funday specials story
-
పులి మెచ్చిన చిత్రం!
సిద్ధారం గ్రామంలో సిద్ధప్ప అనే యువకుడు ఉండేవాడు. అతనికి ఓర్పు తక్కువ. ఏ పనైనా వెంటనే కావాలనుకునేవాడు. గురుకులంలో కూడా ఏరోజుది ఆరోజు చదవకుండా పరీక్షల ముందే చదివిన సిద్ధప్పకు చదువు ఆబ్బలేదు. రాసుకోటానికి ఇచ్చిన పుస్తకాలలోని కాగితాల మీద బొమ్మలు వేస్తూ కాలక్షేపం చేస్తుండేవాడు. పుస్తకాలలోని బొమ్మలు చూస్తూ తాను కూడా అలా బొమ్మలు గీయటానికి ప్రయత్నించేవాడు.దాంతో చుట్టు పక్కలవాళ్లు ‘వీడికి చదువురాదు కానీ, ఏ చిత్రకారుడివద్దయినా చిత్రకళ నేర్పించండి’ అని వాడి తల్లిదండ్రులకు సలహా ఇచ్చేవారు. కళ నేర్పించటానికి డబ్బు లేకపోవటంతో వాడిని నగరంలోని చిత్రకారుడి వద్ద పనికి కుదిర్చారు. సిద్ధప్ఫలో చక్కని చిత్రకళ దాగి ఉన్నదని గ్రహించాడు ఆ చిత్రకారుడు. గీతలతో ఒక అస్థిపంజరంలా బొమ్మను గీసి దానికి జీవం ఉట్టిపడేలా రంగులు, మెరుగులు దిద్దమని సిద్ధప్పకు పురమాయించేవాడు. కానీ సిద్ధప్పకు ఏమాత్రం ఓర్పు ఉండేది కాదు.రేఖలతో కాకుండా నేరుగా బొమ్మ వేసేవాడు. దాంతో బొమ్మ సరిగా రాకపోయేది. చిత్రకారుడు చెప్పే మెలకువలు పాటించేవాడు కాదు. అది చూసి ఆ చిత్రకారుడు ‘సిద్ధప్పా! రేఖ అనేది ప్రాథమిక దృశ్యమానం. ఇది సౌందర్య వ్యక్తీకరణకు పునాదిగా పని చేస్తుంది. ఓపికతో నేర్చుకుంటే నువ్వు నన్ను మించిన చిత్రకారుడివి అవుతావు!’ అని చెప్పాడు.గురువైన చిత్రకారుడి వద్ద తాను నేర్చుకునేదేమీ లేదని.. తనకే ఎక్కువ తెలుసని భావించేవాడు సిద్ధప్ప. ఒకరోజు గురువుకు చెప్పకుండా సిద్ధారం బయలుదేరాడు. తానుంటున్న నగరానికి సొంతూరు సిద్ధారానికి మధ్యలో దట్టమైన అడవి ఉంది. సిద్ధప్ప అడవి మధ్యలోకి వెళ్లేసరికి ఒక పెద్దపులి గాండ్రిస్తూ అతని వెంటపడింది. భయంతో ఒక్క పరుగున పక్కనే ఉన్న గుహలోకి దూరి, దాక్కున్నాడు. సిద్ధప్పకు తెలియని విషయం ఏమిటంటే.. ఆ గుహ పులిదేనని. తన ముందు ప్రత్యక్షమైన పులిని చూసి గజగజ వణికిపోతూ ‘పులిరాజా! నన్ను విడిచిపెట్టు. నేను చిత్రకారుడిని. చక్కటి రంగులతో ఈ గుహ గోడ మీద నీ బొమ్మ వేస్తాను’ అన్నాడు.అప్పటిదాకా తన ప్రతిబింబాన్ని నీటిలోనే చూసుకున్న పులి.. తన గుహ గోడ మీద సిద్ధప్ప రంగుల్లో తన బొమ్మను చిత్రిస్తాననేసరికి సంబరపడి ‘సరే’ అంది. భుజానికున్న సంచిలోంచి కుంచె, రంగులు తీసి క్షణాల్లో పులి బొమ్మ వేశాడు. అది చూసి పులి పెద్దగా గాండ్రిస్తూ ‘నీలో ఓర్పులేదు. చిత్రం ఏ కోణంలోనూ నాలాగా లేదు. అసలు నువ్వు చిత్రకారుడివే కాదు’ అంది.‘అయ్యో అలా కోప్పడకు పులిరాజా.. మరొకసారి వేసి చూపిస్తాను’ అంటూ గబగబా ఆ బొమ్మ చెరిపేసి పది నిమిషాల్లో మరో బొమ్మను వేశాడు. అది చూసి పులి ఈసారి మరింత పెద్దగా గాండ్రిస్తూ ‘నీలో అసలు ఏమాత్రం నేర్పు లేదు. అది నా బొమ్మ కానే కాదు’ అంది. చేసేదిలేక మరో అవకాశం కోసం పులిని వేడుకున్నాడు సిద్ధప్ప. తన గురువైన చిత్రకారుడిని మనసులోనే నమస్కరించి, ఎదురుగా ఉన్న పులిని నిశితంగా పరిశీలించాడు. అప్పుడు ఏకాగ్రత, ఓర్పు, నేర్పులతో పులి రేఖలు గీసి.. వాటికి రంగులతో ప్రాణం అద్దాడు సిద్ధప్ప. ఆ చిత్రాన్ని చూసి ముచ్చటపడింది పులి.‘శభాష్! నువ్వు గొప్ప చిత్రకారుడివే! కాకుంటే నీకు ఓర్పు తక్కువ. ఓర్పు లేకుంటే ఏ కళలోనూ రాణించలేరు’ అంటూ తన చేతికున్న బంగారు కడియాన్ని సిద్ధప్పకు బహూకరించింది పులి. తప్పు గ్రహించిన సిద్ధప్ప వెనుతిరిగి గురువును చేరుకున్నాడు. చిత్రకళలో మెలకువలన్నీ నేర్చుకుని గురువుకు బంగారు కడియం తొడిగాడు. కొద్దిరోజులకే గొప్పచిత్రకారుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఓర్పు ఎంత చేదుగా ఉంటుందో, దాని ప్రతిఫలం అంత తీయగా ఉంటుందని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు సిద్ధప్ప. – కొట్రా సరితఇవి చదవండి: మిస్టరీ.. ఎపెస్ బందిపోట్లు! -
మిస్టరీ.. ఎపెస్ బందిపోట్లు!
అది 1987 అక్టోబర్ 30. అమెరికా, అలబామా రాష్ట్రంలో ఎపెస్ అనే పట్టణంలో ఉన్న చిన్న పోస్ట్ ఆఫీస్. మనియార్డర్లు, ఉత్తరాలు, స్టాంపులు తీసుకెళ్లేవారంతా ఒకరి తర్వాత ఒకరు వస్తున్నారు, వెళ్తున్నారు. ఆ బిజీలోనే ఉంది పోస్ట్‌మాస్టర్ డ్యూటీ చేస్తున్న ఒపాల్ జాన్సన్ అనే మహిళ. అది తన జీవితంలో అత్యంత భయంకరమైన రోజని ఆమెకు తెలియదు.ఉదయం 11 దాటింది. ఆఫీసులో ఎవరూ లేరు. ‘ఏదైనా తిందాం’ అనుకుంటూ బాక్స్ అందుకోబోయింది. ఇంతలో ఒక నల్లజాతీయుడు, ఒక తెల్లజాతీయుడు కలసి అక్కడికి వచ్చారు. ‘ఏం కావాలి?’ అన్నట్లుగా చూసింది వాళ్లవైపు ఒపాల్. వాళ్లు స్టాంపులు అడగడంతో ముందున్న డ్రా ఓపెన్ చేసి, వాళ్లు అడిగిన స్టాంప్స్ కోసం వెతకడం ప్రారంభించింది. ఇంతలో ఒకడు తుపాకీ బయటికి తీసి, ఆమెకు గురిపెట్టి ‘కదిలితే కాల్చేస్తా!’ అన్నాడు. ఊహించని పరిణామానికి ఆమె నిర్ఘాంతపోయింది.చేతులు పైకెత్తి, అయోమయంగా చూస్తూ ఉండిపోయింది. ఇంతలో మరొకడు కౌంటర్ ముందుకు వెళ్లి, డబ్బులు వెతకడం మొదలుపెట్టాడు. అయితే నల్లజాతీయుడు పోస్టాఫీసు కార్యకలాపాలపై పూర్తి అనుభవం ఉన్నవాడిలా ఏది ఎక్కడుంటుంది? ఎందులో ఎంత ఉంటుంది? అంతా తనతో వచ్చిన తెల్లజాతీయుడికి వివరిస్తున్నాడు. అతడు వాటన్నింటినీ తీసి బ్యాగ్‌లో వేసుకుంటున్నాడు. దోపిడీ జరుగుతోందని ఆమెకు అర్థమైంది. అరిస్తే ప్రాణాలకే ప్రమాదమని, తప్పించుకోవడానికి ఏదో అవకాశం దొరక్కపోతుందా అని దేవుడ్ని ప్రార్థించడం మొదలుపెట్టింది.పోస్టాఫీసులో దొరికిన నగదు, విలువైన స్టాంపులు ఇలా అన్నీ దోచేశారు. ఆ వెంటనే ‘ఈమెను ఏం చేద్దాం?’ అని చర్చించుకున్నారు. ‘ఈమె ఇక్కడే ఉంటే మనం వెళ్లేలోపు పోలీసులకు సమాచారం ఇచ్చే ప్రమాదం ఉంది. ఇక్కడ తుపాకీ తీస్తే అలర్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఈమెను కూడా మనతో పాటు తీసుకుని వెళ్దాం’ అన్నాడు నల్లజాతీయుడు తన తోటి దొంగతో.కాసేపటికి ఆ ఇద్దరూ ఒపాల్‌ని తుపాకీతోనే తోసుకుంటూ ఆమె కారు దాకా తీసుకెళ్లారు. ఆమెను బలవంతంగా కారు ఎక్కించారు. ఒకడు ఆమె పక్క సీట్లో కూర్చుని, ఆమెకు తుపాకీ గురిపెట్టే ఉంచాడు. ఇంతలో మరొకరు తమ కారుని ఒపాల్ కారుకి లింక్ చేసి, పరుగున వచ్చి ఒపాల్ కారులో వెనుక సీట్లో కూర్చున్నాడు. వెంటనే ‘హూ.. పోనీ’ అంటూ అరిచాడు నల్లజాతీయుడు. ఇక తనకు చావు తప్పదనుకున్న ఒపాల్ వణికిపోతూనే వారు ఎటు అంటే అటు కారుని ముందుకు పోనిచ్చింది.అయితే వారిద్దరూ ఆ చుట్టుపక్కల ప్రాంతాల గురించి చాలా బాగా తెలిసినట్లుగా చర్చించుకున్నారు. ‘అక్కడికి వెళ్తే తప్పించుకోవడం ఈజీ! అటు నుంచి అటు పారిపోవచ్చు సులభం!’ అంటూ చాలా ప్రదేశాల పేర్లు ఎంచుకున్నారు. చివరగా, ఆ రెండు కార్లు పట్టణానికి 3 మైళ్ల దూరంలో ఉన్న గాగన్ ్స సరస్సు సమీపంలోని రిమోట్ క్లియరింగ్ దగ్గర ఆగాయి. ఒపాల్‌ని మళ్లీ తుపాకీతో బెదిరించి, ఆమె కారులోనే డిక్కీలోకి ఎక్కించారు. ఆ సమయంలో తుపాకీ తెల్లజాతీయుడి చేతిలో ఉంది.అయితే నల్లజాతీయుడు ఆవేశంగా ‘ఆమెను చంపెయ్.. చంపెయ్.. వదిలిపెట్టొద్దు.. వదిలితే మనకే సమస్య’ అని తెల్లజాతీయుడి మీద పెద్దపెద్దగా అరిచాడు. అయితే తెల్లజాతీయుడు అందుకు అంగీకరించలేదు. ‘ఆమె వల్ల మనకేం సమస్య రాదు. చంపితేనే పోలీసులు మరింత వేగంగా మనల్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు’ అంటూ నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. కాసేపటికి ఇద్దరి చర్చలో తెల్లజాతీయుడి వాదనే గెలిచింది. ఒపాల్ ఊపిరి పీల్చుకుంది. అప్పటి దాకా వారి చర్చంతా వింటున్న ఒపాల్, తన మీదకు ఎప్పుడెప్పుడు బుల్లెట్లు దోసుకోస్తాయోనని చాలా భయపడింది. చివరికి తనని ప్రాణాలతోనే వదులుతున్నారని అర్థం చేసుకుంది. అయితే ఆమె చేతికున్న ఉంగరాలు, మెడలో గొలుసు, క్రెడిట్ కార్డులు అన్నీ లాగేసుకుని, ఆమెను ఆమె కారు డిక్కీలోనే లాక్ చేసి, వారు తమ కారులో పారిపోయారు.కొంత సమయానికి చుట్టూ నిశ్శబ్దాన్ని నిర్ధారించుకున్న ఒపాల్, లోపలే ఉన్న ఇనుప టైర్ సాయంతో డిక్కీని పగలగొట్టి బయటపడింది. అయితే డిక్కీ ఓపెన్ కావడానికి సుమారు గంటపైనే పట్టింది. మొత్తానికి ప్రాణాలు దక్కడంతో పోలిస్ స్టేషన్ కి తన కారులోనే వెళ్లి కంప్లైంట్ ఇచ్చింది. ఆమె చెప్పిన ఆనవాళ్లతో ఆ ఇద్దరు ఆగంతకుల రూపురేఖలను ఊహాచిత్రాలుగా గీయించారు పోలీసులు. వెంటనే విచారణ మొదలుపెట్టారు.అయితే దోపిడీ జరిగిన మరునాడే, దోపిడీకి పాల్పడిన నల్లజాతీయుడు ఒహాయోలో మరో నల్లజాతీయురాలితో కలసి తిరిగినట్లు కొందరు సాక్షులు చెప్పారు. మరోవైపు ఆ మహిళ చాలాచోట్ల ఒపాల్ క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించిందని తేలింది. కానీ ఒపాల్‌ని వణికించిన ఆ ఇద్దరు దొంగలు పోలీసులకు ఎప్పుడూ దొరకలేదు. 1995లో ఈ కథనాన్ని అన్సాల్వ్డ్ ఎపిసోడ్స్‌లో ప్లే చేశారు.2010లో ఒపాల్ అనారోగ్య సమస్యలతో మరణించింది. అయితే తెల్లజాతీయుడు కంటే నల్లజాతీయుడు సుమారు పదేళ్లు పెద్దవాడనేది ఒపాల్ అంచనా. ఒపాల్ చెప్పినదాని ప్రకారం నల్లజాతీయుడి ప్లాన్ తో ఆ దోపిడీ మొత్తం జరిగింది. అతడికి పోస్టాఫీసులో పనిచేసిన అనుభవం కచ్చితంగా ఉండే ఉంటుంది. ఈ ఘటన జరిగి సుమారు 36 ఏళ్లు దాటింది. ఆ ఇద్దరు ఎక్కడున్నారో, ఏమయ్యారో పోలీసులు ఇప్పటికీ కనిపెట్టేలేకపోయారు. దాంతో ఈ స్టోరీ ఇంకా మిస్టరీగానే మిగిలిపోయింది. – సంహిత నిమ్మన -
‘మహారాజా.. మీరు మాకు దేవుడిచ్చిన వరం'!
మహారాజు సింహాసనం అధిష్టించి పది సంవత్సరాలు పూర్తి అయింది. దాంతో తన పరిపాలన ఎలా ఉందో తెలుసుకోవాలనుకున్నాడు. అంగరంగ వైభవంగా సమావేశం ఏర్పాటు చేశాడు. సామంతులు, సైన్యాధికారులు, వ్యాపారస్తులు, కళాకారులు, పుర ప్రముఖులు అందరినీ ఆహ్వానించాడు. మహారాజు వచ్చిన వాళ్లందరినీ చిరునవ్వుతో చూస్తూ ‘నా పాలనలో రాజ్యమంతా సుభిక్షంగా ఎలా ఉందో తెలుసుకోవడానికి ఈ సభ ఏర్పాటు చేశాను. బాగుంటే బాగుందనండి. లేదంటే లేదనండి. సరిదిద్దుకోలసిన అంశాలుంటే తెలియచేయండి.రాజ్యం మరింత సుసంపన్నం కావడానికి సలహాలు ఇవ్వండి’ అన్నాడు. ‘మహారాజా.. మీరు మాకు దేవుడిచ్చిన వరం. ఎన్ని జన్మలైనా మీరే మాకు రాజుగా ఉండాలి’ అంటూ నోరువిప్పారు సామంతులు. ‘మీ పాలనలో ఎటువంటి తిరుగుబాట్లు లేవు. రాజ్యమంతా ప్రశాంతంగా సుఖసంతోషాలతో నిండుంది’ అన్నారు సైన్యాధికారులు.‘వ్యాపారాలు పుష్కలంగా జరుగుతున్నాయి. గల్లాపెట్టెలు గలగలలాడుతున్నాయి. రాజ్యంలో దొరకని వస్తువంటూ లేదు. ఎగుమతులూ పుంజుకుంటున్నాయి’ అన్నారు వ్యాపారస్తులు. ‘ఎక్కడ చూసినా సభలు, సమావేశాలు, నాటక ప్రదర్శనలు, కవితా పఠనాలు, కొత్త గ్రంథాల ఆవిష్కరణలు, పురస్కారాలు, సన్మానాలతో సందడిగా ఉంది ప్రభూ’ పొగిడారు కళాకారులు.ఒక్కొక్క మాటకు రాజు మొహంలో కోటి నక్షత్రాల కాంతులు వెదజల్లసాగాయి. వచ్చిన వారందరికీ రకరకాల ఆహార పదార్థాలతో విందు భోజనం ఏర్పాటు చేసి కానుకలతో సత్కరించి పంపించాడు. ఆ రాత్రి అంతఃపురంలో మహారాణితో మహారాజు ‘చూశావా రాణీ.. నా పరిపాలన ఎలా కళకళలాడిపోతున్నదో! ఆకలి కేకలు లేవు, తిరుగుబాట్లు లేవంటూ నింగిని తాకేలా కీర్తిస్తున్నారంతా’ అన్నాడు సంబరంగా. రాణి చిరునవ్వుతో ‘అలాకాక ఇంకెలా చెబుతారులే మహారాజా మీ వద్ద!’ అంది.ఆ మాటల్లో ఏదో వ్యంగ్యం కనబడింది రాజుకు. ‘అంటే.. ఆ పొగడ్తలన్నీ కేవలం భయం వల్ల వచ్చినవే అంటావా?’ ప్రశ్నించాడు. ‘భయం వల్లనే కాకపోవచ్చు. మీతో వారికున్న అవసరాల వల్ల కూడా కావచ్చు. మీ ముందు నిలబడి మీకు వ్యతిరేకంగా మీ కింద పనిచేసే అధికారులెవరైనా నోరు విప్పగలరా? మనసులో మాట చెప్పగలరా? మీరేం చేసినా ఆహా.. ఓహో.. అని ఆకాశానికి ఎత్తేస్తారు తప్ప విమర్శిస్తారా?’ అంది.‘అయితే వాళ్ళందరూ నన్నలా ఊరికే పొగుడుతున్నారని నిరూపించగలవా?’ అన్నాడు రాజు. ‘తప్పకుండా మహారాజా.. మీకు అసలు రాని కళేదైనా ఉంటే చెప్పండి’ అంది. మహారాజు కాసేపు ఆలోచించి ‘నీకు తెలుసు కదా.. లలితకళల్లో ఎంతోకొంత ప్రావీణ్యం ఉన్న నాకు అసలు రానిది, ఎప్పుడూ ముట్టుకోనిది చిత్రలేఖనం ఒక్కటే అని’ అన్నాడు.‘అయితే ఒక పనిచేయండి మహారాజా.. ఒక్కరోజులో చిత్రలేఖనం గురించి తెలుసుకొని మీకు ఎలా తోస్తే అలా రకరకాలుగా చిత్రాలు వేయండి. అవన్నీ ప్రదర్శనకు పెడదాం. ఇప్పుడు పిలిచిన వాళ్లందరినీ అప్పుడూ ఆహ్వానిద్దాం. తెలుస్తుంది ఎవరేమంటారో!’ అంది. మహారాజు సరేనని ఒక ప్రముఖ చిత్రకారున్ని పిలిపించి ఒక రోజంతా చిత్రకళ గురించి తెలుసుకున్నాడు. తర్వాత రోజు నుంచి బొమ్మలు గీయడం మొదలుపెట్టాడు. కుడిచేత్తో కొన్ని, ఎడంచేత్తో కొన్ని, నోటితో పట్టుకొని కొన్ని, వెనక్కి తిరిగి కొన్ని, ఆఖరికి పడుకొని, కూర్చుని, నుంచుని రకరకాలుగా వారం రోజుల్లో వంద చిత్రాలు పూర్తి చేశాడు.వాటన్నింటినీ ప్రదర్శనకు పెట్టాడు. అందులో కొన్ని చిత్రాలను తిరగేసి కూడా పెట్టాడు. అప్పుడు పిలిచిన వాళ్లందరనీ ప్రదర్శనకు ఆహ్వానించాడు. ఏ చిత్రం చూసినా రంగులు ఒకదానితో ఒకటి కలసిపోయి కనిపించాయి. దేనిలో ఏముందో, అందులో భావముందో ఎంత ఆలోచించినా ఎవరికీ అంతుచిక్క లేదు. అర్థంకానిదంతా అద్భుతమే అని తీర్మానించుకున్నారంతా! అవతల ఉన్నది మహారాజు. తప్పు పట్టినా, బాగా లేదన్నా కొరడా దెబ్బలు తప్పవు. దాంతో ఎందుకైనా మంచిదని ‘ఆహా’ అన్నారు కొందరు. వెంటనే ‘ఓహో’ అన్నారు మరికొందరు. ‘అద్భుతం. మీకు మీరే సాటి’ అంటూ అందుకొన్నారు ఇంకొందరు.ఇలా పొడిపొడి మాటలైతే లాభం లేదనుకొని ఇంకొకరు ముందడుగు వేసి ‘మహారాజా.. ఇంత వేగంగా ఇన్ని చిత్రాలు గీయడం మామూలు మానవులకు సాధ్యం కాదు. మీలాంటి కారణజన్ములు ఏడేడు పద్నాలుగు లోకాల్లో ఎక్కడా ఉండరు. మీకు చిత్రరత్న పురస్కారం కచ్చితంగా ఇచ్చి తీరవలసిందే’ అన్నారు. అది విన్న మరికొందరు తాము ఎక్కడ వెనుకబడి పోతామేమోనని ‘మహారాజా.. ఈ చిత్రాలు మీరు గనుక మాకు ఇస్తే మా భవనాలలో అలంకరించుకుంటాం. వీటివల్ల మా ఇంటి అందం రెట్టింపవుతుంది’ అన్నారు.ఒకరిని చూసి మరొకరు పొగడ్తలలో పోటీపడ్డారు. వాళ్ళలా పొగడ్తల వర్షం కురిపిస్తుంటే మహారాజు తన పక్కనే ఉన్న మహారాణికి మొహం చూపించలేక సిగ్గుతో చితికిపోయాడు. ప్రదర్శన పూర్తయి అందరూ వెళ్ళిపోయాక ‘అర్థమైంది కదా రాజా ప్రముఖుల సంగతి. మీ పాలన గురించి నిజానిజాలు తెలియాలంటే ధనవంతులను కాదు కలవాల్సింది పేద ప్రజలను. అధికార దర్పంతో రాజుగా కాదు వాళ్లలో ఒకరిగా మారిపోవాలి. అప్పుడే మీ లోటుపాట్లు తెలుస్తాయి. సరిదిద్దుకోవలసినవి అర్థమవుతాయి’ అంది. మహారాణి వైపు ప్రశంసాపూర్వకంగా చూశాడు మహారాజు. మరుసటి మహారాజు పల్లెమనిషిగా మారు వేషంలో కాలినడకన సంచారానికి బయలుదేరాడు. నిజాల వేటకై! – డా.ఎం.హరి కిషన్ -
ఒలింపిక్ క్రీడలు తొలిసారిగా.. ఎక్కడ మొదలయ్యాయో తెలుసా?
ఒలింపిక్ క్రీడలు తొలిసారిగా క్రీస్తుపూర్వం 776లో నాటి గ్రీకు రాజ్యంలోని ఒలింపియా నగరంలో మొదలయ్యాయి. అప్పట్లో ఒకే ఒక్క పోటీ ఉండేది. అది పరుగు పందెం. ఇందులో పాల్గొనడానికి గ్రీకు రాజ్యంలో స్వతంత్ర పౌరులుగా పుట్టిన పురుషులు మాత్రమే అర్హులు. అప్పట్లో బానిసలకు, మహిళలకు ఒలింపిక్ క్రీడల్లో పాల్గొనే అర్హత ఉండేది కాదు. నాలుగేళ్లకు ఒకసారి ఈ క్రీడా పోటీలను నిర్వహించే పద్ధతి అప్పటి నుంచే ఉండేది.ఒలింపిక్ క్రీడలు మొదలైన తొలి రెండు శతాబ్దాల కాలంలో ఈ పోటీలు మత ప్రాధాన్యం గల ప్రాంతీయ పోటీలుగా మాత్రమే జరిగేవి. కాలక్రమంలో ఒలింపిక్ క్రీడలు గ్రీకు రాజ్యంలో జరిగే నాలుగు ప్రధాన క్రీడోత్సవాల్లో ఒకటిగా గుర్తింపు పొందాయి.క్రీస్తుశకం మూడో శతాబ్ది నుంచి ఒలింపిక్ క్రీడల వైభవం తగ్గుముఖం పట్టింది. రోమన్ చక్రవర్తి థియోడోసియస్ హయాంలో క్రీస్తుశకం 393లో చివరిసారిగా ఒలింపిక్ క్రీడలు జరిగినట్లు చరిత్రలో నమోదైంది. ప్రాచీన ఒలింపిక్ క్రీడలకు అదే పరిసమాప్తిగా భావించవచ్చు.గ్రీకు రాజ్యాన్ని రోమన్లు క్రీస్తుపూర్వం 146లో స్వాధీనం చేసుకున్న తర్వాత కూడా ఒలింపిక్స్ కొనసాగినా, ప్రాధాన్యాన్ని కోల్పోయాయి. క్రీస్తుపూర్వం 86లో రోమన్ సేనాని సూలా ఒలింపియాను కొల్లగొట్టాడు. అక్కడ కొల్లగొట్టిన నిధులతో జరిపిన యుద్ధంలో విజయం సాధించి, క్రీస్తుపూర్వం 80లో ఒలింపిక్ క్రీడలను నిర్వహించాడు.రోమన్ చక్రవర్తి నీరో హయాంలో ఒలింపిక్ క్రీడలు అభాసుపాలయ్యాయి. పిచ్చిమారాజుల్లో ఒకడిగా పేరుమోసిన నీరో రథాల పందేల్లో తొండి ఆటలాడి తనను తానే విజేతగా ప్రకటించుకునేవాడు. తనను తాను మహా సంగీత విద్వాంసుడిగా భావించే నీరో చక్రవర్తి క్రీస్తుశకం 67లో తొలిసారిగా ఒలింపిక్స్‌లో గాత్ర, వాద్య సంగీత పోటీలను కూడా ప్రవేశపెట్టాడు.రోమన్ చక్రవర్తి అగస్టస్ సీజర్ హయాంలో ఒలింపిక్స్‌కు పునర్వైభవం వచ్చింది. అగస్టస్ సీజర్ ఆంతరంగికుడైన మార్కస్ అగ్రిపా ఒలింపియాలోని జూస్ ఆలయాన్ని పునరుద్ధరించి, క్రీస్తుపూర్వం 12లో ఒలింపిక్ క్రీడలను ఘనంగా నిర్వహించాడు.ఇవి చదవండి: యూసీసీ కింద నమోదైతే పోలీసు రక్షణ -
గౌరముఖుడి వృత్తాంతం!
కృతయుగంలో సుప్రతీకుడు అనే రాజు ఉండేవాడు. అతడికి ఇద్దరు భార్యలు. వారికి ఎప్పటికీ సంతానం కలగకపోవడంతో సుప్రతీకుడు చిత్రకూట పర్వతంపై ఆశ్రమం ఏర్పరచుకున్న ఆత్రేయ మహర్షిని ఆశ్రయించి, ఆయన అనుగ్రహంతో దుర్జయుడనే పుత్రుణ్ణి పొందాడు.దుర్జయుడు అమిత బలవంతుడు. అపార సేనాసంపత్తితో దిగ్విజయయాత్రకు వెళ్లి, సమస్త భూమండలాన్ని తన అధీనంలోకి తెచ్చుకున్నాడు. తర్వాత అష్టదిక్పాలకులను జయించి, విజయగర్వంతో తన రాజ్యానికి తిరిగి బయలుదేరాడు. దారిలో గౌరముఖుడు అనే మహర్షి ఆశ్రమం కనిపించింది. దుర్జయుడు తన సేనలను వెలుపలే నిలిపి, తానొక్కడే ఆశ్రమంలోకి వెళ్లాడు. గౌరముఖుడికి నమస్కరించి, ఆశీర్వచనం కోరాడు. గౌరముఖుడు రాజైన దుర్జయుడికి ఆశీర్వచనం పలికి, అతడికి, అతడి సైన్యానికి ఆతిథ్యం ఇస్తానన్నాడు. దుర్జయుడు ఆశ్చర్యపోయాడు. తనకు, లక్షలాదిమంది తన సైనికులకు ఈ ఒంటరి ముని ఎలా ఆహారం పెట్టగలడా అని ఆలోచించాడు.ఇంతలో గౌరముఖుడు సంధ్యావందనం ముగించుకుని వస్తానంటూ దగ్గరే ఉన్న గంగానదికి వెళ్లాడు. గంగలో నిలిచి ఆశువుగా శ్రీమన్నారాయణుడిని స్తుతిస్తూ స్తోత్రం పలికాడు. గౌరముఖుడి స్తోత్రం పూర్తి కాగానే, అతడి భక్తిప్రపత్తులకు అమిత ప్రసన్నుడైన శ్రీమన్నారాయణుడు శంఖ చక్ర గదాధారిగా ప్రత్యక్షమయ్యాడు. పీతాంబరాలతో దేదీప్యమానంగా మెరిసిపోతున్న స్వామిని చూసి గౌరముఖుడు పులకించిపోయాడు.‘వత్సా! ఏమి కోరిక’ అడిగాడు శ్రీమన్నారాయణుడు.‘స్వామీ! నా ఆశ్రమానికి రాజు దుర్జయుడు, అతడి పరివారం వచ్చారు. వారికి ఆతిథ్యమిస్తానని మాట ఇచ్చాను. వారందరికీ భోజనం పెట్టగలిగేలా నాకు వరమివ్వు చాలు’ అని కోరాడు గౌరముఖుడు. నారాయణుడు అతడికి ఒక దివ్యమణిని ప్రసాదించి, ‘ఈ మణి నువ్వు కోరినవన్నీ ఇస్తుంది’ అని పలికి అదృశ్యమయ్యాడు.నారాయణుడు ప్రసాదించిన మణితో గౌరముఖుడు తన ఆశ్రమం ఎదుటనే ఇంద్రలోకాన్ని తలపించే మహానగరాన్ని సృష్టించాడు. అందులో రాజు దుర్జయుడికి, అతడి పరివారానికి విలాసవంతమైన విడిది ఏర్పాటు చేశాడు. వారంతా ఆనందంగా ఆ నగరంలోకి ప్రవేశించారు. వారికి సేవలందించడానికి దాసదాసీ జనాన్ని సృష్టించాడు. వారందరికీ షడ్రసోపేతమైన మృష్టాన్న భోజనాన్ని ఏర్పాటు చేశాడు. దుర్జయుడు, అతడి పరివారం సుష్టుగా భోజనం చేసి, వారికి ఏర్పాటు చేసిన విడిది మందిరాల్లో హాయిగా విశ్రమించారు.మర్నాడు ఉదయం అందరూ నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని, స్నానానికి గంగానదికి వెళ్లారు. వారంతా స్నానాలు చేసి తిరిగి వచ్చేసరికి, అంతకుముందు వరకు ఉన్న నగరం లేదు. అందులోని దాసదాసీ జనం ఎవరూ లేరు. కేవలం గౌరముఖుడి ఆశ్రమం మాత్రమే యథాతథంగా ఉంది. దుర్జయుడు, అతడి పరివారం గౌరముఖుడి దివ్యశక్తికి అమితాశ్చర్యం చెందారు.రాజు దుర్జయుడు, అతడి పరివారం గౌరముఖుడి వద్ద వీడ్కోలు తీసుకుని బయలుదేరారు. కొంత దూరం సాగాక దుర్జయుడు, అతడి పరివారం అటవీమార్గంలో కొద్దిసేపు విశ్రాంతి కోసం ఆగారు. అప్పుడు దుర్జయుడికి ఒక దురాలోచన వచ్చింది. ఆశ్రమంగా పర్ణశాల తప్ప మరేమీ లేని బడుగు ముని అయిన గౌరముఖుడు తనకు, తన సమస్త పరివారానికి రాజోచితమైన ఆతిథ్యం ఎలా ఇచ్చాడో అతడికి అంతుచిక్కని రహస్యంగా మిగిలింది. వెంటనే వేగులను పిలిచి, ‘మనందరికీ ఆ ముని గౌరముఖుడు ఎలా ఆతిథ్యం ఇవ్వగలిగాడు? దీని వెనుకనున్న మర్మమేమిటి? ఇందులో ఏదైనా మంత్ర మహిమా ప్రభావం ఉందా? అసలు రహస్యాన్ని తెలుసుకుని రండి’ అని పురమాయించి పంపాడు.రాజాజ్ఞ కావడంతో వేగులు హుటాహుటిన గౌరముఖుడి ఆశ్రమంవైపు బయలుదేరారు. వారు మాటు వేసి గౌరముఖుడి వద్ద ఉన్న మణి మహిమను తెలుసుకున్నారు. తిరిగి వచ్చి, రాజుకు అదే సంగతి చెప్పారు.‘ఒంటరిగా తపస్సు చేసుకునే మునికి ఎందుకు అంతటి దివ్యమణి? అలాంటిది నావంటి రాజు వద్ద ఉండటమే సమంజసం. ఆ మణిని నాకు ఇవ్వగలడేమో కనుక్కుని రండి’ అంటూ దుర్జయుడు తన భటులను పంపాడు. వారు గౌరముఖుడి వద్దకు వెళ్లి, తమ రాజు ఆ మణిని కోరుతున్న సంగతి చెప్పాడు. గౌరముఖుడు ఆ మణిని ఇవ్వడానికి నిరాకరించాడు. భటులు వెనుదిరిగి, ఈ సంగతిని రాజుకు నివేదించారు.గౌరముఖుడు తన కోరికను కాదనడంతో దుర్జయుడికి పట్టరాని కోపం వచ్చింది. వెంటనే సైన్యాన్ని తీసుకుని గౌరముఖుడి ఆశ్రమాన్ని ముట్టడించాడు. దుర్జయుడు సైన్యంతో వస్తుండటం చూసి, గౌరముఖుడు మణిని చేతిలోకి తీసుకుని శ్రీమన్నారాయణుడిని స్మరించుకున్నాడు. రాజు వల్ల, అతడి సైన్యం వల్ల ఆపదను పోగొట్టాలని ప్రార్థించాడు. ఒక్కసారిగా మణి నుంచి వేలాదిగా సాయుధ సైనికులు ఉద్భవించారు.వారు దుర్జయుడి సైన్యాన్ని ఎదుర్కొని, చంపిన వాళ్లను చంపి, మిగిలినవాళ్లను తరిమికొట్టారు. కొంత సమయం తర్వాత గౌరముఖుడు యుద్ధరంగానికి వెళ్లి, అక్కడే కూర్చుని శ్రీమన్నారాయణుడిని ప్రార్థించాడు. ఆయన ప్రత్యక్షమవగానే, దుర్జయుడి ఆగడాన్ని నివారించమని కోరాడు. శ్రీమన్నారాయణుడు తన చక్రాయుధాన్ని ప్రయోగించి, దుర్జయుడి శిరసును ఖండించాడు. – సాంఖ్యాయన -
‘ఇదిగో అబ్బాయ్.. ఓపాలి ఇట్రా’...!
‘ఇదిగో అబ్బాయ్.. ఓపాలి ఇట్రా’ తెల్లటి బట్టలు ధరించిన ఓ పెద్దాయన కేక విని ఆగాడు అప్పుడే పని నుండి బయటకు వచ్చిన అబ్బాయి. ‘అయ్యా’ అంటూ తలమీదున్న తుండు తీసి చేత్తో పట్టుకొని వంగి దణ్ణం పెట్టాడు. ‘ఆడ ఒడ్లు అట్టా పోతుంటే సూసి సూలేనట్టు పోతావేట్రా అబ్బాయ్. అవన్నీ ఏరి బస్తాలో పొయ్.’‘అట్టాగేనయ్యా’ కింద పడ్డ వడ్లన్నీ తీసి బస్తాలో పోసి, ‘పనయిపోయినాదయ్యా.. ఇకెల్లమంటారా?’ వినయంగా అడుగుతున్న కుర్రాడిని ఓసారి చూసి, ‘నీ పేరేటి?’ అనడిగాడు ధాన్యం మిల్లు ఓనరు.‘రామయ్య అయ్యా, రామం అంటారు..’‘కొత్తగా పన్లోకి సేరింది నువ్వేనా?’ జేబులో నుండి ఓ చుట్ట తీసి వెలిగిస్తూ అడిగాడు యజమాని.‘నేనేనయ్యా..’‘నీ బస ఎక్కడా?’ సమాధానం తెలియని రామయ్య తల గోక్కున్నాడు. ‘పోయి ఆ సెట్టుకి ఉన్న రెండు జాంపళ్లు కోసుకెళ్లు’ గాల్లోకి పొగ వదులుతూ లుంగీ పైకెత్తి కట్టుకొని తన బండి మీద ఇంటికెళ్లిపోయాడతను.‘ఇదిగో అవ్వా.. ఇంత ఎండేలప్పుడు రాకపోతే కాస్త పొద్దెక్కాక వచ్చేవాళ్ళం కదా’ ఎండకి చేతిలో ఉన్న ఖాళీ బాల్చీ నెత్తిమీద పెట్టుకుంటూ విసుక్కుంది సీతాలు. ‘బట్టలెక్కువున్నాయి కదేటే. అయినా ఇంకా ఎండేటి.. ఏసవికాలం పోయి వర్షాకాలం వత్తేనూ..’ ‘రోజూ ఇట్టాగే సెప్తున్నావ్ అవ్వా.. నీరసం వత్తంది. జూన్ మాసం వచ్చినంత మాత్రాన వర్షాకాలం వచ్చినట్టు కాదు.. వర్షాలు పడాలా..’‘నాయమ్మ ఓపిక పట్టే.. కాలం సల్లబడిపోతే ఎండేటి తెలీదు. ఇగో ఈ బాల్చీ మీద ఓ చేయి ఎయ్ సీతమ్మా..’‘రోజూ ఇదే సెప్తావు. నా గురించి ఒగ్గేయ్! నీ గురించైనా నీకు యావ లేపోతే ఎట్టాగా?’ అవ్వ తలపై ఉన్న బరువు దించుతూ చిరుకోపంగా అడిగింది సీతాలు.‘నా గురించి నాకు బెంగేంటి సీతమ్మా.. నాలుగు రాళ్ళు కూడబెట్టి నిన్నో అయ్య సేతిలో ఎట్టేత్తె ఏ సింత లేకుండా పానం ఒగ్గేత్తాను’ చీర కొంగుని బొడ్లో దోపి జుట్టు ముడేస్తూ నవ్వింది.‘అవ్వా’ కోపం సీతాలు గొంతులో. ‘కోప్పడకులే సీతమ్మా. పోయి ఆ సెట్టు కింద కూర్సో నీడగా ఉంటాది’ నీటికి, నేలకి మధ్యున్న బండరాయిపై నిలేస్తూ చెప్పింది.‘నేనూ సాయం సేత్తానే..’‘వద్దమ్మ. అదిగో రావి చెట్టు కింద మీ ముసలోడు ఉన్నాడు పో..’ ‘రోజూ ఇంతే. ఈ మాత్రం దానికి నన్ను ఎంటబెట్టుకొని రాడం దేనికి?’ విసుక్కుంటూ వెళ్ళి రావి చెట్టు కిందున్న ముసలోడి పక్కన కూర్చుంది. దగ్గరలో ఉన్న రాములోరి గుడి గోపురానికి కట్టి ఉన్న మైకు సెట్టు నుండి వస్తున్న రాముడి కీర్తన వింటూ! కీర్తనకు వంత పలుకుతూ పక్కనే ఉన్న ముసలోడితో మాట కలుతుపుతున్న సీతాలు వైపు చూస్తూ గోదాట్లోకి వెళ్ళాడు రామయ్య.తనను చూస్తూ వెళ్తున్న రామయ్యను చూసి ‘ఒక్క నిమిషం తాత ఇప్పుడే వత్తాను!’ అంటూ రామయ్య వైపు వెళ్ళింది. తుండు, తనతో పాటు తెచ్చిన జాంపళ్ళను గట్టు మీద పెట్టి, కాళ్ళు చేతులు కడుక్కుని తాగడానికి దోసిట్లోకి నీళ్ళు తీసుకున్నాడు రామయ్య. ‘ఓయ్ గళ్ళ నిక్కరూ..’ గట్టిగా వినిపించిన కేకకి చేతిలో ఉన్న నీటిని వదిలేసి వెనక్కి తిరిగి చూశాడు రామయ్య. ‘ఏటీ’ గయ్యిమన్నాడు ఒక్కసారిగా, గళ్ళ నిక్కరు అని పిలిచినందుకు ఉక్రోషం అతనిలో.‘సంబడవో.. అంత కోపమేటి? ఈ రేవులో ఆడాళ్ళు పశువులు కడుగుతారు. ఆ నీళ్ళు తాగడానికి బాగోవు. ఇంద ఇవి తాగు’ గోనసంచి చుట్టున్న చిన్న మట్టికుండ రామయ్య చేతిలో పెట్టింది.మైమరపుగా సీతాలు వైపు చూసి నీళ్ళు తాగి ‘నీ పేరేటి?’ అడిగాడు రామం. ‘సీతాలు, మరి నీదో?’‘రామయ్య’ చెప్పి సీతాలు చేతిలో కుండ పెట్టబోయాడు. ‘ఉంచుకో! నాకాడ ఇంకోటుంది’ గట్టు మీదున్న జామకాయలు చూస్తూ చెప్పింది. ‘అట్టాగే’ ఓ జామకాయ సీతాలు చేతికి అందించాడు. కళ్ళతోనే కృతజ్ఞత చెప్పుకొని రావి చెట్టు దగ్గరకి వెళ్ళిపోయింది సీతాలు.ఆ తర్వత మూడు రోజుల్లో ఏదొక సాయంత్ర సమయంలో రామయ్య కనిపించినా, సీతాలు మాట్లాడేది కాదు. రావి చెట్టు కిందున్న ముసలోడికి తనతో పాటు తెచ్చిన అన్నం పెట్టడం, గుడి నుండి వినపడే పాటలు వింటూ, చీకటి పడేదాకా కాలక్షేపం చేసి అవ్వతో వెళ్ళిపోవడం. ప్రతిరోజూ సీతాలుని ఓకంటా గమనిస్తున్న రామయ్య చూపులు సీతాలుని తాకలేదు.ఒకరోజు, పల్చగా కురుస్తున్న వర్షపు జల్లుని లెక్క చేయక గోదారి ఒడ్డున కూర్చున్న రామయ్య పక్కనొచ్చి కూర్చుంది సీతాలు. ‘గళ్ళ నిక్కరూ.. ఆయాల్టిసంది ఈడే కనపడుతున్నావ్. నీ ఊరేటి, మునుపెప్పుడూ నిన్నీడ సూళ్ళేదు.’‘రామయ్య నా పేరు.’‘సంబడవో.. ఈడేం సెత్తున్నావ్?’‘ఒడ్డు దాటి పోతే ఇరవై అంగల్లో నేను పన్చేసే ధాన్యం మిల్లు..’‘ఓ.. పెద్ద పనే. సొంతూరేటి?’‘పశ్చిమ గోదావరి, గూడెంలో మా ఇల్లు.’‘అంత దూరం నుండి వత్తున్నావా రోజూ?’ ఆశ్చర్యంలో సీతాలు.‘లేదు. ఇల్లు ఒగ్గేసి వచ్చేశా. సదువు అబ్బలేదని మా అయ్య కొట్టాడు. అలిగొచ్చేశాను. కానీ ఇంట్లో నుండి బయటకు వచ్చేప్పుడే అనుకున్నాను గొప్పగా ఎదగాలని!’ ‘నిన్నుకొట్టింది మీ నాయన కాదేటి?’‘నా సంగతటెట్టు, నీ సంగతి చెప్పు ?’‘అమ్మా, నాన్నను సూడలేదు. ఈ అవ్వ దగ్గరే పెరిగా. అవ్వ, తాతలది బట్టలుతికే పని. తాతకి ఒంట్లో బాగోపోతే అవ్వకి జతొస్తున్నా..’ అని సీతాలు చెప్తుండగా.. ‘సీతమ్మా.. జడి పెద్దదైపోతుంది. ఇంటికి పోదాం దా..’ పిలిచింది అవ్వ.‘అట్టాగే అవ్వా..’ అని అవ్వకి చెబుతూ ‘నేనెల్తున్నా గళ్ళ నిక్కరూ.. నువ్వు కూడా ఇంటికి పో!’ పైకి లేచి బట్టలకంటుకున్న ఇసుక దులుపుకొని వెళ్తున్న సీతాలు కుడి చేయి పట్టి ఆపి జామకాయ చేతిలో పెట్టి ‘రామయ్య’ అని తన పేరుని గుర్తు చేశాడు.‘సంబడవో..’ చందమామలా నవ్వుకుంటూ వెళ్ళిపోయింది సీతాలు.ప్రతిరోజూ సంధ్యాసమయంలో మిల్లులో పని ముగించుకొని వస్తున్న రామయ్య, అవ్వతో పాటు ఒడ్డుకొస్తున్న సీతాలు మాటల్లో పడ్డారు. ఎన్నో ఏళ్ల నుండి పరిచయం ఉన్నట్లు కష్టసుఖాలు చెప్పుకొనేవారు. రామయ్య తనతో పాటు తెచ్చే రెండు జామకాయల్లో ఒకటి సీతాలుకి ఇవ్వడం, సీతాలు తీసుకెళ్ళి తాత చేతిలో పెట్టడం జరుగుతోంది..‘అతనెవరో నీకెరుకా?’ ఒట్టి చేతులతో తిరిగి వచ్చిన సీతాలుని అడిగాడు రామయ్య. ‘నా అనుకుంటే మనవాడే.. పాపం ఆ తాత కడుపు నింపడానికి ఎవరూ లేరు.. అడగడానికి అతనికి గొంతు లేదు.. మూగోడు.’‘నిజమే?’ రావి చెట్టు కిందున్న ముసలోడి వైపు చూశాడు రామం. ‘నువ్వోటి గమనించావా?’ గోదాట్లో పాదాలు పెట్టి సూర్య కిరణాలకి మెరుస్తున్న కాలి కడియాలను చూసుకుంటూ అడిగింది. ‘ఏటీ ?’‘నీ పేరు రామయ్య, నా పేరు సీతాలు. మనిద్దరి పేర్లు కలిపితే జతవుద్దీ’ తూర్పున శ్రీరామచంద్రుడి ఆలయ గాలిగోపురం వైపు చూస్తూ ముసిముసిగా నవ్వింది. ఆరుమాసాలు గడిచాయి.. ప్రాయంతో పాటు సీతాలు అందాలూ రామయ్యలో కోరికల దీపాలు వెలిగించసాగాయి. ఓ సాయంత్రం అవ్వ.. తాత ఉతికిన బట్టలు మూట కడుతూ తాతను ‘మాయ..’ అని పిలవడం విన్నాడు రామయ్య. గోదావరిలో గెంతుతున్న సీతాలు దగ్గరకు వెళ్లి.. ‘ఓపాలి నన్నూ మాయ అని పిలవ్వే సీతమ్మా’ అని ఆశగా అడిగాడు.‘సంబడవో.. నువ్వేటి నిక్కరూ నన్ను పిలవమనేది’ అలజడిగా అనిపించి అక్కడి నుండి వెళ్ళబోయిన సీతాలు చేయి పట్టి ఆపి ‘నువ్వే సెప్పావ్ కదేటే మన పేర్లు జతవుతాయని.. పిలవ్వే’ అనడిగాడు. ‘అట్టాగే మాయ’ రామాలయం నుండి గట్టిగా వినపడిన గంట శబ్దానికి ఇద్దరూ అటువైపు తిరిగి దణ్ణం పెట్టుకున్నారు.‘గళ్ళ నిక్కరూ! ఈరోజేటి ఆలస్యంగా వచ్చావ్?’ అంటూ అరటాకులో దాచిన పరమాన్నం రామయ్య చేతికి ఇచ్చింది సీతాలు. ‘మిల్లు అమ్మకానికి ఎట్టారంట, నేను దాచిన కొన్ని డబ్బులు ఉన్నాయి. ఇంకొన్ని సర్దుకుంటే మిగతాది తర్వాత ఇవ్వచ్చు అన్నాడు.’‘ఇప్పుడే వత్తా మాయ, నువ్వు తింటా ఉండు..’‘ఎక్కడికే?’ అడుగుతుండగానే మాయం అయిపోయింది సీతాలు. గంట తర్వాత ఆయాసంతో తిరిగొచ్చిన సీతాలు.. రామయ్య పక్కన కూర్చొని అతని చేతిలో తనతో పాటు తెచ్చిన బంగారు గొలుసు పెట్టింది. ‘ఇంత బంగారం నీకెక్కడిదే?’ కంగారుగా అడిగాడు రామయ్య. ‘మా అమ్మది. ఇది అమ్మేయ్ మాయ. డబ్బులు సరిపోతాయి!’‘నీకు అమ్మ, నాన్న లేరన్నావ్ కదే?’‘ఉందేమో, తెలీదు. నన్ను కని ఓ గంపలో పెట్టి గోదారమ్మ తల్లికి అప్పజెప్పేసింది అమ్మ. సాకలి పనిసేసే అవ్వకి పిల్లలు లేకపోతే నన్ను దగ్గరకు తీసి ఇంత దాన్ని చేసింది. అదే బుట్టలో ఈ గొలుసు, ఉంగరం ఉన్నాయంట. ఉంగరం అమ్మ గుర్తుగా నేనే ఉంచుకుంటాను, గొలుసు నువ్వు తీసుకో’ కల్మషంలేని మనసుతో నవ్వుతున్న సీతాలు చేతికి తిరిగి గొలుసు ఇచ్చేస్తూ ‘నాకొద్దే, ఎదోలా ఉంది’ అన్నాడు ఇబ్బంది పడుతూ.‘కట్నం అనుకో. నా దగ్గర మొహమాటమేటి? ఈ ఉంగరం నా చేతికి తొడుగు మాయ’ ఆశగా అడిగిన సీతాలు చేతివేలికి ఉంగరం తొడిగి, ఆమె నుదిటిపై ముద్దు పెట్టుకొని, ‘మిల్లు కొన్నాక ఈ రాములోరి గుళ్ళో పెళ్లి చేసుకుందాం సీతమ్మా’ చెప్పాడు. ‘నీ ఇట్టం మాయ’ వేలికున్న ఉంగరం వైపు మురిపెంగా చూసుకుంది సీతాలు.సీతాలు ఇచ్చిన గొలుసు అమ్మగా వచ్చిన డబ్బుతో తాను దాచిన డబ్బు కలిపి బయాన చెల్లించి మిగిలింది వాయిదాల ప్రకారం ఇస్తానని చెప్పి మిల్లు సొంతం చేసుకున్నాడు, సీతాలుకి విషయం చెప్పాలని మిల్లు తాలూకా పత్రాలు పట్టుకొచ్చాడు గోదారి దగ్గరకి. తెల్లటి బట్టల్లో దొరలా ఉన్న రామయ్య కళ్ళల్లో కనిపిస్తున్న సంతోషాన్ని తన కళ్ళల్లో నింపుకొని కాగితాలు అన్నీ చూసింది సీతాలు. ప్రతి చోట ఉన్న వేలి ముద్రని చూసి ‘సంతకమెట్టడం నేర్చుకో మాయ, పెద్ద ధాన్యం మిల్లు ఒనరువీ, అచ్చరాలు రాకపోతే అవమానం కదూ!!’ చిరుకోపం చూపించింది.‘బడికి పోతేనే కదే అచ్చరాలు ఒచ్చేది, మనమేనాడూ పోయింది లేదు’ తల గోక్కున్నాడు. ‘ఈలు కుదిరినపుడు నేను సదువు నేర్పుతాలే’‘బడాయి పోకు, నీకొచ్చేటి?’‘ఏడో తరగతి సదివాను, పై తరగతులకు పోవాలంటే పెద్ద బడికి ఏరు దాటి పోవాలంట, అవ్వ వద్దంది!’‘నా సీతాలు తెలివైందే’ మెరుస్తున్న కళ్లతో సీతాలును చూశాడు.‘సాల్లే సంబడం .. నాకో రెండు కోరికలు మాయ..’‘సిటికెలో పనే, మిల్లు యజమాని నీ మాయ ఇప్పుడు. సెప్పు ఏటి కావాలో?’ గర్వం రామయ్య గొంతులో తొణికిసలాడింది.‘వచ్చిన లాభాలతో మేడలు కట్టేయకా, బంగారం పోగేయకా నీకు చేతనయినంతలో పేదోళ్ళ కడుపు నింపు మాయ.. అలాగే నాకో మంచి కోక కొనెట్టు!’‘సున్నితమైన హృదయమే నీది, నీ ఇట్ట ప్రకారమే చేద్దాం’ గోదారి వైపు చూస్తూ చెప్పాడు. ‘ఏటి మాయ.. సూత్తున్నావ్..?’‘నీటి పవాహంలో మనం కలిసినట్టు కనపడుతుందే..’‘మరి కదిలే కాలంలో మనం ఒకటిగానే ఉంటామా మాయ?’ అంటూ రామయ్య భుజంపై తల పెట్టుకొని చూస్తుండిపోయింది.మరో మూడు నెలలు కరిగిపోయాయి. సీతాలు దయవల్ల నాలుగు ముక్కలు నేర్చుకున్నాడు రామయ్య. ఒకసారి తన తండ్రిని చూసొస్తానని, వచ్చాక తనను పెళ్ళి చేసుకుంటానని సీతాలుకు మాటిచ్చి సొంతూరికి వెళ్ళాడు రామయ్య. వారం తర్వాత తండ్రితో పాటు వచ్చిన రామయ్య రావి చెట్టకిందున్న ముసలాడికి ఇడ్లీ పొట్లం ఇచ్చి సీతాలు కోసం ఎదురుచూడసాగాడు. చేతిలో ఎదో సంచి. ఆ పొద్దు సీతాలు రాలేదు కానీ అవ్వొచ్చింది. అవ్వను అడిగాడు సీతాలు ఎక్కడ అని. ‘పెళ్ళయిపోనాది బాబు. అత్తింటికి పోయింది’ అవ్వ మాటలు వింటూనే చేతిలో సంచి వదిలేశాడు. సంచిలో ఉన్న నెమలికంఠం రంగు నేత చీర గోదాట్లో కొట్టుకుపోయింది.‘ఏమే లక్ష్మీ.. కాస్త ఆ తువాల పట్రా’ పెరట్లో తొట్టి దగ్గర స్నానం చేసి కేకేశాడు శ్రీను. ‘రోజూ ఇదే అలవాటయిపోతుంది. రేపొద్దున్నుండి నువ్వే తెచ్చుకో’ విసురుగా భర్త ముఖాన తుండు విసిరి లోనికి వెళ్ళిపోయింది లక్ష్మి. ‘ఏమైంది దీనికి? రాత్రి నుండి గయ్యిమంటోంది’ అనుకుంటూ నడుముకి తుండు కట్టుకొని లోపలికెళ్ళి మంచం పై చూశాడు. ఎప్పుడూ మంచం అంచులో లక్ష్మి తనకోసం తీసిపెట్టే బట్టల చోటులో ఖాళీ అతన్ని వెక్కిరించింది.చెక్క బీరువాలోంచి బట్టలు తీసి వేసుకొని బయటకు వస్తూ ‘లక్ష్మీ టిఫిన్ పెట్టు’ అని కేకేస్తూ తండ్రి కోసం చూశాడు. ఎప్పుడూ ఆ సమయానికి ఇంటి బయట అరుగు మీద కూర్చునే తండ్రి రెండ్రోజులగా జీవం లేనట్టు గుమ్మంలో ఉన్న నులక మంచంపై పడుకొని ఉంటున్నాడు. దగ్గరకెళ్ళి తండ్రి నుదిటిపై చెయ్యేసి చూశాడు. కొడుకు చేతి స్పర్శకి కళ్ళు తెరిచిన రామయ్య ‘నేను బానే ఉన్నానురా’ అంటూ లేచి కూర్చున్నాడు.‘నీ ఆరోగ్యం బాగుంటే నువ్వెలా ఉంటావో నాకు తెలీదా నాన్నా?’ అంటూ ‘లక్ష్మీ.. నాన్నకి కాసిన్ని పాలు వెచ్చబెట్టి తీసుకురా. అలాగే అలమరలో ఉన్న జ్వరం మాత్రలు కూడా’ అని పురమాయించాడు. ‘నన్నెందుకు అడగడం? మొన్న కూరగాయల సంతలో మీ వయసున్న అమ్మాయి చేయి పట్టుకున్నారు, నిన్న వీథి చివర అదే అమ్మాయి మెడలో బంగారు గొలుసేశారు, ఈరోజు తెల్లారి పక్కింటి రంగడితో లాయరు గారికి కబురెట్టమన్నారు. అంతా ఆ పిల్ల కోసమే కదా! పోయి ఆ అమ్మాయినే ఇవ్వమని చెప్పండి మాత్రలు’ కోపం ఆపుకోలేక బయటపడిపోయింది లక్ష్మి.‘లక్ష్మీ.. మాటలు జాగ్రత్త’ అరిచాడు శ్రీను. ‘నాపై నోరు పారేసుకోకుండా నేను చెప్పింది అబద్ధమని మీ నాన్నని చెప్పమనండి!’ ‘మీ కోడలు చెప్పేది నిజమా నాన్న?’పెదవి విప్పలేదు రామయ్య. ‘వయసు మర్చిపోయి తప్పుడు పనులు చేశాక ఇంకా ఈ మౌనం ఎందుకో! అడుగుతున్నారు కదా, సమాధానమివ్వండి’ అంటున్న లక్ష్మి చెంప ఛెళ్లుమంది శ్రీను చేతిలో. ఊహించని ఆ చర్యతో బొమ్మలా నిలబడిపోయింది లక్ష్మి. ‘మరోమాట మాట్లాడితే సహించను. పో ఇక్కడి నుండి’ వేలెత్తి చూపిస్తూ భార్యను హెచ్చరించాడు శ్రీను.లక్ష్మి వెళ్ళిన మరుక్షణం ‘అది చెప్పింది నిజమేనా నాన్నా?’ అసహనం నిండుకున్న గొంతుకతో అడిగాడు. కోడలి అపార్థానికి మాటలు రాక కాసేపు మౌనంగా ఉన్న రామయ్య, కొడుకు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పకుంటే అదే నిజం అనుకుంటాడు అని పెదవి విప్పక తప్పలేదు. ‘నిజమే బాబు, చెయ్యట్టుకున్నాను, మెళ్ళో గొలుసేశాను, కానీ మరో ఇదంగా కాదు’ మాట పూర్తి కాకుండానే, ‘ఛీ.. ఎంతో ఉన్నతమైన హోదాలో ఉన్న మీరు ఇలాంటివన్నీ చేస్తుంటే వినడానికి అసహ్యంగా, మిమ్మల్ని నాన్న అని పిలవడానికి అవమానంగా ఉంది’ చీదరించుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు శ్రీను.కొడుకు వెళ్ళిపోయాక తన గదిలో మంచం పై వెనక్కి వాలి కళ్ళు మూసుకున్న రామానికి గతం కళ్ళ ముందు మెదిలింది. సీతాలు దూరమై రెండేళ్ళు గడిచినప్పటికీ తను లేదని, తిరిగి రాదనే నిజం నమ్మలేకున్న రోజుల్లో తండ్రి బలవంతం మీద బాణి అనే అమ్మాయిని మనువాడాడు. బాణిని ఏనాడూ భార్యలా చూడలేదు. మనసు విప్పి మాట్లాడలేదు. పెళ్ళయి రెండేళ్ళయినా పిల్లల్లేరా అని అడిగిన వాళ్ళకి ఏమని సమాధానమివ్వాలో తెలియక మౌనంగా బాధపడేది బాణి.వేసవికాలం. అతనికి సీతాలుని పరిచయం చేసిన కాలం, ఆమె నవ్వులో గ్రీష్మ కాలం కూడా తొలకరి జల్లుని పరిచయం చేసిన కాలం. ఆరుబయట సన్నజాజుల పాదు కింద నులక మంచం వేసి పడుకున్నాడు. మబ్బుల చాటునున్న చంద్రుడిలో సీతాలు, విచ్చుకున్న సన్నజాజి పువ్వులో సీతాలు నవ్వులు. పక్కకి తిరిగి పడుకున్నాడు. ఇంటి ముందున్న గిరిబాబు వేపచెట్టుకి ఆకాశవాణి తగిలించి, లాంతరు వెలుగులో బట్టలు ఇస్త్రీ చేస్తున్నాడు, ఆగి ఆగి వినిపిస్తున్న నిరీక్షణ చిత్రంలోని ‘చుక్కల్లే తోచావే.. ఎన్నల్లే కాచావే.. ఏడబోయావే.. ఇన్ని ఏల సుక్కల్లో నిన్ను నేనెతికానే’ పాటలో రాగం అందుకుంటూ..,రామయ్య కంటి కొసన కన్నీళ్ళు. మూడో కంటికి తెలియడం ఇష్టంలేనట్టు తుడిచేశాడు. కాసేపటికి ‘మాయ’ అని పిలుస్తూ రామయ్య పక్కకొచ్చి కూర్చుంటూ అతని చేయి పట్టుకుంది బాణి. ‘మునుపోసారి సెప్పినట్టు గుర్తు మాయ అని పిలొద్దని’ చేయి వెనక్కి తీసుకున్నాడు.‘అంత కోపమేటి మాయ, అమ్మ సెప్పింది భర్తని పేరెట్టి పిలవకూడదు అని!’తలకింద చేయి పెట్టుకొని ఆకాశం వైపు మౌనంగా చూస్తున్న రామయ్యపై చూపు నిలిపి,‘మన పెళ్ళికి మునుపు అమ్మ సెప్తుండేది మాయ. ఒలేయ్ బాణి, నీతో ఉండేవాళ్ళని నువ్వు బాగా సూసుకుంటావు, నీ పనితనంతో మెప్పు పొందుతావు, నీక్కాబోయే భర్త అదృష్టవంతుడు అని! మరి నేనేటి పాపం సేశానో తెలీదు మాయ, నీ మనసు గెలుచుకోలేకపోయాను’ దుఃఖం ఆపుకోలేక ఏడుస్తూ ఇంట్లోకెళ్ళిపోయింది.జ్ఞాపకాల్లో నుండి బయట పడిన రామయ్య కాగితంపై ఏవో రాసిపెట్టాడు. పొద్దున్నుండి గది బయటకు రాని తండ్రిని తిన్నావా అని అడగలేదు, రాత్రి పది దాటాక బయటకెళ్తున్న అతన్ని చూసి ఎక్కడికని అడగలేదు శ్రీను. పొద్దు పొడవకముందే ఎవరో తలుపులు కొడుతున్న చప్పుడు విసుగ్గా అనిపిస్తుంటే అదే చిరాకులో వచ్చి తలుపులు తెరిచాడు. ‘అయ్యా, రామయ్య గారు శవమై ఒడ్డున తేలారు’ వింటూనే జారగిలపడ్డాడు శ్రీను.తండ్రి చావుకి తానే కారణంగా భావించిన శ్రీను పదిహేను రోజుల తర్వాత ఒక రకమైన బాధతో తండ్రి గదిలోకి వెళ్ళాడు. తనకి జన్మనిచ్చిన బాణి పురిటినొప్పుల్లోనే కళ్ళు మూస్తే అన్నీ తానై పెంచాడు రామయ్య. గదిలో ఏ మూల చూసినా అతని జ్ఞాపకాలే, గోడ మీద మిగిలిన నవ్వులే. తండ్రి నవ్వులను చేత్తో తడిమి మంచం పై కూర్చున్నాడు. కిటికీ నుండి వచ్చిన గాలికి బల్ల మీదున్న కాగితాలపై ఏదో రాసినట్టు అనిపిస్తే చేతిలోకి తీసుకొని చూశాడు.‘బాబూ, సెప్పకుండా పోతున్నాను. బాధపడకు. మూడో మనిషికి తెలియకుండా నా గతం నాలోనే సమాధి చేసెయ్యాలని అనుకున్నాను. కోడలు అలా జరగనివ్వలేదు. నా గతం, నా ప్రాణం నా సీతాలు, దానికి పుట్టిన కన్నబిడ్డే కోడలు అపార్థం చేసుకున్న అమ్మాయి. రెండ్రోజుల క్రితం అనుకోకుండా షావుకారి కొట్టు దగ్గర కలిశాను. ఆ అమ్మి చేతి వేలికున్న ఉంగరం చూసి గుర్తుపట్టాను. ఆరా తీస్తే సెప్పింది తల్లి పేరు సీతాలు అని, పెళ్ళి కాకుండానే ఓ తాగుబోతు ఆవేశానికి బలై తనకి జన్మనిచ్చింది అని.తండ్రికి సారా చుక్క ఎక్కువై ప్రాణం పోతే, తల్లికి తాగడానికి గంజి చుక్క లేక పానం వదిలేసిందని. ఎంత అన్యాయం ఆ భగవంతుడిది! నా సీతాలు నన్నడిగిన ఆఖరు కోరిక, ఆకలితో ఉన్నోడికి గుప్పెడు మెతుకులు దానమియ్యయా అని! అంత మంచి మనసున్న నా సీతమ్మని తిండికి గతిలేనిదాన్ని చేసి తన దగ్గరకి తీసుకెళ్ళిపోయాడు. సీతాలు కూతురికి ఇప్పుడెవరూ లేరు. ఆ అమ్మినలా నడిరోడ్డు మీద ఒంటరిగా వదిలేయాలని అనిపించలేదు, తండ్రినై అక్కున చేర్చుకోవాలి అనుకున్నాను. సీతాలు గొలుసు ఆ అమ్మి మెడలో ఏశాను. కోడలి మనస్తత్వం తెలిసి లాయరుకి కబురెట్టి మిల్లుకి నిన్ను యజమానిని చేయాలని అనుకున్నాను. బాధ్యతలన్నీ నీకు అప్పగించి అమ్మికి తోడవుదామని అనుకున్నాను. కానీ కాలం నన్ను దోషిని చేసింది, తట్టుకోలేకపోయాను.కనురెప్పల మాటున ఉప్పెన రేపేసి పోయింది నా సీతమ్మ. నా గుండెలో ఆరని దీపమైంది. ఎక్కడోచోట సుఖంగా ఉందనుకొని ఇన్నేళ్ళూ నెట్టేశాను. ఆ వెలుగుతో ముడిపడున్న నా గుండె చప్పుడు తను లేదని తెలిశాక ఉనికి వినిపించాలనుకోలేదు. ఆకాశపు ఎడారిలో ఒంటరోన్నై కొన ఊపిరితో కాలం ఈడ్చినట్టు అనిపించింది ఈ రెండు రోజలు. అందుకే నా నుండి దూరంగా పంపేశాను. ఏ గోదారి ఒడ్డున నా సీతాలు నాకన్నీ ఇచ్చిందో, అక్కడే అన్నీ వదిలేశాను నా ఊపిరితో సహ. నువ్వూ, కోడలు జగ్రత్త.. ఇక సెలవు!’ కాగితపు అంచున రామయ్య కన్నీటి చారికలు.శ్రీను కళ్ళల్లో కన్నీటి ఉద్ధృతి. ఇన్నాళ్ళూ తండ్రిని అర్థంచేసుకున్నానని అనుకున్నాడు, కానీ తండ్రి మనసు తెలుసుకోలేకపోయాడు. కాసేపటికి ఓ దృఢమైన నిర్ణయం తీసుకున్నట్టు కన్నీళ్ళు తుడుచుకొని గడప దాటి బయటకు వెళ్తుంటే అడిగింది లక్ష్మి ఎక్కడికని. ‘నా అక్కని ఇంటికి తీసుకురావడానికి’ వెనక్కి చూడకుండా ముందడుగేశాడు శ్రీను. – యల్లపు పావని -
వసుధైక క్రీడోత్సవం: మరింత వేగంగా.. మరింత ఎత్తుకు.. మరింత బలంగా..
పారిస్ నగరం పగలు పెర్ఫ్యూమ్ బాటిల్లా, రాత్రి షాంపేన్ బాటిల్లా కనిపిస్తుందంటారు. ఇప్పుడు మాత్రం పగలు, రాత్రి తేడా లేకుండా ఒలింపిక్మయంగా మారిపోతోంది. ఫ్రెంచ్ వైన్‌ను మించిన స్పోర్ట్స్ మత్తులో నగరం మునిగిపోతోంది. 100 ఏళ్ల తర్వాత తమ ఇంట్లో జరగబోతున్న పండగతో సీన్ నదీ తీరమంతా క్రీడా సందడికి కేరాఫ్‌గా నిలుస్తోంది.రాబోయే కొన్ని రోజుల పాటు అక్కడ కలలు రెక్కలు విప్పుకుంటాయి. ఆశలు, అంచనాలు ఈఫిల్ టవర్‌ను తాకుతాయి. ఫ్యాషన్ స్ట్రీట్‌లో కూడా పతకాలు, పతాకాల గురించే చర్చ సాగుతుంది. గెలిచే మెడల్‌కు ఫ్రెంచ్ ముద్దుతోనే మురిపెం. ఒక్కసారి ఆడితే చాలు అదృష్టంగా భావించేవారు, ఒక్క పతకం గెలిస్తే చాలనుకునేవారు, కనకం కొడితే జన్మ ధన్యమైనట్లుగా సంబరపడేవారు, మళ్లీ మళ్లీ గెలిచి సగర్వంగా శిఖరాన నిలిచేవారు, అందరూ ఇక్కడే కలసిపోతారు. సంబరాలు, కన్నీళ్లు, ఆనందబాష్పాలు, భావోద్వేగాలు అన్నీ ఒక్కచోటే కనిపిస్తాయి.జాతీయ జెండా ఎగురుతున్నప్పుడు, జాతీయ గీతం వినిపిస్తున్నప్పుడు క్రీడాకారుల గుండె లోతుల్లో పొంగే భావనను లెక్కకట్టేందుకు ఎలాంటి కొలమానాలు సరిపోవు. ఔను! సమస్త క్రీడా జాతిని ఏకం చేసే మెగా ఈవెంట్‌కు సమయం వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఆటగాళ్లకే కాదు, అభిమానులకు కూడా ఆనందానుభూతి పంచేందుకు విశ్వ క్రీడా సంబరం వచ్చేసింది. ప్రఖ్యాత పారిస్ నగరంలో 2024 ఒలింపిక్స్‌కు ఈనెల 26న తెర లేవనుంది.5 నగరాల నుంచి..2024 ఒలింపిక్స్ నిర్వహణ కోసం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) వేర్వేరు నగరాల నుంచి 2015 సెప్టెంబర్‌లోనే బిడ్లను ఆహ్వానించింది. ఒలింపిక్స్ ప్రణాళికలు, భిన్నమైన రీతిలో నిర్వహణ, వ్యూహాలు, ప్రభుత్వ పనితీరు, వేదికకు కావాల్సిన ఆర్థిక పుష్టి, గతానుభవం, ఆ నగరానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న గుర్తింపు తదితర అంశాలను దృష్టిలోకి తీసుకుంటూ బిడ్లను కోరారు. పారిస్ (ఫ్రాన్స్), లాస్ ఏంజెలిస్ (అమెరికా), బుడాపెస్ట్ (హంగరీ), హాంబర్గ్ (జర్మనీ), రోమ్ (ఇటలీ) నగరాలు తుది జాబితాలో నిలిచాయి. అయితే ఆర్థిక కారణాలతో మూడు నగరాలు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. రోమ్, హాంబర్గ్ నగరాల్లో ప్రజాభిప్రాయ సేకరణ జరగగా, ఎక్కువమంది ఒలింపిక్స్‌కు వ్యతిరేకంగా ఓటింగ్ చేశారు. బుడాపెస్ట్‌లో అయితే ఒలింపిక్స్ జరిగితే ఆర్థికంగా చితికిపోతామంటూ అన్ని ప్రతిపక్ష పార్టీలు ‘నో ఒలింపిక్స్’ పేరుతో ఉద్యమమే నడిపించాయి. దాంతో చివరకు పారిస్, లాస్ ఏంజెలిస్ మాత్రమే మిగిలాయి. ఈ నేపథ్యంలో ఐఏసీ 2024కే కాకుండా 2028 కోసం కూడా బిడ్‌ను ఖాయం చేసేందుకు సిద్ధమైంది. దాంతో లాస్ ఏంజెలిస్ వెనక్కి తగ్గి తాము 2028లో ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిస్తామంటూ స్పష్టం చేయడంతో 2017 జూలైలో పారిస్‌కు గేమ్స్ ఖాయమయ్యాయి.రూ. 40 వేల కోట్లతో...పారిస్ నగరం ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడం ఇది మూడోసారి. గతంలో 1900 (రెండో ఒలింపిక్స్), 1924 (ఎనిమిదో ఒలింపిక్స్) కూడా ఇక్కడే జరిగాయి. ఒలింపిక్స్‌కు రెండుసార్లు నిర్వహించిన తొలి నగరంగా పారిస్ గుర్తింపు పొందింది. 2024 క్రీడల కోసం అక్షరాలా 4.38 బిలియన్ యూరోలు (సుమారు రూ. 40 వేల కోట్లు) కేటాయించారు. ఇదంతా 100 శాతం ప్రైవేట్ ఫండింగ్ కావడం విశేషం. ఇందులో టీవీ రైట్స్, టికెట్ల అమ్మకం, హాస్పిటాలిటీ, లైసెన్సింగ్, ఇతర భాగస్వామ్యపు ఒప్పందాలు కలసి ఉన్నాయి.ప్రభుత్వం నుంచి ఆర్థికంగా ఎలాంటి సహకారం లేకుండా ఈ ఒలింపిక్స్ జరగనున్నాయి. అయితే సహజంగానే ఒలింపిక్స్ నిర్వహణ అంటే భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడం, క్రీడల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలు, స్టేడియాలు ఆ తర్వాత పనికి రాకుండా పోయి వృథాగా పడి ఉండటం గత కొన్ని ఒలింపిక్స్లుగా చూస్తూనే ఉన్నాం. దాంతో ఆర్థిక భారం అంశంపై ఈసారి బాగా చర్చ జరిగింది. అయితే పారిస్‌లో ఈసారి ఒలింపిక్స్ నిర్వహణ నష్టదాయకం కాదని, ఆర్థిక సమస్యలను తట్టుకోగలిగే శక్తి ఉందని పలు తాజా నివేదికలు వెల్లడించాయి.ముఖ్యంగా ఒలింపిక్స్ జరిగే సమయంలో పారిస్‌కు చాలా పెద్ద సంఖ్యలో వచ్చే పర్యాటకుల కారణంగా నగరానికి మంచి ఆదాయం రానుందనేది అంచనా. పారిస్ ప్రాంతానికి కనీసం 6.7 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 56 వేల కోట్లు) వరకు ఆర్థిక ప్రయోజనాలు కలగవచ్చని చెబుతున్నారు. కాబట్టి ఎలా చూసినా ఒలింపిక్స్ నిర్వహణ లాభదాయకమే తప్ప నష్టం లేదని నిర్వహణా కమిటీ ఘంటాపథంగా చెబుతోంది.టార్చ్‌తో మొదలు..క్రీడల్లో ఒలింపిక్ జ్యోతికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఒలింపిక్ ఉద్యమానికి ఇది సూచిక. ప్రాచీన గ్రీకురాజ్యంలో ఉన్న సంప్రదాయాన్ని కొనసాగిస్తూ దీనిని ఒలింపిక్స్ వరకు తీసుకొచ్చారు. ఏథెన్స్ సమీపంలోని ఒలింపియాలో సూర్యకిరణాల ద్వారా ఒలింపిక్ జ్యోతిని వెలిగించడం ప్రతి ఒలింపిక్స్‌కు కొన్ని నెలల ముందు జరిగే ప్రక్రియ. అక్కడ వెలిగిన జ్యోతితో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల ద్వారా టార్చ్ రిలే కొనసాగుతుంది. శాంతి, స్నేహ సంబంధాల సందేశం ఇవ్వడం ఈ ఒలింపిక్ టార్చ్ ప్రధాన ఉద్దేశం.1936 బెర్లిన్ ఒలింపిక్స్‌లో మొదటిసారి దీనిని వాడారు. తర్వాతి రోజుల్లో ఆతిథ్య దేశం ఆలోచనలు, వారి సంస్కృతికి అనుగుణంగా టార్చ్ల నమూనాలను రూపొందించడం సంప్రదాయంగా మారింది. క్రీడలు జరిగినన్ని రోజులు ఒలింపిక్ జ్యోతి వెలుగుతూ ఉంటుంది. మెగా ఈవెంట్ ముగిసిన తర్వాత దానిని ఆర్పేస్తారు. సాధారణంగా ఆయా దేశపు ప్రముఖ లేదా మాజీ క్రీడాకారులు ఒలింపిక్ టార్చ్ అందుకొని రిలేలో పాల్గొంటారు. పారిస్ ఒలింపిక్స్‌కు సంబంధించి 10 వేల మంది టార్చ్ బేరర్లతో 400 నగరాల గుండా ఈ జ్యోతి ప్రయాణించింది.మస్కట్, లోగో..పారిస్ ఒలింపిక్స్ కోసం ‘ఫ్రీ జీ’ పేరుతో అధికారిక మస్కట్‌ను విడుదల చేశారు. ప్రాచీన ఫ్రెంచ్ సంప్రదాయ టోపీని ‘ఫ్రీజీ’గా వ్యవహరిస్తారు. ఆ దేశపు చరిత్ర ప్రకారం దీనిని ఒక టోపీగా మాత్రమే చూడరు. ఆ దేశపు స్వేచ్ఛకు సంకేతంగా భావిస్తారు. దీనికి చరిత్రలో ఎంతో ప్రాధాన్యం ఉంది. ముఖ్యంగా ఫ్రెంచ్ విప్లవం సమయంలో విప్లవకారులంతా ఇలాంటి టోపీలనే ధరించారు.ఫ్రాన్స్ దేశపు రోజువారీ వ్యవహారాల్లో ఈ ‘ఫ్రీజీ’ టోపీ కనిపిస్తూ ఉంటుంది. ఫ్రాన్స్ జాతీయ పతాకంలోని రంగులైన ఎరుపు, నీలం, తెలుపు ఇందులో కనిపిస్తాయి. ఒలింపిక్స్‌కు సంబంధించిన డిజైనింగ్ టీమ్ దీనిని రూపొందించింది. ఒలింపిక్ జ్యోతిని బంగారపు రంగులో ప్రదర్శిస్తూ పారిస్ 2024 లోగోను తయారుచేశారు. ‘విడిగా మనం వేగంగా వెళ్లవచ్చు. కానీ కలసికట్టుగా మరింత ముందుకు పోవచ్చు’ అనేది ఈ ఒలింపిక్స్ మోటోగా నిర్ణయించారు.కొత్తగా ఆడుదాం..ఒలింపిక్స్‌లో కొత్త క్రీడాంశాలను ప్రోత్సహించడం సంప్రదాయంగా వస్తోంది. అప్పటికే బాగా గుర్తింపు పొందిన ఆటలతో పాటు ఇలాంటి కొత్త క్రీడలు కొత్త తరం క్రీడాభిమానులను ఆకర్షించేందుకు పనికొస్తాయని ఐఓసీ ఉద్దేశం. మెగా ఈవెంట్‌కు ఆతిథ్యం ఇచ్చే దేశాలకు కొత్త క్రీడల పేర్లను ప్రతిపాదించే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో పారిస్ ఒలింపిక్స్‌లో కొత్తగా ఒక క్రీడాంశాన్ని ప్రవేశపెట్టారు.బ్రేకింగ్: 1970ల నుంచి అమెరికా సంస్కృతిలో భాగంగా ఉన్న డాన్స్‌లలో ఒక భాగం ఇది. సరిగ్గా చెప్పాలంటే మన దగ్గర సినిమాల ద్వారా బాగా పాపులర్ అయిన బ్రేక్ డాన్స్ రూపమిది. శారీరక కదలికలు, ఫుట్‌వర్క్‌లో స్టయిల్ తదితర అంశాలతో పాయింట్లు కేటాయిస్తారు. 1990 నుంచి ఇందులో పోటీలు జరుగుతున్నా ఒలింపిక్స్‌కు చేరేందుకు ఇంత సమయం పట్టింది. 2018 యూత్ ఒలింపిక్స్‌లో దీనికి మంచి స్పందన లభించడంతో ఇప్పుడు ఒలింపిక్స్‌లో చేర్చారు.అమెరికాదే హవా... దీటుగా చైనా..1061 స్వర్ణాలు, 830 రజత పతకాలు, 738 కాంస్యాలు... మొత్తం 2629 పతకాలు... ఒలింపిక్స్ చరిత్రలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యూఎస్ఏ) అసాధారణ ఘనత ఇది. 1896లో తొలి ఒలింపిక్స్‌లో అగ్రస్థానంలో నిలిచిన అమెరికా నాటి నుంచి ఇప్పటి వరకు తమ హవా కొనసాగిస్తూనే ఉంది. ఎన్నెన్నో అద్భుత ప్రదర్శనలు, ప్రపంచ రికార్డు ప్రదర్శనలు అన్నీ అలవోకగా అమెరికా ఆటగాళ్ల నుంచి వచ్చాయి.ముఖ్యంగా అథ్లెటిక్స్, జిమ్నాస్టిక్స్, స్విమ్మింగ్ వంటి క్రీడల్లోనైతే ఇతర దేశాల ఆటగాళ్లు రెండో స్థానం కోసం పోటీ పడేందుకే బరిలోకి దిగాల్సిన పరిస్థితి. ఇతర జట్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా పూర్తి స్థాయిలో సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించడం అగ్ర రాజ్యానికే చెల్లింది. ఒలింపిక్స్‌లో నిర్దాక్షిణ్యంగా ప్రత్యర్థి జట్లను ఒక ఆటాడుకోవడం అమెరికా ఆటగాళ్లకు అలవాటైన విద్య.ఎప్పుడో పుష్కరానికోసారి ఒక చిన్న సంచలనం, కాస్త ఏమరుపాటుతో కొన్నిసార్లు వెనుకబడినా ఈ మెగా ఈవెంట్‌కు సంబంధించి మొత్తంగా అమెరికన్లకు తిరుగులేదు. అన్ని రకాలుగా క్రీడలకు ప్రోత్సాహం, సరైన వ్యవస్థ, ప్రొఫెషనల్ దృక్పథం, అభిమానుల మొదలు కార్పొరేట్ల వరకు అన్ని ఆటలకు అండగా నిలిచే తత్వం, సుదీర్ఘ కాలంగా క్రీడలు అక్కడి జీవితంలో ఒక భాగంగా మారిపోవడంవంటివి అమెరికా ముందంజకు ప్రధాన కారణాలు.మరోవైపు చైనా కూడా అమెరికాకు దాదాపు సమఉజ్జీగా నిలుస్తోంది. పతకాల్లో పోటీ పడుతూ రెండో స్థానంలో నిలుస్తూ వస్తోంది. ఇన్నేళ్ల ఒలింపిక్స్ ఓవరాల్ జాబితాలో 263 స్వర్ణాలు సహా 636 పతకాలతో చైనా ఐదో స్థానంలో కనిపిస్తోంది. అయితే 2004 ఒలింపిక్స్ వరకు చైనా ఖాతాలో పెద్దగా పతకాలు లేకపోవడమే ఐదో స్థానానికి కారణం.2008లో చైనా సొంతగడ్డ బీజింగ్‌లో ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇచ్చిన నాటి నుంచి ఆ దేశపు క్రీడా ముఖచిత్రమే మారిపోయింది. 2008–2020 మధ్య జరిగిన నాలుగు ఒలింపిక్ క్రీడల్లో చైనా 3 సార్లు రెండో స్థానంలో నిలిచి, ఒకసారి మూడో స్థానంతో ముగించింది. ఇది క్రీడా ప్రపంచంలో వచ్చిన మార్పునకు సంకేతం. కొత్త తరహా శిక్షణ, ప్రణాళికలతో 2008 కోసం ప్రత్యేక వ్యూహాలతో ఒలింపిక్స్‌కు సిద్ధమైన చైనా ఆ తర్వాత తమ జోరును కొనసాగిస్తూ వచ్చింది. భిన్న క్రీడాంశాల్లో అమెరికాతో సై అంటే సై అంటూ పోటీ పడుతోంది.ఆధునిక ఒలింపిక్స్‌లో జేమ్స్ బ్రెండన్ బెనిట్ కొనలీ తొలి విజేతగా నిలిచాడు. అతడు ట్రిపుల్ జంప్‌లో ఈ విజయం సాధించాడు. హార్వర్డ్ విద్యార్థి అయిన కొనలీ సెలవు తీసుకుని ఒలింపిక్స్‌లో పాల్గొన్నాడు. అయితే, అనుమతి లేకుండా క్రీడా పోటీల్లో పాల్గొన్నందుకు హార్వర్డ్ వర్సిటీ అతడికి ఉద్వాసన పలికింది.తొలిసారిగా 1900లో జరిగిన ఒలింపిక్ క్రీడల పోటీల్లో మహిళలకు అవకాశం లభించింది. ఆ ఒలింపిక్స్‌లో 22 మంది మహిళలు పాల్గొన్నారు. అప్పటికి ఇంకా అమెరికాలో మహిళలకు ఓటు హక్కు కూడా రాలేదు. నానా పోరాటాల తర్వాత అమెరికాలో మహిళలకు 1920లో ఓటు హక్కు దక్కింది.ఆధునిక ఒలింపిక్స్‌లో 1896, 1900 సంవత్సరాల్లో పోటీల్లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన విజేతలకు రజత, కాంస్య పతకాలను మాత్రమే బహూకరించేవారు. అప్పట్లో మూడో బహుమతి ఉండేది కాదు. అయితే, 1904 నుంచి ప్రతి పోటీలోనూ ముగ్గురు విజేతలకు స్వర్ణ, రజత, కాంస్య పతకాలను బహూకరించే ఆనవాయితీ మొదలైంది.ఒలింపిక్స్ సహా సమస్త క్రీడా కార్యక్రమాలను ఇప్పుడు టీవీల్లో చూడగలుగుతున్నాం. రోమ్‌లో 1960లో జరిగిన ఒలింపిక్స్ తొలిసారిగా టీవీలో ప్రసారమయ్యాయి. అప్పటి వరకు ఒలింపిక్స్ విశేషాలను తెలుసుకోవడానికి పత్రికలే ఆధారంగా ఉండేవి.ఈఫిల్ టవర్ ఇనుముతో...ఒలింపిక్స్‌లో అన్నింటికంటే ఉద్వేగభరిత క్షణం విజేతలకు పతక ప్రదానం. ఏళ్ల శ్రమకు గుర్తింపుగా దక్కే స్వర్ణ, రజత, కాంస్య పతకాల్లో నిర్వాహకులు ప్రతిసారీ తమదైన ప్రత్యేకతను, భిన్నత్వాన్ని చూపించేందుకు ప్రయత్నిస్తుంటారు. సాధారణంగా స్వర్ణపతకంలో బంగారం చాలా చాలా తక్కువ. ఇందులో 92.5 శాతం వెండిని వాడతారు. కేవలం 1.34 శాతమే బంగారం ఉంటుంది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నిబంధనల ప్రకారం కనీసం 6 గ్రాముల బంగారం ఇందులో ఉండాలి. రజత పతకంలో దాదాపు అంతా వెండి ఉంటుండగా, కంచు పతకంలో 95 శాతం రాగిని వాడతారు. ఈసారి పారిస్ ఒలింపిక్స్‌లో విజేతలకు ఇచ్చే పతకాలకు ఒక ప్రత్యేకత ఉంది. తమ దేశంలో జరిగే ఒలింపిక్స్ పతకాలను భిన్నంగా రూపొందించాలనే ఆలోచనతో నిర్వాహకులు కొత్తగా ఆలోచించారు.ప్రఖ్యాత ఈఫిల్ టవర్ నిర్మాణంలో ఉపయోగించిన అసలైన ఇనుమును పతకాల్లో చేర్చాలని నిర్ణయించారు. ఇన్నేళ్లలో ఈఫిల్ టవర్‌ను ఎన్నోసార్లు ఆధునికీకరించారు. ఈ క్రమంలో కొంత ఇనుమును పక్కన పెడుతూ వచ్చారు. ఇప్పుడు అందులోనుంచే చిన్న చిన్న ముక్కలను తాజా పతకాలలో చేర్చారు. గుండ్రటి పతకం మధ్య భాగంలో ఈ ఇనుమును పారిస్ 2024 లోగోతో కలిపి షడ్భుజాకారంలో ఉంచారు. ఎప్పటిలాగే వెనుక భాగంలో గ్రీకు విజయదేవత ఏథెనా నైకీ, ఆక్రోపొలిస్ భవనంతో పాటు మరో చివర ఈఫిల్ టవర్ కనిపిస్తుంది.10+9+16=35 ఒలింపిక్స్‌లో భారత పతకాల రికార్డు..1900లో జరిగిన రెండో ఒలింపిక్స్ (పారిస్)లో భారత్ తొలిసారి బరిలోకి దిగింది. వ్యక్తిగత విభాగంలో ఏకైక అథ్లెట్ నార్మన్ ప్రిచర్డ్ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. వేర్వేరు కారణాలతో తర్వాతి మూడు ఒలింపిక్స్‌కు భారత్ దూరంగా ఉండగా, 1920లో ఎక్కువ సంఖ్యలో ఆటగాళ్లు పాల్గొన్నారు. అథ్లెటిక్స్, రెజ్లింగ్‌లలో కలిపి ఐదుగురు క్రీడాకారులు బరిలోకి దిగగా, వ్యాపారవేత్త దొరాబ్జీ టాటా తదితరులు ఆర్థిక సహాయం అందించారు. అప్పటి నుంచి మన దేశం వరుసగా ప్రతీ ఒలింపిక్స్‌లో పాల్గొంటూ వచ్చింది.ఒలింపిక్స్‌లో భారత్‌కు హాకీ అత్యధిక పతకాలు తెచ్చి పెట్టింది. జట్టు ఏకంగా 8 స్వర్ణాలు గెలిచింది. మన స్వర్ణయుగంగా సాగిన కాలంలో 1928–1956 మధ్య వరుసగా ఆరు స్వర్ణాలు సాధించిన టీమ్ 1960లో రజతం; 1968, 1972, 2020లలో కాంస్యం గెలుచుకుంది.1900 ఒలింపిక్స్‌లో నార్మన్ ప్రిచర్డ్ పురుషుల 200 మీటర్లు, 200 మీటర్ల హర్డిల్స్‌లో 2 రజతాలు సాధించాడు. ప్రిచర్డ్ జాతీయతపై కాస్త వివాదం ఉండటంతో అతను గెలుచుకున్న పతకాలు భారత్ ఖాతాలో వస్తాయా రావా అనేదానిపై చర్చ జరిగింది. అతను పాత బ్రిటిష్ కుటుంబానికి చెందిన వాడు కాబట్టి తమవాడే అనేది బ్రిటన్ చరిత్రకారుల వాదన.1900 ఒలింపిక్స్‌కు ముందు లండన్‌లో జరిగిన ఏఏఏ చాంపియన్‌షిప్స్‌లో ప్రదర్శన ఆధారంగానే ఎంపికయ్యాడు కాబట్టి అతను ఇంగ్లిష్‌వాడే అనేది వారు చెప్పే మాట. అయితే ప్రిచర్డ్ కోల్‌కతాలో పుట్టడంతో పాటు సుదీర్ఘ కాలం భారత్‌లోనే గడిపాడు కాబట్టి భారతీయుడే అనేది మరో వాదన. అయితే 1900 క్రీడల్లో గ్రేట్ బ్రిటన్ టీమ్ కూడా బరిలోకి దిగింది. వారి తరఫున కాకుండా భారత్ తరఫున ఆడాడు కాబట్టి భారతీయుడే! చివరకు ఐఓసీ తమ పతకాల జాబితాలో ప్రిచర్డ్ రెండు రజతాలు భారత్ ఖాతాలోనే వేసి అధికారికంగా ఆమోద ముద్ర వేసింది.స్వతంత్ర భారతంలో తొలి పతకం 1952 హెల్సింకీ ఒలింపిక్స్‌లో ఖాషాబా దాదాసాహెబ్ జాదవ్ (రెజ్లింగ్) గెలుచుకున్నాడు. హాకీ కాకుండా వ్యక్తిగత విభాగంలో భారత్‌కు ఇదే తొలి పతకం కావడం విశేషం.ఒలింపిక్స్‌లో భారత పతక వీరులు...హాకీ 12..8 స్వర్ణాలు (1928 ఆమ్స్టర్డామ్, 1932 లాస్ ఏంజెలిస్, 1936 బెర్లిన్; 1948 లండన్; 1952 హెల్సింకీ, 1956 మెల్బోర్న్; 1964 టోక్యో, 1980 మాస్కో)1 రజతం (1960 రోమ్)3 కాంస్యాలు (1968 మెక్సికో, 1972 మ్యూనిక్, 2020 టోక్యో)షూటింగ్ 4..1 స్వర్ణం (అభినవ్ బింద్రా; 2008 బీజింగ్)2 రజతాలు (రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్; 2004 ఏథెన్స్... విజయ్‌కుమార్; 2012 లండన్), 1 కాంస్యం (గగన్ నారంగ్; 2012 లండన్)అథ్లెటిక్స్3..1 స్వర్ణం (నీరజ్ చోప్రా; 2020 టోక్యో)2 రజతాలు (నార్మన్ ప్రిచర్డ్; 1900 పారిస్)రెజ్లింగ్ 7..2 రజతాలు (సుశీల్ కుమార్; 2012 లండన్... రవి కుమార్ దహియా; 2020 టోక్యో)5 కాంస్యాలు (ఖాషాబా జాదవ్; 1952 హెల్సింకీ... సుశీల్ కుమార్, యోగేశ్వర్ దత్; 2012 లండన్... సాక్షి మలిక్; 2016 రియో... బజరంగ్ పూనియా; 2020 టోక్యో)బాక్సింగ్ 3..3 కాంస్యాలు (విజేందర్; 2008 బీజింగ్... మేరీ కోమ్; 2012 లండన్... లవ్లీనా బొర్గోహైన్; 2020 టోక్యో)బ్యాడ్మింటన్ 3..1 రజతం (పీవీ సింధు; 2016 రియో)2 కాంస్యాలు (సైనా నెహ్వాల్; 2012 లండన్, సింధు; 2020 టోక్యో)వెయిట్ లిఫ్టింగ్ 2..1 రజతం (మీరాబాయి చాను; 2020 టోక్యో)1 కాంస్యం (కరణం మల్లీశ్వరి; 2000 సిడ్నీ)టెన్నిస్ 1..1 కాంస్యం (లియాండర్ పేస్; 1996 అట్లాంటా)మనం ఎక్కడున్నాం?71, 71, 65, 50, 55, 67, 48... అట్లాంటాలో జరిగిన 1996 ఒలింపిక్స్ నుంచి టోక్యోలో జరిగిన 2020 ఒలింపిక్స్ వరకు పతకాల పట్టికలో భారత్ స్థానమిది. గత పోటీల్లోనైతే నీరజ్ చోప్రా ప్రదర్శనతో ఒక స్వర్ణపతకం చేరిన తర్వాత కూడా మనం 48వ స్థానానికే పరిమితమయ్యాం. అగ్రరాజ్యాల సంగతి సరే; చెక్ రిపబ్లిక్, క్రొయేషియా, స్లొవేనియా, ఉజ్బెకిస్తాన్, జార్జియా, ఉగాండా, ఈక్వెడార్, బహామాస్, కొసవో, బెలారస్ దేశాలు కూడా పతకాల పట్టికలో మనకంటే ముందు నిలిచాయి. ఈ ప్రదర్శన చూసి నిరాశ చెందాలో, లేక 1996కు ముందు వరుసగా మూడు ఒలింపిక్స్‌లో ఒక్క పతకం కూడా లేకుండా సున్నా చుట్టి అసలు ఏ స్థానమూ సాధించని స్థితి నుంచి మెరుగయ్యామో అర్థం కాని పరిస్థితి.వ్యక్తిగత క్రీడాంశంలోనైతే 1956 నుంచి 1992 వరకు భారత్‌కు ఒక్క పతకమూ రాలేదంటే ఆటల్లో మన సత్తా ఏపాటిదో అర్థమవుతుంది. క్రికెట్లో విశ్వ విజేతలుగా నిలుస్తున్నా, ఇతర క్రీడాంశాలకు వచేసరికి భారత్ వెనుకబడిపోతూనే ఉంది. ఇక ఒలింపిక్స్ వచ్చే సమయానికి కాస్త హడావిడి పెరిగినా, చాలామంది క్రీడాకారులకు అది పాల్గొనాల్సిన లాంఛనమే తప్ప కచ్చితంగా పతకాలతో తిరిగి రాగలరనే నమ్మకం ఉండటం లేదు.అభిమానుల కోణంలో చూసినా సరే మెగా పోటీలు మొదలైన తొలిరోజు నుంచి పతకాల జాబితాలో మన వంతు ఎప్పుడు వస్తుందని ఎదురు చూడటం అలవాటుగా మారిపోయింది. 1900 ఒలింపిక్స్‌లో ఒకే వ్యక్తిని పంపడం మినహాయిస్తే, 1920 నుంచి రెగ్యులర్‌గా మన ఆటగాళ్లు పోటీల్లో పాల్గొంటున్నారు. అంటే 2020 టోక్యో ఒలింపిక్స్‌తో భారత్ వందేళ్లు పూర్తి చేసుకుంది. ఈ వందేళ్లలో 10 స్వర్ణాలు, 9 రజతాలు, 16 కాంస్యాలతో భారత్ మొత్తం 35 పతకాలు గెలుచుకోగలిగింది. ఓవరాల్‌గా ఒలింపిక్స్ చరిత్రలో పతకాలు గెలిచిన జట్ల జాబితాను చూస్తే భారత్ 56వ స్థానంలో ఉంది.ఒలింపిక్స్ సమయంలో మినహా...‘నా దృష్టిలో ఇది 1000 స్వర్ణాలతో సమానం. ఇంకా చెప్పాలంటే అది కూడా తక్కువే!’– 2016 రియో ఒలింపిక్స్‌లో రెజ్లర్ సాక్షి మలిక్ కాంస్యం గెలిచినప్పుడు భారత స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ చేసిన ట్వీట్ ఇది. నిజానికి ఇది ఆ ప్లేయర్‌ను అభినందించినట్లుగా ఉంది. కానీ దేశమంతా అభిమానించే ఒక నటుడు ఈ విజయాన్ని అంత గొప్పగా చెబుతున్నాడంటే మనం ఎంత అల్పసంతోషులమో చూపిస్తోంది. భారత ఆటగాళ్లు అప్పుడప్పుడూ సాధించే ఘనతలకు ఆకాశమంత గుర్తింపు దక్కుతుంది.ఆ సమయంలో సాగే హంగామా చూస్తే భారత్ ప్రపంచ క్రీడా వేదికపై అద్భుతాలు చేసినట్లు అనిపిస్తుంది. కానీ ఒలింపిక్స్ సమయంలో మినహా మిగతా రోజుల్లో ఆయా క్రీడలపై చాలా మందికి కనీస ఆసక్తి కూడా ఉండదు. ఇలాంటి వాతావరణమే క్రికెటేతర క్రీడల్లో భారత్ ఎదుగుదలకు అడ్డంకిగా నిలుస్తోంది. ఇటీవల భారత్ టి20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు మహారాష్ట్రకు చెందిన నలుగురు ఆటగాళ్లకు అక్కడి ప్రభుత్వం భారీ మొత్తంలో నగదు పురస్కారాన్ని అందించింది. కానీ అంతర్జాతీయ వేదికపై ఎన్నో విజయాలు సాధిస్తున్న తనను కనీసం పట్టించుకోలేదని భారత బ్యాడ్మింటన్ ఆటగాడు చిరాగ్ శెట్టి బహిరంగంగానే విమర్శించడం చూస్తే ప్రభుత్వాల ప్రాధాన్యం ఏమిటో స్పష్టమవుతుంది.క్రీడా సంస్కృతి లేకపోవడం వల్లే...ఆటల్లోనూ అగ్రరాజ్యంగా నిలిచే అమెరికాలో క్రీడా మంత్రిత్వశాఖ అనేదే లేదు. క్రీడలకు ఒక మంత్రి కూడా లేడు. ఆశ్చర్యం అనిపించే వాస్తవమిది. క్రీడాకారులను తయారు చేయడంలో అక్కడి ప్రభుత్వానికి ఎలాంటి బాధ్యత లేదు. మరి ఇంత గొప్ప అథ్లెట్లు ఎక్కడి నుంచి, ఎలా పుట్టుకొస్తున్నారని పరిశీలిస్తే ఆసక్తికరమైన అంశాలు కనిపిస్తాయి.స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు, కొందరు పెద్ద పారిశ్రామికవేత్తలు ఆటలను ప్రోత్సహించేందుకు అండగా నిలుస్తున్నారు. వారికి కొన్ని పన్ను రాయితీలు ఇవ్వడం మాత్రమే ప్రభుత్వం చేస్తుంది. అక్కడ స్కూల్స్, కాలేజీలు, స్థానిక పార్కుల్లోనే ఆటగాళ్లు తయారవుతారు. ఒలింపిక్స్‌లో అమెరికాకు ప్రాతినిధ్యం వహించేవారిలో 80 శాతం మంది తమ నేషనల్ కాలేజియేట్ అథ్లెటిక్ అసోసియేషన్ (ఎన్సీఏఏ) నుంచే వస్తారంటూ ఆ సంస్థ సగర్వంగా ప్రకటించింది.అమెరికాలో ప్రతి పార్కుకూ అనుబంధంగా తప్పనిసరిగా అథ్లెటిక్ ఫీల్డ్‌లు ఉంటాయి. మన దగ్గర అసలు ఇలాంటివి ఊహించగలమా? ఎక్కడో దూరం వరకు ఎందుకు, స్థానికంగా మన పాఠశాలల్లో చూస్తేనే పరిస్థితి అర్థమవుతుంది. పెద్ద సంఖ్యలో స్కూళ్లలో కనీసం గ్రౌండ్లు కూడా లేని పరిస్థితి ఉంది.భవిష్యత్తుపై నమ్మకం లేక...ఒలింపిక్స్‌లో సత్తా చాటి భారత్ తరఫున పతకం సాధించిన గుప్పెడు మందిని చూస్తే వారందరి విషయంలో ఒకే సారూప్యత కనిపిస్తుంది. దాదాపు అందరూ ఎన్నో ప్రతికూలతలను దాటి సొంతంగా పైకి ఎదిగినవారే! కెరీర్ ఆరంభంలో, వేర్వేరు వయో విభాగాలకు ఆడే దశల్లో ఎలాంటి సహకారం లభించలేకపోయినా, మొండిగా తమ ఆటను నమ్ముకొని వ్యక్తిగత ప్రతిభతో దూసుకొచ్చినవారే!వ్యవస్థ తయారు చేసిన క్రీడాకారుడు అంటూ ఒక్కరి గురించి కూడా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే మన దగ్గర అలాంటి అవకాశమే లేదు. గెలిచాక అభినందనలు, పోటీగా బహుమతులు, కనకవర్షం కురిపించడం సాధారణమే అయినా, అసలు సమయంలో అవసరం ఉన్నప్పుడు ఎవరూ వారిని పట్టించుకోలేదు. ఏ కార్పొరేట్ కంపెనీ కూడా స్పాన్సర్షిప్ ఇచ్చి ఆదుకోలేదు. సరిగ్గా ఇదే అంశం తమ పిల్లలను క్రీడాకారులుగా మార్చడంలో సగటు భారతీయులను వెనక్కి నెడుతుంది.క్రీడల్లో సఫలమై ఏ స్థాయి వరకు చేరతారనే దానిపై ఎలాంటి గ్యారంటీ లేదు. కోచింగ్, ప్రాక్టీస్, ఎక్విప్మెంట్– ఇలా చాలా అంశాలు భారీ ఖర్చుతో ముడిపడి ఉంటాయి. ఎంత కష్టపడినా ఫలితాలు దక్కకపోవచ్చు కూడా. ఈ అనిశ్చితి వల్ల క్రీడలను కెరీర్‌గా చూడటం కష్టంగా మారిపోయింది. అందుకే దాదాపు అందరూ తమ పిల్లలు బాగా చదువుకుంటే చాలనే ఆలోచనతో దానిపైనే దృష్టి పెడుతున్నారు. మనవాళ్ల ప్రాధాన్యాల జాబితాలో క్రీడలు ఎక్కడో చిట్టచివరి స్థానంలో ఉంటాయి. ఎదుటివారి విజయాలకు చప్పట్లు కొట్టి అభినందించడమే తప్ప తమ పిల్లలను క్రీడల్లోకి పంపే సాహసం చేయడం లేదు. ఆటలు ఆడితే లాభం లేదనే సంస్కృతి మన జీవితాల్లో ‘ఖేలోగే కూదోగే తో హోంగే ఖరాబ్. పఢోగే లిఖోగే తో బనోగే నవాబ్’లాంటి మాటలతో నిండిపోయింది.సౌకర్యాలు కల్పించకుండా...‘మేం ఒలింపిక్స్‌లో ఒక్క పతకం కోసం ఎంత ఖర్చు చేశామో తెలుసా? అక్షరాలా 45 లక్షల పౌండ్లు’ 2012 లండన్ ఒలింపిక్స్ తర్వాత బ్రిటిష్ అధికారి ఒకరు చేసిన వ్యాఖ్య ఇది. అంటే భారత కరెన్సీలో అప్పట్లోనే ఇది దాదాపు రూ. 38 కోట్లు. పతకమే లక్ష్యంగా ఆటగాళ్లకు కల్పించిన సౌకర్యాలు, అభివృద్ధి చేసిన క్రీడా సదుపాయాలు, డైట్, ఫిట్నెస్ వంటి అన్ని అంశాలూ ఇందులో కలసి ఉన్నాయి. అలా చూస్తే మన దేశంలో ఇలాంటిది సాధ్యమా? మన వద్ద గెలిచి వచ్చిన తర్వాత ఇంత మొత్తం ఆటగాళ్లకు ఇస్తారేమో గాని, గెలిచేందుకు కావాల్సిన వాతావరణాన్ని అందించే ప్రయత్నం మాత్రం చేయరు. భారతదేశ జనాభా దాదాపు 141.72 కోట్లు. ప్రపంచంలో మొదటి స్థానం.టోక్యో 2020 ఒలింపిక్స్‌లో భారత్ సాధించిన మొత్తం పతకాల సంఖ్య 7 మాత్రమే. దేశ జనాభా, గెలుచుకున్న పతకాలను లెక్క గట్టి సగటు చూస్తే అన్ని దేశాల్లోకి అత్యంత చెత్త ప్రదర్శన మనదే! నిజానికి జనాభాను బట్టి పతకాలు గెలుచుకోవాలనే లెక్క ఏమీ లేదు గాని, సహజంగానే ఇది చర్చనీయాంశం. చాలా తక్కువ మంది మాత్రమే ఆటల వైపు వెళ్లుతున్నారనేది వాస్తవం. వీరిలో అన్ని దశలను దాటి ఒలింపిక్స్ వరకు వెళ్లగలిగేవారు చాలా తక్కువ మంది మాత్రమే! 2020 టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ నుంచి మొత్తం 126 మంది అథ్లెట్లు మాత్రమే పాల్గొన్నారు. మనం గెలుచుకున్న 7 పతకాలే ఇన్నేళ్లలో మన అత్యుత్తమ ప్రదర్శన. అమెరికా తరహాలో కార్పొరేట్లు పెద్ద ఎత్తున అండగా నిలవడం ఇక్కడ సాధ్యం కావడం లేదు కాబట్టి ప్రభుత్వం వైపు నుంచే క్రీడల అభివృద్ధికి తొలి అడుగు పడాలనేది వాస్తవం.మన పేలవ ప్రదర్శనకు కారణాలను ఎంచడం చూస్తే వాటికి పరిమితి ఉండదు. ఒలింపిక్స్ స్థాయికి తగిన స్టేడియాలు, కనీస సౌకర్యాలు లేకపోవడం, బడ్జెట్లో క్రీడలకు అతి తక్కువ నిధులు కేటాయించడం, ప్రాథమిక స్థాయిలో ఆటలపై అసలు దృష్టి పెట్టకపోవడం, పరిపాలనా వ్యవస్థలోని లోటుపాట్లు క్రీడలకు అడ్డంకులుగా మారుతున్నాయి. ఇలాంటి స్థితిలో ఏదోలా అక్కడక్కడా పైకి దూసుకొచ్చినవారిపైనే ఒలింపిక్స్‌లో మన ఆశలన్నీ ఉంటున్నాయి. ఇప్పటికీ ఫలానా క్రీడాంశంలో మనం పూర్తి ఆధిక్యం కనబరుస్తాం అని నమ్మకంగా చెప్పలేని పరిస్థితిలోనే మనం ఉన్నాం. అందుకే ఒకటీ, రెండు, మూడు అంటూ వేళ్లపై లెక్కించగలిగే పతకాలు వస్తున్న ప్రతిసారీ మనం వాటికి పెద్ద ఎత్తున పండగ చేసుకుంటున్నాం.ఈసారి రాత మారేనా?ఒలింపిక్స్‌లో భారత్ పెద్ద సంఖ్యలో పతకాలు సాధించేందుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లేదంటూ సుదీర్ఘకాలంగా విమర్శలు వచ్చిన నేపథ్యంలో కొన్నేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం కొత్త ఆలోచనలతో ముందుకు వచ్చింది. వెంటనే ఫలితాలు రాకపోయినా భవిష్యత్తులో ఎక్కువ మందిని ఆటల వైపు ప్రోత్సహించేందుకు ఇది ఉపకరిస్తుందని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా భావించింది. ఈ క్రమంలో టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టాప్స్) పథకాన్ని ప్రవేశపెట్టింది. 2014లో మొదటిసారి దీనిని తీసుకొచ్చినా, స్వల్ప మార్పులతో 2018లో ‘టాప్స్’ను అదనపు అంశాలు జోడించి రూపొందించారు.ప్రభుత్వం దీని కోసం ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించింది. అయితే దీనిని పూర్తి స్థాయిలో వ్యవస్థాగతంగా సౌకర్యాల కల్పన, మైదానాల ఏర్పాటువంటివాటితో చూడలేం. కానీ ఒలింపిక్స్‌కు సన్నద్ధమయ్యే ఆటగాళ్లకు వ్యక్తిగతంగా ఆర్థికంగా వెసులుబాటు ఇచ్చేందుకు ఇది పనికొస్తోంది. సన్నద్ధతలో భాగంగా ఆయా క్రీడాంశాలకు సంబంధించి స్థానికంగా శిక్షణ, అవసరమైతే విదేశాల్లో కోచింగ్, ఎక్విప్మెంట్, విదేశాల్లో పోటీలకు హాజరయ్యేందుకు అవసరమయ్యే ఖర్చును ప్రభుత్వం భరిస్తుంది. వీటితో పాటు ఉద్యోగం లేని ప్లేయర్లకు ఊరటగా నెలకు రూ.50 వేల స్టైపెండ్ కూడా లభిస్తుంది.దీని వల్ల ప్లేయర్లు ఆర్థిక సమస్యల గురించి ఆలోచించకుండా, ఏకాగ్రత చెదరకుండా పూర్తి స్థాయిలో తమ ఆటపైనే దృష్టిపెట్టేందుకు అవకాశం ఉంటుంది. దీని వల్ల సమూలంగా మార్పులు రాకపోయినా...గతంతో పోలిస్తే పరిస్థితి కొంత మెరుపు పడినట్లే. ప్రస్తుతం టాప్స్ స్కీమ్ కోర్ గ్రూప్‌లో మొత్తం 172 మంది ఆటగాళ్లు ఉన్నారు. నిజానికి టోక్యో ఒలింపిక్స్‌కు ముందే కొందరు ఆటగాళ్లు టాప్స్ ద్వారా శిక్షణ పొందారు. కానీ అప్పటికి తగినంత సమయం లేకపోవడంతో ఆశించిన ఫలితాలు రాలేదు. కానీ ఇప్పుడు పారిస్ లక్ష్యంగా క్రీడాకారులు సన్నద్ధమయ్యారు. మరి ఈసారి మన పతకాల సంఖ్య పెరిగి రెండంకెలకు చేరుతుందా అనేది చూడాలి.రెండో ప్రపంచయుద్ధం వల్ల 1940, 1944 సంవత్సరాల్లో జరగాల్సిన ఒలింపిక్స్ రద్దయ్యాయి. నిజానికి 1940 ఒలింపిక్స్ టోక్యోలో జరగాల్సి ఉన్నా, జపాన్‌లో యుద్ధబీభత్సం కారణంగా ఆ ఏడాది ఒలింపిక్ వేదిక ఫిన్లండ్‌కు మారింది. అయినా, తర్వాత అది కూడా రద్దయింది. – మొహమ్మద్ అబ్దుల్ హాది, కరణం నారాయణ -
నవ్వుతున్న బుద్ధుడు..
‘రమణీ, ఈరోజైనా వెళ్లిన పనయిందా ?’ రాంబాబు ఇంటిలోకి వస్తూనే భార్యను అడిగాడు. లక్షలు పెట్టి కొన్న షేర్లు వేలకు పడిపోయినప్పుడు ఇన్వెస్టర్ కళ్ళల్లో కనపడే దిగులు రమణి ముఖంలో తారాటలాడింది. ‘ఆ..ఆ.. అర్థమయిందిలే! ఇవ్వాళ కూడా నీ అన్వేషణ ఫలించలేదన్నమాట.’ ‘అవునండీ.. ఒక చోట ఉన్నవి మరోచోట లేవు, పిచ్చెక్కిపోతోంది. ఇలా చూస్తుండగానే వాడికి మూడో ఏడు తగులుతుంది.’‘నా మాట వినవే.. ముందు మన ఇంటి దగ్గరలో చేరుద్దాం, కాస్త పెద్దయిన తరువాత నువ్వు చెప్పినట్టు చేద్దాం’ అంటూనే సడన్‌గా ఆపేశాడు. చెవులు రిక్కించాడు.. ఖర్, ఖర్.. ఖర్మని గులక రాళ్లు నోట్లో వేసుకొని నములుతున్న చప్పుడు.. అది రాంబాబు చెవులకు బాగా పరిచితమైన చప్పుడే.. భార్యా(ర)మణి పళ్లు కొరుకుతోంది. ‘నీకో దండం పెడతా! అలా నమలకే! పళ్ళు అరిగిపోతాయి. నీకు నచ్చినట్లే చేద్దాంలే. రేపయినా నీ వేట పూర్తి చెయ్యి.’రాంబాబు ఎమ్సీఏ చదివి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ప్రోగ్రామర్‌గా పనిచేస్తున్నాడు. ఉదయమే 7 గంటలకు క్యాబ్ వస్తుంది. దాంట్లో వెళ్ళి రాత్రి పదిగంటలకు వస్తాడు. మంచి జీతం. మేనమామ కూతురు, రమణిని పెళ్లి చేసుకున్నాడు. రమణి ఇంటర్ చదివింది. ఎమ్సెట్ రాస్తే ఆరంకెల ర్యాంకు వచ్చింది. లాంగ్‌టర్మ్ కోచింగ్ తీసుకొని మళ్లీ రాసింది. ఈసారీ ఆరంకెలే. అందులోనూ ఇంకాస్త గరిష్ఠ సంఖ్య. ‘ముచ్చటగా మూడోసారి రాయనా’ అనబోయి, వాళ్ళ అమ్మ చేతిలో అట్లకాడ చూసి నోరు మూసింది. మూసే ముందు, ప్రపంచంలో ఇంజినీరింగ్ తప్ప నేను చదవగలిగే కోర్సేదీ లేదని తేల్చి మరీ.. మూసింది. ఇక ఎన్ని చెప్పినా లాభం లేదని పెళ్లి చేశారు.ఆ పెళ్లి జరగడానికి రమణి వాళ్ళ అమ్మమ్మ తనదైన శైలిలో చెప్పిన సెంటిమెంటు డైలాగులు కూడా ఇతోధికంగా సాయపడ్డంతో చేసేదేం లేక పళ్ళు నూరుకుంటూ.. రమణి పెళ్లి పీటలు ఎక్కాల్సి వచ్చింది. అయినా రాంబాబంటే రమణికీ ఇష్టమే. రాంబాబుకు మరదలన్నా, ఆమె అమాయకత్వమన్నా చాలా ఇష్టం. ఆమెకు ఇంటిపని, వంటపనిలో మంచి నైపుణ్యం ఉంది. రాంబాబుకు ఉద్యోగం చేసే అమ్మాయి కాకుండా ఇల్లు దిద్దుకొనే అమ్మాయినే చేసుకోవాలని వ్యక్తిగత అభిప్రాయం. ఇద్దరూ ఉదయం నుండి రాత్రి దాకా జాబులు చేస్తే వచ్చే డబ్బులు చూసి మురవడం తప్ప, సంసారంలో సారం ఉండదంటాడు. స్వతహాగా రమణి మంచిదే. మంచి కాలేజీలో ఇంజినీరింగ్ చేయాలనేది మనసులో తీరని కోరికలాగా ఉండిపోయింది. అంతే! ఎలాగైనా టాప్ కాలేజీలో ఇంజినీరింగ్ చేయాలనే తన లక్ష్యం నెరవేరకుండా పెళ్లి పేరుతో అడ్డుకున్నందుకు అమ్మమ్మను కసితీరా శపించింది. ఆ శాపం తగిలి రమణి పెళ్లయి ఏడాది తిరక్కుండానే, మనవడికి తన పేరు పెట్టాలని ఒట్టు పెట్టించుకొని మరీ బాల్చీ తన్నేసింది.రమణి.. రాంబాబును కూడా శపించేదే, కానీ ‘మనకు పుట్టబోయే బిడ్డను అక్కడా ఇక్కడా ఏం ఖర్మ.. ఐఐటీలోనే చదివించి నీ కోరిక తీర్చుకుందువుగాని’ అన్న సలహా పుణ్యమాని వదిలేసింది. ఆ సలహా వల్ల భవిష్యత్‌లో వచ్చే ఉత్పాతాన్ని మాత్రం పసిగట్టలేకపోయాడు రాంబాబు.కాస్త ఆలస్యంగానైనా, రమణి వాళ్ల అమ్మమ్మ కోరుకున్నట్లు మగపిల్లాడే పుట్టాడు. పాపం వాడికేం ఎరుక.. తనకోసం అప్పటికే ఒక టార్గెట్ ఫిక్స్ అయిందని! అప్పటికీ అనుమానంతో పుట్టగానే ఏడ్చాడు గానీ, అందరూ ఎత్తుకొని ఉంగా.. ఉంగా అని సముదాయించే సరికి ‘వీళ్ల మొహం, అన్ని కుట్రలు చేసే తెలివితేటలు వీళ్లకెక్కడివని’ అప్పటికూరుకున్నాడు. కానీ తల్లి సంగతి పసిగట్టలేకపోయాడు.అందరూ వాడ్ని ‘చిటుకూ’ అని పిలవసాగారు. వాడు కూడా తన పేరు అదే అనుకున్నాడు. ‘అమ్మమ్మా, అమ్మమ్మా’ అని తప్ప.. ఆమె పేరు ఎవరికీ గుర్తులేకపోవడం ఓ కారణమై ఉంటుంది. తన పేరు మునిమనవడికి పెట్టలేదనే సంగతి పైనున్న అమ్మమ్మకు ఇంకా తెలియదు.చిటుకూ మొదటి సంవత్సరం పూర్తి కాక ముందే వాడికి తగిన స్కూలుకోసం వేట మొదలుపెట్టింది రమణి. ఒకానొక శుభ ముహూర్తాన చిటుకూని పక్కింటివాళ్లకిచ్చి, వెంటనే వస్తానని చెప్పి వాళ్ల కాలనీ దగ్గరలో ఉన్న ఓ మోస్తరు స్కూలుకు వెళ్లింది పొద్దున్నే. స్కూలు గేటు దగ్గర వచ్చి పోయే పిల్లలను పరిశీలిస్తూ నిలబడింది. కాసేపటికి నిట్టూరుస్తూ ఇంటికి వచ్చింది. రాంబాబుకు రిపోర్ట్ కూడా యిచ్చింది. ‘ఎక్కువ మంది పిల్లలకు సోడాబుడ్డి కళ్లద్దాలు లేవు. కాబట్టి చిటుకూ ఆ స్కూలులో చేరబోయేది లేదు’ అని! రాంబాబు బిత్తరపోయాడు. ‘అదేమిటే సోడాబుడ్డి కళ్లద్దాలకు చదువుకు ఏం సంబంధం?’ రాంబాబు గొణుగుడు విని ‘పాపం అమాయకుడు’ అనుకొని నవ్విన రమణి నవ్వుకి ఈసారి బిత్తర మీద బిత్తరపోయాడు.మరో ముహూర్తంలో మరో స్కూలుకు ఉదయాన్నే వెళ్లింది. తృప్తి్తపడి సాయంత్రమూ వెళ్లింది. రాంబాబుకు సాయంకాలానికి మరో రిపోర్ట్ సమర్పించింది..‘స్కూలు నుండి సాయంకాలం ఇంటికి వెళ్లే పిల్లలు పెద్దగా బరువు లేని బ్యాగులతో ధిలాసాగా ఉన్నారనీ, పిల్లలకు కనీస గూని అయినా కనపడని కారణంగా ఈ స్కూలు కూడా చిటుకూకి పనికిరాదు’ అంటూ! రాంబాబు నవనాడులూ ముక్కలు ముక్కలై, వక్కలై సహస్రాలైన భ్రమ కలిగింది. ‘అసలు నీకు కావలసిన స్కూలులో నువ్వు కావాలనుకుంటున్న లక్షణాలేవో చెప్పమ’ని పాత సినిమాల్లో సూర్యకాంతాన్ని రమణారెడ్డి అడిగినట్టు, నాలుగో మెట్టు మీద నిలబడి మొదటి మెట్టు అందుకున్న పోజులో అడిగాడు రాంబాబు. వరమిస్తున్న దేవతమాదిరిగా ఒక్కో వేలు ముడుస్తూ.. ‘మందపాటి అద్దాలున్న కళ్ల జోళ్లు, నిలబడితే వాలిపోయే నడుములు, పిల్లాడి బరువుకి కనీసం అయిదు రెట్ల బరువుతో బ్యాగు, మొహం చేతులు తప్ప ఏవీ కనిపించని స్కూలు డ్రెస్సు, బోండాకు కాళ్లుచేతులూ అమర్చినట్లు శరీరాలు, సూర్యుడిని చూడటానికి వీలుపడని టైమింగ్స్, అగరువత్తుల పొగ కమ్ముకున్న మాదిరి ముఖాలున్న టీచర్లు..’ అలా చెబుతూ రెండు చేతుల వేళ్లన్నీ ముడిచింది. కూల్‌గా నోట్లో వేలు వేసుకొని నిద్ర పోతున్న చిటుకూని చూసి రాంబాబుకు ఎనలేని జాలి కలిగింది. ఇలా స్కూళ్ల వేటా, చిటుకూ గాడి వయసూ క్రమంగా ఒక దశకు చేరుకున్నాయి. పనిలో పని, పక్కింటి వాళ్లు కూడా ‘అమ్మయ్య’ అనుకొని రిలాక్స్ అయ్యారు.. చిటుకూని కాపలా కాసే శ్రమ తగ్గినందుకు.తనది పల్లెటూరు చదువు గాబట్టి ఇంజినీరింగ్ సీటు రాలేదని రమణి గాఢమైన అభిప్రాయం. ‘తను అలాంటి పొరపాటు చేయదు గాక చేయదు’ అని మనసులోనే శపథం చేసి, ఆ సిటీలో ఉన్న అన్ని స్కూళ్లు జల్లెడ వేసి, వేసి చివరికి ఒక స్కూల్లో అడ్మిషన్ తీసుకున్నారు.ఒకరోజు, దగ్గరలో ఉన్న గుడిలో సరస్వతీపూజ చేసి చిటుకూని అటు నుండి అటే స్కూల్‌కి తీసుకుపోయారు. ఆరోజే మూడో ఏడు తగిలిన ఆ బాలరాజు ఇదంతా సరదాగా చూస్తున్నాడు. చివరాఖరికి స్కూల్ దగ్గరికి వచ్చేసరికి వీళ్లేదో చేస్తున్నారనే అనుమానం వచ్చి, ఆరున్నొక్క రాగం మొదలుపెట్టేశాడు. వాడిని సముదాయించే సరికి తాతలు దిగొచ్చారు. అటో ఇటో నర్సరీ క్లాసులో కూర్చోబెట్టారు. రమణి కూడా తోడుగా కూర్చోవాల్సి వచ్చింది. రాంబాబు ఆఫీసు గదిలో కూర్చున్నాడు. కిటికీలో నుండి చిటుకూ క్లాస్ రూమ్ కనబడుతోంది. లంచ్ బెల్ తర్వాత, ఇవ్వాల్టికి చిటుకూని తీసుకెళ్లి, మళ్లీ రేపు తీసుకువస్తామని ప్రిన్సిపల్‌ని అడిగాడు. ‘అయ్యో! అలా ఎలా కుదురుతుంది? ఇవ్వాళ్టి సిలబస్ మిస్ అయిపోతే ఎలా?’ ఆమె గాభరా పడిపోయింది. ‘సిలబసా? నర్సరీకా?’ అయోమయంగా చిటుకూ క్లాసు వైపు చూశాడు రాంబాబు.టీచర్ బోర్డు మీద థామ్సన్ అటామిక్ మోడల్ పటం గీస్తోంది. అదే తరగతిలో చిటుకూకి తోడుగా కూర్చున్న రమణి బోర్డు వైపు తన్మయంగా చూస్తోంది. కళ్ళు నులుముకొని బోర్డు వైపు మళ్లీ చూశాడు రాంబాబు. ‘థామ్సన్ అటామిక్.. కాదులే.. పుచ్చకాయ బొమ్మ గీస్తోందేమోలే! నేను మరీ అతిగా ఆలోచిస్తున్నా’ అనుకున్నాడు.ఇక్కడే ఉంటే తనకేదో అయిపోద్దనిపించి ప్రిన్సిపల్ కాళ్లూ గడ్డం పట్టుకొని ఆరోజుకి చిటుకూతోనే బయటపడ్డారు. ‘ఈరోజంటే మొదటి రోజు కాబట్టి ఫరవాలేదు, రేపట్నుంచి స్కూల్ డ్రెస్‌లోనే రావాలి. లేకపోతే ఫైన్ కట్టాల్సి ఉంటుంది’ ఆఫీసు తలుపు దాటుతూంటే వినపడింది. ఎదురుగా వస్తున్న కుర్రాణ్ణి చూస్తే ప్రెషర్ కుక్కర్ విజిల్ లాగా వాడి తలకాయ, కాయమేమో కుక్కర్లో ఉడుకుతున్నట్టు అనిపిస్తే.. రమణి మాత్రం వాడి వైపు అబ్బురంగా చూస్తోంది.వెనక్కి తిరిగి చూస్తే .. ప్రిన్సిపల్ కఠినమైన చూపుతో.. మొహంపై మట్టి గోడ మీద వేసిన డిస్టెంపర్ లాంటి నవ్వుతో లకలక అంటున్న చంద్రముఖిలా కనపడ్డాడు రాంబాబుకు. ఇంటికి రాగానే రమణి కాళ్లమీద పడ్డంత పనిచేశాడు రాంబాబు. ఆ స్కూలు వద్దంటే వద్దని. అంతకంటే కఠినంగా, తన ట్రేడ్ మార్కు చప్పుడు చేస్తూ చెప్పింది రమణి ‘తన నిర్ణయం మారదని. ఇప్పుడు రమణి మొహం కంటే, అక్కడ ప్రిన్సిపల్ మొహమే ప్రశాంతంగా ఉందనిపించింది.చూస్తుండగానే రోజులు, నెలలు గడుస్తున్నాయి. తన లైఫ్‌లో జరిగిన పొరపాట్లు చిటుకూ లైఫ్‌లో జరగవద్దని అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంది రమణి. వాడు బాత్రూమ్లోకి వెళ్లినప్పుడు కూడా, వాడికి వినపడేలా ఆడియో లెస్స¯Œ ్స మొదలుకొని– వాడు టీవీ చూడాలనుకున్నపుడు వీడియో లెస్స¯Œ ్స వరకు ఎక్కడా చిన్న పొరపాటు జరగనివ్వలేదు.మాటిమాటికీ గోళ్లు చూసుకుంటూ కోరుక్కుంటున్నాడని, ఆ గోళ్లపై కూడా పర్మనెంట్ మార్కర్‌తో వివిధ ఫార్ములాలు రాసేది. కారప్పూసలో త్రికోణమితిని, చపాతీలపై కెమిస్ట్రీని, వాడే వస్తువులపై ఫిజిక్స్నీ.. అలా చిటుకూ తినే పదార్థం.. వాడే వస్తువూ.. దేన్నీ వదలిపెట్టలేదు రమణి. ఈ విషయంలో అదీ, ఇదీ అనే సందేహం వలదు దేన్నైనా ఉపయోగించుకోవచ్చనే సూత్రాన్ని.. రమణి క్రియేటివిటీతోనే నమ్మగలం. లంచ్ బాక్స్‌లో మొదటి గిన్నెలో కూడా వివిధ నిర్వచనాలు, సింబల్స్ లాంటివి రాసిన స్లిప్స్ ఉంచేది. ఈ చదువేదో రమణి తన కాలేజ్‌లో చదివుంటే రమణికి పక్కాగా ర్యాంక్ వచ్చేదని రాంబాబు లోపల లోపల అనుకున్నాడు. ఇంట్లో సిట్టింగ్ రూమ్ అంతా చిటుకూ పుస్తకాలతో నిండిపోయింది. కంప్యూటర్, ట్యాబ్లూ వచ్చి చేరాయి. గోడల మీద డిఫరెన్సియేషన్, ఇంటిగ్రేష¯Œ ్స ఫార్ములాలు, పీరియాడిక్ టేబుల్స్ తిష్ట వేశాయి. క్రమంగా ఆ గదిలో ఉన్న సామగ్రి హాలులోకి ఆ తరువాత బెడ్ రూములోకి ఒక్కొక్క అడుగే వేస్తున్నాయి.కళ్లు మూసి తెరిచేసరికి మరో నాలుగేళ్లూ కరిగిపోయాయి. ప్రతి సంవత్సరం ఐఐటీ ర్యాంకర్ల ఫొటోలు కూడా భద్రంగా గోడ మీద ఎక్కిస్తోంది రమణి. చిటుకూ ముక్కు మీదికి కళ్ల జోడెక్కింది. ఆరోజు రమణి ఎంత సంబరపడిందో! గోడ మీద ఉన్న ర్యాంకర్ల ఫొటోల్లో కూడా అన్నీ కళ్ల జోళ్లే మరి! శారీరక వ్యాయామం లేక గుండ్రంగా అయ్యాడు.వివిధ రకాల పేపర్, డిజిటల్ మెటీరీయల్ రాంబాబుకు ఇంట్లో కాలు మెదపడానికి కూడా వీలుపడకుండా చుట్టుముడుతున్నాయి. రాంబాబూ, చిటుకూ మాట్లాడుకొని ఎంతకాలమయ్యిందో! కానీ బయట మాత్రం రాంబాబు ఐఐటీ ముంబై, ఐఐటీ చెన్నై, ఓపీ టాండన్ కెమిస్ట్రీ, హెచ్‌సీ వర్మ ఫిజిక్స్ అంటూ ప్రైమరీ స్కూలు పిల్లలు భయపడే మాటలు మాట్లాడుతున్నాడు.చిటుకూ కూడా కొత్త కొత్త అలవాట్లు నేర్చుకున్నాడు. మాటిమాటికీ కళ్ల జోడు పైకి నెట్టుకోవడం, కుడిచేతి చూపుడు వేలుతో ముక్కు నులుపుకోవడం, నిద్ర మధ్యలో ఇంగ్లిష్‌లో ఏ, బి, సి, డి, ఈ సెక్షన్లు అంటూ జెడ్ వరకూ కలవరించడం వగైరా. రమణి ఈ అలవాట్ల గురించి తన పేరెంట్స్‌తో ‘మీ మనవడు ఇప్పుడే టార్గెట్ ఓరియెంటెడ్‌గా ఆలోచించడమేం ఖర్మ.. నిద్ర కూడా అలాగే పోతున్నాడు’ అని చెబుతూ మురిసిపోతోంది.వాళ్లేమో ‘వీడు మామూలు పిల్లల్లా అల్లరి చేయడు, మాట్లాడడు, ఏదో లోపం ఉందేమో’ అని అనుమానపడ్తున్నారు. ‘పోనీ వీడికి తోడుగా ఉంటారు మరొకరిని కనండి అంటే ఒక్కడే చాలని ఆపేశారు అంటూ లోలోపలే సణక్కోసాగారు. ఆ మాటలు పైకి అంటే అంతే సంగతులు. తను ఇంజినీర్ కాకపోవడానికి మీరే కారణమని తేల్చి నేను ఆ పొరపాటు చేయనని ర్యాంకర్ల ఫొటోలున్న గోడ మీద గట్టిగా గుద్ది మరీ చెబుతుంది రమణి.చూస్తుండగానే కాలయంత్రపు చక్రాలు గిర్రున తిరిగాయి. ఏళ్లు గడిచాయి. ఇంటర్ రిజల్ట్ వచ్చింది. ఫరవాలేదు ఓ మాదిరి మార్కులతో పాసయ్యాడు. ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ అంటూ ఏవో కారణాలు వాళ్లకు వాళ్లే చెప్పుకున్నారు. జెఈఈలు గట్రా ‘మీకూ, నాకూ సంబంధం లేదని’ బుద్ధిగా సైలెంట్ అయిపోయాయి. ఇక ఎమ్సెట్.. హిస్టరీ రిపీట్ అయింది. రమణి పేరు నిలబెట్టాడు చిటుకూ. మళ్ళీ లాంగ్ టర్మ్. హిస్టరీ మళ్ళీ రిపీట్. వాక్యం మార్చాల్సిన అవసరం రానివ్వలేదు.రమణి ఆలోచించింది. ఇన్నాళ్లూ ప్రతి క్లాసులోనూ బాగానే మార్కులు వస్తున్నాయి. మరి ఇప్పుడేమైంది? ఉన్నట్టుండి గుర్తొచ్చింది. ఒకసారి క్లాసులో ఫస్ట్ ర్యాంక్‌లు పది మందికి వచ్చాయి. ‘అదేంటి? ఎంతమంది ఉన్నా ఒకరికే కదా ఫస్ట్ ర్యాంక్ వచ్చేద’ని అడిగితే మార్కులు సమానం, వయసు సమానం, ఎర్రర్స్ సమానం అంటూ అర్థం కానివేవో చెప్పారు. ‘పోనీలే, నా కొడుకుకైతే ర్యాంక్ వచ్చింది కదా’ని ఆనాడు తృప్తిపడింది. ఇప్పుడు ఆలోచిస్తుంటే ఏదో జరిగిందని లోపల గంట కొడుతోంది. స్కూళ్లలో, కాలేజీలలో జరిగిన నమ్మక ద్రోహం అర్థమైంది. పలురకాలుగా ఆలోచించింది. చిన్నగా రాంబాబు దగ్గరకొచ్చి ‘పోనీలెండి.. చిటుకూకి త్వరగా పెళ్లి చేద్దాం. అప్పుడు వాడికి పుట్టే కొడుకో, కూతురో మన కోరిక నెరవేర్చకపోరు?’ అంది అప్పటికి ఆ కోరికతో రాంబాబే సతమతమైపోతున్నట్టు.అప్పుడు.. రమణికి ఏదో శబ్దం వినపడింది. చెవులు వెడల్పు అయ్యాయి. ఖర్..ఖర్..ఖర్మని గులక రాళ్లు నోట్లో వేసుకొని నములుతున్న చప్పుడు. అది రమణి చెవులు ఎప్పుడూ వినని చప్పుడు. తన ప్రమేయం లేకుండానే రాంబాబు పళ్లు కొరుకుతున్నాడు. ఎదురుగా అటక మీద కనపడుతున్న వస్తువు వైపు అతని చూపులు సాగడాన్ని రమణి పసిగట్టింది. ఆ వస్తువు ఎప్పుడో తమ పెళ్లప్పుడు సంప్రదాయం కోసం వచ్చి ఇంట్లో తిష్ట వేసింది. అప్పటివరకూ ఎప్పుడూ అవసరపడనిది.. రోకలి బండ. గోడ మీద పీరియాడిక్ టేబుల్లో సిల్వర్ మెటాలిక్ కలర్లో యురేనియం మెరిసిపోతోంది.అప్పుడెప్పుడో రాంబాబు పుట్టడానికి కొన్ని నెలల ముందు ‘నవ్వుతున్న బుద్ధుడు’ అనే కోడ్ నేమ్‌తో పోఖ్రాన్ మొదటి అణుపరీక్ష జరిగింది. దాని తాలూకు పేలుడు ఇప్పుడు ఆ ఇంట్లో జరిగే సూచనలు కనిపిస్తున్నాయ్. ఇవేమీ పట్టనట్టు చిటుకూ బయట ప్రహరీ గోడ దగ్గరకు వెళ్ళాడు. ఇలాగే జరుగుతుందని వాడికి ఎప్పుడో తెలుసు. కాకపోతే చెప్పడానికి అవకాశమెక్కడిది?ప్రహరీ గోడపై గడ్డం ఆనించి నిలబడ్డాడు. పై పెదవిపై సన్నని పెన్సిల్ గీతలా మీసాల జాడ.. వాడి చూపు.. ముక్కుపైకి నెట్టుకుంటూన్న కళ్లద్దాల గుండా గోడ మీదుగా .. ఎదురుగా కనిపిస్తున్న గ్రౌండ్ వైపు ఉరికింది. అక్కడ పరుగులు పెడుతూ ఆడుతున్న పిల్లలపై నిలిచింది. ఆశ్చర్యంగా, ఒక అద్భుతాన్ని చూస్తున్నట్టు మేను మరచిపోయాడు.ఇంటికి కొద్ది దూరంలోనే ఇలాంటి గ్రౌండ్ వుందని ఇప్పటివరకూ వాడు గమనించనేలేదు. సరిగ్గా అప్పుడే మైదానం నుండి పిల్లల లేత పాదాల తాకిడికి లేచిన ఓ ధూళి మేఘం... చూస్తుండగానే గాలిలో కలిసిపోయింది.. వాడి బాల్యంలా! – బాడిశ హన్మంతరావు -
టీటీలో మేటి మనికా..
ఆ అమ్మాయి చదువులో చాలా చురుకు.. స్కూల్ దాటి కాలేజ్‌లోకి వచ్చిన తర్వాతా అదే కొనసాగింది. ఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక కళాశాలలో ప్రవేశం. కానీ టేబుల్ టెన్నిస్ కోసం అర్ధాంతరంగా చదువు వదిలేసింది. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. టీనేజ్లోనే పేరున్న కంపెనీలు మోడలింగ్ కోసం ఆమెను సంప్రదించాయి. కానీ టేబుల్ టెన్నిస్ కోసం వాటన్నింటికీ దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది.ఎందుకంటే ఆమె ధ్యాసంతా ఆటపైనే కాబట్టి! ఒక క్రీడాకారిణిగా ఎదగాలనే తన లక్ష్యాన్ని చేరుకునేందుకు ఆమె అన్నింటినీ పక్కన పెట్టింది. కఠిన శ్రమ, పట్టుదల, అంకితభావంతో ఆటలోనే పైకి ఎదిగింది. ఆరంభ అవరోధాలను దాటి కామన్వెల్త్ పతకాల విజేతగా, ఒలింపియన్‌గా నిలిచింది. టేబుల్ టెన్నిస్‌లో అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటిన అరుదైన క్రీడాకారిణుల జాబితాలో తన పేరు లిఖించుకున్న ఆ ప్యాడ్లరే మనికా బత్రా.29 ఏళ్ల మనికా ఇప్పుడు వరుసగా మూడో ఒలింపిక్స్‌కు సన్నద్ధమవుతోంది. గత రెండు సందర్భాల్లో తనకు దక్కకుండా పోయిన పతకాన్ని ఈసారి ఎలాగైనా అందుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది.దాదాపు రెండున్నరేళ్ల క్రితం మనికా బత్రా తీవ్ర వివాదంలో చిక్కుకుంది. టోక్యో ఒలింపిక్స్‌లో పతకం సాధించకపోయినా గతంలో ఒలింపిక్స్ ఆడిన భారత ఆటగాళ్లతో మెరుగైన ప్రదర్శన కనబరచి మూడో రౌండ్ వరకు చేరింది. అయితే ఒలింపిక్స్ ముగిసిన కొద్ది రోజులకే ఆమెకు భారత టేబుల్ టెన్నిస్ సమాఖ్య (టీటీఎఫ్ఐ) షోకాజ్ నోటీసు జారీ చేసింది. మ్యాచ్‌లు జరిగే సమయంలో కోర్టు పక్కనుంచి భారత జట్టు కోచ్ సౌమ్యదీప్ రాయ్ సూచనలను తీసుకునేందుకు ఆమె అంగీకరించలేదు. తన వ్యక్తిగత కోచ్ సన్మయ్ పరాంజపేను అక్కడికి వచ్చేందుకు అధికారులు అంగీకరించకపోగా.. కోచ్ లేకపోయినా ఫర్వాలేదని, అలాగే ఆడతానని ఆమె చెప్పేసింది.అర్జున అవార్డ్ అందుకుంటూ..ఇది టీటీఎఫ్‌ఐకి ఆగ్రహం తెప్పించింది. అందుకే మనికాపై చర్య తీసుకునేందుకు సిద్ధమైంది. దాంతో మనికా కోర్టు మెట్లెక్కింది. అంతటితో ఆగిపోకుండా తన నిరసనకు కారణాన్ని కూడా వెల్లడించింది. కొన్నాళ్ల క్రితం ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ టోర్నీ సందర్భంగా సౌమ్యదీప్ మ్యాచ్ ఫిక్సింగ్‌కు ప్రయత్నించారంటూ సంచలన విషయాన్ని వెల్లడించింది. తన అకాడమీలో శిక్షణ తీసుకుంటున్న సుతీర్థ ముఖర్జీ ఒలింపిక్స్‌కు అర్హత సాధించేందుకు తనను మ్యాచ్ ఓడిపొమ్మని చెప్పాడంటూ బయటపెట్టింది. షోకాజ్ నోటీసుతో తనను మానసికంగా ఇబ్బంది పెట్టారని తెలిపింది.చివరకు కోర్టు మనికా ఆవేదనను అర్థంచేసుకుంది. టీటీఎఫ్ఐలో పూర్తి ప్రక్షాళన కార్యక్రమం జరిగి అధికారులు మారాల్సి వచ్చింది. సాధారణంగా అగ్రశ్రేణి ప్లేయర్లు ఏ ఆటలోనైనా జాతీయ సమాఖ్యతో గొడవకు దిగరు. భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి సాధ్యమైనంత వరకు సర్దుకుపోయే, రాజీ మనస్తత్వంతోనే ఉంటారు. కానీ కెరీర్లో అగ్రస్థానానికి ఎదుగుతున్న దశలో ఒక 27 ఏళ్ల ప్లేయర్ అధికారులతో తలపడింది. ఇది టీటీ కోర్టు బయట ఆమె పోరాటానికి, ధైర్యానికి సంకేతం. అత్యుత్తమ ఆటను ప్రదర్శించేందుకు మాత్రమే కాదు.. ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా తాను నిలబడగలననే ధైర్యాన్ని ఆమె చూపించింది.కుటుంబసభ్యుల అండతో..ఢిల్లీలోని ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చింది మనికా. ముగ్గురు సంతానంలో ఆమె చిన్నది. అన్న సాహిల్, అక్క ఆంచల్ టేబుల్ టెన్నిస్ ఆడటం చూసి నాలుగేళ్ల వయసులో తాను కూడా అటు వైపు ఆకర్షితురాలైంది. చాలామంది ప్లేయర్ల తరహాలోనే ఒకరిలో అసాధారణ ప్రతిభాపాటవాలు ఉంటే ఇతర కుటుంబసభ్యులు వారిని ప్రోత్సాహపరుస్తూ ముందుకు నడపడం, తాము తెర వెనక్కి వెళ్లిపోవడం తరచుగా జరిగేదే. మనికా విషయంలో కూడా ఇదే పునరావృతమైంది.తల్లి సుష్మతో..ఆమె ఆటను మొదలుపెట్టినప్పుడు అందరిలాగే సరదాగా ఆడి ముగిస్తుందని అనుకున్నారు. కానీ ఆమెలో దానికి మించి అపార ప్రజ్ఞ ఉన్నట్లు కోచ్‌లు చెప్పడంతోనే కుటుంబ సభ్యులకు అర్థమైంది. ఆ తర్వాత మనికా విషయంలో మరో ఆలోచనకు అవకాశం ఇవ్వకుండా పూర్తి స్థాయిలో అండగా నిలిచారు. అక్క ఆంచల్ కూడా ఆటపై తనకున్న పరిజ్ఞానంతో చెల్లికి మెంటార్‌గా మారి నడిపించింది. రాష్ట్రస్థాయి అండర్–8 టోర్నీ మ్యాచ్‌లో ఆ చిన్నారి ప్రతిభను చూసిన కోచ్ సందీప్ గుప్తా తన మార్గనిర్దేశనంతో శిక్షణకు తీసుకోవడంతో ఆటలో మనికా ప్రస్థానం మొదలైంది.అగ్రస్థానానికి చేరి..‘బ్యాడ్మింటన్‌లో కూడా కొన్నేళ్ల క్రితం వరకు భారత ఆటగాళ్లు అంతంత మాత్రమే ప్రదర్శన కనబరచారు. కానీ సైనా నెహ్వాల్, పీవీ సింధులాంటి వాళ్లు అద్భుత ప్రదర్శనతో దాని స్థాయిని పెంచారు. మన దేశంలో బ్యాడ్మింటన్ ఒక్కసారిగా దూసుకుపోయింది. ఒక టేబుల్ టెన్నిస్ ప్లేయర్‌గా నేనూ అదే చేయాలనుకుంటున్నా. టీటీకి చిరునామాగా మారి మన దేశంలో ఆటకు ఆదరణ పెంచాలనేదే నా లక్ష్యం’ అని మనికా చెప్పింది.నిజంగానే భారత టీటీకి సంబంధించి ఆమె ఎన్నో ఘనతలు సాధించింది. మరో మహిళా ప్లేయర్‌కు సాధ్యం కాని రీతిలో వరుస విజయాలతో తన స్థాయిని పెంచుకుంది. శాఫ్ క్రీడలు, కామన్వెల్త్ క్రీడలు, ఆసియా క్రీడల్లో పతకాలు, వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) టోర్నీల్లో పెద్ద సంఖ్యలో విజయాలు ఆమె ఖాతాలో చేరాయి. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో కూడా మహిళల సింగిల్స్ విభాగంలో అత్యుత్తమంగా 24వ స్థానానికి చేరుకొని ఆమె భారత్ తరఫున కొత్త చరిత్ర సృష్టించింది. ఆమెకు ముందు ఎవరూ కూడా మహిళల సింగిల్స్‌లో ఇంత మెరుగైన ర్యాంక్ సాధించలేదు.2018, కామన్వెల్త్ గేమ్స్ గోల్డ్ మెడల్‌తో.., 2018, ఐఐటీఎఫ్ ‘ద బ్రేక్‌త్రూ స్టార్’ అవార్డ్‌తో..పతకాల జోరు..అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్‌లో మనికా అత్యుత్తమ ప్రదర్శన 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో కనబడింది. ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో జరిగిన ఈ పోటీల్లో మనికా ఏకంగా నాలుగు వేర్వేరు విభాగాల్లో నాలుగు పతకాలు సాధించింది. మహిళల సింగిల్స్, మహిళల టీమ్ విభాగాల్లో స్వర్ణం గెలుచుకున్న ఆమె.. మహిళల డబుల్స్‌లో రజత పతకం, మిక్స్డ్ డబుల్స్‌లో కాంస్యం అందుకుంది.అదే ఏడాది జకార్తాలో జరిగిన ఆసియా క్రీడల్లో మిక్స్డ్ డబుల్స్ విభాగంలో కాంస్య పతకం సాధించింది. డబ్ల్యూటీటీ టోర్నీల్లోనైతే ఆమె ఖాతాలో పలు సంచలన విజయాలు నమోదయ్యాయి. ఇటీవల సౌదీ స్మాష్ టోర్నీలో వరల్డ్ నంబర్ 2, మాజీ ప్రపంచ చాంపియన్ వాంగ్ మాన్యు (చైనా)పై సాధించిన గెలుపు వాటిలో అత్యుత్తమైంది.మూడో ప్రయత్నంలో..మనికా బత్రా తన కెరీర్లో ఇప్పటికే ఎన్నో చెప్పుకోదగ్గ విజయాలను సాధించింది. ఆమె ఘనతలకుగాను కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికే అర్జున, ఖేల్ రత్న పురస్కారాలు అందుకుంది. ఒకప్పుడు మోడలింగ్ వద్దనుకున్న ఆమె ఇప్పుడు టీటీలో స్టార్‌గా ఎదిగిన తర్వాత అలాంటివాటిలో చురుగ్గా భాగమైంది. ప్రఖ్యాత మేగజీన్ ‘వోగ్’ తమ కవర్‌పేజీలో మనికాకు చోటు కల్పించి అటు గేమ్ ప్లస్ ఇటు గ్లామర్ కలబోసిన ప్లేయర్ అంటూ కథనాలు ప్రచురించింది.ఇతర ఫొటోషూట్ల సంగతి సరేసరి. కెరీర్లో ఎన్నో సాధించిన ఆమె ది బెస్ట్ కోసం చివరి ప్రయత్నం చేస్తోంది. 21 ఏళ్ల వయసులో తొలిసారి 2016 రియో ఒలింపిక్స్‌లో బరిలోకి దిగిన మనికా చెప్పుకోదగ్గ ప్రదర్శన లేకుండా అనుభవం మాత్రమే సాధించి తిరిగొచ్చింది. ఆ తర్వాత 2021 టోక్యో ఒలింపిక్స్‌లో మెరుగైన ఆటతో మూడో రౌండ్‌కి చేరింది. ఇప్పుడు మరింత పదునెక్కిన ఆటతో చెలరేగితే పారిస్ ఒలింపిక్స్‌లో పతకం దక్కవచ్చు. ఈ లక్ష్యాన్ని మనికా అందుకోవాలని భారత అభిమానులందరూ కోరుకుంటున్నారు. – మొహమ్మద్ అబ్దుల్ హాది -
సుధర్ముడి కథ: ఒకనాడు అతడు వ్యాపారం కోసం..
త్రేతాయుగారంభంలో మద్ర దేశంలోని శాకల నగరంలో సుధర్ముడనే వర్తకుడు ఉండేవాడు. అతడు గొప్ప ధనికుడు, ధార్మికుడు. ఒకనాడు అతడు వ్యాపారం కోసం విలువైన వస్తువులు తీసుకుని సురాష్ట్రానికి బయలుదేరాడు. సుధర్ముడు రాత్రివేళ ఎడారి మార్గంలో ప్రయాణిస్తుండగా, కొందరు బందిపోటు దొంగలు అతణ్ణి అడ్డగించి, అతడి వద్దనున్న వస్తువులన్నీ దోచుకుపోయారు.ఉన్నదంతా దొంగలు ఊడ్చుకుపోవడంతో సుధర్ముడు ఆ ఎడారి మార్గంలో దిక్కుతోచని స్థితిలో ఒంటరిగా మిగిలాడు. నిస్సహాయుడిగా ఎడారిమార్గంలో పిచ్చివాడిలా తిరగసాగాడు. అలా తిరుగుతూ తిరుగుతూ మర్నాటి ఉదయానికి ఎడారిని దాటుకుని, ఒక అడవికి చేరుకున్నాడు. ఆకలితో శక్తినశించి ఉండటంతో అడవిలోని ఒక జమ్మిచెట్టు కింద కూలబడ్డాడు.నీరసంతో అతడు ఆ చెట్టు కిందనే నిద్రపోయాడు. సాయంత్రం చీకటి పడుతుండగా మెలకువ వచ్చింది. బడలిక తీరడంతో నెమ్మదిగా లేచి కూర్చున్నాడు. ఎదురుగా వందలాది ప్రేతాలతో కలసి ఉన్న ప్రేతనాయకుడు కనిపించాడు. సుధర్మడికి భయం, ఆశ్చర్యం కలిగాయి. ఎక్కడెక్కిడి నుంచో వచ్చిన ప్రేతాలు ఆ ప్రేతనాయకుడి చుట్టూ కూర్చున్నాయి. సుధర్ముడు ఆశ్చర్యంగా ఆ ప్రేతనాయకుడినే చూస్తూ ఉండిపోయాడు.తననే గమనిస్తున్న సుధర్ముడిని చూసిన ప్రేతనాయకుడు, అతడికి స్వాగతపూర్వకంగా నమస్కారం చేశాడు. దాంతో సుధర్ముడికి భయం పోయి, నెమ్మదిగా ప్రేతనాయకుడితో స్నేహం చేశాడు. ప్రేతనాయకుడు సుధర్ముడిని ‘నువ్వెవరివి? చూడటానికి సౌమ్యుడిలా కనిపిస్తున్నావు. ఎక్కడి నుంచి ఈ అడవికి ఒంటరిగా వచ్చావు? నీకేమైనా కష్టం కలిగిందా? చెప్పు’ అని అడిగాడు. ప్రేతనాయకుడు అలా ఆదరంగా అడగటంతో సుధర్ముడు కంటతడి పెట్టుకుని, తన కష్టాన్నంతా దొంగలు దోచుకుపోయారని, ఇప్పుడు తనకు దిక్కులేదని బాధపడ్డాడు.ప్రేతనాయకుడు సుధర్ముణ్ణి ఓదార్చారు. ‘మిత్రమా! కాలం కలసిరానప్పుడు ఇలాంటి దుస్సంఘటనలు జరుగుతుంటాయి. ధైర్యం తెచ్చుకో! తిండి మానేసి శరీరాన్ని శుష్కింపజేసుకోకు. ముందు దిగులుపడటం మానేయి. కాలం నీకు మళ్లీ అనుకూలిస్తుంది’ అని ధైర్యం చెప్పాడు. తర్వాత తన సహచర ప్రేతాలకు సుధర్ముడిని పరిచయం చేస్తూ, ‘మిత్రులారా! ఇతడు సుధర్ముడు. ఈనాటి నుంచి నాకు మిత్రుడు. అందువల్ల మీకు కూడా మిత్రుడే!’ అని పరిచయం చేశాడు.అంతలోనే అక్కడకు గాల్లోంచి ఒక మట్టికుండ పెరుగన్నంతో వచ్చి నిలిచింది. అలాగే మరో కుండ మంచినీళ్లతో వచ్చింది. వాటిని చూసి ప్రేతనాయకుడు ‘లే మిత్రమా! స్నానాదికాలు పూర్తి చేసుకుని, ముందు భోంచేయి.’ అన్నాడు. సుధర్ముడు స్నానం చేసి వచ్చి, ప్రేతనాయకుడు, అతడి సహచర ప్రేతాలతో కలసి పెరుగన్నం తిన్నాడు. వారి భోజనం పూర్తి కాగానే రెండు కుండలూ అదృశ్యమైపోయాయి. తర్వాత ప్రేతనాయకుడికి వీడ్కోలు పలికి మిగిలిన ప్రేతాలు కూడా అదృశ్యమైపోయాయి.ఇదంతా సుధర్ముడికి ఆశ్చర్యకరంగా అనిపించింది. ‘మిత్రమా! ఈ నిర్జనారణ్యంలోకి అమృతంలాంటి పెరుగన్నాన్ని, చల్లని మంచినీళ్లను ఎవరు పంపారు? నీ సహచర ప్రేతాలెవరు? ఇంతకూ నువ్వెరివి?’ అని ప్రశ్నలు కురిపించాడు.‘సుధర్మా! గత జన్మలో నేను శాకల నగరంలో సోమశర్మ అనే విప్రుణ్ణి. నా వద్ద పుష్కలంగా సంపద ఉన్నా, ఎన్నడూ ధర్మకార్యాలు చేసి ఎరుగను. పరమ పిసినారిగా బతికేవాణ్ణి. నా పొరుగునే సోమశ్రవుడనే వైశ్యుడు ఉండేవాడు. దాదాపు నా వయసు వాడే కావడంతో చిన్ననాటి నుంచి అతడితో స్నేహం ఏర్పడింది. అతడు భాగవతోత్తముడు, ధార్మికుడు. అతడి దానధర్మాలు చూసినా, నాలో మార్పు రాలేదు. చాలాకాలం గడిచాక ఇద్దరమూ వార్ధక్యానికి దగ్గరయ్యాం.ఒకనాడు భాద్రపద ద్వాదశినాడు పర్వస్నానం కోసం నా వైశ్యమిత్రుడితో కలసి ఐరావతి, నడ్వా నదుల సంగమ స్థలానికి వెళ్లాను. సంగమ స్నానం చేసిన రోజున నేను పవిత్రంగా ఉపవాసం ఉన్నాను. అక్కడే స్నానానికి వచ్చిన విప్రోత్తముణ్ణి పిలిచి, అతడికి ఒక కుండలో తియ్యని పెరుగన్నాన్ని, మరో కుండలో చల్లని నీళ్లను, గొడుగును, పాదరక్షలను దానంగా ఇచ్చాను. నా జన్మలో నేను చేసిన దానం అదొక్కటే! తర్వాత ఆయువు ముగిసి, మరణించాక నేను ప్రేతాన్నయ్యాను.ఆనాడు ఆ విప్రుడికి దానం చేసిన అన్నమే అక్షయంగా మారింది. ప్రతిరోజూ మధ్యాహ్నం పెరుగున్నం కుండ, నీటి కుండ ఇక్కడకు వస్తాయి. మేమంతా భోజనం ముగించగానే అదృశ్యమవుతాయి. అతడికి ఇచ్చిన గొడుగు ఇప్పుడు జమ్మిచెట్టుగా మారి, నాకు, నా సహచరులకు నీడనిస్తోంది’ అని చెప్పాడు ప్రేతనాయకుడు.‘మిత్రమా! నీ చరిత్ర ఎంతో గొప్పగా ఉంది. ఇప్పుడు నేనేం చేయాలో, నాకు దారేదో చెప్పు?’ అన్నాడు సుధర్ముడు.‘మిత్రమా! బాధ్రపద శ్రావణ నక్షత్రయుత ద్వాదశీ వ్రతాన్ని ఆచరించు. నీకు శుభాలు కలుగుతాయి. అయితే, నాదొక కోరిక. నాకు, నా సహచర ప్రేతాలకు గయ క్షేత్రంలో పిండప్రదానాలు చేయి. నువ్వు పిండదానం చేస్తే, మాకు పిశాచరూపాల నుంచి విముక్తి దొరుకుతుంది’ అని చెప్పి ప్రేతనాయకుడు సుధర్ముణ్ణి తన భుజాలపై కూర్చోబెట్టుకుని, అడవిని దాటించి శూరసేన రాజ్యలో విడిచిపెట్టాడు.సుధర్ముడు శూరసేన రాజ్యంలో మెల్లగా చిన్న చిన్న వ్యాపారాలు చేసి, కాలక్రమంలో పెద్ద వర్తకుడిగా ఎదిగాడు. ప్రేతనాయకుడు చెప్పినట్లుగానే భాద్రపద ద్వాదశి వ్రతాన్ని ఆచరించాడు. గయ క్షేత్రానికి వెళ్లి ప్రేతనాయకుడికి, అతడి ప్రేతపరివారానికి శాస్త్రోక్తంగా పిండప్రదానాలు చేశాడు. వారితో పాటే తన పితరులకు, బంధువులకు పిండప్రదానాలు చేశాడు. సుధర్ముడు పిండప్రదానాలు చేయగానే ప్రేతనాయకుడు, అతడి సహచరప్రేతాలు దివ్యలోకాలకు వెళ్లిపోయారు. – సాంఖ్యాయనఇవి చదవండి: అద్వైత: బజ్ మంటున్న అలారం శబ్దానికి? -
ఒకప్పుడు ఇది మాఫియా డెన్.. కానీ ఇప్పుడిది?
ఒకప్పుడు ఇది మాఫియా డెన్. ఇప్పుడు థీమ్ పార్క్. దీని పేరు ‘హేసియెండా నేపోలెస్’. అంటే నేపుల్స్ ఎస్టేట్ అని అర్థం. కొలంబియన్ డ్రగ్ మాఫియా డాన్ పాబ్లో ఎస్కోబార్ స్థావరమిది. దాదాపు 20 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ఎస్టేట్‌లో నివాస భవనాలు, ఒక ఈతకొలను, నాలుగు చెరువులతో పాటు ఖాళీ స్థలంలో దట్టంగా పెరిగిన వృక్షసముదాయం చిట్టడవిని తలపిస్తుంది. ఇక్కడ రకరకాల జంతువులు కనిపిస్తాయి. ఎస్కోబార్ నీటి ఏనుగుల వంటి భారీ జంతువులను ఇక్కడకు తెచ్చి పెంచుకునేవాడు. ఈ ఎస్టేట్‌లో ఒక జూ, శిల్పశాల వంటి ప్రత్యేక ఆకర్షణలు ఉన్నాయి. పోలీసుల దాడిలో ఎస్కోబార్ 1993లో మరణించాడు. ఈ ఎస్టేట్ కోసం అతడి కుటుంబం దావా వేసినా, కోర్టులో ఓడిపోయింది.దాంతో ఇది 2006లో కొలంబియా ప్రభుత్వానికి స్వాధీనమైంది. కొలంబియా ప్రభుత్వం దీనిని ఒక థీమ్పార్కుగా తీర్చిదిద్ది, కొత్తగా ప్రవేశద్వారాన్ని నిర్మించింది. ప్రవేశద్వారానికి పైన విమానాన్ని ప్రత్యేక ఆకర్షణగా నిలిపింది. ఈ విమానంలోనే ఎస్కోబార్ మాదకద్రవ్యాలను రవాణా చేసేవాడు. దేశ దేశాల్లో తిరిగిన తర్వాత ఇదే విమానంలో నేరుగా తన ఎస్టేట్‌కు చేరుకునేవాడు.కొలంబియా ప్రభుత్వం ఇక్కడ జురాసిక్ పార్క్ తరహాలో 2014 నాటికి పూర్తిస్థాయి ఆఫ్రికన్ థీమ్‌పార్కు నిర్మాణాన్ని పూర్తిచేసింది. ఇప్పుడిది పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. పర్యాటకులు ఈ థీమ్‌పార్కులో ఒక రోజు బస చేయడానికి 15 డాలర్లు (రూ.1,215) చెల్లించాల్సి ఉంటుంది. ఈ థీమ్‌పార్కులో ఎస్కోబార్ మ్యూజియం, పట్టుబడతాననే భయంతో అతడు తగులబెట్టిన కార్లు, కొకెయిన్ గోదాముల శిథిలాలు ఆనాటి మాఫియా సామ్రాజ్యానికి ఆనవాళ్లుగా నిలిచి ఉన్నాయి.ఇవి చదవండి: అదీ గ్లాస్ బ్రిడ్జ్..! ఎక్కారంటే ప్రాణం గుప్పిట్లోనే!! -
Mohit Rai: స్టార్స్‌ని వాళ్లు పోషించే పాత్రలకు తగ్గట్టుగా..
స్టార్స్‌ని వాళ్లు పోషించే పాత్రలకు తగ్గట్టుగా.. వాళ్లు అటెండ్ అయ్యే ఈవెంట్లకు అనుగుణంగా తీర్చిదిద్దడమంటే అంత ఆషామాషీ వ్యవహారమేం కాదు! కానీ దాన్ని అవలీలగా చేసేసే స్కిల్ పేరే మోహిత్ రాయ్!‘స్టయిలిస్ట్ బై డే, బ్యాట్మన్ బై నైట్’ అని తనను తాను వర్ణించుకునే మోహిత్ రాయ్ స్వస్థలం ఢిల్లీ. అక్కడి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ చేశాడు. వెంటనే హార్పర్స్ బజార్ ఇండియా మ్యాగజైన్లో ఫ్యాషన్ స్టయిలిస్ట్‌గా ఉద్యోగం దొరికింది. అక్కడ మూడేళ్లు పనిచేశాక ముంబైకి మకాం మార్చాడు. అక్కడైతే అవకాశాలు ఎక్కువుంటాయని. అక్కడ ‘ద వార్డ్‌రోబిస్ట్’లో క్రియేటివ్ డైరెక్టర్‌గా చేరాడు.రెండేళ్లకు ‘హార్పర్స్ బజార్ బ్రైడ్ ఇండియా’లో ఫ్యాషన్ డైరెక్టర్‌గా కొలువు దొరికింది. అప్పుడే.. ‘ఫాలో మీ టు’ ఫొటో సిరీస్‌తో ఫేమస్ అయిన రష్యన్ ఫొటోగ్రాఫర్ మురాద్ ఉస్మాన్ తన భార్య నటాలియాతో ఇండియా వచ్చాడు. ఆ ఇద్దరితో అద్బుతమైన కవర్ షూట్ చేయించాడు హార్పర్స్ బజార్ కోసం. అది వైరల్ అయి మోహిత్‌ని పాపులర్ చేసింది. ఆ ఖ్యాతిని తన అంట్రప్రెన్యూర్షిప్కి పిల్లర్‌గా వేసుకున్నాడు. ‘ఎమ్ఆర్ (మోహిత్ రాయ్) స్టయిల్స్’ను స్థాపించాడు.ఈ సంస్థ స్టార్ స్టయిలింగ్, సెలబ్రిటీ వెడ్డింగ్స్ మీద ఫోకస్ చేస్తుంది. దీని ద్వారానే మోహిత్ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. అతను మొదట స్టయిలింగ్ చేసింది.. హీరోయిన్ సోనాక్షీ సిన్హాకు. తర్వాత చిత్రాంగదా సింగ్, కరీనా కపూర్, కంగనా రనౌత్, శిల్పా శెట్టిలాంటి బాలీవుడ్ సెలబ్రిటీలు ఎందరికో స్టయిలిస్ట్‌గా చేశాడు.ఎమ్ఆర్ స్టయిల్స్ బాధ్యతలు చూసుకుంటూనే తన స్నేహితుడు షోహ్న దాస్‌తో కలసి ‘గ్రెయిన్ ఫ్యాషన్ కన్సల్టెన్సీ’నీ ప్రారంభించాడు. పలు ఫ్యాషన్ లేబుల్స్‌కి డిజైన్, స్టయిలింగ్‌లో గైడెన్స్ ఇస్తుందీ సంస్థ.‘స్టార్‌కున్న ఇండివిడ్యువల్ స్టయిల్ అండ్ పర్సనాలిటీని ఎలివేట్ చేయటమే స్టయిలిస్ట్ జాబ్’అని నమ్మే మోహిత్ రాయ్‌ని ‘మీకిష్టమైన సెలబ్రిటీ ఎవరు’ అని అడిగితే ‘సోనాక్షి సిన్హా’ అని చెబుతాడు. ‘ఫ్యాషన్ విషయంలో సోనాక్షీ ఎక్స్పరిమెంటల్ అండ్ ఓపెన్. రెండేళ్లు ఆమెతో కలసి పనిచేశాను. స్టయిలిస్ట్‌ని నమ్ముతుంది. చెప్పేది వింటుంది. డిఫర్ అయితే డిస్కస్ చేస్తుంది. ఆ చర్చలు నాకెంతో ఉపయోగపడ్డాయి. నా పనిని మెరుగుపరచాయి. అందుకే సోనాక్షీ అంటే నాకు చాలా రెస్పెక్ట్’ అంటాడు మోహిత్ రాయ్."నా పనిని చూసుకున్న ప్రతిసారీ .. అరే ఇంతకన్నా బాగా చేసుండాల్సింది అనిపిస్తుంది. అందుకే రోజూ ఆత్మవిమర్శ చేసుకుంటాను. పొరపాట్ల నుంచి పాఠాలు గ్రహిస్తాను. దానివల్ల నా పనితీరు రోజురోజుకి మెరుగవుతుంది. సెలబ్రిటీలకు స్టయిలింగ్ చేస్తున్నప్పుడు మన వర్క్ స్టయిల్ హార్డ్‌వర్క్ అండ్ స్మార్ట్వర్క్ల కాంబినేషన్‌గా ఉండాలి!" – మోహిత్ రాయ్ -
'అనాగరికుడు'! గేటుతీసుకుని లోపలికొచ్చి..
గేటుతీసుకుని లోపలికొచ్చి వరండాలో స్తంభానికి ఆనుకుని కూర్చున్నాడు పీరయ్య. మాసిన గళ్లచొక్కా, నలిగిన ప్యాంటు, చెదిరిన జుట్టు, పెరిగిన గడ్డం, లోతుకుపోయిన ఎర్రటి కళ్లు, వొంగిన కడ్డీలాంటి గరుకు శరీరం. జైలు నుంచి విడుదలైన సంవత్సరకాలంలో ఇంకా సన్నబడ్డాడు. ఈమధ్య అంతగా రావడంలేదు.‘మనవూర్లోనే వుంటున్నావా?’ అడిగాను న్యూస్ పేపరు పక్కనపెట్టి. ‘వొకవూరని లేదు వాసుబాబూ’ ఉదయపుటెండలో పూల మీద ఎగురుతున్న సీతాకోకచిలుకను చూస్తూ అన్నాడు. ‘యెందుకని?’‘యేడేండ్లలో కాలం మారలేదా? నేను యిడుదలైవొచ్చే లోపల రాజకీయాలూ మారిపోయినాయి. మా పెదలింగయ్య, ఆయన దాయాదీ రాజీపడి ఫ్యాక్చన్ వైరాలు నిలిపేసిరి. వాల్ల పిల్లోళ్లు డాకటర్లు, యింజనీర్లై సిటీలకు, యిదేసాలకు యెళ్లిపోయిరి. యింగ మందీమార్బలంతో, జీపులతో, నా మాదిరి డ్రైవర్లతో పనేముండాది? పెదలింగయ్య బెంగుళూరులో కొడుకు దెగ్గిరికి యెళ్లిపోయినాడు’మార్పువచ్చి ఉపాధి పోయినందుకు అతనిలో నిరాశ కనిపించలేదు. పోరాట వాతావరణంలో ఉండేవాళ్లు ఎలాంటి నష్టానికైనా సిద్ధంగా ఉంటారేమో అనుకున్నా. ‘డ్రైవరు పని లేకపోతే సేద్యం చేసుకోవచ్చు. నీక్కొంచెం చేనుండాలిగదా?’ అన్నా. ‘నేను జైలుకుబోయి, మాయమ్మ కాలమైపోయినాక సేనంతా కంపసెట్లు మొల్చి నా మాదిరే తరంగాకుండా ఐపోయిండాది’ ‘బాగుచేసుకోలేకపోయినావా?’ ‘వూళ్లో వుండలేక పోయినాను. ఫ్యాక్చన్లో యెదుటోణ్ణి సంపితే వోడు యీరుడు. పెండ్లాన్ని సంపిన కేసు మీద యేడేండ్లు జైలుకు పోయొచ్చినోడికి మర్యాదేముంటాది?’ పీరయ్య తన భార్య సంగతి మాట్లాడినప్పుడు గొంతు జీరగా పలుకుతుంది. అందులో దుఖంతోపాటు తను నిర్దోషిననే భావన ఉంటుంది. ‘నువ్వాపని చెయ్యలేదని, అది ప్రమాదం వల్ల జరిగిందని వూళ్లో నమ్మడంలేదా?’‘యెవురు నమ్మినారో యెవురు లేదో. అందురూ నీమాదిరుంటారా? తల్లీ, బార్యా యిద్దురూ పోయినారు. కోర్టు సెప్పిన సిచ్చ ఐపోయినా ప్రెపంచం యేసిన సిచ్చ యింగా నడస్తావుంది. పెదలింగయ్య నీడ గూడా పాయె. జెనం సైలెంటుగా వుండేదానికి నేనేమన్నా డబ్బు, పలుకుబడీవుండే బడాబాబునా? నా గురించి సెప్పినాక యాడా కుదురుగా పని యియ్యడంలేదు, ఆడా యీడా తిరగతావుండా’ ఉదాసీనంగా అన్నాడు.‘తను తప్పు చెయ్యలేదనే భావన ఒక్కటే పీరయ్య జీవితేచ్ఛేను కొనసాగిస్తున్నట్టుంది’ అనుకున్నా.నా శ్రీమతి తెచ్చిపెట్టిన ఉప్మాతిని, కాఫీతాగి ‘సిటీలో నాకేదైనా డ్రైవరుద్యోగం సూపించు వాసుబాబూ. నీలాంటి మంచోడు సెప్తే యిస్తారు’ అని వెళ్లిపోయాడు. పీరయ్య గురించిన ఆలోచనల్లో పడ్డాను.ఆర్థిక నేపథ్యాలు వేరైనా పీరయ్యా నేనూ చిన్నతనంలో స్నేహితులం. తండ్రి అనారోగ్యంతో చనిపోయాక పీరయ్య చదువును ఐదోతరగతిలోనే ఆపేసి తల్లి అంకమ్మతో పొలం పనులకు, యెనుములను మేపడానికి వెళ్లేవాడు. పీరయ్యకు మొదట్నుంచి డ్రైవింగ్ అంటే మోజు. అతనికి పన్నెండేళ్లప్పుడే ఊరి దగ్గర కడుతున్న పెద్దచెరువు పనికోసం వచ్చే టిప్పర్లు, జీపులకు క్లీనరుగా వెళ్తూండేవాడు. పెద్దయ్యాక డ్రైవింగ్ నేర్చుకుని మా పక్కవూర్లోని ఫ్యాక్షన్ లీడర్ పెదలింగయ్య దగ్గర జీపుడ్రైవరుగా స్థిరపడ్డాడు.మా కుటుంబం ఊరొదిలేశాక పీరయ్యను కలవడం తగ్గిపోయింది. ఎప్పుడైనా కలసినప్పుడు తన సాహసంతో, డ్రైవింగ్ ప్రతిభతో పెదలింగయ్యను ప్రత్యర్థుల నుంచి ఎలా రక్షించాడో ఉద్వేగంగా చెప్పేవాడు. పోరాటంలో హింస తప్పుకాదని, ఐతే అది న్యాయం కోసం అయివుండాలి అనేవాడు. నమ్మినవాళ్ల కోసం త్యాగానికి సిద్ధంగా ఉండాలనేవాడు. పైకి అనాగరికంగా, నిర్లక్ష్యంగా, రఫ్‌గా కనపడ్డం, ఫ్యాక్షనిస్టు నాయకుడితో ఉండడంవల్ల లోకం అతన్ని ఒక రౌడీగానే చూసేది. పీరయ్యకూడా తన వృత్తికి ఆ ఇమేజ్ అవసరమని భావించి దాన్నే బహుముఖంగా ప్రదర్శించేవాడు.పీరయ్యకు పెదలింగయ్య పొలాలు చూసే ఓబయ్య కూతురు గౌరితో పెళ్లైంది. గౌరి చక్కగా వుంటుంది. ‘తండ్రికి ఇష్టంలేకపోయినా, తను మోటుగా వున్నా జానపద కథల్లోలా తన నైపుణ్యం, తెగువ చూసి గౌరే పట్టుబట్టి పెళ్లిచేసుకుందని’ నమ్మాడు పీరయ్య. అదే బయట గర్వంగా చెప్పుకుని వ్యతిరేకులను పెంచుకున్నాడు. భార్యాభర్తలు అన్యోన్యంగానే ఉండేవాళ్లు. ఐతే గౌరికి ముక్కు మీద కోపమని, తన తల్లి అంకమ్మతో పడదని వాపోయేవాడు. క్రమంగా అత్తాకోడళ్లకు తగవులు పెరిగిపోయాయి. తగవులైనప్పుడు పీరయ్య నలుగురి ముందు భార్య మీదే కేకలేసి పైకి తన ఆధిక్యతను ప్రదర్శించేవాడు. ఒక్కోరోజు విసుగెత్తి ఇంటికి రాకుండా పెదలింగయ్య బంగళా దగ్గరే ఉండిపోయేవాడు.పెళ్లైన కొన్నేళ్ల తరువాత ఒక తుఫాను రాత్రి పీరయ్య జీవితంలోనే తుఫాను తెచ్చింది. పెద్దవర్షంలో అతను ఆలస్యంగా ఇంటికొచ్చేసరికి కోడలితో పోట్లాట జరిగి అంకమ్మ యెనుముల కొట్టంలో తడుస్తూ చలికి ముడుచుకుపోయి ఏడుస్తూ కనపడింది. పీరయ్య ఆవేశంగా ఇంట్లోకెళ్లి ఒక్కతేవున్న గౌరితో గొడవ పడ్డాడు. పెనుగులాటలో గోడకున్న పెద్దమేకు తలవెనక దిగి, రక్తంకారి గౌరి స్పృహ తప్పి పడిపోయింది.పీరయ్య జీపులో ఆమెను దగ్గర్లోని చిన్నాసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడ డాక్టరు సెలవులో ఉండడంతో ఆ వర్షంలో, కిందామీదా పడి పొంగుతున్న వాగులుదాటి, ఆలస్యంగా టౌనుకు తీసుకెళ్లాడు. అక్కడ చికిత్స జరిగింది గాని గౌరి స్పృహలోకి రాలేదు. రెండురోజుల తరువాత చనిపోయింది. పీరయ్య డ్రైవింగ్ నైపుణ్యం తుఫాను చేతిలో ఓడిపోయింది. పీరయ్య షాక్ కి గురై కొన్నాళ్లపాటు అచేతనంగా ఉండిపోయాడు.అల్లుడే తనకూతుర్ని హత్య చేశాడని ఓబయ్య కేసు పెట్టాడు. పీరయ్య వ్యతిరేకులే అతన్నలా ఎగదోశారని కొందరన్నారు. ఓబయ్య కూడా తన మనిషే కాబట్టి పెదలింగయ్య తటస్థంగా ఉండిపోయాడు. పీరయ్య సానుభూతిపరుల సాయం సరిపోలేదు. కేసు రెండేళ్లు నడిచాక పీరయ్యకు రిమాండుతో కలిపి ఎనిమిదేళ్లు శిక్షపడింది.పీరయ్యను జైల్లో కలిసినప్పుడు ‘మంట ఆరిన కాగడాలా’ కనిపించేవాడు. ‘నేను ఫ్యాక్చన్ మనిసిగా వుండడం, రౌడీగా ఔపడ్డం, గౌరితో మనువాసించి బంగపడిన యెదవలు మాపెదలింగయ్య మనుసు యిరిసేయడమే గాక నాకు యెతిరేక సాచ్చమివ్వడం వల్ల సెయ్యని నేరానికి సిచ్చపడింది’ అని వాపోయేవాడు. ‘ఆడికీ ‘కోర్టు సానుభూతిగా సూసి తక్కవలో పోగొట్టిందని’ మా వకీలుసారు సెప్పినాడు’ అని సమాధానపడేవాడు. మళ్లీ అంతలోనే ‘ఐనా నేను గౌరిని సంపడమేంది, నాకీ సిచ్చేంది వాసుబాబూ’ అని ఏడ్చేవాడు.‘ఆరాత్రి ఏం జరిగిందో ఇంకెవరూ చూడలేదు. పీరయ్యకు హింసాప్రవృత్తి లేదని అనుకునే నాలాంటి వాళ్లు కొందరు తప్ప మిగతావాళ్లెవరూ అతని మాటలు నమ్మినట్టు కనపడదు. దానికి చాలావరకూ కారణం అతనే. పీరయ్య ఏ ధర్మాన్ని నమ్ముకున్నాడో అదే అతన్ని దెబ్బతీసింది’ అనుకున్నా.‘గౌరి ప్రెమాదం వల్లే సచ్చిపోయిందని లోకం యేపొద్దుటికైనా తెల్సుకుంటాది. ఐనా గౌరి ఆత్మకు నిజెం తెల్సు, అదేసాలు’ అని శిక్ష చివరి రోజుల్లో గాలిలోకి చూస్తూ అనేవాడు. జైలు జీవితంలో పీరయ్య చూడ్డానికి మరింత గరుకు తేలినా, మొహంలో మునుపటి రౌడీ కవళికలు పోయాయి. మంచి ప్రవర్తన కారణంగా సంవత్సరం ముందే విడుదలయ్యాడు.‘మీ ఆఫీసుకు టైమౌతోంది’ అన్న శ్రీమతి పిలుపుతో వర్తమానంలోకి వచ్చాను.నెలరోజుల తరువాత ఒక సాయంత్రం నేను డాబా మీద కుండీల్లో మొక్కలకు నీళ్లు పోస్తూంటే వచ్చాడు పీరయ్య. మంచి ప్యాంటు షర్టు వేసుకున్నాడు, తల దువ్వుకుని, తేట మొహంతో నీట్‌గా ఉన్నాడు. సూర్యుడు దిగిపోయాడు, గుళ్లోని సుబ్బులక్ష్మి పాటకి చెట్లు తలలూపుతున్నాయి, జమ్మిచెట్టు మీది పక్షులు ముందే గూళ్లు చేరుకుంటున్నాయి. ‘మీ కాలనీలో దేవరాజుసారు దెగ్గిర డ్రైవరుద్యోగం దొరికింది. రెండురోజులాయె. మకాం యింటెనకాల అవుటౌసులోనే’ గట్టు మీద కూర్చుంటూ చెప్పాడు. ‘మా కాలనీ ప్రెసిడెంటు దేవరాజుగారు నీకు తెలుసా?’ అడిగాను ఆశ్చర్యపోయి. ‘మా పెదలింగయ్య కొమారుడు నితీషుబాబూ యీయనా వొకే కాలేజీలో సదూకున్నారంట. ఆయన సిఫార్సు సేసినారు’ ‘దేవరాజుగార్తో నాకంత పరిచయంలేదు గాని ఆయన్నందరూ పెద్దమనిషిగా గౌరవిస్తారు. గుడి ధర్మకర్త కూడా ఆయనే. బాగా డబ్బు, పలుకుబడి వున్నా మృదువుగా మాట్లాడతారు, అన్నదానం లాంటి కార్యాలకు వుదారంగా సాయం చేస్తారు. యెత్తుగా, తెల్లగా, చక్కగా వుంటారు’ ‘ఆయన్ని సూస్తే అట్లాగే అనిపిస్తాది. యెందుకైనా మంచిదని మా నితీషుబాబు దేవరాజుసారుకి నా సంగతంతా సెప్పినాడు. అంతా యిన్నాక గూడా నన్ను డ్రైవరుగా తీసుకున్నాడంటే ఆయన శానా మంచోడనేగదా! అంతేగాదు, నన్ను ఆయన భార్య అనసూయమ్మగారి కారు తోలమన్నాడు, దర్మాత్ముడు. ఆయమ్మది సామనసాయ. ఆయనంత సక్కగా వుండదు. కానీ దయాగునంలో మహాతల్లి’ చేతులు జోడించి కళ్లు సగం మూశాడు పీరయ్య.‘ఆయనకు తగ్గ యిల్లాలని చెప్తారు. కాని ఆమెకు యీమధ్య ఆరోగ్యం అంత బావుండడం లేదని, మనిషి కూడా చిక్కిపోయిందనీ విన్నాను. దాన్ని గురించి ఆయన తిరగని ఆసుపత్రి, వెళ్లని గుడీ లేదంటారు’ గుడిగంట పెద్దగా మోగింది. పక్షులు కలకలంగా లేచి మళ్లీ చెట్లల్లో సర్దుకున్నాయి. ‘ఆయిల్లెట్లుంది బాబూ? యింద్రబొవనమే! యిల్లంతా పాలరాయి, టేకు వొస్తువులే, గోడలకు పేద్ద పటాలు, మూలల్లో సెందనం బొమ్మలు, కనపడని లైట్లు! దీనిముందు మా పెదలింగయ్య బంగళా పాతబడిన మహలే’ ‘మా కాలనీలో వుండాల్సిన యిల్లు కాదంటారు. నీ తిండితిప్పల సంగతేమిటి?’ ‘ఆయమ్మ పనోళ్లనట్లా వొదిలేస్తాదా బాబూ? మూడుపూట్లా తిండి ఆణ్ణే. మాయమ్మగూడా నన్నట్లా సూడలేదు’ తృప్తిగా చెప్పాడు, ‘మరింకేం, వుద్యోగం జాగ్రత్తగా చేసుకో’ ‘సరేగాని బాబూ, పెండ్లాన్ని సంపిన కేసులో నేను యేడేండ్లు జైలుకు బోయి వొచ్చినా యీసారు నాకెట్లా వుద్యోగమిచ్చినాడు?’ అడిగాడు పీరయ్య.‘కాలం మారింది పీరయ్యా, యిప్పుడు పనిలో నైపుణ్యం, విధేయత ఇవే చూస్తారు. అవి నీ దగ్గరున్నాయి. వుద్యోగమిచ్చేవాళ్లకి అంతకుమించి అక్కర్లేదు. నీకవి వున్నన్నాళ్లూ నీ వుద్యోగం నిలుస్తుంది’ అన్నా. అర్థం అయ్యీ కానట్టుగా తలవూపి ‘ఖాలీ దొరికినప్పుడు వొస్తా’ అంటూ వెళ్లిపోయాడు.‘హఠాత్తుగా తనకు పూర్తిగా కొతై ్తన నాగరిక ప్రపంచంలో పడ్డాడు పీరయ్య, యెలా నెట్టుకొస్తాడో’ అనుకున్నా. ఒక ఉదయం నేను బస్టాపులో వెయిట్ చేస్తుంటే పీరయ్య కారాపి ‘యెక్కుబాబూ అఫీసుదెగ్గిర దింపతా’ అని బలవంతం చేసి వెనకసీట్లో ఎక్కించాడు. దారిలో ఒక హోటల్ దగ్గర చెట్టుకింద ఆపి ‘టీ తాగుదాం బాబూ, తలనొప్పిగా ఉండాది’ అని రెండు పేపరు కప్పుల్తో టీ పట్టుకొచ్చాడు. ‘యెలావుంది వుద్యోగం’ అడిగాను టీ తాగుతూ. ‘బాగుంది బాబూ. జీతమంతా మిగులే. వూర్లో సేను బాగసేయించి మా సిన్నాయన కొడుకును దున్నుకోమని సెప్పినా. నేనింగ ఆవూర్లో వుండలేను గాబట్టి యిల్లుగూడా రిపేరు జేయించి బాడుక్కిచ్చేసినా’ అన్నాడు. ‘వొక గాడిలో పడినట్టే’ టీ తాగాక పీరయ్య గొంతు తగ్గించి ‘దేవరాజుసారు ఆస్తి, యాపారాలు మొత్తం అమ్మగారివేనంట బాబూ. యీ అయ్యగారు కాలేజీలో ఆమె యెంటబడి ప్రేమించి ఆమె నాయనకు యిష్టం లేకపొయ్యినా పెండ్లి సేసుకున్నాడంట’ అన్నాడు. ‘అవన్నీ నీకెందుకు?’ అన్నా, ‘గాసిప్ లేకపోతే మనుషులు ఎలా వుండేవారో’ అనుకుంటూ. ‘నాకేమీ కుశాల లేదు, ఆయింట్లో పాత నౌకరొకామె వొద్దన్నా రోజూవొచ్చి అన్నీ సెప్తాది. కొన్ని కండ్లకు కనబడతానే వుండాయి. అమ్మగారు శానా మంచిదా? అంత డబ్బుండాదా? పెద్ద డాకటర్లే సూస్తావున్నారా? బాగవడం లేదెందుకు? అది మనసులో ఖాయిలా గాబట్టి. గుండె, నరాలు వీకైపోయినాయని సెప్తావున్నారంట’ ‘కొన్ని జబ్బులలాగే వుంటాయి’‘మొన్నమొన్నటి దాంకా ఆమె సక్కగా, నవ్వతా తిరగతా వుండేదంట. దేవరాజుసారు అనుకున్నంత మంచోడు కాదు. శాన్నాళ్లుగా ఆతల్లిని లోలోపల బాదపెడతా వుండాడని నాకనిపిస్తా వుండాది’ ‘నువ్వు నీ వుద్యోగానికి విశ్వాసంగా వుండాలి, నీ అభిప్రాయాలు, కోపతాపాలకు కాదు. యిది ఆధునికానంతర ప్రపంచం. పద, యికవెళ్దాం’నా మాటలు అర్థంకానట్టుగా చూసి ‘అమ్మగారు వొక్కోతూరి వొంటరిగా రూములో కూస్సోని యేడ్సేది సూసినా. ఆయమ్మను సూస్తే ‘రగతంకారి పడిపోయిన గౌరి’ గుర్తుకొచ్చి మనసు యికలమైతాది. వుండలేక నీకు సెప్తావున్నా’ అని కారు స్టార్ట్ చేశాడు పీరయ్య. మళ్లీ కొన్నాళ్లు పీరయ్య కనిపించలేదు.తుఫాను మూలంగా ఆరోజు సాయంత్రంనుంచే పెద్దవర్షం మొదలైంది. ఈదురుగాలి, వణికించే చలి. కరెంటు పోయింది. తెల్లవారు ఝామున ఐదవుతూండగా వీధితలుపు కొట్టిన చప్పుడు రావడంతో టార్చిలైటు వేసి తలుపు తెరిచాను. వరండాలో తడిసిన బట్టల్తో చేతిలో బ్యాగుతో నిలబడివున్నాడు పీరయ్య. మొహం గంభీరంగా ఉంది. ఆశ్చర్యపోయి అతన్ని హల్లోకి రమ్మని తువ్వాలు, పంచె ఇచ్చాను. అప్పటికి ఉద్ధృతి తగ్గి సన్నటి వర్షపుధార మిగిలింది.కాఫీచేసి ఇచ్చాను. పీరయ్య పొడిబట్టలు కట్టుకుని మౌనంగా తాగాడు. ‘అర్జెంటుగా యెక్కడికన్నా వెళ్తున్నావా?’ నిదానంగా అడిగాను.‘నేనుద్యోగం సాలించి వూరికి యెళ్లిపోతావుండా. సెప్పిపోదామని వచ్చినా’ అన్నాడు పీరయ్య బొంగురు గొంతుతో. ‘యేమైంది? మనవూరికిక వెళ్లనన్నావు గదా?’పీరయ్య తటపటాయించాడు ‘దేవరాజుసారు మంచోడు కాదు బాబూ. నేను సెప్తావచ్చిందే నిజం. అమ్మగారిని శానా బాధపెడతా వున్నాడు. ఆమె యెక్కవ రోజులు బతకదు. బైట యెంత ఫ్యాక్చనిస్టైనా పెదలింగయ్యగారే మేలు, యేదున్నా పైక్కనపడతాడు, యింట్లో అమ్మయ్యదే పెత్తనం. యీసారు యేరే మనిసి’‘అందుకని రాకరాక వచ్చిన మంచి వుద్యోగం మానేసి వెళ్తున్నావా?’ ‘నా తల్లట్లాటి అమ్మగారికి అంత సెడు జరగతావుంటే సూస్తా ఆయింట్లో వుండలేను. యేమైండాదో విను. నిన్న అయ్యగారి డ్రైవరు లేడు, కారు నన్ను తోలమన్నాడు. మాటేల వొర్సం మొదులయ్యేతలికి మేం యాభైమైళ్ల దూరంలోవున్న వూరేదో యెళ్లినాం. వూరిబైట తోటలో గెస్టౌసు, అయ్యగార్దే అనుకుంటా. అప్పుటికే ఆడ రెండు పెద్దకార్లొచ్చి వుండాయి’‘వుంటే?’ ‘నేను రాత్రి తొమ్మిదైనాక మంచినీళ్ల కోసమని యింటి యెనకపక్కకు యెళ్లా, వొరండాలో అయ్యగారు, యిద్దురు దోస్తులు కూస్సోని మందు తాగతావుండారు. వోళ్ల మాటలు యినబడినాయి. ‘ఆమెకు ఖాయిలా అనీ, యింగేయో సాకులు సూపి అమ్మగార్ని వొప్పించేదానికి సూస్తావుండానని, తొందర్లోనే యెట్లైనా యేదోవొకటి సేసి సంతకాలు పెట్టిస్తానని, ఆనక వోళ్లనుకున్న యాపారాల్లో యెంత డబ్బైనా పెడ్తానని అయ్యగారు సెప్తావున్నాడు’‘అవునా?’ ‘నాకు కోపం తన్నుకోనొచ్చింది. ‘అర్జెంటు పనుండాదని’ అయ్యగార్ని పక్క రూంలేకి తీసకపోయి ‘నువ్విట్లా సేస్తావుండేది శానా తప్పయ్యగారూ, దేవతట్లాటి అమ్మగార్ని పోగొట్టుకోవద్దు’ అని యినయంగానే సెప్పినా. ఆయన నన్ను తిట్టినాడు, బెదిరిచ్చినాడు, నేను బైపడలేదు. జీతం పెంచుతానని అశ పెట్టినాడు’ అని చీకట్లోకి చూస్తూ ఆగాడు. నేను ఏమనాలో తెలియక అలాగే చూస్తూండిపోయాను.పీరయ్యే మళ్లీ ‘నాకు యిరక్తొచ్చింది. కారు బీగంచెవులు ఆయనముందు యిసిరేసి బైటికొచ్చేసినా. వానలో రెండుమైళ్లు నడిసి, రోడ్డుమీదికొచ్చి పాలయాను, లారీ యెక్కి వూర్లేకొచ్చి యింటికి సేరినాను. టైము నాలుగుదాటింది. అమ్మగారు అప్పుడే లేచినారు. యేదైతే అదైందని అమెకు జెరిగిందంతా సెప్పి వచ్చేసినా‘ అని అలసినట్టుగా గోడకు తలానించి కళ్లు మూసుకున్నాడు.హింసను ఒక మార్గంగా ఒప్పుకుని, భార్యను చంపినవాడిగా శిక్షను అనుభవించి, అనాగరికుడని ముద్రపడ్డ పీరయ్య నాగరిక సమాజంలోని పరోక్ష గృహహింసను చూసి తట్టుకోలేకపోవడం నాకు ఆశ్చర్యమనిపించింది. వర్షం ఆగింది, చీకటి ఇంకా విడలేదు. ‘మనపల్లెలోనే యెట్నో బతుకుతా. యెప్పుడైనా వొచ్చి నిన్ను సూసిపోతుంటా. వస్తా బాబూ’ అని బ్యాగు బుజానికి తగిలించుకుని బయటికి వెళ్లిపోయాడు పీరయ్య. – డా.కె.వి. రమణరావు -
వానా.. వానా.. వల్లప్పా!
వేసవిలోని మండుటెండలు మనుషులను మలమలలాడించిన తర్వాత కురిసే వాన చినుకులు ఇచ్చే ఊరట చెప్పనలవి కాదు. ఈసారి వేసవిలో ఎండలు ఇదివరకు ఎన్నడూ కని విని ఎరుగని రీతిలో మండిపడ్డాయి. ఉష్ణోగ్రతలు ఊహాతీతంగా పెరిగినా, మొత్తానికి ఈసారి రుతుపవనాలు సకాలంలోనే మన దేశంలోకి అడుగుపెట్టాయి. గత మే చివరివారంలో అండమాన్‌ను తాకిన రుతుపవనాలు అవరోధాలేవీ లేకుండా సజావుగా తెలుగు రాష్ట్రాల్లోకి చేరుకున్నాయి.ఈసారి రెండు రోజుల ముందుగానే– జూన్ 2 నాటికే రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌ను తాకాయి. జూన్ 4 నాటికి తెలంగాణలో ప్రవేశించాయి. భారత్ వంటి వ్యవసాయాధారిత దేశాలకు వానల రాకడ ఒక వేడుక. సజావుగా వానలు కురిస్తేనే పంటలు సుభిక్షంగా పండుతాయి. వానాకాలం ప్రకృతిలో జీవం నింపుతుంది. నెర్రెలు వారిన నేలలో పచ్చదనాన్ని నింపుతుంది. జీవరాశి మనుగడకు ఊతమిస్తుంది. ఇప్పటికే వానాకాలం మొదలైన తరుణంలో కొన్ని వానాకాలం ముచ్చట్లు చెప్పుకుందాం.ప్రపంచంలోని ఉష్ణమండల దేశాలన్నింటికీ వానాకాలం ఉంటుంది. ఉత్తరార్ధ గోళంలోని ఉష్ణమండల దేశాలన్నింటిలోనూ కొద్దిరోజులు అటు ఇటుగా జూన్, జూలై నెలల్లో వానాకాలం మొదలవుతుంది. ఇక్కడ వానలు మొదలైన ఆరునెలలకు దక్షిణార్ధ గోళంలోని ఉష్ణమండల దేశాలకు వానాకాలం మొదలవుతుంది. రుతుపవనాల ప్రభావంతో ఈ దేశాల్లో ఏటా వానాకాలం వస్తుంది. నైరుతి రుతుపవనాల రాకతో మన దేశంలో మాత్రమే కాకుండా శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయాన్మార్ తదితర దేశాల్లో వర్షాకాలం వస్తుంది.ఈ దేశాల్లో వర్షాకాలం జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కొనసాగుతుంది. దాదాపు ఇదేకాలంలో రుతుపవనాల ప్రభావంతో ఉత్తర, మధ్య, దక్షిణ అమెరికా దేశాల్లోను; పశ్చిమ, ఆగ్నేయ, దక్షిణాఫ్రికా దేశాల్లోను; తూర్పు, ఆగ్నేయాసియా దేశాల్లోను వానాకాలం మొదలవుతుంది. మన దేశంలో వానాకాలం సాధారణంగా జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కొనసాగుతుంది. అయితే, కొన్నిచోట్ల వానాకాలం ఏప్రిల్ నుంచి మొదలై నవంబర్ వరకు సుదీర్ఘంగా కొనసాగుతుంది.గొడుగులకు పని మొదలు..వానాకాలం వచ్చిందంటే గొడుగులకు పని మొదలవుతుంది. గొడుగులతో పాటు రెయిన్ కోట్లు, గమ్ బూట్లు వంటివి అవసరమవుతాయి. వానాకాలంలో వానలు కురవడం సహజమే గాని, ఏ రోజు ఎప్పుడు ఏ స్థాయిలో వాన కురుస్తుందో చెప్పలేం. అందువల్ల బయటకు వెళ్లేటప్పుడు గొడుగులను, రెయిన్ కోట్లను వెంట తీసుకుపోవడం మంచిది. కార్లలో షికార్లు చేసేవారికి వీటితో పెద్దగా పని ఉండకపోవచ్చు గాని, పాదచారులకు గొడుగులు, ద్విచక్ర వాహనాల మీద ప్రయాణించేవారికి రెయిన్కోట్లు వానాకాలంలో కనీస అవసరాలు.గొడుగులు, రెయిన్ కోట్లలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫ్యాషన్లు వస్తున్నాయి. వింత వింత గొడుగులు, రెయిన్ కోట్లు అందుబాటులోకి వస్తున్నాయి. చిన్న చిన్న చిరుజల్లుల నుంచి గొడుగులు కాపాడగలవు గాని, భారీ వర్షాల్లో బయటకు వెళ్లాల్సి వస్తే మాత్రం రెయిన్ కోట్లు వేసుకోక తప్పదు. ఈసారి రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా వర్షపాతం సాధారణ స్థాయి కంటే కాసింత ఎక్కువగానే నమోదు కావచ్చని భారత వాతావరణ శాఖ అంచనాను ప్రకటించడంతో గొడుగులు, రెయిన్కోట్లు వంటి వానాకాలం వస్తువుల తయారీదారులు, అమ్మకందారులు తమ వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయనే ఆశాభావంతో ఉన్నారు.ప్రపంచవ్యాప్తంగా గొడుగులు, రెయిన్ కోట్లు తదితర వానాకాలం వస్తువుల మార్కెట్ 2022 నాటికి 3.80 బిలియన్ డాలర్ల (రూ.31,731 కోట్లు) మేరకు ఉంది. ఈ మార్కెట్లో సగటున 5.4 శాతం వార్షిక వృద్ధి నమోదవుతోంది. ఆ లెక్కన 2032 నాటికి వానాకాలం వస్తువుల మార్కెట్ 6.40 బిలియన్ డాలర్లకు (రూ.53,442 కోట్లు) చేరుకోగలదని అంతర్జాతీయ మార్కెట్ విశ్లేషణ సంస్థ ‘బ్రెయినీ ఇన్సైట్స్’ అంచనా.వానలతో లాభాలు..వానాకాలం తగిన వానలు కురిస్తేనే వ్యవసాయం బాగుంటుంది. పంటల దిగుబడులు బాగుంటాయి. దేశం సుభిక్షంగా ఉంటుంది. వ్యవసాయంపైనే ఆధారపడి మనుగడ సాగించే రైతులు, వ్యవసాయ కార్మికులకు జీవనాధారం ఉంటుంది. వర్షాలు పుష్కలంగా కురిస్తేనే జలాశయాలు నీటితో నిండుగా ఉంటాయి. భూగర్భ జలాలు అడుగంటిపోకుండా ఉంటాయి. ప్రజలకు నీటిఎద్దడి బాధ తప్పుతుంది. వానాకాలంలో తగినంత కురిసే వానలు ఆర్థిక రంగానికి ఊతమిస్తాయి.మన దేశంలో దాదాపు 60 శాతం జనాభా వ్యవసాయంపైన, వ్యవసాయాధారిత రంగాలపైన ఆధారపడి జీవనోపాధి పొందుతున్నారు. మన స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిలో వ్యవసాయానిది కీలక పాత్ర. భారతీయ స్టేట్‌బ్యాంకు పరిశోధన నివేదిక ప్రకారం మన జీడీపీలో 2018–19 నాటికి 14.2 శాతంగా ఉన్న వ్యవసాయం వాటా 2022–23 నాటికి 18.8 శాతానికి పెరిగింది. ఈసారి వానాకాలంలో పుష్కలంగా వానలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనాను ప్రకటించిన నేపథ్యంలో మన జీడీపీలో వ్యవసాయం వాటా మరో 3 శాతం వరకు పెరగవచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.వరి, గోధుమలు, మొక్కజొన్న, చెరకు వంటి ఆహార పంటలకు, పత్తి వంటి వాణిజ్య పంటలకు పుష్కలమైన వానలే కీలకం. వానాకాలంలో మంచి వానలు కురిస్తే విద్యుత్తు కోతల బెడద కూడా తగ్గుతుంది. మన దేశం ఎక్కువగా జలవిద్యుత్తుపైనే ఆధారపడుతోంది. బొగ్గుతో పనిచేసే థర్మల్ విద్యుత్ కేంద్రాలు లేని ప్రాంతాల్లో జలవిద్యుత్తు ద్వారానే విద్యుత్ సరఫరా ఉంటోంది. తగిన వానలు కురవని ఏడాదుల్లో ఈ ప్రాంతాలకు విద్యుత్ సరఫరాకు ఇబ్బందులు తప్పవు.వాతావరణ మార్పులూ, వర్షాలూ..ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న వాతావరణ మార్పులు, ముఖ్యంగా భూతాపోన్నతి వర్షాకాలంపై కూడా ప్రభావం చూపుతోంది. దీనివల్ల వాతావరణంలో తీవ్రమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వేసవిలో వడగాల్పులు, అకాల వర్షాలు, వరదలు, తుఫానులు, కరవు కాటకాల వంటివన్నీ వాతావరణంలో చోటు చేసుకుంటున్న ప్రతికూల మార్పుల ఫలితమేనని ‘ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్’ (ఐపీసీసీ) నిపుణులు చెబుతున్నారు.వాతావరణంలోని ప్రతికూల మార్పుల ప్రభావం ఇప్పటికే మన దేశం అంతటా కనిపిస్తోంది. ఈ ప్రభావం కారణంగానే ఇటీవలి వేసవిలో పలుచోట్ల రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వాతావరణ మార్పుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు తలెత్తడం, పంటనష్టాలు, కరవు కాటకాలు, విద్యుత్ సరఫరాకు అంతరాయాలు వంటి విపత్తులు తరచుగా తలెత్తుతున్నాయి. సకాలంలో తగిన వానలు కురిస్తేనే పలు దేశాల్లోని పరిస్థితులు చక్కబడతాయి.వాతావరణ పరిస్థితులు మరింతగా దిగజారకుండా ఉండటానికి ప్రపంచ దేశాలన్నీ సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కర్బన ఉద్గారాలను కట్టడి చేయడం, పునర్వినియోగ ఇంధనాలను ప్రజలకు అందుబాటులోకి తేవడం, అడవుల నరికివేతను అరికట్టడంతో పాటు విరివిగా మొక్కలు నాటడం వంటి చర్యలను చేపట్టాల్సి ఉంది.వానాకాలం కాలక్షేపాలు..వాతావరణం పొడిగా ఉన్నప్పుడు బయట తిరిగినంత సులువుగా వాన కురుస్తున్నప్పుడు తిరగలేం. తప్పనిసరి పనుల మీద బయటకు వెళ్లాల్సి వస్తే తప్ప వానల్లో ఎవరూ బయటకు రారు. చిరుజల్లులు కురిసేటప్పుడు సరదాగా తడవడానికి కొందరు ఇష్టపడతారు గాని, రోజంతా తెరిపిలేని వాన కురుస్తుంటే మాత్రం ఇల్లు విడిచి బయటకు అడుగుపెట్టడానికి వెనుకాడుతారు.వాన కురుస్తున్నప్పుడు ఇంటి అరుగు మీద కూర్చుని, వీథిలో ప్రవహించే వాన నీటిలో కాగితపు పడవలను విడిచిపెట్టడం చిన్న పిల్లలకు సరదా కాలక్షేపం.. కొందరు ఉత్సాహవంతులు వానాకాలంలో కొండ ప్రాంతాలకు వెళ్లి ట్రెకింగ్, పచ్చని అడవులు, చక్కని సముద్ర తీరాల్లో నేచర్ వాకింగ్ వంటివి చేస్తుంటారు. ఇంకొందరు వాన కురుస్తున్నప్పుడు నదుల్లో సరదాగా బోటు షికార్లకు వెళుతుంటారు. వాన కురుస్తున్నప్పుడు చెరువులు, కాలువల ఒడ్డున చేరి చేపలను వేటాడటం కొందరికి సరదా.అందమైన వాన దృశ్యాలను, వానాకాలంలో ఆకాశంలో కనిపించే హరివిల్లు అందాలను కెమెరాలో బంధించడం కొందరికి ఇష్టమైన కాలక్షేపం. వానాకాలంలో జలపాతాలు ఉద్ధృతంగా ఉరకలేస్తుంటాయి. వాన కురిసేటప్పుడు జలపాతాలను చూడటానికి చాలామంది ఇష్టపడతారు. వాన కురుస్తున్న సమయంలో ఎక్కువ మంది వేడివేడి పకోడీలు, కాల్చిన మొక్కజొన్న కండెలు వంటి చిరుతిళ్లు తినడానికి ఇష్టపడతారు. తెరిపి లేని వానలు కురిసేటప్పుడు రోజుల తరబడి కదలకుండా ఇంట్లోనే కూర్చుని గడిపే కంటే కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుని, ఇలాంటి సరదా కాలక్షేపాలతో వానాకాలాన్ని చక్కగా ఆస్వాదించవచ్చు.రెయిన్‌కోట్ ఫ్యాషన్లు..ఆధునిక రెయిన్కోట్లు పంతొమ్మిదో శతాబ్దంలో అందుబాటులోకి వచ్చాయి. స్కాటిష్ రసాయనిక శాస్త్రవేత్త చాల్స్ మాకింటోష్ తొలిసారిగా 1824లో పూర్తిస్థాయి వాటర్‌ప్రూఫ్ రెయిన్‌కోటును రూపొందించాడు. రెండు పొరల వస్త్రాల మధ్య నాఫ్తాతో శుద్ధిచేసిన రబ్బరును కూర్చి తొలి రెయిన్‌కోటును తయారు చేశాడు. తర్వాత నీటిని పీల్చుకోని విధంగా ఉన్నిని రసాయనాలతో శుద్ధిచేసి రూపొందించిన వస్త్రంతో రెయిన్కోట్లు తయారు చేయడం 1853 నుంచి మొదలైంది.ఇరవయ్యో శతాబ్ది ప్రారంభంలో సెలోఫెన్, పీవీసీ వంటి ప్లాస్టిక్ పదార్థాలతో రెయిన్కోట్ల తయారీ ప్రారంభమైంది. వానలో శరీరం తడవకుండా కాపాడటానికే రెయిన్కోట్లను రూపొందించినా అనతికాలంలోనే వీటిలోనూ ఫ్యాషన్లు మొదలయ్యాయి. అమెరికా, చైనా తదితర దేశాల్లో రెయిన్కోట్లు ఫ్యాషన్ మార్కెట్లో తమదైన ముద్ర వేస్తున్నప్పటికీ, భారత్‌లో మాత్రం రెయిన్కోట్లలో ఫ్యాషన్ ధోరణి కొంత తక్కువే! వానలో తల, ఒళ్లు తడవకుండా ఉంటే చాలు అనే ధోరణిలోనే మన ప్రజలు రెయిన్కోట్లను కొనుగోలు చేస్తారు.మన దేశంలో తరచుగా వానలు కురిసేది కూడా మూడు నాలుగు నెలలు మాత్రమే! అందుకే మన ఫ్యాషన్ డిజైనర్లు కూడా రెయిన్కోట్ల డిజైనింగ్‌ను పెద్దగా పట్టించుకోవడం లేదు. ముంబై, కోల్‌కతా, ఢిల్లీ వంటి నగరాల్లోని పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్‌లో మాత్రం విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఫ్యాషన్ రెయిన్కోట్లు దొరుకుతాయి.వానాకాలం కష్టాలు..వానాకాలంలో వీథులన్నీ బురదమయంగా మారుతాయి. రోడ్లు సరిగా లేని చోట్ల గోతుల్లో నీరు నిలిచిపోయి ఉంటుంది. మ్యాన్‌హోల్ మూతలు ఊడిపోయి, డ్రైనేజీ నీరు రోడ్ల మీద ప్రవహిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో రోడ్ల మీద నడవడం, వాహనాలు నడపడం కష్టంగా మారుతుంది. మురుగునీటి ప్రవాహాలకు పక్కనే పానీపూరీలు, పకోడీలు, మొక్కజొన్న కండెలు అమ్మే బడ్డీలు ఉంటాయి. పగలు ఈగల బెడద, రాత్రి దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. వీటి వల్ల రోగాల బెడద పెరుగుతుంది.వానాకాలంలో జలుబు, దగ్గు, జ్వరాలు సర్వసాధారణం. ఇవి కాకుండా ఎక్కువగా కలరా, డయేరియా, టైఫాయిడ్, హెపటైటిస్, డెంగీ, చికున్ గున్యా, మలేరియా సహా పలు రకాల వైరల్ జ్వరాలు, కళ్ల ఇన్ఫెక్షన్లు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాపిస్తాయి. వానాకాలంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా, వ్యాధుల బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే వానాకాలంలో ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోవచ్చు.వేడి వేడి చిరుతిళ్ల మీద ఎంత మోజు ఉన్నా, వానాకాలంలో ఆరుబయట తినకపోవడమే మంచిది. రోడ్డు పక్కన మురికినీటి ప్రవాహాలకు దగ్గరగా బళ్లల్లో అమ్మే బజ్జీలు, పకోడీలు, పానీపూరీలు, చాట్లు వంటి చిరుతిళ్లు తింటే అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్లే!వానాకాలంలో నీటి కాలుష్యం ఎక్కువగా జరిగే అవకాశాలు ఉంటాయి. చిట్లిన మంచినీటి పైపుల్లోకి డ్రైనేజీ నీరు చేరి, ఇళ్లల్లోని కొళాయిల ద్వారా కలుషితమైన నీరు వస్తుంది. నీటిని వడగట్టి, కాచి చల్లార్చి తాగడం మంచిది. తాగునీటి విషయంలో జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ కాలంలో వచ్చే చాలా ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు.వానాకాలంలో ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఇంట్లో దుమ్ము, ధూళి, బూజులు పేరుకోకుండా చూసుకోవాలి. వానజల్లు ఇంట్లోకి చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇల్లు అపరిశుభ్రంగా, తడి తడిగా ఉన్నట్లయితే ఈగలు, దోమలు సహా క్రిమికీటకాల బెడద పెరిగి, ఇంటిల్లిపాది రోగాల బారిన పడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వానాకాలాన్ని ఆస్వాదించవచ్చు. -
ఒకరోజు వర్షాకాలం ఉదయాన్నే.. నదికి వెళ్లిన ముని..
శృంగవరం అడవుల్లో ఆశ్రమ జీవితం గడిపేవాడు ముని శతానందుడు. ఉదయాన్నే లేచి దైనందిన కార్యక్రమాలు పూర్తి చేసుకుని, తపస్సు చేసుకునేవాడు. ఆ ఆశ్రమం చుట్టూ పూల మొక్కలు, పండ్ల చెట్లు, పొదలు దట్టంగా ఉండేవి. ఆ ప్రశాంత వాతావరణానికి అలవాటు పడిన జంతువులు, పక్షులు అక్కడ సేదతీరడానికి ఇష్టపడేవి.ముని కూడా వాటిపట్ల దయతో ప్రవర్తించేవాడు. అవెప్పుడైనా జబ్బు చేస్తే, గాయపడితే వనమూలికలు, ఆకు పసర్లతో వైద్యం చేసేవాడు. అలా మునికి, వాటికి మధ్య స్నేహం కుదిరింది. ముని ధ్యానంలో మునిగిపోతే తియ్యటి పండ్లు, దుంపలు, పుట్ట తేనెను తెచ్చి ముని ముందు పెట్టేవి. ఆశ్రమ ప్రాంగణంలో ఆ జంతువులు, పక్షులు జాతి వైరం మరచి కలసిమెలసి ఉండేవి.ఒక వర్షాకాలం.. ఉదయాన్నే నదికి వెళ్లిన ముని తిరిగి వస్తూండగా.. జారి గోతిలో పడిపోయాడు. ఎంతప్రయత్నించినా పైకి లేవలేకపోయాడు. బాధతో మూలుగుతూ చాలాసేపు గోతిలోనే ఉండిపోయాడు. స్నానానికి వెళ్లిన ముని ఇంకా ఆశ్రమానికి తిరిగిరాలేదని ఒక చిలుక గమనించింది. ఎగురుకుంటూ నది వైపు వెళ్లింది. గోతిలో మునిని చూసింది. ఆయన ముందు వాలింది. ఆయన చెప్పగా ప్రమాదం గురించి తెలుసుకుంది. వెంటనే ఆశ్రమానికి వెళ్లి అక్కడున్న జంతువులన్నిటికీ చెప్పింది.వెంటనే ఏనుగు, ఎలుగుబంటి, గుర్రం, మేక, కోతి పరిగెడుతూ ముని ఉన్న గోతిని చేరాయి. ‘భయపడకండి మునివర్యా.. మిమ్మల్ని బయటకు తీస్తాము’ అని మునికి భరోసానిచ్చాయి. గోతి లోపలకి వెళ్ళడానికి దారి చేసింది ఏనుగు. తన తొండంతో మునిని లేపి గుర్రం మీద కూర్చోబెట్టింది. అలా ఆ జంతువులన్నీ కలసి మునిని ఆశ్రమానికి చేర్చాయి. వనంలోని మూలికలు, ఆకులను సేకరించి మునికి వైద్యం చేశాయి. చిలుక వెళ్లి తియ్యటి పండ్లను, కుందేలు వెళ్లి దుంపలను తెచ్చి మునికి ఆహారం అందించాయి.అలా అవన్నీ.. మునికి సేవలు అందించసాగాయి. నెల గడిచేసరికి ముని పూర్తిగా కోలుకున్నాడు. అవి తనకు చేసిన సేవకు ముని కళ్లు ఆనందంతో చిప్పిల్లాయి. ‘నా బంధువులైనా మీ అంత శ్రద్ధగా నన్ను చూసేవారు కాదు. మీ మేలు మరువలేను’ అన్నాడు శతానందుడు వాటితో. ‘ ఇందులో మా గొప్పదనమేమీ లేదు మునివర్యా..! మీ తపస్సు ప్రభావం వల్లనేమో మేమంతా జాతి వైరాన్ని మరచిపోయి ఒక్కటయ్యాం. మీ ఆశ్రమ ప్రాంగంణంలో.. మీ సాంగత్యంలో హాయిగా బతుకుతున్నాం. మీరు మాకెన్నోసార్లు వైద్యం చేసి మా ప్రాణాల్ని కాపాడారు.కష్టంలో ఉన్న ప్రాణిని ఆదుకోవాలనే లక్షణాన్ని మీ నుంచే అలవర్చుకున్నాం. మీకు సేవలందించాం. మీరు త్వరగా కోలుకోవాలని కోరుకున్నాం. ఆ భగవంతుడు మా మొర ఆలకించాడు. మీరు కోలుకున్నారు. ఇప్పుడే కాదు ఎప్పుడూ మిమ్మల్ని మా కంటికి రెప్పలా కాచుకుంటాం మునివర్యా..’ అన్నది ఏనుగు. ‘అవునవును’ అంటూ మిగిలినవన్నీ గొంతుకలిపాయి. ఆప్యాయంగా వాటిని తడిమాడు శతానందుడు. – నారంశెట్టి ఉమామహేశ్వరరావు -
పూర్వం 'ధ్రువసంధి' అయోధ్యకు.. రాజుగా..
పూర్వం ధ్రువసంధి అయోధ్యకు రాజుగా ఉండేవాడు. అతడికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య మనోరమ, రెండో భార్య లీలావతి. సద్గుణ సంపన్నుడైన ధ్రువసంధి యజ్ఞయాగాదికాలు చేస్తూ, బ్రాహ్మణులకు, సాధు సజ్జనులకు, పేదసాదలకు విరివిగా దానాలు చేస్తుండేవాడు.ధ్రువసంధికి మనోరమ ద్వారా సుదర్శనుడు, లీలావతి ద్వారా శత్రుజిత్తు అనే కొడుకులు కలిగారు. వారిద్దరూ గురుకులవాసంలో సకల శాస్త్రాలు, అస్త్రశస్త్ర విద్యలు నేర్చి, అన్ని విద్యల్లోనూ ఆరితేరారు. ధ్రువసంధి పెద్దకొడుకు సుదర్శనుడికి త్వరలోనే పట్టాభిషేకం చేయాలనుకున్నాడు. వినయశీలుడు, వీరుడు అయిన సుదర్శనుడికి ప్రజామోదం కూడా ఉండేది. అయోధ్య ప్రజలందరూ సుదర్శనుడే తదుపరి రాజు కాగలడని అనుకునేవారు.సుదర్శనుడికి పట్టాభిషేకం చేయడానికి ధ్రువసంధి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుసుకుని, అతడి రెండో భార్య లీలావతి తండ్రి, శత్రుజిత్తు మాతామహుడు యుధాజిత్తు సహించలేకపోయాడు. తన మనవడినే రాజుగా చేయాలని ధ్రువసంధిని కోరాడు. పెద్దకొడుకుకే పట్టాభిషేకం చేయడం ధర్మమని తేల్చి చెప్పిన ధ్రువసంధి అతడి కోరికను నిరాకరించాడు.సుదర్శనుడిపై అసూయతో రగిలిపోతున్న యుధాజిత్తు ఒకనాడు అకస్మాత్తుగా తన సేనలతో అయోధ్యపై విరుచుకుపడ్డాడు. ధ్రువసంధిని చెరసాలలో పెట్టి, తన మనవడైన శత్రుజిత్తుకు రాజ్యాభిషేకం చేసి, తానే అధికారం చలాయించడం మొదలుపెట్టాడు. తన సేనలతో ఎలాగైనా సుదర్శనుడిని, అతడి తల్లి మనోరమను బంధించడానికి ప్రయత్నించాడు.అయితే, ప్రమాదాన్ని శంకించిన మనోరమ కొందరు మంత్రులు, ఆంతరంగికుల సాయంతో కొడుకు సుదర్శనుడితో కలసి అరణ్యాల్లోకి వెళ్లిపోయింది. అరణ్యమార్గంలో ముందుకు సాగుతుండగా, మార్గమధ్యంలో కనిపించిన భరద్వాజ మహర్షి ఆశ్రమంలో తలదాచుకుంది. భరద్వాజ మహర్షి వారికి జరిగిన అన్యాయం తెలుసుకుని, జాలితో తన ఆశ్రమంలోనే వారికి వసతి కల్పించాడు.మనోరమ, సుదర్శనులను ఎలాగైనా పట్టి బంధించి, చెరసాల పాలు చేయాలని భావించిన యుధాజిత్తు వారిని వెదకడానికి రాజ్యం నలుమూలలకు, పొరుగు రాజ్యాలకు వేగులను పంపాడు. కొన్నాళ్లు గడిచాక వారు భరద్వాజ మహర్షి ఆశ్రమంలో తలదాచుకుంటున్నట్లు సమాచారం తెలుసుకున్నాడు.సైన్యాన్ని, పరివారాన్ని వెంటబెట్టుకుని యుధాజిత్తు ఒకనాడు భరద్వాజుడి ఆశ్రమానికి చేరుకున్నాడు. ‘ఓ మునీ! నువ్వు అన్యాయంగా సుదర్శనుడిని, మనోరమను నీ ఆశ్రమంలో బంధించి ఉంచావు. వాళ్లను వెంటనే నాకు అప్పగించు’ అని దర్పంగా ఆదేశించినట్లు పలికాడు. అతడి మాటలకు భరద్వాజుడు కన్నెర్రచేసి కోపంగా అతడివైపు చూశాడు.భరద్వాజ మహర్షి ఎక్కడ శపిస్తాడోనని యుధాజిత్తు మంత్రులు భయపడ్డారు. వెంటనే యుధాజిత్తును వెనక్కు తీసుకుపోయారు. ‘మళ్లీ ఈ పరిసరాల్లో కనిపిస్తే నా క్రోధాగ్నికి నాశనమవుతారు’ అని హెచ్చరించాడు భరద్వాజుడు. ఆ మాటలతో యుధాజిత్తు పరివారమంతా వెనక్కు తిరిగి చూడకుండా అయోధ్యకు పరుగు తీశారు.భరద్వాజుడి ఆశ్రమంలో ఒక మునికుమారుడు మనోరమకు క్లీబ మంత్రాన్ని ఉపదేశిస్తుండగా, సుదర్శనుడు విన్నాడు. ఆ శబ్దం అతడికి ‘క్లీం’ అని వినిపించింది. క్లీంకారం దేవీమంత్రం. సుదర్శనుడు తదేక దీక్షతో క్లీంకారాన్ని జపించసాగాడు. సుదర్శనుడి నిష్కల్మష భక్తికి అమ్మవారు సంతసించి, అతడి ముందు ప్రత్యక్షమైంది. అతడికి ఒక దివ్యాశ్వాన్ని, గొప్ప ధనువును, అక్షయ తూణీరాలను ఇచ్చింది. ‘నువ్వు తలచినంతనే నీకు సాయంగా వస్తాను’ అని పలికి అదృశ్యమైంది.ఆనాటి నుంచి సుదర్శనుడు, మనోరమ నిరంతరం భక్తిగా దేవిని పూజించసాగారు. కొన్నాళ్లకు ఒకనాడు ఒక నిషాదుడు సుదర్శనుడిని చూడవచ్చాడు. అతడు ఒక రథాన్ని సుదర్శనుడికి కానుకగా సమర్పించాడు. అమ్మవారు ఇచ్చిన అస్త్రశస్త్రాలు ధరించి, నిషాదుడు బహూకరించిన రథంపై సుదర్శనుడు యుద్ధానికి బయలుదేరాడు. యుద్ధంలో అతడికి అమ్మవారి శక్తి తోడుగా నిలిచింది.సుదర్శనుడి ధాటికి యుధాజిత్తు సేనలు కకావిలకమయ్యాయి. అతడి ధనుస్సు నుంచి వెలువడుతున్న బాణాలు తరుముకొస్తుంటే, వారంతా భీతావహులై పలాయనం చిత్తగించారు. యుద్ధంలో ఘనవిజయం సాధించిన సుదర్శనుడు తన రాజ్యాన్ని కైవసం చేసుకున్నాడు. – సాంఖ్యాయన -
అలా మొదలై.. 'డి' ఫర్ దినేశ్ వరకూ..
‘పడిపోవడంలో తప్పు లేదు కాని, పడ్డ ప్రతిసారి పైకి లేవడమే గొప్ప’... కన్ఫ్యూషియస్ చెప్పిన ఈ మాట అతనికి సరిగ్గా సరిపోతుంది. రెండు దశాబ్దాల క్రితం తొలిసారి భారత జట్టు తరఫున అతను అంతర్జాతీయ క్రికెట్లో అడుగు పెట్టాడు. ఈ ఇరవై ఏళ్ల అతని ప్రయాణం అందరికంటే ఎంతో భిన్నంగా సాగింది. ఆటలో ఎన్నో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నాడు. ఎంతో ప్రతిభ ఉన్నా అనివార్య కారణాలతో అతడికి జట్టులో చోటు దక్కలేదు. అయినా, ఏనాడూ ఆశ కోల్పోలేదు. ఎప్పుడూ సాధన మానలేదు. ఇక ముగించాలని భావించలేదు.స్థానం కోల్పోయిన ప్రతిసారి పట్టుదలగా పోరాడి పునరాగమనం చేశాడు. ఎప్పుడు వచ్చినా కొత్తగా ఏదో ఒకటి నేర్చుకొని తన ప్రత్యేకతను ప్రదర్శిస్తూ వచ్చాడు. మరోవైపు వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదురయ్యాయి. మరొకరైతే అలాంటి స్థితిలో అన్నింటినీ వదిలేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయేవారేమో! కానీ అతను ధైర్యంగా నిలబడ్డాడు. ఎక్కడా తన కెరీర్‌పై ఆ ప్రభావం లేకుండా స్థితప్రజ్ఞతో ముందుకు సాగాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఆగిపోయినా ఐపీఎల్లో సత్తా చాటి తన విలువేంటో చూపించాడు. ఆడే అవకాశం లేని సమయంలో వ్యాఖ్యాతగా తన మాట పదునును ప్రదర్శించాడు.39 ఏళ్ల వయసులోనూ యంగ్‌గా, మైదానంలో చురుగ్గా ఆడుతూనే ఇటీవలే ఐపీఎల్‌కు ముగింపు పలికిన ఆ క్రికెటరే దినేశ్ కార్తీక్. గత ఇరవై ఏళ్లలో భారత జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా మారిన పెద్ద సంఖ్యలో మ్యాచ్‌లు ఆడిన ఇతర ఆటగాళ్లందరితో పోలిస్తే కార్తీక్ ప్రస్థానం వైవిధ్యభరితం, ఆసక్తికరం. దిగ్గజ ఆటగాళ్ల మధ్య కూడా తన ప్రత్యేకతను నిలుపుకోవడంలో అతను సఫలమయ్యాడు.భారత క్రికెట్లో వికెట్ కీపింగ్‌కు సంబంధించి అన్ని రుతువులతో పాటు ‘మహేంద్ర సింగ్ ధోని కాలం’ కూడా ఒకటి నడిచింది. వికెట్ కీపర్లను ధోనికి ముందు, ధోని తర్వాతగా విభజించుకోవచ్చు. ‘ధోని కాలం’లో ఎంతో మంది యువ వికెట్ కీపర్లు తెర వెనక్కి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఎంతో ప్రతిభ ఉన్నా, దేశవాళీ క్రికెట్లో అద్భుతంగా ఆడుతూ వచ్చినా ధోని హవా, అతని స్థాయి ముందు అవన్నీ చిన్నవిగా మారిపోయాయి.అలాంటి బాధితుల జాబితాలో అగ్రస్థానం దినేశ్ కార్తీక్‌దే. 2008–2016 మధ్య ఐదు సీజన్ల పాటు అతను దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారించడంతో పాటు వికెట్ కీపర్‌గా కూడా రాణించాడు. కానీ ఈ ప్రదర్శన కూడా అతడికి టీమిండియాలో రెగ్యులర్‌గా చోటు ఇవ్వలేకపోయింది. నిజానికి ధోనికి ఏడాది ముందే భారత్ తరఫున టెస్టు మ్యాచ్ ఆడిన కార్తీక్...ధోని అరంగేట్రానికి మూడు నెలల ముందే వన్డేల్లోకి అడుగు పెట్టాడు.కానీ ఒక్కసారి ధోని పాతుకుపోయిన తర్వాత కార్తీక్‌కు అవకాశాలు రావడం గగనంగా మారిపోయింది. కానీ అతను ఎప్పుడూ నిరాశ పడలేదు. తన ఆటనే నమ్ముకుంటూ ముందుకు సాగాడు. కీపర్‌గా స్థానం లభించే అవకాశం లేదని తెలిసిన క్షణాన తన బ్యాటింగ్‌ను మరింతగా మెరుగుపరచుకున్నాడు. తన ప్రదర్శనలతో స్పెషలిస్ట్ బ్యాటర్‌గా తనకు చోటు కల్పించే పరిస్థితిని సృష్టించుకోగలిగాడు.అలా మొదలై...సెప్టెంబర్ 5, 2004... అంతర్జాతీయ క్రికెట్లో దినేశ్ కార్తీక్ తొలి మ్యాచ్. ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్‌తో జరిగిన ఈ పోరులో అద్భుత వికెట్ కీపింగ్‌తో అతను ఆకట్టుకున్నాడు. భూమికి దాదాపు సమాంతరంగా గాల్లో పైకెగిరి మైకేల్ వాన్‌ను అతను స్టంపౌట్ చేసిన తీరు ఈ కొత్త ఆటగాడి గురించి అందరూ చర్చించుకునేలా చేసింది. మరో రెండు నెలల తర్వాత ఆస్ట్రేలియాతో టెస్టు మ్యాచ్‌లో అరంగేట్రం.2007లో ధోని సారథ్యంలో భారత జట్టు సాధించిన టి20 ప్రపంచకప్ విజయాన్ని ఎవరూ మరచిపోలేరు. ఈ మెగా టోర్నీకి దాదాపు పది నెలల ముందు భారత జట్టు ఒకే ఒక అంతర్జాతీయ టి20 మ్యాచ్ ఆడింది. ఇందులో కూడా ధోని ఉన్నా, బ్యాటర్‌గా దినేశ్ కార్తీక్‌కు స్థానం లభించింది. దక్షిణాఫ్రికాపై మన టీమ్ నెగ్గిన ఈ పోరులో కార్తీక్కే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ పురస్కారం దక్కడం విశేషం. చారిత్రాత్మక వరల్డ్ కప్ విజయంలో కూడా కార్తీక్ తన వంతు పాత్ర పోషించాడు.అలా మూడు ఫార్మాట్లలో కూడా అతను భారత జట్టులో భాగంగా మారాడు. టెస్టుల్లో కార్తీక్ హైలైట్ ప్రదర్శన 2007లోనే వచ్చింది. స్వింగ్‌కు విపరీతంగా అనుకూలిస్తూ అగ్రశ్రేణి బ్యాటర్లకే కొరుకుడు పడని ఇంగ్లండ్ గడ్డపై అతను సత్తా చాటాడు. కొత్త బంతిని ఎదుర్కొంటూ అక్కడి పరిస్థితుల్లో ఓపెనర్‌గా రాణించడం అంత సులువు కాదు. కానీ తాను ఎప్పుడూ ఆడని ఓపెనింగ్ స్థానంలో జట్టు కోసం ఆడేందుకు సిద్ధమయ్యాడు. నాటింగ్‌హామ్‌లో అతను చేసిన 77 పరుగులు, ఆ తర్వాత ఓవల్‌లో సాధించిన 91 పరుగులు భారత జట్టు 1986 తర్వాత ఇంగ్లండ్‌లో టెస్టు సిరీస్‌ను గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాయి.జట్టులోకి వస్తూ పోతూ...ఇంగ్లండ్‌లో రాణించిన తర్వాత కూడా కార్తీక్ కెరీర్ వేగంగా ఊపందుకోలేదు. తర్వాతి మూడేళ్లలో అతను 7 టెస్టులు మాత్రమే ఆడగలిగాడు. కీపర్ స్థానానికి అసలు అవకాశమే లేకపోగా, రెగ్యులర్ బ్యాటర్ స్థానం కోసం తన స్థాయికి మించిన అగ్రశ్రేణి ఆటగాళ్లతో పోటీ పడాల్సి రావడంతో తగినన్ని అవకాశాలే రాలేదు. వన్డేల్లోనైతే వరుసగా రెండు మ్యాచ్‌లలో ఆడే అవకాశం వస్తే అదే గొప్ప అనిపించింది. 2010లో వన్డే జట్టులోనూ స్థానం పోయింది. కానీ కార్తీక్ బాధపడలేదు.పునరాగమనం చేయాలంటే ఏం చేయాలో తనకు బాగా తెలుసని నమ్మాడు. అందుకే మూడేళ్ల పాటు దేశవాళీ క్రికెట్లో చెలరేగాడు. ఫలితంగా 2013లో ప్రతిష్ఠాత్మక చాంపియన్స్ ట్రోఫీ టీమ్‌లో మళ్లీ స్థానం లభించింది. ధోని ఉన్నా సరే, బ్యాటర్‌గా చోటు దక్కించుకొని విజేతగా నిలిచిన జట్టులో సభ్యుడయ్యాడు. మరో ఏడాది తర్వాత టీమ్‌లో మళ్లీ చోటు పోయింది. ఇప్పుడూ అదే పని. దేశవాళీలో బాగా ఆడటంతో మూడేళ్ల తర్వాత వెస్టిండీస్ పర్యటనకు ఎంపికయ్యాడు.ఆ తర్వాత కొన్ని చక్కటి ప్రదర్శనలతో తర్వాతి రెండేళ్లు నిలకడగా రాణించిన అనూహ్యంగా 2019 వన్డే వరల్డ్ కప్ టీమ్‌లోనూ చోటు దక్కించుకొని అందరినీ ఆశ్చర్యపరచాడు. టెస్టుల్లో ధోని రిటైర్మెంట్ తర్వాత కూడా దురదృష్టవశాత్తూ కార్తీక్ పేరును పరిశీలించకుండా సెలక్టర్లు సాహాను ప్రధాన కీపర్‌గా తీసుకున్నారు. అయినా అతను కుంగిపోలేదు. ఏకంగా ఎనిమిదేళ్ల విరామం తర్వాత 2018లో మళ్లీ టెస్టు మ్యాచ్ బరిలోకి దిగగలిగాడంటే అతని పట్టుదల ఎలాంటితో అర్థమవుతుంది.2021 ముస్తక్ అలీ ట్రోఫీతో...మరచిపోలేని ప్రదర్శనతో...అంతర్జాతీయ టి20ల్లోనూ కార్తీక్ ప్రస్థానం పడుతూ లేస్తూనే సాగింది. వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యుడే అయినా ఎక్కువ అవకాశాలు రాలేదు. అన్నింటికీ ఒకటే సమాధానం...ధోని ఉండగా చోటెక్కడుంది? 2010లో భారత్ తరఫున టి20 ఆడిన మరో ఏడేళ్లకు 2017లో అతను తన తర్వాతి మ్యాచ్ ఆడాడంటే అతని కమ్‌బ్యాక్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అయితే 2018లో నిదాహస్ ట్రోఫీలో కార్తీక్ ప్రదర్శన అతనికి కొత్త అభిమానులను తెచ్చి పెట్టింది.సరిగ్గా చెప్పాలంటే 14 ఏళ్ల కెరీర్ తర్వాత ఇది కార్తీక్ మ్యాచ్ అనే గుర్తింపును తెచ్చి పెట్టింది. శ్రీలంకతో జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో భారత్ విజయానికి చివరి 12 బంతుల్లో 34 పరుగులు అవసరమయ్యాయి. ఈ దశలో కేవలం 8 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో అతను జట్టును గెలిపించాడు. ఆఖరి బంతికి అతను కొట్టిన సిక్సర్ హైలైట్‌గా నిలిచింది. ఎప్పుడో కెరీర్ ముగిసింది అనుకున్న దశలో 2022 టి20 వరల్డ్ కప్ జట్టులో కూడా అతను చోటు దక్కించుకొని 37 ఏళ్ల వయసులో అంతర్జాతీయ టి20 మ్యాచ్ ఆడటం మరో విశేషం. మరో వైపు ఐపీఎల్లో కూడా ఎన్నో మంచి ప్రదర్శనలు కార్తీక్‌కు గుర్తింపును తెచ్చి పెట్టాయి. ఐపీఎల్లో 6 టీమ్‌లకు ప్రాతినిధ్యం వహించిన కార్తీక్ విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ టీమ్‌లో సభ్యుడిగా ఉన్నాడు. ఐపీఎల్ మొదలైన 2008నుంచి 2024 వరకు కార్తీక్ 257 మ్యాచ్‌లు ఆడి అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంతో తన లీగ్ కెరీర్ ముగించాడు. ఈ టోర్నీలో 4842 పరుగులు చేసిన అతను అత్యధిక పరుగులు చేసినవారిలో పదో స్థానంలో నిలిచాడు.ఫ్యామిలీతో...ఆటుపోట్లు ఎదురైనా...కార్తీక్ స్వస్థలం చెన్నై. మాతృభాష తెలుగు. తండ్రి ఉద్యోగరీత్యా బాల్యం కువైట్‌లో గడిపినా... తర్వాత మద్రాసులోనే స్థిరపడ్డాడు. తండ్రి నేర్పించిన ఆటతో దిగువ స్థాయి క్రికెట్లో మంచి ప్రదర్శనలు ఇస్తూ సీనియర్ జట్టు వరకు ఎదిగాడు. అయితే ఆటగాడిగా భారత జట్టులో సుస్థిర స్థానం కోసం ప్రయత్నిస్తున్న సమయంలో కార్తీక్ వ్యక్తిగత జీవితంలో తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. 2007లో అతను తన మిత్రురాలు నికితను పెళ్లి చేసుకున్నాడు.ఐదేళ్ల తర్వాత వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. అయితే తనతో వివాహ బంధంలో ఉండగానే భారత జట్టు, తమిళనాడు జట్లలో తన సహచరుడైన మురళీ విజయ్ను ప్రేమించడం, ఆపై తనకు దూరం కావడం అతడిని తీవ్రంగా బాధించాయి. ఆ డిప్రెషన్ నుంచి బయటపడేందుకు చాలా సమయం పట్టింది. ఎట్టకేలకు భారత స్టార్ స్క్వాష్ క్రీడాకారిణి దీపిక పల్లికల్‌తో పరిచయం అతని జీవితంలో కొత్త ఉత్సాహాన్ని తెచ్చింది. 2015లో వీరిద్దరు పెళ్లి చేసుకోగా, వీరికి మూడేళ్ల వయసు ఉన్న కవల అబ్బాయిలు ఉన్నారు. –మొహమ్మద్ అబ్దుల్ హాది -
నేలపట్టు! ‘మామయ్యా.. ఒక్క విషయం'..
జీవితం జీవించటానికి కాదు. జీవితం నిర్వహించాల్సిన కర్తవ్యమని భావించే వ్యక్తి చంద్రశేఖరం. ఉదయ సంధ్య వేళ. చుట్టూ స్వచ్ఛమైన ప్రాణవాయువు ఆవరించిన స్పృహ. ప్రాణం నిలకడగా ఉచ్ఛ్వాసనిశ్వాసాల్లో డోలలూగుతున్న భావన. ప్రకృతిని ఆస్వాదిస్తూ ఎంతో హాయి పొందుతున్నాడు చంద్రశేఖరం. ఎప్పుడో వెళ్లిపోయిన యవ్వనం తిరిగి వచ్చినంత ఉత్సాహంగా ఉంది. సూర్యోదయం అయ్యేంత వరకు పొలం గట్ల మీద అలా తిరుగుతూనే ఉండిపోయాడు. అది అలవాటు. దినచర్యలో మొదటి ప్రస్థానం.తెల్లటి ఖద్దరు జుబ్బా, ఎగ కట్టిన పంచెతో తదేకంగా నడుస్తున్నాడు. అప్పుడే పొలంలోకి కూలీలు దిగుతున్నారు. ఆ పక్క చెరువులో కడప చెట్ల మీద పక్షుల కిలకిలరావాలు. వీనులవిందుగా ప్రతిధ్వనిస్తూ ఉంది ఆ ప్రాంతమంతా. చంద్రశేఖరాన్ని చూస్తే మరింత అల్లరి వాటిది. రోజూ టిఫిన్ తెచ్చి ఫామ్‌హౌస్‌లో పెట్టి వెళ్లే మాణిక్యం హడావుడిగా పొలం గట్ల మీద ఎదురు రావడం కొద్దిగా గాబరా పడ్డాడు. పడమర పొలం వెళ్లటం మానుకొని ఎదురు నడిచాడు.‘టిఫిన్ తెచ్చి టేబుల్ మీద పెట్టాను అయ్యా.. మధ్యాహ్నం అన్నం వండాలా?’ కొత్తగా అడగటంతో అర్థం కాలేదు. అదే ప్రశ్నించాడు చంద్రశేఖరం. ‘ఆ యశోదమ్మ వచ్చి అయ్యగారికి భోజనం పంపిస్తాము నీవేమీ వండొద్దు, మేం చెప్పామని అయ్యగారికి చెప్పు అని చెప్పి వెళ్ళారయ్యా’ వినయంగా బిడియంగా చెప్పింది మాణిక్యం. ‘ఏమిటి విషయం ఈరోజు?’ చంద్రశేఖరం ప్రశ్న పూర్తిగా వినకుండానే ‘అయ్యా పక్షుల కొరకు చెరువు గట్టు మీద మన ఊరోళ్ళు పొంగళ్ళు పెట్టేది ఈ రోజే కదయ్యా’ మాణిక్యం జవాబుతో గుర్తుకు వచ్చిన వాడిలా ‘అవును కదూ సరే ఆ పొంగలి పులిహోరతో ఈ పూట ఇక్కడే గడిపేస్తానులే. రాత్రికి వచ్చి, మామూలుగానే చపాతీ చేసి వెళ్ళు.. సరేనా’ అంటూనే ఇక నీవెళ్ళచ్చు అని తల ఆడిస్తూ మాణిక్యాన్ని పంపేశాడు.‘నాన్న నువ్వు ఎప్పటికీ ఊర్లో వాళ్ళు పంపిన అన్నం తినవద్దు. ఇంట్లోనే చేయించుకో. పొలం వెళితే వారితో కలసి అన్నం తినొద్దు’ కూతురు రోహిణి మాటలు గుర్తుకు వచ్చాయి. కళ్ళలో సన్నటి నీటి చెమ్మ. రోహిణిని చూసి ఐదేళ్లయ్యింది. ఫోన్లోనే కులాసాలు, కబుర్లు. ఆడబిడ్డ మేలు.. ప్రతివారం ‘ఏం నాన్నా..’ అని నోటినిండా అరగంట మాట్లాడుతుంది. ప్రశాంతు, సుమన్‌లు అయితే పలకరింపు క్కూడా అందడం లేదు. పిల్లలు సరే, కట్టుకొని, నాలుగు పదుల కాలం కాపురం చేసిన తాళికి ఏమైంది.. ఎక్కడ నుంచి వచ్చాము, ఏ మట్టి తల్లి బిడ్డలం అనేది మర్చిపోతే ఎలా? మూలాలు దాచేసే జీవితాలా? జన్మనిచ్చిన పల్లెను, జీవితాన్ని పంచిన నేల పరిమళాలు తుడిచేస్తే పోయేవేనా?‘పల్లె నచ్చక, పల్లె జీవితం చిన్నతనంగా భావించి పిల్లలకు తోడు, వారి బాగోగులు అంటూ వాళ్ళు దేశాలు పట్టుకుని తిరుగుతుంటే కంటికి రెప్పలా మనమేగా కాసుక్కూర్చోవాలి’ అనేది శకుంతల. నిజానికి పల్లెలో ఉండలేక తన పాత జీవితాన్ని, పునాదుల్ని గుర్తు చేసుకోను ఇష్టంలేక పిల్లలకు తోడుగా ముగ్గురు బిడ్డలతో విలాస జీవితం గడుపుతూ ఉంది శ్రీమతి చంద్రశేఖరం. ఒకప్పుడు ఇంట్లో అందరూ ఉన్నా ఉద్యోగ బాధ్యతలు మధ్య బతికేవాడు. కుటుంబాన్ని.. వారి బాగోగులను ఎక్కడా నిర్లక్ష్యం చేయలేదు. ఇప్పుడు ఎవరికి వారు ఉద్యోగాల్లో, సొంత కాపురాల్లో ఎక్కడో ఎక్కడెక్కడో విడిపోయారు. తను ఒంటరిగా బతుకుతున్నాడు రిటైర్డ్ ఏఎస్పీ చంద్రశేఖరం.నేలపట్టు సముద్ర తీరాన దట్టమైన చెట్లు, అడవుల మధ్య రస్తాల వాసన సోకనంత దూరంగా విసిరేసినట్టున్న కుగ్రామం. నాగరికులు అనేదానికి వీల్లేదు. పల్లెలకు పట్నాలకు దూరంగా ఉంది. నాగరికత నీడ పడని ఊరు. ఆ చిన్న పల్లెటూరే నేలపట్టు. యాబై గడప దాటని కుగ్రామం. దొరవారి సత్రం వెళ్లే తారు రోడ్డు కోసం ఏడు కిలోమీటర్లు అడ్డంగా నడవాలి. అక్కడ అందరి జీవనం ఒక్కటే. నీళ్ల కాలంలో పులికాట్ సరస్సులో చేపల వేట. మిగిలిన రోజుల్లో చెరువు, దొరువుల్లో వేట. ఇదే వారి జీవనాధారం.నేలపట్టులో మూడు నాలుగు తరగతుల వరకు చదివినవారే అంతా. అదీ సుదూరం నడిచి వెళ్లి. ఆ ఊర్లో తొలి డిగ్రీ పట్టా పొందిన వ్యక్తి చంద్రశేఖరం. దాని వెనుక సుబ్బయ్య, పిచ్చమ్మ పట్టుదల బోలెడంత. వారి ఒక్కగానొక్క కొడుకు చంద్రశేఖరం. చదివించాలనే మూర్ఖత్వం వారిది. మూర్ఖత్వం అని అప్పట్లో ఆ ఊరి వారి నింద లేదా బిరుదు. ఈ జీవితం నుండి వెలుగు చూడాలనే ఓ కిరణం కోసం వెతుకులాట సుబ్బయ్య – పిచ్చమ్మ దంపతులది. నేలపట్టులో అది ఎనిమిదో వింత. శిక్షణ పూర్తిచేసుకుని ఇందుకూరుపేట పోలీస్ సబ్ ఇన్స్పెక్టరుగా చార్జి తీసుకొని గ్రామానికి చేరుకున్నాడు చంద్రశేఖరం. ఒక్క క్షణం ఆ పల్లె గడప, పోలీసు జీపు దుమ్ముకు, ఖాకీ బట్టల వాసనకు సన్నగా వణికింది. నేలతల్లికి ముద్దు పెట్టుకొని నడిచి వస్తున్న ఎస్ఐని చూసి ‘పోలీసు కాదురా మన చంద్రుడే!’ అని సన్నటి చిరు జల్లుల సందడిలో పల్లె అంతా సరదాల చిత్తడి అయింది.‘మా చంద్రుడు బీఏ అంట’ నేలపట్టు వాళ్ళు ఘనంగా చెప్పుకునే వారు. వారికి తెలియని అందని ఎన్నో విషయాలు చాలానే ఉన్నాయి. బీఏ కాదు పీజీ చేశాడని, నెల్లూరు చరిత్ర మీద తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో పీహెచ్డీ కూడా చేశాడని ఇప్పటికీ తెలియదు. కానీ ఆ చందురూడే కాల చక్రభ్రమణంలో ఎస్సై మాత్రమే కాదు సీఐ, డి.ఎస్.పి, ఏఎస్పీ కూడా అయినాడని ఎనిమిది జిల్లాల్లో పనిచేసి రిటైర్మెంట్కు చివరి రెండేళ్లు నెల్లూరు వచ్చారు.రాష్ట్రస్థాయిలో పొందిన గుర్తింపు గౌరవంతో సొంత జిల్లాలోని బాధ్యతలు నెరవేరుస్తున్న విషయం ఇప్పటికి అందరూ తెలుసుకున్నారు. నేలతల్లిని ముద్దాడి ఉద్యోగ ప్రయాణాన్ని మొదలెట్టిన నేలపట్టు చంద్రుడు ఊరిని మరవలేదు. వంద గడప ఉన్న తన తల్లిలాంటి ఊరి కోసం పాతికేళ్ల కృషిని నాలుగైదు ఏళ్ళలో పూర్తి చేయగలిగాడు. సొంత ఊరు నుండి నాయుడుపేట, దొరవారి సత్రానికి తారు రోడ్లు మొదలు పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య సబ్‌సెంటర్, పక్కా ఇళ్లు.. అన్ని ప్రభుత్వ పథకాలు గ్రామానికి అందేలా కృషి చేయడమే కాక ప్రతి నెల సొంత ఊరిలో రెండు రోజులు ప్రజలను చైతన్య పరచడం తన విధులలో ఒకటిగా భావించాడు చంద్రశేఖరం. నాటు పడవలు, వలల వద్ద నుంచి చెరువుకు రెండు వైపులా ఉన్న పోరంబోకు భూములను గ్రామçస్థులకు కేటాయించేలా కృషిచేసి డి ఫారములు అందేలా చేశాడు. ఊరికి ఒక్కడిలా చంద్రుడు గ్రామానికి వెన్నెల వెలుగయ్యాడు.మూడు పదుల ఏళ్ల కృషి – ఆ నేల వైభవం ఆ ప్రాంతాలలో ప్రవచనంలా మారుమోగుతుంది. దానికి అనేకానేక కారణాలు. అభివృద్ధి మాత్రమే కాదు, ప్రతి ఇంట చదువుకున్న వారే. గ్రామం నుంచే ఇప్పుడు రైల్వే, పోలీసు, బడి పంతుళ్లు, ఇంజినీర్లుగా ఎదిగిన పిల్లలతో పల్లె స్వరూపమే మారింది. నేలపట్టు.. ఆకాశమంత సముద్రాన్ని ఇక్కడ భూమిపైన జల తివాచీగా పరచినట్టు ఉంటుంది. చెట్లకి ప్రాణమిచ్చే మట్టి, మట్టిని మెత్తగా మలచిన చెట్లు. చెట్లుకీ మట్టికీ ఉనికినిచ్చిన పులికాట్ సరస్సు. చెట్టు, మట్టి, సముద్రం, పులికాట్‌లకు స్థానమిచ్చినదే నేలపట్టు. ఒకప్పుడు మురుగు కూపం – నేడు ఆదర్శగ్రామం. తైల సంస్కారమెరగని పల్లెసీమ – నేడు ఉత్తమ పల్లె. పోరంబోకు పొలాలు పంట పొలాలు అయ్యాయి.చెరువు ఆయకట్టు కింద రెండు కార్లు జీలకర్ర మసూర్లకు వేదికైంది. ఆ డివిజనులోనే అభివృద్ధికి దర్వాజా అయింది. ప్రతి పిల్లోడు చదువుకున్న యువత కాగలిగింది. ప్రతి గడప ప్రభుత్వ ఉద్యోగి కాపురంగా నిలిచింది. దానితో పాటు ఎర్ర చెరువు.. నేలపట్టుకు కలసొచ్చిన మరో ఆయువుపట్టు అయింది. అదే వలస పక్షులు. చెరువులోనే ప్రత్యేకంగా ఉన్న కడప చెట్లు వీటికి ఆసరా.ఈశాధాన్యుల హిమాలయ యాత్రలా, కాశీతీర్థ ప్రయాణంలో వలసపక్షులు చేరుతుంటాయి. విశ్వసుందరి పోటీలకు పయనమైన సోయగాల్లా, విశ్వశాంతి చాటే ఆత్మీయ అతిథుల రాయబారుల్లా, పులికాట్ సరస్సు ఒడ్డున వాలుతాయి ఈ తారా పక్షులు. ప్రేమయాత్రో, ఆత్మీయ సంగమ ప్రయాణమో, తను పుట్టిన మట్టిని ముద్దాడుతుంటాయి ఈ ఫెలికాన్లు. సుదూర తీర ప్రయాణ ప్రయాస తీర్చుకుంటూ ఫ్లెమింగోలు, దండయాత్రకు తరలివచ్చిన సముద్ర సైన్యంలా, పెలికాన్లు, ఫ్లెమింగోలు, నారాయణ పక్షి, నీటి కాకి, పాలపిట్ట, కళ్లకంకణాయి, ఎర్రకాళ్ల కొంగ, నీటి కొంగ, చెకుముకి పిట్ట, ఇక్కడ ఆవాసాలతో బృందావనంలా మలచుకుంటాయి ఈ నేలపట్టుని. ఒకనాడు అలెగ్జాండరు జయించాడు జంబూ ద్వీపాన్ని, ఈనాడు విదేశీ పక్షులు ముద్దాడుతున్నాయి ఈ నేలపాదాల్ని. వేల పక్షులు ఆరు నెలలు పాటు ప్రేమమయ భక్తి భావనలే. రాధా మాధవ ప్రణయ వేద వేదనా స్వనాలే. కొత్త సృష్టి రచనా రీతికి అనుక్రమణికలు ఈ చెరువు చిరునామాగా మారుతుంది. సృష్టియాగం మదనభంగిమ అందుకేనేమో పరువపు ఘుమఘుమలు – రేగడి నేలల్లో రెట్టల పరిమళం.రేపటి పంటలకు శుభోదయం అవుతుంటాయి. చెరువు, పొలాల గట్లలో నిండిన చెట్లు పక్షుల ఎరువుతో కలసి పదిరెట్లు పండించే పంటలు హరిత దుప్పట్లు. నేలపట్టు మహిళలు జాతర చేసుకునేది ఈ పక్షుల కోసమే. గుళ్లు, గోపురాలు, దేవుళ్లు, దేవతలకు కాదు, చెరువుకు కడప చెట్లకు మొక్కులు తీర్చుకుంటారు. దేశ విదేశీ పక్షులకు ఇవే ఆసరాలు. పక్షులకు స్వాగతం పలకటం ఇక్కడ జరిగే అతి పెద్ద జాతర. అదే తిరణాల. అందుకే సవినయ సాదర స్వాగతం పలుకుతూ, నేలపట్టు నాగేటి చాళ్లతో ఆహ్వాన గీతం పలుకుతుండటం రెండు దశాబ్దాలుగా ఇక్కడ సాగుతున్న పక్షుల పండుగ. ఎక్కడున్నా, ఏ ఉద్యోగంలో ఉన్నా, చదువుల్లో ఉన్నా అందరూ ఈ పక్షుల జాతరకు, ఈ పొంగళ్లు, ఉత్సవాలకు హాజరవటం ఈ నేలపట్టు పుణ్యస్థలిగా మారుతుంది.వేడుకల్లో పాల్గొనడమే కాదు వచ్చే ఏడాది ప్రణాళికలను రూపొందించుకోవటం. అన్ని తరగతుల వారికి, అన్ని వర్గాల వారికి, ఎవరి పనులు వారికి, ఎవరి బాధ్యతలు, కర్తవ్యాలను అందరూ ఒక్కమాటగా పంచుకుంటుంటారు. అవన్నీ అమలు జరగాల్సిందే. ఈ పాతికేళ్లుగా అదే కట్టుబాటు, ప్రతిఒక్కరిలో అదే కసి, అందుకే నేలపట్టుకు గుర్తింపు, గౌరవం. దీనికి కర్త, కర్మ, క్రియ ఒక్కరే.. చంద్రశేఖరం.ప్రతికదలికలోనూ ఓ రాజసం. ఎక్కడివో, ఏ ప్రాంతానివో, మరే దేశానివో సరిగ్గా ఈ సీజనులో వస్తాయి. ఐదారు నెలలు కాపురం చేస్తాయి. సంతతి వృద్ధి చేసుకొని వెళతాయి. మంచుకాలంలో ఉండలేవు. మంచు తగలక ముందే వెళ్లిపోతాయి. పెలికాన్ లు.. వాటి కదలికలను చూసి చంద్రశేఖరం పెదాలు చిరునవ్వుల సందడి చేస్తున్నాయి. దరహాసాల నాట్యమాడుతున్నాయి. ఈ నేల మీద ఎంత ప్రేమ..నమ్మకం..! ఠంచనుగా ప్రతి ఏడాది వేల కి.మీ. దాటుకొని సముద్రాలు దాటుకొని ఈ నేలతల్లి ఒడిలో సేద తీరుతాయి. ఎక్కడిదో ఈ విశ్వాసం.. ఏమిటో.. ఈ నేలతో ఆత్మీయ అనురాగ సంగమం! ఈ విదేశీ పక్షులకు ఉన్న ప్రేమాభిమానాలు ఈ నేల మీద పురుడు పోసుకున్న మనుషులకు ఎందుకు లేకుండా పోయింది! చంద్రశేఖరం మనసు బాధగా మూలిగింది. ఇక్కడ పునాదులతోనే గదా ఎదిగింది. ఈ నేలతల్లి ఒడి ఎందుకు గిట్టడం లేదు. నేలపట్టు పొడ ఎందుకు పడటం లేదు. పదవీ విరమణ జరిగి, ఒక్కడే నేలపట్టు గ్రామానికి చేరుకోవటం వెనుక నిర్మించుకొన్న ఆశల సౌధం బీటలు వారినంత వ్యథ..‘డాడీ.. మీరెన్నయినా చెప్పండి చెన్నై, లేదా హైద్రాబాదులలో సెటిల్ అవ్వండి. మీరు నెల్లూరు నేలపట్టు అనటం మాత్రం మాకు మింగుడు పడటం లేదు’ పెద్ద కొడుకు ప్రశాంత్. ‘సొంత ఊరంటే అభిమానం కాదనం డాడీ. అంతా ట్రాష్, మేమేమో ముగ్గురం మూడు దేశాల్లో స్థిరపడ్డాం. మేము రావాలన్నా పోవాలన్నా మా వసతి కూడా గమనించండి’ చిన్న కొడుకు సుమంత్. ‘అక్కడ పొలాలు, ఇళ్లు మీ పేరుతో ఊరి అభివృద్ధికి కేటాయించండి డాడీ. అంతేకానీ మీరిద్దరూ ఆ పల్లెలో ఉంటే మేమెలా ఇక్కడ స్థిరంగా ఉండగలం! మమ్మల్ని అర్థం చేసుకో డాడీ..’ తన ఆలోచనలను పుణికి పుచ్చుకున్న రోహిణి ఆలోచనలు కూడా గాడి తప్పాయి.‘మామయ్యా.. ఒక్క విషయం. ఒకటో తరగతిలో అక్షరాలు దిద్దామని, ఐదవ తరగతిలో గుణింతాలు దిద్దామని, డిగ్రీ పాసైనా అక్కడే ఉండి చదువుకుంటాను డిగ్రీలో కూడా ఆ టీచరే పాఠాలు చెప్పాలంటే కుదరుతుందా? అంతే మామయ్యా. ఊరి నుండి ఎదిగారు. ఎంతో చేశారు మీ వంతు.. ఆ గౌరవంతోనే మనం తప్పుకుంటే గొప్పగా నిలిచిపోతాం గదా మామయ్యా’ అల్లుడు చైతన్య అనునయించే ప్రయత్నం. చంద్రశేఖరంలో అప్పుడే ఓ మెరుపు మెరిసింది. నిజమే .. గౌరవంగా తప్పుకోవాలి. శాశ్వతంగా తప్పుకోవాలి. ఎక్కడ నుండి.. ఊరునుండే తప్పుకోవాలి! ఎలా తప్పుకోవాలి.. ఊరు ఖాళీ చేసికాదు.. ‘బొందిలో జీవం వెళ్లిన తర్వాతనే’ అప్పటికే ఓ నిశ్చయ నిర్ణయానికి చేరువయ్యాడు. ‘పిల్లలు లేకుండా, మనవళ్లు, మనవరాళ్లను చూడకుండా వారితో ఆడుకోకుండా జీవితాన్ని చూడకుండా, ఆస్వాదించకుండా ఆ పల్లెలో బిక్కుబిక్కుమంటూ నేనుండలేను. మీరు కావాలంటే వెళ్లండి’ జీవిత భాగస్వామి శకుంతల తెగేసి చెప్పింది. పదవీ విరమణ తర్వాత కూడా రెండు మూడు నెలలు ఇదే యుద్ధం.ఇదే చర్చ, ఇవే సమస్యలు. శకుంతల వైభోగం.. చంద్రశేఖరం ఆశయం పోటీ పడ్డాయి. కదులుతున్న కాలమే మన గురువు.. ఎంతటి సమస్య వచ్చినా ముందుకు కదలమనే చెబుతుంది తప్ప అక్కడే ఆగిపొమ్మని చెప్పదనే చంద్రశేఖరం విశ్వాసం. లగేజీ వాహనం పల్లెకు చేరుకుంది. వెనుక కారులో చంద్రశేఖరం ఒంటరిగా నేలపట్టుకు చేరి అప్పడే ఏడేళ్లు దాటింది. చందురూడూ ఒక్కడే. తారలేదని గుండెలు బోరుమన్నా, ఇప్పడు అంతా సర్దుకుపోయారు. చందురూడే.. నేలపట్టుకు వెలుగయ్యాడు. చెరువు ఒడ్డున పక్షులకోసం పొంగళ్లు పెడుతున్న గ్రామ మహిళలు, పిల్లలు, గ్రామానికి చేరుకొన్న కొత్త సందడి చప్పుళ్లతో చంద్రశేఖరం హృదయం కోటి వెలుగులతో కాంతిపుంజం అయింది.అయినా ఒక్కడే.. ఆ భావన లేదు. ఊరంతా తనది. అన్నీ మన మంచికే అనుకుంటే ఆపదలో కూడా ఆత్మవిశ్వాసం పోదు. ఒక వ్యక్తి విజయం సాధించాలంటే అతని సంకల్పం గొప్పదై ఉండాలి. అతని గురి లక్ష్యం వైపు ఉండాలి. శ్రద్ధ.. చేసే పనిపై ఉండాలి! ఫోన్ లో పలకరింపులు, కుశలాలు సాగుతూ, సాగుతూ పలచబడ్డాయి. అప్పుడప్పుడు చేసే రోహిణి కూడా పిల్లల వ్యాపకాలు, చదువు సంధ్యల ఒత్తిడి వలనేమో ఫోన్ లో కూడా పలకరించి చాలా కాలమయింది. పిల్లలు, కోడళ్ళు, కట్టుకున్న తాళి అందరూ ఎవరికి వారు యంత్రాలైపోయారు. కానీ చంద్రశేఖరం మాత్రం ప్రేమానురాగాలు ఆత్మీయత అనుబంధాలు అన్నీ గుండె నిండా ఆస్వాదిస్తున్నాడు. ఎందుకంటే అక్కడ అతను ప్రతి ఇంటిలోనూ దీపం వెలిగించిన మకరజ్యోతిగా నిలిచాడు. పిల్లా జెల్లా ఆ ఊరే కాదు, పక్క ఊరు వాళ్ళ అభిమానాన్ని కూడా పొందిన చంద్రశేఖరానికి ఏ లోటూ లేదు. కాని కాలం కదా! అయినా ఇప్పటికీ లోటు లేదు.ప్రతి ఒక్కరూ.. నమస్కారం బాబయ్యా.. పెద్దయ్యా దండాలు.. గుడ్‌మార్నింగ్ తాతయ్యా.. పెదనాన్నా ఊరెళుతున్నాం శెలవులకు వస్తాం! నాకు తాశిల్దారుగా ప్రమోషన్ వచ్చింది. వీసా కన్ ఫర్మ్ అయ్యింది తాతయ్యా!ఆ ఊరి వాళ్ళకే కాదు, పక్క ఊరి వాళ్ళకూ ఆదర్శనీయుడే! ఎందుకంటే నేలపట్టుకు వసతులు ఏర్పడటంతో పక్క దీవులు కూడా చైతన్యవంతమయ్యాయి. అందుకే అందరకీ పూజ్యనీయుడు! ప్రతి ఏడాది వచ్చే విదేశీ పక్షులు, వలస పక్షులు రావటం ఆగలేదు. నాలుగైదు నెలలు కాపురం చేయటమూ ఆగలేదు. ఆ ఊర్లో ఏం జరిగినా.. ఎవరు వెళ్ళినా, వచ్చినా చంద్రశేఖరానికి నమస్కరించాల్సిందే. చివరకు పక్షులు కూడా ఆ ఊరిలో బాగమే. పక్షులు తిరిగి వెళుతూ గ్రామం చుట్టూ చక్కర్లు కొట్టి వెళుతుంటాయి. ఆ ఊరి ప్రజలూ అంతే. ఊరి వారంతా చంద్రశేఖరానికి చెప్పి వెళ్లాల్సిందే. దండాలు పెట్టి వెళ్ళాల్సిందే. ఆ ఊరుకి ఏర్పడిన సంస్కారం అది. అదే ఆ ఊరి సంప్రదాయంగా మారిపోయింది. కాని ఒక్కటే లోటు. అవన్నీ కూడా గ్రామం నడిబొట్టున నిర్మించిన చంద్రశేఖరం విగ్రహానికి. ఎందుకంటే కాలం గొప్పది కదా! – ఈత కోట సుబ్బారావు -
క్రికెట్ పండగొచ్చింది.. 'టీ' కప్ లో పరుగుల సునామీ!
ధనాధన్ సిక్సర్లు.. ఫటాఫట్ ఫోర్లు.. ప్రపంచ క్రికెట్ అభిమానుల కోసం ట్వంటీ20 పండగ సిద్ధమైంది.. ఐపీఎల్ ముగిసి వారం రోజులే కాలేదు.. అప్పుడే మరో 20–20 సమరానికి అంతా రెడీ.. మీరు హైదరాబాద్ అభిమానులైనా, రాజస్థాన్ ఫ్యాన్స్ అయినా.. బెంగళూరును ఇష్టపడినా... కోల్‌కతాను ప్రేమించినా.. ఇప్పుడు మాత్రం అంతా భారత జట్టు వీరాభిమానులే..ఫ్రాంచైజీ క్రికెట్ ఎలాంటి వినోదాన్ని అందించినా ఆటలో అసలు కిక్కు మాత్రం మన దేశం, మన జట్టు అనడంలోనే ఉంది! కాబట్టే టి20 వరల్డ్‌కప్ అంటే అంత క్రేజ్! అందుకే పదహారేళ్ల వ్యవధిలో ఎనిమిది మెగా టోర్నీలు వంద శాతం ఆనందాన్ని పంచాయి. ఈసారీ ఆ సంబరంలో ఎలాంటి లోటు రానివ్వనన్నట్లుగా మరో వరల్డ్‌కప్ మన ముంగిటకు వచ్చేసింది. అందమైన కరీబియన్ సముద్ర తీరాన కలిప్సో సంగీతంతో సాగే టి20 మ్యాచ్‌లకు ఈసారి అగ్రరాజ్యం అమెరికా కూడా జత కట్టడం కొత్త ఆకర్షణ. ఇన్నేళ్లుగా క్రికెట్ అంటేనే మైళ్ల దూరంలో ఉన్న యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యూఎస్ఏ) ఇప్పుడు ఆతిథ్య జట్టుగా తమ దేశంలో కామన్వెల్త్ దేశాల ఆటకు స్వాగతం పలుకుతోంది. బరిలోకి దిగనున్న జట్ల సంఖ్య తొలిసారి 20కి చేరడం ఈసారి మరో ప్రత్యేకత. సంప్రదాయాలు, ప్రారంభోత్సవాల తంతు ముగిస్తే ఇక జట్లు మైదానంలో తలపడటమే మిగిలింది. ఇకపై నెల రోజుల పాటు ట్రవిస్ హెడ్ మనవాడు కాదు, కమిన్స్‌పై అభిమానం అస్సలు కనిపించదు, క్లాసెన్ తొందరగా అవుట్ కావాలనే మనం కోరుకోవాలి.గతంలో రెండుసార్లు చాంపియన్‌గా నిలవడంతో పాటు ఇప్పుడు ఆతిథ్యం కూడా ఇస్తూ వెస్టిండీస్ మరో కప్‌పై కన్నేసింది. డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ తమ మూడో టైటిల్ వేటలో జట్టునంతా హిట్టర్లతో నింపేయగా.. మాజీ విజేత ఆస్ట్రేలియా తమ స్థాయిని మళ్లీ ప్రదర్శించేందుకు ‘సై’ అంటోంది.ఒకసారి చాంపియన్లుగా నిలిచి రెండో టైటిల్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్న పాకిస్తాన్, శ్రీలంక తమ అస్త్రాలతో సిద్ధమయ్యాయి. దక్షిణాఫ్రికా, న్యూజీలండ్లు ఇన్నేళ్లుగా పోరాడుతున్నా ట్రోఫీ మాత్రం ఇంకా అందని ద్రాక్షగానే ఉంది. ఈ సారైనా ఆ జట్ల రాత మారుతుందా అనేది చూడాలి. లెక్కల్లో భాగంగా ఉన్నా డజను టీమ్‌లు టైటిల్ గెలిచే అంచనాల్లో లేవు. అయితే తమ స్థాయికి మించిన ప్రదర్శనతో సంచలనానికి అవి ఎప్పుడూ రెడీనే.ఇక చివరగా.. మన రోహిత్ శర్మ బృందం ఏ స్థాయి ప్రదర్శనతో భారత అభిమానుల కోరిక తీరుస్తుందనేది ఆసక్తికరం. ఎప్పుడో 2007లో తొలి టి20 వరల్డ్ కప్‌ను గెలుచుకున్న తర్వాత ఏడు ప్రయత్నాల్లోనూ మనకు నిరాశే ఎదురైంది. ఈసారి విండీస్ దీవుల్లో విజయీభవ అంటూ అందరం దీవించేద్దాం!జట్ల సంఖ్యను పెంచి...టి20 వరల్డ్‌కప్ చరిత్రలో ఇప్పటి వరకు 8 టోర్నీలు జరిగాయి. 2007 నుంచి 2022 మధ్య వీటిని నిర్వహించారు. ప్రస్తుతం జరగబోయేది 9వ టోర్నీ. గత నాలుగు వరల్డ్ కప్‌లలో 16 జట్లు పాల్గొనగా ఈసారి ఆ సంఖ్యను మరింత పెంచి క్రికెట్‌కు ప్రాచుర్యం కల్పించాలని ఐసీసీ నిర్ణయించింది. అందుకే ఈసారి 20 జట్లకు అవకాశం కల్పించింది. 2022 టోర్నీలో టాప్–8లో నిలిచిన ఎనిమిది జట్లు ముందుగా అర్హత సాధించాయి. రెండు ఆతిథ్య జట్లతో పాటు ఐసీసీ టి20 ర్యాంకింగ్స్ ప్రకారం మరో రెండు టీమ్‌లను ఎంపిక చేశారు. రీజినల్ క్వాలిఫయింగ్ టోర్నీల ద్వారా వేర్వేరు ఖండాల నుంచి మరో 8 జట్లు అర్హత సాధించాయి. కెనడా, ఉగాండా తొలిసారి టి20 ప్రపంచకప్‌లో ఆడనుండగా... ఆతిథ్య హోదాలో అమెరికా కూడా మొదటిసారి ఈ విశ్వ సమరంలో బరిలోకి దిగుతోంది.నవంబర్ 16, 2001... అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) 2024లో జరిగే టి20 ప్రపంచకప్ నిర్వహణ హక్కుల ప్రకటన వెలువరించింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా క్రికెట్ బోర్డు, వెస్టిండీస్ క్రికెట్ బోర్డు కలసి సంయుక్తంగా ఈ అవకాశం కోసం బిడ్ వేశాయి. అమెరికాలో కొత్తగా క్రికెట్‌ను అభివృద్ధి చేసేందుకు వచ్చిన అవకాశం... కరీబియన్ దీవుల్లో కొత్త తరంలో క్రికెట్‌పై తగ్గిపోతున్న ఆసక్తిని పెంచేందుకు ఈ రెండు దేశాల బోర్డులు కలసి ముందుకు వెళ్లాలని 2019లోనే నిర్ణయం తీసుకున్న తర్వాత సంయుక్త బిడ్‌కు సిద్ధమయ్యాయి. అమెరికాలాంటి అగ్రరాజ్యంలో క్రికెట్‌కు ఇప్పటి వరకు ఉన్న ఆదరణ అంతంత మాత్రమే. దేశంలోని వివిధ జట్లలో కూడా దక్షిణాసియా దేశాల నుంచి వచ్చినవారే సభ్యులుగా ఉంటున్నారు. అయితే వాణిజ్యపరంగా ఆ దేశంలో మంచి అవకాశాలు ఉండటం కూడా అమెరికాను ఐసీసీ ప్రోత్సహించేందుకు మరో కారణం. పైగా 2028లో లాస్ ఏంజెలిస్‌లో జరిగే ఒలింపిక్స్ క్రీడల్లో కూడా టి20 క్రికెట్‌ను చేర్చడంతో దానికి ఒక ట్రయిలర్‌గా ఈ వరల్డ్‌కప్ ఉండనుంది. మరోవైపు విండీస్ గడ్డపై క్రికెట్‌కు క్రేజ్ తగ్గుతుండటంతో స్టేడియాల నిర్వహణ సరిగా లేక ఆ జట్టు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో వరల్డ్‌కప్‌తో కాస్త కళ పెంచే అవకాశం ఉండటంతో విండీస్ ముందుకు వచ్చింది. ఏర్పాట్ల కోసం కనీసం రెండేళ్ల సమయం తీసుకునేలా ఐసీసీ ఈ రెండు బోర్డులకు అవకాశం కల్పిస్తూ హక్కులను కేటాయించింది.మొత్తం 9 వేదికలు..వరల్డ్‌కప్ మ్యాచ్‌ల ఎంపిక కోసం అమెరికా–వెస్టిండీస్‌లకు హక్కులు ఇచ్చినా మ్యాచ్‌లు జరిగే వేదికల విషయంలో ఐసీసీ చిక్కులు ఎదుర్కొంది. ముందుగా అమెరికాలో నాలుగు స్టేడియాలను ఎంపిక చేశారు. వీటిలో న్యూయార్క్ శివార్లలో ఉన్న బ్రాంక్స్ స్టేడియానికి సంబంధించి జనం నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. సుదీర్ఘ సమయంపాటు పార్క్ స్థానికులకు అందుబాటులో లేకపోవడంతోపాటు పర్యావరణ సమస్యలూ తలెత్తుతాయని వాదించడంతో దానిని పక్కన పెట్టాల్సి వచ్చింది. వేర్వేరు దేశాల సమాహారమైన వెస్టిండీస్ నుంచి కూడా ఏడు వేదికలను వరల్డ్‌కప్ కోసం ఐసీసీ ఎంపిక చేసింది. అయితే గ్రెనడా, జమైకా, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ ఆర్థిక సమస్యల కారణంగా మ్యాచ్‌ల నిర్వహణ కోసం బిడ్ వేయకుండా వెనక్కి తగ్గాయి. మైదానం సిద్ధం చేసేందుకు తమ వద్ద తగినంత సమయం లేదని డొమినికా కూడా తప్పుకుంది. చివరకు వాటి స్థానంలో కొత్త వేదికలను చేర్చి మొత్తంగా ఆరింటిని ఖరారు చేశారు.ఏ జట్టులో ఎవరున్నారంటే...భారత్..రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, రిషభ్ పంత్, సంజూ సామ్సన్, కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చహల్, అర్ష్‌దీప్ సింగ్, సిరాజ్, బుమ్రా.ఇంగ్లండ్..జోస్ బట్లర్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్, డకెట్, మొయిన్ అలీ, విల్ జాక్స్, లివింగ్‌స్టోన్, స్యామ్ కరన్, బెయిర్‌స్టో, ఫిల్ సాల్ట్, జోఫ్రా ఆర్చర్, టామ్ హార్ట్లే, క్రిస్ జోర్డాన్, ఆదిల్ రషీద్, రీస్ టాప్లీ, మార్క్ వుడ్.దక్షిణాఫ్రికా..మార్క్రమ్ (కెప్టెన్), హెండ్రిక్స్, మిల్లర్, మార్కో జాన్సెన్, డికాక్, క్లాసెన్, రికెల్టన్, స్టబ్స్, బార్ట్‌మన్, కొయెట్జీ, జాన్ ఫార్చూన్, కేశవ్ మహరాజ్, నోర్జే, రబడ, షమ్సీ.ఆస్ట్రేలియా..మిచెల్ మార్ష్ (కెప్టెన్), టిమ్ డేవిడ్, హెడ్, వార్నర్, గ్రీన్, మ్యాక్స్‌వెల్, స్టొయినిస్, అగర్, ఇంగ్లిస్, వేడ్, కమిన్స్, ఎలిస్, హాజల్‌వుడ్, స్టార్క్, జంపా.న్యూజీలండ్..విలియమ్సన్ (కెప్టెన్), ఫిన్ అలెన్, చాప్మన్, గ్లెన్ ఫిలిప్స్, బ్రేస్‌వెల్, మిచెల్, నీషమ్, రచిన్ రవీంద్ర, సాన్‌ట్నర్, డెవాన్ కాన్వే, బౌల్ట్, ఫెర్గూసన్, హెన్రీ, ఇష్ సోధి, సౌతీ.పాకిస్తాన్..బాబర్ ఆజమ్ (కెప్టెన్), ఫఖర్ జమాన్, సయీమ్ ఆయూబ్, ఇఫ్తికార్ అహ్మద్, ఆఘా సల్మాన్, ఇమాద్ వసీమ్, ఇర్ఫాన్ ఖాన్, షాదాబ్ ఖాన్, మొహమ్మద్ రిజ్వాన్, హారిస్ రవూఫ్, ఆమిర్, నసీమ్ షా, షాహిన్ అఫ్రిది, అబ్రార్ అహ్మద్, ఆజమ్ ఖాన్.శ్రీలంక..హసరంగ (కెప్టెన్), నిసాంక, అసలంక, ధనంజయ డిసిల్వా, ఏంజెలో మాథ్యూస్, కామిందు మెండిస్, షనక, వెల్లలాగె, కుశాల్ మెండిస్, సమరవిక్రమ, చమీర, మధుషంక, పతిరణ, తీక్షణ, నువాన్ తుషారా.వెస్టిండీస్..రోవ్‌మన్ పావెల్ (కెప్టెన్), హెట్‌మైర్, బ్రాండన్ కింగ్, రూథర్‌ఫర్డ్, రోస్టన్ ఛేజ్, రసెల్, హోల్డర్, జాన్సన్ చార్లెస్, నికోలస్ పూరన్, అల్జారి జోసెఫ్, షమర్ జోసెఫ్, రొమారియో ఫెఫర్డ్, అకీల్ హొసెన్, గుడకేశ్ మోతీ.బంగ్లాదేశ్..నజ్ముల్ హొస్సేన్ (కెప్టెన్), షకీబ్ అల్ హసన్, సౌమ్య సర్కార్, తన్జిద్, తౌహిద్ హృదయ్, మహ్ముదుల్లా, మెహదీ హసన్, లిటన్ దాస్, జకీర్ అలీ, తస్కిన్ అహ్మద్, తన్వీర్ అస్లాం, రిషాద్ హొస్సేన్, ముస్తఫిజుర్, షోరిఫుల్ ఇస్లాం, తన్జిమ్.నేదర్లండ్స్..స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్), మాక్స్ ఒడౌడ్, తేజ నిడమనూరు, విక్రమ్‌జిత్ సింగ్, సైబ్రాండ్, లెవిట్, బస్ డి లీడి, టిమ్ ప్రింగిల్, వెస్లీ బరెసి, లొగాన్ వాన్ బీక్, ఆర్యన్ దత్, ఫ్రెడ్ క్లాసెన్, డేనియల్ డోరమ్, మికెరెన్, వివియన్ కింగ్మా.ఐర్లండ్..పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), రోస్ అడెర్, బల్బీర్నీ, టెక్టర్, డెలానీ, కాంఫర్, డాక్రెల్, నీల్ రాక్, టకర్, మార్క్ అడెర్, హ్యూమ్, జాషువా లిటిల్, మెకార్తీ, క్రెయిగ్ యంగ్, బెంజమిన్ వైట్.కెనడా..సాద్ బిన్ జఫర్ (కెప్టెన్), నవ్‌నీత్ ధలీవాల్, ఆరన్ జాన్సన్, మొవ్వ శ్రేయస్, రవీందర్‌పాల్ సింగ్, కన్వర్పాల్, దిల్‌ప్రీత్ బాజ్వా, పర్గత్ సింగ్, రయాన్ పఠాన్, హర్ష్ ఠాకెర్, జెరెమి జోర్డాన్, డిలాన్ హెలిగర్, కలీమ్ సనా, జునైద్ సిద్దిఖి, నికోలస్ కీర్టన్.నమీబియా..గెరార్డ్ ఎరాస్మస్ (కెప్టెన్), డావిన్, జేన్ గ్రీన్, కోట్జీ, మలాన్ క్రుగెర్, లీచెర్, స్మిట్, ఫ్రయ్‌లింక్, లింజెన్, డేవిడ్ వీస్, బ్లిగ్నాట్, జేక్ బ్రాసెల్, లుంగామెని, షాల్ట్జ్, షికోంగో, ట్రంపెల్మన్.అఫ్గానిస్తాన్..రషీద్ ఖాన్ (కెప్టెన్), ఇబ్రహీమ్ జద్రాన్, నజీబుల్లా జద్రాన్, నాంగ్యాల్ ఖరోటి, అజ్మతుల్లా ఒమర్జాయ్, నబీ, గుల్బదిన్, కరీమ్ జనత్, రహ్మానుల్లా గుర్బాజ్, ఇషాక్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, నవీనుల్ హక్, ఫజల్హక్ ఫారూఖి, ఫరీద్ అహ్మద్ మాలిక్, నూర్ అహ్మద్.నేపాల్..రోహిత్ పౌడెల్ (కెప్టెన్), ఆసిఫ్ షేక్, దీపేంద్ర సింగ్, కుశాల్ భుర్తెల్, సందీప్ జోరా, కరణ్, కుశాల్ మల్లా, ప్రాతిస్, అనిల్ సాహ్, సోంపాల్ కామి, అభినాష్ బొహరా, గుల్షన్ జా, లలిత్ రాజ్‌బన్షీ, కమాల్ ఐరీ, సాగర్ ఢకాల్.ఒమన్..అకీబ్ ఇలియాస్ (కెప్టెన్), ప్రతీక్ అథవాలె, ఖాలిద్, మెహ్రాన్ ఖాన్, నసీమ్, కశ్యప్ ప్రజాపతి, షోయబ్ ఖాన్, జీషాన్ మక్సూద్, అయాన్ ఖాన్, నదీమ్, బిలాల్ ఖాన్, ఫయాజ్, కలీముల్లా, షకీల్ అహ్మద్, రఫీయుల్లా.పపువా న్యూ గినీ..అసద్ వాలా (కెప్టెన్), సెసె బావు, కిప్లిన్, హిరి హిరి, లెగా సియాక, టోనీ ఉరా, చార్లెస్ అమిని, సెమో కమెయి, జాన్ కరికో, కబువా, అలె నావో, చాద్ సోఫెర్, నార్మన్ వనువా, జేక్ గార్డెనర్, హిలా వరె.స్కాట్లండ్..రిచీ బెరింగ్టన్ (కెప్టెన్), మాథ్యూ క్రాస్, మైకేల్ జోన్స్, జార్జి మున్సే, లీస్క్, మెక్‌ములెన్, గ్రెవెస్, జార్విస్, షరీఫ్, క్రిస్ సోల్, మార్క్ వాట్, బ్రాడ్ వీల్, ఒలీ కార్టర్, బ్రాడ్లీ కరీ, చార్లీ టియర్.ఉగాండా..బ్రియాన్ మసాబా (కెప్టెన్), ఫ్రెడ్ అచెలమ్, దినేవ్ నక్రాని, అల్పేష్ రాంజానీ, కెన్నెత్ వైస్వా, బిలాల్ హసన్, కాస్మస్, రియాజత్ అలీషా, జుమా మయాగి, రోజర్ ముకాసా, ఫ్రాంక్ నుసుబుగా, రాబిన్సన్ ఒబుయా, రోనక్ పటేల్, హెన్రీ సెన్యోండో, సిమోన్ సెసాజి.అమెరికా..మోనాంక్ పటేల్ (కెప్టెన్), ఆరోన్ జోన్స్, ఆండ్రీస్ గౌస్, నితీశ్ కుమార్, షాయన్ జహంగీర్, స్టీవెన్ టేలర్, కోరె అండర్సన్, హర్మీత్ సింగ్, మిలింద్ కుమార్, నిసర్గ్ పటేల్, షాడ్లీ, హసన్ అలీఖాన్, జెస్సీ సింగ్, నోస్తుష్ కెంజిగె, సౌరభ్ నేత్రావల్కర్.వందల్లో ‘ఒక్కడు’... ప్లేయర్ ఆఫ్ ద సిరీస్...బరిలో డజను కంటే ఎక్కువ జట్లు.. 200 మంది కంటే ఎక్కువ ప్లేయర్లు.. చివరకు ఒక జట్టే విజేత.. టోర్నీ ఆసాంతం నిలకడగా రాణిస్తూ తమ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించే వారుంటారు.. కొన్నిసార్లు వీరి ప్రదర్శన ఆయా జట్లను అందలాన్ని ఎక్కిస్తుంది.. లేదంటే టైటిల్‌కు చేరువ చేస్తుంది.. తుది ఫలితాలతో సంబంధం లేకుండా ఒకే ఒక్కడికి ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ రూపంలో పురస్కారం వరిస్తుంది. ఇప్పటి వరకు 8 సార్లు టి20 ప్రపంచకప్ జరగ్గా.. మూడుసార్లు మాత్రమే విజేత జట్టు నుంచి ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ పురస్కారం అందుకున్నవారున్నారు. వారి వివరాలు క్లుప్తంగా..2007షాహిద్ అఫ్రిది (పాకిస్తాన్)దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన తొలి టి20 ప్రపంచకప్ టోర్నీలో పాకిస్తాన్ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిదికి ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు లభించింది. ఈ టోర్నీలో పాకిస్తాన్ ఫైనల్లో భారత్ చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. ఓవరాల్‌గా ఈ టోర్నీలో అఫ్రిది 91 పరుగులు సాధించడంతోపాటు 12 వికెట్లు పడగొట్టాడు.2010కెవిన్ పీటర్సన్ (ఇంగ్లండ్)ఏడాది తిరగకుండానే మూడో టి20 ప్రపంచకప్ జరిగింది. వెస్టిండీస్ ఆతిథ్యమిచ్చింది. ఇంగ్లండ్ జట్టు తొలిసారి చాంపియన్‌గా అవతరించింది. ఇంగ్లండ్ బ్యాటర్ కెవిన్ పీటర్సన్ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు సొంతం చేసుకున్నాడు. మొత్తం ఆరు మ్యాచ్‌లు ఆడిన పీటర్సన్ 243 పరుగులు సాధించాడు. ఇందులో రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి.2009 తిలకరత్నే దిల్షాన్ (శ్రీలంక)ఇంగ్లండ్‌లో జరిగిన రెండో ప్రపంచకప్‌లో శ్రీలంక బ్యాటర్ తిలకరత్నే దిల్షాన్ నిలకడగా రాణించాడు. టోర్నీ మొత్తంలో ఏడు మ్యాచ్‌లు ఆడిన దిల్షాన్ మూడు అర్ధ సెంచరీల సహాయంతో మొత్తం 317 పరుగులు సాధించి ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ పురస్కారం గెల్చుకున్నాడు. ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో ఓడిపోయి శ్రీలంక రన్నరప్‌గా నిలిచింది.2012షేన్ వాట్సన్ (ఆస్టేలియా)శ్రీలంకలో జరిగిన నాలుగో టి20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్ జట్టు తొలిసారి చాంపియన్‌గా అవతరించింది. ఫైనల్లో ఆతిథ్య శ్రీలంక జట్టును వెస్టిండీస్ ఓడించింది. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు లభించింది. ఈ టోర్నీలో వాట్సన్ 249 పరుగులు చేయడంతోపాటు 11 వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియా జట్టు సెమీఫైనల్ చేరేందుకు దోహదపడ్డాడు. సెమీఫైనల్లో వెస్టిండీస్ చేతిలో ఆస్ట్రేలియా ఓడిపోయింది.2014 విరాట్ కోహ్లీ (భారత్)వరుసగా రెండోమారు టి20 ప్రపంచకప్ ఆసియాలోనే జరిగింది. బంగ్లాదేశ్ ఈ మెగా టోర్నీకి తొలిసారి ఆతిథ్యమిచ్చింది. ఫైనల్లో భారత జట్టును ఓడించి శ్రీలంక జట్టు తొలిసారి చాంపియన్‌గా నిలిచింది. విరాట్ కోహ్లీ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు సంపాదించాడు. ఆరు మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ నాలుగు అర్ధ సెంచరీల సహాయంతో మొత్తం 319 పరుగులు సాధించి ‘టాప్ స్కోరర్’గా నిలిచాడు.2016 విరాట్ కోహ్లీ (భారత్)వరుసగా మూడోమారు టి20 ప్రపంచకప్ ఆసియాలోనే జరిగింది. ఆరో టి20 ప్రపంచకప్‌కు తొలిసారి భారత్ వేదికయింది. వెస్టిండీస్ జట్టు రెండోసారి చాంపియన్‌గా నిలిచింది. సెమీఫైనల్లో వెస్టిండీస్ చేతిలో భారత్ ఓడిపోయింది. విరాట్ కోహ్లీ వరుసగా రెండో ప్రపంచకప్‌లోనూ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు కైవసం చేసుకున్నాడు. ఐదు మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ మూడు అర్ధ సెంచరీల సహాయంతో మొత్తం 273 పరుగులు సాధించాడు.2021డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా)రెండేళ్లకోసారి జరిగే టి20 ప్రపంచకప్ టోర్నీకి ఈసారి ఐదేళ్ల విరామం వచ్చింది. 2020లో భారత్ వేదికగా ఏడో టి20 ప్రపంచకప్ జరగాల్సింది. అయితే కరోనా మహమ్మారి కారణంగా ఈ టోర్నీ ఒక ఏడాది వాయిదా పడింది. 2021లో ఒమన్–యూఏఈ సంయుక్తంగా ఈ టోర్నీకి ఆతిథ్యమిచ్చాయి. ఫైనల్లో న్యూజీలండ్ను ఓడించి ఆస్ట్రేలియా తొలిసారి టి20 విశ్వవిజేతగా నిలిచింది. ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఏడు మ్యాచ్‌లు ఆడి మూడు అర్ధ సెంచరీలతో కలిపి మొత్తం 289 పరుగులు సాధించి ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు గెల్చుకున్నాడు.2022స్యామ్ కరన్ (ఇంగ్లండ్)ఏడాది తిరిగేలోపు ఎనిమిదో టి20 ప్రపంచకప్ టోర్నీకి ఆస్ట్రేలియా తొలిసారి ఆతిథ్యమిచ్చింది. ఫైనల్లో పాకిస్తాన్‌ను ఓడించి ఇంగ్లండ్ జట్టు రెండోసారి చాంపియన్‌గా నిలిచింది. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ స్యామ్ కరన్ బంతితో మెరిపించి ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు సొంతం చేసుకున్నాడు. స్యామ్ కరన్ ఆరు మ్యాచ్‌లు ఆడి 13 వికెట్లు పడగొట్టాడు.టోర్నీ ఫార్మాట్..మొత్తం 20 జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. ఒక్కో గ్రూప్‌లో ఐదు జట్లు ఉన్నాయి. ప్రతిజట్టూ తమ గ్రూప్‌లో ఉన్న మిగతా నాలుగు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. పాయింట్లపరంగా ప్రతిగ్రూప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు (మొత్తం 8) తర్వాత దశ సూపర్ ఎయిట్‌కు అర్హత సాధిస్తాయి. ఇక్కడ టీమ్‌లను రెండు గ్రూప్‌లుగా విభజిస్తారు. ప్రతిటీమ్ తన గ్రూప్‌లో ఉన్న మిగతా 3 జట్లతో తలపడుతుంది. టాప్–2 టీమ్స్ సెమీఫైనల్‌కు చేరతాయి. సెమీఫైనల్లో గెలిచిన రెండు జట్లు టైటిల్ కోసం ఫైనల్లో తలపడతాయి.గ్రూప్‌ల వివరాలు..గ్రూప్-ఎభారత్, పాకిస్తాన్, ఐర్లండ్, కెనడా, అమెరికా.గ్రూప్-బిఆస్ట్రేలియా, ఇంగ్లండ్, స్కాట్లండ్, ఒమన్, నమీబియా.గ్రూప్-సివెస్టిండీస్, న్యూజీలండ్, అఫ్గనిస్తాన్, ఉగాండా, పపువా న్యూగినీ.గ్రూప్-డిశ్రీలంక, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, నేదర్లండ్స్, నేపాల్.టి20 వరల్డ్‌కప్ షెడ్యూల్ బ్రిడ్జ్‌టౌన్ గ్రౌండ్ ఫైనల్ మ్యాచ్ వేదిక..– మొహమ్మద్ అబ్దుల్ హాది, కరణం నారాయణ -
Short Story: ఒకనాడు ఆ రాక్షసుడు నర్మదా తీరంలో..
ఒకానొకప్పుడు సౌరాష్ట్రంలో ఒక క్షత్రియుడు ఉండేవాడు. బతికినంత కాలం ప్రజలను పీడించుకు తిన్నాడు. నిస్సహాయులైన ప్రజలు అతడిని నేరుగా ఏమీ అనలేక లోలోపలే అతడిని తిట్టుకునేవారు. అతడి ప్రస్తావన వస్తేనే చాలు, చీత్కరించుకునేవారు. జన్మలో ఎలాంటి పుణ్యకార్యం చేయని ఆ క్షత్రియుడు కాలం తీరి మరణించాడు. పూర్వజన్మ పాపకర్మల ఫలితంగా బ్రహ్మరాక్షసుడిగా జన్మించాడు.నర్మదానది పరిసరాల్లోని అడవుల్లో దొరికిన జీవిని దొరికినట్లే తింటూ తిరుగుతుండేవాడు. పొరపాటున ఆ అడవిలోకి మనుషులు ఎవరైనా అడుగుపెడితే వారిని కూడా తినేస్తూ నరమాంస భక్షకుడిగా మారాడు. బ్రహ్మరాక్షసుడి ధాటికి భయపడి మనుషులు ఆ అడవిలోకి అడుగుపెట్టడమే మానుకున్నారు. ఒకనాడు ఆ రాక్షసుడు నర్మదా తీరంలో తపస్సు చేసుకుంటున్న మునీశ్వరుడి ఆశ్రమానికి వచ్చాడు. నరమాంసం తిని చాలారోజులు కావడంతో ఆ బ్రహ్మరాక్షసుడు మునీశ్వరుడిని ఎలాగైనా తినేయాలని అనుకున్నాడు. అయితే, మంత్ర యోగ విద్యల్లో ఆరితేరిన ఆ మునీశ్వరుడు సామాన్యుడు కాదు. బ్రహ్మరాక్షసుడి ప్రయత్నాన్ని గ్రహించి, మహా మహిమాన్వితమైన విష్ణుపంజర స్తోత్రాన్ని పఠించడం ప్రారంభించాడు. స్తోత్ర ప్రభావంతో బ్రహ్మరాక్షసుడు మునీశ్వరుడిని సమీపించ లేకపోయాడు. అయినా, ఆశ చావని బ్రహ్మరాక్షసుడు అదను చూసుకుని మునీశ్వరుడిని తినేయాలనుకుని, ఆశ్రమం బయటే కాచుకుని ఉన్నాడు. అలా నాలుగు నెలలు గడచిపోయాయి. అన్నాళ్లు వేచి చూడటంతో బ్రహ్మరాక్షసుడి శక్తి క్షీణించింది. శరీరం నీరసించింది. అడుగు వేసే ఓపిక లేక అతడు అక్కడే కూలబడిపోయాడు. ధ్యానం నుంచి లేచిన మునీశ్వరుడు ఆశ్రమం వెలుపల కూలబడిన రాక్షసుడిని చూశాడు. అతడిపై జాలిపడ్డాడు. నీరసించిన రాక్షసుడు నెమ్మదిగా పైకిలేచి, ఓపిక తెచ్చుకుని ‘మహాత్మా! నేను ఎన్నో పాపాలు చేశాను. అడవిలో తిరుగాడే జంతువులనే కాదు, అడవిలోకి అడుగుపెట్టిన ఎందరో మనుషులను కూడా చంపి తిన్నాను. నా పాపాలు తొలగిపోయే మార్గం చెప్పండి’ అని దీనంగా ప్రార్థించాడు.‘ఓయీ రాక్షసా! నేను నరమాంసభక్షకులకు ఉపదేశం చేయను. పాపోపశమన మార్గం ఎవరైనా విప్రులను అడిగి తెలుసుకో! ముందుగా నువ్వు నరమాంసభక్షణ మానేయి’ అని చెప్పి మునీశ్వరుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. బ్రహ్మరాక్షసుడు ఆనాటి నుంచి మనుషులను చంపి తినడం మానేశాడు. కేవలం వన్యమృగాలను మాత్రమే వేటాడి, వాటిని చంపి తింటూ, తన పాపాలు ఎలా తొలగిపోతాయా అని చింతిస్తూ ఉండసాగాడు. కొద్దిరోజులు రాక్షసుడికి అడవిలో ఆహారం దొరకలేదు. ఆకలితో ఉన్న బ్రహ్మరాక్షసుడు ఆహారాన్వేషణ కోసం అడవికి వచ్చాడు. ఎంతసేపు ప్రయత్నించినా ఒక్క జంతువైనా దొరకలేదు. మధ్యాహ్నం కావస్తుండగా రాక్షసుడికి ఆకలి బాగా పెరిగింది. సరిగ్గా అదే సమయానికి ఒక బ్రాహ్మణ యువకుడు పండ్లు కోసుకోవడానికి అడవిలోకి వచ్చాడు.ఆకలి తీవ్రత పెరగడంతో బ్రహ్మరాక్షసుడు తన పూర్వ నియమాన్ని పక్కనపెట్టి, బ్రాహ్మణ యువకుడిని భక్షించి ఆకలి తీర్చుకోవాలని భావించాడు. ఒక్క ఉదుటన అతడి వద్దకు చేరుకుని, అతడిని ఒడిసి పట్టుకున్నాడు. ఈ హఠాత్పరిణామానికి బ్రాహ్మణ యువకుడు భయభ్రాంతుడయ్యాడు. రాక్షసుడి చేతిలో ఎలాగూ చావు తప్పదనే నిశ్చయానికి వచ్చిన బ్రాహ్మణ యువకుడు ‘ఓయీ రాక్షసా! నన్ను ఎందుకు పట్టుకున్నావో చెప్పు. నువ్వు నన్ను వదలాలంటే నేనేం చేయాలో చెప్పు’ అని అడిగాడు.‘ఓరీ మానవా! నేను నరమాంస భక్షకుడిని. వారం రోజులుగా నాకు ఆహారం దొరకలేదు. చివరకు నువ్వు దొరికావు. నిన్ను విడిచిపెడితే నాకు ఆకలి ఎలా తీరుతుంది?’ అన్నాడు. ‘రాక్షసా! నేను మా గురువుగారికి ఆహారంగా ఫలాలు తీసుకుపోవడానికి వచ్చాను. నీకు ఆహారమవడానికి నాకు అభ్యంతరమేమీ లేదు. కొద్దిసేపు గడువిస్తే నేను ఈ ఫలాలను నా గురువుగారికి ఇచ్చి వస్తాను’ అన్నాడు బ్రాహ్మణ యువకుడు. ‘దొరక్క దొరక్క దొరికావు. నిన్ను విడిచిపెట్టాక నువ్వు తిరిగి రాకపోతే నా గతేమిటి? అయితే, ఒక పని చేశావంటే నిన్ను విడిచిపెడతాను. నేను ఇంతవరకు చాలా పాపాలు చేశాను. జాలి దయ లేకుండా ఎందరో మనుషులను చంపి తినేశాను. నా పాపాల నుంచి విముక్తి పొందే మార్గం చెప్పావంటే నిన్ను తినకుండా వదిలేస్తాను’ అన్నాడు.బ్రాహ్మణ యువకుడికి ఏమీ తోచలేదు. చివరకు తాను నిత్యం పూజించే అగ్నిదేవుడిని స్మరించుకున్నాడు. అతడి ప్రార్థనకు అగ్నిదేవుడు స్పందించాడు. అతడికి సాయం చేయమని సరస్వతీదేవిని కోరాడు. అగ్ని కోరిక మేరకు సరస్వతీదేవి బ్రాహ్మణ యువకుడికి మాత్రమే కనిపించి, ‘నాయనా భయపడకు. నీ నాలుక మీద నిలిచి ఒక దివ్యస్తోత్రాన్ని పలికిస్తాను. అది విన్న రాక్షసుడు నిన్ను విడిచిపెడతాడు’ అని చెప్పింది.సరస్వతీదేవి మాటతో ధైర్యం తెచ్చుకున్న బ్రాహ్మణ యువకుడు ‘ఓయీ రాక్షసా! నేనిప్పుడు ఒక దివ్యస్తోత్రం వినిపిస్తాను. ఈ స్తోత్రాన్ని త్రికాలాల్లోనూ పఠించావంటే, నీ సమస్త పాపాలూ నశించి, తుష్టి, పుష్టి, శాంతి కలుగుతాయి’ అని చెప్పి తన నోట నిలిచిన సరస్వతీదేవి అనుగ్రహంతో విష్ణుసారస్వత స్తోత్రాన్ని ఆశువుగా పఠించాడు.బ్రాహ్మణ యువకుడు దివ్యస్తోత్రాన్ని బోధించగానే బ్రహ్మరాక్షసుడు ఎంతో సంతోషించి, అతడిని తినకుండా వదిలేశాడు. బ్రాహ్మణ యువకుడు రాక్షసుడికి నీతులు బోధించి తన ఆశ్రమానికి వెళ్లిపోయాడు. – సాంఖ్యాయనఇవి చదవండి: Sunday Story: 'ఎట్టా సచ్చిపోయినాడురా బంద నాగన్న'! -
Sunday Story: 'ఎట్టా సచ్చిపోయినాడురా బంద నాగన్న'!
‘ఎట్టా సచ్చిపోయినాడురా బంద నాగన్న, నిన్నటి దాంక బిస్సగా ఉండ్య?’ అని పెద్దింటి మనిషిని అడిగాడు తగ్గుబజారు మనిషి. మాటలు వినపడేంత దూరంలోనే యేటి తగ్గున దొడ్డికి కూచ్చోని మాట్లాడుకుంటున్నారిద్దరూ. ప్రొక్లెయినర్‌తో ఏటి గట్టునున్న కంప ఉన్న కంపచెట్లను పీకించేసరికి వరిమళ్లు నున్నగా కనపడతున్నాయి. చింతట్టు మీంద నుంచి తెల్ల కొంగల గుంపొకటి వరిమళ్లల్లోకి దిగింది. గుడ్ల మాడి ఇంటి బరుగోళ్ళు యేట్లో సల్లగా పనుకొని నెమురేచ్చా ఉండాయి.బీడీ పొగ గాల్లోకి ఊత్తా ‘నిన్న పెత్తల్ల అమాస గదరా.. కేజీ మటన్, సీపు లిక్కర్ తెచ్చుకున్యాడంట, ఒక్కడే తిని తాగి సచ్చినాడు. ఉబ్బరం పట్టకల్యాక నిద్రలోనే గుండె పట్టుకుందంటా. మంచి సావు సచ్చినాడులే ముసిలోడు’ అన్యాడు పెద్దింటి మనిషి. ‘ఎంత సావొచ్చరా వానికి, డెబ్బై ఏళ్ళు వొచ్చినా మనిషి తుమ్మసెక్క ఉన్యట్టు ఉండ్య’ అనుకుంటా ఇద్దరూ ఒకేపారి లేసి యేట్లోకి పోయివచ్చినారు. ‘తొందర పోదాం పారా, ఎత్తేలోపే ఒకసారి సూసోద్దామ’ని ఊళ్ళోకి దావ పట్టినారు. ముసిలోల్లు, సావాసగాళ్లు అందరూ నాగన్నను సూన్నీకి పోతనారు. యాపసెట్టు కొమ్మల మద్దే నుంచి పడ్తన్య ఎండలో నాగన్నను రగ్గు మీంద పండుకోబెట్టినారు. తలాపున ఊదిగడ్లు పట్టుకుని కూచ్చోని ఉంది నడిపి కోడలు. వచ్చినోళ్లకు నీళ్ళు, కాపీ అందించా సేలాకీగా ఉంది సిన్న కోడలు. మొగుని కాళ్ళ కాడ కూచ్చోని ‘మటన్ కూరాకు, మటన్ కూరాకు అని కలవరిచ్చా ఉన్యాడు మూడు దినాల నుంచి. ఉన్నది అంత తిని సచ్చిపోయే గదరా’ అని ఏడుచ్చాంది నాగన్న పెళ్ళాం. నాగన్న మొఖం సచ్చిపోయినాంక గూడా కళతోనే ఉంది. వచ్చినోళ్ళు అందరూ దాని గురించే మాట్టాడుకుంటా పోతనారు. నాగన్న సిన్నకొడుకు మాటికి ఒకసారి ఇంట్లోకి పోయొచ్చా మూతి తుడుసుకుని వాళ్ళ నాయనను తలుసుకుని కుమిలిపోతనాడు. మిగిలిన ఇద్దరు కొడుకులు తలకాయ న్యాలకేసి నిలబన్యారు. మనువళ్లు మిగతా పనులు సూసుకుంటా ఉండారు. ఊరు సర్పంచు సెండుమల్లె దండ నాగన్న మీందేసి ఒక పక్కన నిలబడి ‘ఎట్టి మాలోళ్లకు సెప్పినారా?’ అని పెద్దరికం నిరూపించుకున్యాడు. నాగన్న పెద్దకొడుకు ముందుకొచ్చి ‘మా పిల్లోల్లు సెప్పనీకి పోయినారు సామీ’ అన్యాడు. ఇంతలోనే ఊరి నుంచి కూతురు ఏడ్సుకుంటా వచ్చి వాళ్ళ నాయన మీంద పడింది. పెద్దింటి మనిషి, తగ్గుబజారు మనిషి ఇద్దరూ గూడా నాగన్న మొఖం దిక్కు సూసి ఒక పక్కన నిలబన్యారు.కోపంగా ఇంటికాడ బగ్గి ఆపి దిగినారు నాగన్న మనువళ్లు. యాప సెట్టు మీందున్న కాకులు అరుసుకుంటా పైకి లేసినాయి. శాంచేపు నుంచి గాడిపాట్లో ఉండే బరుగోళ్ళు రెండు కొట్టుకుంటా ఉండాయి. వాళ్ళ నాయన కాడికి వచ్చి ‘ఈరన్న గుంత తియ్యనీకి రాడంట’ అన్యారు. ఆడ ఉన్య అందరూ వచ్చినోళ్ల దిక్కేమొఖం పెట్టినారు. ‘ఏంటికి?’ అని అడిగినాడు నాగన్న పెద్దకొడుకు.‘ఏమో నాయన! ఏం ఏంటికి గుంత తియ్యవు అని అడిగితే ఏం పలకల్యా.’ ‘ఏం వానికి పొగరు ఎక్కిందంటనా’ అన్యాడు పసిడెంట్. ‘లెక్క జాచ్చి ఇయ్యాలేమో లేరా’ అన్యాడు నిలబన్య పెద్దమనిషి. ‘ఆడికి అది గూడా సెప్పినాం మామా, నీ లెక్క నా పుల్లాతుకు సమానమని ఎచ్చులు పోయినాడు.’‘బలసినట్టు ఉందే.. ఎవరు అనుకోని మాట్టాడ్తానాడంట? కాళ్ళు ఇర్సాలేమో’ అని మీసం తిప్పినాడు నాగన్న నడిపి కొడుకు. ‘ఒర్యా నడిపే.. ఇది కొట్టాట టైమ్ కాదు.. వాని అవసరం మనది. నువ్వు మీయన్న పోయి మాట్టాడి రాపోరి’ అన్యారు రొంత మంది. కొడుకులు ఆలోచనలో పన్యారు. ‘ఇంగో ఇద్దరూ పెద్ద మనుషులు గూడా పోరి’ అన్యాడు పసిడెంట్. గుంత తీసే ఈరన్నను తిట్టుకుంటా పోయినారు నలుగురు.‘ఏం వచ్చి సచ్చింది గుంత తీనీకి పోయే.. లెక్కన్నా వచ్చాది. పెద్ద మాంసం తెచ్చుకుందాం’ అంది మంచంలో నెత్తి దూక్కుంటా ఈరన్న పెళ్ళాం. ఇంటి పక్కన ఉన్య కానుగ సెట్టు కింద కూచ్చోని హరిశ్చంద్ర పద్యం పాడుకుంటా తాడు పేన్తా ఉండాడు ఈరన్న. ‘వీళ్ళ బజార్లు బాగుంటాయి ప్పా.. నీట్‌గా ఉండాయి సూడు.. మన బజార్లు సచ్చినాయి ఎప్పుడూ సూసినా కుళాయి నీళ్ళు పార్త బురద బురద ఉంటాయి’ అన్యాడు నాగన్న కొడుకులతో పాటు వచ్చన్య మొదటి పెద్దమనిషి.ఆయన సెప్పినట్టే రోడ్డుకు రెండేపులా సెట్లు ఏపుగా పెరిగి ఉండాయి. ఎండ భూమి మీందకు దిగకుండా ఉంది. ఇంటి దిక్కే వచ్చన్య నలుగురును సూసి మంచం మీంద నుంచి దిగి నమస్కారం సేసింది ఈరన్న పెళ్ళాం. ఈరన్న ఏం పలకనట్టు కూచ్చున్యాడు. హరిశ్చంద్ర పద్దెం గొంతు పెంచి అందుకున్యాడు. జనం రొంత గుంపు అయినారు. ‘ఈరన్న.. ఓ ఈరన్న’ అని పిల్సినాడు నాగన్న పెద్దకొడుకు. ‘ఎవరోళ్ళు..’ అన్యాడు ఈరన్న. ‘బంద నాగన్న కొడుకులం’ అన్యాడు నాగన్న నడిపి కొడుకు. ‘సెప్పండి సామీ’ అని అరుగు దిగినాడు. ‘సెప్పనీకి ఏం ఉంది ఈరన్న.. నాగన్న సచ్చిపోయినాడు తెల్దా ఏందీ?’ అన్యాడు రెండో పెద్దమనిషి. ‘తెల్సు సామీ!’ ‘మరేందీ ఈరన్న.. పిల్లోల్లు వచ్చే గుంత తియ్యవనీ సెప్పినావంట?’‘అవును తియ్యను సామీ.’‘యేంది ఈరన్న.. ఏం కావాలా సెప్పు? ఐదు వేలు లెక్క.. రెండు కోటర్లు మందు ఇచ్చాం రా.. టైమ్ ఐపోతాందీ’ అన్యాడు నడిపి కొడుకు. ‘నాకు పదివేలు ఇచ్చినా గుంత తీయను’ అని తెగేసి సెప్పినాడు ఈరన్న. ‘ఏం ఎందుకు ఈరన్న.. మా తాత సచ్చిపోయినప్పుడు నువ్వే గదా తీసినావ్? మా పెద్దనాయన సచ్చిపోయినప్పుడు నువ్వే తీసినావ్? మా ఇల్లు నీకే కదా.’ ‘అవ్ వాళ్ళందరివి తీసిన. రేప్పొద్దున మీలో ఎవరు సచ్చినా గుంత తీచ్చా, కానీ ఈ గుంత తియ్యను.’భుజం మీందున్న టువాలా సర్దుకుంటూ ‘యేందిబీ.. మాటలు యాడికో పోతనాయి. రొంత సూసుకొని మాట్టాడు’ అన్యారు పెద్దమనుషులు. ‘సూడు అయ్యా.. నా మాటలు యాటికి పోలా. నేను గుంత తియ్యను. నన్ను యిడ్సిపెట్టండి.’‘ఏమైందో సెప్పమంటే ఇకారాలు పోతనాడు, ఈడు రాకపోతే వేరేవాళ్ళు రారా యేంది. వాళ్ళను పిల్సుకొని పోదాం’ అన్యాడు నడిపి కొడుకు. ‘ఆ... అట్నే పోండి సామీ’ అని తాడు పేనే పనిలో పడ్డాడు ఈరన్న. మెత్తగా ‘పెద్దోళ్ళు వచ్చినారు, పోకూడదా’ అంది ఈరన్న పెళ్ళాం.‘నీ యమ్మ నిన్ను నరికి, ఈన్నే గుంత తీసి పూడుచ్చా అతికేం మాట్టాన్యావంటే’ అని ఒంటి కాలు మీంద పెళ్ళాం పైకి లేసినాడు ఈరన్న. ‘నీ దినం కూడు కుక్కలు తినా. ఏమన్యానని నా మీందకు వచ్చనావు? పోయేకాలం వచ్చిందిలే నీకు. పెద్దోళ్ళతో పెట్టుకుంటనావు’ అని తిట్టుకుంటా మంచంలో మళ్ళా కూచ్చుంది.నలుగురు ఎదురుగా ఉన్య ఇంటి కాడికి పోయి నిలబన్యారు. ‘అయ్యా.. ఆ ఈరన్న గానీ ఇల్లుకు మేము పోయినామంటే.. వాడు తాగి అమ్మనక్కను తిడ్తాడు. వాన్తో మాకు కొట్టాట వొద్దు అయ్యా.. వానికి ఏం కావాలో ఇచ్చి వాణ్ణే పిల్సుకొని పోండి’ అన్యాడు ఈరన్న ఎదిరింటి మనిషి.రొంత దూరంలో నిలబన్య ఈరన్న అన్న కొడుకు కెళ్ళి సూసేసరికి వాడు సేసేది ఏంల్యాక తలకాయ దించుకున్యాడు. సెప్పనీకి సూసినా వాళ్ళ మనుషుల మీంద మాటలతో పెద్దపులి పడినట్టు పన్యాడు ఈరన్న. ఎవ్వరూ గూడా నోరెత్తల్యా. సెవులూ కొట్టుకుంటా వెనక్కి పోయినారు నలుగురూ. ఈరన్న పెళ్ళాం భయపడ్తా మొగుని దగ్గరకొచ్చాంటే సింత నిప్పుల మాదిరి ఉన్య ఈరన్న కళ్ళు సూసి దూరం నిలబడి జరగబోయేది తలుసుకొని బిత్తర సూపులు సూచ్చాందినాగన్న తలకాయ కాడ ఉన్య బియ్యం గ్లాసులో కొత్త ఊదిగడ్లు నుంచి పొగ దట్టంగా లేచ్చా అప్పుడే లేపిన షామియానాను తాకుతాంది. రెండు మూడు కొత్త పూల దండలతో నాగన్న మొఖం యింగా వెలిగిపోతాంది. గాడిపాడు ఖాళీ అయ్యింది. ‘వాడు రాడంట!’ అని నలుగురు తలకాయలు దించుకున్యారు. ‘ఆ నావట్టకు ఏం పోయేకాలం వచ్చిందో సూడు క్కా’ అని పక్కన కూచున్య బండకాడ కూరగాయాల ఆమెతో బంకామె కళ్ళు పెద్దవి సేసి సెప్పింది. ‘వాడు ల్యాకపోతే ఏంది? వేరే వాళ్లు లేరా’ అన్యాడు పసిడెంట్. ‘వాని దెబ్బకు ఎవరూ రాకుండా ఉండారు.’నాగన్న పెళ్ళాం ఏడుపు యాపసెట్టు అంతా అయింది. ఉన్య రెండు మూడు కాకులు గూడా ఎగిరిపోయినాయి. ‘ఎంత సేపు పెడ్తార్రా.. వాణ్ని పిల్సి ఈపు పగలగొట్టకుండా? ఇదే మా ఊర్లో అయ్యింటే బొడ్డాలు పగలగొట్టే వాళ్ళం. పెద్దమనుషులు ఉండారా? మా మామతో పాటు సచ్చినారా’ అన్యాడు సావు సూన్నీకి వచ్చిన సుట్టం.అది యిన్య పెద్ద మనుషుల మొఖంలో నెత్తుర సుక్క ల్యాకుండా పోయింది. దొంగకోళ్ళు పట్టే మాదిరి ఒకరి మొఖం ఒకరు సూసుకుని బెల్లం కొట్టిన రాయిలా నిలబన్యారు. పరువు మీందకు వచ్చేసరికి కోపంగా ఈరన్నను పిల్సుకొని రమ్మని పసిడెంట్ మనిషిని పంపినాడు. విషయం ఊరంతా పాకింది. ఊర్లో యాసావు అంత మంది జనాన్ని సూసిండదు. ఏం అయితాదని జనాలు పనులు పోకుండా కూచ్చున్యారు. తిన్నాల ఉన్నట్టు ఉంది సావు. ఏడ్సి ఏడ్సి నాగన్న పెళ్ళాం సోయి ల్యాకుండా పడిపోయింది.తప్పెటోల్లు రెండు పెగ్గులేసుకొని ఒక మూలకు కూచున్యారు. ఏం సెయ్యాలో తెలీక కొడుకులు గమ్మున నిలబడి ఉండారు. నాగన్నకు నలుగురు కొడుకులు అందరికి సమానంగా భూమి పంచి ఇచ్చి సోడమ్మ దేళంలో పూజారి పని సేచ్చా ఉండ్యా. దేళంకి చందాలు వసూలు చేయడం, దేళం బాగోగులు సూసుకుంటా సంతోషంగా బతుకుతుండ్యా. సోడమ్మ దేళంలో దీపం వెలగని రోజు లేదు.పనికోసం యా రోజు ఒకరికోసం సెయ్యి స్యాసింది ల్యా. అంత వయసులో కూడా ఎద్దులతో ఆరు ఎకరాల భూమి పండిచ్చా ఉన్యాడు. రోజుకు రెండు సెంబుల కాఫీ తాగుతా, నాలుగు కట్టలు వకీలా బీడీలు కాల్చేవోడు. పెళ్ళాంతో యారోజు మాట్టాడింది ల్యా ఎప్పుడూ కొట్టాడ్త ఉండేవాడు. ఊర్లో ఉన్నన్ని రోజులు ఉత్తపైనే ఉండేటోడు సంతకు పోవాల్సి వచ్చే కొత్తపెళ్ళికొడుకు మాదిరి పోయేటోడు నాగన్న.ఎండ ఎక్కువైంది. సేతీకి ఉన్య పారేన్ వాచ్ పదే పదే సూసుకుంటా ఉండాడు పసిడెంట్. ఈరన్న పేనే తాడు భుజానేసుకుని నిమ్మళంగా వచ్చి రోడ్డు మీందనే నిలబన్యాడు. ఈరన్న వొచ్చినాడని గందరగోళం అయింది. ఊరి పెద్దోళ్లనే మల్లెసినా మొగోడు ఎవడాని కొత్తగా వచ్చిన సుట్టాలు ఈరన్న దిక్కు నోరెళ్ళబెట్టి సూచ్చనారు. వొంటి మింద కేజీ కండ గూడా లేదు. తాగి తాగి ఎముకలు బయట పన్యాయి. మూతి మొత్తం తిప్పినా మీసాలే. కళ్ళు ఎండిపోయిన కుందు యేరు మాదిరి ఉండాయి.‘యేరా ఆన్నే రోడ్డు మీంద నిలబన్యావ్? రా ఇట్టా’ అన్యాడు పసిడెంట్. ఈరన్న పసిడెంట్ మాటకు ఎదురుసెప్పల్యాక నీళ్ళు నములుతా ఉండాడు. ‘యేందిరా?’ అని కళ్ళు పెద్దవి సేసినాడు పసిడెంట్. రోడ్డు మీందకు కళ్ళేసి ‘నేను ఆడికి రాను రెడ్డి’ అని సెప్పినాడు. కొత్త ఊరోళ్ళు పసిడెంట్ కెళ్ళి సూసినాడు. పసిడెంట్కు తలకాయ కొట్టేసినట్టు అయింది. పెద్దమనుషులు పసిడెంట్కు సర్ది సెప్పినారు. అందరూ రోడ్డు మీందకు వచ్చినారు. ‘సూచ్చనా సూచ్చనా శానా ఇకారాలు పోతనావ్? యేంది వాయ్ కథ’ అన్యాడు పసిడెంట్. అందరూ తల ఒకమాట ఏసుకున్యారు. ఈరన్న ఏం పలకకుండా నిలబన్యాడు. పీర్ల పండగ గుండం మాదిరి నిప్పులు కక్కుతా ఇద్దరు ముగ్గురు సెయ్యి పైకి లేపినారు.‘లాస్ట్ సారి మర్యాదగ సెప్తనా.. పోయి గుంత తీపో’ అన్యాడు పసిడెంట్. ‘నా గొంతు కోసినా.. నేను గుంత తియ్యను రెడ్డి’ అని పసిడెంట్ కళ్ళల్లోకి సూటిగా సూచ్చా సెప్పినాడు. ఈరన్న దొమ్మ పొగరు ఊరు మొత్తం సూసింది. ఇట్టా కాదని కోటోళ్ల తాత ముందుకు వచ్చి ‘ఒర్యా... నీకు, నాగన్నకు ఏమైనా తకరారు అయిందా?’ అని అడిగినాడు. ఈరన్న అందరి దిక్కు సూచ్చా తలకాయ ఊపినాడు.‘ఓర్నీ పాసుగూలా.. ఈ మాట ముందు సేప్తే పోయేది గదరా. ఏం కొట్టాట అయింది’ అని అడిగినారు. ఈరన్న ఏం మాట్టాడకుండా రోడ్డు వెంబడి నడ్సుకుంటా పోతాంటే జనం ఈరన్న దిక్కు సూచ్చా పోయినారు. పెద్దమనుషులు ఈరన్న పీక మీంద కాలేసి తొక్కేమాదిరి ఉండారు. గాడ్దెంకా దాటి సోడమ్మ దేళం ముందు రోడ్డు కాడ ఆగినాడు ఈరన్న. జనం గూడా ఏం సెప్తాడ అని కాసుకొని ఉండారు. ఈరన్న ఊరి మంది దిక్కు సూచ్చా పదేళ్ళ కింద మాట ఇదని మొదలుపెట్టినాడు.ఆ పొద్దు ఇంగా సరిగ్గా తెల్లవారాల్య. ఊర్లో సారాయి బాలన్నను పోలీసులు పట్టకపోయినాంక సారాయి కోసం జనం అందరూ పక్క ఊరికి పోతాండారు. రెండు రోజుల నుంచి సారాయి ల్యాక న్యాలుకా పీక్తాంటే నేను సోడమ్మ వెనక దావ గుండా సచ్చా బతుకుతా పక్క ఊరికి పోయినా. కాళ్ళకు సెప్పులు లేవు. అడ్డదావాలో ముల్లులు ఉండాయని సోడమ్మ ముందు దావ వెంబడి ఊళ్ళోకి వచ్చాంటే పొద్దున పూజ సేసుకొనికీ వచ్చిన నాగన్న దావన పోతన్య నన్ను సూసి ‘ఒర్యా ఈరన్న.. ఒర్యా’ అని క్యాకేసినాడు. ఎవరోబ్బా ఇంత పొద్దునా అని నేను ఆగి తలకాయ తిప్పి సూసినా. ‘మాల నాకొడాకా యా దావ నుంచి రా నువ్వు పొయ్యేది’ అన్యాడు.‘ఓ నాగన్న... మాటలు మర్యాదగా రానీ’ అన్య కైపు బిస్సన.‘తాగుబోతు నా కొడకా నీకు మార్యాద యేందిరా, మీకు వెనక దావ ఉంది గదరా.. పెద్దరెడ్డి మాదిరి ఎవరూ సూల్లేదని ముందు నుంచి పోతానావ్’ అన్యాడు. నాకు కైపు అంత యిడ్సిపోయి కోపం అరికాళ్ళల్లో నుంచి మెదుడులోకి పాకింది.. ‘నీ యబ్బా కట్టిచ్చినాడా రోడ్డు.. ఇది అందరికీ’ అని సెప్పినా. అంతే కోపంతో ఎగిచ్చి తన్యాడు కాల్‌తో. నా కొడకా.. మళ్ళా మాట్టాడ్తనావే.. మీ బతుకులెంత? మీరెంత? యాపొద్దు పోంది, ఈ పొద్దు ఇట్టా ఎందుకు పోతనావ్ వాయ్ అని కుతిక మీంద కాలేసినాడు. సాచ్చం ఆ సోడమ్మ తల్లే. ‘మీకు ఒక దావ.. మాకు ఒక దావ ఎందుకు?’ అని అడిగినా. ‘మీరు మేము ఒకటేనా వాయ్. మేము ల్యాకపోతే మీ బతుకులు తెల్లవారావ్’ అన్యాడు.‘మేము గూడా ల్యాకపోతే మీ బతుకులు తెల్లవారవ్.. మీ పీనుగ కూడా లేయ్యదు’అని సెప్పినా. ‘అంతా మొగోనివా?’ అన్యాడు. ‘సరే అయితే సెప్తండా సూసుకో.. ఇదే ఆకాశం, ఇదే నేల, ఇదే సోడమ్మ, ఎదురుగా ఉన్య మారెమ్మ మీంద ఒట్టేసి సెప్తనా.. రెండు దావలు పోయి ఒకే దావ వచ్చేగానీ నీ పీనుగకు నేను పికాసి ఎత్తను, పారా ముట్టను’ అని గట్టిగా అర్సి తొడ కొట్టి, మీసం తిప్పినా. ‘పో.. పో వాయ్ సూసినావ్, నీ మూడకాసు మాటలు’ అని నన్ను వెనక దావలోకి మెడకాయ పట్టుకొని గుంజకపోయినాడు’ అని జెప్పి.. సాచ్చం అద్దో ఆ మారెమ్మ తల్లే అని పోతురాజు మాదిరి మారెమ్మ దేళంకెళ్ళి సెయ్యి సూపిచ్చినాడు.జనాలు అందరూ కిక్కురుమనుకుండా సినిమా సూసినట్టు సూసినారు. సోడమ్మ కటాంజన్కు కట్టిన ఎర్ర గుడ్డ గాలికి ఊగుతా ఉంది. పొద్దున్నుంచి దీపం ల్యాక దిగులుగా ఉన్నట్టు ఉంది. సాచ్చం యాడ అడుగుతారో అని సోడమ్మ కళ్ళు మూసుకుని ఏం ఎరగనట్టు వింటా ఉంది. సోడమ్మ వెనక దావాలో నిలబన్య ఈరన్న మనుషులు దీనంగా మొఖం పెట్టినారు.‘మళ్ళా మీకు ఆ దావ ఉంది గదరా.. నువ్వు ఎందుకు ఈ దావలో నడ్సినావ్’ అన్యారు పెద్దమనుషులు. ‘మళ్ళా మీరు అదే పాట పాడ్తారు. నేల అంతా ఒకటే అయినప్పుడు మీకు ఒక దావేంది, మాకు ఒక దావేంది రెడ్డి’ అన్యాడు ఈరన్న ఊగిపోతా. ‘ఇప్పుడు ఏం అంటావ్ రా’ అని పళ్ళు నూరినారు పెద్దమనుషులు. ‘నేను సేప్పేది ఏం లేదు రెడ్డి.. నన్ను యిడ్సిపెడ్తే నా పని నేను సూసుకుంటా!’‘సూడు ఈరన్న అయిపోయిందేందో అయిపోయింది. రా వచ్చి గుంత తీయ్. మా నాయన తరుపున పెద్ద కొడుకుగా నేను నిన్ను క్షమాపన అడుగుతనా’ అన్యాడు నాగన్న పెద్దకొడుకు.‘ఎట్టా అయిపోతాది సామీ.. పది సంవత్సరాల నుంచి గుండెకాయ కాల్తానే ఉంది. ఉప్పు కారం మీకన్నా రొంత ఎక్కువే తిన్యా. కుందరాగు నర్సన్న పెద్దకొడుకు కుందరాగు ఈరన్నను నేను, మాట అంటే పానం లెక్క. మీరు సెప్పినట్టే మా బతుకులా? మీకేమో తారోడ్డులు, మాకేమో మట్టి దావలా? మారాల మారి తీరాల.’అందరూ అర్థంకానట్టు సూచ్చనారు. పసిడెంట్ ముందుకు వచ్చి ‘ఇప్పుడు ఏం కావాలి రా నీకు?’‘అందరికీ ఒకే దావా కావాలా!’ ‘తంతే నాకొడకా యేట్లో పడ్తావ్.. అందరికీ ఒకే దావ యేంది రా.. తలకాయ తిరుగుతుందా?’‘నాకు ఏం తిరగల్యా సామీ.. ఇప్పుడే సక్కగా పనిసేచ్చాంది. మేము గూడా ముందు దావలో నుంచే నడుచ్చాం.’ ‘నడసనియ్యక పోతే..’‘మీ గుంతలు మీరే తవ్వుకోండి.. మీ పీనుగులు మీరే బూర్సుకోండి!’ఈరన్న మనసు అందరికీ అర్థం అయింది. పెద్దమనుషులు అందరూ గుంపు అయి గుస గుసలాడ్త ఈరన్న దిక్కు సంపేమాదిరి సూచ్చాండారు. ఎండ నెత్తి మీందకు వచ్చింది. నాగన్న తలకాయ కాడ ఊదిగడ్లు మారుతానే ఉండాయి. బయట ఊరోళ్ళు పెద్దమనుషుల దిక్కు మనుషుల్లానే సూడకుండా ఉండారు. ఈరన్న దిక్కు వాళ్ళ మనుషులు వచ్చి బలంగా నిలబడి కళ్ళ నిండా నీళ్ళు పెట్టుకున్యారు. దమ్ములు ఇరిసి నిలబన్య ఈరన్న దిక్కు పెళ్ళాం కళ్ళు ఆర్పకుండా సూచ్చాంది. వాళ్ళళ్ళో వాళ్ళు కొట్టుకుంటా అర్సుకుంటా ఉంటే తాపకొకసారి మీసం తిప్పుతా బుసలు కొడ్తా ఉండాడు ఈరన్న.కొంతమంది ఈరన్న సంగతి సూజ్జామని పంచెలు ఎగ్గొట్టుకోని తిరిగి పోయినారు. సెసేది ఏం ల్యాక పెద్దమనుషులు సల్లు పోయినారు. సోడమ్మ వెనక దావకి కంపసెట్లు అడ్డంగా పెట్టినారు. ఈరన్నను ఎత్తుకుని క్యాకలేసినారు వాళ్ళ మనుషులు. అప్పుడే గుళ్ళో పెట్టిన దీపం వెలుగులో సోడమ్మ నవ్వుతా ఉన్యట్టు ఉంది. ఊళ్ళోదావ గురించి దండోరా యినపడ్తాంటే పికాసీ, పారా తీసుకొని యేటి పడమటి దిక్కు శ్మశానం కెళ్ళి ఈరన్న ఉదయిస్తా పోయినాడు. – సురేంద్ర శీలం -
మిస్టరీ.. 'ఏదో బలమైన శక్తి తన కాళ్లను పట్టుకుని ఈడ్చుకెళ్లినట్లు'..
అది 1968, ఇంగ్లండ్‌లోని గ్లోస్టర్షర్లోని వాటన్–అండర్–ఎడ్జ్‌లో ఉన్న ఈ ప్రసిద్ధ చారిత్రక కట్టడాన్ని ‘జాన్ హంఫ్రీస్’ అనే వ్యాపారవేత్త కొనుగోలు చేశాడు. అప్పటి దాకా ఆ భవనం 11వ శతాబ్దానికి చెందినదని, అందులో కొన్నేళ్ల పాటు బార్ అండ్ హోటల్ ఉండేదని మాత్రమే అతడికి తెలుసు. వ్యాపార దృక్పథంతోనే కొన్న జాన్.. ఆ భవనానికి చిన్న చిన్న మరమ్మతులు చేయించి.. బెడ్ అండ్ బ్రేక్ ఫాస్ట్ హోటల్‌గా మార్చాడు. దానిలోనే ఒక పక్క కుటుంబంతో కలసి కాపురం పెట్టాడు. రోజులు గడిచే కొద్ది ఆ ఇంట్లో జరిగే అంతుచిక్కని పరిణామాలు వారిని వణికించడం మొదలుపెట్టాయి.ఒక రాత్రి జాన్ నిద్రపోయిన సమయంలో ఏదో బలమైన శక్తి తన కాళ్లను పట్టుకుని ఈడ్చుకెళ్లినట్లు, ఇల్లంతా తిప్పి విసిరికొట్టినట్లు అనిపించింది. కళ్లు తెరిచి చూస్తే ఒంటిపై గాయాలున్నాయి. తాను మాత్రం మంచం మీదే ఉన్నాడు. రోజు రోజుకీ ఇలాంటి హింసాత్మక అనుభవాలు మరింత ఎక్కువయ్యాయి. కేవలం జాన్‌కు మాత్రమే కాదు.. అతడి కూతురు ఎనిమిదేళ్ల కరోలిన్ హంఫ్రీస్తో పాటు జాన్ భార్య, మిగిలిన వారసులు, ఆ హోటల్లో డబ్బు చెల్లించి బస చేసేవారు.. ఇలా ప్రతి ఒక్కరికీ ఇలాంటి వింత అనుభవాలు హడలెత్తిస్తూ వచ్చాయి.దాంతో జాన్.. అప్పటికే సుమారు వెయ్యేళ్ల చరిత్ర ఉన్న ఆ ‘ఏన్షియంట్ రేమ్ ఇన్ హౌస్’ గురించి అన్వేషణ మొదలుపెట్టాడు. ఆ అన్వేషణలో అతడ్ని భార్య, బంధువులు, కొడుకులు ఇలా అంతా వదిలిపోయినా.. కూతురు కరోలిన్ మాత్రం వదిలిపెట్టలేదు. గగుర్పాటు కలిగించే ఎన్నో అంశాలను వెలికి తీసే తండ్రి ప్రయత్నానికి.. చేయూతను ఇచ్చింది కరోలిన్. దాంతో జాన్.. అనుమానం కలిగిన ప్రతి గదిలోనూ తవ్వకాలు జరిపాడు. ప్రతి మూలలోనూ, గోడలోనూ.. ఆ అతీంద్రియ కదలికలను జల్లెడ పట్టాడు.అతడికి ఆ ఇంట్లో చాలా భయపెట్టే బొమ్మలు, ఎముకలు, పుర్రెలు, సమాధులు, పక్షులు, జంతువుల కళేబరాలు దొరికాయి. చాలా ఎముకలను పరిశీలిస్తే.. అవన్నీ చిన్న పిల్లల ఎముకలని తేలింది. పైగా వాటి చుట్టూ నరబలి ఆనవాళ్లు భయపెట్టాయి. చిత్ర విచిత్రమైన మొనదేరిన కత్తులు దొరికాయి. అవన్నీ 1145 నాటివని పురావస్తు నివేదికలు తేల్చాయి. దాంతో జాన్.. మీడియా సాయం కోరాడు. నాటి నుంచి ఈ హౌస్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తూ వస్తోంది.ఇతడి ఆసక్తికరమైన అన్వేషణలలో ఒక గోడ లోపల.. అప్పటికి 500 సంవత్సరాల నాటి పిల్లి కళేబరం బయటపడింది. ఆ గోడ గల గది ఓ మంత్రగత్తెదని, ఆ పిల్లి ఆ మంత్రగత్తె వెనుక తిరిగే నల్లపిల్లి అని ప్రచారంలో ఉన్న కథను తెలుసుకున్నాడు జాన్. ‘మంత్రగత్తె తనను వ్యతిరేకించే జనాల నుంచి తప్పించుకోవడానికి ఆ హోటల్లో దాక్కుందని, తర్వాత అక్కడే ఆమె మరణించిందని ఇలా ఎన్నో కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అక్కడ ఉన్నవారిని.. అక్కడ ఉండటానికి వచ్చినవారిని.. కనిపించని శక్తులు పరుగులు పెట్టించడమే ఇక్కడ మిస్టరీ.ఈ ఇంటికి సమీపంలో ఓ పెద్ద చర్చ్ కూడా ఉంది. అయితే ఆ చర్చికి, ఈ ఇంటికి రహస్య సొరంగ మార్గం ఉండటంతో.. ఆ చరిత్రను కూడా తవ్వే ప్రయత్నం చేశాడు జాన్. అయితే ఆ చర్చిలో పని చేసే బానిసలు, కాథలిక్ సన్యాసులు ఆ సొరంగ మార్గం ద్వారానే రాకపోకలు జరిపేవారని తేలింది. ఆ ఇంట్లోని మానవ అవశేషాలకు.. చర్చ్ అధికారులకు సంబంధం ఉందా అనేది మాత్రం తేలలేదు. అయితే ఈ ఇంటి నిర్మాణానికంటే ముందు అదొక శ్మశానవాటికని.. అందుకే అక్కడ అంత పెద్ద ఎత్తున మానవ ఎముకలు దొరికాయని ఓ అంచనాకు వచ్చారు కొందరు.ఆ ఇంట్లో పలు అసాంఘిక కార్యక్రమాలు జరిగేవని.. ఇదంతా వాటి ఫలితమేనని నమ్మడం మొదలుపెట్టారు మరికొందరు. ఏది ఏమైనా ఆ ప్రదేశంలో ఎందరో నిపుణులు, పర్యాటకులు పలు ప్రయోగాలు చేసి.. స్వయంగా బాధితులు అయ్యారు తప్ప.. బలమైన కారణాన్ని మాత్రం కనుగొనలేకపోయారు. దాంతో నేటికీ ఈ భవనం.. ప్రపంచంలోనే అత్యంత హంటెడ్ నిర్మాణాల్లో ఒక్కటిగా మిగిలిపోయింది. అయితే ఇక్కడ హడలెత్తిస్తున్న అతీంద్రియ శక్తి ఏంటీ? నిజంగానే అక్కడ ఆత్మలు ఉన్నాయా? అక్కడ దొరికిన ఎముకలు.. వాటి వెనుకున్న విషాధ గాథలు ఏవీ తేలకపోవడంతో ఈ ఇంటి చరిత్ర మిస్టరీగానే మిగిలిపోయింది. – సంహిత నిమ్మన -
రాతల్లో నిజాయితీ: రామేశంగారు మాకు..
రామేశంగారు మాకు దగ్గరగా ఉండే, దూరపు బంధువు! ఒకే వీధిలో పక్క పక్క ఇళ్ళల్లో ఉండేవారం! ఆయన భార్య వైపు నుంచి మా నాన్నగారికి బీరకాయపీచు చుట్టరికం ఉండేది. మా అన్నదమ్ములందరం వాళ్ళని అత్తయ్య, మావయ్య అని పిలిచేవారం! మా నాన్నగారు, ఆయన ఒకే డిపార్ట్మెంటులో పనిచేసేవారు. దానికితోడు ఇద్దరూ రచయితలే! ఇవన్నీ కలవడంతో, మా కుటుంబాల మధ్య బంధుత్వం మాట ఎలావున్నా, స్నేహం ఎక్కువ కనబడేది!నేను కాలేజీ చదువులకు వచ్చేసరికే.. మా నాన్నగారు పక్షవాతంతో మంచం పట్టడం, రామేశంగారు బదిలీ మీద వేరే ఊరు వెళ్ళిపోవడంతో, మా కుటుంబాల మధ్య దూరం ఏర్పడి పోయింది. తర్వాత కాలంలో నాకు బ్యాంకులో ఉద్యోగం వచ్చి, మూడు నాలుగు చోట్ల పనిచేసిన తర్వాత బదిలీ మీద నేను తిరిగి మా ఊరు చేరాను. ఓ రోజు బ్యాంకులో పనిచేసుకుంటున్న సమయంలో, కౌంటర్ ఎదురుగా నిలబడి.. ‘నువ్వు చిట్డిబాబు కొడుకువి కదూ!’ అంటూ పలకరించారు. బుర్ర వంచి పని చేసుకుంటున్న నేను, ఆ పిలుపు వినగానే బుర్ర ఎత్తి చూశాను. రామేశం గారే!మా నాన్నగారిని ఆ పేరుతో పిలిచేవారు బహు తక్కువగా ఉండేవారు. అందులో రామేశంగారు ఒకరు! ‘అవునండీ .. మీరు రామేశం మావయ్యగారు కదూ!’ అప్రయత్నంగానే నోటంట ఆ పేరు వచ్చేసింది. ‘అవునయ్యా! ఇక్కడికి ఎప్పుడు వచ్చావూ.. మీ నాన్న ఆరోగ్యం ఎలావుంది.. ఇక్కడే ఉన్నారా? నువ్వు కూడా కథలు రాస్తావుట కదా.. మీ బ్యాంకులో పనిచేసే హరగోపాల్ చెప్పాడు! రిటైర్మెంట్ తర్వాత నేను కూడా ఇక్కడికి వచ్చేశాను!’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.అన్నిటికీ జవాబులిచ్చి.. ‘సాయంత్రం బ్యాంకు అవగానే మీ ఇంటికి వస్తాను!’ అంటూ అడ్రసు తీసుకుని ఆయన పనిచేసిపెట్టి పంపేశాను. అలా.. మా కుటుంబాల మధ్య బంధుత్వం నాతో తిరిగి మొదలైంది! అయితే మా నాన్న కదల్లేని పరిస్థితులలో ఇంటిపట్టునే ఉండేవారు. మా అమ్మ ఏ పేరంటాలకో వెళ్తుండేది. నేను ఖాళీ దొరికినప్పుడో, కథల మీద సలహాలు తీసుకోడానికో, ఆయన పని మీదో వాళ్ళింటికి వెళ్తుండేవాడ్ని! రామేశంగారి భార్య భానుమతిగారు మా ఇంటికి తరచు వస్తుండేవారు. రామేశంగారు మాత్రం ఎవరింటికి వెళ్ళేవారు కాదు! వాళ్ళ పిల్లలు కూడా అంతే.. ఎవరినీ కలసేవారు కాదు. ఇప్పుడు ఆయన మా ఇంట్లోవాళ్లందరి కంటే నాతోనే ఎక్కువ చనువుగా ఉంటున్నారు. మా ఇద్దరి అభిప్రాయాలు కలిసేవి. అలాగే.. ఆయన కథలంటే చాలా ఇష్టపడేవాడ్ని. మంచి శైలి, అభ్యుదయ భావాలతో ఆయన కథలు, ఆసాంతం చదివించేవి. ఆయన్ని కలసినప్పుడల్లా.. నాకు తెలియని చాలా విషయలు చెప్తూ ఉండేవారు.ఆయనతో బాగా చనువు ఎర్పడటంతో, నేను రాసే కథలను ఆయనకే మొదట చూపెట్టేవాడ్ని! బావుండకపోతే.. మొహం మీదే చెప్పేవారు. ఆయన సూచనలు తీసుకుని మార్పులు, చేర్పులు చేసి, మళ్ళీ ఆయన ఓకే అన్న తర్వాతే, పత్రికలకు పంపేవాడ్ని! ఓ సంవత్సర కాలం గడిచిన తర్వాత, ఉన్నట్టుండి రామేశంగారికి మోకాలు నొప్పి వచ్చి, బయటకు వెళ్ళడం తగ్గిపోయింది. ఆ విషయమే ఓ రోజు ఫోన్ చేసి.. ‘చేతి వేళ్లు కూడా పూర్తిగా పట్టు తప్పాయి! నీ అవసరం తరచు ఉంటుంది!’ అంటూ, బ్యాంకు పని ఏదో పురమాయించారు. బ్యాంకులో పని ఎక్కువగా ఉండటంతో, వెంటనే వాళ్ళింటికి వెళ్ళలేకపోయాను.ఓ నెల రోజుల తర్వాత వీలు చూసుకుని రామేశంగారిని చూడ్డానికి వెళ్ళాను. తలుపు తీస్తూ.. ‘రా నాయనా! ఈ మధ్య బొత్తిగా నల్లపూస అయిపోయావు! కూర్చో కాఫీ ఇస్తా!’ అంటూ మా అత్తయ్య, నా మాట వినిపించుకోకుండా వంటింట్లోకి వెళ్ళిపోయింది.‘మార్చి నెల కదా.. బ్యాంకులో చాలా బిజీగా ఉంది! ఇంటికి వెళ్ళేసరికే రాత్రి పది దాటిపోతున్నది!’ అంటూ రామేశంగారి మంచం దగ్గరకి కూర్చి లాక్కుని కూర్చున్నాను. అప్పుడు చూశాను.. మరో కుర్చీలో ఒకావిడ కూర్చుని ఉంది. ఆవిడ్ని నేనెప్పుడూ చూడలేదు.‘ఏంలేదోయ్.. మీ అత్తయ్యలాగే ఈ మధ్య నా చేతివేళ్ళు కూడా నా మాట వినడం లేదు! మెదడు నాదే కదా.. ఇంకా నా చెప్పు చేతల్లోనే ఉంది!’ అంతలో అక్కడికి వచ్చిన మా అత్తయ్య, రామేశంగారి మాటలకు అడ్డం పడుతూ.. ‘చోద్యం కాకపోతే.. డొంకతిరుగుడు లేకుండా విషయం తిన్నగా చెప్పొచ్చుగా!’ అంటూ, నాకు కాఫీ గ్లాసు అందించింది. ‘కథలలో వర్ణనలు, ఉపోద్ఘాతాలు, ఉపమానాలు లేకపోతే, నువ్విచ్చే కాఫీలా చప్పగా ఉంటుంది!’ ఆవిడతో అని..నావైపు చూపు మరలుస్తూ ‘ఏం లేదేయ్.. ఈ మధ్య రాయడం కూడా కష్టంగా ఉంది. అందుకే.. నా రాతకోతలన్నీ ఈ అమ్మాయి చేత చేయిస్తున్నాను. ఓ రకంగా స్టెనోగ్రాఫర్ అనుకో!’ అన్నారు రామేశంగారు.‘కథలు రాసే స్టెనోగ్రాఫర్ అన్నమాట!’ నవ్వుతూ అంటూ, కాస్సేపు మాట్లాడి వచ్చేశాను. తర్వాత రోజుల్లో వాళ్ళింటికి వెళ్ళినప్పుడు ‘ఎక్కడైనా వంట మనిషినో, పని మనిషినో పెట్టుకుంటారు గాని, ఇలా కథలు రాయడానికి మనిషిని పెట్టుకోవడం ఎప్పుడూ వినలేదురా అబ్బి!’ మా అత్తయ్య నవ్వుతూ నాతో అంటుండేది.‘కదల్లేని కథల మనిషికి, నీలా కథలు చెప్పేవారు కాకుండా, కథలు రాసేవారు కావాలి కదోయ్!’ ఆయన కూడా నవ్వుతూ అనేవారు. ‘ఎప్పుడు చూసినా మన కొంపల్లో పదిమంది ఉండేవారు! ఇప్పుడేం వుంది.. లింగు లింగుమని ఇద్దరేసి ఉంటున్నారు! ఈ వయసులో మరో మనిషి సాయం మంచిదే కదా నాయనా!’ అంటూ మా అత్తయ్య కూడా ఆవిడతో సరదాగానే ఉండేది.ఓ రోజు బ్యాంకులో పని చేసుకుంటుంటే, రామేశంగారి నుంచి ఫోన్ వచ్చింది. ‘మీ అత్తయ్య చనిపోయింది, అర్జంటుగా నువ్వు రావాలి’ అంటూ కంగారుగా చెప్పి ఫోన్ పెట్డిశారు!ఒక్కసారిగా నిర్ఘాంత పోయాను. ‘ఆవిడ ఎప్పుడూ ముక్కు చీదిన సందర్భం కూడా లేదు.. అలాంటిది ఈ ఘోరం ఎలా జరిపోయిందో..’ అనుకుంటూ బ్రాంచి మేనేజరు దగ్గరికి వెళ్ళి, విషయం చెప్పి, సెలవు పెట్టి రామేశంగారింటికి వెళ్ళాను. అప్పటికే వాళ్ళ పిల్లలు, బంధువులు వచ్చి, తర్వాత కార్యక్రమం గురించి అటూ ఇటూ తిరుగుతున్నారు. రామేశంగారు దిగులుగా ఓ పక్కన కూర్చుని ఉన్నారు. ఆయన్ని ఎలా పలకరించాలో తెలియలేదు. దగ్గరకి వెళ్ళి గట్టిగా చేతులు పట్టుకున్నాను. ప్రశాంతంగా నిద్ర పోతున్నట్టున్న మా అత్తయ్యని చూడగానే, నా కళ్ళు చెమర్చాయి.‘నిన్న రాత్రి వరకు బానే ఉందయ్యా.. ఉదయాన్నే కొంచెం నలతగా ఉందంటే, డాక్టరు రామ్మూర్తికి ఫోన్ చేశా. ‘మీరు రావొద్దు.. నేనే హాస్పిటల్‌కి వెళ్ళేటప్పుడు, మీ ఇంటికి వచ్చి చూస్తానులెండి!’ అంటూ ఓ పది నిమిషాల్లో వచ్చాడు. ఆయన వచ్చేలోగా.. అదిగో ఆ దివాను మీద పడుకుంది పడుకున్నట్టే పోయింది! హార్ట్ అటాక్ట. పాపం అది చెప్పడానికి రామ్మూర్తి వచ్చినట్టైంది! బీపీ, షుగరు, బెల్లం అన్నీ నాకున్నాయి గాని, మీ అత్తకి ఎప్పుడూ తుమ్ము కూడా రాలేదు! సునాయాసంగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది!’ అంటూ వస్తున్న దుఃఖాన్ని దిగమింగుకున్నారు. ఓ గంటలో కార్యక్రమం అంతా ముగిసి, రామేశంగారు ఇంట్లో ఒంటరైపోయారు. ఆయన పక్కన మౌనంగా కాస్సేపు కూర్చున్నాను. ఆ కథలు రాసే ఆవిడ కూడా ఆయన పక్కనే కూర్చుంది. ‘నాకు తప్పదులే.. పనేమైనా ఉంటే ఫోన్ చేస్తాను! అన్నట్టు.. మీ అమ్మా, నాన్నలకి ఈ విషయం అంత అర్జంటుగా చెప్పకు. మెల్లగా వీలు చూసుకుని చెప్పు’ అంటూ ఆయన నెమ్మదిగా కళ్ళు మూసుకున్నారు. జలజలరాలే నీటిబొట్లు ఆయన ఒళ్లో పడుతుండటం నేను మొదటిసారి చూశాను. కాలగర్భంలో ఆర్నెల్లు గడిచిపోయాయి. ఆ రోజు లంచ్ టైములో.. ‘నీకీ విషయం తెలిసిందా!?’ అంటూ మా కొలిగ్ నా వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. నోట్లో ఇడ్లీ ముక్క పెట్టుకుంటూ.. తెలియదన్నట్టు తలూపాను. ఎడం చేత్తో సెల్ఫోన్లో ఓ ఫొటో చూపెట్టేడు. అది చూస్తూనే ఒక్కసారిగా షాక్ తగిలినట్టైయింది. నా నోటంట మాట రాలేదు.‘నిజం కాదే’ అన్నట్టు అతని వైపు చూశాను. ‘ఓ వారం కిందట.. మా ఫ్రెండ్ అక్కడకి ఏదో పని మీద వెళ్తే, కనబడ్డారుట.. మీ మావయ్యగారు వీల్ చైర్లో ఉన్నారుట, పక్కన ఆవిడ ఉందిట!’ అంటూ ఆ విషయాన్ని మా కొలిగ్ కళ్ళకు కట్టినట్లు చెప్తుంటే, నమ్మలేకుండా ఉండిపోయాను. లంచ్ తర్వాత కౌంటర్లో కూర్చుని పని చేసుకుంటున్నానే గాని, ఆలోచనలతో మనసంతా కకావికలమైంది!ఓ నాలుగు రోజులు ఆ ఆలోచనలతోనే గడిపాను. ఏం చేయాలో తోచలేదు. ‘అసలు ఏం చేయగలను?’ అనుకుంటూ సమాధాన పడిపోయాను.ఆ రోజు.. బ్యాంక్‌లో పని పూర్తిచేసి, టేబుల్ సర్దుకుంటుంటే సెల్‌ఫోన్ మోగింది. రామేశంగారి నుంచి.. ఉలిక్కిపడ్డాను! ఫోన్ ఆన్ చేశాను గాని, మాటలు వెతుక్కుంటూ, తడపడ్డాను!‘బ్యాంకులో ఉన్నావా.. అందరూ బావున్నారా?’ ఆయన మాటల్లో కాస్త వ్యంగం కనబడింది. కారణం.. ఈమధ్య కాలంలో నేను ఆయన్ని కలవలేదు, ఫోన్లో మాట్లాడిందీ లేదు! ‘అందరూ బావున్నారండీ! బ్యాంకులో చాలా బిజీగా ఉంది.. రాలేకపోయాను!’ పొడి పొడిగా వచ్చాయి నా మాటలు.‘ఏం లేదోయ్.. మీ బ్యాంకులో ఉన్న నా పెన్షన్ అకౌంట్‌కి నామినేషన్ మార్చాలి! ఆ ఫారం పట్టుకుని ఓసారి రా.. !’ ఎప్పటిలాగే.. హుకుం జారిచేసినట్టు అన్నారు. భార్య పోయిన తరువాత పెన్షన్ అకౌంట్‌కి నామినేషన్ ఇవ్వకపోయినా కొంపలు మునిగిపోవు! అయితే ఆయన చాదస్తం తెలిసిన వాడ్ని కాబట్టి ‘రేపు వస్తాను!’ అంటూ ఫోన్ కట్ చేశాను.ఆయనింటికి వెళ్ళి, ఆయన్నెలా ఫేస్ చెయ్యాలో అర్థం కాలేదు! మర్నాడు ఉదయం బ్యాంకుకి ఓ పావుగంట ముందే బయలుదేరి, మధ్యలో ఆయనింటికి వెళ్ళాను.‘ఏమిటీ.. ఈ మధ్య మరీ నల్లపూసవై పోయావు..’ ఆ మాటలకి సమాధానం చెప్పకుండా.. ముభావంగా నా చేతిలో బ్యాంకు ఫారం ఆయనకి ఇచ్చి ఎదురుగా కూర్చున్నాను. ఆయన ఆ ఫారం నింపుతూ.. ‘ఏంలేదోయ్.. పోయే వయసే కదా, తర్వాత పిల్లలకు ఇబ్బంది కలగకుండా ఈ జాగ్రత్తలు!’ అంటూ నా వైపు క్రీగంట చూస్తూ అన్నారు. వంటింట్లో నుంచి ఆవిడ కాఫీ తెచ్చి, నాకు అందించింది. ఆవిడలో మార్పు నాకు ఏం కనబడలేదు. ‘మా పిల్లలు బానే చూస్తారు, వాళ్ళ దగ్గరకి వచ్చేయమని అంటారు. కానీ, నాకీ కాగితాల్ని వదిలి వెళ్ళబుద్ధి కావడం లేదు! ఆ మాట ఎలా ఉన్నా, ఓసారి చూసి.. అన్ని సరిపోయాయో లేదో చెప్పు!’ అంటూ నింపిన ఫారాల్ని నా చేతిలో పెట్టారు. ఫారంలో ఆయన ఫించన్ అకౌంట్ ఎదురుగా నామినీ పేరుని చూసి, నుదురు చిట్లించి, ఆయన వైపు చూశాను.‘ఉన్న ఈ రెండిళ్లు, బ్యాంకు డిపాజిట్లు మా పిల్లలకి రాసేశాను. ఆ ఫించన్..’ అంటూ నా వైపు చూశారు. నా మొహంలో ఏం కనబడిందో.. మళ్ళీ ఆయనే అన్నారు.. ‘ఈ అమ్మాయి తెలుసుగా, ఆమెకి ఎవరూ లేరు. ఓ అనాథ! నేను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాను. నీకేమిటి.. అందరికీ తెలుసులే, అదేం రహస్యం కాదు! ఇదిగో ఇలా ఈ వీల్ చైర్లోనే అక్కడికి వెళ్ళాను! ఎవరికీ నచ్చదు, కాని..’ అంటూ ఓ పుస్తకంలో ఉన్న, ఆ మ్యారేజ్ సర్టిఫికెట్ జిరాక్స్ కాపీ నాకందించారు. అయితే.. ఆయన దాన్ని మామూలు విషయంలా చెప్పడం నాకు చాలా చిరాకు కలిగింది.మాట్లాడాలనిపించలేదు! ‘మీ అత్తయ్య వెళ్ళిపోయిందిగా, నా తదనంతరం నా పెన్షన్ తీసుకోవడానికి ఎవరూ లేరు! ఈ అమ్మాయికా.. పాపం ఎవరూ లేరు, జీవనాధారం కూడా లేదు! అందుకే.. అలా చేశాను! అంతే గాని, అందరూ అనుకుంటున్నట్టు కాదులే! ఈ సర్టిఫికెట్తో అమ్మాయికి ఓ ఆధారం దొరుకుతుంది! ఆ విషయమే మా ఆఫీసు వాళ్ళకి ఈ రోజే ఆర్జీ కూడా పంపిసాను! బ్యాంకులో కాస్త ఈ పని చేసి పెట్టు!’ అంటూ గబగబా ఆయన చెప్పదలుచుకుంది చెప్పేశారు.ఆ క్షణంలో.. ఆయనకి.. ఏం చెప్పడానికీ నాకు ధైర్యం సరిపోలేదు! ‘సరే.. వస్తాను!’ అంటూ బ్యాంకు దారి పట్టాను.బ్యాంకులో ఉన్నంతసేపు ఆయన గుర్తుకు రాలేదు. కాని సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత, తిరిగి నా ఆలోచనలు ఆయన చేసిన పని చూట్టూరే తిరిగాయి!ఆ రాత్రి ఏదో ఆలోచిస్తున్న నాకు ఒక్కసారిగా.. ఏదో స్ఫురించి, సెల్‌ఫోన్ తీసుకున్నాను. ‘మావయ్యగారు నమస్కారం! నా ఈ అభిప్రాయాన్ని మీ ముందు చెప్పే ధైర్యం లేదు.. అలా అని చెప్పకుండా ఉండనూ లేను! అందుకే ఈ మెసేజ్! మీ మ్యారేజ్‌ని సమాజం కొందరు తప్పని అనొచ్చు.. లేదా వెనుకనున్న మీ ఆలోచనని కొంతమంది మెచ్చుకోవచ్చు! కాని నిజానికి.. మీ ఆలోచనని అచరణలో పెట్టడానికి, మీకు పెళ్ళి తప్పనిసరైంది! అసలు మీ ఆలోచనే తప్పు! మీ ఆస్తిలో కొంత ఆవిడకి ఇచ్చుంటే హర్షించేవాడ్ని, కాని ప్రభుత్వం ఇచ్చే ఈ సౌకర్యాన్ని, మీరు దుర్వినియోగం చేశారు! ఇప్పటికే కొన్ని లక్షల కోట్ల రూపాయాలు పెన్షన్ల కింద ప్రభుత్వం ఇస్తున్నది. సమాజసేవ అంటూ మీలా అందరూ పెన్షన్లని ఎవరికో ఒకరికి రాసేస్తుంటే.. ఈ దుర్వినియోగనికి ఇంక అంతు ఉండదు! వాటిని చెల్లించడానికి ప్రభుత్వం తిరిగి మన మీదే పన్నులు వేస్తుంది!మీరు చేసిన పని చట్టసమ్మతం కావొచ్చు. కాని ఈ దేశ పౌరుడుగా నాకు సమ్మతం కాదు! మీ రాతల్లో కనబడే నిజాయితీ, చేతల్లో కనబడలేదు!క్షమించండి.. ఇది మూమ్మాటికీ తప్పే!’ మెసేజ్ టైపు చేసి, రామేశంగారికి పంపాను! తర్వాత.. నాకు నిద్ర పట్టడానికి అట్టే సమయం పట్టలేదు! – జయంతి ప్రకాశశర్మ -
ఉత్తముడి వృత్తాంతం.. ‘మహారాజా! నేను అర్ధరాత్రి నిద్రిస్తున్న సమయంలో..
ఉత్తానపాదుడికి, సురుచికి ఉత్తముడు అనే కుమారుడు జన్మించాడు. ఉత్తముడు సార్థకనామధేయుడు. సకల శాస్త్రాలు, శస్త్రవిద్యలు నేర్చుకున్నాడు. తండ్రి గతించిన తర్వాత రాజ్యాధికారం చేపట్టి, ధర్మప్రభువుగా పేరు పొందాడు. బభ్రు చక్రవర్తి కుమార్తె బహుళను ఉత్తముడు పెళ్లాడాడు.ఉత్తముడు భార్య బహుళను అమితంగా ప్రేమించేవాడు. అయినా ఆమె భర్త పట్ల విముఖురాలిగా ఉండేది. అతడు ఆమెకు దగ్గర కావాలని చూసినా, ఆమె ఏదో వంకతో అతడిని దూరం పెట్టేది. ఉత్తముడు ఒకనాడు తన మిత్రులను పిలిచి విందు ఇచ్చాడు. వాళ్లంతా తమ తమ భార్యలతో సహా వచ్చారు. విందులో అందరూ ఆనందంగా రుచికరమైన వంటకాలను ఆరగిస్తూ, మధువు సేవించసాగారు. ఉత్తముడు తన భార్య బహుళకు మధుపాత్ర అందించాడు. ఆమె అందరి ఎదుట ఉత్తముడిని తిరస్కరించి చరచరా లోపలకు వెళ్లిపోయింది. భార్య చర్యతో ఉత్తముడికి సహనం నశించింది. వెంటనే భటులను పిలిచి, ఆమెను ‘అడవిలో విడిచిపెట్టి రండి’ అని ఆజ్ఞాపించారు. కోపం కొద్ది భార్యను విడిచిపెట్టినా, ఉత్తముడికి ఆమెపై ప్రేమ తగ్గలేదు. లోలోపల బాధను అణచుకుని పాలన కొనసాగించసాగాడు.ఒకనాడు ఒక విప్రుడు ఉత్తముడి వద్దకు వచ్చాడు. ‘మహారాజా! నిన్న అర్ధరాత్రి నిద్రిస్తున్న సమయంలో ఎవరో నా భార్యను అపహరించుకుపోయారు. దయచేసి ఆమెను వెదికించి నాకు ఇప్పించు’ అని కోరాడు. ‘బ్రాహ్మణోత్తమా! నీ భార్య ఎలా ఉంటుంది?’ అడిగాడు ఉత్తముడు.‘మహారాజా! నా భార్య కురూపి. అంతేకాదు, గయ్యాళి. భార్య ఎలాంటిదైనా ఆమెను భరించడం భర్త ధర్మం. అందువల్ల నా భార్యను వెదికి తెప్పించు. రాజుగా అది నీ ధర్మం’ అన్నాడు విప్రుడు. విప్రుడి భార్యను వెదకడానికి ఉత్తముడే స్వయంగా సిద్ధపడ్డాడు. విప్రుడిని వెంటపెట్టుకుని రథంపై బయలుదేరాడు. రాజధాని దాటిన కొంతసేపటికి ఒక అడవిని చేరుకున్నాడు. అక్కడ ఒక ముని ఆశ్రమాన్ని గమనించి, రథాన్ని నిలిపి ఆశ్రమం లోపలకు వెళ్లాడు.రాజును గమనించిన ముని, అతణ్ణి ఆదరంగా పలకరించాడు. అర్ఘ్యాన్ని తెమ్మని శిష్యుడికి చెప్పాడు. ఆ ముని రాజు వృత్తాంతం తెలుసుకుని అర్ఘ్యం ఇవ్వకుండానే ఆసనం సమర్పించి, సంభాషణ ప్రారంభించాడు. ‘మునీశ్వరా! మీ శిష్యుడు అర్ఘ్యం తేబోయి, మళ్లీ తిరిగి వెనక్కు ఎందుకు వెళ్లాడో అంతుచిక్కడం లేదు. కారణం తెలుసుకోవచ్చునా?’ అడిగాడు ఉత్తముడు. ‘రాజా! నా శిష్యుడు త్రికాలవేది. నిన్ను చూసిన వెంటనే గతంలో నువ్వు నీ భార్యను అడవిలో ఒంటరిగా వదిలేశావని తెలుసుకున్నాడు. అందుకే నువ్వు అర్ఘ్యం స్వీకరించడానికి యోగ్యతను పోగొట్టుకున్నావు’ అన్నాడు. ‘స్వామీ! నా తప్పును తప్పక దిద్దుకుంటాను. నాతో వచ్చిన ఈ విప్రుడి భార్యను ఎవరో అపహరించారు. ఆమెను ఎవరు తీసుకువెళ్లారో, ఎక్కడ బంధించారో చెప్పండి’ అడిగాడు ఉత్తముడు. ‘రాజా! ఈ విప్రుడి భార్యను బలాకుడు అనే రాక్షసుడు అపహరించాడు. ఉత్తాలవనంలో బంధించాడు’ అని చెప్పాడు.ఉత్తముడు విప్రుడిని వెంటపెట్టుకుని ఉత్తాలవనం చేరుకున్నాడు. అక్కడ రాక్షసుడి చెరలో ఉన్న విప్రుడి భార్యను చూశాడు. రాజును చూడగానే ఆమె ‘రాజా! ఎవరో రాక్షసుడు నన్ను అపహరించి ఇక్కడ బంధించాడు. ఇప్పుడు అతడు తన అనుచరులతో వనానికి అటువైపు చివరకు వెళ్లాడు’ అని చెప్పింది. ఉత్తముడు ఆమె చెప్పిన దిశగా బయలుదేరాడు. అక్కడ బలాకుడు తన అనుచరులతో కనిపించాడు. ఉత్తముడు విల్లంబులను ఎక్కుపెట్టగానే ఆ రాక్షసుడు భయభ్రాంతుడై కాళ్ల మీద పడ్డాడు. ‘ఓరీ రాక్షసా! నువ్వు వేదపండితుడైన ఈ విప్రుడి భార్యను ఎందుకు అపహరించావు?’ అని గద్దించాడు ఉత్తముడు.‘రాజా! ఈ విప్రుడు యజ్ఞాలలో రక్షోఘ్న మంత్రాలను పఠిస్తూ, నేను ఆ పరిసరాల్లో సంచరించకుండా చేస్తున్నాడు. అతడి నుంచి భార్యను దూరం చేస్తే అతడు యజ్ఞాలు చేయడానికి అనర్హుడవుతాడు. అందుకే ఆమెను అపహరించుకు వచ్చాను. అంతకు మించి నాకే దురుద్దేశమూ లేదు’ అని బదులిచ్చాడు. ‘అయితే, రాక్షసా! నువ్వు ఆమెలోని దుష్టస్వభావాన్ని భక్షించి, ఆమెను విప్రుడికి అప్పగించు’ అన్నాడు ఉత్తముడు.అతడు సరేనంటూ, ఆమెలోని దుష్టస్వభావాన్ని భక్షించి, ఆమెను సురక్షితంగా విప్రుడికి అప్పగించి వచ్చాడు. ‘రాజా! ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నన్ను తలచుకుంటే వచ్చి సాయం చేస్తాను’ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు బలాకుడు.విప్రుడి భార్యను అప్పగించాక ఉత్తముడు తన భార్య ఆచూకీ కోసం తిరిగి ముని ఆశ్రమానికి వచ్చాడు.‘నీ భార్యను కపోతుడనే నాగరాజు మోహించి, రసాతలానికి తీసుకుపోయాడు. అతడి కూతురు నంద నీ భార్యను రహస్యంగా అంతఃపురంలో దాచింది. నాగరాజు కొన్నాళ్లకు తిరిగి వచ్చి తాను తెచ్చిన వనిత ఏదని అడిగితే కూతురు బదులివ్వలేదు. దాంతో కోపించి, ‘నువ్వు మూగదానిగా బతుకు’ అని శపించాడు. ఇప్పుడు నీ భార్య నాగరాజు కూతురి సంరక్షణలో సురక్షితంగా ఉంది’ అని చెప్పాడు ముని.ఉత్తముడు వెంటనే బలాకుడిని తలచుకున్నాడు. నాగరాజు చెరలో ఉన్న తన భార్యను తీసుకురమ్మని చెప్పాడు. బలాకుడు ఆమెను అక్కడి నుంచి విడిపించి తెచ్చి ఉత్తముడికి అప్పగించాడు. — సాంఖ్యాయనఇవి చదవండి: ఆ నీళ్లు.. దేన్నైనా 'రాయిగా మార్చేస్తున్నాయంటే నమ్ముతారా'? -
మధిర టు తిరుపతి.. ‘సారూ.. ఆ రైలేదో చెబితే ఎక్కుదామని..!'
‘సారూ..’ అన్న శబ్దం నా చెవి గూబను కాస్త గట్టిగానే చరిచింది. నా భార్యతో మాటలకు మధ్యలో కామా పెట్టి, ఎవరాని అటు దిరిగి చూశాను. వయస్సు అర్ధసెంచరీకి అవతలిగట్టు. అరవై ఏళ్లవరకూ ఉండొచ్చు. మాసిన చొక్కాకు అక్కడక్కడా చిన్నపాటి చిరుగులు. కింద లుంగీ.. ఇంకొంచెం పెద్ద చిరుగులతో చొక్కాను డామినేట్ చేస్తోంది. నెత్తిన జుట్టు దుమ్మును పులుముకొని చిందరవందరగా వుంది. కుడికాలికి పిక్క మునిగే వరకు కట్టు. కట్టుకట్టి చాలారోజులైందన్నట్టు తెల్లటి కట్టు మట్టి పులుముకొని కనిపించింది. మనిషిని చుట్టుముట్టిన పేదరికం ఛాయలు.‘ఏంటన్నట్లు?’ అతనివైపు చూశాను. ‘సారూ.. నేను హైదరాబాద్‌కు పొయ్యే రైలెక్కాలి. ఆ రైలేదో చెబితే ఎక్కుదామని..!’ బతిమిలాడుతున్నట్లు మాట, అభినయం. ‘సరే చెబుతా! అక్కడ కూర్చోనుండు’ పక్కనే ఉన్న అరుగు చూపించి అన్నాను. ‘మర్చిపోవద్దు సారూ.. నీ కాళ్లు మొక్కుతా’ అంటూ మరింత దగ్గరగా వచ్చి నా కాళ్లపైకి వంగాడు.అతన్నుంచి జారి మందు వాసన నా ముక్కు పుటాలను తాకింది.ముఖం చిట్లించి ‘చెప్పాను కదా.. అక్కడ కూర్చో, రైలొచ్చినప్పుడు చెబుతా’ కాస్త విసుగ్గా అన్నాను.‘గట్లనే సారూ ..’ రెండడుగులు వెనక్కువేసి నిలుచున్నాడు.నేను, నా భార్య హైదరాబాద్ వెళ్లేందుకు బాపట్ల రైల్వేస్టేషన్ లో రైలు కోసం వెయిట్ చేస్తున్నాము. మా కూతురు, అల్లుడు హైదరాబాదులో కాపురంపెట్టి నెలన్నర. ప్రసవం పూర్తయి బిడ్డకు జన్మనిచ్చాక అయిదవ నెల వచ్చేవరకు కూతురు గాయత్రి మాతోనే ఉంది. అప్పటికే మనవడు గిర్వాన్ కాస్త వొళ్లుచేశాడు. కాళ్లు, చేతులు హుషారుగా ఆడించడం, కనుగుడ్లు పెద్దవిచేసి చూడడం, బోర్లా తిరగడం, మనం నవ్వితే.. నిశితంగా పరిశీలించి నవ్వడం, హెచ్చరికలకు స్పందించడం మొదలు పెట్టాడు.మనవడి మురిపెంలో అయిదు నెలలు అయిదు రోజుల్లా గడిచాయి. అల్లుడిది ప్రైౖవేటు కంపెనీలో ఉద్యోగం. తానెలాగోలా బాబును సగదీరుకుంటానని చెప్పి కూతురు హైదరాబాద్‌కు వెళ్లిపోయింది. మనవడి జ్ఞాపకాలు మరువలేక బుడ్డోన్ని చూడాలని నా శ్రీమతి తహతహలాడిపోయింది. నాకూ కాస్త అలానే ఉన్నా బయటపడలేని స్థితప్రజ్ఞత.ఇంతలో ఆరవనెల అన్నప్రాశన అని కూతురు కబురుపెట్టింది. కాగలకార్యం కాలం తీర్చినట్లు హైదరాబాద్ ప్రయాణం ఖరారైంది. రాత్రి పది గంటలకు సింహపురి ట్రైన్ లో ప్రయాణం. మనవడి కోసం బట్టలు, పెద్ద దోమతెరతో పాటు ఏమేమి తీసుకురావాలో కూతురు రెండు రోజులుగా పదేపదే లిస్ట్ చదివింది. నా శ్రీమతి.. కూతురు వద్దన్న వాటిని కూడా బ్యాగుల్లో బలవంతంగా కూర్చి ఉరువుల సంఖ్యను అయిదుకు పెంచింది.‘బయలుదేరేటప్పుడు, రైలు ఎక్కేటప్పుడు బ్యాగులను కౌంట్ చేయండి’ అన్న కూతురు ముందుచూపు సూచనలతో ఉరువులు లెక్కగట్టి రైల్వేస్టేషన్‌కు చేరుకునేసరికి రాత్రి తొమ్మిదిన్నర గంటలైంది. ప్లాట్‌ఫారంపై మరోమారు బ్యాగులు లెక్కగట్టి సంతృప్తి చెందాక అక్కడే ఉన్న అరుగుపై కూర్చుంది మా ఆవిడ. రైలు రావడానికి అరగంట సమయముంది. ‘అన్నీ సర్దావా? ఏవైనా మరచిపోయావా?’ అన్నమాటకు ‘గుర్తున్నకాడికి’ అంది. ఇంతలో కూతురు ఫోన్ . లగేజీల ప్రస్థానంపై ఆరా.ఆమె కొడుకు అన్నప్రాశన కోసం తీసుకున్న వెండి గిన్నె, స్పూన్, గ్లాసు ఎక్కడ మరచి పోతామో? అన్నది ఆమె టెన్షన్ . ఒకపక్క రైళ్ల రాకపోకల అనౌన్స్మెంట్లు, ప్రయాణికుల ఉరుకులు, పరుగులు. రైళ్లు ఎక్కి, దిగే ప్రయాణికుల రద్దీతో ప్లాట్‌ఫారాలు సందడిని నింపుకోగా, ఈ మధ్యే రంగులద్దుకున్న రైల్వేస్టేషన్ రాత్రిపూట ఎల్ఈడీ కాంతుల వెలుగుల్లో కన్నులకింపుగా కనపడుతోంది.‘సార్.. సార్’ అంటూ పెరుగెత్తుకుంటూ వచ్చాడు మళ్ళీ ఆ వ్యక్తి. ‘ఏమిటన్నట్లు?’ చూశాను.‘రైలు వస్తున్నట్టుంది సార్! హైదరాబాద్ దేనా?’ అన్నాడు. సీరియస్‌గా ముఖం పెట్టి ‘నువ్వెక్కడికెళ్లాలి?’ అన్నాను. ‘హైదరాబాద్ పొయ్యే రైలుకే సార్’‘ఎక్కడ దిగాలి?’ ఊరి పేరు చెప్పాడు. ఏపీ సరిహద్దులో ఉన్న తెలంగాణా రాష్ట్రానికి చెందిన ఊరు.‘మేమూ ఆ రైలుకే వెళుతున్నాము, మాతో పాటు ఎక్కుదువులే’ అన్నాను. ‘దండాలు దొరా.. ఈ ఒక్క సాయం చెయ్యి.. మా అయ్య కదూ’ అని మరీ వంగి కాళ్లను తాకుతూ దండం పెట్టాడు. మందు వాసన నాతోపాటు పరిసరాలనూ పలకరిస్తోంది. నేను వెనక్కు తగ్గాను. ‘మర్చిపోబాకు సారూ రైలు రాగానే నాకు చెప్పు.. ఏమీ అనుకోకు’ అంటూ చేతులు జోడించాడు.తను పదేపదే దగ్గరగా రావడం నన్ను మరింతగా ఇబ్బంది పెడుతోంది. కోపం, చిరాకు తెప్పిస్తోంది. ‘సరే.. చెబుతానన్నా గదా, రైలు రాంగానే చెబుతా, పొయ్యి అరుగు మీద కూర్చో’ అన్నాను.‘కోప్పడకు సారూ.. మరచిపోతావేమోనని చెపుతాండాలే ’ కొంచెం దూరం జరిగాడు. మరికొద్దిసేపట్లో గూడూరు– సింహపురి ఎక్స్‌ప్రెస్ మూడవ నంబర్ ప్లాట్పారంపైకి రానుందని తెలుగు, ఇంగ్లిష్, హిందీలో అనౌన్స్మెంట్. అప్పటికే కిక్కిరిసిన జనం అలర్ట్ అయ్యారు. రైలు వస్తుందంటూ తోటి ప్రయాణికులతో చర్చలు. కొందరు షాపుల్లో వాటర్ బాటిళ్లు కొంటున్నారు, ఇంకొందరు పిల్లలకు బిస్కెట్లు, కూల్‌డ్రింక్స్ కొనిపిస్తున్నారు, మరికొందరు ఫోన్లో రైలు వచ్చిందంటూ ఇంటికి కబురు చెబుతున్నారు, కొందరు బయలుదేరుతున్నామంటూ గమ్యంలోని వారికి సమాచారం చేరవేస్తున్నారు. ప్రయాణికుల కోలాహలం పెరిగింది.మరోమారు నా భార్య మా లగేజీ బ్యాగులు లెక్కగట్టింది. మా కూతురు కౌంటింగ్ సూచనల ప్రభావం ఆమెను వీడనట్లుంది. ‘బ్యాగులు అన్నీ ఉన్నాయా?’ అన్న అర్థం వచ్చేలా ఆమెవైపు చూశాను. ఈసారి ఆమె నవ్వింది. ‘సార్..సార్ ఇదో టీ తీసుకోండి, వేడివేడి టీ..’ పరుగులాంటి నడకతో వచ్చాడు ఆ వ్యక్తి. సీరియస్‌గా చూశాను. ‘మీ కోసమే తెచ్చాను, టీ తాగండి సర్’ అన్నాడు. నాకు కోపం నసాలానికెక్కింది. చుట్టుపక్కల ప్రయాణికుల దృష్టి చాలాసేపటి నుంచి మా ఇద్దరిపైనే ఉంది. ప్రతిసారీ అతను వేరెవరి దగ్గరకు వెళ్లకుండా నావద్దకు వచ్చి బతిమిలాడుతుండడంతో అందరూ ఆసక్తిగా తిలకిస్తున్నారు. మరోమారు అందరూ నావైపు చూశారు. కోపం కంట్రోల్ చేసుకున్నాను.‘ఇప్పుడే ఇంట్లో అన్నం తిని వస్తున్నాను, ఇప్పుడు టీ తాగను, నువ్వు తాగు’ ఒక్కో అక్షరం గట్టిగా నొక్కి పలికుతూ కళ్లెర్ర చేశాను.నా ఆగ్రహం పసిగట్టినట్లున్నాడు, దూరంగా వెళ్లి టీ తాగి అక్కడే నిల్చున్నాడు. ట్రైన్ వస్తోందంటూ మరోమారు అనౌన్్సమెంట్. ప్లాటుఫారంపై డిస్ప్లేలలో రైలు నంబర్, బోగీ నంబర్లు వేస్తున్నారు. అది చూసి ప్రయాణికుల్లో హడావుడి. అటూ ఇటూ వేగంగా కదులుతున్నారు. ‘సార్ రైలొచ్చిందా?’ ఈసారి కాస్త దూరం నుంచే అడిగాడు ఆ వ్యక్తి.‘ఆ.. వస్తాంది. ఇక్కడే ఉండు ఎక్కుదాం’ అన్నాను. ‘సరే.. సరే’ అంటూ నాకు దగ్గరగా వచ్చి నిల్చున్నాడు.నా భార్య మరోమారు బ్యాగులను చూపుడు వేలితో లెక్కించడం కనిపించింది. రైలు కూతతోపాటు దాని వెలుతురు తోడుగా ప్లాట్ఫారం పట్టాలపైకి భారంగా వచ్చి ఆగింది. మేమున్న దగ్గరకి కొంత అటు ఇటుగా మేము ఎక్కాల్సిన బీ–5 ఏసీ స్లీపర్ బోగి ఉంది. నా భార్య, నేను చెరో రెండు బ్యాగులు చేతికి తీసుకున్నాం. ఆదరబాదరగా వచ్చి ‘ఇటివ్వు తల్లీ’ అంటూ నా భార్య చేతిలోని రెండు బ్యాగులు తీసుకున్నాడా వ్యక్తి. ఆమె ఇంకో బ్యాగు తీసుకుంది. నా వెంటే బ్యాగులు మోసుకొచ్చాడు. బోగీలో మాకు కేటాయించిన సీట్ల వద్ద బ్యాగులు పెట్టాను. నా భార్యకు సీటు చూపించి కూర్చోబెట్టి.. ‘నీది యే బోగి?’ అడిగాను ఆ వ్యక్తిని. ‘నాదిక్కడ కాదు సారూ..’ అన్నాడు. ‘పద నీ బోగీలో దిగబెడతా’ అన్నాను. ‘నాదిక్కడ కాదులే సారూ..’ అన్నాడు మళ్లీ. ‘ఏదీ.. నీ టిక్కెట్ చూపించు? సీటెక్కడో చెబుతా’ అన్నాను. ‘టికెట్ లేదు సారూ..’ అన్నాడు.‘అదేంటి! టికెట్ తీసుకోలేదా?’ ‘లేదు సారూ.. అయినా మాకెందుకు సారూ టికెట్, మమ్మల్ని టికెట్ అడగరులే’ అన్నాడు. ‘టీసీ వచ్చి చెక్ చేస్తే?’ ‘అది మీకు సారూ.. మాకు కాదులే’ నసగుతూ అన్నాడు‘ఎందుకు?’ అన్నట్లు చూశాను. ‘నేను అడుక్కునేటోన్ని సారూ.. మాకు టిక్కెట్ గట్ల లేదులే’ అన్నాడు. ఆశ్చర్యమేసింది. మాసిన బట్టలు, ఆహార్యం చూస్తే అచ్చమైన పల్లెటూరి అమాయకుడిలా ఉన్నాడు తప్పించి మరీ అడుక్కునేవాడిలా కనిపించలేదు.‘నువ్వు అడుక్కుంటావా?’ అన్నాను. ‘అవును సారూ.. నేను బిచ్చగాన్ని’ అన్నాడు.నాముందు దాదాపు గంటపాటు రైల్వేస్టేషనులో ఉన్నాడు, నాకే టీ ఇవ్వబోయాడు, ఎవ్వరినీ డబ్బులు అడుక్కోలేదు. మనస్సు ఏదోలా అయ్యింది. తను అబద్ధం చెబుతున్నాడేమో! ‘నిజం చెప్పు నువ్వు అడుక్కుంటావా?’ అడిగాను. ‘నిజం సారూ.. నేను బిచ్చగాన్నే, ఆరేళ్లుగా అడుక్కుంటున్నాను’ అన్నాడు. ‘అంతకుముందు?’‘రైతును సారూ’ అన్నాడు. ఉలిక్కి పడ్డాను. తనవైపు తేరిపార చూశాను. రైతు కుటుంబంలో పుట్టిన నాకు తన మాటలు మనస్సులో అలజడి సృష్టించాయి. నా భార్యకు మళ్లీ వస్తానని చెప్పి తనతో పాటు బోగీల వెంట నడుస్తున్నాను. నాగటి చాళ్లలో నడచినట్లు కాలి పాదాలు తొసుకుతున్నాయి. సరిగ్గా అడుగులు వేయలేకపోతున్నాను. మనసుదీ అదే స్థితి. మెదడు గతితప్పింది.‘యే.. టిఫినీ.. టిఫినీ.. ఇడ్లీ వడా, ఇడ్లీ వడా... సార్ వాటర్.. వాటర్, కూల్‌డ్రింక్స్..’రైలు బోగీల్లో అరుపుల గోల. నా మనసు ఘోషపై ధ్యాసపెట్టిన నా చెవులు వాటిని పట్టించుకోలేదు. ఎలాగోలా జనరల్ కంపార్ట్మెంట్ కొచ్చాను. ఖాళీగా ఉన్న సీటుపై కూర్చున్నాను. ‘కూర్చో’ ఆ వ్యక్తికి సీటు చూపించాను.‘పర్లేదు సారూ నేను నిలుచుంటా’ అన్నాడు. చెయ్యిపట్టి కూర్చోబెడుతూ ‘నీ పేరు..?’ అడిగాను. ‘సోమయ్య సారూ..’‘నీ కథ వినాలని ఉంది చెప్పు సోమయ్యా..’ అన్నాను. ఒక్కక్షణం.. మొదలుపెట్టాడు.‘మాది మధిర దగ్గర పల్లెటూరు సారూ. చిన్న రైతు కుటుంబం. ఒక కొడుకు, ఒక కూతురు. రెండెకరాల మెట్ట. వానొస్తేనే పైరు, లేకుంటే బీడు. రెక్కలు గట్ల కట్టెలు జేసుకొని పని చేసేటోల్లం. అప్పులతో పెట్టుబడి, కరువులతో కష్టాలు. ఒక పంటొస్తే నాలుగు పంటలు పొయ్యేటియి. వడ్డీలు పెరిగొచ్చి అప్పులు కుప్పబడె. తీర్చే దారి దొరక్కపాయ.ఎదిగొచ్చిన కూతురును ఇంట్లో పెట్టుకోలేంగద సారూ.. ఎకరం అమ్మి బిడ్డ పెండ్లిజేస్తి. నా కష్టం పిల్లోడికొద్దని వాన్ని డిగ్రీ దాకా చదివిస్తి. అప్పులోల్లు ఇంటిమీద పడి ఆగమాగం జేస్తిరి. నానా మాటలు పడితి. అయి భరించలేక ఉరిపోసుకుందామని తీర్మానం జేసుకుంటి. భార్యా, కొడుకు దావలేని రీతిన వీధిన పడ్తరని మనసు మార్చుకుంటి. సేద్యం ఇక కుదిరేకత లేదని తీర్మానం జేసుకుంటి. ఉన్న అప్పు వడ్డీలతో గలిపి అయిదు లక్షలకు ఎగబాకె. ఎకరం అమ్మి లొల్లిజేసేటోల్లకు కొంత అప్పుగడ్తి. మా ఊర్లో నా దోస్తుగాల్లు కొందరు సేద్యం ఎత్తిపెట్టి చిన్నచిన్న యాపారాలకు బొయ్యి బాగానే సంపాదిస్తున్నారు. వో దినం నా బాధ వారికి మొరపెట్టుకుంటి.‘మాతో వస్తావా?’ అనిరి. అట్టే అని జెప్పి వొకనాడు వాల్లతో పాటు తిరుపతి రైలెక్కితి. ఎట్టోకట్ట గడ్డనెయ్యి స్వామీ అని ఎంకన్న స్వామికి మొక్కుకుంటి. తిరపతి బొయ్యి చూస్తే నా దోస్తుగాల్లు జేసే యాపారం బిచ్చమెత్తకోవడమని తెలిసె సారూ. పొద్దున లేచింది మొదలు రాత్రి దాకా అడుక్కోడమే. ‘ఇదేందయ్యా ఇట్టాంటిదానికి దెస్తిరే’ అని తొలిరోజు మనసురాక యాతనపడితి.కలోగంజో కలిగిన కాడికి నలుగురికి పెట్టినోల్లం, ఇప్పుడు అడుక్కునే రోజులొచ్చే అని కుమిలిపోతి. అప్పుతీర్చాల, కొడుకును దారిలో పెట్టాల. మనకాడ యేముందని యేం యాపారం జేస్తాం! మనసుకు నచ్చజెప్పుకుంటి. ఆ రోజు నుంచి అడుక్కోడం మొదలు పెడ్తి సారూ. రెండువారాలు బిచ్చమెత్తడం ఇంటికి రాడం, రెండు రోజులుండి మల్లీ పోడం, నెలాఖరుకు రావడం రెండు రోజులుండి మల్లీ పోడం. ఆరేండ్ల కాలం గడచిపాయ దొరా.’మనసు బాధను పంచుకొనేదానికి దోస్తానా దొరికిండనుకున్నాడేమో? ఏకబిగిన తన కథ చెప్పాడు సోమయ్య. మనసును పిండేసే కథ. నేలను కదలించే కథ. కొన్ని నిమిషాలపాటు మా మధ్యన మాటల్లేవు. అంతా నిశ్శబ్దం. రైలు ఇనప చక్రాల రోదనా నా చెవికెక్కడం లేదు.కొద్దిసేపటి తరువాత.. ‘ఇప్పుడెలా ఉంది పరిíస్థితి’ అడిగాను. ‘బాగుందిసారూ .. అప్పులు తీర్చాను, ఊర్లో పాత ఇంటిని రిపేర్ చేసుకున్నాను. కొడుకు హైదరాబాద్‌లో కంపెనీలో చేరాడు’ చెప్పాడు.‘రైతుగా పదిమందికి పెట్టినోడివి బిచ్చమెత్తడం ఇబ్బందిగా లేదా సోమయ్యా..’ ‘ఎందుకుండదు సారూ.. ఎదుటి మనిషి ముందు చేయిచాచగానే కొందరు చీదరించుకుంటారు, కొందరు పనిజేసుకొని బతకొచ్చుగా అంటారు. కొందరు అసహ్యంగా చూస్తారు. కొందరైతే నానాతిట్లు తిడతారు’ అన్నాడు.‘మాటలు పడ్డప్పుడు బాధనిపించదా?’ అన్నాను.‘అనిపిస్తుంది సారూ.. కచ్చితంగా అనిపిస్తుంది. అలా అనిపించినప్పుడల్లా రైతుగా నేను పడిన కష్టాలు కళ్ల ముందేసుకుంటాను. పంట కోసం తెచ్చిన అప్పులు గట్టమని అప్పులిచ్చినోల్లు తిట్టిన తిట్లు గుర్తుకు తెచ్చుకుంటాను. తోటి మనిషన్న జాలి లేకుండా ఇంటి మీదకొచ్చి పరువు బజారుకీడ్చినప్పుడు పడ్డ యాతన గుర్తుకు తెచ్చుకుంటాను.పెండ్లాన్ని అమ్మైనా బాకీ తీర్చాలన్న మాటలకు గుండెపగిలి ఏడ్చిన ఏడుపు గుర్తుకు తెచ్చుకుంట సారూ. చుట్టుపక్కోల్లు గుమిగూడి ఓదార్చకుండా మాట్లాడిన వెకిలి మాటలకు పడ్డ యాతన, వేదన గుర్తుకు తెచ్చుకుంటా, ఆ మాటలు పడలేక ఉరిపోసుకొని చచ్చిపోదామనుకున్న రోజులు యాదికి తెచ్చుకుంట. ఆ కష్టాలు, అవమానాల కంటే బిచ్చమెత్తుకొనేటప్పుడు పడే మాటలు సిన్నయిగా అగుపిస్తాయి సారూ. రైతుగా ఉన్న నాటి కష్టాలతో పోలిస్తే ఇప్పటి నొప్పి గుండెను పిండదు సారూ.’సోమయ్య మాటలు ఆర్ద్రంగా మారాయి. చొక్కా చెరుగుతో కళ్లను తుడుచుకున్నాడు. నా కళ్లకు సోమయ్య మసగ్గా కనపడుతున్నాడు. మనస్సు బాధగా మూలిగింది. ‘సోమయ్యా .. ఉద్యోగం చాలించి నేనూ రానా..’ ఆయన మనస్సు తేలిక చేయాలన్న ఉద్దేశంతో అన్నాను. ఒక్కసారి నావైపు చూసి చిన్నగా నవ్వాడు. ‘మీకెందుకు సారూ ఆ కర్మ? ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు’ అన్నాడు. ‘అవును సోమయ్యా! తిరుపతికే ఎందుకు వెళ్లడం అంతదూరం?’ అన్నాను.‘భక్తులు దేశం నలుమూలల్నుంచి వచ్చేతావు సారూ, పాపాలు చేసి పుణ్యం పట్టకపోయేటందుకు మొక్కులతో వస్తరు, దండిగా డబ్బులతో వస్తరు, ఖర్చుపెట్టేందుకు సిద్దపడే వస్తరు, దేవుడికింత , మాకింత’ చెప్పాడు. ‘అయితే బిక్షమెత్తి పాపులకు పుణ్యం పంచే దేవుడి ఉద్యోగం అన్నమాట’ అన్నాను. ‘ఊరుకొండి సారూ.. వెంకన్నస్వామే దేవుడు, నేను కాదు’ నవ్వుతూ అన్నాడు. సోమయ్యలో నవ్వు చూశాను. కొంచెం బాధ తగ్గింది. సెల్‌ఫోన్ లో టైమ్ చూశాను. పన్నెండు కావస్తోంది. ఎవరిగోడూ పట్టని సింహపురి ఎక్స్‌ప్రెస్ విజయవాడ దాటి మధిర వైపు వేగంగా పరుగెడుతోంది.‘మీరెల్లిపడుకోండి సారూ.. మేడం ఒక్కరే ఉంటారు, నేను ఇంకో గంటలో దిగిపోతా ’ అన్నాడు. ‘అవును సోమయ్యా.. నువ్వు బాపట్లలో ఎందుకున్నావు?’ అన్నాను. ‘తిరపతిలో తొందరతొందరగా రైలెక్కాను సారూ.. తీరాచూస్తే అది మావూరి దగ్గర ఆగదంట. అందుకే ఇక్కడ దిగాను, దసరా పండక్కు కొడుకు, కూతురు పిల్లలు ఊరికి వచ్చిండ్రు సారూ.. రేపే పండగ, మల్లీ రైలెక్కడ పోగొట్టుకుంటానో అని బయపడి మిమ్మిల్ని ఇబ్బంది పెట్టాను’ అన్నాడు.‘సరే’ అని లేచాను. ఇప్పుడు సోమయ్య దగ్గర నాకు మందు వాసన రావడం లేదు, మట్టి వాసన వస్తోంది, రైతు చమట వాసన వస్తోంది. చేయి కలిపాను. పాలకుల ఆదరణ కరువై వో రైతు కాడిదించాడు. వందల మంది జనం ఆకలి ఆర్తనాదాలు నా చెవుల్లో మారు మోగుతున్నాయి. అన్యమనస్కంగానే నా బోగీవైపు అడుగులు వేశాను. — బిజివేముల రమణారెడ్డి