలు కలుగుతాయి అని సారాంశం. – డా. చెంగల్వ రామలక్ష్మి -
ఏది అత్యుత్తమ మార్గం?
మార్గాలన్నీ సమాన ప్రాముఖ్యం కలిగినవే. ఎందుకంటే జీవాత్మను పరమాత్మునిలో చేర్చడమే ఈ అన్ని మార్గాల లక్ష్యం. మంచితనం విషయంలో ఉత్తమం, మధ్యమం, అథమం అనేవి సాపేక్ష పదాలు మాత్రమే. ఏ వ్యక్తికి ఏ మార్గం సులభంగా, మనస్సుకు నచ్చినట్లు ఉంటుందో అదే అతనికి ఉత్తమ మార్గం.వివిధ నదులు అనేక దిక్కుల నుంచి వేగంగా ప్రవహిస్తూ చివరగా సముద్రంలో కలిసిపోతాయి. అలాగే భక్తి, జ్ఞాన మార్గాల్లో పయనించే వాళ్లందరూ చివరిగా చేసే ప్రయత్నం ఒక్కటే. జీవుడు ఏ మూలం నుండి వచ్చాడో, ఆ మూలం లోనికి జీవుణ్ణి చేర్చడమే భక్తి, జ్ఞాన మార్గాల లక్ష్యం. కారణం గుర్తించు నీవు, నీ అంతరాత్మతో పొందిక కలిగి ఉన్నట్లయితే బాహ్య ప్రపంచం నీతో పొందికను కలిగి ఉంటుంది. బాహ్య ప్రపంచంలో నీకు విరోధం కనిపించినట్లయితే అది నీ లోపల గల కల్లోలాలను బహిర్గతపరుస్తుంది. అందువల్ల బయట కల్లోలాలు సృష్టించబడతాయి.ప్రకృతి మాత రచించిన గొప్ప ప్రణాళికలో ప్రతి వస్తువునకూ సముచితమైన విలువ, ఉపయోగాలు ఉన్నాయి. దానికంటూ ప్రత్యేక స్థానం ఉంది. వేదాంతాన్ని అనుసరించి చూస్తే... ప్రకృతి ఎక్కడా కల్లోలాలను కలిగించదని అర్థమవుతుంది. కేవలం మానవుని మనస్సు మాత్రమే ఇటువంటి కల్లోలాలను సృష్టిస్తుంది. కల్లోలాలను గురించి ఎంత సులభంగా మాట్లాడతావో, నీవు వాటికి అంత ప్రాముఖ్యం ఇచ్చిన వాడవు అవుతావు.ప్రతి విషయానికీ ఏదో ఒక పరిణామం కారణం అనే విషయాన్ని గ్రహించి, ఏ కారణం వల్ల అది సంభవించిందో... అటువంటి మూల కారణాలను నీవు గుర్తించు. కారణం లేకుండగానే ఏదీ సంభవించదు అని గుర్తెరగాలి. నీవు జీవితంలో ఉన్నత ఆÔè యా లకు లోబడి నడచుకున్నప్పుడు నీకు విశ్రాంతి లభిస్తుంది. అదే సమ యంలో నీవు ప్రశాంతంగా ఉండగలవు. కాబట్టి దృష్టిని ప్రక్కకు మళ్ళించకుండా, నీ జీవితాన్ని భక్తి, విశ్వాసాలతో భగవదర్పణ చేసి గడుపు. సదా భగవన్నామాన్ని స్మరించు.– శ్రీ గణపతి సచ్చిదానందస్వామి -
వర్తమానమే... నిజం!
అరణ్యంలో ఉన్న ఓ జ్ఞాని దగ్గరకు వెళ్లిన ఒక యువకుడు తనకు నిజమంటే ఏమిటో చెప్పాలని కోరాడు. వెంటనే జ్ఞాని ‘నిజం సంగతి ఇప్పటికి పక్కనపెట్టు. నేనడిగిన దానికి జవాబు చెప్పు. మీ ఊళ్ళో బియ్యం ధర ఎంతో చెప్పు’ అన్నాడు. అందుకు యువకుడు వినమ్రంగా ‘స్వామీ! నన్ను మన్నించండి. మర్యాద మరచి మాట్లాడుతున్నానని అనుకోకండి. ఇటువంటి ప్రశ్నలు ఇక మీదట నన్ను అడక్కండి. ఎందుకంటే నేను గతకాలపు దారులు మరచిపోయాను. గతానికి సంబంధించినంత వరకు నేను ఇప్పుడు మరణించాను. ఇదిగో ఇప్పుడు నడిచొ చ్చిన మార్గాన్ని కూడా నేను మరచిపోయాను’ అన్నాడు. ‘నువ్వు గత కాలపు భారాన్ని ఇంకా మోస్తున్నావా... లేదా అనేది తెలుసుకోవడానికే బియ్యం ధర ఎంతని అడిగాను. నువ్వు దానికి జవాబు చెప్పి ఉంటే వెంటనే నిన్ను ఇక్కడినుంచి పంపించేసేవాడిని. నిజం గురించి మాట్లాడటానికి తిరస్కరించే వాడిని’ అన్నాడు. ‘అయితే ఇపుడు చెప్పండి నిజమంటే ఏమిటో’ అని అడిగాడు యువకుడు.‘వర్తమానంలో బతకడం తెలీని మనిషిని ఓ తోటలోకి తీసుకు వెళ్ళి ఓ గులాబీ పువ్వుని అతనికి చూపించు. ఈ గులాబీ ఎంత అందమైనదో అని అతనితో అను. వెంటనే అతను దీని వల్ల ఎటువంటి ప్రయోజనమూ లేదు. సాయంత్రంలోపు వాడి రాలిపోతుంది అంటాడు. యవ్వనం ఎంతటి సుఖమైనదో చెప్పమని అడిగితే అది నిజమే కావచ్చు కానీ ముసలితనం త్వరగా వచ్చేస్తుందిగా అంటాడు. సంతోషం గురించి మాట్లాడితే అదంతా వట్టి మాయ అంటాడు. కానీ వర్తమానంలో బతకడం తెలిసిన వ్యక్తిని ఓ ఉద్యానంలోకి తీసుకు వెళ్తే అక్కడి రంగు రంగుల పువ్వులను చూపిస్తే వాటిని చూసి అతనెంతగా ఆనందిస్తాడో తెలుసా... ఎన్ని కబుర్లు చెప్తాడో తెలుసా! ఇవి చూడటానికి వచ్చిన దారులను గురించి ఆలోచించవలసిన అవసరమేముందంటాడు.రాలిపోయే పువ్వులైనా సరే ఇప్పుడు ఎంత ఆందంగా ఉన్నాయో అంటాడు. వికసించే పువ్వులు అందమైనవా... రాలిపోయే పువ్వులు అందమైనవా అని అడిగితే గతించిన కాలాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటే వర్తమానంలోని నిజాన్ని గ్రహించలేమంటాడు. అది నిజం. ఏది నిజమో అది ఈ క్షణంలో ఉంది. నిజమనేది గతించిన, రానున్న కాలాలకు సంబంధించినది కాదు. వర్తమానమే నిజమైన కాలం’ అని చెప్పాడు జ్ఞాని. యువకుడికి విషయం అర్థమైంది. ఆనందంగా వెనుతిరిగాడు. – యామిజాల జగదీశ్ -
ఆడంబరాలు.. అనర్థాలు తెస్తాయి!
అవంతి రాజ్యాన్నేలే ఆనందవర్మకి ఒక్కడే కొడుకు. అతని విద్యాభ్యాసం పూర్తయ్యింది. వివాహం చేసి పట్టాభిషేకం చేయాలనుకున్నాడు ఆనందవర్మ. ఆ మాట రాణితో అంటే, ఆమె ‘అవును.. పెళ్ళి అంగరంగవైభవంగా చేయాలి. ఎందుకంటే మనకు ఒక్కగానొక్క కొడుకాయే!’ అంది. అదే విషయాన్ని రాజు మంత్రితో చెబితే, ఆయనా రాణి అన్నట్లే అన్నాడు. బంధుగణమూ, రాజోద్యోగులూ ‘అవును ఆకాశమంత పందిరేసి, భూదేవంత అరుగేసి చేయాలి’ అన్నారు.రాజుగారు అందరిమాట మన్నించి కుంతల రాకుమారితో యువరాజు వివాహం కనీవినీ ఎరుగనంత వైభవంగా చేశాడు. ఆ వేడుకలు చూసిన రాజ్యంలోని ప్రజలంతా ‘ఇలాంటి పెళ్ళి ఇంతకు ముందెప్పుడూ జరగలేదు. ఇక ముందు కూడా జరగబోదు’ అంటూ పొగడటం ప్రారంభించారు. రాజుగారి ఆనందం అంతా ఇంతా కాదు. అయితే ఆ ఆనందం అట్టేకాలం నిలవలేదు. ఒకరోజు చావు కబురు చల్లగా చెప్పాడు మంత్రి.. ఖజానా ఖాళీ అయిందని! ‘పరిష్కారం ఏమిటీ?’ అని రాజుగారు అడిగితే, ‘కొత్త పన్నులు వేసి ధనం రాబట్టడమే’ అన్నాడు మంత్రి. కొత్త పన్నులు విధించాడు రాజు. కొత్తగా పన్నులు వేసినపుడు ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడం రాజుగారికి అలవాటు. అలా రాజు, మంత్రి ఇద్దరూ మారువేషాల్లో బయలుదేరారు.పొద్దుపోయేసరికి రుద్రవరం అనే గ్రామం చేరారు. రాత్రికి అక్కడే సేదదీరి ఉదయాన్నే తిరిగి ప్రయాణం ప్రారంభిద్దామనుకుని, గుడి వద్ద సందడిగా ఉంటే అక్కడికెళ్లారు. గ్రామాధికారి కూతురి పెళ్ళి జరుగుతున్నది. పట్టుమని వంద మంది అతిథులు కూడా లేరు. ‘అంత పెద్ద పదవిలో ఉండి ఇంత నిరాడంబరంగా పెళ్ళి చేస్తున్నాడేమిటీ?’ అని ఆశ్చర్యపోయి రాజుగారు గ్రామస్థుల్ని విచారించాడు. ‘ముందుగా మన రాజుగారిలాగే ఆడంబరాలకు పోయి గ్రామాధికారి తన కుమార్తె వివాహం ఘనంగా చేయాలనుకున్నాడు. ఖర్చులు లెక్కేస్తే లక్షవరహాలు దాటేటట్టు అనిపించింది. ఆయనకది ఇష్టంలేకపోయింది.పెళ్ళి నిరాడంబరంగా జరిపి, ఆ లక్షవరహాలతో ఊర్లో వైద్యశాల నిర్మిస్తే తరతరాలు సేవలందిస్తుందని ఆలోచించాడు. ఇదే విధంగా రాజుగారు కూడా ఆలోచించి ఉంటే అనవసర వ్యయం తగ్గివుండేది. ఆ ధనంతో ఏదైనా సత్కార్యం చేసుంటే తరతరాలు రాజుగారి పేరు చెప్పుకునేవారు. ఆ విధంగా ఆయన చరిత్రలో నిలిచిపోయేవారు. మాకు ఈ కొత్త పన్నుల బాధ తప్పేది’ అన్నారు నిష్ఠూరంగా. రాజుగారికి ఎవరో చెంప ఛెళ్ళుమనిపించినట్లయింది.ఆయన తిరిగి మంత్రితో రాజధాని చేరి, చర్చలు జరిపి కొత్త పన్నులను రద్దు చేశాడు. అంతఃపుర ఖర్చులు తగ్గించాడు. వేట, వినోద కార్యక్రమాల ఖర్చులూ తగ్గించాడు. పాలనలో అనవసర వ్యయాలను తగ్గించాడు. ఆ తర్వాత ఖజానా సులువుగానే నిండింది. అప్పటినుంచి ఆనందవర్మ ఏ కార్యక్రమాన్నయినా ఒకటికి పదివిధాలుగా ఆలోచించి చేయసాగాడు. ఆడంబరాలకు పోక పొదుపు పాటించసాగాడు. ప్రజలపై పన్నుల భారం మోపకుండా మంచిపేరు సంపాదించుకున్నాడు. – డా. గంగిశెట్టి శివకుమార్ఇవి చదవండి: రోండా హిన్సన్.. 'అమ్మా రోమ్! నీకు ఏమైంది తల్లీ'? -
భీష్ముడు చెప్పిన.. పులి–నక్క కథ!
అంపశయ్య మీదనున్న భీష్ముడి వద్దకు వెళ్లిన ధర్మరాజు ‘పితామహా! లోకంలో కొందరు లోపల దుర్మార్గంగా ఉంటూ, పైకి సౌమ్యంగా కనిపిస్తుంటారు. ఇంకొందరు లోపల సౌమ్యంగా ఉన్నా, పైకి దుర్మార్గంగా కనిపిస్తుంటారు. అలాంటివాళ్లను గుర్తించడం ఎలా?’ అని అడిగాడు. అందుకు సమాధానంగా భీష్ముడు ‘ధర్మనందనా! నువ్వు అడిగిన సందేహానికి నేను పులి–నక్క కథ చెబుతాను’ అంటూ కథను మొదలుపెట్టాడు.‘పూర్వం పురిక అనే నగరాన్ని పౌరికుడు అనే రాజు పాలించేవాడు. బతికినన్నాళ్లు క్రూరకర్మలు చేయడం వల్ల నక్కగా జన్మించాడు. పూర్వజన్మ జ్ఞానం ఉండటం వల్ల ఈ జన్మలో మంచిగా బతుకుదామని తలచి, అహింసావ్రతం చేస్తూ ఆకులు అలములు తినసాగాడు. ఇది చూసి అడవిలోని తోటి నక్కలు ‘ఇదేమి వ్రతం? మనం నక్కలం. ఆకులు అలములు తినడమేంటి? నువ్వు నక్కల్లో తప్పపుట్టావు. నీకు వేటాడటం ఇష్టం లేకుంటే చెప్పు, మేము వేటాడిన దాంట్లోనే కొంత మాంసం నీకు తెచ్చి ఇస్తాం’ అన్నాయి.పూర్వజన్మ జ్ఞానం కలిగిన నక్క ‘తప్పపుట్టడం కాదు, తప్పనిసరిగా నక్కగా పుట్టాను. నాకు ఆకులు అలములు చాలు. నేను జపం చేసుకునే వేళైంది. మీరు వెళ్లండి’ అని చెప్పి మిగిలిన నక్కలను సాగనంపింది. నక్క అహింసావ్రతం చేçస్తున్న సంగతి అడవికి నాయకుడైన పులికి తెలిసింది. ఒకనాడు పులిరాజు స్వయంగా నక్క గుహకు వచ్చాడు.‘అయ్యా! నువ్వు చాలా ఉత్తముడివని తెలిసింది. నువ్వు నాతో వచ్చేయి. నీకు తెలిసిన మంచి విషయాలు చెబుతూ, నన్ను మంచిదారిలో నడిపించు’ అని వినయంగా ప్రాధేయపడ్డాడు. ‘రాజా! చూడబోతే నువ్వు గుణవంతుడిలా ఉన్నావు. అయినా నేను నిన్ను ఆశ్రయించలేను. నాకు ఐహిక సుఖాల మీద మమకారం లేదు. నీతో రాలేను’ అని బదులిచ్చింది నక్క.‘నాతో రాకపోయినా, నాతో సఖ్యంగా ఉంటూ నాకు మంచీచెడ్డా చెబుతూ ఉండు’ కోరాడు పులిరాజు.‘పులిరాజా! నువ్వూ నేనూ స్నేహంగా ఉంటే, నీతోటి వాళ్లు అసూయ పడతారు. మనిద్దరికీ విరోధం కల్పించడానికి ప్రయత్నిస్తారు. దానివల్ల కీడు తప్పదు. అందువల్ల నా మానాన నన్ను విడిచిపెట్టు’ బదులిచ్చింది నక్క.‘లేదు మహాత్మా! నీమీద ఎవరేం చెప్పినా వినను. అలాగని మాట ఇస్తున్నాను, సరేనా!’ అన్నాడు పులిరాజు. నక్క సరేనని ఆనాటి నుంచి పులితో సఖ్యంగా ఉండసాగింది.పులిరాజుకు నక్క మంత్రిగా రావడం మిగిలిన భృత్యులకు నచ్చలేదు. నక్క ఉండటం వల్ల తమకు విలువ దక్కడం లేదని అవి వాపోయాయి. చివరకు ఎలాగైనా నక్క పీడ విరగడ చేసుకోవాలని కుట్ర పన్నాయి. ఒకరోజు పులిరాజు గుహలో దాచుకున్న మాంసాన్ని దొంగిలించి, నక్క ఉండే గుహలో దాచిపెట్టాయి.గుహలో మాంసం లేకపోయేసరికి పులిరాజు భృత్యులందరినీ పిలిచి వెదకమని నాలుగు దిక్కులకూ పంపాడు. వెదుకులాటకు తాను కూడా స్వయంగా బయలుదేరాడు. నక్క గుహ దగ్గరకు వచ్చేసరికి మాంసం వాసన పులిరాజు ముక్కుపుటాలను తాకింది. లోపలకు వెళ్లి చూస్తే, తాను దాచిపెట్టుకున్న మాంసమే అక్కడ కనిపించింది.‘ఎంత మోసం!’ పళ్లు పటపట కొరికాడు పులిరాజు.ఈలోగా మిగిలిన భృత్యులంతా అక్కడకు చేరి, ‘మహారాజా! మీరు స్వయంగా గుర్తించబట్టి సరిపోయింది. లేకుంటే, నక్క ఏమిటి? అహింసావ్రతమేమిటి? మీ ఆజ్ఞకు భయపడి ఊరుకున్నామే గాని, దీని సంగతి ఇదివరకే మాకు తెలుసు’ అన్నాయి.‘వెళ్లండి. ఈ ముసలినక్కను బంధించి, వధించండి’ ఆజ్ఞాపించాడు పులిరాజు.ఇంతలో పులిరాజు తల్లి అక్కడకు వచ్చింది. ‘ఆగు! వివేకం లేకుండా ఏం చేస్తున్నావు? భృత్యులు చెప్పేదంతా తలకెక్కించుకునేవాడు రాజుగా ఉండతగడు. అధికులను చూసి హీనులు అసూయపడతారు. ఇలాంటివాళ్ల వల్లనే ఒకప్పుడు ధర్మం అధర్మంలా కనిపిస్తుంది. అధర్మం ధర్మంలా కనిపిస్తుంది. రాజు దగ్గర సమర్థుడైన మంత్రి ఉంటే, తమ ఆటలు సాగవని దుష్టులైన భృత్యులు నాటకాలాడతారు. అలాంటివాళ్లను ఓ కంట కనిపెట్టి ఉండాలి’ అని హితబోధ చేసింది.పులిరాజు తన భృత్యుల మోసాన్ని గ్రహించాడు. వెంటనే నక్కను పిలిచి, ‘మహాత్మా! నావల్ల పొరపాటు జరిగిపోయింది. మన్నించు. దుర్మార్గులైన నా భృత్యులను దండిస్తాను’ అని వేడుకున్నాడు.‘పులిరాజా! తెలిసిగాని, తెలియకగాని ఒకసారి అనుమానించడం మొదలుపెట్టాక తిరిగి కలుపుకోవాలని అనుకోవడం అవివేకం. ఒకవేళ నువ్వు నాతో సఖ్యంగా ఉండాలనుకున్నా, ఇక నాకిక్కడ ఉండటం ఇష్టంలేదు’ అంటూ పులి దగ్గర సెలవు తీసుకుని బయలుదేరింది. నిరాహారదీక్షతో శరీరం విడిచి, సద్గతి పొందింది.రాజు ఎన్నడూ చెప్పుడు మాటలకు లోబడకూడదు. మంచిచెడులను గుర్తెరిగి, మంచివారు ఎవరో, చెడ్డవారు ఎవరో తెలుసుకుని మసలుకోవాలి’ అని ధర్మరాజుకు బోధించాడు భీష్ముడు. – సాంఖ్యాయనఇవి చదవండి: రాతి కోటల్లో.. గాంధారి ఖిల్లా! -
జ్యూల్ థీఫ్.. సేల్స్ గర్ల్ శ్రమ!
‘వెల్ డన్! నీ సీనియర్స్‌ని బీట్ చేసి.. శాలరీ కన్నా డబుల్ అమౌంట్‌ని ఇన్సెంటివ్‌గా తీసుకుంటున్నావ్.. కంగ్రాట్స్’ అని ప్రశంసిస్తూ ఆమె చేతిలో ఓ ఎన్వలప్ పెట్టాడు మేనేజర్.‘థాంక్యూ సర్’ అని వినమ్రంగా బదులిచ్చి, బయటకు వచ్చింది. ఆమెకోసం బయట వెయిట్ చేస్తున్న కొలీగ్స్ ‘పార్టీ ఇస్తున్నావ్ కదా!’ అంటూ ఆమెను చుట్టుముట్టారు. కుడిచేతితో ఆ ఎన్వలప్ కొసను పట్టుకుని మరో చివరను ఎడమ అరచేతిలో కొడుతూ ‘ఈ డబ్బు పార్టీ కోసం కాదు. నా ఫస్ట్ అసైన్మెంట్ జ్ఞాపకంగా దాచుకోడానికి’ అన్నది తనకు మాత్రమే వినిపించేలా! ‘ఏం సణుగుతున్నవ్ పిల్లా?’ వేళాకోళమాడింది ఆ గుంపులోని ఓ కొలీగ్. ‘ఈ మొహాలకు పార్టీనా.. అని అనుకుంటుందేమోలేవే’ అంది ఇంకో కొలీగ్. ‘అనుకోదా మరి.. ఫ్లూయెంట్ ఇంగ్లిష్, హిందీతో కస్టమర్స్‌ని కన్విన్స్ చేస్తూ తన సెక్షన్ జ్యూల్రీ సేల్స్‌ని పెంచిన ఆమె కాన్ఫిడెన్స్ ఎక్కడా.. ప్రతిదానికి భయపడుతూ ఇన్ఫీరియర్గా ఉండే మీరెక్కడా!’ అన్నాడు సీనియర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్. ‘అయ్యో.. అలా ఏం కాదన్నా! ఫస్ట్ శాలరీ.. వెరీ ఫస్ట్ ఇన్సెంటివ్ కదా.. దీన్ని మా ఇంట్లో వాళ్ల కోసమే ఖర్చుపెడదామనుకుంటున్నా!’ అందామె.ఆ సిటీలోనే అతిపెద్ద జ్యూల్రీ షాప్ అది. దానికున్న మూడు బ్రాంచెస్ని వరుసగా యజమాని ముగ్గురు కొడుకులు, కార్పొరేట్ ఆఫీస్‌ని యజమాని చూసుకుంటున్నారు. ఆమె మెయిన్ బ్రాంచ్‌లో పనిచేస్తోంది. నెల కిందటే జాయిన్ అయింది. సీనియర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ చెప్పినట్టుగా కమ్యూనికేషన్ స్కిల్స్‌తో నెల రోజులకే సీనియర్స్ కన్నా ఇంపార్టెన్స్‌ని సంపాదించుకుంది.మరో పదిహేను రోజులకు.. ఆ ఏటికే మేటైన అమ్మకాన్నొకటి అందించిందామె! మేనేజ్మెంట్ ఖుషీ అయిపోయి ఇంకో ఇన్సెంటివ్నిచ్చింది. వర్కింగ్ అవర్స్‌లో సెల్ ఫోన్‌ను క్యారీ చేసే అవకాశాన్ని కూడా! తర్వాత వారంలో మరో బిగ్ సేల్నిచ్చింది. ఈసారి మేనేజ్మెంట్ ఆమెను సీనియర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా ప్రమోట్ చేసి.. క్యాష్, జ్యూల్రీ, గోల్డ్ బిస్కట్స్, డైమండ్స్ లాకర్స్ యాక్సెస్నిచ్చింది. అంతేకాదు ఆ షాప్ యజమాని ఇంట్లో జరిగే ఫంక్షన్లకూ ఆమెను పిలవసాగింది.. కుటుంబ సభ్యులకు సాయమందించడానికి. స్టాఫ్ అంతా ముక్కున వేలేసుకున్నారు.. ‘ఎంత ఎఫిషియెంట్ అయితే మాత్రం అంత నెత్తినపెట్టుకోవాలా?’ అని! ఎవరెలా కామెంట్ చేసుకున్నా యాజమాన్యానికి మాత్రం ఆమె ‘యాపిల్ ఆఫ్ ది ఐ’ అయింది. తరచుగా ఆమెను అన్ని బ్రాంచ్‌లు తిప్పుతూ అక్కడున్న సేల్స్ స్టాఫ్‌కి ఆమెతో ట్రైనింగ్ ఇప్పించసాగింది. తనకున్న చొరవతో కార్పొరేట్ ఆఫీస్‌లోని కీలకమైన విషయాల్లోనూ నేర్పరితనం చూపించి, ఆ బాధ్యతల్లోనూ ఆమె పాలుపంచుకోసాగింది. అలా చేరిన రెణ్ణెళ్లకే ఆ షాప్ ఆత్మను పట్టేసింది. ప్రతి మూలనూ స్కాన్ చేసేసింది.ఒక ఉదయం.. పదిన్నరకు ఎప్పటిలాగే ఆ జ్యూల్రీ షాప్ అన్ని బ్రాంచ్‌లూ తెరుచుకున్నాయి. కార్పొరేట్ ఆఫీస్ కూడా. అన్నిచోట్లా ఒకేసారి దేవుడికి దీపం వెలిగిస్తున్నారు. సరిగ్గా అప్పుడే ఆ నాలుగు చోట్లతోపాటు ఆ జ్యూల్రీ షాప్ యజమాని ఇంటికీ ఐటీ టీమ్స్ వెళ్లాయి. మెయిన్ బ్రాంచ్‌లో ఆమె సహా స్టాఫ్ అంతటినీ ఓ పక్కన నిలబడమన్నారు. సోదా మొదలైంది. ఆమె నెమ్మదిగా ఫోన్ తీసి స్క్రీన్ లాక్ ఓపెన్ చేయబోయింది. అది గమనించిన ఐటీ టీమ్‌లోని ఓ ఉద్యోగి గబుక్కున ఆమె ఫోన్ లాక్కుని, పూజ గదిలా ఉన్న చిన్న పార్టిషన్లోకి వెళ్లాడు.ఆ షాప్‌కి సంబంధించి రెయిడ్ చేసిన అన్ని చోట్లా దాదాపు అయిదు గంటలపాటు సోదాలు సాగాయి. పెద్దమెత్తంలో డబ్బు, బంగారం, డైమండ్స్ దొరికాయి. ఆ ఏడాది అతిపెద్ద రెయిడ్ అదే అనే విజయగర్వంతో ఉంది ఐటీ స్టాఫ్! ఫార్మాలిటీస్ పూర్తిచేసుకుని, ఫైనల్ కాల్ కోసం వెయిట్ చేయసాగారు. మెయిన్ బ్రాంచ్‌లో కూడా అంతా పూర్తయి, ఆ టీమ్ ఆఫీసర్ ఫైనల్ కాల్ చేయబోతుండగా.. కౌంటర్ దగ్గర నుంచి మేనేజర్ గబగబా ఆ బ్రాంచ్ చూసుకుంటున్న యజమాని పెద్దకొడుకు దగ్గరకు వచ్చి చెవిలో ఏదో చెప్పాడు. వెంటనే అతను అలర్ట్ అయ్యి.. ‘ఎక్స్క్యూజ్ మి సర్..’ అంటూ ఐటీ టీమ్ ఆఫీసర్ని పిలిచాడు. ఫోన్ చెవి దగ్గర పెట్టుకునే ‘యెస్..’ అంటూ చూశాడు. ‘ఒక్కసారి ఇలా రండి’ అంటూ కౌంటర్ దగ్గరకు నడిచాడు. డయల్ చేసిన కాల్ని కట్ చేస్తూ ఫాలో అయ్యాడు ఆఫీసర్. మేనేజర్ వంక చూశాడు యజమాని పెద్ద కొడుకు. కౌంటర్ టేబుల్ మీదున్న కంప్యూటర్ స్క్రీన్‌లో అంతకు కొన్ని క్షణాల ముందే రికార్డ్ అయిన సీసీ ఫుటేజ్ ప్లే చేశాడు మేనేజర్. పూజ గదిలో సోదా చేస్తున్న ఐటీ ఉద్యోగి ఒక సీక్రెట్ సేఫ్‌లో దొరికిన డైమండ్స్లోంచి ఒక డైమండ్‌ని జేబులో వేసుకోవడం కనిపించింది అందులో. చూసి నివ్వెరపోయాడు ఆఫీసర్. ఏం జరుగుతోందో అంచనా వేసుకుంటున్న ఆ ఉద్యోగి మొహంలో నెత్తరు చుక్క లేదు.‘సర్.. మీడియాను పిలవమంటారా?’ స్థిరంగా పలికాడు యజమాని పెద్ద కొడుకు. వెంటనే ఆ ఐటీ ఆఫీసర్ మిగిలిన చోట్లలో ఉన్న టీమ్స్‌కి ఫోన్ చేసి ‘రెయిడ్ క్యాన్సల్.. అంతా వదిలేసి వచ్చేయండి’ అన్న ఒక్క మాట చెప్పి గబగబా బయటకు నడిచాడు. అనుసరించింది టీమ్. వాళ్ల వంకే అయోమయంగా చూస్తూ నిలబడిపోయింది ఆమె!పదేళ్ల కిందట జరిగిన రెయిడ్ ఇది. ఆమె ఐటీ న్యూ ఎంప్లాయీ. ఆ షాప్స్, ఆ యజమాని ఇంటికి సంబంధించిన సమాచారాన్ని చేరవేయడానికి అందులో సేల్స్ గర్ల్‌గా చేరింది. చాకచక్యంతో ఫోన్ యాక్సెస్‌ను సంపాదించుకున్న ఆమె, డీటెయిల్స్ అన్నిటినీ స్కాన్‌చేసి ఎప్పటికప్పుడు డిపార్ట్మెంట్కి పంపేది. వాటి ఆధారంగానే రెయిడ్ చేశారు. ఫోన్ చూస్తున్నట్టు నటించడం, దాన్ని లాక్కోవడం అంతా కూడా ఐటీ వాళ్ల డ్రామా, యాజమాన్యానికి అనుమానం రాకుండా! అంతా సవ్యంగానే జరిగేదే.. ఆ ఉద్యోగికి సేఫ్‌లోని డైమండ్స్‌ని చూసి ఆశ పుట్టకపోయుంటే! ఆ పార్టీషన్లో సీసీ కెమెరా ఉందన్న విషయాన్ని మరచిపోయి గబుక్కున డైమండ్‌ని జేబులో వేసుకుని దొరికిపోయాడు. అంత పెద్ద రెయిడ్ క్యాన్సల్ అవడానికి కారణమయ్యాడు.( ఓ వాస్తవ సంఘటనకు కాస్త ఫిక్షన్‌ను జోడించి రాసిన కథనం ఇది. అందుకే ఊరు పేరు , వ్యక్తుల పేర్లు ఇవ్వలేదు. ప్రతివారం ఇలాంటి ఆసక్తికర కథనాన్ని ఇక్కడ చదవొచ్చు.) – శరాది -
సాయపు చేతులు..!
యమదూతలు ఓ మనిషిని తీసుకొచ్చి యమలోకాన యమ ధర్మరాజు ఎదుట నిలబెట్టారు. ఆ మనిషి ఎంతో దిగాలు ముఖం వేసుకుని నిల్చున్నాడు. పక్కనే చిత్రగుప్తుడు ఆ మనిషి ఖాతాను తరచి చూస్తున్నాడు. అతను ఏం తప్పు చేశాడని యమధర్మరాజు అడిగాడు. చిత్రగుప్తుడు అదే పనిగా అతని గురించి నమోదు చేసిన పేజీలను చదువుతుంటే తలతిరుగుతోంది. అంతా విన్నాడు యమధర్మరాజు.‘అతనిని నరకలోకంలో పడేయండి’ అన్నాడు యముడు. వెంటనే చిత్రగుప్తుడు అడ్డు తగిలి ఇలా అన్నాడు: ‘అతను అన్ని పాపాలు చేసిన ప్పటికీ ఒకే ఒక్క పుణ్యం చేశాడు. ఓరోజు ఓ వృద్ధురాలు గుడికి వెళ్ళడా నికి దారి అడిగితే చూపుడు వేలుతో దారి చెప్పడమే కాకుండా ఆమె చేయి పట్టుకుని వెళ్ళి దిగబెట్టాడు’. ఆ మాటతో యముడు తన తీర్పుని అప్పటికప్పుడు మార్చు కున్నాడు. ‘అతని చేతికి గంధం పూసి ముందుగా స్వర్గానికి తీసుకుపోండి. అనంతరం అతనిని నరకానికి తరలించవచ్చు’ అని ఆదేశించాడు.కర్ణుడు వంటి పుణ్యాత్మునికీ మరణానంతరం ఓ సమస్య ఎదురయ్యింది. ఆయన మహాదాత. అయితే ఆయన ధన రాశులను, వస్తువులనే ఇచ్చాడు. ఆకలిగొన్నవారి ఆకలి తీర్చిన చరిత్ర ఆయనకు లేదు. నిర్యాణానంతరం కర్ణుడు స్వర్గానికే వెళ్లాడు. స్వర్గానికి వెళ్ళే వారికి ఆకలి అనేది ఉండదు. కానీ కర్ణుడికి ఆకలి వేసింది. ఓమారు కర్ణుడు ‘నాకు మాత్రమే ఎందుకు ఆకలి వేస్తోంది’ అని స్వర్గ లోక ద్వార పాలకుని అడిగాడు. అప్పుడతను ‘నువ్వు భూలోకంలో ఎవరికీ అన్నదానం చేయలేదు. అందుకే నీకు ఆకలి వేస్తోంద’ని చెప్పాడు. ‘మరిప్పుడు ఏం చేయాలి. ఆకలి ఎక్కువై భరించలేకపోతు న్నాను’ అన్నాడు కర్ణుడు. వెంటనే ద్వారపాలకుడు ‘కర్ణా, నీ చూపుడు వేలుని నోట పెట్టుకో. ఆకలి తగ్గిపోతుంది’ అన్నాడు. కర్ణుడు అలాగే చేశాడు. ఆకలి పోయింది. ఇందుకు కారణమేమిటి?ఓసారి కృష్ణుడి సన్నిహితులకు కర్ణుడు అన్నం తినడానికి ఓ చోటును తన చూపుడు వేలుతో చూపించాడట. అది కాస్తా ఓ పుణ్య కార్యంగా కర్ణుడి ఖాతాలో జమైంది. పురాణాలు, ఇతిహాసాలలో పేర్కొన్న ఇటువంటి కథలను నమ్మవచ్చా, అసలు స్వర్గ–నరకాలు ఉన్నాయా అంటూ చర్చోప చర్చలు ఇక్కడ అనవసరం. మనిషిగా పుట్టినవాడు సాటి మనిషికి సాయం చేయడం అతడి కనీస ధర్మం అని తెలియచేయడానికి ఇటువంటి కథలు వాహకాలుగా నిలుస్తాయి. మానవ విలువలను ప్రోది చేసే భారతీయ తత్త్వం సర్వదా ఆచరణీయం. – యామిజాల జగదీశ్ -
సుగుణ భూషణుడు... విభీషణుడు!
విభీషణుడు విశ్రవసు, కైకసిల సంతానమే విభీషణుడు, రావణాసురుని చిన్న తమ్ముడు. అందరికంటే పెద్దవాడు రావణాసురుడు, కుంభకర్ణుడు రెండవవాడు. విభీషనుడు వీరిద్దరికంటే పూర్తి భిన్నమైన వాడు. సంస్కారవంతుడు, ఉత్తమోత్తమగుణాలు కలవాడు. సోదరులంటే అభిమానం కలవాడు. అందులో రావణాసురుడు అంటే భయభక్తులున్నవాడు. సీతమ్మ వారిని రావణాసురుడు చెర పట్టినప్పుడు‘అన్నా నీకు ఇది తగదు’ అని మొదట హెచ్చరించింది విభీషణుడే. తదుపరి ఎన్నడూ రావణుని మందిరానికి వెళ్ళింది లేదు.హనుమ లంకాదహనం చేసినప్పుడు మరోసారి రావణునికి హితబోధ చేయాలని దృఢంగా నిశ్చయించుకున్నాడు. రావణుడు, సీతమ్మ దగ్గరకు వెళ్ళి గడువు పెట్టి వస్తున్నప్పుడు, రావణుని ఏకాంతంగా కలసి చెప్పాలనుకుని భయంతో విరమించుకున్నాడు. ఈ దిశలో రామలక్ష్మణులు, వానర సైన్యంతో సముద్రాన్ని దాటి రావడం, రావణునితో సమర భేరి మోగించడం జరిగింది ఆ సమయంలో రాచకొలువులో కోపోద్రిక్తుడై యుద్ధంలో ఆ రోజు విధులను కొంతమంది రాక్షస వీరులను నియమించాడు. అప్పుడు కూడా విభీషనుడు, రావణునికి చెప్పలేకపోయాడు. అన్న అంటే అంత భయం అతనికి. యుద్ధంలో రాక్షస వీరులు మరణిస్తుంటే తట్టుకోలేక పోయాడు విభీషణుడు. అప్పుడే పూజ ముగించి దైర్యంతో నేరుగా రావణుని దగ్గరకు వెళ్ళాడు.. అప్పుడు రావణుడు ‘‘రా విభీషణా!రేపు యుద్ధంలో నీవే నాయకత్వం వహించాలి’’ అని చెబుతుండగా, విభీషణుడు చేతులు జోడించి ‘అగ్రజా! యుద్ధం మనకు వద్దు.సీతమ్మ పరమ సాధ్వి. ఆ రామలక్ష్మణులు దైవాంశ సంభూతులు... అందువల్ల... ’’ అంటుండగా రావణుని తీక్షణ చూపులు చూడలేక తల దించుకున్నాడు. మళ్ళీ ధైర్యంతో ‘ఒక్కసారి ఆలోచించు ఒక రాజుగా మీకు ఇది శ్రేయస్కరం కాదు. రాజు ప్రజల బాగోగులు చూడాలి. స్త్రీలకు రక్షణగా ఉండాలి. నా మాట విను, ఆ సీతమ్మ వారిని రాముల వారికి అప్పగించు. సమయం మించి పోలేదు. చేసిన తప్పు ఒప్పుకుని ఆ శ్రీరాముల వారిని శరణు వేడు. నీకు జయం కలుగుతుంది. శరణుజొచ్చిన వారిని అక్కున చేర్చుకునే మంచి గుణాలు అయనకు ఉన్నాయి, మీ మేలు కోరి ఈ లంక ప్రజల తరపున చివరిసారిగా చెబుతున్నాను. సీతమ్మ వారిని అప్పగించు, చేసిన తప్పు ఒప్పుకో! నిన్ను శ్రీ రాములు వారు కరుణిస్తారు’’ అని పరి పరి విధాలుగా చెప్పాడు.ఆ మాటలు విని రావణుడు ‘‘అయ్యిందా నీ ఉపన్యాసం? నాకే నీతులు చెబుతావా! ముల్లోకాలలోనూ నాకు ఎదురు లేదు అనే విషయం నీకు తెలియదా! ఆ రాముని వధించి, సీతను వివాహం చేసుకొనుటకే నేను నిశ్చయించుకున్నా, నీ హితబోధ నాకు కాదు. ఇదే నిన్ను శాసిస్తున్నాను. రేపు యుద్ధ భూమిలో నీవే ప్రధాన బాధ్యత వహించాలి ఇది నా ఆజ్ఞ’’ అని చర చర వెళ్ళిపోయాడు రావణుడు. విభీషణుడు అన్నీ ఆలోచించి శ్రీరాముల వారి దగ్గరకు ‘శరణు, శరణు’ అని వెళ్ళాడు.శ్రీ రాముడు అతన్ని చూశాడు. వినమ్రంగా, చేతులు జోడించి ఉన్న విభీషణుని చూడగానే ఆసనంపై నుంచి లేచి తన హృదయానికి హత్తుకున్నాడు.‘నా జన్మ ధన్యమైంది ప్రభూ’’ అంటూ శ్రీ రాముల వారి పాదాలు తాకి తన భక్తి, వినయం నిరూపించుకున్నాడు. ఆ విధంగా శ్రీరాముడితో విభీషణునికి స్నేహం కుదిరింది. రాముడికి యుద్ధంలో చేదోడుగా ఉన్నాడు. రావణుని మరణానంతరం లంకకు విభీషణుడు రాజైనాడు. ఇది శ్రీ రాముల వారు, విభీషణునికి ఇచ్చిన కానుక. లంకకు రాజైన విభీషణుడు సుపరిపాలన చేసి, ప్రజలకు ఉత్తమ పాలన అదించాడు. విభీషణుని చరిత్ర సువర్ణాక్షరాలతో లిఖించదగ్గది. – కనుమ ఎల్లారెడ్డి, పౌరశాస్త్ర అధ్యాపకులు -
గృహస్థాశ్రమ వైశిష్ట్యం: అది... క్షీరసాగరమథనం!
మనిషి జీవితంలో సంస్కారానికి ఆలంబన గృహస్థాశ్రమంలోనే. దానిలోకి వెడితే భార్య వస్తుంది, పిల్లలు వస్తారు...అలా చెప్పలేదు శాస్త్రం. అక్కడ ఆటు ఉంటుంది, పోటు ఉంటుంది. దెబ్బలు తగిలినా, సుఖాలు వచ్చినా... అవన్నీ అనుభవంలోకి రావల్సిందే. వాటిలో నీవు తరించాల్సిందే. కుంతీ దేవి చరిత్రే చూడండి. ఎప్పుడో సూర్య భగవానుడిని పిలిచి నీవంటి కొడుకు కావాలంది. కర్ణుడిని కనింది. అయ్యో! కన్యా గర్భం.. అపఖ్యాతి ఎక్కడ వస్తుందో అని విడిచిపెట్టలేక విడిచిపుచ్చలేక... మాతృత్వాన్ని కప్పిపుచ్చి నీళ్ళల్లో వదిలేసింది. తరువాత బాధపడింది. కొన్నాళ్ళకు పాండురాజు భార్యయింది. సుఖంగా ఉన్నాననుకుంటున్న తరుణంలో సవతి మాద్రి వచ్చింది. పిల్లలు లేరంటే మంత్రంతో సంతానాన్ని ధర్మరాజు, భీముడు, అర్జునుడిని ΄÷ందింది. ఆ మంత్రం మాద్రికి కూడా చెప్పమన్నాడు పాండురాజు. చెప్పింది. మాద్రికి నకులుడు, సహదేవుడు పుట్టారు.శాపం వచ్చింది. పాండురాజు చచ్చిపోయాడు. మాద్రి సహగమనం చేసింది. ఈ పిల్లలు నీ పిల్లలేనని ఏం నమ్మకం? అని... పాండురాజు పిల్లలకు రాజ్యంలో భాగం ఇవ్వరేమోనని... ఇది ధార్మిక సంతానం అని చెప్పించడానికి మహర్షుల్ని వెంటబెట్టుకుని పిల్లల్ని తీసుకుని హస్తినాపురానికి వెళ్లింది. అంత కష్టపడి వెడితే లక్క ఇంట్లో పెట్టి కాల్చారు. పిల్లల్ని తీసుకెళ్ళి నదిలో పారేసారు, విషం పెట్టారు. .. అయినా చలించకుండా ఇన్ని కష్టాలు పడుతూ పిల్లల్ని పెంచి పెద్ద చేసింది. ఆఖరికి ధర్మరాజు ఆడిన జూదంతో అన్నీ పోగొట్టుకుని అరణ్యవాసానికి వెళ్ళాల్సి వచ్చింది.అజ్ఞాతవాసం కూడా అయింది. తిరిగొచ్చారు. కురుక్షేత్రం జరిగింది. హమ్మయ్య గెలిచాం, పట్టాభిషేకం కూడా అయిందనుకున్నది. కంటికి కట్టుకున్న కట్టు కొంచెం జారి... కోపంతో ఉన్న గాంధారి చూపులు ప్రసరిస్తే ధర్మరాజుకు కాళ్ళు బొబ్బలెక్కిపోయాయి. అటువంటి గాంధారీ ధృతరాష్ట్రులు అరణ్యవాసానికి వెడుతుంటే... తన పిల్లలు గుర్తొచ్చి గాంధారి మళ్ళీ ఎక్కడ శపిస్తుందోనని, మీకు సేవ చేస్తానని చెప్పి... సుఖపడాల్సిన తరుణంలో వారి వెంట వెళ్ళిపోయింది. ఆమె పడిన కష్టాలు లోకంలో ఎవరు పడ్డారు కనుక !!!గంగ ప్రవహిస్తూ పోయి పోయి చివరకు సముద్రంలో కలిసినట్లు ఈ ఆట్లు, పోట్లు కష్టాలు, సుఖాలతో సంసార సాగరంలో చేరి తరించాలి. చివరలో తిలోదకాలు ఇచ్చేటప్పడు ఒక్కొక్కరి పేరు చెబుతున్నారు.. కొంత మంది పేరు చెప్పగానే ధృతరాష్ట్రుడు ‘నావాడు’ అంటున్నాడు... కొంత మందికి ధర్మరాజు ‘నావాడు’ అంటున్నాడు. కర్ణుడి పేరు చెప్పగానే ధృతరాష్ట్రుడు ‘నావాడు’ కాదన్నాడు. ధర్మరాజు కూడా ‘నావాడు’ కాదన్నాడు... తట్టుకోలేకపోయింది తల్లిగా. ‘‘వరంవల్ల పుట్టాడ్రా.. వాడు నీ అన్నరా, నీ సహోదరుడు... నా బిడ్డ...’’ అంది.మరి ధర్మరాజేమన్నాడు... తల్లిని శపించాడు..‘‘ఆడవారి నోట్లో నువ్వుగింజ నానకుండుగాక..’’ అని. దీనికోసమా ఇంత కష్టపడ్డది. అప్పుడొచ్చింది ఆమెకు వైరాగ్యం. కృష్ణభగవానుడిని స్తోత్రం చేసింది. గృహస్థాశ్రమం అంటే క్షీరసాగర మథనం. అక్కడ అమృతం పుట్టాలి. జీవితం అన్న తరువాత ఆటుపోటులుండాలి. రుషిరుణం, పితృరుణం, దేవరుణం... ఈ మూడు రుణాలు తీరాలన్నా, మనిషి తరించి పండాలన్నా గృహస్థాశ్రమంలోనే... అంతే తప్ప భార్యాబిడ్డలకోసం మాత్రమే కాదు.. కర్తవ్యదీక్షతో అన్నీ అనుభవంలోకి వచ్చిన నాడు ఈశ్వర కృప దానంతటదే వస్తుంది. – బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
మంత్రి ఎన్నిక! చంద్రగిరి రాజ్యాన్ని..
చంద్రగిరి రాజ్యాన్ని విజయసింహుడు పాలించేవాడు. కొంతకాలంగా మంత్రికి ఆరోగ్యం బాలేకపోవడంతో కొత్త మంత్రిని ఎన్నిక చేయాలనుకున్నాడు. అందుకు ఓ ప్రకటన చేయించాడు రాజు. అన్ని ప్రాంతాల నుంచి సుమారు పాతిక మంది దాకా మంత్రి పదవి పోటీకి వచ్చారు. వారికి నిర్వహించిన పోటీలలో గెలిచి చివరకు ధర్మయ్య, శివయ్య, సీతయ్య అను ముగ్గురు మిగిలారు. ‘వారిలో ఎవరు మంత్రి పదవికి సరిపోతారు?’ అని న్యాయనిర్ణేతను అడిగాడు రాజు. ‘ఆ ముగ్గురు మాసానికి ఎంత జీతం కావాలనుకుంటున్నారో దాన్ని బట్టి నిర్ణయిద్దాం మహారాజా’ అని చెప్పాడు న్యాయనిర్ణేత.మొదటగా ధర్మయ్యను అడిగాడు రాజు ‘నీకు మాసానికి ఎంత జీతం కావాలి?’అని. ‘మహారాజా! నాకు మాసానికి పది వరహాలు కావాలి’ చెప్పాడు ధర్మయ్య. అలాగే మిగిలిన ఇద్దరినీ అడగగా శివయ్యేమో ఎనిమిది వరహాలు కావాలని, సీతయ్యేమో ఆరు వరహాలు చాలని చెప్పారు.ముగ్గురి జవాబులు విన్న తరువాత ‘ధర్మయ్యా.. నీకు కాస్త ఆశ ఎక్కువగా ఉన్నట్టుంది. మాసానికి పది వరహాలు అడిగావు. అవతల ఇద్దరేమో రెండేసి వరహాలు తగ్గించి చెప్పారు’ అన్నాడు రాజు. ‘మహారాజా! నాకు ఈ మధ్యనే వివాహం అయ్యింది. నా తల్లిదండ్రులు నా మీదే ఆధారపడి ఉన్నారు. వారిని చూసుకోవలసిన బాధ్యత కూడా నాదే. కుటుంబ పోషణ, ఇంటి అద్దె ఇవన్నీ పోనూ ఒక వరహా అటూ ఇటూగా మిగులుతుంది. అప్పు లేకుండా జీవితం సాఫీగా జరిగిపోతుంది. నేను కోరింది న్యాయమైన జీతం’ బదులిచ్చాడు ధర్మయ్య.‘నువ్వు రెండు వరహాలు తగ్గించి ఎనిమిది వరహాలని ఎలా చెప్పావు?’ అని శివయ్యను అడిగాడు రాజు. ‘మహారాజా! నాకూ వివాహం అయ్యింది, తల్లిదండ్రులూ ఉన్నారు. ఖర్చుదేముంది ఎంతైనా పెట్టవచ్చు. ఉన్న దాంట్లోనే సర్దుకుంటాను. అందుకే ఎనిమిది వరహాలే చెప్పాను’ చెప్పాడు శివయ్య. ‘నువ్వు కూడా మరో రెండు వరహాలు తగ్గించి ఆరు వరహాలే చెప్పావు. వివరణ ఇవ్వు’ అని సీతయ్యనూ అడిగాడు రాజు. ‘మహారాజా! నాకూ భార్య, ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులు ఉన్నారు. ఉద్యోగం దొరకడం కష్టంగా ఉంది. ఎలాగోలా సర్దుకుంటాను. అందుకే ఆరు వరహాలు చాలు అన్నాను’ చెప్పాడు సీతయ్య.‘నువ్వేవిధంగా సేవలు అందిస్తావు?’ అడిగాడు ధర్మయ్యను న్యాయనిర్ణేత. ‘న్యాయపరంగా రాజుగారికి సలహాలు ఇవ్వడం, అవినీతి, లంచగొండితనానికి చోటు లేకుండా, ధర్మమార్గంలో నడుస్తూ అంకిత భావంతో దేశానికి సేవలు అందిస్తాను’ అన్నాడు ధర్మయ్య. శివయ్య, సీతయ్యలనూ అదే ప్రశ్న అడిగాడు న్యాయనిర్ణేత. తామూ మంచి దారిలోనే సేవలు అందిస్తామని చెప్పారు వారు.‘మహారాజా! ధర్మయ్య కోరింది న్యాయమైన జీతం. తక్కువ జీతం కోరిన శివయ్య, సీతయ్యలు కొలువు వస్తే చాలు అనే పద్ధతిలో రెండు వరహాలు తగ్గించి చెప్పారు. మంత్రి పదవి వచ్చాక కోటలో, బయట ఆ పదవికి భయపడే వారు ఎక్కువ. పక్కదారి పట్టి లంచాలు తీసుకుంటారు. కనుక ధర్మయ్యకే మంత్రి పదవి ఇవ్వండి’ అన్నాడు న్యాయనిర్ణేత.‘ధర్మయ్యా! మంత్రి పదవి నీకే ఇస్తున్నాను. చక్కగా కొలువు చేసుకో!’ చెప్పాడు రాజు. ‘మహారాజా! చాలా సంతోషం.. నా మీద ఎలాంటి ఆరోపణలు వచ్చినా ఆ క్షణమే నా ఉద్యోగం నుంచి తొలగిపోతాను’ అన్నాడు ధర్మయ్య. చెప్పినట్టుగానే నిజాయితీగా ఉద్యోగం చేసుకుంటూ తన పేరును సార్థకం చేసుకున్నాడు ధర్మయ్య.ఇవి చదవండి: ఇంద్రుడితో గృత్సమదుడి మైత్రి.. -
Dr Vikram Raju: సనాతనమే.. సమాధానం!
సాక్షి, సిటీబ్యూరో: నిద్రలేమి నుంచి నిలకడ లేమి దాకా ఆధునిక సమస్యలన్నింటికీ సనాతనం సమాధానం చెప్పింది అంటున్నారు నగరానికి చెందిన ఇండియన్ వేదిక్ స్కూల్ ఫౌండేషన్ డైరెక్టర్ డా. విక్రమ్‌రాజు.. కఠినమైన గణితం నుంచీ సంక్లిష్ట మానవ సంబంధాల దాకా విడమరిచి చెప్పాయనే పురాణాలను, శాస్త్రాలను స్తుతిస్తారు. ఆధునికులకు వాటిని అందించడం అంటే సమస్యల నుంచి విముక్తి కల్పించడమే అంటున్నారు. ఈ ఆలోచనలకు అనుగుణంగా తాను 2017లో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏళ్ల తరబడి కృషి చేసి సులభంగా అర్థమయ్యే రీతిలో వందలాది పుస్తకాలను, మెటీరియల్‌ను రూపొందించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రూపొందిన ఈ పుస్తకాలు వచ్చే నెల్లో పాఠశాలలకు అందుబాటులోకి తెస్తున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో తన ఆలోచనలను పంచుకున్నారిలా...దశావతారాన్ని మించిన మానవ పరిణామక్రమ సిద్ధాంతం లేదు. దీని ఆధారంగా మానవ పరిణామ క్రమానికి సంబంధించి 50 థియరీల పుస్తకంతో సహా విభిన్న కేటగిరీల్లో 150 బుక్స్ రూపొందించాం. ఆన్లైన్లో ఇండియన్ వేదిక్ స్కూల్ డాట్ కామ్‌లో 25 రకాల ప్రీ రికార్డెడ్ కోర్సులు తెలుగులో ఉండగా, కొన్ని ఇంగ్లిష్‌లో ఉన్నాయి. యాప్ డౌన్లోడ్ చేసుకుని కూడా చదువుకోవచ్చు.‘చిరు’నవ్వుల యోగం..ఆరేళ్ల చిన్నారికి ఎలాంటి యోగా నేర్పాలి? ఎవరికీ తెలియని పరిస్థితిలో 1 నుంచి 10వ తరగతి దాకా ఉపయోగపడేలా యోగా, చక్రాస్, ముద్రాస్, ధ్యాన విశేషాలతో బుక్స్ తయారు చేశాం.వేదం.. నిత్యజీవన నాదం..వేదాలు, పురాణాలను సరిగా అర్థం చేసుకుంటే నిత్య జీవితంలో ఎన్నో చిక్కుముళ్లు విడిపోతాయి. అయితే నేటి చిన్నారులకు ఇవేవీ అందుబాటులో లేవు. అందుకే రుగ్వేదం, సామవేదం, అధర్వణ వేదం, యజుర్వేదం వంటివన్నీ అర్థమయ్యే రీతిలో అందిస్తున్నాం.మన గణితం.. ఘన చరితం..ప్రస్తుత ఇంగ్లిష్, మ్యాథ్స్ రైట్ నుంచి లెఫ్ట్‌కి వెళితే.. వేదిక్ మ్యాథ్స్‌లో లెఫ్ట్ నుంచి రైట్కి చేస్తాం. ఒక నిమిషం çపట్టే గణిత సమస్యను, వేదిక్ మ్యాథ్స్ వల్ల ఒక సెకనులోనే చేసేయవచ్చు. అందుకే క్లాస్–1 నుంచి క్లాస్–8 వరకూ ఈ కోర్సు మెటీరియల్ తయారు చేయించాం.పురాణం.. ఆభరణం.. మొత్తం 18 పురాణాలు క్లుప్తీకరించి ఒక్కొక్కటి 100 పేజీల చొప్పున చేయించాం. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మహాభారతం కథ దశరథుడితో ప్రారంభమైతే, మేం అంతకన్నా ముందున్న బ్రహ్మ నుంచి స్టార్ట్ చేశాం. అలాగే రాముడు 81వ రాజు ఆయన కన్నా ముందున్న గొప్ప రాజుల గురించి కూడా ఇచ్చాం. మహాభారతంలో కౌరవ పాండవుల భాగం కన్నా ముందున్న కథని కూడా కలిపి అందిస్తున్నాంమెటీ‘రియల్’ వర్క్ మొదలైంది..పలు ప్రైవేటు పాఠశాలలతో ఒప్పందం చేసుకున్నాం. అలాగే అన్ని ప్రభుత్వ పాఠశాలలకూ ఈ మెటీరియల్ అందుబాటులోకి తేవాలని ప్రయతి్నస్తున్నాం. ఆన్‌లైన్‌లోనూ అందుబాటులోకి తెచ్చాం. ఇవి చదివిన వారికి పరీక్ష నిర్వహించి పొట్టి శ్రీరాములు వర్సిటీ వారి సర్టిఫికెట్ అందిస్తున్నాం. చిన్నారులకు యోగా నేర్పేందుకు సెట్విన్‌తో కూడా ఒప్పందం చేసుకున్నాం.సహకరిస్తే.. సాధిస్తాం.. ప్రభుత్వం స్పందించి సహకారం అందిస్తే దేశంలోనే ఎక్కడా లేని స్థాయిలో భారీగా వేదిక్ స్కూల్ క్యాంపస్ పెడదాం అనుకుంటున్నాం. సీబీఎస్ఈ సిలబస్‌తో పాటు ప్రతి రోజూ 1వ క్లాస్ నుంచి 10వ తరగతి వరకూ యోగా, వేదిక్ మ్యాథ్స్, వేదిక్ సైన్సెస్.. భారతీయ సంప్రదాయ నృత్యాలు, క్రీడలు, వేదాలు ఒకే క్యాంపస్‌లో నేర్చుకుంటే భావితరం దృక్పథం చాలావరకూ మారిపోతుంది. కనీసం 100 మంది నిరుపేద చిన్నారులకు ఉచిత ఆశ్రయమిచ్చి ఆ తర్వాత వారినే అక్కడ టీచర్లుగా తయారు చేయాలి.. ఇలాంటి ఆలోచనలతో మా ఫౌండేషన్ పనిచేస్తోంది.బొమ్మరిల్లు.. కొత్తగా..మన చిన్నప్పుడు బొమ్మరిల్లు ఎంతగా ఆదరణ పొందిందో తెలిసిందే. మేం గత 2012లో బొమ్మరిల్లు పబ్లికేషన్స్‌ను సొంతం చేసుకున్నాం. ఆ కథల రీతిలో నైతిక విలువలు జొప్పించిన పురాణేతిహాసాల్లోని కథలను సంక్షిప్తంగా అందిస్తున్నాం. అలాగే ముఖ్యమైన దేవతలు 50 మంది గురించి సింప్లిఫై చేసి 100 పేజీల్లో రాయించాం. -
స్వీయ క్రమశిక్షణ..
మనం అభివృద్ధి చేయగల అత్యంత ముఖ్యమైన జీవన నైపుణ్యాలలో స్వీయ–క్రమశిక్షణ ఒకటి. ఏదైనా ఒక పనిని మనం చేస్తున్నపుడు ఆ మార్గంలో ఎలాంటి ప్రలోభాలు, ఆకర్షణలు ఎదురైనా వాటికి ఏ మాత్రం ప్రభావితం కాకుండా మనస్సుని నియంత్రించుకుని.. చేస్తూన్న పనిపైనే సంపూర్ణమైన దృష్టిని కేంద్రీకరించడమే‘ స్వీయ క్రమశిక్షణ‘. స్వీయ–క్రమశిక్షణ ఆత్మవిశ్వాసాన్ని పెం΄÷ందిస్తుంది. నమ్మకమైన వ్యక్తిత్వాన్ని నిర్మించడంలో సహాయపడుతుంది. ఇది సమయపాలన కూడా నేర్పుతుంది. అలాగే, తనను తాను మలచుకోవడానికి, అభివృద్ధి సాధించడానికి ఇంధనంగా పనిచేస్తుంది. ఇది ఏకాగ్రతను పెంచుతుంది. పరధ్యానాన్ని నివారించడానికి సహాయపడుతుంది. అలాగే, ఒత్తిడిని దూరం చేస్తూ, కష్టతరమైన పరిస్థితుల్లో ప్రశాంతంగా... ధైర్యంగా ఎలా ఉండవచ్చో అవగతం చేస్తుంది.వివిధ కార్యకలాపాలకు ఎలాంటి ప్రణాళికలు అవలంబించాలో, ఎలా నిర్వహించాలో నేర్పుతుంది. స్వీయ–క్రమశిక్షణ కలిగిన వారు తమ లక్ష్యాలపై దృష్టిసారిస్తే, పరీక్షలలో బాగా రాణించడానికి, వారి అభ్యాస లక్ష్యాలను సాధించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అధ్యయనాలు వెల్లడించాయి. ఇతర జీవిత నైపుణ్యాల మాదిరిగానే, స్వీయ–క్రమశిక్షణలో ్రపావీణ్యం సంపాదించడానికి చాలా సంవత్సరాల అభ్యాసం అవసరం. అయితే ఇది బాహ్యంగా ఎవరో మనల్ని అదుపు చేస్తుంటే అలవరచుకునేదిలా కాకుండా మనకు మనమే పరి చేసుకునేలా ఉండాలి. గాంధీజీ, అబ్దుల్ కలామ్, బెంజమిన్ ఫ్రాంక్లిన్, థామస్ ఆల్వా ఎడిసన్, అబ్రహాం లింకన్, హెన్రీఫోర్డ్, ఆండ్రో కార్నెగీ, వాల్ట్ డిస్నీ, బరాక్ ఒబామా వంటి మహనీయులంతా తమ తమ జీవితాలలో పాటించిన ‘ స్వీయ క్రమశిక్షణ వల్లే ఉన్నత శిఖరాలకు చేరుకుని, జననీరాజనాలందుకున్నారు.కనుక స్వీయ క్రమశిక్షణను సరైన వయస్సులో నేర్పించి అలవాటు చేసినట్లయితే అది జీవితాంతం మన వ్యక్తిగత అభివృద్ధికి, విజయ సాధనకు సహాయపడుతుంది. స్వీయ క్రమశిక్షణను అలవరచుకోవడానికి ఎప్పటికప్పుడు మనల్ని ప్రేరేపించుకుని సాధన చేస్తే స్వీయ క్రమశిక్షణ మన సొంతమై, అనేక విజయాలను సంపాదించి పెడుతుంది. ఇది మన భవిష్యత్ గమ్యాన్ని దిశానిర్దేశం చేయడంతో పాటు, మన జీవితానికి ఓ అర్ధాన్ని, పరమార్థాన్ని అందించి పెడుతుంది. కనుక ఏ మనిషైతే స్వీయ క్రమశిక్షణను అలవరచుకుంటాడో, అలాంటి వారు జీవితంలో అత్యంత సులువుగా ఉన్నత శిఖరాలను చేరుకుంటారనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి అనిపించుకోదు."స్వీయ క్రమశిక్షణ అనేది ఓ గొప్ప వ్యక్తిత్వపు లక్షణం. ఇది నిరంతరం చేయాల్సిన తపస్సు లాంటిది. ఒకానొక విద్యార్థి తన జీవితంలో పాటించే స్వీయ క్రమశిక్షణ ఆ విద్యార్థి పూర్తి జీవితానికి బంగారు బాట అవుతుంది." – దాసరి దుర్గా ప్రసాద్ -
Shri Krishna Janmashtami: కృష్ణం వందే జగద్గురుం!
బాల్యంలో వెన్నదొంగగా వన్నెకెక్కినవాడు. మన్నుతిన్నాడని గద్దించిన తల్లి యశోదకు తన నోట ఏడేడు పద్నాలుగు లోకాలనూ చూపించినవాడు. బృందావనంలో వేణుగానం వినిపిస్తూ, గోపికలను రాసలీలలతో అలరించినవాడు. దుష్టశిక్షణ శిష్టరక్షణ నెరవేర్చినవాడు. కురుక్షేత్రంలో బంధువులను తన చేతులతో చంపలేనని, యుద్ధం చేయలేనని అస్త్రాలను విడిచిపెట్టిన అర్జునుడికి భగవద్గీతను బోధించి, కర్తవ్యోన్ముఖుణ్ణి చేసినవాడు. భగవద్గీతను బోధించినందున గీతాచార్యుడిగా, జగద్గురువుగా భక్తుల పూజలు అందుకొనే శ్రీకృష్ణ పరమాత్ముడు సర్వాంతర్యామి. ఆయన జగన్నాథుడు. ఆయన ఆర్తత్రాణపరాయణుడు. శ్రీకృష్ణుడి భక్తులు ప్రపంచం నలుమూలలా ఉన్నారు. మన దేశంలో బృందావనం, మథుర, ద్వారక సహా పలు శ్రీకృష్ణ క్షేత్రాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా శ్రీకృష్ణుడికి వేలాదిగా ఆలయాలు ఉన్నాయి. ఇవే కాకుండా, విదేశాల్లోనూ శ్రీకృష్ణుడికి ఎన్నో ఆలయాలు ఉన్నాయి. ఆగస్టు 26 శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా విదేశాల్లో ఉన్న శ్రీకృష్ణ ఆలయాల విశేషాలు మీ కోసం...శ్రీకృష్ణుడి ఆరాధాన ప్రాచీనకాలంలోనే విదేశాలకు పాకింది. క్రీస్తుపూర్వం ఎనిమిదో శతాబ్దంలోనే ప్రాచీన గ్రీకులు శ్రీకృష్ణుడిని వాసుదేవుడిగా, దేవాదిదేవుడిగా కొలిచేవారు. గ్రీకు రాయబారి హిలియోడారస్ క్రీస్తుపూర్వం 113 సంవత్సరంలో మధ్యప్రదేశ్‌లోని విదిశా నగరంలో ఒక గరుడస్తంభాన్ని నాటించాడు. ఈ రాతి స్తంభంపై బ్రహ్మీలిపిలో ‘వాసుదేవుడు దేవాదిదేవుడు’, ఆయన అడుగుజాడలైన ఆత్మనిగ్రహం, జ్ఞానం, దానం అనుసరించడం వల్ల స్వర్గాన్ని చేరుకోవచ్చు’ అని రాసి ఉంది. గ్రీస్ రాజధాని ఏథెన్స్లో ప్రస్తుతం ‘ఇస్కాన్’ శ్రీకృష్ణ ఆలయాన్ని నిర్వహిస్తోంది.మన పొరుగు దేశాల్లో కృష్ణాలయాలు..బ్రిటిష్ పాలనలో ఒకటిగా ఉండి తర్వాత విడిపోయిన మన పొరుగు దేశాలు పాకిస్తాన్, బంగ్లాదేశ్, బర్మాలలోను, నేపాల్లోను కృష్ణాలయాలు ఉన్నాయి. బంగ్లాదేశ్‌లో ఇస్కాన్ ఆధ్వర్యంలో నడిచే కృష్ణాలయాలతో పాటు కొన్ని పురాతన ఆలయాలు కూడా ఉన్నాయి. దినాజ్‌పూర్‌లోని ‘కళియా జుయె’ ఆలయం, జెస్సోర్‌లోని రాధాకృష్ణ మందిరం, పాబ్నాలోని జగన్నాథ ఆలయం బంగ్లాదేశ్‌లోని పురాతన కృష్ణాలయాల్లో ప్రముఖమైనవి. పాకిస్తాన్‌లోని క్వెట్టా, రావల్పిండి, హరిపూర్, ఫతేజంగ్ తదితర చోట్ల పురాతన కృష్ణాలయాలు ఉన్నాయి. లాహోర్‌లో 2006లో కొత్తగా కృష్ణాలయాన్ని నిర్మించారు. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో అక్కడి ప్రభుత్వ అనుమతితో కొత్తగా కృష్ణాలయ నిర్మాణం ప్రారంభమైంది. దీని నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. నేపాల్ రాజధాని కాఠ్మాండూ సహా పాటన్, నవల్పరాసీ, రాజ్‌బిరాజ్ తదితర ప్రాంతాల్లో పురాతన కృష్ణాలయాలు ఉన్నాయి.ఖండ ఖండాంతరాల్లో కృష్ణాలయాలుమన పొరుగు దేశాల్లోనే కాకుండా, ఆసియా, యూరోప్, అమెరికా, ఆస్ట్రేలియాల్లో కృష్ణాలయాలు ఉన్నాయి. మలేసియాలోని కౌలాలంపూర్‌లో అక్కడ స్థిరపడిన తమిళులు నిర్మించిన కుయిల్ శ్రీకృష్ణాలయం, పెనాంగ్‌లో శ్రీకృష్ణాలయం, రాధాకృష్ణాలయం సహా పలు కృష్ణాలయాలు ఉన్నాయి. సింగపూర్‌లో 1870 నాటి శ్రీకృష్ణాలయం ఉంది. దీనిని సింగపూర్ ప్రభుత్వం జాతీయ సాంస్కృతిక వారసత్వ నిర్మాణంగా గుర్తించింది. మయాన్మార్లో రాధామండలేశ్వర ఆలయం, థాయ్లండ్లో క్రీస్తుశకం ఏడో శతాబ్ది నాటికే వైష్ణవారాధన ఉండేది. థాయ్లండ్లోని శ్రీథేప్లో పదమూడో శతాబ్ది నాటి వైష్ణవాలయంలో గోవర్ధనగిరి పైకెత్తిన శ్రీకృష్ణుడి విగ్రహం కనిపిస్తుంది. దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో స్థిరపడిన భారతీయులు రాధా శ్యామసుందర ఆలయాన్ని నిర్మించుకున్నారు. భారత సంతతి జనాభా ఎక్కువగా ఉండే ట్రినిడాడ్ అండ్ టొబాగోలో సెయింట్ మాడలిన్ నగరంలోని కృష్ణ మందిరం, డెబె పట్టణంలోని గాంధీగ్రామంలో రాధాకృష్ణ మందిరం సహా పలు కృష్ణాలయాలు ఉన్నాయి.బ్రిటన్ రాజధాని లండన్‌లో కృష్ణయోగ మందిరం, రాధాకృష్ణ ఆలయాలతో పాటు లివర్‌పూల్, మాంచెస్టర్, ఓల్డ్హామ్, స్వాన్సీలలో రాధాకృష్ణ ఆలయాలు, గ్లోస్టర్‌షైర్, ష్రాప్షైర్, కాన్వెంట్రీ, డుడ్లీ, శాండ్వెల్, బోల్టన్లలో కృష్ణ మందిరాలు చాలాకాలంగా ఉన్నాయి. ఇవే కాకుండా, బ్రిటన్‌లో పలుచోట్ల కృష్ణారాధన జరిగే ‘ఇస్కాన్’ మందిరాలు, స్వామినారాయణ్ మందిరాలు కూడా ఉన్నాయి. అమెరికాలోని బోయిజ్ స్టేట్ యూనివర్సిటీ సమీపంలో హరేకృష్ణ ఆలయం ఉంది. ఈ ఆలయంలో వైదిక సంస్కృతీ కేంద్రం కూడా పనిచేస్తోంది. హాల్బ్రూక్లో ‘బ్రజమందిర్’ పేరిట కృష్ణాలయం ఉంది. ఆస్టిన్‌లో రాధామాధవధామ్ ఆలయం, మిల్‌క్రీక్ సాల్ట్‌లేక్ సిటీలో కృష్ణాలయం, స్పానిష్ఫోర్క్లో రాధాకృష్ణాలయం, మిల్వాకీలో రాధామాధవ మందిరంతో పాటు పలుచోట్ల ‘ఇస్కాన్’ నిర్వహిస్తున్న కృష్ణాలయాలు ఉన్నాయి. భారత్ నుంచి వెళ్లి స్థిరపడిన హిందువులు ఎక్కువగా నివసించే గల్ఫ్ దేశాల్లోనూ కృష్ణాలయాలు దుబాయ్‌లో ‘శ్రీకృష్ణ హవేలి’, బహ్రెయిన్‌లో శ్రీనాథ ఆలయం, ఓమన్‌లో శ్రీకృష్ణాలయం ఉన్నాయి. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో హరేకృష్ణ ఆలయంతో పాటు పలుచోట్ల ఇస్కాన్ ఆధ్వర్యంలోని కృష్ణాలయాలు ఉన్నాయి. దక్షిణాఫ్రికాలోని మార్ల్బ్రోలో, శాండ్టన్లలో రాధేశ్యామ్ ఆలయాలు ఉన్నాయి.ఇవే కాకుండా, ‘ఇస్కాన్’ ఆధ్వర్యంలో ప్రపంచం నలుమూలలా దాదాపుగా అన్ని దేశాల్లోనూ కృష్ణాలయాలు ఉన్నాయి. అలాగే స్వామినారాయణ్ ఆలయాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయాల్లో ఏటా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతాయి. వీటితో పాటు దేశ విదేశాల్లోని ఇతర వైష్ణవ ఆలయాల్లో కూడా శ్రీకృష్ణాష్టమి వేడుకలు జరుగుతాయి. -
‘శ్రియః కాంతాయ కల్యాణనిధయే నిధయే అర్థినామ్...’ అనే మంగళ శ్లోకం?
‘శ్రియః కాంతాయ కల్యాణనిధయే నిధయే అర్థినామ్...’ అనే మంగళ శ్లోకం, వైష్ణవాలయాల్లో, వైష్ణవుల నిత్య పూజల్లో దేశ విదేశాలలో ప్రతిరోజూ కొన్ని లక్షలసార్లు వినబడుతుంది. శ్రియః కాంతాయ (శ్రీదేవి వల్లభుడైన స్వామికి), కల్యాణ నిధయే (సమస్త కల్యాణ గుణాలకూ నెలవైన స్వామికి), నిధయే అర్థినామ్ (ప్రార్థ నలు చేసే అర్థి జనానికి పెన్నిధి అయిన స్వామికి), శ్రీ వేంకటనివాసాయ (శ్రీ వేంకటాద్రి నివాసుడికి), శ్రీనివాసాయ (లక్ష్మీ నివాసు డైన స్వామికి) మంగళమ్ (మంగళమగుగాక)! వేంకటేశ్వర సుప్ర భాతంతో పాటు రోజూ వినిపించే మంగళ ఆశాసన శ్లోకాల్లో ప్రప్ర థమ శ్లోకం ఇది. ఈ మంగళాశాసన శ్లోకాలు రచించిన ధన్యుడు 14వ శతాబ్దంలో జీవించిన ప్రతివాది భయంకర అన్నంగరాచార్యు లవారు అనే విద్వన్మణి. మనోహరమైన భావా లను, మధురమైన పదాలతో పొదిగి చెప్పే ఈ శ్లోకాలు ఆస్తికులకు సుపరిచితాలు.ఒక శ్లోకం... లక్ష్మీ– సవిభ్రమ – ఆలోక – సుభ్రూ విభ్రమ – చక్షుషే (లక్ష్మీదేవిని సంభ్ర మంతో కుతూహలోత్సాహాలతో రెప్పలారుస్తూ చూస్తున్నప్పుడు ముచ్చట గొలిపే కనుబొమల కదలికలు కలిగిన వాడినిగా వేంకటేశ్వరుడిని వర్ణిస్తే; మరొక శ్లోకం... సర్వావయవ సౌందర్య/ సంపదా, సర్వచేతసామ్/ సదా సమ్మోహనాయ (సకల అవయవ సౌందర్య సంపద చేత, సర్వ ప్రాణులకూ సదా సమ్మో హనకారుడు)గా ఆయనను అభివర్ణిస్తుంది. శ్రీ వేంకటాద్రి శృంగ అగ్రానికి మంగళకరమైన శిరోభూషణంగా నిలిచిన స్వామిని మరొక శ్లోకం కొనియాడింది.వైకుంఠం మీద విరక్తి కలిగి, తిరుమల క్షేత్రంలో స్వామి పుష్క రిణి తీరంలో స్వామి, లక్ష్మీదేవితో విహరిస్తున్నాడని ఒక శ్లోకం చమ త్కరిస్తే, భక్త పురుషులకు తన పాదాల శరణ్యత్వాన్ని, స్వామి స్వయంగా తన దక్షిణ హస్తం ద్వారా చూపుతున్నాడని మరొక శ్లోకం ఉత్ప్రేక్షిస్తుంది. ఈ మంగళాశాసన శ్లోకాల విశేష ప్రాచుర్యా నికి వాటి అసాధారణ సౌందర్యమే కారణం. – ఎం. మారుతి శాస్త్రి -
అసలైన ప్రార్థన అంటే?
మన శాస్త్రాల్లో సాధకులకు ఉపయోగపడే వందల కొలది మార్గాలు ఉన్నాయి. ప్రపంచంలో వేల కొలది బోధకులు ఉన్నారు. మన సంప్రదాయాలను అనుసరించి భగవంతునికి కోట్లాది రూపాలున్నాయి. సాధకులు తమ మార్గాలను, గురువులను, వారు పూజించు దేవుళ్ళను మార్చుకోవడం చూస్తూ ఉంటాం. ఆ విధంగా చేయడం సరైనదే కావచ్చు, కాకపోనూ వచ్చు. కానీ లక్ష్యాలను చేరుకోవడానికి వారు చూపించే ఉత్సాహం మెచ్చుకోతగింది. అటువంటివారి దృష్టి అంతా ఎల్లప్పుడూ ఆదర్శమార్గం, ఆదర్శ గురువు, ఆదర్శప్రాయమైన భగవత్ స్వరూపం పైననే ఉంటుంది. వారు ఏ మార్గాన్ని అనుసరించినప్పటికీ, ప్రయాణం మాత్రం అంతరాత్మ లోనికే అనే విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు.గురువులందనూ బోధించే సత్యం ఒకటే. భగవంతుని ఏ స్వరూపంలో పూజించినప్పటికీ, అది సర్వేశ్వరుని పూజించినట్లే. వారు ఎంచుకొనే మార్గం, అనుసరించే గురువు, ఆరాధించే భగవత్ స్వరూపం... ఇవన్నీ సాంకేతికంగా భగవంతుని సూచిస్తాయి. నీవు నీ మార్గాన్ని గంభీరంగా, భక్తిపూర్వకంగా నిశ్చిత బుద్ధితో అనుసరించడమే ముఖ్యం. ప్రపంచంలోని అన్ని మతాలవారికీ ప్రార్థన ఉంది. అయితే చేసే విధానాలు విభిన్నంగా ఉండవచ్చు. కాని ఇది అందరికీ ముఖ్యమైనది. కేవలం మానవులకు మాత్రమే ప్రార్థన అనేదాన్ని భగవంతుడు అనుగ్రహించాడు. ప్రార్థన చాలా శక్తిమంతమైనది. మనకు ఆపదలు, దుఃఖం కలిగినప్పుడు మాత్రమే సాధారణంగా భగవంతుని ప్రార్థిస్తాం.దీనిలో నష్టం ఏమీ లేదు. అయినప్పటికీ, అన్ని పరిస్థితుల్లో భగవంతుని ప్రార్థించడం అలవరచుకోవాలి. వ్యక్తిత్వాన్ని సరిచేసుకోవడం, ఆత్మవికాసమే ప్రార్థన ముఖ్య ఉద్దేశాలుగా ఉండాలి. భౌతిక అవసరాలను లేక కోరికలను తీర్చు కోవడానికి భగవంతుని ప్రార్థించకూడదు. కాబట్టి నీవు చేసే ప్రార్థన బంధ విముక్తి కోసం చేయాలి. ఎట్టి పరిస్థితిలో అయినా ఆ దేవదేవుని మరచిపోకుండా ఉండేట్లు ఉంచమని ఆయననే ప్రార్థించాలి. కొన్ని విషయాలు మనకు సంతోషం కలిగించవు. అందువలన బాధ కలుగుతుంది. అటువంటి విషయాలను ప్రార్థన ద్వారా దేవుని అడుగరాదు. అదే నిజమైన ప్రార్థన. నీ ప్రార్థన భగవంతుని నియమానుసారానికి లోబడి ఉండాలి. అందుకు తగినట్లు నిన్ను నీవు మలచుకోవాలి.– శ్రీ గణపతి సచ్చిదానందస్వామి -
శోక జీవితం నిరాశామయం!
కష్టాలలో పడి బాధలను అనుభవిస్తున్న మనిషికి తన చుట్టూ చోటుచేసుకుంటున్న సుఖ సంతోషాలను గురించిన స్పందన, కాలం గడిచే కొద్దీ తగ్గిపోయి, చివరకు దాదాపుగా నశించిపోతుంది. బతుకంతా కష్టంతోనే కూడుకున్నట్లుగా కనబడి అంతులేని నిరాశకు, అయోమయానికి గురిచేస్తుంది. ఇందులో ఆశ్చర్యపోవాల్సింది ఏమీ లేదు. జీవితంలో ఏదో ఒక సమయంలో ఈ విపరీత మానసిక స్థితిని ఎదుర్కొనని మనిషి దాదాపుగా ఉండడు అంటే అది అతిశయోక్తి కాదు. ఈ విపరీత మాన సిక స్థితిని ఒక సరసమైన సన్నివేశంలో చెప్పాడు కనుపర్తి అబ్బయామాత్యుడు ‘కవిరాజ మనోరంజనము’ కావ్యం ద్వితీయాశ్వాసంలో.మానవలోకంలో చంద్రవంశానికి చెందిన ప్రభువైన పురూరవుడిని ప్రేమించింది దేవేంద్రుడి సభలో నర్తకియైన ఊర్వశి. అయితే, లోకాలు వేరైన కారణంగా, పురూరవుడితో సాంగత్యాన్ని ఎలా పొందాలో తెలియని అవస్థలో పడింది. అలా పురూరవుడి ధ్యాసలో పూర్తిగా మునిగిపోయిన ఊర్వశి సర్వమూ మరిచి దుఃఖిస్తూ ఉన్న స్థితిని ఇలా వర్ణించాడు అబ్బయా మాత్యుడు.'పువ్వులు మానె దావి మెయిపూతలు మానె సఖీజనంబుతో నవ్వులు మానె గీరవచన ప్రతిభాషలు మానె మానె దానెవ్వియు నింపుగాక సుఖహేతువు లెల్ల మనోజబాధ నాజవ్వని ‘దుఃఖితే మనసి సర్వమసహ్యమ’ నంగ లేదొకో'పూవులు పెట్టుకోవడం మానేసింది; సుగంధ పరిమళాలు వెదజల్లే లేపనాలను శరీరంపై రాసుకోవడం మానేసింది; తోటివారితో నవ్వులు మానివేసింది; సరస మైన సంభాషణలతో సమాధానాలను మానివేసింది; ఈ శోకం కారణంగా, ఒకప్పుడు ఆహ్లాదంగా అనిపించినవి అన్నీ ఇప్పుడు సుఖం ఇచ్చేవిగా కనుపడడంలేదు ఊర్వశికి. భరింపరాని దుఃఖంలో మునిగిపోయిన మనిషికి లోకంలో అంతా దుఃఖమయంగానూ, సహింపరానిదిగానూ కనపడడంలో ఆశ్చర్యపోవాల్సింది ఏమీ లేదు కదా! అని పై పద్యం భావం. శోకంలో మునిగివున్న మనిషికి సర్వమూ సహింపరానిదిగా కనబడుతుందన్నది స్వతహాగా అనుభవించకపోయినప్పటికీ అందరూ గ్రహించగలిగే సంగతే! కష్టమే అయినప్పటికీ ప్రయత్నం చేసి శోకంలోంచి ఎంత త్వరగా బయటపడితే అంతగా మేలు జరుగుతుందన్నది అందరూ సారాంశంగా గ్రహించవలసిన విషయం. – భట్టు వెంకటరావు -
పులి మెచ్చిన చిత్రం!
సిద్ధారం గ్రామంలో సిద్ధప్ప అనే యువకుడు ఉండేవాడు. అతనికి ఓర్పు తక్కువ. ఏ పనైనా వెంటనే కావాలనుకునేవాడు. గురుకులంలో కూడా ఏరోజుది ఆరోజు చదవకుండా పరీక్షల ముందే చదివిన సిద్ధప్పకు చదువు ఆబ్బలేదు. రాసుకోటానికి ఇచ్చిన పుస్తకాలలోని కాగితాల మీద బొమ్మలు వేస్తూ కాలక్షేపం చేస్తుండేవాడు. పుస్తకాలలోని బొమ్మలు చూస్తూ తాను కూడా అలా బొమ్మలు గీయటానికి ప్రయత్నించేవాడు.దాంతో చుట్టు పక్కలవాళ్లు ‘వీడికి చదువురాదు కానీ, ఏ చిత్రకారుడివద్దయినా చిత్రకళ నేర్పించండి’ అని వాడి తల్లిదండ్రులకు సలహా ఇచ్చేవారు. కళ నేర్పించటానికి డబ్బు లేకపోవటంతో వాడిని నగరంలోని చిత్రకారుడి వద్ద పనికి కుదిర్చారు. సిద్ధప్ఫలో చక్కని చిత్రకళ దాగి ఉన్నదని గ్రహించాడు ఆ చిత్రకారుడు. గీతలతో ఒక అస్థిపంజరంలా బొమ్మను గీసి దానికి జీవం ఉట్టిపడేలా రంగులు, మెరుగులు దిద్దమని సిద్ధప్పకు పురమాయించేవాడు. కానీ సిద్ధప్పకు ఏమాత్రం ఓర్పు ఉండేది కాదు.రేఖలతో కాకుండా నేరుగా బొమ్మ వేసేవాడు. దాంతో బొమ్మ సరిగా రాకపోయేది. చిత్రకారుడు చెప్పే మెలకువలు పాటించేవాడు కాదు. అది చూసి ఆ చిత్రకారుడు ‘సిద్ధప్పా! రేఖ అనేది ప్రాథమిక దృశ్యమానం. ఇది సౌందర్య వ్యక్తీకరణకు పునాదిగా పని చేస్తుంది. ఓపికతో నేర్చుకుంటే నువ్వు నన్ను మించిన చిత్రకారుడివి అవుతావు!’ అని చెప్పాడు.గురువైన చిత్రకారుడి వద్ద తాను నేర్చుకునేదేమీ లేదని.. తనకే ఎక్కువ తెలుసని భావించేవాడు సిద్ధప్ప. ఒకరోజు గురువుకు చెప్పకుండా సిద్ధారం బయలుదేరాడు. తానుంటున్న నగరానికి సొంతూరు సిద్ధారానికి మధ్యలో దట్టమైన అడవి ఉంది. సిద్ధప్ప అడవి మధ్యలోకి వెళ్లేసరికి ఒక పెద్దపులి గాండ్రిస్తూ అతని వెంటపడింది. భయంతో ఒక్క పరుగున పక్కనే ఉన్న గుహలోకి దూరి, దాక్కున్నాడు. సిద్ధప్పకు తెలియని విషయం ఏమిటంటే.. ఆ గుహ పులిదేనని. తన ముందు ప్రత్యక్షమైన పులిని చూసి గజగజ వణికిపోతూ ‘పులిరాజా! నన్ను విడిచిపెట్టు. నేను చిత్రకారుడిని. చక్కటి రంగులతో ఈ గుహ గోడ మీద నీ బొమ్మ వేస్తాను’ అన్నాడు.అప్పటిదాకా తన ప్రతిబింబాన్ని నీటిలోనే చూసుకున్న పులి.. తన గుహ గోడ మీద సిద్ధప్ప రంగుల్లో తన బొమ్మను చిత్రిస్తాననేసరికి సంబరపడి ‘సరే’ అంది. భుజానికున్న సంచిలోంచి కుంచె, రంగులు తీసి క్షణాల్లో పులి బొమ్మ వేశాడు. అది చూసి పులి పెద్దగా గాండ్రిస్తూ ‘నీలో ఓర్పులేదు. చిత్రం ఏ కోణంలోనూ నాలాగా లేదు. అసలు నువ్వు చిత్రకారుడివే కాదు’ అంది.‘అయ్యో అలా కోప్పడకు పులిరాజా.. మరొకసారి వేసి చూపిస్తాను’ అంటూ గబగబా ఆ బొమ్మ చెరిపేసి పది నిమిషాల్లో మరో బొమ్మను వేశాడు. అది చూసి పులి ఈసారి మరింత పెద్దగా గాండ్రిస్తూ ‘నీలో అసలు ఏమాత్రం నేర్పు లేదు. అది నా బొమ్మ కానే కాదు’ అంది. చేసేదిలేక మరో అవకాశం కోసం పులిని వేడుకున్నాడు సిద్ధప్ప. తన గురువైన చిత్రకారుడిని మనసులోనే నమస్కరించి, ఎదురుగా ఉన్న పులిని నిశితంగా పరిశీలించాడు. అప్పుడు ఏకాగ్రత, ఓర్పు, నేర్పులతో పులి రేఖలు గీసి.. వాటికి రంగులతో ప్రాణం అద్దాడు సిద్ధప్ప. ఆ చిత్రాన్ని చూసి ముచ్చటపడింది పులి.‘శభాష్! నువ్వు గొప్ప చిత్రకారుడివే! కాకుంటే నీకు ఓర్పు తక్కువ. ఓర్పు లేకుంటే ఏ కళలోనూ రాణించలేరు’ అంటూ తన చేతికున్న బంగారు కడియాన్ని సిద్ధప్పకు బహూకరించింది పులి. తప్పు గ్రహించిన సిద్ధప్ప వెనుతిరిగి గురువును చేరుకున్నాడు. చిత్రకళలో మెలకువలన్నీ నేర్చుకుని గురువుకు బంగారు కడియం తొడిగాడు. కొద్దిరోజులకే గొప్పచిత్రకారుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఓర్పు ఎంత చేదుగా ఉంటుందో, దాని ప్రతిఫలం అంత తీయగా ఉంటుందని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు సిద్ధప్ప. – కొట్రా సరితఇవి చదవండి: మిస్టరీ.. ఎపెస్ బందిపోట్లు! -
వింధ్యపర్వతాన్ని అణచిన అగస్త్యుడు..
బ్రహ్మదేవుడి ఆదేశంతో సూర్యుడు మేరుపర్వతం చుట్టూ ప్రదక్షిణ మార్గంలో పయనిస్తూ లోకానికి వెలుగు పంచుతూ వస్తున్నాడు. సూర్యుడు ప్రదక్షిణ చేసే పర్వతం కావడంతో మిగిలిన దేవతలందరూ మేరువును గౌరవించసాగారు. మేరువు వైభవం వింధ్యపర్వతానికి అక్కసు కలిగించింది. సూర్యుడు మేరువు చుట్టూనే తిరుగుతుండటం, దేవతలు సైతం మేరువునే గౌరవిస్తుండటం, మేరువును గౌరవించే వారెవరూ తనను పట్టించుకోకపోవడం వింధ్యుడి అహాన్ని దెబ్బతీసింది.నారద మహర్షి ఒకనాడు ఆకాశమార్గాన వింధ్యను దాటుకుని కాశీనగరం వైపు వెళుతుండగా, వింధ్యుడు ఆయనను పలకరించి, ‘మహర్షీ! మా పర్వతాల్లో మేరువు గొప్పా? నేను గొప్పా?’ అని అడిగాడు. ‘ఇద్దరూ ఉన్నతులే! ఎవరి గొప్ప వారిదే!’ అని పలికి, నారద మహర్షి నారాయణ నామజపం చేస్తూ ముందుకు సాగిపోయాడు. నారదుడి సమాధానం వింధ్యుడికి రుచించలేదు.ఒకనాడు వింధ్యుడు ఉండబట్టలేక సూర్యుడిని అడ్డగించి, ‘ఓ కర్మసాక్షీ! ఎన్నో ఏళ్లుగా గమనిస్తున్నాను. నువ్వు ఆ మేరుపర్వతం చుట్టూనే ప్రదక్షిణగా తిరుగుతున్నావు. నా వంక చూసీ చూడనట్లు సాగిపోతావేం? నీకిది ఏమైనా మర్యాదగా ఉందా?’ అని నిలదీశాడు. ‘సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి ఆజ్ఞ మేరకే నేను మేరువు చుట్టూ పరిభ్రమిస్తున్నాను. నేను ఆయన ఆజ్ఞ మీరి లోకరీతిని తప్పితే, జీవులకు మనుగడ అసాధ్యం’ అన్నాడు సూర్యుడు.సూర్యుడి మాటలు వినే స్థితిలో లేని వింధ్యుడు ‘లోకరీతి ప్రకారం నాలాంటి ఉన్నతుల మాట కూడా నెగ్గాలి. రేపటి నుంచి నువ్వు నా చుట్టూ కూడా తిరుగు’ అని హుకుం జారీ చేశాడు.‘అయ్యా! నేనేమీ చేయలేను. మేరుపర్వతం మహోన్నతమైనదే కాదు, సృష్టికర్త ఆదేశం కూడా తనకే అనుకూలంగా ఉంది’ అంటూ సూర్యుడు చక్కా పోయాడు.అహం దెబ్బతిన్న వింధ్యుడు ఎలాగైనా మేరువుకు గుణపాఠం చెప్పాలని నిశ్చయించుకున్నాడు. వెంటనే తనను తాను అంతకంతకూ పెంచుకుని, ఆకాశానికి అడ్డుగా నిలిచాడు. ఆ దెబ్బకు సూర్యచంద్రుల గతులు తప్పి లోకం అంధకారంలో మునిగిపోయింది. వింధ్యుడి విశ్వరూపం చూసి, దేవతలకు దిక్కు తోచలేదు. వారంతా వెంటనే ఇంద్రుడి వద్దకు పరుగు పరుగున వెళ్లి, జరుగుతున్న ఉత్పాతాన్ని వివరించారు.లోకానికి తలెత్తిన ఈ విపత్తును తప్పించగల సమర్థుడు అగస్త్యుడు మాత్రమేనని తలచాడు ఇంద్రుడు. వెంటనే దేవతలను వెంటపెట్టుకుని, అగస్త్యుడి ఆశ్రమానికి వెళ్లాడు. వింధ్యుడి ఆగడాన్ని ఆయనకు చెప్పి, ‘మహర్షీ! ఎలాగైనా నువ్వే ఈ ఆపదను తప్పించాలి’ అని ప్రార్థించాడు. ‘మరేమీ భయం లేదు. వింధ్యుడి సంగతి నేను చూసుకుంటాను’ అని చెప్పి అగస్త్యుడు ఇంద్రాది దేవతలను సాగనంపాడు. ఇంద్రాదులు తిరిగి స్వర్గానికి వెళ్లిపోయాక, అగస్త్యుడు తన భార్య లోపాముద్రతో కలసి వింధ్యపర్వతం దిశగా బయలుదేరాడు. దేవతలు, మహర్షులు పట్టించుకోవడం మానేసిన తనవైపు అగస్త్యుడు సతీ సమేతంగా వస్తుండటం చూసి, వింధ్యుడి ఆనందానికి అవధులు లేకపోయాయి.‘మహర్షీ! నా జన్మ ధన్యమైంది. నేను తమ వద్దకు రాలేనని ఎరిగి, నా జన్మ పావనం చేయడానికే మీరిలా తరలి వచ్చినట్లున్నారు. మీకు ఏవిధంగా సేవ చేయగలనో ఆదేశించండి’ అంటూ అగస్త్యుడి ముందు మోకరిల్లాడు వింధ్యుడు.‘ఓ పర్వతరాజా! నేను అత్యవసరమైన పని మీద దక్షిణ దిశగా వెళుతున్నాను. నువ్వేమో దారికి అడ్డుగా ఇంత ఎత్తుగా ఉన్నావు. అసలే పొట్టివాణ్ణి. నువ్వు కాస్త తలవంచి తగ్గావంటే, ఏదోలా నిన్ను దాటుకుని దక్షిణాపథం వైపు వెళతాను’ అని పలికాడు అగస్త్యుడు.‘ఓస్! అదెంత పని!’ అంటూ వింధ్యుడు తలవంచి, పూర్తిగా మోకరిల్లాడు.వింధ్యుడు శిరసు వంచడమే తరువాయిగా అగస్త్యుడు తన భార్య లోపాముద్రతో కలసి పర్వతానికి అటువైపు చేరుకున్నాడు. ‘పర్వతరాజా! నాది మరో విన్నపం. పని పూర్తయ్యాక నేను ఏ క్షణాన అయినా ఇటు తిరిగి రావచ్చు. నేను మళ్లీ తిరిగి వచ్చేంత వరకు నువ్వు ఇలాగే ఉన్నావంటే, నేను సులువుగా నా ప్రయాణాన్ని పూర్తి చేసుకోగలను’ అన్నాడు. మాట నిలబెట్టుకోవడానికి వింధ్యుడు తలవంచుకుని అలాగే ఉండిపోయాడు. అగస్త్యుడు ఇప్పటికీ అటువైపుగా మళ్లీ రాలేదు. వింధ్యుడి గర్వాన్ని అగస్త్యుడు చాకచక్యంగా అణచాడు. – సాంఖ్యాయన -
అంతా.. అర్థం చేసుకోవడంలోనే..!
శ్రీ రామకృష్ణ పరమహంస ఓ కథ చెప్పారు. అది ఇలా సాగుతుంది:‘‘ఊరి పొలి మేరలో ఓ ఆశ్రమంలో గురువు ఉండేవారు. ఆయనకు శిష్యులనేకమంది. ఒకరోజు వారందరినీ కూర్చో పెట్టి... ‘ఈ లోకంలో ఉన్నవన్నీ దేవుడి రూపాలే. దానిని మీరు అర్థం చేసుకుని నమస్కరించాలి’ అన్నారు. శిష్యులందరూ సరేనన్నారు.ఓరోజు ఓ శిష్యుడు గురువుగారు చెప్పిన పని మీద అడవిలోకి బయలు దేరాడు. ఇంతలో ‘ఎవరెక్కడున్నా సరే పారిపోండి... మదమెక్కిన ఏనుగొకటి వస్తోంది. దాని కంట పడకండి’ అని హెచ్చరిస్తూ ఒక వ్యక్తి పారిపోతున్నాడు. ఈ హెచ్చరికతో అక్కడక్కడా ఉన్నవారు పారిపోయారు. కొందరు చెట్టెక్కి కూర్చున్నారు. కానీ ఈ గురువుగారి శిష్యుడున్నాడు చూశారూ, అతను తన ధోరణిలోనే నడుస్తున్నాడు. పైగా ‘నేనెందుకు పరుగెత్తాలి... నేనూ దేవుడు, ఆ ఏనుగూ దేవుడే! ఇద్దరం ఒక్కటే... ఏనుగు నన్నేం చేస్తుంద’నుకుని దారి మధ్యలో నిల్చుండిపోయాడు. ఏనుగు సమీపిస్తోంది.కానీ అతను ఉన్న చోటనే నిల్చున్నాడు. చేతులు రెండూ పైకెత్తి నమస్కరించాడు. పైగా దైవప్రార్థన చేశాడు. ఇంతలో ఏనుగుమీదున్న మావటివాడు కూడా అతనిని పక్కకు తప్పుకోమని హెచ్చరించాడు. కానీ శిష్యుడు ఆ హెచ్చరికను ఖాతరు చేయలేదు. అతను కావాలంటే ఏనుగుని దేవుడిగా భావించవచ్చు. కానీ ప్రతిగా ఏనుగు అలా అనుకోదుగా! అతను చేతులు రెండూ పైకెత్తి నిల్చోడంతో ఏనుగు పని మరింత సులువైంది. అది అతనిని ఒక చుట్ట చుట్టి కింద పడేసి ముందుకు వెళ్ళిపోయింది. అతనికి గాయాలయ్యాయి.విషయం తెలిసి ఆశ్రమానికి చెందినవారు అక్కడికి చేరుకుని కింద పడి ఉన్న అతనిని అతికష్టం మీద గురువుగారి వద్దకు తీసుకుపోయారు. అతను జరిగినదంతా చెప్పాడు. అప్పుడు గురువుగారు ‘నువ్వనుకున్నది నిజమే, కానీ మావటివాడు కూడా దేవుడే కదా! అతను నిన్ను హెచ్చరించాడుగా తప్పు కోమని! ఆ మాటైనా పట్టించుకోవాలి కదా’ అని చెప్పగా శిష్యుడు అయోమయంగా చూశాడు. ‘వేదాంతాన్ని సరిగ్గా అర్థం చేసుకోక పోవడం వల్ల వచ్చిన ప్రమాదమిది’ అంటూ గురువుగారు కథ ముగించారు.’’ – యామిజాల జగదీశ్ -
సమయోచిత జ్ఞానమే.. వివేచన!
వివేచన అంటే సమయోచిత జ్ఞానం, యుక్తాయుక్త విచక్షణ, లోచూపు, శోధన, దార్శనికత, విశ్లేషణా సామర్థ్యం. ఇతరులకు తోచని, అవగాహనకు రాని సూక్ష్మాంశాలను గ్రహించగల ఓ శక్తి. ఈ వివేచన కొందరిలో మాత్రమే ఉండే ఓ అపురూపమైన శక్తి.అసలు వివేచన ఎలా ఒనగురుతుంది... అని ప్రశ్నించుకుంటే... ప్రధానంగా చదువు వల్ల పొందే జ్ఞాన, పరిజ్ఞానాల వల్ల అని చె΄్పాలి. ఈ భావాన్నే ΄ోతన‘‘జదివిన సదసద్వివేక చతురత గలుగు జదువగ వలయును జనులకు.. ’’అని హిరణ్యకశిపుని చేత పలికిస్తాడు. చదువు వల్ల జ్ఞానంతోపాటు ఔచిత్యాననౌచిత్యాలు, మంచి చెడు విచక్షణలు తెలుస్తాయి. అవి మన పలుకులో, ప్రవర్తనలో, ఆలోచనాసరళిలో అభిలషణీయమైన చక్కని మార్పు తెస్తాయి. ఈ వివేచన మన వైయుక్తిక జీవిత సుఖ సంతోషాలకు, ఆరోగ్యకరమైన సామాజిక వికాసానికి పునాదులు వేస్తుంది.విద్యనభ్యసించటం వలన వివేచన అనే శక్తిని పొందటం జరుగుతుంది. కాని ఇది ఎల్లప్పుడూ నిజం కావలసిన అవసరం లేదని లోకానుభావం, పరిశీలన చెపుతాయి. కొందరు విద్యావంతులలో కనిపించని ఈ వివేచన కొన్ని సందర్భాలలో అక్షర జ్ఞానంలేని వారెందరి లోనో కనిపించటం ఆశ్చర్యం కలిగిస్తుంది. కానీ, ఇది వాస్తవం. వారి సంభాషణల్లో, సమస్యలను పరిష్కరించే వేళల్లో సమయోచిత జ్ఞానాన్ని చూపుతూ, విచక్షణను ప్రదర్శిస్తూ వివేచనాపరులుగా పేరు తెచ్చుకున్న వారున్నారు."పంచతంత్రంలోని పావురాలు – వేటగాడి కథ వివేచనా పార్శ్వమైన ముందుచూపుని సూచిస్తుంది. ఆకాశమార్గం లో పయనించే పావురాలు భూమిపై ఒకచోట చల్లిన నూకలను చూచి, కిందకు దిగి తిందామనుకున్నప్పుడు వారిని వారించిన చిత్రగ్రీవునిలో ఉన్నది ముందుచూపే. అప్రమత్తతే. ఇవి వివేచనలోని కోణాలే . చిత్రగ్రీవుని మాటను పెడచెవిని పెట్టి ్రపాణాల మీదకు తెచ్చుకున్న మిగిలిన పావురాలలో ఉన్నది తొందరపాటుతనం, విచక్షణారాహిత్యం. జ్ఞానాన్ని సందర్భానుసారంగా ఉపయోగించగలగాలని ఈ ఉదంతం మనకు చెపుతుంది. అలాగే మూడు చేపలకథలోని దీర్ఘదర్శి అన్న చేప తన్రపాణాలను కాపాడుకున్నది ఈ ముందుచూపు వల్లే కదూ!"ఇది ఎలా సాధ్యమవుతుంది? జీవనక్రమంలో వచ్చే ఆటు΄ోట్లను తట్టుకుని, నిబ్బరంగా ఉంటూ, మనసును దిటవు చేసుకోవటంవల్ల వారికి ఇది సాధ్యమవుతుంది. అలాగే చేదు అనుభవాలు, జీవితం నేర్పిన పాఠాలు పొందిన ఇంగితజ్ఞానంతో జీవితాన్ని మరింత లోతుగా పరిశీలిస్తూ, విశ్లేషించుకునే వీరికి ఈ వివేచనాశక్తి కరతలామలకమవుతుంది.కౌరవులు పాండవులను పెట్టే ఇబ్బందులను, చేసే దుశ్చర్యలను గమనిస్తూ ఎప్పటికప్పుడు వారిని అప్రమత్తులను చేసి, రక్షించినవాడు శ్రీ కృష్ణుడు. అలా వివేచనకు గొప్ప ఉదాహరణగా నిలిచాడు. వివేచనాశీలి ఎదుటవారి మాటలను, వాటి అంతరార్థాన్ని గ్రహించగలడు. వారి మనసులో మెదిలే ఆలోచనలను పసిగట్టగలరు. వాటిని విశ్లేషించగలరు. ఇవన్నీ వివేచనకున్న కోణాలే.బెర్ట్రాండ్ రసెల్.. జ్ఞానం –వివేకం.. అన్న వ్యాసంలో ఈ రెండిటి మధ్య ఉన్న సూక్ష్మమైన భేదాన్ని ఒక ఉదాహరణతో ఎంతో స్పష్టంగా వివరించాడు. రివాల్వర్ ఎలా ఉపయోగించాలో తెలియటం జ్ఞానం. దాన్ని ఎప్పుడు వాడాలి, అసలు వాడాలా, వద్దా అన్న సందర్భానౌచిత్య నిర్ణయశక్తే వివేచన. మనలో చాలామందికి విషయం పరిజ్ఞానం ఉంటుంది. కాని ఎక్కడ ప్రదర్శించాలో, ఎక్కడ కూడదోనన్న వివేకం ఉండదు. మన ప్రతిభా నైపుణ్యాలను అసందర్భంగా ప్రదర్శించి, అవమానం పొందకూడదు. ఉచితానుచితాలు తెలుసుకుని ప్రవర్తించటం కూడా వివేచనే. సాంకేతికాభివృద్ధి... ముఖ్యంగా అంతర్జాల సాంకేతికత విశ్వాన్ని కుగ్రామం చేసింది. ఆ సాంకేతికతను అంది పుచ్చుకోవాలి. వాటి ఫలితాలు అనుభవించాలి. ఇందంతా జ్ఞానపరమైనది. అభినందనీయం. కాని సక్రమమార్గంలో ఉపయోగించుకోవటంలోనే మన వివేచన ఉంటుంది. – లలితా వాసంతి -
ఈ పసివాడు.. యాగానికి రక్షగా నిలబడడం ఏమిటి?
విశ్వామిత్రుడు వచ్చి శ్రీరాముడిని యాగపరిరక్షణార్థం పంపించమని అడిగినప్పుడు, కేవలం పదిహేనేండ్ల బాలుడు, ఈ పసివాడు యాగానికి రక్షగా నిలబడడం ఏమిటి? అని కంగారుపడి, పంపించడానికి సంకోచించాడు దశరథ మహారాజు. తపస్సు చేయగా చేయగా కలిగిన సంతానం కాబట్టి దశరథుడి మనసులో ఆ కంగారు, దిగులు సహజమే! అయితే, అలా పంపమని అడిగిన విశ్వామిత్రుడు ఆ మాత్రం ఆలోచన లేకుండానే అడిగాడా? అన్నది ఆ క్షణాలలో దశరథుడు, శ్రీరాముడి మీదనున్న అపారమైన ప్రేమ కారణంగా ఆలోచించలేకపోయిన సంగతి.పిల్లల క్షేమానికి ఏది రక్షగా పనిచేస్తుంది? అని ప్రశ్న వేసుకున్నపుడు, ఆ పిల్లల తల్లిదండ్రులు ఎంత ధర్మబద్ధంగా జీవనాన్ని సాగిస్తారో అంత క్షేమంగా వారి పిల్లలు ఉంటారన్న సమాధానాన్ని సూచించిన సన్నివేశం ఇది. దశరథుడి సంకోచానికి విశ్వామిత్రుడు కోపగించుకోవడం చూసిన వశిష్ఠుడు కలగజేసుకుని ‘దశరథ మహారాజా! దక్షప్రజాపతి కుమార్తెలైన జయకు, సుప్రభకు భృశాశ్వుడనే ప్రజాపతి ద్వారా కలిగిన కామరూపులు; మహా సత్వసంపన్నులు, అస్త్రములు అయినటువంటి నూర్గురు కొడుకులను విశ్వామిత్రుడు పొంది ఉన్నాడు.వాళ్ళల్లో ఏ ఒక్కడైనా కూడా యాగరక్షణ అనే పనికి సరిపోతాడు. ఇక శస్త్రాస్త్రాల సంగతంటావా? ఈయనకు తెలియని శస్త్రాలు, తలుచుకుంటే ఈయన సృష్టించలేని అస్త్రాలు లేవు. అటువంటి ఆయనతో పంపించడానికా నీవు సంకోచిస్తున్నావు?’ అని ఊరడించి, దశరథుడితో ఇంకా ఇలా చెప్పాడు."చ. అనలము చేత గుప్తమగు నయ్యమృతంబును బోలె నీ తపో ధనపరిరక్షితుం డగుచు దద్దయు నొప్పెడు నీ తనూభవుం డని నకృతాస్త్రుడైనను నిరాయుధుడైన నిశాట కోటికిం జెనకగ రాదు కౌశికుడు చెప్పగ గేవల సంయమీంద్రుడే"పూర్వం క్షీరసాగర మథనంతో లభించిన అమృతకలశం భయంకరమైన విషాగ్ని కింద దాచబడి ఉన్నట్లుగా, నీ కొడుకైన శ్రీరాముడనే అమృతకలశం నీ తపోధనం అనే ప్రాణశక్తి చేత పరిరక్షించబడుతూ ఉన్నది. అటువంటి స్థితిలో శ్రీరాముడు నిరాయుధుడుగా ఉన్నప్పటికీ ఆ రాక్షస సమూహం అతడిని ఏమీ చేయలేదు. కౌశికుడు కంటికి కనిపిస్తున్నట్లుగా కేవలం మునిమాత్రుడు కాడు సుమా!’ అని వివరించాడు వశిష్ఠుడు ‘భాస్కర రామాయణం’ బాలకాండలోని పై సన్నివేశంలో. సంతానం ప్రాణాలకు వారి తల్లితండ్రుల ధర్మబద్ధ జీవనమే అన్నిటినీ మించిన రక్ష అని పైసన్నివేశం చాలా బలంగా చెప్పింది. – భట్టు వెంకటరావు -
ధర్మయోధుడు: ‘‘నాయనా! మాకు నీవు ఒక్కడివే కుమారుడవి.. పైగా..
అది కురుదేశం. దాని రాజధాని నగరం స్థూలకోష్ఠికం. ఆ నగరంలో ధనవంతుడైన పండితుని కుమారుడు రాష్ట్రపాలుడు. రాష్ట్రపాలునికి యుక్తవయస్సు దాటింది. అతనికి గృహజీవితం పట్ల అంతగా ఇష్టం ఉండేది కాదు. సన్యసించాలని, జ్ఞానం పొందాలని అనుకునేవాడు. ఒకరోజు బుద్ధుడు తన బౌద్ధసంఘంతో కలసి నగరానికి వచ్చాడు. తన మిత్రునితో కలిసి వెళ్ళి, బుద్ధుని ధర్మోపదేశం విన్నాడు రాష్ట్రపాలుడు. తానూ బౌద్ధ భిక్షువుగా మారాలి అనుకున్నాడు. బుద్ధుని దగ్గరకు వెళ్ళి నమస్కరించి, విషయం చెప్పాడు.‘‘రాష్ట్రపాలా! నీవు కుర్రవాడివి. నీ తల్లిదండ్రుల అనుమతి ఉంటేనే నీకు భిక్షు దీక్ష ఇస్తాను’’ అన్నాడు బుద్ధుడు. రాష్ట్రపాలుడు ఇంటికి వెళ్ళి తల్లిదండ్రుల్ని అడిగాడు. వారు–‘‘నాయనా! మాకు నీవు ఒక్కడివే కుమారుడవి. పైగా మా కోట్లాది ధనానికీ నీవే వారసుడివి. నిన్ను వదిలి మేం బతకలేం. కాబట్టి భిక్షువుగా మారడానికి అనుమతించలేం’’ అని తేల్చి చెప్పారు. రాష్ట్రపాలుడు రెండుమూడు రోజులు వారిని ప్రాధేయపడ్డాడు. చివరికి తన గదిలోకి చేరి, నిరాహార వ్రతం పూనాడు. వారం గడిచింది. రాష్ట్రపాలుడు నీరసించి పడిపోయాడు. తల్లిదండ్రులు భయపడ్డారు. భోరున విలపించారు. అప్పుడు రాష్ట్రపాలుని మిత్రున్ని పిలిపించారు. అతను చెప్పినా ఉపయోగం లేకుండా పోయింది. చివరికి ఆ మిత్రుడు– తల్లిదండ్రులతో..‘‘మీరు అంగీకరించడమే మంచిది. కనీసం ఎక్కడో ఒకచోట బతికి ఉంటాడు. అయినా కొందరు కొంతకాలమే భిక్షు జీవనం సాగించి, ఇక సాగించలేక తిరిగి ఇంటిదారి పడుతున్నారు. మన వాడూ అదే చేయవచ్చు ’’ అని చెప్పడంతో ఏదో ఒక మూల ఆశతో తల్లిదండ్రులు అనుమతించారు.మహా ఐశ్వర్యాన్ని వదిలి రాష్ట్రపాలుడు భిక్షువుగా మారాడు. కొన్నాళ్ళు గడిచాయి. కొడుకు తిరిగిరాలేదు. దానితో బుద్ధుని పట్ల, భిక్షువుల పట్ల చాలా కోపాన్ని పెంచుకున్నాడు రాష్ట్రపాలుడి తండ్రి. ఒకరోజు కాషాయ బట్టలు కట్టుకుని, బోడిగుండుతో, భిక్షాపాత్ర పట్టుకుని ఒక భిక్షువు వారింటికి వచ్చాడు. పెరట్లో ఉన్న తండ్రికి వళ్ళు మండిపోయింది. ‘‘భిక్షా లేదు, గంజీ లేదు. పో..పో’’ అంటూ తిట్టాడు. ఇంట్లోకి వెళ్ళిపోయాడు. భిక్షువు చిరునవ్వుతో అక్కడి నుండి కదిలాడు. అంతలో ఇంటిలోని దాసి పాచిన గంజి పారబోయడానికి బయటకు తెచ్చింది. భిక్షువు ఆగి... ‘‘అమ్మా! ఆ గంజి అయినా భిక్షగా వేయండి’’ అన్నాడు.ఆమె ఆ పాచిన గంజిని భిక్షాపాత్రలో పోస్తూ ఆ భిక్షువుకేసి తేరిపార చూసింది.ఆమె ఒళ్ళు జలదరించింది. నేల కంపించింది. నేలమీద పడి నమస్కరించింది. లేచి పరుగు పరుగున ఇంట్లోకి పోయింది.‘‘అయ్యా! ఆ వచ్చిన భిక్షువు మరెవరో కాదు. మన అబ్బాయి గారే’’ అంది. ఆ మాట విని తల్లిదండ్రులు శోకిస్తూ వీధుల్లోకి వచ్చిపడ్డారు. అక్కడ భిక్షువు కనిపించలేదు. వెతుకుతూ వెళ్లారు. ఆ వీధి చివరనున్న తోటలో కూర్చొని ఆ పాచిన భిక్షను పరమాన్నంగా స్వీకరిస్తున్నాడు రాష్ట్రపాలుడు. ‘‘నాయనా! మేము గమనించలేదు. రా! మన ఇంటికి రా! మంచి భోజనం వడ్డిస్తాం’’ అన్నారు. ‘‘గృహస్తులారా! ఈ రోజుకి నా భోజనం ముగిసింది’’ అన్నాడు. మరునాడు రమ్మన్నారు. అంగీకరించాడు. వెళ్ళాడు. ఉన్నతమైన ఆసనంపై బంగారు గిన్నెల్లో ఎన్నో రకాల ఆహార పదార్థాలు ముందు ఉంచారు. కొన్ని పళ్ళాల నిండా రత్నరాశులు, వజ్రవైడూర్యాలు నింపి ఆ గదిలో ఉంచారు.‘‘నాయనా! మనకి ఏం తక్కువ! ఈ పళ్ళాల్లో కాదు, గదుల నిండా ఇలాంటి ధనరాశి ఉంది. ఇవన్నీ నీకే... రా! ఆ భిక్ష జీవనం వదులు’’ అన్నారు.‘‘మీరు ఆ ధనరాశుల్ని బండ్లకెత్తించి గంగానదిలో కుమ్మరించండి. లేదా... దానం చేయండి. నాకు జ్ఞాన సంపద కావాలి. ధర్మ సంపద కావాలి. శీలసంపద కావాలి. అది తరగని సంపద. అది తథాగతుని దగ్గర తరగనంత ఉంది. మీరూ ఆ ధర్మ మార్గాన్నే నడవండి. మీ జీవితాన్ని సార్థకం చేసుకోండి’’ అని లేచి వెళ్లిపోయాడు రాష్ట్రపాలుడు. – డా. బొర్రా గోవర్ధన్