గత డెబ్బయ్ రెండు గంటల్లో జరిగిన సంఘటనలు రాహుల్‌ని రోడ్ మీద పడేశాయి. వేటజంతువులా పరుగులు పెడుతున్నాడు. ఇరవై ఎనిమిదేళ్ళుంటాయి అతనికి. హైదరాబాదులో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్నాడు. త్వరలో అతని కొలీగూ, గాళ్ ఫ్రెండూ అయిన కల్పనతో వివాహం కానుంది. మూడు రోజుల క్రితం.. ఆఫీసులో సెకండ్ షిఫ్ట్ లో వర్క్ చేసి అర్థరాత్రి తరువాత మోటార్ బైక్‌లో ఇంటికి బయలుదేరాడు రాహుల్. జూబ్లీ హిల్స్ దగ్గరకు వచ్చేసరికి ఓ ప్రైవేట్ బ్యాంక్ వెనుకనున్న సందులోంచి షార్ట్–కట్ తీసుకున్నాడు, ఎప్పటిలాగే.
అదిగో, అప్పుడే కనిపించింది అతనికి.. అక్కడ వున్న ఓ ప్రైవేట్ బ్యాంక్ లోపల లైట్స్ వెలుగుతున్నట్టు. లోపల నుండి ఏవో నీడలు కదలుతున్నట్టు కిటికీలోంచి కనిపించాయి. మెయిన్ రోడ్ వైపునున్న బ్యాంక్ ముఖద్వారం మూసివుండడం గుర్తుకు వచ్చింది. ఏదో అనుమానం వచ్చింది. బైక్ ఓ పక్కగా ఆపి, వెనుక ద్వారం వైపు వెళ్ళాడు. తలుపు మెల్లగా తోసిచూస్తే తెరచుకుంది. లోపలి దృశ్యాన్ని గాంచి అవాక్కయ్యాడు. ముగ్గురు వ్యక్తులు లోపలి నుండి గుమ్మంవైపు వస్తున్నారు. వారి భుజాలపైన బరువైన సంచులు ఉన్నాయి. వారి వాలకం చూస్తే దొంగలనీ, బ్యాంక్‌ని దోచుకుంటున్నారనీ అర్థమయిపోయింది. ‘ఏయ్, ఎవరు మీరు?’ అని అరిచాడు అప్రయత్నంగా. అదే అతను చేసిన పొరపాటు!
ఉలికిపడి చూశారు వాళ్ళు. హఠాత్తుగా అక్కడ ప్రత్యక్షమైన అతన్ని చూసి అవాక్కయ్యారు. దొంగలు, రాహుల్.. ఒకరినొకరు పరీక్షగా చూసుకున్నారు. వారిలో ఒకడు జేబులోంచి పిస్టల్ తీశాడు. చటుక్కున బయటకు గెంతాడు రాహుల్. మెరుపులా పరుగెత్తి, బైక్‌ని చేరుకున్నాడు. బైక్ ఎక్కి దుండగుడి కాల్పుల మధ్య అక్కడ నుండి వేగంగా వెళ్ళిపోయాడు. దారిలో ఓ పబ్లిక్ బూత్ వద్ద ఆగి, పోలీస్ కంట్రోల్ రూమ్‌కి ఫోన్ చేసి, తన పేరు చెప్పకుండా, విషయం చెప్పాడు.
ఆ బ్యాంక్ దోపిడీ నగరంలో గొప్ప సంచలనం రేపింది. బ్యాంక్ స్ట్రాంగ్ రూమ్‌నీ, లాకర్స్‌నీ ఎలక్ట్రానిక్ పరికరాలతో కోసేశారు దొంగలు. కొన్నివేల కోట్ల ధనం, బంగారం దోపిడీ అయినట్టు బ్యాంక్ యాజమాన్యం చెప్పింది. పోలీసులకు దొంగలను గూర్చిన ఎటువంటి క్లూ దొరకలేదు. బ్యాంక్ లోపలి సీసీ టీవీ కెమెరాలు పగిలిపోయున్నాయి. వెనుక సందులో కెమెరాలు లేవు. స్నిప్ఫర్ డాగ్స్ కూడా ఏమీ చేయలేకపోయాయి.
పోలీస్ కంట్రోల్ రూమ్‌కి ఫోన్ చేసిన వ్యక్తి ఎవరో తెలియలేదు. దోపిడీకి గురైన బ్యాంక్ సమీపంలో మెయిన్ రోడ్ మీద ఉన్న సీసీ టీవీ కెమెరా ద్వారా దోపిడీ జరిగినప్పుడు అటువైపు వెళ్ళిన ఏకైక మోటార్ బైక్‌ని పోలీసులు గుర్తించారనీ, దాని రిజిస్ట్రేషన్ నంబర్ ద్వారా యజమానిని తెలుసుకోబోతున్నారనీ, తాము వెదుకుతున్న ప్రత్యక్షసాక్షి అతనే అయ్యుండాలనీ పోలీసులు గాఢంగా విశ్వసిస్తున్నారనీ...’ –టీవీ చానెల్స్ బ్రేకింగ్ న్యూస్ ఫ్లాష్ చేస్తూంటే జడుసుకున్నాడు రాహుల్. దొంగల ముఖాలను స్పష్టంగానే చూశాడు తాను. వాళ్ళను మళ్ళీ చూస్తే గుర్తుపట్టగలడు.
కానీ, తన పేరు బయటకు వచ్చిందంటే, దొంగలు తనను ఊరకే విడిచిపెట్టరు. ఒంటరిగా ఉంటున్న రాహుల్.. ఇంటికి తాళం పెట్టేసి ‘అండర్ గ్రౌండ్’కి వెళ్ళిపోయాడు! రెండురోజుల తరువాత మరో వార్త అతన్ని బెంబేలెత్తించింది.. ‘పోలీసులు దొంగల్ని పట్టుకోవడానికి టీమ్స్‌ని నలుదిశలకూ పంపించారు. వెహికిల్ రిజిస్ట్రేషన్ ఆధారంగా సాక్షిని ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా గుర్తించారు. అతనికోసం పోలీసులు వెదుకుతున్నారు. అతను దొంగల రూపాలను వర్ణించితే ఆర్టిస్ట్ చేత వారి చిత్రాలను గీయించాలనుకుంటున్నారు’ అని.
అంతేకాదు ‘సాక్షిని ఎలిమినేట్ చేసే నిమిత్తం పోలీసులతో పాటు దొంగలు కూడా అతనికోసం వెదుకుతుంటారనడంలో సందేహంలేదు’ అన్న చానెల్స్ కామెంట్స్ మరింత భయపెట్టాయి అతన్ని. ఆ గొడవ సద్దుమణిగేంతవరకు కొన్నాళ్ళపాటు సిటీ వదిలి ఎక్కడికైనా వెళ్ళిపోవాలనుకున్నాడు. ఇటు పోలీసులు, అటు దొంగలూ తనకోసం ‘వేటాడుతూంటే’ చెన్నైలో ఉన్న అతని స్నేహితుడి దగ్గరకు బయలుదేరాడు రెంటల్ కారులో.
కారు వేగంగా దూసుకుపోతోంది. రేడియో ఆన్ చేశాడు రాహుల్, అప్ డేట్స్ ఏవైనా ఉంటాయేమోనని. లేట్ నైట్ న్యూస్ చానెల్స్ స్క్రీన్ మీది స్క్రోలింగ్‌లో పోలీసులు తనను గుర్తించినట్టూ, తనకోసం వెదుకుతున్నట్టూ చదివి ఉలిక్కిపడ్డాడు. ‘అన్ని పోలీస్ స్టేషనలకూ తన ఫొటోని రహస్యంగా సర్క్యులేట్ చేశారు’ అప్రయత్నంగా తల మీది మంకీ క్యాప్‌ని ముఖం మీదకు లాక్కున్నాడు. నైట్ గాగుల్స్‌ని సరి చేసుకున్నాడు. రేడియో ఆఫ్ చేసి, యాక్సిలరేటర్ని గట్టిగా తొక్కాడు. సూర్యాపేట తరువాత ఓ పోలీస్ కానిస్టేబుల్ కారాపాడు. రాహుల్ భయపడుతూంటే, లిఫ్ట్ అడిగాడు అతను. ఎక్కించుకోక తప్పలేదు. పక్కన కూర్చుని ఏదో ఒకటి మాట్లాడుతూనే వున్నాడతను. హైదరాబాదులో జరిగిన బ్యాంక్ దోపిడీ గురించి ప్రస్తావిస్తూంటే, రాహుల్‌కి ఇబ్బందిగా వుంది.
‘ప్రత్యక్షసాక్షిని కనిపెట్టినవారికి యాభైవేలరూపాయల బహుమతిని ప్రకటించింది డిపార్ట్‌మెంట్’ చెప్పాడు కానిస్టేబుల్. ‘అతను నాకు దొరికితే అందరిలా బహుమతికి కక్కుర్తిపడను’ ఆశ్చర్యంతో చూశాడు రాహుల్.
‘అతన్ని కిడ్నాప్ చేసి వారంరోజులపాటు దాచివుంచుతాను. ఆ తరువాత కష్టపడి పట్టుకున్నట్టు బిల్డప్ ఇచ్చి డిపార్ట్‌మెంట్‌కు అప్పగిస్తాను. దాంతో నాకు హెడ్‌కానిస్టేబుల్ నుండి ఏఎస్సైగా ప్రమోషన్ ఖాయం!’ అంటూ ఫకాలున నవ్వాడతను. ‘మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది’ అన్నాడు హఠాత్తుగా. బలవంతం మీద ఉలికిపాటును ఆపుకున్నాడు రాహుల్.
టోల్ గేట్ దగ్గర దిగిపోయాడు హెడ్‌కానిస్టేబుల్. దిగుతూ ‘కొంపదీసి మేం వెదుకుతున్న ఆ సాఫ్ట్‌వేర్ ఇంజనీరు మీరు కాదుగదా?’ అన్నాడు. రాహుల్ కంగారుపడడం చూసి, ‘జోక్ చేశాన్లే. వెళ్ళి రండి’ అంటూ శాల్యూట్ చేశాడు. ‘బ్రతుకు జీవుడా!’ అనుకుంటూ రాహుల్ కారును వేగంగా ముందుకు ఉరికించాడు.
కోదాడ సమీపిస్తూండగా కల్పన ఫోన్ చేసింది..‘ఏమయిపోయావ్ రాహుల్? మూడురోజులుగా ప్రయత్నిస్తూంటే లైన్ కలవడంలేదు. ఆఫీసుక్కూడా రావడంలేదు. ఏదైనా ప్రోబ్లమా?’ అంటూ ఆత్రంగా. జరిగిందంతా అతను వివరించడంతో నిర్ఘాంతపోయిందామె. తేరుకుని, ‘టేక్ కేర్. ఐ విల్ గెట్ బ్యాక్’ అని ఫోన్ పెట్టేసింది. కారు కోదాడ నుండి గుంటూరు బాట పట్టింది. ఏదో నేరం చేసినవాడిలా చట్టం నుండి పారిపోవడం ఎలాగో ఉంది అతనికి. పోలీసులు, దొంగలూ తనకోసం జాయింటుగా నిర్వహిస్తూన్న ‘వేట’ అది!
తెల్లచీర కట్టుకున్న ఓ యువతి కారు ఆపమంటూ చేయి వూపింది. పాతికకు అటోఇటో ఉంటుంది ఆమె వయసు. ‘ప్లీజ్! నాకు లిఫ్ట్ ఇవ్వగలరా?’ అనడిగింది. రాహుల్ డైలమాలో పడిపోయాడు. ‘ఆ వేళప్పుడు ఆ స్త్రీ హైవే మీదకు ఎలా వచ్చింది? ఓ అపరిచిత యువతిని కారులో ఎక్కించుకోవడం మంచిదేనా?’ అతని సంశయాన్ని పసిగట్టిన ఆమె, ‘ఎదర ఉన్న ధాబా దగ్గర దిగిపోతాను’ అంది. ఒంటరి ఆడపిల్లను అలా వదిలి వెళ్ళిపోవడానికి మనసు రాలేదు అతనికి. పక్కకు వంగి డోర్ తెరచాడు. ఎక్కి కూర్చుందామె.
ఆ వేళప్పుడు ఆమె ఒంటరిగా అక్కడ వుండడానికి కారణం అడిగితే, ‘ప్లీజ్.. ఇప్పుడు నన్నేమీ అడక్కండి’ అంది చెంగుతో కళ్ళు తుడుచుకుంటూ. ఓ కిలోమీటరు దూరం వెళ్ళాక ధాబా ఒకటి వచ్చింది. అక్కడ ఆపమంది ఆమె. తలుపు తెరచుకుని, అతనివంక మిస్చివస్‌గా చూస్తూ, ‘మీ మెళ్ళోని గోల్డ్ చెయిన్ మందంగా, బాగుంది. దాన్ని నాకు ఇవ్వరూ?’ అనడిగింది. తెల్లబోయి చూశాడు రాహుల్. ‘గెట్ డౌన్!’ అన్నాడు విసురుగా.
చెయిన్ ఇస్తేకానీ కారు దిగనంది ఆమె. ‘చూడు, మిస్టర్! నువ్వు నీ చెయిన్ ఇవ్వకపోతే ఏమవుతుందో తెలుసా? బట్టలు చింపుకుని పెద్దగా అరుస్తాను. లిఫ్ట్ ఇస్తానంటూ నన్ను కారులో ఎక్కించుకుని నాపైన అత్యాచారం చేయబోయావని చెబుతాను. ఆ తరువాత జరగబోయే పరిణామాలకు నువ్వే బాధ్యుడివవుతావు’ అంది కూల్‌గా.
నిశ్చేష్టుడయ్యాడు రాహుల్. అతని చూపులు అప్రయత్నంగా ధాబా మీద పడ్డాయి. లారీల వాళ్ళు, ఇతర కస్టమర్సూ అరడజను పైనే ఉంటారు. ‘త్వరగా ఇవ్వు, మిస్టర్! లేకపోతే’ అంటూ పైట తీసేసి బ్లౌజ్ చింపుకోబోయింది ఆమె.
అలాంటి ఓ అనుచిత సంఘటనను ఎదుర్కోవలసివస్తుందని ఊహించలేదు అతను. అప్పటికే ధాబాలోంచి ఇద్దరు వ్యక్తులు లేచి కారు వైపు రాసాగారు. ఇప్పుడు తాను ఆ గొడవలో చిక్కుకుంటే, వ్యవహారం పోలీసుల వరకు వెళ్ళవచ్చు. అప్రయత్నంగానే మెళ్ళోని చెయిన్ తీసి ఆమె చేతిలో పెట్టాడు. కారు దిగి నవ్వుకుంటూ, వస్తూన్న వ్యక్తులకు ఎదురువెళ్ళిందామె. అదంతా ఆ హైవే మీద నడుస్తూన్న ఓ ర్యాకెట్ అని ఎరుగని రాహుల్ గంటుపడ్డ ముఖంతో యాక్సిలరేటర్ని కసిగా తొక్కాడు.
గుంటూరు చేరుకుంటుండగా కల్పన ఫోన్ చేసింది. అతను చెన్నయ్ వరకు వెళ్ళనవసరంలేదనీ, గుంటూరులో ఊరిశివార్లలో తన స్నేహితురాలి ఫ్యామిలీది ఫామ్ హౌస్ ఒకటి ఉందనీ, అక్కడ కేర్ టేకర్ తప్ప ఎవరూ ఉండరనీ, సేఫ్‌గా ఉంటుందనీ చెప్పింది. వాట్సాప్‌లో లొకేషన్ మ్యాప్‌ని పంపించింది.
ఆ ఫామ్ హౌస్‌లో రాహుల్‌కి బాగానే ఉంది. అక్కడే ఓ షెడ్‌లో ఉన్న కేర్‌టేకర్ దంపతులు ఇంటి, వంటపని చేసి పెడుతున్నారు. ఓ రోజున కేర్‌టేకర్, అతని భార్య సరుకులవీ కొనుక్కురావడానికని సిటీకి వెళ్ళారు సాయంత్రానికి తిరిగివస్తామని. రాహుల్ హాల్లో టీవీ చూస్తున్నాడు. డోర్ బెల్ మోగడంతో లేచెళ్ళి తలుపు తెరచాడు. గుమ్మంలో కనిపించిన ‘త్రయాన్ని’ చూసి– కట్టెదుట కొండచిలువను చూసినట్టు తుళ్ళిపడ్డాడు. అతన్ని చూసి వాళ్ళూ అవాక్కయ్యారు.
ముందుగా బ్యాంక్ దొంగలే తేరుకున్నారు. ‘వెదకబోయిన తీగ కాళ్ళకు చుట్టుకోవడమంటే ఇదే! పోలీసులకంటే ముందు మాకే కనపడ్డావు నువ్వు. పద, లోపలికి’ అంటూ అతన్ని తోసుకుంటూ లోపలికొచ్చి తలుపులేశారు. ఆ షాక్ నుండి రాహుల్ ఇంకా తేరుకోలేదు. తనలాగే వాళ్ళూ పోలీస్ నెట్ నుండి తప్పించుకోవడానికి హైదరాబాద్ నుండి పారిపోయివచ్చారనీ, సేఫ్‌ప్లేస్ కోసం వెదుకుతూంటే ఆ ఫామ్ హౌస్ కనిపించిందనీ ఎరుగడు అతను. ‘వాట్ ఎ బ్లడీ కోయిన్సిడె¯Œ ్స!’ అనుకున్నాడు పళ్ళు కొరుక్కుంటూ. అతన్ని వాళ్లు కుర్చీకి కట్టేశారు.
‘ప్లీజ్! మీగురించి ఎవరికీ చెప్పను. నన్ను ఏమీ చేయొద్దు’ అంటూ వేడుకున్నాడు.
‘ఆరోజు రాత్రి నువ్వు మమ్మల్ని చూసుండకపోతే, మేమిలా పరుగెత్తాల్సిన అవసరం వుండేదికాదు. నిన్ను ప్రాణాలతో వదిలి ముప్పు తెచ్చుకోమంటావా?’ అన్నాడు వారి నాయకుడు కరకుగా. ఎత్తుగా, దృఢంగా ఉన్నాడతను. మిగతా ఇద్దరిలో ఒకడు సన్నగా, పొడవుగా ఉంటే రెండోవాడు లావుగా, పొట్టిగా ఉన్నాడు.‘కేర్‌టేకర్ త్వరగా తిరిగివస్తే బావుండును!’ అనుకున్నాడు రాహుల్ మదిలో.
‘ఇక్కడ ఇంకెవరున్నారో చెప్పు’ అనడిగాడు నాయకుడు. కేర్‌టేకర్ ఉంటాడని చెప్పడంతో, ‘అతను వస్తే, మేము నీ స్నేహితులమని చెప్పు. నాలుగు రోజులపాటు ఇక్కడ వుండవలసినవాళ్ళం. అంతవరకు నిన్ను ఏమీ చెయ్యంలే’ అన్నాడు.
తక్షణప్రమాదం తప్పినందుకు ఊపిరి పీల్చుకున్నాడు రాహుల్. ‘నన్నిలా కట్టిపడేస్తే, స్నేహితులమంటే ఎవరూ నమ్మరు’ అన్నాడు. ‘అదీ నిజమేలే’ అంటూ అతన్ని బంధవిముక్తుణ్ణి చేశారు వాళ్ళు. ‘పిచ్చివేషాలేస్తే కాల్చిపడేస్తాం’ అంటూ పిస్టల్ చూపించి బెదిరించారు. కల్పన ఫోన్ చేసింది. ఆమె చెప్పేది పూర్తిగా వినిపించుకోకుండా పొడిపొడిగా జవాబిచ్చి ఫోన్ కట్ చేశాడు రాహుల్. ‘ఎవరని’ దొంగలు అడిగితే, ‘నా గాళ్ ఫ్రెండ్’ అని జవాబిచ్చాడు ముక్తసరిగా.
ఓ గంట తరువాత.. డోర్ బెల్ మోగింది. దొంగలు ప్రశ్నార్థకంగా చూస్తే, ‘కేర్‌టేకర్ తిరిగొచ్చుంటాడు’ అంటూ వెళ్ళి తలుపు తెరచిన రాహుల్, గుమ్మంలో కల్పనను చూసి కంగారుపడ్డాడు. ‘ఎందుకొచ్చావ్? వెళ్ళిపో!’ అంటూ తలుపు మూసేయబోయాడు. విస్తుబోతూ, ‘నేను గుంటూరు వచ్చానని చెప్పబోతే వినకుండానే లైన్ కట్ చేశావెందుకు?’’ అంటూ, లోపలికి తొంగిచూసిన కల్పన, అతని వెనుకనున్న త్రయాన్ని చూసి, ‘వాళ్ళెవరు?’ అనడిగింది. ‘వీళ్ళు వాళ్ళే!’ అన్నాడు రాహుల్ అప్రయత్నంగా.
కల్పనకు ఏదో అర్థమయింది. వెంటనే, ‘సరే, నువ్వు స్నేహితులతో ఉన్నట్టున్నావు. నేను మళ్ళీ వస్తాను’ అంటూ వెనుదిరగబోయింది.
‘మమ్మల్ని చూశాక ఎక్కడికీ వెళ్ళేది? రా లోపలికి’ అంటూ ఆమె చేయి పట్టుకుని లోపలికి లాగాడు ఓ వ్యక్తి. ‘ప్లీజ్! ఆమెకేమీ తెలియదు. వెళ్ళనివ్వండి’ అంటూ రాహుల్ మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు.
దొంగలనాయకుడి చూపులు కల్పన మీదే ఉండడం రాహుల్‌కి అసహనం కలిగించింది. కల్పన అదేమీ పట్టించుకోకుండా టీవీ ముందు కూర్చుంది. నాయకుడు ఆమె దగ్గరకు వెళ్ళి భుజమ్మీద చేయివేశాడు. విదిలించికొట్టిందామె. ఇంకోసారి భుజమ్మీద చేయివేయబోతుంటే కోపంతో చెంప పగులగొట్టింది కల్పన. రాహుల్ అటు వెళ్ళబోతే, అతని రెక్కలు విరిచి పట్టుకున్నారు మిగతా ఇద్దరూ. ‘ఆమెను ఏమైనా చేశారంటే మిమ్మల్ని చంపేస్తాను!’ ఆవేశంతో అరిచాడు అతను.
హేళనగా నవ్వారు వాళ్ళు. తనను పట్టుకున్నవారిలో ఒకణ్ణి కాలితో తన్నాడు రాహుల్. రెండోవాణ్ణి తలతో ముఖం మీద కొట్టాడు. వారి పట్టు వీగిపోవడంతో, ఒక్క వురుకులో నాయకుడి వైపు గెంతి అతని గుండె మీద తన్నాడు. అతను వెనక్కి తూలి నిలువరించుకుంటూ రాహుల్‌నీ తన్నాడు. రాహుల్ కింద పడిపోయాడు. అంతలో సన్నటివాడు పిస్టల్ తీసి రాహుల్‌కి గురిపెట్టాడు. ‘చెప్పు, బాస్! వీణ్ణి చంపేయమంటావా?’ అంటూ. కల్పన టీపాయ్ మీదున్న ఫ్లవర్ వేజ్‌ని తీసి వాడి మీదకు విసిరింది. అది తగిలి పిస్టల్ పడిపోయింది. రాహుల్ పైకి లేచి కల్పన వద్దకు వెళ్ళి ఆమెకు సపోర్ట్‌గా నిలుచున్నాడు. సన్నటివాడు పిస్టల్ తీసి వారికి గురిపెట్టాడు. అదే సమయంలో డోర్ బెల్ మోగింది. ‘కేర్‌టేకర్ తిరిగొచ్చే వేళయింది’ అన్నాడు రాహుల్.
నాయకుడి సైగనందుకున్న సన్నటివాడు వెళ్ళి గడ తీశాడు. ఓ చేత్తో పిస్టల్ పట్టుకుని తలుపు నెమ్మదిగా తెరచాడు. బైటనుండి కాలితో తన్నడంతో తలుపు భళ్ళున తెరచుకుంది. ఆ విసురుకు వాడు వెనక్కి పడిపోయాడు. గుమ్మంలో కేర్‌టేకర్ కాదు మఫ్టీలో వున్న క్రైమ్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ శివరామ్!
‘దిసీజ్ పోలీస్’ దర్పంగా ఎనౌ¯Œ ్స చేశాడు అతను. దొంగలు ఉలిక్కిపడ్డారు. కిందపడ్డవాడు పిస్టల్ ఎత్తాడు. వాడి చేతిమీద రివాల్వర్‌తో షూట్ చేశాడు శివరామ్. పిస్టల్ ఎగిరిపడింది. వాడి చేతినుండి రక్తం చిప్పిల్లింది. నాయకుడు తేరుకుని పిస్టల్ తీస్తూంటే అతని మీదకు ఉరికాడు రాహుల్. అతను కొట్టిన దెబ్బకు వెనక్కి తూలుతూనే షూట్ చేశాడు నాయకుడు. బులెట్ రాహుల్ భుజానికి గాయంచేస్తూ రాసుకుపోయింది. మఫ్టీపోలీసులు బిలబిలమంటూ లోపలికి వచ్చారు. ముగ్గురు దొంగలనూ అదుపులోకి తీసుకున్నారు.
‘రాహుల్ తన ఫియా¯Œ ్సతో టచ్‌లో ఉంటాడన్న ఆలోచనతో కల్పన సెల్ ఫోన్‌ని ట్రాక్ చేసి ఇక్కడికి రాగలిగాం’ చెప్పాడు ఇ¯Œ స్పెక్టర్ శివరామ్. ‘వెల్, దొంగలు కూడా ఇక్కడ దొరుకుతారని ఊహించలేదు!’ అన్నాడు. -తిరుమల శ్రీ
Comments
Please login to add a commentAdd a comment