సిద్ధారం గ్రామంలో సిద్ధప్ప అనే యువకుడు ఉండేవాడు. అతనికి ఓర్పు తక్కువ. ఏ పనైనా వెంటనే కావాలనుకునేవాడు. గురుకులంలో కూడా ఏరోజుది ఆరోజు చదవకుండా పరీక్షల ముందే చదివిన సిద్ధప్పకు చదువు ఆబ్బలేదు. రాసుకోటానికి ఇచ్చిన పుస్తకాలలోని కాగితాల మీద బొమ్మలు వేస్తూ కాలక్షేపం చేస్తుండేవాడు. పుస్తకాలలోని బొమ్మలు చూస్తూ తాను కూడా అలా బొమ్మలు గీయటానికి ప్రయత్నించేవాడు.
దాంతో చుట్టు పక్కలవాళ్లు ‘వీడికి చదువురాదు కానీ, ఏ చిత్రకారుడివద్దయినా చిత్రకళ నేర్పించండి’ అని వాడి తల్లిదండ్రులకు సలహా ఇచ్చేవారు. కళ నేర్పించటానికి డబ్బు లేకపోవటంతో వాడిని నగరంలోని చిత్రకారుడి వద్ద పనికి కుదిర్చారు. సిద్ధప్ఫలో చక్కని చిత్రకళ దాగి ఉన్నదని గ్రహించాడు ఆ చిత్రకారుడు. గీతలతో ఒక అస్థిపంజరంలా బొమ్మను గీసి దానికి జీవం ఉట్టిపడేలా రంగులు, మెరుగులు దిద్దమని సిద్ధప్పకు పురమాయించేవాడు. కానీ సిద్ధప్పకు ఏమాత్రం ఓర్పు ఉండేది కాదు.
రేఖలతో కాకుండా నేరుగా బొమ్మ వేసేవాడు. దాంతో బొమ్మ సరిగా రాకపోయేది. చిత్రకారుడు చెప్పే మెలకువలు పాటించేవాడు కాదు. అది చూసి ఆ చిత్రకారుడు ‘సిద్ధప్పా! రేఖ అనేది ప్రాథమిక దృశ్యమానం. ఇది సౌందర్య వ్యక్తీకరణకు పునాదిగా పని చేస్తుంది. ఓపికతో నేర్చుకుంటే నువ్వు నన్ను మించిన చిత్రకారుడివి అవుతావు!’ అని చెప్పాడు.
గురువైన చిత్రకారుడి వద్ద తాను నేర్చుకునేదేమీ లేదని.. తనకే ఎక్కువ తెలుసని భావించేవాడు సిద్ధప్ప. ఒకరోజు గురువుకు చెప్పకుండా సిద్ధారం బయలుదేరాడు. తానుంటున్న నగరానికి సొంతూరు సిద్ధారానికి మధ్యలో దట్టమైన అడవి ఉంది. సిద్ధప్ప అడవి మధ్యలోకి వెళ్లేసరికి ఒక పెద్దపులి గాండ్రిస్తూ అతని వెంటపడింది. భయంతో ఒక్క పరుగున పక్కనే ఉన్న గుహలోకి దూరి, దాక్కున్నాడు. సిద్ధప్పకు తెలియని విషయం ఏమిటంటే.. ఆ గుహ పులిదేనని. తన ముందు ప్రత్యక్షమైన పులిని చూసి గజగజ వణికిపోతూ ‘పులిరాజా! నన్ను విడిచిపెట్టు. నేను చిత్రకారుడిని. చక్కటి రంగులతో ఈ గుహ గోడ మీద నీ బొమ్మ వేస్తాను’ అన్నాడు.
అప్పటిదాకా తన ప్రతిబింబాన్ని నీటిలోనే చూసుకున్న పులి.. తన గుహ గోడ మీద సిద్ధప్ప రంగుల్లో తన బొమ్మను చిత్రిస్తాననేసరికి సంబరపడి ‘సరే’ అంది. భుజానికున్న సంచిలోంచి కుంచె, రంగులు తీసి క్షణాల్లో పులి బొమ్మ వేశాడు. అది చూసి పులి పెద్దగా గాండ్రిస్తూ ‘నీలో ఓర్పులేదు. చిత్రం ఏ కోణంలోనూ నాలాగా లేదు. అసలు నువ్వు చిత్రకారుడివే కాదు’ అంది.
‘అయ్యో అలా కోప్పడకు పులిరాజా.. మరొకసారి వేసి చూపిస్తాను’ అంటూ గబగబా ఆ బొమ్మ చెరిపేసి పది నిమిషాల్లో మరో బొమ్మను వేశాడు. అది చూసి పులి ఈసారి మరింత పెద్దగా గాండ్రిస్తూ ‘నీలో అసలు ఏమాత్రం నేర్పు లేదు. అది నా బొమ్మ కానే కాదు’ అంది. చేసేదిలేక మరో అవకాశం కోసం పులిని వేడుకున్నాడు సిద్ధప్ప. తన గురువైన చిత్రకారుడిని మనసులోనే నమస్కరించి, ఎదురుగా ఉన్న పులిని నిశితంగా పరిశీలించాడు. అప్పుడు ఏకాగ్రత, ఓర్పు, నేర్పులతో పులి రేఖలు గీసి.. వాటికి రంగులతో ప్రాణం అద్దాడు సిద్ధప్ప. ఆ చిత్రాన్ని చూసి ముచ్చటపడింది పులి.
‘శభాష్! నువ్వు గొప్ప చిత్రకారుడివే! కాకుంటే నీకు ఓర్పు తక్కువ. ఓర్పు లేకుంటే ఏ కళలోనూ రాణించలేరు’ అంటూ తన చేతికున్న బంగారు కడియాన్ని సిద్ధప్పకు బహూకరించింది పులి. తప్పు గ్రహించిన సిద్ధప్ప వెనుతిరిగి గురువును చేరుకున్నాడు. చిత్రకళలో మెలకువలన్నీ నేర్చుకుని గురువుకు బంగారు కడియం తొడిగాడు. కొద్దిరోజులకే గొప్పచిత్రకారుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఓర్పు ఎంత చేదుగా ఉంటుందో, దాని ప్రతిఫలం అంత తీయగా ఉంటుందని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు సిద్ధప్ప. – కొట్రా సరిత
ఇవి చదవండి: మిస్టరీ.. ఎపెస్ బందిపోట్లు!
Comments
Please login to add a commentAdd a comment