Crime Story
-
అల్లుడు యముడు!
అజిత్‌కుమార్ లండన్‌లో ఫార్మసిస్ట్. అతడి భార్య, ఆమె కుటుంబసభ్యులు హైదరాబాద్‌లో ఉంటారు. అతడు లండన్‌లో ఉంటూనే, హైదరాబాద్‌లో ఉంటున్న భార్య కుటుంబసభ్యులపై 2023లో విషప్రయోగం చేశాడు. విషప్రయోగానికి అతడి అత్త మరణించింది. అత్తవారి కుటుంబంలోని మరో ఐదుగురు అస్వస్థులయ్యారు. ఈ సంఘటనపై మియాపూర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు తొమ్మిదిమందిని అరెస్టు చేశారు. అజిత్‌పై ఇక్కడి కోర్టు అరెస్టు వారంట్ జారీ చేయడంతో ఇటీవల లండన్ పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అతడిని హైదరాబాద్ తీసుకురావడానికి సైబరాబాద్ పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.మియాపూర్ గోకుల్ప్లాట్స్కు చెందిన హనుమంతరావు, ఉమామహేశ్వరి దంపతుల కుమార్తె డాక్టర్ శిరీషకు 2018 జూన్ 23న అజిత్‌కుమార్‌తో పెళ్లి జరిగింది. భార్యాభర్తలు లండన్‌లో స్థిరపడ్డారు. వారికి ఒక కూతురు పుట్టింది. కొన్నాళ్లకు ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. భర్త వేధింపులపై శిరీష లండన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి ఇద్దరూ లండన్‌లోనే వేర్వేరుగా ఉంటూ, అక్కడి కోర్టులో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసుకున్నారు. దీంతో అజిత్ తన భార్యపైన, ఆమె కుటుంబసభ్యులపై కక్ష పెంచుకున్నాడు. వారందరినీ అంతంచేయాలని నిశ్చయించుకుని, 2023 ఫిబ్రవరిలో ఇక్కడకు వచ్చి వెళ్లాడు. తన వద్ద పనిచేసే వినోద్‌కుమార్‌కు ఈ పనిని పర్యవేక్షించే బాధ్యత అప్పగించి, మేలో అతడిని హైదరాబాద్ పంపాడు. అతడి ద్వారా నగరానికి చెందిన భవానీశంకర్, అశోక్, గోపీనాథ్‌లతో పాటు తన స్నేహితులను రంగంలోకి దించాడు.అత్తింటివారు ఉండే ఫ్లాట్స్ వాచ్మెన్ కొడుకు రమేష్‌కు డబ్బు ముట్టజెప్పి, అతడి ద్వారా అత్తింటివారి కదలికలను తెలుసుకోసాగాడు. శిరీష సోదరుడు పూర్ణేందర్కు 2023 జూన్‌లో పెళ్లి నిశ్చయమైంది. ఈ పెళ్లి కోసం శిరీష తన కూతురితో పాటు వచ్చింది. రమేష్ ద్వారా అజిత్ ఈ సంగతి తెలుసుకుని, అత్తింటివారిని అంతం చేయడానికి ఇదే అదనుగా భావించాడు. అందరూ పెళ్లి హడావుడిలో ఉండగా, విషపు ఇంజెక్షన్లతో వారిని చంపాలనుకున్నాడు. శిరీష వాళ్ల పైఫ్లాట్‌లో ఉండే పూర్ణచందర్‌ను తనవైపు తిప్పుకున్న అజిత్, అతడి సాయంతో ఈ పథకాన్ని అమలు చేయాలనుకున్నాడు. భవానీశంకర్, అశోక్, గోపీనాథ్‌లకు విషపు ఇంజెక్షన్లు ఇచ్చి, జూన్ 25న తన అత్తవారింటికి పంపాడు. ఈ పథకం పారకపోవడంతో పథకాన్ని మార్చుకున్నాడు. ఫార్మసిస్టుగా తన పరిజ్ఞానంతో స్లోపాయిజనింగ్ చేయాలని భావించాడు.అజిత్ సోదరి నగరంలోని ఒక పాఠశాలలో ఉపాధ్యాయురాలు. తన స్కూలు అవసరాల కోసం కొన్న ఆర్సెనిక్‌ను ఆమె ద్వారానే భవానీశంకర్ తదితరులకు అందేలా చేశాడు. అజిత్ సలహాపై ఈ ముగ్గురూ డెలివరీ బాయ్స్ అవతారమెత్తారు. ఆర్సెనిక్ కలిపిన పసుపు, కారం, మసాలా పొడులను శిరీష ఇంట్లోని వారికి అందించారు. పెళ్లి హడావుడిలో ఉన్న వాళ్లు వాటిని తీసుకుని, వంటల్లో వినియోగించారు. ఆ వంటకాలు తిన్న శిరీష, ఆమె తల్లిదండ్రులు, ఆమె సోదరుడు, అతడి భార్య సహా ఆరుగురు అస్వస్థులై, ఆస్పత్రి పాలయ్యారు. వారిలో శిరీష తల్లి ఉమామహేశ్వరి చికిత్స పొందుతూ జూలై 5న మరణించింది. ఎందరు వైద్యులను సంప్రదించినా, ఎన్ని ఆస్పత్రుల్లో చికిత్స పొందినా ఎవరూ ఏం జరిగిందో గుర్తించలేకపోయారు.పూర్ణేందర్ తన భార్యతో కలసి 2023 ఆగస్టు మొదటివారంలో ఆమె స్వస్థలమైన గుంటూరు వెళ్లాడు. అక్కడ ఒక సీనియర్ వైద్యుడిని ఈ దంపతులు సంప్రదించారు. దాదాపు నలభై ఏళ్ల కిందట ఇలాంటి రోగులకు చికిత్స చేసిన ఆయన, వారిపై ఆర్సెనిక్ పాయిజనింగ్ జరిగినట్లు గుర్తించారు. ఆయన సూచనపై జరిపించిన పరీక్షల్లో విషప్రయోగం జరిగినట్లు తేలడంతో, వారికి చికిత్స చేశారు. శిరీష దీని వెనుక తన భర్త అజిత్ పాత్రను అనుమానించి, 2023 ఆగస్టు 17న మియాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసి, ప్రాథమిక ఆధారాలను అందించింది. శిరీష కుటుంబం నివసించే అపార్ట్మెంట్ సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలను పరిశీలించిన పోలీసులు, వాటిలో బయటపడ్డ అంశాల ఆధారంగా వాచ్‌మన్ కొడుకు రమేష్‌ను అదుపులోకి తీసుకుని, విచారించారు. అతడి ద్వారా గుట్టు బయటపడటంతో పూర్ణచందర్, భవానీశంకర్, అశోక్, గోపీనాథ్‌లను అరెస్టు చేశారు. తన అత్తింటివారంతా చనిపోలేదని తెలుసుకున్న అజిత్‌కుమార్ మరో కుట్రకు తెరలేపాడు. దీని అమలుకు వినోద్‌ను మళ్లీ హైదరాబాద్‌కు పంపాడు. ఇది తెలుసుకున్న పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఈ కేసులో అజిత్ సహా మొత్తం పది మంది నిందితులు ఉన్నట్లు తేల్చారు. ఈ కేసులో 2023 ఆగస్టులోనే తొమ్మిది మందిని అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. అజిత్ అరెస్టు కోసం కోర్టు ఉత్తర్వులు పొంది, కేంద్ర విదేశాంగ శాఖ ద్వారా లండన్ పోలీసులను సంప్రదించారు. కేసు వివరాలను, అజిత్‌పై అరెస్టు వారంట్‌ను వారికి పంపారు. ఈ ఏడాది జనవరి రెండోవారంలో లండన్ పోలీసులు అజిత్‌ను అరెస్టు చేశారు. అజిత్ తన బెయిల్ కోసం లండన్ కోర్టులో వేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. ప్రస్తుతం లండన్ జైలులో ఉన్న అతడిని ఇక్కడకు తీసుకురావడానికి సైబరాబాద్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ∙శ్రీరంగం కామేష్ -
శిల్పీ–గౌతమ్ హత్య
1999 జూలై 3 – ఆరోజు మధ్యాహ్నం వేళ. బిహార్ రాజధాని పట్నాలోని ఫ్రజేర్ రోడ్– నగరంలోని రాజకీయ ప్రముఖులు ఉండే ప్రదేశం. ఆ వీథి గల్లీల్లో పిల్లలు ఆటలాడుకుంటూ ఉన్నారు. దాగుడు మూతలు ఆడుకుంటూ ఒక చిన్నారి బుడతడు, ఒక చిన్నారి పాప వీథిలో నిలిపి ఉన్న కారు పక్కన దాగుందామని, కారు వద్దకు చేరుకున్నారు. తెరిచి ఉన్న కారు కిటికీలోంచి కనిపించిన దృశ్యం వాళ్లను భయభ్రాంతులను చేసింది. గుక్కపట్టి ఏడుస్తూ పరుగు తీశారు. దారినపోయే ఒక పెద్దమనిషి వాళ్లను ఆపి, ‘ఎందుకు ఏడుస్తున్నారు?’ అని అడిగాడు.‘మరేమో, ఆ కారులో ఒక అన్న, ఒక అక్క చచ్చిపోయి ఉన్నారు’ వెక్కిళ్లు పెడుతూ, ఆ కారుకేసి వేలితో చూపిస్తూ, బదులిచ్చాడు బుడతడు. ఆ కారు ఎమ్మెల్యే సాధు యాదవ్ క్వార్టర్‌కు చేరువలో నిలిపి ఉంది. సాధు యాదవ్ సాక్షాత్తు బిహార్ ముఖ్యమంత్రి రబ్డీదేవి సోదరుడు, ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ బావమరిది. ఆర్జేడీ పార్టీలో పలుకుబడిగల నాయకుడు. బుడతడి సమాచారంతో ఆ పెద్దమనిషి కనిపించిన అందరికీ సంగతి చెబుతూ, దాదాపు పరుగు పెడుతున్నట్లే కారు వద్దకు చేరుకున్నాడు. కారులో ఒక యువతి, ఒక యువకుడు విగతజీవులై ఉన్నారు. యువతి శరీరంపై దుస్తులు సగం తొలగి ఉన్నాయి. కారు వద్ద గుమిగూడిన జనంలోంచి ఎవరో పోలీసులకు ఫోన్ చేశారు. క్వార్టర్ సమీపంలో కలకలం గమనించిన ఎమ్మెల్యే అనుచరులు పోలీసుల కంటే ముందే కారు వద్దకు చేరుకున్నారు. కొద్దిసేపట్లో పోలీసులు వచ్చారు. ఆర్జేడీ కార్యకర్తలు కూడా పెద్దసంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. మృతులను శిల్పీ జైన్, గౌతమ్ సింగ్‌గా గుర్తించారు. ముందురోజు ఇంటి నుంచి బయలుదేరిన వారిద్దరూ తిరిగి ఇంటికి చేరుకోలేదని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. శిల్పీ తండ్రి ఉజ్వల్‌కుమార్ జైన్. పట్నాలోని ప్రముఖ వస్త్రదుకాణం కమలా స్టోర్ యజమాని. గౌతమ్ తండ్రి డాక్టర్ బి.ఎన్.సింగ్. లండన్‌లో ఆయన సొంత క్లినిక్ నడుపుకుంటున్నాడు. శిల్పీ, గౌతమ్ ఒకరినొకరు ఇష్టపడ్డారు. వారిద్దరికీ త్వరలోనే పెళ్లి చేయాలని పెద్దలు కూడా అనుకున్నారు. శిల్పీ చదువు పూర్తయ్యాక పెళ్లికి ముహూర్తాలు పెట్టించుకోవాలని ఇరువురి కుటుంబాలూ ఒక నిర్ణయానికి వచ్చాయి. ఈలోగానే ఈ దుర్ఘటన జరిగింది. ఈ సంఘటనపై దర్యాప్తులో పట్నా పోలీసులు చేయరాని పొరపాట్లన్నీ చేశారు. రాజకీయ ఒత్తిడి వల్లనే వారు ఉద్దేశపూర్వకంగా అలా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాల సేకరణ కోసం ఎలాంటి ప్రయత్నాలూ చేయలేదు. పైగా, ఉన్నతాధికారుల ఆదేశాలతో ఒక కానిస్టేబుల్ ఆ కారును డ్రైవ్ చేసుకుంటూ పోలీస్ స్టేషన్‌కు తీసుకుపోయాడు. ఈ చర్యతో స్టీరింగ్‌పై వేలిముద్రలు సేకరించే అవకాశం లేకుండాపోయింది. కనీసం మృతదేహాలకు శవపంచనామా గాని, పోస్ట్‌మార్టం గాని జరగకముందే, కొందరు పోలీసులు అత్యుత్సాహంతో ఈ సంఘటనను జంట ఆత్మహత్యలంటూ మీడియా ముందు ప్రకటించారు. ఆర్జేడీ కార్యకర్తలు మధ్యలో కలగజేసుకుని, మృతదేహాలకు పోస్ట్‌మార్టం జరిపించడానికి కూడా నిరాకరించారు. పోలీసులు ఎలాగోలా వాళ్లకు సర్దిచెప్పి, మృతదేహాలను పోస్ట్‌మార్టంకు తరలించారు. అనుమానాస్పద పరిస్థితుల్లో మృతదేహాలు దొరికితే, పోస్ట్‌మార్టం రిపోర్టు రాకుండానే, పోలీసులు ఆత్మహత్యలంటూ ప్రకటించడంపై కొన్ని మీడియా సంస్థలు తీవ్రంగా విమర్శలు చేశాయి. తర్వాత పోస్ట్‌మార్టం రిపోర్టు వచ్చాక, విషం పుచ్చుకోవడం వల్లనే వారు మరణించారని పోలీసులు ప్రకటించారు. ఈలోగా వారు హడావుడిగా గౌతమ్ మృతదేహాన్ని దహనం చేసేశారు. శిల్పీ జైన్ పట్నా విమెన్స్ కాలేజీకి అందాలరాణి. కాలేజీ అందాల పోటీలో కిరీటాన్ని అందుకుంది. ఎప్పుడూ చిరునవ్వులు చిందిస్తూ ప్రశాంతంగా ఉండేది. కాలేజీలో ఆమె సన్నిహితులకు గౌతమ్ గురించి కూడా తెలుసు. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న వారిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారంటే ఎవరూ నమ్మలేకపోయారు. సంఘటన తర్వాత పోలీసులు వ్యవహరించిన తీరుపై చాలామంది అనుమానాలు వ్యక్తం చేశారు. సంఘటన జరిగిన ఆరు రోజులకు శిల్పీ తల్లిదండ్రులు తమ కూతురిది, ఆమె సహచరుడిది ఆత్మహత్య కాదని, ఎవరో వారిని హత్యచేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తూ, కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో పట్నా పోలీసులు వ్యవహరించిన తీరుపై కూడా వారు అనుమానాలు వ్యక్తం చేశారు.కోర్టు జోక్యం చేసుకోవడంతో ఈ కేసు పట్నా పోలీసుల నుంచి సీబీఐ చేతికి వెళ్లింది. సీబీఐ అధికారులు శిల్పీ మృతదేహం నుంచి సేకరించిన నమూనాలను డీఎన్ఏ పరీక్షల కోసం హైదరాబాద్ లాబొరేటరీకి పంపారు. హైదరాబాద్ లాబొరేటరీ రిపోర్టులో దిగ్భ్రాంతికరమైన వాస్తవం వెలుగులోకి వచ్చింది. మరణానికి ముందు శిల్పీపై పలువురు అత్యాచారం జరిపారని, ఆ హింస తట్టుకోలేకనే ఆమె మరణించి ఉండవచ్చని ఆ రిపోర్టు స్పష్టం చేసింది. ఆమె సహచరుడు గౌతమ్ మృతికి కారణాలు తెలుసుకుందామనుకుంటే, అప్పటికే అతడి మృతదేహాన్ని దహనం చేయడంతో కనీసమైన ఆధారాలు కూడా లేకుండాపోయాయి.ఈ సంఘటనలో సీబీఐ అధికారులు సాధు యాదవ్‌ను అనుమానితుడిగా గుర్తించారు. దర్యాప్తు కోసం రక్త నమూనాలు అడిగితే, ఆయన నిరాకరించాడు. నాలుగేళ్ల పాటు దర్యాప్తు సాగదీసిన సీబీఐ, ఈ కేసులో ఏమీ తేల్చలేకపోయింది. ఒక్క నిందితుడినైనా పట్టుకోలేకపోయింది. చివరకు ఏమీచేయలేక కేసు మూసేసింది. సీబీఐ ఎటూ తేల్చకుండా కేసును మూసివేయడంపై శిల్పీ జైన్ కుటుంబం బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇది జరిగిన కొద్దిరోజులకు శిల్పీ సోదరుడు ప్రశాంత్ జైన్‌ను కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు. అయితే, కొద్దిరోజుల తర్వాత అతడిని విడిచిపెట్టారు. అతడి కిడ్నాప్ కేసులో కూడా పోలీసులు నిందితులను పట్టుకోలేకపోయారు. -
Mystery: ఓ సరదా.. రెండు జీవితాలు..
అది 1983 జూలై 24, అమెరికా, లాస్ఏంజెలెస్ శివార్లలో డంప్‌యార్డ్‌లో అదే ఏడాదికి చెందిన ఒక డైరీ చెత్తకుప్పలో తెరిచినట్లుగా పడుంది. దానిలోని పేజీలు గాలికి రెపరెపలాడుతున్నాయి. అటుగా వచ్చిన అటెండెంట్ అప్రయత్నంగా ఆ డైరీ తీసి, పేజీలు తిప్పుతుంటే, అతడి చూపు ఒక వాక్యం దగ్గర ఆగిపోయింది. ‘ఈ అమెరికన్స్ సహృదయులు. వీరి మనసులు ఎంతో స్వచ్ఛంగా ఉన్నాయి’ అనే లైన్ చదివి అతడు గర్వంగా నవ్వుకున్నాడు. ఆ డైరీలోని రాతలు జూలై 21తో ఆగిపోయాయి. వెంటనే అతడు తలెత్తి చుట్టూ చూశాడు. అప్పుడే కాస్త దూరంలో చెత్తకుప్పల మధ్య ఒక హ్యాండ్ బ్యాగ్ కనిపించింది. దానిలో రెండు పాస్‌పోర్టులు, అంతకుముందు ట్రావెల్ చేసిన కొన్ని టికెట్స్ ఉన్నాయి. ఒక పాస్‌పోర్ట్, డైరీ రాసిన మారియా వాహిన్స్ అనే 25 ఏళ్ల అమ్మాయిది, రెండవ పాస్‌పోర్ట్ ఆమె స్నేహితురాలు మేరీ లిలియన్బర్(23)ది. ఇద్దరూ స్వీడిష్ యువతులే! ‘పొరబాటున వారెక్కడో వీటిని పారేసుకుంటే, ఇక్కడికి చేరి ఉంటాయి’ అని భావించిన ఆ అటెండెంట్ వాటిని పోలీసులకు ఇచ్చి, ఆ అమ్మాయిలకు అందించాలని కోరాడు.అయితే పదిరోజులు గడిచేసరికి మేరీ, మారియాలు ఏమయ్యారో తెలియడంలేదని స్వీడన్స్ నుంచి వారి పేరెంట్స్ అమెరికాకి వచ్చి, కాలిఫోర్నియా అధికారులకు కంప్లైంట్ ఇవ్వడంతో, పత్రికలు మొదటిపేజీ వార్తకు సిద్ధమయ్యాయి. అప్పటికే వారి వివరాలు రికార్డ్స్‌లో ఉండటంతో విచారణను డంప్‌యార్డ్ నుంచి మొదలుపెట్టారు.స్వీడన్ నుంచి వచ్చిన మేరీ, మారియా.. కొలరాడో, వైల్లోని ఒక రిసార్ట్ హోటల్లో చాంబర్ మెయిడ్స్‌గా పని చేసేవారు. ఒకే దేశానికి చెందినవారు కావడంతో స్నేహితులుగా మారడానికి ఎంతోకాలం పట్టలేదు. వారి స్నేహం ఇరు కుటుంబాలకు.. ఒకరికొకరు ఉన్నారన్న ధైర్యానిచ్చేది. అయితే వారిద్దరికీ పర్యాటకంపై ఆసక్తి ఉండటంతో, వారిలో హిచ్ హైకింగ్ (అపరిచితులను లిఫ్ట్ అడుగుతూ, పలు ప్రాంతాలను సందర్శించడం) చేయాలనే ఆశ మొదలైంది. హిచ్ హైకింగ్‌తో కాలిఫోర్నియా మొత్తం తిరగాలని ఇద్దరూ ప్లాన్స్ చేసుకున్నారు. పర్వతాలు, అడవులు ఉండే చోట హిచ్ హైక్ చేయడం అమ్మాయిలకు అసలు సురక్షితం కాదని తోటి స్వీడిష్ స్నేహితులతో పాటు పలువురు అమెరికన్లు కూడా వారిని హెచ్చరించారు. లాంటి ప్రమాదాన్నైనా, ఎవరి మోసాన్నైనా ముందే గ్రహించే శక్తి, తెలివి తమకున్నాయని వారు సమాధానమిచ్చేవారు. ఆత్మరక్షణ కోసం కత్తి కూడా ఉందని తీసి చూపించేవారు. అలాంటి ట్రిప్స్‌కి పోవద్దని మేరీని ఆమె తండ్రి ఓవ్ ఫోన్స్ లో బతిమాలాడు. ‘ఈ ఒక్క సారికే’నని మేరీ మాటివ్వడంతో ఓవ్ ఒప్పుకున్నాడు. జూలై 12 నుంచి వారి ట్రిప్ మొదలైంది.పోలీసుల విచారణకు మారియా డైరీ చాలా ఉపయోగపడింది. ఏరోజు ఎక్కడ తిరిగారో డైరీలో పరిశీలిస్తూ, చాలామంది డ్రైవర్స్‌ని అధికారులు ప్రశ్నించారు. వారిలో కొందరు మేరీ, మారియాల ఫొటోలు చూసి గుర్తుపట్టారు. మార్క్ అనే ఒక ట్రక్ డ్రైవర్.. ‘వీళ్లకు నేను శాన్స్ డియాగో నుంచి లాస్ ఏంజెలెస్‌లోని కాంప్టన్స్ వరకు లిఫ్ట్ ఇచ్చాను. ఇలాంటి ప్రయాణాలు అమ్మాయిలు చేయడం మంచిది కాదని సలహా కూడా ఇచ్చాను’ అని చెప్పాడు. అలా రకరకాల ఆధారాలను సేకరించిన పోలీసులు.. శాంటా మారియా సమీపంలో హైవే 166పై ఒకచోట వారి బట్టలు, ఇతర వస్తువులను కనుగొన్నారు. మరో 4 వారాల తర్వాత శాంటా బార్బరా సమీపంలో వేటగాళ్లకు కుళ్లిన రెండు మృతదేహాలు కనిపించాయి. సమాచారం అందగానే అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహాలను డీఎన్ఏ పరీక్షలకు పంపించారు. అవి మేరీ, మారియాలవేనని, వారిపై లైంగిక దాడులు జరిగాయని, ఆపై కత్తితో పొడిచి చంపేశారని తేలింది. కానీ కేసు అంతకుమించి ముందుకు పోలేదు.సుమారు ఏడెనిమిదేళ్ల తర్వాత(1991లో) కాలిఫోర్నియాలోని శాన్స్ డియాగోలో ఉన్న స్వీడిష్ కాన్సులేట్‌కి ఒక అజ్ఞాత వ్యక్తి కాల్ చేసి.. ‘మేరీ, మారియాలను చంపిన కిల్లర్ ఎవరో నాకు తెలుసు!’ అనడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ‘కిల్లర్ పేరు లోరెన్స్ , అతడు కెనడాకు చెందినవాడు. ఆరడుగులుంటాడు. ప్రతి ఏడాది శీతకాలం అమెరికాలోని శాన్స్ డియాగో మీదుగా మెక్సికోకు తన వ్యాన్స్ లో ట్రెక్కింగ్‌కి వచ్చేవాడు. అలా వచ్చినప్పుడే నాకు పరిచయమయ్యాడు. అతడు తీవ్రమైన స్త్రీ ద్వేషి. సుమారు ఆరేళ్ల క్రితం తాను నన్ను కలిసినప్పుడు ఇద్దరు స్వీడిష్ అమ్మాయిలకు తన వ్యాన్స్ లో లిఫ్ట్ ఇచ్చానని చెప్పాడు. మేరీ, మారియాల మర్డర్ కేసు గమనిస్తుంటే.. లోరెన్ లిఫ్ట్ ఇచ్చిన స్వీడిష్ అమ్మాయిలు వీరే కావచ్చనిపిస్తోంది. అతడు స్త్రీ ద్వేషి కాబట్టి అతడే వారిని ఏమైనా చేసి ఉండొచ్చు’ అని అజ్ఞాత కాలర్ చెప్పాడు. అయితే అధికారులు అతడ్ని ‘మీ పేరేంటి?’ అని ఆరా తీయడంతో భయపడి ఫోన్ పెట్టేశాడు. కొంతకాలానికి అధికారులు టెక్నాలజీని ఉపయోగించి ఆ కాల్ చేసిన అజ్ఞాత వ్యక్తిని కనిపెట్టగలిగారు. మరోసారి ఆరా తీసి, అతడు అబద్ధం చెప్పడం లేదని నిర్ధారించుకున్నారు. అయితే అది కేవలం అతడి అనుమానం కావచ్చని భావించారు.1999లో స్పీడ్ ఫ్రీక్ కిల్లర్స్‌గా కాలిఫోర్నియాను వణికించిన ఇద్దరు నరరూప రాక్షసులను వేరే పలు కేసుల్లో అరెస్ట్ చేసి, నేర నిర్ధారణ చేయడంతో వారిద్దరికీ జీవిత ఖైదు పడింది. వారిద్దరూ కలిసి సుమారు 15 హత్యలు చేసినట్లు తేలింది. అయితే ఆ ఇద్దరు కిల్లర్స్‌లో ఒకడి పేరు లోరెన్స్ (అజ్ఞాత కాలర్ చెప్పిన పేరు). పూర్తి పేరు లోరెన్స్ హెర్జోగ్. ఇతడే మేరీ, మారియాలను చంపి ఉంటాడని అధికారులు నమ్మడం మొదలుపెట్టారు. అయితే ఈసారి సాక్ష్యమివ్వడానికి.. ఆ అజ్ఞాత కాలర్ అధికారులకు చిక్కలేదు. మరోవైపు అరెస్ట్ అయిన మూడేళ్లకే లోరెన్ జైల్లో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. దాంతో ఈ కేసు మిస్టరీగానే మిగిలిపోయింది. ఏదేమైనా పెద్దలు, శ్రేయోభిలాషుల హెచ్చరికలను పక్కనపెట్టి, సరదా కోసం మొండితనంతో మేరీ, మారియాలు జీవితాలనే పోగొట్టుకున్నారు. ‘ఈ అమెరికన్స్ చాలా స్నేహస్వభావులు’ అని మేరీ చాలాసార్లు తన తండ్రి ఓవ్తో చెప్పేదట. మారియా అవే మాటలు డైరీలో రాసుకుంది. నిజానికి వారి నమ్మకం అపనమ్మకమైన క్షణాల్లో.. వారి జీవితాన్ని మట్టుబెట్టిన అమెరికన్ క్రూరులెవరో నేటికీ ప్రపంచం తెలుసుకోలేకపోయింది. అసలు డైరీ, హ్యాండ్‌బ్యాగ్ డంప్‌యార్డ్‌లో ఎందుకు పడున్నాయి? హైవేపై బట్టలు, అడవిలో మృతదేహాలు దొరికాయంటే.. వారికి, కిల్లర్‌కి మధ్య ఎంతటి ఘర్షణ జరిగుంటుందో? అతడి నుంచి తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నించి ఉంటారో?! ఇలా వేటికీ సమాధానాలు లేవు.∙సంహిత నిమ్మన -
'రా.. ఇటువైపు రా.. ఇక్కడే, ఈ క్షణమే చచ్చిపో..' కథ కాదు నిజం..
‘జీవితం విలువైన బహుమతి, ఒక్కసారి మీ కుటుంబం గురించి ఆలోచించండి. దయచేసి ఒంటరిగా ఇక్కడ తిరగొద్దు.. వెంటనే క్షేమంగా తిరిగి వెళ్లిపోండి’ ఇవి ఔకీగహారా సమీపంలో కనిపించే ప్రమాద హెచ్చరికలు. ‘పో.. దూరంగా పో.. తిరిగి వెళ్లిపో.. బతుకు..’ అంటూ గమనిక బోర్డులనిండా రాతలు. అవి స్పష్టంగా కనిపిస్తున్నా.. అడవి మాత్రం ‘రా.. ఇటువైపు రా.. ఇక్కడే, ఈ క్షణమే చచ్చిపో’ అని పిలుస్తుందట. టోక్యోకు పశ్చిమంగా దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో.. ఫుజి అనే ఎత్తైన పర్వతానికి ఆనుకుని.. ఔకీగహారా అనే ఫారెస్ట్ ఉంది. అక్కడ ప్రతి మొక్కలో, ప్రతి మలుపులో విషమ గీతమే వినిపిస్తుంది. ఏదో తెలియని క్రూరత్వం రారమ్మంటూ వల విసురుతున్నట్లుగా ఉంటుంది. ‘అవన్నీ ఆత్మహత్యలకు ఆహ్వానాలే’ అంటుంటారు చాలామంది. ఈ అడవి భూమ్మీద అత్యంత భయంకరమైన ప్రదేశాల్లో ఒకటి. ప్రపంచంలోనే ఆత్మహత్యల రేటులో ఈ అడవిది రెండో స్థానం. ఏటా ఇక్కడి నుంచి సుమారు వందకు పైగా మృతదేహాలను వెలికితీస్తుంటారు. ఇది ఇంత ప్రమాదకరమైన ప్రదేశమని తెలిసి కూడా కొందరు .. ఇక్కడికే హైకింగ్‌కి వస్తుంటారు. పురాణ కథనం పురాణాల ప్రకారం.. కొన్నేళ్ల క్రితం కొంతమంది పేదలు ఇక్కడ ఆకలితో మరణించి ఆత్మలుగా మారారని ఒక కథనం. ఆ ఆత్మలు కొత్త ఆత్మల కోసం వెదుకుతూ ఉంటాయని.. అందుకే అవి అడవి సమీపానికి వచ్చిన మనుషుల్ని ఆత్మహత్యలకు ప్రేరేపిస్తుంటాయని చాలామంది నమ్ముతారు. అయితే ఈ అడవిలో చనిపోయిన శవాలు కదులుతాయని.. భీకరంగా కేకలు వేస్తుంటాయని స్థానికులు చెబుతుంటారు. మరో కథనం ప్రకారం.. పూర్వం స్థోమత లేని కుటుంబాల్లోని వృద్ధులు లేదా అనారోగ్యంతో బాధపడే బంధువులను ఈ అడవికి తీసుకొచ్చి వదిలేసేవారని.. వారంతా అక్కడే ఆకలితో చనిపోయేవారని.. వారి ఆత్మఘోషే ఈ విషాదానికి కారణమని మరో కథనం. 'సీచో మాట్సిమోటో' అనే రచయిత.. 1961లో రచించిన ‘ది టవర్ ఆఫ్ వేవ్స్’ అనే నవల వల్ల.. ‘ఔకీగహారా’ అడవి విశేషాలు బాగా పాపులర్ అయ్యాయని కొందరి అభిప్రాయం. అప్పటి నుంచే ఈ అడవి మిస్టరీని కథాంశంగా తీసుకుని.. అనేక చిత్రాలు, కథనాలు పుట్టుకొచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. శాస్త్రవేత్తల మాట్లలో.. కొందరు శాస్త్రవేత్తలు మాత్రం.. ‘ఇక్కడి ఇనుప నిక్షేపాల కారణంగా అవి దిక్సూచిగా మారి దారి తప్పించడంతో అడవిలోనే చనిపోతున్నారు. అందుకే ఈ అడవిలోకి వెళ్లాలి అనుకునే హైకర్స్.. టేప్ లేదా స్ట్రింగ్‌ని ఉపయోగించడం మంచిది’ అని సూచిస్తున్నారు. అడవి ప్రాంతం విస్తారంగా, దట్టంగా ఉండటంతో.. ఇక్కడ అడుగుపెట్టిన చాలామంది శవాలు కూడా దొరకట్లేదు. మిస్ అయిన వాళ్లని కనిపెట్టడంలో రెస్క్యూ టీమ్ కూడా ఫెయిల్ అవుతూ వచ్చింది. దాంతో ఆత్మహత్యలను, మిస్సింగ్లను నివారించడానికి.. అటవీ ద్వారాల ముందు భద్రతా కెమెరాలతో పాటు.. సెక్యూరిటీనీ పెంచారు. నిర్మానుష్యమైన ఈ అడవిలో.. నిర్ఘాంత పోయే దృశ్యాలు భయపెడుతూ ఉంటాయి. చెల్లాచెదురుగా పడి ఉన్న షూలు, బట్టలు, టోపీలతో పాటు భీతికలిగించే బొమ్మలు కూడా ఉంటాయి. అవన్నీ చెట్టు కొమ్మలతో తాళ్లు మెలిపెట్టి బొమ్మల్లా అల్లినట్లు ఉంటాయి. చూడటానికి రాక్షసుల్లా కనిపిస్తూ ఉంటాయి. అయితే వాటిని ఎవరు అలా పెట్టారో ఎవరికీ తెలియదు. మనిషి పుర్రెలు, ఎముకలు అక్కడక్కాడా అగుపిస్తూ హడలెత్తిస్తుంటాయి. చనిపోయిన వారి శవాలు కూడా దిష్టిబొమ్మల్లా.. ఊడలమర్రిపై దయ్యాల్లా వేలాడుతూ భయపెడుతూ ఉంటాయి. ఏదిఏమైనా ఈ అడవి.. మనుషుల్ని ఆత్మహత్యలకు ఎలా ప్రేరేపిస్తోంది? అక్కడ తాళ్లతో రాక్షసుల రూపాలను ఎవరు తయారు చేశారు? వంటివన్నీ మిస్టరీలుగానే మిగిలిపోయాయి. - సంహిత నిమ్మన -
కుమారుని మృతదేహం పక్కన లేఖ.. వెలుగులోకి కీలక విషయాలు
భళ్లారి: నాలుగేళ్ల కుమారుడిని మైండ్‌పుల్ ఏఐ సీఈఓ సుచనా సేథ్ హత్య చేసిన కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బాలుని మృతదేహాన్ని ఉంచిన బ్యాగులో ఓ లేఖ లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. విడిపోయిన భర్త తన కుమారున్ని కలవడానికి అనుమతించిన కోర్టు తీర్పుపై ఆవేదన వ్యక్తం చేస్తూ సుచనా నోట్లో పేర్కొన్నట్లు పోలీసులు వెల్లడించారు. టిష్యూ పేపర్‌పై ఐలైనర్ వాడి సుచనా లేఖ రాసినట్లు తెలుస్తోంది. ' ఏం జరిగినా సరే కుమారుడు నా వద్దే ఉండాలి. కోర్టు విడాకులు మంజూరు చేసినా సరే.. కస్టడీ హక్కు నాకే దక్కాలి. " అని ఆమె అందులో పేర్కొంది. హత్య అనంతరం బాలుని మృతదేహం వద్ద ఈ లేఖ పెట్టినట్లు తెలుస్తోంది. సుచనా మానసిక పరిస్థితిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పోలీసుల విచారణకు సుచనా సహకరించడం లేదని సమాచారం. కుమారున్ని చంపినందుకు ఆమెలో కొంచెం కూడా మానసిక పశ్చాత్తాపం కనిపించడం లేదని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆమెకు ఆరోగ్య, మానసిక పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. బ్యాగులో దొరికిన లేఖను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్లు తెలుస్తోంది. భార్య-భర్తల మధ్య విబేధాల కారణంగా కొడుడు కస్టడీ విషయంలో కోర్టు ఇచ్చిన తీర్పు కారణంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన సుచనా సేథ్ 2010లో కేరళకు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. తొమ్మిదేళ్ల తర్వాత కుమారుడు జన్మించాడు. ఆ తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. 2020లో దంపతులిద్దరు కోర్టు నుంచి అనుమతి తీసుకొని దూరంగా ఉంటున్నారు. ప్రతి ఆదివారం కుమారునితో కాసేపు తండ్రి గడిపేవాడు. ఇది ఏమాత్రం ఇష్టంలేని కసాయి తల్లి.. కొడుకును చంపేయాలని, తద్వారా భర్తపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: Suchana Seth Planned Murder: భరణంగా నెలకు రూ.2.5 లక్షలు -
కూతుర్ని చంపిన హంతకుల కోసం హీరోలా వేటాడాడు ఓ తండ్రి..ఏకంగా రూ. 16 కోట్లు..
ఓ తండ్రి అంతులేని ప్రేమకు నిదర్శనమే ఈ గాథ. కూతురు ఆకస్మిక మరణం ఆ తండ్రిని నిలువనీయలేదు. ఎందుకు చనిపోయింది? ఎలా చనిపోయిందన్న ప్రశ్నలు అతడ్ని కుదురుగా ఉండనివ్వలేదు. తానే ఓ డిటెక్టివ్‌లా దర్యాప్తు చేసేలా పురిగొల్పాయి. ఒకటి, రెండు కాదు ఏకంగా 37 ఏళ్లు తన కూతురికి న్యాయం జరగాలని తపించి నిరీక్షించాడు. దేశం కానీ దేశంలో వందసార్లుకు పైగా పర్యటించాడు. డబ్బును కూడా లెక్కచేయకుండా నీళ్లలా ఖర్చుపెట్టాడు. కానీ ఇప్పటికి అతడి కూతురు హత్య చిక్కుముడి వీడని మిస్టరీలో ఉండిపోయింది. ఐతే ఆ తండ్రి తపన, ఆశ, అలుపెరగని ప్రయత్నం చివరికి ఫలించాయా అంటే... అసలేం జరిగిందంటే..తన కూతురుని చంపిన హంతకుల కోసం హీరోలా అన్వేషించిన వ్యక్తి ఇంగ్లాండ్‌కు చెందిన జాన్ వార్డ్ మరణించిన అతడి కూతురు పేరు జూలీ వార్డ్. ఆమె వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్. జూలీ మరణించేనాటికి ఆమె వయసు 28 ఏళ్లు. ఆమె బరీ సెయింట్ ఎడ్మండ్స్లోని పబ్లిషింగ్ కంపెనీలో ఉద్యోగం చేసేది. అయితే జూలీ మాసాయి మారా గేమ్ రిజర్వ్‌లో జంతువుల ఫోటోలు తీసి పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఆరు నెలలు కెన్యా పర్యటనలోనే ఉండిపోయింది. అయితే ఆమె చిరిసారిగా సెప్టెంబర్ కనిపించింది. ఆ తర్వాత నుంచి ఆమె ఆచూకి కనిపించడంలేదని తెలిసిన కొద్ది క్షణాల్లోనే ఆమె మరణించిందనే వార్త వచ్చింది. దీంతో ఏం అర్థకాని జూలీ తండ్రి ఆఘమేఘాలపై కెన్యా వెళ్లిపోయాడు. నా కూతురు ఎందుకని చనిపోయిందని అని ఆ తండ్రి ఒకటే ఆత్రుతో వెళ్లగా..అక్కడ అధికారులు ఆమెపై క్రూరమృగాలు దాడి చేసి చంపేశాయని చెప్పారు. ఐతే జూలీ తండ్రికి అధికారులు చెబుతున్నవన్నీ కట్టుకథల్లా తోచాయి. కనీసం కూతురి చివరి చూపు దక్కలేదు, పైగా ఆమె మృతదేహం కూడా కనిపించకపోవడం ఇవన్నీ జాన్ని కుదురుగా ఉండనివ్వలేదు. అధికారుల మాటలను నమ్ముతూ కూర్చొంటే.. ఏం లాభం లేదని నిర్ణయించుకుని జాన్ వార్డ్ స్వయంగా డిటెక్టివ్‌లా రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించాడు. జూన్వార్డ్ దంపతులు, జూలీ(కుడివైపు), ఇన్సెట్లో ఇద్దరు సోదరులతో దిగిన చిన్ననాటి చిత్రం అందులో భాగంగా ఫోరెన్సిక్ గురించి తనకు తానుగా నేర్చుకుని మరీ కూతురి మృతదేహం కోసం అన్వేషించాడు. జూలీని చివరిగా కనిపించిన ప్రాంతంలో ఏకంగా ఐదు విమానాలతో జల్లెడ పట్టించాడు. చివరికి ఆమె మృతదేహం ఆ రిజర్వ్‌కి దాదాపు 10 మైళ్ల దూరంలో కనిపించింది. జాన్ తన కుమార్తె దవడ, ఎడమ కాలు తదితర భాగాలను గుర్తించాడు. అయితే అవి రెండు కాలిపోయి పోదల్లో ఉన్నాయి. ఎలా చనిపోయిందనే దాని గురించి అలుపెరగకుండా దర్యాప్తు చేస్తూనే ఉన్నాడు. జూలీ అవశేషాలను ఫ్రిజర్‌లో భద్రపరిచి ఎలాగైనా హంతకులను పట్టుకోవాలని తన కూతరుకి న్యాయం చేయాలని ఎంతగానో తపించాడు. జాన్ దర్యాప్తు ఓ కొలిక్కి రాడమే కాకుండా ఆమె ఎలా చనిపోయిందో కనుకున్నాడు. దర్యాప్తులో కెన్యా అప్పటి అధ్యక్షుడు కుమారుడు జోనాథన్ మోయి జూలీపై క్రూరంగా అత్యాచారం చేసి చంపేశాడని కనుగొన్నాడు. ఆమె మృతదేహాన్ని అడవిలో పడేసి జంతువుల దాడిలో చనిపోయిందని నమ్మించాడని తెలుసుకున్నాడు. అయితే దాన్ని నిరూపించేందుకు బలమైన సాక్ష్యాధారాలు జాన్ వద్ద లేవు. ఎంతాగనో అధికారులను ప్రాధేయపడి చర్యలు తీసుకోమని చెప్పినా..కానీ వారు అధ్యక్షుడి కొడుకు కావడం వల్ల ఈ ఘటనను మభ్యపెట్టి తారుమారు చేసే కుట్రకే తెరతీశారు. ఐతే జాన్ తగ్గేదేలా అంటూ.. చేసిన దర్యాప్తు కారణంగా అధికారులు సైతం జూలీది హత్యేనని ఒప్పుకోక తప్పుకోలేదు. దీని కోసం కెనడా కోర్టులో ఏకంగా 22 సార్లు క్రాస్ ఎగ్జామిన్ని జాన్ ఎదుర్కొన్నాడంటేనే వాస్తవం ఏంటో క్లియర్‌గా అర్థమవుతుంది. ఇద్దరు సోదరులో జూలీ వార్డ్(ఫైల్‌ఫోటో) ప్రభుత్వమే తమే చేతిలో ఉన్నవాళ్లతో పోరాడటం ఎంత కష్టం అనేదానికి ఈ జూలీ కేసు ఓ ఉదాహరణ. ఆ తండ్రి కూతురు కేసు దర్యాప్తు కోసం ఏకంగా తన సొంత డబ్బు రూ. 16 కోట్ల దాక నీళ్లలా ఖర్చుపెట్టాడు. చివరి శ్వాస వరకు కూతురుకి న్యాయం జరగాలని పోరాడాడు. జూన్ వయసు ఇప్పుడూ 79 ఏళ్లు ఇటీవలే అతన మరణించాడు. అతడు మరణించడానికి రెండు వారాల ముందే అతడి భార్య జేన్ కూడా చనిపోయారు. తమ తండ్రి జాన్ ఆశ అడియాశగానే మిగిలిపోయిందని అతడి కొడుకులు బాబ్, టిమ్ చాలా ఆవేదనగా చెప్పుకొచ్చారు. తమ సోదరి కేసును తాము క్లోజ్ చేయనివ్వమని తమ తండ్రి ఎలా కెన్యా ప్రభుత్వంతో పోరాడుతూనే ఉన్నాడో అలానే తాము పోరాడతామని, ఆ బాధ్యతను తాము తీసుకుంటామని చెబుతున్నారు జాన్ కొడుకులు. జాన్ వార్డ్ కొడుకు బాబ్ వార్డ్ న్యాయం కోసం తన తండ్రి చూపిన పట్టుదల, తెగువ నమ్మశక్యం కానివని అన్నారు. జాన్ మరణించడానికి ఆరునెలల ముందు వరకు కెన్యా వెళ్లోచ్చారని చెప్పుకొచ్చారు. అంతేగాదు తన తండ్రి ఈ కేసుపై ఓ పుస్తకం కూడా రాశారని, అందుకు తాను సహకరించినట్లు బాబ్ చెప్పుకొచ్చారు. తాను, తన సోదరుడు టిమ్ దీనిపై డాక్యుమెంటరీ కూడా తీస్తామన్నారు. ఇక ఈ జూలీ కేసులో తగిన సాక్ష్యాధారాలు లేకపోవడంతో 1992లో ఆమె హత్య కేసులో అనుమానితులుగా అదుపులోకి తీసుకున్న ఇద్దరు గేమ్ రేంజర్లు నిర్దోషులుగా విడుదలయ్యారు. కెన్యా పోలీసు అధికారుల్లో కొత్త బృందం 1997లో ఈ కేసును మళ్లీ పరిశీలించింది. 1999లో ఒక గేమ్కీపర్ని ఈ కేసులో విచారించారు. కానీ, ఆయనను నిర్దోషిగా విడుదల చేశారు. 2004లో ఈ హత్యకు సంబంధించిన తీర్పును రికార్డ్ చేశారు. మళ్లీ 2010లో లండన్ డిటెక్టివ్‌ల సాయంతో కెన్యా స్థానికుల పోలీసుల ఈ కేసులో కొంత పురోగతి సాధించారు. జూలీ అవశేషాలు కనిపించిన ప్రదేశంలో జరిగిన క్రైమ్ గురించి ఓ అవగాహనకు వచ్చారు. అలాగే డీఎన్ఏ పరీక్షలు కూడా కొంత వరకు పురోగతి సాధించనట్లు తెలిపారు బాబ్. అలసు నిందితులను కనిపెట్టి ఈ కేసును చేధిస్తామని జాను కుమారుడు బాబ్ నమ్మకంగా చెబుతున్నారు. కాగా, పాపం ఆ తండ్రి కూతురుకి న్యాయం జరగాలని తపించి, తపించి అలిసిపోయి మత్యుఒడిలోకి వెళ్లిపోయాడు. కనీసం ఇప్పటికైన జూలీ కేసులో నిందులెవరనేది తెలుస్తుందా? అంతుపట్టిని మిస్టరీలా మిగిలి.., ఆ తండ్రి ప్రయత్నం వృధాగాపోతుందా? అనేది వేచి చూడాల్సిందే...! --ఆర్ లక్ష్మీ లావణ్య (చదవండి: ఆ ఇంట్లోకి అడుగుపెట్టడమే..తూలుతూ, ఊగిపోతాం! సైన్సుకే అంతుచిక్కని మిస్టరీ ప్రదేశం..) -
మిస్టరీ: అందమైన ఇంటిని శ్మశానంగా మార్చాడు, 34 ఏళ్ల తర్వాత..
నిస్సహాయతను, నిర్వేదాన్ని నింపుకున్న గుండెలో.. ఓ వెర్రి నవ్వు నిస్తేజంగా తొణికిసలాడుతుంది. ఆ నవ్వులో.. సమాజాన్ని నిలువునా కాల్చి బూడిద చేయగలిగేంత ఆవేశం ఉంటుంది. 43 ఏళ్ల వెనెస్సా బెన్నెట్‌ని కదిలిస్తే అచ్చం అలాంటి నవ్వే నవ్వుతుంది. ఎందుకంటే.. తనకు ఊహ తెలియక మునుపే.. క్రూరమైన చావు పరిచయం అయ్యింది. ఊహ తెలిసేసరికి.. ఆ చావే శరణమనిపించింది. చెల్లాచెదురైన తన బతుకుని చక్కదిద్దుకోవడానికి కొన్నేళ్లు పట్టింది. బతుకుపోరాటంలో ఇప్పటికీ తన మనసుతో తాను యుద్ధం చేస్తూనే ఉంది. ఇంతకీ ఎవరీ వెనెస్సా? అసలు తన జీవితంలో ఏం జరిగింది? వెనెస్సా గురించి ఒక మాటలో చెప్పాలంటే.. దురదృష్టానికి, అదృష్టానికి మధ్య నలిగిన ఒక జీవితం. తనకు అసలేం జరిగిందో తెలియని వయసులోనే.. తోటివాళ్ల రూపంలో.. వెకిలినవ్వులు, ఎగతాళి చూపులు తన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీశాయి. ఆ పరిస్థితికి కారణం ఎవరో తెలియక, తను ఎందుకలా ఉందో తెలియక తల్లడిల్లింది. ఊహ తెలిశాక తన కథ తనకే కన్నీళ్లు తెప్పించింది.1984 జనవరి 16 అర్ధరాత్రి ఓ రాక్షసుడు సుత్తి చేత పట్టుకుని.. అమెరికా, కొలరాడోలోని అరోరాలో.. వెనెస్సా ఇంట్లో అడుగుపెట్టాడు. ఆమెకప్పుడు మూడేళ్ల వయసు. వాడు లోపలికి అడుగుపెట్టగానే.. వెనెస్సా తండ్రి బ్రూస్ బెన్నెట్(27)ని అత్యంత క్రూరంగా సుత్తితో కొట్టి చంపేశాడు. మూడేళ్ల చిన్నారిపై లైంగికంగా.. తర్వాత తల్లి డెబ్రా(26), అక్క మెలిస్సా(7)లపై లైంగికంగా దాడి చేసి.. అదే సుత్తితో వాళ్లనూ హత్య చేశాడు. కొన్ని గంటల వ్యవధిలోనే ఆ ఇంటిని శ్మశానంగా మార్చాడు. అసలేం జరుగుతోందో తెలియని స్థితిలో వెనెస్సా ఒంటరిగా ఆ కిల్లర్ చేతికి చిక్కింది. కనికరంలేని ఆ క్రూరుడు మూడేళ్ల వెనెస్సాపై కూడా లైంగికదాడి చేసి.. సుత్తితో తీవ్రంగా కొట్టాడు. అందరిలానే ఆ పాపా చనిపోయిందనుకుని తెల్లారేసరికి పారిపోయాడు. ఉదయం పది దాటేసరికి వెనెస్సా నాన్నమ్మ కొన్నే బెన్నెట్.. ఆ ఘోరాన్ని చూసి గుండెలవిసేలా ఏడ్చింది. కాసేపటికే పోలీసులు, వైద్యులు అంతా అక్కడికి చేరుకున్నారు. రక్తపుమడుగులో పడి ఉన్న వెనెస్సా కొన ఊపిరితో ఉందని గుర్తించి.. వెంటనే ఆసుపత్రికి తరలించారు. 16ఏళ్లకే డ్రగ్స్‌కు అలవాడుపడి.. కిల్లర్ దాడికి.. వెనెస్సా దవడ, పుర్రె పగిలిపోయాయి. కాళ్లు, చేతులు విరిగిపోయాయి. శరీరం మొత్తం ఛిద్రమై.. ప్రాణం మాత్రమే మిగిలింది. రెండేళ్లకు కోలుకున్న వెనెస్సా.. తీవ్రమైన ఒత్తిడి, కోపం, అసహనం లాంటి ఎన్నో మానసిక రుగ్మతలతో బాధపడుతూ నాన్నమ్మ దగ్గరే పెరిగింది. అయితే ఇంతటి ఘోరం చేసిన కిల్లర్ ఎవరో.. ఎవరికీ తెలియలేదు. దర్యాప్తు జరుగుతున్నా.. సరైన సాక్ష్యాధారాల్లేక.. కోల్డ్ కేసుల సరసన చేరిపోయింది. కాలక్రమేణా తన కథను తెలుసుకున్న వెనెస్సా.. సమాజంపై ద్వేషాన్ని పెంచుకుంది. చెడుదారుల్లో నడిచింది. 16 ఏళ్లకే డ్రగ్స్‌కు అలవాటుపడింది. 17 ఏళ్ల వయసులో.. జీవితం మీద విరక్తి పుట్టి.. చనిపోవాలని మణికట్టుని కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. జీవితం విలువ తెలిసొచ్చింది ఏళ్లుగా కిల్లర్ కోసం.. పోలీస్ ఇన్వెస్టిగేషన్ కొనసాగినా.. ఆ అగంతుకుడు ఎవరో తేలలేదు.18 ఏళ్ల వయసులో తన ఇష్టపూర్వకంగానే గర్భవతి అయిన వెనెస్సా.. కొడుకు పుట్టిన 3 నెలలకు ‘తల్లిగా ఎలా ఉండాలో తెలియట్లేదు’ అంటూ చిల్డ్రన్స్ వెల్ఫేర్ అధికారులకు బాబుని అప్పగించేసింది. రోజురోజుకీ మానసిక ఒత్తిడి పెరుగుతూ వచ్చింది. తను, తన బాయ్‌ఫ్రెండ్ కలసి వంతెన కింద జీవించడం మొదలుపెట్టారు. తలస్నానం చెయ్యాలన్నా.. దగ్గరల్లోని ఆసుపత్రికి వెళ్లాల్సిన పరిస్థితుల్ని ఎదుర్కొంది. దొంగతనాలు, మాదకద్రవ్యాల కేసుల్లో జైలుకి కూడా వెళ్లింది. 30 ఏళ్లు వచ్చేసరికి.. ఆమెలో మార్పు మొదలైంది. జీవితం అంటే ఇది కాదు అనే ఆలోచన వచ్చింది. మనిషిగా బతకడానికి.. గతంతో సంబంధం లేదనిపించింది. దాంతో మాట, తీరు అన్నీ మార్చింది. ఫ్రాంకీ విల్లార్డ్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. మోటివేషనల్ స్పీకర్‌గా పని చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. సాటి మనిషికి సాయం చెయ్యాలనే ఆలోచనతో తన కథను ప్రపంచానికి చెప్పడం మొదలుపెట్టింది. డ్రగ్ కౌన్సెలర్ అయేందుకు డిగ్రీ కళాశాలలో చేరింది. 2018లో సుమారు 20 ఏళ్ల వయసున్న తన కొడుకుని కూడా కలుసుకుంది. ఆ రోజు వెనెస్సా మనస్పూర్తిగా నవ్వింది. ‘నేను ఒకరికి ప్రాణం పోశాననే ఆనందం.. నేనో తల్లిననే అనుభూతి చాలా గొప్పగా ఉంది’ అంటూ పొంగిపోయింది. 2018 వరకూ ఈ కేసు మిస్టరీగానే ఉంది. సరిగ్గా 34 ఏళ్ల తర్వాత.. డీఎన్ఏ ఆధారంగా కిల్లర్ ఎవరనేదానిపై ఓ స్పష్టత వచ్చింది. డీఎన్ఏతో హంతకుడు ఎవరో తేలింది షాకింగ్ విషయం ఏంటంటే.. ఆ కిల్లర్.. పరారీలో ఉన్న నిందితుడు కాదని.. 1984 ఆగస్ట్ 9 నుంచి జైలు జీవితాన్ని అనుభవిస్తున్న నేరగాడని తేలింది. అతడు సీరియల్ కిల్లర్ అలెక్స్ క్రిస్టోఫర్ ఎవింగ్ అని అందరితో పాటు వెనెస్సా అప్పుడే తెలుసుకుంది. 1984లో అతడు చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. అందులో బెన్నెట్ ఫ్యామిలీ విషాదగాథ కూడా ఒకటని.. ముందు నుంచి అనుమానాలున్నా.. డీఎన్ఏతో 2018లో క్లారిటీ వచ్చింది. 1984 జనవరి 10న లేక్‌వుడ్‌లో ప్యాట్రీషియా స్మిత్ అనే మహిళపై హింసాత్మకంగా లైంగిక దాడి చేసి, హత్య చేశాడు. అదే ఏడాది ఆగస్టు 9న నెవాడా, హేండర్సన్లో గొడ్డలితో నాన్సీ, క్రిస్ బ్యారీలపై దాడిచేసి పారిపోయాడు. ఆ కేసులోనే అతడు అరెస్ట్ అయ్యాడు. అప్పటి నుంచి నిర్బంధంలోనే ఉన్నాడు. అతడికి హ్యామర్ కిల్లర్ అనే పేరు కూడా పెట్టాయి అప్పటి వార్తా పత్రికలు. మూడు వేర్వేరు రాష్ట్రాల్లో ప్రజలపై దాడి చేసినట్లు ఆధారాలు ఉండటంతో అతడికి పెరోల్ కూడా లభించలేదు. 2021 నాటికి అతడు బెన్నెట్ కేసులో దోషిగా రుజువు కావడంతో కోర్టు.. మూడు జీవితకాలాల కారాగార శిక్షను విధించింది. దాంతో అతడు జీవితంలో బయటికి వచ్చే అవకాశాన్నే కోల్పోయాడు. ఈ కథ తెలిసిన వాళ్లంతా న్యాయం జరిగింది అన్నారు. కానీ వెనెస్సా మాత్రం.. తనకు జరిగిన అన్యాయం పూడ్చలేనిదని, అతడిలో నేను పశ్చాత్తాపం చూడలేదని చెప్పింది. సమాజంపై గౌరవం కోల్పోయింది ‘అతడి కారణంగా నేను నా వాళ్లని మాత్రమే కాదు.. సమాజంపై నమ్మకాన్నీ, గౌరవాన్నీ కోల్పోయాను. నా వ్యక్తిత్వాన్నీ కోల్పోయాను. ఇప్పటికీ నేను ప్రతిరోజూ అద్దంలో చూసుకుని.. తట్టుకోలేని వేదనను అనుభవిస్తున్నాను. తెలియని కోపం, ద్వేషం, మానసిక వేదన ఇలా అన్నీ నన్ను కుంగదీస్తూనే ఉన్నాయి. నా జీవితం నాశనమైపోయింది. దానికి ఏ పరిష్కారం లేదు’ అంటూ ఎందరో మనసుల్ని మెలిపెట్టింది. సరైన సాక్షులు లేని ఈ కథలో కిల్లర్ కేవలం డీఎన్ఏ ఆధారంగానే దొరికాడు. లేదంటే ఇప్పటికీ ఈ కథ మిస్టరీగానే ఉండిపోయేది. ∙సంహిత నిమ్మన -
హలో బ్రదర్ సినిమా మాదిరి కవల సిస్టర్స్ !..ఊహాతీతమైన ఓ మిస్టరీ గాథ
ఆత్మల మధ్య అనుసంధానమనేది మనిషి చావుపుట్టుకలకు అతీతమైనది. జ్ఞాననేత్రంతో దివ్యదృష్టిని (సిక్త్ సెన్ ్స) సాధించడం, ఎలాంటి ప్రసార సాధనం లేకుండా మనిషి నుంచి మనిషికి సమాచారాన్ని చేరవేయడం (టెలిపతీ) వంటివన్నీ మనిషి జీవితంలో ఎప్పటికీ అబ్బురాలే! అలాంటి ఊహాతీతమైన మిస్టరీ ఈవారం మీకోసం. ఇది రెండు వేరు వేరు చోట్ల, రెండు వేరు వేరు సందర్భాలను కలిపి చెప్పే సినిమా కథలాంటిది. అది 1978 అక్టోబర్ 31. అంతా హాలోవీన్ సెలబ్రేషన్ ్సలో ఉన్నారు. సాయంత్రం ఆరు తర్వాత, 19 ఏళ్ల కర్రన్, కాథీ అనే కవలలు.. తమ అక్క షారోన్, కాథీ బాయ్‌ఫ్రెండ్ లూకాస్‌తో కలసి స్థానిక క్లబ్‌కి వెళ్లారు. అక్కడ కొందరు స్నేహితుల్ని కలసి ఎంజాయ్ చేశారు. సరిగ్గా 8 అయ్యేసరికి లూకాస్‌తో కలసి కాథీ ఇంటికి బయలుదేరింది. కర్రన్ తన అక్క షారో తో ఇంకాసేపు క్లబ్‌లోనే గడపాలని నిర్ణయించుకుంది. అయితే కాథీ, లూకాస్లు ఇంటికి సమీపిస్తుండగా, ఇద్దరు ముసుగు దుండగులు వాళ్లను అడ్డుకున్నారు. తుపాకీ చూపించి.. వారి దగ్గరున్న విలువైన వస్తువులను, డబ్బును లాక్కున్నారు. అదే సమయానికి క్లబ్లో ఉన్న కర్రన్ ఉన్నట్టుండి తనకు తెలియకుండానే భయంతో వణికిపోయింది. కారణం లేకుండానే బాగా ఏడ్చింది. వెంటనే ఇంటికి వెళ్లాలని పట్టుబట్టింది. పక్కనే ఉన్న షారోన్కి ఏం అర్థం కాలేదు. కాథీ ఏదో ప్రమాదంలో పడిందని కర్ర మనసుకు తెలుస్తూనే ఉంది. తీరా ఇంటికి చేరేసరికి దగ్గర్లో లూకాస్ గాయాలతో కనిపించాడు. ఆ పరిసరాల్లో ఎక్కడా కాథీ కనిపించలేదు. కాథీని చంపేస్తామని బెదిరించి, దాడికి తెగబడిన దుండగులు ఆమెను కారులో బలవంతంగా ఎక్కించుకుని పోయారని లూకాస్ చెప్పాడు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. కాసేపటికి కాథీ నుంచి కర్రన్‌కి డైరెక్ట్ సందేశాలు రావడం మొదలయ్యాయి. టెలిపతీ మాదిరి.. ప్రమాదం తాలూకు ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ‘కాథీ ఓ కారులో బందీగా వెళుతోందని, ఆ కారు సీట్ కలర్‌తో పాటు కారులో ఉన్న కార్పెట్ కలర్ కూడా చెప్పింది కర్రన్. మొదట ఎవ్వరూ ఆమె మాటలు నమ్మలేదు. పోలీసులైతే ఆమెకి పిచ్చి అనుకున్నారు. కానీ కర్ర ఎంతో తీక్షణంగా కనురెప్పలు వాల్చకుండా, కళ్లతో చూస్తున్నట్లుగా కాథీ పరిస్థితి గురించి ప్రతి అంశాన్నీ వివరంగా చెబుతూనే ఉంది. కాథీని తీసుకెళ్తున్న కారు సమీపంలోని ఎయిర్వేస్ బూలవాడ్ వైపు వెళుతోందని చెప్పింది కర్రన్. అయితే కాథీ తలపై ఆ దుండగులు గట్టిగా కొడుతున్నారని కర్ర ఆ నొప్పిని అనుభవిస్తూ చెప్పింది. కాథీకి దెబ్బలు తీవ్రంగా తగలడంతో కర్రన్ తట్టుకోలేక విలవిల్లాడింది. తన అక్కను చంపేస్తున్నారనే భయం ఆమెను క్షణం కూడా కుదురుగా ఉండనివ్వలేదు. కానీ ఏం చేయలేని పరిస్థితి. ఆమె బాధ చూసి పోలీసులు కూడా కరిగిపోయారు. ఆమె చెప్పిన చోటికి ఆమె వెంటే పయనమయ్యారు. అయితే కాసేపటికి కాథీ నుంచి కర్రన్‌కి పరోక్ష సందేశాలు ఆగిపోయాయి. పుట్టినప్పటి నుంచి అదే బంధం.. కాథీ– కర్రన్లు 1959 ఏప్రిల్ 25న అమెరికా, టెనసీలోని మెంఫిస్‌లో జన్మించారు. సాధారణంగా కవలల్లో ఒకరికి జ్వరం వస్తే మరొకరికి జ్వరం రావడం.. ఒకరికి ఆకలేస్తే మరొకరికి ఆకలేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ కాథీ, కర్రన్ లకు ఎంత దూరంలో ఉన్నా మొదటి నుంచి ఒకరి భావోద్వేగాలు మరొకరికి అనుభవంలోకి వచ్చేవి. ఒకసారి కాథీ తన బాయ్‌ఫ్రెండ్‌తో గొడవ పడుతుంటే.. చాలా దూరంలో ఉన్న కర్రన్‌కి విపరీతమైన కోపం పొంగుకొచ్చింది. కాథీ ప్రసవవేదనను కర్రన్ కూడా అనుభవించి, అల్లాడిపోయింది. అవన్నీ సాధారణమే అనుకున్న కాథీ, కర్రన్ల జీవితంలో కాథీ కిడ్నాప్ ఘటన.. ఆ కవలల మధ్యనున్న అతీంద్రియ అనుబంధాన్ని బయటపెట్టింది. ఆ సమయంలో ఓ చోట అకస్మాత్తుగా కాథీ వెళ్తున్న కారులో ఇంధనం అయిపోయింది. కారు ఆగిపోయింది. దాంతో దుండగులు భయపడి, కారును ఓ పక్కకు నెట్టారు. ఆ దారిలో పార్క్ చేసి ఉన్న మరో కారు నుంచి ఒక దుండగుడు ఆయిల్ దొంగలిస్తుంటే, మరో దుండగుడు కాథీని అదుపుచేసే పనిలో ఉన్నాడు. ఆ గందరగోళాన్ని పసిగట్టిన కొన్ని కుక్కలు భీకరంగా మొరగడం మొదలుపెట్టాయి. ఆ అలికిడికి పక్కనే ఉన్న ఇంట్లోంచి దంపతులు బయటికి వచ్చి ‘ఎవరది’ అంటూ గద్దించారు. వెంటనే ఆ దుండగులు వారి మీద కూడా కాల్పులు జరిపి పెద్ద హంగామా సృష్టించారు. ఆ అరుపులకి ఇంకొంత మంది రావడంతో దుండగులు భయపడి.. కారు వదిలిపెట్టి, కాథీని తీసుకుని అక్కడి నుంచి పరుగుతీశారు. కాసేపటికి కర్రన్‌కి మళ్లీ కాథీ నుంచి సందేశాలు రావడం మొదలయ్యాయి. కాథీ ఎక్కడో ఓ రోడ్డు మీద పరుగు తీస్తున్నట్లుగా కర్రన్ మెదడుకు సందేశాలు వచ్చాయి. దాంతో కాథీ బతికే ఉందనే ఆనందం కర్రన్లో మళ్లీ ఉత్సాహాన్ని నింపింది. అయితే కాథీ ఒళ్లంతా చల్లగా ఉందని, ప్రాణాపాయ స్థితిలోనే ఉందని మనోనేత్రంతోనే గుర్తించి తనతో ఉన్నవాళ్లకు చెప్పింది. దాంతో కాథీ కోసం కర్రన్, షారో లతో కలసి ఆ పోలీస్ బృందం వెతుకుతూనే ఉంది. సీన్ కట్ చేస్తే.. దుండగుల కాల్పుల హంగామా, దంపతుల ఫిర్యాదుతో మరో పోలీస్ బృందం ఆ పరిసరాలను జల్లెడపట్టే పనిలో పడింది. పోలీస్ సైరన్లకు బెంబేలెత్తిన ఆ దుండగులు కాథీని వదిలి పారిపోవడం.. చావుబతుకుల మధ్య ఉన్న కాథీ ఆ పోలీస్ బృందానికి దొరకడం, ఆమెను ఆసుపత్రిలో చేర్పించడం అంతా కొన్ని నిమిషాల వ్యవధిలోనే జరిగిపోయింది. కాసేపటికి కర్రన్, షారోన్లకు, వారితో ఉన్న పోలీస్ బృందానికి ఈ సమాచారం అందింది. ప్రమాదం తర్వాత ఆ ఆసుపత్రిలోనే కాథీ, కర్రన్ కలుసుకున్నారు. కాథీ కోలుకున్నాక కర్రన్ చెప్పిన ప్రతి అంశం నిజమేనని కాథీ నిర్ధారించింది. దుండగులు దాడి చేయగానే భయంతో ఏడవడం దగ్గర నుంచి కారు సీట్ కలర్, కార్పెట్ కలర్ వరకూ అన్నీ.. కర్రన్ చెప్పినట్లే ఉన్నాయని తేలింది. దాంతో పోలీసులు సైతం నివ్వెరపోయారు. ఏదేమైనా ఈ అద్భుతం గురించి మీడియాలో పెద్దగా కథనాలేమీ రాలేదు. కాథీ, కర్రన్ల మధ్య ఉన్న బంధం శాస్త్రీయంగా నిరూపితం కాలేదు. వారికి చెందిన మరే ఇతర వివరాలు ప్రపంచానికి తెలియలేదు. అలాగే కాథీని కిడ్నాప్ చేసిన దుండగులు ఎవరూ ఇప్పటికీ పట్టుబడలేదు. దాంతో ఈ ఉదంతం మిస్టరీగానే మిగిలిపోయింది. గాంట్స్ కవలల అన్వేషణ లీసా గాంట్స్, డెబ్బీ గాంట్స్ అనే ట్విన్స్.. కవలల జీవితాల్లోని రహస్యాలను అర్థం చేసుకునేందుకు.. ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది కవలలను ఇంటర్వ్యూ చేశారు. ఆ సమయంలోనే కాథీ, కర్రన్ల అనుబంధం గురించి వారికి తెలిసింది. గాంట్స్ సిస్టర్స్ రాసిన ‘ద బుక్ ఆఫ్ ట్విన్స్’ అనే ఈ పుస్తకంలో ఆ వివరాలున్నాయి. కవలల మధ్య టెలిపతిక్ కమ్యూనికేషన్ ఉంటుందని చెబుతూ కాథీ, కర్రన్ల కథను ఆధారంగా చూపించారు. మొదటి నుంచి కర్రన్, కాథీలు మానసికంగా అనుబంధాన్ని కలిగి ఉన్నారని, ఒకరి బాధను మరొకరు అనుభవించగలరని గాంట్స్ సిస్టర్స్ పేర్కొన్నారు. సంహిత నిమ్మన (చదవండి: సైనికులు ప్రాణాలు పోతుంటే..పుతిన్ పట్టనట్లు చేస్తున్న పని చూస్తే..షాకవ్వతారు) -
వీకెండ్ ట్రిప్‌కి వెళ్లి తిరిగిరాలేదు..ఆరోజు అడవిలో ఏం జరిగింది?
ఆకస్మిక అదృశ్యాలను, అసహజ మరణాలను తిరగదోడేటప్పుడు.. ప్రతి కోణం ఉత్కంఠగానే ఉంటుంది. కానీ కొన్నింటికి ముగింపే ఉండదు. ఎంత వెతికినా దొరకదు. ఎందుకంటే అవి కల్పితాలు కావు, నిజ జీవిత కథలు. పైశాచికత్వం ముందు ఓడిపోయిన బతుకులు. అలాంటి మరో మిస్టరీనే ఇది.. 48 ఏళ్ల క్రితం.. పిక్నిక్కి వెళ్లిన కూతురు, అల్లుడు, పిల్లలు.. తన ఇంటి దగ్గర ఆగి, డిన్నర్ చేసి వెళ్తారని ఆశపడింది ఆ తల్లి. ఎందుకంటే అమెరికాలోని ఒరెగన్ రాష్ట్రం, కాపర్లోని తనింటికి.. 2 కిలో మీటర్లలోపే ఉన్న సిస్కియో పర్వతాల్లో క్యాంప్గ్రౌండ్కే వాళ్లు వెళ్లింది. రుచికరమైన వంటకాలు సిద్ధం చేసి, ఎదురు చూడసాగింది. ఎంతకూ రాకపోయేసరికి మనసెందుకో కీడు శంకించింది. దగ్గరే కావడంతో ధైర్యం చేసి క్యాంప్‌గ్రౌండ్‌కి నడిచేసింది. అక్కడ క్రీక్ రోడ్ సమీపంలోని క్యాంప్‌గ్రౌండ్‌కి వెళ్లి, తనవాళ్ల టెంట్‌ని గుర్తుపట్టింది. తీరా లోపలికి వెళ్తే అందులో ఎవ్వరూ లేరు. చిన్న టేబుల్ మీద సగం ఖాళీ చేసిన పాలడబ్బా, వెహికిల్ తాళం చెవి, అల్లుడు రిచర్డ్ కౌడెన్(28) పర్స్ కనిపించాయి. రిచర్డ్.. కూతురు బెలిండా(22), మనవడు డేవిడ్(5), ఐదు నెలల మనవరాలు మెలిసా సహా ఎవ్వరూ కనిపించలేదు. వాళ్ల వెంటవెళ్లిన పెంపుడు కుక్కలు కూడా కనిపించలేదు. దాంతో ఆ పెద్దావిడకు టెన్షన్ పెరిగిపోయింది. పైగా ఆ టెంట్లో వస్తువులన్నీ చెల్లాచెదురుగా కనిపించాయి. పర్స్‌లో 21 డాలర్లు సురక్షితంగా ఉన్నాయి. వెంటనే కూతురు, అల్లుడు వచ్చిన వాహనం కోసం వెతకడం మొదలుపెట్టింది బెలిండా తల్లి. క్రీక్ రోడ్‌పై పార్క్ చేసి ఉన్న ట్రక్కులో బాతింగ్ సూట్లు తప్ప అన్ని బట్టలూ ఉన్నాయి. బహుశా వాగుల్లో స్నానానికి వెళ్లినప్పుడు ఏదైనా ప్రమాదం జరిగిందా? ఆ ఆలోచనే ఆమెను కుదురుగా ఉండనివ్వలేదు. వెంటనే పోలీస్ స్టేషన్‌కి పరుగుతీసింది. పాలడబ్బా సాక్ష్యం సంఘటన స్థలానికి అధికారులు వచ్చారు. అక్కడ ఎలాంటి హింసాత్మక వాతావరణం కనిపించకపోవడంతో ఆ రాత్రి విచారణను అశ్రద్ధ చేశారు. మరునాడు వాళ్ల పెంపుడు కుక్కలైన బాసెట్ హౌండ్, డ్రూపీలు ‘కాపర్ జనరల్ స్టోర్’ ముందు తచ్చాడుతూ కనిపించాయి. సెప్టెంబర్ 1న ఉదయం 9 గంటలకు రిచర్డ్, కొడుకు డేవిడ్ కలసి వచ్చి.. తమ స్టోర్‌లో పాల ప్యాకెట్ కొనుక్కుని వెళ్లారని ఆ స్టోర్ యజమాని చెప్పాడు. దానికి టెంట్లో టేబుల్ మీదున్న సగం పాలడబ్బానే సాక్ష్యం. చరిత్రలోనే.. కౌడెన్ కుటుంబం వైట్ సిటీలో ఉండేవారు. 1974 ఆగస్టు 30న వీకెండ్ ట్రిప్ అంటూ ఓరెగన్ లోని అత్తగారి ఇంటి నుంచే క్యాంప్‌గ్రౌండ్‌కి వెళ్లారు. సెప్టెంబర్ 1 సాయంత్రానికల్లా అత్తగారి ఇంటికి చేరుకుని, అటు నుంచి తిరిగి వైట్ సిటీకి వెళ్లాలనేది వారి ప్లాన్. కానీ అలా జరగలేదు. వాళ్లు వెళ్లిన చోటికి పర్యాటకులు వస్తూపోతూ ఉంటారు. రిచర్డ్ ఫ్యామిలీ మిస్ అవడంతో ఆ ప్రాంతం నిఘా నీడలోకి చేరింది. జాతీయ మీడియా దీనిపై కవరేజ్ ఇవ్వడంతో కౌడెన్ కుటుంబం పట్ల సానుభూతి మొదలైంది. హైకర్స్ వల్ల.. స్థానిక వాలంటీర్లు, ఎక్స్‌ప్లోరర్ స్కౌట్స్, ఫారెస్ట్ సర్వీస్ అధికారులు, ఒరెగన్ నేషనల్ గార్డ్స్ విచారణాధికారులకు గట్టి సహకారమే అందించారు. ఫారెస్ట్ సర్వీస్ క్యాంప్ సైట్ చుట్టూ అణువణువూ గాలించారు అధికారులు. హెలికాప్టర్ల సాయంతో క్షుణ్ణంగా పరిశీలించినా ఫలితం లేదు. 1975 ఏప్రిల్ 12న ఒరెగన్ లోని ఫారెస్ట్ గ్రోవ్ నుంచి ఇద్దరు హైకర్స్ కొండపైన ఓ చెట్టుకు కట్టేసిన వ్యక్తి శవాన్ని చూశారు. అది బాగా కుళ్లిపోయింది. రంగంలోకి దిగిన పోలీసులు సమీపంలోని గుహలో ఒక మహిళ, ఇద్దరు పిల్లల శవాలను గుర్తించారు. ఆ మృతదేహాలు కౌడెన్ కుటుంబానివేనని పరీక్షల్లో తేలింది. నిజానికి ఆ ప్రదేశం వారి క్యాంప్‌సైట్ నుంచి దాదాపు 11 కిమీ దూరంలో ఉంది. శవపరీక్షల్లో బెలిండా, డేవిడ్‌లను తుపాకీతో కాల్చి, మెలిసాను బండకు బాది చంపారని తేలింది. చెట్టుకు కట్టిన తర్వాతే రిచర్డ్ చనిపోయాడని, బెలిండాతో పాటు ఇద్దరు పిల్లల్నీ వేరే చోట చంపి, గుహలో పడేశారని వైద్యులు భావించారు. షాకింగ్ విషయం సెప్టెంబర్ 1న క్యాంప్‌గ్రౌండ్‌లో ఉన్న పర్యాటకుల్ని విచారించినప్పుడు ‘ఓ లాస్ ఏంజెలెస్ ఫ్యామిలీ ఆ రోజు సాయంత్రం 5 గంటలకు పార్కులో నడుచుకుంటూ వెళుతుండగా ఇద్దరు మగవారు, ఒక మహిళ పికప్ ట్రక్‌లోంచి దిగడం చూశాం. వారు మమ్మల్ని భయాందోళనకు గురిచేశారు. అక్కడి నుంచి మేమెప్పుడు కదులుతామా అన్నట్లు ప్రవర్తించారు. అందుకే జనావాసం ఉండే చోటికి వెళ్లిపోయాం’ అంటూ చెప్పారు. అప్పుడే ఓ స్థానికుడు మరో షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు. ‘సెప్టెంబరులో కౌడెన్ కుటుంబం కోసం శోధించినప్పుడు ఆ గుహ మొత్తం నేను వెతికాను. అప్పుడు అక్కడ ఏ మృతదేహాలు లేవు’ అంటూ. ఈ క్రమంలోనే రూష్కు చెందిన డ్వైన్ లీ లిటిల్(25) అనే ఖైదీని నిందితుడిగా భావించారు. అతడు పదహారేళ్ల వయస్సులో ఓ యువకుడిపై అత్యాచారం, హత్య చేసిన నేరంపై శిక్షను అనుభవిస్తూ, కౌడెన్స్ కుటుంబం అదృశ్యానికి 3 నెలల ముందే పెరోల్ మీద విడుదలయ్యాడు. మిస్ అయిన రోజు అతడు కాపర్లోనే ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. పైగా 1975 జనవరిలో లిటిల్ దగ్గర తుపాకీ ఉందని తేల్చుకున్న పోలీసులు పెరోల్ రద్దు చేశారు. మళ్లీ 1977 ఏప్రిల్‌లో బయటికి వచ్చిన లిటిల్.. ఓ గర్భవతిపై లైంగికదాడి చేసి, తీవ్రంగా కొట్టాడు. కొంచెంలో ఆ తల్లి, బిడ్డా ప్రాణాలతో బయటపడ్డారు. ఆ కేసులో కోర్టు లిటిల్‌కి 3 జీవిత ఖైదులను విధించింది. ఇప్పటికీ మిస్టరీనే.. విచారణలో లాస్ ఏంజెలెస్ ఫ్యామిలీ చెప్పినట్లుగా పార్క్ సమీపంలో ట్రక్‌లో వచ్చిన ఇద్దరు మగవారు, ఒక మహిళ ఎవరో కాదని.. లిటిల్, అతని తల్లిదండ్రులేనని పోలీసులు బలంగా నమ్మారు. కానీ సాక్ష్యాలే లేవు. 1974 సెప్టెంబర్ 2 సోమవారం నాడు లిటిల్ కుటుంబం క్యాంప్ గ్రౌండ్ సమీపంలోనే ఉన్నారని, గెస్ట్ బుక్‌లో సంతకం కూడా చేశాడని ఓ మైనర్ సాక్ష్యమిచ్చాడు. అయితే లిటిల్ కుటుంబం ఆ ఆరోపణలను అంగీకరించలేదు. మరోవైపు లిటిల్‌తో సెల్ పంచుకున్న ఓ ఖైదీ.. కౌడెన్ కుటుంబాన్ని చంపింది తనేనని లిటిల్ తన ముందు ఒప్పుకున్నట్లుగా చెప్పాడు. కానీ నేరం రుజువు కాకపోవడంతో కౌడెన్ కుటుంబాన్ని హతమార్చింది ఎవరో? నేటికీ మిస్టరీనే. ∙సంహిత నిమ్మన -
క్రైమ్ కథనాలే స్ఫూర్తి!
సాక్షి, హైదరాబాద్: మాదాపూర్‌లో రేవ్ పార్టీ నిర్వహిస్తూ తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకు (టీఎస్–నాబ్) చిక్కిన ‘ఫిల్మ్ ఫైనాన్షియర్’కారుమూరి వెంకట రత్నారెడ్డికి సంబంధించి మరో వ్యవహారం బయటపడింది. క్రైమ్ కథనాలే స్ఫూర్తిగా నకిలీ ఐఆర్ఎస్ అధికారం ఎత్తాడని పోలీసులు గుర్తించారు. రేవ్ పార్టీ కేసులో ఇతడిని కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించామని అధికారులు తెలిపారు. ఆ తర్వాతే నిందితులు ఎందరనే అంశంపై స్పష్టత వస్తుందని చెబుతున్నారు. వెన్నెముక విరగడంతో కథ అడ్డం... గుంటూరు నగరానికి చెందిన కె.వెంకట రత్నా రెడ్డి అలియాస్ రత్నారెడ్డి అలియాస్ కేవీఆర్ రెడ్డి బీఎస్సీ పూర్తి చేశాడు. ఆపై కొన్ని కంప్యూటర్ కోర్సులు కూడా చేసి బిల్డింగ్ ఎలివేషన్స్ డిజైనర్ గా స్థిరపడ్డాడు. 2007 లో ఓ బిల్డింగ్ వర్క్ చేస్తుండగా... ప్రమాద వశాత్తూ జారి పడటంతో వెన్నుముకకు తీవ్ర గాయమైంది. ఈ గా యంతో చాలా కాలం పాటు మంచం పట్టిన రత్నారెడ్డి అప్పట్లో వార్తా పత్రికలు, చానళ్లలో వచ్చే క్రైమ్ కథనాలను ఆసక్తిగా చూసేవాడు. ఈ నేపథ్యంలోనే అనేక మంది ప్రభుత్వ అధికారులుగా చెప్పుకుంటూ అమాయకులను మోసం చేసి భారీగా దండుకుంటున్న వైనంపై వెలువడిన కథనాలు ఇతన్ని ఆకర్షించాయి. ఆ స్ఫూర్తితోనే తానూ అదే రకంగా మోసాలు చేసి తేలిగ్గా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. కేవీఆర్ రెడ్డిగా అవతారం... అనుకున్నదే తడవుగా మోసాలు ప్రారంభించేందుకు అవసరమైన సరంజామా సిద్ధం చేసుకున్నాడు. కేవీఆర్ రెడ్డి పేరుతో ఐఆర్ఎస్ అధికారిగా పేర్కొంటూ ఓ బోగస్ గుర్తింపుకార్డు తయారు చేశాడు. ఇదే పేరు, హోదాలతో కొన్ని విజిటింగ్ కార్డులు సైతం రూపొందించుకున్నాడు. తనకు తానే హైదరాబాద్‌లో ఉన్న సెంట్రల్ విజిలెన్స్ కమిషన్‌లోని కమిషనర్స్ ఫర్ డిపార్ట్మెంట్ ఎక్వయిరీస్‌లో సూపరెంటెండెంట్‌గా హోదా క్రియేట్ చేసుకున్నాడు. నగరంలోని కృష్ణనగర్ ప్రాంతానికి చెందిన నర్సింహ నుంచి రూ.6 వేలు వెచ్చించి ఓ బొమ్మ పిస్తోలు కొనుగోలు చేశాడు. గుంటూరులోని ఓ షోరూమ్‌లో ఫైనాన్స్‌పై కారు కొన్నాడు. దానిపై ప్రభుత్వ చిహ్నం ఏర్పాటు చేయడంతో పాటు నెంబర్ ప్లేట్లపై గవర్నమెంట్ వెహికిల్ అని రాయించడం ద్వారా ఉన్నతాధికారిగా ‘కలర్’ఇచ్చాడు. వీటి సాయంతో తాను ఐఆర్ఎస్ ఆఫీసర్ అని నమ్మిస్తూ ప్రభుత్వంలో మంచి పలుకుబడి ఉందని, అనేక ప్రాజెక్టులు ఇప్పిస్తానని మోసాలకు తెరలేపాడు. వరుస పెట్టి నేరాలు... తాను ఐఆర్ఎస్ అధికారినంటూ నగరానికి చెందిన పి.వెంకటరామ్ అలియాస్ భీష్మాజీతో పరిచయం చేసుకున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ‘గవర్నమెంట్ హాస్పిటల్స్ ఆన్ లైన్’ అనే ప్రాజెక్టు ఇప్పిస్తానని, దీని విలువ రూ.5 కోట్లకుపైగా ఉంటుందని నమ్మబలికి ఆయన నుంచి రూ.11 లక్షలు వసూలు చేశాడు. వరంగల్‌కు చెందిన బాల్‌కిషోర్‌రెడ్డికి, ఆయన సంబందీకులతో ఉన్న సివిల్ వివాదాన్ని సెటిల్ చేయడానికి రూ.4 లక్షలు తీసుకున్నాడు. ఓ ఆర్థిక వివాదంతో కూకట్‌పల్లికి చెందిన గోపి అనే వ్యక్తిని బెదిరించాడు. తాను సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అధికారినంటూ ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి పైరవీలు చేయడం ప్రారంభించాడు. -
మొదట్లో భూకబ్జాలు..సెటిల్మెంట్లు ఆపై మోసాలు...బెదిరింపులు
సాక్షి, హైదరాబాద్: మొదట్లో భూకబ్జాలు, సెటిల్మెంట్లు చేశాడు.. అవి సెట్ కాలేదు...దీంతో ఐఆర్ఎస్ అధికారి అవతారం ఎత్తి సినీ ప్రొడ్యూసర్లను బెదిరించాడు.. చివరకు వ్యభిచారదందా కూడా నిర్వహించాడు.. మోసాలు, బెదిరింపులకు లెక్కేలేదు. మాదాపూర్‌లోని ఓ అపార్ట్మెంట్లో రేవ్‌పార్టీ నిర్వహిస్తూ గురువారం తెలంగాణస్టేట్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోకు (టీఎస్–నాబ్) చిక్కిన ఫిల్మ్ ఫైనాన్షియర్ కారుమూరి వెంకటరత్నారెడ్డి అలియాస్ వెంకటరమణారెడ్డి ఘనచరిత్ర ఇది. ఇతడితోసహా చిక్కిన ముగ్గురిని జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించిన గుడిమల్కాపూర్ పోలీసులు తదుపరి విచారణ నిమిత్తం తమ కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించారు. గుంటూరులోని నెహ్రూనగర్‌కు చెందిన వెంకటరత్నారెడ్డి డిగ్రీ కూడా పూర్తి చేయలేదు. చేసేందుకు ఏ ఉద్యోగమూ దొర కలేదు. దీంతో బతుకుతెరు వుకు స్నేహితులతో కలిసి భవన శిథిలాల తొలగింపు వ్యాపారంలోకి దిగాడు. అందులోనూ నష్టాలు రావడంతో మోసాలు చేసి డబ్బు దండుకోవాలని పథకం వేశాడు. నకిలీ ఐఆర్ఎస్ అధికారిగా అవతారమెత్తి.. నకిలీ ఐఆర్ఎస్ అధికారి అవతారం ఎత్తిన వెంకటరత్నారెడ్డి ఆ పేరుతో సినీ నిర్మాతలు సి.కల్యాణ్, రమేష్‌ల నుంచి రూ.30 లక్షలు వసూలు చేశాడు. దీనిపై బంజారాహిల్స్ ఠాణాలో కేసు నమోదైంది. తిరుమలలో దర్శనానికి కేవీ.రత్నారెడ్డి పేరుతో ఐఆర్ఎస్ అధికారిగా నకిలీ గుర్తింపుకార్డు తయారు చేసుకున్నాడు. దీని ఆధారంగా తనతో సహా 9 మందికి బ్రేక్ దర్శనం టిక్కెట్లు ఇవ్వాలని దరఖాస్తు చేసి చిక్కాడు. ఓ ఐఆర్ఎస్ అధికారిణిని వివాహం చేసుకొని మోసం చేసిన ఆరోపణలు ఉన్నాయి. ఎన్నారై మహిళలను టార్గెట్ చేసి.. ఎన్నారై మహిళలను టార్గెట్‌గా చేసుకుని, తానూ ఎన్నారైనే అంటూ నమ్మబలికి పెళ్లి పేరుతో మోసాలకు తెరలేపాడు. భర్త నుంచి విడాకులు తీసుకుని అమెరికాలో ఉంటున్న నగరానికి చెందిన ఓ మహిళ భారత్‌మాట్రిమోనీలో ఇతగాడి ప్రొఫైల్ చూసి వివాహమాడింది. ఆమెతో పాటు అమెరికా వెళ్లిన వెంకట్ కేవలం 20 రోజులే కాపురం చేశాడు. ఆపై అత్యవసర పని ఉందని, ఆమె నుంచి రూ.20 లక్షలు తీసుకుని ఇక్కడకు వచ్చాడు. ఆ తర్వాత పత్తా లేకపోవడంతో ప్రొఫైల్‌ను ఇంటర్నెట్లో సెర్చ్ చేసిన బాధితురాలి మేనమామ అతడికి నేరచరిత్ర ఉందని, తల్లి, భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నట్టు తెలుసుకున్నాడు. దీంతో ఆయన సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అరెస్టు చేశారు. మరో ముగ్గురు ఎన్నారై మహిళలకు ఇతగాడు ఎర వేసినట్టు అప్పట్లో తేలింది. వెంకట్‌పై జూబ్లీహిల్స్ పరిధిలో వ్యభిచార కేసు కూడా ఉంది. విదేశీ మద్యం అక్రమఅమ్మకం, తాను గుంటూరు ఎస్పీ గన్‌మెన్ అని చెప్పి మోసం చేయడం, దొంగ పాస్‌పోర్టు పొందడం సహా ఇతడిపై ఏపీ, తెలంగాణల్లోని వివిధ ఠాణాల్లో 25 కేసులు నమోదయ్యాయి. వీటిలో కొన్ని రాజీ కాగా, మరికొన్ని వీగిపోయాయి. 10 కేసులు వివిధ దశల్లో ఉన్నాయి. ఆ 18 మంది కోసం వేట ముమ్మరం వెంకట్‌తోపాటు అరెస్టు అయిన బాలాజీ కాల్‌డేటాను పరిశీలించిన టీఎస్–నాబ్ అధికారులు 18 మంది డ్రగ్స్ వినియోగదారులను గుర్తించారు. విశాఖకు చెందిన రామ్‌తో పాటు బెంగళూరులో ఉంటున్న నైజీరియన్లు అమ్మోది చికూడి ముగుముల్, ఇగ్వారే, థామస్ అన్హాల నుంచి వీరు డ్రగ్స్ ఖరీదు చేస్తున్నట్టు నిర్ధారించి గాలిస్తున్నారు. వీరి కస్టమర్లు రామ్‌చంద్, అర్జున్, రవి ఉప్పలపా టి, సుశాంత్‌రెడ్డి, ఇంద్రతేజ, కల్హర్రెడ్డి, సురే ష్, రామ్‌కుమార్, ప్రణీత్, సందీప్, సూర్య, శ్వేత, కార్తిక్, నర్సింగ్, ఇటాచి, మహ్మద్‌అ జామ్, అమ్‌జద్‌ల కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. వెంకట్ దగ్గర డ్రగ్స్ కొన్నవారిలో నటులు, ప్రముఖులున్నట్టు అనుమానిస్తున్న అధికారులు ఆరా తీస్తున్నా రు. గతంలో ఇతగాడు ఏపీకి చెందిన ఓ ఎంపీ పేరు చెప్పి నగరంలో భారీ వసూళ్లకు పాల్పడినట్టు తెలుస్తోంది. సినీ, రాజకీయ ప్రముఖులను పార్టీలకు పిలిచి బురిడీ కొట్టించేవాడు. కొన్నాళ్లుగా ఫిల్మ్ ఫైనాన్షియర్ అవతారం ఎత్తి డ్రగ్స్ పార్టీలు నిర్వహిస్తున్నాడు. -
ఓ అమాయకురాలి విషాద గాథ! చంపింది స్నేహితుడా?.. ప్రేమికుడా?..
నిజాలను అబద్ధాలుగా.. అబద్ధాలను నిజాలుగా మార్చేయడం నేరగాళ్లకు వెన్నతో పెట్టిన విద్య. అలాంటివాళ్ల గారడీలో చిక్కిన అమాయకుల కథ ప్రపంచానికి తెలియకుండానే ముగిసిపోతుంది. చరిత్రలో మిస్టరీగా మిగిలిపోతుంది. కాథీ ఫోర్డ్ వ్యథ అలాంటిదే. వెస్ట్ వర్జీనియాలోని గోర్మానియా, మేరీల్యాండ్ సమీపంలో ఉన్న ఓల్డ్మిల్ రెస్టారెంట్ అది. 1988 ఫిబ్రవరి 17 మధ్యాహ్నం ఒంటిగంటకు ఓ ఫోన్ మోగింది. అందులో వెయిట్రెస్‌గా పని చేస్తున్న కాథీ ఫోర్డ్ అనే 19 ఏళ్ల అమ్మాయి ఆ ఫోన్ లిఫ్ట్ చేసింది. ఆ రెస్టారెంట్ ఆమె తల్లిదండ్రులదే. అందులో తను పార్ట్‌టైమ్ జాబ్ చేస్తూ ఉండేది. ఫోన్ పెట్టెయ్యగానే ఆమె చాలా కంగారుగా, అందులో పనిచేసే మరో ఉద్యోగినితో ‘కాల్ చేసింది ఓ మేజిస్ట్రేట్ అట, మైనర్లకు మద్యం అమ్ముతున్న బార్లు, రెస్టారెంట్లపై పోలీస్ విభాగం కఠినంగా వ్యవహరిస్తోందని అతడు హెచ్చరించాడు’ అని ఇతర వివరాలేమీ చెప్పకుండా అక్కడి నుంచి పరుగుతీసింది. ఆమె అదే కంగారుతో ఇంటికి వెళ్లి స్నానం చేసి, డ్రెస్ మార్చుకుని.. సరిగ్గా గంటకి రెస్టారెంట్‌కి తిరిగి వచ్చింది. అంతే వేగంగా తన పర్స్ అందుకుని, తన తండ్రి కారులో బయలుదేరింది. అదే ఆమె కనిపించిన ఆఖరి దృశ్యం. సాయంత్రం దాకా ఆమె కోసం ఎదురు చూసిన తల్లిదండ్రులు.. పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. మరునాడు కాథీ బాయ్‌ఫ్రెండ్ డార్విన్ పోలీసుల్ని కలసి.. గోర్మానియాకు చెందిన డిప్యూటీ షెరీఫ్ పాల్ ఫెర్రెల్పై తనకు అనుమానం ఉందని, కాథీకి అతడితో పరిచయం ఉందని చెప్పాడు. పైగా గతరాత్రి కాథీని ఫెర్రెల్ నివాస గృహానికి సమీపంలో చూశానని సాక్ష్యమిచ్చాడు. దాంతో అదేరోజు ఫెర్రెల్ని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు. ‘కాథీ నాకు ప్రియురాలి కంటే ముందు గొప్ప స్నేహితురాలు.. గత రాత్రి ఎనిమిదిన్నర సమయంలో స్థానిక క్లబ్‌హౌస్‌కి నా కోసం కాథీ కాల్ చేసి, కలుద్దాం అంటూ ఏడ్చింది. హైస్కూల్ పార్కింగ్ స్థలంలో ఎదురుచూస్తా త్వరగా రా అన్నాను. సుమారు 20 నిమిషాలు ఎదురు చూసినా తను రాలేదు’ అంటూ ఫెర్రెల్ బదులిచ్చాడు. ఫెర్రెల్ అప్పటికే బెర్నార్డ్ అనే మహిళతో రిలేషన్లో ఉన్నాడు. వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. 1988 జనవరిలోనే ఫెర్రెల్ వెస్ట్ వర్జీనియాలోని గ్రాంట్ కౌంటీలో డిప్యూటీ షెరీఫ్గా జాయిన్ అయ్యాడు. సరిగ్గా నెలకు కాథీ మిస్ అయ్యింది. ‘1987 నుంచే మా మధ్య పరిచయం ఉంది. మా కలయిక చాలా రహస్యంగా నడిచేది. ఇటు బెర్నార్డ్కి కానీ, అటు కాథీ బాయ్ ఫ్రెండ్‌కి కానీ తెలియకుండా జాగ్రత్తపడేవాళ్లం. జాబ్ వచ్చిన తర్వాత కాథీకి సమీపంలో బిస్మార్క్ రోడ్లో ఇల్లు అద్దెకు తీసుకుని ఒంటరిగా ఉండేవాడ్ని. అప్పుడప్పుడు కాథీ నా దగ్గరకు వచ్చేది’ అని ఫెర్రెల్ చెప్పాడు. ఆధారాలు లేక అతడ్ని వదిలిపెట్టేశారు. సరిగ్గా వారానికి ఓల్డ్మిల్ రెస్టారెంట్‌కి ఓ లేఖ వచ్చింది. అందులో ‘నేను క్షేమంగానే ఉన్నాను.. నా కోసం వెతకొద్దు’ అని కాథీ రాసినట్లుంది. అయినా డార్విన్.. కాథీ కోసం వెతకడం ఆపలేదు. మరో రెండు వారాలకు ఫెర్రెల్ నివాసం ఉండే ఇంటికి కిలోమీటర్‌లోపే, అడవిలో కాథీ తీసుకెళ్లిన కారు కాలి బూడిదై కనిపించింది. ఎక్కడా కాథీ ఆనవాళ్లు కానీ, మృతదేహం కానీ కనిపించలేదు. వెంటనే.. రెస్టారెంట్‌కి వచ్చిన లేఖలోని చేతిరాతపై నిఘా పెట్టారు అధికారులు. అది ఫెర్రెల్ చేతిరాతేనని తేలడంతో కేసు బిగుసుకుంది. అయితే ఫెర్రెల్ ఇంకో షాకిచ్చాడు.. ‘ఆ కారు అక్కడున్న విషయం నాకు ముందే తెలుసు. కాథీ కేసు విషయంలో నన్ను విచారించి, వదిలిపెట్టిన మరునాడే కాథీ కోసం వెతుకుతుంటే.. ఆ కారు అక్కడ కనిపించింది. కాథీ శవం కారులో ఉందేమోనన్న భయంతో ఎవరికీ చెప్పలేదు. ఎవరో నన్ను ఇరికిస్తున్నారని అర్థమై ఆ లేఖ రాసి తప్పించుకోవాలని అనుకున్నా’ అన్నాడు. మరోవైపు ఫెర్రెల్ బెడ్రూమ్లో గోడ మీద రక్తం మరకలు ఉండటంతో ఆ శాంపిల్స్ ల్యాబ్‌కి పంపించారు పోలీసులు. అది ఓ మహిళ రక్తమని తేలింది కానీ కాథీదో కాదో తేల్చలేకపోయారు. దాని గురించి ఫెర్రెల్ని అడిగితే.. ఆ మరకలు తాను అద్దెకు రాకముందు నుంచే ఆ గోడ మీద ఉన్నాయని చెప్పాడు. ఇక ఫెర్రెల్ నివాసానికి పొరుగున ఉండే కిమ్ నెల్సన్ అనే మహిళ.. ఫిబ్రవరి 17 రాత్రి తనకు సమీపంలో ఓ అమ్మాయి అరుపులు, తుపాకీ శబ్దాలు వినిపించాయని సాక్ష్యమిచ్చింది. దాంతో కాథీని చంపి మృతదేహాన్ని ఫెర్రెల్ ఎక్కడో దాచేశాడని నమ్మేవాళ్లు పెరిగిపోయారు. అలా సుమారు పదిహేనేళ్లు జైల్లోనే ఉండిపోయాడు ఫెర్రెల్. మరోవైపు అతడు.. పరిచయస్తులైన ఆడవారికి అజ్ఞాత ఫోన్ కాల్స్ చేసి.. అసభ్యకరమైన మాటలు మాట్లాడేవాడని తేలింది. తను చెప్పిన చోటుకు రావాలని బెదిరించేవాడని కొందరు మహిళలు సాక్ష్యమిచ్చారు. ఆ ఆరోపణలను ఫెర్రెల్ అంగీకరించినప్పటికీ.. ఈ ఫోన్ కాల్స్‌కి, కాథీ మిస్సింగ్‌కి సంబంధం లేదని వాదించాడు. అయితే కాథీకి ఆ రోజు కాల్ చేసింది ఫెర్రెలే అయ్యుంటాడని, ఏదో చెప్పి బెదిరించడంతోనే ఆమె వెళ్లి ఉంటుందని.. గతంలో ఇద్దరి మధ్య ఉన్న స్నేహపూర్వకమైన సంబంధాన్ని అతడు కావాలనే తప్పుగా క్రియేట్ చేసి చెబుతున్నాడని కొందరు అధికారులు భావించారు. అయితే అతడు నిర్దోషి అనేందుకు మార్టిన్ అనే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ఓ జంటను సాక్ష్యంగా తీసుకొచ్చాడు. కాథీ కనిపించకుండా పోయిన ఏడాదికి.. టెన్నెసీ గుండా వెళుతుంటే మార్గంమధ్యలో ఓ రెస్టారెంట్లో కాథీ.. వెయిట్రెస్‌గా పనిచేయడం చూశామని ఆ జంట చెప్పుకొచ్చింది. ‘మీరు కాథీనే కదా?’ అని అడ గటానికి ప్రయత్నించినప్పుడు ఆమె కిచెన్‌లోకి పారిపోయిందని వాళ్లు చెప్పారు. మరోవైపు తనతో ఆ రోజు పోలీసులు బలవంతపు సాక్ష్యం చెప్పించారని కిమ్ వెల్లడించింది. దాంతో ఫెర్రెల్ పట్ల సానుభూతిపరులు పెరిగారు. 2002లో అతడికి పెరోల్ లభించింది. అయితే కాథీ తమని వదిలి ఉండాలనుకునే మనిషి కాదని.. తనను ఎవరో చంపేసి ఉంటారని ఆమె కుటుంబం నమ్మింది. ఈ కేసులో కాథీ స్నేహితులు కొందరు అసలు నేరస్థుడు డార్విన్ కావచ్చన్నారు. ఎందుకంటే కాథీ నిత్యం డార్విన్కే భయపడుతూ బతికేదని వాళ్లు గుర్తుచేసుకున్నారు. ఈ ఉదంతంలో కాథీ చనిపోయిందా? లేక పారిపోయిందా? డార్విన్ చంపేసి.. కేసు ఫెర్రెల్ని చుట్టుకునేలా ప్లాన్ చేశాడా? లేక ఫెర్రెలే చంపేసి.. అమాయకంగా నాటకం ఆడాడా? కాథీకి ఆ రోజు మధ్యాహ్నాం కాల్ చేసింది ఎవరు? ఇలా అన్నీ మిస్టరీగానే మిగిలాయి. --సంహిత నిమ్మన (చదవండి: కూతుర్నే పెళ్లాడిన ఓ నీచపు తండ్రి కథ..ఆఖరికి ఆమె కొడుకుని సైతం..) -
కూతుర్నే పెళ్లాడిన ఓ నీచపు తండ్రి కథ..ఆఖరికి ఆమె కొడుకుని సైతం..
జాలి, దయ, తప్పు, ఒప్పు తెలియని పశుత్వం మనిషిరూపంలో ఉంటే.. అమాయకమైన జీవితాలు ఎలా ఆగమవుతాయో చెప్పే ఉదంతమే ఇది. ‘ఫ్రాంక్లిన్ డెలానో ఫ్లాయిడ్’ అనే రాక్షసుడు.. తన ఇష్టానుసారంగా కాలరాసిన కొందరి అభాగ్యుల తలరాత ఇది. 1994 సెప్టెంబర్ 12, ఉదయం పదకొండు దాటింది. అమెరికా ఓక్లహోమాలోని చోక్టావ్లో ‘ఇండియన్ మెరిడియన్ ఎలిమెంటరీ స్కూల్’లో ఒక్కసారిగా పిల్లలంతా పెద్దపెద్దగా కేకలేస్తున్నారు. కొందరైతే భయంతో ఏడుస్తున్నారు. స్కూల్ టీచర్స్ అంతా వెనక్కి అడుగులేస్తుంటే.. ప్రిన్సిపల్ జేమ్స్ డేవిస్ మాత్రం చేతులు పైకెత్తి నెమ్మదిగా ముందుకు అడుగులేస్తున్నాడు. నిజానికి అతడి తలకు గురిపెట్టిన తుపాకీనే.. అతడ్ని గదమాయిస్తూ ముందుకు తోస్తోంది. గన్ పట్టుకున్న ఆ ఆగంతకుడి ఆజ్ఞలే అక్కడున్న అందరినీ వణికిస్తున్నాయి. అతడు చెప్పినట్లే ప్రిన్సిపల్.. ఓ క్లాస్‌రూమ్‌లోని ఆరేళ్ల మైకేల్ హ్యూజ్ అనే బాబు దగ్గరకు వెళ్లాడు. క్షణాల్లో ఆ బాబుని తన చేతుల్లోకి తీసుకున్న ఆ ఆగంతకుడు.. సరాసరి ప్రిన్సిపల్‌ని ఓ కారు దగ్గరకు నడిపించి, డ్రైవ్ చెయ్యమన్నాడు. అతడి ఆదేశాలతోనే ఆ కారు ముందుకు కదిలింది. కిడ్నాప్ అయింది ప్రిన్సిపల్‌తో పాటు మైకేల్ అని పోలీసులకి తెలియగానే.. ఆ ఆగంతకుడు వారెన్ జడ్సన్ మార్షల్ అని వాళ్లకు క్లారిటీ వచ్చేసింది. వెంటనే పోలీస్ రికార్డ్స్ నుంచి ఓ ఫొటో తీసి.. కొందరు ప్రత్యక్ష సాక్షుల(టీచర్స్)కి చూపించి నిర్ధారించుకుని మరీ వేట మొదలుపెట్టేశారు. ఐదు గంటల తర్వాత.. ఓ అడవి సమీపంలో ‘హెల్ప్ హెల్ప్’ అనే అరుపులు జేమ్స్‌ని గుర్తించేలా చేశాయి. అతణ్ణి ఎవరో చెట్టుకు కట్టేశారు. అయినా, సురక్షితంగానే ఉన్నాడు. జేమ్స్‌ని ‘మైకేల్ ఎక్కడ?’ అని అడిగితే.. ‘నన్ను కట్టేసి.. బాబుని తీసుకుని అతడు (వారెన్) పారిపోయాడ’ని సమాధానమిచ్చాడు. నిజానికి మైకేల్ తల్లి షారోన్ మార్షల్ అనుమానాస్పద మృతిలో వారెన్ (ఆమె భర్తే) ప్రధాన నిందితుడు. తల్లి మరణం తర్వాత మైకేల్‌ని సంరక్షణ కేంద్రానికి తరలించి.. ఆమె భర్త వారెన్ని అరెస్ట్ చేశారు. పలు ఆంక్షలతో పోలీసులు వదిలిపెట్టిన ప్రతిసారి వారెన్.. నేను నా భార్య షారోన్ ని చంపలేదు.. నా కొడుకు మైకేల్‌ను నాకు తిరిగి అప్పగించండి అని రచ్చ చేసేవాడు. నాలుగేళ్లుగా అదే మాట మీదున్న వారెన్.. చివరికి మైకేల్‌ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయాడు. ఇక్కడే మరో ట్విస్ట్ ఉంది. షారోన్ కేసు విచారణ సమయంలోనే మైకేల్.. వారెన్ కన్నకొడుకు కాదని డీఎన్ఏ రిపోర్ట్లు తేల్చాయి. షారోన్ కి రహస్యంగా మరో వ్యక్తితో సంబంధం ఉందని, అతడే మైకేల్ తండ్రి అని అధికారులు నమ్మారు. అదే నమ్మకంతో వారెన్.. షారోన్ ని చంపేసి ఉంటాడని కూడా భావించారు. బాబు కిడ్నాప్ అయిన రెండు నెలలకు వారెన్ పోలీసులకు దొరికేశాడు. అయితే మైకేల్ అతడితో లేడు. మైకేల్ ఎక్కడ? అనే ప్రశ్నకు అతడు సరైన సమాధానం ఇవ్వలేదు. పోలీస్ ట్రీట్మెంట్ మొదలైంది. అయినా నోరు విప్పలేదు. కొన్ని రోజులకి ‘మైకేల్ సురక్షితంగానే ఉన్నాడు.. కానీ అతడి వివరాలు ఎప్పటికీ చెప్పను’ అని మొండికేశాడు. నిజం చెప్పకపోవడంతో కస్టడీలోనే ఉండిపోయాడు. అప్పుడే అతడు చేసిన మరిన్ని అకృత్యాలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. ఇంతలో ఫ్లోరిడాకు చెందిన షీరల్ కమెస్సో అనే పద్దెనిమిదేళ్ల అమ్మాయి మిస్సింగ్ కేసులో అనుమానితుడైన క్లారెన్స్ హ్యూజ్, ఈ వారెన్ ఒక్కరేనని తేలింది. పైగా షీరల్, షారోన్ ఇద్దరూ మంచి స్నేహితులు. వారెన్ (క్లారెన్స్)తో షీరల్కి ఏదో విషయంలో వాగ్వాదం జరిగిందట. తర్వాత కొంత సమయానికే ఆమె కనిపించకుండా పోయిందట! ఆమె మిస్ అయిన కాసేపటికే వారెన్ కుటుంబం ఫ్లోరిడా నుంచి ఓక్లహోమా షిఫ్ట్ అయ్యారట! పైగా పేర్లు కూడా మార్చేసుకున్నారు. అన్నీ అనుమానించదగ్గ అంశాలే కావడంతో వారెన్ (క్లారెన్స్) చుట్టూ కేసు బిగుసుకుంది. ఇక అతడి భార్య షారోన్ అతడి కంటే పాతికేళ్లు పైనే చిన్నది కావడంతో.. మైకేల్‌ని ఎత్తుకెళ్లినట్లే.. షారోన్ ని కూడా ఎత్తుకొచ్చాడా? అనే అనుమానం వారెన్ నేరపుటల్ని కదిలించింది. వారెన్ (క్లారెన్స్) అసలు పేరు ఫ్రాంక్లిన్ డెలానో ఫ్లాయిడ్ అని తెలిసినప్పటి నుంచి అతడి నేరాల చిట్టా ఒక్కొక్కటిగా బయటపడటం మొదలైంది. ఫ్రాంక్లిన్ ఊరికో పేరు మార్చేవాడని తేలింది. విచారణలో ఉన్న ఫ్రాంక్లిన్ రోజుకో అబద్ధం చెప్పేవాడు. పొంతనలేని సమాధానాలతో పిచ్చెక్కించేవాడు. అయితే 1995లో దొరికిన కొన్ని ఆధారాలతో 2002లో షీరల్ని హత్య చేసింది ఫ్రాంక్లిన్నే అని నిర్ధారణ అయ్యి అతడికి జీవితఖైదు పడింది. ఇక జైల్లోనే మగ్గిపోయాడు.‘షీరల్ మర్డర్ కేసులో శిక్షపడింది కాబట్టి.. ఎలాగో నీ జీవితం జైల్లోనే ముగుస్తుంది. ఇప్పుడైనా మైకేల్, షారోన్ ల గురించి నిజం చెప్పు’ అంటూ 2014లో ఎఫ్‌బీఐ ఏజెంట్స్ ఫ్రాంక్లిన్ ని మళ్లీమళ్లీ ప్రశ్నించారు. దాంతో మైకేల్‌ని ఆ రోజే చంపి ఓక్లహోమా/టెక్సాస్ సరిహద్దు సమీపంలో పాతేశానని చెప్పాడు ఫ్రాంక్లిన్. అయితే ఆ పరిసరాల్లో ఎక్కడా మైకేల్ అవశేషాలు కూడా దొరకలేదు. దాంతో అతడు చెప్పింది నిజమో అబద్ధమో తేలలేదు. ఇక ఫ్రాంక్లిన్ బయటపెట్టిన షారోన్ కథ ఎందరినో కంటతడి పెట్టించింది. షారోన్ అసలు పేరు సుజానే సేవకీస్, తను నా మొదటి భార్య శాండీ బ్రాండెన్ పెద్ద కూతురు, అంటే సుజానే(షారోన్)కి నేను సవతితండ్రిని, ఆమెకి ఐదేళ్ల వయసున్నప్పుడు 1975లో కరోలినా నుంచి ఎత్తుకొచ్చా అని చెప్పాడు. వెంటనే ఆధారాల కోసం శాండీ కథను, ఫ్రాంక్లిన్ గతాన్ని లోతుగా తవ్వడం మొదలుపెట్టారు పోలీసులు. ఫ్రాంక్లిన్ 17 ఏళ్ల నుంచి 31 ఏళ్ల వరకూ చేసిన నేరాలు ఒక ఎత్తయితే.. 31 ఏళ్ల నుంచి చేసిన కుట్రలు మరో ఎత్తు. అమెరికాలోని జార్జియా నుంచి ఇల్లినాయీ వరకూ ఎన్నో లైంగిక, హత్య నేరాలకు పాల్పడి.. కొన్నింటికి శిక్షలు అనుభవించి.. మరికొన్నింటికి పాల్పడినా, చిక్కకుండా తప్పించుకుని పారిపోయి.. 1974 నాటికి కరోలినా చేరుకున్నాడు. అక్కడ పరిచయం అయ్యింది శాండీ బ్రాండెన్ అనే నలుగురు పిల్లల తల్లి. ఫ్రాంక్లిన్ ఆమెని ప్రేమించి, పెళ్లి చేసుకున్నాడు. కొన్ని నెలలు గడిచే సరికి.. శాండీ ఏదో చెక్ విషయంలో 30 రోజులు జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. ఫ్రాంక్లిన్ అసలు స్వరూపం తెలియని శాండీ.. జైలుకి వెళ్తూ వెళ్తూ తన పిల్లలందరినీ ఫ్రాంక్లిన్ కే అప్పగించి వెళ్లింది. ఆమె తిరిగి జైలు నుంచి వచ్చేసరికి ఇంట్లో తన పిల్లలు, భర్త ఫ్రాంక్లిన్ ఎవ్వరూ కనిపించలేదు. కొన్ని రోజులకి తన నలుగురు పిల్లల్లో.. ఇద్దరు ఆడపిల్లలు స్థానిక సంరక్షణ కేంద్రంలో ఉన్నారని తెలుసుకుని వారిని చేరుకుంది. మరి పెద్ద కూతురు సుజానే, కొడుకు ఫిలిప్‌ని ఫ్రాంక్లిన్ ఎత్తికెళ్లాడని గుర్తించి.. కంప్లైంట్ ఇవ్వడానికి ట్రై చేసింది. అయితే సవతి తండ్రికి పిల్లలపై హక్కు ఉంటుంది కాబట్టి కేసు నమోదు చెయ్యలేమని అధికారులు చెప్పారు. దాంతో శాండీ కొన్నేళ్లకు తన ఇద్దరు పిల్లల మీద ఆశలొదులుకుని బతకడం మొదలుపెట్టింది. 1987లో కూతురుగా పెరిగిన సుజానే(షారోన్)ని.. ఫ్రాంక్లిన్ (వారెన్) రెండో పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు ఆమె వయసు 16. సరిగ్గా ఏడాదికి మైకేల్ జన్మించాడు. మైకేల్ తన కొడుకు కాదని తెలిసి, హిట్ అండ్ రన్ సాకుతో సుజానేని చంపేసే ఉంటాడని అధికారులు అంచనా వేశారు. ఇదంతా 2014లో ఫ్రాంక్లిన్ చెప్పిన ఆధారాలతో వెలికి తీసిన కథ. మరి సుజానే తమ్ముడు ఫిలిప్‌ని ఏం చేశావ్? అని ఫ్రాంక్లిన్‌ని ప్రశ్నిస్తే.. అప్పట్లోనే ఓ జంటకు దత్తత ఇచ్చానని చెప్పాడు. ఇక 2019లో ఫిలిప్ స్టీవ్ అనే వ్యక్తి.. సుజానే నా అక్క, ఫ్రాంక్లిన్ ఎత్తుకొచ్చిన శాండీ కొడుకుని నేనే అని డీఎన్ఏ పరీక్షకు సిద్ధమయ్యాడు. 2020లో అది నిర్ధారణైంది. దాంతో ఫిలిప్ తిరిగి శాండీ కుటుంబాన్ని కలుసుకున్నాడు. మరోవైపు ఫ్రాంక్లిన్ 79 ఏళ్ల వయసులో 2023 జనవరి 23న ఫ్లోరిడాలోని జైల్లోనే మరణించాడు. ఏది ఏమైనా సుజానే, మైకేల్‌లను నిజంగానే ఫ్రాంక్లిన్ చంపాడా? మరి మైకేల్ అవశేషాలు ఏమయ్యాయి? అనే ప్రశ్నలు నేటికీ మిస్టరీనే. --సంహిత నిమ్మన (చదవండి: సాక్స్ కిల్లర్..జంటలే టార్గెట్‌గా హత్యలు! అతడెవరనేది ఇప్పటకీ మిస్టరీనే!) -
లిటిల్ ఏంజెల్ దారుణ హత్య.. ఇప్పటికీ మిస్టరీగానే!
ఒక ముగింపు అస్పష్టమైనప్పుడు.. దాని చుట్టూ అల్లే అల్లికలు అనంతాలై.. దట్టంగా అలముకుంటాయి. ఆధారాలు లేక.. ఉన్నా సరిపోలక.. ఎంతో అప్రతిష్ఠను మూటగట్టుకుంటాయి. 26 ఏళ్ల కిందట అమెరికా మీడియాను ఓ ఊపు ఊపిన కథ ఇది. ప్యాట్రీషియా రామ్సే(పాట్సీ), జాన్ బెనే రామ్సే దంపతుల అందాల కూతురు జాన్ బెనే ప్యాట్రీషియా రామ్సే కథ ఇది. తను 1990 ఆగస్ట్ 6న జన్మించింది. ముద్దుగా ఆమెను జూనియర్ పాట్సీ అని కూడా పిలిచేవారు. తన అన్న బుర్కే రామ్సే.. ఆమె కంటే మూడేళ్లు పెద్దవాడు. ఈ కుటుంబం అమెరికా, కొలరాడోలోని బౌల్డర్‌లో నివాసం ఉండేవారు. ప్యాట్రీషియా మాజీ మిస్ వెస్ట్ వర్జీనియాగా అప్పటికే ప్రపంచానికి సుపరిచితం. ఆమె భర్త జాన్ బెనే పెద్ద వ్యాపారవేత్త, రచయిత కూడా. అతను 1978లో మొదటి భార్య లుసిండాకి విడాకులు ఇచ్చి.. ప్యాట్రీషియాను పెళ్లి చేసుకున్నాడు. జూ. పాట్సీ కూడా ఎన్నో వెల్ బేబీ షో పోటీల్లో విజేతగా నిలిచింది. ఒక్క మాటలో చెప్పాలంటే అదో సెలెబ్రిటీ ఫ్యామిలీ. ఏమైందో ఏమో.. 1996 డిసెంబర్ 26న జూ. పాట్సీ తన ఇంట్లోనే శవమై కనిపించింది. అసలేం జరిగింది? డిసెంబర్ 26, తెల్లవారు జామున రామ్సే దంపతులు.. తమ కూతురు పాట్సీ అంతకు ముందు రోజు కి డ్నాప్ అయిందని పోలీసులను ఆశ్రయించారు. ముందురోజు వారు అందుకున్న కిడ్నాపర్స్ లేఖను కూడా చూపించారు. ‘మిస్టర్ రామ్సే (జాన్ బెనే).. శ్రద్ధగా వినండి! మాదొక విదేశీ సంఘం. మేము మీ కూతురును కిడ్నాప్ చేశాం. ఆమె 1997ను చూడాలనుకుంటే, మీరు మా సూచనలను తప్పనిసరిగా పాటించాలి. మాకు 1,18,000 డాలర్లను చెల్లించి మీ అమ్మాయిని తిరిగి తీసుకెళ్లొచ్చు. మిగిలిన వివరాలు రేపు ఉదయం 8 నుంచి 10 గంటల మధ్య కాల్ చేసి చెబుతాం. ఈలోపు మీరు బ్యాంక్ అధికారులను కానీ పోలీసులను కానీ అప్రమత్తం చేస్తే.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయి’ అనేది ఆ లేఖ సారాంశం. విషయం మీడియాకి చేరడంతో రిపోర్టర్స్, స్నేహితులు, చుట్టు పక్కల ప్రజలు ఇలా చాలామంది రామ్సే ఇంటికి చేరుకున్నారు. ఆరాలు, విచారణ, కిడ్నాపర్స్ నుంచి తదుపరి ఆదేశాలు.. ఇలా ఓ పక్క హంగామా నడుస్తూనే ఉంది. మరో వైపు జాన్ బెనే కిడ్నాపర్స్ కోరినట్లు డబ్బు సిద్ధం చేసే పనిలోపడ్డాడు. మధ్యాహ్నం కావస్తున్నా.. పాప ఆచూకీ తెలియకపోవడంతో డిటెక్టివ్ అర్ట్.. జాన్ బెనే స్నేహితుడు ఫ్లిట్ వైట్‌తో.. ‘ఎందుకైనా మంచిది ఒకసారి ఇల్లంతా వెతుకు’ అని చెప్పడంతో.. ఫ్లిట్ వెతకడం మొదలుపెట్టాడు. ఆ క్రమంలోనే తాళం వేసి ఉన్న బేస్మెంట్ రూమ్‌ని బలవంతంగా తెరచి చూశాడు. ఆ గదిలో శవమై కనిపించింది జూ. పాట్సీ. పాప నోటికి డస్ట్ టేప్ చుట్టి ఉంది. విరిగిన పెయింట్ బ్రష్‌తో ముడివేసిన నైలాన్ తాడు చేతికి, మెడకు బలంగా బిగించి ఉంది. బాడీ అంతా తెల్లటి దుప్పటితో కప్పి ఉంది. వెంటనే మృతదేహాన్ని పట్టుకుని బయటికి వచ్చాడు ఫ్లిట్. అనుమానాస్పద ప్రాంతం నుంచి మృతదేహాన్ని తీసుకుని రావడం.. ఈలోపే అందరూ పాపను పట్టుకోవడంతో వేలి ముద్రలు, కీలక ఆధారాలు అన్నీ నాశనమైపోయాయి. జూ. పాట్సీ తలపై బలమైన గాయం ఉందని.. ఊపిరాడకుండా చేíసి చంపేశారని, లైంగికదాడి జరగలేదు కానీ.. ప్రయత్నించినట్లు ఆధారాలు ఉన్నాయని రిపోర్ట్స్ తేల్చాయి. దాంతో కేసు వివాదం రామ్సే ఫ్యామిలీనే చుట్టుముట్టింది. దానికి కొన్ని బలమైన కారణాలున్నాయి. జూ. పాట్సీ మృతదేహం దగ్గర లభించిన పెయింట్ బ్రష్‌కి సంబంధించిన మరో ముక్క.. తల్లి మేకప్ కిట్‌లో దొరకడంతో కేసు బిగుసుకుంది. మరోవైపు ఎన్నో పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో బుర్కేతో సహా ప్యాట్రీషియా, జాన్ బెనేలు చెప్పిన విషయాలకు, జరిగిన సంఘటనలకు పొంతన కుదరలేదు. చనిపోయే ముందు జూ. పాట్సీ పైనాపిల్ తిన్నదని వైద్యపరీక్షల్లో తేలింది. పైగా పైనాపిల్ ముక్కలతో మిగిలి ఉన్న బౌల్‌పై బుర్కే వేలి ముద్రలు ఉన్నాయి. అయితే ఆ రోజు పైనాపిల్ తిన్నట్లు గుర్తులేదని చెప్పారు ముగ్గురూ. పాపను వెతికే సమయంలో బుర్కే అసలు బయటికే రాలేదు. ఎందుకు రాలేదు? అంటే నిద్రపోయాడని చెప్పారు తల్లిదండ్రులు. బుర్కేది అదే మాట. నిజానికి ఇంట్లో అంత అలజడి రేగుతుంటే.. అంతా చెల్లెల్ని వెతుకుంటే తొమ్మిదేళ్ల బాలుడికి మెలకవరాకపోవడమేంటీ? అనేది చర్చనీయాంశంగా మారింది. దాంతో ఆ కిడ్నాపర్స్ లేఖను తల్లి సీనియర్ పాట్సీనే రాసుంటుందనే అనుమానాలు బలపడ్డాయి. మరి పాపను ఎవరు చంపి ఉంటారు అనేదానికి చాలా వాదనలు రాద్ధాంతాలుగా మారాయి. ‘పాపపై తండ్రి జాన్ బెనే లైంగిక దాడికి యత్నించాడని కొందరు.. బుర్కే అనుకోకుండా బలమైన వస్తువుతో చెల్లెలు జూ. పాట్సీని కొట్టడంతో ఆమె తీవ్రంగా గాయపడిందని.. కొడుకుని కాపాడుకునే క్రమంలోనే పాపను చంపేసి తల్లిదండ్రులు డ్రామా ఆడారని మరికొందరు తమ ఊహాగానాలను మొదలుపెట్టారు. ఆ దిశగానే క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో కూడా విచారణ జరిపింది. ఆ రోజు రాత్రి ఎవరో ఆగంతకుడు బేస్మెంట్ గది కిటికీని పగలగొట్టుకుని లోపలికి వచ్చి ఉంటాడని.. వాడే పాపని కిడ్నాప్ చేసి చంపేసి ఉంటాడని మరో వాదన పుట్టుకొచ్చింది. అయితే కిటికీ పరిసరప్రాంతాల్లో చాలాకాలంగా ఉన్న సాలిగూడు చెక్కుచెదరలేదంటూ ఆ కథను కొట్టిపారేశారు విశ్లేషకులు. ఇక్కడే మరో అంశాన్ని లేవనెత్తారు అధికారులు. జూ. పాట్సీ చిన్నప్పటి నుంచి ఉన్న హెల్త్ రిపోర్ట్‌ని బయటికి తీశారు. 1994లో అంటే పాపకు నాలుగేళ్ల వయసున్నప్పుడు బుర్కే ఆమె ముఖం మీద బలంగా కొట్టాడని హెల్త్ రికార్డ్‌లో ఉంది. 1995, మేలో పాప ముక్కు పగిలిందని, అదే ఏడాది నవంబర్‌లో ఎడమ కన్నుకు గాయమైందని.. 1996లో ఎడమ చేతివేలు దెబ్బ తిన్నదని.. ఇలాంటివన్నీ బుర్కే నేరస్థుడనేందుకు ఆధారాలుగా మారి నమ్మకాన్ని బలపరిచాయి. మరోవైపు1996 ఆగష్టు 27న పాప పునరుత్పత్తి సామర్థ్యాన్ని గురించి తల్లి ప్యాట్రీషియా.. డాక్టర్‌ను ఆరా తీసినట్లు కూడా ఆధారాలు సంపాధించారు అధికారులు. అయితే 2003లో పాప బట్టల మీద దొరికిన మరో డీఎన్ఏ.. కుటుంబసభ్యులది కాకపోవడంతో కథ అడ్డం తిరిగింది. డిఏ(డిస్ట్రిక్ట్ అటార్నీ) 2008లో పాప హత్యతో ఆ కుటుంబానికి సంబంధం లేదంటూ రామ్సే ఫ్యామిలీకి క్షమాపణ పత్రాన్ని కూడా పంపించింది. అయితే కొందరు అధికారులు.. దీన్ని తప్పుబట్టారు. కేసు దారి తప్పిందని విమర్శించారు. మరోవైపు దర్యాప్తు సమయంలోనే.. జాన్ బెనే ఇంట్లో పనిమనిషి ఆత్మహత్య కూడా అప్పట్లో వివాదంగానే నిలిచింది. 2006లో అలెక్సిస్ వాలోరన్ రీచ్ అనే ట్రాన్స్‌జెండర్.. జూ. పాట్సీ కథలోకి ఊహించని ఎంట్రీ ఇచ్చింది. తను మగవాడిగా ఉన్నరోజుల్లో తనే పాపకి మత్తుమందు ఇచ్చి.. లైంగిక దాడిలో పొరపాటున చంపేశానంటూ లొంగిపోయింది. అయితే శవ పరీక్షలో పాపకు మత్తుమందు ఇచ్చిన ఆనవాళ్లు లేకపోవడంతో రీచ్ చెప్పేదాన్ని తోసిపుచ్చారు నిపుణులు. అదే ఏడాది ప్యాట్రీషియా అండాశయ క్యాన్సర్‌తో తన 49 ఏళ్ల వయసులో కన్నుమూసింది. తండ్రి జాన్ బెనే.. ఇంకా ఈ కేసుపై దర్యాప్తు గురించి పోలీసుల్ని ఆరా తీస్తూనే ఉన్నాడు. బొర్కే ఇన్వెస్టిగేషన్ బ్యూరోపై 750 మిలియన్ డాలర్లు పరువు నష్టం దావా వేశాడు. ఏదిఏమైనా.. బుల్లి అందాల రాణిగా మెరిసిన జూ. పాట్సీ మరణం.. ఆ కుటుంబానికి తలవంపులను మిగిల్చింది. పాప మృతికి ఆ కుటుంబమే కారణమా? లేక నిజంగానే కిడ్నాపర్స్ చంపేశారా? మరింకేదైనా కుట్ర ఉందా? అనేది నేటికీ తేలలేదు. ∙సంహిత నిమ్మన -
దెయ్యం చేసిన హత్య..?
‘నీకు మతిపోయిందా? దెయ్యం హత్య చేయడం ఏమిటి?’ కసిరాడు సీఐ మహంకాళి. ‘అలా కొట్టిపారేయకండి సర్. నా మాట కాస్త వినండి. ఈ ఫైల్ చూడండి.. నా కష్టం మీకే తెలుస్తుంది! ముమ్మాటికీ అది హత్యే. అయితే ఆ పని దెయ్యం కాకుండా వేరెవరూ చేసినట్లు ఆధారాలు లేవు. విదేశాల్లో అనేక అన్సాల్వ్డ్ కేసుల విషయంలో, కొన్ని హత్యలు దెయ్యాలే చేసి ఉండవచ్చుననే అభిప్రాయాలూ ఉన్నాయి. 1999లో బోస్టన్‌లో ఇలాంటి కేసే...’ అని ఎస్సై అంబరీష్ చెప్పబోతుండగా, అడ్డుతగిలి, .. ‘ఆ పుక్కిటి పురాణాల గురించి చెప్పొద్దు. ఇప్పుడు మొదటి నుంచి వివరంగా చెప్పు’ అన్నాడు సీఐ మహంకాళి. ‘హత్యకు గురైన ముకుందం, అతని భార్య శ్రావణి, చాలా ఏళ్లుగా లండన్‌లో ఉంటూ, ఆరు నెలల కిందటే ఇండియా వచ్చారు. ముకుందం తాతగారు, వందేళ్ళ క్రితం కట్టించిన ‘వేట బంగళా’లో నివాసం ఉంటున్నారు. ఆ బంగాళాలో ముందు మనం అడుగుపెట్టేది, పెద్ద హాల్లోకి. హాల్లోంచే పైకి మెట్లున్నాయి. హాలుని ఆనుకొని, డైనింగ్ రూమ్, దాని పక్కన కిచెన్ ఉన్నాయి. పై అంతస్తులోని గదే ముకుందం, శ్రావణిల బెడ్రూమ్. అప్పటికి ఆ బంగాళా ఊరికి దూరంగా, అడవికి దగ్గరగా ఉండేది. ఇప్పుడు అక్కడంతా బాగా డెవలప్ అయిపోయింది. గత ఆరేళ్లుగా ఆ బంగాళా పోషణను చూస్తున్న రాములు, కమల అక్కడే అవుట్ హౌస్‌లో ఉంటున్నారు. గత ఏడాదిగా ఆ బంగళాలో దెయ్యం తిరుగుతున్నట్లు .. వాళ్ళు ముకుందానికి ముందుగానే చెప్పినా అతను పట్టించుకోలేదట’ వివరించాడు అంబరీష్. ‘అక్కడ దెయ్యం తిరుగుతుందని వాళ్లకు ఎలా తెలిసిందట?’ అని అడిగాడు మహంకాళి. ‘పగలు ఏ హడావిడీ ఉండేది కాదట. రాత్రుళ్లు మాత్రం లైట్లు వెలిగి ఆరుతూ ఉండడం, ఎవరో మసలుతున్నట్లు నీడ కనిపించడం, శబ్దాలు వినిపించడం జరిగేదట. నలుగురైదుగుర్ని తోడు తీసుకొని లోపలికి వెళ్లి చూస్తే, ఏమీ కనిపించేది కాదట. అలా మూడు నాలుగు సార్లు చేసి, ఆ ఇంట్లో దెయ్యం ఉందని, నిర్ధారణకు వచ్చేశారట’ అని అంబరీష్ అనగానే, ‘అంతా ట్రాష్. ఆ పనులు మనుషులు కూడా చెయ్యొచ్చు కదా?’ అన్నాడు మహంకాళి. ‘అప్పుడే ఒక నిర్ణయానికి వచ్చేయకండి. శ్రావణి స్టేట్మెంట్ కూడా వినండి మరి. ఆ ఇంట్లో దిగాక, మేడమీద పడుకున్న ఆ దంపతులకు కూడా అర్ధరాత్రి వేళ శబ్దాలు వినిపించేవట. ముకుందానికి ధైర్యం ఎక్కువే కాబట్టి, అతను కిందకువెళ్లి చూస్తే, ఎవరూ కనిపించేవారు కాదట. దిగువన, హాల్లో ఉంచిన గాగుల్స్, ఇయర్ ఫోన్స్, వాచీ, ఐపాడ్, సెల్‌ఫోన్ లాంటి కాస్టీ›్ల వస్తువులు మాయమయ్యేవట. డైనింగ్ టేబ్ల్ మీదున్న ఆహారపదార్థాలతో పాటు, ఫ్రిజ్‌లో పెట్టిన పదార్థాలు కూడా మాయమవుతూ ఉండేవట. ‘ఇదేదో దొంగల పనే’ అని భావించిన ముకుందం దంపతులు ఎంతగా గాలించినా ఏ ఆధారమూ దొరకలేదట. ఒకరాత్రి, ఆ శబ్దాల సంగతి ఏమిటో తేల్చేద్దామని, భార్య ఎంత వారించినా వినకుండా టార్చి పట్టుకొని కిందకు దిగాడట ముకుందం. చేసేదేమీ లేక ఆమె కూడా అతన్ని అనుసరించిందట. కిచెన్ లోపల శబ్దాలు గట్టిగా వినిపించేసరికి ముందుకు అడుగు వేసిన ముకుందానికి నల్లని రూపమేదో కనిపించేసరికి, జడుసుకొని గబగబా వెనక్కి పరిగెత్తాడట. వెంటనే భార్యాభర్తలిద్దరూ రూమ్‌లోకి దూరి తలుపేసుకున్నారట. కాస్సేపటికి తలుపు దగ్గర కూడా ఎవరో తచ్చాడుతున్నట్లు అనిపించేసరికి మరింత భయపడిపోయారట. అలా ప్రతిరాత్రి భయపడుతూనే గడిపారట. దుర్భేద్యమయిన ఆ ఇంట్లో ఎవరూ దూరే అవకాశమే లేదు. తలుపులు, కిటికీలు మూసి ఉన్నా, వస్తువులు ఎలా మాయమవుతున్నాయో వాళ్లకు అర్థంకాక, ‘ఇది దెయ్యం పనే అయి ఉంటుంది’ అనే నిర్ధారణకు వచ్చేసి, ‘త్వరలోనే ఇల్లు మారిపోదాం’ అనుకుంటుండగానే ఈ ఘోరం జరిగిపోయింది’ ఆపాడు అంబరీష్. ‘సరే ముకుందం మరణం గురించి వివరాలు చెప్పు’ అన్నాడు కాళి. ‘ఆరోజు ఉదయం నిద్రలేచిన శ్రావణి, పక్కనే భర్త లేకపోవడంతో, అతని కోసం గదిలోంచి బయటకు వచ్చి, హాల్లో మెట్ల దగ్గర శవమై పడున్న భర్తను చూసి కేకలు పెట్టింది. వెంటనే రాములు, కమల వచ్చి, మన స్టేషన్‌కి ఫోన్ చేశారు. ముకుందం మెట్ల మీద నుంచి జారి పడ్డాడని, అదొక యాక్సిడెంట్ అని మొదట నేనూ అనుకున్నాను. అయితే అది యాక్సిడెంట్ కాదు. దెయ్యమే మెట్లమీద నుంచి తోసేసింది. మావారికి అరవై ఏళ్ళు వచ్చినా, చాలా యాక్టివ్‌గా ఉంటారు. రోజూ ఆరేడుసార్లయినా మెట్లెక్కి దిగుతూ ఉంటారు. జారిపడే ప్రసక్తి లేదు. మా ఇంట్లో దెయ్యం ఉంది. ఇది దాని పనే’ అని వాదించింది శ్రావణి. బాగా పరిశీలించి చూస్తే, అతను మెట్లమీద నుంచి జారిపడలేదని తెలిసింది. పాతకాలపు చెక్క మెట్లమీద నుంచి జారిపడితే, పెద్ద శబ్దమే వస్తుంది. ఆ శబ్దానికి శ్రావణి లేచి ఉండేది. ముకుందానిది భారీ శరీరం కాబట్టి, చెక్కమెట్లు గానీ, రెయిలింగ్ గానీ కొద్దిగానయినా డామేజ్ అయి ఉండాలి. అదేమీ లేదు. తలపై ఎవరో గట్టిగా కొట్టడం వల్లనే చనిపోయాడని నిర్ధారణకు వచ్చాను కానీ, హంతకుడెవరనేది తెలియలేదు. ఎంత పరిశోధించినా క్లూ దొరకలేదు. అందుకే శ్రావణి చెప్పినట్లు ..’అని అంబరీష్ అంటుండగా పెద్ద పెట్టున నవ్వాడు మహంకాళి. ‘దెయ్యమే చంపింది అని నిర్ధారణ చేసేశావన్నమాట. పిచ్చోడా? నీకు శ్రావణి మీద అనుమానం రాలేదా?’ అడిగాడు కాళి. ‘ఆ కోణంలోనూ ఆలోచించాను సర్.. శ్రావణిని చూశారు కదా? సన్నగా రివటలా ఉంటుంది. ఆమె ఎలా చంపుతుంది? వేరే అవకాశాల గురించి కూడా ఆలోచించాను. హత్య వేరే ఎవరయినా చేసి ఉండొచ్చని, శ్రావణి అతనికి సహకరించి ఉండవచ్చని, ఆమే తలుపు తీసి ఉండవచ్చని, అలా లోపలికి వచ్చిన వ్యక్తి హత్య చేసి ఉండొచ్చునని ... అలా చాలా రకాలుగా ఆలోచించి, ఆ దిశలో దర్యాప్తూ చేశాను. ఆమెను అనుమానించదగ్గ ఆధారాలేవీ దొరకలేదు’ అన్నాడు అంబరీష్.. తను సేకరించిన వివరాల ఫైల్‌ను అందిస్తూ.‘వెరీ గుడ్. చాలా బాగుంది నీ పరిశోధన. కానీ దెయ్యం హత్య చేసిందంటేనే నమ్మలేకపోతున్నాను’ అన్నాడు మహంకాళి. ఎన్నో కేసులను చాకచక్యంగా సాల్వ్ చేసిన మహంకాళికి, ఈ కేసు ఒక పెద్ద సవాల్ అయింది. దెయ్యాలే హత్య చేశాయి అని తేల్చేసిన కేసుల వివరాలను అంబరీష్ అందించాక, అదే నిజమేమోనన్న అభిప్రాయమూ బలపడుతున్న సమయంలో కేసు మలుపు తిరిగింది. కారణం ముకుందం శవాన్ని పోస్ట్‌మార్టమ్ చేసిన డా. త్రివేది అసిస్టెంట్ డా. సరిత. ఆమె కోరినట్లు, ఆమెను రహస్యంగా కలిశారు సీఐ, ఎస్సైలు. ‘డాక్టర్ త్రివేది.. పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్‌ని, మార్చి మీకు రేపు సబ్మిట్ చేయబోతున్నారు’ అనగానే.. ఇద్దరూ షాకయ్యారు. ‘వ్వాట్.. నిజమా?’ ప్రశ్నల వర్షం కురిపించాడు మహంకాళి. ‘నూటికినూరు శాతం నిజం. రెండేళ్ల నుంచి ఆయన దగ్గర పనిచేస్తున్నాను. ఎప్పుడూ ఇలా జరగలేదు. పోస్ట్‌మార్టమ్ చేస్తున్నప్పుడు నేనూ ఉన్నాను. అప్పటికి ఆ రిపోర్ట్ మార్చాలనే ఐడియా లేదనుకుంటాను. ఉన్నదున్నట్లే నాతో డిస్కస్ చేశాడు. ముకుందం మెట్లమీద నుంచి జారిపడిపోవడం వల్ల చనిపోలేదు. ఎవరో దేనితోనో తలపై కొట్టడం వల్ల మరణించాడు. కానీ, ఇవాళ తయారుచేసిన కొత్త రిపోర్టులో ‘మెట్లమీద నుంచి పడిపోవడం వల్లనే ముకుందం మరణించాడని, అతని ఒంటి మీదున్న కముకు దెబ్బలు.. మెట్లతాకిడి వల్ల తగిలాయని మార్చి రాశాడు. ఆ కొత్త రిపోర్ట్ నాకు కనబడకుండా దాచినప్పుడే నాకు అనుమానం కలిగింది. కానీ, అతనికి తెలియకుండా చాటుగా ఆ రిపోర్ట్‌ను చదివాను. ఇదే కాదు చాలా కీలకమైన విషయాన్ని కూడా దాచి పెట్టాడు’ అని చెప్పింది డా. సరిత. ఇద్దరూ ఒకేసారి ‘ఏమిటి? ఏమిటి?’అని ఆత్రుతగా ప్రశ్నించారు.‘ముకుందం పంటి మీద రక్తపు మరక కనిపించింది. దాని శాంపిల్‌ని ఫోరెన్సిక్ లాబ్‌కి పంపి, పరీక్ష చేయిస్తే, ఆ రక్తం అతనిది కాదని, వేరే ఎవరిదోనని తెలిసింది’ అని చెప్పింది ఆమె. ఆ మాట విని ఇద్దరూ నోరెళ్లబెట్టారు. ‘ఇప్పుడా విషయాన్ని దాచేసి, ఆ రిపోర్ట్ మాయం చేసేశాడు. చాలాకాలంగా అతని లైంగిక వేధింపులతో నరకం అనుభవిస్తున్నాను. ఇప్పుడు అతని పీడ వదిలిపోతుంది’ అంది కసిగా. సరితతో మరికాస్త సేపు మాట్లాడాక కేసుకు కావలసిన కొత్త విషయాలు కూడా తెలియడంతో కేసు సాల్వ్ చేయడానికి మార్గం సుగమం అయింది. వారం రోజుల తర్వాత, వేటబంగాళా ముందు పోలీసు జీపులు ఆగాయి. పోలీసులు నేరుగా కిచెన్‌లోకి వెళ్ళారు. కిచెన్‌లోని అటక వైపు చూస్తూ, ‘ఒరేయ్ నరసింహం నీ ఆట కట్టించేశాం. కిందకు దిగిరా. నీ అంతట నువ్వు వస్తే మంచిది. లేకపోతే, మా తూటాలతో అటకంతా ముక్కలు ముక్కలు అయిపోతుంది. నీకు రెండు నిమిషాల టైమ్ ఇస్తున్నాను’ హెచ్చరించాడు మహంకాళి. భయపడి, తాడు సహాయంతో కిందకు దిగాడు నరసింహం. బేడీలు వేశాడు అంబరీష్. కేసు వివరాలు తెలుసుకోవడానికి మర్నాడు స్టేషన్‌కి రమ్మని శ్రావణికి చెప్పి వెళ్ళిపోయారు పోలీసులు. మర్నాడు చెప్పడం మొదలుపెట్టాడు, మహంకాళి.. ‘మీ వారిని చంపింది, దెయ్యంలా భయపెట్టింది ఇతనే. ఈ నరసింహం పెద్ద కేడీ. కిందటేడాది జైలు నుంచి తప్పించుకుపోయి, మీ ఇంట్లో దూరాడు. ఆ రోజుల్లో కట్టిన పెద్ద అటక, పెద్ద జాగాలో ఉన్న మీ ఖాళీ బంగాళా ఇతనికి బాగా కలసి వచ్చాయి. ఇంట్లో దెయ్యాలు ఉన్నట్లు నాటకం ఆడితే, సేఫ్‌గా ఉండొచ్చు అని ప్లాన్ వేశాడు. దెయ్యాలకు భయపడి మీ బంగళాలో ఎవరూ దిగరు అనే ధీమాతో ఉన్నాడు. కానీ దెయ్యాలు, భూతాలు ట్రాష్ అనుకునే మీ దంపతులిద్దరూ ఇంట్లో దిగిపోయారు. ఎప్పటి నుంచో మీ బంగళాను కొని, పెద్ద అపార్ట్మెంట్ కట్టాలనే ఆశతో ఉన్న ‘బిల్డర్ పోతరాజు’.. బంగాళా అమ్మమని మిమ్మల్ని ఒత్తిడి చేస్తున్నాడని, భోజనం చేస్తున్నప్పుడు మీవారు మీకు చెప్పడం నరసింహం చెవిన పడింది. వీలు చూసుకొని పోతరాజుని కలసి, మిమ్మల్ని దెయ్యంలా భయపెట్టి, ఇల్లు అమ్మేసేలా చేస్తానని బేరం కుదుర్చుకున్నాడు. హత్య జరిగిన రాత్రి, సహజంగా ధైర్యవంతుడయిన ముకుందం, తెగించి కిందకు దిగివచ్చినపుడు, నరసింహం దొరికిపోయాడు. వెంటనే నరసింహం.. చేతికి దొరికిన గిన్నెతో మీవారి తల మీద కొట్టాడు. ఆయన కింద పడిపోయారు. మెట్ల దగ్గర పడేస్తే, జారి పడ్డాడని అనుకుంటారని, ఆయన్ని మెట్ల దగ్గరకు ఈడ్చుకుంటూ వస్తున్నప్పుడు ముకుందంగారికి తెలివి రావడంతో, వాడి చేతిని కొరికారు. వాడు మళ్ళీ తలమీద బలంగా కొట్టి చంపేశాడు. హత్యకు ఉపయోగించిన గిన్నెను అటక మీద దాచేశాడు. ఇవేమీ తెలియని మేము కేసును ఎలా సాల్వ్ చేయాలో తెలియక బుర్ర బద్దలు కొట్టుకుంటున్న సమయంలో మాకు కీలకమైన ఆధారం దొరికింది. ముకుందంగారి బాడీని పోస్ట్‌మార్టమ్ చేసిన డాక్టర్ త్రివేది, తప్పుడు రిపోర్ట్ ఇచ్చాడని, అతని దగ్గర పనిచేసే జూనియర్ డాక్టర్ సరిత మాకు చెప్పింది. ముకుందంగారి పంటికి ఎవరిదో రక్తం అంటిందన్న విషయం ఒరిజినల్ పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్‌లో ఉంది. హత్య జరిగాక, ఒక కొత్త వ్యక్తి త్రివేదిని కలవడానికి వచ్చేవాడని, వాళ్ళిద్దరూ రహస్యంగా మాట్లాడుకొనేవారని ఆమె చెప్పింది. ఆమె చెప్పిన గుర్తుల ఆధారంగా, బిల్డర్ పోతరాజుని పట్టుకోగలిగాం. త్రివేదిని, పోతరాజుని కస్టడీలోకి తీసుకొని, మా పద్ధతిలో విచారణ జరిపేసరికి, అన్ని విషయాలూ బయటపడ్డాయి. ముకుందంగారి పంటి మీద ఉన్నది మానవ రక్తం అని తెలిసిపోతే, ఆ హత్య దెయ్యం పనికాదని కనిపెట్టేస్తామని, ఆ రిపోర్ట్ మార్పించేశాడు పోతరాజు, త్రివేదికి డబ్బాశ చూపించి. ఎప్పుడయితే దెయ్యమే హత్య చేసిందని అందరూ నమ్మేస్తారో, అప్పుడే తన పని సులువు అయిపోతుందని మీ బంగళాను చవకగా కొట్టేసి కోట్లు సంపాదించాలనుకున్నాడు పోతరాజు. పాపం ఇప్పుడు నరసింహంతో కలసి జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు’ అంటూ ముగించాడు కాళి. -కొయిలాడ రామ్మోహన్ రావు -
ఒకే లాంటి మూడు హత్యలు.. ఇప్పటికీ మిస్టరీ గానే!
అది 1984 జూలై 21, అమెరికాలోని మోంటానా.. రోసన్డన్ లోని సేక్రడ్ హార్ట్ క్యాథలిక్ చర్చి. అక్కడంతా ఫాదర్ జాన్ కెర్రిగన్(58) కోసమే వెతుకుతున్నారు. ముందురోజు రాత్రి 11 గంటలకు అతడ్ని చర్చ్‌కి ఎదురుగా ఉన్న బేకరీలో చూశామని, మాట్లాడామని, కాసేపట్లో వెళ్లి పడుకుంటాను అంటూ గుడ్‌నైట్ కూడా చెప్పారని కొందరు ప్రత్యక్షసాక్షులు చెప్పారు. ఎంతసేపటికీ జాన్ ఆచూకి తెలియక పోవడంతో.. చర్చ్ నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ వెంటనే విచారణ మొదలైంది. మరుసటి రోజు, ఫ్లాట్‌హెడ్ సరస్సు సమీపంలో హైవే వెంబడి రక్తంతో తడిసిన షర్ట్, షూస్, చలికోటు దొరికాయి. అవి కెర్రిగన్వే కావడంతో మిస్సింగ్ కేసు కాస్తా మర్డర్ కేసుగా మారిపోయింది. ఆ చోటంతా జల్లెడపట్టారు అధికారులు. అప్పుడే కోట్ హ్యాంగర్ ఒకటి కనిపించింది. దాన్ని కిల్లర్.. కెర్రిగన్ని బంధించడానికి లేదా గొంతు కోయడానికి ఉపయోగించి ఉంటాడని అంచనాకొచ్చారు. అయితే కెర్రిగన్ బాడీ మాత్రం దొరకలేదు. సరిగ్గా వారం తర్వాత జూలై 29న, కెర్రిగన్ కారు రక్తపు మరకలతో కనిపించింది. కొద్ది అడుగుల దూరంలో కారు తాళం పడేసి ఉంది. డిక్కీ తెరిచే ఉంది. దానిలో పార, దిండుతో పాటు కెర్రిగన్ వాలెట్ కూడా రక్తంతో ముద్దయ్యాయి. వాలెట్ నిండా డబ్బులుండటంతో.. ఈ నేరం డబ్బు కోసం జరగలేదని.. పగ, ప్రతీకారంతోనే జరిగిందని కేసు దర్యాప్తు అధికారులకు క్లారిటీ వచ్చేసింది. ఈ క్రమంలో 1982లో జరిగిన మరో ఇద్దరు చర్చ్ ఫాదర్స్ మిస్సింగ్ అండ్ మర్డర్ కేసులు మళ్లీ చర్చనీయాంశాలుగా నిలిచాయి. ఆ రెండు కేసులకి, ఫాదర్ కెర్రిగన్ అదృశ్యానికీ.. ఏదో సంబంధం ఉందనే అనుమానంతో.. ఆ దిశగా విచారణ మొదలుపెట్టారు. అంతకు ముందు ఏం జరిగింది? 1982 ఆగస్ట్ 7న న్యూ మెక్సికోలోని శాంటా ఫేలో సెయింట్ ఫ్రాన్సిస్ కేథడ్రల్ చర్చ్‌కి ఓ ఫోన్ కాల్ వచ్చింది. ‘నా పేరు మైకేల్ కార్మెల్లో, చావుబతుకుల మధ్య ఉన్న మా తాతకు ఎక్స్ట్రీమ్ అంక్షన్(క్యాథలిక్ మతకర్మల ప్రకారం తీవ్ర అనారోగ్యానికి గురైనవారి కోసం, చివరి దశలో ఉన్న వృద్ధుల కోసం చర్చ్ ఫాదర్స్ ప్రార్థనలు చేస్తారు) ఇవ్వాలని కోరాడు. మొదట ఫోన్ లిఫ్ట్ చేసిన ఓ ఫాదర్.. నాకు వీలుపడదు కానీ..మరో పదిహేను నిమిషాలు ఆగి కాల్ చేయమని చెప్పాడు. సరిగ్గా పదిహేను నిమిషాలకి ఆ అజ్ఞాత వ్యక్తి కాల్ చేశాడు. ఈసారి ఫోన్ లిఫ్ట్ చేíసిన.. రెనాల్డో రివెరా(57) అనే ఫాదర్ ఆ అజ్ఞాత వ్యక్తి కోరికను కాదనలేకపోయాడు. వస్తానని అతడికి మాటిచ్చాడు. ఎక్కడికి రావాలని రివెరా అడిగితే.. ‘న్యూ మెక్సికోలోని వాల్డో సమీపంలో రెస్ట్ స్టాప్‌లో ఉంటాం’ అని వివరాలు చెప్పాడు ఆ వ్యక్తి. దాంతో రివెరా వాల్డోకు వెళ్తునట్లు చర్చ్ మఠాధిపతికి సమాచారం ఇచ్చి చర్చ్ నుంచి బయలుదేరాడు. ఆ తర్వాత అతడు తిరిగి రాలేదు. సరిగ్గా మూడు రోజుల తరువాత, ఫాదర్ రివెరా మృతదేహం రెస్ట్ స్టాప్ నుంచి మూడు మైళ్ల దూరంలో బయటపడింది. కాస్త దూరంలో కారు కూడా దొరికింది. ఫాదర్ కెర్రిగన్ అదృశ్యానికి, ఫాదర్ రివెరా హత్యకు మధ్య అనేక సారూప్యతలు ఉన్నాయి. ఇద్దరి కార్లూ నేరస్థలానికి దూరంగానే విడిచారు. రెండు కేసుల్లోనూ కోట్ హ్యాంగర్స్ కామన్‌గా నిలిచాయి. అవి కూడా ఒకే కంపెనీకి చెందినవి. ఇన్ని సరిపోలిన తర్వాత రెండు హత్యలకు సూత్రధారులు ఒక్కరనే నమ్మకానికి వచ్చేశారు పోలీసులు. పైగా ఈ హత్యలకు క్యాథలిక్ వ్యతిరేకవర్గాలే ప్రేరణగా నిలుస్తున్నాయని.. చాలా మంది నమ్మారు. అయితే అందుకు సరైన ఆధారాలు లభించకపోవడంతో ఆ ఊహాగానాలను పోలీసులు కొట్టి పడేశారు. రివెరాతో ఫోన్లో మాట్లాడిన.. మైకేల్ కార్మెలో అనే వ్యక్తి కోసం పోలీసులు ఓ రేంజ్లో వేట మొదలుపెట్టారు. మోంటానా రాష్ట్ర సైనికుల సాయం కూడా తీసుకున్నారు. హత్యలో కనీసం ఇద్దరు వ్యక్తుల ప్రమేయం ఉందని చాలామంది భావిస్తున్నారు. కొందరు అనుమానితుల్ని పట్టుకుని నిలదీశారు. స్థానికంగా కొందరు యువకుల్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అయినా ఎలాంటి ఆధారం దొరకలేదు. అయితే కొన్ని నివేదికల ప్రకారం ఆగస్ట్ 8న చివరిసారిగా ఫాదర్ కెర్రిగన్ను చూశామని తేలడంతో.. అసలు కెర్రిగన్ చనిపోలేదా? బతికే ఉన్నాడా? అనే అనుమానాలు మొదలయ్యాయి. పైగా 1982లో మిస్ అయిన మరో ఫాదర్ జేమ్స్ ఓటిస్ ఆండర్సన్.. కెర్రిగన్ స్నేహితుడే కావడం కూడా ఈ కథలో రక్తికట్టించే అంశమే. మరో ఫాదర్ కథ? జేమ్స్ ఓటిస్ 1982 జూన్ 13న మోంటానాలోని టౌన్సెండ్లోని హైవే 12వైపు కారులో వెళ్తూ కొందరికి కనిపించాడు. అదే చివరిసారి. ఆ తర్వాత అతడి కారు టౌన్‌సెండ్‌కు ఈశాన్యంలో ఉన్న బిగ్బెల్ట్ పర్వతాలలో పెద్దపెద్ద చెట్ల మధ్య దొరికింది. అతడి భార్య.. జేమ్స్‌కి డ్రైవింగ్ అంతగా రాదని.. అలాంటి పర్వతాల మధ్య అస్సలు డ్రైవ్ చేయలేడని చెప్పింది. దాంతో అప్పట్లో.. కారు ఎవరో కావాలనే అక్కడికి తీసుకుని వెళ్లారనే కోణంలో విచారణ చేశారు. అలాగే ఆ పరిసర ప్రాంతాలను క్షుణంగా పరిశీలించగా.. జేమ్స్‌కి సంబంధించిన బైబిల్స్, కళ్లజోడు, టోపీ, క్లరికల్ కాలర్ ఇలా చాలా వస్తువులు దొరికాయి. కానీ జేమ్స్ మాత్రం దొరకలేదు. కెర్రిగన్ మిస్సింగ్ తర్వాత.. పోలీసులు ఈ మూడు కేసుల్ని చాలెంజింగ్‌గా తీసుకున్నారు. కానీ ఎలాంటి క్లూస్ లభించలేదు. అయితే 2015లో రోమన్ క్యాథలిక్ డియాసెస్ ఆఫ్ హెలెనా నిర్వహించిన సర్వే ఒకటి బయటికి వచ్చింది. అందులో పశ్చిమ మోంటానాలో పిల్లలను లైంగికంగా వేధింపులకు గురిచేసిన ఎనభై మంది మాజీ ఉద్యోగుల పేర్లు ఉన్నాయి. వారిలో ఫాదర్ కెర్రిగన్ ఒకడు. ఒక్కసారిగా కేసు ఆ దిశగా తిరిగింది. లైంగిక వేధింపులతో సంబంధం ఉండటం వల్లే ఆ బాధితుల్లో ఎవరో చంపేసి ఉంటారని ఊహాగానాలు పుట్టు కొచ్చాయి. అయితే కొందరు పరిశోధకులు ఆ ఆరోపణలను కొట్టిపారేశారు. ఏదిఏమైనా కెర్రిగన్, జేమ్స్‌లు ఎప్పుడూ, ఎవరికీ కనిపించ లేదు. కనీసం మృతదేహాలు కూడా కానరాలేదు. మరి ముగ్గురి అదృశ్యానికి, మరణానికి ఒక్కడే సీరియల్ కిల్లర్ కారణమా? లేక వేరువేరు కథలను కన్ఫ్యూజన్తో పోలీసులు ఏకం చేయడానికి ప్రయత్నించారా? అనేది నేటికీ మిస్టరీగానే ఉంది. ∙సంహిత నిమ్మన -
పాలిన్ చనిపోయిందంటున్నారు.. ఇంటికి వచ్చిందెవరు?
అది 1922, ఏప్రిల్ నెల. నార్త్–వెస్ట్ ఫ్రాన్స్.. బ్రిటనీ ప్రాంతంలోని గోవాస్ అల్ లూడూ. ఆ గ్రామంలో ఊహించని అలజడి మొదలైంది. వందల మంది సందుగొందుల్లో పరుగులు తీస్తున్నారు. గుంతల్నీ, చెట్టు తొర్రల్నీ వేటినీ వదిలిపెట్టకుండా అణువణువు వెతుకుతున్నారు. ‘పాలిన్.. పాలిన్..’ ఇదే పేరు ప్రతి ఒక్కరి నోట. పక్కనే ఉన్న అడవినీ జల్లెడ పట్టేశారు. ఎటు చూసినా పాలిన్ పేరే మారుమోగసాగింది. కానీ పాలిన్ మాత్రం దొరకలేదు. పాలిన్ పికార్డ్.. రెండేళ్ల చిన్నారి. పొలంలో ఆడుతూ ఆడుతూ ఉన్నట్టుండి మాయమైంది. అడవివైపు వెళ్లిందా? అక్కడ తప్పిపోయి.. చలికి తట్టుకోలేక ఎక్కడైనా పడిపోయిందా? లేక అడవి పందులేమైనా లాక్కెళ్లాయా? అనుకుంటూ పాలిన్ కుటుంబంతో పాటు చుట్టుపక్కల జనమంతా వెతుకుతూనే ఉన్నారు. లాభం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులతో పాటు సైనిక బృందం కూడా రంగంలోకి దిగింది. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా.. పాలిన్ ఆచూకీ దొరకలేదు. దాంతో ‘ఎవరైనా ఎత్తుకెళ్లారా?’ అనే అనుమానాలు బలపడ్డాయి. ఆ దిశగా విచారణ మొదలుపెడితే.. పాలిన్ మిస్ అయిన రోజు.. పొలానికి సమీపంలో ఇద్దరు అపరిచితుల్ని చూశామంటూ పొరుగువారు గుర్తుచేసుకున్నారు. మరోవైపు కెరమాన్ అనే గొడుగులు అమ్మే వ్యక్తిని అరెస్ట్ కూడా చేశారు. పాలిన్ అంటే కెరమాన్ చాలా ఇష్టంగా ఉండేవాడని.. పాలిన్ అదృశ్యమైన రోజు అతడు పాపని కలిశాడని తేలడంతో అతడ్ని గట్టిగానే విచారించారు. సరైన ఆధారాలు లేక విడిచిపెట్టారు. గోవాస్ అల్ లూడూ గ్రామంలో పాలిన్ కుటుంబం ఉండే ఇల్లు ఊరికి దూరంగా సింగిల్‌గా ఉండేది. మే నెల చివర్లో పోలీసులు ఒక చిన్న పాప ఫొటోతో వచ్చి.. పాలిన్ కుటుంబాన్ని కలిశారు. ‘ఈమేనా మీ పాప?’ అని అడిగారు. ఫొటోని బాగా పరికించి చూసిన పికార్డ్ దంపతులు.. ‘అవును’ అంటూ ఏడ్చేశారు. ‘ఈ పాప రూ కోయ్పెల్లో దొరికింది. చినిగిన బట్టలతో ఉన్న ఓ మహిళ ఈ పాపని వదిలేసి పారిపోయింది, పాపని షెర్బోర్గ్లోని ధర్మశాలకు తరలించారు’ అంటూ జరిగింది చెప్పుకొచ్చారు పోలీసులు. నిజానికి పాప దొరికిన ప్రాంతం.. గోవాస్ అల్ లూడూ గ్రామానికి 217 మైళ్ల (350 కిమీ) దూరంలో ఉంది. అంత దూరం పాలిన్ ఎలా వెళ్లిందో? ఎవరికీ అంతుపట్టలేదు. పోలీసులు చెప్పింది విన్న వెంటనే పాలిన్ పేరెంట్స్ షెర్బోర్గ్కు రైలెక్కారు. పాప ఉన్న ధర్మశాలకు వెళ్లారు. అక్కడ పాపని చూస్తే.. గుర్తుపట్టలేనంతగా చిక్కిపోయింది. తనే పాలిన్ అంటే.. పాప తల్లిదండ్రులు నమ్మలేకపోయారు. అయితే అదే జుట్టు, అవే నీలి కళ్ళు కావడంతో ఏడుస్తూ గుండెలకు హత్తుకున్నారు. ‘ఇన్నిరోజులుగా సరైన ఆహారం అందకపోవడం వల్లే పాలిన్ అలా అయ్యింది’ అని వైద్యులు చెప్పారు. పాప పోషకాహార లోపంతో బాధపడుతోందని, వైద్యపరమైన ఎలాంటి సమస్యలు లేవని తేల్చేశారు. తల్లిదండ్రులు పాపతో స్థానిక భాషలో మాట్లాడటానికి ప్రయత్నించినప్పుడు.. పాప వాళ్లని గుర్తుపట్టలేదు. మొత్తానికీ పాపని ఇంటికి తెచ్చుకున్నారు. పాప దొరికిన రోజు పాప ఒంటి మీదున్న దుస్తులు పాలిన్వి కాకపోవడంతో.. బహుశా పాపని ఎత్తుకెళ్లినవాళ్లు దుస్తులు మార్చి ఉంటారని అనుకున్నారు. రావడం రావడమే పాపను చూసిన తోబుట్టువులు ఆమెను పాలిన్గానే గుర్తించారు. అయితే పాప మాత్రం మౌనంగానే ఉండేది. తినడానికి రొట్టెలు అడుగుతుందని, స్థానిక భాషలో పెంపుడు పిల్లిని పిలుస్తుందని నెమ్మదిగా.. పాత పాలిన్ లా యాక్టివ్ అవుతుందని కుటుంబసభ్యులంతా నమ్మడం మొదలుపెట్టారు. కొన్ని రోజులకు.. గోవాస్ అల్ లూడూలో మరో అలజడి రేగింది. పాలిన్ ఇంటికి మైలు దూరంలో ఉన్న పొలంలో.. ఓ రైతుకు.. తల, చేతులు, కాళ్లు లేని కుళ్ళిపోయిన చిన్న శరీరం కనిపించింది. ఆ పక్కనే పొందిగ్గా మడతపెట్టిన బట్టలు కనిపించాయి. వెంటనే ఆ రైతు పోలీస్ స్టేషన్ కి పరుగుతీశాడు. పోలీసులు వచ్చి పరిశీలించగా ఆ బట్టలు పాలిన్ వేనని తేలాయి. దాంతో అది పాలిన్ శవమని గుర్తించారు. డెడ్ బాడీకి కాస్త దూరంలో పూర్తిగా రూపురేఖలు లేని తల కనిపించింది. అయితే అప్పటికే పాలిన్‌ని వెతికే క్రమంలో.. మృతదేహం దొరికిన ఆ ప్రాంతాన్ని పోలీసులు, ప్రజలు పలుమార్లు వెతికారు. అప్పుడు దొరకని మృతదేహం, బట్టలు ఇప్పుడు దొరికాయంటే.. ఎవరో కావాలనే వాటిని అక్కడ వేశారని అర్థమైంది. అది కచ్చితంగా పాలిన్ ని మాయం చేసిన నేరస్తుల పనేనని తేలిపోయింది. కానీ నేరగాడు మాత్రం పట్టుబడలేదు. తీరా వైద్యపరీక్షలు చేస్తే.. ఆ తల, శరీరం ఒకే వ్యక్తివి కావని.. శరీరం చిన్న పాపదే కానీ తల మాత్రం ఒక పురుషుడిదని, తలను నక్కలు పాక్షికంగా తినడం వల్లే అలా తయారైదని తేలింది. కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు కనిపిస్తుండడంతో పోలీసులు తలలు పట్టుకున్నారు. పాలిన్ శరీరంలో కాళ్లు, చేతులు, తల ఏమయ్యాయి? తల మాత్రమే దొరికిన పురుషుడు ఎవరు? అతడి శరీరం ఏమైంది? అసలు ధర్మశాల నుంచి తెచ్చుకున్న పాప ఎవరు? ఇలా అన్నీ ప్రశ్నలే మిగిలాయి. మరణానికి గల సరైనకారణం వైద్యపరీక్షల్లో తేలలేదు. అయితే పాలిన్‌ని కిడ్నాప్ చేసిన వారు.. పాపను దాచిపెట్టి కేసును తప్పుదోవ పట్టించడానికే ఇలా మృతదేహాలతో ఆడుకుంటున్నారని నమ్మడం మొదలుపెట్టారు కొందరు. షెర్బోర్గ్లో దొరికిన పాప.. పారిపోయిన ఆ మహిళ కూతురేనని.. పోషించలేకే పాపను వదిలి, ఆమె తన భర్తతో కలసి అమెరికా వలసపోయిందని ఊహాగానాలు వచ్చాయి. ఇక జూన్ నెల మధ్యలో పికార్డ్ దంపతులు.. ఆ పాపను దత్తత తీసుకోవడానికి సిద్ధపడ్డారు. కొన్ని రోజులకు వైవ్స్ మార్టిన్ అనే మతి చలించిన వ్యక్తి.. పికార్డ్ దంపతుల్ని కలసి.. వారి దగ్గరున్న చిన్నపాపను చూపిస్తూ.. ‘ఇది పాలిన్ అని మీరు నమ్ముతున్నారా? దేవుడా నన్ను క్షమించు, నేను దోషిని’ అని పెద్దగా నవ్వుతూ అడవిలోకి పారిపోయాడు. ఆ మరుసటి రోజు అతణ్ణి పిచ్చి ఆసుపత్రికి తరలించారు. అతడే పాలిన్‌ను హత్య చేసి ఉంటాడని చాలా మంది నమ్మారు. ఏది ఏమైనా పాలిన్ కథలో అసలు నేరగాడు ఎవరు? ఆ మృతదేహాలు ఎవరివి? అక్కడకి ఎలా వచ్చాయి? మతిచలించిన ఆ వ్యక్తే నేరం చేశాడా? వంటివన్నీ మిస్టరీగానే మిగిలాయి. - సంహిత నిమ్మన -
కథ: ఋణశేషం.. 30 లక్షలకే ఇల్లు! ఐదేళ్ల క్రితం చనిపోయిన శీనును ఇప్పుడు కలిశావా?
చెన్నై, తాంబరాన్ని దాటి ఇరవైకిలోమీటర్ల దూరంలోనున్న ఆ ఇంటిని కొనుక్కునేటప్పుడే కాస్తంత ఆలోచించి ఉండాల్సింది. ‘రెండు గ్రౌండుల ఇంటిని ముప్పై లక్షల రూపాయలకు, ఇంత చౌకగా అమ్ముతున్నాడేమిటి ఈ కళ్ళజోడువాడు?!’ అంటూ ఇరుగుపొరుగువాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడే వెనక్కి తగ్గివుండాల్సింది. ‘అమెరికాలో సెటిల్ అవుదామనుకుంటున్నామండీ. డబ్బు ప్రధానం కాదు, మనుషులే ప్రధానం’ అంటూ అతను గడగడమని వాగుతున్నప్పుడే వెనక్కి తగ్గివుండాల్సింది. తక్కువ ధరకు ఇల్లు దొరుకుతోంది కదాని తొందరపడ్డందుకు బాగానే ఏడ్వాల్సి వస్తోంది. కారణం.. ఆ ఇంట్లో తిరుగాడుతున్న దెయ్యం. దాన్ని ఇంట్లో నుంచి తరిమేందుకు దెయ్యంలా చక్కర్లు కొడుతోన్న నేను సాఫ్ట్వేర్ ఇంజినీర్ని. ఈ ఇంటిని చూసిన వెంటనే నా భార్య సీతకు, నా సుపుత్రుడు హరికి బాగా నచ్చింది. రెండు పడకగదులతో చిన్న ఇల్లు. ఇంటి చుట్టూ విశాలమైన ప్రదేశం. భవిష్యత్తులో చేతికి తగినన్ని డబ్బులు అందితే విశాలమైన ఇంటిని మరింత పెద్దగా కట్టుకోవచ్చు. తోటను పెంచవచ్చు. ఇంటిముందున్న వేపచెట్టుకు ఊయలను కట్టొచ్చు. ఆడొచ్చు.. పాడొచ్చు.. అరవొచ్చు.. పరుగెత్తొచ్చు! ఇలా అనేక విధాల ‘వచ్చు’లతో అంతా బాగానే ఉంది. ఆ ఇంట్లో మొదటిరాత్రి గడిపేంతవరకు. ఉదయాన్నే పూజాకార్యక్రమాలన్నీ చక్కగా జరిగాయి. భోజనాలనంతరం.. సాయంకాలం వరకు వచ్చిన వాళ్లంతా నెమ్మది నెమ్మదిగా వెళ్లిపోగా.. రాత్రికి నేనూ, నా భార్య, మా అబ్బాయి, ఇంకా నా భార్య కాలేజ్ తమ్ముడు మాత్రం మిగిలిపోయాం. రాత్రి భోజనం.. నాలుగు కిలోమీటర్ల దూరంలోనున్న ఓ హోటల్లో. ఇంటికి సంబంధించిన ప్రత్యేకతలను మాట్లాడుకుంటూనే భోంచేశాం. ‘ఇది నా సొంతిల్లు’అని కాలర్‌ను ఒక అంగుళం పైకి లేపి, ఇంటికి చేరుకుని తలుపు తాళం తీయగానే బెదిరిపోయేంతటి పని. ఒక బూడిదరంగు ఆకారం గభాల్న వంటగదివైపు వెళ్తున్నట్లుగా అనిపించింది. అది నిజమా? లేక భ్రమా? ఒక ఆకారమా? లేక కదలికనా? ఒక మిల్లీసెకండ్ మాత్రమే. లైట్ స్విచ్ వేశాను. మల్లెపూల వాసన. పొద్దున్నే పూజ చేసిన ఇల్లు. పూజకు విచ్చేసిన చాలామంది మహిళలు పట్టు చీరలు, మల్లెపూలతో వచ్చి వెళ్ళినందుకు గుర్తుగా ఈ మల్లెపూల వాసన. నన్ను నేను సమాధాన పరచుకున్నాను. హరి, సీత లోపలిగదిలో పడుకోగా.. నేనూ, మా బావమరిది హాల్లో పడుకున్నాం. కిటికీలు తెరిచే ఉన్నాయి. పక్కనే కట్టడాలు లేనందున కాస్తంత గాలివాటంగా అనిపించింది. గేటు దగ్గర లైట్లను ఆర్పేయలేదు. అలసటతో వెంటనే గాఢ నిద్రలోకి జారుకున్నాం. అర్ధరాత్రి. మెదడులోని నరాలను దడదడలాడించిన ఒక పెద్ద అరుపు. ‘ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ...!’ అరిచింది మా బావమరిది. అదిరిపోయి లేచాను. ‘ఏయ్, ఏమైయ్యింది?’ అంటూ నిద్రలోనున్న తనను కుదిపాను. ‘ఎవరో నా మీద కూర్చుని గొంతు నులుముతున్నారు’ తను మాట్లాడలేక పోతున్నాడు. దీర్ఘశ్వాస తీసుకుంటున్నాడు. చెమటతో తడిసి ముద్దయిపోయాడు. ఆలోపు కేకలను విన్న సీత పరుగుపరుగున హాల్లోకి వచ్చింది. లైట్లన్నీ వెలిగించాం. ‘గొంతు నులుముతున్నారా? ఎవరు? నేను నీ పక్కనే పడుకున్నాను కదా?’అంటూ నేను మాట్లాడుతుండగా, కిటికీవైపు ఓ చిన్న సంచలనం. అటువైపు తీక్షణంగా చూస్తే, వేపచెట్టు గాలికి అటు ఇటు ఊగుతుండటం కనిపించింది. ఆ క్షణంలో వేపచెట్టుపై పొగలు.. నిజంగా అది పొగేనా లేక నా భ్రమా అని ఆలోచించేలోపు, గదిలో ఒక విచిత్రమైన వాసన వ్యాపించి, క్షణంలో మాయమైపోయింది. ‘రోజంతా కంప్యూటర్లో మనుషులను నరకడం, పొడవటం వంటి గేమ్స్ ఆడటం, రాత్రిపూట కేకలు పెట్టడం..’ తమ్ముడి కేకలకు తగిన కారణాన్ని చెప్పింది సీత. సీత ధైర్యవంతురాలు. తన తండ్రిది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కావడం వలన పలు ప్రాంతాల్లో, పలువిధాలైన ఇళ్ళల్లో నివసించింది. కొత్త ప్రదేశాలు, కొత్త ముఖాలు, కొత్త పరిస్థితులు ఆమెనేమాత్రం ఇబ్బంది పెట్టవు. నాకైతే రాత్రిపూట కిటికీలోంచి చూసేందుకే భయంగా ఉంది. ‘ఏం లేదు. ఏదో కల. లైట్ ఆఫ్ చేసి నిద్రపోండి’అంటూ మా భయాన్ని వెనక్కి నెట్టేసింది సీత. అయినప్పటికీ, ఆ తరువాత ఎవ్వరికీ నిద్రపట్టలేదు. ఇంటి చుట్టూ ఏదో తిరుగాడుతున్నట్లుగానే భావించాం. పొద్దున్నే పాలు కొనుక్కొచ్చేందుకు మెయిన్ రోడ్డు దుకాణానికి వెళ్ళినప్పుడు, ఎంతో ఆసక్తిగా అడిగాడు ఆ దుకాణాదారుడు. ‘నాలుగోవీధి ఇంట్లోకి కొత్తగా వచ్చారా?’ ‘అవును’ ‘రేటు తక్కవనగానే వెంటనే కొనేశారా?’ ఆ ప్రశ్నలో ‘మోసపోయారులే!’అనే ధోరణి. ‘లేదు, ఇల్లు మాకు బాగా నచ్చింది.’ ‘ఆ ఇంట్లో ఉండేవాళ్ళు ఒక్కరోజు కూడా ప్రశాంతంగా నిద్రపోయింది లేదని చెబుతుండేవారు. చాలామంది ఆ ఇంటిని ఖాళీ చేసి వెళ్ళిపోయారు’ అంటూ ఆ దుకాణాదారుడు పాలప్యాకెట్‌ను అందించేలోపు, ఆ ఇంటి స్థల పురాణాన్ని వివరించాడు. ‘అలాంటిదేమీ లేదే!’ అని చెప్పి, పాలప్యాకెట్తో అక్కడ్నుంచి బయటపడ్డాను. ఇంటికి చేరుకోగానే ఆ దుకాణాదారుడు చెప్పిన విషయాన్ని సీతకు చెప్పాను. ఆమె ఏమాత్రం చలించలేదు. ‘ఇళ్ళ ధరలను తగ్గించేందుకు బ్రోకర్లు చేసే మాయాజాలం ఇది. దెయ్యం లేదు, గియ్యం లేదు. మీరు ఏకాలంలో ఉన్నారు?’ అంటూ ప్రశ్నల వర్షాన్ని కురిపించింది. ‘ఈరోజు రాత్రి కూడా ఇక్కడే నిద్రపోదాం’అని సీత గట్టిగా చెప్పడంతో, ‘నేను కాలేజ్‌కు వెళ్తున్నాను’అంటూ బావమరిది బయలుదేరాడు. రాత్రయ్యింది. దేవుళ్ళ పటాలకు స్పెషల్ పూజలు చేసింది సీత. లోపలిగదిలో పడుకోకుండా హాల్లోనే పడుకున్నాం. జీరోవాట్ బల్బ్ వెలుగుతూనే ఉంది. తల పక్కన చీపురును, చెప్పులను పెట్టుకున్నాం. దెయ్యాన్ని తలచుకుంటూ పడుకోవడం వలన భయంతో కూడిన కలత నిద్ర. ఏదో ఒక క్షణంలో నిద్రలోకి జారుకుంటుండగా, పక్కన అటు ఇటు కదిలిన మోతలను విని, క్రీగంట చూడగా, సీత లోపలి గదిలోని బాత్రూమ్కు వెళ్తుండటం కనిపించింది. ఆమె మరలా వచ్చి పడుకుంది. కళ్ళు మూసుకోవడానికి ప్రయత్నించాను. కళ్ళు పూర్తిగా మూతబడలేదు. అంతలోపు.. అదేంటి?! ఒక ఆకారం. నలుపా, తెలుపా, బూడిద రంగా.. తెలియడం లేదు. గదిలో ఒక మూల నిలబడి ఉంది. క్షణంలో సదరు ఆకారం అక్కడ్నుంచి మాయమైపోయింది. ఒకవిధమైన వేడిగాలి నన్ను రాసుకుంటూ వెళ్ళినట్లనిపించింది. ‘సీతను లేపుదామా?’అని అనుకుంటున్నంతలో... ‘ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..’ సీత పెద్దగా కేకలు పెట్టింది. ‘ఎవరో గొంతు నులుముతున్నారు.. నులుముతున్నారు.. ’ అంటూ కేకలు. అంతకుమించి మాట్లాడలేక పోతోంది. కిటికీవైపు ఏదో ఆకారం కదులుతోన్న విషయాన్ని ఇద్దరం గమనించాం. కిటికీ తలుపులు మెల్లగా కదిలాయి. గభాల్న ట్యూబ్‌లైట్ స్విచ్ వేశాను. సీత కూర్చుని ఉంది. ఒళ్ళంతా చెమటలు. తెల్లగా పాలిపోయి నట్లనిపించింది. కిటికీలోంచి ఎవరో మమ్మల్ని చూస్తున్నట్లుగా ఓ భావన. కిటికీ తలుపులు మూయడానికి భయంగా అనిపించింది. ‘వద్దు, ఈ ఇల్లు మనకొద్దు’ సీత వణుకుతూనే చెప్పింది. ఆ రాత్రంతా జాగారమే. సూర్యోదయం కోసం కాచుకుని కూర్చున్నాం. ఆ రోజే పాత ఇంటికి చేరుకున్నాం (ఆ ఇంటిని ఖాళీ చేయకపోవడం వల్ల). ఆ తరువాత నా జీవితమే మారిపోయింది. నా ముఖపుస్తకం స్నేహితుల పట్టికలో జ్యోతిష్యులు, పూజారులు, స్వామీజీల సంఖ్య పెరిగింది. కొత్త ఇంట్లో దెయ్యాలను తరిమే పూజలు వరుసగా చేయబడ్డాయి. ఒక్కో పూజా కార్యక్రమం ముగియగానే ‘దెయ్యం పారిపోయిందా?’ అనుకుంటూ, ఆరోజు రాత్రి ఆ ఇంట్లో బసచేసి పరీక్షించడం వాడుకగా మారిపోయింది. ముప్పైలక్షల రూపాయలు లోను తీసుకున్నందుకు నెలకు ముప్పైవేలు ఇన్స్టాల్మెంట్ కట్టాల్సి వస్తోంది. ఏదో ఒకటి చేయమని మనస్సు గొడవపెడుతుండటంతో నాకు శీను గుర్తుకొచ్చాడు. నేను చదువుకున్న కాలేజ్ హాస్టల్లోని ఒక గదిలో ఓ దెయ్యం ఉండేది. ఆ గదిలోకి ఎవరు వెళ్ళినా మెడపట్టుకుని బయటకు నెట్టేస్తుండేదట. నాకు ఆ అనుభవం లేదు. కానీ ఆ గదిలో పడుకున్నవారు, అర్ధరాత్రి దాటగానే గడప దగ్గరకొచ్చి పడిపోతుండేవారు. దాంతో గదివైపు వెళ్ళేందుకు ఎవ్వరూ సాహసించేవారు కాదు. అయితే ఆ గదిలో ఒకడు బస చేశాడు. అతడే శీను. మా క్లాస్మేటే. తరగతులకు హాజరయ్యేవాడు కాదు. బోల్డన్ని అరియర్స్. ఆ విషయమై ఏమాత్రం కలత చెందేవాడు కాదు. ఒకరోజు నుదుటిపై నామాలతో దర్శనమిచ్చేవాడు. ఇంకోరోజు మెడలో రుద్రాక్షమాలతో. వేరొకరోజు మెడలో శిలువతో. ఒకరోజు భుజానికి వేలాడే సంచి, ఇంకోరోజు చేతిలో చిన్న బ్రీఫ్‌కేస్. తను, ఏరోజు, ఎలా దర్శనమిస్తుంటాడనేది ఎవ్వరికీ తెలియదు. చొక్కాజేబులో ఒక అమ్మాయి ఫొటో తెలిసీతెలియనట్లుగా కనబడుతుండేది. ఎవరు అని అడిగితే, ‘నేను పెళ్ళి చేసుకోబోతోన్న అమ్మాయి, ఊర్లో ఉంది’ అని చెప్పేవాడు. ఒకరోజు.. ‘సినిమాకెళ్దాం, వస్తావా?’అని అడిగినంత ఈజీగా ‘ఈ రాత్రి శ్మశానానికి వెళ్తున్నా.. వస్తావా?’ అంటూ క్యాంటిన్లో టీ తాగుతోన్న నన్ను అడిగాడు. ‘శ్మశానమా?’ ‘ఏం భయపడనక్కర్లేదు. ఒక దారాన్ని టెస్ట్ చేయబోతున్నాను.’ ‘దారమా?!’ అని నేను అడుగుతుండగానే జేబులోనుంచి రకరకాల రంగుల్లోనున్న దారాన్ని తీశాడు. దానికి ఒక చివర ఒక చెట్టు ఆకును కట్టి, ఇంకొక చివర గోరును కట్టాడు. ‘దీనిని నేపాల్‌లో ఒక స్వామిజీ దగ్గర తీసుకున్నాను. మెడలో వేసుకుని చూస్తే, దెయ్యాలు మన కళ్ళకు కనబడుతాయట, చూద్దాం, వస్తావా?’ ‘సరే’నంటూ ఊరకనే తలాడించాను. అయితే ఆ రాత్రి తనూ రాలేదు, నేనూ తనకోసం వెదకలేదు. మరసటిరోజు అందరం క్యాంటిన్లో టీ తాగుతుండగా వచ్చాడు. రాత్రి శ్మశానంలో ఒక దెయ్యంతో మాట్లాడానని చెప్పాడు. జేబులో బూడిదను చూపించాడు. వెంటనే తన మాటలను విన్న రఘు, ‘పొయ్యిలోని బూడిదను తీసుకొచ్చి సినిమా చూపిస్తున్నావా?’ అంటూ శీనుని ఎగతాళి చేశాడు. శీనుకి కోపం పొంగుకొచ్చింది. ‘వానస చూడు, ఇది పొయ్యిలో బూడిదా?’ అంటూ ఆ బూడిదను ముక్కు దగ్గర పెట్టగానే, గాడ్ ప్రామిస్‌గా అది పొయ్యిలో బూడిద వాసన కాదు. శ్మశానంలో శవాలను కాల్చుతున్నప్పుడు వచ్చే వాసన. వెంటనే అక్కడ్నుంచి ముందుకు కదిలాం. అయితే రఘు వదల్లేదు. ‘ నువ్వు నిజంగా దెయ్యంతో మాట్లాడి ఉంటే.. మన హాస్టల్ రూములోనున్న దెయ్యంతో కూడా మాట్లాడి, దాన్ని అక్కడ్నుంచి వెళ్ళిపోమ్మని చెప్పు మరి’ అన్నాడు. హాస్టల్లోని దెయ్యం సంగతి శీనుకి అప్పటిదాకా తెలియదు. విన్నవెంటనే, రాత్రికి రాత్రే దెయ్యాన్ని తరిమేస్తానని చెప్పాడు. చెప్పినట్లుగానే ఆరోజు రాత్రి ఓ సంచితో దెయ్యం గదిలో బసచేశాడు. పొద్దున్నే నవ్వుతూ బయటకు వచ్చాడు. ‘దెయ్యాన్ని వెళ్ళిపొమ్మన్నాను. ఇకమీదట ఆ గదిలోకి రాదు. పాపం, తల దాచుకునేందుకు చోటులేక ఈ రూముకు వచ్చిందట’ అంటూ శీను చెబుతోన్న మాటలు విన్న హాస్టల్ నోరెళ్ళబెట్టింది. ఆ తరువాత స్టూడెంట్స్‌కు కొంచెం ధైర్యం కలగి ఆ గదిలో బస చేయసాగారు. అప్పటి నుంచి ‘వాడికి మంత్రవిద్యలు తెలుసు. చేతబడులు చేస్తాడు’ అంటూ శీను గురించి రకరకాల కథనాలు సర్వత్రా వ్యాపించసాగాయి. తనని చూస్తేనే చాలు, స్టూడెంట్స్ అందరూ పక్కకు తొలగిపోవడం మొదలెట్టారు. కాస్తోకూస్తో నేనే మాట్లాడేవాడిని. పరీక్షలప్పుడు నోట్స్ ఇవ్వడం, తను చెప్పే చిత్రమైన కథలను ఆస్తకిగా వినడం చేస్తుండేవాడిని. నన్నొక్కడినే తన స్నేహితుడిగా భావిస్తుండేవాడు. అలా హాస్టల్లోని దెయ్యాన్ని తరిమేసిన శీను ఇంట్లోని దెయ్యాన్ని తరిమేయలేడా?! శీనుని వెదకాలి! అతనికి సంబంధించిన ఎటువంటి కాంటాక్ట్స్ లేవు. ఫేస్బుక్లో వెదికాను. దెయ్యం శీను తప్ప ఎంతోమంది శీనులున్నారు. ఫ్రెండ్స్‌ను అడిగినా ‘తెలియదు’అనే చెప్పారు. నమ్మకాన్ని కోల్పోతోన్న సమయంలో ఓ చిన్న జ్ఞాపకం. ఈ–మెయిల్ వాడుకలోకి వచ్చిన కొత్తలో తనకొక మెయిల్‌ను పంపించాను. జి–మెయిల్ రాని హాట్‌మెయిల్ కాలమది. వెదికాను. దొరికింది. ‘డియర్ శీనూ, నేను గుర్తున్నానా? ఎలా ఉన్నావ్? ఎక్కడున్నావ్? నీ సాయం కావాలి..’ నాలుగే వాక్యాలు నా నుంచి. మరుసటిరోజే శీను నుంచి జవాబు స్పష్టమైన ఆంగ్లంలో.. ‘నిన్ను మరచిపోగలనా? సెమిస్టర్ పరీక్షలప్పుడు నువ్వు సాయం చేయకపోయుంటే పాసయ్యేవాడినే కాదు. ఏం హెల్ప్ కావాలి?’ అంటూ! నా దయనీయమైన పరిస్థితి వివరిస్తూ మరొక మెయిల్ పంపించాను. దానికీ జవాబు వచ్చింది.. ‘వచ్చే శనివారం చెన్నైకి వస్తున్నాను. కలుద్దాం. మీ దెయ్యం ఇంటి అడ్రసు పంపించు’ అంటూ. ∙∙ శీను వస్తానన్న రోజు వచ్చేసింది. కొత్త ఇల్లున్న వీధిలో ఎదురు చూడసాగాను అతని కోసం. దూరంగా ఒక ఆకారం వస్తూ కనిపించింది. శీనూ!! పెద్దగా మారలేదు. భుజానికి ఒక సంచి వేలాడుతోంది. ‘శీనూ, బాగున్నావా? ఎక్కడ ఉంటున్నావ్? అడగ్గానే వచ్చినందుకు థ్యాంక్స్’ ఉత్సాహంగా పలకరించా. ‘థ్యాంక్స్గీంక్స్ ఎందుకు రామ్! ఈ ఇల్లేనా?’ ‘అవును. కొని రెండు నెలలైంది. ఒకటే గొడవ. నువ్వే ఆ దెయ్యాన్ని తరిమేయాలి’ నవ్వుతూ ‘నో ప్రాబ్లం. ఈ రాత్రే తరిమేస్తాను. నువ్వు ఇంటికెళ్ళి పొద్దున్నేరా. నేనిక్కడే పడుకుంటాలే’ అన్నాడు. ‘నీకేమైనా హెల్ప్ కావాలంటే, నేను ఉండాలి కదా’ మనస్సులో భయంగా ఉన్నప్పటికీ అడిగాను. ‘అవసరం లేదులే’ అని శీను చెప్పగానే ఊపిరి పీల్చుకుంటూ ‘రా.. హోటల్కెళ్ళి తినొద్దాం’ అన్నాను. ‘నో థ్యాంక్స్. నేను తినే బయలుదేరాను. ఒక పూజ చేయాలి. నువ్వెళ్ళు’ అన్నాడు. ‘ఓకే. రేప్పొద్దున్నే వస్తాను’ అంటూ ఇంటికి బయలుదేరాను. మరుసటిరోజు ఉదయం నేను వచ్చేసరికే ఇంట్లో శీను లేడు. తలుపు మీద మాత్రం ఓ చీటీ అతికించి ఉంది.. ‘రామ్, నన్ను మన్నించు. నువ్వు వచ్చేంతవరకు వేచివుండలేకపోయాను. వేరే పనిమీద వెళ్తున్నాను. ఇకమీదట ఈ ఇంట్లో దెయ్యం గొడవే ఉండదు. నీ ఋణశేషాన్ని తీర్చుకున్నట్లయ్యింది. – ప్రేమతో.. శీనూ’ అంటూ. ‘అయ్యో శీను మొబైల్ నంబర్ కూడా తీసుకోలేదే’ అని నొచ్చుకున్నాను. తను వెళ్ళడం కంటే, దెయ్యం పారిపోయిందా? లేదా? అన్నదే నా అనుమానం. ఆరోజు రాత్రి బంధువులతోపాటు ఆ ఇంట్లో బస చేశాం. మల్లెపువ్వుల వాసన, వేడిగాలులు లేవు. విచిత్రమైన కదలికలూ లేవు. నెలరోజుల నుంచి ఆ ఇంట్లోనే ఉంటున్నాం. ప్రశాంతంగా గడవసాగింది ఓరోజు నా కాలేజ్మేట్ను కలిసేంతవరకు. ఐదు నిమిషాల సంభాషణ తరువాత, శీనుని కలుసుకున్న సందర్భాన్ని గురించి చెప్పాను. ‘ఏ శీనూ?!’.. ‘రేయ్, శీనూనే మరిచిపోయావా? మన హాస్టల్లో దెయ్యాన్ని తరిమిన శీనూ’ ‘వాడా?’.. ‘అవును’.. ‘ఎప్పుడు కలిశావు?’.. ‘పోయిన నెల ఇక్కడకు వచ్చాడు!’ ‘ఏందీ.. పోయిన నెలా? వాడు చచ్చిపోయి ఐదారు సంవత్సరాలవుతుందే?! ప్రేమించిన పిల్ల దొరకలేదని ఆత్మహత్య చేసుకున్నాడు!’ -రంజన్ చదవండి: కథ: చివరి ప్రయాణం.. నేను ఇంకెంతో కాలం బతకనని డాక్టర్లన్నారు! గొప్ప క్షణాలు కథ: భార్య, ఇద్దరు పిల్లలతో కేరళ టూర్.. అశ్వతితో నాకున్నది ప్రేమ కాదు! ఐతే! -
హైటెక్ దోపిడి.. కింది స్థాయి ఉద్యోగులకు ఎరవేసి..!
హైదరాబాద్, జూబ్లీ హిల్స్.. రోడ్ మీద నడుస్తున్నాడు విక్రమ్. అగర్వాల్ కంపెనీ బోర్డు చూసి ఆగాడు. లోపలికెళ్ళాడు. స్టాఫ్ ఇంకా వచ్చినట్టులేరు. గుమాస్తా ఒక్కడే ఉన్నాడు. అతని దగ్గరకెళ్ళి ‘మీ పేరు?’ అడిగాడు గుమాస్తాను. ‘రామకృష్ణ’ అని చెప్పాడు అతను. ‘మీ జీతమెంత?’ విక్రమ్. ‘ఎందుకు?’ ఎదురుప్రశ్న వేశాడు అతను. ‘చెప్పు బ్రదర్. సొల్యూషన్ చెప్తాను’ విక్రమ్. ‘పదివేలు’ అతను. ‘ఈ మహానగరంలో పదివేలు ఏ మూల?’ విక్రమ్. ‘అయితే ఏం చేయమంటావ్?’ అతను. ‘నాకో సాయం చేస్తే లక్షరూపాయలిస్తాను. స్పాట్ పేమెంట్’ చెప్పాడు విక్రమ్. ‘ఇంతకీ మీరెవరు?’ అడిగాడు రామకృష్ణ. తనను పరిచయం చేసుకున్నాడు విక్రమ్. ఆలోచనలోపడ్డాడు రామకృష్ణ. లక్షరూపాయలు చేతికొస్తే దూరంగా వెళ్ళిపోయి ఏదో వ్యాపారం చేసుకోవచ్చని ఆశపడ్డాడు. ఆ çసంబరంతో ‘ఏం చేయాలి? రిస్క్ ఉండదు కదా?’ సంశయంగా రామకృష్ణ. ‘రిస్క్ చేయకపోతే జీవితమే లేదు’ ధైర్యం చెప్పాడు విక్రమ్. ఏం చెబుతాడోననే కుతూహలంతో అతనివైపు చూశాడు రామకృష్ణ. ‘అగర్వాల్ సంతకం ఓసారి నాకు చూపించాలి’ అడిగాడు విక్రమ్. ‘ఓస్ ఇంతేనా!’ అంటూ అగర్వాల్ సంతకమున్న బిల్ ఒకటి చూపించాడు రామకృష్ణ. జేబులోంచి సెల్‌ఫోన్ తీసి అగర్వాల్ సంతకాన్ని ఫొటో తీసుకున్నాడు విక్రమ్. ‘ఫొటో ఎందుకు తీశావ్?‘ ఆశ్చర్యపోతూ అడిగాడు రామకృష్ణ. ‘లక్షరూపాయలు నీ చేతికి రావాలంటే ఇప్పుడు నువ్వు మరో పనిచేయాలి’ చెప్పాడు విక్రమ్. ‘ఏంటది?’ ఈసారి గొంతు తగ్గించాడు రామకృష్ణ. ‘అగర్వాల్ చెక్బుక్లోంచి ఖాళీ బ్యాంక్ చెక్ ఒకటిస్తే హార్డ్ క్యాష్ నీకిస్తాను’ విక్రమ్. ఆ మాట విని ఒక్కసారిగా నిర్ఘాంతపోయాడు రామకృష్ణ. ‘రిస్క్ చేస్తేనే నీకైనా నాకైనా లైన్ క్లియరయ్యేది!’ అన్నాడు విక్రమ్. కాసేపు మౌనంగా ఉండిపోయాడు రామకృష్ణ. ‘టైమ్ లేదు. కాసేపట్లో మీ ఆఫీస్ స్టాఫ్ వచ్చేస్తారు’ తొందరపెట్టాడు విక్రమ్. చివరకు చెక్ ఇవ్వడానికే నిర్ణయించుకున్నాడు రామకృష్ణ. బీరువా తెరచి చెక్బుక్లోంచి ఓ లీఫ్ తీసి బయటకొచ్చాడు రామకృష్ణ. రోడ్డుమీద నిల్చొని ఉన్న విక్రమ్‌కి చెక్ ఇచ్చి అతనిచ్చిన లక్షరూపాయలు తీసుకుని లోపలకొచ్చాడు రామకృష్ణ. ఆటోలో బయటకు వెళ్ళిపోయాడు విక్రమ్. అది జూబ్లీహిల్స్ మెయిన్ రోడ్.. జనంతో బిజీగా ఉంది. స్టేట్‌బ్యాంక్ ముందు ఆటో దిగాడు విక్రమ్. బ్యాంక్ వైపు చూశాడు. ఆటో ఫేర్ ఇచ్చి వాచ్ చూసుకున్నాడు. మధ్యాహ్నం పన్నెండు. తనకు కలిసొచ్చే టైమ్. పక్కనే ఉన్న రెస్టారెంట్‌కి వెళ్ళి ఎవరూ లేని చోట కూర్చున్నాడు విక్రమ్. బేరర్ రాగానే టీ ఆర్డరిచ్చాడు. ‘బేరర్ వచ్చేలోపు తన పని పూర్తిచేసేయాలి’ అనుకుని సెల్‌ఫోన్ ఓపెన్ చేసి రఫ్ పేపర్ మీద అగర్వాల్ సంతకం ప్రాక్టీస్ చేశాడు. తర్వాత జేబులోంచి చెక్ తీసి సంతకం చేసి.. పదిలక్షల ఫిగర్ రాశాడు చెక్ మీద. విక్రమ్ మనసు కుదుటపడింది. బేరర్ తెచ్చిన టీ తాగి బిల్ పే చేసి అక్కడ నుండి బయటకొచ్చాడు. బ్యాంక్‌లోకి వెళ్ళి క్యాష్ కౌంటర్ ముందు నిలబడ్డాడు. కౌంటర్ బిజీగా ఉంది. క్యాషియర్‌కి చెక్ ఇచ్చాడు. ‘ఇంతకు ముందు మిమ్మల్ని చూడలేదే. అగర్వాల్ ఆఫీసులో మీరు కొత్తగా చేరారా?’ అడిగాడు క్యాషియర్. ఔనంటూ తలూపాడు విక్రమ్. చెక్ అటూ ఇటూ చూశాడు క్యాషియర్. విక్రమ్ గుండెలో రైళ్ళు పరిగెత్తాయి. ‘వెనకాల సంతకం చేయండి’ అని క్యాషియర్ అనగానే గుండె మీద కుంపటి దించేసుకున్నాడు విక్రమ్. గబగబా సంతకం చేసి చెక్ క్యాషియర్ చేతికిచ్చాడు. చెక్ ఇచ్చిన నుండి తిరిగి క్యాష్ తీసుకునే వరకు విక్రమ్‌లో టెన్షన్. బీపీ పెరిగిపోయింది. కర్మకాలి అటువైపు పోలీస్ రాలేదు కదాని చుట్టూ చూశాడు. క్యాషియర్ ఇచ్చిన పదిలక్షలు తీసుకుని బ్యాగ్‌లో పెట్టుకుని అక్కడనుండి రోడ్డుమీదకి వచ్చాడు విక్రమ్. బాగా ఆకలిగా ఉంది. దగ్గర్లో ఉన్న హోటల్‌కి వెళ్ళి భోజనం చేశాడు. అక్కడే కాసేపు విశ్రాంతి తీసుకుని మళ్ళీ బ్యాంక్‌కి వచ్చాడు. అది లంచ్ అవర్. స్టాఫంతా లంచ్ కెళ్ళారు. అటూ ఇటూ చూసి క్యాష్ కౌంటర్ దగ్గరకెళ్ళాడు విక్రమ్. లోపలంతా చూశాడు. ఎవరూ లేరు. క్యాషియర్ టేబుల్ మీదున్న క్లియరెన్స్ చెక్కులను పరిశీలించాడు. అందులోంచి తను ప్రెజెంట్ చేసిన చెక్ నెమ్మదిగా తీసి జేబులో పెట్టుకున్నాడు. తనని ఎవరైనా గమనిస్తున్నారేమోనని చుట్టూ చూశాడు. ఎవరూ లేరు. బతుకు జీవుడా అనుకుంటూ అక్కడ నుండి మెయిన్ గేట్ దగ్గరకు వచ్చాడు. ‘ఇది లంచ్ అవర్ సార్. రెండు గంటలకు రండి’ వాచ్‌మన్ చెప్పాడు. ‘మళ్ళీ వస్తాను’ అంటూ బయటకొచ్చి ఆటోలో సికింద్రాబాద్ రెల్వేస్టేషన్ చేరుకున్నాడు విక్రమ్. ప్లాట్‌ఫామ్ రద్దీగా ఉంది. టికెట్ కౌంటర్కెళ్ళి విజయవాడకి టికెట్ తీసుకున్నాడు. ప్లాట్‌ఫామ్ మీద సిద్ధంగా ఉన్న రైలెక్కి కూర్చున్నాడు. టీసీ రాగానే బెర్త్ రిజర్వ్ చేసుకుని ‘హమ్మయ్య! ప్లాన్ సక్సస్’ అనుకున్నాడు. విజయవాడలో రైలు దిగి బయటకొచ్చాడు విక్రమ్. స్టేషన్‌కి వచ్చిన భార్య కారులో ఇంటికి బయలుదేరాడు. ఇంటికి చేరాక ‘హమ్మయ్యా’ అంటూ ఊపిరిపీల్చుకుని ‘మీరు వచ్చేదాక నాకు ఒకటే టెన్షన్’ అంది అతని భార్య రమ్య. ‘ఇలాంటి పనుల్లో రిస్క్ తప్పదు. అలాగని అన్ని రోజులూ మనవి కావు. ఎక్కడో ఒకచోట దీనికి గుడ్ బై చెప్పాలి’ అన్నాడు విక్రమ్. ‘ఈ డబ్బుతో ఎక్కడో ఒకచోట భూమి కొనేయండి. భవిష్యత్తులో అదే మనకు భరోసా’ చెప్పింది రమ్య. విజయవాడ ఇంజనీరింగ్ కాలేజీలో బిటెక్ చదివాడు విక్రమ్. సినీమాలు షికార్లతోనే కాలేజీ జీవితం గడిచిపోయింది. ఇంజనీరింగ్ మాత్రం పూర్తవలేదు. పెళ్ళయ్యింది. ఉద్యోగం లేదు. బతకాలి. ఏదో ఒక పనిచేయాలి. అప్పుడు ఈ రూట్ ఎంచుకున్నాడు. ‘క్లియరెన్స్ చెక్కుల్లో పదిలక్షల చెక్కు కనిపించట్లేదు సార్’ క్యాషియర్‌తో అన్నాడు అటెండర్. ‘సరిగ్గా చూడు అక్కడే ఉంటుంది’ క్యాషియర్. ‘చూశాను సార్. ఎక్కడా లేదు’ అటెండర్ మాటలకు ఖంగుతిన్నాడు క్యాషియర్. సొరుగులో ఉన్న పేపర్లన్నీ వెతికాడు. చెక్ కనిపించ లేదు. అప్పుడే విషయాన్ని మేనేజర్‌కు చేరవేశారెవరో. ‘సార్ మిమ్మల్ని మేనేజర్‌గారు రమ్మంటున్నారు’ అటెండర్ చెప్పగానే మేనేజర్ గదిలోకి వెళ్ళాడు క్యాషియర్. ‘ఆ క్లియరెన్స్ చెక్ దొరికిందా?’ మేనేజర్. ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయాడు క్యాషియర్. ‘క్యాష్తో ఆటలాడకు. నీ నిర్లక్ష్యం విలువ పది లక్షలు. నా సర్వీస్‌లో ఇలా చెక్ మిస్సవడం ఇదే మొదటిసారి. ఏదైనా సమస్య ఉంటే సెలవు పెట్టి ఇంట్లో కూర్చోండి. బ్యాంకుకొచ్చి మాకు తలనొప్పి తేకండి. మరోసారి ఇలాంటి తప్పు జరిగితే శాశ్వతంగా ఇంటికెళ్తారు’ అంటూ వార్నింగిచ్చి ఎవరికో ఫోన్ చేశాడు మేనేజర్. తల దించుకుని మేనేజర్ గది నుండి బయటకొచ్చాడు క్యాషియర్. ‘ఇందులో బ్లాంక్ చెక్ ఒకటి మిస్సయింది’ అగర్వాల్ కంపెనీ మేనేజర్ ఎకౌంటెంట్‌ను అడిగాడు. ‘నాకేం తెలియదు సార్’ చెప్పాడు. ‘గుమాస్తా ఎక్కడ?’ అడిగాడు మేనేజర్. ‘నిన్నటి నుండి ఆఫీస్‌కి రావట్లేదు సార్. సెలవు కూడా పెట్టలేదు’ చెప్పాడు ఎకౌంటెంట్. ‘ఇది వాడి పనే అయ్యుంటుంది’ అనుకుని రామకృష్ణకు ఫోన్ చేశాడు మేనేజర్. ‘ఈ నెంబర్ ప్రస్తుతం పని చేయట్లేదు’ అని వాయిస్ వచ్చింది. చెక్ పేమెంట్ ఆపేయమని బ్యాంక్‌కి ఫోన్ చేశాడు మేనేజర్. చెక్ పేమెంట్ అప్పటికే జరిగిపోయిందని బ్యాంక్ స్టాఫ్ చెప్పగానే నీరుగారిపోయాడు మేనేజర్. ‘ఏం సార్ మళ్ళీ రమ్మన్నారట?’ మేనేజర్‌తో అన్నాడు క్యాషియర్. ‘ఆ పది లక్షల చెక్ మీద సంతకం ఫోర్జరీ అట. సంతకం వెరిఫై చేశారా?’ అడిగాడు మేనేజర్. ‘వెరిఫై చేశాను సార్. సంతకం సరిపోయింది’ క్యాషియర్. ‘కొంప మునిగింది. నువ్వు కొత్త తలనొప్పి తెచ్చావు’ అంటూ తలపట్టుకున్నాడు బ్యాంక్ మేనేజర్. పదిలక్షలు పెట్టి ఇచ్చాపురంలో రెండెకరాల ల్యాండ్ కొన్నాడు విక్రమ్ భార్య పేరు మీద. ఆస్తులయితే సంపాదించాడు గాని ఆత్మస్థయిర్యాన్ని కోల్పోతున్నాడు రోజురోజుకీ. ఆ భయంతోనే భార్యకు చెప్పాడు ‘ఇక ఇలాంటి పనులు చేయదల్చుకోలేదు. ఇప్పటికే చాలా చోట్ల వ్యక్తుల్ని, బ్యాంకుల్ని మోసంచేసి ఆ డబ్బుతో నీ పేర ఎకరాల కొద్దీ భూములు కొన్నా. అవి చాలు’ స్పష్టం చేశాడు విక్రమ్. ‘వైజాగ్ చుట్టుపక్కల భూముల రేట్లు బాగా పెరుగుతున్నాయి. అక్కడ కూడా కొంత భూమి కొనేస్తే భవిష్యత్తులో అక్కడే స్థిరపడొచ్చు. ఈ ఒక్కసారి చూడండీ.. ఇదే మీ లాస్ట్ డీల్. ఇంక జీవితంలో ఇలాంటి పనులు చేయించను’ బతిమాలింది రమ్య. భార్య ముందు ఓడిపోయాడు విక్రమ్. చివరి ప్రయత్నంగా కాకినాడలోని వెంకట్ మోటార్స్‌ను ఎంచుకున్నాడు వెంటాడుతున్న భయంతోనే. వెంకట్ మోటార్స్ ఆఫీస్‌లోకి అడుగుపెట్టాడు విక్రమ్. ఎవర్ని ఎలా డీల్ చేయాలో విక్రమ్‌కి కొట్టిన పిండి. అందులో పనిచేసే కార్మికులకు తక్కువ జీతాలు ఇస్తారనే అపవాదు ఆ సంస్థ యాజమాన్యానికి ఉంది. ఆ బలహీనతే విక్రమ్‌కి కలిసొచ్చింది. ఆఫీస్‌లో స్టాఫ్ లేని టైమ్‌లోనే విక్రమ్ ఇలాంటి దందాలు నడుపుతాడు. ఓ ఏభై ఏళ్ళ వ్యక్తి అక్కడ గుమాస్తాగా పనిచేస్తున్నాడు. అతని గురించి ముందుగానే అన్నీ తెలుసుకున్నాడు. అతని దగ్గరకు వెళ్ళి తనెవరో ఎందుకొచ్చాడో చెప్పాడు. విక్రమ్ చెప్పిన పని చేయడానికి ముందు అతను నిరాకరించాడు. ‘నీ జీతంతో ఈ జన్మలో నీకూతురి పెళ్ళి చేయలేవు. నేను చెప్పినట్టు చేస్తే రెండు లక్షలిస్తాను. దాంతో నీ కూతురి పెళ్ళి చెయ్యొచ్చు’ ఆశ చూపాడు విక్రమ్. ‘నాకు కూతురుందని నీకెలా తెలుసు?’ ఆశ్చర్యపోయాడు అతను. ‘నీ గురించే కాదు. మీ బాస్ గురించి కూడా తెలుసు. ఈ అవకాశం వదులుకోకు. మీ ఎండీ గారి బ్లాంక్ చెక్ ఒకటి ఇస్తే నీ దరిద్రం మొత్తం తీరిపోతుంది. చెక్ మిస్ అయిందని అనుకుంటారు. నీకేమీ కాదు’ ధైర్యం చెప్పాడు విక్రమ్. మనసు మార్చుకున్నాడు గుమాస్తా. చెక్‌బుక్‌లోని లీఫ్ ఒకటి తీసి విక్రమ్కిచ్చాడు. ‘మీ ఎమ్డీ సంతకం ఓసారి చూపించు’ అని అడగ్గానే సంతకాలు చేసున్న ఫైల్ విక్రమ్ చేతికిచ్చాడు. ఆ సంతకం ఉన్న పేపర్ని మొబైల్లో ఫొటో తీసుకున్నాడు విక్రమ్. ‘డబ్బిస్తాను, ఓసారి బయటకు రండి’ చెప్పాడు విక్రమ్. గుమాస్తా బయటకు రాగానే ఎవరూ చూడకుండా రెండు లక్షల కవరు అతని చేతికిచ్చాడు. ఇంటికి వెళ్ళి డబ్బు ఇంట్లో పెట్టి మళ్ళీ ఆఫీస్‌కి వచ్చేశాడు గుమాస్తా. మున్సిపల్ ఆఫీస్ పక్కనున్న పార్క్‌లోకి వెళ్ళాడు విక్రమ్. ఆ టైమ్‌లో పార్కులో జనం ఉండరు. వెళ్ళి ఖాళీ బెంచీ మీద కూర్చున్నాడు. ఫొటో తీసిన సంతకాన్ని ప్రాక్టీస్ చేసి ఖాళీ చెక్ మీద సంతకం పెట్టి అమౌంట్ వేశాడు. అప్పుడు సమయం పన్నెండు దాటింది. పక్క రోడ్లో ఉన్న ఆంధ్రాబ్యాంక్ ముందు ఆగాడు విక్రమ్. కస్టమర్స్‌తో బ్యాంక్ రద్దీగా ఉంది. లోపలకు వెళ్లాడు. క్యాష్ కౌంటర్ బిజీగా ఉంది. లైన్లో నుంచున్నాడు. తన వంతు రాగానే చెక్ క్యాషియర్ చేతిలో పెట్టాడు. కంప్యూటర్లో బ్యాలెన్స్ చెక్ చేసి సంతకం టాలీ చేశాడు. అన్నీ సరిపోయాయి. క్యాషియర్ అప్పటికే బాగా అలసిపోయాడు. చెక్ ఎవరు తెచ్చారన్న సంగతి మర్చిపోయి పది లక్షలు విక్రమ్ చేతిలో పెట్టాడు. ఆ డబ్బుతో వెనక్కి తిరిగి చూడకుండా బయటపడ్డాడు విక్రమ్. ఆటోలో సుబ్బయ్య హోటల్‌కి వెళ్ళి భోంచేశాడు. అదే ఆటోలో తిరిగి ఆంధ్రాబ్యాంక్‌కి వచ్చాడు. లంచ్ అవర్. బ్యాంక్‌లో జనం పలచబడ్డారు. క్యాష్ కౌంటర్ దగ్గరకెళ్ళాడు విక్రమ్. లోపలికి చూశాడు. ఎవరూ లేరు. మేనేజర్ గది వైపు చూశాడు. అక్కడా లేరు. గేటు వైపు చూశాడు. సెక్యూరిటీ గార్డు బయట ఎవరితోనో మాట్లాడుతున్నాడు. ముందుకు వంగి టేబుల్ మీదున్న క్లియరెన్స్ చెక్కులు ఒకొక్కటీ చూస్తున్నాడు. తనిచ్చిన చెక్ అక్కడే ఉంది. ఎప్పుడూ లేనిది విక్రమ్ చేతులు అవాళ వణికాయి. చెక్కును బయటకు తీసేలోపు అక్కడున్న పేపర్ వెయిట్ కిందపడింది. చెక్ చేతిలోకి తీసుకుని బ్యాగులో పెట్టడం దూరంగా ఉన్న బ్యాంక్ స్టాఫ్ ఒకతను చూశాడు. ఎమర్జెన్సీ అలారం నొక్కాడు. ఆ శబ్దంతో బ్యాంక్ మారుమోగిపోయింది. గేటువైపు పరిగెత్తాడు విక్రమ్. సెక్యూరిటీ గార్డు ఎలర్టయ్యాడు. షట్టర్ కిందికి దించేలోపు ఒక్క ఊపుతో షట్టర్ కింద నుంచి దూకి రోడ్డు మీదకు పారిపోయాడు విక్రమ్. సెక్యూరిటీ గార్డు విక్రమ్ వెంటపడ్డాడు. పోలీస్ కంట్రోల్ రూమ్‌కి ఫోన్ చేశాడు మేనేజర్. విక్రమ్ శక్తికొద్ది పరిగెత్తుతున్నాడు. వెనక పోలీసులు. విక్రమ్ సందులోకి దూరాడు. ఇక పరిగెత్తే ఓపిక లేదు. అలిసిపోయాడు. పోలీసులు దగ్గరగా వచ్చేశారు. విక్రమ్ పోలీసులకి దొరికిపోయాడు. హైటెక్ దోపిడీ అంటూ మరునాడు అన్ని పేపర్లలో, టీవీల్లో పతాకశీర్షికన విక్రమ్ ఫొటోతో పాటు వార్తలు వచ్చాయి. ఆ వార్తలు చూసి రమ్య విజయవాడ నుండి ఎవరికీ తెలియని మరోచోటుకి రహస్యంగా మకాం మార్చేసింది. విక్రమ్‌ను రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు పోలీసులు. -
క్రైమ్ స్టోరీ: రెండు పిట్టలు.. ఒకే దెబ్బ!
18 నవంబర్ 1996. ఆ రోజు దినపత్రిక చదువుతున్న సీఐ ష్రఘ్వీ తన స్టేషన్ పరిధిలో ఉన్న సహన ఫార్మాస్యూటికల్ కంపెనీ డైరెక్టర్ సరితాదేవిని ఎవరో హత్య చేశారని ఫోన్ రావడంతో తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నాడు. హత్య జరిగిన గదిలోకి వెళ్లి, అన్నీ పరిశీలించి, పోస్ట్‌మార్టమ్, ఫింగర్ ప్రింట్స్ ఏర్పాట్లు చూడమని, అక్కడ ఉన్న అన్ని వస్తువులూ, ఫైల్స్ కూడా స్టేషన్‌కి పంపమని అక్కడ నుండి బయటకు వచ్చాడు సీఐ. బయట ఉన్న మేనేజర్ని కలుసుకుని, కొన్ని విషయాలు సేకరించి, ఇంకో డైరెక్టర్ నరేష్ రూమ్ వద్దకు వెళ్లాడు సీఐ.. రాత్రి పడిన వర్షానికి చిత్తడిగా ఉన్న నేల మీద నెమ్మదిగా నడుస్తూ. ‘ఈ కంపెనీ, చనిపోయిన ఈవిడదేనా? ఈ క్వార్టర్లో ఈవిడతో పాటు ఎవరు ఉంటారు? కొంచెం వివరంగా చెప్పండి’ నరేష్‌ని అడిగాడు సీఐ ష్రఘ్వీ, ‘సార్, ఐదేళ్ల క్రితం సరితాదేవి, హరనాథ్, నరేష్ అనే నా పేరునూ కలిపి, మా పేర్లలో మొదటి అక్షరాలు కలిసి వచ్చేలా కంపెనీకి సహన అని పేరు పెట్టి ప్రారంభించాం. సరిత ఒక్కరే ఈ క్వార్టర్లో ఉంటారు. హరనాథ్ చెన్నైలో ఉంటాడు. నేను ఇక్కడే సిటీలో ఉంటాను’ చెప్పాడు నరేష్. ‘మిస్టర్ నరేష్, గదిలో ఎటువంటి వస్తువులు చోరీకి గురి కాకపోవడం చూస్తూంటే, నిందితుడు కేవలం ఆమెను చంపడానికే వచ్చినట్టుంది. సూటిగా అడుగుతున్నా.. సరితాదేవికి కుటుంబ సభ్యులనుంచి కానీ, బిజినెస్ పరంగా కానీ ఎవరైనా శత్రువులున్నారా?’ ‘ఆమెకు కుటుంబ సభ్యులు ఎవరూ లేరు. తల్లి కూడా ఈ మధ్యనే మరణించింది. ఇక బిజినెస్ పరంగా అంటే, మా పార్ట్నర్ హరనాథ్ తనను తరచూ ఫోన్లో బెదిరిస్తున్నాడు అని చెబుతూండేది. ఇంకో విషయం, అతను కాలేజీ రోజుల నుంచి కూడా ఆమెను ప్రేమించేవాడు. అమె అతడిని దూరంగా ఉంచింది. అందుకే అతను ఇక్కడ ఇమడలేక చెన్నైలో ఉంటున్నాడు. అంతే కాదు, మొన్న జనవరిలో అయితే ఏకంగా ఓ బెదిరింపు లెటర్ వచ్చిందని కూడా చెప్పింది’ చెప్పాడు నరేష్. ‘ఆమె హత్య వలన హరనాథ్‌కి ఏమిటి ప్రయోజనం?’ ‘ఏముంది సార్, మా బిజినెస్ బావుంది. దాని మీద ఇతని కన్ను పడింది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు. ఆమెను హత్య చేసి, ఆ నేరం ఇదే ఊర్లో ఉంటున్న నా మీదకు తోసేసి, మా ఇద్దరినీ అడ్డు తొలగించి, కంపెనీ తన అధీనంలోకి తీసుకోవచ్చుగా?’ ‘అయితే, ఆయనే హత్య చేశాడంటారా?’ అడిగాడు సీఐ. ‘లేదు, చేయించి ఉంటాడు. ఎందుకంటే నిన్ననే అతను చెన్నై నుంచి వచ్చి, లాడ్జిలో ఉన్నాడు. రాత్రి నాకు ఫోన్ చేసి, ‘నేను వేరే బిజినెస్ పనిమీద ఇక్కడకు వచ్చేను. నీకు తెలుసుగా, సరితకు చెన్నై సాంబార్ అంటే ఇష్టమని. ఓ సాంబార్ పౌడర్ ప్యాకెట్ తెచ్చాను. అది ఆమెకు అందచేయాలి. మీ మనిషిని పంపిస్తావా?’ అని అడిగాడు. దానికి నేను, ‘ఎవరూ లేరు. అయినా వర్షం వస్తోంది కుదరదు’ అని చెప్పాను. అయినా కానీ రాత్రి ఎవరో మనిషిని ఇచ్చి పంపేడుట. నాకు తెలిసి, ఆ వచ్చిన మనిషి కిరాయి హంతకుడు అయి ఉండవచ్చు’ చెప్పి కంటి నీరు తుడుచుకున్నాడు నరేష్. నరేష్ రూమ్‌లోంచి బయటకు వచ్చిన ష్రఘ్వీ, సెక్యూరిటీ ఆఫీస్ వద్దకు వచ్చి, ‘రాత్రి మేడమ్ గారిని కలుసుకోవడానికి ఎవరు వచ్చారో చెప్పగలవా?’ రాత్రి డ్యూటీ చేసిన సెక్యూరిటీ గార్డుని అడిగాడు. అతను చెప్పిన వివరాలు అన్నీ సేకరించి, చివర్లో ‘అతడిని గుర్తు పట్టగలవా?’ అడిగాడు సీఐ. ‘చలి మూలంగా మొహం అంతా మఫ్లర్ చుట్టుకున్నాడు, గుర్తు పట్టలేను సార్. అయితే నేను ఇక్కడ చేరి పదిరోజులే అయ్యింది సార్’ చెప్పాడు గార్డు. ఆ రోజు సాయంత్రం అంతవరకూ లభించిన ఆధారాలతో, లాడ్జిలో ఉన్న హరనాథ్‌ను అదుపులోకి తీసుకుని, స్టేషన్లో విచారణ మొదలెట్టాడు ష్రఘ్వీ. ‘సీ.. మిస్టర్ హరనాథ్! ఏ విధంగా చూసినా సరితాదేవి హత్యలో మీ ప్రమేయం కనబడుతోంది. ఆఫీసులో ఫోన్ బిల్లులు వెరిఫై చేసిన తర్వాత తెలిసింది ఏమిటంటే, ఆవిడ మిమ్మల్ని తిరస్కరించిందన్న కోపంతో, ఆమెను కంపెనీ షేర్లు అమ్ముకుని బయటకు పొమ్మని బెదిరిస్తూ తరచుగా ఫోన్ చేస్తున్నారని’ చెప్పాడు సీఐ. ‘సార్, అంతా అబద్ధం. ఆమెను ప్రేమించి, ఆమెచే తిరస్కరించబడ్డది నేను కాదు, నరేష్! అతను లైంగికంగా వేధిస్తున్నాడని తరచుగా ఫోన్లో నాతో చెప్పుకుని బాధపడేది. నేను ధైర్యం చెప్పేవాడిని. అందుకే మా ఫోన్ బిల్లుల మీద మీకు అనుమానం వచ్చి ఉంటుంది’ చెప్పాడు హరనాథ్. ‘ఇదే విషయం నీ గురించి నరేష్ కూడా చెప్పాడు కానీ, మరి నిన్న రాత్రి ఆమెను హత్య చేసిన ఆ కిరాయి హంతకుడిని ఎందుకు పంపినట్లు?’ అడిగాడు సీఐ. ‘సార్, సరితాదేవిని హత్య చేయమని నేను ఏ మనిషినీ పంపలేదు. నరేష్ తన డ్రైవర్ని పంపడం కుదరదని చెప్పడంతో నేను హోటల్లో ఉన్న ఓ కుర్రాడికి ఓ ప్యాకెట్ ఇచ్చి పంపించాను. కానీ మార్గమధ్యంలో ఎవడో బైకుతో ఆ కుర్రాడిని ఢీకొట్టి, ఆ ప్యాకెట్‌తో ఉడాయించాట్ట. నాకు ఆ విషయం ఈ ఉదయమే తెలిసింది. ప్రస్తుతం ఆ కుర్రాడు హాస్పిటల్లో ఉన్నాడు. కావాలంటే మీరు వెరిఫై చేసుకోవచ్చు’ అసలు విషయం చెప్పాడు హరనాథ్. ‘సరే, అది అలా ఉంచు. మరి నువ్వు సరితాదేవిని బెదిరిస్తూ రాసిన ఈ లెటర్ మాట ఏమిటి?’ అడిగాడు ష్రఘ్వీ, ఆ లెటర్ హరనాథ్ చేతికిచ్చి. తన ఇంటి అడ్రసుతో ఉన్న లెటర్ హెడ్ మీద తెలుగులో ఉన్న ఆ లెటర్ చదవడం మొదలెట్టాడు హరనాథ్. చెన్నై ,30.12.1995. డియర్ సరితా, నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. నీకు మొన్న ఫోన్లో చెప్పిన విధంగా, కనీసం ఈ కొత్త సంవత్సరంలోనైనా, కంపెనీలో నీ వాటాలు విక్రయించి డైరెక్టర్ పోస్ట్‌కు రాజీనామా చేసి వెడతావని ఆశిస్తున్నా. తరువాత బాధపడి ప్రయోజనం లేదు. ఇట్లు (ఏ.హరనాథ్) ‘సరే, లెటర్ చదివేవు కదా! ఇప్పుడు చెప్పు, ఇది నువ్వు పంపినదేనా?’ అడిగాడు సీఐ ష్రఘ్వీ. ‘ఈ లెటర్ హెడ్ నాదే కానీ, సంతకం నాది కాదు. ఎవరో ఫోర్జరీ చేసినట్లు ఉంది. ఈ లెటరూ నేను పంపలేదు’ ఆశ్చర్యంగా చెప్పాడు హరనాథ్. ‘నిజానిజాలు త్వరలో తెలుస్తాయి కానీ, అంతవరకూ మా అధీనంలో ఉండాలి. ఔనూ ఇంతకీ నిన్న సరితాదేవికి పంపిన ఆ ప్యాకెట్ ఏమిటి? అందులో ఉన్నది సాంబార్ పౌడరేనా లేక..’ అడిగాడు సీఐ. ‘ఒహ్.. అదా సార్? ఆ ప్యాకెట్లో..’ అంటూ మొత్తం విషయం వివరించాడు హరనాథ్. ‘ఓ ఐసీ. ఆ ప్యాకెట్ ఇంకా మా దగ్గరే ఉంది. ఇంకా ఓపెన్ చేయలేదు’ అంటూ స్టేషన్ నుంచి బయటకు నడిచాడు సీఐ ష్రఘ్వీ. ∙∙l మర్నాడు ఉదయం, పక్కా ఆధారాలు, సాక్ష్యాలు లభించడంతో నరేష్ ఇంటికి వెళ్లి, అతడిని అరెస్టు చేశాడు ష్రఘ్వీ. ‘దారుణం, నాకేమీ తెలియదు. కావాలనే ఆ హరనాథ్ నన్ను ఇందులో ఇరికిస్తున్నాడు’ భోరుమని విలపించసాగేడు నరేష్. ‘నీ దొంగ ఏడుపు ఆపు మిస్టర్ నరేష్. అసలు జరిగింది ఏమిటో నేను చెబుతాను విను. హరనాథ్ తన సొంత పనిమీద హైదరాబాద్ వస్తున్నాడన్న విషయం నీకు మూడు రోజుల ముందే తెలిసింది. వెంటనే సరితాదేవిని హత్య చేసి ఆ నేరం హరనాథ్ మీదకు మళ్లేలా పథకానికి రూపకల్పన చేశావు. అందులో భాగంగా నీ దగ్గర ఉన్న హరనాథ్ కొత్త లెటర్ హెడ్ మీద పాత తేదీతో, మొన్ననే ఓ లెటర్ సృష్టించావు.’ ‘అంతా అబద్ధం’ గట్టిగా అరిచాడు నరేష్. ‘కంగారు పడకు. నాకు అనుమానం వచ్చి, నేను అదే లెటర్‌ను మళ్లీ మీ టైపిస్ట్ చేత ఈరోజు టైప్ చేయించా. మీ ఆఫీసు టైప్ మిషన్‌లో ‘ర’, ‘ ?’ అనే అక్షరాలకు దుమ్ము పట్టేయడం వలన మూడు రోజుల క్రితం నువ్వు సృష్టి్టంచిన లెటర్ మీద, అలాగే ఈరోజు లెటర్ మీద కూడా ఒకలాగే వచ్చాయి. మీ టైపిస్ట్‌ను గట్టిగా అడిగేసరికి అతను మీరే ఈ పని చేయించారని ఒప్పేసుకున్నాడు. అతను ప్రస్తుతం మా అధీనంలో ఉన్నాడు.’ ‘బ్రహ్మాండంగా అల్లారు క«థని. ఇంకెందుకు ఆలస్యం. ఆ కిరాయి హంతకుడిని కూడా నేనే పురమాయించేను అని చెప్పండి’ అన్నాడు ఉడికిపోతూ. ‘ఔను. అదీ నిజమే. ఎప్పుడైతే హరనాథ్ మీ మనిషి కోసం ఫోన్ చేశాడో, నువ్వు అనుకోని అదృష్టం కలసివచ్చిందని భావించి, మీ కంపెనీకి తరచూ అద్దెకు టాక్సీని నడిపే కిరాయిహంతకుడు అప్పారావుని ఈ పనికి పురమాయించేవు. మాకు లభ్యమైన ఆధారాలతో అతడిని కస్టడీలోకి తీసుకున్నాం. మా పద్ధతిలో విచారించేసరికి, అతడు జరిగింది అంతా చెప్పి లొంగిపోయాడు’ చెప్పాడు ష్రఘ్వీ. అంతా విన్న నరేష్ చేసేదేమీ లేక మౌనంగా తల వంచుకున్నాడు.‘సీ, మిస్టర్ నరేష్! నేరస్థుడు ఎప్పటికైనా దొరక్కపోడు. కానీ, ఆ ఫోర్జరీ లెటర్, అలాగే కిరాయి హంతకుడు విషయంలో నువ్వు చేసిన పొరబాట్లే నిన్ను పట్టించేశాయి.’ ‘ఔనా! ఏమిటి సార్ ఆ పొరబాట్లు?’ అమాయకంగా అడిగాడు నరేష్. ‘అవీ..’ అంటూ మొత్తం అంతా చెప్పాడు ష్రఘ్వీ. చేసేదేమీ లేక పోలీస్ జీపు ఎక్కాడు నరేష్. ‘మిస్టర్ నరేష్, నిన్ను చూస్తే జాలేస్తోంది. హత్య జరిగిన ఆ ఒక్క రోజూ నువ్వు కొంచెం ఓపిక పట్టి, కొంచెం తెలివి ఉపయోగించుంటే, నువ్వు ‘ఒక్క దెబ్బ’ వేయనక్కర లేకుండానే ఆ ‘రెండు పిట్టలు’ ఎగిరి పోయేవి’ స్టేషన్‌లోపలికి వస్తూ చెప్పాడు సీఐ ష్రఘ్వీ. ‘ఏంటి సార్ మీరనేది?’ కుతూహలంగా అడిగాడు నరేష్. ‘ఔను. సరితాదేవి హత్య జరిగిన రోజు సాయంత్రం, హరనాథ్ ఆమెకు ఫోన్ చేసి, కంపెనీ డైరెక్టర్‌గా తను రిజైన్ చేస్తున్నాననీ, షేర్లు కూడా అమ్మేస్తున్నానీ వాటికి సంబందించిన కాగితాలు ఒక ప్యాకెట్లో పెట్టి, ఓ కుర్రాడితో పంపిస్తున్నానీ, వీలైతే ఆమెను కూడా రిజైన్ చేసి బయటకు వచ్చేయమనీ చెప్పడంతో ఆమె కూడా అంగీకరించిందట. ఇవిగో ఆ సాంబారు పౌడర్ ప్యాకెట్‌తో పాటు ఉన్న రాజినామా కాగితాలు’ అంటూ చూపించాడు. ∙∙l మర్నాడు ట్రైనీ ఎస్సైలతో సమావేశం అయిన సీఐ ష్రఘ్వీ, ఈ కేసు గురించి చెప్పి ‘ఓకే, ఫ్రెండ్స్ అంతా విన్నారుగా! ఇప్పుడు చెప్పండి. నేను ఈ కేసును సునాయాసంగా సాల్వ్ చేయగలిగేలా, నరేష్ చేసిన ఆ రెండు తప్పులు ఏమిటి?’ అడిగాడు. ‘పాత తేదీతో లెటర్ క్రియేట్ చేయడం’ చెప్పాడు ఓ యస్సై. ‘ఆ కిరాయి హంతకుడి వేలిముద్రలు’ చెప్పాడు వేరొకతను. ‘మీరు చెప్పింది కొంచెం వాస్తవమే కానీ, అసలు విషయమేమిటంటే ఆ ఫోర్జరీ లెటర్ తయారు చేసింది 30.12.1995 తేదీతో. అప్పటికి మద్రాసు అనే పేరే వాడుకలో ఉంది. చెన్నై పేరు అమల్లోకి వచ్చింది 17.07.1996 నుంచి. అంటే, ఇతను మర్చిపోయి, రెండు నెలలు క్రితం హరనాథ్ కోసం వేయించిన కొత్త లెటర్ హెడ్ మీద పాత తేదీతో ఆ మేటర్ టైప్ చేయించాడు’ చెప్పాడు సీఐ ష్రఘ్వీ. ‘సార్, అతను చేసిన రెండో తప్పు?’ అడిగాడు ఇంకో ఔత్సాహికుడు. ‘మీరన్నట్టు హంతకుడి వేలిముద్రలు ఎక్కడా లేవు. కిరాయి హంతకుడు కాబట్టి, ముందుగానే జాగ్రత్త పడ్డాడు. కానీ, ఆ రోజు రాత్రి, వర్షంలో తడిసిన రైన్ కోటు, రైన్ షూస్ గేట్ వద్దే విప్పి వెళ్లమని సెక్యూరిటీ గార్డు చెప్పడంతో, బూట్లు లేకుండా మట్టి కాళ్లతో మేడమ్ రూమ్‌లోకి వెళ్లడం వలన అక్కడ అతని పాద ముద్రలు దొరికాయి. ఆ పాదముద్రలను చూపించి, కంపెనీలో వారిని ఎంక్వయిరీ చేస్తే కొంతమంది గుర్తుపట్టి చెప్పారు అతను తరచూ వచ్చే టాక్సీ డ్రైవర్ అప్పారావని’ చెప్పాడు సీఐ. ‘వాళ్లు, పాదముద్రలు బట్టి ఎలా గుర్తు పట్టేరు సార్?’ ఆశ్చర్యంగా అడిగాడు ఓ ఎస్సై. ‘ఆ కిరాయిహంతక డ్రైవర్ రెండు పాదాలకీ నాలుగో వేలు భూమికి ఆనకుండా కొంచెం పైకి లేచి ఉంటుంది’ అసలు విషయం చెప్పాడు ష్రఘ్వీ . -
యోగర్ట్ షాప్ హత్యలు.. ఇప్పటికీ మిస్టరీ గానే..!
అమెరికన్స్‌ను వణికించిన అపరిష్కృత మిస్టరీల్లో ఈ కథొకటి. అది 1991 డిసెంబర్ 6. రాత్రి 11 దాటింది. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్ర రాజధాని ఆస్టిన్‌లో ‘ఐ కాంట్ బిలీవ్ ఇట్స్ యోగర్ట్’ అనే క్లోజ్ చేసి ఉన్న షాపులోంచి మంటలు రావడం పెట్రోలింగ్ పోలీసుల కంటపడింది. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో, కొద్దిసేపటికే ఫైర్ ఇంజన్ల మోతమోగింది. మంటలార్పేటప్పుడు కనిపించిన భయంకరమైన దృశ్యాలు సంచలనానికి తెరతీశాయి. షాపు వెనుక గది మధ్యలో ఒక అమ్మాయి నగ్నంగా శవమై ఉంది. తన చేతులు వెనక్కి కట్టేసి ఉన్నాయి. ఆమె బట్టలతోనే ఆమెని ఎవరో బంధించారు. షాపులో చెలరేగిన మంటలకు సగానికి పైగా శరీరం కాలిపోయింది. వెనుక గదికి వెళ్లి చూస్తే, మరో ముగ్గురు అమ్మాయిలు అదే రీతిలో నగ్నంగా ఓ మూలన పడి ఉన్నారు. తెల్లారేసరికి చనిపోయిన వారి వివరాలను తేల్చేశారు పోలీసులు. మరునాడు దేశమంతా ఇదే వార్త. చనిపోయిన నలుగురిలో జెన్నిఫర్ హార్బిసన్(17), ఎలీజా థామస్(17) ఇద్దరూ ప్రాణస్నేహితులు. అదే షాపులో పార్ట్‌టైమ్ ఉద్యోగులు. ఆ రాత్రి నైట్ షిప్ట్‌లో ఉన్నారు. మిగిలిన ఇద్దరిలో సారా హార్బిసన్(15) జెన్నిఫర్ సొంత చెల్లెలు. మరో అమ్మాయి అమీ అయర్స్(13) సారా స్నేహితురాలు. ఈ నలుగురూ జీవితంలో తమకంటూ ప్రత్యేకత ఉండాలని కలలు కన్నవారే. సారా, జెన్నిఫర్ ఇద్దరూ స్పోర్ట్స్‌లో ఎన్నో అవార్డ్స్ సాధించారు. ఇద్దరూ అక్కా చెల్లెల్లా కాకుండా స్నేహితుల్లా కలిసుండేవారు. అమీ కూడా ఎప్పుడూ వారి స్నేహాన్నే కోరుకునేది. తను చిన్నప్పటి నుంచి ప్రకృతి ప్రేమికురాలు. ఫిషింగ్, హార్స్ రైడింగ్, పెట్స్ ట్రైనింగ్.. ఇలా తనదో ప్రత్యేక ప్రపంచం. ఇక ఎలీజా చాలా అందగత్తె. మోడల్ కావాలని కలలు కనేది. మోడలింగ్ కాంపిటీషన్లో పాల్గొనేందుకు కావలసిన డబ్బుల కోసమే పార్ట్ టైమ్ జాబ్స్ చేస్తూ కష్టపడేది. ఒక్కోక్కరిదీ ఒక్కో కల. కానీ రాత్రికిరాత్రే అంతా తారుమారై, జీవితాలే ముగిసిపోయాయి. పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్‌లో నలుగురినీ తీవ్రంగా హింసించి, లైంగిక దాడి చేశారని, తర్వాత తలలపై తుపాకీలతో కాల్చి చంపారని తేలింది. నేరస్థులు షాపు వెనుక డోర్ నుంచి పారిపోయినట్లుగా నిర్ధారించారు. కొన్ని సాక్ష్యాలు కాలి బూడిదైతే, మరికొన్ని మంటలార్పే క్రమంలో కొట్టుకుపోయాయి. దాంతో ఎవ్వరినీ అరెస్ట్ చేయలేకపోయారు. 1999 నాటికి బాధిత కుటుంబాల పోరు పెరిగింది. కేసు దర్యాప్తు చేసే అధికారులూ మారారు. అనుమానితుల్లో మారిస్ పియర్స్, ఫారెస్ట్ వెల్బోర్న్, మైకేల్ స్కాట్, రాబర్ట్ స్ప్రింగ్స్టీన్ అనే పాతికేళ్లలోపు యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు. వీళ్లు ఎవరో కాదు హత్యలు జరిగిన ఎనిమిదో రోజు తుపాకీతో పట్టుబడి, తగిన సాక్ష్యాలు లేక విడుదలైన వాళ్లే! ఈసారి మెక్సికన్ అధికారులు విచారించినప్పుడు నేరాన్ని ఒప్పుకున్నారు. అయితే, కీలకమైన మరే సాక్ష్యాధారాలు లేకపోవడంతో.. ఆ తర్వాత పోలీసులే తమతో బలవంతంగా ఒప్పించారని చెప్పారు. ఇలాంటి సాక్ష్యం చెల్లదని కోర్టు కొట్టేసింది. పైగా అదే ఏడాది అమీ లైంగిక దాడిలో బయటపడిన డీఎన్ ఏ ఆ నలుగురిలో ఏ ఒక్కరితోనూ సరిపోలేదు. మరి అసలు నేరస్థులెవరని కోర్టు అధికారులను నిలదీసింది. ఈ నలుగురిపై అభియోగాలను కొట్టేసింది. అయితే 2010 డిసెంబర్ 25 రాత్రి 11 గంటల సమయంలో మారిస్ పియర్స్ పెట్రోలింగ్ పోలీసుల కంటపడ్డాడు. అతడి కంగారు చూసి... పట్టుకోవడానికి ప్రయత్నిస్తే, కత్తిదూశాడు. అధికారుల్లో ఒకరైన ఫ్రాంక్ విల్సన్ తుపాకీతో కాల్చి అతడ్ని చంపేశాడు. జెన్నిఫర్, ఎలీజాల డ్యూటీ తర్వాత పార్టీకి వెళ్లాలనేది ఆ నలుగురు అమ్మాయిల ప్లాన్. అందుకే అమీ, సారాలూ వాళ్లతో ఉన్నారు. షాప్ క్లోజ్ చేసే టైమ్‌కి చివరిగా ఉన్న కస్టమర్స్‌ని కూడా పోలీసులు విచారించారు. సుమారు 52 మంది ఆ సమయంలో షాప్‌కి వచ్చి పోయారని ప్రత్యక్షసాక్షుల కథనం. అయితే క్లోజింగ్ టైమ్ కాబట్టి షాప్ ఫ్రంట్ డోర్ జెన్నిఫర్ మూసేసి, ఇతర కస్టమర్స్ లోనికి రాకుండా చేసిందని, ఆ టైమ్‌లో ఓ వ్యక్తి వాష్‌రూమ్ లోపలికి వెళ్లడం గమనించినా, తిరిగి రావడం తాము చూడలేదని కొందరు చెప్పారు. మరోవైపు చివరిగా షాప్ నుంచి బయటపడిన ఓ జంట.. షాప్‌లో ఇద్దరు మగవాళ్లు నక్కి నక్కి ఉన్నట్లు అనిపించిందని, వారిలో ఒకరు గ్రీన్ కలర్ జాకెట్, మరొకరు బ్లాక్ కలర్ జాకెట్ వేసుకున్నారని చెప్పారు. అయితే విచారించిన కస్టమర్స్‌లో ఆ ఇద్దరూ మిస్సయినట్లు పోలీసులు గుర్తించారు. వాళ్లే ఈ ఘాతుకానికి ఒడికట్టి ఉంటారని అంచనాలు వేశారు. మరోవైపు సీరియల్ కిల్లర్స్ పాత్రపై దర్యాప్తు చేసినా, ఫలితం దక్కలేదు. పైగా ఈ ఘటన జరిగిన రోజు షాప్‌లో 540 డాలర్లు గల్లంతైనట్లు యాజమాన్యం గుర్తించింది. అయితే అది నేరస్థుల డైవర్ టెక్నిక్‌లో భాగమేనని, వాళ్లు వచ్చింది డబ్బులు కోసం కాదని, అమ్మాయిల కోసమేనన్నది డిటెక్టివ్స్ నమ్మకం. అయితే ముప్పయ్యేళ్లు దాటినా ఈరోజుకీ నేరుస్థులెవరో తేలలేదు. నేటికీ యోగర్ట్ షాప్ పక్కనుంచి వెళ్లే వాళ్లు అక్కడ ఓ క్షణం ఆగుతారు. ఆ నలుగురు అమ్మాయిల స్మారక ఫలకంపై పూలు ఉంచి, ఎప్పటికైనా న్యాయం గెలవాలని కోరుకుంటారు. ∙సంహిత నిమ్మన -
Crime Story: ఫోరెన్సిక్.. ఆదర్శ జంట అనుకున్నారు! అసలు విషయం తెలిసి!
‘కిరణ్మయి చనిపోవడం ఏమిటి?ఈ రోజు సాయంత్రం కూడా తనతో మాట్లాడాను. ఎంతో చలాకీగా ఉంది. ఇంతలోకే ఏమైంది?’ అంటూ కిరణ్మయి ఇంటి ఆవరణలోకి అడుగు పెట్టింది పక్కింటి పావని. ‘నిజమేనమ్మాయ్. ఆరోగ్యంగా హుషారుగా తిరిగే పిల్ల ఇలా అర్ధాంతరంగా..’ అంటూ కన్నీళ్లొత్తుకుంది ఆ వీథిలోనే ఉంటున్న జానకమ్మ. వాళ్ళిద్దరూ లోపలికి వెళ్లేసరికి, అప్పటికే చాలా మంది జనం పోగయ్యారు. ‘కిరణ్మయి, రాజీవ్‌ల జంట భలే ఉండేది ఆదర్శ దాంపత్యానికి ఉదాహరణగా! కాలనీలో అందరితో సఖ్యంగా ఉండేవారు!’ అంటూ అక్కడి జనసందోహం సానుభూతి కనబర్చసాగారు. ‘ఇంతకూ ఏం జరిగింది?’ ఆరా తీసే ప్రయత్నం జరుగుతోంది గుమిగూడిన ఆ గుంపులో. ‘పది గంటలప్పుడు ఇంటికొచ్చి కాలింగ్ బెల్ కొట్టాడట రాజీవ్. ఎంతకీ తలుపు తీయకపోయేసరికి భార్య నిద్రపోయి ఉంటుందని భావించి తన దగ్గరున్న తాళంతో తలుపు తీసి.. బెడ్ రూమ్‌లోకి వెళ్ళాడట. అక్కడ అపస్మారకస్థితిలో చావు బతుకుల మధ్య కొట్టాడుతున్న కిరణ్మయిని చూసి బెంబేలెత్తిపోయాడట. పక్కింటి మహేంద్రకి ఫోన్‌చేసి సాయం కోరాడట. వాళ్ళిద్దరూ ఆమెకు సపర్యలు చేస్తుండగా వాంతి చేసుకుందట. శుభ్రం చేసేలోగానే ఆమె ప్రాణం పోయిందట. అప్పుడే సింగపూర్ నుంచి ఆమె తమ్ముడు వసంత్ వచ్చాడట’ అని ఎవరో చెబుతుంటే ఇంకెవరో అడ్డుపడి ‘ఆ అబ్బాయి అప్పుడే రావడం ఏమిటి?’ అని ప్రశ్నించారు మరొకరు. ‘రేపు కిరణ్మయి పుట్టిన రోజుట. సర్ప్రైజ్ చేద్దామని చెప్పాపెట్టకుండా వచ్చాడుట’ అని ఇంకెవరో వివరమిస్తుండగానే పోలీసు జీప్ వచ్చింది. గుంపులో కలకలం ‘పోలీసులు వచ్చారేంటి?’ అని. ఆ కలకలానికి బయటకు వచ్చిన వసంత్.. ‘రండి సార్.. కంప్లైంట్ ఇచ్చింది నేనే’ అంటూ ఎస్సై అంబరీష్‌కు ఎదురెళ్లాడు. అది విన్న అక్కడున్నందరికీ మతిపోయింది. ‘మీరు కిరణ్మయికి ఏమవుతారు? ఇది హత్యని మీకెందుకు అనుమానం వచ్చింది?’ ప్రశ్నించాడు ఎస్సై లోపలికి నడుస్తూ. ‘నా పేరు వసంత్. నేను కిరణ్మయికి సొంత తమ్ముడిని. మీ ఫార్మాలిటీస్ పూర్తయ్యాక చెప్తాను అన్నీ’ అంటూ ఎస్సైని అనుసరించాడు. సరే అన్నట్టుగా తలూపుతూ శవం ఉన్న గదిలోకి ప్రవేశించాడు ఎస్సై. అక్కడ రాజీవ్, మహేంద్రతోపాటు మరో ముగ్గురు ఉన్నారు. పోలీసులు ఎందుకొచ్చారో తెలియక తికమకపడుతున్నారు. పోలీస్ టీమ్, ఫోరెన్సిక్ టీమ్.. వాళ్ళ పనుల్లో మునిగిపోయింది. రాజీవ్, వసంత్‌లను తప్ప మిగిలినవాళ్ళను బయటకు పంపేశాడు ఎస్సై. బెడ్ మీద పడుకొని ఉన్న శవాన్ని పరిశీలనగా చూశాడు. ఏదో వాసన వస్తున్నట్లు గ్రహించి అటూ ఇటూ చూశాడు. అది గమనించిన రాజీవ్ ‘చనిపోయే ముందు వాంతి చేసుకుంది. శుభ్రం చేసినా ఇంకా వాసన వస్తోంది’ అన్నాడు. ‘హత్యేమోనని అనుమానంగా ఉంది. దేన్నీ టచ్ చేయొద్దు’ హెచ్చరించాడు ఎస్సై. రాజీవ్ ఏదో చెప్పబోతుంటే ‘ఫార్మాలిటీస్ పూర్తయ్యాక మాట్లాడొచ్చు’ అంటూ ఇల్లంతా గాలించసాగాడు. ఏ క్లూ దొరక్కపోయేసరికి వసంత్ దగ్గరకు వచ్చి ‘ఇది హత్య అనడానికి ఏ ఆధారమూ కనబడ్డం లేదు. డాక్టర్ కూడా సహజ మరణమనే అంటున్నారు. మీకెందుకు డౌట్‌గా ఉంది?’ అడిగాడు ఎస్సై అంబరీష్. వసంత్ బదులు చెప్పబోతుండగా అతని మీద విరుచుకుపడ్డాడు రాజీవ్.. ‘అయితే పోలీసులను పిలిపించింది నువ్వన్నమాట. ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో ఉంటూ ఈ రోజే ఊడిపడ్డ నీకేం తెలుసని? ఈ ఇంట్లో హత్య జరగడమేంటి?’ అంటూ! అతణ్ణి అంబరీష్ అడ్డుకుంటేగానీ వసంత్ నోరువిప్పలేకపోయాడు. ‘సర్ నేను సింగపూర్‌లో ఫోరెన్సిక్ ఎక్స్‌పర్ట్‌గా పని చేస్తున్నాను. ఎన్నో క్రైమ్ కేసుల విషయంలో అక్కడి పోలీసులకు హెల్ప్ చేస్తూంటాను’ అంటూ తన ఐడీ కార్డ్ చూపించాడు వసంత్. ఆ కార్డ్ తీసుకుంటూ ‘ఓ.. అలాగా? అయితే నేర పరిశోధనలో మీకు బ్రహ్మాండమైన అనుభవం ఉందన్న మాట. సరే. ఇప్పుడు చెప్పండి.. మీకెందుకు అనుమానం వచ్చింది ఇది హత్య అని?’ అడిగాడు ఎస్సై. రాజీవ్‌కి సైలెంట్‌గా ఉండక తప్పలేదు. ‘ఇలా రండి.. మా అక్క నోటిని పరీక్షగా చూడండి. మీకు క్లూ దొరకొచ్చు’ అన్నాడు మళ్లీ కిరణ్మయి డెడ్ బాడీ దగ్గరకు ఎస్సైని తీసుకెళుతూ. ఎస్సైతో పాటు ఫోరెన్సిక్ టీమ్ లీడర్ భాస్కర్ కూడా డెడ్‌బాడీ దగ్గరకు వచ్చి.. మళ్లీ పరీక్షగా చూసి, పెదవి విరిచారు. ‘పెద్ద క్లూ ఏమీ కనబడట్లేదు. కింది పెదవి చివర రెండు మెతుకులు కనిపిస్తున్నాయి. వాంతి అయిందని వాళ్ళు ముందే చెప్పారు కదా? అది తప్ప ఏముంది?’ అన్నాడు భాస్కర్. అతన్ని సమర్థిస్తున్నట్లు తలూపాడు అంబరీష్. ‘అయితే అక్క పంటిలో ఇరుక్కున్న గులాబి రంగు దారప్పోగు మిమ్మల్ని ఆకర్షించలేదన్నమాట?’ అడిగాడు వసంత్. ‘చూశాను. అయితే ఏమిటి?’ అడిగాడు ఎస్సై. ‘ఏదో కర్చీఫ్‌నో.. లేదా గుడ్డనో అక్క నోట్లో కుక్కి ఉంటారని అనుమానం కలగడం లేదూ?’ వసంత్. ఆ ఊహ తమకు తట్టనందుకు కాస్త సిగ్గుపడ్డారు అంబరీష్, భాస్కర్లు. ‘అది కర్చీఫ్ అని నేను నిర్ధారణ చేసుకున్నాను. రండి చూపిస్తాను. అది కార్ గ్యారేజ్‌లో ఉంది’ అంటూ అటు వైపు దారి తీశాడు వసంత్. గ్యారేజ్‌లోని కారుకి కాస్త దూరంలో పడున్న పింక్ కర్చీఫ్‌ను కర్రతో పైకి లేపి ‘ఇది ఎవరిది?’ అని రాజీవ్‌ని ప్రశ్నించాడు. ‘కిరణ్మయిది’ అంటూ సమాధానం ఇచ్చాడు రాజీవ్. ‘కేవలం దీని ఆధారంతోనే హత్య అని తేల్చేస్తున్నారా?’ వసంత్‌ని అడిగాడు అంబరీష్. ‘అన్నీ వివరంగా చెప్తాను సర్. అందరినీ బయటకు పంపేయండి’ అన్నాడు వసంత్. ‘నేను కూడా ఉండకూడదా?’ కోపంగా అడిగాడు రాజీవ్. ‘మిస్టర్ రాజీవ్ ప్లీజ్ కోపరేట్’ అంటూ బయటకు దారి చూపించాడు అంబరీష్. విసవిసా అక్కడి నుంచి వెళ్లిపోయాడు రాజీవ్. ‘నా అనుమానాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇన్స్పెక్టర్.. ఒక రిక్వెస్ట్. అక్క రక్తం, సలైవాతోపాటు పెదవుల దగ్గర ఉన్న అన్నం మెతుకులను వీలయినంత తొందరగా టాక్సికాలజీ టెస్టులకు పంపండి’ అన్నాడు వసంత్. ‘టాక్సికాలజీ టెస్టులు అంటున్నారు. ఆమె పై విషప్రయోగం జరిగిందని అనుమానమా?’ అడిగాడు ఎస్సై. ‘అవును సర్. రుజువులు చూపిస్తాను రండి’ అంటూ మళ్లీ శవం దగ్గరకు తీసుకెళ్ళాడు. కిరణ్మయి బుగ్గలు, గోర్లను చూపిస్తూ ‘అస్పష్టంగా కనిపిస్తున్న ఈ చెర్రీ రంగు మచ్చలను చూడండి.. ఇవి విష ప్రయోగ సంకేతాలే. కానీ టెస్ట్‌ల ద్వారే ప్రూవ్ కావాలి. మా అక్క బాడీని క్షుణ్ణంగా పరీక్షించడానికి మీ అనుమతి కోరుతున్నాను’ అన్నాడు వసంత్. అంగీకరిస్తున్నట్లు తలూపాడు ఎస్సై. గ్లోవ్స్ వేసుకుని.. కిరణ్మయి చేతులను, కాళ్ళను చూపుతూ ‘ఈ గుర్తులను చూస్తే అర్థమవడం లేదా అక్క కాళ్లు, చేతులను కట్టేసి ఉంచినట్లు?’ అని వసంత్ చెపుతుంటే అంబరీష్ ఆశ్చర్యపోతూ ‘ఈ వసంత్ నేర పరిశోధనలో ఆరితేరిన వాడై ఉండాలి. అతని ముందు నేను గానీ, భాస్కర్ గానీ, శవాన్ని పరీక్షించిన డాక్టర్ గానీ దిగదుడుపే’ అనుకున్నాడు. ‘ఇది చాలా క్రిటికల్ కేసులా ఉంది. విషప్రయోగం జరిగినట్లు తెలుస్తుంది గానీ, దాని కోసం నోట్లో గుడ్డలు కుక్కడం, కాళ్ళు, చేతులు కట్టేయడం ఎందుకో అర్థంకావడం లేదు. అటాప్సీ రిపోర్ట్ వస్తే గానీ, ఏ విషయమూ తేలదు. ఒకవేళ మీరు అన్నట్లు హత్యే అయితే గనుక ఎందుకు జరిగి ఉంటుంది? ఎవరు చేసి ఉంటారు? మీకు ఎవరి మీదనయినా అనుమానం ఉందా?’ అడిగాడు ఎస్సై. ‘నేనిప్పుడు ఏమీ చెప్పలేను సర్. టెస్ట్ రిజల్ట్స్, అటాప్సీ రిపోర్ట్ చూశాకే మాట్లాడతాను. అవి వచ్చిన వెంటనే కబురుపెట్టండి’ అన్నాడు వసంత్. ∙∙ పోలీస్ స్టేషన్లో ఒక టేబుల్ ముందు కూర్చుని రిపోర్ట్లు పరిశీలిస్తున్నాడు వసంత్. ఎస్సై అంబరీష్, సీఐ మహంకాళి.. అతను చెప్పేది వినడానికి కుతూహలంతో ఎదురు చూస్తున్నారు. రిపోర్ట్‌లను క్షుణ్ణంగా పరిశీలించాక, రెండు చేతులతో బల్లను చరిచి.. ‘యస్.. నా అనుమానం నిజమయింది’ అన్నాడు. ‘కంగ్రాట్స్.. వివరంగా చెప్పండి’ అన్నాడు సీఐ కాళి. ‘కార్బన్ మోనాక్సైడ్ పాయిజనింగ్ జరిగింది. ఇదిగో ఈ రిపోర్ట్స్ చూడండి.. కార్బాక్సీ హీమోగ్లోబిన్ శాతం ముప్పై. అంటే చాలా ఎక్కువ. మన శరీరం మూడు శాతాన్ని మాత్రమే తట్టుకోగలదు. స్మోకింగ్ అలవాటు ఉన్నవాళ్లు పది శాతం వరకూ తట్టుకుంటారు. కానీ ముప్పై శాతం చేరుకుందంటే ప్రాణాపాయమే. మనం పీల్చుకునే ఆక్సిజన్, రక్తంలో ఉన్న హీమోగ్లోబిన్‌తో కలుస్తుంది. అలారక్తం, శరీరంలోని అన్ని భాగాలకు, అన్ని కణాలకు చేరడం వల్ల, వాటికి ఆక్సిజన్ నిరంతరంగా అందుతుంది. అయితే కార్బన్ మోనాక్సైడ్, ఆక్సిజన్ కన్నా తొందరగా, సులువుగా హీమోగ్లోబిన్‌తో కలసి కార్బాక్సీహీమోగ్లోబిన్ను ఏర్పరుస్తుంది. అందువల్ల ఆక్సిజన్ రక్తంతో కలవడం ఆగిపోతుంది. ఫలితంగా శరీర భాగాలకు గానీ, కణాలకు గానీ ఆక్సిజన్ అందదు. ఆ విధంగా కార్బన్ మోనాక్సైడ్ ఒక విషంలా పనిచేస్తుంది. అలా ఏర్పడే ఆక్సిజన్ కొరత వల్ల ఊపిరి అందకపోవడం, అపస్మారకంలోకి పోవడం, కొన్ని సార్లు కోమాలోకి వెళ్ళడం, మరణం సంభవించడం, వికారంగా అనిపించడం, వాంతులు కావడం, శరీరంలోని కొన్ని భాగాలపై చెర్రీ రెడ్ రంగు మచ్చలు ఏర్పడడం లాంటివి జరుగుతాయి. మనం ఆ ఇంటికి వెళితే, ఈ విషప్రయోగం ఎలా జరిగిందో తెలుసుకోవచ్చు’ అన్నాడు వసంత్. ∙∙ నేరుగా కారు గ్యారేజ్‌లోకి దారి తీశాడు వసంత్ .. ఎస్సై అంబరీష్‌తో. గ్యారేజ్ అంతా క్షుణ్ణంగా పరిశీలిస్తూ గోడమీద ఉన్న ఓ మచ్చను చూపిస్తూ ‘ఇది చూశారా? కారు సైలెన్సర్కి ఎదురుగా ఉంది. సైలెన్సర్ నుంచి వచ్చిన వాయువుల తాకిడికి ఈ మచ్చ ఏర్పడింది. అయితే ఇది ఇంత స్పష్టంగా ఏర్పడిందంటే, కారు ఇంజన్‌ను కనీసం అరగంటయినా ఆన్‌లో ఉంచి ఉండాలి. అవునా?’ అడిగాడు వసంత్. ‘అవును. అయితే?’ అడిగాడు అంబరీష్. ‘హంతకుడు చాలా తెలివిగా ప్లాన్ చేశాడు. మా అక్క కాళ్ళు, చేతులూ కట్టేసి అరవకుండా నోట్లో కర్చీఫ్ కుక్కి, ఇదిగో ఈ సైలెన్సర్ ఎదురుగా తన ముఖం ఉండేటట్లు బంధించి చాలాసేపు సెలెన్సర్ నుంచి వాయువును పీల్చుకునేలా చేశాడు. ఇది పాతకారు కాబట్టి ఆ వాయువుల్లో కార్బన్ మోనాక్సైడ్ శాతం ఎక్కువగా ఉండే ఉంటుంది. ఆ విధంగా ఆ విషప్రయోగం చేశాడు. దాంతో మా అక్క అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయుంటుంది. అప్పుడు ఆమెను బెడ్ రూమ్‌లోకి మార్చి ఉంటాడు. కట్టిన తాళ్ళను మాయం చేశాడు గానీ, కర్చీఫ్ అక్కడే పడిపోయినట్లు గుర్తించి ఉండడు ఆ గాభరాలో. అదే మనకు ఆధారం అయింది. పాపం ఇదేమీ తెలియని మా బావ ఇంట్లోకి వచ్చి చూసేసరికి, మా అక్క చావు బతుకుల్లో కనిపించింది. కళ్ళ ముందే భార్య చనిపోవడం చూసిన మా బావ ఎంత క్షోభ అనుభవించి ఉంటాడో’ అన్నాడు బాధగా. ‘మీరంత బాధ పడిపోకండి. హంతకుడు మీ బావేనని మా సీఐ అనుమానం’ అనగానే, తెల్లమొహం వేశాడు వసంత్. ‘ఇది హత్య కావచ్చనే అనుమానం వచ్చిన వెంటనే, ఆయన తనదైన శైలిలో దర్యాప్తు మొదలుపెట్టారు. చాలా విషయాలు బయటపడ్డాయి. మీ బావ ఒక మేకవన్నె పులి. భార్య మీద అనుమానం పెంచుకున్నాడు. అదే అతన్ని హత్యకు ఉసిగొల్పి ఉండవచ్చునని భావించాం. హత్య వేరే వాళ్లెవరూ చేసినట్లు ఆధారాలు దొరకలేదు. మీరు ఎప్పుడయితే రంగంలోకి దిగారో అప్పటి నుంచి అతనికి బెంగ పట్టుకుంది. అందుకే ఇక్కడి నుంచి వెళ్లిపోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడని మా వాళ్ళు పసిగట్టారు. ఇప్పుడు హత్య ఎలా జరిగిందన్న విషయమూ స్పష్టమైంది. సాక్ష్యాలూ ఎదురుగా ఉన్నాయి. ఈ విషయం మా సీఐకి చెప్పాలి. వెంటనే రాజీవ్‌ను పట్టుకోవాలి’ అంటూ మొబైల్ ఫోన్ తీశాడు ఎస్సై అంబరీష్. చదవండి: Crime Story: మోస్ట్ వాంటెట్.. పరిణీత ఎందుకలా చేసిందో తెలిసి అందరూ షాక్! క్రైమ్ స్టోరీ: హంతకుడెవరు.. అసలు ట్విస్ట్ తెలిసిన తర్వాత! -
డోరతి జేన్ హత్య.. ఇప్పటికీ మిస్టరీ గానే..!
కొన్ని పరిచయాలు నివురుగప్పిన నిప్పులై.. నీడలా వెంటాడుతూ.. నిర్దాక్షిణ్యంగా ఉసురు తీసేస్తాయి. నిండు జీవితాన్ని నిలువునా కాల్చేస్తాయి. ‘డోరతి జేన్ స్కాట్’ అనే సింగిల్ మదర్ హత్య కేసు కూడా అలాంటిదే. అది 1980 మే 28, రాత్రి 9 గంటలు. కాలిఫోర్నియాలో యు.సి. ఇర్విన్ మెడికల్ సెంటర్లోని వెయిటింగ్ హాల్లో డోరతి జేన్ స్కాట్(32) చాలా టెన్షన్ పడుతూ వెయిట్ చేస్తోంది. డాక్టర్ బయటికి ఎప్పుడు వస్తాడా? ఎలాంటి వార్త చెబుతాడా? అనేదే ఆమె భయం. ఎందుకంటే తన సహోద్యోగి బోస్ట్రాన్.. ఎమర్జెన్సీ వార్డ్‌లో చికిత్స పొందుతున్నాడు. కాలిఫోర్నియాలోని స్టాంటన్‌లో తన నాలుగేళ్ల కొడుకు, అత్తతో కలసి జీవించేది డోరతి. తల్లిదండ్రులు ఉండే అనాహైమ్లోనే ఒక స్టోర్‌లో సెక్రటరీగా పని చేసేది. కొన్ని సార్లు తను పనికి వెళ్లేటప్పుడు తన బాబుని తల్లిదండ్రుల దగ్గరే వదిలి వెళ్లేది. తను డ్యూటీలో ఉండగానే బోస్ట్రాన్ అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే మరొక సహోద్యోగి పామ్ హెడ్ సాయంతో తన కారులోనే బోస్ట్రాన్ను ఆసుపత్రికి తీసుకొచ్చింది డోరతి. మొత్తానికి డాక్టర్ బయటికి వచ్చాడు. ‘భయపడాల్సిన పని లేదు.. బ్లాక్ విడో స్పైడర్ కరవడం వల్లే బోస్ట్రాన్ అస్వస్థతకు గురయ్యాడు.. చికిత్స పూర్తి అయ్యింది. ఓ అరగంట తర్వాత ఇంటికి తీసుకుని వెళ్లొచ్చు’ అని చెప్పాడు. ఊపిరి పీల్చుకుంది డోరతి. రాత్రి 11 దాటింది. బోస్ట్రాన్ చాలా నీరసంగా ఉండటంతో.. డిశ్చార్జ్ సమ్మరీ పూర్తి చేసేలోపు కారు తీసుకొస్తానని డోరతి పార్కింగ్ ఏరియాకి వెళ్లింది. అయితే సమ్మరీ పూర్తి అయ్యి.. చాలా సేపు అయినా డోరతి కారు తీసుకుని రాకపోవడంతో.. బోస్ట్రాన్, పామ్ హెడ్ పార్కింగ్ దగ్గరకు వెళ్లారు. అప్పుడే డోరతి కారు వేగంగా వారి ముందు నుంచే దూసుకుపోయింది. కారు హెడ్‌లైట్స్ డైరెక్ట్‌గా వాళ్ల కళ్లల్లో పడటంతో.. డ్రైవింగ్ సీట్లో ఉన్నదెవరో చూడలేదు. అయితే.. బాబుకి అత్యవసర పరిస్థితి వచ్చి డోరతి అంత వేగంగా తమని వదిలి వెళ్లి ఉంటుందని వాళ్లు భావించారు. మరునాడు తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో డోరతి కారు ఆసుపత్రికి పది మైళ్ల దూరంలో ఉన్న సందులో కాలిపోతున్నట్లు కనిపెట్టారు పోలీసులు. దాంతో డోరతి కిడ్నాప్ అంటూ కేసు నమోదు చేసుకుని విచారణ మొదలుపెట్టారు పోలీసులు. డోరతి నిబద్ధత కలిగిన క్రైస్తవురాలని.. సాయం చేయడంలో ముందుంటుందని, డ్రగ్స్, మద్యం వంటి చెడు అలవాట్లేవీ ఆమెకు లేవని సహోద్యోగులు, ‘డోరతికి అసలు బాయ్‌ఫ్రెండ్ కూడా లేడు’ అని డోరతి తండ్రి జాకబ్ చెప్పారు. తల్లి మాత్రం ఓ అజ్ఞాత కాలర్ గురించి వణుకుతూ చెప్పింది. నెల రోజులుగా ఏవో బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్పింది. గట్టిగా అడిగితే ‘ఒక వ్యక్తి డోరతికి చాలాసార్లు కాల్ చేసి.. ‘‘నిన్ను ప్రేమిస్తున్నా, త్వరలో నిన్ను చంపేస్తా’’ అనేవాడట. ఆ మాటలను పట్టించుకోని డోరతి.. ఒక్కసారి మాత్రం చాలా భయపడింది. ఎందుకంటే.. ఒకరోజు సడన్‌గా ఫోన్ చేసి ‘‘నీ కోసం బయట ఒకటి వెయిట్ చేస్తోంది.. వెళ్లు’’ అని చెప్పి ఫోన్ పెట్టేశాడట. వెళ్లి చూస్తే.. కారు విండ్‌షీల్డ్ పైన.. వాడిపోయిన గులాబీ ఉందట. ఆ రోజు నుంచే డోరతి భయపడటం మొదలుపెట్టింది. అప్పుడే నాకు ఆ వ్యక్తి ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్న విషయం చెప్పింది’ అంటూ జరిగింది రివీల్ చేసింది డోరతి తల్లి. ఆ భయంతోనే.. డోరతి తుపాకీ కొనాలని కూడా నిర్ణయించుకుందని, కిడ్నాప్‌కి వారం ముందే.. కరాటే క్లాసుల్లో చేరిందని ఆమె స్నేహితులు చెప్పారు. అయితే కిడ్నాప్ అయిన వారం తర్వాత.. డోరతి తల్లికి చాలాసార్లు ఆ అజ్ఞాత వ్యక్తి నుంచి కాల్స్ వచ్చాయి. ‘ఐ హావ్ హర్’ అని చెప్పి ఫోన్ పెట్టేసేవాడు. డోరతి తల్లి ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే కాల్స్ వచ్చేవి. ఒకవేళ డోరతి తండ్రి ఫోన్ లిఫ్ట్ చేస్తే ఫోన్ కట్ అయ్యేది. క్రమం తప్పకుండా డోరతి తండ్రే ఫోన్ లిఫ్ట్ చేయడంతో ఆ వ్యక్తి కాల్ చేసి వేధించడం మానేశాడు. అయితే అధికారులు అతడి లొకేషన్‌ను ట్రాక్ చేయడానికి చాలా ప్రయత్నించారు కానీ.. ఆ వ్యక్తి అతి తక్కువ సేపే ఫోన్ మాట్లాడేసరికి ఆ ఫోన్ కాల్ ట్రాక్ చేయడానికి పోలీసులకు వీలు కాలేదు. ఇతర ప్రయత్నాలు ఎన్ని చేసినా డోరతి ఆచూకీ దొరకలేదు. నాలుగేళ్లు గడిచింది. 1984 ఆగష్టు 6న.. శాంటా అనా కాన్యన్ రోడ్ నుంచి ముప్పై అడుగుల దూరంలో మనిషి ఎముకలు ఉన్నాయని పోలీసులకు చెప్పాడు ఓ వ్యక్తి. 1982లో ఆ ప్రాంతాన్ని కార్చిచ్చు చుట్టుముట్టడంతో దేహం పాక్షికంగా కాలిపోయి ఎముకలు మాత్రమే మిగిలాయి. వాటితో పాటు ఒక ఉంగరం, వాచ్ దొరకడంతో ఆ అస్థిపంజరం డోరతిదేనని గుర్తించారు. శవ పరీక్షలో ఆమె మరణానికి గల కారణం తేలలేదు. అయితే ఎవరు చంపారు అనేది తెలియకపోయినా.. కచ్చితంగా ఫోన్ కాల్స్ చేసిన వ్యక్తే చంపి ఉంటాడని నమ్మారు చాలామంది. అందుకు బలమైన సాక్ష్యం లేకపోలేదు. డోరతి మిస్సింగ్ తర్వాత ఎన్నో ప్రత్యేక కథనాలను ప్రచురించిన.. ‘ఆరెంజ్ కౌంటీ రిజిస్టర్’ అనే న్యూస్ పేపర్ మేనేజింగ్ ఎడిటర్‌కి ఆ అజ్ఞాత వ్యక్తి కాల్ చేశాడట. ‘నేను డోరతి స్కాట్‌ను చంపేశాను. ఆమె నా ప్రియురాలు. కానీ ఆమె నన్ను మోసం చేసింది. వేరొక వ్యక్తితో ఆమె ఉండటం నేను చూశాను. అలాంటిదేం లేదని ఆమె ఖండించింది. అయినా నేను ఆమెను చంపేశాను’ అని చెప్పి ఫోన్ కట్ చేశాడట. అయితే ‘మే 28 రాత్రి బోస్ట్రాన్ను స్పైడర్ కరచిన విషయం ఆ కాలర్కి ముందే తెలుసు’ అనేది ఆ మేనేజింగ్ ఎడిటర్ ఉద్దేశం. అదీ నిజమై ఉండొచ్చు. ఏదిఏమైనా.. డోరతి మరణానికి కారణం ఎవరో? ఆ అజ్ఞాత వ్యక్తి పేరేంటో నేటికీ తేలలేదు. దాంతో ఈ కేసు మిస్టరీగానే మిగిలిపోయింది. ∙సంహిత నిమ్మన -
Crime Story: మోస్ట్ వాంటెట్.. పరిణీత ఎందుకలా చేసిందో తెలిసి అందరూ షాక్!
సాయంత్రం నుండి హోరున వర్షం కురుస్తూనే ఉంది. అక్కడికి ఎడమపక్కగా ఒక పోలీసుస్టేషన్. ఆ స్టేషన్లో ఆకాష్ గుప్తా, రజని దంపతులు.. సీఐ నచికేత ఎదురుగా కూర్చుని ఉన్నారు. తన చేతిలో ఉన్న కంప్లైంట్ ను దీక్షగా చదువుతున్నాడు నచికేత. కొద్దిసేపటి తరువాత వారిని చూస్తూ.. ‘ఇది చాలా క్లిష్టమైన సమస్యలా ఉంది. మనం ఘోరా బాబా ఆశ్రమానికి వెళదాం. వారెంటుతో ఆశ్రమానికి వెళ్ళాలి కాబట్టి మీరు అప్పటివరకు నిరీక్షించక తప్పదు’ అన్నాడు. ∙∙ ‘నేను దైవాంశసంభూతుడిని. నన్ను నమ్ముకున్న వారికి అంతా మంచే జరుగుతుంది. మీ సమస్యలు, కష్టాలు నాతో చెప్పుకోండి. నేను వాటిని తీర్చి మీకు ముక్తిని ప్రసాదిస్తాను’ ఎప్పటినుండో సాగుతున్న ఘోరాబాబా ప్రసంగం ముగిసింది. అది గమనించిన బాబా ప్రధానశిష్యులు నలుగురు మెరుపువేగంతో కదిలి ఘోరాబాబా చుట్టూ కవచంలా ఏర్పడ్డారు. రక్షకవలయం నడుమ ఘోరాబాబా లోపలికి వెళ్ళిపోయాడు. అక్కడున్న భక్తులు దూరం నుండే ఘోరాబాబాకి జై అని నినాదాలు చేయసాగారు. వారిని అనుక్షణం బాబా శిష్యులు అప్రమత్తులై డేగకళ్లతో కాపలా కాస్తున్నారు. చిన్న చీమ కూడా లోపలికి జొరబడకుండా ఆశ్రమం అంతటా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి ఉన్నాయి. ఘోరాబాబా దర్శనానికి అప్పుడప్పుడు వచ్చే పరిణీత.. గత కొంతకాలంగా ఆశ్రమంలోనే ఉంటూ అక్కడికి వచ్చే భక్తులను, అక్కడి ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ అన్ని పనుల్లో చురుకుగా పాల్గొంటోంది. ఘోరాబాబా మన్ననలు చూరగొని ప్రియమైన శిష్యురాలిగా మారిపోయింది. అది ఒక విశాలమైన హాలు. అక్కడున్న వేదిక మీది వెండి సింహాసనంపై ఘోరాబాబా ఆసీనుడయ్యాడు. ఘోరాబాబా చుట్టూ శిష్యులు కవచంలా నిలబడి ఉన్నారు. ఘోరాబాబా తల చుట్టూ తెల్లటి కాంతివలయం మెరిసిపోతూ ఉంది. అందరినీ చూస్తున్న ఘోరాబాబా ‘భక్తులారా.. మీ అందరిని ఉద్ధరించడానికే అవతరించాను. మీ మీ కష్టాలన్నీ నాతో విన్నవించుకోండి’ అని పలుకుతూ తన చేతిని గాలిలో తిప్పాడు. వెంటనే విభూది ప్రత్యక్షమైంది. ఆ విభూదిని అక్కడున్న భక్తులు అందరి మీదా పడేటట్టు ఊదాడు ఘోరాబాబా. ఆ విభూది అందరి మీద పడగానే వారందరూ తన్మయత్వంతో వివశులై మంత్రముగ్ధుల్లా మారిపోయారు. తర్వాత ఘోరాబాబా ప్రసంగించడం మొదలుపెట్టాడు. ఆ ప్రసంగాన్ని అక్కడున్నవారందరూ ఎంతో శ్రద్ధగా వినసాగారు. వెండి సింహాసనం నుండి దిగిన ఘోరాబాబా సింహాసనం వెనుక భాగం వైపు ఉన్న ఒక మీటను నొక్కాడు. అది నొక్కగానే సింహాసనం పక్కకి జరిగి వేదిక కిందకు మెట్లు కనిపించాయి. అక్కడే ఉన్న పరిణీతను భక్తులు ఇచ్చిన కానుకల పళ్ళేన్ని పట్టుకుని తన వెంట రమ్మన్నాడు. అక్కడకు వచ్చిన పరిణీత ఆ వేదిక కింద ఉన్న మెట్లను చూసి ఆశ్చర్యపోయింది. ఇంతలో ఒక శిష్యుడు పరుగుపరుగున అక్కడికి వచ్చాడు.. ‘బాబా.. మీకోసం సీఐ వచ్చాడు’ అంటూ. అది వినగానే ఘోరాబాబా.. పరిణీతతో పాటు బయటకు వచ్చాడు. అక్కడ సీఐ నచికేతతో పాటు ఆకాష్ గుప్తా, రజని ఉన్నారు. వారిని చూసిన ఘోరాబాబా ఆశ్చర్యపోయాడు. వారందరినీ అక్కడ చూసిన పరిణీత ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కారణం ఆకాష్ గుప్తా, రజని.. ఆమె తల్లిదండ్రులు కావడమే. ఘోరాబాబా.. నచికేతను చూస్తూ ‘ సీఐ గారూ.. మా ఆశ్రమాన్ని సందర్శించడానికి కారణం?’ అని అడిగాడు. ‘నేను తమరి ఆశ్రమం సందర్శించడానికి రాలేదు. వారెంటుతో వచ్చాను. మీరు.. పరిణీత అనే అమ్మాయిని మీ ఆశ్రమం నుండి పంపించకుండా బంధించినట్టు మాకు కంప్లయింట్ వచ్చింది. అందుకుగాను మీ మీద, మీ ఆశ్రమం మీద చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది’ అన్నాడు పీఐ నచికేత. ఆ మాటకు తెలియని కలవరపాటుకు గురైనా కనిపించకుండా సర్దుకున్న ఘోరాబాబా.. ‘పరిణీత ఇక్కడే ఉంది. నేను కానీ మా ఆశ్రమంలో ఇంకెవరు కానీ ఆమెను బంధించలేదు’ అన్నాడు. నచికేత.. పరిణీత వద్దకు వెళ్ళాడు. ‘పరిణీతగారూ.. మీరిలా మీ తల్లిదండ్రులను వదిలి ఇక్కడ ఉండటం సమంజసం కాదు. మీరు వెంటనే మీ పేరెంట్స్‌తో వెళ్లడం మంచిది’ అని చెప్పాడు. ‘చూడండి సర్.. నేనెక్కడ ఉండాలో నాకు బాగా తెలుసు. అదీ కాక నేను మేజర్ని. మేజర్‌కి తాను ఎక్కడ ఉండాలో నిర్ణయించుకునే హక్కు కూడా ఉంటుందని మీకు బాగా తెలుసనుకుంటాను. దయచేసి మీరందరూ ఇక్కడనుండి వెళ్లిపోండి’ అంది పరిణీత. జరుగుతున్నదంతా నిర్వికారంగా ఘోరాబాబా, ఏం జరుగుతుందా అనే ఉత్కంఠ తో శిష్యులు, కన్నీటితో పరిణీత తల్లిదండ్రులు చూస్తున్నారు. ‘మీరు మేజర్ అవునో కాదో తెలుసుకోవడానికి ఏవైనా ఆధారాలు ఉన్నాయా?’ అడిగాడు నచికేత. తన చేతిలో ఉన్న ఒక ఫైలును నచికేతకు అందించింది పరిణీత ‘ఇది చూడండి’ అంటూ. అందులో ఉన్న సర్టిఫికెట్స్‌ను పరిశీలనగా చూస్తున్న నచికేతకు ఒక కాగితాన్ని చూడగానే కళ్ళు పెద్దవయ్యాయి. అది పరిణీత జర్నలిజంలో మాస్టర్స్ చేసిన సర్టిఫికెట్. అప్పుడర్థమైంది నచికేతకు పరిణీత అక్కడ ఎందుకు ఉందో! ఆ సంఘటన జరిగిన నెల రోజులకు.. ఘోరాబాబా ఆశ్రమం అంతా గగ్గోలుగా ఉంది. ఆ ఆవరణంతా పోలీసులు.. మీడియాతో నిండి ఉంది. కొద్దిసేపటిలో సీఐ నచికేత.. ఘోరాబాబాను అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయాడు. ∙∙ ఆ వేళ.. కోర్టు హాలు అంతా కిక్కిరిసి ఉంది. ఫైల్ చేయబడిన ఘోరాబాబా కేసు తీర్పు ఇవ్వబోతున్నారు జడ్జిగారు. సీఐ నచికేత.. ప్రత్యేక భద్రత నడుమ పరిణీత తల్లిదండ్రులను కోర్టుకు రప్పించాడు. ఒకపక్క కోర్టుబోనులో పరిణీత.. మరోపక్క బోనులో కళ్ళనిండా క్రోధంతో ఘోరాబాబా.. జడ్జిగారు పర్మిషన్ ఇవ్వగానే పరిణీత చెప్పడం మొదలుపెట్టింది. ‘జడ్జిగారూ.. నా పేరు పరిణీత. నేను జర్నలిజంలో మాస్టర్స్ చేశాను. ఒకరోజు నా ఫ్రెండ్.. ఘోరాబాబా ఆశ్రమానికి వెళదామని నన్ను తీసుకువెళ్ళింది. ఘోరాబాబా చుట్టూ ఉన్న వారందరూ భక్తి పేరుతో హిప్నాటిజమ్కు గురైనట్టు అనిపించింది. ఆశ్రమంలో దృశ్యాలు కుతూహలం కలిగించాయి. తెలుసుకోవాలనే ఆసక్తిని రేకెత్తించాయి. ఓ సామాన్యురాలిగా ఆశ్రమానికి రెగ్యులర్‌గా వెళ్లడం మొదలుపెట్టాను. ఘోరాబాబాకు ప్రియమైన శిష్యురాలిగా మారిపోయాను. అక్కడ భక్తి ముసుగులో ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయని గ్రహించాను. వాటిని అందరికి తెలియచేసి ఘోరాబాబా నిజస్వరూపం బయటపెట్టాలని నిశ్చయించుకున్నాను. నిజానికి అది ఓ సాహసమే. అయినా నేను వెనకాడలేదు. హిప్నాటిజం అనేది ఒక నమ్మకం. దాన్ని గారడిగా మర్చి.. మాస్ హిస్టీరియాను సృష్టిస్తూ.. చిన్న చిన్న ట్రిక్స్‌తో, తనకు తనే మహాయోగిగా ప్రచారం చేసుకుంటూ అమాయకులను టార్గెట్ చేస్తున్నాడు ఈ ఘోరాబాబా. ఆ ఘోరాలను నా కళ్లకు అమర్చిన ‘స్పై కెమెరా లెన్స్’ తో షూట్ చేశాను. ఘోరాబాబా చేసే ప్రతి గారడీ ప్రజలు చూడాలి. అందుకు అవకాశం ఇవ్వండి మిలార్డ్’ అంటూ తన దగ్గరున్న ఫుటేజీని జడ్జిగారికి అందించింది పరిణీత. ఆమె ధైర్యసాహసాలకు ముచ్చటపడ్డారు అక్కడున్నవారంతా. ఆ ఫుటేజీని స్క్రీన్ మీద ప్లే చేయాల్సిందిగా జడ్జిగారు అనుమతినిచ్చారు. అనుమతి అందడమే ఆలస్యం ఘోరాబాబా లీలలన్నీ ఒక్కొక్కటిగా ల్యాప్‌టాప్ స్క్రీన్ మీద కనిపించసాగాయి. ‘ఒక గదిలో ఘోరాబాబా తన శిష్యులను హిప్నటైజ్ చేస్తున్నాడు. వారందరూ ఏదో మత్తులో ఉన్నట్టు ఊగిపోతున్నారు. ఘోరాబాబాను వాళ్ళందరూ దేవుడని పొగుడుతూ కాళ్ళమీద పడి మొక్కుతున్నారు. తెల్లటి విభూదిని తీసుకొచ్చి అందులో ఏదో కలిపాడు ఘోరాబాబా. ఆ విభూదిని భక్తుల మీద చల్లడానికి ఉపయోగిస్తున్నారు. మరొకచోట అక్కడున్న అమ్మాయిలను కొంతమంది శిష్యులు ఘోరాబాబాకు లొంగిపొమ్మని లేదంటే మీ కుటుంబాలను అన్యాయం చేస్తామని బెదిరిస్తున్నారు. మరొకచోట పెద్ద ఎత్తున స్మగ్లింగ్ వ్యాపారం చేస్తున్నారు. ఇవన్నీ ఘోరాబాబా ఆశ్రమం అండర్ గ్రౌండ్లో జరుగుతున్నాయి. ఆశ్రమానికి అండర్ గ్రౌండ్ ఉందని ఎవరికీ తెలియదని ఘోరాబాబా.. పరిణీతకు చెప్పడం కూడా అందులో ఉంది. ప్రజల అమాయకత్వాన్ని.. భక్తివిశ్వాసాలను వ్యాపారంగా మార్చుకుంటున్న ఆ ఘోరమైన దృశ్యాలు ఘోరాబాబా వికృత ఆలోచనలకు అద్దం పడుతున్నాయి. అంతా చూసిన జడ్జిగారు.. ఆ వీడియోలను తక్షణమే ప్రజాతీర్పు కోసం టెలికాస్ట్ చేయమని ఆదేశాలు ఇచ్చారు. ∙∙ టీవీల్లో ఘోరాబాబా అకృత్యాలు ప్రసారమవడం మొదలయ్యాయి. ఇది జరిగిన నిమిషాల వ్యవధిలోనే ఘోరాబాబా ఆశ్రమాలు, సంస్థలు భక్తుల ఆగ్రహానికి నేలమట్టమవసాగాయి. ∙∙ ప్రజా తీర్పు తర్వాత.. కోర్టు తీర్పూ వెలువడింది. ఏడుచువ్వల మధ్య.. కటిక నేల మీద పడుకుని సీలింగ్ వంక వెర్రిచూపులు చూస్తూ కాలక్షేపం చేయసాగాడు ఘోరాబాబా. చదవండి: కథ: ఋణం.. తండ్రి ఋణం నుంచి పిల్లలు తప్పుకోగలరా? -
క్రైమ్ స్టోరీ: హంతకుడెవరు.. ట్విస్ట్ అదిరిపోయింది!
పసలపూడిలోని ఓ పంటపొలంలోనున్న బావిలో ఓ అమ్మాయి శవం తేలిందన్న సమాచారం అందడంతో వెంటనే తన సిబ్బందితో ఆ ప్రాంతానికి బయలుదేరాడు సీఐ జయసింహ. పోలీసులను చూడగానే ఓ వ్యక్తి వాళ్ల దగ్గరకు వచ్చి ‘సార్! నా పేరు దుర్గారావు. ఆ దుర్మార్గుడు నా బిడ్డను ఈ బావిలోకి తోసి చంపేశాడు సార్’ బావి వైపు చూపిస్తూ భోరుమన్నాడు. నూతిలోంచి మృతదేహాన్ని బయటకు తీయమని తన సిబ్బందికి పురమాయించి, ‘మీ అమ్మాయి పేరు?’ దుర్గారావును అడిగాడు సీఐ. ‘విశాల.. ఆ దరిద్రుడు గోపాల్ గాడు.. రెండేళ్లుగా మా అమ్మాయి వెంటపడి, ప్రేమించమని వేధిస్తున్నాడు. ఈరోజు ఇక్కడికి రమ్మని ఉంటాడు. తను కాదనడంతో ఇదిగో ఇలా తోసేసి..’ నూతిలోంచి తీస్తున్న కూతురు మృతదేహాన్ని చూస్తూ గుండెలు బాదుకున్నాడు దుర్గారావు. ‘ఆ గోపాలే తోసేశాడని అంత కచ్చితంగా ఎలా చెప్పగలరు?’ అనుమానంగా అడిగాడు సీఐ. ‘సార్, వీడు మా తమ్ముడు గౌరీపతి. ఈ ఘోరం జరిగిన తరువాత ఆ గోపాల్ పారిపోవడం వీడు ప్రత్యక్షంగా చూశాడు’ అంటూ తమ్ముడి వైపు చూపిస్తూ.. కూతురి శవం దగ్గర కూలబడిపోయాడు దుర్గారావు. ‘గౌరీపతిగారూ! ఏం జరిగిందో వివరంగా చెప్పండి’ అంటూ అతన్ని సంఘటన స్థలం నుంచి కొంచెం దూరంగా తీసుకెళ్లాడు సీఐ జయసింహ. ‘సార్, మా అన్నయ్యకు ఈ విశాల ఒక్కతే కూతురు. ఎలా పడిందో తెలియదు కానీ మా విశాల ఆ గోపాల్ గాడి బుట్టలో పడింది. వాళ్లిద్దరూ కలసి తిరగడం చాలాసార్లు చూశాను. ఇద్దరినీ మందలించాను కూడా. అయితే ఈమధ్య ఎందుకో విశాల ముభావంగా ఉంటోంది. ఈరోజు నేను నా పొలం దగ్గరకు వస్తూండగా, విశాల కూడా మా పొలం వైపు వెళ్లడం గమనించాను. కాసేపటికి ఆ గోపాల్ కూడా వచ్చాడు. దూరం నుంచి నన్ను చూసిన గోపాల్ అక్కడ నుంచి పారిపోవడం చూశాను. ఓ పావుగంట తరువాత విశాల ఏమైంది అన్న అనుమానంతో ఇక్కడకొచ్చి, ఆమె కోసం ఈ చుట్టుపక్కల అంతా వెతికాను. కాసేపటి తరువాత ఏదో అనుమానం వచ్చి నూతి దగ్గరకు వచ్చి చూస్తే..’ ఏడుపు దిగమింగుకుంటూ చెప్పాడు గౌరీపతి. ∙∙ అదే రోజు రాత్రి దుర్గారావు ఇంటికి వెళ్లాడు సీఐ.. ‘దుర్గారావు గారూ! ఈ సమయంలో మిమ్మల్ని బాధ పెట్టడం భావ్యంకాదు కానీ, మా డ్యూటీ మేం చేయాలికదా? ఒకసారి మీ అమ్మాయి విశాల గది చూపిస్తారా?’ అడిగాడు ఆ పరిసరాలను ఓ కంట పరిశీలిస్తూనే. ‘అలాగే.. రండి సార్! ఇంతకీ ఆ గోపాల్ గాడు దొరికాడా సార్?’ కూతురు గది చూపిస్తూ, గాద్గదిక స్వరంతో అడిగాడు దుర్గారావు. ‘లేదు. ఈ సంఘటన జరిగిన తర్వాత ఇల్లు వదలి పారిపోయాడుట. ఓ రెండు బృందాలు ఆ పని మీదే ఉన్నాయి. త్వరలో పట్టుకుంటాం’ అంటూనే ఆ గదిని క్షుణ్ణంగా పరిశీలించసాగాడు. అక్కడ దొరికిన కొన్ని వస్తువులను తీసుకుని వెళ్లిపోయాడు సీఐ. ∙∙ హత్య జరిగిన మూడవ రోజు రాత్రి.. విజయనగరంలో తమ దూరపు బంధువుల ఇంట్లో రహస్యంగా తలదాచుకున్న గోపాల్‌ను అరెస్ట్ చేసి తీసుకొచ్చారు పోలీసులు. ‘గోపాల్! నువ్వు విశాలను నూతిలోకి తోసేస్తుంటే చూసినవాళ్లున్నారు. అందుచేత ఏం జరిగిందో చెప్పి తప్పు ఒప్పుకో. శిక్ష తగ్గించేలా చూస్తా’ ఇంటరాగేషన్‌లో భాగంగా ప్రశ్నించాడు సీఐ జయసింహ. ‘సార్! ఈ హత్యకు.. నాకు ఎలాంటి సంబంధం లేదు. నన్ను నమ్మండి. విశాల.. నేనూ ప్రేమించుకున్నాం. మా పెళ్లికి మా ఇంట్లో వాళ్లకెలాంటి అభ్యంతరం లేదు. కానీ విశాల వాళ్ల నాన్న, చిన్నాన్నలకు మాత్రం మేం కలవడం ఇష్టం లేదు.. మేం వాళ్లకన్నా తక్కువ కులం వాళ్లమని! నన్ను మరచిపొమ్మని విశాలను హింసించేవారుట సార్. అంతే కాదు అవసరం అయితే నన్ను లేపేస్తామని కూడా బెదిరించారుట. తనే చెప్పింది ఈ విషయాలన్నీ’ కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పాడు ‘మరైతే ఆ రోజు సాయంత్రం దుర్గారావు పొలం దగ్గర నువ్వెందుకు ఉన్నావ్?’ అనుమానంగా సీఐ. ‘సార్, ఆ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు నన్ను, వాళ్ల పొలం దగ్గర కలుసుకొమ్మని కబురు పంపింది విశాల. నేను అక్కడికి వెళ్లగానే నా దగ్గరకు వచ్చి .. వెంటనే నన్ను అక్కడ నుండి వెళ్లిపొమ్మంటూ ఏడ్చింది. లేకపోతే వాళ్ల బాబాయ్ నన్ను చంపేస్తాడని అక్కడే దూరంగా ఉన్న తన బాబాయ్‌ని చూపిస్తూ చెప్పింది సార్. నాకేం అర్థంకాక అయోమయంగా అక్కడ నుండి వెళ్లిపోయాను’ చెప్పాడు గోపాల్. ‘మరి ఊర్లోంచి ఎందుకు పారిపోయావ్?’ కొంచెం వెటకారంగా అడిగాడు సీఐ. ‘నేను ఇంటికి చేరిన కాసేపటికే విశాల చనిపోయినట్టు తెలిసింది. అది హత్యనీ.. ఆ హత్య నేనే చేశానని ఊర్లో పుకారు పుట్టడంతో వణికిపోయాను. విశాల ఇంట్లో వాళ్లు నన్ను చంపేస్తారనీ.. అలాగని నన్ను ఒంటరిగా పంపిస్తే నేను ఏ అఘాయిత్యానికి ఒడిగడతానోనని భయపడి మావాళ్లు నాకు ఓ మనిషిని తోడిచ్చి అప్పటికప్పుడు విజయనగరం పంపేశారు సార్’ బెదురుతూ చెప్పాడు గోపాల్. గోపాల్ కళ్లల్లోకే సూటిగా చూస్తూ ‘గౌరీపతిని పిలిపించండి’ అంటూ కానిస్టేబుల్స్‌కు ఆర్డర్ వేశాడు సీఐ. ∙∙ ‘మిస్టర్ గౌరీపతీ! విశాలను నూతిలోకి తోసి చంపింది నువ్వేనని బలమైన ఆధారాలు ఉన్నాయి’ అంటూ ఓ బాణం వేశాడు సీఐ జయసింహ. ‘ఏంటి సార్ మీరు మాట్లాడేది? మా పిల్లను నేను ఎందుకు చంపుతాను?’ ఆశ్చర్యపోయాడు గౌరీపతి. ‘ఎందుకంటే, ఆ గోపాల్‌ను విశాల పెళ్లి చేసుకుంటే మీ అమ్మాయికి పెళ్లి సంబంధాలు రావనీ.. ఆమె చనిపోతే మీ అన్నగారి ఆస్తికి నువ్వే వారసుడివి కావచ్చనీ’ అన్నాడు సీఐ క్రీగంట గౌరీపతి హావభావాలను కనిపెడుతూ. ‘సార్! మీరేమైనా అనుకోండి.. నేను చెప్పింది మాత్రం నిజం. ఆ రోజు వాళ్లిద్దరినీ చూశాను. గోపాల్ పారిపోయాడు. విశాల నూతిలో పడుంది’ జరిగిన విషయం మరోసారి చెప్పాడు గౌరీపతి. ‘పోనీ మీ అన్నగారు ఎవరైనా కిరాయి మనుషులతో..’ అడగబోతున్న సీఐతో ‘సార్, అవసరం అయితే ఆ గోపాల్ గాడిని లేపేస్తాం కానీ, సొంత బిడ్డను చంపుకుంటామా సార్? ఇదంతా ఆ గోపాల్ గాడు చేసిందే సార్’ కరాఖండీగా చెప్పాడు గౌరీపతి. ‘సరే.. నిజానిజాలను త్వరలోనే నిగ్గు తేలుస్తాం కానీ మీరు మాత్రం మాకు చెప్పకుండా ఈ పొలిమేర దాటకూడదు’ అంటూ స్టేషన్ బయటకు నడిచాడు సీఐ. ∙∙ తన గుమ్మంలో సీఐని చూసిన దుర్గారావు.. ‘సార్, నా కూతుర్ని చంపిన ఆ గోపాల్ గాడిని వదలకండి సార్’ అంటూ బిగ్గరగా ఏడవడం మొదలెట్టాడు. ‘నీ దొంగ ఏడుపు ఆపు మిస్టర్ దుర్గారావ్. మీ విశాల.. గోపాల్‌ను ప్రేమించడం ఇష్టం లేని నువ్వు, ఆ అమ్మాయిని కిరాయి గూండాల చేత నూతిలోకి తోసేయించావని మీ తమ్ముడు వాంగ్మూలం ఇచ్చాడు. అందుకే, హత్యా నేరం కింద నిన్ను అదుపులోకి తీసుకుంటున్నాం’ చెప్పాడు సీఐ. ‘సార్! మా అమ్మాయిని నేను చంపుకోవడమేంటి సార్! ఆ గోపాల్ గాడే..’ చెప్పబోతున్న దుర్గారావుతో.. ‘స్టాపిట్, ఈ విషయాలన్నిటినీ విశాల ఓ లెటర్లో రాసింది. అది దొరికితే ప్రమాదమని ఆ ఉత్తరాన్ని దాచేశావ్’ అంటూ కానిస్టేబుళ్ల సహాయంతో దుర్గారావును స్టేషన్‌కు తీసుకెళ్లాడు సీఐ జయసింహ. ∙∙ ‘గుడ్ మిస్టర్ జయసింహ! ఆ విశాల మర్డర్ కేసు సాల్వ్ చేశావుట. ఇంతకీ హంతకుడు ఎవరు? గోపాలా లేక గౌరీపతా?’ అడిగారు స్టేషన్‌కు వచ్చిన డీఎస్పీ రంగనాథ్. ‘వాళ్లెవరూ కాదు సార్. అసలు ఇది హత్య కాదు, ఆత్మహత్య’ కూల్‌గా చెప్పాడు సీఐ. ‘వ్వాట్.. ఎలా కనిపెట్టావ్?’ అనుమానంగా అడిగారు డీఎస్పీ. ‘సార్! ఆ రోజు సీన్ ఆఫ్ అఫెన్స్ చూడగానే నాకు అనుమానం వచ్చింది ఇది హత్య కాకపోయుండొచ్చని. ఎందుకంటే నూతి దగ్గరున్న మట్టినేల మీద పెనుగులాట జరిగినట్లు ఆనవాళ్లు కానీ.. వేరే పాదముద్రలు కానీ లేవు. ఆమె ధరించిన జోళ్లు ఆ పాక దగ్గర నీట్‌గా పెట్టున్నాయి. అంతేకాదు నూతి గట్టు మీద విశాల పాదముద్రలున్నాయి. హత్య చేసినవాడు ఆమెను నూతిలోకి తోసేస్తాడు కానీ ఆమెను గట్టు మీద నిలబెట్టి తర్వాత నూతిలోకి తొయ్యడు కదా? విశాలే నూతి గట్టు మీద నిలబడి లోపలికి దూకి ఆత్మహత్య చేసుకుందని నా పరిశీలనలో తేలింది. అయితే ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకోవడం కోసమే ఈ ఇంటరాగేషన్ చేయవలసి వచ్చింది సార్’ అంటూ మొత్తం విచారణా వివరాలు డీఎస్పీకి వివరించసాగాడు సీఐ జయసింహ. ‘సార్, గోపాల్‌తో ప్రేమ వ్యవహారాలు మానేయమని, తమ కుటుంబం పరువు కాపాడమని లేకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానని కూతురిని చాలాసార్లు బెదిరించాడు దుర్గారావు. కానీ విశాల.. గోపాల్‌కు దూరం కాలేకపోయింది. ఆమె చనిపోయే రోజు ఉదయం.. తన తండ్రి, బాబాయ్‌లు.. గోపాల్‌ను హత్యచేసే విషయం గురించి మాట్లాడుకున్న మాటలను ఆమె రహస్యంగా విన్నది. వెంటనే ఓ స్థిర నిర్ణయానికి వచ్చి ఇదిగో ఈ లెటర్ రాసిపెట్టి ఆత్మహత్య చేసుకుంది’ అంటూ టేబుల్ మీదున్న ఫైల్లోంచి ఓ లెటర్ తీసి డీఎస్పీకిచ్చాడు సీఐ జయసింహ. తను గోపాల్ లేకుండా బతకలేనని, అలాగని గోపాల్‌తో తను వెళ్లిపోతే తన తండ్రి, బాబాయ్‌లు పొందే అవమానాన్నీ తాను భరించలేనని, తన తండ్రి, బాబాయ్‌లు కలసి గోపాల్‌ను చంపాలని వేసుకున్న ప్లాన్‌ను తాను రహస్యంగా విన్నానని, గోపాల్ చాలా మంచివాడని, అతన్ని ఏం చేయొద్దని వేడుకుంటూ, ఈ సమస్యకు పరిష్కారం తన చావొక్కటేనని.. అందుకే నూతిలో దూకి ఆత్మహత్య చేసుకోబోతున్నాని.. విశాల రాసిన ఆ సూసైడ్ నోట్ సారాంశం. ‘ఆ ఉత్తరం దుర్గారావు కంటబడేటప్పటికే విశాల నూతిలో శవమై పడి ఉందని, గోపాల్ పారిపోయాడనీ తన తమ్ముడు పంపిన సమాచారం అందింది. ఉక్రోషంతో ఊగిపోయాడు దుర్గారావు. అతనిలోని రాక్షసుడు మేల్కొన్నాడు. తన కూతురు చావుకు కారణమైన ఆ గోపాల్ మీద కక్ష తీర్చుకోవడానికి అదే మంచి సమయమని భావించాడు. ఈ ఆత్మహత్యని గోపాల్ చేసిన హత్యగా చిత్రీకరించి అతడిని కటకటాల పాలు చెయ్యాలనుకున్నాడు. ఆలెటర్ ఎవరికీ కనబడకుండా దాచేశాడు. యామై కరెక్ట్ మిస్టర్ జయసింహ?’ అడిగారు డీఎస్పీ రంగనాథ్. ‘కరెక్ట్ సార్. ఇదే విషయం దుర్గారావు కూడా చెప్పాడు నా విచారణలో’ డీఎస్పీ కన్‌క్లూజన్‌కు ఆశ్చర్యపోతూ అన్నాడు సీఐ. ‘ఓకే బాగానే ఉంది కానీ అసలు విశాల ఆ లెటర్ రాసుంటుందని నీకు ఎలా తెలిసింది?’ అడిగాడు డీఎస్పీ కుతూహలంగా. ‘సార్, విశాలది ఆత్మహత్య అయి ఉండొచ్చన్న అనుమానం వచ్చిన వెంటనే.. అదే రోజు రాత్రి వాళ్లింటికి వెళ్లి విశాల గదిని పరిశీలించాను. టేబుల్ మీద పెట్టున్న స్క్రిబ్లింగ్ పాడ్, బాల్ పెన్నుల మీద నా కన్ను పడింది. అసలు అవి అక్కడ ఎందుకున్నాయన్న అనుమానం వచ్చి, ఆ పాడ్‌లోని మొదటి పేజీ చూడగానే, దాని ముందు పేజీ మీద బాల్‌పెన్‌తో గట్టిగా రాసిన అక్షరాల తాలూకు ఇంప్రెషన్స్ కనపడ్డాయి. నా అనుమానం నిజమయింది. అయితే ఆ లెటర్లో ఏముంది? ఆ లెటర్ ఎక్కడుంది? అసలు ఇది ఆత్మహత్య అని నిరూపించడం ఎలాగో రాబట్టడం కోసమే ఇంత టైమ్ పట్టింది సార్’ తన పరిశోధన వివరాలు చెప్పాడు సీఐ జయసింహ. ‘అయితే ఆ లెటర్ దుర్గారావు దగ్గరుందని నీకు తెలియదు, అలాగే గౌరీపతి అన్నీ చెప్పేశాడని అతడిని జస్ట్ భయపెట్టావ్ అంతేనా?’ అడిగారు డీఎస్పీ. ‘ఔను సార్’ నవ్వుతూ చెప్పాడు సీఐ జయసింహ. చదవండి: కథ: అద్దం.. అప్పుడు అసహ్యంగా కనిపించింది.. ఇప్పుడేమో! కథలో అయినా.. నిజ జీవితమైనా ఆత్మహత్య ఏ సమస్యకు పరిష్కారం కాదు.. తీవ్రమైన నిర్ణయం తీసుకునే ముందు ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
క్రైమ్ స్టోరీ: క్లూస్... కాల్చిపారేసిన చుట్టముక్క.. ఊహించని ట్విస్ట్!
రాత్రి.. పది గంటలు.. బయట జోరుగా వర్షం కురుస్తోంది.. తన ఫ్లాట్‌లో విస్కీ తాగుతూ హాలీవుడ్ మూవీ చూస్తున్నాడు శ్రీకర్. ఇంతలో సెల్ ఫోన్ రింగ్ అవటంతో తీసి ‘హలో’ అన్నాడు. ‘మిస్టర్ శ్రీకర్ ఫారెన్ క్లయింట్స్‌కు సంబధించిన సర్వర్‌లో ఏదో టెక్నికల్ ఇష్యూ వచ్చిందంట. నువ్వు వెంటనే ఆఫీస్‌కు వెళ్ళి ఇష్యూ సాల్వ్ చేయి’ చెప్పాడు బాస్ వరుణ్. ‘సార్.. బయట బాగా వర్షం పడుతోంది. ఈ టైమ్ లో...’ అంటూ నసిగాడు శ్రీకర్. ‘నో మోర్ డిస్కషన్స్. డూ వాట్ ఐ సే. కావాలంటే నైట్ సిఫ్ట్లో వున్న షీలా కూడా నీకు హెల్ప్ చేస్తుంది. ఆఫీస్‌కు వెళ్ళి నాకు ఇన్ఫామ్ చేయి’ అంటూ ఫోన్ కట్ చేశాడు వరుణ్. చేసేది లేక వెంటనే ఆఫీస్‌కు బయలు దేరాడు శ్రీకర్. ఇష్యూ సాల్వ్చేసి తెల్లవారు జామున సుమారు మూడు గంటల ప్రాంతంలో తిరిగి ఫ్లాట్‌కు చేరుకొని అలసటగా బెడ్ మీద వాలిపోయాడు. ∙∙ రాత్రి డెల్టా ఐటీ సొల్యుషన్స్‌లో జరిగిన షీలా మర్డర్ విషయం తెలుసుకున్న ఇన్స్పెక్టర్ వంశీ తన సిబ్బందితో హత్య జరిగిన ప్రదేశానికి చేరుకున్నాడు. ‘సార్ నా పేరు మురళి. పొద్దున ఐదున్నర గంటలకు నేను డ్యూటీ ఎక్కాను. నైట్ డ్యూటీ వాచ్‌మన్ సైదయ్యను పంపించి ఆఫీస్ అంతా ఒకసారి చెక్ చేస్తుంటే కారిడార్‌లో షీలా మేడమ్ శవం కనిపించింది. వెంటనే మీకు ఫోన్ చేశాను సార్’ చెప్పాడు వాచ్‌మన్ మురళి. ‘నైట్.. ఆఫీస్‌లో ఎవరెవరు వున్నారు?’ అడిగాడు ఇన్స్పెక్టర్ వంశీ. ‘ఎంట్రీ బుక్‌లో రాత్రి పది గంటలకు షీలా మేడమ్ వచ్చిన తర్వాత , పదకొండు గంటలప్పుడు శ్రీకర్ సార్ వచ్చి .. మళ్ళీ తెల్లవారు జమున రెండున్నర టైమ్‌లో వెళ్ళిపోయినట్లు వుంది సార్’ చెప్పాడు మురళి ఎంట్రీ బుక్ చూసి. ‘ఆఫీస్ బాస్, మిగతా స్టాఫ్ ముఖ్యంగా శ్రీకర్, సైదయ్య... అందరినీ స్టేషన్‌కు పిలిపించండి’ అని తన సిబ్బందికి చెప్పి క్లూస్‌టీమ్‌తో కలసి ఆఫీస్ చుట్టుపక్కల మెత్తం తిరిగి కొన్ని ముఖ్యమైన ఆధారాలను సేకరించి వుంచుకున్నాడు వంశీ. ఈలోపు.. ‘సార్ స్టాఫ్ మొత్తం స్టేషన్‌కు వచ్చారంట’ అని కానిస్టేబుల్ చెప్పడంతో షీలా బాడీని పోస్ట్ మార్టమ్‌కు పంపించి వంశీ స్టేషన్‌కు చేరుకున్నాడు. మొదట మొత్తం సిబ్బందిని విచారించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకున్నాడు వంశీ. ఇక విచారించవలసిన వాళ్ళు ఆఫీస్బాస్ వరుణ్, శ్రీకర్, సైదయ్య. వాళ్లనూ ఒకరి తర్వాత ఒకరిని విచారణకు లోపలికి పంపించమని కానిస్టేబుల్‌కు పురమాయించాడు వంశీ. ∙∙ ‘మిస్టర్ శ్రీకర్.. మీకు షీలాకు అస్సలు పడేది కాదని.. మీకు రావలసిన ప్రమోషన్ ఆవిడకు వచ్చిందని, అందుకే ఆమె పై మీకు చాలా కోపం వుందని.. దానివల్లనే మీ మధ్య మాటలు కూడా లేవని మీ కొలిగ్స్ చెప్పారు. ఆ అక్కసుతోనే మీరు ఈ మర్డర్ చేశారని అనుకోవచ్చా? ఎందుకంటే ఆ రాత్రి ఆఫీసులో మీరు.. షీలా తప్ప ఇంక ఎవరు లేరు’ అని అడిగాడు వంశీ . ‘సార్.. ప్రమోషన్ నాకు రాలేదన్న బాధ వుంది కానీ దానికోసం మర్డర్ చేసేంత కిరాతకుణ్ని మాత్రం కాదు. ఎందుకో నాకు ఆమె పద్ధతి నచ్చలేదు. అందుకే తనతో మాట్లాడడం మానేశాను. ఆ రోజు రాత్రి నేను ఆఫీస్‌కు వెళ్లినప్పుడు కూడా అసలు తనున్న ఫ్లోర్ క్కూడా వెళ్లలేదు. నా పని నేను పూర్తి చేసుకొని రూమ్‌కు వచ్చేశాను’ చెప్పాడు శ్రీకర్. ఆ మాట విని సైదయ్య వైపు తిరిగి.. ‘చూడు సైదయ్యా.. నవ్వు ఒకసారి షీలా పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకు అందరిముందర ఆమె నిన్ను అవమానించిందన్న కోపంతో నువ్వే ఈ హత్య చేసి వుండొచ్చని మీ ఆఫీసులో కొందరు అనుకుంటున్నారు?’ అనుమానంగా అడిగాడు ఇన్స్పెక్టర్ వంశీ. ‘అయ్యో.. లేదు సార్! తాగిన మైకంలో నేను.. ఆమె పట్ల అలా ప్రవర్తించినందుకు తర్వాత చాలా బాధపడ్డాను. పశ్చాత్తాపంతో ఆరోజు నుంచి తాగుడే మానేశాను సార్. సత్యప్రమాణకంగా నేను ఈ హత్య చేయలేదు సార్’ చెప్పాడు సైదయ్య. ‘సార్ నేను బాస్‌గా వున్న ఆఫీస్‌లో హత్య జరగడం చాలా బాధగా వుంది. ప్లీజ్, మీరు త్వరగా కేస్ సాల్వ్ చేయండి. లేకపోతే మా కంపెనీ ఇమేజ్ దెబ్బ తింటుంది’ అభ్యర్థిస్తున్నట్టుగా వరుణ్. ‘ఓకే వరుణ్‌గారు.. ఒక పెద్ద కంపెనీ బాస్‌గా మీ ఇబ్బందిని అర్థం చేసుకోగలను. కానీ మాకు కొంచెం టైమ్ కావాలి. ఏదైనా అవసరం అనిపిస్తే మళ్లీ మీ ఆఫీస్‌కు వచ్చి కలుస్తాను. మీరు వెళ్ళండి’ అని చెప్పాడు ఇన్స్పెక్టర్ వంశీ. ∙∙∙ షీలా మర్డర్ కేసుకు సంబంధించిన పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్స్ పరిశీలిస్తున్నాడు వంశీ. ఎవరో గొంతు నులిమి చంపేశారు. కానీ చంపిన వాళ్ల వేలి ముద్రలు డెడ్‌బాడీ పై లేవు. రిపోర్ట్‌లో వున్న ఒక ఆసక్తికరమైన అంశం మీద నిలిచిపోయాయి వంశీ చూపులు. డెడ్‌బాడీ తల వెంట్రుకల్లో అక్కడక్కడ కాల్చిన చుట్ట తాలూకు బూడిద వున్నట్లు ఆ రిపోర్ట్‌లో రాసుంది. ఆ పాయింటే వంశీని కాస్త లోతుగా ఆలోచింపచేసింది. హత్య జరిగిన ఆ కారిడార్‌లో ఒక చోట కాల్చిపారేయగా మిగిలిన చుట్టముక్క దొరికితే దాన్ని తీసివుంచాడు వంశీ. ∙∙ ‘హలో మిస్టర్ వరుణ్! షీలాను మర్డర్ చేసిన హంతకుడు దొరికేశాడు. నేను.. నా టీమ్‌తో మీ ఆఫీస్‌కు వస్తున్నాను. అక్కడే అతన్ని అరెస్ట్ చేస్తాను’ చెప్పాడు వంశీ.. వరుణ్‌కి ఫోన్లో. ‘ఒకే సార్ రండి. మేము కూడా వాడు ఎవడాని వెయిట్ చేస్తున్నాం’ అన్నాడు వరుణ్. ∙∙ ‘ఓకే.. అందరికీ ఒకేసారి గుడ్‌బై చెప్పేస్తే మనం స్టేషన్‌కు బయలుదేరదాం’ అన్నాడు వంశీ... వరుణ్‌తో . ఆ మాటకు షాక్ అయ్యి ‘వాట్.. నేను స్టేషన్‌కు రావడం ఏంటి?’ అడిగాడు వరుణ్. ‘యెస్.. మిస్టర్ వరుణ్.. షీలాను మర్డర్ చేసింది తమరే’ చెప్పాడు నింపాదిగా ఇన్స్పెక్టర్ వంశీ. ∙∙ ‘షీలా మర్డర్ కేస్ ఎలా సాల్వ్ చేశారు?’ అడిగారు విలేఖరులు వంశీని. ‘ముందుగా.. షీలా మర్డర్ జరిగిన ప్రదేశంలో ఒక చోట నాకు.. కాల్చిపారేసిన చుట్టముక్క దొరికింది. ప్రతిరోజూ సాయంత్రం ఆరు గంటల ప్రాంతలో ఆఫీస్ అంతా క్లీన్ చేస్తారని తెలిసింది నా ఎంక్వయిరీలో. అలాంటిది ఆఫీస్ కారిడార్‌లో నాకు చుట్టముక్క దొరికిందంటే క్లీన్ చేసిన తర్వాతనే ఎవరో పారేసి వుండాలి. పైగా ఆ చుట్టముక్క చుట్టూ వున్న బూడిద, షీలా తలవెంట్రుకల్లో దొరికిన బూడిద ఒకటే అని నిర్ధారణ అయింది. అంటే దీన్ని బట్టి ఆ చుట్టను తప్పకుండా హంతుకుడే కాల్చి పారేసి వుంటాడన్న ప్రాథమిక నిర్ధారణకు వచ్చాను. ఆఫీస్ వెనుక ప్రాంతంలో బురదను పరిశీలిస్తే నాకు రెండు షూ గుర్తులు కనిపించాయి. గమనించవలసిన విషయం ఏమంటే ఆ రెండు షూ గుర్తులు వేరు వేరు సైజుల్లో వున్నాయి. అంటే హంతకుడి రెండు పాదాల సైజు ఒకటి కాదు. ఆఫీస్ వెనుక ప్రాంతలో చాలాసేపు ఒక కారు రోడ్డు పక్కన పార్క్‌చేసి వుందని అక్కడ వున్న వాళ్ళు చెప్పారు. వీటన్నిటినీ అనుసంధానం చేస్తే వచ్చిన సమాధానమే వరుణ్. నేను మొదటిసారి విచారణ చేసినప్పుడు వరుణ్ పాదాలను గమనించాను. రెండు పాదాలు ఒకే పరిమాణంలో లేవు. చూస్తే చాలు తెలిసిపోయేంత తేడాగా ఉన్నాయి. పైకి మోడర్న్‌గా కనిపించిన వరుణ్‌కు చుట్ట తాగే అలవాటు ఎక్కువ వుందని మాకు ఆ చుట్టలు అమ్మే షాపు అతను చెప్పాడు. ఆఫీస్ వెనుక చాలాసేపు పార్క్ చేసి వుంచిన ఆ కారు నంబర్ ఎంక్వయిరీ చేస్తే అది వరుణ్‌ది అని తేలింది. ఇంకొక ముఖ్య విషయం ఆరోజు శ్రీకర్‌కు వరుణ్ ఫోన్ చేసింది ఆఫీస్ వెనుక నుండే. మేం ఆ సెల్‌ఫోన్ లొకేషన్ కూడా ట్రేస్ చేశాం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్... షీలా డైరీ. దాన్ని మేం... ఆమె వుంటున్న వర్కింగ్ వుమెన్స్ హాస్టల్లో స్వాధీనం చేసుకున్నాం. ఆ డైరీని చదివితే... సదరు వరుణ్ ఆఫీస్‌కు సంబంధించిన చాలా ఇంపార్టెంట్ డేటాను డబ్బుల కోసం ఎవరికి ట్రాన్స్ఫర్ చేశాడో పసిగట్టిన షీలా ... డబ్బుల కోసం అతన్ని బ్లాక్మెయిల్ చేయసాగింది. షీలా నుండి తప్పించుకోవడాని ఆమెను మర్డర్ చేసి ఆ హత్యను శ్రీకర్ మీదకు తోసెయ్యడానికి తెలివిగా అతనిని ఆరోజు ఆఫీస్‌కు రప్పించాడు వరుణ్. దాని కోసం ముందుగానే క్లైంట్స్‌కు సంబంధించిన సర్వర్‌లో కావాలనే ఇష్యూను జనరేట్ చేశాడు. హంతకుడు తన చేతి గ్లోవ్స్‌ను ఆఫీస్ వెనుకున్న కాలనీ కాలువలో పడేశాడు. వాటినీ సంపాదించా. ఇవీ వరుణ్ హంతకుడు అని చెప్పే... మాకు దొరికిన క్లూస్’ అంటూ తన ప్రెస్ మీట్ ముగించాడు ఇన్స్పెక్టర్ వంశీ. చదవండి: కథ: నీలం రంగు రాయి ఉంగరం -
తీగ లాగితే.. డొంక కదలడం అంటే ఇదే
చెక్ బౌన్స్ ఐంది. కేసులో ఇరుక్కున్నాడు స్వామి. రగిలిపోయాడు. తను ప్రలోభపరచినా లొంగక.. తన మీద కేసు పెట్టిన.. రావుని చంపించేయాలని యత్నించాడు. ‘వాడు ఒకే దెబ్బకి చావాలి’ చెప్పాడు. ‘తప్పక సారూ.. నా చేతి కత్తి వాటం చూస్తారుగా’ వాడి వాలకమే కాదు.. వాచకం కూడా భయంకరంగా ఉంది. వాడు సోములు.. కిరాయికి మనుషులను చంపే కర్కోటకుడు! ‘అడ్వాన్స్ కాదు.. పూర్తి మొత్తం ఒకే మారు చెల్లిస్తున్నా’ అంటూ ఒక బ్యాగుని.. సోములుకి అందించాడు స్వామి. బ్యాగులోని డబ్బుని తీసి.. లెక్కించుకున్నాడు సోములు. ‘సరిపోయింది’ అంటూ ఆ డబ్బుని బ్యాగులో సర్దుకున్నాడు. ‘పనితనం చూపు.. చావు తప్పకూడదు’ చెప్పాడు స్వామి. ‘రేపు ఈ పాటికి పనయిపోతుంది’ ధీమా చూపాడు సోములు. ∙∙ మర్నాడు.. గుండె పోటుతో స్వామి చనిపోయాడు. ఈ విషయం తెలిసిన సోములు.. రావు హత్యని విరమించుకున్నాడు! ∙∙ సరిగ్గా పక్షం రోజుల తర్వాత.. శకుంతల హత్య సంచలనం ఐంది. స్వామి భార్య.. శకుంతల.పోలీసులు పరిశోధన చేపట్టారు. ‘మీకు ఎవరి మీదైనా అనుమానాలు ఉన్నాయా?’ ఇన్స్పెక్టర్ అడిగాడు.కృపాకర్ తల అడ్డంగా ఆడించాడు. అతను స్వామి, శకుంతల ఏకైక సంతానం. ‘తలతో కాదు.. మాట్లాడాలి’ ఇన్స్పెక్టర్ వాయిస్ ఫోర్స్‌గా ఉంది. ‘లేదు సార్. అమ్మ మంచిది. విరోధులు ఉండే అవకాశమే లేదు’ మాట్లాడేడు కృపాకర్. ‘మరి.. మీ తండ్రికి విరోధులు ఎవరైనా ఉన్నారా?’ ఇన్స్పెక్టర్ది మరో ప్రశ్న. ‘ఆయన కూడా మంచివారు. ఆయనకి విరోధులు ఉండరు’ కృపాకర్ జవాబు ఇచ్చాడు.విచారణ కొనసాగుతోంది. ∙∙ ఉదయం.. ఇంటి నుంచి స్టేషన్‌కి రాగానే ఇన్స్పెక్టర్.. కృపాకర్‌కి ఫోన్ చేసి పిలిపించాడు. కృపాకర్ వచ్చి.. తన ముందున్న కుర్చీలో కూర్చోగానే.. ‘మీ ఇంటి పరిసరాల్లోని కొన్ని సీసీ కెమెరాల ఫుటేజీలను రాబట్టుకున్నాం. మీ వివరణ కావాలి’ అంటూ.. తన వైపు ఉన్న కంప్యూటర్ మానిటర్‌ను కృపాకర్ వైపు తిప్పాడు ఇన్స్పెక్టర్. ‘ఇతడు మీ ఇంటికి రావడం.. వెళ్లడం జరిగింది’ ఇన్స్పెక్టర్ వ్యాఖ్యానించాడు.. మానిటర్‌లోని విజువల్స్ చూపుతూ. కృపాకర్ వాటిని చూసి తలెత్తాడు. ఇన్‌స్పెక్టర్‌నే చూస్తూ.. ‘ఇతను.. ఇతను ఎవరు? నాకు తెలీదు!’ చెప్పాడు. ఇన్స్పెక్టర్.. మానిటర్‌ను తన వైపు తిప్పేసుకుంటూ..‘వీడు సోములు. కిరాయి గూండా’ చెప్పాడు. కృపాకర్ తలాడించాడు. అది గుర్తించాడు ఇన్స్పెక్టర్. ‘ఇతడు వచ్చిన రోజున మీరు ఇంట్లో లేరా?’ అడిగాడు ఇన్స్పెక్టర్. ‘అదే.. ఆ రోజు ఏ రోజు? ఐనా అతడు నాకు తెలీదు. నేను చూడలేదు’ తంటాలు పడ్డాడు కృపాకర్. ‘మీ అమ్మగారి హత్య జరిగిన రోజు ఫుటేజీలు ఇవి’ ఇన్స్పెక్టర్ చెప్పడం ఆపాడు. ‘నేను క్యాంపులో ఉన్నాను. అమ్మ హత్య కబురు మా ఇంటి వాచ్‌మన్ ఫోన్ చేసి చెబితేనే తెలిసింది. ఎకాఎకీన వచ్చాను. ఆ తర్వాత.. నేను మీకు ఫోన్ చేసి చెప్పాను’ హైరానా పడుతూ చెప్పాడు కృపాకర్. ‘అవునా? మీ ఫోన్ కాల్‌తో మేము వచ్చేక.. అప్పుడు ఈ వివరాలేవీ మీరు చెప్పలేదు’ గుర్తుచేశాడు ఇన్స్పెక్టర్. ‘అవును. అప్పుడు నేను చాలా నెర్వసయ్యి ఉన్నాను. అమ్మ హత్య ఐనట్టే చెప్పగలిగాను’ తడబడ్డాడు కృపాకర్. ‘సరే. పాయింట్‌కి వద్దాం. ఆ రోజు ఏ ఊరు వెళ్లారు?’ అడిగాడు ఇన్స్పెక్టర్. ఆ అడిగే తీరు కృపాకర్లో దడ రేపింది. ‘చెప్పండి’ అదే రీతిని కొనసాగిస్తూ ఇన్స్పెక్టర్. నిమిషం పిమ్మట చెప్పగలిగాడు కృపాకర్. ‘ఎవిడెన్స్ చూపగలరా’ అడిగాడు ఇన్స్పెక్టర్. కృపాకర్ బేలగా మొహంపెట్టాడు. ‘అదే.. టికెట్టు లాంటివి’ ఇన్స్పెక్టర్ క్లూ ఇచ్చాడు. ‘నేను నా కారులో వెళ్లాను’ చెప్పాడు కృపాకర్. ‘వెల్.. అక్కడి మీ స్టే ప్లేసెస్ గురించి.. అక్కడ మీరు కలిసిన వాళ్ల గురించి.. చెప్పండి’ మరో క్లూ ఇచ్చాడు ఇన్స్పెక్టర్. నెమ్మదిగా జవాబు ఇచ్చాడు కృపాకర్. ‘సరే.. మీ ఇంటికి కాపలావాడు.. ఒక్కడేనా’ ప్రశ్నించాడు ఇన్స్పెక్టర్. ‘ఇద్దరు. నైట్ డ్యూటీలో ఒకడు.. డే డ్యూటీలో ఒకడు’ చెప్పాడు కృపాకర్. ‘హత్య కబురు మీకు చెప్పింది ఎవరు?’ ‘డే డ్యూటీ అతను’ ‘వాచ్మెన్ డ్యూటీస్ ఏంటీ?’ టక్కున అడిగాడు ఇన్స్పెక్టర్. ‘గేట్ దగ్గర ఉండి.. లోనికి వచ్చే వారిని వాకబు చేయడం.. కొత్త వాళ్లెవరైనా వస్తే మాకు కబురు చేసి.. మా పర్మిషన్తో వాళ్లను లోపలికి పంపడం.. అంతే’ చెప్పాడు కృపాకర్. ‘మరి.. సోములు మీ ఇంటికి వచ్చినప్పుడు.. వెళ్ళినప్పుడు.. వాచ్‌మన్ గేట్ దగ్గరున్న జాడే ఫుటేజీల్లో లేదే!’ ఆశ్చర్యపడ్డాడు ఇన్స్పెక్టర్. ఆ మాటకు కృపాకర్ తికమక అవడం ఇన్స్పెక్టర్ గుర్తించాడు. వెంటనే ‘మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు’ అని ప్రశ్నించాడు. ‘అమ్మ, నేనే. నాన్న లేరుగా’ తడబడ్డాడు కృపాకర్. ‘ఇంట్లో పనివాళ్లు?’ ‘వంట మనిషి లేదు కానీ.. పనమ్మాయి ఉంది’ చెప్పాడు కృపాకర్. ∙∙ స్వామి వాళ్లింటి కాపలావాళ్లను, పనావిడను స్టేషన్‌కి పిలిపించాడు ఇన్స్పెక్టర్. ‘శకుంతల హత్య కబురును కృపాకర్‌కి ఎవరు చెప్పారు?’ ‘నేనే సార్..’ డే డ్యూటీ వాచ్‌మన్ చెప్పాడు. అతడ్నే చూస్తూ ‘శకుంతల హత్య జరిగిన రోజున నువ్వేనా డ్యూటీలో ఉంది?’ అడిగాడు ఇన్స్పెక్టర్. తలాడించాడు వాచ్‌మన్. ‘నోరు తెరు’ చిరాకుపడ్డాడు ఇన్స్పెక్టర్. ‘యస్సార్. కానీ నేను అప్పుడు అక్కడ లేను. టీ తాగడానికి బయటికి వెళ్లాను. నేను తిరిగి వచ్చి డ్యూటీ ఎక్కేసరికి పని మనిషి వచ్చింది. ఇంట్లోకి వెళ్లిన ఆవిడ.. గాభరాగా తిరిగొచ్చి.. నన్ను ఇంట్లోకి పిల్చుకెళ్లింది. నేను లోపలికి వెళ్లి చూశాకే తెలిసింది.. మేడమ్ హత్య సంగతి. చూడగానే క్యాంపులో ఉన్న చిన్న సార్‌కి ఫోన్ చేశాను’ చెప్పాడు ఆ వాచ్‌మన్. ‘భేష్. నేను అడక్కుండానే చాలా చెప్పావే’ నవ్వేడు ఇన్స్పెక్టర్. తొట్రుపడ్డాడు ఆ వాచ్‌మన్.స్వామి వాళ్లింటి పనావిడను చూస్తూ.. ‘ఆ రోజు పనికి ఎన్ని గంటలకొచ్చావ్? ఆ రోజు ఏం జరిగింది’ అడిగాడు ఇన్స్పెక్టర్. ‘ఎప్పటిలాగే వచ్చాను సర్. ఇంట్లోకెళ్లి చూస్తే హాల్లోగానీ.. కిచెన్లోగానీ అమ్మగారు కనిపించలేదు. అమ్మగారిని పిలుస్తూ తన గదిలోకి వెళ్లా. మంచం మీద పడి ఉన్నారు ఆవిడ. చుట్టూ రక్తం.. భయమేసింది. వచ్చి వాచ్‌మన్‌కి చెప్పి లోపలికి పిల్చుకెళ్లాను. ఇతను అమ్మగారిని చూసి.. చనిపోయారు.. ఎవరో చంపేశారు అన్నాడు’ అంటూ ఆగింది ఆవిడ. తను చూసిన ఫుటేజీలోవి.. పని వాళ్లు చెప్పేవి.. ట్యాలీ అవుతుండడం... కొత్త విషయమేదీ తెలియకపోవడంతో.. ఇన్స్పెక్టర్ దీర్ఘంగా నిట్టూర్చాడు. ఎంక్వయిరీ కొనసాగించాడు. ∙∙ విలేకర్ల సమావేశంలో.. ‘శకుంతల హత్య ముడి విప్పగలిగాం. స్వామి.. చెక్ బౌన్స్ తతంగాన్ని తట్టుకోలేకపోయాడు. దాంతో రావుని హత్య చేయించాలనుకున్నాడు. అందుకు సోములుకు సుపారీ ఇచ్చాడు. ఐదు లక్షల పైకం కూడా చెల్లించేశాడు. రావుని సోములు హత్య చేసేలోగా.. స్వామి చనిపోయాడు. స్వామి మరణం.. ఒక మంచి అదను అనుకున్నాడు రాంశేఖర్. ఇతడు స్వామి వ్యాపార భాగస్వామి. తమ వ్యాపార వాటాల్లో.. భారీ స్థాయి పెట్టుబడులు స్వామివి కావడంతో.. వాటిలో చాలా వరకు ఎలాగైనా చేజిక్కించుకోవాలన్న తలంపులో ఉన్న రాంశేఖర్.. తొలుత రావు ఇష్యూను తనకు వీలుగా వాడుకోవాలనుకున్నాడు. రావును చంపేయమని స్వామిని ఉసికొల్పాడు. అందుకై సోములును స్వామికి పరిచయం చేశాడు. రావు హత్యతో.. స్వామిని జైలు పాలు చేసి.. స్వామిని హైరానా పెట్టి.. తన పేరున పవర్ ఆఫ్ పట్టా పొందాలని అనుకున్నాడు రాంశేఖర్. కానీ స్వామి గుండెపోటుతో చనిపోవడంతో తన ప్లాన్ మార్చుకున్నాడు. రావు హత్య విషయంలో.. స్వామికి, సోములుకి మధ్య జరిగిన బేరసారాలు తెలిసి ఉండడంతో రాంశేఖర్.. సోములును కలిశాడు. రావు బదులు శకుంతలను హత్య చేయమని కోరాడు. అదనంగా మరో మూడు లక్షలు ముట్ట చెప్పాడు కూడా. సోములు.. రాంశేఖర్ సూచనల ప్రకారమే ఇంట్లోకి చొరబడి.. శకుంతలను.. ఆవిడ గదిలోనే హత్య చేసి పోయాడు. ఆ సమయంలో కృపాకర్ క్యాంపులో ఉన్నాడు. స్వామి ఇంటి కాపలావాడు.. రాంశేఖర్ డైరక్షన్ ప్రకారం.. అప్పటికి బయటికి వెళ్లి ఉన్నాడు. శకుంతల హత్య గురించి.. స్వామి ఇంటి కాపలావాడి ఫోన్ కాల్ ద్వారా తెలుసుకున్నాక.. ఆ హత్య కబురును.. ఆ వాచ్‌మన్ చేత.. కృపాకర్‌కి చేరవేయించింది రాంశేఖరే. ఆ వాచ్‌మన్‌కు డబ్బు ఎర వేశాడు. వాచ్‌మన్ ఫోన్‌కాల్ డేటా మూలంగానే రాంశేఖర్ మా దృష్టికి వచ్చాడు. హత్య జరిగిన సాయంకాలం.. కృపాకర్ ఇంటికి వచ్చిన తర్వాత.. అప్పుడే తనకి శకుంతల హత్య వార్త తెలిసినట్టు.. ఊర్లో ఉన్న తాను తక్షణమే తిరిగి వచ్చేసినట్టు నటించాడు రాంశేఖర్. మరి కొద్ది రోజుల్లోనే కృపాకర్ హత్యకూ ప్లాన్ చేసిపెట్టుకున్నాడు.. దానికీ సోములునే పురమాయించాడు రాంశేఖర్. మేము తీగ లాగితే.. డొంక కదిలింది. సంబంధితులందర్నీ పట్టుకున్నాం. తదుపరి చర్యలు చేపట్టాం’ అంటూ ముగించాడు ఇన్స్పెక్టర్. -బివిడి ప్రసాదరావు -
Crime Story: కిలో 70 తులాల బంగారం.. బెడిసి కొట్టిన ప్లాన్.. ఆఖరికి!
‘సార్ బంగారం మీద లోను కావాలి’ అంటూ కో ఆపరేటివ్ బ్యాంకులోని ఫీల్డ్ ఆఫీసర్ ముందు ఒక బ్యాగ్ పెట్టాడు కస్టమర్. ‘బంగారం ఇమ్మంటే సంచీ పెట్టావేంటి?’ అడిగాడు ఫీల్డ్ ఆఫీసర్. ‘అందులో బంగారమే ఉంది’ ఫీల్డ్ ఆఫీసర్ వైపు చూస్తూ అన్నాడు కస్టమర్. ‘ఇంత బంగారమా? మీరు నగల కొట్టుకు వెళ్ళాల్సింది పోయి బ్యాంకుకు వచ్చినట్టున్నారు’ ఆశ్చర్యపోతూ అన్నాడు ఆఫీసర్. ‘బంగారం అమ్మటానికి రాలేదు సార్.. తాకట్టు పెట్టడానికి వచ్చాను’ అన్నాడు. ‘ఎంత కావాలి?’ మాట నొక్కుతూ అన్నాడు. ‘ముప్పై లక్షలు’ చెప్పాడు. ‘ముప్పై లక్షలా? అంత డబ్బు ఈ బ్యాంకులో ఇవ్వరు’ ముఖం అదోలా పెట్టి అన్నాడు. ‘ఆ మాటేదో మీ మేనేజరు చెప్పాలి’ మేనేజరు రూమ్ వైపు చూస్తూ అన్నాడు. ‘మేనేజరు చెప్పినా.. నేను చెప్పినా ఒకటే. ఈ బంగారం తీసుకుపొండి’ అంటూ కస్టమరుకి బ్యాగు ఇవ్వబోయాడు. ‘మీ మేనేజరుని అడిగొస్తాను’ అంటూ మేనేజర్ గదిలోకి వెళ్ళాడు కస్టమర్. ‘ఏం కావాలి? అడిగాడు మేనేజర్. ‘బంగారం మీద డబ్బు ఇమ్మంటే ఫీల్డ్ ఆఫీసర్ ఇవ్వట్లేదు’ చెప్పాడు. ఆ మాట వినగానే ఓసారి తన క్యాబిన్‌కు రమ్మని ఫీల్డ్ ఆఫీసర్‌కి ఫోన్ చేశాడు మేనేజర్. ఫీల్డ్ ఆఫీరసర్ వచ్చీరావడంతోనే ‘బంగరం మీద లోన్ ఇవ్వనన్నారట’ అడిగాడు మేనేజర్. ‘అవును సర్. అతను అడిగింది లక్ష కాదు, రెండు లక్షలు కాదు ఏకంగా ముప్పై లక్షలు. అంత డబ్బు ఎలా ఇస్తాం సర్?’ తన మాట వినకుండా మేనేజర్ని కలిశాడని కస్టమర్ మీద అప్పటికే కొంత అసహనం ఉంది ఫీల్డ్ ఆఫీసర్‌కి. ‘మూర్తిగారూ.. ఇది మార్చి నెల. మన టార్గెట్స్ మనకుంటాయి. డిపాజిట్స్ సేకరించడమే కాదు. ఆ డబ్బు మళ్ళీ లోన్స్ రూపంలో కస్టమర్స్‌కి చేరినప్పుడే బ్యాంకు లాభాలతో నడిచేది. మీకు తెలుసు కదా.. మన బ్రాంచ్కున్న టార్గెట్స్ గురించి! బిజినెస్ విషయంలో మన బ్రాంచ్ ఇప్పటికే వెనకబడి ఉంది. ఈ లోనే కాదు. ముప్పై లక్షల లోపు గోల్డ్ లోన్స్ మరో రెండు మూడు ఇవ్వండి పర్లేదు’ అన్నాడు మేనేజర్. సరే అన్నట్టుగా తలూపుతూ కస్టమర్ వైపు అదోలా చూసి తన సీట్లోకి వెళ్ళిపోయాడు ఫీల్డ్ ఆఫీసర్. బ్యాంక్ మేనేజర్‌కి థ్యాంక్స్ చెప్పి కౌంటరు వైపు నడిచాడు కస్టమర్. అప్పటికే బంగారాన్ని రుద్ది మదింపు చేసి వెయిట్ చూశాడు గోల్డ్ అప్రయిజర్. ‘వంద తులాల నిఖార్సయిన బంగారం సార్’ ఫీల్డ్ ఆఫీసర్‌తో చెప్పాడు అప్రయిజర్. అరగంట తర్వాత ముప్పై లక్షలు కస్టమర్ చేతికిస్తూ ‘వడ్డీ నెల నెలా కట్టేయాలి. కట్టకపోతే సంవత్సరం చివర్లో బంగారం వేలం వేసేస్తాం’ చిరాగ్గా చెప్పాడు ఫీల్డ్ ఆఫీసర్. ‘ఎప్పుడు ఏది కట్టాలో మాకు తెలుసండి. మీరు చెప్పేదాక తెచ్చుకోం’ అంటూ డబ్బు బ్యాగులో వేసుకుని అక్కడ నుండి బయటకు వెళ్ళిపోయాడు కస్టమర్. ఆలోపే ఏజీఎం నుంచి ఫోన్ మేనేజర్‌కు.. ‘మీ టార్గెట్ ఇంకా కోటి రూపాయలు మిగిలే ఉంది. ఎలా పూర్తి చేస్తారో నాకు తెలీదు. నెలాఖరు లోపు టార్గెట్ పూర్తి చేయాలి’ అంటూ. ∙∙ ఇరవై రోజుల తర్వాత మరో కస్టమర్ బంగారం మీద లోన్ కావాలని బ్యాంక్ మేనేజర్ దగ్గర కొచ్చాడు. సమయానికి నాకోసమే వచ్చాడని మనసులో అనుకుంటూ ‘ఎంత కావాల’ని కస్టమర్‌ని అడిగాడు మేనేజర్. ‘ఇరవై లక్షలు’ అనగానే ఎగిరి గంతేసినంత పని చేశాడు మేనేజర్. వెంటనే కస్టమర్‌ని ఫీల్డ్ ఆఫీసర్ దగ్గరకు పంపించాడు మేనేజర్. కస్టమర్ తెచ్చిన డెబ్బై తులాల బంగారాన్ని అప్రయిజర్‌తో చెక్ చేయించి, ఫార్మాలిటీస్ పూర్తిచేసి కస్టమర్‌కు ఇరవై లక్షల రూపాయలు ఇచ్చాడు ఫీల్డ్ ఆఫీసర్. ‘పచ్చ నోట్లు తళ తళ మెరిసిపోతున్నాయి అచ్చం బంగారంలాగే’ నవ్వుకుంటూ డబ్బు అందుకుని కళ్ళకద్దుకున్నాడు కస్టమర్. ‘వస్తాను సార్’ బ్యాంక్ మేనేజరుకూ థ్యాంక్స్ చెప్పి అక్కడ నుండి బయలుదేరాడు కస్టమర్. ∙∙ సాయంత్రం ఆరయింది. స్టాఫ్ తప్ప బ్యాంకులో జనం లేరు. మేనేజర్ ఫైల్స్ మీద సంతకాలు చేస్తున్నాడు. ఫీల్డ్ ఆఫీసర్ కంప్యూటర్ ముందు బిజీగా ఉన్నాడు. గ్రిల్ గేటు లోపల సెక్యూరిటీ గార్డ్ నుంచుని ఉన్నాడు. బ్యాంకు ఉన్న ప్రాంతం బాగా బిజీ సెంటర్. జనంతో ఎప్పుడూ కిట కిటలాడుతుంటుంది. ఇంతలో ఓ కారొచ్చి బ్యాంకు ముందు ఆగింది. ఇద్దరు వ్యక్తులు కారులోంచి దిగి బ్యాంకు వైపు నడిచారు. ‘ఎవరు కావాలి?’ అంటూ వాళ్లను గ్రిల్ గేట్ దగ్గర ఆపాడు సెక్యూరిటీ గార్డ్. ‘మేనేజర్ని కలవాలి’ చెప్పాడు అందులో ఒకడు. ‘ఈటైమ్‌లో కలవడం కుదరదు. మేనేజర్ బిజీగా ఉన్నారు. ఇంతకీ అపాయింట్మెంట్ ఉందా?’ అడిగాడు. ‘అపాయింట్మెంట్ లేదు పాడు లేదు’ అంటూ పక్కకు తోసేసి సెక్యూరిటీ గార్డు నోటికి ప్లాస్టర్ అంటించి కదలకుండా కాళ్ళు చేతులు కట్టేశారు. పనుల్లో పడిన బ్యాంకు స్టాఫ్ ఈ సంఘటన గమనించలేదు. మంకీ క్యాప్స్ ధరించి ముందుగా సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు ఆగంతుకులు. కత్తులు పట్టుకుని ఎదురుగా వస్తున్న ఆగంతుకుల్ని చూసిన మేనేజర్ విఠల్ ప్రసాద్ భయంతో ‘సెక్యూరిటీ ’ అంటూ కేకేశాడు. మేనేజర్ కేక విన్న ఫీల్డ్ ఆఫీసర్ తన గది నుండి లేచేలోపు ఒకరు మేనేజర్ గదిలోకి, మరొకరు ఫీల్డ్ ఆఫీసర్ గదిలోకి వెళ్ళి కత్తులతో వాళ్ళను బెదిరించారు. ‘ఎవరు మీరు?’ అనేలోపు ‘డబ్బు, బంగారం ఎక్కడుందో చెప్పండి’ అంటూ మేనేజర్, ఫీల్డ్ ఆఫీసర్ మెడల మీద కత్తులు దూయబోయారు. వాళ్ళ చర్యలకు భయపడి లాకర్లను ఓపెన్ చేశాడు ఫీల్డ్ ఆఫీసర్. లాకర్లలో ఉన్న డబ్బు, బంగారం చూసేసరికి ఆగంతుకుల కళ్ళు ఆనందంతో తళతళా మెరిసిపోయాయి. లాకర్లలో ఉన్న లక్షల కొద్ది డబ్బు, వందల తులాల బంగారం తమతో తెచ్చిన బ్యాగుల్లో సర్దుకున్నారు ఆగంతుకులు. అక్కడున్న ఫోన్ కనెక్షన్లు, వాళ్ళ దగ్గరున్న సెల్ ఫోన్లు స్వాధీనం చేసున్నారు. వాళ్ళను అక్కడ వదిలి తలుపులు వేసేసి హడావుడిగా కార్లో వెళ్ళిపోయారు ఆ ఆగంతుకులు. వాళ్లు వెళ్ళిపోయాక గేటు దగ్గర పడున్న సెక్యూరిటీ గార్డు పరిస్థితి చూసిన ఫీల్డ్ ఆఫీసర్.. అతని కాళ్లు, చేతులకున్న కట్లన్నీ విప్పాడు. టేబుల్ సొరుగులో ఉన్న తన పర్సనల్ సెల్ ఫోన్ తీసి పోలీసులకు ఫోన్ చేసి బ్యాంకులో జరిగిన దోపిడీ గురించి చెప్పాడు మెనేజర్ విఠల్ ప్రసాద్. ‘ఇలా జరుగుతుందని అనుకోలేదు. వెపన్డ్ సెక్యూరిటీని పెట్టకపోవడం ఒక విధంగా తప్పే. సెంటర్లో ఉన్న బ్యాంకులో ఇలా రాబరీ జరుగుతుందని ఎవ్వరం ఊహించం. తప్పు జరిగిపోయింది. ఇంతకీ దొంగలు దొరికితే సరే. లేదంటే బ్యాంకుకి కోలుకోలేని నష్టం’ ఫీల్డ్ ఆఫీసర్ ముందు వాపోయాడు బ్యాంకు మేనేజర్. మేనేజర్ నుండి ఫోన్ రాగానే హడావుడిగా క్లూస్ టీమ్‌తో బ్యాంకుకి చేరుకున్నారు పోలీసులు. బయట నుంచి పెట్టిన బోల్ట్తీసి బ్యాంకులోకి ప్రవేశించారు. బ్యాంకు లోపల పరిసరాలన్నీ గమనించారు. ఖాళీగా ఉన్న లాకర్లు, పాడయిన సీసీ కెమెరాలు, కట్ చేసిన ఫోన్ కనెక్షన్లు అన్నీ నిశితంగా పరిశీలించారు. ‘దొంగలు రావడం ముందుగా ఎవరు చూశారు?’ బ్యాంక్ మేనేజర్ని అడిగాడు ఎస్సై రఘువీర్. ‘నేనే చూశాను సార్. అప్పటికే వాళ్ళు ముసుగులు ధరించి ఉన్నారు’ సెక్యూరిటీ గార్డ్ చెప్పాడు. ‘బ్యాంకులోకి వచ్చే ముందు వాళ్ళు నీతో ఏమని చెప్పారు?’ అడిగాడు. ‘మేనేజర్ని కలవాలని చెప్పారు. అపాయింట్మెంట్ ఉందా? అని అడిగాను. అంతే నోటికి ప్లాస్టర్ వేసి కాళ్ళు చేతులు కట్టేసి నన్ను ఓ మూలన పడేశారు సార్’ అక్కడ జరిగింది చెప్పాడు సెక్యూరిటీ గార్డ్. ‘తర్వాత నా గదిలోకి, ఫీల్డ్ ఆఫీసర్ గదిలోకి చెరొకరు వచ్చి కత్తులు చూపించి మమ్మల్ని బెదిరించి లాకర్లు ఓపెన్ చేయించి డబ్బు, బంగారం దోచుకుపోయారు’ మేనేజర్ విఠల్ ప్రసాద్ వివరంగా చెప్పాడు. ‘ఇంత బిజీ సెంటర్లో రాబరీ చేశారంటే ఇది అంతర్రాష్ట్ర దొంగల ముఠా పనే అయ్యుంటుంది. వాళ్ళు ఏ భాషలో మాట్లాడారు?’ అడిగాడు ఎస్సై. ‘తెలుగులోనే’ చెప్పాడు మేనేజర్. క్లూస్ టీమ్ ఫొటోలు.. లాకర్స్ మీదున్న వేలి ముద్రలు తీసుకున్నాక.. మేనేజర్ నుండి కంప్లయింటు తీసుకుని తన టీమ్‌తో అక్కడ నుండి జీపులో బయలుదేరాడు ఎస్సై రఘువీర్. మరునాడు ఉదయమే బ్యాంకుకి వచ్చాడు. బ్యాంకుకి ఎదురుగా ఉన్న షాపింగ్ మాల్ సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలించాడు. ముందురోజు సాయంత్రం ఆరు నుండి ఏడు గంటల మధ్య సీసీ ఫుటేజ్ చూస్తుండగా ఇద్దరు వ్యక్తులు ఆ సమయంలో బ్యాంకులోకి వెళ్తున్న దృశ్యం దగ్గర పాజ్ చేశాడు ఎస్సై. బ్యాంకు గేటు ముందుకు రాగానే వాళ్ళు ముసుగులు ధరించారు. ‘వాళ్ళే సర్ బ్యాంకులో దొంగతనం చేసింది’ సీసీ కెమెరా వైపు చూస్తూ అన్నాడు సెక్యూరిటీ గార్డ్. ‘కొన్నాళ్ళ క్రితం వీళ్ళిద్దరూ మా బ్యాంకులో బంగారం కూడా తాకట్టు పెట్టారు’ అంటూ ఫీల్డ్ ఆఫీసర్ చెప్పాడు. ‘ఇదంతా చూస్తుంటే ఇదేదో పెద్ద పథకంలా ఉంది. డొంక లాగితే దొంగలెవరో దొరలెవరో తెలుస్తుంది’ అని ఎస్సై అనగానే ‘ఎస్సైగారూ.. నా సెల్ ఫోన్ మీ దగ్గర ఉండిపోయింది’ అంటూ గుర్తు చేశాడు మేనేజర్. ‘మా ఇన్వెస్టిగేషన్ ఇంకా మొదలవందే! ఇన్వెస్టిగేషన్ పూర్తి అయ్యాక అప్పుడు ఫోన్ మీ చేతికొస్తుంది’ అంటూ ఎస్సై రఘువీర్ అక్కడ నుండి బయలుదేరాడు. స్టేషన్లో ఉన్నప్పుడు మేనేజర్ సెల్ ఫోన్‌కి కాల్ రాగానే ఫోన్ ఆన్ చేశాడు ఎస్సై రఘువీర్. ‘మేనేజర్ గారు.. మన ప్లాన్ సూపర్ సక్సెస్. బ్యాంకు రాబరీ కేసు కింద పోలీసులు కేసు రాసుకుంటారు. మీ చేతికి మట్టి అంటకుండా భలే నాటకమాడారు. బంగారం, డబ్బు భద్రంగా నా దగ్గరే ఉన్నాయి. మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం’ అంటూ అవతల వ్యక్తి ఫోన్ కట్ చేశాడు. ఎస్సై రఘువీర్‌కి విషయమంతా అర్థమైంది. ఇంతకు ముందు ఫోన్ చేసిన వ్యక్తి, బ్యాంక్ మేనేజర్ సెల్‌కి చాలా సార్లు ఫోన్ చేసినట్టు కాల్ హిస్టరీ చూపిస్తోంది. కాల్ సెంటర్ నుండి ఆ వ్యక్తి అడ్రస్ తీసుకుని అతని ఇంటికి వెళ్ళాడు ఎస్సై. ‘యు ఆర్ అండర్ అరెస్ట్’ అంటూ ఎస్సై అనగానే అతన్ని తీసుకొచ్చి జీపులో పడేశాడు కానిస్టేబుల్. ‘నన్ను ఎందుకు అరెస్ట్ చేశారు సార్’ అడిగాడు అవతల వ్యక్తి. ‘బ్యాంకు రాబరీ కేసులో’ చెప్పాడు. ‘ఆ దొంగతనానికి నాకు ఏంటి సర్ సంబంధం?’ అమాయకంగా ప్రశ్నించాడు. ‘సీసీ ఫుటేజ్ చూస్తే తెలుస్తుంది’ బదులిస్తూ పొమ్మని జీప్ డ్రైవర్‌కు సైగ చేశాడు ఎస్సై. ‘ఆరోజు నీతోపాటు ఉన్న రెండో వ్యక్తి ఎక్కడ?’ అంటూ స్టేషన్‌కు రాగానే ఇంటరాగేషన్ మొదలుపెట్టాడు ఎస్సై. ఏదో అడ్రస్ చెప్పాడు ఆ వ్యక్తి. అతను చెప్పిన అడ్రస్‌కి వెళ్ళి రెండో వ్యక్తిని పోలీస్ స్టేషనుకి తీసుకొచ్చారు ఇద్దరు కానిస్టేబుళ్లు. వాళ్ళిద్దరి నుండి మొత్తం సమాచారంతో పాటు పోయిన బంగారం, డబ్బూ రాబట్టాడు ఎస్సై రఘువీర్. ∙∙ పోలీస్ జీప్ బ్యాంక్ ముందు ఆగింది. లోపలకు వస్తున్న ఎస్సైని చూసి ‘రండి.. రండి.. దొంగలు దొరికారా సార్?’ అంటూ పలకరిస్తూ ప్రశ్నించాడు బ్యాంక్ మేనేజర్. ‘దొరికారు. ఒకసారి స్టేషనుకి వస్తే విషయాలన్నీ మాట్లాడుకుందాం’ అని జవాబిస్తూ పక్కనే ఉన్న ఫీల్డ్ ఆఫీసర్ని చూసి ‘మీరూ రావాలి’ చెప్పాడు ఎస్సై రఘువీర్. ఎస్సైతోపాటు అందరూ స్టేషనుకి బయలుదేరారు. ‘దొంగలెక్కడ?’ స్టేషనుకి చేరుకోగానే అటూ ఇటూ చూస్తూ ఆత్రంగా ఎస్సైని అడిగాడు బ్యాంకు మేనేజర్. ‘డ్రామాలు ఆపి ఇప్పుడు చెప్పండి. ఈ దొంగతనం మీరే కదా చేయించారు?’ మేనేజర్ వైపు కోపంగా చూస్తూ అన్నాడు ఎస్సై. ఆ మాటలు విని ఫీల్డ్ ఆఫీసర్ ఆశ్చర్యపోయాడు. ‘అదేంటి అలా మాట్లాడుతున్నారు? దొంగతనం నేను చేయించడమేంటి?’ ఎదురు ప్రశ్న వేశాడు మేనేజర్. ఇంతలో పక్క గదిలోంచి ఇద్దరు దొంగలతోపాటు గోల్డ్ అప్రయిజర్ అక్కడకు రావడం చూసి కంగు తిన్నాడు మేనేజర్. ‘ఈపని మీరెందుకు చేశారు?’ దొంగల్ని అడిగాడు ఎస్సై. ‘దొంగ బంగారం మాకిచ్చి ఆ బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టమన్నదే కాక, బ్యాంకులో దొంగతనం కూడా చేయమన్నది మేనేజర్గారే సార్. అందుకు మా ఇద్దరికీ చెరో మూడేసి లక్షలు ఇచ్చారు’ చెప్పాడు అందులో ఒక దొంగ. ‘దొంగ బంగారాన్ని మంచి బంగారంగా విలువ కడితే నాకు లక్ష రూపాయలిస్తామని మేనేజర్‌గారు చెబితే ఈపని నేను చేశాను సార్’ అప్రయిజర్ తన నేరాన్ని ఒప్పుకున్నాడు. మేనేజర్ ఇంత దారుణానికి ఒడిగడతారని ఫీల్డ్ ఆఫీసర్ ఊహించలేదు. ‘అప్పటికీ మేనేజర్‌తో చెప్పాను సార్.. బంగారం మీద ముప్పై లక్షలు అప్పు ఎలా ఇస్తామని? ఇప్పుడు తెలిసింది మేనేజర్‌గారి ఆలోచన ఏమిటో’ అన్నాడు ఫీల్డ్ ఆఫీసర్. ‘ఈ రాబరీ ప్లాన్ ఎందుకు వేశారు?’ ఎస్సై ప్రశ్నకి బదులిచ్చాడు మేనేజర్. ‘దొంగ బంగారం పెట్టి లోన్ తీసుకుని మళ్ళీ లోన్ కట్టేద్దామనుకునే లోపు బ్యాంకు ఆడిట్ జరగబోతోందని తెలిసింది. ఆడిట్ జరిగితే ఎక్కడ బంగారం విషయం బయట పడుతుందోనని భయపడి ఈ ప్లాన్ చేశాను. తప్పంతా నాదే’ తన నేరాన్ని ఒప్పుకున్నాడు మేనేజర్. ‘గోల్డ్ లోన్ కింద తీసుకున్న డబ్బు ఏం చేశారు?’ ‘విజయవాడలో ల్యాండ్ కొన్నాను’ చెప్పాడు మేనేజర్. ‘బ్యాంక్ మేనేజర్‌గా పనిచేస్తూ బ్యాంకుకే కన్నం వేసే మీలాంటి వాళ్ళకు ఎంత పెద్ద శిక్ష వేసినా తక్కువే’ అంటూ మేనేజర్‌తో పాటు ఇద్దరు దొంగల్ని, గోల్డ్ అప్రయిజర్ని సెల్లో వేశాడు ఎస్సై. - చొక్కర తాతారావు -
క్రైం స్టోరీ: రాంగ్ ఇన్ఫర్మేషన్.. ట్విస్టు అదిరింది!
రాం నగర్‌కు ఫర్లాంగు దూరంలో కొత్తగా కట్టిన ఇల్లది. చుట్టుపక్కల వేరే ఇళ్లేం లేవు. చుట్టూ ప్రహరీ మధ్యలో రెండంతస్తుల భవనం అది. చుట్టూ పోలీసులు మోహరించారు. గుంపులు గుంపులుగా జనం. నేరుగా లోపలికి వెళితే మూడు శవాలు పడున్నాయి. ఒక వృద్ధురాలు.. భార్య భర్తల జంట. తలపై మోది కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. పోలీస్ టీమ్ సాక్ష్యాలు సేకరిస్తోంది. డాగ్ స్క్వాడ్ అక్కడే వెతుకుతున్నారు. రెండు బీరువాలు పగలగొట్టి నగదు, నగలు కలిపి దాదాపు యాభై లక్షల వరకు దోచుకున్నారు. బట్టలు చెల్లాచెదురుగా పడేశారు. హత్యానంతరం చేతులు వాష్ చేసుకుని తీరిగ్గా అక్కడే భోంచేసివెళ్లిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. సిటీలో ఈ తరహా కేసులో ఇది మూడవది. హంతకుల ఆచూకీ కనుక్కోవడానికి పోలీస్ టీమ్ శత ప్రయత్నాలు చేస్తోంది. బాగా డబ్బున్న ఇళ్లను ఎంచుకుంటున్నారు.. సిటీకి దూరంగా విడిగా ఉన్న వాటిని టార్గెట్ చేసి.. రాత్రివేళ చొరబడి దొంగతనం చేస్తున్నారు. బహుశా హంతకులు ఇరవై ఐదు నుండి ముప్పై లోపు వయసు గల వారే అని పోలీసుల నమ్మకం. చనిపోతున్న వారందరూ ఉద్యోగులే కావడం గమనార్హంగా మారింది. శవాలను పోస్టుమార్టమ్‌కు పంపించేశారు. ‘ఈ వరుస హత్యల మిస్టరీ ఛేదించమని పై నుండి ఒకటే ఒత్తిడి. సరైన ఆధారాలు దొరకనందున ఆలస్యమౌతోంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు’ అంటూ స్టేషన్ వసారాలో కాలు కాలిన పిల్లిలా అటూ ఇటూ తిరుగుతున్నాడు ఎస్సై రంగనాథం. ‘సార్ ! వాళ్ళు ఇక్కడే ఎక్కడో ఉంటారు. కచ్చితంగా దొరికిపోతారు’ అన్నాడు అక్కడే ఉన్న పోలీస్ ఇన్ఫార్మర్ సుధాకర్. ‘నువ్వు సిటీలో తచ్చాడుతూ ఉండు. అనుమానాస్పద వ్యక్తులు తారసపడితే వెంటనే మాకు ఫోన్ చెయ్’ చెప్పాడు ఎస్సై రంగనాథం. ‘ఓకే సార్ ’ అంటూ అక్కడి నుండి కదిలాడు సుధాకర్. అక్కడున్న సిబ్బందిని వెంటబెట్టుకుని బయటికి వెళ్లాడు రంగనాథం. టీ కొట్టు దగ్గర చిల్లర వ్యాపారుల స్థావరాల దగ్గర తన ఫ్రెండ్స్‌ని వెంటేసుకుని మామూలు వ్యక్తిగా తిరగడం మొదలు పెట్టాడు సుధాకర్. ∙∙ నగరంలో ఈ హత్యలు సంచలనంగా మారిపోయాయి. కొత్తవాళ్లను నమ్మడానికి భయపడుతున్నారు. రాత్రిపూట ఇళ్లకు వాకిళ్ళు తీయాలంటేనే బెదిరి పోతున్నారు. నగరంలోకి బయట నుండి ఎవరైనా కొత్తగా వచ్చారా అన్నదానిపై దృష్టి పెట్టిన ఎస్సై రంగనాథం సుమారు పదిహేను మందిని స్టేషన్‌కు పిలిపించాడు విచారించేందుకు. సుధాకర్ కూడా అక్కడే ఉన్నాడు. వాళ్లలో ఒకడు..‘సార్ ! నేను గాజుల వ్యాపారం చేస్తాను. నేను వచ్చి కూడా ఆరు సంవత్సరాలు దాటిపోయింది. రాజీవ్ నగర్లో చిన్న కొట్టు వేసుకున్నాను ‘ అని, ఇంకొకడు ‘ సార్! నేను బట్టల వ్యాపారం చేస్తాను.. నేను వచ్చి సంవత్సరం దాటింది’ అని ఇలా అందరూ తలో వ్యాపకం గురించి చెప్పుకొచ్చారు. ‘వీళ్ళందరూ బతుకుతెరువు కోసం వచ్చారు. కష్టపడి సంపాదిస్తున్నారు కాబట్టి అలాంటి పని చేసి ఉంటారని నమ్మకం లేదు’ అన్నాడు సుధాకర్. వాళ్ళను అన్ని విధాలుగా పరిశీలించి వదిలేశాడు రంగనాథం. అంతలోపే ‘సార్! శివాజీ నగర్ శివారులో ముగ్గురు వ్యక్తులు అనుమానస్పదంగా తచ్చాడుతున్నారు’ అంటూ ఒక అజ్ఞాత వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. వెంటనే ఆ ఏరియాకు బయలుదేరి వెళ్లాడు ఎస్సై రంగనాథం. అక్కడ ఎవరూ కనిపించలేదు. మళ్లీ అదే నంబర్‌కు కాల్ చేశాడు. పనిచేయడం లేదు. చీకటి పడుతోంది ‘ఈ రాత్రికి సిటీ ఉత్తర భాగాన ఉన్న ఇళ్ళ వైపు దృష్టి పెట్టాలి. చెక్ పోస్టులలో నాకాబందీ వేయాలి’ అన్నాడు రంగనాథం. ‘మీరు పొరబడుతున్నారు. అక్కడ తిష్టవేసి ప్రయోజనం లేదు. అది ఎలాగూ జనసంచారం గల ప్రాంతం. ఈసారికి సిటీలోనే ప్లాన్ చేసి ఉండవచ్చు. ఎందుకంటే నగరం శివారులో గల ఇళ్ళల్లోనే దొంగతనాలు జరుగుతున్నాయని గ్రహించి.. పోలీసులు అక్కడే తిరుగుతుంటారని తెలుసు కాబట్టి ఈసారికి స్కెచ్ మార్చి ఉండొచ్చు. ఆలోచించండి సార్ ’ అన్నాడు సుధాకర్. ‘అవును.. నువ్వు చెప్పింది కూడా కరెక్టే. టౌన్లోకి వెళ్దాం’ అంటూ అక్కడి నుండి నిఘా మార్పించాడు ఎస్సై రంగనాథం. ∙∙ సరిగ్గా అర్ధరాత్రి.. ఉత్తర భాగాన గల అమృత నగర్ నిశ్శబ్దంగా నిద్రపోతోంది. పోలీసు పహారా కూడా పెద్దగా లేదు. అక్కడున్నది మొత్తం ఉద్యోగస్తుల ఇళ్లే. అవీ అక్కడొకటి.. ఇక్కడొకటిగా విసిరేసినట్టుగా ఉన్నాయి. చివరి ఇంటి ప్రహరీని ముసుగులు ధరించిన నలుగురు కుర్రాళ్ళు ఎక్కుతున్నారు. పట్టుకుంటే జారిపోవడానికి ఒళ్లంతా నూనె రాసుకున్నారు. చేతిలో ఆయుధాలు పట్టుకుని చాకచక్యంగా లోపలికి ప్రవేశించారు. పడుకున్న వాళ్లని లేపి చంపుతామని బెదిరించారు. ఆ బెదిరింపులకు ఆ ఇంటి వాళ్ళు బెదరకపోయేసరికి.. గట్టిగా అరుస్తారేమోననే భయంతో విచక్షణ రహితంగా వారిపై దాడి చేశారు. నోటిలో గుడ్డలు కుక్కి దారుణంగా హత్య చేశారు. డబ్బు, బంగారం దోచుకుని పారిపోయారు. తెల్లవారేసరికి ఈ వార్త సిటీ అంతా వ్యాపించింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ‘నేను అప్పుడే చెప్పాను.. ఇది నగరానికి దూరంగా ఉన్న టీచర్స్ కాలనీ.. ఇక్కడ జరగవచ్చు అని! ఆ విషయమే నీతో అన్నాను కూడా! గత కొన్నేళ్లుగా ఇన్ఫార్మర్గా పని చేస్తున్నావ్. నువ్వు చెప్పిన క్లూస్ గతంలో చాలా పాసయ్యాయి. ఆ నమ్మకంతో నీ మాట విని నిఘా మార్చా. ఇప్పుడు చూడు ఏం జరిగిందో?’ అంటూ ఎస్సై రంగనాథం.. సుధాకర్ పై చిందులు తొక్కాడు. ‘సారీ సార్.. ఇలా జరుగుతుందని నేనూ ఊహించలేదు. ఈసారికి మన కళ్లుగప్పి సిటీలో ఉన్న పెద్దవాళ్ల ఇళ్లకు కన్నం వేస్తారనుకున్నా’ అన్నాడు తల గీరుకుంటూ సుధాకర్. ‘మన స్టేషన్లో స్టాఫ్ ఎక్కువ లేకపోవడం చేతనే ఇలాంటి తప్పిదాలు జరుగుతున్నాయి’ అంటూ అసహనం వ్యక్తం చేశాడు ఎస్సై రంగనాథం. ఒక కేసు పూర్తిగా శోధించక ముందే మరో కేసు జరగడం.. ఎస్సైని నిద్రకు దూరం చేసింది. అదనపు పోలీసులు వస్తే తప్ప నగరాన్ని కాపాడలేం అనుకున్నాడు. ఎంత పహార కాసినా ఒక్కడు కూడా పట్టుబడలేదు. దిక్కుతోచని పరిస్థితుల్లో సుధాకర్ మీదే ఆధారపడ్డాడు మళ్లీ. ‘ఏవైనా ఆనవాళ్లు దొరికాయా?’ అని అడిగాడు అతన్ని. ‘నేను జనాల్లో తిరుగుతున్నాను. అందర్నీ అబ్జర్వ్చేస్తున్నాను. అనుమానం వచ్చేలా మాట్లాడుకోవడం గానీ.. ప్రవర్తించడం గానీ ఎవరూ చేయట్లేదు సార్. అయినా వదలట్లేదు. ప్రతి మనిషిని ఆరా తీస్తున్నాను’ చెప్పాడు సుధాకర్. ‘ఈ కేసులపై ఒక ఇంటెలిజెన్స్ పోలీసుని కూడా నియమించారు కానీ అతనికి కూడా ఎలాంటి ఆధారాలు దొరకలేదు. పాత నేరస్తులందర్నీ పిలిపించి వేలిముద్రలు కూడా చెక్ చేశాం. ఎవరివీ మ్యాచ్ కాలేదు’ చెప్పాడు ఎస్సై రంగనాథం. ‘ఆ దొంగలు చాలా తెలివిగా తప్పించుకుంటున్నారు సార్ ’ అన్నాడు సుధాకర్. ‘అవును కానీ నాకు ఒక డౌట్.. ఆ దొంగతనాలు చేస్తున్నది మన ప్రాంతం వాళ్లు కాదేమో అని! పొరుగు రాష్ట్రాల నుండి వచ్చినవారై ఉంటారు. ఒకసారి ఊరి చివరన గుడిసెలు వేసుకున్న వాళ్ళని పిలిపిస్తే సరిపోతుందేమో’ అన్నాడు రంగనాథం. ‘వాళ్లు పాపం అడుక్కునే వాళ్ళు. ఇంత పెద్ద స్కెచ్ వేసి హత్యలు చేసేంత ధైర్యం గాని ఐడియా గాని వాళ్లకు ఉండదని నా అభిప్రాయం. అడుక్కోవడం తప్ప వాళ్లకు మరో పని తెలియదు సార్..’ అన్నాడు సుధాకర్. ‘నువ్వు చెప్పేదీ నిజమే అనుకో! అయినా ఒకసారి పరిశీలిస్తే పోయేదేముందీ!’ ఎస్సై రంగనాథం. ‘సరే’ అన్నట్టుగా తలూపుతూ వాచీ వంక చూస్తుకున్నాడు సుధాకర్. ‘సర్.. ఇప్పుడెలాగూ లంచ్ టైమ్ అయింది. నేను ఇంటికెళ్లి భోజనం చేస్తాను. మీరు బయలుదేరే ముందు కాల్ చేయండి.. రెడీగా ఉంటాను. దార్లో పికప్ చేసుకుందురు’ అంటూ స్టేషన్ నుంచి బయటకు నడిచాడు సుధాకర్. ∙∙ సరిగ్గా మిట్టమధ్యాహ్నం.. స్టేషన్ నుండి పోలీస్ జీప్ బయలుదేరింది. సుధాకర్‌కు ఇన్ఫామ్ చేశాడు ఎస్సై రంగనాథం. ఊరి మధ్యలో కొట్టాల వీధిలో జీప్ ఎక్కాడు సుధాకర్. జీప్ నేరుగా ఊరి బయట గుడిసెలు ఉన్న ప్రాంతానికి చేరుకుంది. అక్కడ ఒక్క గుడిసె కూడా లేదు. ఎస్సై ఆశ్చర్యపోతూ ‘సుధాకర్! ఇక్కడ గుడిసెలు ఉండాలి కదా! మార్నింగ్ ఉన్న గుడిసెలు ఒక్కపూటలో ఎలా మాయమైనట్టు?’ అడిగాడు. ‘వాళ్లు అడుక్కునే వాళ్ళు కదా సార్! ఒక చోట స్థిరంగా ఉండరు. ఊర్లు మారుతా పోతారు’ చెప్పాడు సుధాకర్. ‘ఇంత ఉన్నపళంగా మారాల్సిన అవసరం ఎందుకొచ్చింది?’ ఎస్సై అనుమానం. ‘వాళ్ళంతే సార్.. ఉదయం ఓ చోట ఉంటే మధ్యాహ్నం మరోచోటుకు వెళతారు. ఒకే చోట ఉంటే వాళ్లకు అన్నం పుట్టదు కదా అందుకోసం’ సుధాకర్. క్షణం ఆలోచించాడు ఎస్సై రంగనాథం. అంతలోనే డిపార్ట్మెంట్ నుండి ఫోన్ వచ్చింది అర్జంట్‌గా స్టేషన్‌కు రమ్మంటూ. ‘మీరు వెళ్ళండి.. వీళ్ళు ఎక్కడున్నా వెదికి స్టేషన్‌కు తీసుకురండి’ అంటూ తన టీమ్‌కి చెప్పి సుధాకర్ వైపు తిరిగి ‘మీరు ఈ పరిసర ప్రాంతంలోనే ఉండి వారిపై ఓ కన్నేసి ఉంచండి’ అంటూ రంగనాథం వెళ్లిపోయాడు. పోలీసులు అక్కడి నుండి వెళ్ళిపోగానే సుధాకర్ ఒక్కడే నిలిచిపోయాడు. అక్కడున్న చిన్న దిమ్మెపై కూర్చుని ఆలోచించసాగాడు. సాయంకాలం అయిదు గంటలప్పుడు స్టేషన్ నుండి ఫోన్ వచ్చింది. బయలుదేరి స్టేషన్‌కు వెళ్ళాడు. స్టేషన్ ఆవరణలో నేల పై కూర్చుని ఉన్న నలుగురు యువకులు.. వాళ్ల ముందు టేబుల్‌ను ఆనుకుని నిలబడ్డ ఎస్సై రంగనాథం, అతని పక్కనే సీఐ రామకృష్ణ కనిపించారు సుధాకర్‌కు. సుధాకర్‌ను చూడగానే ఎస్సై విప్పారిన మొహంతో ‘దొంగలు దొరికిపోయారు సుధాకర్! చాలా తెలివైనవాళ్ళు’ అన్నాడు. అతని మాటల్లో ఏదో వెటకారం వినిపించింది సుధాకర్‌కు. దొరికిన దొంగల వైపు చూడగానే అతని మొహంలో రంగులూ మారాయి. ‘ చాలా చాకచక్యంగా దొంగల్ని పట్టేశారు సార్. ఇక నేను వెళ్ళొస్తాను’ అంటూ ఒకడుగు ముందుకేసిన సుధాకర్ కాలర్ పట్టుకున్నాడు ఎస్సై.. ‘ఆగు’ అంటూ. ‘అసలైన దొంగవి నువ్వు వెళ్ళిపోతే ఎలా? వాళ్లకు మార్గదర్శకుడివి! బాగానే స్కెచ్ వేశావు’ అంటూ సుధాకర్ చేతికి బేడీలు వేశాడు. అక్కడే నిజానిజాలు బయటపడ్డాయి. ఆ దొంగల ముఠాను నడిపిస్తున్నది సుధాకర్. వాళ్లకు నాలుగు తగిలించగానే అసలు విషయాలు బయటపడ్డాయి. వాళ్ళు చేసే దొంగతనంలో సగం వాటా తను తీసుకుని మిగిలింది వాళ్లకు ఇచ్చేవాడు. అనుమానం రాకుండా వాళ్లను అడుక్కుతినే వాళ్ళలాగా నటింపచేస్తూ పగటిపూట స్కెచ్ వేసి రాత్రిపూట చోరీకి పంపించేవాడు. అలా వాళ్లకు దిశానిర్దేశం చేసేవాడు సుధాకర్. ఒకపక్క పోలీస్ ఇన్ఫార్మర్గా ఉంటూనే పోలీసుల కదలికలను పసిగడుతూ వాళ్లకు సూచనలు ఇచ్చేవాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఆ దొంగల్ని ఊరి బయట గుడిసెల్లో పెట్టాడు. దొరికిపోతారనే భయంతో వాళ్లను అప్పటికప్పుడు ఖాళీ చేయించాడు. ఇవన్నీ గంటలో జరిగిపోయాయి. పోలీసులు ఎక్కడున్నా వాళ్లకు ఫోన్ చేసి దారి మళ్ళించేవాడు. అలా పోలీసులకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ దొంగల్ని తప్పించేవాడు. ‘డిపార్ట్మెంట్ నిన్ను బాగా నమ్మింది. దాన్ని ఆసరాగా తీసుకునిమాకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ నువ్వు పబ్బం గడుపుకున్నావ్. డిపార్ట్మెంట్ ఇచ్చే సూచనల కన్నా నువ్వు ఇచ్చే ఇన్ఫర్మేషన్‌నే ఎక్కువగా నమ్మాను. డిపార్ట్‌మెంట్‌కే ద్రోహం చేస్తావా? నీవల్ల ఎంత మంది ప్రాణాలు పోయాయో తెలుసా? నిన్ను క్షమించకూడదు’ అంటూ దొంగతనం చేసిన సొమ్మంతా సుధాకర్ దగ్గర రికవరీ చేశాడు ఎస్సై రంగనాథం. కేసు పెట్టి సుధాకర్ సహా అయిదుగురినీ జైల్లో పెట్టించాడు. - నరెద్దుల రాజారెడ్డి -
Crime Story: పనిష్మెంట్.. ‘బొమ్మ’ ఎంత పనిచేసింది? ఆఖరికి ఏమైంది?
న్యూఢిల్లీ ..సీబీఐ ఆఫీస్..నాలుగు అంతస్తుల ఆ భవనానికి కట్టుదిట్టమైన భద్రతతో .. అడుగడుగునా శక్తిమంతమైన సీసీ కెమెరాలు అమర్చి ఉన్నాయి. నాలుగవ అంతస్తులోని కాన్ఫరెన్స్ హాల్లో సీబీఐ డైరెక్టర్లు .. మిగిలినవారు ఎవరికోసమో ఉత్కంఠగా వేచి ఉన్నారు. అరగంట తర్వాత అక్కడికి చేరుకున్న కిరణ్ మిశ్రాను అభినందనలతో ముంచెత్తారు. వారి అభినందనలను స్వీకరిస్తూనే ఆలోచనల్లోకి జారిపోయాడు కిరణ్ మిశ్రా. ∙∙∙ ఒక ఉగ్రవాద ముఠా దేశంలోకి రహస్యంగా ప్రవేశించిందని .. దేశంలో పలుచోట్ల అల్లకల్లోలం సృష్టించడానికి పన్నాగంతోనే వారు వచ్చినట్టు సీబీఐ ఏజెంట్లు పసిగట్టారు. ఆ సమాచారం తెలియగానే సీబీఐ చీఫ్.. రాజీవ్ అగర్వాల్ వెంటనే కిరణ్ మిశ్రాతో రహస్య సమావేశమయ్యాడు. ‘మిస్టర్ మిశ్రా.. మనకు మన ఏజెంట్లు అందించిన సమాచారం మీకు తెలిసిందే కదా! ఆ ఉగ్రవాద ముఠాను సమూలంగా అంతమొందించాలి. ఈ పనికి మీరు మాత్రమే సమర్థులు. మీకు ‘షూట్ ఎట్ సైట్’ ఆర్డర్స్ ఇచ్చారు. ఉగ్రవాదులను మీరు ప్రాణాలతో పట్టుకున్నా సరే .. లేకుంటే.. అంటూ ఆగిపోయాడు. అందుకు సమాధానంగా కిరణ్ మిశ్రా.. ‘సర్ ఆ ఉగ్రవాద ముఠాను మన దేశంలో లేకుండా చేస్తాను. అది ఈ దేశ పౌరుడిగా నా బాధ్యత’ అంటూ పైకి లేచి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ∙∙∙ కాన్ఫరెన్స్ హాల్లో అందరు వెళ్లిపోయారు. అక్కడ కిరణ్ మిశ్రా తప్ప ఎవరూ లేరు. ఇంతలో అక్కడికి చీఫ్ రాజీవ్ అగర్వాల్ అడుగుపెట్టాడు. మిస్టర్ మిశ్రా అని అతడి భుజంపై చేయి వేశాడు. ఉలిక్కిపడి తేరుకున్న కిరణ్ మిశ్రా చీఫ్‌ను చూస్తూ విష్ చేశాడు. అతడిని చూస్తూ ఏదో జరిగిందని ఇట్టే గ్రహించాడు అగర్వాల్. ‘ఏం జరిగింది?’ అడుగుతూ అక్కడున్న కుర్చీని చూపిస్తూ తాను కూడా మరొక కుర్చీలో కూర్చున్నాడు చీఫ్ అగర్వాల్. ‘సర్.. నేను ఆ ఉగ్రవాద ముఠా జాడ కనిపెట్టి వారిని బంధించాలని చూశాను. కానీ వారి ప్రాణాలు బలి తీసుకొనక తప్పలేదు’ అంటూ ఆగిపోయాడు. అది వింటున్న సీబీఐ చీఫ్.. ‘అదంతా మన వృత్తిలో భాగమే కదా! అయినా మీకు షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ ఇచ్చారు’ అంటున్న చీఫ్ మాటలకూ అడ్డు పడుతూ ..‘సర్ ఆ ముఠాలో ఇద్దరు చాలా తెలివిగా తప్పించుకున్నారు. వారి నుండి ప్రమాదం పొంచి ఉంది’ అని ఆందోళనగా చెప్తున్న కిరణ్ మిశ్రాను చూస్తూ ఆలోచనలో మునిగిపోయాడు రాజీవ్ అగర్వాల్. కొద్దిసేపటి తర్వాత ‘మీ ఇంటి వద్ద సెక్యూరిటీని మఫ్టీలో ఉండేటట్టు ఏర్పాటు చేస్తాను. ఇంకా మీ అమ్మాయి వెళ్లే స్కూల్ వద్ద కూడా కట్టుదిట్టమైన భద్రతను పెంచుతాను’ అని అక్కడున్న బజర్ మోగించాడు. సరిగ్గా అదే సమయంలో.. శిఖర్ స్కూల్.. సాయంత్రం స్కూల్ బెల్ మోగింది. పిల్లలందరితో పాటు దక్ష బయటకు వచ్చింది. ఇంతలో ఒక చెట్టు పక్క ఒక వ్యక్తి.. ఆ వ్యక్తి చేతిలో పట్టుకున్న బొమ్మలు దక్షను ఆకర్షించాయి. దక్ష తన వద్ద ఉన్న వంద రూపాయలను ఇచ్చి ఆ బొమ్మను తీసుకుంది. ∙∙∙ ఇంటికి వెళ్లిన దక్ష.. తాను తెచ్చుకున్న బొమ్మను బయటకు తీయకుండా తన స్కూల్ బాగ్‌లోనే దాచి పెట్టింది. దక్షకు తాను తెచ్చుకున్న బొమ్మతో ఆడుకోవాలని చాలా ఆతృతగా ఉంది. ఇంతలో కిరణ్ మిశ్రా లోపలికి అడుగు పెట్టాడు. తండ్రితో అన్ని విషయాలు చెప్పుకుంటూ ఉండిపోయిన దక్షకు ఉన్నట్టుండి తాను కొనుక్కున్న బొమ్మ గుర్తొచ్చింది. బొమ్మను తీసుకొచ్చి చూపిస్తూ ‘నాన్నా ఈ బొమ్మ చూడు.. దీని కళ్ళు ఎంత బాగా ఆర్పుతుందో చూడు’ అంటూ ఆ బొమ్మను తండ్రి చేతిలో పెట్టింది దక్ష. బొమ్మను అటు ఇటు తిప్పి చూస్తూ ఏదో అడగబోతున్న కిరణ్ మిశ్రాకు బయట నుండి ‘సర్’ అన్న పిలుపు వినిపించింది. బయట సీబీఐ చీఫ్ పంపించిన సెక్యూరిటీ వచ్చి ఉన్నారు. వారితో మాట్లాడుతూ ఉండిపోయాడు మిశ్రా. బొమ్మ సంగతి మరిచిపోయాడు. ∙∙∙ తర్వాత మిశ్రాకు ఒక కేసు పని మీద వేరే ఊరు వెళ్ళవలసి వచ్చింది. ఎయిర్ పోర్ట్ చేరుకున్న మిశ్రాకు తాను వెళ్లబోయే విమానం రెండుగంటలు ఆలస్యం అని తెలిసింది. టైమ్ చూసి ఇంకా దాదాపు గంటన్నర సమయం ఉందనుకుంటూ లాప్టాప్లో ఏదో పని చేసుకోసాగాడు మిశ్రా. అనుకోకుండా లాప్టాప్లో మరొక సైట్ ఓపెన్ అయ్యింది. ఆ సైట్లో ఒక బొమ్మ కనిపించింది. ఆ బొమ్మ గురించిన సమాచారం చూస్తున్న మిశ్రాకు ఒక్కసారిగా ఏదో గుర్తొచ్చి ఒళ్ళు జలదరించింది. ‘అచ్చం అలాంటి బొమ్మని కూతురు దక్ష వద్ద చూశాడు!’ అది గుర్తు రాగానే కంగారుగా పైకి లేచాడు. తానిప్పుడు వెళ్ళాల్సింది విమానంలోకి కాదు. వెంటనే ఇంటికి వెళ్ళాలి. ఇంటికి.. ఇంటి దగ్గర ఉన్న సెక్యూరిటీకి ఫోన్ చేశాడు. కానీ ఏ ఒక్కరి ఫోన్ కూడా పని చెయ్యడం లేదు. వెంటనే ఏదో జరిగిందని మిశ్రాకు రూఢి అయ్యింది. అతని మెదడు శరవేగంగా ఆలోచించసాగింది. వెంటనే సీబీఐ ఆఫీస్‌కు ఫోన్ చేశాడు. వారితో.. ‘మీరు వెంటనే వెళ్లి మా ఇంటిని చుట్టుముట్టండి. క్విక్.. తొందరగా.. ఏ మాత్రం సమయం లేదు’ చెప్పుకుపోతున్నాడు మిశ్రా. కేవలం పది నిమిషాల్లో సీబీఐ కమాండోలు మిశ్రా ఇంటి వద్దకు చేరుకున్నారు.అక్కడ.. సెక్యూరిటీ వాళ్ళు పడిపోయి ఉన్నారు. మిశ్రా ఇంటి తలుపులు వారగా వేసి ఉన్నాయి. లోపలకు వెళ్ళడానికి తుపాకులు ఎక్కుపెట్టి మెల్లిగా తలుపులను తోశారు. లోపల ఏదో పొగ లాంటిది కమ్ముకుని ఉంది. కమాండోలు ఆ పొగ తమను కమ్ముకోకుండా ప్రయత్నాలు చేస్తూ లోపలికి అడుగుపెట్టారు. ఇంతలో వారికి ఎదురుగా ఇద్దరు ముసుగులు ధరించిన వ్యక్తులు శ్రుతిని, దక్షను తీసుకుని బయటకు వస్తున్నారు. వారిద్దరూ అప్పటికే స్పృహ తప్పి ఉన్నారు. వారిని చూసిన కమాండోలు వారిపై తుపాకీలు ఎక్కుపెట్టారు. కానీ ఆ ముసుగు వ్యక్తులు ఒకరు శ్రుతిని .. మరొకరు ఆమె కూతురు దక్షను అడ్డం పెట్టుకుని వస్తున్నారు. ఒకవేళ కమాండోలు వారిని షూట్ చేస్తే ఆ బుల్లెట్లు శ్రుతికో.. దక్షకో తప్పకుండా తగులుతాయి. కమాండోలు నిస్సహాయులై బయటకు నడిచారు. ముసుగు వ్యక్తులు బయటకు రాగానే ఆ ఇంటి ముందుకు ఒక వ్యాన్ వచ్చి ఆగింది. స్పృహ తప్పిన శ్రుతిని భుజాన వేసుకుని ఒక ముసుగు వ్యక్తి ... స్పృహలో లేని దక్షను ఎత్తుకున్న మరో ముసుగు వ్యక్తి ఆ వ్యాన్ ఎక్కబోయే ఆ సమయంలో ఆ ముసుగు వ్యక్తుల వెనుక.. తుపాకీ గుళ్ల వర్షం. ఆ బుల్లెట్ల దెబ్బలకి అక్కడే కుప్పకూలిపోయారు ఆ ముసుగు వ్యక్తులు. ఇంతలో మరికొన్ని బుల్లెట్లు ఆ వ్యాన్ చక్రాల మీద దిగాయి. కింద పడిపోయిన శ్రుతిని, దక్షను కమాండోలు లేవదీయబోతూ .. ఆ బుల్లెట్లు ఎక్కడనుండి వచ్చాయా అని వెనుతిరిగి చూశారు. అక్కడ.. సీబీఐ చీఫ్ రాజీవ్ అగర్వాల్. చీఫ్‌ను చూసిన కమండోలు సెల్యూట్ చేశారు. ఈ లోపు అక్కడికి చేరుకున్న మిశ్రా మెల్లిగా పైకి లేస్తున్న దక్షను.. శ్రుతిని చూసి ఊపిరి పీల్చుకున్నాడు. ‘‘సర్.. మీరిక్కడ’’.. అని అడగబోతున్న మిశ్రాను చూసిన చీఫ్ ‘‘నీ ఫోన్ వల్లే నేనిక్కడికి చేరుకున్నాను. కానీ మీ ఇంట్లో ఇలా జరుగుతుందని నీకెలా తెలుసు?’’ ప్రశ్నించాడు చీఫ్. ‘సర్ నేను ఎయిర్ పోర్ట్‌లో ఉన్నప్పుడు ఒక బొమ్మ చూశాను. అదే బొమ్మ నా కూతురు వద్ద ఉండటం నాకు గుర్తొచ్చింది. ఏదో జరగబోతుందని ఊహించాను. ఆ బొమ్మ పేరు...‘ మై ఫ్రెండ్ కేలా’. జర్మనీలో తయారైన ఈ బొమ్మలో అతి శక్తిమంతమైన బ్లూ టూత్ని అమర్చి ఆ బొమ్మ ఉన్న చుట్టుపక్కల మాట్లాడే మాటలు మొత్తం వింటారు. అంతే కాదు ఆ బొమ్మకు సంబందించిన వెబ్సైట్లోకి యాక్సిస్ అయితే చాలు.. ఆ బొమ్మ ఎక్కడ ఉన్నది దాని ద్వారా జరిగే పనులన్నిటినీ తెలుసుకోవచ్చు. శత్రువులు ఇలా ఈ ‘మై ఫ్రెండ్ కేలా’ బొమ్మ ద్వారా నా కుటుంబాన్ని టార్గెట్ చేశారు’ అని వివరించాడు మిశ్రా. అంతా వింటున్న దక్ష ఇంటిలోపలికి పరిగెత్తుకు వెళ్లి తన బ్యాగ్‌లో ఉన్న బొమ్మను తెచ్చి బయటకు విసిరేసింది. వెంటనే అక్కడున్న కమండోలు ఆ బొమ్మను స్వాధీనం చేసుకున్నారు. ‘వెల్ డన్ మిస్టర్ మిశ్రా’.. అంటూ సీబీఐ చీఫ్ మిశ్రా భుజం తట్టి అక్కడ నుండి ముందుకు కదిలాడు. ‘నాన్నా’ అంటూ వచ్చిన దక్షను ఎత్తుకుని తన భార్య శ్రుతి చేయి పట్టుకుని ఇంటి లోపలికి నడిచాడు కిరణ్ మిశ్రా. -శ్రీసుధామయి ఇది కూడా చదవండి: క్రైం స్టోరీ: బ్లాక్‌మెయిలర్.. చచ్చిపోయాడంటూ బెదిరించి డబ్బు గుంజి.. ఆఖరికి -
క్రైం స్టోరీ: చచ్చిపోయాడంటూ బ్లాక్మెయిల్ చేసి.. డబ్బు గుంజి.. ఆఖరికి
చాయ్ మహల్లో సాయంత్రం ఆరుగంటలకు కస్టమర్ల రద్దీ ఎక్కువగా వుంది. అక్కడ దొరికే ఖడక్ చాయ్ లాంటి టీ స్టార్ హోటళ్లలో కూడా లభించకపోవడంతో సామాన్యజనంతో బాటూ ధనికులు కూడా అక్కడ ఆగి టీ తాగి వెళ్తుంటారు. ఒక కార్నర్ టేబుల్ దగ్గర కూర్చుని చంద్రశేఖర్ మిత్రులతో బాటూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఖడక్ చాయ్ తాగుతున్నాడు. చెన్నైలో పేరుమోసిన లాయర్ అతను. వారానికి ఆరు రోజులు కోర్టులు, కేసులు, క్లయింట్లతో బిజీగా వుంటాడు. శనివారం కోర్టుకు సెలవు కాబట్టి ప్రతి శుక్రవారం సాయంత్రం ఆరుగంటలకు చాయ్ మహల్లో మిత్రులతో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ టీ తాగి వెళ్లడం అలవాటతనికి. పిల్లిగడ్డం, కళ్లజోడుతో వున్న ఒక యాభై ఐదేళ్ల మనిషి చంద్రశేఖర్‌ను దూరం నుంచి పరీక్షగా చూసి దగ్గరకు వచ్చి, ‘బాగున్నారా?’ అని అడిగాడు. చంద్రశేఖర్‌కు ఆ వ్యక్తిని ఎక్కడో చూసినట్లుగా అనిపించింది. కానీ వెంటనే అతడినంతకు మునుపు తాను ఎక్కడ చూశాడో గుర్తుకు రాలేదు. పిల్లిగడ్డం వాడు చిన్నగా నవ్వి ‘ఫ్రెండ్స్‌తో బిజీగా వున్నట్లున్నారు. తరువాత ఇంటికి వచ్చి మిమ్మల్ని కలుస్తాను’ అన్నాడు. చంద్రశేఖర్ అప్రయత్నంగా జేబులోంచి తన విజిటింగ్ కార్డు తీసి ఆ వ్యక్తికి ఇచ్చాడు. దాన్ని జేబులో పెట్టుకొని వెళ్లిపోయాడతను. ఎవరో కేసు గురించి తనను సంప్రదించాలని వచ్చి వుంటాడనుకొని చంద్రశేఖర్ మళ్లీ మిత్రులతో కబుర్లలో పడిపోయాడు. ∙∙ ఆ రోజు రాత్రి భోజనం చేసి పక్కమీదికి వాలుతుండగా హఠాత్తుగా చంద్రశేఖర్‌కు ఆ పిల్లిగడ్డం వాడిని తానింతకుముందు ఎక్కడ చూశాడో గుర్తుకు వచ్చింది. వాడిపేరు కాళిదాసు. అతడిని తానింతకు మునుపు ఎక్కడ చూశాడో గుర్తుకు వచ్చేసరికి చంద్రశేఖర్‌కు ఒళ్లు జలదరించినట్లనిపించింది. ∙∙ చంద్రశేఖర్ తండ్రి నెల్లూరులో పెద్దలాయరు. డిగ్రీ పూర్తికాగానే కొడుకును చెన్నైలోని ఒక లా కాలేజీలో చేర్పించడానికి ప్రయత్నించాడతను. కానీ పుట్టిపెరిగిన వూరిని వదిలి వెళ్లనని మొండికేశాడు చంద్రశేఖర్. డబ్బులో పుట్టి పెరిగిన అతనికి ఫ్రెండ్స్‌తో తిరగడం, అప్పుడప్పుడు పార్టీలు, పబ్బులు సందర్శించడం అలవాటైంది. చెన్నై లా కాలేజీలో సీటు వచ్చినా అక్కడికి వెళ్లకుండా చంద్రశేఖర్ పదిరోజులు ఇంటిదగ్గరే వుండిపోయాడు. తండ్రి అతడిని బుజ్జగించి, చంద్రశేఖర్‌కు ఇష్టమైన బైక్ కొనుక్కోమని యాభైవేలు చేతికిచ్చాడు. ఆ రోజు సాయంత్రం చంద్రశేఖర్ ఫ్రెండ్స్‌తో మందుపార్టీ చేసుకొని మిత్రుడి బైక్ తోలుతూ వేగంగా విజయ మహల్ సెంటర్ వైపు వస్తున్నాడు. రోడ్డు దాటుతూ ఎదురుగా వస్తున్న మోపెడ్‌ను చూసుకోకుండా ఢీకొట్టాడు. కిందపడిన మోపెడ్ అతన్ని తాగిన మత్తులో తిట్టసాగాడు చంద్రశేఖర్. మోపెడ్ రైడర్ కూడా తిట్లు లంకించుకున్నాడు. అతని పేరు సుందరం. మూడిళ్ల అవతలే అతని ఇల్లు. సుందరం తమ్ముడు రాజు, పక్కింటి కాళిదాసు గొడవ విని పరుగెత్తుకు వచ్చారు అక్కడికి. సుందరం తిట్లు ఆపకపోవడంతో అప్పటికే ఆవేశంలో, మత్తులో వున్న చంద్రశేఖర్ చేతికందిన రాయి తీసుకొని సుందరం తలపై కొట్టాడు. తల నుండి రక్తం ధారకట్టింది. అది చూసి రాజు, కాళిదాసు చంద్రశేఖర్ పై ఎగబడ్డారు. దూరంగా పడిన చంద్రశేఖర్‌ను అతడి ఫ్రెండ్ పైకిలేపి ‘గొడవలు వద్దు, ఇంటికి వెళ్లిపోదాం’ అన్నాడు భయంగా. ఫ్రెండ్ బైక్ స్టార్ట్ చేయగానే చంద్రశేఖర్ వెనక సీట్లో కూర్చున్నాడు. ఇంటికి చేరిన చంద్రశేఖర్‌కు మత్తు దిగగానే సుందరానికి ఏమైందో అన్న భయం పట్టుకొంది. రాత్రి కలత నిద్రపోయి చంద్రశేఖర్ పొద్దునే లేచి చూసుకొనే సరికి అతని పర్స్ కనబడలేదు. తండ్రి తిడతాడన్న భయంతో ఆయనకు ఆ విషయం చెప్పలేదు. సుందరానికి ఏమైంది అన్న ఆందోళన చంద్రశేఖర్‌ను వదలలేదు. తాను కొట్టిన దెబ్బకు వాడు చనిపోయివుంటే.. అన్న భయం పీడించసాగింది. చంద్రశేఖర్ స్నానం చేసి యాక్సిడెంట్ జరిగిన ప్రదేశం దగ్గరికి వెళ్లాడు. బైక్ కొంచెం దూరంలో పార్క్ చేసి ప్రమాదం జరిగిన కరెంటు స్థంభం వద్ద పర్స్ కోసం వెతికాడు. అది కనబడకపోయేసరికి, మూడిళ్ల అవతలవున్న సుందరం ఇంటివైపు వెళ్లాడు. ఆ ఇల్లు తాళంవేసి వుంది. హఠాత్తుగా కాళిదాసు ఇంటి బయటకు వచ్చి చంద్రశేఖర్ చేయి పట్టుకొన్నాడు. ‘నీవల్ల సుందరం చనిపోయాడు. బాడీని తీసుకురావడానికి వాళ్లవాళ్లు హాస్పిటల్‌కు వెళ్లారు. నిన్ను పోలీసులకు అప్పజెప్పాలి’ అని కేకలు వేయసాగాడు. అతని చేయి విదిలించుకుని బైక్ స్టార్ట్‌చేసి వేగంగా ఇంటికి వెళ్లిపోయాడు చంద్రశేఖర్. ఆరోజు మధ్యాహ్నమే చెన్నై లా కాలేజీలో చేరిపోయాడు. చాలా కాలంపాటు నెల్లూరుకు రాకుండా చెన్నైలోనే వుండిపోయాడతను. లా కోర్సు పూర్తయ్యాక చంద్రశేఖర్ చెన్నైలోనే లాయరుగా ప్రాక్టీసు చేస్తానని తండ్రికి చెప్పాడు. కొడుకు పట్టువీడక పోయేసరికి, అతని తండ్రి చెన్నైలో తనకు తెలిసిన సీనియర్ లాయర్ వద్ద అతన్ని జూనియర్‌గా చేర్పించాడు. చెన్నైలోనే ఒక పెద్దింటి అమ్మాయిని వివాహం చేసుకొని అనతి కాలంలోనే లీడింగ్ లాయర్‌గా పేరు సంపాదించుకున్నాడు చంద్రశేఖర్. ఇన్నేళ్లకు కాళిదాసు మళ్లీ ఇలా కనిపించడంతో చంద్రశేఖర్ పై ప్రాణాలు పైనే పోయాయి. ∙∙ మరుసటి రోజు వుదయం చంద్రశేఖర్ ఆఫీసులో క్లయింట్లతో మాట్లాడుతుండగా.. కాళిదాసు వచ్చాడు. అతడిని పక్కగదికి తీసుకువెళ్లి మాట్లాడాడు చంద్రశేఖర్. ‘నువ్వు రాయితో కొట్టిన దెబ్బకు సుందరం చనిపోయాడు. అతని భార్య, పిల్లలు అనాథలయ్యారు. సుందరం షర్టుపైన నీ వేలిముద్రలు దొరికాయి పోలీసులకు. ఎలాగూ నేను, రాజు సాక్షులుగా వున్నాం. పోలీసు కేసు నమోదైంది. కానీ నీ వివరాలు పోలీసులకు తెలియలేదు. నెల్లూరు చుట్టుపక్కల ఎంత వెతికినా, నువ్వెక్కడున్నావో తెలియలేదు. అనుకోకుండా మద్రాసు వచ్చాను. నీ ఆచూకీ పోలీసులకు తెలపాలంటే ఒక్క ఫోన్ కాల్ చాలు’ కఠినంగా అన్నాడు కాళిదాసు. భయంతో కాళ్లు, చేతులు ఆడలేదు చంద్రశేఖర్‌కు. ‘వద్దు, ఆపని చేయద్దు. ఏదో భార్య, పిల్లలతో పరువుగా బతుకుతున్నాను’ అంటూ బతిమాలాడు. కాళిదాసు చిన్నగా నవ్వి ‘నాకు ఖర్చులు ఎక్కువగా వున్నాయి. ఒక రెండు లక్షలు ఇవ్వు’ అన్నాడు. చంద్రశేఖర్ ఇంట్లోకి వెళ్లి కాళిదాసుకు డబ్బు తెచ్చిచ్చాడు. కాళిదాసు వెళ్లిపోయాడు. ∙∙ మళ్లీ రెండురోజుల తరువాత కాళిదాసు నుండి కాల్ వచ్చింది చంద్రశేఖర్‌కు..‘చాలా అవసరంలో వున్నాను. రెండు రోజుల్లో ఒక పదిలక్షలు అందజెయ్యి’ అంటూ. ‘నెలరోజుల్లో నా కూతురి పెళ్లి వుంది. చాలా ఖర్చులున్నాయి. అంతడబ్బు సర్దలేను’ చెప్పాడు చంద్రశేఖర్. ‘అయితే నేను నేరుగా పోలీసుల వద్దకు వెళ్తాను. కూతురి పెళ్లికి ముందు నువ్వు అరెస్ట్ కావడం బాగుండదుకదా’ అన్నాడు కాళిదాసు. ‘వద్దు, వద్దు, ఎలాగోలా నీకు డబ్బు అడ్జస్ట్ చేస్తాను’ కంగారుగా చంద్రశేఖర్. ∙∙ చంద్రశేఖర్ చెప్పేదంతా సావకాశంగా విన్నాడు డిటెక్టివ్ వినోద్. ‘ఆ సుందరం నెల్లూరులో వున్న వీధి, ఇతర వివరాలు నాకు ఇవ్వండి. అలాగే అప్పటి మీ మిత్రుల వివరాలూ కావాలి’ అన్నాడు వినోద్. చంద్రశేఖర్ ఆ వివరాలన్నిటినీ వినోద్‌కు ఇస్తూ ‘సార్, ఈ దర్యాప్తు రహస్యంగా చేయండి. ఎలాగైనా నన్నీ సమస్య నుండి బయట పడేయండి’ అన్నాడు వేడుకోలుగా. ∙∙ సుందరం అప్పట్లో వున్న వీధికి వెళ్లాడు వినోద్. ఆ వీధిలో చాలామంది కొత్తగా వచ్చారు. వారికి సుందరం గురించి తెలియదు. వీధి చివర్లో పచారీకొట్టు నడుపుతున్న చలమయ్య ముప్పై ఏళ్ల నుండీ ఆ వీధిలోనే వున్నట్లు తెలిసింది వినోద్‌కు. ‘సుందరమా? అతనికి యాక్సిడెంటైంది. వాళ్ల వాళ్లు ఇల్లు ఖాళీచేసి టెక్కేమిట్ట ప్రాంతానికి వెళ్లిపోయారు’ చెప్పాడు చలమయ్య. అక్కడ వారెక్కడ వుండేదీ తనకు తెలియదన్నాడు. రాజు మాత్రం ట్రంక్ రోడ్లో ఏదో బట్టల కొట్టులో పనిచేసేవాడని వివరమందించాడు చలమయ్య. ట్రంక్ రోడ్లో పది, పన్నెండు బట్టల దుకాణాల్లో విచారిస్తే ఒక షాపు యజమాని రాజు పేరు గుర్తుకు తెచ్చుకున్నాడు. ‘మా షాపు పక్కన మరో బట్టల కొట్టు వుండేది. రాజు అక్కడ పనిచేసేవాడు. ఆ షాపు మూతపడ్డాక అతను ఒకసారి కనిపించి ఏదో పెద్ద ఫర్నిచర్ మార్కెట్లో సేల్స్‌మన్‌గా చేరానన్నాడు’ అని చెప్పాడు. వినోద్ కొన్ని ఫర్నిచర్ షాప్స్ తిరిగాక రాజు దొరికాడు అతనికి. తనను తాను సుందరం బాల్యమిత్రుడిగా పరిచయం చేసుకున్నాడు వినోద్. ‘సుందరం అన్నయ్య ఏసీ మహల్ సెంటర్లో ఫ్యాన్సీ షాపులో పనిచేస్తాడు. మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వస్తాడు. కాసేపు వుండండి, మనం వెళ్దాం’ అన్నాడు రాజు. వినోద్ ఆశ్చర్యపోయాడు. ‘ సుందరం బతికేవున్నాడా..!’ . మధ్యాహ్నం రాజుతో కలసి సుందరం ఇంటికి వెళ్లాడు. ‘చంద్రశేఖర్ వల్ల మాకు మేలే జరిగింది. అతని పర్స్ కరెంట్ స్థంభం దగ్గర నాకు దొరికింది. అందులో చాలా డబ్బుంది. నేను తలదెబ్బకు చికిత్స చేసుకున్న తరువాత మిగిలిన డబ్బుతో ఒక కిరాణా కొట్టు పెట్టుకున్నాను. కాలం కలిసొచ్చి ఇంకో రెండు ఫ్యాన్సీ షాపులు నడుపుతున్నాను’ చెప్పాడు సుందరం. కాళిదాసు గురించి అడిగితే.. ‘వాడొక వెధవ. అందరి దగ్గరా అప్పులు చేసి తాగుడు, డ్రగ్స్‌కి తగలేశాడు. తంతారని భయపడి ఎక్కడికో పారిపోయాడు’ అని చెప్పాడు రాజు. తాను తెచ్చిన ఆపిల్స్‌ను సుందరానికి అందజేసి సెలవు తీసుకున్నాడు వినోద్. ∙∙ కాళిదాసు నుండి మళ్లీ ఫోన్ వచ్చింది చంద్రశేఖర్‌కు. ‘నువ్వు నా గురించి డిటెక్టివ్‌ను పంపావని నాకు తెలిసిపోయింది. మళ్లీ ఎక్కడ కలుసుకోవాలో చెప్తాను’ అని ఫోన్ కట్ చేశాడతను. వినోద్ సలహా మీద చంద్రశేఖర్ పోలీస్ కంప్లయింట్ ఇచ్చాడు. వారికి కాళిదాసు ఎక్కడ దొరుకుతాడో తెలియలేదు. ‘డ్రగ్స్ అలవాటున్న వాళ్లు కచ్చితంగా అవి అమ్మే ప్రదేశాలకు రెండు, మూడు రోజులకు ఒకసారైనా వస్తారు’ అన్నాడు వినోద్. వినోద్ సలహాపై పోలీసులు ఆ ప్రదేశాల్లో నిఘా వుంచారు. రెండు రోజుల్లో కాళిదాసు ఒక డీలర్ దగ్గర డ్రగ్స్ కొంటూ దొరికిపోయాడు పోలీసులకు. -∙రాచపూటి రమేశ్ -
క్రైమ్ స్టోరీ: తమ్ముడి హత్య.. అన్న టాక్సీలోనే నిందితులు.. ఊహించని ట్విస్ట్!
‘ఏరా తమ్ముడూ.. ఏంటి విషయం? పొద్దుటే ఫోన్ చేశావు?’ అంటూ హుషారుగా అడిగాడు రాజారావు. ‘సారీ అండి. నేను ఎస్సై అంబరీష్‌ని. కృష్ణ ఫోన్ నుంచి మాట్లాడుతున్నాను’ అన్న సమాధానం వినపడగానే షాక్ అయ్యాడు. ‘ఎస్సై గారా? ఏమయింది మా తమ్ముడికి? వాడి ఫోన్ మీకెలా..?’ అని అడుగుతుండగానే..‘చాలా దారుణం జరిగిపోయింది. కృష్ణను ఎవరో హత్య చేశారు’ అని చెప్పాడు ఎస్సై అంబరీష్. అంతే నెత్తిన పిడుగు పడినట్లయింది రాజారావుకి. కాస్సేపటివరకూ అతని నోటమ్మట మాట రాలేదు. కష్టం మీద గొంతుపెగల్చుకొని నీరసంగా అడిగాడు ‘ఎక్కడ? ఎప్పుడు?’ అంటూ. ‘నిన్న రాత్రి. టోల్‌గేట్‌కి అగనంపూడికి మధ్యలో సైడ్ రూట్లో’ అని సమాధానం ఇచ్చాడు ఎస్సై. ‘నేను స్టీల్‌ప్లాంట్‌లో ఉన్నాను. అరగంటలో వస్తాను’ చెప్పాడు రాజారావు తన్నుకొస్తున్న దుఃఖాన్ని అదుపు చేసుకుంటూ. ∙∙ కత్తిపోటుకి గురైన కృష్ణ్ణ ఒళ్ళంతా నెత్తురుతో తడిసిపోయి ఉంది. చూస్తూనే బిగ్గరగా ఏడుస్తూ మృతదేహంపై పడబోతున్న రాజారావుని ఆపి ‘సారీ.. ఏమీ అనుకోకండి. పంచనామా పూర్తికాలేదు. ఈ లోగా ఎవరూ శవాన్ని ముట్టుకోకూడదు’ అంటూ అపాలజీ చెప్పాడు అంబరీష్. చాలాసేపటి వరకూ తేరుకోలేకపోయాడు రాజారావు. అప్పటివరకూ ఓపిగ్గా వేచిఉన్న అంబరీష్, ‘సారీ.. ఈ సమయంలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు. మీ తమ్ముడు ఎలాంటివాడు? అతనికి ఎవరయినా శత్రువులు ఉన్నారా?’ అంటూ రొటీన్ ప్రశ్నలు వేశాడు. ‘చాలా మంచివాడు సార్. చాలా చాలా నెమ్మదస్తుడు. నేనే కాస్త దూకుడుగా ఉంటాను. నాకు కోపం ఎక్కువ. అంత మంచి వాడిని ఇంత క్రూరంగా చంపడానికి, ఆ దుర్మార్గుడికి చేతులెలా వచ్చాయి?’ అని భోరున ఏడ్చాడు రాజారావు. అతనుచెప్పిన వివరాలను బట్టి, అన్నదమ్ములిద్దరూ ఆరేళ్ల క్రితం వైజాగ్ వచ్చి సెటిల్ అయ్యారని, చెరో టాక్సీ నడుపుకుంటూ వాళ్ళ కుటుంబాలను పోషించుకుంటున్నారని తెలిసింది. అన్నదమ్ముల స్వభావాలు పూర్తిగా భిన్నమని వాళ్ళను.. వాళ్ళ టాక్సీలను చూస్తూనే తెలుస్తోంది. కృష్ణకి శుభ్రత ఎక్కువ. రోజుకి మూడు నాలుగు సార్లయినా టాక్సీని రుద్ది రుద్ది శుభ్రం చేసుకుంటాడు. రాజారావుకి శుభ్రత బాగా తక్కువ. కృష్ణ చక్కగా షేవ్ చేసుకొని మంచి బట్టలు వేసుకుని నీట్‌గా తయారయితే, ఇతను మాత్రం మాసిన గెడ్డంతో, పెరిగిపోయిన చింపిరి జుట్టుతో, మాసిపోయిన చౌకబారు బట్టలు వేసుకొని ఉన్నాడు. అంబరీష్, రాజారావు మాట్లాడుకుంటుండగా సీఐ మహంకాళి అక్కడికి వచ్చాడు. ఎస్సై అతనికి సెల్యూట్ చేసి కేసు వివరాలు తెలియజేశాడు. ఆ తర్వాత కాళి తనదయిన శైలిలో దర్యాప్తు ప్రారంభించాడు. ఏదీ వదలకుండా అన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించాడు. ఎవరితోనో ఫోన్లో మాట్లాడాడు. ఫోరెన్సిక్ టీమ్‌కి సహాయపడడం, శవాన్ని పోస్ట్ మార్టమ్‌కి పంపడం వగైరా బాధ్యతలను ఏఎస్సైకి అప్పజెప్పి స్టేషన్‌కి బయల్దేరారు కాళి, అంబరీష్‌లు. మధ్యాహ్నానికి గానీ కేసు ఒక కొలిక్కి రాలేదు. అప్పుడు చెప్పాడు సీఐ కాళి.. ‘నా అంచనా ప్రకారం సుమారు పదిగంటల ప్రాంతంలో ముగ్గురు పాసింజర్లను ఎక్కించుకొని, వైజాగ్ నుంచి బయల్దేరాడు కృష్ణ. ఒకడు డ్రైవర్ పక్కన సీట్లో, మిగిలిన ఇద్దరూ వెనుక సీట్లో కూర్చున్నారు. వాళ్ళు తమిళనాడు నుంచి వచ్చారు. నేషనల్ హైవే మీదుగా కారు నడుపుతున్న కృష్ణను బెదిరించి, పక్కదారికి మళ్ళించి ఉంటారు. హత్య.. రాత్రి పదకొండున్నర తర్వాత జరిగింది. హత్యకు ముందు పెద్ద గొడవే జరిగింది. అయితే శాంత స్వభావుడు అయిన కృష్ణను వాళ్లు ఎందుకు చంపవలసి వచ్చింది? ఆవిషయం తేలవలసి ఉంది’ అంటూ అతను ఒక నిమిషం ఆగగానే అందుకున్నాడు అంబరీష్ ‘మరోసారి మీరు గ్రేట్ అని రుజువు చేశారు సార్. హత్యకు ముందు గొడవ జరిగిందన్న విషయం ఊహించగలిగాను. ఎందుకంటే కృష్ణ బట్టలు అక్కడక్కడ చిరిగిపోయి ఉన్నాయి. శవం పక్కన అతని షర్ట్ బటన్స్ పడి ఉన్నాయి. అతని ఒంటి మీద గాయాలూ ఉన్నాయి. కానీ మిగతా వివరాలు ఎలా తెలుసుకున్నారో నాకు తట్టడం లేదు’ అన్నాడు. ‘దర్యాప్తు చేయడంలో నువ్వు మరింత శ్రద్ధ తీసుకోవాలి. ఏ ఒక్క క్లూలనూ వదలకుండా తీవ్రంగా గాలించాలి. కృష్ణ.. టాక్సీ లోపల నాకు ఖాళీ గుట్కా పేకెట్, రెండు న్యూస్ పేపర్ ముక్కలు దొరికాయి. వాటిని నువ్వూ చూసే ఉంటావు. కానీ వాటిని పట్టించుకోలేదు. ఆ పేకెట్ తమిళనాడులో తయారయ్యింది. మన రాష్ట్రంలో ఆ పేకెట్లు దొరకవని, మన వాళ్ళ ఎంక్వైరీలో తేలింది. ఇక న్యూస్ పేపర్ ముక్కలు తమిళ పేపర్‌కి సంబంధించినవి. వాటిని వాసన చూస్తే కరక్కాయ పొడి కలిపిన మందేదో పొట్లం కట్టడానికి వాటిని వాడారని తెలుస్తోంది. అది దగ్గుకు సంబంధించిన మందు కావచ్చు. కేవలం గంట, గంటన్నర ప్రయాణంలో రెండు సార్లు ఆ మందు వేసుకున్నాడంటే ఆ మనిషికి దగ్గు ఎక్కువగా వస్తుందని భావించవచ్చు. అది అల్లోపతీ మందు కాదు, ఇక్కడ దొరక్కపోవచ్చు. కాబట్టి అది వాడుతున్న వాడు సొంత ఊరి నుంచే తెచ్చుకొని ఉండాలి. ఆ సొంత ఊరు తమిళనాడులోనే ఉండాలి. కారులో ఉన్న మేట్ మీద అస్పష్టంగా స్టోన్ క్రషర్ పౌడర్ కనిపిస్తోంది. వాళ్ళ చెప్పులకు అంటిన ఆ పౌడర్ అక్కడ రాలిందన్నమాట. ఆపౌడర్ ఉన్న చోట్లను బట్టి వాళ్ళెక్కడ కూర్చున్నారో ఊహించాను. రాజారావు చెప్పినదాన్ని బట్టి కృష్ణకు శుభ్రత ఎక్కువని తెలిసింది కదా? టాక్సీలో కనిపించిన గుట్కా పేకెట్, పేపర్ ముక్కలు, స్టోన్ క్రషర్ పౌడర్లకు కారణం పాత పాసింజర్లు కాదు. కచ్చితంగా ఆ ముగ్గురే వాటికి కారణం ’ అని చెప్పగానే కాళి సునిశిత పరిశీలనకు అబ్బురపడ్డాడు అంబరీష్. అదేమీ పట్టించుకోకుండా తన ధోరణిలో కొనసాగించాడు కాళి.. ‘కృష్ణ, లీలామహల్ దగ్గరున్న టాక్సీ స్టాండ్‌లో ఉండేవాడని చెప్పావు కదా? తమిళనాడు నుంచి వచ్చిన ముగ్గురు మనుషులు.. అక్కడికి దగ్గరలో ఉన్న ఏ లాడ్జ్లోనయినా దిగారేమో మనవాళ్ళను కనుక్కోమను. ఏదయినా లాడ్జ్ ముందున్న రోడ్డు మీద గుంతలను పూడ్చడానికి స్టోన్ క్రషర్ పౌడర్ వాడారేమో చూడమను. వాళ్ళను సులువుగా పట్టుకోవడానికి అదొక క్లూ. వాళ్ళు తమిళంలో మాట్లాడుకుంటూ ఉండొచ్చు. అది మరో క్లూ. పదకొండు ఇరవైకి కృష్ణ తన భార్యతో మూడు నిమిషాలు మాట్లాడాడని, అతని సెల్ఫోన్లో కాల్ హిస్టరీ చూస్తే తెలిసింది. అతని భార్యతో మాట్లాడి కన్ఫర్మ్ చేసుకున్నాను. దాన్ని బట్టే హత్య పదకొండున్నర తర్వాతే జరిగి ఉండాలని ఊహించాను. అయితే కృష్ణ హత్య అనుకోకుండా జరిగి ఉండొచ్చు. అతన్ని చంపాలన్న ఉద్దేశం ఎవరికీ ఉండదని, అతని చరిత్ర చెబుతోంది. అంతేకాక కేవలం అతన్ని హత్య చేయడం కోసం వాళ్ళు అంత దూరం నుంచి వచ్చారని అనుకోను. వాళ్ళ ప్లాన్ వేరే ఏదో ఉంది. మరెవరినయినా హత్య చేయడానికో లేదా బ్యాంక్ కొల్లగొట్టడానికో వచ్చి ఉంటారు. నా ఉద్దేశం ప్రకారం కొన్ని రోజులు, ఎక్కడయినా నక్కి ఆ తర్వాత వాళ్ళ కార్యక్రమం చూసుకునుంటారు. అప్పటివరకూ వైజాగ్‌లో గానీ, పరిసరాలలోగానీ దాక్కునుంటారు. మనం గట్టిగా ప్రయత్నిస్తే దొరక్కపోరు. తప్పని పరిస్థితిలో వాళ్ళు అనుకున్న నేరం చేయడాన్ని వాయిదా వేసుకొని ఉంటారు. దానికి కారణాలు రెండు. మొదటిది.. చేతిలో వాహనం లేకపోవడం. రెండవది.. అప్పుడే హత్య చేసి తప్పించుకోవడం. హత్య జరిగిన తర్వాత, వాళ్ళు రోడ్డెక్కేసరికి పన్నెండు దాటి ఉంటుంది. తిరిగి వైజాగ్ వెళ్ళడానికి ఆ సమయంలో బస్సులేవీ ఉండవు కనుక ఏ లారీయో పట్టుకొని ఉంటారు. టోల్గేట్ సీసీ ఫుటేజ్ చూస్తే కొన్ని క్లూలు దొరకొచ్చు. ఆ ఫుటేజ్ తెప్పించు’ అని ఆర్డర్ వేసి, ఆ కేసు గురించే ఆలోచిస్తూ వెనక్కి వాలాడు కాళి.. కాస్తరిలాక్స్ అవడానికి. అతను అప్పజెప్పిన పనిని పూర్తి చేయడానికి బయల్దేరాడు అంబరీష్. ∙∙ అంబరీష్ తెచ్చిన సీసీ ఫుటేజ్ చూడగానే కాళి కళ్ళు మెరిశాయి.. ‘నా ఊహ నిజమయింది. ఇక్కడ చూడూ.. సుమారు ఒంటిగంట ప్రాంతంలో రికార్డ్ అయిన సీన్ ఇది. దీని ప్రకారం ముగ్గురు కుర్రాళ్ళు లారీలో ఇరుక్కొని కూర్చున్నారు. వారిలో నల్లగా ఉన్న వాడొకడు నోటికి చేయి అడ్డుపెట్టుకొని దగ్గుతున్నాడు. రెండవ వాడు తెల్లగా ఉన్నాడు. జుట్టు పూర్తిగా ఊడిపోయి దాదాపు గుండులా తయారయ్యింది. మూడో వాడు సన్నగా పొడవుగా ఉన్నాడు. అయితే ఈ ఫుటేజ్ సహాయంతో వాళ్ళను గుర్తుపట్టడం అంత సులువేమీ కాదు. మన ఆర్టిస్టుని పిలిపించి అన్ని ఏంగిల్స్‌లో వాళ్ళ ఊహా చిత్రాలను గీయమని చెప్పు. ఆ బొమ్మలను అన్ని స్టేషన్లకు పంపి, అందరినీ గాలించమని చెప్పు. వాళ్ళు ఎక్కిన లారీని ట్రేస్ చేయండి. ఆ డ్రైవర్‌ను పట్టుకుంటే వాళ్ళ పోలికలు తెలిసిపోతాయి. వాళ్ళు మాట్లాడే భాష, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ మొదలయినవి అర్థమైపోతాయి’ అన్నాడు హుషారుగా. అంబరీష్లోనూ కొత్త ఉత్సాహం వచ్చింది. కేసు త్వరగానే సాల్వ్ అయిపోతుందనే ఆశ కలిగింది. తొందరగానే లారీని ట్రేస్ చేశారు పోలీసులు. డ్రైవర్ ద్వారా ఆ ముగ్గురి వివరాలూ తెలిశాయి. వాళ్ళను వైజాగ్‌లో ఎక్కడ దించాడో కూడా తెలిసింది. ‘ఇంకేముంది? వాళ్ళు దొరికిపోయినట్లే. నేరస్తులను పట్టుకోవడానికి బోలెడు క్లూలు ఉన్నాయి’ అనుకుంటూ రెట్టించిన ఉత్సాహంతో గాలింపు మొదలుపెట్టారు పోలీసులు. వాళ్ళను పట్టుకున్నారన్న వార్తను వినడానికి అసహనంగా వెయిట్ చేస్తున్నారు ఇన్స్పెక్టర్లు. కానీ రోజులు గడుస్తున్నా ఏ ప్రోగ్రెస్ కనబడటం లేదు. వాళ్ళు దిగిన లాడ్జ్‌ను కనిపెట్టారు గానీ, అప్పటికే వాళ్ళు గది ఖాళీ చేసి వెళ్లిపోయినట్లు తెలిసింది. రాజారావు రోజూ స్టేషన్‌కి వచ్చి కేసు విషయంలో ప్రోగ్రెస్ ఏమీ లేదని తెలుసుకొని బాధ పడుతూ తిరిగి వెళ్ళిపోతున్నాడు. ∙∙ ఒకరోజు రాత్రి పదిగంటలు దాటిన తర్వాత రాజారావు నుంచి అంబరీష్‌కు ఫోన్ రావడంతో ఒక్కసారిగా కేసు మలుపు తిరిగింది. ‘సర్.. ఆ ముగ్గురూ ఇప్పుడు నా టాక్సీలోనే ఉన్నారు. అర్జంట్‌గా టాయిలెట్‌కి వెళ్ళాలని చెప్పి సులభ్ కాంప్లెక్స్‌కి వచ్చి మీకు ఫోన్ చేస్తున్నాను. అనకాపల్లి వెళ్లి రావడానికి ఐదువేలిస్తామని నాతో బేరం కుదుర్చుకున్నారు. ఇద్దరు తమిళంలోనే మాట్లాడు కుంటున్నారు. వాళ్ళలో ఒకడు దగ్గుతున్నాడు. మరొకడిది బట్టతల. బేరం ఆడినవాడు సన్నగా పొడవుగా ఉన్నాడు. కచ్చితంగా వాళ్ళే సార్’ అని చెప్పాడు గబగబా. ‘వెరీ గుడ్. మనకి ఇలా కలిసి వచ్చిందన్న మాట. నీ ఫోన్‌ని ట్రాక్ చేస్తూ, వాళ్లకు అనుమానం రాకుండా మిమ్మల్ని ఫాలో అవుతాం. నువ్వేమీ భయపడకు’ అంటూ అభయాన్ని ఇచ్చి ఫోన్ కట్ చేశాడు అంబరీష్. ∙∙ ‘సర్.. నేనిప్పుడు అనకాపల్లిలో ఉన్నాను. లొకేషన్ షేర్ చేశాను. నన్ను ఇక్కడే ఉండమని వాళ్ళు ముందుకు నడిచి వెళ్తున్నారు. ఎడమ వైపు నాలుగవ వీధిలోకి తిరిగారు’ అని వివరం అందించాడు రాజారావు. ‘మేం దగ్గరలోనే ఉన్నాం. రెండు నిమిషాల్లో చేరుకుంటాం’ అని ఫోన్ పెట్టేశాడు అంబరీష్. అన్నట్టుగానే రెండు నిమిషాల్లో పోలీసు జీపు అక్కడికి వచ్చింది. అంబరీష్‌తో సాయుధులయిన ఇద్దరు పోలీసు ఆఫీసర్లు, ఇద్దరు పోలీసులు నాలుగవ వీధి వైపు నడిచారు. రాజారావు అక్కడే ఉండిపోయి ఏం జరగబోతుందోనన్న ఉత్సుకతతో ఎదురుచూడసాగాడు. దాదాపు అరగంట దాటినా వెళ్ళిన వాళ్ళు తిరిగి రాకపోయేసరికి రాజారావులో టెన్షన్ మొదలయింది. గాభరా పడుతూ అటువైపే చూడసాగాడు. అక్కడికి వెళ్లి చూడ్డానికి అతనికి ధైర్యం సరిపోవడం లేదు. కాస్సేపటికి పోలీసులు తిరిగిరావడం చూసి అతని మనసు కుదుటపడింది. వాళ్ళతో పాటు నడుస్తున్న ముగ్గురు నేరస్తులు, వాళ్ళ చేతికి తగిలించిన బేడీలు చూడగానే ఆనందం పట్టలేకపోయాడు రాజారావు. గబగబా అంబరీష్‌కు ఎదురెళ్ళి..‘ఏమయింది సార్? మా తమ్ముడిని ఎందుకు చంపారు ఈ దుర్మార్గులు?’ అంటూ ఆత్రుతగా ప్రశ్నిస్తున్న రాజారావు వైపు నవ్వుతూ చూస్తూ, ‘అన్ని వివరాలూ స్టేషన్‌కి వెళ్ళిన తర్వాతే. అంతవరకూ సస్పెన్స్ అని చెప్పాడు అంబరీష్. చేసేదేమీలేక తల ఊపాడు రాజారావు. స్టేషన్‌కి వెళ్ళిన తర్వాత అంబరీష్ చెప్పడం మొదలుపెట్టాడు.. కాళితో సహా అందరూ శ్రద్ధగా వినసాగారు.. ‘సన్నగా పొడవుగా ఉన్నవాడి పేరు రాహుల్.. తెలుగువాడే. వాడే అసలు నేరస్తుడు. రాహుల్‌కి పన్నెండేళ్ల వయసప్పుడు తండ్రి చనిపోతే, తల్లి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకొని కలకత్తా వెళ్ళిపోతూ కొడుకును తన తండ్రి జానకిరామ్‌కు అప్పగించింది. అప్పటినుంచి ఆయనే వీడిని గొప్ప క్రమశిక్షణతో పెంచి పెద్ద చేశాడు. అదే కొంప ముంచింది. తల్లితండ్రుల ప్రేమకు దూరమయిన రాహుల్.. తాతగారి స్ట్రిక్ట్ డిసిప్లిన్‌తో విసిగిపోయి, తాత అంటే అయిష్టాన్ని పెంచుకున్నాడు. అది కక్షగా మారడానికి ఎక్కువ రోజులు పట్టలేదు. తనకు స్వేచ్ఛను ఇవ్వడం లేదని, కనీస అవసరాలకు కూడా డబ్బు ఇవ్వడం లేదని తల్లికి తరచూ ఫిర్యాదు చేసేవాడు. ‘నీ మంచి కోసమే తాతగారు అలా చేస్తున్నారు’ అంటూ తల్లి.. జానకిరామ్‌ను సమర్థిస్తూ రావడంతో తాత మీద కక్ష ఇంకా పెరిగింది. ఇంటర్ అత్తెసరు మార్కులతో పాస్ అయిన రాహుల్‌ను చెన్నైలో ఒక ఇంజినీరింగ్ కాలేజ్‌లో చేర్చారు భారీ డొనేషన్ కట్టి. అక్కడ మిగిలిన ఇద్దరు నేరస్తులు రామన్, రాఘవన్‌లు పరిచయం అయ్యారు. వాళ్ళ సహవాసంతో రాహుల్‌కు అన్ని వ్యసనాలు అబ్బాయి. ఇంటి దగ్గర నుంచి పంపే డబ్బు సరిపోక అప్పులు పెరిగిపోయి అతని పరిస్థితి దుర్భరం అయింది. తాత దగ్గర తల్లి నగలు, బోలెడంత డబ్బు ఉన్నట్లు రాహుల్ పసిగట్టాడు. తాతను చంపేసి డబ్బు, నగలు పట్టుకుపోవాలని ప్లాన్ వేసి ఇద్దరినీ తోడు తెచ్చుకున్నాడు. హత్య జరిగిన రోజు రాత్రి కృష్ణ టాక్సీలో ఎక్కిన ఆ ముగ్గురు జానకిరామ్‌ను ఎలా చంపాలో చర్చించుకోవడం మొదలుపెట్టారు. తాము మాట్లాడేది తమిళం కాబట్టి వాళ్లు కృష్ణని పట్టించుకోలేదు. కానీ కృష్ణకు తమిళం వచ్చు. వాళ్ళ ప్లాన్ అర్థమైయిపోయింది అతనికి. కారు ఆపి వాళ్ళను దిగిపోమని, పోలీసులకు ఈ విషయం చెప్తానని బెదిరించాడు కృష్ణ. దాంతో రాఘవన్.. కృష్ణ మెడపై కత్తి పెట్టి, కారుని పక్కదారి పట్టించాడు. అక్కడ కారు ఆపించి కృష్ణను దారుణంగా కొట్టి, కత్తితో పొడిచి చంపేశారు. రెండవ ప్రయత్నంలో వాళ్ళు రాజారావు కారు ఎక్కడం యాదృచ్ఛికం. అలాకలిసొచ్చి వాళ్లు దొరికి నిజాలు బయటపడ్డాయి’ అంటూ ముగించాడు అంబరీష్. (సుమారు నాలుగు దశాబ్దాల కిందట విశాఖ జిల్లాలో జరిగినయదార్థ సంఘటన ఆధారంగా రాసిన కథ) చదవండి👉🏾కథ: ‘నేను’... సుందర్‌ని చంపేశానన్నమాట! ఇంతకీ ఏం జరిగింది? -
Crime Story: ఇంట్లోకి ఎలా రాగలిగారో..!
పోలీస్ స్టేషన్ చేరుకున్నాడు లక్ష్మీకాంత్. ‘చెప్పాగా. మీరు వెళ్ళండి’ చెప్పాడు అతడితో వచ్చిన అతను. బెరుకు బెరుకుగా లోపలికి వెళ్లాడు లక్ష్మీకాంత్. అతడు తొలిసారిగా పోలీస్ స్టేషన్‌కు వచ్చాడు. ఇన్స్పెక్టర్ని కలిశాడు. ‘చెప్పండి’ అన్నాడు ఇన్స్పెక్టర్. ‘నేను లక్ష్మీకాంత్... నేను...’ చెప్పుతున్నాడు లక్ష్మీకాంత్. ‘ముందు వచ్చిన పని చెప్పండి’ అడ్డుపడ్డాడు ఇన్స్పెక్టర్. ‘మరండీ’ లక్ష్మీకాంత్ తొట్రుబాటు శుభ్రంగా తెలుస్తోంది. ‘ఏమైంది’ ఇన్స్పెక్టర్ అడిగాడు. ‘మా ఇంట్లో దొంగలు పడ్డారు’ చెప్పాడు లక్ష్మీకాంత్. ‘బంగారం నగలు... వెండి వస్తువులు... నగదు పోయాయి’ వెంటనే చెప్పాడు. ‘ఎప్పుడు? ఎలా?’ విచారణ మొదలెట్టాడు ఇన్స్పెక్టర్. ‘రాత్రి. ఎలా అంటే...’ ‘పూర్తిగా వివరంగా చెప్పాలి’ చెప్పారు ఇన్స్పెక్టర్. లక్ష్మీకాంత్ తంటాలు పడుతున్నాడు. అతడ్నే చూస్తూ, ‘చెప్పండి’ అన్నాడు ఇన్స్పెక్టర్ మళ్ళీ. ‘నేను నా భార్య రమణి ఇక్కడ అంటే విశాఖపట్నంలో ఉంటున్నాం. మా సొంత ఇల్లు, చాలా వరకు మా బంధువులు ఇక్కడే ఉంటున్నారు. అబ్బాయి శ్రీకాంత్ ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో, అమ్మాయి శ్రీవల్లి పెళ్లి రీత్యా బెంగుళూరులో ఉంటున్నారు. నేను.. రమణి నిన్న ఉదయం గుంటూరు వెళ్లాం. అక్కడ రమణి అన్నయ్య గుణశేఖర్ కుటుంబం ఉంటుంది. వాళ్లింట్లో గుణశేఖర్ రెండవ కూతురు భామ పెళ్ళికి ముహూర్తం తీసే కార్యక్రమం కావడంతో మేము వెళ్లాం. అక్కడ పని కాగానే బయలుదేరి ఉదయం తిరిగి ఇంటికి వచ్చాం. మెయిన్ గేట్ తలుపు తాళం తీసుకొని ఇంట్లోకి వెళ్లాం. గదిలోకి వెళ్తే బీరువా తెరిచి ఉంది. దానిలో దాచిన నగలు, నగదు కనిపించడంలేదు. మేము వెళ్లేటప్పుడు గడియ పెట్టిన పెరటి వైపు తలుపు దగ్గరగా మూసి ఉంది. ఆ గడియ మాత్రం తీసి ఉంది. మా హైరానాకి ఇరుగు పొరుగు వారు వచ్చారు. మా పొరుగాయన ఎకాఎకీన లాక్కొస్తేనే నేను మీ దగ్గరకి వచ్చాను. ఆయన బయటే ఉండిపోయాడు. పోలీసులంటే భయమట’ తలాడిస్తూ ఇన్స్పెక్టర్ ‘మీకు అనుమానాలేమైనా ఉన్నాయా’ అడిగాడు. ‘దొంగలు ఇంట్లోకి ఎలా రాగలిగారో తెలియడం లేదండీ’ ‘లక్ష్మీకాంత్గారూ అది మేము తేలుస్తాం. నేను తెలుసుకోవాలనుకుంటుంది దొంగతననాకి కారకులు వీరై ఉండొచ్చు అన్న అనుమానితులు ఎవరైనా మీ దృష్టిలో ఉన్నారా అని’ ఆగాడు ఇన్స్పెక్టర్. లక్ష్మీకాంత్ అయోమయమయ్యాడు. తల గొక్కున్నాడు. నిముషం తర్వాత – ‘బీరువాలో నగలు, నగదు సర్దడం మాతో పాటు మా ఇంటి పని మనిషి కాంతానికీ తెలుసు’ చెప్పాడు లక్ష్మీకాంత్. ‘ఆ కాంతం మీతో పాటే ఉంటుందా?’ వెంటనే ఇన్స్పెక్టర్ అడిగాడు. ‘లేదు. కాంతం కుటుంబం మాకు దగ్గరలోనే ఉంది. కాంతం మాత్రం ఉదయం ఆరింటికి వస్తుంది. రాత్రి ఎనిమిది వరకు మాతోనే ఉంటుంది. తన రోజు వారీ టిఫిన్, భోజనాలు మాతోనే చేస్తుంది. నా భార్య అనారోగ్యం కారణంగా కాంతాన్ని ఇంటి, వంట పనులకి నియమించాను’ లక్ష్మీకాంత్ చెప్పుతున్నాడు. ‘కాంతం మీద మీకు అనుమానమా?’ ఠక్కున అడిగాడు ఇన్స్పెక్టర్. ‘ఏమో. కాంతం నమ్మకస్తురాలుగా తిరిగేది’ లక్ష్మీకాంత్ గొంతు వణుకుతోంది. ‘మీరు ఊరు వెళ్లేక కాంతానికి ఇంటి పనులు ఏమైనా చెప్పారా. కాంతానికి ఇంటి తాళాలు ఏమైనా ఇచ్చారా’ అడిగాడు ఇన్స్పెక్టర్. ‘లేదు. కానీ బీరువా తాళాలు బీరువా వెనుక గోడ మేకుకి పెట్టేశాం ఎప్పటిలాగే’ ‘కాంతానికి అలా మీరు తాళాలు పెట్టడం తెలుసా? మీరు ఎప్పుడు వచ్చేది కూడా కాంతానికి తెలుసా?’ ఇన్స్పెక్టర్ అడిగాడు. ‘తనకి అన్నీ తెలుసు. ఈ రోజు ఉదయం ఏడు ఎనిమిది మధ్య తిరిగి వచ్చేస్తామని కాంతానికి చెప్పాం’ అన్నాడు లక్ష్మీకాంత్. ఇన్స్పెక్టర్ తన రిస్ట్ వాచీ వైపు చూసుకున్నాడు. ‘పదవుతోంది. మరి కాంతం మీరు చెప్పిన టైమ్‌కి మీ ఇంటికి వచ్చిందా? అన్నట్టు మీరు ఎన్ని గంటలకి వచ్చారు?’ ‘బస్సులో వచ్చాం. ఆలస్యమైంది. మేము ఇంటికి చేరేసరికి తొమ్మిది దాటింది’ చెప్పాడు లక్ష్మీకాంత్. ‘మీ కంప్లయింట్ పేపరు మీద రాసి ఇవ్వండి. తదుపరి చర్యలు చేపడతాం’ లక్ష్మీకాంత్ ఆ పనికి తటపటాయిస్తుండగా అతడి సెల్‌ఫోన్ రింగయ్యింది. ‘చెప్పు’ అన్నాడు. అటు రమణి. ‘కంప్లయింట్ ఇచ్చేశారా?’ సర్రున అడిగింది రమణి. ’ఆ.. లేదు. ఇంకా లేదు’ తడబడుతున్నాడు లక్ష్మీకాంత్. ‘అయ్యో...! ఏమిటి మీరు చేస్తుంది? నాతో చెప్పకుండా పొరుగాయన లాక్కుపోతే స్టేషన్‌కి పోవడమేనా? ఆ విషయం నాకు ఇప్పుడే తెలిసింది. కంప్లయిట్ ఇవ్వకండి. వచ్చేయండి’ గట్టిగానే చెప్పింది రమణి. నీళ్లు నములుతున్నాడు లక్ష్మీకాంత్. ఇన్స్పెక్టర్ వైపు చూపు తిప్పాడు. అప్పటికే లక్ష్మీకాంత్ చేష్టల్ని ఇన్స్పెక్టర్ గమనిస్తూ ఉన్నాడు. ‘ఏమైంది?’ అడిగాడు. లక్ష్మీకాంత్ తలని అస్థిరంగా ఆడించి ‘సరే రమణీ.. కంప్లయింట్ ఇవ్వను. నేను వచ్చేస్తాను’ అంటూ ఆ ఫోన్ కాల్ని కట్ చేసేశాడు. ఇన్‌స్పెక్టర్‌నే చూస్తున్నాడు. ‘చెప్పండి.. ఏం జరుగుతోంది? అటు మాట్లాడింది ఎవరు?’ టకటకా అడిగాడు ఇన్స్పెక్టర్. లక్ష్మీకాంత్ వెంటనే చెప్పలేకపోయినా ఇన్స్పెక్టర్ గుచ్చి గుచ్చి అడగడంతో – ‘నా భార్య. కంప్లయింట్ ఇవ్వొద్దంటుంది. నన్ను వచ్చేయమంటుంది’ చెప్పేశాడు. ‘వాట్ వాట్’ రియాక్టయ్యాడు ఇన్స్పెక్టర్. ‘బిలబిలా పోగైన వాళ్ళు తలో మాటతో నన్ను తొందర చేయడంతో నేను ఇలా వచ్చేశాను’ నొచ్చుకుంటున్నాడు లక్ష్మీకాంత్. ‘బాగుంది. బాగుంది. జరిగింది చాలా పెద్ద నష్టం. ఇక్కడ మీ భార్య అభిప్రాయం ఏమిటి? ఎందుకు? ఆ’ ఇన్స్పెక్టర్ చిరాకవుతున్నాడు. లక్ష్మీకాంత్ హైరానా పడుతున్నాడు. అతడ్ని ఇన్స్పెక్టర్ చిత్రంగా చూస్తున్నాడు. ‘నేను ఇంటికి వెళ్ళిపోతాను. కంప్లయింట్ ఇవ్వను’ చెప్పేశాడు లక్ష్మీకాంత్. ‘అవునా. అది మీ ఇష్టం. సరే. ఈ మాత్రం మీరు ఓరల్‌గా చెప్పింది మాకు చాలు. కావాలనుకుంటే మేము మా వైపు పని మొదలు పెట్టవచ్చు’ సూటిగా మాట్లాడేడు ఇన్స్పెక్టర్. లక్ష్మీకాంత్ గింజుకుంటూనే – ‘నేను నా భార్యతో మాట్లాడి వస్తాను’ ఎలాగో చెప్పగలిగాడు. ‘నేనేమీ మిమ్మల్ని ఆపలేదే’ ఇన్స్పెక్టర్ సీరియస్‌గా ఉన్నాడు. లక్ష్మీకాంత్ మెల్లిగా లేచాడు. బయటికి నడిచాడు. లక్ష్మీకాంత్ చేష్టలకి ఇన్స్పెక్టర్లో కుతూహలం, అనుమానం పొడచూపాయి. దారిలో తనతో వచ్చిన పొరుగింటతనితో ఏమీ మాట్లాడక లక్ష్మీకాంత్ ఇంటికి చేరిపోయాడు. ఇంట్లో కొద్ది మందే ఉన్నారు. కాంతం కూడా ఉంది. లక్ష్మీకాంత్ నేరుగా రమణిని చేరి ఆమెను తనతో గదిలోకి తీసుకుపోయాడు. ‘పోలీస్ కంప్లయింట్ వద్దనుకున్నాంగా’ ఠక్కున అంది రమణి. ‘అవును... కానీ... ’ లక్ష్మీకాంత్ ఇంకా తంటాల్లోనే ఉన్నాడు. ‘ఇప్పుడు మనం ఏం చేయాలి?’ విసురుగా అడిగింది రమణి. అప్పటికే అక్కడకి చేరిన ఇన్స్పెక్టర్, ‘నేను తేలుస్తాగా’ అన్నాడు. లక్ష్మీకాంత్ దంపతులు గతుక్కుమన్నారు. ఇన్స్పెక్టర్ని చూస్తూ నోట మాట రాక ఉండిపోయారు. ఆ వచ్చిన ఇన్స్పెక్టర్ తన సహచరుల సహాయంతో తన చర్యల్ని ముమ్మరం చేశాడు. గంట గడవక ముందే ఆ కేస్‌ను ఒక కొలిక్కి తెచ్చేశాడు. ‘మీ పిల్లలకి తెలియకూడదని మీ ఇద్దరూ కూడబలుక్కుని ఏ మాత్రం ఏమిటి మీ గుణశేఖర్‌కి ముట్టచెప్పేశారు?’ అడిగాడు ఇన్స్పెక్టర్. లక్ష్మీకాంత్, రమణిలు మాట్లాడం లేదు. ‘మీ పిల్లలకు నగలు, నగదు దొంగతనంలో పోయాయని నమ్మంచడానికి మీరు ప్లాన్ చేయడం భలేగా ఉంది’ నవ్వేడు ఇన్స్పెక్టర్. లక్ష్మీకాంత్, రమణి మొహాలు చూసుకున్నారు. ‘పెరటి వైపు నుండి దొంగలు దొంగతనం చేసినట్టు నమ్మించడానికి ఇటు తలుపు గడియ తీసి పెట్టారా. అబ్బో. హు. మీ అడ్డ దారే మిమ్మల్ని అడ్డంగా దొరకపుచ్చింది’ చెప్పాడు ఇన్స్పెక్టర్. ‘మా అన్నయ్య బాగా చితికిపోయాడు ...’ రమణి చెప్పుతోంది. ‘అవునవును’ అన్నాడు లక్ష్మీకాంత్. ‘అందుకు చనిపోయిన నీ మొదటి భార్య పిల్లల్ని మోసం చేస్తావా లక్ష్మీకాంత్! నీ రెండో భార్య రమణి మీద నీకు బోలెడు అనురాగం ఉండొచ్చు. కానీ మరీ ఇంత బ్లండర్‌గా దానిని ప్రెజెంట్ చేయకూడదు’ చెప్పుతున్నారు ఇన్స్పెక్టర్. లక్ష్మీకాంత్ భయం తెలుస్తుంది. ‘నీ కడుపు పిల్లలు కాకపోయినా వాళ్ళు నీ భర్త పిల్లలే కదమ్మా రమణి!’ రమణి అలజడి తెలుస్తోంది. ‘మంచి పనిని నిర్భయంగా చేపట్టాలి. లేకపోతే అది ఎంత మంచిదైనా వ్యర్థమే. తగ్గ శిక్ష అనుభవించక తప్పదు’ లక్ష్మీకాంత్, రమణి తలలు దించుకున్నారు. -బివిడి ప్రసాదరావు -
వేట.. ఎ క్రైం స్టోరీ
గత డెబ్బయ్ రెండు గంటల్లో జరిగిన సంఘటనలు రాహుల్‌ని రోడ్ మీద పడేశాయి. వేటజంతువులా పరుగులు పెడుతున్నాడు. ఇరవై ఎనిమిదేళ్ళుంటాయి అతనికి. హైదరాబాదులో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్నాడు. త్వరలో అతని కొలీగూ, గాళ్ ఫ్రెండూ అయిన కల్పనతో వివాహం కానుంది. మూడు రోజుల క్రితం.. ఆఫీసులో సెకండ్ షిఫ్ట్ లో వర్క్ చేసి అర్థరాత్రి తరువాత మోటార్ బైక్‌లో ఇంటికి బయలుదేరాడు రాహుల్. జూబ్లీ హిల్స్ దగ్గరకు వచ్చేసరికి ఓ ప్రైవేట్ బ్యాంక్ వెనుకనున్న సందులోంచి షార్ట్–కట్ తీసుకున్నాడు, ఎప్పటిలాగే. అదిగో, అప్పుడే కనిపించింది అతనికి.. అక్కడ వున్న ఓ ప్రైవేట్ బ్యాంక్ లోపల లైట్స్ వెలుగుతున్నట్టు. లోపల నుండి ఏవో నీడలు కదలుతున్నట్టు కిటికీలోంచి కనిపించాయి. మెయిన్ రోడ్ వైపునున్న బ్యాంక్ ముఖద్వారం మూసివుండడం గుర్తుకు వచ్చింది. ఏదో అనుమానం వచ్చింది. బైక్ ఓ పక్కగా ఆపి, వెనుక ద్వారం వైపు వెళ్ళాడు. తలుపు మెల్లగా తోసిచూస్తే తెరచుకుంది. లోపలి దృశ్యాన్ని గాంచి అవాక్కయ్యాడు. ముగ్గురు వ్యక్తులు లోపలి నుండి గుమ్మంవైపు వస్తున్నారు. వారి భుజాలపైన బరువైన సంచులు ఉన్నాయి. వారి వాలకం చూస్తే దొంగలనీ, బ్యాంక్‌ని దోచుకుంటున్నారనీ అర్థమయిపోయింది. ‘ఏయ్, ఎవరు మీరు?’ అని అరిచాడు అప్రయత్నంగా. అదే అతను చేసిన పొరపాటు! ఉలికిపడి చూశారు వాళ్ళు. హఠాత్తుగా అక్కడ ప్రత్యక్షమైన అతన్ని చూసి అవాక్కయ్యారు. దొంగలు, రాహుల్.. ఒకరినొకరు పరీక్షగా చూసుకున్నారు. వారిలో ఒకడు జేబులోంచి పిస్టల్ తీశాడు. చటుక్కున బయటకు గెంతాడు రాహుల్. మెరుపులా పరుగెత్తి, బైక్‌ని చేరుకున్నాడు. బైక్ ఎక్కి దుండగుడి కాల్పుల మధ్య అక్కడ నుండి వేగంగా వెళ్ళిపోయాడు. దారిలో ఓ పబ్లిక్ బూత్ వద్ద ఆగి, పోలీస్ కంట్రోల్ రూమ్‌కి ఫోన్ చేసి, తన పేరు చెప్పకుండా, విషయం చెప్పాడు. ఆ బ్యాంక్ దోపిడీ నగరంలో గొప్ప సంచలనం రేపింది. బ్యాంక్ స్ట్రాంగ్ రూమ్నీ, లాకర్స్నీ ఎలక్ట్రానిక్ పరికరాలతో కోసేశారు దొంగలు. కొన్నివేల కోట్ల ధనం, బంగారం దోపిడీ అయినట్టు బ్యాంక్ యాజమాన్యం చెప్పింది. పోలీసులకు దొంగలను గూర్చిన ఎటువంటి క్లూ దొరకలేదు. బ్యాంక్ లోపలి సీసీ టీవీ కెమెరాలు పగిలిపోయున్నాయి. వెనుక సందులో కెమెరాలు లేవు. స్నిప్ఫర్ డాగ్స్ కూడా ఏమీ చేయలేకపోయాయి. పోలీస్ కంట్రోల్ రూమ్‌కి ఫోన్ చేసిన వ్యక్తి ఎవరో తెలియలేదు. దోపిడీకి గురైన బ్యాంక్ సమీపంలో మెయిన్ రోడ్ మీద ఉన్న సీసీ టీవీ కెమెరా ద్వారా దోపిడీ జరిగినప్పుడు అటువైపు వెళ్ళిన ఏకైక మోటార్ బైక్‌ని పోలీసులు గుర్తించారనీ, దాని రిజిస్ట్రేషన్ నంబర్ ద్వారా యజమానిని తెలుసుకోబోతున్నారనీ, తాము వెదుకుతున్న ప్రత్యక్షసాక్షి అతనే అయ్యుండాలనీ పోలీసులు గాఢంగా విశ్వసిస్తున్నారనీ...’ –టీవీ చానెల్స్ బ్రేకింగ్ న్యూస్ ఫ్లాష్ చేస్తూంటే జడుసుకున్నాడు రాహుల్. దొంగల ముఖాలను స్పష్టంగానే చూశాడు తాను. వాళ్ళను మళ్ళీ చూస్తే గుర్తుపట్టగలడు. కానీ, తన పేరు బయటకు వచ్చిందంటే, దొంగలు తనను ఊరకే విడిచిపెట్టరు. ఒంటరిగా ఉంటున్న రాహుల్.. ఇంటికి తాళం పెట్టేసి ‘అండర్ గ్రౌండ్’కి వెళ్ళిపోయాడు! రెండురోజుల తరువాత మరో వార్త అతన్ని బెంబేలెత్తించింది.. ‘పోలీసులు దొంగల్ని పట్టుకోవడానికి టీమ్స్‌ని నలుదిశలకూ పంపించారు. వెహికిల్ రిజిస్ట్రేషన్ ఆధారంగా సాక్షిని ఓ సాఫ్ట్వేర్ ఇంజనీరుగా గుర్తించారు. అతనికోసం పోలీసులు వెదుకుతున్నారు. అతను దొంగల రూపాలను వర్ణించితే ఆర్టిస్ట్ చేత వారి చిత్రాలను గీయించాలనుకుంటున్నారు’ అని. అంతేకాదు ‘సాక్షిని ఎలిమినేట్ చేసే నిమిత్తం పోలీసులతో పాటు దొంగలు కూడా అతనికోసం వెదుకుతుంటారనడంలో సందేహంలేదు’ అన్న చానెల్స్ కామెంట్స్ మరింత భయపెట్టాయి అతన్ని. ఆ గొడవ సద్దుమణిగేంతవరకు కొన్నాళ్ళపాటు సిటీ వదిలి ఎక్కడికైనా వెళ్ళిపోవాలనుకున్నాడు. ఇటు పోలీసులు, అటు దొంగలూ తనకోసం ‘వేటాడుతూంటే’ చెన్నైలో ఉన్న అతని స్నేహితుడి దగ్గరకు బయలుదేరాడు రెంటల్ కారులో. కారు వేగంగా దూసుకుపోతోంది. రేడియో ఆన్ చేశాడు రాహుల్, అప్ డేట్స్ ఏవైనా ఉంటాయేమోనని. లేట్ నైట్ న్యూస్ చానెల్స్ స్క్రీన్ మీది స్క్రోలింగ్‌లో పోలీసులు తనను గుర్తించినట్టూ, తనకోసం వెదుకుతున్నట్టూ చదివి ఉలిక్కిపడ్డాడు. ‘అన్ని పోలీస్ స్టేషనలకూ తన ఫొటోని రహస్యంగా సర్క్యులేట్ చేశారు’ అప్రయత్నంగా తల మీది మంకీ క్యాప్‌ని ముఖం మీదకు లాక్కున్నాడు. నైట్ గాగుల్స్‌ని సరి చేసుకున్నాడు. రేడియో ఆఫ్ చేసి, యాక్సిలరేటర్‌ని గట్టిగా తొక్కాడు. సూర్యాపేట తరువాత ఓ పోలీస్ కానిస్టేబుల్ కారాపాడు. రాహుల్ భయపడుతూంటే, లిఫ్ట్ అడిగాడు అతను. ఎక్కించుకోక తప్పలేదు. పక్కన కూర్చుని ఏదో ఒకటి మాట్లాడుతూనే వున్నాడతను. హైదరాబాదులో జరిగిన బ్యాంక్ దోపిడీ గురించి ప్రస్తావిస్తూంటే, రాహుల్‌కి ఇబ్బందిగా వుంది. ‘ప్రత్యక్షసాక్షిని కనిపెట్టినవారికి యాభైవేలరూపాయల బహుమతిని ప్రకటించింది డిపార్ట్మెంట్’ చెప్పాడు కానిస్టేబుల్. ‘అతను నాకు దొరికితే అందరిలా బహుమతికి కక్కుర్తిపడను’ ఆశ్చర్యంతో చూశాడు రాహుల్. ‘అతన్ని కిడ్నాప్ చేసి వారంరోజులపాటు దాచివుంచుతాను. ఆ తరువాత కష్టపడి పట్టుకున్నట్టు బిల్డప్ ఇచ్చి డిపార్ట్మెంట్కు అప్పగిస్తాను. దాంతో నాకు హెడ్‌కానిస్టేబుల్ నుండి ఏఎస్సైగా ప్రమోషన్ ఖాయం!’ అంటూ ఫకాలున నవ్వాడతను. ‘మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది’ అన్నాడు హఠాత్తుగా. బలవంతం మీద ఉలికిపాటును ఆపుకున్నాడు రాహుల్. టోల్ గేట్ దగ్గర దిగిపోయాడు హెడ్‌కానిస్టేబుల్. దిగుతూ ‘కొంపదీసి మేం వెదుకుతున్న ఆ సాఫ్ట్వేర్ ఇంజనీరు మీరు కాదుగదా?’ అన్నాడు. రాహుల్ కంగారుపడడం చూసి, ‘జోక్ చేశాన్లే. వెళ్ళి రండి’ అంటూ శాల్యూట్ చేశాడు. ‘బ్రతుకు జీవుడా!’ అనుకుంటూ రాహుల్ కారును వేగంగా ముందుకు ఉరికించాడు. కోదాడ సమీపిస్తూండగా కల్పన ఫోన్ చేసింది..‘ఏమయిపోయావ్ రాహుల్? మూడురోజులుగా ప్రయత్నిస్తూంటే లైన్ కలవడంలేదు. ఆఫీసుక్కూడా రావడంలేదు. ఏదైనా ప్రోబ్లమా?’ అంటూ ఆత్రంగా. జరిగిందంతా అతను వివరించడంతో నిర్ఘాంతపోయిందామె. తేరుకుని, ‘టేక్ కేర్. ఐ విల్ గెట్ బ్యాక్’ అని ఫోన్ పెట్టేసింది. కారు కోదాడ నుండి గుంటూరు బాట పట్టింది. ఏదో నేరం చేసినవాడిలా చట్టం నుండి పారిపోవడం ఎలాగో ఉంది అతనికి. పోలీసులు, దొంగలూ తనకోసం జాయింటుగా నిర్వహిస్తూన్న ‘వేట’ అది! తెల్లచీర కట్టుకున్న ఓ యువతి కారు ఆపమంటూ చేయి వూపింది. పాతికకు అటోఇటో ఉంటుంది ఆమె వయసు. ‘ప్లీజ్! నాకు లిఫ్ట్ ఇవ్వగలరా?’ అనడిగింది. రాహుల్ డైలమాలో పడిపోయాడు. ‘ఆ వేళప్పుడు ఆ స్త్రీ హైవే మీదకు ఎలా వచ్చింది? ఓ అపరిచిత యువతిని కారులో ఎక్కించుకోవడం మంచిదేనా?’ అతని సంశయాన్ని పసిగట్టిన ఆమె, ‘ఎదర ఉన్న ధాబా దగ్గర దిగిపోతాను’ అంది. ఒంటరి ఆడపిల్లను అలా వదిలి వెళ్ళిపోవడానికి మనసు రాలేదు అతనికి. పక్కకు వంగి డోర్ తెరచాడు. ఎక్కి కూర్చుందామె. ఆ వేళప్పుడు ఆమె ఒంటరిగా అక్కడ వుండడానికి కారణం అడిగితే, ‘ప్లీజ్.. ఇప్పుడు నన్నేమీ అడక్కండి’ అంది చెంగుతో కళ్ళు తుడుచుకుంటూ. ఓ కిలోమీటరు దూరం వెళ్ళాక ధాబా ఒకటి వచ్చింది. అక్కడ ఆపమంది ఆమె. తలుపు తెరచుకుని, అతనివంక మిస్చివస్గా చూస్తూ, ‘మీ మెళ్ళోని గోల్డ్ చెయిన్ మందంగా, బాగుంది. దాన్ని నాకు ఇవ్వరూ?’ అనడిగింది. తెల్లబోయి చూశాడు రాహుల్. ‘గెట్ డౌన్!’ అన్నాడు విసురుగా. చెయిన్ ఇస్తేకానీ కారు దిగనంది ఆమె. ‘చూడు, మిస్టర్! నువ్వు నీ చెయిన్ ఇవ్వకపోతే ఏమవుతుందో తెలుసా? బట్టలు చింపుకుని పెద్దగా అరుస్తాను. లిఫ్ట్ ఇస్తానంటూ నన్ను కారులో ఎక్కించుకుని నాపైన అత్యాచారం చేయబోయావని చెబుతాను. ఆ తరువాత జరగబోయే పరిణామాలకు నువ్వే బాధ్యుడివవుతావు’ అంది కూల్‌గా. నిశ్చేష్టుడయ్యాడు రాహుల్. అతని చూపులు అప్రయత్నంగా ధాబా మీద పడ్డాయి. లారీల వాళ్ళు, ఇతర కస్టమర్సూ అరడజను పైనే ఉంటారు. ‘త్వరగా ఇవ్వు, మిస్టర్! లేకపోతే’ అంటూ పైట తీసేసి బ్లౌజ్ చింపుకోబోయింది ఆమె. అలాంటి ఓ అనుచిత సంఘటనను ఎదుర్కోవలసివస్తుందని ఊహించలేదు అతను. అప్పటికే ధాబాలోంచి ఇద్దరు వ్యక్తులు లేచి కారు వైపు రాసాగారు. ఇప్పుడు తాను ఆ గొడవలో చిక్కుకుంటే, వ్యవహారం పోలీసుల వరకు వెళ్ళవచ్చు. అప్రయత్నంగానే మెళ్ళోని చెయిన్ తీసి ఆమె చేతిలో పెట్టాడు. కారు దిగి నవ్వుకుంటూ, వస్తూన్న వ్యక్తులకు ఎదురువెళ్ళిందామె. అదంతా ఆ హైవే మీద నడుస్తూన్న ఓ ర్యాకెట్ అని ఎరుగని రాహుల్ గంటుపడ్డ ముఖంతో యాక్సిలరేటర్‌ని కసిగా తొక్కాడు. గుంటూరు చేరుకుంటుండగా కల్పన ఫోన్ చేసింది. అతను చెన్నయ్ వరకు వెళ్ళనవసరంలేదనీ, గుంటూరులో ఊరిశివార్లలో తన స్నేహితురాలి ఫ్యామిలీది ఫామ్ హౌస్ ఒకటి ఉందనీ, అక్కడ కేర్ టేకర్ తప్ప ఎవరూ ఉండరనీ, సేఫ్‌గా ఉంటుందనీ చెప్పింది. వాట్సాప్‌లో లొకేషన్ మ్యాప్‌ని పంపించింది. ఆ ఫామ్ హౌస్‌లో రాహుల్‌కి బాగానే ఉంది. అక్కడే ఓ షెడ్లో ఉన్న కేర్‌టేకర్ దంపతులు ఇంటి, వంటపని చేసి పెడుతున్నారు. ఓ రోజున కేర్‌టేకర్, అతని భార్య సరుకులవీ కొనుక్కురావడానికని సిటీకి వెళ్ళారు సాయంత్రానికి తిరిగివస్తామని. రాహుల్ హాల్లో టీవీ చూస్తున్నాడు. డోర్ బెల్ మోగడంతో లేచెళ్ళి తలుపు తెరచాడు. గుమ్మంలో కనిపించిన ‘త్రయాన్ని’ చూసి– కట్టెదుట కొండచిలువను చూసినట్టు తుళ్ళిపడ్డాడు. అతన్ని చూసి వాళ్ళూ అవాక్కయ్యారు. ముందుగా బ్యాంక్ దొంగలే తేరుకున్నారు. ‘వెదకబోయిన తీగ కాళ్ళకు చుట్టుకోవడమంటే ఇదే! పోలీసులకంటే ముందు మాకే కనపడ్డావు నువ్వు. పద, లోపలికి’ అంటూ అతన్ని తోసుకుంటూ లోపలికొచ్చి తలుపులేశారు. ఆ షాక్ నుండి రాహుల్ ఇంకా తేరుకోలేదు. తనలాగే వాళ్ళూ పోలీస్ నెట్ నుండి తప్పించుకోవడానికి హైదరాబాద్ నుండి పారిపోయివచ్చారనీ, సేఫ్‌ప్లేస్ కోసం వెదుకుతూంటే ఆ ఫామ్ హౌస్ కనిపించిందనీ ఎరుగడు అతను. ‘వాట్ ఎ బ్లడీ కోయిన్సిడె¯Œ ్స!’ అనుకున్నాడు పళ్ళు కొరుక్కుంటూ. అతన్ని వాళ్లు కుర్చీకి కట్టేశారు. ‘ప్లీజ్! మీగురించి ఎవరికీ చెప్పను. నన్ను ఏమీ చేయొద్దు’ అంటూ వేడుకున్నాడు. ‘ఆరోజు రాత్రి నువ్వు మమ్మల్ని చూసుండకపోతే, మేమిలా పరుగెత్తాల్సిన అవసరం వుండేదికాదు. నిన్ను ప్రాణాలతో వదిలి ముప్పు తెచ్చుకోమంటావా?’ అన్నాడు వారి నాయకుడు కరకుగా. ఎత్తుగా, దృఢంగా ఉన్నాడతను. మిగతా ఇద్దరిలో ఒకడు సన్నగా, పొడవుగా ఉంటే రెండోవాడు లావుగా, పొట్టిగా ఉన్నాడు.‘కేర్‌టేకర్ త్వరగా తిరిగివస్తే బావుండును!’ అనుకున్నాడు రాహుల్ మదిలో. ‘ఇక్కడ ఇంకెవరున్నారో చెప్పు’ అనడిగాడు నాయకుడు. కేర్‌టేకర్ ఉంటాడని చెప్పడంతో, ‘అతను వస్తే, మేము నీ స్నేహితులమని చెప్పు. నాలుగు రోజులపాటు ఇక్కడ వుండవలసినవాళ్ళం. అంతవరకు నిన్ను ఏమీ చెయ్యంలే’ అన్నాడు. తక్షణప్రమాదం తప్పినందుకు ఊపిరి పీల్చుకున్నాడు రాహుల్. ‘నన్నిలా కట్టిపడేస్తే, స్నేహితులమంటే ఎవరూ నమ్మరు’ అన్నాడు. ‘అదీ నిజమేలే’ అంటూ అతన్ని బంధవిముక్తుణ్ణి చేశారు వాళ్ళు. ‘పిచ్చివేషాలేస్తే కాల్చిపడేస్తాం’ అంటూ పిస్టల్ చూపించి బెదిరించారు. కల్పన ఫోన్ చేసింది. ఆమె చెప్పేది పూర్తిగా వినిపించుకోకుండా పొడిపొడిగా జవాబిచ్చి ఫోన్ కట్ చేశాడు రాహుల్. ‘ఎవరని’ దొంగలు అడిగితే, ‘నా గాళ్ ఫ్రెండ్’ అని జవాబిచ్చాడు ముక్తసరిగా. ఓ గంట తరువాత.. డోర్ బెల్ మోగింది. దొంగలు ప్రశ్నార్థకంగా చూస్తే, ‘కేర్‌టేకర్ తిరిగొచ్చుంటాడు’ అంటూ వెళ్ళి తలుపు తెరచిన రాహుల్, గుమ్మంలో కల్పనను చూసి కంగారుపడ్డాడు. ‘ఎందుకొచ్చావ్? వెళ్ళిపో!’ అంటూ తలుపు మూసేయబోయాడు. విస్తుబోతూ, ‘నేను గుంటూరు వచ్చానని చెప్పబోతే వినకుండానే లైన్ కట్ చేశావెందుకు?’’ అంటూ, లోపలికి తొంగిచూసిన కల్పన, అతని వెనుకనున్న త్రయాన్ని చూసి, ‘వాళ్ళెవరు?’ అనడిగింది. ‘వీళ్ళు వాళ్ళే!’ అన్నాడు రాహుల్ అప్రయత్నంగా. కల్పనకు ఏదో అర్థమయింది. వెంటనే, ‘సరే, నువ్వు స్నేహితులతో ఉన్నట్టున్నావు. నేను మళ్ళీ వస్తాను’ అంటూ వెనుదిరగబోయింది. ‘మమ్మల్ని చూశాక ఎక్కడికీ వెళ్ళేది? రా లోపలికి’ అంటూ ఆమె చేయి పట్టుకుని లోపలికి లాగాడు ఓ వ్యక్తి. ‘ప్లీజ్! ఆమెకేమీ తెలియదు. వెళ్ళనివ్వండి’ అంటూ రాహుల్ మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు. దొంగలనాయకుడి చూపులు కల్పన మీదే ఉండడం రాహుల్‌కి అసహనం కలిగించింది. కల్పన అదేమీ పట్టించుకోకుండా టీవీ ముందు కూర్చుంది. నాయకుడు ఆమె దగ్గరకు వెళ్ళి భుజమ్మీద చేయివేశాడు. విదిలించికొట్టిందామె. ఇంకోసారి భుజమ్మీద చేయివేయబోతుంటే కోపంతో చెంప పగులగొట్టింది కల్పన. రాహుల్ అటు వెళ్ళబోతే, అతని రెక్కలు విరిచి పట్టుకున్నారు మిగతా ఇద్దరూ. ‘ఆమెను ఏమైనా చేశారంటే మిమ్మల్ని చంపేస్తాను!’ ఆవేశంతో అరిచాడు అతను. హేళనగా నవ్వారు వాళ్ళు. తనను పట్టుకున్నవారిలో ఒకణ్ణి కాలితో తన్నాడు రాహుల్. రెండోవాణ్ణి తలతో ముఖం మీద కొట్టాడు. వారి పట్టు వీగిపోవడంతో, ఒక్క వురుకులో నాయకుడి వైపు గెంతి అతని గుండె మీద తన్నాడు. అతను వెనక్కి తూలి నిలువరించుకుంటూ రాహుల్‌నీ తన్నాడు. రాహుల్ కింద పడిపోయాడు. అంతలో సన్నటివాడు పిస్టల్ తీసి రాహుల్‌కి గురిపెట్టాడు. ‘చెప్పు, బాస్! వీణ్ణి చంపేయమంటావా?’ అంటూ. కల్పన టీపాయ్ మీదున్న ఫ్లవర్ వేజ్‌ని తీసి వాడి మీదకు విసిరింది. అది తగిలి పిస్టల్ పడిపోయింది. రాహుల్ పైకి లేచి కల్పన వద్దకు వెళ్ళి ఆమెకు సపోర్ట్‌గా నిలుచున్నాడు. సన్నటివాడు పిస్టల్ తీసి వారికి గురిపెట్టాడు. అదే సమయంలో డోర్ బెల్ మోగింది. ‘కేర్‌టేకర్ తిరిగొచ్చే వేళయింది’ అన్నాడు రాహుల్. నాయకుడి సైగనందుకున్న సన్నటివాడు వెళ్ళి గడ తీశాడు. ఓ చేత్తో పిస్టల్ పట్టుకుని తలుపు నెమ్మదిగా తెరచాడు. బైటనుండి కాలితో తన్నడంతో తలుపు భళ్ళున తెరచుకుంది. ఆ విసురుకు వాడు వెనక్కి పడిపోయాడు. గుమ్మంలో కేర్‌టేకర్ కాదు మఫ్టీలో వున్న క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శివరామ్! ‘దిసీజ్ పోలీస్’ దర్పంగా ఎనౌ¯Œ ్స చేశాడు అతను. దొంగలు ఉలిక్కిపడ్డారు. కిందపడ్డవాడు పిస్టల్ ఎత్తాడు. వాడి చేతిమీద రివాల్వర్‌తో షూట్ చేశాడు శివరామ్. పిస్టల్ ఎగిరిపడింది. వాడి చేతినుండి రక్తం చిప్పిల్లింది. నాయకుడు తేరుకుని పిస్టల్ తీస్తూంటే అతని మీదకు ఉరికాడు రాహుల్. అతను కొట్టిన దెబ్బకు వెనక్కి తూలుతూనే షూట్ చేశాడు నాయకుడు. బులెట్ రాహుల్ భుజానికి గాయంచేస్తూ రాసుకుపోయింది. మఫ్టీపోలీసులు బిలబిలమంటూ లోపలికి వచ్చారు. ముగ్గురు దొంగలనూ అదుపులోకి తీసుకున్నారు. ‘రాహుల్ తన ఫియా¯Œ ్సతో టచ్‌లో ఉంటాడన్న ఆలోచనతో కల్పన సెల్ ఫోన్‌ని ట్రాక్ చేసి ఇక్కడికి రాగలిగాం’ చెప్పాడు ఇ¯Œ స్పెక్టర్ శివరామ్. ‘వెల్, దొంగలు కూడా ఇక్కడ దొరుకుతారని ఊహించలేదు!’ అన్నాడు. -తిరుమల శ్రీ -
ది ఐస్ బాక్స్ మర్డర్స్.. నేటికీ మిస్టరీగానే!
ఉన్మాద చర్యలు ఎప్పుడూ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేస్తాయి. నిర్ఘాంతపోయే నిజాలతో గజగజా వణికిస్తాయి. నెత్తుటిధారలతో చరిత్ర పేజీలను తడిపేస్తాయి. ఆ జాబితాలోనివే అమెరికాలోనే అతి భయంకరమైన ఐస్ బాక్స్ మర్డర్స్. సుమారు 56 ఏళ్లు దాటినా నేటికీ తేలని ఆ కథేంటో ఈ వారం మిస్టరీలో చూద్దాం. 1965, జూన్ 23.. చార్ల్స్ ఫ్రెడరిక్ రోజర్స్ అనే పేరు అమెరికా మొత్తం మారుమోగిన రోజు. అతడి ఫొటోలు నాటి పత్రికల మొదటి పేజీల్లో పడ్డాయి. మోస్ట్ పాపులర్‌గా కాదు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా. అసలు ఎవరీ రోజర్స్.. అతడు చేసిన నేరమేంటీ? ఫ్రెడ్ క్రిస్టోఫర్, మరియా ఎడ్వినా.. దంపతులకు 1921 డిసెంబర్ 30న జన్మించాడు రోజర్స్. 1942 నాటికి హ్యూస్టన్ విశ్వవిద్యాలయంలో న్యూక్లియర్ ఫిజిక్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ పొందాడు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో యునైటెడ్ స్టేట్స్ నేవీలో పైలట్‌గా ఉంటూనే.. నేవల్ ఇంటెలిజెన్స్ కార్యాలయంలో గుఢచారిగానూ పనిచేశాడు. యుద్ధం తర్వాత తొమ్మిదేళ్ల పాటు షెల్ ఆయిల్‌కు భూకంప శాస్త్రవేత్త గా సేవలందించాడు. 1957లో ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే ఆ ఉద్యోగాన్ని వదిలేశాడు. ‘రోజర్స్ ఏడు భాషలను అనర్గళంగా మాట్లాగలడు. చాలా తెలివైనవాడు. చమురు, బంగారం వెలికి తియ్యడంలో ప్రత్యేకమైన ప్రతిభ ఉంది అతడికి’ అనేది అతడి సన్నిహితుల మాట. 1963 తర్వాత రోజర్స్ నిరుద్యోగిగానే ఉన్నాడు. హ్యూస్టన్ లోని మాంట్రోస్ పరిసరాల్లో నివసిస్తున్న వృద్ధ తల్లిదండ్రులతో కలిసి జీవించేవాడు. అయితే తెల్లవారకముందే వెళ్లి.. అర్ధరాత్రికి తిరిగి వచ్చే రోజర్స్ అక్కడే ఉంటున్నాడనే విషయం చుట్టుపక్కల వాళ్లక్కూడా పెద్దగా తెలియదు. ఏళ్లు గడిచాయి.. 1965, జూన్ 23న ఫ్రెడ్ మేనల్లుడు మార్విన్.. ఆందోళనగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లాడు. గత కొన్ని రోజులుగా తన అత్తా, మామ(ఫ్రెడ్, మరియా)ల నుంచి ఎలాంటి సమాచారం లేదని, ఫోన్ చేస్తే ఎత్తడం లేదని, ఇంటికి వెళ్తే తాళాలు వేసి ఉన్నాయని.. అసలే ముసలివాళ్లు.. ఏదైనా ప్రమాదంలో ఉన్నారేమోనని అనుమానంగా ఉందని, తక్షణమే వెతకాలని కోరాడు. దాంతో హ్యూస్టన్ పోలీసులు రంగంలోని దిగారు. మార్విన్‌ని తీసుకుని మాంట్రోస్ పరిసరాల్లో ఉన్న ఫ్రెడ్ ఇంటికి బయలుదేరారు సోదా చెయ్యడానికి. తలుపుమూసి ఉండటం చూసి.. బలవంతంగా తెరిచారు. తలుపు తీస్తే లోపలంతా సాధారణంగా ఉంది. ఎక్కడా ఏ అలికిడీ లేదు. డైనింగ్ టేబుల్ మీద ఏవో వంటకాలు కనిపించాయి. చుట్టూ చూశారు పోలీసులు. ఒక్కొక్కరూ ఒక్కో గది వెతికారు. ఎక్కడా ఏమీ అసాధరణమైనవి కంటపడలేదు. మనుషులూ కనిపించలేదు. అందులో ఒక పోలీస్ ఆఫీసర్‌కి ఓ అనుమానం వచ్చింది. ‘ఈ ఇంట్లో ఎన్నిరోజులుగా మనుషులు ఉండటం లేదు? రోజువారి అసవరాల కోసం ఏమైనా తెచ్చి పెట్టుకుంటున్నారా లేదా?’ అనుకుంటూ ఫ్రిజ్ ఓపెన్ చేసి చూశాడు. ఫ్రిజ్ నిండా శుభ్రంగా కడిగిపెట్టిన మాంసం కనిపించింది. అడివి దున్న మాంసం కాబోలు అనుకుని తలుపు వెయ్యబోతుంటే.. కింద ఉండే ట్రాన్స్పరెంట్ కూరగాయల టబ్‌లో రెండు మనిషి తలలు కనిపించాయి. అవి ఎవరివో కాదు.. ఫ్రెడ్, మరియాలవే. ఫ్రిజ్ డోర్ తీసిన ఆఫీసర్ నుంచి ఒక గావుకేక వినిపించింది. మిగిలిన వాళ్లు అతడి దగ్గరకు పరుగుతీశారు. అక్కడ పరిస్థితి చూసి గజగజా వణికారు. టాయిలెట్ ఫ్లష్ దగ్గర.. ఆ దంపతుల అవయవాలు తొలగించినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. అవశేషాలు దొరికాయి. రోజర్స్ గదిలో రక్తంతో తడిసిన రంపాన్ని బయటికి తీశారు. అయితే ఆ రోజు నుంచి రోజర్స్ కనిపించలేదు. అసలు ఎక్కడున్నాడో ఈ ప్రపంచానికి తెలియలేదు. నేరం చేసింది ఎవరు? కన్నకొడుకే తల్లిదండ్రులను ఇంత కిరాతకంగా కడతేర్చాడా? అనే వార్తలు యావత్ అమెరికా వ్యాపించాయి. అంతకు రెండు రోజుల ముందే ఫ్రెడ్ దంపతులు హత్యకు గురైనట్లు రిపోర్ట్లు వచ్చాయి. రెండు రోజుల ముందంటే జూన్ 20న ఈ ఘోరం జరిగింది. అంటే ఆ రోజు ఫాదర్స్ డే కావడంతో ఈ వార్త మరింత సంచలనం అయ్యింది. శవపరీక్షల్లో ఫ్రెడ్(81), మారియా(72)లని తలపై సుత్తితో కొట్టి చంపినట్లు తేలింది. చనిపోయిన తర్వాతే ఫ్రెడ్ కాళ్లు, జననాంగాలు తొలగించారని, మారియా శరీరానికి నిప్పు పెట్టి, మిగిలింది ఫ్రిజ్‌లో దాచిపెట్టారని వెల్లడైంది. అయితే రోజర్స్.. సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజన్సీ(సి.ఐ.ఏ)కి సంబంధించిన ఏజెంట్ అని.. మెక్సికో నగరంలో ‘లీ హార్వే ఓస్వాల్డ్’గా చలామణీ అయ్యాడని.. చార్ల్స్ హారెల్సన్, ప్రెసిడెంట్ జాన్ ఎఫ్. కెన్నెడీల హత్యల్లో నిందితుడని, అతడి రహస్యాలు తెలుసుకున్నందుకే తల్లిదండ్రులను చంపేశాడని.. కథలు కథలుగా రాశారు కొందరు ఔత్సాహిక రచయితలు. అయితే ఈ వాదనను పలువురు విచారణాధికారులు కొట్టిపారేశారు. రోజర్స్ కోసం గాలింపు చర్యలు ఎంత ముమ్మరం చేసినా ఫలితం లేకపోయింది. చివరికి 1975లో ఈ కేసు విచారిస్తున్న న్యాయమూర్తి.. చట్టప్రకారం రోజర్స్ చనిపోయాడని ప్రకటించడంతో ఈ కేసు అధికారికంగా ముగిసింది. కోల్డ్ కేసుల సరసన చేరిపోయింది. ఫోరెన్సిక్ అకౌంటెంట్ హ్యూస్టన్, అతడి భార్య మార్తా ఈ కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడించారు. రోజర్స్ తల్లిదండ్రులను హత్య చేసిన తరవాత తను కూడా హోండురాస్ అనే ప్రాంతంలో హత్యకు గురయ్యాడని, సీ.ఐ.ఏ సిబ్బందితో అతడికి సన్నిహిత సంబంధాలు ఉండేవని నిర్ధారించారు. మరోవైపు ఫ్రెడ్ దగ్గర పని చేసే తోటమాలి మాటల ప్రకారం.. రోజర్స్ ఎప్పుడూ తల్లిదండ్రులను ఏడిపిస్తూనే ఉండేవాడని, దుర్భాషలాడి బాధపెట్టేవాడని.. జూదం, దొంగతనం అంటూ చట్టవిరుద్ధమైన పనులకు తెగబడేవాడని, చాలా సార్లు ఫ్రెడ్ దగ్గర డబ్బులు దొంగలించాడని చెప్పాడు. అంతేకాదు రోజర్స్ ముందే ప్లాన్ చేసుకుని తల్లిదండ్రుల్ని చంపి ఉంటాడని, ఎవరో నమ్మకమైన స్నేహితుల సాయంతోనే దొరక్కుండా తప్పించుకోగలిగాడని, చివరికి హోండురాస్లో మైనర్ల వేతనాల వివాదంలో హత్యకు గురయ్యి ఉంటాడని అభిప్రాయపడ్డాడు. ఇదే కథనాన్ని బేస్ చేసుకుని ‘ది ఐస్ బాక్స్ మర్డర్స్’ అనే పుస్తకం కూడా వచ్చింది. అయితే అన్ని అనుమానాలు, అంచనాలే కానీ అసలు ఏం జరిగిందో చెప్పేవాళ్లు లేకపోవడంతో ఈ కేసు నేటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. ∙సంహిత నిమ్మన -
ఎవరీ సింథియా.. 42 ఏళ్లుగా మిస్సింగ్.. అసలేం జరిగింది?
స్వార్థపూరితమైన ఆలోచనలు కక్షగడితే.. ఆనవాళ్లు, అవశేషాలు కూడా దొరకవనేందుకు సింథియా ఆండర్సన్ కథే సాక్ష్యం.అమెరికాలోని ఒహైయో రాష్ట్రంలో టోలీడోలోని.. ఓ సంప్రదాయ కుటుంబానికి చెందిన అమ్మాయే సింథియా. మైఖేల్ ఆండర్సన్ దంపతులకు..1961 ఫిబ్రవరి 4న జన్మించింది. మత సంప్రదాయాల్ని కచ్చితంగా పాటించే మైఖేల్‌కి కూతురు సింథియా అంటే ప్రాణం. సింథియాకూ తండ్రంటే అంతే గౌరవం. ఏనాడూ తండ్రి మాటకు ఎదురు చెప్పిందిలేదు. సహజంగానే అందగత్తెన సింథియాకు మేకప్ అంటే చాలా ఇష్టం. ఖాళీ దొరికితే మేకప్ వేసుకోవడమో, నవలలు చదవడమో చేసేది. మొదటి నుంచీ ఆమెకు స్నేహితులు ఎక్కువ. అయినా సరే తండ్రి చెప్పినట్టుగా.. తనకంటూ కొన్ని హద్దులు ఏర్పరచుకుని నడుచుకునేది. తన కుటుంబ గౌరవానికి తలవంపులు తేవద్దనే తలంపుతోనే ఉండేది. ఆమెకు తన 19వ ఏట ఒక కలొచ్చింది.. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి.. తనని ఎత్తుకెళ్లి క్రూరంగా చంపేసినట్లు. బెదిరిపోయి ఇంట్లో వాళ్లకి చెప్పింది. తల్లి, సోదరి ఇద్దరూ సింథియాకు ధైర్యం చెప్పారు. అయితే ఆ కల ఆ ఒక్కరోజుతో ముగిసిపోలేదు. రోజుల తరబడి వెంటాడడంతో సింథియా కలవరపడింది. తనకు ఏదో జరగబోతోందని శంకించింది. నిత్యం ఆ భయంతోనే గడపసాగింది. కొన్ని రోజులకు అదో మానసిక రుగ్మతగా మారింది. ఓ పక్క కుటుంబ నియమాల ప్రకారం ప్రతిరోజూ ప్రార్థన సమావేశాలు, క్యాంపింగ్ ఈవెంట్స్‌కు హాజరవుతూనే లీగల్ సెక్రెటరీగా ఉద్యోగం చేసేది సింథియా. ఆమె పని చేసే కార్యాలయంలో తను కూర్చునే డెస్క్ ఎదురుగా ఉండే గోడపైన ఓ ఆకతాయి.. ‘ఐ లవ్యూ సిండీ.. బై జీడబ్ల్యూ’ అని స్ప్రే పెయింట్ చేశాడు. సిండీ అనేది సింథియా ముద్దుపేరు. అప్పటికే సింథియా.. పీడ కలతో సతమతమవు తుండటంతో ఆ రాసింది ఎవరనే దానిపై దృష్టి పెట్టలేకపోయింది. తనకొచ్చిన కల ఎక్కడ నిజమవుతుందోనన్న భయంతో తన డెస్క్ దగ్గర ఎమర్జెన్సీ బజర్ ఏర్పాటు చేయించుకుంది. ఎందుకంటే ఉదయం పూట అంతపెద్ద ఆఫీస్‌లో సింథియా ఒక్కత్తే ఉండేది. మిగిలిన కొలీగ్స్ అంతా మధ్యాహ్నం వచ్చేవారు. అది 1981, ఆగస్టు 4.. సింథియా జీవితాన్ని చరిత్రలో కలిపేసిన రోజది. అప్పటికి ఆమెకు ఇరవై ఏళ్లు. మరో రెండువారాల్లో తను చేసే ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేసి.. బైబిల్ కాలేజీకి వెళ్లాలనేది ఆమె నిర్ణయం. కానీ అలా జరగలేదు. ఆగస్టు 4న ఉదయం ఎనిమిదిన్నరకి.. బ్రేక్‌ఫాస్ట్ చెయ్యకుండానే ఆమె తన కారులో ఆఫీస్‌కి బయలుదేరింది. ఎప్పటిలా కాకుండా ఆ రోజు తొమ్మిది నలభై ఐదుకి అంటే కాస్త ఆలస్యంగా ఆమె ఆఫీస్‌కు వచ్చినట్టుగా గమనించాడు వాచ్‌మన్. మధ్యాహ్నం 12 గంటలకు తతిమా సహోద్యోగులు ఆఫీస్‌కి వచ్చేసరికి సింథియా అక్కడ లేదు. తలుపులు తీసే ఉన్నాయి. కారు పార్కింగ్‌లోనే ఉంది. కారు తాళంచెవి, హ్యాండ్ పర్స్ మాత్రం కనిపించలేదు. ఫోన్ రిసీవర్ పక్కకు తీసిపెట్టి ఉంది. లైట్లు వెలుగుతూనే ఉన్నాయి. రేడియో మోగుతూనే ఉంది. అప్పుడే నెయిల్ పాలిష్ వేసుకున్నట్లు.. ఆ వాసన ఇంకా ఆఫీస్ వాతావరణంలో తచ్చాడుతూనే ఉంది. మరో విచిత్రం ఏమిటంటే.. ఆమె క్యాబిన్లో ఓ రొమాంటిక్ నవల తెరిచి ఉంది. అందులో.. ‘అతను వచ్చి కత్తితో బెదిరించి.. ఆమెని ఎత్తుకుపోయాడు’ అనే వాక్యం ఉంది. కానీ ఎక్కడా కిడ్నాప్ చేసినట్లు ఆధారాలు లేవు. ఎక్కడి వస్తువులు అక్కడే ఉన్నాయి. పోలీసులు రంగంలోకి దిగి.. దర్యాప్తు మొదలుపెట్టారు. పేరెంట్స్‌కి తెలియకుండా సింథియాకి ఓ బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడని, అతడు చర్చిలో సభ్యుడని, బైబిల్ కాలేజీలో చదువుకుంటున్నాడని.. అందుకే సింథియా కూడా ఉద్యోగం మానేసి.. బైబిల్ కాలేజీలో జాయిన్ కావాలనుకుందని.. ఇలా ఏవేవో విషయాలు బయటికి లాగారు. సింథియా ఆఫీస్‌లో.. జీడబ్ల్యూ (ఐ లవ్యూ కింద ఉన్న లెటర్స్) పేరున్న వ్యక్తిని కూడా ప్రశ్నించారు. అతడికీ, ఈ కేసుకు ఏ సంబంధం లేదని తేలింది. మరోవైపు సింథియాకి ఆఫీస్‌లో ఉన్నప్పుడు ఏవేవో బెదిరింపు కాల్స్ వచ్చేవని, వాటితో ఆమె చాలా ఇబ్బంది పడేదని కొందరు కొలీగ్స్ చెప్పుకొచ్చారు. కొన్ని రోజులకు ఓ అజ్ఞాత మహిళ.. పోలీసులకు ఫోన్‌చేసి ‘మా పక్కింటి అబ్బాయి.. సింథియాని బలవంతంగా బంధించాడు. అతడి తల్లిదండ్రులు అతడితో లేరు. పక్కిల్లే కావడంతో ఆ విషయం నాకు తెలిసింద’ని చెప్పింది. పూర్తి వివరాలు అడిగేసరికి ఆమె భయపడి ఫోన్ కట్ చేసింది. దాంతో పోలీసులు అనుమానాస్పదమైన కొన్ని ఇళ్లను సోదా చేశారు. అయినా ఫలితం దక్కలేదు. మరోవైపు.. సింథియా పనిచేసే లా ఆఫీస్‌లో రిచర్డ్ నెలర్ అనే న్యాయవాదికి మాదకద్రవ్యాలకు సంబంధించిన నేర చరిత్ర ఉంది. ఈ క్రమంలో నెలర్కి సంబంధించిన చట్టవిరుద్ధమైన డ్రగ్ యాక్టివిటీ గురించి సింథియాకి ఏమైనా తెలిసిందా? అదే ఆమెకు శాపమైందా? అనే యాంగిల్ల్లోనూ విచారణ కొనసాగింది. కానీ కేసు ముందుకు కదల్లేదు. ఇంట్లో కఠినమైన నియమనిబంధనలను తాళలేక ఇంట్లోంచి తప్పించుకునేందుకు సిం«థియానే అలాంటి నాటకమాడిందనే వాదనా బలంగా వినిపించింది. అదే నిజమైతే.. సింథియా అకౌంట్లో చాలా డబ్బులు ఉన్నాయి. వాటిని వినియోగించినట్లు ఇప్పటికీ ఎలాంటి ఆధారాలు లేవు. ఎప్పటికైనా సింథియా తిరిగి వస్తుందని ఆశపడ్డాడు తండ్రి మైఖేల్. ఫోన్ నంబర్ మార్చినా, ఇళ్లు మారినా సింథియా తిరిగి రావాలనుకుంటే ఇబ్బంది అవుతుందనే ఆలోచనతో అదే ఇంట్లో, అదే ఫోన్ నంబర్‌తోనే గడిపింది ఆ కుటుంబం. చివరికి ఆమె వివరాలు తెలుసుకోకుండానే చనిపోయారు సింథియా తల్లిదండ్రులు. అసలు ఆ రోజు ఆమెను ఎవరైనా కిడ్నాప్ చేశారా? ఎవరైనా చంపేశారా? లేక సింథియానే కుటుంబాన్ని వదిలి పారిపోయిందా? మానసిక రుగ్మతతో ఏ ఆత్మహత్యకైనా పాల్పడిందా? అనేది నేటికీ మిస్టరీనే. సంహిత నిమ్మన -
నేనూ నాగరాజు... ఫొటో పై డేట్ ఆఫ్ డెత్ చూశాక..
ఆ రోజు సాయంత్రం... పదేళ్ల తర్వాత ఊర్లోకి అడుగుపెట్టాను. నేనొచ్చినట్టు నా శత్రువు నాగరాజుకి తెలిసే అవకాశం లేదు. వాడితో శత్రుత్వానికి నేపథ్యాలు ఇక్కడ చెప్పడం అనవసరమే గానీ తీవ్రత చెప్పడం అవసరమే. ఎదురుపడితే ఎవరో ఒకరమే ప్రాణాలతో మిగులుతాం. రెండోవాడు హంతకుడు కావాల్సిందే.. వాడైనా..నేనైనా. ఒకరు శవం.. ఇంకొకరు ముద్దాయి. అంతే. వేరే మార్గం లేదు. అయిదేళ్ల కిందట.. ఒకసారి నేనే మధ్యవర్తుల ద్వారా రాజీ సూత్రం ప్రతిపాదించాను.. ‘అయ్యిందేదో అయ్యింది.. జీవితాలు పాడవుతున్నాయి గతం మరిచిపోదాం’ అంటూ. ససేమిరా అన్నాడు. అదే చివరిసారి. వాడికి సొసైటీలో పలుకుబడి ఎక్కువే. అందుకనే దూరంగా బతుకుతున్నాను. ఒకరి ఉనికి ఒకరికి తెలియనంతగా. ఊళ్ళో ఎవరితోనూ టచ్‌లో లేను. ఆరోజు మాత్రం రావాల్సివచ్చింది.. ఒంటరిగా. రాత్రయ్యింది.. ఇంట్లో భోజనం చేసి నిద్రకుపక్రమించాను. ముందు జాగ్రత్తగా తలగడ కింద ఒకవైపు కత్తి.. మరోవైపున బెడ్ కింద, చేతికందేంత దూరంలో ఇనుపరాడ్ ఉంచుకున్నాను. ఉదయాన్నే వెనక్కి వెళ్లిపోవాలి. నేను ప్రస్తుతం ఉంటున్న పట్టణంలో ఎవరూ నేనిలా ఆయుధాలతో పడుకునే పరిస్థితిలో ఉంటానని చచ్చినా నమ్మరు. ఇక్కడే ఈ స్థితి. ఇక తెల్లవారుతుందనగా గదిలో అలికిడి. కళ్ళు తెరిచేలోగా నన్ను సమీపించిన చప్పుడు. కచ్చితంగా బలమైన మనిషి అడుగులే. తలగడ కింద కత్తిని అందుకోబోయాను. అప్పటికే ఆలస్యమైంది. నా ఛాతీ మీద బరువు. ఆగంతకుడు నా మీద కూర్చుని, చేతుల్ని కదలనివ్వడం లేదు. గట్టిగా అరుద్దామన్నా నోరు పెగలడం లేదు. వీడు కచ్చితంగా నాగరాజే. వాడు జైలుకి, నేను పైలోకానికి పోవడం ఖాయం. పెనుగులాడుతున్నాను. ప్రయత్నం వదలలేదు. చివరకు పట్టు వీడింది. ఒక్కసారిగా బలంగా విదిలించి లేచాను. వాడు మెరుపులా చీకట్లో కలిసిపోయాడు. వాడి వేగానికి ఆశ్చర్యపోయాను. వెళ్లే ముందు వాడి చూపులో ‘ఈసారికి బతికిపోయావులే’ అన్న భావం కదలాడింది. నా గుండె వేగం ఇంకా తగ్గలేదు. మృత్యువు అంచులదాకా వెళ్ళొచ్చాను కదా! నా ప్రతికదలికా వీడికెలా తెలుస్తోంది? కనబడగానే చంపెయ్యాలన్నంత కసి పెరుగుతూ పోతోంది కానీ ఏమాత్రం తగ్గలేదు. గ్లాసు నీళ్లు తాగాను. అందులో సగం కిందనే ఒలికాయి చేతుల వణుకుతో. ఇంకో అనుమానం ‘నిద్రపోతున్న నన్ను ఒక్క వేటుతో ఫినిష్ చెయ్యగలడు కదా! మరెందుకు తడబడ్డాడు? నా ప్రతిఘటనతో బాలెన్స్ తప్పాడా? అయితే ఎందుకు పరిగెత్తిపోయాడు? వాడి బలిష్టమైన శరీరం ముందు సన్నగా ఉన్న నేను ఏమాత్రం? లేదా నన్నిలా బెదిరించి, రెండోదఫాలో సఫా చేద్దామని అనుకున్నాడా?’ ఎన్నో సందేహాలు. ఏమైనా మరి ఉపేక్షించడానికి లేదు. అటో, ఇటో తేల్చుకోవాలి. ఉదయాన్నే పోలీసు స్టేషన్‌కి వెళ్ళాను. ఫిర్యాదు చేశాను. అనుమానంగా చూస్తూ ఇన్స్పెక్టర్ అడిగాడు ‘ఎవరో ఆగంతకుడా? లేదా నాగరాజే హత్యాయత్నం చేశాడా?’ అని. ‘స్పష్టంగా చూశాను సార్. నాగరాజే. వాడిమీదే ఫిర్యాదు’ అన్నాన్నేను. ‘సర్లెండి. వెళ్ళండి. మా వాళ్ళు వచ్చి క్రైమ్‌సీన్ చూస్తారు’ అని చెప్పాడు. ఆయన మొహంలో కొంచెం నిర్లక్ష్యం. బహుశా నాగరాజు పట్ల సానుకూల భావం. అసలే పలుకుబడి ఉన్న వ్యక్తి. ∙∙∙ నాగరాజు ఇంటికి, పోలీసు స్టేషన్ నుండే సరాసరి బయల్దేరాను. పట్టపగలు అందరూ చూస్తుండగా ఎటూ నన్ను చంపలేడు. ఆ ప్రయత్నం చేసినా నేను ఎదుర్కోడానికి సిద్ధంగానే ఉన్నాను. ఇక ఈ శత్రుత్వానికి ఫుల్స్టాప్ పెట్టేద్దామని డైరెక్ట్‌గా చెప్పేస్తాను. గతంలో మధ్యవర్తుల ద్వారా కదా చెప్పింది.. ఈ సారి నేనే ఫైనల్‌గా చెప్పేస్తే అతడి జవాబు బట్టీ నిర్ణయించుకోవచ్చు. వాళ్ళబ్బాయి మంచినీళ్లిచ్చి సోఫాలో కూర్చోబెట్టాడు. వీడికి తండ్రి పోలికలు వచ్చినట్టు లేవు.. సన్నగా ఆధునికంగా ఉన్నాడు. ‘అంకుల్, అమ్మకి చెప్తానుండండి’అంటూ లోపలికి వెళ్ళాడు. అమ్మకి చెప్పడమేమిటి, నాగరాజు ఇంటికి ఇంకా రాలేదా అనుకుంటూ లోపలికి చూశాను. షాక్‌తో మాట రాలేదు. గోడకి పూలదండతో వేలాడుతున్న నాగరాజు ఫొటో. ఆవిడ వస్తూ నమస్కరించి ‘అంతా కలలోలా అయిపోయిందండి. ఆక్సిడెంట్‌కి ముందే నాతో మాట్లాడారు. గంటలో వస్తున్నట్లు. ఈలోగా లారీ గుద్దేసింది. స్పాట్లో ప్రాణాలు పోయాయి. ఎప్పుడూ మీ గురించే తలుస్తుండే వారు’ కళ్లు తుడుచుకుంది. ఇంకా షాక్‌లోనే ఉన్న నేను ఫొటో పై డేట్ ఆఫ్ డెత్ చూశాను. సరిగ్గా నెల అయ్యింది. ఎటూ పరామర్శకి వచ్చాననుకుంటున్నారు కదా అలానే మాట్లాడేసి సెలవు తీసుకున్నాను. అయితే రాత్రి వచ్చిందెవరు? స్పష్టంగా చూశానే! ఆ ఒడ్డు పొడవు ఇంకెవరికీ లేవే! ఒకవేళ ఉన్నా శత్రుత్వం లేదే! అంతా కన్ఫ్యూజన్. బహుశా అందుకనే ఇన్స్పెక్టర్ అలా చూసి ఉంటాడు.. నెల కిందట పోయినవాడు నిందితుడేమిటాని. ∙∙∙ ‘ఇలా జరిగిందోయ్. నాకు టెన్షన్ తగ్గడం లేదు’ భార్యకు ఫోన్ చేశాను. ‘అయితే దయ్యం అయి ఉంటుందా? త్వరగా ఇంటికి వచ్చెయ్యండి. అసలే తీరని కోరికలున్న వాళ్ళు దయ్యాలవుతారట.’ ‘నాకు ఈ దయ్యాలు, పిశాచాల మీద నమ్మకం లేదు. ఈరోజు కూడా ఇక్కడే ఉండి వస్తాను. రాత్రికి శ్మశానానికి వెళ్లి నాగరాజు సమాధి పక్కనే పడుకుని వస్తాను.’ ‘మీకిదేం పాడు బుద్ధి? ఏదో తగలడండి. ఎటూ మీకు నచ్చిందే చేస్తారు. నాకు మాత్రం భయమేస్తోంది. మా ఫ్రెండ్‌ని తోడు పిలుచుకుంటాను.’ ‘రేపొస్తాను’ అని ఫోన్ పెట్టేశాను.. నాగరాజు బతకనిస్తే అని మనసులో అనుకుంటూ. అనుకున్నట్టుగానే ఆ రాత్రి శ్మశానంలో పడుకున్నాను. భయంలేదు గానీ ఏదో తెలియని టెన్షన్. దాదాపు నిద్ర పట్టలేదు. కొంచెం పట్టేసరికి ఎవరో కదిలెళ్లినట్టనిపించింది. లేచి చూస్తే ఏమీ లేదు. ∙∙∙ ఇంట్లో నాకోసమే వెయిట్ చేస్తున్నట్లున్నారు. మా ఆవిడకు అసలే దయ్యాల భయం ఎక్కువ. రాత్రి నిజంగానే తోడు తెచ్చుకున్నట్టుంది. తన ఫ్రెండ్‌ని పరిచయం చేసింది. ఇంతకు ముందెప్పుడూ మేం కలుసుకోలేదు. దయ్యాలు, పారా సైకాలజీ అంటూ ఏదేదో చెప్తోంది. చూడ్డానికి మోడర్న్‌గానే ఉంది. ‘ఒక వేళ నాగరాజు దయ్యం నామీద పగబడితే రాత్రి అక్కడే ఉన్నాను కదా. రాలేదేం?’ ‘దయ్యాలు మీ ప్లాన్ బట్టీ రావు. వాటి ప్లాన్ బట్టి వస్తాయి’ నవ్వుతూ అంది. ‘అయితే మళ్లీ వచ్చే అవకాశం ఉందా?’ ‘అది మీ మీద ఆధారపడి ఉంటుంది.అయితే కచ్చితంగా మీకు హాని చెయ్యదు. గ్యారెంటీ.’ ‘అలా ఎలా చెప్పగలరు?’ ‘ఎందుకంటే మీ కథ పూర్తిగా విన్నాక తెలిసింది.. మీకు లేవంగానే వచ్చినవి హిప్నోపాంపస్ హాల్యూసినేషన్స్. ఆ టైమ్‌లోనే వస్తాయవి. ఎవరో వచ్చినట్టు భ్రమ. పీడకలల్లాంటివి అన్న మాట.’ ‘మరి ఛాతిపై బరువు, నేను కదల్లేకపోవడం?’ ‘దాన్ని స్లీప్ పెరాలసిస్ అంటారు. రెండూ కలిసి రావడాన్ని ఇంక్యుబస్ ఫెనామినా అంటారు.’ ‘మానసిక అనారోగ్యమా?’ ‘కాదు. ఆరోగ్యవంతుల్లో కూడా అలా అప్పుడప్పుడు వస్తుంది. నిద్రలేమి, అలసట, టెన్షన్ కారణాలు కావొచ్చు. కాబట్టి హ్యాపీగా రిలాక్స్ అవ్వండి’ అంటూ సెలవు తీసుకుంది. తర్వాత మా ఆవిడ చెప్పింది. ఆవిడ తనకు తెలిసిన సైకియాట్రిస్ట్ అట. ఫోన్లో నేను చెప్పిన విషయమూ, విధానమూ చూసి తనను సంప్రదించిందట. ఆవిడ మా ఆవిడ నుండీ, నా నుండీ పూర్తి వివరాలు సేకరించి ఇలా వ్యాధి నిర్ధారణ చేసిందన్న మాట. ‘మరి ఆ విషయం నాకు ముందే చెప్పొచ్చు కదా!’ ‘బాబూ, మీరు మరీ తప్పదంటే భూత వైద్యులనైనా నమ్ముతారు కానీ సైకియాట్రిస్టు అంటే మాట్లాడతారా! అదేదో పిచ్చిలా నామోషీ ఫీల్ అయిపోరా?’ హాయిగా నవ్వేశాను. నాగరాజు మరి కనబడడేమో?! -డా. డి.వి.జి.శంకర రావు మాజీ ఎంపీ, పార్వతీపురం. చదవండి: పరాయి జీవితాలు: పెళ్ళయిన ఏడాదిన్నర నుంచి ఆమెకి ఇదే అనుమానం.. ఆ క్షణం కూడా.. -
Crime Story: అలివేణి మిస్సింగ్ ఒక మిస్టరీ.. ఫినిషింగ్ టచ్ మాత్రం అదిరింది!
పాతికేళ్ల తర్వాత నేను మళ్ళీ అలివేణిని చూస్తానని అనుకోలేదు. అసంపూర్తిగా ఉన్న ఆమె కథను రాస్తాననీ అనుకోలేదు. రచయిత వేళ్ళు కీ బోర్డు మీద కదులుతున్నప్పుడు అక్షరాలను ఆవాహన చేసుకున్న కథ, కథనమై కదనరంగంలో అడుగిడినప్పుడు. ఒక నేరం తన రూపు మార్చుకుంది. ∙∙∙ పాతికేళ్ల క్రితం... చలికాలం... రాత్రి పన్నెండు కావడానికి పదినిమిషాలు బాకీ ఉంది. సరిగ్గా అప్పుడే కాలనీలోకి పోలీస్ వెహికిల్ వచ్చింది. ఆ వెహికల్ సరాసరి అలివేణి ఇంటి దగ్గర ఆగింది. కాలనీ వాళ్లంతా నిద్రలో నుంచి ఉలిక్కిపడి లేచారు పోలీస్ వెహికిల్ హారన్ శబ్దం విని. రెండు రోజులుగా అలివేణి కనిపించడం లేదు. రెండు రోజులుగా కనిపించకపోవడంతో నాకు అనుమానం, భయం కలిగాయి. నాకు తెలిసిన పోలీస్ అధికారికి విషయం చెప్పి సీక్రెట్‌గా ఎంక్వయిరీ చేయించాలని అనుకున్నాను. అంతలోనే పోలీస్ వెహికిల్ వచ్చింది. పోలీసులు వెహికిల్ దిగి అలివేణి ఇంట్లోకి వెళ్లారు. ఇళ్లల్లో ముసుగు తన్ని పడుకున్న వాళ్ళు లేచొచ్చారు. నేను క్రైమ్ నవలా రచయితను కావడం, పోలీస్ అధికారులతో పరిచయాలు కలిగి ఉండడం వల్ల పోలీసులతో పాటు లోపలికి వెళ్ళాను. పోలీస్ ఇన్స్పెక్టర్ నన్ను గుర్తు పట్టి విష్ చేసి విషయం చెప్పాడు. ‘చెరువులో ఒక డెడ్ బాడీ దొరికింది. స్పాట్లో ‘అలివేణి’ అని ఎంబ్రాయిడరీ చేసి ఉన్న చేతి రుమాలు దొరికింది’ అని. రెండు రోజుల క్రితమే తన భార్య కనబడడం లేదని అలివేణి భర్త రిపోర్ట్ ఇచ్చాడు. డెడ్ బాడీని ఐడెంటిఫై చేయడానికి అలివేణి భర్త నిరంకుశ్ని తీసుకువెళ్ళటానికి వచ్చారు. అతని మొహంలో నెత్తురు చుక్క లేదు. భయం స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవేళ ఆ డెడ్ బాడీ అలివేణిదే అయితే తనకు శిక్ష పడటం ఖాయం అనుకున్నాడు. నా మనసు భారమైంది. ఆ డెడ్ బాడీ అలివేణిది కాకూడదని బలంగా కోరుకున్నాను. అలివేణి భర్త నిరంకుశ్తో పాటు నేనూ మార్చురీకి వెళ్ళాను. ‘ఆ డెడ్ బాడీ అలివేణిది కాదు’ అని తేలడంతో ఊపిరి తీసుకున్నాను. అలివేణి తండ్రి చక్రాల కుర్చీలో వచ్చాడు. తన కూతురి చావుకు కారణం అల్లుడే అని ఏడుస్తూ పోలీసులకు చెప్పాడు. రోజులు గడుస్తున్నాయి... రెండు రోజుల తర్వాత ‘మూడేళ్ళ పసిపాప శవం’ రైల్వే స్టేషన్లో కనిపించింది. నిరంకుశ్ని తీసుకు వెళ్లారు. ఆ పసిపాప తన బిడ్డ కాదని తెలిసే వరకు నిరంకుశ్ తేరుకోలేక పోయాడు. మొదటిసారి అతనికి భయం పరిచయం అయ్యింది. వారంలో ఒకటి రెండు సార్లు ఇలా పోలీస్ స్టేషన్ చుట్టూ మార్చురీల చుట్టూ తిరగాల్సి వస్తోంది. రోజురోజుకూ చిక్కిపోతున్నాడు నిరంకుశ్. ఎప్పుడు ఏ క్షణం పోలీసులు వస్తారో అనే భయం. ఎప్పుడు ఎక్కడ ఏ డెడ్ బాడీ దొరికినా భయమే. పసిపాపల అనాథ శవాలు దొరికినా భయమే. భయం కన్నా భయంకరమైన భయం మరోటి ఉండదు.. అందులోనూ తప్పు చేసినప్పుడు కలిగే భయమే వేరు! రోజులు నెలలుగా మారాయి. నాకు అలివేణి ఇంటివైపు చూసినప్పుడల్లా మనసు భారంగా అనిపించేది. ఇదివరకులా ఆ ఇంట్లో నుంచి ఏడ్పుల చప్పుళ్ళు వినిపించడం లేదు. శ్మశానంలా ఉంది ఆ ఇల్లు. నిరంకుశ్ ఎప్పుడు వెళ్తున్నాడో, ఎప్పుడు వస్తున్నాడో తెలియడం లేదు. అప్పుడప్పుడు పోలీసులు వస్తూనే ఉన్నారు. అలివేణి మిస్సింగ్ ఒక మిస్టరీగా మిగిలిపోయింది. ఆమె డెడ్ బాడీ కానీ కూతురి డెడ్ బాడీ కానీ దొరకలేదు. అలా అని వాళ్ల ఆచూకీ దొరకలేదు. కొన్నాళ్ల తర్వాత నిరంకుశ్ చెప్పాపెట్టకుండా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళాడు. ఆ ఇంట్లోకి మరో జంట దిగింది. నాకు మాత్రం అలివేణి జ్ఞాపకం ఒక మిస్టరీలా ఉంది. ఇది జరిగిన పాతికేళ్ల తర్వాత.. ∙∙∙ రోడ్డు మీద కారు షికారు చేస్తోంది. నా దృష్టి ఒక్కసారిగా రోడ్డు క్రాస్ చేస్తోన్న వ్యక్తి మీద పడింది. చిన్న ఉలికిపాటు... అలివేణి... అవును అలివేణే... పాతిక సంవత్సరాల తరువాత కనిపించిన అలివేణి. మొహం బాగా గుర్తు. ఎక్సయిటెమెంట్ను కవర్ చేస్తూ కారు స్టార్ట్ చేశాను. కుడివైపు టర్న్ చేశాను. అలివేణి ఎడమ పక్కగా నడుస్తోంది. కారు ఆమె పక్కనే ఆపి ‘ అలివేణీ..’ అని పిలిచాను. అలివేణి కాదు. కానీ అదే మొహం.. అదే అందం.. అదే చెక్కుచెదరని చిరునవ్వు. చీరలో నిండుగా కనిపించే అలివేణి.. చుడిదార్‌లో ఉంది. కారు దిగి ఆమె దగ్గరికి వెళ్లి ‘అలివేణీ..’ అనగానే ఆమె నా వైపు చిరునవ్వుతో చూసి మర్యాదపూర్వకంగా చేతులు జోడించి ‘నా పేరు నీలవేణి. అలివేణి మా అమ్మ’ అన్నది. ‘సారీ ..’ అని నేను ఇంకా మాట్లాడబోతుండగానే ‘నాకు తెలుసు మీరు అలివేణి అనగానే నన్ను చూసి ‘అమ్మ’ అనుకున్నారని’ అంది. మళ్లీ తనే.. ‘ మీరు కార్తికేయ. ప్రముఖ క్రైమ్ నవలా రచయిత. మిమ్మల్ని తెలియని వారు ఉండరు. పాతికేళ్ల కిందటి మీ నవలలు అమ్మ దగ్గర భద్రంగా ఉన్నాయి. ఈ మధ్యే రాసిన అడ్వెంచర్: డెత్ వ్యాలీ, మిడ్ నైట్ : 12, కథలు కూడా ’ నవ్వుతూ చెప్పింది. ఆ అమ్మాయితో నేను అలివేణి ఇంటికి బయల్దేరాను. ∙∙ ఒక చిన్న ఇంటిదగ్గర స్కూటీ ఆగింది. అందమైన పొదరిల్లు లాంటి ఇల్లు.. చుట్టూ పూల మొక్కలు. కాటన్ చీరలో అలివేణి. సోఫాలో కూర్చుని ఉంది. ఆమె కూర్చున్న సోఫా వెనుక నేను రాసిన క్రైమ్ నవలలు. ∙∙ నన్ను చూసిన అలివేణి కళ్ళలో ఎన్నో భావాలు. మేడ మీద నేను, అలివేణి.. ఆకాశంలో నక్షత్రాలు. నా ప్రశ్నలకు సమాధానం అలివేణి చెప్పడం మొదలుపెట్టింది... ‘నా భర్తలోని లోపాలన్నీ భరించాను. కానీ నా స్థానంలో మరొకరిని అతను ఆహ్వానించడాన్ని భరించలేకపోయాను. అరచి అల్లరి చేయనా? ఆత్మహత్య చేసుకుని నా జీవితాన్ని అర్ధాంతరంగా ముగించనా? నా భర్తతో విడాకులు తీసుకుని విడిగా ఉండనా? నా బిడ్డను అకారణంగా నాతో పాటు చంపుకోవాలా? ఏ పాపం చేయని తనను చంపే హక్కు నాకు ఎవరు ఇచ్చారు? అలా అని నా భర్తకు విడాకులు ఇస్తే, అతను జీవితంలోకి వచ్చిన ఇంకో అమ్మాయితో సజావుగా కాపురం చేస్తాడా? మళ్ళీ మరో అమ్మాయి వెంటపడడన్న గ్యారెంటీ ఏమిటీ? అందుకే నేను చావకుండా ఉన్నాను. నా మృతదేహం దొరికేవరకు అతడిని చట్టం శిక్షించదు. కేసు మూసేసే వరకు అతను అనుభవించిన... అనుభవిస్తున్న ‘భయం’ కూడా శిక్ష లాంటిదే. అలా నా భర్త కొన్నాళ్లపాటు చేయని తప్పుకు శిక్ష అనుభవించాడు. మానసిక ప్రశాంతత కోల్పోయాడు. పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగాడు. నరకం అనుభవించాడు. శారీరకంగా మాత్రమే కాదు మానసికంగా కూడా. ఇప్పటికీ ఎక్కడైనా ఎవరి మృతదేహమైనా కనిపిస్తే అది నేనేమోనని ఉలిక్కిపడి లేస్తాడట. చేసిన తప్పుకు ఆ శిక్ష విధించాలని అనిపించింది. అతను చనువుగా ఉంటున్న అమ్మాయిని కలిశాను. నా భర్త గురించి అంతా చెప్పి జాగ్రత్తగా ఉండమని.. నా విషయం ఎవరి చెవినా వేయొద్దని చెప్పాను. నేనే పోలీసులకు కాల్ చేసి అనాథ శవాలకు సంబంధించిన సమాచారం ఇచ్చేదాన్ని. నా భర్తకు ఫోన్ చేసి ఫలానా చోట ఫలానా శవం ఉందని చెప్పేదాన్ని. అతడిని శిక్షించాలని కాదు.. అతను చేసిన తప్పు తాలూకు భయం అతనికి తెలియజేయాలని. నేను చేసిన పనితో భయపడి, మరో అమ్మాయి జోలికి వెళ్లకుండా ఆమెతో బుద్ధిగా ఉంటున్నాడు. అతనికి ఇద్దరు కూతుళ్లు అని తెలిసింది...’ ఆమె కళ్ళల్లో సన్నటి కన్నీటిపొర. ‘మా నాన్నకు నేను ఎక్కడ ఉన్నానో తెలియకుండా జాగ్రత్త పడ్డాను. నాన్నతో టీ కొట్టు పెట్టించాను. నా కూతురికి నేనే తల్లీ.. తండ్రీ. తను సివిల్స్‌కి ప్రిపేర్ అవుతోంది’ అని చెప్పింది అలివేణి .. కళ్ళు తుడుచుకుంటూ. ∙∙ తన భర్త చేసిన నేరానికి ఘోరానికి ఇచ్చిన ఫినిషింగ్ టచ్ నాకు నచ్చింది. ఒక క్రైమ్ రూపు మార్చుకుని అలివేణి భర్తకు తగిన శిక్ష వేసింది ∙∙ నీలవేణి ఐపీఎస్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఏసీపీగా చార్జ్ తీసుకుంది. అది అలివేణి విజయం. నేరాన్ని శిక్షించడానికి నేరాన్నే శిక్షా స్మృతిగా, ఆయుధంగా మార్చుకున్న అలివేణి కథ ఇది. కీ బోర్డు మీద నేను రాసిన క్రైమ్ స్టోరీ.. ‘ఫినిషింగ్ టచ్’... నేరాన్ని నేరంతో ఎదుర్కోవాలని నిరంకుశ్ లాంటి వాళ్లకు అంకుశంలా ఒక రెడ్ అలెర్ట్ వార్నింగ్‌లా మారాలని చెబుతూ! ‘పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్ ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే’ -విజయార్కె చదవండి: Mystery- Lansa Flight 508: 10 వేల అడుగుల పైనుంచి ఆమె కూర్చున్న కుర్చీ కిందపడింది.. చుట్టూ విషసర్పాలు.. అయినా -
Crime Story: తన హత్యకు తానే పథకం వేసుకున్నాడు.. ద్రోహి!
నవంబర్ నెల ఆదివారం రాత్రి.. తన స్నేహితుడు విక్రమ్‌కి చెందిన ఆ అపార్టుమెంట్ ఐదోఅంతస్తులోగల విశాలమైన ఫ్లాట్.. బాల్కనీలో కూర్చొని సన్నగా కురుస్తున్న వర్షాన్ని చూస్తూ ఆలోచిస్తున్నాడు మదన్. రెండు గ్లాసుల్లో ‘బ్లాక్ లేబిల్’ లార్జ్, ఐస్ క్యూబ్స్ కలిపి, ఒక గ్లాస్ అతని చేతికి అందిస్తూ ‘చీర్స్’ చెప్పి ‘అర్జెంట్‌గా మాట్లాడాలన్నావు..ఏంటి విషయం?’ అని అడిగాడు విక్రమ్. ‘వీరేంద్రని హత్య చేయించాలి’ స్కాచ్‌ని చప్పరిస్తూ సూటిగా విషయం చెప్పేశాడు మదన్. అదిరిపడ్డాడు విక్రమ్. నమ్మలేనట్లుగా చూశాడు. మదన్, వీరేంద్ర ఇద్దరూ కలసి పాతికేళ్ళ వయసులో స్థాపించిన ‘నెట్ ఇన్ఫ్రా సొల్యూషన్’ పదేళ్లలోనే రెండువందల కోట్ల టర్నోవర్ సంస్థగా నిలిచింది. ఒకరు ఎమ్‌డీగా, మరొకరు సీఈఓగా వ్యవహరిస్తున్నారు. గత పదేళ్లలో వారిద్దరి మధ్య స్నేహబంధం రోజురోజుకి బలపడిందే తప్ప, పొరపొచ్చాలతో బలహీనపడలేదు. అలాంటిదిప్పుడు ఇటువంటి ఆలోచన మదన్‌కి ఎందుకు వచ్చిందో అర్థంకాలేదు విక్రమ్‌కు. అదే ప్రశ్న అడిగాడు...దోరగా వేయించిన జీడిపప్పు, సలాడ్‌తో కూడిన చికెన్ కబాబ్ ప్లేట్స్ అతని ముందుకు జరుపుతూ. జీవంలేని ఒక చిన్ననవ్వుతో బదులిచ్చాడు అతను.. ‘పదేళ్లలో ఇద్దరం కలసి అహోరాత్రులు శ్రమించి సాఫ్ట్వేర్ రంగంలో ‘నెట్ ఇన్ఫ్రా’ను ఉన్నతస్థానంలో నిలిపాం. అందులో సందేహం లేదు. కానీ ఈ విజయానికి సంబంధించి బయట ప్రపంచంలో మాత్రం అతనికే ఎక్కువ పేరు ప్రఖ్యాతులు లభించాయి. అంతేకాదు, ఈ కంపెనీ కోసం నేను వ్యక్తిగత జీవితాన్ని కూడా త్యాగం చేసి ఒంటరిగా మిగిలిపోయాను. అతను మాత్రం అందమైన భార్య, ఇద్దరు పిల్లలతో సంతోషంగా గడుపుతున్నాడు. ఆస్తిపాస్తులు కూడా నాకన్నా ఎక్కువ సంపాదించాడు. ఇద్దరిదీ సమానమైన కష్టం, సమానమైన హోదా అయినా అతనికే ఎక్కువ పలుకుబడి ఉండటం.. జీర్ణించుకోలేకపోతున్నాను’ అంటూ. అతని మాటల్లో ఈర్ష్య, ఆక్రోశం ధ్వనించాయి. ‘అయితే చంపించేస్తావా?’ అడిగాడు విక్రమ్. ‘ఎస్. లైఫ్‌లో ఎంతో ఎత్తుకు ఎదిగాను. అనుకున్నంత డబ్బు సంపాదించాను. కానీ ఏదో వెలితి. తృప్తి లేదు. ఏదో మిస్ అవుతున్నా. దానికి కారణం ఆ మదన్గాడు. ఇప్పుడు వాడి చావు వార్త మాత్రమే నాకు తృప్తినిచ్చే ఏకైక విషయం’ అన్నాడు కసిగా. ‘మరొక్కసారి ఆలోచించు. అతను మరణిస్తే నీకు వచ్చే లాభమేమీ లేదు’ సాలోచనగా అన్నాడు విక్రమ్. ‘ఉంది. కంపెనీ షేర్లలో మా ఇద్దరిదీ చెరో ముప్పైశాతం వాటా. మిగతా నలభైశాతం ప్రమోటర్లది. వ్యవస్థాపకులుగా మేము చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం.. మా ఇద్దరిలో ఎవరు మరణించినా మా వాటాలో సగం షేర్లు కుటుంబ సభ్యులకు, మిగతా సగం షేర్లు మాలో జీవించి ఉన్న ఇంకొకరికి చెందేలా విల్లు రాయబడింది’ చెప్పాడు మదన్. ‘ఇదంతా నువ్వు అనుకున్నంత సులువుగా జరుగుతుందా?’ దీర్ఘంగా శ్వాసిస్తూ అడిగాడు విక్రమ్. ‘జరగాలి. వాడు చస్తేనే నా అంతరాత్మకు ప్రశాంతత. అంతేకాదు దాదాపు ముప్పై కోట్ల రూపాయల విలువైన షేర్లు కూడా నాకు కలిస్తే కంపెనీలో నా వాటా అరవై శాతానికి పెరుగుతుంది. నేనే కంపెనీ చైర్మన్ అవుతాను’ గోల్డ్‌ఫ్లేక్ లైట్ సిగరెట్ వెలిగించి గుండెల నిండా పొగ పీలుస్తూ చెప్పాడు. అతని కళ్ళలో క్రోధంతో కూడిన ఎరుపు జీరను స్పష్టంగా గమనించాడు విక్రమ్. ఇంతకు ముందెప్పుడు అతన్ని అలా చూడలేదు. ‘విక్రమ్ నిన్నెప్పుడూ ఏదీ అడగలేదు. ఇదొక్కటి నాకోసం చేసిపెట్టు’ అభ్యర్థనగా మదన్. ఆలోచనలో పడ్డాడు విక్రమ్. అనాథ అయిన విక్రమ్‌ని చేరదీసి, సొంతంగా బిజినెస్ చేసుకోవటానికి ఆర్థిక సహాయమందించాడు. ఒక ఇంటివాడినీ చేసి అతని జీవితానికి అర్థాన్ని ఇవ్వటమే కాకుండా, పేరు పెట్టి పిలిచేంత చనువైన స్నేహాన్ని కూడా ఇచ్చాడు మదన్. అలాంటి గొప్ప స్నేహితుడి కోసం ఏమైనా చెయ్యటానికి సిద్ధపడాలి.. తప్పదు అనుకున్నాడు విక్రమ్. ఇది అతని రుణం తీర్చుకునే అవకాశంగా భావించాడు. ‘అది ఒక ఆక్సిడెంట్ లేదా సహజ మరణంలానో ఉండాలి తప్ప హత్య అని నిర్ధారణ కాకూడదు. ఎలాంటి అనుమానం ఎవ్వరికీ రాకూడదు. ఎంత ఖర్చయినా పరవాలేదు’ చెప్పాడు మదన్. సాక్ష్యం దొరకని హత్యా పథకం కోసం ఆలోచించసాగాడు విక్రమ్. ‘బెంగాల్ నుంచి షార్ప్ షూటర్ వస్తాడు. పని ముగించుకొని వెళ్తాడు. ఖరీదు ఎక్కువ రెండు కోట్లు’ అన్నాడు విక్రమ్. ‘ఇందులో రిస్క్ ఎక్కువ. పోలీస్ దర్యాప్తు పకడ్బందీగా జరిగితే హంతకుడు పట్టుబడే అవకాశం ఉంది. లేదా భవిష్యత్‌లో మరే నేరంలోనైనా ఆ హంతకుడు అరెస్ట్ అయితే మన విషయం బయటపెట్టే చాన్స్ ఉంటుంది’ విశ్లేషించాడు మదన్. ‘స్లో పాయిజనింగ్? అతను రెగ్యులర్‌గా తీసుకొనే ఆహరంలో రోజూ కొద్దిగా పాయిజన్ కలుపుతూ మోతాదు పెంచితే అతని శరీరం చచ్చుబడిపోయి కొద్దిరోజుల్లో మరణిస్తాడు. ఎవ్వరికీ అనుమానం రాదు. ఖర్చు కూడా చాలా తక్కువ’ వివరించాడు మదన్. ‘నో. ఇది చాలా దీర్ఘంగా సాగుతుంది. మరణించే అవకాశం వంద శాతం అని కచ్చితంగా చెప్పలేం’ సందేహం వెలిబుచ్చాడు మదన్. ‘అతని ఇంట్లోని షాండ్లియర్ తెగి అతని మీద పడేలా చెయ్యటం లేదా అతను తన ఆఫీస్ ఎనిమిదో అంతస్తులో వున్నప్పుడు ప్రమాదవశాత్తు కిటికీలోంచి కింద పడ్డట్లు చిత్రీకరించటం...’ విక్రమ్ మాటలకు అడ్డు తగులుతూ ‘అవన్నీ కూడా అతని పనివాళ్లు లేదా సన్నిహితుల సహకారం లేకుండా చేయలేం. అంతటా సీసీ కెమెరాలు ఉన్న ఈ రోజుల్లో ఇలాంటి పథకాలు నేరస్తున్ని ఈజీగా పట్టిస్తాయి’ అసంతృప్తి వ్యక్తం చేస్తూ మదన్. ‘మరెలా?’ గ్లాసుల్లో మూడో రౌండ్ ఫిక్స్ చేస్తూ అడిగాడు విక్రమ్. ‘రోడ్డు ప్రమాదంలో మరణించాలి. హైవేలో వెళ్తున్నప్పుడు సీసీ కెమెరాలు లేని చోట ప్రమాదం జరగాలి. వీరేంద్ర కారు తుక్కుతుక్కు అయిపోవాలి. అతడి దేహం ఛిద్రం కావాలి. నిర్లక్ష్యంతో కూడిన డ్రైవింగ్ తో ఒక ప్రాణం బలవ్వటానికి కారణం అయిన డ్రైవర్‌కి గరిష్ఠంగా ఆరు సంవత్సరాల జైలు శిక్ష మాత్రమే’ చెప్పాడు మదన్.. తన మనసులో ఉన్న ప్లాన్‌ని. ‘ఈ ప్లాన్ బాగుంది. కానీ తెలిసి తెలిసి ఎవరు ఒప్పుకుంటారు?’ అడిగాడు విక్రమ్. ‘ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఒక లారీ డ్రైవర్ని వెతుకు. యాభై లక్షలు క్యాష్ ముందుగానే ఇవ్వు. ఆ మొత్తం అతని జీవితాన్ని సెటిల్ చేస్తుంది. ఆరు సంవత్సరాల తరువాత సుఖవంతమైన కుటుంబ జీవితం అతని సొంతం అని చెప్పు. ఫోన్లో కాకుండా నేరుగా సంప్రదింపులు జరుపు’ ఆజ్ఞాపిస్తున్నట్టుగా వివరించాడు మదన్. ∙∙ ఆ మరుసటి ఆదివారం .. అనుకున్నట్టుగానే వారి ప్లాన్ అమలు జరిగింది. కానీ కారు వీరేంద్రది కాదు. హైవేలో వెళ్తున్న మదన్ కారుని లారీ ఢీ కొట్టటంతో అక్కడికక్కడే మరణించాడు అతను. మదన్ ఆస్తులకు బినామీ అయిన విక్రమ్‌కి.. అవి సొంతం అయ్యాయిప్పుడు. తన హత్యకు తానే పథకం రచించుకున్నాడు ‘పూర్ మదన్’ అనుకున్నాడు విక్రమ్. - మొగిలి అనిల్‌కుమార్ రెడ్డి చదవండి: Viral News: ఒకే కంపెనీలో 75 ఏళ్ల సర్వీస్... 90 ఏళ్ల వయసులో రిటైర్మెంట్..!! -
క్రైమ్ స్టోరీ: ఆ బ్యాగ్
గాలి జోరు తెలుస్తోంది. వాన వచ్చేలా ఉంది. గది కిటికీ అద్దాలు మూశాను. విండో కర్టెన్ సర్దాను. నా భార్య.. పిల్లలతో పుట్టింటికి వెళ్లింది. ప్రస్తుతం ఇంట్లో ఒక్కణ్ణే. లైట్ ఆర్పి మంచం ఎక్కాను. నిద్రకి ఉపక్రమిస్తున్నాను. అంతలోనే బయట డోర్‌బెల్ మోగింది. ‘ఎవరబ్బా’ అనుకున్నాను. లేచి లైట్ వేశాను. గది నుంచి బయటకు నడిచాను. హాలు, బయట లైట్లు వేశాను. మెయిన్ డోర్ పక్కనున్న విండో కర్టెన్ కాస్త తొలగించి దాని డోర్ తీశాను. బయటకి చూశాను. ఎవరో.. ఒకతను! యువకుడులా ఉన్నాడు. బయట తచ్చాడుతున్నాడు. ‘ఎవరూ?’ అతణ్ణే చూస్తున్నాను. అతను విండో దరికి వచ్చి ‘సారీ ఫర్ ది ట్రబుల్’ అన్నాడు. చిన్నగా తలాడిస్తూ ‘ఏమిటీ’ అడిగాను. ‘మీ ఎదురు రూమ్‌లో నా ఫ్రెండ్ ఉంటాడు. వాడికై వస్తే వాడు లేడు’ నా చూపును ఎదురు రూమ్ వైపు పోనిచ్చాను. తాళంవేసి ఉంది. ఆ రూమ్‌లో ఒకతను ఉండడం నాకు తెలుసు. అతను ఉద్యోగి అనుకుంటున్నా. తిరిగి నా చూపుని విండో ముందున్న అతని వైపు తీసుకొచ్చాను. ‘ఈ బ్యాగ్ వాడికి అందించాలి. వర్షం వచ్చేలా ఉంది. పాలుపోవడం లేదు’ అతను కుదురు తప్పేలా తోస్తున్నాడు. ‘దయచేసి ఈ బ్యాగ్‌ను వాడికి అందించి పెట్టండి’ అతనిలో దీనం అగుపిస్తోంది. మెయిన్ డోర్ తీశాను. అతను గుమ్మం వైపు వచ్చాడు. నా ముందు ఆ బ్యాగ్ పెట్టాడు. ‘అతడిని చూస్తున్నా.. కానీ అతనితో నాకు పరిచయం లేదు’ చెప్పాను. ‘ఫోన్ చేస్తే రూమ్‌లో ఉంటాను అన్నాడు’ చెప్పాడు అతను. ‘సాయంకాలం ఆఫీస్ నుంచి వస్తూ రూమ్‌లో అతణ్ణి చూశాను’ నేనూ చెప్పాను. ‘మరెటు వెళ్లాడో ఏమో! పైగా వాడి ఫోన్ సిచ్చాఫ్‌లో ఉందిప్పుడు’ అతను కంగారుగా ఉన్నట్టు అగుపిస్తున్నాడు. ‘నేను రామారావు. నేను వచ్చి ఇచ్చానని చెప్పండి. వాడి పేరు శ్యామలరావు’ అతను చెబుతున్నాడు. ‘అతడు ఎప్పుడు వస్తాడో ఏమో. నేను ఉన్న టైమింగ్స్‌లో కనిపిస్తాడో లేదో’ సందిగ్ధమవుతున్నాను. ‘వాడితో ఫోన్లో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంటాను. మిమ్మల్ని కలసి బ్యాగ్ తీసుకొనేలా నేను చూస్తాను’ చెప్పాడు రామారావు. చినుకులు మొదలయ్యాయి. ‘నేను ఈ ఊరు వచ్చిన పని అపోయింది. తిరిగి ఊరెళ్లిపోవాలి. రిటర్న్ టికెట్టు అయిపోయింది. రైల్వేస్టేషన్‌కి పోవాలి’ రామారావు తొందరవుతున్నాడు. ‘సర్లే. నా పేరు కృష్ణారావు. నీ ఫ్రెండ్‌ని కలవమను. అవకాశం కుదిరితే నేనే అందచేస్తాను’ చెప్పాను ఆ బ్యాగ్‌ని లోపలికిలాక్కుంటూ. ‘థాంక్స్’ అంటూ కదిలి పరుగులా పోతున్నాడు రామారావు. నేను మెయిన్ డోర్ మూసి హాల్లోకి వచ్చాను ఆ బ్యాగ్‌తో. అందులో ఏమున్నాయో కానీ చాలా బరువనిపించింది. ఫ్రిజ్‌లోంచి బాటిల్ తీసి వాటర్ తాగాను. లైట్లార్పి గదిలోకి వచ్చాను. బయట చినుకులు కాస్తా వానగా మారిందని తోస్తోంది. రామారావు పరిస్థితి ఏమిటో! స్టేషన్‌ని చేరుకోగలడా? ఊరుకి పోగలడా? ఇంతకీ శ్యామలరావు ఎటు వెళ్లాడో? ఎప్పుడు వస్తాడో? బ్యాగ్ అతడికి అందించడం ఎలాగో? తర్జనభర్జనలతోనే లైట్ ఆర్పి మంచం ఎక్కేశాను. ఎప్పుడు ఎలా పట్టేసిందో నిద్ర పట్టేసింది. లేచేసరికి తెల్లారి పోయింది. హాలులోని ఆ బ్యాగ్‌ని చూశాక రాత్రి ఘటన సర్రున గుర్తుకు వచ్చింది. పేపర్కై మెయిన్ డోర్ తీస్తూ ఎదురు రూమ్ వైపు చూశాను. ఆ రూమ్ తలుపు తీసి ఉంది. పేపర్ రాలేదు. శ్యామలరావుకై వేచి చూస్తున్నాను. అతడు కానరావడం లేదు. నేనే కదిలి ఆ రూమ్ ముందుకు వెళ్లాను. ‘హలో’ అన్నాను. రెండో పిలుపుకి ఒకతను రూమ్‌లోంచి బయటకి వచ్చాడు. నేను ఈ రూమ్‌లో చూస్తున్న అతనే. ‘మీరు శ్యామలరావా’ అడిగాను. ‘అవును’ అన్నాడు అతను. నేను విషయమంతా చెప్పాను. ‘అవునవును. మీల్స్కెళ్లాను. నా ఫోన్ స్విచ్చాఫ్ అయిపోయింది. రూమ్‌కి వచ్చి చార్జింగ్ పెట్టాక రామారావు ఫోన్‌కాల్ అటెండ్ కాగలిగాను. వాడు మా ఊరు వాడే. మా వాళ్లు వాడి చేత నాకు ఆ బ్యాగ్ పంపారు. వాడు తన సొంత పని కాగానే నాకా బ్యాగ్ అందచేయాలనుకున్నాడట. నేనా సమయానికి వాడికి అందుబాటులో లేకపోయాను. ట్రైన్‌కి టైమైపోతుందని మీకు ఆ బ్యాగ్నిచ్చేసి వాడు తిరిగి ఊరు బయలుదేరిపోయాడట. ఆ బ్యాగ్కై మిమ్మల్ని నేనే కలవాలనుకుంటున్నాను’ చెప్పాడు శ్యామలరావు. శ్యామలరావుని పిలుచుకొని ఇంట్లోకి వచ్చాను. హాల్లోని ఆ బ్యాగ్‌ని చూపాను. ఆలోపే ‘పేపర్’ అంటూ బయట నుంచి పేపర్ బాయ్ కేక. దాని కంటే ముందుగానే పేపరు సర్రున హాల్లోకి వచ్చి పడింది. నేను చిత్రమవుతున్నాను. శ్యామలరావు ‘థాంక్స్’ చెప్పి ఆ బ్యాగ్‌ని తీసుకెళ్ళిపోతున్నాడు. నేను అతని వెనుకే వెళ్ళి మెయిన్ డోర్ మూశాను. పేపరు తీసుకొని హాల్లోని సోఫాలో కూర్చున్నాను. పేపర్ పేజీలు తిప్పుతూ హెడింగ్స్ చదువుతున్నాను. డోర్ బెల్ మోగింది. వెళ్లి మెయిన్ డోర్ తీశాను. శ్యామలరావు కనిపించాడు. ‘ఏమట?’అడిగాను. ‘బ్యాగ్‌లో రాళ్లున్నాయి’ దాదాపుగా ఏడుపు గొంతుతో అతను. నేను కంగారుపడుతూ ‘నాకేం తెలుసు? అతనిచ్చిందే మీకు అందించేశాను’ అన్నాను. ‘లేదు. మా వాళ్లు ఏం పంపారో అవి లేవు’ గందికవుతున్నాడు శ్యామలరావు. ‘అయ్యో. నాకేం సంబంధం?’ అనేశాను. ‘రామారావుకి ఫోన్ చేశాను. వాడూ మా వాళ్ళు ఇచ్చిందే తెచ్చి ఇచ్చానని చెప్పుతున్నాడు. బ్యాగ్‌లో ఏం ఉన్నాయో తనకీ తెలియదంటున్నాడు’ చెప్పుతున్నాడు శ్యామలరావు. నేను వింటున్నాను. ‘మా వాళ్లనీ వాకబు చేశాను. వాళ్లు పంపినవి చెప్పారు. అవి లేవు. వాటి బదులు రాళ్లు ఉన్నాయి’ శ్యామలరావు తంటాలు పడుతున్నాడు. నేను అతణ్ణే చూస్తున్నాను. ‘ఏమీ తేలడం లేదు. మోసం జరిగింది. ఇలాగైతే నేను మీ మీద పోలీస్ కంప్లయింట్ ఇస్తాను’ చెప్పాడు శ్యామలరావు చాలా ఘోరంగా. నాకు చుర్రుమంది. అయినా తమాయించుకున్నాను. మాట్లాడడానికి యత్నిస్తున్నాను. కానీ శ్యామలరావు విసురుగా వెళ్లి పోయాడు. గంట తర్వాత పోలీసులు రావడంతో నేను స్టేషన్‌కి వెళ్లవలసి వచ్చింది. ఇన్స్పెక్టర్కి జరిగింది చెప్పాను. మరుసటి రోజు పోలీసులు మళ్లీ పిలవడంతో నేను స్టేషన్‌కి వెళ్లాను. స్టేషన్లో శ్యామలరావుతో పాటు రామారావు, మరొకతను ఉన్నారు. ‘ఇతడేనా మీకు ఆ బ్యాగ్ ఇచ్చింది’ అడిగాడు ఇన్స్పెక్టర్.. రామారావుని చూపుతూ. ‘అవును’ అన్నాను. అక్కడ ఉన్న మరొకతణ్ణి పిలిచి ‘మీరు ఇక్కడ నిల్చోండి’ అన్నారు ఇన్స్పెక్టర్. అతడు అక్కడ నిల్చున్నాడు. అతడి పక్కన రామారావుని, అతని పక్కన నన్ను, నా పక్కన శ్యామలరావుని వరుసగా నిలబెట్టాడు ఇన్స్పెక్టర్. మా నలుగురుకీ తన టేబుల్ మీద ఉన్న ఆ బ్యాగ్‌ని చూపుతూ ‘మీ చేతులు మారింది ఇదే బ్యాగ్ కదూ’ అడిగాడు ఇన్స్పెక్టర్. మేం నలుగురం ‘అవును’ అన్నాం. ‘మీరు అప్పారావు. శ్యామలరావు తండ్రి. మీరేగా మీ అబ్బాయికి అందించమని ఈ బ్యాగ్‌ని పంపింది’ అడిగాడు ఇన్స్పెక్టర్.. మాలోని ఆ మరొకతన్ని. ఆయనా తలూపాడు. ఇన్స్పెక్టర్ చెప్పగా అప్పారావు టేబుల్ మీది బ్యాగ్‌ని తీసుకున్నాడు. ‘మీరు పంపినప్పుడు బ్యాగ్ ఇంతే బరువు ఉందా’ అడిగాడు ఇన్స్పెక్టర్. ‘అబ్బే. ఇంత బరువు కాదు’ చెప్పాడు అప్పారావు. తర్వాత రామారావు వంతు. తర్వాత నా వంతు. తర్వాత శ్యామలరావు వంతు. మేమ్ముగ్గురం ‘ఇంతే బరువు’ అని ఒప్పుకున్నాం. ‘సో. రామారావు నుంచే బ్యాగ్ బరువు మారింది’ అన్నాడు ఇన్స్పెక్టర్.. రామారావునే చూస్తూ. రామారావు గమ్మున ‘సార్ నాకేం తెలియదు. నేను పుచ్చుకున్నప్పుడే బ్యాగ్ అంత బరువుగా ఉంది’ చెప్పాడు. ‘అబద్ధమాడకు. తదుపరి చర్యలు కఠినంగా ఉంటాయి’ ఇన్స్పెక్టర్ గద్దించాడు. ‘ఒట్టు సార్. నిజం సార్’ బెంబేలయిపోతున్నాడు రామారావు. ‘అంటే ఆయన అబద్ధం చెబుతున్నాడా? ఆయన అందించేటప్పుడు బ్యాగ్ అంత బరువు లేదన్నాడుగా’ అప్పారావుని చూపుతూ అన్నాడు ఇన్స్పెక్టర్. ‘లేదు సార్. నేను తీసుకున్నప్పుడు అంతే బరువు ఉంది. అయినా బ్యాగ్ నాకు ఈయన ఇవ్వలేదు’ చెప్పాడు రామారావు. ‘వ్వాట్?’ ఆశ్చర్యమయ్యాడు ఇన్స్పెక్టర్. ‘అవును సార్. ముందు రోజు అప్పారావు అంకుల్ నేను కలిశాం. మాటల్లో రేపు నేను ఊరు వెళ్తున్నానంటే ఒక బ్యాగ్ ఇస్తాను శ్యామలరావుకి అందించు అన్నారు. సరే అన్నాను. మర్నాడు ట్రైన్ మూవ్ అవుతున్న సమయాన సోమశేఖర్ తెచ్చిచ్చాడు ఈ బ్యాగ్‌ని’ చెప్పుతున్నాడు రామారావు. ‘రామారావు చెబుతోంది నిజమేనా?’ అప్పారావుని అడిగాడు ఇన్‌స్పెక్ట్టర్. ఆయన ‘నిజమే’ అన్నాడు. ‘హూష్. నిగ్గుతేలాలి’ సీరియసయ్యాడు ఇన్స్పెక్టర్. మమ్మల్నందరినీ రెండు రోజుల తర్వాత తిరిగి సమావేశపరచాడు ఇన్స్పెక్టర్. ఈ సమావేశంలో మరో కొత్త వ్యక్తి కూడా చేరాడు. అతణ్ణే చూస్తూ ‘ఇతడు సోమశేఖర్. అప్పారావు మినహా ఇతడూ మీ ముగ్గురులానే ఆ బ్యాగ్ తను అందుకున్నప్పుడు సుమారుగా ఇదే బరువున ఉందని తేల్చాడు. సో ఇక తప్పక నా పనితనాన్ని కఠినం చేశాను. తొలుత అప్పారావు నుంచే మొదలు పెట్టాను. అప్పారావు మొదటి భార్య చనిపోయింది. ఆవిడ కొడుకే శ్యామలరావు. అప్పారావు రెండో పెళ్లి చేసుకున్నాక శ్యామలరావుతో విభేదాలు పెరిగాయి. శ్యామలరావు తన వాటా ఇచ్చేస్తే శాశ్వతంగా తను బయటకి పోతానన్నాడు. అందుకు అప్పారావు ససేమిరా అంటూ వచ్చాడు. తర్వాత్తర్వాత ఇద్దరి మధ్య ఒక ఒప్పందం కుదిరింది. తన మొదటి భార్య నగలు, నగదుతో పాటు ఆవిడ పేరున ఉన్న పత్రాలు శ్యామలరావుకి ముట్ట జెప్పడానికి అప్పారావు అంగీకరించాడు. వాటినే ఆ బ్యాగ్ ద్వారా అందజేస్తున్నట్టు శ్యామలరావుకి చెప్పాడు. కానీ ఆ బ్యాగ్‌లో వాటి బదులు తనే రాళ్లుపెట్టి పంపాడు. శ్యామలరావుకి ఆ బ్యాగ్ అందే ప్రోసెస్‌లో చేతులు మారే విధం ఉండడంతో తను సేఫ్ కావొచ్చు అనుకున్నాడు. హు. అడ్డంగా దొరికిపోయాడు. అసలు మోసకారి అప్పారావే’ ఇన్స్పెక్టర్ చెబుతున్నాడు. ‘హమ్మయ్య’ అనుకున్నాను. - బివిడి ప్రసాదరావు చదవండి: కథ: మరణ దండన -
Crime Story: ప్రమాదం అంచున..!
‘సార్! నిన్నటి నుంచి మా రాహుల్ కనబడడం లేదు!’ ఎస్.ఐ. కోసం వేచి చూస్తూన్న ఆ జంట ఆయన రావడంతోనే గబగబా చెప్పేశారు. ఫిర్యాదుదారుకి సుమారు ముప్పై, అతని భార్యకు పాతిక వరకూ ఉండొచ్చు వయసు. ముఖాలు వాడిపోయి, అమె కళ్ళయితే ఏడ్చి వాచి ఉన్నాయి. ‘కూర్చోండి, ఎంత వయసు? నిన్ననగా కనబడకుంటే ఇప్పుడా ఫిర్యాదు చెయ్యడం? మీరు పిల్లాడి తల్లి,తండ్రులేనా?’ విసుగ్గా, కోపంగా అడిగాడు ఎస్.ఐ. తప్పు చేసినట్టు తల దించుకున్నారు వాళ్ళు. ‘కూర్చోండి. వివరాలు చెప్పండి’ పరిశీలనగా చూస్తూ చెప్పాడు ఎస్.ఐ. ‘రాహుల్.. వయసు ఏడేళ్ళు. వివేకానంద స్కూల్లో రెండో తరగతి చదువుతున్నాడు. నిన్న మేము ఆఫీస్ నుంచి వచ్చేసరికి బాగా ఆలస్యం అయింది. అప్పుడప్పుడలా జరుగుతుంది. వాడు పక్కవీధిలో ఉన్న మా అక్క ఇంటికెళతాడు. ఉదయాన్నే వచ్చేస్తాడు, ఒక్కోసారి అక్కడి నుంచే స్కూల్‌కి వెడతాడు. మాకిది మామూలే. అందుకే కంగారు పడలేదు. వచ్చాక ఫోన్ చేస్తే బిజీ వచ్చింది. అక్కడే ఉంటాడులే అనుకుని అలసిపోయామేమో పడుకుండి పోయాం. ఉదయం ఏదో పని మీద మా అక్క ఫోన్‌చేసే వరకూ వాడక్కడ లేడని తెలియదు. అప్పటి నుంచీ, మేమూ, వాళ్ళూ కూడా తెలిసున్న వాళ్ళందరినీ అడిగి మిస్ అయ్యాడు అని నిర్ధారించుకుని ఫిర్యాదు చేయడానికి వచ్చాం’ తప్పు చేసిన భావన అతని స్వరంలో స్పష్టంగా వినబడింది. ‘సరే.. వివరాలన్నీ రాసి, ఫోటో కూడా ఇచ్చి వెళ్ళండి. దర్యాప్తు చేస్తాం. అన్నట్టు మీకెవరి మీదైనా అనుమానం ఉందా? మీరే ఉద్యోగం చేస్తారు?’ ఆరాగా అడిగాడు ఎస్.ఐ. ‘మేమిద్దరం సాఫ్ట్వేర్ ఇంజనీర్స్మే. మాకు ఒక్కడే కొడుకు. ఎవరితోనూ గొడవల్లేవు. ఎవరి మీదా అనుమానమూ లేదు. స్కూల్‌కి కూడా వెళ్లొచ్చాం, నిన్న సాయంత్రం స్కూల్ అయిపోయాక మామూలుగా స్కూల్ బస్‌లోనే వచ్చి మా ఇంటి దగ్గర స్టాప్‌లోనే దిగాడని బస్ వాళ్లు కూడా చెబుతున్నారు’ ఏడుస్తున్న భార్య భుజాల చుట్టూ ఓదార్పుగా చెయ్యివేసి బదులిచ్చాడు అతను. ‘సరే మీరు వెళ్ళండి. మేము దర్యాప్తు చేస్తాం’అన్నాడు ఎస్.ఐ. ‘ఆ.. అన్నట్టు పిల్లాడి మెడలో గొలుసూ గట్రా ఏమైనా ఉందా?’ ‘లేదు సర్‘ చెప్పింది తల్లి. ‘మీ ఫోన్ నంబర్ ఇచ్చారుగా. ఆచూకీ తెలియగానే ఫోన్ చేస్తా.. వెళ్ళండి’ ఎస్.ఐ. తన ముందున్న ఫిర్యాదులు చూడడంలో బిజీ అయిపోయాడు. ‘సర్! దయచేసి కొంచెం వెంటనే వెతకండి. నాకు భయంగా ఉంది’ వెళ్ళబోతూ అంది ఆమె. ‘మీరు ఫిర్యాదు ఇచ్చి క్షణంకాలేదు. కనీసం పిల్లాడు మీ అక్క దగ్గరకు వెళ్ళాడో లేదో కూడా తెల్సుకోని తల్లితండ్రులు.. మాకు చెబుతున్నారు! చూస్తాం వెళ్ళండి’ విసుక్కున్నాడాయన. చదవండి: ఈ పుట్టగొడుగు పొడిని మహిళలు ప్రసవసమయంలో తింటే.. తల దించుకుని, మౌనంగా వెళ్ళిపోయారు వాళ్ళు. ‘ఏం తల్లితండ్రులో? ఉద్యోగాలు, సంపాదనలే ముఖ్యం అనుకున్నప్పుడు పిల్లలను కనడం దేనికి?’ చిరాగ్గా అంటూ లేచాడు. వాళ్ళిచ్చిన ఫోటో చూశాడు. చాలా ముద్దుగా బాగున్నాడు. లేత ముఖం, చురుకైన చూపులూ! ‘నాతోరా’ అని కానిస్టేబుల్‌తో అంటూ ఫోటో జేబులో పెట్టుకుని బయలుదేరాడు ఎస్.ఐ. ∙∙ స్కూల్‌కి వెళ్ళి రొటీన్ విచారణ జరిపాడు ఎస్.ఐ. ఏ బస్ ఎక్కాడో.. ఆ సంబంధీకులతో మాట్లాడాడు. వాళ్ళు చెప్పిన స్టాప్‌లో సుమారుగా ఎన్ని గంటలకు ఆ బస్ ఆగిందో కనుక్కున్నాడు. దాన్ని ఆ ఏరియాలో ఉన్న సీసీ ఫుటేజ్‌తో నిర్ధారణ చేసుకున్నాడు. పిల్లాడు దిగి పక్క వీధిలోకి వెళ్ళడం స్పష్టంగా కనబడింది. వాళ్ళు ఇచ్చిన వివరాల ప్రకారం ఆ అక్కగారింటికి వెళ్ళారు. ‘అప్పుడప్పుడు వస్తాడు కానీ నిన్న రాలేదు. తమ్ముడు ఫోన్ చేయలేదంటే ఇంటికే వెళ్ళిపోయాడనుకున్నా’ చెప్పింది ఆమె. ‘మీరేం చేస్తుంటారు?’ అన్న ప్రశ్నకు తాను గృహిణి అని, తన భర్త లాయర్ అని, వాళ్లకు ఒక కొడుకూ, కూతురూ అని వివరాలు ఇచ్చింది. ‘వాళ్ళేం చదువుతున్నారు?’ ఇల్లంతా కలియచూస్తూ అడిగాడు ఎస్.ఐ. ‘పిల్లాడు ఎనిమిదో తరగతి, పిల్ల ఆరు’ అని చెప్పిందావిడ. ‘ఏరీ?’ అన్న ప్రశ్నకు ‘స్కూల్‌కి వెళ్ళార’ని బదులిచ్చింది. తలా, తోకాలేని ఆ కేస్ తలనెప్పిగా మారింది. ఆస్తి కోసమా అంటే వాళ్ళకు ఆస్తులేం లేవు. కుటుంబ కలహాలా అంటే అతనికి ఆ ఒక్క అక్క తప్ప ఇంకెవరూ తోబుట్టువుల్లేరు. పోనీ డబ్బు కోసం కిడ్నాప్ అనుకునేందుకు రోజులు గడచిపోయినా ఎటువంటి బెదిరింపు కాల్స్ రాలేదు. మరి? ఆ మరి దగ్గరే ఆలోచన ఆగిపోతోంది. మూడు రోజులు గడచిపోయాయి. ఎటువంటి చిన్న ఆధారమూ దొరకలేదు. అసలు అది ఎందుకు జరిగి ఉంటుంది అన్న కారణం తెలిసినా ఎవరు చేసి ఉంటారు? అని ఊహించొచ్చు. తెలుస్తుంది కూడా. కానీ ఇక్కడ ఏ ఆధారం దొరకలేదు. అనుమానితులు కానీ, అనుమానాస్పద సంఘటన కానీ లేదు. ఆలోచించి ఆలోచించి బుర్ర వేడెక్కి పోవడం తప్ప ఏ ఆధారం దొరకని ఎస్.ఐ. మళ్ళీ ఫిర్యాదు దారు వాళ్ల అక్క ఇంటికి వెళ్ళాడు. ఆ రోజు ఆదివారం కావడంతో పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. తల్లీ, తండ్రీ హాల్లో కూర్చుని సినిమా చూస్తున్నారు. పిల్లలు వాళ్ళ గదుల్లో ఉన్నారని చెప్పారు. పిల్లాడి గదిలోకి వెళ్ళిన ఎస్.ఐ. విస్తుపోయాడు. ఆ గదిలో ఒక ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్, ఖరీదైన వస్తువులతో అది చిన్నపిల్లాడి గదిలా లేదు. వాడు చాలా సీరియస్‌గా ఏదో వీడియో గేమ్ ఆడుతున్నాడు. నిశ్శబ్దంగా చూస్తూ నిలబడ్డ అతనికి ఆశ్చర్యం వేసింది. తన గదిలో మరో వ్యక్తి ఉనికిని కూడా గమనించనంత దీక్షగా ఆ పిల్లాడు ఆ గేమ్‌లో మునిగిపోయాడు. అదేదో హంటింగ్ గేమ్. చాలా నిష్ణాతుడిలా ఆడుతున్నాడు. అంతకంటే ఆశ్చర్యం తనను గదిలోకి పంపి ఆ తల్లి కానీ, తండ్రి కానీ కూడా రాలేదు, పని పిల్లతో కాఫీ పంపించి వాళ్ళు సినిమా చూడడంలో మునిగి పోయారు. అది ఒక క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్. కొంచెంసేపు చూసి ఎస్.ఐ. పక్కగదిలోకి వెళ్ళాడు. అక్కడ వాళ్ళ అమ్మాయి మంచం మీద అడ్డదిడ్డంగా పడుకొని నిద్రపోతోంది. సమయం పదకొండు కావస్తోంది. ఎంత సెలవైనా ఆ పిల్లకి ఇంకా అంత నిద్రేమిటో? వాళ్ళు పట్టించుకోకుండా ఉండడమేమిటో? అనుకున్న అతనికి ఆ ఇల్లూ, వాతావరణం, మనుషులూ ఎంత బాధ్యతలేనివారో అర్థమై.. మొదటిసారిగా ఆ పిల్లాడి మీద అనుమానం కలిగింది. అలాంటి వాతావరణంలో పెరిగేపిల్లల మనస్థితి అతనికి బాగానే తెలుసు. చేతి నిండా డబ్బూ, అడ్డూఅదుపూ లేని పెంపకం, వాడు చూస్తున్న సినిమాలూ, ఆడుతున్న ఆటలూ ఆ వయసు పిల్లల్లో ఎలాంటి పోకడలూ, వెర్రితలలూ వేస్తాయో తెల్సినవాడిగా, వాడిని ‘నాతోరా’అంటూ తల్లిదండ్రులకు చెప్పి బయలుదేరతీశాడు. వెతకడంలో సాయానికి అనుకున్న వాళ్ళు కూడా ఏం అభ్యంతరం చెప్పలేదు. చిన్న కుర్రాడు, అదీ తమ్ముడి కొడుకు కనబడకుండా పోయి మూడు రోజులే అయింది. ఆ బాధ కానీ, ఆలోచన కానీ లేకుండా శుభ్రంగా టిఫిన్ తిని, ఆరామ్‌గా సినిమా చూస్తున్న వాళ్ళను ఏం అనుకోవాలో కూడా అర్థంకాలేదు ఎస్.ఐకి. ఏదో యథాలాపంగా ‘పిల్లాడి ఆచూకీ ఏమైనా తెలిసిందా?’ అన్న వాళ్ళ నిర్లిప్తతకు అతని మతి పోయింది. కనీసం ‘తనకున్న టెన్షన్ కూడా వాళ్ళకు లేదు’అని విస్తుపోయాడు. ఆ పిల్లాడిని స్టేషన్‌కు కాకుండా ఓ ఐస్‌క్రీమ్ పార్లర్‌కు తీసికెళ్లాడు. వాడితో కబుర్లుచెప్పి, అచ్చికబుచ్చిక లాడి, ‘రేపొద్దున నువ్వే పోలీస్ ఆఫీసర్ అయ్యావనుకో.. ఏం చేస్తావ్?’ అని అడిగాడు. అంత చిన్నపిల్లాడు ఏ మాత్రం జంకుగొంకు లేకుండా చెప్పిన జవాబుకు బిత్తరపోయాడు ఎస్.ఐ. ఐదు వందల రూపాయల బిల్లయ్యింది కానీ వాడి నుంచి చిన్న విషయం కూడా రాబట్టలేకపోయాడు. ఐస్‌క్రీమ్ తిన్నాకా అక్కడ టిష్యూ పేపర్ అయిపోవడం గమనించి జేబులోంచి చేతి రుమాలు తీసిన ఆ కుర్రాడు, దానితో బాటూ చిన్న తాళంచెవి కింద పడిపోవడం గమనించ లేదు. అది చూసిన ఎస్.ఐ. ముందు అది ఏ సైకిల్ తాళంచెవో అనుకుని, వాడికి చెప్పబోతూ అంతలోకే ఏదో అనుమానం వచ్చి వంగి దాన్ని తీశాడు. అది గాడ్రెజ్ తాళంచెవి. ‘ఈ తాళంచెవి ఏమిటీ?’ అంటూ చూపాడు ఎస్.ఐ. ‘మా స్టోర్‌రూమ్ కీ’ ఠకీమని చెప్పాడు పిల్లాడు ఏ మాత్రం తడుముకోకుండా. ‘నీ జేబులో ఎందుకుంది?’ ‘పొద్దున మమ్మీ పాతపేపర్లు అందులో పెట్టమని ఇచ్చింది. ఆటలో పడి మరచిపోయి జేబులో పెట్టేసుకున్నా. ఇటివ్వండీ’ అంటూ చెయ్యి చాపాడు. అప్పటికే ఎస్.ఐ.బుర్రలో ఉన్న అనుమానం, అంత తేలికగా ఆ కుర్రాడిని నమ్మనివ్వలేదు. ‘సరే పదా!’ అంటూ ఆ తాళంచెవిని జేబులో పడేసుకున్నాడు. కుర్రాడు దాని గురించి మళ్ళీ అడగకపోవడం అతని అనుమానాన్ని బలపరచింది. ∙∙ ఇల్లు చేరిన వెంటనే కుర్రాడు తనగదిలోకి వెళ్ళగానే.. స్టోర్ రూమ్ గురించీ, తాళంచెవి గురించీ పిల్లాడి తల్లిదండ్రులను అడిగాడు ఎస్. ఐ. ‘అందులో పాతసామాను ఉంటుంది. నెలకోసారి పనివాళ్ళే తీసి శుభ్రం చేస్తారు. ఆ తాళంచెవి వాడెందుకు తీస్తాడు?’అంటూ అయోమయంగా అడిగింది పిల్లాడి తల్లి. గబగబా కుర్రాడి గదిని బయట నుంచి లాక్ చేసి,పెరటి వైపున్న ఆ గది తెరిచాడు ఎస్.ఐ. దాదాపుగా అపస్మారకస్థితిలో, నోటికి అడ్డంగా కట్టిన గుడ్డ, పక్కన ఎంగిలి ప్లేట్లు, భరించలేని దుర్గంధంతో ఉన్న స్థితిలో రాహుల్ కనిపించాడు. అతని కూడా వచ్చిన తల్లీ, తండ్రీ విస్తుపోయి చూస్తున్నారు. వేగంగా రాహుల్ దగ్గరకు వెళ్లి ఆ పిల్లాడిని భుజాన వేసుకుని బయటకు తెచ్చాడు ఎస్.ఐ. అంతలోకే లాయర్ గబగబా తమ ఫ్యామిలీ డాక్టర్‌కు ఫోన్ చేశాడు. ఆయన వచ్చి పిల్లాడిని ట్రీట్ చేశాడు. ‘పొరపాటున ఆ పిల్లాడు ఆ గదిలోఉండగా చూడకుండా తాళం పెట్టారేమో!’ అంటున్న ఆ తల్లిని వారించి, ‘విషయం మీ అబ్బాయితో చెప్పిస్తా.. రండి’ అంటూ వాళ్ళను కుర్రాడి గదిలోకి తీసుకెళ్ళాడు ఎస్.ఐ. ఏ మాత్రం అదురూ,బెదురూ లేకుండా ‘థ్రిల్ కోసం, పట్టుకోగలరో లేదో చూద్దామనే చేశాను ఈ పని’అని చెప్పాడు ఆ కుర్రాడు. వాడి నోటి వెంట వచ్చిన ఆ మాటలకు నిర్ఘాంతపోయారంతా. ముందుగా తేరుకున్న ఎస్.ఐ ‘ఇప్పుడు నేనేం చేయాలి? మీ అబ్బాయిని అరెస్ట్‌చేసి కోర్టులో సబ్మిట్ చేయాలా? అలా చేస్తే ఏం జరుగుతుందో లాయర్‌గారూ.. మీకు చెప్పక్కర్లేదనుకుంటా’ తీక్షణంగానే అన్నాడు ఎస్.ఐ. పిల్లాడికి ఏ ప్రమాదం జరగలేదు కనుక కుర్రాడి భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని వదిలేయమని కాళ్ళావేళ్ళా పడ్డారు వాళ్ళు. ‘చదువుకున్న వాళ్ళయి ఉండీ పిల్లలు ఎలా పెరుగుతున్నారో, ఏ దారిలో వెడుతున్నారో చూడకుండా, వాళ్ళకు అక్కరలేనన్ని సౌకర్యాలు ఇచ్చి, ఈ వయసులోనే ఓ ప్రత్యేక గది, ల్యాప్‌టాప్,నెట్,మొబైల్ ఇచ్చిన వాళ్ళు, వాడు వాటిని దేనికి వాడుతున్నాడో, ఎటు పోతున్నాడో చూడక్కర లేదా? ఇదేనా పెంపకం? మీ అబ్బాయిని కాదు మిమ్మల్ని శిక్షించాలి! మీ తమ్ముడు వాళ్లను పిలవండి. వాళ్ళు చెప్పిన జవాబు మీద నా చర్య ఆధారపడి ఉంటుంది’ స్థిరంగా చెప్పాడు ఎస్.ఐ. విషయం తెల్సి షాక్ అయిన రాహుల్ తల్లి, తండ్రి హుటాహుటిన వచ్చేశారు. పిల్లాడిని హత్తుకొని ముద్దులు పెడుతూ ఆ తల్లి ఏడ్వసాగింది. పేరెంట్స్‌గా వాళ్ల బాధ్యతను గుర్తుచేసి, పిల్లల పట్ల నిర్లక్ష్యమూ నేరమే అని హెచ్చరించి స్టేషన్‌కు బయలుదేరాడు ఎస్.ఐ. - మీనాక్షీ చెరకువాడ చదవండి: African Wild Dogs: శునకస్వామ్యం.. తుమ్ములతో మద్దతు ప్రకటన! -
Wemmer Pan Killer: అతనో నరరూప రాక్షసుడు.. ఏ శిక్ష వేసినా తక్కువే..!
ఉన్మాదం వెర్రితలలేయడం చరిత్రకేం కొత్త కాదు. వికృత చేష్టలతో కొందరు.. సీరియల్ కిల్లర్స్ ఇంకొందరు.. తరతరాలను వణికిస్తూనే ఉంటారు. అలాంటి వారిలో ఒకడు మౌపా సెడ్రిక్ మాకే. తప్పు చేసి పోలీసులను తప్పుదోవ పట్టించిన ఘనుడు. హత్యలు, హత్యాచారాలు, దొమ్మీలు, దోపిడీలు.. ఒక్కటేమిటి తవ్వేకొలదీ అతడి జీవితం ఓ నేరాల పుట్ట. దక్షిణాఫ్రికాకు చెందిన మౌపా.. 1965లో జన్మించాడు. అతడి నేర చరిత్ర 1996 నుంచి మొదలైంది. ఏడాదిలోనే తనున్న నగరాన్ని అతలాకుతలం చేసేశాడు. ‘మౌపా సెడ్రిక్ మాకే’గా కాకుండా ‘వెమ్మెర్ పాన్ కిల్లర్’గా పేరు మోశాడు. ఎందుకలా మారాడు? 1996 నుంచి 1997 వరకూ జోహాన్నెస్‌బర్గ్‌లోని వెమ్మెర్ పాన్ అనే ప్రాంతంలో వరుసగా 3 రకాల హత్యలు జరిగాయి. ఎవరు చేస్తున్నారో తెలియక పోలీసులు తలలు పట్టుకున్నారు. హత్యలు జరిగిన తీరుని బట్టి రెండు రౌడీగ్యాంగ్స్ నగరానికి వచ్చి ఉంటాయని.. ఆ దిశగా విచారణ మొదలుపెట్టారు. హత్యకు గురైన తీరుని బట్టి వాటిని మూడు వేరువేరు కేటగరీలుగా విభజించి ప్రొఫైల్స్ కూడా రెడీ చేశారు. మొదటి రకం.. ఒంటరిగా నడిచివెళ్లే ఆడ, మగలను బండరాయితో కొట్టి చంపి, వారి వద్ద ఉన్న విలువైన వస్తువులను దోచుకోవడం. రెండవ రకం.. కారుల్లో వెళ్లే జంటలను టార్గెట్ చేసి మొదట మగవారిని గన్‌తో కాల్చి చంపి.. తర్వాత స్త్రీలను రేప్ చేసి చంపడం. మూడవ రకం.. స్థానిక టైలర్ల షాపులపై దాడి చేసి విలువైన వస్తువులు ఎత్తుకెళ్లడం. ఇలా జరిగిన హత్యల్లో మూడు తేడాలు ఉండేవి. దాంతో ఈ ఉదంతం ఓ మిస్టరీగా మారిపోయింది. టైలర్స్ మీద దాడి చేసేది ఒక గ్రూప్ అని, మిగిలిన రెండు రకాల హత్యలను మరో గ్రూప్ చేస్తోందని ముందొక నిర్ధారణకు వచ్చారు పోలీసులు. వెమ్మెర్ పాన్ ప్రాంతంలో హత్యలు జరుగుతున్నాయి కాబట్టి ‘వెమ్మెర్ పాన్ కిల్లర్’గా, కొందరిని సుత్తితో చంపుతున్నారు కాబట్టి ‘హామర్ కిల్లర్’గా పేర్లు పెట్టి స్థానిక మీడియా ఆ నగరవాసులను హెచ్చరించేది. మౌపా చదవండి: Mysteries Temple: అందుకే రాత్రి పూట ఆ దేవాలయంలోకి వెళ్లరు..! ఓ రోజు ఓ టైలర్ షాప్‌లో పోలీసులకు ఒక స్లిప్ దొరికింది. దాంట్లో ఓ సంతకం ఉంది. దాన్ని చూసిన పోలీసులు అవాక్కయ్యారు. ఎందుకంటే.. అప్పటికే అలాంటి సంతకం రెండో గ్రూప్ చేసిన హత్యలో కీలక ఆధారంగా దొరికింది. దాంతో రెండు గ్రూపులు లేవనీ ఒకటే గ్రూపు ఇదంతా చేస్తోందని పోలీసులు భావించారు. కనీసం ఒక్కడిని పట్టుకున్నా గ్యాంగ్ మొత్తాన్ని బయటికి లాగొచ్చు అనే ఆలోచనతో దాన్నో సవాలుగా తీసుకున్నారు. వెమ్మెర్ పాన్ చుట్టుపక్కల మఫ్టీలో తిరగడం మొదలుపెట్టారు. కొన్నిరోజులకు అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని తమ పై అధికారులకు అప్పగించారు ఆ మఫ్టీ పోలీసులు. అయితే ఆ అధికారులు అతన్ని చూడగానే షాక్ అయ్యారు. ‘నువ్వా?’ అంటూ ఆశ్చర్యపోతున్న అధికారులతో ‘నేనే సార్.. గుర్తున్నానా? నా పేరు మౌపా సెడ్రిక్ మాకే. ఆ ఏరియా మాదే సార్. ఇంతకు ముందు కొన్ని హత్యలకు సంబంధించిన సమాచారాన్ని నేనే కదా మీకిచ్చింది’ అని అతను అనడంతో పోలీసులకు మతి పోయింది. ఆ వెంటనే తేరుకొని వాళ్లు ‘అసలు ఆ నేరాల గురించి నీకు మాత్రమే ఎలా తెలుస్తోంది?’ అంటూ ఆరా లాగారు. దాంతో అతని డ్రామాకి తెరపడింది. అనుమానం రావాలే కానీ నిజాలను కక్కించడం ఎంతసేపు? చివరికి అదే జరిగింది. గ్యాంగులు, గ్రూపులు ఏమీ లేవని.. ఆ నేరాలన్నిటినీ తానే చేశానని ఒప్పుకున్నాడు మౌపా. పోలీసులకు తప్పుడు సమాచారాన్ని ఇస్తూ తప్పించుకుని తిరిగిన మౌపా వ్యూహాన్ని చాకచక్యంగా ఛేదించారు పోలీసులు. చదవండి: ఐదేళ్లుగా వెతుకులాట.. దొరికిన గోల్డ్ ఐలాండ్.. లక్షల కోట్ల సంపద! మౌపా అరెస్టు 1,340 ఏళ్ల జైలుశిక్ష.. 1997 డిసెంబర్లో అరెస్ట్ అయిన మౌపాకి.. 6 సెప్టెంబర్, 2000 సంవత్సరంలో అన్ని ఆధారాలతో శిక్ష ఖరారైంది. అతడు మొత్తంగా 110కి పైగా నేరాలు చేసినట్లు తేలింది. 27 హత్యలు, 26 హత్యాయత్నాలు, 14 రేప్‌లు, 41 దోపిడీలు చేసినట్లు రుజువైంది. వాటన్నింటికీ కోర్టు అతడికి 27 జీవిత ఖైదులను విధించింది. అంటే 1,340 సంవత్సరాలు అతను జైల్లో ఉండాలని తీర్పునిచ్చింది. అయితే ఈ నేరాల్లో ఎక్కువ శాతం రెండిళ్ల చుట్టుపక్కలే జరగడం గమనార్హం. వాటిలో ఒకటి మౌపా పని చేసే ఇల్లు, మరొకటి అతడి సోదరుడు నివసిస్తున్న ఇల్లు. ఆ రెండిళ్ల మధ్య తన ఇష్టానుసారంగా తిరుగుతూ ఈ నేరాలకు పాల్పడ్డాడు మౌపా. అయితే ఈ శిక్షలపై బాధిత బంధువు ఒకరు స్పందిస్తూ.. ‘మరణ శిక్ష అమల్లో ఉంటే నేను చాలా సంతోషించేవాడిని’ అన్నాడు.. 1995 నుంచి దక్షిణాఫ్రికాలో మరణ శిక్షలు రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ. -సంహిత నిమ్మన చదవండి: Health Tips: ఈ విటమిన్ లోపిస్తే మతిమరుపు, యాంగ్జైటీ, హృదయ సమస్యలు.. ఇంకా.. -
Suspense Thriller Crime Story: 37 కోట్ల బీమా కోసం పాముకాటుతో చంపించి..
బీమా సొమ్ము కోసం ఓ నిరుపేదను పాముకాటుతో చంపించిన ఉదంతం తాజాగా వెలుగులోకొచ్చింది. నిందితుడు వేసిన ప్లాన్ సస్పెన్స్ థ్రిల్లర్‌కు ఏమాత్రం తక్కువ కాదు! ఏం చేశాడంటే.. ప్రభాకర్ భీమాజీ వాఘ్చౌరే (54) గత 20 యేళ్లుగా అమెరికాలో నివసిస్తున్నాడు. ఈ ఏడాది జనవరిలో స్వదేశానికి వచ్చి, మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లో రజుర్ అనే గ్రామంలో ఉంటున్నాడు. ఐతే ఏమైందో ఏమో.. హఠాత్తుగా 3 నెల్లతర్వాత ఏప్రిల్ 22న రజుర్ పోలీస్ స్టేషన్‌కు అక్కడి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నుంచి వాఘ్చౌరే అనే వ్యక్తి మరణించినట్లు నివేదిక వచ్చింది. చదవండి: True Love Story: 65 ఏళ్ల ఎదురుచూపు.. అద్భుత ప్రేమ గాథ! దీంతో పోలీసులు సదరు ఆసుపత్రికి వెళ్లి విచారణ చేపట్టగా.. ప్రవీణ్, హర్షద్ లహంజె అనే ఇద్దరు వ్యక్తులు మృతుడు వాఘ్‌చౌరేగా గుర్తించారు. వారిలో ప్రవీణ్ అనే వ్యక్తి మృతుడికి మేనల్లుడినని చెప్పుకొన్నాడు. మృతుడు పాముకాటుతో మరణించినట్లు ప్రాథమిక మెడికల్ రిపోర్టులు వెల్లడించాయి. అంత్యక్రియల నిమిత్తం మృతదేహాన్ని మేనల్లుడికి అప్పగించారు కూడా. దీంతో కథముగిసిపోయిందిలే అని అనుకున్నారు. కానీ.. వాఘ్చౌరే జీవిత బీమా క్లెయిమ్‌పై దర్యాప్తు చేస్తున్న బీమా సంస్థ అధికారులు అతని మరణ వివరాలను కోరుతూ అహ్మద్‌నగర్ అధికారులను సంప్రదించడంతో ఇబ్బందులు మొదలయ్యాయి. చదవండి: Science Facts: క్యాన్సర్ నివారణకు పసుపు ఉపయోగపడుతుందా?.. అదే అడ్డంకి.. బీమా సంస్థ అధికారులు తొలుత మృతుడిగా చెప్పబడుతున్న వాఘ్చౌరే ఇంటి పక్కవారిని అడిగితే.. పాముకాటు సంఘటన ఏదీ ఇక్కడ చోటుచేసుకోలేదని, ఐతే అంబులెన్స్ మాత్రం ఆ ఇంటి ఆవరణలో కనిపించినట్లు తెలిపారు. తర్వాత వాఘ్చౌరే మొబైల్ కాల్ రికార్డులను పరిశీలించగా అసలు విషయం బయటపడింది. అతను బతికిఉండటమేకాకుండా హాస్పిటల్లో తనను తాను మేనల్లుడు ప్రవీణ్‌గా పరిచయం చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు గతవారం వాఘ్‌చౌరేను, అతనికి సహకరించిన 4 అనుచరులను నిర్భందంలోకి తీసుకున్నాట్టు అహ్మద్‌నగర్ ఎస్పీ మనోజ్ పటేల్ మీడియాకు తెలిపారు. ఈ దర్యాప్తులో చనిపోయిన వ్యక్తి అదే ప్రాంతానికి చెందిన నవ్‌నాథ్ యశ్వంత్ ఆనప్ (50)గా గుర్తించారు. ఏప్రిల్ 22న ఆనప్‌ను బలవంతంగా ముందుగానే నిర్ణయించిన ప్రాంతానికి తరలించి కాలి వేలిపై పాముతో కరిపించారు. అతను మరణించిన తర్వాత మృతదేహాన్ని వాఘ్చౌరే ఇంటికి తరలించి, అంబులెన్స్‌ను పిలిపించినట్లు తెలిసింది. అసలు బీమా కంపెనీకి వాఘ్‌చౌరేపై అనుమానం ఎందుకొచ్చిందంటే.. గతంలో అతని భార్య బతికి ఉండగానే 2017లో సదరు బీమా కంపెనీ నుంచి బీమా క్లెయిమ్ చేయడంతో, మోసపోయిన బీమా సంస్థ అతని మృతి గురించి దర్యాప్తు మొదలు పెట్టింది. ఈ దర్యాప్తే అతని బండారాన్ని వీధి కీడ్చింది. ఏదిఏమైనా ఒక నిండు ప్రాణం అతని స్వార్థానికి బలైపోయింది. చదవండి: ఎంత క్యూట్‌గా రిలాక్స్ అవుతుందో .. నిన్ను చూస్తుంటే అసూయగా ఉంది! -
క్రైమ్ స్టోరీ: ది స్పై కెమెరా
అర్ధరాత్రి 11.45 .. డీజీపీ కార్యాలయం. ఎదురుగా ఇద్దరు పోలీస్ అధికారులు. డీజీపీ వాళ్ళవైపు అసహనంగా చూసి అన్నాడు..‘మరో ఇన్ఫార్మర్ మన కారణంగా ప్రాణాలు కోల్పోయాడు’ అని. ‘సారీ సర్! మన డిపార్ట్మెంట్ నుంచి ప్రతీ కదలిక ఆ స్వామీజీకి చేరుతోంది’ ఆ ఇద్దరిలో ఒక పోలీస్ అధికారి అన్నాడు. ‘సో అనవసరంగా మన ఇన్ఫార్మర్స్ ప్రాణాలు పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. కొన్నాళ్ళు మనం కామ్‌గా ఉందాం’ చెప్పాడు డీజీపీ. ఆ ఇద్దరు పోలీస్ అధికారులు పోలీస్ బాస్ మాటలకు ఎదురుచెప్పలేక సెల్యూట్ చేసి వెనుతిరిగారు. ఈ సంఘటన జరగడానికి కొన్నిగంటల ముందు... ∙∙ ఆశ్రమంలో స్వామిజీ ప్రవచనాలు పూర్తయ్యాయి. స్వామిజీ శిష్యులు.. చుట్టూ కవచంలా ఏర్పడి స్వామిజీని ఆశ్రమం లోపలికి తీసుకెళ్లారు. భక్తులకు ప్రసాదించే గంగాజలాన్ని నీళ్లసీసాల్లో నింపి భక్తులకు ప్రసాదిస్తుంటాడు స్వామిజీ. ఆ నీటిని స్వామిజీ హిమాలయాల నుంచి ప్రత్యేకంగా భక్తుల కోసం తీసుకొస్తారని స్వామిజీ శిష్యులు ప్రచారం చేస్తుంటారు. ఆ నీళ్లసీసాలను శిష్యులు తమకు అందుబాటులో ఉంచుకుని వాటిని స్వామిజీకి అందిస్తుంటారు. ఆ గంగాజలం పరమ పవిత్రమైనదని ఆ గంగాజలం తమ దోసిట పడగానే తమ కష్టాలన్నీ తీరిపోయి తమకు సుఖశాంతులు లభిస్తాయని నమ్మే భక్తులు స్వామిజీకి వేలాదిమంది ఉన్నారు. అందుకే ఆ గంగాజలం కోసం పోటీలు పడుతూ స్వీకరిస్తుంటారు. ∙∙ స్వామీజీ అనే ముసుగులో తన చీకటి వ్యాపారాన్ని విస్తరించుకున్నాడు. తన శిష్యులు అతి రహస్యంగా సేకరించుకు వచ్చే ఏనుగుదంతాలను, పులిచర్మాలనే కాక అనేక వస్తువులను ‘‘స్మగ్లింగ్ ’’ ద్వారా విదేశాలకు ఎగుమతి చేస్తూ కోట్లాది ఆస్తులను తన ఆశ్రమ నేలమాళిగల్లో భద్రపరచుకునేవాడు. ఆరోజు ఏనుగుదంతాలు, పులిచర్మాలు చేతులు మారుతున్నాయి. అదే సమయంలో.. స్వామిజీ మిగిలిన శిష్యులు తిరిగి ఆశ్రమం వైపు వెళ్లబోయేంతలో.. దూరం నుంచి ఏదో వెలుగు స్వామిజీ కంటపడింది. అది చూడగానే స్వామిజీ తన దుస్తులలో దాచుకున్న గన్ బయటకు తీశాడు. శిష్యులు ఆ వెలుగు వచ్చిన వైపు శరవేగంగా పరుగు తీశారు. ‘వాడిని చంపేయండి.. వాడు ప్రాణాలతో ఈ ప్రాంతం దాటి వెళ్ళకూడదు’ స్వామిజీ సెక్యూరిటీని హెచ్చరించాడు. స్వామిజీ అనుచరులు అతడిని వెంబడించారు. చీకటిలో ఎంతో దూరం పరిగెత్తలేని ఆ వ్యక్తి ఒకచోట పడిపోయాడు. స్వామిజీ అనుచరులు అతడిని షూట్ చేశారు. ఆ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. అతని చేతిలోని ఫోన్ దూరంగా పడిపోయింది. అదేసమయంలో అటువైపు దూసుకొచ్చిన ఒక వాహనం ఆ సెల్ ఫోన్‌ను ముక్కలుగా చేసి అంతే వేగంగా అక్కడి నుంచి వెళ్లిపోయింది. అది చూసిన స్వామిజీ, శిష్యులు తమ రహస్యం బట్టబయలు కాలేదని సంతోషించి స్వామిజీ చేతిలో బలైన ఆ వ్యక్తిని రోడ్డు మీదకు లాగి ఏమీ ఎరగనట్టు ఆశ్రమానికి వెళ్లిపోయారు. ఆ వ్యక్తి పోలీస్ ఇన్ఫార్మర్. తప్పించుకోవడానికి పరుగిడుతున్నపుడు ఒక వీడియోను మరోవ్యక్తికి పంపించాడు. ప్రాణాలు కోల్పోతూ కూడా తన బాధ్యతను నెరవేర్చాడు. ∙∙∙ అర్ధరాత్రి వేళ స్వామిజీ ఆశ్రమంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఒకవ్యక్తిని సీసీటీవీ ద్వారా చూసి భక్తుల రూపంలో ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ స్వామిజీ దగ్గరికి తీసుకువెళ్లారు. అతని వేషధారణ చూడగానే వజ్రాల వర్తకుడిగా గుర్తించారు. ఆధార్ కార్డులో భన్సీలాల్ అని వుంది. రాజస్థాన్ వాసి అని అతని చిరునామా చూశారు. ‘స్వామిజీ నా పేరు భన్సీలాల్.. నాకు వజ్రాలవ్యాపారం ఉంది ’ అంటూ తన దగ్గరున్న వజ్రాలను తీసి చూపించాడు. ఆ వజ్రాలను చూసి కళ్లు బైర్లు కమ్మిన స్వామిజీకి ఆ వజ్రాలను ఎలాగైనా సొంతం చేసుకోవాలన్న ఆశ కలిగింది. అంతలో భన్సీలాల్ స్వామిజీని ‘మీ దగ్గర పులిచర్మం, పులిగోళ్ళు, ఏనుగుదంతాలు దొరుకుతాయి. అని మాకు తెల్సు.. ఎప్పటి నుంచో వాటిని సేకరించాలని మాది కోరిక. మా దగ్గర వజ్రాలు మూలుగుతూ ఉన్నాయి. నాకు పులిచర్మం.. పులిగోళ్ళు..ఏనుగుదంతాలు.. అందచేస్తే ఈ వజ్రాలన్నీ మీకే సాబ్! ఇది చాలా సీక్రెట్‌గా జరిగిపోవాలి. మాకీ పోలీసులు అంటే మా చెడ్డ చికాకు’ అతి వినయంగా, కాన్ఫిడెంట్‌గా చెప్పాడు. ముందు అతను కోరినవి ఇచ్చి ఆ తరువాత భన్సీలాల్ని పైకి పంపించాలని నిర్ణయించుకున్నాడు స్వామిజీ. ఆ రాత్రి భన్సీలాల్ ఆశ్రమానికి కొద్ది దూరంలో వేచి ఉన్నాడు. కొద్ది సేపటి తర్వాత స్వామిజీ తన శిష్యులతో అక్కడికి చేరుకున్నాడు. అక్కడికి ఒక లారీ వచ్చి ఆగి ఉంది. ఆ లారీ ఎక్కిన స్వామిజీ.. ఒకటి దొంతరలుగా పేర్చి ఉన్న పులిచర్మాలను స్వయంగా బయటకు తీయసాగాడు. భన్సీలాల్ కోరినవన్నీ ఇచ్చి అతని చేతిలోని వజ్రాలు తీసుకున్నాడు. భన్సీలాల్ ఆశ్రమం దాటగానే అతని వెహికిల్‌ని లారీతో ఢీకొట్టించి యాక్సిడెంట్‌గా చిత్రించాలన్నది స్వామిజీ ప్లాన్. అతను ఎప్పుడూ అనుసరించే ప్లాన్ ఇదే. సరిగ్గా పావుగంట తరువాత స్వామిజీ.. లారీ డ్రైవర్‌కు ఫోన్ చేశాడు ఆశ్రమంలోకి అడుగుపెడుతూ. అతని చేతిలో భన్సీలాల్ ఇచ్చిన వజ్రాలు ఉన్నాయి. లారీ డ్రైవర్ నుంచి రెస్పాన్స్ రాలేదు. కంగారుగా మళ్ళీ ఫోన్ చేశాడు. ఆశ్రమంలోనే ఫోన్ రింగ్ అయింది. తన వెనుక నుంచే ఆ శబ్దం. తలవెనక్కి తిప్పి చూసి షాకయ్యాడు. భన్సీలాల్ చేతిలో లారీ డ్రైవర్ ఫోన్. ‘ఈరోజుతో నీ చాప్టర్ క్లోజ్ మిస్టర్ ధనంజయ్ అలియాస్ స్వామిజీ..! ఆశ్రమం చుట్టూ కమాండోస్ ఉన్నారు. లారీ డ్రైవర్ మా కస్టడీలో ఉన్నాడు. స్వామీజీ చేతులకు సంకెళ్లు తగిలిస్తూ చెప్పాడు భన్సీలాల్ అలియాస్ సిద్ధార్థ.. డిటెక్టివ్ సిద్ధార్థ. ∙∙ స్వామిజీని అరెస్టు చేయడంతోనే మిగిలిన శిష్యులందరూ లొంగిపోయారు. స్వామిజీ ఆశ్రమాన్ని పోలీసు బలగం చుట్టుముట్టారు. డిటెక్టివ్ సిద్ధార్థను చూసిన మీడియా ప్రశ్నలవర్షం కురిపించసాగింది. స్వామిజీ స్మగ్లింగ్ చేస్తాడని మీకెలా తెలుసు? స్వామిజీ ఆశ్రమంలోకి అనుమతి లేకుండా చీమ కూడా వెళ్లలేదని చెప్పుకుంటారు. మరి మీరెలా ఆశ్రమంలోకి ప్రవేశించారు? స్వామిజీని రెడ్ హ్యాండెడ్‌గా ఎలా పట్టించారు? మీరొక్కరే ఈ టాస్క్ పూర్తి చేశారా? అంటూ మీడియా అడుగుతున్న ఈ ప్రశ్నలను వింటున్న సిద్ధార్థ అందరినీ ఆగమని సైగ చేసి.. తాను గొంతు విప్పాడు. వెంటనే నిశ్శబ్దం ఆవరించుకున్న ఆ ప్రదేశంలో ఖంగుమంటూ మోగిన సిద్ధార్థ కంఠం ఇలా చెప్పడం మొదలుపెట్టింది. ‘పోలీస్ ఇన్ఫార్మర్ చనిపోవడంతో డీజీపీ నాకు ఫోన్ చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్లో అక్కడక్కడా కలుపుమొక్కలు ఉంటాయి. అందుకే కొన్నాళ్ళు స్వామిజీ కేసు క్లోజ్ చేస్తున్నట్టు స్వామీజీకి సమాచారం చేరేలా చేశాను. ఇన్ఫార్మర్ ఆ వీడియోను నాకు పంపించాడు. వీడియోలో ఉన్నది స్వామిజీ అనే నిజం అందరికీ తెలియాలంటే ఈ వీడియో మాత్రమే ఉపయోగపడదని అర్థమైంది. అందుకే భన్సీలాల్ వేషంలో స్వామిజీ ఆశ్రమంలోకి ఆంతరంగిక మందిరంలోకి అడుగుపెట్టాను. గంగాజలం పేరుతో అక్కడున్న నీళ్లసీసాల మధ్య నేను తీసుకెళ్లిన ఒక నీళ్లసీసాను అమర్చాను. ఆ నీటిసీసా మూతలో ఒక ‘‘స్పై కెమెరా’’ అమర్చబడి ఉంది. అది తెలియని స్వామిజీ యథాప్రకారం తన స్మగ్లింగ్ కార్యకలాపాలను నిర్వర్తించేవాడు. ఆ కెమెరాలో రికార్డయిన దృశ్యాలన్నీ మీకు అందజేస్తాను. ఆ దృశ్యాలను ప్రజలకోసం విడుదల చేయండి. లేదంటే స్వామిజీని అరెస్టు చేశారని ప్రజలు తిరగబడే ప్రమాదం వుంది’ చెప్పాడు డిటెక్టివ్ సిద్ధార్థ. అతను అమర్చిన స్పై కెమెరాలో దృశ్యాలు లైవ్‌లో ప్రసారం అవుతున్నాయి. ప్రజల అమాయకత్వంతో ఆటలాడుకున్న స్వామిజీ ఆ ప్రజల తిరుగుబాటుతో రాళ్ల దెబ్బలు తిన్నాడు. జైలులో ఊచలు లెక్కబెడుతున్నాడు. - శ్రీసుధామయి -
క్రైమ్ స్టోరీ: బంగారు గొలుసు
ఇంటిముందు కారు ఆగేసరికి రాజేష్ అటువైపు చూశాడు. కారులోంచి వస్తున్న చైతన్యని చూసి ఆశ్చర్యపోయాడు. ఎప్పుడోగాని రాని చైతన్య ఇలా సడెన్‌గా వచ్చేసరికి ఏదో విశేషం ఉందనుకున్నాడు. ‘వచ్చే ఆదివారం నాపెళ్ళి’ శుభలేఖ ఇస్తూ రాజేష్‌తో చెప్పాడు చైతన్య. ‘వసంతా’ అంటూ కేకేశాడు రాజేష్. ‘మీరా అన్నయ్యగారు!’ లోపల నుంచి వస్తూ అంది వసంత. ‘పెళ్ళికి మీరిద్దరూ రావాలి’ అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు చైతన్య. రాజేష్, చైతన్య ఒకే స్కూలులో చదువుకున్నారు. చైతన్య పెద్ద కంపెనీలో మేనేజర్. రాజేష్ ఓ ప్రైవేటు కంపెనీలో అటెండర్. ‘ఈపెళ్ళికి మీరే వెళ్ళండి, నేను రాలేను. వద్దామన్నా మెడలోకి సరైన నగలేదు. బోసి మెడతో ఎలారాను!’ తన పేదరికాన్ని గుర్తు చేసుకుంది వసంత. ‘ఇంటిదాక వచ్చి ఇద్దర్నీ పెళ్లికి పిలిచాడు. నువ్వు రాకుండా నేను మాత్రం పెళ్ళికి ఎలా వెళ్తాను? ఓ పని చెయ్! నీ ఫ్రెండ్ సువర్ణని అడిగి నగ తీసుకో’ సలహా ఇచ్చాడు రాజేష్. ‘బాగోదేమోనండి’ ఆత్మాభిమానం అడ్డుపడింది వసంతకి. ‘పర్లేదు, ఫంక్షన్ అయిపోగానే మళ్ళీ ఇచ్చేద్దువుగాని..’ భర్త అలా చెప్పేసరికి కాదనలేకపోయింది. వసంత, సువర్ణ విజయనగరంలో కలసి చదువుకున్నారు. పెళ్ళిళ్ళయ్యాక ఇద్దరూ వైజాగ్‌లో ఉంటున్నారు. తను పేదరికంలో ఉన్నప్పటికీ సువర్ణని ఎప్పుడు ఏ సాయం అడగలేదు వసంత. మొదటిసారి సువర్ణని గొలుసు అడగటం వసంతకి ఇష్టం లేదు. అయినా తప్పడం లేదు. గుమ్మంలో నుంచున్న వసంతని చూసి ఇంట్లోకి ఆహ్వానించింది సువర్ణ. కలసి చాలా రోజులయిందేమో ఇద్దరూ మనసుతీరా మాట్లాడుకున్నారు. ఆ తర్వాత తను ఎందుకు వచ్చిందో సువర్ణతో చెప్పింది వసంత ఆపసోపాలు పడుతూ. ‘దానికేం భాగ్యం అలాగే తీసుకెళ్ళు. ఈ విషయం అడగడానికి అంత మొహమాటం దేనికి?’ అంటూ మెడలోని గొలుసు తీసి వసంత చేతికిచ్చింది సువర్ణ. గొలుసు తీసుకుని అక్కడ నుంచి ఇంటికి బయలుదేరింది వసంత. ∙∙ ధవళకాంతులతో కళ్యాణమండపం ధగధగ వెలిగిపోతోంది. ఓ మూలన కూర్చున్నారు రాజేష్, వసంత. పెళ్ళి అయిపోగానే ఒక్కొక్కరు వధూవరుల్ని విష్ చేస్తున్నారు. వధూవరులకు శుభాకాంక్షలు చెప్పేసి– భోజనాలు చేసి ఇంటికి బయలుదేరారు రాజేష్, వసంత. ఇంటికొచ్చి చూసేసరికి వసంత మెడలో గొలుసు కనిపించలేదు. ఒకరి మొహం ఒకరు చూసుకుని తెల్లబోయారు ఆ దంపతులు. బదులు తెచ్చిన గొలుసు ఇలా దొంగల పాలవుతుందని రాజేష్ అనుకోలేదు. ‘అప్పటికీ నేను చెబుతూనే ఉన్నాను పెళ్ళికి రానని! మీరు వింటే కదా’ గొలుసు పోయిందనే బాధతో వసంత. సువర్ణకి ఎలా చెప్పాలో, ఏంచేయాలో ఆమెకు అర్థం కాలేదు. ‘పోలీస్ కంప్లయింట్ ఇద్దాం. గొలుసు దొరికితే సరే.. లేదంటే కొత్త గొలుసు కొనిద్దాం తప్పదు’ వసంతతో అన్నాడు రాజేష్. ఆరాత్రి వాళ్ళు నిద్రపోలేదు. ఉదయానే ఇద్దరూ కలసి పోలీస్ స్టేషన్‌కి వెళ్ళారు. పెళ్ళిలో పోయిన గొలుసు గురించి కంప్లయింట్ ఇచ్చాడు రాజేష్. ‘వారం తర్వాత కనిపించండి. గొలుసు దొరుకుతుందేమో చూద్దాం’ ఎస్సై చెప్పగానే ‘అలాగే’ అంటూ అక్కడ నుంచి వచ్చేశారు వసంత, రాజేష్. ‘ఇది పాత నేరస్తుల పనే అయ్యుంటుంది సార్!’ కానిస్టేబుల్ చెప్పాడు. ‘వాళ్ళందర్నీ ఒకసారి స్టేషనుకి పిలిపించ’మని కానిస్టేబుల్‌కి ఆర్డర్ వేశాడు ఎస్సై. టవున్లో అప్పటికే పాత నేరస్తులుగా ముద్రపడ్డ ఓ అయిదుగుర్ని స్టేషనుకి తీసుకొచ్చాడు కానిస్టేబుల్. ఎంత అడిగినా ఆ గొలుసును తీయలేదనే చెప్పారు వాళ్లు. డీలా పడిపోయిన కానిస్టేబుల్ ‘నిజంగా వీళ్ళు తీయలేదేమో సార్!’ అన్నాడు ఎస్సైతో. ‘వాళ్ళని పంపించెయ్’ అంటూ సెల్ నుంచి బయటకు వచ్చేశాడు ఎస్సై. వారం తర్వాత పోలీసుస్టేషన్‌కి వెళ్ళి ఎస్సైని కలిశాడు రాజేష్. ‘మా ప్రయత్నం మేం చేశాం. అయినా మీ గొలుసు దొరకలేదు’ చెప్పాడు ఎస్సై. ఆ మాట విని నిరాశతో ఇంటికి చేరుకున్నాడు రాజేష్. ‘గొలుసు దొరికిందా?’ ఇంటికి వచ్చిన రాజేష్‌ని ఆత్రంగా అడిగింది వసంత. ‘దొరకలేదు వసంతా! మీఫ్రెండ్కి కొత్త గొలుసు కొనివ్వాల్సిందే!’ నిర్ణయించుకున్నాడు రాజేష్. బాధగా నిట్టూర్చింది వసంత. రెండు రోజుల తర్వాత భార్యతో కలసి నగలషాప్కి వెళ్ళి పోయిన గొలుసులాంటిదే కొత్త బంగారుగొలుసు కొన్నాడు రాజేష్. డబ్బు సమకూర్చడం కోసం ఎన్నితిప్పలు పడ్డాడో అతనికే తెలుసు. ఆ సాయంకాలమే ఆ గొలుసు తీసుకొని తన స్నేహితురాలు సువర్ణ వాళ్లింటికి వెళ్లి గొలుసు ఇచ్చేసొచ్చింది వసంత. ∙∙∙ నగ అమ్ముదామని ఒకతను చమన్ లాల్ షాప్కొచ్చి– చమన్ లాల్ చేతికి గొలుసు ఇచ్చాడు. బంగారం మీద అప్పులివ్వడం, పాత బంగారం కొనడం చేస్తుంటాడు చమన్ లాల్. కొత్తవాళ్ళు ఎవరైనా గొలుసు అమ్మకానికి తెస్తే తెలియజేయమన్న ఎస్సైగారి హెచ్చరిక గుర్తొచ్చింది అతనికి. పక్కకి వచ్చి ఎస్సైకి ఫోన్ చేసి విషయం చెప్పాడు చమన్ లాల్. ఈలోగా ఆ గొలుసు నాణ్యతను పరీక్షించగా అది గిల్టు నగ అని తేలింది. నిమిషాలమీద పోలీసు జీపు అక్కడకు రానేవచ్చింది. అది చూసి గొలుసు అమ్మకానికి తెచ్చిన వ్యక్తి కంగారుపడడం చమన్ లాల్ గమనించాడు. ఇంతలో ఎస్సై షాప్‌లోకి రానే వచ్చాడు. ‘ఇతనే సర్ అమ్మకానికి గొలుసు తెచ్చింది’ అంటూ ఆ వ్యక్తిని ఎస్సైకి చూపించాడు చమన్ లాల్. బెదిరిపోయాడు ఆ వ్యక్తి. ‘ఇది గిల్టు నగ సార్’ గొలుసు ఎస్సై చేతికిస్తూ చెప్పాడు చమన్ లాల్. ‘ఇంత కష్టపడి కొట్టుకొచ్చింది గిల్టు నగా?’ ఆశ్చర్యపోయాడు దొంగ. కోపంగా చూస్తూ అతన్ని వెంటబెట్టుకొని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిపోయాడు ఎస్సై. ‘వీడిని సెల్లోపెట్టి ఆ వసంతని స్టేషన్‌కి రమ్మని ఫోన్ చెయ్’ కానిస్టేబుల్‌కి పురమాయించాడు ఎస్సై. ∙∙∙ వసంత, రాజేష్ ఇద్దరు కలసే స్టేషన్‌కు వచ్చారు. వాళ్లను చూడగానే కోపంతో ఎస్సై మొహంలో రంగులు మారాయి. ‘ఈ గొలుసు మీదేనా?’ టేబులు సొరుగులోంచి గొలుసుతీసి వసంత చేతిలో పెట్టాడు ఎస్సై. ‘నాదే సార్!’ అంటున్న వసంత కళ్లు మెరిశాయి. ‘ఆరోజు పెళ్ళిలో ఈమె మెడలోంచేనా గొలుసు కొట్టేసింది?’ సెల్లో ఉన్న దొంగ వైపు తిరిగి అడిగాడు ఎస్సై. ఒకసారి ఆరోజు దృశ్యాన్ని గుర్తు తెచ్చుకుని వసంతను తేరిపార చూసి ‘ఈవిడే సార్’ చేతులు కట్టుకుని చెప్పాడు దొంగ. ‘గిల్టు నగ పోతే కూడా పోలీస్ స్టేషన్లో కంప్లయింట్ ఇస్తారా? అసలు పోలీసులంటే ఏమనుకుంటున్నారు!’ అరిచేశాడు ఎస్సై. ఆయన మాటలకు కంగుతిన్న ఆ జంట ‘ఇది గిల్టునగా?’ అంటూ ఆశ్చర్యపోయారు. ‘అది గిల్టు నగన్న సంగతి నాకు తెలీదు సార్!’ బేలగా చెప్పింది వసంత. ‘చాల్లేమ్మా ఊరుకో.. మీ ఒంటిమీద నగ– ఒరిజినలో గిల్టో తెలీదంటే మేం నమ్మాలి మరి!’ ఎస్సైకి కోపం నసాళానికంటింది. ‘నన్ను నమ్మండి సార్. ఆ నగ నాది కాదు’ వసంత. ‘ఏంటి.. ఆ గొలుసు మీది కాదా? మాట మారుస్తున్నారా? నగ మీది కాదంటే వదిలేస్తానని అనుకుంటున్నారేమో?’ ‘నిజమే సర్.. ఆ గొలుసు నా భార్య ఫ్రెండ్ సువర్ణ గారిది’ చెప్పాడు రాజేశ్. ‘ఆమె నగ మీ దగ్గర ఎందుకుంది?’ ‘పెళ్ళిలో వేసుకుందామని ఆ గొలుసు సువర్ణని అడిగి తీసుకున్నాను’ వసంత. ‘ఆమె చెప్పలేదా అది గిల్టునగ అని?’ ‘చెబితే కంప్లయింట్ ఎందుకు ఇస్తాం సార్?’ ‘గొలుసు పోయిందని ఆమెతో చెప్పారా?’ ‘చెప్పలేదు సార్.. అలాంటిదే కొత్త బంగారు గొలుసు కొనిచ్చాం’ ‘ఏంటీ కొత్త గొలుసు కొనిచ్చారా?‘ ఆశ్చర్యపోయాడు ఎస్సై. అవునన్నట్టు తలూపారు ఇద్దరూ. నిట్టూరుస్తూ వాళ్ల దగ్గర్నుంచి సువర్ణ వాళ్ల ఇంటి అడ్రస్ తీసుకొని ఆమెను స్టేషన్‌కు తీసుకురమ్మని కానిస్టేబుల్‌కు చెప్పాడు ఎస్సై. ఈలోపు వసంత రాజేష్‌లను పక్కగదిలో కూర్చోబెట్టారు. ∙∙∙ తమ గుమ్మం ముందు కానిస్టేబుల్‌ను చూడగానే గతుక్కుమంది సువర్ణ. వెంటనే ఆఫీస్‌లో ఉన్న భర్తకు ఫోన్ చేసింది. కానీ అతని ఫోన్ స్విచాఫ్ వచ్చింది. ‘సువర్ణ గారంటే మీరేనా?’ అడిగాడు కానిస్టేబుల్. తనే అన్నట్టుగా తలాడించింది. ‘మీరు స్టేషన్‌కు రావాల్సి ఉంటుంది.. ’ చెప్పాడు. ‘ఎందుకు?’ అడిగింది సువర్ణ. ‘ఆ విషయాలేవీ నాకు తెలియవు. ఉన్నపళంగా మిమ్మల్ని తీసుకురమ్మని చెప్పారు మా ఎస్సై’ అన్నాడు కానిస్టేబుల్. మళ్లీ ఒకసారి భర్తకు ఫోన్ ట్రై చేసింది సువర్ణ. ఇంకా స్విచ్చాఫ్‌లోనే ఉంది. చేసేదేమీలేక కానిస్టేబుల్ వెంట పోలీస్ స్టేషన్‌కి వెళ్లింది సువర్ణ. ‘సువర్ణ అంటే మీరేనా?’ అడిగాడు ఎస్సై. అవునన్నట్టు తలూపింది సువర్ణ. ‘ఈగొలుసు మీదేనా?’ తన చేతిలో ఉన్న గొలుసు చూపిస్తూ అడిగాడు ఎస్సై. ‘అరే..అచ్చం నాగొలుసులాగే ఉంది’ అంటూ తన మెడలో ఉన్న గొలుసుకేసీ ఓసారి చూసుకొని ‘కానీ అది నా గొలుసు కాదు’ చెప్పింది సువర్ణ. ‘మీ ఫ్రెండ్ వసంతకి మీరు గొలుసు ఇచ్చారా?’ ఎస్సై. ‘ఇచ్చాను, ఆమె మళ్ళీ తిరిగి ఇచ్చేసింది! ఆ గొలుసే ఇది’ అంటూ తన మెడలో ఉన్న గొలుసును ఎస్సైకి చూపించింది. ‘మరి ఇదెవరిది?’ తన దగ్గరున్న గొలుసును పైకెత్తి చూపిస్తూ ఎస్సై. గిల్టునగకి బదులు వసంత బంగారు గొలుసు తెచ్చిచ్చిందని భర్తతో చెబితే ‘రేపు వసంత వచ్చి మళ్ళీ అడిగినా నువ్వు ఇచ్చింది బంగారు గొలుసనే చెప్పు’ అన్న భర్త మాటలు ఇంకా చెవుల్లో గింగుర్లు తిరుగుతున్నాయి సువర్ణకి. స్వార్థం ఆమెను కట్టిపడేసింది. ‘మాట్లాడరే?’ గద్దించాడు ఎస్సై. ‘ఆ గొలుసు నాది కాదు’ మళ్ళీ చెప్పింది సువర్ణ. ‘అబద్ధం సార్. ఆమె చెప్పేది అబద్ధం. నన్ను మోసం చేసింది. స్నేహితురాలని నమ్మితే నన్ను నిండా ముంచేసింది. గిలు ్టనగ నాకిచ్చి నా బంగారు గొలుసు తను తీసుకుంది’ పక్క గదిలోంచి వచ్చి సువర్ణ వైపు చురచుర చూస్తూ చెప్పింది వసంత. అక్కడ వసంతను చూసేసరికి బిక్కచచ్చిపోయింది సువర్ణ. ‘నా భార్య చెప్పింది నిజం సార్. ఆ గొలుసు కొనడానికి నేను అష్టకష్టాలు పడ్డాను’ అన్నాడు రాజేష్. ‘ఇప్పటికైనా నిజం చెబుతారా?’ ఎస్సై మాటలకు సిగ్గుతో తలవంచుకొని నిజం చెప్పేసింది సువర్ణ.. ‘నాదే సార్. ఆ గొలుసు ఇచ్చినప్పుడు అది గిల్టు నగ అని వసంతకి చెప్పకపోవడం నాదే తప్పు’ అంటూ. ‘గొలుసు తిరిగి ఇస్తున్నప్పుడైనా మీరు నిజం చెప్పాలి కదా?’ అని ఎస్సై అడిగేసరికి ‘వసంత నాకు గొలుసు ఇచ్చినప్పుడు అచ్చంగా అది నా గొలుసే అనుకున్నాను. తర్వాత తెలిసింది అది బంగారు గొలుసని’ చెప్పింది సువర్ణ. ‘అది బంగారు గొలుసని తెలిసింతర్వాతైనా ఆ విషయం మీ ఫ్రెండ్‌తో చెప్పాలని అనిపించలేదా?’ ‘చెప్పి నగ ఇచ్చేద్దామనుకున్నాను సర్.. మా ఆయనే వద్దని ఆపేసి ఇంతదాకా తీసుకొచ్చాడు’ నిష్టూరపోయింది సువర్ణ. సరిగ్గా అప్పుడే గాబరాపడుతూ అక్కడికి వచ్చాడు సువర్ణ భర్త. చేసిన తప్పు ఒప్పుకున్నాడు. ‘చెడు సలహాలిచ్చి.. వాళ్ళిద్దరి మధ్య స్నేహాన్ని దూరం చేశారు కదా’ అంటూ సువర్ణ భర్తను మందలించాడు ఎస్సై. ‘సారీ వసంతా’ అంటూ బంగారు గొలుసు వసంత చేతిలో పెట్టి క్షమాపణ కోరింది సువర్ణ. - చొక్కర తాతారావు -
మిస్టరీ: మహాసముద్రంలో ఓ అనాథ
కొన్ని విహారయాత్రలు అనుకోని ప్రమాదాలతో విషాదాలుగా మిగిలిపోతే.. మరి కొన్ని విహారయాత్రలు ఊహించని మలుపులతో మిస్టరీలుగా మారిపోతుంటాయి. ఎటువంటి ఆధారాల్లేక ఏళ్లకు ఏళ్లు కథలుగా నడుస్తుంటాయి. అలాంటి ఓ మిస్టరీ 49 ఏళ్ల తర్వాత వీడింది. అదే 1961 నాటి ‘టెర్రీ జో’ ట్రాజెడీ అండ్ క్రైమ్ స్టోరీ! అదొక మహా సముద్రం.. చుట్టూ చిక్కని చీకటి.. నడుమ ఒక ఓడ.. ఓ వైపు పెనుగాలులు, మరోవైపు నాలుకలు చాస్తున్న అలలు.. హఠాత్తుగా ఆర్తనాదాలు.. కలతనిద్రలోంచి ఉలిక్కిపడి లేచింది 11 ఏళ్ల టెర్రీ జో డ్యూపెరాల్ట్. అప్పటికే కన్నవారు, తోబుట్టువులు ఎవరూ ప్రాణాలతో లేరు. ఎదురుగా వాళ్లందరినీ చంపిన హంతకుడు. కళ్లు మూసి తెరిచేలోపే టెర్రీని ఎత్తి సముద్రంలోకి విసిరేశాడు. టెర్రీ జో తండ్రి అర్థర్ డ్యూపెరాల్ట్ ఒక డాక్టర్ (ఆప్టోమెట్రిస్ట్). తన భార్య, ముగ్గురు పిల్లలతో కలసి సముద్ర విహారం చేయాలని నిర్ణయించు కున్నాడు. తన స్నేహితుడు, మాజీ నౌకాధికారి జూలియన్ హార్వే, అతని భార్య మేరీ డెనాలను కూడా ఆ యాత్రకు ఆహ్వానించాడు. నవంబర్ 8న బ్లూబెల్ బోట్‌ను అద్దెకు తీసుకుని.. ఫోర్ట్ లాడర్ డేల్ నుంచి బహామాలోని ఐల్యాండ్‌ను సందర్శించడానికి బయలుదేరారంతా. బోట్‌కి హార్వే కెప్టెన్‌గా ఉంటే.. అతడి భార్య మేరీ బోట్లో అందరికీ వండిపెట్టేది. రోజులు అద్భుతంగా గడుస్తున్నాయి. తిరుగు ప్రయాణమైన రాత్రి (నవంబర్ 12) బోట్.. శాండీ పాయింట్ దగ్గర ఆగింది. టెర్రీ జీవితాన్ని శాశ్వతంగా మార్చేసిన రాత్రి అది. ∙∙ తెల్లారే నడిసముద్రంలో టెర్రీ.. బిక్కుబిక్కుమంటూ ఓ చిన్న తెల్లటి తెప్పపై ప్రయాణం చేస్తోంది. సముద్రంలో పడినప్పుడు టెర్రీకి దొరికిన ఒకే ఒక్క ఆధారం బోట్ నుంచి విడిపోయిన ఆ రబ్బరు తెప్ప. నిర్మానుష్యమైన ఆ కడలిలో.. అనాథగా మిగిలిపోయింది టెర్రీ. సుమారు మూడున్నర రోజులు తిండి, నీరు లేక నీరసించి పోయింది. అదృష్టవశాత్తు అటుగా వచ్చిన ఓ వాణిజ్య నౌక కెప్టెన్.. టెర్రీని చూసి, కాపాడి ఆసుపత్రిలో చేర్పించాడు. అప్పటికే ఊహించని షాక్‌తో, భయంతో స్పృహ లేకుండా పడుంది టెర్రీ. ఆ రాత్రి ఏం జరిగింది? (టెర్రీ పూర్తి వివరాలు చెప్పలేకపోవడంతో అల్లిన కథనం) ఇన్సూరెన్స్ డబ్బుల కోసం తన భార్యని సముద్రంలోకి విసిరేశాడు హార్వే. మేరీ అరుపులు వినిపించిన అర్థర్.. ‘మేరీ ఎక్కడా?’ అని హార్వేని నిలదీయడంతో అర్థర్నూ సముద్రంలోకి తోసేశాడు. అయితే ఆ హత్యను చూసిన అర్థర్ భార్య జీన్‌తో పాటు అర్థర్ కొడుకు బ్రయిన్(14)లను క్రూరంగా పొడిచి చంపేశాడు. అర్థర్ చిన్న కూతురు రెనే(7)ను కూడా ఎత్తి సముద్రంలో పారేశాడు హార్వే. అయితే ఆ అరుపులకు బోటు కింద నిద్రిస్తున్న టెర్రీజోకు మెలకువ రావడంతో పైకి వచ్చి చూసింది. అప్పటికే బోట్‌ని సముద్రంలో ముంచి, తప్పించుకునే ప్లాన్‌లో ఉన్న హార్వే.. టెర్రీనీ ఎత్తి సముద్రంలోకి విసిరేశాడు. ఆ కథనం ఏదైనా.. బ్లూబెల్ని సముద్రంలో పూర్తిగా ముంచేసి హార్వే ఆ రాత్రి ఈతకొట్టుకుంటూ వెళ్లడాన్ని కళ్లరా చూసింది టెర్రీ. సేఫ్టీ బోటులో మయామీ బీచ్‌కు చేరుకున్న హార్వే.. ‘తాము ప్రయాణిస్తున్న బోటు సముద్రం మధ్యలో మునిగిపోయిందని, తాను మాత్రమే బతికి బయటపడ్డా’నని పోలీసులకు తెలిపాడు. వెంటనే రెస్క్యూ టీమ్ విమానాల్లో ఓడ కోసం గాలింపులు చేపట్టింది. ఓడకు సంబంధించి ఎలాంటి ఆధారాలు దొరకలేదు. దాంతో ఊపిరి పీల్చుకున్నాడు హార్వే. కానీ నాలుగు రోజులకు టెర్రీ బతికొచ్చిందని తెలుసుకున్న అతను.. నిజం బయటపడుతుందనే భయంతో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అయితే టెర్రీ మానసిక పరిస్థితి బాగోకపోవడంతో పూర్తి వివరాలు బయటికి రాలేదు. టెర్రీ తన 12 ఏళ్ల వయసులో టెరేగా పేరు మార్చుకుని.. తండ్రి తరపు బంధువుల దగ్గరే పెరిగింది. 1988లో తనని కాపాడిన కెప్టెన్‌ను కలిసిన టెరే.. అప్పుడు కూడా జరిగిందేంటో చెప్పలేదు. మీడియాకీ ఇంటర్వ్యూ ఇవ్వలేదు. కానీ 2010లో తన అనుభవాలని.. సముద్రంలో ఒంటరిగా బతికిన ఆ రోజులని వివరిస్తూ.. ‘ఎలోన్–ఆర్ఫన్డ్ ఆన్ ది ఓషన్ (మహా సముద్రంలో అనాథ)’ అనే పుస్తకం రాసింది. అప్పటికే విస్కాన్సిన్ డిపార్ట్మెంట్ ఆఫ్ నేచురల్ రిసోర్సెస్‌లో వాటర్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్‌గా చేసి రిటైర్ అయ్యింది. అయితే మానసికంగా బాగా కుంగిపోయిన టెరే.. ఆ సమస్యను అధిగమించడంలో మానసిక నిపుణుడు రిచర్డ్ డి.లోగాన్ సాయం తీసుకుంది. టెరే బుక్ రిలీజ్ తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు బయటపెట్టింది. అవేంటంటే.. ‘ఆ రోజు రాత్రి నేను బోట్‌పైకి వెళ్లి చూసేసరికి అమ్మా, అన్నయ్యా రక్తపు మడుగులో నిర్జీవంగా పడి ఉన్నారు. నాన్న, చెల్లి కనిపించలేదు. కానీ.. కెప్టెన్ హార్వే ఎందుకలా చేశాడనేది నాకు అర్థం కాలేదు. నన్ను సముద్రం మింగేస్తుందని హార్వే భావించాడు కానీ.. ఆ నీరే నన్ను కాపాడింది. అందుకే ఆ నీటితో నాకు అనుబంధం పెరిగింది. ఆ ఘటన నుంచి నేను పూర్తిగా కోలుకోవడానికి 49 ఏళ్లు పట్టింది. బోట్ నుంచి విడిపోయిన తెల్ల తెప్ప సాయంతో నేను సముద్రంలో తేలాను. కానీ తెల్ల తెప్ప వల్ల రెస్క్యూ టీమ్‌కు నేను కనిపించలేదు. అందుకే 1962లో బోట్స్కి తెల్లటిరంగుకి బదులు ఆరెంజ్ కలర్ వేయడం మొదలుపెట్టారు. నా జీవితం ఎందరికో ప్రేరణ కావాలనే ఈ పుస్తకం రాశాను’ అంటూ తన జీవితాన్ని ప్రపంచం ముందు పెట్టింది. అయితే ఈ ఘటనలో టెరే చూసింది మాత్రమే ప్రపంచానికి ఓ ఆధారం. హార్వే అందరినీ చంపడం నిజమే కానీ.. ఎవరి తర్వాత ఎవరిని చంపాడు? అనేది ఊహాత్మక కథనం. ఎందుకంటే టెర్రీ చూడలేదు, హార్వే ఆత్మహత్య చేసుకున్నాడు. అందుకే ఆ సంఘటన నేటికీ మిస్టరీనే. హార్వే నేర చరిత్ర హార్వేకి మేరీ నాలుగో భార్య. మొదటి ముగ్గురు భార్యలు ఏం అయ్యారు అనే సమాచారం లేకపోయినా.. బ్లూబెల్ విషాదఘటనకు 12 ఏళ్ల ముందు.. ప్రమాదవశాత్తు కారు చెక్క వంతెన మీద నుంచి నీటిలో పడిపోయిందని నమ్మించి రెండో భార్యను, ఆమె తల్లినీ పొట్టనపెట్టుకున్నాడనే అభియోగం బలపడింది. - సంహిత నిమ్మన చదవండి: Joshi Anumuthu: అప్పుడు కన్నీళ్లు తాగి ఆకలి తీర్చుకున్నాడు.. ఇప్పుడు ఎందరికో ఆసరా..! -
క్రైమ్ స్టోరీ: షాక్ నుంచి తేరుకోవటానికి ఇరవై నిమిషాలు పట్టిందా..?
జన సంచారం లేని రాత్రి వేళ, ఆ కాలనీలో గాలి కూడా బిగదీసుకుపోయింది.. ఎవరో డబ్బాలో వేసి మూత పెట్టినట్లు. అంతలో ‘హెల్ప్ హెల్ప్’ అన్న పెనుకేకతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. ఒక్కసారిగా ఇళ్ల తలుపులు తెరచుకుని, రోడ్డు మీదకు పరుగెత్తుకొచ్చారు కొంత మంది. రక్తపు మడుగులో రమేష్ పడి ఉన్నాడు. పక్కనే కంగారుగా అరుస్తూ, ఏడుస్తూ కుమార్. ఒకరు హడావిడిగా కారు తీసుకొచ్చి, కొందరి సాయంతో రమేష్‌ని కారులోకి చేర్చారు. హాస్పిటల్‌కి చేరకముందే రమేష్ ఆయువు గాలిలో కలసిపోయింది. ‘బలమైన రాడ్‌తో కొట్టటం వలన మరణించినట్లు’ పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్. బాడీని కుటుంబసభ్యులకు అప్పగించారు. అతని శరీరం మీద ఉన్న వస్తువులు కూడా వారికి హాండోవర్ చేశారు. రమేశ్ హత్య సంచలనం రేకెత్తించింది. మామగారి షష్టిపూర్తి వేడుక కోసం రమేష్ అమెరికా నుంచి భార్య, పిల్లలతో వారం కిందటే ఇండియాకి వచ్చాడు. ఎన్నో ఏళ్ల క్రితం అమెరికా వెళ్ళి సెటిలైపోయిన వ్యక్తికి ప్రాణంతీసే శత్రువులు ఎవరు ఉంటారు ఇక్కడ? పోనీ ఏదన్నా దొంగతనం అనుకుందామంటే, మెడలో గొలుసు, పర్సు, ఖరీదైన వాచ్ ఏవీ మిస్ కాలేదు. ‘రమేష్‌కి, కుమార్‌కి ఏమిటి సంబంధం?’ రమేష్ భార్య శాంతిని ప్రశ్నించాడు ఆ ఏరియా సబ్ఇన్స్పెక్టర్ సందీప్. ‘వాళ్ళు స్నేహితులు’ ‘మీ వారు దాదాపు ఇరవై ఏళ్ల క్రితమే అమెరికా వెళ్ళి పోయారు కదా’ ‘వాళ్ళు బాల్యస్నేహితులు. ఇప్పటికీ ఆ స్నేహం కొనసాగుతోంది. ఏ చిన్న విషయమైనా ఈయన ముందుగా కుమార్గారికే తెలియ చేస్తారు. అలాగే ఆయన కూడా. మాకు ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ కూడా ఆయనే చూసుకుంటున్నారు’ ‘అంటే?’ ‘మా వారు రెండు ఫ్లాట్స్, ఒక విల్లా ఇండియాలో కొన్నారు. వాటిని కొనటంలోనే కాక, అద్దెకి ఇవ్వటం లాంటి విషయాల్లో కూడా కుమార్‌గారు హెల్ప్ చేశారు’ ‘ఆ సాయానికి మీ వారేమన్నా ఆయనకి పేమెంట్ చేశారా?’ ‘అలాంటిది ఏమీ లేదు. అది కేవలం స్నేహానికి కుమార్‌గారు ఇచ్చే విలువ’ ‘ఓకే. ఇంతకూ చివరిసారిగా మీ వారిని ఎప్పుడు చూశారు?’ ‘ఆ రోజు సాయంత్రం, మా వారు కుమార్‌గారితో కలసి ఊరవతల ఉన్న పొలంకొనే విషయం గురించి మాట్లాడటానికి వెళ్లారు. ఆ దోవలోనే కుమార్‌గారి ఇల్లు. చీకటి పడుతుండగా ఫోన్‌చేసి ‘ఆ పొలం ఓనర్ రాలేదు. చీకటి పడుతోందని వచ్చేశాం. కుమార్ డిన్నర్చేసి వెళ్ల మంటున్నాడు. చేసేసి వస్తాను’ అని చెప్పారు. ఆ తరువాత హాస్పిటల్లో చూడటమే’ దుఃఖం అడ్డు పడుతుంటే ఆగిపోయింది శాంతి. ‘మీకు ఎవరి మీదన్నా అనుమానం ఉందా?’ ‘ఊహూ, లేదు’ భారంగా చెప్పింది శాంతి. ∙∙ ‘కుమార్ గారు.. ఆ రోజు అసలు ఏమి జరిగిందో చెప్పగలరా ?’ గోడ మీద కుమార్, రమేష్ భుజాల మీద చేతులు వేసుకుని తీయించుకున్న ఫోటోని చూస్తూ అడిగాడు సబ్ ఇన్స్పెక్టర్ సందీప్. ‘పొలం దగ్గరికి వెళ్ళి వస్తూ, దోవలోనే కదా అని మా ఇంటికి డిన్నర్‌కి పిలిచాను’ ‘ఆ వీధిలో ఏమి జరిగిందో చెప్పండి’ అసహనంగా అన్నాడు సందీప్. ‘డిన్నర్ తరువాత , వాకింగ్‌కి వెళ్లాం. ‘దాహంగా ఉంది. ఏదన్నా తాగాలనిపిస్తోంది’ అన్నాడు. ‘నువ్వు ఈ బెంచీ మీద కూర్చో, జ్యూస్ కొని తీసుకు వస్తాను’ అని నేను వీధి చివర పాన్‌షాప్‌కి వెళ్ళి జ్యూస్ బాటిల్ తీసుకుని తిరిగి వస్తున్నాను. నన్ను చూసి నవ్వుతూ, రమేష్ లేచి నుంచున్నాడు. ఇంతలో ఎవరో వెనుక నుంచి ఇనపరాడ్తో తన తలపై కొట్టారు. చిన్నగా కేక పెడుతూ చేతులు అడ్డం పెట్టుకున్నాడు’ ఇహ మాట్లాడలేనట్లు ఆగి పోయాడు కుమార్. ‘ఆ కొట్టిన వ్యక్తిని గుర్తుపట్టగలరా’ ‘లేదు సర్’ నిస్సహాయంగా అన్నాడు కుమార్. ‘మీ కళ్ల ముందే కొట్టిన వ్యక్తిని గుర్తు పట్ట లేరా?’ ‘కొట్టిన వ్యక్తికి నెత్తి మీద టోపీ, మొహానికి కర్చీఫ్ ఉంది. అందుకే సరిగా చూడలేకపోయాను’ ‘అప్పుడు మీరు ఏమి చేశారు?’ ‘నాకు భయంతో నోట మాట రాలేదు. వెంటనే తేరుకుని, సహాయానికి కేకలు పెడుతూ తనకేసి పరుగెత్తాను. అప్పటికే దాడి చేసిన వ్యక్తి పారిపోయాడు. తను నేలమీద పడిపోయాడు’ అంటూ దుఃఖం అడ్డుపడగా ఆగిపోయాడు కుమార్. ‘సరే.. మళ్ళీ కలుస్తాను’ అంటూ నిష్క్రమించాడు సందీప్. ∙∙ ‘అతను ఎన్నిగంటలకు మీ షాప్‌కి వచ్చాడు? ఏం కొన్నాడు?’ తన ఇన్వెస్టిగేషన్లో భాగంగా అడిగాడు సందీప్ పాన్‌షాప్ ఓనర్ని. ‘జ్యూస్ బాటిల్ తీసుకున్నాడు. అప్పుడు టైమ్ రాత్రి 9.15 అయ్యింది’ ‘టైమ్ అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలగుతున్నావ్?’ ‘రోజూ లాగానే ‘మలుపు’ డైలీ సీరియల్ చూస్తున్నాను సర్. 9.15కి యాడ్స్ వస్తాయి. అప్పుడే ఆయన జ్యూస్ బాటిల్ కొనుక్కుని వెళ్లారు’ ‘ఎంతసేపు ఉన్నాడు?’ ‘మొత్తం ఐదునిమిషాలు ఉన్నారేమో!’ ‘హత్య గురించి ఎప్పుడు తెలిసింది నీకు?’ ‘ఓ పావుగంట, ఇరవై నిమిషాల తరువాత అనుకుంటాను, కొట్టు కట్టెయ్య బోతున్నాను. ఇంతలో జనం హడావిడి కనిపించింది. గబాగబా షాప్ మూసేసి అక్కడకు వెళ్ళాను. అప్పటికి ఒకతన్ని కారులో ఎక్కిస్తున్నారు. ఆ పక్కనే నా షాప్‌కు వచ్చినతను ఏడుస్తూ కనపడ్డాడు. దడగా అనిపించి వెంటనే అక్కడ నుంచి వెళ్ళి పోయాను’ అతనికి థాంక్స్ చెప్పి, తన ఎంక్వైరీలో భాగంగా కాలనీలో ఆ చుట్టుపక్కల ఇళ్ల వారిని ప్రశ్నించాడు. చివరకు ఆ రోజు కారులో రమేష్‌ని హాస్పిటల్‌కి తీసుకు వెళ్ళిన వ్యక్తి ఇంటికేసి నడిచాడు. తనను పరిచయం చేసుకుని, జరిగిన విషయం గురించి ప్రశ్నించాడు సందీప్. ‘నేను టీవీలో ఏవో డిస్కషన్స్ చూస్తున్నాను. మా ఆవిడ యూఎస్సేలో ఉన్న మా అమ్మాయితో ఫోన్ మాట్లాడుతోంది. ఇంతలో కేకలు వినపడి, గబుక్కునలేచి బయటకు పరుగెత్తాను. వెనకే మా ఆవిడ కూడా వచ్చింది. ఎదురుగా రక్తం మడుగులో ఓ వ్యక్తి పడి ఉన్నాడు. భయంతో వణికిపోతూ ఒకతను నిలుచుని ఉన్నాడు. ‘ఏమయ్యింది?’ అని అడిగితే ఎవరో తన ఫ్రెండ్‌ను తల మీద రాడ్‌తో కొట్టారని చెప్పాడు. ఇంతలో ఇంకొంతమంది బయటకు వచ్చారు. వెంటనే నా కారులో హాస్పిటల్ తీసుకెళ్లాం. అప్పటికే చనిపోయినట్లు చెప్పారు డాక్టర్స్’ ‘అప్పుడు టైమ్ ఎంత అయ్యుంటుంది?’ ‘9.45 అయ్యింది సార్ ’ ఆయన నుంచి కాక, ఆయన భార్య నుంచి వచ్చింది జవాబు. ‘ఎలా చెప్పగలరు అంత ష్యూర్‌గా’ అనుమానంగా అడిగాడు సందీప్. ‘ఫోన్లో ‘‘బ్రేక్ ఫాస్ట్ చేశావా’’ అని మా అమ్మాయిని అడిగాను. ‘‘ఇప్పుడు పావుతక్కువ పది అయ్యింది. ఇప్పటి దాకా టిఫిన్ తినకుండా ఉంటారా మీ అల్లుడు గారు. ఎప్పుడో అయిపోయింది’’ అంది. అప్పుడే ఈ కేకలు వినపడ్డాయి. అమెరికాలో ఉన్న వాళ్ళకి , మనకు ఈ సీజన్లో ఖచ్చితంగా పన్నెండుగంటల తేడా. వాళ్ళకి పగలు 9.45 అంటే మనకు రాత్రి 9.45 అన్నమాట. అందుకే చెప్ప గలిగాను’ వివరించింది ఆవిడ. ‘కారులో మీతో పాటు ఎవరు వచ్చారు?’ ‘మా మేడ పైన అద్దెకుండే ఇద్దరు కుర్రాళ్ళు సాయంగా వచ్చారు’ ‘మీరు హాస్పిటల్లో ఎప్పటిదాకా ఉన్నారు ?’ ‘వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చేదాకా ఉండి వచ్చేశాం. ఆ తరువాత న్యూస్ ద్వారా వాళ్ళ వివరాలు తెలిశాయి’ థాంక్స్ చెప్పి, గేటు దగ్గరకు నడిచాడు సందీప్. వెనుకనే ఆ ఇంటాయన మర్యాద పూర్వకంగా సాగనంపటానికి వచ్చాడు. ‘ఎగ్జాక్ట్‌గా రమేష్ ఎక్కడ పడి ఉండగా చూశారు?’ ప్రశ్నించాడు సందీప్. ‘మా ఇంటి ఎదురుగా, ఇక్కడే సార్’ రోడ్డు మీదకు వచ్చి చూపించాడు ఆయన సిన్సియర్‌గా. చుట్టూతా పరిశీలనగా చూశాడు. అక్కడ పక్కనే ఓ బెంచీ ఉంది. ‘ఓకే ..సార్ , బై’ అంటూ తన బైక్ ఎక్కి, తిరిగి పాన్‌షాప్ దగ్గరకు వెళ్ళాడు. అక్కడ బైక్‌ని పార్క్ చేసి రెండు మూడు సార్లు, అక్కడ నుంచి రమేష్ పడిపోయిన స్పాట్‌కి నడచి వెళ్లొచ్చాడు. ‘ఏంటి సార్, ఎక్కడికి వెళ్లొస్తున్నారు?’ కొంచెం భయపడుతూ ఆరాగా అడిగాడు పాన్‌షాప్ ఓనర్. ‘ఏమీ లేదు, తిన్నది అరగనట్లు ఉంటే కాస్త నడచి వస్తున్నాను’ అంటూ బైక్ స్టార్ట్ చేశాడు. ∙∙ ‘మీ ఫ్రెండ్ హత్యకు అరగంట ముందు, ఎవరికి కాల్ చేశారో చెపుతారా?’ ఆ గదిలోని వస్తువులను పరిశీలిస్తూ ప్రశ్నించాడు సందీప్. ‘ఊహూ, ఎవరికీ కాల్ చేసిన గుర్తులేదు’ ఆలోచిస్తున్నట్లుగా అన్నాడు కుమార్. ‘పోనీ అతనిని కొట్టిన వెంటనే ఎందుకు అరవలేదో గుర్తుందా?’ వ్యంగ్యంగా అన్నాడు సందీప్. ‘మీరు ఏమంటున్నారో అర్థం కావటంలేదు’ అయోమయంగా అన్నాడు కుమార్. ‘తనని కొట్టిన దాదాపు ఇరవై నిమిషాలదాకా మీరు కేకలు పెట్టకపోవటానికి కారణం, రమేష్‌ను చంపటానికి సుపారి ఇచ్చి మీరు ఏర్పాటు చేసిన మనిషి తప్పించుకోవటానికే కదా!’ ‘అర్థం లేకుండా మాట్లాడకండి ఇన్స్పెక్టర్.. నేను షాక్ అయ్యాను. కొన్ని నిమిషాల్లో తేరుకుని అరిచాను, అంతే’ ‘షాక్ నుంచి తేరుకోవటానికి మీకు ఇరవై నిమిషాలు పట్టిందా?’ ‘అవును.. నా మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది’ ‘ఇహ చాలు.. ఆపండి మీ కల్లబొల్లి కబుర్లు. ఆ పాన్‌షాప్ అతను, కారులో ఎక్కించుకుని హాస్పిటల్‌కి తీసుకు వెళ్ళినాయన చెప్పిన సాక్ష్యం.. నేను మూడు రకాల వేగాలతో పాన్‌షాప్ నుంచి ఆ స్పాట్‌కు నడచి చూసి, చెక్ చేసుకున్న టైమ్.. అన్నీ కలిపి మీరు అబద్ధమాడుతున్నారని రుజువయ్యింది’ ‘మీరు అందరూ ఏదో కన్ఫ్యూజన్లో ఉన్నారు’ ‘మనం కన్ఫ్యూజన్లో ఉన్నా , టైమ్ ఎప్పటిలాగానే నడుస్తుంది సార్’ అంటూ ఆ పక్కనే టేబుల్ మీద ఉన్న ఓ వస్తువుని పైకి తీశాడు ఇన్స్పెక్టర్ సందీప్. అర్థంకానట్లు చూశాడు కుమార్. ‘తన తల మీద కొడుతున్నప్పుడు, రమేష్ రెండు చేతులు అడ్డం పెట్టుకున్నారని మీరు చెప్పారు. దానికి రుజువుగా పోస్ట్‌మార్టంలో అతని కుడి చేతి రెండు వేళ్ళు ఫ్రాక్చర్ అయినట్లు రిపోర్ట్ కూడా వచ్చింది. అతని చేతికి ఉన్న వాచ్ కూడా బ్రేక్ అయ్యి, టైమ్ ఆగిపోయింది. రమేష్ పడిపోయిన దానికి, మీరు కేకలు పెట్టటానికి మధ్య తీసుకున్న టైమ్గాప్ నాకు అనుమానం కలిగించింది. ఇదిగో మీ ఫ్రెండ్ తీపి గుర్తుగా మీరు ఎంతో ప్రేమగా ఉంచుకున్న ఈ వాచ్‌లో 9.20 PMకి ఆగిపోయిన టైమ్ కూడా మరో సాక్ష్యం. యువర్ టైమ్ ఈజ్ అప్’ అంటూ ఊపిరి పీల్చుకోడానికన్నట్లు ఒక్క క్షణం ఆగాడు సందీప్. ‘ఇంత ఘాతుకానికి ఒడికట్టిన, ఆ హంతకుడిని మీ కాల్ డేటా హెల్ప్‌తో, మా కస్టడీలోకి తీసుకున్నాం. మీరు నిజం ఒప్పుకుంటే మంచిది లేదా మా పద్ధతిలో చెప్పించాల్సి వస్తుంది’ చేతిలో లాఠీ ఊపుతూ తీవ్రంగా చెప్పాడు సందీప్. ప్రాపర్టీస్ డీలింగ్స్‌లో వాటిని అమ్మిన వారితో కుమ్మక్కైన కుమార్.. తన కల్లబొల్లి మాటలతో రమేష్‌ని నమ్మించి చాలా ఎక్కువ రేట్లకు కొనిపించాడు. తరువాత ఆ ఎక్స్ట్రా సొమ్మును తన అకౌంట్లో వేసుకునే వాడు. పొలంకొనే విషయంలో ఎందుకో రమేష్‌కి అనుమానం వచ్చి ప్రశ్నించగా ‘పాతవి కూడా తవ్వి తీస్తాడేమో’ అని కుమార్‌కి భయం పట్టుకుంది. ఆ భయం రమేష్‌ని అడ్డు తొలగించుకునేందుకు పురి గొల్పింది. స్నేహానికి ద్రోహం తల పెట్టిన తన తప్పును ఒప్పుకుంటూ తలదించుకున్నాడు కుమార్. - యమున చింతపల్లి -
క్రైంస్టోరీ: మన రహస్యాలు లీకైపోతున్నాయి.. జాగ్రత్త.. ఎట్టకేలకు
‘ఏమిటి పరిస్థితి? వాడు దొరికాడా?’ ఫోన్లో అడిగాడు సీఐ మహంకాళి. ‘ఇంకా లేదు సార్. బ్యాంక్‌కి ఎదురుగానే కాచుకొని ఉన్నాం’ చెప్పాడు వినయంగా ఎస్సై ఆత్మారాం. ‘నీతోపాటు ఇంకెవరున్నారు?’ సీఐ మహంకాళి. ‘ఇద్దరు పీసీలు ఉన్నారు సార్. వాళ్లకు ఈ విషయం తెలియదు. ఏదో రొటీన్ డ్యూటీ అనుకుంటున్నారు’ ‘గుడ్. ఈ విషయం ఎవ్వరికీ తెలియకూడదు. నీకు తెలుసుగా.. మన రహస్యాలు లీకయి పోతున్నాయి. ఎవరినీ నమ్మలేకపోతున్నాం. జాగ్రత్త. వాడు మహా కన్నింగ్ ఫెలో. ఇన్నాళ్ళకు వాడిని పట్టుకునే అవకాశం దొరికింది. ఎట్టి పరిస్థితుల్లో వాడు తప్పించుకోకూడదు’ అంటూ హెచ్చరించాడు సీఐ. ఆత్మారాం చాలా ఎలెర్ట్‌గా ఉన్నాడు. ఒకవైపు ఫోన్ మాట్లాడుతున్నా అతని చూపులు బ్యాంక్ మీద నుంచి మళ్లడం లేదు. అతను పనిచేసే ప్రాంతం చుట్టూ ఇటీవల కాలంలో మావోయిస్టుల కార్యక్రమాలు బాగా ఎక్కువయ్యాయి. ఎన్నడూ లేనిది ఆ అడవి ప్రాంతంలో అనేక కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నారని నిర్ధారణ కావడంతో తన పోలీస్ స్టేషన్‌పై ఒత్తిడి పెరిగింది. ఒక ముఖ్యమైన మావోయిస్టు బ్యాంకులో ఉన్నాడని పక్కా సమాచారం అందడంతో అతన్ని పట్టుకునే బాధ్యత ఆత్మారాం మీద పడింది. ఎవరయినా తమని గమనిస్తున్నారేమోనని అటూ ఇటూ చూస్తూ, తన పనిలో నిమగ్నమయ్యాడు ఆత్మారాం. కాస్తంత దూరంలో నడచివస్తున్న ఒక మనిషి, అతన్ని ఆకర్షించాడు. సెల్‌ఫోన్ మాట్లాడుతూ తన లోకంలో తాను ఉన్న ఆ మనిషి తన కుడి కాలిని ఈడ్చుకుంటూ నడవడం, అప్పుడప్పుడు ఎడమ చెవిని రుద్దుకుంటూ ఉండడం ఆత్మారాంని ఏవో జ్ఞాపకాల్లోకి నెట్టేశాయి. ‘ఇలా కాలు ఈడుస్తూ నడవడం, చెవినలా రుద్దుకోవడం ఎవరో చేసేవారే? ఆ అలవాట్లు ఉన్న ఇతన్ని ఎక్కడో చూశానే? ఎక్కడ? ఎక్కడ?’ అనుకుంటూ పరధ్యానంలో పడినా, వెంటనే కర్తవ్యం గుర్తొచ్చి, బ్యాంక్‌పై దృష్టి నిలిపాడు. అయినా ఆత్మారాం మనసు నిలకడగా ఉండడం లేదు. ఆ వ్యక్తి కారణంగా అతను బాగా డిస్టర్బ్ అవుతున్నాడు. అతను దగ్గరవుతున్న కొలదీ ఆత్మారాం ఏకాగ్రత చెదరసాగింది. ఆ వ్యక్తి.. ఆత్మారాంను దాటుకొని ముందుకు వెళ్ళిపోయాడు. అప్పుడు వెలిగింది ఆత్మారాంకి.. అతను చిన్నప్పుడు తనతో కలిసి చదువుకున్న క్లోజ్ ఫ్రెండ్ భాస్కర్ అని. వెంటనే అనాలోచితంగా అతని నోటిమ్మట ‘బాచీ’ అన్న పదం వెలువడింది. ఆ వ్యక్తి ఆగిపోయి, వెనక్కి తిరిగి చూసి, ఎవరు పిలిచారో తెలియక దిక్కులు చూశాడు. తన ఊహ కరెక్టే అని అనుకోగానే ఆత్మారాం ఆనందానికి అంతే లేదు. ‘నేను రా బాచీ.. ఆత్మారాంని’ అంటూ అరిచాడు. ‘సారీ.. మీరెవరో నాకు తెలియదు. ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారో?’ అంటూ ఒక్క అడుగు వెనక్కివేశాడు. ‘అరే.. నన్ను గుర్తుపట్టలేదా? రామచంద్రపురం హైస్కూల్లో కలిసి చదువుకున్నాం. ఎలా మర్చి పోతావ్‌రా ఈ ఆత్మని?’ అన్నాడు ఆశ్చర్యపోతూ. ‘ఓ.. ఆత్మారాంవా? నిజంగా? అయితే మాత్రం ఎలా గుర్తుపడతాను? అప్పుడు సన్నగా పుల్లలా ఉండే నువ్వు ఇలా వస్తాదులా మారిపోతే ఎలా గుర్తుపట్టగలను?’ అంటూ నవ్వి, ‘థైరాయిడ్ వల్ల నా ముఖం కూడా బాగా మారిపోయింది. చిన్నప్పటి స్నేహితులెవరూ గుర్తుపట్టలేక పోతున్నారు. నువ్వెలా ఎలా గుర్తుపట్టావురా? అంటూ ఆశ్చర్యపోయాడు. ‘వాళ్ళకీ నాకూ తేడా లేదా? నేను పోలీసోడిని కదా?’ అంటూ గర్వంగా నవ్వుతున్న ఆత్మారాంకి తన కర్తవ్యం గుర్తుకు వచ్చింది. ఆందోళనగా బ్యాంక్ వైపు చూశాడు. ‘అయ్యో ఎంత ఏమరుపాటుగా ఉన్నాను? కొంపదీసి వాడు ఈ గ్యాప్‌లో తప్పించుకు పోలేదు కదా?’ అని కంగారు పడ్డాడు. ‘వాడు అసలే నక్కజిత్తుల మారి. వాడు తప్పించుకోవడానికి రెండు నిమిషాలు చాలు. నేను ఎక్కువ టైమే ఇచ్చేశాను. ఎంత పొరపాటు అయిపోయింది!’ అని గాభరా పడ్డాడు. ‘ఏమిటా కంగారు? ఎనీథింగ్ రాంగ్?’ అని అడిగాడు భాస్కర్. దానికి సమాధానం చెప్పకుండా ‘ఒక్క క్షణం ఇక్కడే వెయిట్ చేయి. ఇప్పుడేవస్తాను’ అంటూ హడావిడిగా బ్యాంక్ వైపు నడిచాడు. బ్యాంక్‌లోకి అడుగు పెడుతూనే సెక్యూరిటీ గార్డ్ని పిలిచి, గేట్ వేసేయమని ఆర్డర్ చేశాడు. జనం మధ్యలో తిరుగుతూ తీవ్రవాది కోసం తీక్షణంగా గాలించడం మొదలుపెట్టాడు. అతని జాడ లేకపోవడంతో చెమటలు పట్టాయి. మేనేజర్ని కలిసి, సిసి కెమెరా ఫుటేజ్ చూశాడు. కొద్దిసేపటి కిందటే అతను వెతుకుతున్న మనిషి గేట్లోంచి బయటకు పోయినట్లు రికార్డ్ అయింది. అతను గేటు దాటిన టైమ్ చూశాడు. సరిగ్గా అదే సమయంలో తను భాస్కర్‌తో మాట్లాడుతూ కర్తవ్యాన్ని మర్చిపోయినట్లు గ్రహించాడు. ‘ఛ.. ఎంత పొరపాటు జరిగిపోయింది?’ అనుకుంటూ కుమిలిపోయాడు. ఎప్పుడూ ఇలాంటి పొరపాటు చేయని ఆత్మారాంకి చాలా బాధ కలిగింది. మావోయిస్ట్ కోసం బయట పడిగాపులు కాచే బదులు, బ్యాంక్‌లోకే వెళ్లి అతన్ని పట్టుకోవాలని ముందు ప్లాన్ చేసుకున్నాడు. అయితే సీఐ అందుకు ఒప్పుకోలేదు. అలా చేస్తే పెద్ద పబ్లిసిటీ అయిపోతుందని, మీడియాతో నానా ఇబ్బందులు వస్తాయని, కస్టమర్‌ను అడ్డుపెట్టుకొని, తప్పించుకునే ప్రయత్నం చేస్తాడని, అప్పుడు వాడిని పట్టుకోవడం కష్టం అవుతుందని అడ్డు చెప్పాడు సీఐ. బయటకు వచ్చిన తీవ్రవాదిని గుట్టుచప్పుడు కాకుండా బంధించి, జీపెక్కించడమే ఉత్తమమని సలహా ఇచ్చాడు. ‘ఛ.. నా ప్లాన్‌ని ఫాలో అయ్యుంటే ఈ తప్పు జరిగి ఉండేది కాదు’ అని విచారపడ్డాడు. ఇప్పుడు జరిగినదంతా దాచి మావోయిస్ట్ చాలా తెలివిగా తన కన్ను గప్పి తప్పించుకున్నాడని సీఐతో చెప్పాడు. సీఐ ఉగ్రుడైపోయి చెడామడా తిట్టేశాడు. అలా తిట్లు కాయడం మొదటిసారి కావడంతో తీవ్ర మనస్తాపానికి గురి అయ్యాడు ఆత్మారాం. బ్యాంక్ నుంచి బయటకు వచ్చిన ఆత్మారాంని చుట్టుముట్టారు కానిస్టేబుళ్లు. ‘ఏమయిందిసార్? ఒక్కసారిగా అలా బ్యాంక్‌లోకి పరిగెత్తారు? మమ్మల్ని పిలిస్తే, మేమూ కూడా వచ్చేవాళ్ళం కదా?’ అన్నాడొక కానిస్టేబుల్. ఏమి జరిగిందో.. ఏం జరుగుతుందో తెలియక అయోమయంగా చూస్తూ ఉండిపోయాడు భాస్కర్. ‘ఏం లేదు. చిన్న ఎంక్వైరీ అంతే. నన్ను మా ఇంటి దగ్గర దింపేసి మీరు స్టేషన్‌కి వెళ్ళిపొండి’ అంటూ అబద్ధమాడి భాస్కర్ వైపు తిరిగి ‘నీకు అర్జెంట్ పనేమీ లేదుగా? మా ఇంటికి వెళ్దాం. కాస్త రిలీఫ్‌గా ఉంటుంది’ అన్నాడు. తలూపి జీపు ఎక్కాడు భాస్కర్ అలవాటుగా తన ఎడమ చెవిని రుద్దుకుంటూ. ∙∙ ఇంటి తాళం తీసి హాల్లోకి నడుస్తూ ‘సారీ.. ఇంతసేపూ నీతో సరిగ్గా మాట్లాడలేక పోయాను. ఎన్నో ఏళ్ల తర్వాత కలిశావన్న ఆనందం ఆవిరి అయిపోయింది. మా ఉద్యోగాలింతే. నిత్యం టెన్షన్, టెన్షన్. అలా కూర్చో. కాఫీ చేసి తెస్తాను. మా ఆవిడ, పిల్లలు ఊరెళ్ళారు’ అంటూ భాస్కర్ కి మాట్లాడే అవకాశమే ఇవ్వకుండా కిచెన్‌లోకి నడిచాడు. నవ్వుకుంటూ సోఫాలో కూలబడి.. టీపాయ్ మీదున్న న్యూస్ పేపర్ అందుకున్నాడు భాస్కర్. కాఫీ చేసుకొచ్చిన ఆత్మారం కాఫీ కప్పు భాస్కర్‌కు అందిస్తూ ‘ఇప్పుడు చెప్పు. ఎక్కడుంటున్నావ్? ఏమి చేస్తున్నావ్?’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. ‘రామచంద్రపురంలోనే సెటిల్ అయ్యాను. ఓ స్కూల్లో పని చేశాను చాలాకాలం. ప్రజాసేవ చేయాలని బుద్ధి పుట్టడంతో ఉద్యోగం వదిలేశాను. బతకడానికి ఇబ్బంది లేదు. మా నాన్న నాకోసం బాగానే ఆస్తిని వదిలి పెట్టాడు. టీచర్‌గా నా అవసరం ఎక్కడుంటే అక్కడికి వెళ్తున్నాను. ఈ ఏరియాలో ‘ట్రైబల్ వెల్ఫేర్ స్కూళ్ళు, హాస్టళ్ళు చాలా బాగా కట్టినా, ఫుడ్‌తో సహా అన్నిరకాల సౌకర్యాలు చక్కగా అమర్చినా, విద్యాబోధన కుంటు పడిందని తెలిసింది. పర్మినెంట్ టీచింగ్ స్టాఫ్ పాతిక శాతం కూడాలేరని, పాఠాలు చెప్పడానికి మంచి టీచర్లు కరువయ్యారనీ చెవిన పడింది. అందుకే నా అంతట నేను ఫ్రీగా పాఠాలు చెప్పడానికి ముందుకొచ్చాను. ఆ హాస్టల్లోనే వసతి, భోజనం. అలా గడిచిపోతుంది’ చెప్పాడు భాస్కర్ నవ్వుతూ. ‘వెరీ గుడ్ మంచి పనిచేస్తున్నావు. మరి నువ్వు ఊళ్లు పట్టుకు తిరుగుతుంటే నీ భార్య, పిల్లల సంగతి?’ అడిగాడు ఆత్మారాం. ‘ఆ జంజాటం పెట్టుకోలేదు. సమాజసేవ చేయాలంటే ఆ బంధాలు అడ్డం కదా? అందుకే పెళ్ళే చేసుకోలేదు’ అంటూ చిన్నగా నవ్వాడు భాస్కర్. ‘ఎంత ఎదిగిపోయావు? హ్యాపీగా ఉంది.. నీ ఆదర్శ జీవితం గురించి వింటుంటే. ఈ రోజే నీ మకాం ఇక్కడికి మార్చేయ్. మా వాళ్ళు నెలరోజుల దాకా రారు. ఆ తర్వాత సంగతి తర్వాత’ చెప్పాడు ఆత్మారాం. ‘వద్దొద్దు. అక్కడ టీచర్లు పడుకునే చోట నాకో మంచం ఇచ్చారు. భోజనం హాస్టల్లో తినేస్తున్నాను. బాగానే ఉంది’ అంటూ అడ్డు చెప్పాడు భాస్కర్. కానీ ఆత్మారాం ఊరుకోకుండా పట్టు పట్టేసరికి ఒప్పుకోక తప్పలేదు అతనికి. సాయంత్రం భాస్కర్ తన సామాను పట్టుకొని ఆత్మారాం ఇంటికొచ్చేశాడు. అప్పటి క్లాస్‌మేట్స్‌ను, టీచర్లను తలుచుకొని.. ఆనాటి ముచ్చట్లతో ఆ సాయంకాలం కాలక్షేపం చేశారు. మర్నాడు ఉదయం భాస్కర్.. ఆత్మారాంకన్నా ముందే లేచి ఉప్మా, కాఫీ సిద్ధం చేసి.. ఆత్మారాంను నిద్రలేపాడు. ఆ ఏర్పాట్లకు ఆశ్చర్యపోతూ ‘ఎందుకురా శ్రమ పడడం? మా పనిమనిషి లక్ష్మి వచ్చి చేస్తుంది కదా?’ అంటూ మందలించాడు ఆత్మారాం . ‘అమ్మనాయనోయ్.. నిన్న రాత్రి తిన్నానుగా ఆమె చేతి వంట. నా వల్ల కాదు. ఆ వంటేదో నేనే చేస్తాను. అంట్లు తోమి, ఇల్లు శుభ్రం చేయమను చాలు. ముందు నువ్వు ముఖం కడుక్కొనిరా. కాఫీ తాగుదాం. టిఫిన్ చేయడం అయిపోయాక నీకు లంచ్ కూడా చేసేస్తాను. నేను హాస్టల్లో తింటానులే. రాత్రికి ఇద్దరికీ చపాతీలు చేస్తాను. నువ్వేమీ అనొద్దు. నేను చెప్పిందే ఫైనల్’ అంటూ స్నేహితుడిని మాట్లాడనివ్వలేదు. చేసేదేం లేక నవ్వుతూ భుజాలు ఎగరేశాడు ఆత్మారాం. ∙∙ ‘ఈపది రోజులూ మాట్లాడుకుంటున్నా జానీ గురించి గానీ, జాహ్నవి గురించి గానీ తలుచుకోలేదు. ఇంతకూ జానీ ఎలా వున్నాడురా? ఎప్పుడయినా కలిశావా?’ అని అడిగాడు ఆత్మారాం. పెదవి విరిచాడు భాస్కర్. ‘అందరూ చెల్లాచెదురై పోయారు. జానీగాడు జాహ్నవికి లవ్ లెటర్ రాసి సస్పెండ్ అయిపోయిన సంగతి నీకు గుర్తుందా?’ అడిగాడు భాస్కర్. గుర్తుంది అన్నట్లు తలూపి ‘జానీగాడు చాలా మంచివాడురా. వాడా పనిచేశాడంటే నమ్మకం కలగడం లేదు’ అన్నాడు. ‘వాడే ఒప్పుకున్నాడు. ఇంకా నీకు అనుమానం ఏమిటి?’ అన్నాడు విస్తుపోతూ. సమాధానం చెప్పకుండా తల పంకిస్తూ ఏదో ఆలోచనలో పడ్డాడు ఆత్మారాం. ‘జానీ ప్రస్తావన రాగానే, వీడేమిటి ఇలా అయిపోయాడు? అనుకుంటూ అలవాటు ప్రకారం ఎడమ చెవిని రుద్దుకోవడం మొదలుపెట్టాడు. ∙∙ ‘ఇదేమిటి నన్ను అరెస్ట్ చేశావు? నీకేమయినా పిచ్చి ఎక్కిందా?’ అంటూ గావుకేకలు పెడుతున్న ఆదివిష్ణు ఉరఫ్ భాస్కర్ని చూసి గట్టిగా నవ్వాడు ఆత్మారాం. ‘అన్నన్నా.. ఎంత టోకరా వేశావురా? భాస్కర్గాడిలా కాలు ఈడ్చడం, చెవిరుద్దు కోవడం చేసి ఈ పోలీసోడినే బుట్టలో వేసేశావే? ఎంత తెలివైనోడివిరా? నువ్వు కూడా మాతో చదువుకున్నా ఆ రోజుల్లో నిన్ను పట్టించుకునే వాళ్ళం కాదు మేము. అందుకే నిన్ను నేను గుర్తుపట్టలేనని, ఈ సాహసం చేశావు. నీ వల్ల ఎంత నష్టపోయానురా? మీ వాడు బ్యాంకులోంచి సులువుగా తప్పించుకునేలా చేశావు. మా ఇంట్లోనూ, తోటలోనూ సీక్రెట్ మైక్రోఫోన్లు అమర్చి, నా ఫోన్ సంభాషణలు వింటూ, మా ప్లాన్లు ముందే తెలుసుకున్నావు. నీ వల్ల మా చేతికి దొరకబోయిన మీ వాళ్ళు తప్పించుకు పారిపోయారు. మా ఇన్ఫార్మర్ ఎవరో తెలిసిపోవడంతో, అతన్ని దారుణంగా హత్యచేసేశారు మీ వాళ్ళు. ముందు నాకు నీమీద ఏ అనుమానమూ రాలేదు. వచ్చాక ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. నీ బండారం బట్టబయలు చేసేదాకా నిద్రపోలేదు. రోజూ నువ్వు వాడుతున్న మాత్రల్లో థైరాయిడ్ మాత్రలు లేకపోవడంతో నా అనుమానం కొట్టిపారేసేది కాదని తెలిసిపోయింది. దాదాపు నలభై ఏళ్లుగా ఈడుస్తూ నడుస్తున్న వాడి కాలు సన్నగా ఉండి, ఫ్లెష్ తక్కువగా ఉండాలి. కానీ నీ కాళ్ళు రెండూ మామూలుగా ఉండేసరికి, నువ్వు నాటకం ఆడుతున్నావని అర్థమైపోయింది. నువ్వు తోటలో కూర్చుని ఫోన్ మాట్లాడుతున్నపుడు, మా వాడి చేత ఒక పామును లోపలికి పంపాను. పాముని చూసి నువ్వు గంతులేయడం చూసిన వాడు ఎవడైనా నువ్వు కుంటి వాడివి కాదని కనిపెట్టేస్తాడు. అందుకే ఆ సమయంలో నేను ఇంట్లో లేనని నిన్ను నమ్మించాను. ఫైనల్ పరీక్షలో కూడా నువ్వు దొరికిపోయావు. జాహ్నవికి లవ్ లెటర్ రాసింది జానీ కాదు. వాడి బావ చలపతి. జానీ తల్లితండ్రులు చనిపోతే చలపతి తండ్రే వాడిని పెంచాడు. అందుచేత వాడికి చలపతి అంటే ప్రాణం. అందుకే ఆ నింద తన మీద వేసుకున్నాడు. ఆ నిజం నాకూ, భాస్కర్‌కి కూడా తెలుసు. నీకు ఆ విషయం తెలియకపోవడంతో తేలికగా దొరికిపోయావు’ అంటూ గట్టిగా నవ్వేసరికి సిగ్గుతో తలదించుకున్నాడు ఆదివిష్ణు. -కొయిలాడ రామ్మోహన్రావు -
మే ఐ హెల్ప్ యూ
రాత్రి తొమ్మిది గంటలకు లింగంపల్లి రైల్వేస్టేషన్ దగ్గర కారు పార్క్ చేసి లోపలికి నడిచాడు హనుమంతయ్య. వచ్చేపోయే రైళ్ళతో ప్లాట్‌ఫామ్ రద్దీగా ఉంది. టీ స్టాల్‌కి వెళ్ళి చాయ్ సిప్ చేస్తుంటే అతని సెల్ఫోన్లో మెసేజ్ వచ్చింది ‘ప్లాట్‌ఫామ్ కుడివైపుగా నడుస్తూవుండండి’ అని. టీ కప్‌ను డస్ట్‌బిన్‌లో పడేసి ప్లాట్‌ఫామ్ పైన నడవనారంభించాడు అతను. మధ్యలోనే ఓ యువతి వచ్చి కలిసింది. ‘ఎమ్.ఐ.హెచ్.వై’ అంది మెల్లగా. ముప్పయ్యేళ్ళుంటాయి ఆమెకు. బ్లూ జీన్స్ ప్యాంట్ మీద లైట్ పింక్ కలర్ టీషర్ట్ తొడిగింది. బాబ్డ్ హెయిర్. ‘వై.హెచ్.ఐ.ఎమ్’ జవాబిచ్చాడు హనుమంతయ్య. కోడ్ వర్డ్ అది! ‘నా పేరు అనామిక. మే ఐ హెల్ప్ యూ స్క్వాడ్ చీఫ్‌ని. మనం నడుస్తూనే మెల్లగా మాట్లాడుకుందాం’ అంటూ చెప్పడం మొదలుపెట్టింది.. ‘చదువుకున్న నిరుద్యోగ యువతీయువకులు మా స్క్వాడ్‌లో సభ్యులు. స్క్వాడ్ గోప్యతను కాపాడుకునే ఉద్దేశంతో ఓ ఆఫీసంటూ ఏర్పరచుకోలేదు. కేవలం నోటి మాట ద్వారానే స్క్వాడ్‌ని గూర్చిన ప్రచారం జరుగుతుంది. వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకోజాలని నిస్సహాయులకు అండగా నిలవడమే స్క్వాడ్ ఉద్దేశం. ఫీజు నామినల్. కేసును బట్టి ఉంటుంది’ అని ఆగింది. అతను తన సమస్యను వివరిస్తుంటే శ్రద్ధగా ఆలకించింది. ‘నలభై ఎనిమిది గంటల తరువాత మా స్క్వాడ్ మెంబర్ మిమ్మల్ని కలుస్తారు. ఆ లోపున రియాలిటీ చెక్ నిర్వహిస్తాం. మీరు చెప్పినవి వాస్తవాలే అని నిర్ధారించుకోగానే యాక్షన్ ప్లాన్‌తో మీ ముందుంటాం.. గుడ్ లక్ అండ్ గుడ్ నైట్!’ అంటూ గుంపులో కలసిపోయిందామె. ఇంటికి డ్రైవ్ చేస్తుంటే హనుమంతయ్య మదిలో ఆలోచనలు రేగాయి. ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఎస్పీగా పనిచేసిన అతని తండ్రి రజనీకాంతరావు ఆస్తులు బాగా సంపాదించాడు. వాటిలో మాదాపూర్‌లోని ప్రైమ్ ఏరియాలో ఉన్న పెద్ద బిల్డింగ్ ఒకటి. కింద మూడు కమర్షియల్ పోర్షన్, పైన ఐదు రెసిడెన్షియల్ ఫ్లాట్లూను. దాన్ని కట్టి ముప్పయ్ ఐదేళ్ళు అవుతుంది. ప్రస్తుతం దాని విలువ కోట్లలో ఉంటుంది. రజనీకాంతరావు ఏకైక సంతానమైన హనుమంతయ్య దుబాయ్‌లో గార్మెంట్ బిజినెస్ చేసుకుంటున్నాడు. రిటైర్మెంట్ అనంతరం రజనీకాంతరావు భార్యతో ఆ బిల్డింగ్‌లోని ఓ ఫ్లాట్ లో ఉండేవాడు. రెండేళ్ళ కిందట.. భార్య పోయిన ఐదేళ్ళకు అతనూ మరణించాడు. దాంతో ఇండియాకి తిరిగివచ్చేశాడు ఏభయ్యో పడిలో ఉన్న హనుమంతయ్య. అతని ముస్లిమ్ భార్య అతనితో రావడానికి నిరాకరించడంతో ఒంటరిగానే వచ్చాడు. కూతురు తల్లితోనే ఉంటోంది. హైదరాబాదులో ఆఫీసు ప్రారంభించి గార్మెంట్ ఎక్స్పోర్ట్ బిజినెస్‌కి శ్రీకారం చుట్టాడు. ఆ బిల్డింగ్‌లోని గ్రౌండ్ ఫ్లోర్లో షాపులు ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్లో మధ్యనున్న ఫ్లాట్‌లో హనుమంతయ్య ఉంటున్నాడు. మిగతా వాటిలో టెనెంట్లు ఉంటున్నారు. హనుమంతయ్య ఎడమ పక్క ఫ్లాట్‌లో అరవావిడ.. అరవై ఐదేళ్ళ ఆండాళ్ళు ఉంటోంది. ఆమె భర్త పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు. ఇరవయ్యేళ్ళ కిందట నక్సలైట్లతో ఎన్కౌంటర్లో పోయాడు. సంతానం లేదు. ఆ తరువాత పోలీస్ క్వార్టర్స్ ఖాళీ చేసి ఆ ఫ్లాట్‌లో అద్దెకు దిగింది. ఫ్యామిలీ పెన్షన్ వస్తుంది. ఠంచనుగా అద్దె చెల్లిస్తుందే తప్ప, ఎన్నేళ్ళైనా అద్దె పెంచదు, ఫ్లాట్ ఖాళీ చేయమంటే చేయదు. గొడవకు దిగుతుంది. ఆమె పక్క ఫ్లాట్‌లో ఓ నలభై ఏళ్ళ చిరుద్యోగి పదేళ్ళుగా కుటుంబంతో ఉంటున్నాడు. క్రమం తప్పకుండా అద్దె చెల్లిస్తుంటాడు. అద్దె పెంచమని అడిగితే, తన కష్టాలను ఏకరుపెట్టనారంభిస్తాడు. హనుమంతయ్యకు కుడిపక్కన ఓ పాస్టర్.. భార్య, కూతురితో సుమారు ఐదేళ్ళుగా ఉంటున్నాడు. ఎవరెవరో వస్తుంటారు అతని ఇంటికి, ప్రార్థనలు చేయించుకోవడానికి. అద్దె రెగ్యులర్‌గా చెల్లించడు. అదేమంటే బైబిల్ లోంచి ఏవేవో ‘సువార్త’లను ఉటంకించి కన్ఫ్యూజ్ చేస్తుంటాడు. అతని పక్క ఫ్లాట్‌ని అధికార పార్టీకి చెందిన ఓ ఛోటా నాయకుడు ఐదేళ్ళ కిందట అద్దెకు తీసుకున్నాడు. దాన్ని కొందరు స్టూడెంట్ కుర్రాళ్ళకు సబ్–లెట్ చేశాడు. అద్దె చెల్లించడు. గట్టిగా నిలదీస్తే తన పార్టీ కార్యకర్తలను ఉసిగొలిపి నానా రగడా çసృష్టిస్తాడు. కాలక్రమాన ఆ ఏరియా బాగా డెవలప్ అయి అద్దెలు ఎన్నో రెట్లు పెరిగాయి. ఐనా ఆ కిరాయిదారులు మాత్రం ఆరంభంలో ఇచ్చిన అద్దెకు మించి పైసా ఎక్కువ ఇవ్వమని భీష్మించుకుని కూర్చున్నారు. మెయింటెనెన్స్ లేక పాతబడిపోయిన ఆ బిల్డింగును పడగొట్టి, బిల్డర్ కిచ్చి కమర్షియల్–కమ్–రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌ని కట్టాలన్న ప్లాన్ అతనిది. అది నెరవేరాలంటే ముందుగా వాళ్ళందరినీ ఖాళీ చేయించాలి. ఆ దిశగా అతను చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించడం లేదు. కోర్ట్‌కు వెళితే, దాని పరిష్కారానికి తన జీవితకాలం సరిపోదని అతడెరుగును. అదిగో అప్పుడే వచ్చింది.. మూడు రోజుల క్రితం అతని సెల్ ఫోన్లో ఆ మెసేజ్– ‘ఎంతటి జటిలమైన సమస్యకైనా పరిష్కారం– ‘మే ఐ హెల్ప్ యూ?’ కాంటాక్ట్ ఫలనా నంబర్ అంటూ. రెండు రోజులపాటు తీవ్రంగా ఆలోచించిన మీదట ‘ఏ ప్రభుత్వ విభాగంలో ఏ స్కామ్ ఉందో అన్నట్టు, ఏ బుర్రలో ఏ జిత్తులున్నాయో! లెట్ మీ ట్రై’ అనుకుంటూ ఆ సెల్ నంబరుకు ఫోన్ చేశాడు హనుమంతయ్య. దాని పర్యవసానమే అనామికతో మీటింగ్. ∙∙ ‘నా పేరు అజ్ఞాత. మే ఐ హెల్ప్ యూ స్క్వాడ్ నుంచి వస్తున్నాను’ అందామె, హనుమంతయ్య ఆఫీసు రూమ్‌లోకి ప్రవేశిస్తూ. పాతికేళ్ళుంటాయి ఆమెకు. అందంగా ఉంది. తుమ్మెదరెక్కల్లాంటి జుత్తును మెడ వరకు కత్తిరించుకుంది. వైట్ జార్జెట్ శారీ ధరించింది. ‘బ్యాక్ గ్రౌండ్ చెక్ చేసి... మీది జెన్యూన్ ప్రోబ్లెమ్ అని నిర్ధారణ చేసుకున్నాం. మీ కేసు టేకప్ చేయడానికి నిర్ణయించుకున్నాం. మా ఫీజు కోటి రూపాయలు’ చెప్పిందామె. ‘కోటా!?’ అవాక్కయ్యాడు హనుమంతయ్య. ‘టెనెంట్లు ఖాళీచేసేస్తే ఓ పెద్ద మల్టీపర్పస్ కాంప్లెక్స్‌ను కట్టాలనుకుంటున్నారు మీరు. 60:40 నిష్పత్తి మీద ఆల్రెడీ ఓ ప్రముఖ బిల్డర్‌తో ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. మీ ఆలోచన ఆచరణకు వస్తే కొన్ని వందల కోట్లు లాభిస్తాయి మీకు’ వివరాలన్నీ ఏకరువు పెడుతూండగా.. ‘ఆల్ రైట్, అజ్ఞాతా! మీ అడ్వాన్స్ ఎంత?’ మధ్యలోనే అడిగాడు. తాము అడ్వాన్స్ తీసుకోమనీ, పని పూర్తికాగానే ఇరవై నాలుగు గంటల్లో మొత్తం ఫీజు చెల్లించవలసి ఉంటుందనీ చెప్పిందామె. అగ్రిమెంట్ కాగితం ఇచ్చి అతని చేత సంతకం చేయించింది. ‘రేపు ఉదయం మీ ఇంటికి వస్తాను. లండన్ నుంచి వచ్చిన మీ మేనకోడలిగా ఆండాళమ్మకు నన్ను పరిచయం చేయండి. ఆవిడ ఒక్కరికి తెలిస్తే ఊరంతా తెలిసినట్టే!’ ఆమె అంత కరెక్ట్ గా ఎలా చెబుతోందా అని విస్తుపోయాడు అతను. అతని ఫ్లాట్‌లో ఆండాళమ్మ ఉన్న పోర్షన్ వైపు ఉండే గదిని తనకు కేటాయించవలసిందిగా కోరిందామె. అతను పగలు షాప్‌కి వెళ్ళిపోతాడు కనుక, ఇంట్లోని విలువైనవాటిని బ్యాంక్ లాకర్లో భద్రపరచుకోమని సలహా ఇచ్చింది అజ్ఞాత. తనకు కేటాయించిన గది తప్ప మిగతావాటిని లాక్ చేసుకుని వెళ్ళమంది. తన గది, మెయిన్ డోర్ డూప్లికేట్ కీస్‌ని తనకు ఇవ్వమంది. ‘సరిగ్గా నెల రోజుల తరువాత మీ బిల్డింగులో టెనెంట్లు ఉండరు!’ హామీ ఇచ్చింది. ఆమె స్వరంలో తొణికిసలాడిన ఆత్మవిశ్వాసం అతనిలో ధైర్యాన్ని పెంచింది. ∙∙ మర్నాటి ఉదయం భోషాణాలవంటి మూడు పెద్ద సూట్ కేసులు, ఓ మీడియం సైజ్ బ్రీఫ్ కేసూ పట్టుకుని ఆ బిల్డింగ్ ముందు క్యాబ్ దిగింది అజ్ఞాత. పెట్టెలకు ఎయిర్‌లైన్స్ లగేజ్ ట్యాగ్స్ ఉన్నాయి. ఆశ్చర్యంగా చూస్తున్న హనుమంతయ్యతో ‘మీ మేనకోడలు ఫారిన్ నుంచి వస్తోందంటే ఈమాత్రపు బిల్డప్ అవసరం అంకుల్!’ అంటూ నవ్వింది. ఆమెను ఆ రోజే ఆండాళమ్మకు పరిచయం చేశాడు హనుమంతయ్య. ‘ఇంద పొణ్ణె నానెప్పోవుం పార్కవే ఇల్లియే!’ అందామె. ఆమెకు తెలుగు బాగానే వచ్చినా హనుమంతయ్యను చూస్తే అరవంలో మాట్లాడుతుంది. తాను లండన్‌లో జాబ్ చేస్తున్నట్టు, హాలిడేయింగ్ కోసం ఇండియాకి వచ్చినట్టు చెప్పింది అజ్ఞాత. తనకు తమిళ స్నేహితులు ఉన్నారనీ, వారి నుంచి తానూ తమిళం మాట్లాడడం నేర్చుకుందనీ ఆమె అరవంలో చెప్పడంతో, ఆండాళ్ళు సంతోషానికి మేరలేకపోయింది. ‘నీ రొంబ అళగా ఇరికే!’ అంటూ కాంప్లిమెంట్ ఇచ్చింది. అజ్ఞాత వచ్చి నాలుగు రోజులయిపోయింది. హనుమంతయ్య మేనకోడలు లండన్ నుంచి వచ్చిందన్న వార్త ‘ఆండాళ్ళు న్యూస్ ఛానల్’ ద్వారా ఆ బిల్డింగ్ అంతా పాకిపోయింది. రోజుకోసారైనా ఆండాళ్ళును పలుకరిస్తుండేది అజ్ఞాత. చిరుద్యోగికి ఐదేళ్ళ కూతురు. తెల్లగా ముద్దుగా ఉంటుంది. ఆ పాపను ముద్దాడి చాక్లెట్ బార్స్ ఇచ్చేది అజ్ఞాత. దాంతో ఆమెకు చేరిక అయిపోయింది ఆ పిల్ల. ఓ రోజున ఎందుకో అజ్ఞాత గదిలో ప్రవేశించిన హనుమంతయ్య.. నేలపైన ఉన్న వస్తువులను చూసి విస్తుపోయాడు– ‘ఇన్సులేటెడ్ వైర్ కాయిల్స్, ఎక్స్ టెన్షన్ కార్డ్స్..సాకెట్లు.. మినీ స్పీకర్స్.. యాంప్లిఫయర్ డైరెక్షనల్ మైక్స్.. ఓ పెద్ద డ్రిల్లర్.. ఓ బాటిల్లో కెమికల్ వంటి ఏదో ద్రవం.. వగైరాలు. ‘ఇటీవల టెక్నాలజీ బాగా డెవలప్ అయింది అంకుల్! దాన్ని ఎప్పుడు ఎలా వాడుకోవాలన్నది మన తెలివితేటల పైన ఆధారపడివుంటుంది. దయ్యాలకు, భూతాలకు జడవని మనిషి ఉండడు. ఒక్క ఆండాళ్ళును స్కేర్ చేస్తే చాలు.. బిల్డింగంతా భయం పాకిపోతుంది. అత్యాధునికం అనుకునే అమెరికాలో మూడొంతులు దయ్యాలు, ప్రేతాత్మలు, చేతబడుల సినిమాలే! ఈ టూల్స్ నా ఆలోచనకు టెక్నికల్ సపోర్ట్ నిస్తాయి’ అందామె. వారం తరువాత ఓ రోజు రాత్రి షాపు నుంచి తిరిగివచ్చిన హనుమంతయ్యకు ఆండాళ్ళు ఫ్లాట్‌కి పెద్ద తాళంకప్ప వేలాడుతూ కనిపించింది. ఆ రెండేళ్ళలో ఎన్నడూ ఆమె ఇంటి బైట అడుగుపెట్టిన దాఖలాలు లేవు. అన్నీ ఫోన్ ద్వారా ఇంటికే తెప్పించుకుంటుంది. ‘ఆండాళ్ళు ఇక తిరిగిరాదు!’ ప్రకటించింది అజ్ఞాత. ‘ఈ మధ్య ఇక్కడ తాతయ్య.. అదే మీ తండ్రిగారి ప్రేతాత్మ తిరుగుతోందని ఆండాళ్ళును నమ్మించాను. అందుకు అనుగుణంగా ఆమె ఫ్లాట్ వైపు గోడలో చిన్న రంధ్రం చేసి వరుసగా నాలుగు రోజులపాటు నా టూల్స్‌తో భయానక శబ్దాలు, ఆర్తనాదాలు వగైరాలను çసృష్టించాను. దాంతో ఉదయం ఫ్లాట్ ఖాళీ చేసేసి వెళ్ళిపోయింది’ అని చెప్పింది. హనుమంతయ్య ఆనందానికి మేరలేకపోయింది. వీకెండ్లో తాను సృష్టించబోయే స్పెషల్ ఎఫెక్ట్‌ల ధాటికి తట్టుకోలేక టెనెంట్లందరూ ఫిర్యాదు చేయడానికి అతని వద్దకు వస్తారనీ.. అతను వారికి అందుబాటులో ఉండకుండా మూడు రోజులపాటు ఫోన్ స్విచాఫ్ చేసుకుని ఎక్కడికైనా వెళ్ళిపొమ్మనీ సలహా ఇచ్చిందామె. మూడు రోజుల అజ్ఞాతవాసం తరువాత సోమవారం ఉదయం.. ఇంటికి తిరిగివచ్చిన హనుమంతయ్య, ఆండాళమ్మను చూసి విస్తుపోయాడు. ‘నువ్వు ఫ్లాట్ ఖాళీచేసి వెళ్ళిపోయావుకదూ?’ అనడిగాడు. ‘నాన్ ఎన్నదుకు గాలీ పన్ననం అబ్బా?’ అంటూ ఎదురు ప్రశ్నించిందామె. ‘అజ్ఞాత లండన్ నుంచి వచ్చినట్లు తెలిసి హనుమంతయ్య బంధువర్గం రాబోతోందనీ, వాళ్ళంతా ఆటలతో పాటలతో రాత్రింబవళ్ళు హంగామా చేస్తారనీ, గుండెజబ్బుతో బాధపడే ఆండాళమ్మకు అది పెద్ద ఇబ్బందికరంగా పరిణమించ వచ్చుననీ, ఓ వారం రోజులపాటు ఏదైనా హోటల్లో ఉండి వస్తే మంచిద’నీ సలహా ఇచ్చిందట అజ్ఞాత. హోటల్ ఖర్చుల నిమిత్తం సొమ్ములు కూడా ఇచ్చిందట! ఆవిడ హోటల్ నుంచి ఆ రోజు ఉదయమే తిరిగివచ్చిందట. ‘నల్ల పొణ్ణు!’ అంటూ కితాబు ఇచ్చింది ఆండాళమ్మ. హనుమంతయ్య ఖంగుతిన్నాడు. గబగబా తన ఫ్లాట్‌కి వెళ్ళి తన కీతో తలుపు తెరిచాడు. తిన్నగా అజ్ఞాత ఉన్న గదికి వెళ్ళి చూసిన అతని గుండె గతుక్కుమంది. గదిలో ఆమె లేదు. సూట్ కేసులూ లేవు! టూల్సన్నీ నేలపైన పడున్నాయి. గది మధ్యన ఉండవలసిన బెడ్ స్థానభ్రంశం చెందింది. దాని కిందనుండే తివాచీ పక్కగా పడుంది. దాని స్థానంలో.. నేలపైన ఓ మనిషి సులువుగా పట్టేటంత కన్నం ఉంది! హఠాత్తుగా తట్టింది అతనికి.. గ్రౌండ్ ఫ్లోర్‌లోని ‘డైమండ్స్ అండ్ జువెల్స్’ నగల షాపు సరిగా ఆ గది కిందే ఉందన్న సత్యం! ఆ బిల్డింగ్‌లోని నగల షాపులో భారీ దొంగతనం జరిగిందన్న వార్త క్షణాలలో దావానలంలా పాకిపోయింది. పోలీసులు, పోలీసు కుక్కలూ వచ్చాయి. వేలిముద్రల నిపుణులూ వచ్చారు. ఎక్కడా చిన్న క్లూ కూడా లభించలేదు. ఆ బిల్డింగ్‌లో కానీ, సమీపంలో కాని సి.సి. కెమెరాలు లేవు. నగల షాపులో ఉన్న కెమెరా పనిచేయడంలేదు. గత అర్ధరాత్రి సమయంలో ఆ చోరీ జరిగుంటుందని అంచనా వేశారు. షాపు తాళం చెక్కుచెదరలేదు. కాని వేల కోట్ల రూపాయల విలువచేసే వజ్రాలు, నగలు, బంగారం దొంగతనమయ్యాయి. దొంగలు హనుమంతయ్య ఫ్లాట్‌లోని గెస్ట్ రూమ్ నేలపైన కన్నం తవ్వి రోప్ సాయంతో షాప్‌లోకి దిగారు! హనుమంతయ్యను ప్రశ్నించారు పోలీసులు. అతను లబోదిబోమంటూ తాను ‘మే ఐ హెల్ప్ యూ?’ స్క్వాడ్ నుంచి మెసేజ్ రిసీవ్ చేసుకున్నప్పట్నుంచి జరిగినదంతా ఏదీ దాచకుండా వివరించాడు. అనుమానం పైన అతన్ని అరెస్ట్ చేసి.. ఇతర టెనెంట్లను ప్రశ్నించడానికి పూనుకున్నారు పోలీసులు. మూడు రోజుల తరువాత చందానగర్‌లోని ఓ హోటెల్లో దాక్కున్న అజ్ఞాత, అనామికలను పోలీసులు అరెస్ట్ చేయడం, దోచుకున్న సొత్తంతా రికవర్ చేయడమూ జరిగాయి. నేరస్థులను మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీస్ కమీషనర్ ‘ఎంత తెలివైన నేరస్థుడైనా ఏదో ఒక పొరపాటు చేయకమానడు. అజ్ఞాత చేసిన పొరపాటల్లా, ఆ బిల్డింగులోని ఓ టెనెంట్ కూతురితో చనువుగా ఉండడమే! ఐదేళ్ళ ఆ పాప తన తల్లి సెల్‌ఫోన్ తెచ్చి, సెల్ఫీ తీసుకుందామని అడగ్గానే అనాలోచితంగా ఒప్పేసుకుంది అజ్ఞాత. మా పరిశోధనలో బైటపడ్డ ఆ సెల్ఫీయే వీళ్ళను పట్టిచ్చింది. పాత నేరస్థులు కావడంతో వీళ్ళను ట్రాక్ చేయడం సులభమయింది మాకు. ఇద్దరూ నేరం ఒప్పుకున్నారు’ అని చెప్పాడు. హెచ్చరించి హనుమంతయ్యను వదిలేశారు పోలీసులు. -
Maranam Telugu Movie: ఆత్మలను బంధిస్తే...
వీర్‌సాగర్, శ్రీ రాపాక, మాధురి ప్రధాన పాత్రల్లో వీర్ సాగర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మరణం’. ‘కర్మ పేస్’ అనేది ఉపశీర్షిక. బి. రేణుక సమర్పణలో ఓషియన్ ఫిలిం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం ట్రైలర్ విడుదలయింది. వీర్ సాగర్ మాట్లాడుతూ– ‘‘తెలుగులో హారర్ చిత్రాలకి మంచి క్రేజ్ ఉంది. సరికొత్త కథ, కథనంతో, అద్భుతమైన విజువల్స్‌తో, గొప్ప సౌండ్ ఎఫెక్ట్స్‌తో ఒక హారర్ చిత్రం వస్తే ఎలా ఉంటుందంటే మా ‘మరణం’లా ఉంటుంది’’ అన్నారు. ‘‘వీర్ సాగర్ ఈ చిత్రంలో డెమనాలజిస్ట్ (ఆత్మలను బంధించే శాస్త్రవేత్త)గా నటించారు’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: కేవీ వరం, సంగీతం: మనోజ్ కుమార్. ఓ అమ్మాయి నేర కథ జూనియర్ ఎన్టీఆర్ ‘ఆది’ ఫేమ్ కీర్తీ చావ్లా ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘ఓ అమ్మాయి క్రైమ్‌స్టోరీ’. జి. సురేందర్ రెడ్డి దర్శకుడు. సాధిక, ఆదీ ప్రేమ్, కవిత, శ్రీమాన్, గౌతమ్ రాజు, నిళల్గళ్ రవి ముఖ్య పాత్రల్లో నటించారు. ఏబీ శ్రీనివాస్, ఆర్. సుందర్, శ్రీధర్ పోతూరి, శాకముద్ర శ్రీధర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 30న విడుదల కానుంది. నిర్మాతల్లో ఒకరైన ఏబీ శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘లేడీ ఓరియంటెడ్ చిత్రమిది. ఓ అమ్మాయి నేర కథాంశంతో నిర్మించాం. హారర్ ఎలిమెంట్స్, గ్రాఫిక్స్, రొమాంటిక్ అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. గతంలో విడుదల చేసిన టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. సినిమా కూడా ఆదరణ పొందుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. -
ఊరికి జరమొచ్చింది..
భాస్కర్ దగ్గర నుండి ఫోన్. బద్ధకం వదిలించుకుని ‘‘ ఏరోయ్! డీఎస్పీ! ఎప్పుడు ఫోను చేసినా బిజీ అంటుంటావ్! ఇంత తెల్లవారుఝామున ఈ ఫోనేంటి?’’ అని కంగారుగా అడిగాడు ఉమాపతి. ‘‘మీ ఊర్లో దిగాను. స్టేషన్లో ఉన్నాను. అడ్రస్ చెప్పు’’ ‘‘ఓర్నీ! రాత్రే చెప్పచ్చుగా! స్టేషన్‌కి వచ్చేవాణ్ణి’’... అడ్రస్ చెప్పాడు. చిన్ననాటి మిత్రుణ్ణి చూడగానే ఆనందంగా కౌగిలించుకున్నాడు. ‘‘చెల్లెమ్మ ఏదిరా?’’ ఇల్లంతా వెదుకుతూ అడిగాడు. ‘‘తెలుసున్నవాళ్ళింటికి పెళ్ళికి వెళ్ళింది. రేపొస్తుంది’’ ‘‘అయ్యో! భలే టైం చూసొచ్చానే?’’ ‘‘ఏం పర్లేదు! నీ ఆతి«థ్యానికి ఏ లోటూ రానివ్వను. కంగారు పడకు. వంటమనిషి ఉన్నాడు.. సర్లే! ఏంటి ఈ ఆకస్మిక రాక?’’ ‘‘అర్జెంటుగా హెడ్ ఆఫీసు పని పడింది’’ అన్నాడు భాస్కర్. ‘‘అదీ అలా చెప్పు. లేకపోతే నువ్వొస్తావా అంత తీరిగ్గా!’’ అని నవ్వేడు ఉమాపతి. ఆఫీసు పని అయ్యాక ఇద్దరు మిత్రులూ ఆ రాత్రి టెర్రస్ మీద మందుబాటిల్ ఓపెన్ చేశారు. ‘‘నీ కెరీర్ లో అతి జటిలమైన కేసుగా ఉండి, అతి చాకచక్యంగా ఛేదించినది ఏదైనా ఉందొరేయ్? ఉంటే చెప్పు. సరదాగా వినాలని ఉంది’’ అడిగాడు ఉమాపతి. ‘‘లేకేం? చాలా ఏళ్ళ క్రితం జరిగింది చెప్తాను’’ ఉమాపతి ఇంట్రెస్టుగా వినడం మొదలెట్టాడు. నేను సబ్ ఇన్స్పెక్టర్గా చెరుకువాడ అనే ఊళ్ళో జాయిన్ అయిన రోజులు. పిల్లల చదువుల కోసం సిటీలో ఫ్యామిలీ పెట్టి స్టేషన్ పక్కన చిన్న గదిలో అద్దెకు ఉండేవాణ్ణి. ఊరిలో అడుగుపెట్టిన నాకు కనబడిన విచిత్రం ఏంటంటే.. భయం దుప్పట్లో దూరిన ఆ ఊరు జ్వరంతో గజగజ వణుకుతోంది. ఎక్కడ విన్నా అదే వార్త! ఎవ్వరూ రాత్రి ఏడు దాటితే బయటకు రావడం లేదు. ఊరి పొలిమేరలో ఉన్న గ్రామదేవత బర్రెమ్మ ఆకలెక్కువై రాత్రిళ్ళు గ్రామం అంతా తిరుగుతోందని, ఏది కనబడితే అది తినేస్తోందని, మనుషులు ఎవరైనా బయట కనబడితే రక్తం కక్కుకొని చచ్చిపోతారని ఒకటే భయంకరమైన పుకారు ఊరంతా గుప్పుమంటోంది. ముసలోళ్ళు మునగదీసి పడుకుంటే, పడుచోళ్ళు చడీచప్పుడూ లేకుండా పడున్నారు. చంటాళ్ళకి బువ్వపెట్టడం సులువైంది తల్లులకి. చదువుకునే కుర్రాళ్ళు భయపడకపోయినా, నమ్మకపోయినా పెద్దాళ్ళ మాటకు విలువ ఇచ్చి ఇంట్లో ఉండిపోయారు. మొత్తం మీద ఆ ఊరి జనం భయం భయంగానే కాలం గడుపుతున్నారు. కొంతమందికి బయట గజ్జెల చప్పుడు వినబడిందని చెప్పుకున్నారు. మరొకరికి ఏదో నిలువెత్తు ఆకారం చీకట్లోంచి నడిచి వెడుతున్నట్టనిపించిందని, బయలుకి వచ్చిన కొంతమంది ముసలాళ్ళు గుండె ఆగి చనిపోయారు అని, రకరకాల పుకార్లు ఊరంతా ప్రచారం. ‘‘ఏంటయ్యా! ఇంత చిన్న ఊరిలో జనం అంతా చీకటి పడకుండానే తలుపులు బిడాయించుకుంటున్నారు?’’ కానిస్టేబుల్ నరసింహాన్ని అడిగాను. ‘‘బర్రెమ్మ అమ్మోరు ఊర్లో తిరిగి జనాన్ని పీక్కతింటందని సెప్పుకుంటున్నారండి’’ అతనూ అదే సమాధానం. ‘‘హ్హ ! హ్హ! జనం ఎంత పిచ్చాళ్ళయ్యా! ఈ రోజుల్లో అమ్మవారు తిరగడం, జనం నమ్మడమూనా! అంతా ట్రాష్’’ అని గట్టిగా నవ్వాను. ‘‘ఆ తల్లిని అనుమానించకండి సర్! మీకు తెల్దు. మా చిన్నప్పుడు అమ్మ ముందు ఒకడు అవాకులు చవాకులు పేలితే మర్నాడు పొద్దున్నకి ఊరవతల మర్రిచెట్టు కింద రత్తం కక్కుకుని చచ్చిపడున్నాడు. చాలా పవర్ ఫుల్ అమ్మోరండి’’ అని వణికిపోతూ చెప్పాడు. ‘‘సర్లే నీకు, నాకు సరిపడదుగానీ ఓ టీ చెప్పు!’’ అని పనిలో పడిపోయాను. ఎవరో తలుపు దబ దబ బాదుతున్నారు. వాచీ చూసుకున్నాను. ఉదయం ఐదుగంటలైంది. ఇంత పొద్దున్నే ఎవడాని తలుపు తీశాను. చెమటతో ఒళ్ళంతా తడిసిపోయి, నరసింహులు గుమ్మం ముందు నిలబడి ఉన్నాడు. ‘‘ఏమైందయ్యా?’’ ‘‘సాంబయ్యను బర్రెమ్మ చంపేసిందండి’’ అని ఆయాస పడుతూ చెప్పాడు. గబగబ యూనిఫాం వేసుకుని, గవర్నమెంటు హాస్పిటల్ డాక్టర్ రామారావుకి కవురంపాను. సిద్ధంగా ఉండమని. ఇద్దరం వెళ్ళే చూసే సరికి సాంబయ్య శవం పరమ భయంకరంగా ఉంది. గుడ్లు బయటకి వచ్చేసి, నోట్లోంచి కారిన రక్తం చారికలు చొక్కామీద ఎండిపోయి ఉన్నాయి. సాంబయ్య వయస్సు ఇరవై ఉంటుంది. చుట్టూ ఉన్న జనాన్ని మా కానిస్టేబుల్స్ అదుపులో పెడుతున్నారు. సాంబయ్య తల్లి బోరుబోరు మని ఏడుస్తోంది. జాలి వేసింది. ఊరి సర్పంచ్ పల్లయ్య నాయుడు, పంచాయతీ స్టాఫ్ అక్కడ నిలబడి ఉన్నారు. అందరి మొహాల్లోనూ భయం. ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి, శవాన్ని పోస్టుమార్టంకి పంపాను. నెమ్మదిగా శవం పడి ఉన్న చుట్టుపక్కల పరిశీలించాను. అంతా బురద బురదగా ఉంది. అక్కడక్కడ అడుగుల ముద్రలు కనబడ్డాయి. పక్కనున్న చెరువులో తూటు మొక్కలు ఆ బురద మీద బయటపడేసి ఉన్నాయి. ఆ ప్రాంతమంతా కలుపు, ముళ్ళతో ఉన్న పిచ్చి మొక్కలతో నిండి ఉంది. పెనుగులాటకు గురి అయ్యినట్టు, మట్టి పైకి లేచినట్టు అక్కడక్కడ కనబడింది. ఎంత తరచి తరచి చూసినా ఏమీ క్లూ దొరకలేదు. నరసింహం మటుకు ‘‘బర్రెమ్మ తల్లి మా ఊరి మీద ఎంత కోపంగా ఉందో’’ అని గొణుక్కుంటున్నాడు. కాస్త దూరంగా ఉన్న పెద్ద పెద్ద ఊడల మఱి< చెట్టు ఒకటే సాక్షిగా కనిపించింది. కాస్త దూరంగా బర్రెమ్మ గుడి, దాని ముందు నిలబడిన త్రిశూలం కనబడ్డాయి. నడుచుకుంటూ అక్కడకు వెళ్ళాను. కూడా నరసింహం అమ్మకి దణ్ణాలు పెట్టుకుంటూ వస్తున్నాడు. అక్కడి వరకు చెప్పి గ్లాసులో ఐస్ ముక్కలేసుకుని కాస్త విస్కీ పోసుకున్నాడు మరో రౌండుకి. ఉమాపతి ఊపిరి బిగబెట్టి వింటున్నాడు. గ్లాసులో విస్కీ ఖాళీ అవుతున్నా, మత్తు ఎక్కడం లేదు. ‘‘తర్వాత ఏం జరిగింది...?’’ ఆతృతగా అడిగాడు ఉమాపతి. ‘గర్భగుడి తలుపులు తెరిచి ఉన్నాయి. అమ్మ స్వరూపం మహోగ్రరూపంలో ఉంది. అందరినీ కాపాడే తల్లివి నువ్వు. ఇలా మనుషుల్ని చంపుతావా ! నేను నమ్మను’ అని మనసులో అనుకున్నాను. పూజారి పేరు వీరభద్రం అని చెప్పాడు నరసింహం. ఆరడుగుల ఎత్తున్న అమ్మవారి పాదాల దగ్గర పూజ చేస్తున్నాడు. లోపలికి చూసిన నాకు ముందు గదిలో పువ్వులు, కుంకుమ, పసుపు పళ్ళాల్లో పెట్టి కనిపించాయి. మమ్మల్ని చూసిన వీరభద్రం కంగారు పడుతూ లేచాడు. అతను నల్లగా మినుములు పోతపోసిన గుట్టలా ఉన్నాడు. నుదుటికి అడ్డంగా విభూది, నిలువుగా కుంకుమ బొట్టు, జుట్టుని కొప్పుగా కట్టిన తలకట్టుతో, కళ్ళకి కాటుక రాసుకొని, ఆ కళ్ళల్లో ఎర్రజీరతో కనిపించాడు. నడుముకి ఉన్న ఎర్రపంచెను తోలు బెల్టుతో కట్టాడు. పెద్ద బానపొట్ట, కాళ్ళకు పారాణి పెట్టుకున్నాడు. మమ్మల్ని చూసి ‘‘ఏం కావాలి సారు?!’’ అని అడిగాడు వినయంగా, ‘‘రాత్రి నువ్వెక్కడ ఉన్నావు?’’ ‘‘ఇంట్లోనే సర్!’’ ‘‘మీ ఇల్లెక్కడ ?’’ ‘‘ఈ గుడి వెనకాల సర్!’’ ‘‘రాత్రి నీకు కేకలు ఏమైనా వినబడ్డాయా?’’ ‘‘లేదండీ!’’ ‘‘సాంబయ్య చచ్చిపోయాడని తెలుసా?’’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించాను. ‘‘బర్రెమ్మ తల్లి పట్ల అపచారం జరిగిందన్నమాట. ఆ తల్లి ఆకలితో ఉందండి. జాతర జరపాలండి! అమ్మని క్షమించమని అడగాలండి. అప్పుడైనా అమ్మ శాంతిస్తుందేమోనండి!’’ కళ్ళు మూసుకుని ప్రశాంతంగా మాట్లాడాడు. ‘‘సర్లే ! సర్లే! అవసరమైతే మళ్ళీ పిలుస్తాను. స్టేషన్‌కి వచ్చి కనబడాలి’’ ‘‘అలాగే సారు!’’ అని లోపలికి వెళ్ళాడు. పోస్టుమార్టం రిపోర్టులో కొత్త విషయాలేమీ బయటపడలేదు. గొంతు నొక్కుకుపోయినట్టు, ఊపిరి ఆడక గిలగిల కొట్టుకుని మరణించి ఉండవచ్చని రాశాడు డాక్టర్. ఊరిలో అడుగుపెట్టిన నెలరోజులకే ఈ కేసు నాకు తలనొప్పి తెప్పించింది. ఎక్కడా తాడూబొంగరం లేదు. సాంబయ్య తల్లి మీరమ్మని ‘ఎవరి మీద అయినా అనుమానం ఉందా?’ అని అడిగాను. చెప్పలేకపోయింది. చాలా సేపు ప్రశ్నించాను. అయినా చెప్పలేకపోయింది. ‘‘ఆ రోజు నీ కొడుకు ఎందుకు బయటకి వచ్చాడు?’’ అడిగాను. ‘‘పొలం కళ్ళెంలో కోసిన పంట ఉంది బాబు. కాపలా పడుకోడానికి వెళ్ళాడు. మరి పొలంలో పడుకోక, బయటకి ఎందుకు వచ్చాడో తెలియడంలేదు’’ అంది. ఏం చేయాలో తెలియక కేసు విషయాలు పై వాళ్ళకి తెలియజేసి ఊరుకున్నాను. ‘తర్వాత ఏం జరిగింది ?’’ ప్లేట్లో ఉన్న జీడిపప్పు నోట్లో పెట్టుకుంటూ అడిగాడు ఉమాపతి. ‘‘ఆరు నెలలు అయ్యింది. పైనుంచి చీవాట్లు. ఫైల్ మూసేశాము. కానీ కళ్ల ముందు కొడుకు కోసం ఏడుస్తున్న మీరమ్మ కనబడి నిద్రపట్టేది కాదు’’ ‘‘ రాత్రిళ్లు ఊరి పరిస్థితి ఏంటి?’’ ఉమాపతి అడిగాడు . ‘‘అదే సందేహం నాకూ వచ్చింది. రాత్రిళ్లు నేను కాపలా కాసినన్నాళ్లూ ఆశ్చర్యంగా ఏ విధమైన గజ్జెల చప్పుడూ వినబడలేదు. కానీ చివరకు క్లూ దొరికింది’’ తాపీగా సిగరెట్టు నోట్లో పెట్టుకుని లైటర్‌తో వెలిగిస్తూ చెప్పాడు భాస్కర్. తాగుతున్న గ్లాసు పక్కన పెట్టి ‘‘క్లూ దొరికిందా! ఎలా ? చెప్పు చెప్పు’’ అని ముందుకు వంగాడు ఉమాపతి. ‘‘ఆరోజు సర్పంచి పల్లయ్య నాయుడు కూతురి పెళ్ళికి వెళ్ళాను. ఇంట్లోకి సాదరంగా ఆహ్వానించాడు నాయుడు. భోజనాలు అయ్యాక ‘సారు! వచ్చే ఆదివారం అమ్మవారి జాతర. ఊరి జనం భయపడుతున్నారు. అమ్మవారికి జాతర జరిపిస్తే ఊరికి పట్టిన అరిష్టం పోతుందని గుడి పూజారి వీరభద్రం చెప్పాడు. ఊరేగింపు కూడా పెట్టాం. తమరు పర్మిషన్ ఇవ్వాల’ అని రిక్వెస్ట్ చేశాడు. ‘సరే! గొడవలు లేకుండా జరిపించండ’ని పర్మిషన్ ఇచ్చాను’’ జాతర బ్రహ్మాండంగా జరుగుతోంది. వీరభద్రం దగ్గరుండి అన్నీ జరిపిస్తున్నాడు. నాయుడు దర్జాగా ఇంటి అరుగు మీద కూర్చుని, మధ్య మధ్యలో ఊరంతా తిరుగుతూ, బాణసంచా కాల్పిస్తున్నాడు. పులి వేషగాళ్ళు, గరగ డాన్సు వాళ్ళు డప్పు శబ్దాలకు లయబద్ధంగా నాట్యం చేస్తున్నారు. నేను పదిమంది కానిస్టేబుల్స్‌ను తీసుకొని, ఊరంతా బందోబస్తు కట్టుదిట్టం చేశాను. అర్ధరాత్రయ్యింది. వీరభద్రం ప్రతి ఏడాది అమ్మవారిలా చేసే నృత్యం చేస్తున్నాడు. అమ్మవారిలా చీర కట్టుకున్నాడు. అమ్మోరు పూనినట్టు వీరంగం వేస్తున్నాడు. వెనకాల డప్పులు కొడుతున్న వాళ్ళ చేతి నరాలు పొంగుతున్నాయి. దానికి లయబద్ధంగా ఇతను చేస్తున్న నృత్యం చూసి నేను కూడా ఆశ్చర్యపోయి అప్రయత్నంగా దణ్ణం పెట్టాను. నా దృష్టి అతని కాళ్ళ మీదే ఉంది. వెంటనే నా మస్తిష్కానికి వచ్చిన ఒక సందేహం, నన్ను జాగరూకుడిని చేసింది. ‘అమ్మ గజ్జెల చప్పుడు వినిపిస్తోంది రాత్రిళ్లు’ అనే మాట స్ఫురణకి వచ్చింది. వీరభద్రం కాళ్ళ వైపు చూశాను. అతని ఆట అయ్యి, అలసిపోయి ఒక చోట కూర్చున్నాడు. కాగడాల కాంతిలో అతని కాళ్ళకి కట్టుకున్న గజ్జెల దండలో రెండు మువ్వలు లేకుండా ఖాళీగా కనబడింది. వెంటనే, నరసింహాన్ని తీసుకొని, సాంబయ్య చనిపోయిన స్థలానికి వెళ్ళి బ్యాటరీ లైట్ల కాంతిలో వెతకడం మొదలుపెట్టాము. ‘‘నరసింహం! ఎక్కడైనా మువ్వలు దొరికితే చెప్పు’’ గట్టిగా అరిచాను. తెల్లవారింది. లోకసాక్షి ఉదయించాడు. ఆ వెలుగు అక్కడ ఉన్న మొక్కల మీద పడుతోంది. నా కళ్ళు సూర్య కాంతిని మించి పరిశీలిస్తున్నాయి. దొరికింది ఒక మువ్వ.. తుప్పల మీద నిలవ ఉన్న నీటిలో స్వచ్ఛమైన నిజంలా మెరుస్తూ. మరొకటి నరసింహం మొక్కల మధ్యలో దొరకబుచ్చుకున్నాడు. ‘‘వెంటనే వీరభద్రాన్ని నాలుగు పీకి నిజం రాబట్టాను’’ తాగుతున్న గ్లాసు పక్కన పెట్టాడు భాస్కర్. ‘‘వీరభద్రం అంత పని ఎందుకు చేశాడు? సాంబయ్యకు అతనికి ఏమిటి గొడవ? మీరమ్మని దిక్కులేని దాన్ని చేశారు కదా పాపం’’ అని ప్రశ్నల వర్షం కురిపించాడు ఉమాపతి. ‘‘వీరభద్రం చంపలేదు... సాయం చేశాడు’’ ‘‘మరి ఎవరు చంపారు?’’ ‘‘చంపినవాడు పల్లయ్య నాయుడు’’ అని తాపీగా బాటిల్లో విస్కీ గ్లాసులో పోసుకున్నాడు భాస్కర్. ‘‘ఆ.. ! మళ్ళీ ఇదేం ట్విస్టు?’’ ‘‘నాయుడి కూతురు, కాలేజీలో చదువుతున్న సాంబయ్య ప్రేమించుకున్నారు. అది తెలిసిన నాయుడు అగ్గి మీద గుగ్గిలం అయ్యాడు. ‘ఆడి కులమేటి! నా కులమేటి! ఆడి అంతస్తేమిటి! ఆడికి నా కూతురు కావలిసి వచ్చిందా?’ అని శివాలెత్తిపోయి, అతనికి నమ్మిన బంటు అయిన వీరభద్రానికి విషయం చెప్పాడు. డైరెక్టుగా గొడవ చేస్తే అసలే మొండిదైన కూతురు ఏ అఘాయిత్యం చేస్తుందో అని భయపడి, ఇలా ఒక నెల ముందు నుంచి, వీరభద్రం అమ్మవారిలా అర్ధరాత్రిళ్లు గజ్జెలతో నడిచి, ఊరి మధ్యలో పుకారు వ్యాపింప చేశారు. నెమ్మదిగా ఒక రోజు ప్లాన్ చేసి, సాంబయ్యని మట్టుపెట్టారు. నాయుడు.. సాంబయ్య పీక నొక్కి, గుండెల మీద కాలు వేసి తొక్కి చంపాడు. అతనికి సాయం చేసే హడావుడిలో వీరభద్రం కాళ్ళకి ఉన్న గజ్జెల్లో రెండు తెగి పడ్డాయి. అది చూసుకోలేదు. మనకు అదే ఆధారం అయ్యింది. ఇద్దరూ నేరం ఒప్పుకున్నారు’’ అన్నాడు భాస్కర్. ‘‘ఊరికి భయం అనే జ్వరం తగ్గింది’’ అని నవ్వాడు ఉమాపతి. - చాగంటి ప్రసాద్ -
సుపారీ: ఒక్క హత్యకు రూ.6 లక్షలు!
‘నిన్ను ఎక్కడో చూసినట్టుందే!’ బార్‌లోని ఏసీ సెక్షన్లోకి వెళ్లడంతోనే లోపల ఒంటరిగా కూర్చున్న ఒక వ్యక్తి వంక పరీక్షగా చూస్తూ అన్నాడు ప్రకాశ్. ఆ మాట విన్న ఆ వ్యక్తి నర్మగర్భంగా నవ్వుతూ ‘మీవంటి ధనవంతులకు సేవలందిస్తుంటాను. ఆ సందర్భంలో ఎక్కడో చూసి ఉంటారు నన్ను’ చెప్పాడు. అతని ముందు కూర్చుంటూ అడిగాడు ప్రశాశ్ ‘నువ్వు అందిస్తున్న సేవలు ఎలాంటివో?’ అంటూ. ‘హత్యలు’ కూల్‌గా చెప్పాడు ఆ వ్యక్తి. ఆ మాట విన్న ప్రకాశ్ ఉలిక్కిపడ్డాడు. కంగారుగా అటూ ఇటూ చూశాడు. అది ఉదయం పదకొండు గంటల సమయం కావడంతో బార్లో బొత్తిగా జనం లేరు. తమ మాటలను వినేవారెవరూ లేరని గ్రహించాక ‘నీ పేరేంటి?’ అని అతణ్ణి అడిగాడు ప్రకాశ్. ‘నా పేరు మారుతూ ఉంటుంది.. ప్రస్తుతానికైతే నేను రాజును’ చెప్పాడు అతను. ప్రకాశ్ ఆత్రంగా ముందుకు వంగి స్వరం బాగా తగ్గించి అడిగాడు ‘నా కోసం ఒక హత్య చేస్తావా?’ అంటూ. మళ్లీ నవ్వాడు రాజు. అర్థం కానట్టుగా చూశాడు ప్రకాశ్. అర్థమయ్యేలా చెప్పాడు రాజు ‘నేను ఎవరి కోసమూ హత్యలు చేయను. కేవలం డబ్బు కోసమే చేస్తాను’ అని. ‘ఓకే.. ఎంత కావాలో చెప్పు?’ అన్నాడు ప్రకాశ్. ‘ఎవరిని చంపాలి? ఎలా చంపాలి? ఆ పనిలో ఉన్న రిస్క్ ఎంత? అనే దాన్ని బట్టి రేట్ ఫిక్స్ చేస్తా’ చెప్పాడు నింపాదిగా. ‘ఇందులో రిస్క్ చాలా తక్కువ. చంపవలసిన వ్యక్తి గొప్పవాడేమీ కాదు. అతని పేరు వినోద్. ఓ విలేఖరి. గాంధీనగర్‌లోని చర్చి ఎదురుగా ఉన్న ప్రియా అపార్ట్మెంట్స్ రెండో అంతస్తులో ఉంటాడు. మూడు రోజుల కిందటే అతని భార్య, పిల్లలు బంధువుల పెళ్లికి వెళ్లారు. ప్రస్తుతం వినోద్ ఒక్కడే ఉంటున్నాడు ఇంట్లో. ఇంకో విషయం.. ఆ రెండో అంతస్తులో వినోద్ ఫ్లాట్ ఒక్కటే ఉంటుంది. కాబట్టి అతణ్ణి పట్టపగలు చంపినా ఎవరికీ తెలిసే అవకాశమే లేదు. అతణ్ణి చంపి ఇంట్లో దోపిడీ జరిగినట్టు వాతావరణం సృష్టిస్తే చాలు... దోపిడీ కోసం జరిగిన హత్యనే అనుకుంటారు పోలీసులు’ వివరించాడు ప్రకాశ్. ఒక్క క్షణం ఆలోచించి చెప్పాడు రాజు ‘మామూలుగా నేను ఒక హత్యకు పది లక్షలు తీసుకుంటాను. ఇందులో రిస్క్ తక్కువ కాబట్టి ఎనిమిది లక్షలు ఇవ్వండి’ అని. ‘చాలా ఎక్కువ అడుగుతున్నావ్. ఆరు లక్షలు ఇస్తాను’ స్థిరంగా ఉంది ప్రకాశ్ స్వరం. ‘ఊ...’ అని నసుగుతూ రెండు చేతులతో తల రుద్దుకుంటూ ‘సరే.. కానీ మొత్తం డబ్బు ఇప్పుడే ఇచ్చేయాలి. పనయ్యాక నేను కన్పించను ’ అన్నాడు రాజు. ‘నేను కోరుకునేదీ అదే. మొత్తం డబ్బు ఇప్పుడే ఇచ్చేస్తాను. నేను చెప్పిన పని కూడా ఈ రోజే ముగించాలి. ఎందుకంటే రేపు వినోద్ ఫ్యామిలీ తిరిగొచ్చేసిందనుకో.. కష్టం అవుతుంది. నేనూ ఈ మధ్యాహ్నం ఫ్లయిట్‌కి ఢిల్లీ వెళ్లిపోతున్నా. హత్య జరిగిన రోజు నేను ఇక్కడ లేనట్టు ఎలిబీ కూడా క్రియేట్ అవుతుంది కాబట్టి పోలీసులకు నా మీద అనుమానం రాదు’ చెప్పాడు ప్రకాశ్. ‘సరే.. ఆ వినోద్ ఫొటో ఉంటే ఇవ్వండి’ అడిగాడు రాజు. ‘ఉన్న ఒక్క ఫొటో మహేశ్‌కి ఇచ్చేశా. అయినా ఫొటో అక్కర్లేదు. ఎందుకంటే ప్రియా అపార్ట్మెంట్స్ రెండో అంతస్తులో ఉండేది వినోద్ ఒక్కడే. సాయంత్రం ఆరుగంటల కల్లా అతను తన ఫ్లాట్‌కి చేరకుంటాడు. అక్కడే అతణ్ణి చంపాలి. శబ్దాలు వినపడకుండా పని ముగించాలి’ అన్నాడు ప్రకాశ్. ‘డోంట్ వర్రీ. నా దగ్గర సైలెన్సర్ సెట్ చేసిన పిస్తోల్ ఉంది. సైలెంట్‌గానే పని ముగిస్తాను’ ధీమాగా చెప్పాడు రాజు. ప్రకాశ్ తన బ్యాగ్ తెరచి ఆరు లక్షల రూపాయలు రాజుకు ఇచ్చాడు. రాజు ఆ డబ్బును షర్టులో కుక్కుకొని పై నుంచి హుడీ వేసుకొని వెళ్లిపోయాడు. ప్రకాశ్ ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి. అవినీతి, అక్రమాలతో బాగా డబ్బు సంపాదించాడు. ఈ వ్యవహారంలోనే ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ వినోద్ అతనికి తలనొప్పిగా మారాడు. వినోద్ వల్ల తన గుట్టంతా ఎక్కడ బయటపడు తుందోననే భయం పట్టుకుంది ప్రకాశ్‌కి. డబ్బు ఎర చూపి వినోద్ నోరు మూయించాలని ప్రయత్నించాడు. కానీ వినోద్ లొంగలేదు. అందుకే ఏకంగా అతని హత్యకే ప్లాన్ చేశాడు ప్రకాశ్. రాజు కన్న ముందే మహేశ్ అనే కిల్లర్‌కి సుపారీ ఇచ్చాడు. మూడు లక్షలు అడ్వాన్స్ కూడా ఇచ్చాడు. తీరా పని మొదలుపెట్టే సమయానికి ఒక పాత కేసు విచారణ కోసం మహేశ్‌ను పట్టుకుపోయారు పోలీసులు. అతనెప్పుడు బయటకు వస్తాడో తెలియదు. ఈ లోపు వినోద్ కుటుంబం వచ్చేస్తే అతని మర్డర్ కష్టమవుతుంది. అందుకే వెంటనే ఆ సుపారీని రాజుకి బదలాయించాడు ప్రకాశ్.. ఆలస్యం కాకుండా వినోద్‌ను మట్టుబెట్టేందుకు. ఆ రోజు సాయంత్రం ఐదు గంటలకే రాజు గాంధీనగర్‌లోని ప్రియా అపార్ట్మెంట్స్ దగ్గరికి చేరుకున్నాడు. తన ముఖం కనపడకుండా కోవిడ్ మాస్క్‌తో పాటు కూలింగ్ గ్లాసెస్ ధరించాడు. ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించాడు. నాలుగు అంతస్తులున్న ప్రియా అపార్ట్మెంట్స్ ఓ పాత బిల్డింగ్. ఒక్కో అంతస్తులో ఒక్కో ఫ్లాట్ ఉంది. గ్రౌండ్ ఫ్లోర్‌కి తాళం వేసి ఉంది. పైకి వెళ్లడానికి ఓ పక్క లిఫ్ట్, మరోపక్క మెట్లు ఉన్నాయి. బిల్డింగ్ కాంపౌండ్‌లో వాచ్మెన్ గాని, సీసీటీవీ కెమెరాలు గానీ లేవు. నిశ్చింతగా ఊపిరి పీల్చుకున్నాడు రాజు. బిల్డింగ్‌కి కొద్ది దూరంలో నిల్చొని వినోద్ కోసం ఎదురు చూడసాగాడు. అరగంట గడిచాక మాస్క్ ధరించిన ఓ వ్యక్తి ప్రియా అపార్ట్మెంట్ కాంపౌండ్‌లోకి ప్రవేశించాడు. నేరుగా లిఫ్ట్‌లో పైకి వెళ్లాడు. రాజు వెంటనే ఆ లిఫ్ట్ దగ్గరకు వెళ్లి చూశాడు. అక్కడ కనిపించిన నంబర్‌ను బట్టి ఆ వ్యక్తి రెండో అంతస్తుకి వెళ్లాడని అర్థమైంది రాజుకి. దాంతో ఆ వ్యక్తి వినోద్ అని నిర్ధారించుకున్నాడు. మెట్ల గుండా గబగబా రెండో అంతస్తుకి చేరుకున్నాడు రాజు. ఫ్లాట్ ద్వారాన్ని సమీపించి జేబులోంచి సైలెన్సర్ అమర్చిన పిస్తోల్‌ను బయటకు తీశాడు. చిన్నగా తలుపు నెట్టి చూశాడు. లోపల గడియ లేకపోవడంతో తలుపు తెరుచుకుంది. చప్పుడు చేయకుండా లోపలికి నడిచాడు. ఎదురుగా కన్పించిన దృశ్యం చూసి అదిరిపడ్డాడు రాజు. ఇందాకా లిఫ్ట్‌లో పైకి వచ్చిన మాస్క్ వ్యక్తి పిస్తోల్ పట్టుకొని షూట్ చేసేందుకు పొజిషన్లో నిలబడి ఉన్నాడు. రాజును చూడగానే అతను ట్రిగ్గర్ నొక్కేశాడు. క్షణం ఆలస్యం చేయకుండా అసంకల్పితంగా రాజు చేతిలోని పిస్తోల్ కూడా పేలింది. ఇద్దరూ గురి తప్పలేదు. ఒకరి పిస్తోల్ నుంచి దూసుకొచ్చిన బుల్లెట్ మరొకరి గుండెలోకి చొచ్చుకొని పోయింది. ఇద్దరూ ఆర్తనాదాలు చేస్తూ నేలకొరిగి ప్రాణాలు విడిచారు. ‘నిన్న నగరంలోని గాంధీనగర్‌లో అనూహ్య సంఘటన జరిగింది. ప్రముఖ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ వినోద్ ఫ్లాట్‌లో ఇద్దరు వ్యక్తులు పిస్తోళ్లతో ఒకరినొకరు కాల్చుకుని చనిపోయారు. ఆ సమయంలో వినోద్ ఇంట్లో లేడు. చనిపోయిన ఇద్దరిలో ఒకవ్యక్తిని పాత నేరస్తుడు మహేశ్‌గా గుర్తించారు పోలీసులు. అతనొక సుపారీ కిల్లర్ అని పోలీసుల అనుమానం. ఓ పాతకేసులో విచారణ కోసమని నాలుగు రోజుల కిందటే పోలీసులు అతణ్ణి తీసుకెళ్లారు. కాని సరైన సాక్ష్యాధారాలు లేక నిన్న మధ్యాహ్నం వదిలేశారు. నిన్న సాయంకాలం అతను వినోద్‌ను హతమార్చడానికి ఆ ఫ్లాట్‌కి వెళ్లినట్లు పోలీసులు భావిస్తున్నారు. వినోద్ ఇంటికి చేరేకంటే ముందే మహేశ్ మారు తాళం చెవితో ఆ ఫ్లాట్‌కు వెళ్లి వినోద్ కోసం కాపు కాశాడు. అంతలోకే మరో అజ్ఞాత వ్యక్తి వినోద్‌ను చంపడానికి అక్కడికి వచ్చాడు. ఒకరిని చూసి మరొకరు వినోద్ అని పొరబడి పిస్తోళ్లు పేల్చి ఉంటారని అనుకుంటున్నారు పోలీసులు. బుల్లెట్లు సూటిగా ఇద్దరి గుండెల్లోకి చొచ్చుకుపోవడంతో ఘటనా స్థలంలోనే ప్రాణాలు వదిలారు. ఆ ఇద్దరూ వినోద్‌ను చంపడానికి వచ్చిన సుపారీ కిల్లర్లే అని పోలీసులు అనుమానిస్తున్నారు. వీరికి సుపారీ ఇచ్చిన వారి కోసం గాలిస్తున్నారు. నగరంలోని ఓ బార్‌లోని ఏసీ గదిలో ఉన్న సీసీటీవీ కెమెరా ఫుటేజీలను పరిశీలించాక పోలీసులకు ఓ క్లూ దొరికినట్టు తెలుస్తోంది. దాంతో ఈ హత్య వెనుక గల మిస్టరీని త్వరలో ఛేదిస్తామని పోలీసులు ప్రకటించారు.’ ఢిల్లీలో ఉన్న ప్రకాశ్ టీవీలో వస్తున్న ఈ వార్తను చూడగానే అసహనంతో జుట్టు పీక్కున్నాడు. చదవండి: ఆమె నా భార్య కాదు! -
ఆమె నా భార్య కాదు!
‘‘సార్! ఆమె నా భార్య కాదు!’’ అన్న ఆ వ్యక్తి వంక ఆశ్చర్యంతో చూశాడు క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శివరామ్. ఆ వ్యక్తికి ముప్పయ్యేళ్ళుంటాయి. అతను చెప్పిన వివరాలు ఇవి... అతని పేరు దిలీప్. ఏడాది కిందట ముంబయ్‌కి చెందిన అంజలితో వివాహమయింది. తల్లిదండ్రులు ఓ ప్లేన్ క్రాష్‌లో చనిపోవడంతో కోట్ల ఆస్తికి ఏకైక వారసురాలయిందామె. నాలుగురోజుల కిందట బిజినెస్ టూర్లో చెన్నై వెళ్ళారు దంపతులు. హోటల్ లీలామహల్ ప్యాలెస్‌లో బస చేశారు. నుంగంబాకంలో వున్న తన స్నేహితురాలితో రెండురోజులు గడిపివస్తాననీ చెప్పి వెళ్ళిపోయింది అంజలి. తిరిగిరాలేదు. ఆమె మొబైల్ ఫోన్ అందుబాటులో లేదు. పోలీసు కంప్లెయింట్ ఇచ్చి, ఓ బిజినెస్ డీల్ ఉండడంతో కిందటి రోజే హైదరాబాద్ వచ్చాడు. ‘‘సార్! బేగంపేటలోని హోటల్ వివాంతాలో బస చేశాను. ఈరోజు ఉదయం బైటకు వెళ్ళిన నేను తిరిగి హోటల్‌కు వచ్చేసరికి రాత్రి అయింది. రూమ్ లాక్ తీసి లోపలికి వెళ్లిన నాకు షాక్.. ఓ అపరిచిత యువతి నా బెడ్ రూమ్‌లో పడుకునివుంది! తానే నా భార్యనంటోంది!’’ చెప్పాడు దిలీప్. ఆ కేసు చిత్రంగా అనిపించింది శివరామ్‌కి– ‘ఓ స్త్రీ ..ముక్కూ మొగమూ ఎరుగని పరపురుషుడికి భార్యనని చెప్పుకోవడం సంభవమేనా!?’ అనుకుంటూ ‘‘పదండి, హోటల్‌కి వెళదాం’’ అంటూ కుర్చీలోంచి లేచాడు శివరామ్. ‘‘భగీరథ గారూ! ఆమె నా భార్య కాదు. మీరే నన్ను సేవ్ చేయాలి’’ అన్నాడు దిలీప్. ‘‘మీ భార్య అదృశ్యం గురించి చెన్నయ్ పోలీసులు పరిశోధిస్తున్నారని చెప్పారుగా?’’ అన్నాడు డిటెక్టివ్ భగీరథ. ‘‘ఔను. మీరు చేయవలసిందల్లా ఆ నకిలీ స్త్రీని ఎక్స్పోజ్ చేయడమే’’ చెప్పాడు దిలీప్. వివరాలు అడిగి తెలుసుకుని.. నోట్ చేసుకున్నాడు భగీరథ. ఓ అంశం ఆలోచనలో పడేసిందతణ్ణి. ఇన్స్పెక్టర్ శివరామ్‌ని కలిసిన డిటెక్టివ్ భగీరథకు ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి. ‘ఇంపోస్టర్గా చెప్పబడుతున్న ఆ స్త్రీ వద్ద అంజలి సెల్ ఫోన్ ఉంది. ఆమె సూట్ కేస్ తాళంచెవి కూడా ఉంది. సూట్ కేసులోని దుస్తులు ఆమెకు సరిగ్గా సరిపోతున్నాయి. ఆమె సెల్ఫోన్లో ఉన్న దంపతుల ఫొటో వారిద్దరిదే! చివరకు ఆమె వాట్సాప్ గ్రూప్‌లో పెట్టుకున్న జాయింట్ ఫొటోలో కూడా ఆమె, దిలీప్ ఉన్నారు! అంతేకాదు, అంజలి స్నేహితురాళ్ళకు వీడియో కాల్ చేస్తే, ఆ స్త్రీ అంజలే అని నిర్ధారించారు అందరూ!’ ‘‘ఆ దిలీప్గాడు ఓ నట్లా ఉన్నాడు. స్వంత పెళ్ళాన్ని పట్టుకుని ఇంపోస్టర్ అంటున్నాడు. అతణ్ణి సైకియాట్రిస్ట్‌కి అప్పగించాల్సిందే’’ అన్నాడు శివరామ్. ‘‘ఇందులో ఏదో పెద్ద కాన్స్పిరసీయే ఉందేమోననిపిస్తోంది నాకు’’ అన్నాడు భగీరథ సాలోచనగా. హోటల్ వివాంతాకి వెళ్ళి ఆ స్త్రీని కలిశాడు భగీరథ. తన ఫేస్బుక్ అకౌంట్ తెరిచి, అందులో ఉన్న తమ జాయింట్ ఫొటోగ్రాఫ్‌ని చూపించిందామె. సెల్‌ఫోన్ నుంచి ఎవరికో వీడియో కాల్ చేసింది. అవతల ఒక యువతి పిక్చర్లోకి రాగానే.. ‘‘హాయ్, సరితా!’’ అంది. వెంటనే ఆ యువతి, ‘‘హాయ్, అంజలీ! ఏం చేస్తున్నావే?’’ అనడిగింది నవ్వుతూ. ‘‘ముందు నాకీ విషయం చెప్పవే. మొన్న చెన్నయ్‌లో ఉన్న నాలుగు రోజులూ నేను ఎక్కడ ఉన్నానే?’’ అనడిగింది. ‘‘ మా ఇంట్లోనేగా? ఏం?’’ అంది సరిత. ‘‘దిలీప్‌కి నిజంగానే మతిభ్రమించిందా!?’ అనుకుని విస్తుపోయాడు డిటెక్టివ్. అసిస్టెంట్ భావనను ముంబయ్ పంపించి, తాను చెన్నయ్ వెళ్ళాడు భగీరథ. డీజీపీని కలసి అంజలి ‘అదృశ్యం’ కేసులో పురోగతి లేదని తెలుసుకున్నాడు. అనంతరం హోటల్ లీలామహల్ ప్యాలెస్‌కి వెళ్ళాడు. నిర్ణీత తేదీన దిలీప్ దంపతులు తమ హోటల్లో చెకిన్ అయ్యారనీ, మర్నాటి ఉదయం ఔటింగ్‌కి వెళ్ళారనీ, రెండోరోజు రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఒక్కడే తిరిగివచ్చాడనీ ‘మేడమ్ స్నేహితుల ఇంట్లో వుంద’ని’ బెల్ బాయ్‌తో చెప్పాడనీ వివరించాడు మేనేజర్. వారికోసం అద్దెకారును హోటలే ఏర్పాటు చేసింది. అది వైట్ కలర్ టయోటా కారు. దాని రిజిస్ట్రేషన్ నంబర్: TN–06–CA–5995. సెల్ఫ్–డ్రైవ్. ఆ కారు లాగ్బుక్ని తెప్పించి పరిశీలించాడు భగీరథ. మొదటి రెండురోజుల్లో సుమారు 1100 కిలోమీటర్ల దూరం తిరిగింది. కొడైకెనాల్ గురించి అంజలి తనను కాజ్యువల్‌గా అడిగినట్టు చెప్పింది రిసెప్షనిస్ట్. ‘అంజలి’గా చెప్పుకుంటున్న యువతి ఫొటోను ఆమెకు తెలియకుండా తన సెల్లో తీశాడు భగీరథ. ‘‘దిలీప్‌తో వచ్చిన యువతి ఈమెనే?’ తన సెల్‌లోని ఫోటో చూపించి అడిగాడు హోటల్ సిబ్బందిని. ‘కాదు’ అన్నారు. ముంబై నుంచి భావన పంపించిన అంజలి ఫొటోని చూపిస్తే .. గుర్తుపట్టారు! అద్దెకారులో కొడైకెనాల్కి బైలుదేరాడు భగీరథ. చెన్నయ్–కొడైకెనాల్ నడుమ ఉన్న ఒక్కో టోల్‌ప్లాజా దగ్గరా ఆగి, దిలీప్ దంపతులు కొడైకెనాల్కి వెళ్ళారనుకుంటూన్న తేదీ ఎంట్రీలను పరిశీలించాడు. వైట్‌కలర్ టయోటా కారు వాటిగుండా వెళ్ళినట్టూ, డ్రైవర్ పక్కన ఓ యువతి ఉన్నట్టూ.. మరుసటి రోజున తిరుగు ప్రయాణమైనట్టూ... అప్పుడు కారులో డ్రైవర్ తప్ప ఇంకెవరూ లేనట్టూ... సీసీ కెమేరాలలో నమోదయింది. భగీరథ కొడైకెనాల్ చేరుకునేసరికి రాత్రి అయింది. దాంతో మర్నాడు... దిలీప్ దంపతులు నిర్ణీత తేదీన సెయింట్ మేరీస్ రోడ్లో ఉన్న తామరై కోడై హోటల్లో బస చేసినట్టు తెలుసుకున్నాడు. ఆ దంపతులు నిర్ణీత తేదీన రాత్రి ఏడు గంటల సమయంలో వచ్చారనీ, మర్నాటి ఉదయం ఏడు గంటలకే దిలీప్ ఒక్కడూ వచ్చి చెకవుట్ చేశాడనీ తేలింది. హైద్రాబాద్‌కు తిరిగివచ్చిన డిటెక్టివ్ తిన్నగా ‘అంజలి’గా చెప్పుకుంటున్న ఆ స్త్రీ వద్దకు వెళ్లాడు. తాను సేకరించిన సాక్ష్యాధారాలతో ఆమెను కన్ఫ్రంట్ చేశాడు. ఆరోజు రాత్రి దిలీప్‌తో పాటు డిన్నర్‌కి వెళ్ళలేదు ‘ఆమె’. దిలీప్‌కి ఆమెను చూస్తూంటే పీక పిసికి చంపేయాలన్నంత కోపంగా ఉంది. తన మాటలను ఎవరూ నమ్మడంలేదు. కానీ నిజం తనకు తెలుసు. తనకే తెలుసు! దిలీప్ బార్కి వెళ్ళి బాగా తాగాడు. డిన్నర్ ముగించి సూట్‌కి వచ్చాడు. బెడ్ మీద పడుకుని టీవీలో ప్రోగ్రామ్స్ చూస్తోందామే. ఆవేశం ముంచుకొచ్చిందతనికి. ‘‘చెప్పు, ఎవరు నువ్వు? చెప్పకపోతే చంపేస్తాను!’’ అన్నాడు. ‘‘నీ భార్య అంజలిని!’’ కూల్‌గా అందామె. ‘‘’’నో!’’ గట్టిగా అరచాడతను. ‘నువ్వు అంజలివి కాదు. ఎందుకంటే అంజలి లేదు!’’ ‘‘నా మీద నకిలీ ముద్ర వేసి నా ఆస్తంతా కాజేయాలనుకుంటున్నావు కదూ?’’ కోపంగా అంది. ‘‘నాన్సెన్స్! ఆస్తిని కాజేయాలనుకుంటున్నది నువ్వే. అంజలి చచ్చిపోయింది!’’ రెచ్చిపోయాడు. ‘‘అంత ఖచ్ఛితంగా ఎలా చెప్పగలవ్?’’ ‘‘ఎలా అంటే తనను నేనేం స్వయంగా చంపేశాను కనుక!’’ స్వీటంతా దద్దరిల్లేలా అరిచాడు. ‘‘నువ్వే చంపేశావా?’’ ‘‘ఎస్. కొడైకెనాల్లో సూయిసైడ్ పాయింట్ దగ్గర లోయలోకి తోసేశా’’ ‘‘దట్స్ ఇట్!’’ అంటూ చటుక్కున పైకి లేచిందామె. అదే సమయంలో యాంటీ–రూమ్ నుంచి బైటకు వచ్చారు డిటెక్టివ్ భగీరథ, ఇన్స్పెక్టర్ శివరామ్‌లు. క్రైమ్ బ్రాంచ్ ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్ లో ఆ కేసు పూర్వా పరాలను వివరించాడు డిటెక్టివ్ భగీరథ. ‘రెండేళ్ళ కిందట.. అంజలికి ఫేస్బుక్లో పరిచయమయ్యాడు దిలీప్. ప్రేమ పేరుతో ఆమెను ట్రాప్ చేసి పెళ్ళిచేసుకున్నాడు. ఆస్తిలో సగం తనకు రాసివ్వమని ఒత్తిడిచేయడం మొదలుపెట్టాడు. తన తదనంతరం అతనే వారసుడంటూ దాటవేస్తూ వచ్చిందామె. అంజలిని తొలగిస్తే తప్ప ఆస్తి తనకు సంక్రమించదనుకున్న దిలీప్.. ఆమెను చంపడానికి నిశ్చయించుకున్నాడు. బిజినెస్ టూర్ మీద చెన్నై వెళ్ళారు దంపతులు. కొడైకెనాల్ తీసుకువెళ్ళి, మార్నింగ్ వాక్ సమయంలో సూయిసైడ్ పాయింట్ దగ్గర ఏమరుపాటుగా వున్న అంజలిని క్లిఫ్ మీదనుంచి కిందకు తోసేశాడు దిలీప్. ఆమె చనిపోయిందనుకుని వెంటనే చెన్నయ్‌కి తిరిగివచ్చేశాడు. అదృష్టవశాత్తూ క్లిఫ్ అంచున పెరిగిన ఓ చెట్టుకొమ్మను పట్టుకుని నిలువరించుకుంది అంజలి. ఆమె అరుపులు విన్నవారు ఫైర్ సర్వీస్‌కి ఫోన్ చేయడమూ, వాళ్ళు వచ్చి ఆమెను కాపాడ్డమూ జరిగాయి. ట్రామాకి గురైన అంజలి పైకి రాగానే çస్పృహతప్పి పడిపోయింది. ఆమెను ఓ లోకల్ హాస్పిటల్లో చేర్పించి వైద్యం చేయించారు. మర్నాడు తెలివిలోకి వచ్చిన అంజలికి భర్త హోటల్ గది ఖాళీచేసి వెళ్ళిపోయినట్టు తెలిసింది. దాంతో అతని కుట్ర బోధపడిందామెకు. భుజానికి తగిలించుకున్న హ్యాండ్ బ్యాగ్ జారిపోకుండా వుండడం విశేషం. ఆమె మొబైల్ ఫోన్ అందులోనే ఉంది. చెన్నయ్‌లోని తన స్నేహితురాలికి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పింది. ఆమె వెంటనే కొడైకెనాల్కి వచ్చి అంజలిని తనతో తీసుకువెళ్ళింది. చెన్నయ్‌కి తిరిగివచ్చిన దిలీప్ తన భార్య అదృశ్యమయిందంటూ ఫార్మల్గా పోలీస్ కంప్లెయింట్ ఇచ్చి, హైద్రాబాద్ కి చెక్కేశాడు. ముఖాముఖీ కన్ఫ్రంట్ చేస్తే అతను నేరం ఒప్పుకోడు. రుజువు చేయడం కూడా కష్టమే. అందుకే అతని పద్ధతిలోనే నాటకమాడి ఎక్స్పోజ్ చేయాలని నిశ్చయించుకున్నారు. అంజలి స్నేహితురాళ్లూ అందులో భాగమే. ఒకామె అంజలిగా హైద్రాబాద్‌లో దిలీప్ బసచేసిన హోటల్లో ప్రవేశించడం. ఫేస్బుక్లో, వాట్సాపలో, మొబైల్లో ఫొటోలను మార్ఫింగ్ చేసీ, ఇతరత్రానూ ఆమే అంజలి అంటూ అతనికి పిచ్చెక్కేలా చేశారు. దిలీప్.. డిటెక్టివ్ భగీరథ సాయం కోరింది.. అదృశ్యమైన భార్యను కనిపెట్టడానికి కాదు ఇంపోస్టర్ని ఎక్స్పోజ్ చేయడానికి! అదే డిటెక్టివ్‌లో ఆలోచనలను రేపింది. డిటెక్టివ్ సాయం కోరడం ద్వారా తాను చేసిన నేరం నుంచి తప్పించు కోవచ్చను కున్నాడు. డిటెక్టివ్‌కి తాను తీగనందించాడనీ, అతను డొంకంతా కదల్చగలడనీ ఊహించలేకపోయాడు. పరిశోధన మొదలుపెట్టిన భగీరథ చెన్నయ్, కొడైకెనాల్, నోయిడాలను దర్శించి దిలీప్ నిజస్వరూపాన్ని తెలుసుకున్నాడు. అంజలిగా వచ్చిన యువతి ఇంపోస్టర్ అని గ్రహించాడు. తాను సేకరించిన సమాచారంతో ఆమెను కన్ఫ్రంట్ చేశాడు. దాంతో నిజం చెప్పేసిందామె. దిలీప్ని ఎక్స్పోజ్ చేసేందుకు స్నేహితురాళ్ళు ఆడుతున్న నాటకంగా వివరించింది. డిటెక్టివ్ సలహా ప్రకారం ఆ రోజు రాత్రి డిన్నర్‌కి వెళ్ళలేదామె. దిలీప్ కిందకు వెళ్ళగానే డిటెక్టివ్, ఇన్స్పెక్టర్లు సూట్లో ప్రవేశించి సీక్రెట్ కెమేరాను అమర్చి, బగ్ చేసి, యాంటీ–రూమ్‌లో దాక్కున్నారు. దిలీప్ తిరిగిరాగానే అతన్ని రెచ్చగొట్టవలసిందిగా ఆమెతో చెప్పారు. రెస్ట్ ఈజ్ హిస్టరీ. పోలీసులు అంజలినీ, ఇంపోస్టర్గా వచ్చిన ఆమె స్నేహితురాలినీ ప్రవేశపెట్టడంతో వారిని చూసి తల వంచుకున్నాడు దిలీప్. - తిరుమలశ్రీ -
చనిపోయిన యువతి పేరుతో రాంగ్ మెసేజ్
అప్పుడప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నాడు, లేత కిరణాలు ఒంటికి తాకితే ఆరోగ్యం బాగుంటుందని చిన్నప్పుడు అమ్మమ్మ చెప్పేది. నోట్లో వేసుకున్న టూత్ బ్రష్ వేసుకొని.. మరో చేత్తో సెల్‌ఫోన్ పట్టుకుని డాబాపై అటూ ఇటూ తిరుగుతున్నాను. మెసేజ్ వచ్చినట్టు అలర్ట్ టోన్ మోగితే చూసుకున్నాను. ఆశ్చర్యం వేసింది. మరో వైపు ఆనందం. చిన్నపాటి గొడవతో విడిపోయిన నళిని ‘ఎలా వున్నారు?’ అంటూ మెసేజ్ చేసింది. ఇక నా సంతోషం అవధులు దాటింది. ‘బాగున్నాను, నువ్వెలా వున్నావ్?’ అంటూ రిప్లై ఇచ్చాను. తిరిగి సమాధానం రాకపోయినా.. చాలా రోజుల తర్వాత నళిని నన్ను అర్థం చేసుకుందన్న సంబరంలో మునిగిపోయాను. ఈ విషయం వెంటనే స్నేహితుడు రాకేష్‌కి చెప్పాలి. ఎందుకంటే మేమిద్దరం దూరంగా వుంటూ ఒకరినొకరం ఇష్టపడుతుంటే మమ్మల్ని కలిపింది వాడే. ఏదో చిన్న మాటతో నోరు జారిన కారణంగా దూరంగా వుండిపోయింది నళిని. ఆ రోజు నుండి ఇద్దరం కలవడం లేదు. దీపావళి వచ్చినంత వెలుగొచ్చింది నా ముఖంలో. ఇక ఆలస్యం చేయలేదు చకచకా రెడీ ఐపోయి రాకేశ్ దగ్గరకు పరుగులు పెట్టాను. తోటలో చెట్లకు నీళ్ళు పడుతున్నాడు రాకేశ్. వాడి చేతిలోని నీటి పైపు లాగేసి, పక్కకు తీసుకువెళ్లి మెసేజ్ చూపించాను. వాడు చాలా హ్యాపీగా ఫీలయ్యాడు. ‘ఇద్దరూ మళ్లీ కలవబోతున్నారన్నమాట. సంతోషకరమైన వార్త తెచ్చావ్. నాకేమిస్తావ్?’ అని అడిగాడు రాకేశ్. ‘ఏం కావాలన్నా ఇస్తా.. అడుగు’ అన్నాను. ‘పార్టీ చేసుకుందాం.. చాలా రోజులైంది కదా! ఇన్నాళ్లూ బాధలో వున్నాం అది తీరిపోయింది. ఏమంటావ్?’ అన్నాడు రాకేశ్. ‘అంతేకదా..! నళిని మళ్ళీ నాతో మాట్లాడింది అంటే ఇంతకన్నా ఏం కావాలి? నీకు తెలుసుగా ఆమెను ఒక్కరోజు కూడా వదిలి వుండేవాణ్ణి కాదు. పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయ్యాను. తను హఠాత్తుగా దూరం అయ్యేసరికి ఇన్నాళ్లూ మనసు మనసులో లేదు. ఇప్పుడు కాస్త కుదుట పడింది. ఫుల్ పార్టీ చేసుకుందాం’ రెట్టింపు ఆనందంతో అన్నాను. ‘ఓకే డన్’ అన్నాడు రాకేశ్. ఆరోజు ఒక మోస్తరుగా వర్షం పడుతోంది. లంచ్ పార్టీయే పెట్టుకుందామని రాకేశ్ అనేసరికి ఆ రోజు డిసైడ్ చేసుకున్నాం. వాడిని డైరెక్ట్‌గా వెన్యూ దగ్గరకే రమ్మన్నాను. కాని వాడు ‘కలిసే వెళ్దాంలే.. రెడీగా ఉండు.. పికప్ చేసుకుంటా’ అన్నాడు. గొడుగు పట్టుకుని వసారాలోకి వచ్చి ఆగిపోయాను ‘ఇంత వర్షంలో ఎక్కడికిరా’ అన్న నాన్న మాటతో. ఆ ప్రశ్న నా కాళ్ళకు అడ్డం పడింది. అంతలోపే మళ్లీ మెసేజ్ టోన్... ఆత్రుతగా ఫోన్ తీసి చూసుకున్నాను. ‘ఈవాళ సాయంత్రం టెంపుల్ దగ్గరకు వస్తున్నాను అక్కడ కలుద్దాం బై’ అంటూ నళిని పెట్టిన మెసేజ్. అంతే... నాన్న మాటను పట్టించుకోకుండా చకచకా బయటికి వచ్చానో లేదో రాకేశ్ కారు ఆగింది మా ఇంటి ముందు. ఎక్కి కూర్చున్నాను. అంతకు ముందే వచ్చిన నళిని మెసేజ్ సంగతి చెప్పాను వాడితో. ‘ఓహో.. ఈరోజు డబుల్ ధమాకా అన్నమాట. ఇక్కడ పార్టీ అక్కడ మీటింగ్’ అన్నాడు. ‘నా బాధలో, సంతోషంలో భాగం పంచుకునే నీలాంటి ఫ్రెండ్ దొరికినందుకు హ్యాపీగా వుందిరా’ అప్రయత్నంగా నా కళ్లు చెమ్మగిల్లాయి. అది బెంగళూరు బైపాస్ రోడ్డు పక్కనే ఉన్న హోటల్. పార్కింగ్లాట్లో కారు పార్క్ చేసి నేరుగా హోటల్ లోపలికెళ్ళి కూర్చున్నాం. నేను చికెన్, మందు రెండింటిని వద్దనుకొని.. రోటి స్పెషల్ ఆర్డర్ పెట్టాను. ‘ నువ్వు నాతో పాటు తిని తాగకపోతే.. నాకు కిక్కేముంటుంది చెప్పు’ అంటూ అసహనం వ్యక్తపరిచాడు రాకేశ్. ‘వద్దురా.. నళిని టెంపుల్‌కు రమ్మంది. చికెన్ తిని వెళ్లలేను. అసలే ఒక మిస్ అండర్‌స్టాండ్ తర్వాత కలవబోతున్నాను తనను.. తాగి కలవలేనురా...’ అంటూ వాడికి సర్ది చెప్పాను. మా సీటింగ్‌కి ఎదురుగా గోడ గడియారం ఉంది. అప్పుడప్పుడూ దానికేసి చూస్తూ కాలాన్ని లెక్కిస్తున్నాను. రెండు గంటలు దాటిపోయింది.. రాకేశ్ నింపాదిగా వున్నాడు. బిల్లు చెల్లించి బయటకు వచ్చేశాం. నళినిని కలవాల్సిన టైమ్‌కి ఇంకో గంట మాత్రమే ఉండటంతో కారు వేగంగా పోనిస్తున్నాడు రాకేశ్. నళిని చెప్పిన టెంపుల్ రానేవచ్చింది. అక్కడ నన్ను దింపేసి ‘ బెస్ట్ ఆఫ్ లక్ ‘ చెప్పి వెళ్ళిపోయాడు రాకేశ్, టెంపుల్ ఆవరణలో ఉన్న ఒక చిన్న అరుగు మీద కూర్చుని నళిని కోసం ఎదురు చూడసాగాను. నన్ను అయిదింటికల్లా రమ్మన్న నళిని అయిదుంపావు అయినా తాను రాలేదు. పొద్దున మెసేజ్ వచ్చిన నంబర్ కు కాల్ చేశాను స్విచ్ ఆఫ్ వస్తోంది. ‘ఎక్కడ వున్నావు నళినీ?’ అని మెసేజ్ పంపాను. ఉహూ.. రిప్లయ్ లేదు. ఆరు గంటలు దాటి చీకటి ఆవరిస్తోంది. చాలా సార్లు కాల్ చేసాను.. స్విచ్ ఆఫ్ అనే వస్తోంది తన ఫోన్. అరుగు మీద నుంచి లేచి ఇంటి ముఖం పట్టాను నిరాశగా. ఆరోజు బయట వసారాలో కూర్చున్నా.. నళిని ఆలోచనలు చుట్టుముట్టాయి. ‘వస్తానని ఎందుకు రాలేదు.. నళిని ఎందుకిలా చేసింది?’ ఇద్దరం సఖ్యంగా ఉన్న రోజుల్లో... చెప్పిన సమయం కంటే పది నిమిషాలు ముందే వచ్చేది. నేను ఆలస్యమైతే గొడవ పడేది. మరి ఇప్పుడెందుకు నన్ను రమ్మని చెప్పి తను రాలేదు.. పైగా సెల్ ఫోన్ ఆఫ్ చేసింది?’ అని అనుకుంటూండగా తలపై ఎవరో తడిమినట్టు అనిపిస్తే తల ఎత్తి చూశాను. చేతిలో చిల్లర పట్టుకుని నన్నే గమనిస్తోన్న అమ్మ.. ‘ఈమధ్య నీ తల పూర్తిగా పాడైనట్టుంది పక్కన పిడుగు పడినా కదిలే పరిస్థితిలో లేవు ఏమైందిరా?’ అడిగింది. ‘నాకేం బాగానే వున్నాను’ అన్నాను చాలా క్యాజువల్‌గా. ‘సర్లే.. ఇదిగో ఈ చిల్లర పట్టుకెళ్ళి పాల పాకెట్ పట్టుకురా. తొందరగా వచ్చెయ్ మీ నాన్న ఆఫీసుకెళ్ళాలి’ అంటూ నన్ను తరిమింది. పాలడైరీ దగ్గరకు వెళుతుంటే మెసేజ్ రింగ్ టోన్ వినిపించే సరికి చప్పున ఆగిపోయి జేబులోంచి ఫోన్ తీసి చూసాను. ‘సారీ.. బంగారు మొన్న నేను రాలేకపోయాను. ఇప్పుడు కాలేజీ దగ్గరకు రాగలవా?’ నళిని మెసేజ్. క్షణం ఆలస్యం చేయకుండా వెంటనే కాలేజ్ దగ్గరకు పరుగు పెట్టాను. అక్కడ నళిని కనిపించలేదు, గ్రౌండ్ మొత్తం వెతికా.. ప్రయోజనం లేదు. అదే నంబర్‌కు మళ్లీ కాల్ చేస్తే.. స్విచ్ ఆఫ్. నళిని ఎందుకిలా చేస్తోందో అర్థం కావడం లేదు, ఇంటి దగ్గర నుండి ఫోన్. గుండె గుభేలుమంది. పాలు తీసుకొని గబగబా ఇంటికి వెళ్ళాను, అమ్మ గురాయించి చూసింది. పాలు ఆలస్యం అయినందుకు నాన్న ఆఫీసుకు వెళ్ళిపోయారట. ‘వస్తానంటుంది రాదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ ఉంటుంది. నళిని నాతో ఎందుకిలా ఆడుకుంటోందో అర్థం కావట్లేదురా’ రాకేశ్‌తో నా బాధను చెప్పుకున్నాను. ఏం చెప్పాలో వాడికీ అర్థం కానట్టుంది. అందుకే వాడు మౌనంగా వుండిపోయాడు. మరోసారి.. షాపింగ్ మాల్‌కు రమ్మని మెసేజ్ చేసింది.ఈసారి ఒక్కణ్ణే వెళ్ళకుండా రాకేష్‌ని కూడా వెంట తీసుకెళ్ళాను. షాపింగ్ మాల్ మొత్తం జల్లెడ పట్టాం నళిని కనిపించలేదు. ఇద్దరి సెల్ఫోన్ల నుంచి కాల్ చేశాం. ఫోన్ పని చేయడం లేదు, మెసేజ్ మాత్రం వస్తోంది. వెంటనే కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తోంది. ‘ఏంటీ మాయ?’ జుట్టు పీక్కున్నంత పనైంది మాకు. తిరిగి ఇళ్ళకు వెళ్ళిపోయాం. ఆ రాత్రి నిద్రపోలేదు.. సెల్ ఫోన్ పక్కనే పెట్టుకున్నాను. సరిగ్గా అర్ధరాత్రి పన్నెండు గంటలప్పుడు ఒక మెసేజ్ వచ్చింది. ‘నువ్వు చాలా ఫీలయ్యావని నాకు తెలుసు.. నిన్ను కలవాలని అనుకున్న ప్రతిసారీ ఏదో ఒక సమస్య వచ్చి పడుతోంది.. అమ్మకు ఆరోగ్యం నిలకడగా లేదు హాస్పిటల్లో వున్నాం. అర్జెంట్‌గా పదివేలు కావాలి. సర్దగలవా ప్లీజ్.. నా అకౌంట్ నంబర్ పంపిస్తా.. ప్లీజ్..’ అంటూ మెసేజ్ పెట్టింది. ‘ఏ హాస్పిటల్’ అని వెంటనే నేనూ మెసేజ్ పెట్టాను. తిరిగి జవాబు రాలేదు. ’ ఇప్పటికిప్పుడు పదివేలు అంటే ఎలా ?’ అనే ఆలోచనతోనే ఆ రాత్రి గడిచిపోయింది. తెల్లవారగానే తెలిసిన వాళ్ల నుంచి పదివేలు అప్పు తీసుకుని రాకేశ్ దగ్గరకు వెళ్లా.. విషయం చెప్పా. ‘అయ్యో పాపం! ఇలాంటప్పుడే ఆదుకోవాలిరా.. అప్పుడే నీది నిజమైన ప్రేమ అనిపించుకుంటుంది.. పదా వెళ్దాం’ అంటూ నన్ను బయలుదేరదీశాడు రాకేశ్. బ్యాంక్‌కి వెళ్ళి నళిని ఖాతాలో డబ్బు జమ చేశాను. అంతే మళ్లీ వారం దాకా ఆమె నుంచి మెజేస్ రాలేదు. తర్వాత ఎప్పుడో ఒకరోజు మెసేజ్ వచ్చింది.. ‘పార్క్‌లో నీకోసం వెయిటింగ్’ అంటూ. పరుగులు పెట్టి వెళితే పార్క్ గేట్‌కు తాళం కనిపించింది. నళిని కనిపించలేదు. విసిగిపోయి ఇంటికి వచ్చేశాను. మేమిద్దరం స్నేహంగా ఉన్న రోజుల్లో నళిని తన ఇంటి చిరునామా కార్డ్ ఇచ్చినట్టు గుర్తు. అప్పుడు వెళ్ళలేక పోయాను. ఇప్పుడు ఆ కార్డ్ ఎక్కడుందో? పాత పుస్తకాలన్నీ తిరగేసాను. దొరికింది. ఆలస్యం చేయకుండా బయలుదేరాను. ఆ ఇంటి ముందు ఒక పెద్దాయన వాలు కుర్చీలో కూర్చుని ఉన్నాడు. వెళ్ళి పలకరించాను. ‘ఎవరు కావాలి బాబూ?’ అడిగాడతను, ‘నళినిగారు వున్నారాండి?’ అడిగాను. ఆ మాటకు అతను కుర్చీలోంచి లేచి ఇంట్లోకి నడిచాడు. వెనకే నేను. ‘అదిగో బాబూ.. నా మనుమరాలు నళిని..’ అంటూ గోడ వైపు చూపించాడు. అంతే.. నా కాళ్ల కింద భూమి కంపించినట్టు.. ఆకాశం విరిగి నెత్తిన పడినట్టు స్థాణువైపోయా. పూలదండ వేలాడుతూ నళిని ఫొటో. ‘చాలా రోజులైంది బాబూ..’ కళ్ల నిండా నీళ్లు. గొంతు జీరబోతుండగా చెప్పాడు అతను. ఎవరో హత్య చేశారంట.. ఆనవాళ్ళు కూడా దొరక్కుండా. నాకు వస్తున్న మెసేజ్‌ల గురించి అతనితో చెప్పాను. బ్యాంకులో వేసిన డబ్బు సంగతి సహా. విస్తుపోయాడు అతను. మొత్తానికి ఏదో జరుగుతోంది. నళిని కుటుంబసభ్యులతో కలిసి ఎంక్వయిరీ దిశగా అడుగులు వేశాను. ఆమె అకౌంట్ డీటైల్స్ తీసుకున్నాం. గత ఎనిమిది నెలలుగా ఆగిపోయిన లావాదేవీలు నేను వేసిన పదివేలుతో మొదలైనట్టు తెలిసింది. అదే బ్యాంక్ ఏటీఎమ్‌లో డబ్బు అయినట్టూ తేలింది. విత్ డ్రా ఫాంలో వున్న సమయాన్ని బట్టి సీసీ కెమెరా ఫుటేజ్‌ను గమనిస్తే.. అరవై ఏళ్ళు నిండిన పెద్దాయన ఆ డబ్బు డ్రా చేసినట్టు కనిపిస్తోంది. నిద్రాహారాలు ఎగిరిపోయాయి నాకు. ఎవరు అతను? ఈ మిస్టరీని రాకేశ్‌తో షేర్ చేసుకుందామనుకుంటే సమయానికి వాడు అందుబాటులో లేడు. కొంత సస్పెన్స్ అనుభవించాక మొత్తానికి డబ్బు డ్రా చేసిన పెద్దాయన దొరికాడు. ‘అతనెవరో తెలీదు బాబు.. డబ్బు డ్రా చేసుకురా.. నీకు ఐదు వందలు ఇస్తానని, కార్డు, పిన్ నంబర్ ఇచ్చాడు. ఏటీఎంలో డబ్బు తీసి అతని చేతిలో పెట్టాను’ చెప్పాడు ఆ పెద్దాయన. ‘అతను ఎక్కడ వుంటాడో తెలుసా?’అడిగాను. ‘రండి .. చూపిస్తా’ అంటూ ఊరికి దూరంగా వున్న ఓ బంగ్లా వైపు తీసుకెళ్ళాడు అతను. అక్కడ కొంతమంది పేకాడుతూ కూర్చున్నారు. ‘అదిగో ఆ గళ్ళ చొక్కా వేసుకున్నాడే.. అతనే’ అని చూపించాడు ఆ పెద్దాయన. కళ్లు తిరిగినంత పనైంది నాకు. ఎవరో కాదు వాడు రాకేశే... నమ్మలేక పోయా. పోలీసులకు కంప్లయింట్ ఇవ్వడంతో గుట్టు మొత్తం బయట పడింది. నళిని నన్ను ప్రేమించడాన్ని వాడు జీర్ణించుకోలేకపోయాడు. తన కోరిక తీర్చమని నళిని వెంట పడ్డాడు. ఆమె వినకపోవడంతో ఓ పథకం ప్రకారం.. సాక్ష్యం దొరకనివ్వకుండా నళినిని చంపేశాడు. కూతురే పోయాక .. పోలీసులు, కేసులు ఎందుకని మిన్నకున్నారు నళిని తల్లిదండ్రులు. వాళ్ల నిస్సహాయతను రాకేశ్ ఆసరాగా తీసుకొని నళిని సెల్‌ఫోన్ దగ్గర పెట్టుకొని నాతో ఆడుకున్నాడు ఇన్నాళ్లూ. నా శ్రేయోభిలాషిగా నటిస్తూ నాకే ద్రోహం తలపెట్టాడు రాకేశ్. తట్టుకోలేకపోయా. వాడు జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు.. కాని వాడు నళిని తల్లిదండ్రులకు, నాకు మిగిల్చిన శోకం మాత్రం తీరేది కాదు. ‘ స్నేహం చేస్తే గుడ్డిగా నమ్మకూడద’ని మా అమ్మమ్మ అంటుండేది.. ఆ మాట నా కళ్లు తెరిపించింది. - నరెద్దుల రాజారెడ్డి -
నీలిమకి ఎవరో అజ్ఞాత ప్రేమికుడు
అరగంట క్రితమే తెల్లవారింది. ఇన్స్పెక్టర్ విజయ్ బృందావన్ పార్కులో చేరుకునేసరికి అప్పటికే అక్కడున్న పోలీస్‌లు, ఫోరెన్సిక్ నిపుణులు తమ పనుల్లో నిగమగ్నమై ఉన్నారు. పార్కు చివర గుబురు చెట్ల మధ్య నేలపై ఓ యువకుడి మృతదేహం బోర్లా పడివుంది. పదునైన కత్తితో గొంతు కోయడం వల్ల యువకుడు మరణించాడని చూడగానే తెలుస్తోంది. అతడి వయసు 30 ఏళ్లు ఉండొచ్చు. శవాన్ని ముందుగా చూసి పోలీసులకు సమాచారం అందించిన తోటమాలిని ప్రశ్నించాడు విజయ్. ‘‘సార్, నేను ఎప్పటిలాగే తెల్లవారినప్పుడు పార్కంతా తిరుగుతూ ఇక్కడికొచ్చి చూస్తే ఈ దృశ్యం కనిపించింది. మొదట ఇతడు తప్పతాగి ఇక్కడ పడుకున్నాడునుకున్నాను. కాని గడ్డకట్టిన రక్తం చూడగానే విషయం అర్థమైంది. వెంటనే పోలీసులకు ఫోన్ చేశాను’’ అన్నాడు తోటమాలి.తర్వాత శవం జేబులో ఉన్న ఐడీ కార్డ్ ఆధారంగా పోలీసులు ఆ యువకుడి వివరాలు సేకరించారు. అతడి పేరు మహేష్. నగరంలోని ఓ కాల్ సెంటర్లో పనిచేస్తున్నాడు. మరో నెల రోజుల్లో నీలిమ అనే యువతితో అతడి పెళ్లి జరగాల్సి ఉంది. అంతలోనే ఈ ఘోరం జరిగిపోయింది. ఇన్స్పెక్టర్ విజయ్ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టాడు. హంతకుడు మహేష్ జేబులోని డబ్బు, సెల్‌ఫోన్ ముట్టుకోలేదు కాబట్టి ఈ హత్య దోపిడీ కోసం జరగలేదని అతడు నిర్ధారణకొచ్చాడు. మహేష్ కుటుంబ సభ్యుల్ని విచారిస్తే మహేష్‌కి ఎవరితోనూ వైరం లేదని తెలిసింది. మహేష్ తన కాల్సెంటర్లో పనిచేసే నీలిమను ప్రేమించాడని, నెలరోజుల్లో పెళ్లివుందనగా ఈ హత్య జరిగిందని వారు తెలిపారు. దాంతో ఈ హత్యకు మహేష్ పెళ్లితో సంబంధం ఉందని విజయ్‌కి అనుమానం కలిగింది. వెంటనే నీలిమ ఇంటికి వెళ్లాడు. ఆ ఇంట్లో నీలిమతో పాటు ఆమె ఇద్దరు చెల్లెళ్లు, తండ్రి చలపతిరావు ఉన్నారు. చలపతిరావు గతంలో మిలటరీలో పనిచేశాడు. తీవ్రవాద దాడిలో ఓ చేతిని కోల్పోయాడు. నీలిమ డిగ్రీ వరకు చదువుకొని కాల్సెంటర్లో పనిచేస్తోంది. ఆమె చెల్లెళ్లు ఒకరు ఇంటర్, మరొకరు పదో తరగతి చదువుతున్నారు. చలపతిరావు తన గురించి చెప్పుకున్నాడు. ‘‘టెర్రరిస్ట్ ఎటాక్‌లో నా ఎడమ చెయ్యి పోయింది. నాకు పరిహారంగా ప్రభుత్వం ఇచ్చిన డబ్బుతో పిల్లల్ని చదివించాను. అవసరార్థం పలుచోట్ల నైట్ వాచ్‌మెన్‌గా పనిచేశాను. నాలుగేళ్ల క్రితం అనారోగ్యంతో నా భార్య మరణించింది. డిగ్రీ పూర్తిచేశాక నీలిమకు గత ఏడాది కాల్సెంటర్లో ఉద్యోగం వచ్చింది. కొద్ది రోజుల క్రితమే ఆమె పెళ్లి నిశ్చితార్థం జరిగింది. అంతలోనే ఈ ఘోరం జరిగింది’’ అన్నాడు బాధగా. విజయ్ నీలిమను పక్కకి పిల్చుకెళ్లి ప్రశ్నించాడు. ‘‘నిన్ను ఎవరైనా ప్రేమిస్తున్నారా? నీ పెళ్లి మహేష్‌తో జరగటం ఇష్టం లేక అతన్ని హత్య చేశారని అనుమానంగా ఉంది’’ అన్నాడు.‘‘నన్ను ఎవరూ ప్రేమించడం లేదు. ఒక వేళ ప్రేమించినా దాని కోసం ఇంతటి ఘాతుకానికి పాల్పడతారని నేననుకోను. ఈ హత్య వెనక వేరే కారణం వుందనిపిస్తోంది’’ అంది. ఆమె ఏదో విషయం దాస్తున్నట్లు విజయ్‌కి అనుమానం కలిగింది. అయినా ఆమెను మళ్లీ ప్రశ్నించకుండా ఆ ఇంట్లో నుంచి బయటికొచ్చాడు. బయటకొచ్చాక చుట్టుపక్కల ఇళ్లలో నీలిమ గురించి కూపీ లాగాడు. అప్పుడొక కొత్త సంగతి బయటపడింది. అదేమంటే ఏడాది క్రితమే ఓ దూరపు బంధువుతో నీలిమకు పెళ్లి సంబంధం కుదిరింది. అబ్బాయి పేరు మోహన్. అయితే పెళ్లికి కొద్ది రోజుల ముందే మోహన్ ఆత్మహత్య చేసుకున్నాడు. దానికి కారణమేంటో ఎవరకీ తెలియదు. ఈ విషయం గురించి నీలిమగానీ, ఆమె తండ్రిగానీ విజయ్‌కి చెప్పలేదు. రెండు సార్లు పెళ్లికి ముందే పెళ్లికొడుకు చనిపోయాడని ప్రచారమైతే నీలిమకు ఇక సంబంధాలు రావని భయపడ్డారు కాబోలు. అయితే మోహన్ ఆత్మహత్యకు, మహేష్ హత్యకు ఏదో లింక్ ఉందని విజయ్‌కి అనుమానం కలిగింది. నీలిమకి ఎవరో అజ్ఞాత ప్రేమికుడు ఉండొచ్చు. మోహన్, మహేష్‌ల చావులకు అతనే కారణం కావొచ్చు. ఈ ఆలోచన రాగానే విజయ్ ఏడాది క్రితం మోహన్ ఆత్మహత్య కేసు నమోదు అయిన పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి ఆ కేసు వివరాలు సేకరించాడు. నగరానికి దూరంగా ఓ పల్లెలో ఉంటున్న మోహన్ కుటుంబ సభ్యుల్ని కలిసి మాట్లాడాడు. అప్పుడు తెల్సిందేమంటే మోహన్ నగరంలోని ఓ షాపింగ్‌మాల్‌లో పనిచేసేవాడు. నగరం పొలిమేరల్లో ఓ గది అద్దెకు తీసుకొని వుండేవాడు. తనకు దూరపు బంధువైన నీలిమను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. నీలిమ పెళ్లికి రాజీ కావడంతో నిశ్చితార్థం జరిగింది. ఇంకా కొద్ది రోజుల్లో పెళ్లి ఉందనగా మోహన్ ఓ రోజు రాత్రి తన గదిలో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ సమయంలో గదికి లోపల నుంచి గడియవేసి ఉండటంతో పోలీసులు దీన్ని ఆత్మహత్యగా భావించారు. కాని మోహన్ అకారణంగా ఎందుకు ఆత్మహ్యత చేసుకున్నాడో ఇంతవరకు బయటపడలేదు. అయితే డిగ్రీ వరకు చదువుకున్న మోహన్ సూసైడ్‌నోట్ కూడా రాయకుండా ఆత్మహత్య చేసుకోవడం విజయ్‌కి అసహజంగా తోచింది. పైగా మోహన్ చావుకి కారణమైన విషం పొటాషియం సైనేడ్ అతడికి ఎవరిచ్చారో అంతుపట్టలేదు. మొత్తం మీద ఇది ఆత్మహత్య కేసు కాదనపించింది. ఎవరో మోహన్‌ను తెలివిగా హత్యచేసి దాన్ని ఆత్మహత్యగా మార్చారనిపించింది. ఈ పని నీలిమని మూగగా ప్రేమించే ఏ అజ్ఞాత ప్రేమికుడో చేసినట్టున్నాడు. అతడు ఇప్పటి వరకు నీలిమను పెళ్లి చేసుకోవాలనుకున్న ఇద్దర్ని చంపాడు. ఇప్పుడు మూడో వ్యక్తి పెళ్లికి సిద్ధమైతే అతడిని కూడా చంపవచ్చు. ఈ ఆలోచన రాగానే విజయ్‌కి ఓ ఐడియా తట్టింది. తన ఆలోచనని అమలు చేయడానికి విజయ్ కొత్తగా ఉద్యోగంలో చేరినో ఎస్సైని ఎన్నుకున్నాడు. అతడిపేరు వినోద్. ఇంకా పెళ్లి కాలేదు. విజయ్ వినోద్‌కి తన పథకం గురించి వివరించగానే అతడు ఉత్సాహంగా ఒప్పుకున్నాడు. పథకం ప్రకారం వినోద్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా నీలిమకి పరిచయమయ్యాడు. ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. కొద్ది రోజుల్లో ఇద్దరి మధ్య చనువు పెరిగింది. ఓ రోజు వినోద్ నీలిమ ముందు పెళ్లి ప్రతిపాదన తీసుకొచ్చాడు. నీలిమ నివ్వెరబోయింది. తన తండ్రిని అడిగి అభిప్రాయం చెబుతానని చెప్పింది. ఓ వారం తర్వాత రాత్రి పదిగంటలకు వినోద్ తన ఇంట్లో ఉన్నప్పుడు అతడి సెల్‌ఫోన్‌కి ఒక మెసేజ్ వచ్చింది. ‘మన పెళ్లి గురించి అర్జెంట్‌గా నీతో మాట్లాడాలి. గాంధీ నగర్లో పాడుబడ్డ మఠం దగ్గరికి వెంటనే వచ్చేయ్. నా ఫోన్ స్విచాఫ్ అయింది. అందుకే అందుకే ఫ్రెండ్ ఫోన్ నుంచి మెసేజ్ పంపుతున్నాను’ అని వుందా మెసేజ్‌లో. పంపిన వారి పేరు లేకపోయినా అది నీలిమ పంపిన మెసేజ్ అని ఇట్టే గ్రహించాడు వినోద్. ఎందుకైనా మంచిదని నీలిమ నంబర్‌కి రింగ్ చేశాడు. ఫోన్ స్విచ్ఆఫ్ అని వచ్చింది. వెంటనే ఇన్స్పెక్టర్ విజయ్‌కి ఫోన్ చేసి తనకొచ్చిన మెసేజ్ గురించి చెప్పాడు. అప్పుడు విజయ్ ‘నువ్వు ఆ మఠం దగ్గరికెళ్లు. ఏం జరుగుతుందో చూద్దాం. బీ కేర్ ఫుల్’’ అన్నాడు. వినోద్ వెంటనే తన బైకుపై మఠం దగ్గరికి చేరుకున్నాడు. కానీ అక్కడ నీలిమ కనపడలేదు. అక్కడంతా నిర్మానుష్యంగా ఉంది. వినోద్ ఓ పక్కన నిల్చొని ఎదురుచూడ సాగాడు. ఆలోగా అక్కడికి చేరుకున్న విజయ్ వినోద్ దగ్గరికెళ్లకుండా ఓ చెట్టుచాటున నిల్చొని ఏం జరుగుతుందా? అని ఆసక్తిగా చూడసాగాడు. కొద్ది నిమిషాలయ్యాక ఒంటి నిండా శాలువా కప్పుకున్న ఓ వ్యక్తి వినోద్ దగ్గరికి రావడం కనిపించింది. అతడు కాసేపు వినోద్‌తో మాట్లాడాడు. అంతలోనే హఠాత్తుగా ఓ పొడవాటి కత్తి బయటకు తీసి వినోద్‌ను పొడవబోయాడు. కానీ వినోద్ అప్రమత్తంగా ఉండటం వల్ల కత్తి వేటు తగలకుండా పక్కకి జరిగాడు. వినోద్ అతడి చేతిలో కత్తిని లాక్కున్నాడు. శాలువా తొలగి పోవడంతో ఆ వ్యక్తి ముఖం స్పష్టంగా అతనెవరో కాదు, నీలిమ తండ్రి చలపతిరావు! తర్వాత ఇంటరాగేషన్‌లో చలపతిరావు తన నేరాన్ని అంగీకరించాడు. ‘‘టెర్రరిస్టు దాడిలో నేను చెయ్యి పోగొట్టుకున్న తర్వాత సైన్యం నుంచి నాకు రిటైర్మెంట్ ఇచ్చారు. నష్టపరిహారంగా అందిన సొమ్ము కొన్నాళ్లకు ఖర్చయిపోయింది. దాంతో చాలా చోట్ల వాచ్‌మెన్‌గా పని చేశాను. ఒక చెయ్యి లేకపోవడం వల్ల తొందరగా పని దొరికేది కాదు. దొరికినా తక్కువ జీతం ఇచ్చేవారు. నాలుగేళ్ల క్రితం సరైన చికిత్స లేక నా భార్య అనారోగ్యంతో మరణించింది. నా వద్ద డబ్బు ఉంటే ఆమెను కాపాడుకునే వాణ్ణి. ఎలాగోలా పెద్దమ్మాయిని నీలిమను మాత్రం డిగ్రీ వరకు చదివించాను. గత ఏడాది ఆమెకు ఉద్యోగం రావడంతో మా జీవితం గాడిన పడింది. కానీ నీలిమ అందగత్తె కావడమే నాకు శాపమైంది. ఆమెను పెళ్లాడటానికి కుర్రాళ్లు ఎగబడ్డారు. ఆమె పెళ్లిచేసుకొని వెళ్లిపోతే ఇద్దరు పిల్లల చదువులు ఆగిపోతాయని నాకు భయమేసింది. అందుకే ఆమెకొచ్చే పెళ్లి సంబంధాలను ఏదో ఒక సాకుతో తిరస్కరించేవాణ్ణి. కానీ మా దూరపు బంధువుల అబ్బాయి మోహన్ సంబంధాన్ని తిరస్కరించలేకపోయాను. పైగా తన పెళ్లి కాగానే ఇద్దరు చెల్లెళ్లను చదువులు మాన్పించి ఓ బట్టల షాపులో పనికి పంపిస్తానని నీలిమ చెప్పడంతో నాకు పుండుమీద కారం చల్లినట్టు అయింది. మోహన్ని హత్య చేసైనా సరే, ఈ పెళ్లి జరక్కుండా ఆపాలనుకున్నాను. అందుకే గతంలో నేను పని చేసిన ఓ ల్యాబ్‌లో నుంచి రహస్యంగా పోటాషియం సైనైడ్ దొంగిలించి రాత్రి పూట మోహన్ గదికి వెళ్లాను. ముందుగా అతడికి నా పరిస్థితి వివరించి రెండు మూడేళ్లు పెళ్లి వాయిదా వేద్దామని కోరాను. దానికతను ఒప్పుకోలేదు. అయినా నేను కోప్పడలేదు. అవకాశం కోసం ఎదురు చూశాను. అంతలో అతడు బాత్రూంలోకి దూరాడు. నేను వెంటనే అతడి వాటర్ బాటిల్లోకి సైనేడ్ వేసిసి బయటికెళ్లిపోయాను. తర్వాత అంతా నేను ఊహించినట్టే జరిగింది. నాపైన ఎవరికీ అనుమానం రాకపోవడంతో నాకెంతో ధైర్యం వచ్చింది. అదే ధైర్యంతో మహేష్‌ని కూడా హతమార్చాను. మహేష్ నీలిమని తరచుగా బృందావన్ పార్కులో చీకటి పడ్డాక కల్సుకొనేవాడు. వాళ్లిద్దరు చాలసేపు కబుర్లు చెప్పుకొని ఒకరి తర్వాత ఒకరు ఇళ్లకు వెళ్లిపోయేవారు. ఓ రోజు నీలిమ వెళ్లిపోయే వరకు నేను చెట్టు చాటున ఉండి ఆనక మహేష్‌ను పలకరించాను. ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలని చెప్పి అతడిని పార్కు చివర నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లాను. అక్కడ నా శాలువలో దాచి తెచ్చుకున్న కత్తిని బయటికి తీసి హఠాత్తుగా అతడి గొంతు కోసేశాను. అతడి నోట్లోంచి ఆర్తనాదం కూడా బయటకి రాలేదు. అదృష్టవశాత్తు రెండో సారి కూడా నన్ను ఎవరూ చూడలేదు. రెండు సార్లు ఇలా జరగడంతో నీలిమ ఇక కొన్నాళ్లు పెళ్లి గురించి మర్చిపోతుందనుకున్నాను. కాని ఇంతలోనే ఆమె వినోద్ గురించి చెప్పగానే పెళ్లి కుదరక ముందే అతడిని కూడా చంపెయ్యాలనుకున్నాను. నీలిమ రోజూ రాత్రి పదిగంటలకు ఫోన్ స్విచాఫ్ చేస్తుంది. వారం క్రితం పార్కులో నాకొక పాత ఫోన్ దొరికింది. ఆ ఫోన్‌తో వినోద్‌కు మెసేజ్ పంపి నిర్జన ప్రదేశానికి రప్పించాను. అతడిని కూడా చంపేస్తే ఈ హత్యలన్నీ నీలిమను ప్రేమించిన ఎవరో అజ్ఞాత హంతకుడు చేస్తున్నాడని పోలీసులు నమ్ముతారనుకున్నాను. కాని వినోద్‌ను మీరే నియమించారని ఊహించలేకపోయాను. ఓ ఆడపిల్లల తండ్రిగా అభద్రతా భావానికి గురై నేనే హత్యలు చేశాను తప్ప నాకు ఎవరి మీద కక్ష లేదు’’ కుమిలిపోతూ అన్నాడు చలపతిరావు. ఇన్స్పెక్టర్ విజయ్ దీర్ఘంగా నిట్టూర్చాడు. ‘‘నిన్ను చూసి తిట్టుకోవాలో, జాలిపడాలో నాకు అర్థం కావడం లేదు. నీ కూతురికి ప్రేమగా నచ్చజెప్పి ఉంటే ఆమె నీ బాధను అర్థం చేసుకునేది. నీ పిల్లల భవిష్యత్తు కోసం తప్పుడు మార్గంలో వెళ్లి వారికి భవిష్యత్తే లేకుండా చేశావ్’’ కోపంగా అన్నాడు విజయ్. -మహబూబ్ బాషా -
నన్ను క్షమించు జెన్నిఫర్
కారు దిగబోతున్న జాన్సన్ దూరంగా కొండ మీద నుంచి వినిపిస్తున్న కేకలకు ఉలిక్కిపడ్డాడు. ‘డల్హౌసీ లో తెలుగు వాడి కేకలా?’ అనుకుంటూ ఆశ్చర్యంగా పైకి చూశాడు. పైనున్న కొండ మీద జనం మూగి ఉన్నారు. జనం మధ్యలోంచే ఆ కేకలు వినబడుతున్నాయి. జాన్సన్ వేగంగా అక్కడి చేరుకున్నాడు. ‘కష్టంలో ఉన్న తెలుగు వాడెవడయి ఉంటాడు? ఆ గొంతు ఎక్కడో విన్నట్లుంది’ అనుకుంటూ కుతూహలంగా, జనాన్ని నెట్టుకుంటూ ముందుకెళ్ళిన జాన్సన్ ఆశ్చర్యంతో తలమునకలయ్యాడు. లోయలోకి చూస్తూ హిస్టీరిక్‌గా అరుస్తున్నది ఎవరో కాదు. జాన్సన్ దూరపు బంధువు జెన్నిఫర్ భర్త భరత్. ‘మైగాడ్! జెన్నిఫర్ ఏమైంది? లోయలో పడిపోయిందా?’ అనుకోగానే అతనిలో హఠాత్తుగా వణుకు ప్రారంభమయింది. (అనంతగిరి అడవిలో ఇద్దరి ఆత్మహత్య) భరత్ హృదయవిదారకంగా అరుస్తూ లోయలోకి దూకే ప్రయత్నం చేస్తున్నాడు. అక్కడున్న జనం అతన్ని ఆపడానికి ఎంతో కష్టపడుతున్నారు. జాన్సన్‌ని చూడగానే, ఒక్కసారిగా ఆశ్చర్యపోయినా వెంటనే తేరుకొని, ‘‘జాన్సన్... నా జెన్నీని కాపాడు’’ అంటూ బిగ్గరగా అరిచాడు భరత్. అప్పుడు చూశాడు జాన్సన్ లోయలోకి. ఆ లోయలో సుమారు ఇరవైఅడుగుల లోతులో ఒక కొమ్మను పట్టుకొని వేలాడుతూ ప్రాణాల కోసం పోరాడుతోంది జెన్నిఫర్. కానీ ఆమెను కాపాడే అవకాశమే లేదు. తాడు లాంటిది ఏమయినా దొరుకుతుందేమోనని అటూ ఇటూ చూస్తుంటే, పక్కనే ఉన్నతను చెప్పాడు ‘‘తాడు కోసం మా తమ్ముడు వెళ్ళాడు. అదిగో వచ్చేస్తున్నాడు’’అంటూ అటు వైపు చూసి, ‘‘జల్దీజల్దీ’’ అని ఆత్రుతగా అరిచాడు. అందరూ ఆశగా ఆ కుర్రాడి వైపు చూస్తూ ‘అమ్మయ్య గండం గడిచినట్లే’ అనుకుంటుండగా, కెవ్వున కేక వినిపించింది. అందరూ అప్రయత్నంగా లోయలోకి చూశారు. జెన్నిఫర్ అప్పటికే వంద అడుగుల లోతున్న లోయలోకి పడిపోయి, మంచులో కూరుకుపోయి, మాయమయిపోయింది. ఆ దృశ్యం చూస్తూనే భరత్ స్పృహతప్పి పడిపోయాడు. అందరి మనసులూ వికలమయిపోయాయి. (ప్రియుడు రాలేదని మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య) డల్హౌసీ, హిమాచల్‌ప్రదేశ్‌లోని హిల్ స్టేషన్. జాన్సన్ ఒక ఐఏఎస్ ఆఫీసర్. ఆఫీసు పని మీద హైదరాబాద్ నుంచి రెండ్రోజుల క్రితమే డల్హౌసీ వచ్చాడు. ‘సూయిసైడ్ పాయింట్’ అని ఒకప్పుడు పేరుమోసిన ‘కాలా టాప్ వ్యూపాయింట్’ చూడడానికి వచ్చిన జాన్సన్‌కి ఈ దురదృష్టకరమైన సంఘటన చూడవలసిన అగత్యం పట్టింది. జెన్నిఫర్తోనూ, ఆమె కుటుంబంతోనూ జాన్సన్‌కి, అతని తమ్ముడు రాబిన్‌కి ఎంతో ఆత్మీయ అనుబంధం ఉంది. మధ్య తరగతి కుటుంబానికి చెందిన జెన్నిఫర్ అందాన్ని చూసి, ధనవంతుడయిన భరత్ ఆమెను పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళిద్దరికీ పెళ్ళయి మూడేళ్లు కావస్తోంది. జెన్నిఫర్ అంటే భరత్‌కి ఎంత ప్రేమో ఎవరూ చెప్పనవసరం లేదు. అన్యోన్య దాంపత్యానికి ఆ జంటనే ఉదాహరణగా చెప్పవచ్చు. జెన్నిఫర్ కన్నా రెండేళ్లే పెద్ద అయిన రాబిన్‌తో ఆమెకు గాఢమయిన స్నేహం. రాబిన్ ఆమెకు ఒకే ఒక బెస్ట్ ఫ్రెండ్. భరత్, జెన్నిఫర్‌లకు విహారయాత్రాలంటే చాలా ఇష్టం. ఈసారి వాళ్లు డల్హౌసీలో వారం రోజులు గడపడానికి వచ్చారు. వచ్చిన నాలుగోరోజుకే ఈ ప్రమాదం జరిగింది. ∙∙ పోలీస్ ఎంక్వయిరీ మొదలయింది. జాన్సన్ పూర్తిగా ఫాలో అవుతూ వచ్చాడు. కాలా టాప్ పాయింట్ దగ్గరున్న టీ షాప్‌ను నడుపుతున్న రామ్‌దేవ్ ద్వారా కొన్ని విషయాలు తెలిశాయి. ‘‘మూడు రోజులుగా రోజూ ఆ సాబ్, మేమ్ సాబ్‌లు వ్యూ పాయింట్‌కి వచ్చి గంట, గంటన్నర గడిపి వెళ్తున్నారు. మేమ్సాబ్ అంటే ఆ సాబ్‌కి ఎంత ప్రేమో, ఆ మూడు రోజుల్లోనే నాకు బాగా తెలిసింది. ప్రమాదం జరిగిన రోజున మునుపటి కన్నా హుషారుగా ఉన్నారు మేమ్సాబ్. కొండ చరియ దగ్గరున్న బండ మీద ఆమె కూర్చుంటే, ఈ సాబే మా షాప్ నుంచి టీ పట్టుకెళ్లి ఆమెకిచ్చేవారు. ఇద్దరూ టీ తాగుతూ ముచ్చటగా కబుర్లు చెప్పుకుంటుంటే నాకెంతో ఆనందం కలిగేది. చూడ చక్కటి జంట వాళ్లిద్దరిదీ. ...ప్చ్... ఆ పైవాడే చూడలేకపోయాడు. టీ కలుపుతూ నా పన్లో పడిపోయిన నేను, ఆయన పెట్టిన కేకకు అదిరిపడి, అటు చూస్తే... ఇంకేముంది? ఆమె లోయలో పడిపోవడం, ఆమెను రక్షించబోయినసాబ్ బండకు తగిలి, అక్కడే పడిపోవడం’ చూసేసరికి నా కాలూ చెయ్యీ ఆడలేదు. గబగబా పరుగెత్తి, సాబ్‌ని లేవదీశాను. పాపం మోకాలికి దెబ్బ తగిలి, ప్యాంట్ రక్తంతో తడిసిపోయింది. లోయలోకి చూస్తే, మేమ్సాబ్ చెట్టుకొమ్మను పట్టుకు వేలాడుతున్నారు. నాకేమీ తోచలేదు. సహాయం కోసం గట్టిగా అరిచేసరికి, జనం పోగయ్యారు. అంతమందిమి ఉన్నా ఆమెను కాపాడలేకపోయాం’’ అంటూ ఏడ్చేశాడతను. ఇతర ప్రత్యక్ష సాక్షుల కథనాలు కూడా విన్న తర్వాత పోలీసులకు కూడా భరత్ పై అమితమయిన జాలి కలిగింది. ఆ లోయలో పడిన వారెవరూ ఇంత వరకూ ప్రాణాలతో బయట పడలేదు. జెన్నిఫర్ విషయంలోనూ ఆ ఆశ లేనప్పటికీ, ఆమె మృత దేహాన్ని పైకి తీయించాలని జాన్సన్ కోరిన మీదట, ‘అది చాలా కష్టమయిన పని’ అంటూ పోలీస్ ఇన్స్పెక్టర్ చేతులెత్తేశాడు. అయినా జాన్సన్ ఒప్పుకోలేదు. తన పలుకుబడిని ఉపయోగించి, ఆ ప్రయత్నాలు ప్రారంభించేంత వరకు ఊరుకోలేదు. ఎంతో కష్టం మీద మూడో రోజుకు గానీ, ఆమె మృత దేహాన్ని పైకి తీయలేకపోయారు. ప్రమాదం జరిగిన మర్నాడే అక్కడికి చేరుకున్న జెన్నిఫర్ ముసలి తల్లితండ్రులను ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. భరత్ పరిస్థితి కూడా దయనీయంగా ఉంది. జెన్నిఫర్ శవాన్ని బయటకు తీసినపుడు, ఆమె తల్లి తండ్రుల పరిస్థితి మరింత దారుణంగా మారింది. గుండె దిటవు చేసుకుని,వాళ్ళను ఓదార్చాడు భరత్.. శవం దొరికాక, పోస్ట్‌మార్టమ్ వంటి కార్యక్రమాలను విడిచిపెట్టి శవాన్ని తొందరగా తరలించడానికి, జాన్సన్ తన పరపతిని ఉపయోగించడంతో వాళ్ళంతా తొందరగానే హైదరాబాద్‌లోని జెన్నిఫర్ పుట్టింటికి చేరుకోగలిగారు.‘శవాన్ని ఎవరింటికి తీసుకెళ్లాలి?’ అనే ఆలోచన ఎవరికీ రాలేదు. ఏదోరకంగా తొందరగా హైదరాబాద్‌లో పడితే చాలు అనేదే వాళ్ళ తాపత్రయం. అప్పటికే జెన్నిఫర్ ఇంటి దగ్గర కాచుకుని కూర్చొని ఉన్నాడు రాబిన్. అచేతనంగా పడిఉన్న జెన్నిఫర్‌ని చూడగానే, అతని దుఃఖం కట్టలు తెంచుకుంది. చంటి పిల్లాడిలా ఏడుస్తున్న అతన్ని చూసేసరికి, అందరి హృదయాలూ ద్రవించి పోయాయి. మర్నాడు అంత్య క్రియలు జరపడానికి నిర్ణయించారు. జాన్సన్, రాబిన్లు ఆ ఏర్పాట్లలో ఉన్నారు. ∙∙ జెన్నిఫర్ మరణంతో పిచ్చివాడయి పోయాడు రాబిన్. చిన్నప్పటి నుంచి ఆమె అంటే పిచ్చి ప్రేమ అతనికి. ఆమెను పెళ్ళి చేసుకోవాలని ఎంతో ఆశ పడ్డాడు. ఆమెకు కూడా రాబిన్ అంటే వల్లమాలిన అభిమానమే. అయితే అతనిని పెళ్ళాడాలని ఆమె ఎప్పుడూ అనుకోలేదు. రాబిన్‌కి మంచి ఉద్యోగం గానీ, ఆస్తిపాస్తులు గానీ లేకపోవడం వల్ల, ఆమెను పెళ్లి చేసుకోవడానికి ముందుకు రాలేకపోయాడు. మంచి ఉద్యోగం సంపాదించి ఆమెను పెళ్లి చేసుకోవాలని ప్రయత్నిస్తుండగా, భరత్ తో ఆమెకు పెళ్లి అయిపోయింది. అప్పటి నుంచి అతనిలో కసి ప్రారంభమయింది. జెన్నిఫర్ తనకు దక్కలేదన్న కసితో పెళ్ళయిన తర్వాత కూడా వదలకుండా తన చుట్టూ తిరగడం, అర్ధరాత్రి, అపరాత్రి అని చూడకుండా ఆమెకు మెసేజ్‌లు పెట్టడం... ఇవన్నీ కావాలనే చేశాడతను. వాటి వల్ల వాళ్లిద్దరి దాంపత్యంలో కలతలు రావాలనే పైశాచిక ఆలోచన అతనిలో లేకపోలేదు. జెన్నిఫర్‌ని చేసుకున్న భరత్ అంటే అతనికి చాలా అసూయకలిగేది. అతన్ని చంపేస్తే, జెన్నిఫర్ తనదవుతుందనే పిచ్చి ఆలోచనలు కూడా అతనికి అప్పుడప్పుడు వస్తూ ఉండేవి. కానీ అది సాధ్యం కాదు అని అతనికీ తెలుసు. జెన్నిఫర్ శవానికి పోస్ట్‌మార్టమ్ చేయలేదని తెలిసినపుడు అతనికో ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనతో పాటూ అతని బెస్ట్ ఫ్రెండ్ ఇన్సె్పక్టర్ మహంకాళి గుర్తొచ్చాడు. ‘ఎలాగయినా వాడి చేత కేసు రీ ఓపెన్ చేయించి భరత్గాడిని జైల్లోకి తోయించాలి. భరత్ గాడు సామాన్యుడు కాదు. వాడే జెన్నిఫర్‌ని లోయలోకి తోసేసి ఉంటాడు. ఏదో జరిగింది. అది నిశ్చయంగా హత్యలేనని నా అంతరాత్మ చెబుతోంది. అయితే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి కేసు తిరిగి ఓపెన్ చేయించాలంటే అన్నయ్యను ఒప్పించడం అవసరం. అతను అడ్డు పడితే, ముందుకెళ్లడం కష్టం’ అనుకుని జాన్సన్‌ను ఒంటరిగా కలిశాడు. ‘‘ఇది నిస్సందేహంగా హత్యే అన్నయ్యా. భరత్‌గాడు మీరందరూ అనుకునేటంత అమాయకుడేమీ కాదు. వాడే జెన్నిని లోయలోకి తోసేసి ఉంటాడు’’ అంటున్న రాబిన్ మాటలు వినగానే మతిపోయింది జాన్సన్‌కి. ‘‘ఛ... తప్పు.. నీకెందుకొచ్చిందా అనుమానం?’’ అంటూ గసిరాడు. ‘‘నా దగ్గర ఆధారాలు ఏవీ లేవు గానీ, ఎందుకో అది యాక్సిడెంట్ కాదని అనిపిస్తోంది’’ అన్నాడు రాబిన్. ‘‘అతను ఎందుకలా చేస్తాడు? నీకేదో పిచ్చి పట్టినట్లుంది. ఎవరయినా వింటే, ఏమనుకుంటారు? భరత్ చాలా మంచివాడురా. జెన్నీని ఎంతో ప్రేమగా చూసుకునేవాడురా. అతని మీద ఇలా నిందలు వేయడం భావ్యం కాదురా. పోనీ ఒక విషయం చెప్పు. జెన్నీ నీకు బాగా క్లోజ్ కదా? భరత్ గురించి చెడ్డగా ఎప్పుడయినా చెప్పిందా? సంసారంలో కలతలు వచ్చాయని చెప్పిందా?’’ అని అడిగాడు జాన్సన్. ‘‘లేదు. కానీ ... నాకెందుకో అది యాక్సిడెంట్ అనిపించడం లేదు’’ అన్నాడు రాబిన్. ‘‘అర్ధంపర్ధం లేని అనుమానాలు నీవి’’ అంటూ కొట్టి పారేశాడు జాన్సన్. ‘‘అలా అనకు. నా అంతరాత్మ చెబుతోంది, ఏదో తేడా ఉందని. ఈ మధ్య భరత్ వ్యాపారంలో బాగా దెబ్బ తిన్నాడు. వాడికి చాలా అప్పులున్నాయట. డబ్బు కోసం వాడు పన్నిన పన్నాగం ఇది. నాకు మూడు అనుమానాలు ఉన్నాయి... మొదటిది అతను జెన్నీ పేరిట పెద్ద మొత్తంలో ఇన్సూరెన్స్ చేసి ఉంటాడు. రెండవది, అతనికేదో గొప్పింటి సంబంధం వచ్చి ఉంటుంది. మూడవది, సహజంగా అందగాడు కదా? ఏ అమ్మాయో తగులుకొని ఉంటుంది. ఆ విషయం తెలిసిపోయేసరికి జెన్నీ రాద్ధాంతం చేసి ఉంటుంది. ఆమెను వదిలించుకోవడానికి ఇలా పథకం వేసి ఉంటాడు’’ అంటూ ఆరోపించాడు రాబిన్. ఆవేశంగా ఆలోచిస్తున్న వాడికి ఏం చెప్పినా వినడని, ‘‘సర్లే... నీ మాట ఎందుకు కాదనాలి? కానీ... అలా ఆరోపిస్తే సరిపోదు. ఆధారాలు కావాలి. ప్రయత్నించు, ఏదయినా క్లూ దొరుకుతుందేమో!’’ అని సలహా ఇచ్చాడు. ఆమాత్రం ప్రోత్సాహానికే పొంగిపోయాడు రాబిన్. ‘‘ఆ పని ఇంకా సులువు. అంతా మహంకాళి చూసుకుంటాడు అన్నాడు హుషారుగా.‘వీడిక్కడితో ఆగేలా లేడు. కేసు రీ ఓపెన్ చేయిస్తాడు. కానీ ఆధారాలు దొరకాలి కదా?’ అనుకున్నాడు జాన్సన్ మనసులో... ∙∙ అంత్యక్రియల ఏర్పాట్లకు బయటకెళ్లిన అన్నదమ్ములిద్దరూ జెన్నిఫర్ ఇంటికి తిరిగి వచ్చేసరికి, భరత్ తండ్రి రఘురామారావు, అతని భార్య కనిపించారు. జాన్సన్‌ని చూడగానే రఘురామారావు ఎదురెళ్ళి, ‘‘ఏమిటి జాన్సన్? డెడ్ బాడీని ఇక్కడికి తీసుకొచ్చావు? మా ఇంటికి కదా తీసుకురావాలి?’’ అని ప్రశ్నించాడు ఘాటుగా. ‘‘ఏమో సార్... అంతా అలా జరిగిపోయింది. అందరూ దుఃఖంలో ఉన్నారు. ఏదో నాకు తోచినట్లు చేసేశాను. ఇప్పుడేమంటారు?’’ అని అడిగాడు, తత్తర పడుతూ. ‘‘మా ఇంటికే తీసుకుపోదాం. అంత్యక్రియలన్నీ అక్కడే’’ ఆర్డర్ వేస్తున్నట్లు అన్నాడు. ‘‘ఏర్పాట్లన్నీ చేసేశామే! కఫిన్ రెడీ అయిపోయింది. పాస్టర్ కి చెప్పేశాం. రేపు ఉదయం అందరూ ఇక్కడికే వస్తారు. మీ ఇంటికి తీసుకెళ్తామని మేము ఎవరమూ అనుకోలేదు. భరత్ కూడా...’’అంటుంటే అడ్డు తగిలాడు రఘురామారావు. ‘‘పుట్టెడు దుఃఖంలో ఉన్నాడు. వాడెలా చెప్తాడు? సరే అయ్యిందేదో అయ్యింది. తంతు అంతా మా ఇంటి దగ్గరే జరుగుతుంది. మా పద్ధతిలోనే’’ అంటూ ఆఖరి ముక్క గట్టిగా నొక్కి చెప్పాడు. జాన్సన్‌తో పాటు అక్కడున్న అతని బంధువులంతా తెల్లబోయారు.‘‘తొందరగా కానివ్వండి, ఎక్కువ టైం లేదు. రేపటి ఏర్పాట్లు చూడాలి. వాసంతీ మీ తమ్ముడికి ఫోన్ చేసి చెప్పు, అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేయమని’’అంటూ భార్యకు పురమాయించాడు. ఆ మాటలు విన్న జెన్నిఫర్ తండ్రి, డెబ్భయి ఏళ్ళు దాటిన అబ్రహాం బిగ్గరగా ఏడుస్తూ కుప్పకూలిపోయాడు. ఆ వార్తను అతని భార్య మార్తా కూడా తట్టుకోలేక తల్లడిల్లిపోతుంది. తమ పద్ధతిలోనే అంత్యక్రియలు జరిపితే, కూతురి పరిశుద్ధ ఆత్మ పరలోకాలకు చేరుతుందనే ప్రగాఢ విశ్వాసంతో ఉన్న ఆ ముసలి జంట, తాము విన్నదాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. తమ కోరిక మన్నించమని అల్లుడిని ప్రాధేయపడ్డారు. ‘‘నాన్న ఇష్టం. నాదేమీలేదు’’ అంటూ నిస్సహాయతను ప్రదర్శించాడు భరత్.. జెన్నిఫర్ బంధువులందరూ రఘురామారావును బతిమాలడం మొదలు పెట్టారు. చాలా సేపు వాళ్ళంతా బతిమాలేసరికి అతను ఒప్పుకోక తప్పలేదు. జెన్నిఫర్ ముసలి తల్లి తండ్రుల పట్ల అతనికి జాలి, సానుభూతి కలిగాయి. ఆ మర్నాడు ఉదయం క్రై స్తవ పద్ధతిలోనే అంత్యక్రియలు జరిగాయి. ఆ మధ్యాహ్నమే రాబిన్... మహంకాళిని కలిసి, తన అనుమానాలన్నీ వ్యక్తం చేశాడు. అయితే ఇన్సె్పక్టర్ మహంకాళి సానుకూలంగా స్పందించలేదు. కేసు రీ ఓపెన్ చేయడానికి ఇష్టపడలేదు. కానీ రాబిన్ తన పంతాన్ని విడిచిపెట్టలేదు. వాళ్ళిద్దరికీ ఉన్న ప్రగాఢ స్నేహానికి మహంకాళి తలవంచక తప్పలేదు. పరిశోధన ప్రారంభించాడు. రాబిన్ కూడా అతని వెంటే ఉండి, భరత్ ను ఎలా అయినా కటకటాల్లోకి నెట్టేయాలన్న పట్టుదలతో ఉన్నాడు. శవాన్ని బయటకు తీసి పోస్ట్‌మార్టమ్‌కి పంపారు. భరత్ చరిత్ర అంతా క్షుణ్ణంగా పరిశీలించారు. కానీ ఏ క్లూ లభించలేదు. జెన్నిఫర్ పేరుతో బీమాపాలసీ ఏదీ తీసుకున్న దాఖలాలు లేవు. రాబిన్ ఆరోపణలన్నీ నిరాధారమని రుజువయింది. భరత్‌కు ఉన్న ‘క్లీన్ రికార్డ్’ చూసి, రాబిన్ పై మండిపడ్డాడు. మూసేసిన కేసును తిరగదోడినందుకు పై అధికారుల నుంచి తిట్లు తప్పవని రాబిన్ పై విరుచుకు పడ్డాడు. ఎప్పటికప్ప్పుడు కేసు వివరాలను తెలుసుకుంటున్న జాన్సన్ ‘అమ్మయ్య’ అనుకుంటూ తేలికగా ఊపిరి తీసుకున్నాడు. ఈ విషయాలేవీ తెలియని భరత్, తన రొటీన్లో పడిపోయి బిజీ అయిపోయాడు. ∙∙ వారం రోజుల తర్వాత... అనూహ్య పరిణామం జరిగింది. ‘ఇంత వరకు నేను చేపట్టిన ఏ కేసూ ఫెయిల్అవ్వలేదు. ఈ రాబిన్గాడి వల్ల నా రికార్డ్ మీద మచ్చ పడింది’ అని బాధపడుతున్న మహంకాళి పెదవులపై చిరునవ్వు విరిసింది. రాబిన్ విజయగర్వంతో పగలబడి నవ్వే రోజొచ్చింది. భరత్ అరెస్ట్ అయ్యాడు. ఆ వార్తను ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. భరత్ తన నేరాన్ని ఒప్పుకోక తప్పలేదు. నిజానికి ఆ విజయం పూర్తిగా రాబిన్ది కాదు. పోలీసులదీ కాదు. తొందరపడి చేసిన తప్పుకు కుమిలిపోతూ, తానే పోలీసులకు లొంగిపోదామనుకున్న తరుణంలో ఇలా జరిగేసరికి, పోలీసుల పని సులువయింది. మంచి లాయర్ని పెట్టి, తమకున్న పరపతితో బయటపడడం భరత్ కి పెద్ద కష్టమేమీ కాదు. కానీ ఆ ప్రయత్నం చేయలేదతను. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌తో కేసు ముడివీడింది. జెన్నీ కడుపులో కనుగొన్న మత్తుమందు చిక్కుముడిని విప్పింది. దాన్ని బట్టి జెన్నిఫర్ది యాక్సిడెంట్ కాదని తేలింది, మహంకాళికి. భరత్ హత్యచేసి ఉంటాడన్న దానికి బలమయిన ఆధారం దొరికింది. అతను భార్యను చంపడానికి ఏ కారణమూ తోచలేదు మహంకాళికి. ‘భరత్ ఏదయినా మానసిక సమస్యతో బాధపడుతున్నాడా? దాని కారణంగానే, మతి స్థిమితం తప్పి భార్యను హత్య చేశాడా?’ అనే సందేహం వచ్చింది. భరత్ ఫ్యామిలీ డాక్టర్ తో మాట్లాడినపుడు ఒక కొత్త విషయం తెలిసింది. ఈమధ్య కాలంలో వ్యాపారంలో వచ్చిన సమస్యల కారణంగా భరత్‌కి రాత్రుళ్లు సరిగ్గా నిద్రపట్టడం లేదని, దాని వల్ల డాక్టర్ సలహా మీద నిద్రమాత్రలు వాడుతున్నాడని... అతను వాడే నిద్రమాత్రలలో ఉండే రసాయన పదార్థం జెన్నిఫర్ కడుపులో కనుగొన్న మత్తుమందు ఒకటేనని తెలియడంతో భరత్ నేరస్తుడు అని రుజువయింది. కాలా టాప్ వ్యూ పాయింట్ దగ్గర టీలో తను వాడే నిద్ర మాత్రల పొడిని కలిపి ఇవ్వడం వల్ల కలిగిన మత్తు వల్ల జెన్నిఫర్ కంట్రోల్ తప్పి లోయలో పడి మరణించిందని, ఆ లోయలోని మంచులో కూరుకుపోయిన శవాన్ని పైకి తీసే అవకాశమే లేదు కాబట్టి తను సురక్షితంగా పోలీస్ కేసు నుంచి తప్పించుకోవచ్చునని ప్లాన్ చేశానని, కానీ ఆ సమయానికి జాన్సన్ అక్కడికి రావడంతో కథ అనుకోని మలుపు తిరిగిందని పోలీసుల ముందు ఒప్పుకున్నాడు భరత్. హత్య చేయడానికి కారణం భార్య శీలంపై అనుమానమని, రాబిన్‌కి, జెన్నిఫర్‌కి పెళ్లి ముందు నుంచే వ్యవహారం ఉన్నట్లు గట్టిగా నమ్మానని చెప్పాడు. రాబిన్‌ని కలిసినా, అతనితో మాట్లాడినా, అతని నుంచి మెసేజులు వచ్చినా ఆమెలో చాలా మార్పు వచ్చేదని, అంత హుషారుగా మామూలు సమయాల్లో ఉండేది కాదని, రాత్రి పది, పదకొండు గంటలప్పుడు కూడా రాబిన్ నుంచి మెసేజ్‌లు రావడం, ఆమె చాటుగా సమాధానం ఇస్తూ ఉండడం, తనని బాగా రెచ్చగొట్టడం జరిగేదని చెప్పాడు. తను నేరం చేశానని రాబిన్... జాన్సన్ దగ్గర అభియోగం చేయడం చాటుగా విన్నానని, కేసు రీ ఓపెన్ చేసి, పోస్ట్‌మార్టమ్ చేస్తారేమోనన్న భయం కలిగిందని, అందుకే హిందూ పద్ధతి ప్రకారం శవాన్ని కాల్చేసే నిమిత్తం, అంత్యక్రియలు హిందూ పద్దతిలో జరగాలనే ఆలోచన, తండ్రి మనసులో గట్టిగా నాటానని, కానీ తను అనుకున్నట్లు జరగక పోవడంతో పట్టుబడాల్సి వచ్చిందని చెప్పాడు. తొందరపాటుతో హత్య చేసినా, నిదానంగా ఆలోచిస్తే, తనెంత తప్పు చేశాడో అర్ధమయిందని, ఏ ఆధారమూ లేకుండా అంతటి అఘాయిత్యానికి పాల్పడడానికి కారణం, ఆమెపై తాను పెంచుకున్న పిచ్చి ప్రేమేనని, అందువల్లే తానొక సైకోలా మారిపోయానని చెబుతూ హృదయ విదారకంగా ఏడ్చేశాడు భరత్. -
అగ్రిమెంట్
ప్రభాకర్ ఏమీ తెలియని వాడిలా చదువుతున్నట్లు నటిస్తూ...హఠాత్తుగా రామారావు మీదకు లంఘించాడు. అనుకోని పరిణామానికి రామారావు కనుగుడ్లు తేలేశాడు. మంచం మీద కూర్చున్న రామరావును వెల్లకిల తోసేసి ముఖంపైన దిండును గట్టిగా అదిమి పట్టాడు. టేబుల్ పైన ల్యాండ్ ఫోన్ మోగడంతో ఇన్స్పెక్టర్ సుదర్శన్ ఎత్తాడు. ‘‘నమస్తే సార్! నేను శంషాబాద్ లోటస్ ఫామ్‌హౌస్ నుండి శంకరయ్యను మాట్లాడుతున్నాను... మా అయ్యగారు ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నారు... మీరు వెంటనే రావాలి’’ ‘‘నేను మరో పదినిమిషాల్లో అక్కడుంటాను. ఎవరూ శవాన్ని ముట్టుకోవద్దు’’ అని కానిస్టేబుల్ సూర్యంను తీసుకొని జీపులో బయలుదేరాడు సుదర్శన్. దారిలో అతని సూచనల మేరకు సూర్యం క్లూస్ టీమ్‌కు, అంబులెన్స్‌కు సమాచారమిచ్చాడు. పోలీస్ జీపు ఆగడం చూసి, శంకరయ్య గేటు తెరచుకుని పరుగు, పరుగున వచ్చాడు. ‘‘ఇందాక తమరికి ఫోన్ చేసిన శంకరయ్యను నేనే సార్!’’ అంటూ ఫామ్‌హౌస్ లోకి దారి తీశాడు. సుదర్శన్, సూర్యంలు అతణ్ణి అనుసరించారు. బెడ్ రూంలోకి ప్రవేశించే సరికి లుంగీతో ఫ్యానుకు వెళ్ళాడుతున్న దృశ్యం కనబడింది. సూర్యం తన అనుమానాన్ని వ్యక్తం చేశాడు. సుదర్శన్ తలూపుతూ... శవాన్ని మరింత దగ్గరగా వచ్చి పరిశీలించాడు. ఇంతలో క్లూస్ టీమ్ వచ్చి తమ పనిలో తాము నిమగ్నమయ్యారు. విషయం తెలుసుకుని వచ్చిన గ్రామ పెద్దల సమక్షంలో పంచనామా చేసి, శవాన్ని అంబులెన్స్‌లో పోస్ట్‌మార్టం కోసం తరలించారు. సుదర్శన్ అడిగిన ప్రశ్నలతో శంకరయ్య చనిపోయిన తన యజమాని పేరు రామారావని చెబుతూ... ‘‘సార్...నిన్న రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో అయ్యగారు క్యాబ్‌లో వచ్చారు. విశాఖపట్టణం నుండి విమానంలో వచ్చానని చెప్పారు. అక్కడ అయ్యగారికి సొంతంగా పెద్ద బట్టలషాపు ఉంది. దాని బ్రాంచి ఒకటి బంజారాహిల్స్‌లో ఉంది. అప్పుడప్పుడు అయ్యగారు వచ్చి పనులు చూసుకొని తిరిగి విశాఖకు వెళుతుంటారు. ‘‘ఎంత కాలం నుండి ఇక్కడ పనిచేస్తున్నావు?’’ అడిగాడు సుదర్శన్. ‘‘నేను ఇక్కడ పనిలో చేరి దాదాపు సంవత్సరం దాటింది సార్... నేను నా భార్య ఈ ఫామ్‌హౌస్‌ను చూసుకుంటాం. సాధారణంగా అయ్యగారికి మేమే వంట చేస్తాం... కానీ నా భార్య అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరింది. అయ్యగారికి హోటల్ నుండి భోజనం తెచ్చి వడ్డించి... తిరిగి ఉదయం వస్తానని ఆసుపత్రికి బయలుదేరాబోతుంటే...’’ అంటూ కంట తడిపెట్టసాగాడు శంకరయ్య. కొద్ది క్షణాల్లో తేరుకుని తిరిగి చెప్పసాగాడు. ‘‘అయ్యగారు ధర్మ ప్రభువులు. అవసరానికి ఉంచమని ఐదు వేలిచ్చారు. ఉదయం వచ్చేప్పుడు కాఫీ, టిఫిన్ తెమ్మని మరో వంద రూపాయలు కూడా ఇచ్చారు. నేను ఉదయం ఏడు గంటలకు టిఫిన్, కాఫీ తెచ్చి తలుపు తట్టాను. అయ్యగారు ఎంతకూ తలుపు తీయలేదు. కిటికీలో నుంచి చూస్తే... ఫ్యాన్‌కు వెళ్ళాడుతూ కనిపించారు అయ్యగారు. నేను గట్టిగా ఏడుస్తుంటే... రోడ్డుకెదురుగా గుడిసెల్లో ఉన్న వాళ్ళు కొందరు పరుగెత్తుకు వచ్చారు. వారి సాయంతో తలుపులు బద్దలు కొట్టి లోనికి వెళ్ళాను. అయ్యగారిని రక్షిద్దామని కాళ్లు పట్టుకుని పైకి లేపుదామనుకు న్నాను. కాళ్లు చల్లగా తగిలాయి. చనిపోయారని నిర్ధారించుకుని మీకు ఫోన్ చేశాను’’ అంటూ కండువా ముఖానికి పెట్టుకుని కుమిలిపోసాగాడు శంకరయ్య. క్లూస్ టీమ్ గదిలోను, కాంపౌండ్ లోపల అణువణువు జల్లెడ పట్టారు. ఒక చోట మూలగా మామిడి చెట్టు మొదట్లో...కాలిపోయిన పేపర్లు కనిపించాయి. అవి నుసి గాకుండా జాగ్రత్తగా చిన్న చేటలో సేకరించారు. జర్మన్ సాంకేతికతతో రసాయనాన్ని స్ప్రే చేశారు. అవి ఒరిజినల్ రూపంలోకి మారాయి. ఆ ముక్కలను తమ మేధాశక్తితో జతపరుస్తూ...కొంత వరకు సమాచారాన్ని సేకరించారు. అది విశాఖలో చేసుకున్న అగ్రిమెంట్ దస్తావేజు. దానిపై ఉన్న వేలి ముద్రలు సేకరించారు. హాల్లోని అటాచ్డ్ బాత్ రూంలో, వెంటిలేటర్‌కు ఐరన్ గ్రిల్ లేదు. కేవలం వుడ్ ఫ్రేమ్‌లో నాలుగు గ్లాసెస్ బిగించారేమో...! అన్నీ ముక్కలయ్యాయి. ఒక గ్లాస్ చిన్న ముక్క చెక్కకు బిగుసుకు పోయి ఉంది. అందులో నుండి ఎవరో దూరి వచ్చి, వెళ్ళినట్లుగా సంకేతాలున్నాయి. గ్లాస్ ముక్క మీద రక్తపు మరక స్పష్టంగా కనిపిస్తోంది. దానిని కూడా చెక్క నుండి వేరు చేసి క్లూస్ టీమ్ భద్రం చేసింది. క్లూస్ టీమ్‌తోపాటు అవసరమైన ఫోటోలను సెల్ఫోన్లో బంధించి, టీ పాయ్ పైన ఉన్న రామారావు సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నాడు సూర్యం. సెల్ ఫోన్ ఆధారంగా షాపుకు ఫోన్ చేశాడు. రామారావు విషయం వారి కుటుంబానికి తెలియజేయమన్నాడు సూర్యం. ‘‘పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్ వచ్చాక విషయాలు తెలుస్తాయి. ఫామ్‌హౌస్‌కు మీ అయ్యగారిని కలవడానికి ఎవరైనా వస్తుంటారా?’’ అడిగాడు సుదర్శన్. ‘‘ఎవ్వరూ రావడం చూడలేదు సార్!’’ అంటూ చేతులు కట్టుకున్నాడు శంకరయ్య. ‘‘నీ కంటే ముందు ఇక్కడ ఎవరు పనిచేసే వారు?’’ అంటూ అడిగి అతని వివరాలు తీసుకుని సూర్యానికి సైగ చేశాడు సుదర్శన్. అర్థమయ్యిందన్నట్టు తలూపాడు సూర్యం. ‘‘మేము ఎప్పుడు పిలిచినా మాకు అందుబాటులో ఉండాలి’’ అంటూ శంకరయ్యను చూస్తూ...హెచ్చరించాడు సుదర్శన్. ‘‘అలాగే సార్!’’ అంటూ వినమ్రంగా తలూపాడు శంకరయ్య. విశాఖపట్టణం నుండి రామారావు భార్య సుమతి, కొడుకు రమేష్ ఫ్లైట్‌లో బయలుదేరి హైదరాబాద్‌లో దిగి క్యాబ్‌లో పోస్ట్‌మార్టమ్ జరుగుతున్న ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడ సుదర్శన్, సూర్యాన్ని కలిశారు. సూర్యం విషయమంతా చెప్పాడు. వారు కన్నీరుమున్నీరు అయ్యారు, వారిని ఓదార్చడం ఇద్దరి తరం కాలేదు. కాసేపటికి పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్స్ వచ్చాయి. ‘‘ఊహించినట్లే జరిగింది. రామారావును ఊపిరి ఆడకుండా చేసి చంపారు. తరువాత అతను ఉరి వేసుకున్నట్టు చిత్రీకరించారు’’ అన్నాడు సుదర్శన్. అది విని తట్టుకోలేక పోయింది సుమతి. విశాఖపట్టణంలో రామరావు షాపు వివరాల గురించి రమేష్‌ను అడిగాడు సూర్యం. ‘‘నాన్న గారు జగదాంబ సెంటర్లో, పది సంవత్సరాల క్రితం ఐదు లక్షలతో చిన్న రెడీ మేడ్ షాప్ ఓపెన్ చేశారు...తక్కువ సమయంలో వ్యాపారం బాగా పుంజుకుంది. దానిని పెద్దగా విస్తరింపజేసి ఐదు కోట్లకు చేరుకునేలా చేశారు’’ అన్నాడు రమేష్. ‘‘భాగస్వాములు ఉన్నారా...లేక ఒక్కరే చూసుకుంటున్నారా?’’ అంటూ ఆరా తీశాడు సుదర్శన్. ‘‘మాకు దూరపు చుట్టం ప్రభాకర్ పెట్టుబడి పెట్టారు’’ ‘‘మీ వ్యాపార లావాదేవీలు ఎవరు చూస్తుంటారు?’’ ‘‘ఆంజనేయులు గారు చూస్తుంటారు’’ అతని సెల్ నెంబర్ తీసుకున్నాడు సుదర్శన్. ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని డెడ్ బాడీనీ ఆసుపత్రి వర్గం అప్పగించింది. రమేష్ కోరిక మేరకు డెడ్ బాడీని అంబులెన్స్‌లో విశాఖపట్టణం తీసుకెళ్లడానికి ఏర్పాటు చేసి– ‘‘సాధ్యమైనంత త్వరలో దోషులను పట్టుకుంటాము’’ అని సుమతి,రమేష్‌ను ఓదార్చి పంపారు సుదర్శన్. దినపత్రికలన్నీ ‘ప్రముఖ వ్యాపార వేత్త రామారావు హత్య...’ అని తాటికాయంత అక్షరాలతో వార్త ప్రచురించాయి. కేసును ఒక సవాలుగా తీసుకున్నాడు సుదర్శన్. సూర్యం అత్యంత కీలకమైన సమాచారం సేకరించే సరికి కేసు మూడు రోజుల్లోనే సులభంగా ఛేదించబడింది. వేలిముద్రలు, రక్తపు మరకల ఆధారాలతో నిందితులను అరెస్ట్ చేసుకుని వచ్చాడు సూర్యం. రాత్రంతా ఇంటరాగేట్ చేసి వారి నుంచి స్టేట్మెంట్స్ తీసుకుని కేసు నమోదు చేశాడు సుదర్శన్. ఆ మరునాడు రామారావును హత్య చేసిన హంతకులు దొరికారు. వివరాలు వెల్లడిస్తానని పత్రికల వారితో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాడు సూర్యం. కేసు వివరాలు చెప్పసాగాడు సుదర్శన్.... ‘‘సాధారణంగా ఒక వ్యాపారి హత్యకు భాగస్వాముల ప్రమేయం ఉంటుందని ఆ కోణంలో దర్యాప్తు ప్రారంభించాను. రామారావు గారి వ్యాపారంలో మరో భాగస్వామి ప్రభాకర్ నలభై లక్షల పెట్టుబడితో చేరాడు. ప్రభాకర్ బంజారాహిల్స్ లోని షాప్‌ను, ఇతర వ్యవహారాలను చూసుకునే వాడు. అనతి కాలంలోనే సంస్థ కోట్లకు పడగెత్తడంతో అతనిలో దుర్భుద్ది మొదలయ్యింది. సంస్థను ఎలాగైనా తన హస్తగతం చేసుకుని రామరావును తరిమెయ్యాలనుకున్నాడు. దానికి పథకాలు రచించసాగాడు. కాని అతని దురదృష్టం వెన్నంటసాగింది. అనుకోని ఖర్చులు వచ్చాయి. స్వగ్రామంలో అతను చేసిన అన్యాయాలకు ఫలితంగా అతని ఆస్తి కోర్టుకు అటాచ్ చేయబడింది. దాని నుండి విముక్తి కోసం ఇరవై లక్షలు రామారావు వద్ద అప్పుగా తీసుకున్నాడు. మరో దఫా కొడుకును పై చదువుల కోసం విదేశాలకు పంపాలని, కూతురు పెళ్లి చెయ్యాలనే నెపంతో మరో ఇరవై లక్షలు అప్పుగా తీసుకున్నాడు. సంవత్సరాలు గడుస్తున్నా అప్పు సంగతి దాటవేస్తున్నాడు ప్రభాకర్. లాభాలలో వాటా మాత్రం అప్పు కింద కొంతైనా జమచేయడం లేదు. ప్రభాకర్ నుండి డబ్బు రాబట్టడం అంతా తేలికైన పని కాదని...రామారావు న్యాయవాదితో సంప్రదించాడు. అతని సలహా మేరకు ప్రభాకర్ భాగస్వామ్యాన్ని రద్దు చేస్తున్నట్లు అగ్రిమెంట్ చేయించాడు. ‘‘హైదరాబాద్‌కు రెండు రోజుల్లో వస్తున్నాను. మనం ఫామ్‌హౌస్‌లో కలుసుకుందాం’’ అని ప్రభాకర్‌కు సమాచారమిచ్చాడు రామారావు. ప్రభాకర్‌కు అర్థం కాలేదు. పది రోజుల క్రితమే వెళ్లిన వాడు తిరిగి అకస్మాత్తుగా వస్తూండడం ప్రభాకర్‌కు అనుమానమేసింది. వారి మేనేజర్ ఆంజనేయులుకు ఫోన్ చేసి అసలు విషయం తెలుసుకున్నాడు. వెంటనే తన బుర్రకు పదును పెట్టి పథకం రచించాడు. ఆరాత్రి రామారావు శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో దిగి ఫామ్‌హౌస్ చేరుకునేసరికి రాత్రి ఎనిమిది గంటలయ్యింది. భోజనం చేసి కాసేపు నడుం వాల్చాడు. శంకరయ్య వెళ్ళిన కాసేపటికి ప్రభాకర్ ఫామ్‌హౌస్‌కు వచ్చాడు. కాసేపు విషయం చర్చించుకున్నాక అతని ధోరణితో సంతృప్తి చెందని రామారావు... ‘‘ప్రభాకర్..నీ పెట్టుబడి మొత్తం అప్పుగా తీసుకున్న దానికి సరిపోయింది. దానికి సంబంధించిన దస్తావేజులు అన్నీ మా లాయరు దగ్గర పెట్టాను. నువ్వు భాగస్వామి అర్హత కోల్పోయావు. నేటి వరకు లెక్కలు చూసి లాభాలలో నీ వంతు వాటా ఇస్తున్నాను కాని ముందుగా ఈ దస్తావేజులపై సంతకాలు చెయ్యి’’ అంటూ అగ్రిమెంటు దస్తావేజులు ఇచ్చాడు రామారావు. ప్రభాకర్ ఏమీ తెలియని వాడిలా చదువుతున్నట్లు నటిస్తూ...హఠాత్తుగా రామారావు మీదకు లంఘించాడు. అనుకోని పరిణామానికి రామారావు కనుగుడ్లు తేలేశాడు. మంచం మీద కూర్చున్న రామరావును వెల్లకిల తోసేసి ముఖంపైన దిండును గట్టిగా అదిమి పట్టాడు, అప్పటి వరకూ బాత్రూంలో, ఈ క్షణం కోసమే అన్నట్టుగా వేచి చూస్తున్న మల్లయ్య అనే ఫామ్‌హౌస్ పూర్వపు కాపాలాదారు పరుగెత్తుకుంటూ వచ్చి రామారావు కాళ్ళను అదిమి పట్టుకున్నాడు. కొన్ని నిమిషాల్లో రామారావు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. తరువాత మల్లయ్య సాయంతో రామారావు లుంగీ ఊడ దీసి మెడకు తగిలించాడు. మరో చివర ఫ్యాన్‌కు కట్టి రామరావును మంచం మీద నుండి నిలబెట్టి మంచాన్ని పక్కకు తోశాడు. వెంటనే లుంగీ రామారావు మెడకు బిగుతుగా బిగుసుకుంది. ప్రభాకర్ ఆదుర్దాగా అగ్రిమెంటును తీసుకొని గదిలో నుండి బయటకు వచ్చాడు. మల్లయ్య లోపలి నుండి తలుపు గడియపెట్టి, బాత్రూమ్లోని వెంటిలేటర్ గుండా ఎలా వచ్చాడో...అలాగే తిరిగి వెళ్ళాలనే ప్రయత్నంలో ఇబ్బంది పడసాగాడు. బయట అతని కోసం ఆతృతగా చూస్తున్న ప్రభాకర్...మల్లయ్య రెండు చేతులు పట్టుకుని కిందకు లాగాడు. మల్లయ్యకు గాజు ముక్క గాయం చేసింది. ఆ రక్తపు మరక మల్లయ్యదేనని తేలింది. మల్లయ్యకు పాతిక వేలున్న సంచినిచ్చాడు. మళ్ళీ ఈ ఛాయలకు రావద్దని హెచ్చరిస్తూ...పారిపొమ్మన్నాడు ప్రభాకర్. తరువాత అగ్రిమెంట్ పేపర్లను తునాతునకలు చేసి ప్రక్కనే ఉన్న మామిడి చెట్టు కింద అగ్గిపుల్లతో తగులబెట్టాడు. ఎవరూ తనని చూడలేదని నిర్ధారించుకుని...అక్కడ నుండి నిష్క్రమించాడు ప్రభాకర్. అగ్రిమెంట్ దస్తావేజు మీద ప్రభాకర్ వేలి ముద్రలు సరి పోయాయి’’ అంటూ కాసిన్ని మంచి నీళ్ళు తాగి సూర్యానికి సంకేతాలిస్తూ ...తిరిగి చెప్పసాగాడు సుదర్శన్... ‘‘ఇంతకూ...మల్లయ్య గురించి చెప్పలేదు. వాడొక తాగుబోతు. గతంలో రామారావు ఫామ్ హౌస్‌లో మల్లయ్యని నియమించింది ప్రభాకరే. నిత్యం సారా మత్తులో ఉండే మల్లయ్య ఫామ్‌హౌస్‌ను పట్టించుకోక పోవడం వల్ల పనిలో నుండి రామారావు తొలగించాడు. ఆ కక్షతో రామరావును హత్య చేయడానికి మల్లయ్య పనికొస్తాడని అతని సహకారం తీసుకున్నాడు ప్రభాకర్. మల్లయ్య ఇంట్లో ప్రభాకర్ ఇచ్చిన రొక్కం...రక్తం మరక అంటిన చొక్కా దొరికాయి’’ ఇంతలో సూర్యం...ప్రభాకర్,మల్లయ్య ముఖాలపై నల్ల గుడ్డ తొడుగులు తొడిగి బయటకు నెట్టుకుంటూ వచ్చాడు. -యు.విజయశేఖర రెడ్డి -
తాళంచెవి రహస్యం
వసంతనగర్ కాలనీ..సంక్రాంతి పండగ సందర్భంగా దాదాపు కాలనీవాసులంతా వారి, వారి గ్రామాలకు తరలి వెళ్ళారు. వీధులన్నీ బోసి పోయాయి. ఒక వారం రోజులు పొతే గాని మళ్ళీ కాలనీకి నిండుదనం రాదు. పోలీసువ్యాను రాత్రింబగళ్ళు కాలనీచుట్టూ అప్పుడప్పుడు చక్కర్లు కొడ్తుండడంతో ఉన్న కొద్ది కుటుంబాలు నిర్భయంగా ఊపిరి పీల్చుకుంటున్నాయి. ఆరోజు శనివారం. కాలనీలో సంత జరుగుతుంది. ఇందుమతికి ఇంట్లో ఉల్లిపాయలు నిండుకున్నాయని గుర్తుకు వచ్చింది. అప్పుడు సమయం నాలుగు కావస్తోంది. ఇప్పుడైతే సంతలో ఎక్కువమంది ఉండరు. తన ఒక్కగానొక్క ముద్దులపట్టి పవిత్రను తీసుకొని వెళదామని బెడ్రూంలోకి వెళ్ళి చూసింది. పవిత్ర గాఢ నిద్రలో ఉంది. లేపాలంటే మనస్కరించలేదు. ‘సంత కాలనీ మెయిన్ రోడ్డు పైన జరుగుతుంది. చాలా దగ్గర కూడానూ. ఇలా వెళ్లి అలా వస్తాను. పవిత్రను ఎందుకు లేపాలి?’ అనుకుంది మనసులో. పవిత్రకూ అలవాటే. ఒకవేళ లేచినా అమ్మ బయటికి వెళ్లి ఉంటుందని అర్థం చేసుకుని చదువుకోవడమో లేదా తనకిష్టమైన బొమ్మలు గీసుకుంటూ కూర్చోవడమో పరిపాటి. పవిత్ర మరీ చంటి పాపేం కాదు. రెండవ తరగతి చదువుతోంది. ఇందుమతి కాటన్ సంచి తీసుకొని ఇంటికి తాళం పెట్టింది. ఆ పూట ఆమె భర్త భరణి మధ్యాహ్నం భోజనానికి రాలేదు. ఒకవేళ భరణి వస్తే తీసుకోడానికి వీలుగా యథాప్రకారం తాళం చెవిని గులాబి పూల కుండీ కింద రహస్యంగా పెట్టింది. ఇందుమతి గేటు దగ్గరకు వేసి సంతకు బయలు దేరింది. సంత అంతా తిరిగినా ఉల్లి జాడ కానరాలేదు. నిరాశతో వెనుదిరిగే సమయంలో... ‘‘ఉల్లిగడ్డా.. కిలో వందా..!’’ అనే కేక వినబడింది. అటువైపు తిరిగి చూసింది. కాస్త దూరంగా ఒక తోపుడు బండిని తోసుకుంటూ వస్తున్నాడొక ముసలాయన. ఇందుమతి బండిని చేరే సరికే క్యూ చాంతాడంత పెరిగింది. నిలబడక తప్ప లేదు. మొత్తానికి అరకిలో ఉల్లిగడ్డలు కొనుక్కొని ఇంటికి బయలు దేరింది. చాలా సమయం అయ్యిందని మనసులో గొణుక్కుంటూ. ఇల్లు చేరింది. తాళం తీసి లేదు. అంటే భరణి ఇంకా రాలేదనుకుంది. పూలకుండీ కింద ఉన్న తాళం చెవి తీసుకుంటూ అనుమానంగా పరిశీలించింది. ఇంటి తాళం తీసి అలికిడేమీ వినరాక పోవడంతో, పవిత్ర ఇంకా లేవలేదనుకుంది. వెళ్లి లేపాలనుకుంది. ఉల్లిగడ్డల సంచి వంటింట్లో సర్ది ‘‘పవిత్రా..’’ అంటూ పిల్చుకుంటూ బెడ్ రూంకు వెళ్ళింది. అక్కడి దృశ్యం చూసి నివ్వెరపోయింది. బీరువా తలుపులు తెరుచుకొని ఉన్నాయి. అందులోని బట్టలన్నీ చిందరవందరగా నేలపై పడి ఉన్నాయి. ఎవరో ఇంట్లో దూరినా పవిత్ర లేవలేదనే చిరు కోపంతో.. ‘‘ఏంటే నీ మొద్దు నిద్ర పాడుగాను. లే..’’ అంటూ పవిత్ర చెక్కిలిని తట్టింది. పవిత్ర ఉలుకూ, పలుకూ లేదు. ఒళ్ళు చల్లగా తాకింది. ఝల్లున వణకింది ఇందుమతి. పవిత్రని మరింత గట్టిగా తట్టింది. అయినా ఆమెలో చలనం లేదు. ఊపిరి ఆడుతుందో లేదోనని ఆందోళనతో పరీక్షించి చూసి స్థాణువయ్యింది. గుండెలు బాదుకుంటూ, ఎవరైనా కనబడుతారేమోనని వీధిలోకి పరుగు తీసింది. ఇంతలో గస్తీ తిరుగుతున్న పోలీసు వ్యాను వీధిలోని గుంపును చూసి ఆగింది. వీధి చివర వ్యాను ఆపి ఇద్దరు పోలీసుల పరుగెత్తుకుంటూ వచ్చారు. ‘‘ఏమయ్యిందమ్మా!’’ అంటూ ఒకతను ఆతృతగా అడుగుతుంటే, మరొకతను పరిసరాలు పరిశీలించసాగాడు. ఇందుమతి రెండు చేతులతో నొసలు కొట్టుకుంటూ ఇంట్లోకి వడి, వడిగా అడుగులులేసింది. ఆమెను అనుసరించారు పోలీసులు. బెడ్రూంలో మంచంపై విగత జీవిగా పడి ఉన్న పవిత్రను చూసి పోలీసులు కొయ్యబారిపోయారు. ఇందుమతి ఏడ్పు తారస్థాయికి చేరింది. పవిత్ర దగ్గరికి వెళ్తుంటే... ‘‘శవాన్ని తాకద్దమ్మా..’’ అంటూ ఒక పోలీసు అడ్డుకుంటున్నాడు. మరొక పోలీసు తమ వెనకాలే వచ్చిన జనాన్ని బయటికి వెళ్ళండని గద్దిస్తూ స్టేషన్‌కు ఫోన్ చేశాడు. అలాగే ఇందుమతిని ఫోన్ అడిగి భరణి నంబరు తెలుసుకొని వెంటనే రమ్మంటూ ఫోన్ చేశాడు. మరో పది నిముషాలలో కూకట్పల్లి నుండి పోలీసు వ్యానులో తన సిబ్బందితో దిగాడు ఎస్సై ఉదయబాబు. ఉదయబాబును చూస్తూనే కాలనీ ప్రెసిడెంటు పరుశురాం ఎదురు వెళ్లి నమస్కరించాడు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ ఘోరం జరగిందని విచారం వ్యక్తం చేశాడు. ఈ కేసును ఒక సవాలుగా తీసుకుంటున్నానని, నేరస్తుణ్ణి పదిరోజుల్లో పట్టుకుంటానని హామీ ఇచ్చాడు ఉదయబాబు. పోలీసు డిపార్ట్మెంటుకు సంబంధించిన ఫోటోగ్రాఫర్, వేలిముద్ర నిపుణులు, క్లూస్ టీమ్‌లు వారి, వారి పనుల్లో నిమగ్నమయ్యారు. కాసేపటికి ఉదయ బాబు బయటికి వచ్చాడు. ‘‘పాపను ఎప్పుడు చూశావు?’’ అంటూ ఇందుమతిని అడిగి జరిగిన విషయం తెలుసుకుంటున్నాడు. ఇంతలో అక్కడికి వచ్చిన భరణి ఇంటి వాతావరణం చూసి కంపించి పోయాడు. ఇందుమతి ఏడ్పు తారస్థాయిని చేరింది. భరణి ఎదపై వాలి భోరుమంది. భరణి కన్నీళ్ళ పర్యంతమయ్యాడు. పవిత్రను చూద్దామంటూ లోనికి వెళ్లబోతుంటే..పోలీసు లోనికి అనుమతించ లేదు. ‘‘చూడు భరణీ, ఏడుస్తూ కూర్చుంటే పనులు గావు. ముందుగా నీకు ఎవరి మీదైనా అనుమానం ఉంటే ఫిర్యాదు రాసివ్వు’’ అంటూ నెమ్మదిగా అడిగాడు ఇన్స్పెక్టర్. ‘‘ఎవరి మీదా అనుమానము లేదు’’ అంటూ కన్నీళ్లు తుడ్చుకోసాగాడు భరణి. ‘‘ఎవరైనా మీ కుటుంబానికి శత్రువులున్నారా?’’ ‘‘లేరు సర్’’ డగ్గుత్తికతో అన్నాడు. ‘‘సరే..బాగా ఆలోచించి మీ ఇంట్లో జరిగిన సంఘటన వివరిస్తూ.. ఒక దరఖాస్తు ఇవ్వు’’ అన్నాడు ఎస్పై. పవిత్ర హత్యకు సంబంధించిన పనులన్నీ పూర్తి చేసుకునే సరికి రాత్రి దాదాపు ఏడయ్యింది. శవాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపించాడు ఉదయబాబు. మార్చురీ గదిలో శవాన్ని భద్రపరచి ఆ మరునాడు ఉదయం పోస్ట్‌మార్టం చేశారు. రిపోర్ట్స్ సాయంత్రానికల్లా ఉదయబాబు చేతికి అందాయి. పవిత్రపై అత్యాచారం జరుగలేదు. ఊపిరాడక చనిపోయినట్లు రిపోర్టు ఉంది. ఎక్కడా వేలి ముద్రల జాడా కానరాలేదు. గదిలో, బీరువా పైనా కూడా క్లూస్ ఏమీ లభించలేదు. కేసు ముందుకు సాగిపోయే అవకాశాలు కనబడ్డం కష్టసాధ్యమనుకుంటూ కాసేపు దీర్ఘంగా ఆలోచించాడు. సమయం దాదాపు ఏడు కావస్తోంది. బయట చూస్తే ఎంతో రాత్రి అయినట్టు కనబడుతోంది. ఉదయబాబు ఒక సాధారణ పౌరునిలా టూ వీలర్‌పై వసంతనగర్ కాలనీ సొసైటీ కార్యాలానికి వెళ్ళాడు. అతణ్ణి చూడగానే పరుశురాం సాదరంగా ఆహ్వానించాడు. ‘‘ఆఫీసు ఎంత వరకుంటుంది సర్’’ ఆరా తీస్తూ కుర్చీలో కూర్చున్నాడు ఉదయబాబు. ‘‘ఏడు వరకే సర్.. కట్టేద్దామనే ప్రయత్నంలో ఉన్నాం’’ ‘‘పవిత్ర పాప హత్య కేసు గురించి కొంత సమాచారం కోసం వచ్చాను. కాలనీలో సి.సి. కెమెరాలు ఉన్నాయిగదా...ఒక సారి చూద్దామా’’ ‘‘తప్పకుండా సర్. పదండి చూద్దాం. అయితే అవి కేవలం కాలనీ ప్రధాన మార్గాన్నే కవరు చేస్తాయి. ఇంకా వీధి, వీధికి పెట్టలేదు ’’ అంటూ సి.సి. కెమెరాల కేంద్ర పరిశీలన గది లోకి తీసుకెళ్ళాడు పరుశురాం. సంత జరిగిన శనివారం రోజు ప్రధాన రోడ్డులో భరణి వాళ్ళు ఉండే వీధి మలుపు సునిశితంగా పరిశీలించసాగారు. ఇందుమతి ఇచ్చిన సమాచారం ప్రకారం నాలుగు గంటల తరువాత కనబడే దృశ్యాలలో ఇందుమతి కనబడే సరికి ఒక్కొక్క ఫ్రేం కదిలిస్తూ నింపాదిగా చూడసాగారు. ఒకతను హెల్మెట్ ధరించి బైక్ మీద అదే వీధిలోకి మళ్ళాడు. మరొకసారి వెనక్కి తిప్పి బైకు నంబరు నోట్ చేసుకున్నాడు ఉదయబాబు. మరింకేమీ విశేషాలు కనిపించలేదు. ‘‘ఓకే సర్. వస్తాను’’ అంటూ సెలవు తీసుకొని నేరుగా భరణి ఇంటికి దారి తీశాడు ఉదయబాబు. కాలింగ్ బెల్ నొక్కుదామని స్విచ్ కోసం చూస్తుంటే హాల్లో నుండి వాడి, వాడి మాటలు వినవస్తున్నాయి. భార్యాభర్తల మధ్య ఏదో వివాదం జరుగుతుందని గ్రహించాడు. కిటికీ పక్కకు నిలబడి రహస్యంగా వినసాగాడు. ‘‘నేను చెబితే విన్నావా? ఇల్లు ఖాళీ చేసి మా అమ్మ వాళ్ళు ఉండే కాలనీకి వెళ్దామన్నాను’’ అది భరణి గొంతు. ‘‘ఆ కాలనీలో పిల్లలెవరూ సరిగ్గా చదువుకోరు. జులాయిల్లాగా తిరుగుతుంటారు. ఈ కాలనీలో మంచి బడి ఉందని పవిత్ర కోసం రానని మొండికేశాను. మీరు ఊరికే ఇలా ఇల్లు మారుద్దామని సతాయించడం ఏంబాగూ లేదు’’ అంటోంది ఇందుమతి. ‘‘ఆ మొండితనం వల్లనే పవిత్రను పోగొట్టుకున్నాం’’ వెంటనే ఇందుమతి గొంతు ఉరిమింది. ‘‘ముందుగా ఇది చెప్పు. మన ఇంటి తాళంచెవి రహస్యం వేరే వానికి ఎలా తెలిసింది? నేను సంతకు వెళ్లి వచ్చి తాళం చెవి పూల తొట్టి కింద నుండి తీస్తుంటే అనుమానమేసింది. అది నేను పెట్టిన చోట కాకుండా కాస్తా పక్కకు జరిగి బయటకు సగం కనబడుతూ ఉంది. నువ్వు ఎవరికైనా చెప్పావా?’’ ‘‘నేనెందుకు చెబుతాను. నువ్వు దాస్తుంటే ఏ దొంగ వెధవ చూశాడో! వాడే తీసి మళ్ళీ హడావుడిలో అలా పెట్టి ఉంటాడను కుంటాను. వాడు దొరికితే గాని నిజం బయట పడదు’’ ‘‘ఈ విషయం మనం పోలీసులకు చెబుదాం’’ అంటూ ఏడ్వసాగింది ఇందుమతి. ఉదయబాబు వెంటనే కాలింగ్ బెల్కు పని చెప్పాడు. భరణి వచ్చి తలుపు తెరిచి ఆశ్చర్యంగా చూడసాగాడు. ‘‘నేను ఎస్సై ఉదయబాబును’’ అనగానే గుర్తుబట్టాడు భరణి. ‘‘సర్, రండి’’ అంటూ ఆహ్వానించాడు. ఇందుమతి తలెత్తి చూసి ఏడ్పును కొనసాగిస్తూనే ఉంది. ఉదయబాబు కుర్చీలో కూర్చుంటూ.. ‘‘మీ రిపోర్టులో డబ్బు గానీ, నగలు గానీ పోయినట్లు లేదు. ఏ వస్తువులూ కూడా పోలేదా!’’ అంటూ ప్రశ్నించాడు. ‘‘ఏవీ పోలేదు సర్’’ ‘‘బీరువాలో డబ్బు లేదా?’’ ‘‘పదివేల రూపాయలు బీరువాలోని సీక్రెట్ లాకర్లో అలాగే భద్రంగా ఉన్నాయి సర్. కేవలం బట్టలు మాత్రమే వెదజల్లాడు దొంగ’’ అని చేతులు నలుచుకుంటూ పోస్ట్‌మార్టం రిపోర్ట్స్ గురించి అడిగాడు భరణి. ఇందుమతి కళ్ళు పెద్దవిగా చేసుకుని..ఉదయబాబు ఏం చెబుతాడో అని తలెత్తి వినసాగింది. ‘‘పవిత్ర ఊపిరాడకుండా చనిపోయిందని వచ్చింది’’ అనగానే ఇందుమతి ఘొల్లుమంది. ‘‘ఈ ఘోరం ఎవరు చేశారో త్వరలోనే తేలుతుంది’’ అనుకుంటూ లేచి మరోసారి బెడ్ రూం లోకి దారి తీశాడు. అతణ్ణి అనుసరించాడు భరణి. గదంతా మరోసారి క్షుణ్ణంగా పరిశీలించాడు. తిరిగి హాల్లోకి వస్తూ.. ‘‘భరణీ నువ్వు ఏం చేస్తుంటావ్?’’ అని అడిగాడు. ‘‘సర్.. నేను టూ వీలర్ మెకానిక్‌ను.’’ ‘‘ఓకే..’’ అంటూ ఉదయబాబు బయలుదేరబోతుంటే ఇందుమతి కలుగజేసుకొని ఇంటి తాళం చెవిని రహస్యంగా దాచే పద్ధతిని చెప్పింది. ‘‘ఇది ఎవరో తెలిసినవారే చేశారని నా అనుమానం. నేను తప్పకుండా హంతకుణ్ణి పట్టుకుంటాను’’ అంటూ భరోసా ఇచ్చి బయలుదేరాడు ఉదయబాబు. ఉదయబాబు మరునాడు స్టేషన్‌కు రావడంతోనే త్రీ నాట్ త్రీ కానిస్టేబుల్ రవిని పిలిచి రాత్రి నోట్ చేసుకున్న బైక్ నంబరు చెప్పి ఆ బండి కలిగిన ఆసామిని పట్టుకు రమ్మని పురమాయించాడు. ఇంటి తాళంచెవి విషయంలో భరణి మీద అనుమానముంది. ‘ఇందుమతి తాళంచెవి పూల కుండీ కింద దాస్తుంటే ఆరోజు మరో వ్యక్తి చూసే అవకాశం చాలా తక్కువ. ఇదివరకే ఈ రహస్యం తెలిసిన వాడై ఉండాలి. అదును చూసి దొంగతనానికి ప్లాను వేశాడే అనుకుందాం. కాని డబ్బు పోలేదు కదా..మరి పవిత్రను ఎందుకు చంపినట్టు. అత్యాచారం చేయలేదు కదా!’ ఇలా ఉదయబాబు మదిలో నుండి ప్రశ్నలు తెరలు, తెరలుగా చెలమలో నీళ్ళూరినట్టు ఉబికి రాసాగాయి. అరగంటలో రవి బైకు అబ్బాయిని తీసుకు వచ్చాడు. అతణ్ణి చూస్తూనే కోపంగా లేచి లాఠీ ఊపుతూ ‘‘నీ పేరేంట్రా..’’ అంటూ గద్దించి అడిగాడు. ఉదయబాబు వీరావేశం చూసి గజ, గజా వణకుతూ... ‘‘సుదీర్ సర్’’ అన్నాడు. ‘‘ఈ బైకు నీదేనా?’’ ‘‘అవును సార్’’ ‘‘మొన్న శనివారం బైకు మీద సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో వసంతనగర్ వెళ్ళావుకదూ..’’ రెట్టించాడు ఉదయబాబు. ‘‘సర్.. శనివారం నా బైకు సర్వీసింగ్‌కు ఇచ్చాను. బండి ఆదివారం ఉదయం తీసుకున్నాను’’ అంటూ ఏదో జ్ఞప్తికి వచ్చిన వాడిలా పర్స్ వెదికాడు. అదృష్టవశాత్తు సర్వీసింగ్ బిల్లు దొరికింది. తీసి చూపించాడు సుధీర్. దాన్ని చూడగానే ఉదయబాబు కనుబొమ్మలు ముడిపడ్డాయి. దాని మీద డెలివరీ డేట్ కూడా ఉంది. వెంటనే భరణిని తీసుకురమ్మంటూ రవికి హుకుం జారీ చేశాడు. పోలీసు వ్యానులో వాయువేగంగా వెళ్లి పది నిముషాల్లో భరణిని హాజరు పరిచాడు రవి. ‘‘భరణీ.. ఈ బిల్లు చూడు’’ అంటూ చేతికి అందించాడు. అక్కడి వాతావరణం చూడగానే భరణి కాళ్ళూ, చేతులు చల్లబడ్డాయి. ‘‘అవును సార్ మా షాపుదే. నేనే ఇచ్చాను’’ అన్నాడు భయం, భయంగా. ‘‘అయితే ఈ బండి మీద మీ ఇంటికి ఎవరిని పంపావు? అబద్ధం చెప్పొద్దు. నా దగ్గర ఆధారాలున్నాయి. అబద్ధం చెప్పావనుకో..పోలీసు లాఠీ రుచి చూడాల్సి వస్తుంది’’ అంటూ లాఠీని గాలిలో ఝళిపించాడు. భరణి ముఖం పాలిపోయింది. ‘‘నిజం చెప్తాను సర్. ఆరోజు నేను మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వెళ్ళ లేదు. టిఫిన్‌బాక్స్ తీసుకు రమ్మంటూ రాజును పంపాను. ఒకవేళ ఇంట్లో ఎవరూ లేకుంటే తాళం చెవి ఎక్కడుంటుందో చెప్పాను’’ ‘‘మరి ఆరోజు ఎవరి మీదా అనుమానం లేదని చెప్పావు. నీ భార్యతో తాళంచెవి రహస్యం ఎవరికీ చెప్పలేదని వాదించడం నేనారాత్రి విన్నాను’’ అంటూ గర్జించాడు ఉదయబాబు. గతుక్కుమన్నాడు భరణి. ‘‘నిజమే సర్. రాజు ఇంట్లోకి వెళ్లేసరికి ఇల్లంతా చిందరవందరగా ఉందట. పవిత్రను పిలిస్తే పలుకలేదట. భయపడి వెంటనే తిరిగి వచ్చాడు’’ అంటూ తల దించుకుని రెండు చేతులా దండం పెట్టసాగాడు భరణి. ‘‘రాజు షాపులో ఉన్నాడా..’’ అంటూ ప్రశ్నించాడు ఉదయబాబు. ‘‘లేడు సర్..ఒంట్లో బాగుండడం లేదని ఆ మరునాటి నుండి రావడం లేదు’’ తల ఎత్తకుండానే సమాధానమిచ్చాడు భరణి. ‘‘వాడి ఇల్లెక్కడ?’’ అంటూ చిరునామా అడిగాడు ఉదయబాబు. భరణి చెప్పేడు. అంతా వింటున్న రవి, ఉదయబాబు చేతి సూచనలతో భరణిని సెల్లో వేసి రాజును తీసుకు రావడానికి వెళ్ళాడు. సుధీర్‌ను వెళ్ళిపొమ్మంటూ మరో చేత్తో సైగజేశాడు ఉదయబాబు. రవి, రాజును తీసుకురాగానే వేరే గదిలోకి తీసుకెళ్ళాడు ఉదయబాబు. నిజంగానే రాజు చాలా బలహీనంగా ఉన్నట్లు గమనించాడు. భయంతో వణికి పోతున్నాడు కూడా. ‘‘చూడు రాజూ..భరణిని తీసుకు వచ్చి లోపల వేశాను. నాలుగు తగిలిస్తే నువ్వు చేసిన నిర్వాకం నిజం చెప్పాడు. అలా లాఠీ దెబ్బలకు అవకాశం ఇవ్వకుండా నువ్వు ఆరోజు జరిగిన విషయం వివరంగా చెప్పు. నిజం చెప్పావనుకో..శిక్ష తక్కువ పడేలా చూస్తాను’’ అంటూ భరణి చెప్పిన విషయమంతా వివరించాడు. ‘‘నో సర్..అంతా అబద్ధం. భరణి చెప్పిందంతా అబద్ధం’’ అంటూ రాజు ఏడువసాగాడు. ‘‘అయితే నిజమేంటో చెప్పు’’ అంటూ నింపాదిగా అడిగాడు ఇన్స్పెక్టర్. ‘‘సర్..నేను దేవుని మీద, నా పిల్లల మీద ప్రమాణం చేసి చెబుతున్నాను’’ అంటూ కన్నీళ్లు తుడ్చుకోసాగాడు. ‘‘భరణి ఇంట్లో రోజూ గొడవేనట సర్. ఇల్లు మారి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని భరణి, ఆ ప్రసక్తే లేదని అతని భార్య రోజూ గొడవ పడేవారట. భరణి తనకు మనశ్శాంతి లేదని నాకు రోజూ చెబుతూ బాధపడే వాడు. ఆ ఇల్లు బాగానే ఉంది కదా! అని నేను నచ్చ జెప్పినా వినే వాడు కాదు. అసలు విషయం నాకు తెలుసు సర్.. భరణికి విధవరాలైన అతని మరదలితో అక్రమ సంబంధం ఉంది, అందుకే ఇల్లు అక్కడికి మారితే తనకు సౌకర్యంగా ఉంటుందని అతని ఆలోచన కావచ్చు. మొన్న శనివారం నన్ను చిన్న సాయం చేయమని కోరాడు. ఏంటని అడిగాను. ఈ రోజు శనివారం మా దగ్గర సంత జరుగుతుంది. ప్రతీ శనివారం నా భార్య పాపను తీసుకుని సంతకు వెళ్ళడం అలవాటు. ఈ రోజు వెళ్లి చూడు. ఒకవేళ ఈ రోజు కూడా వెళ్ళితే.. నువ్వు మా ఇంట్లోకి వెళ్లి దొంగలు పడ్డారన్నట్లుగా వస్తువులన్నీ చిందరవందర చేసిరా...ఆ దెబ్బతో నా భార్య భయపడి ఇల్లు ఖాళీ చేసేందుకు ఒప్పుకుంటుందని బతిమాలాడు. తాళంచెవి రహస్యం చెప్పాడు. అప్పుడే సర్వీసింగ్ పూర్తి అయిన బైకు ఇచ్చాడు. వేలి ముద్రలు పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకొమ్మంటూ గ్లౌస్ కూడా ఇచ్చాడు. నేను ఇంట్లోకి వెళ్ళేసరికి పాప పడుకుని ఉంది. నెమ్మదిగా శబ్దం రాకుండా బీరువా తెరచి బట్టలు కింద వేస్తుంటే పాప లేచింది. నన్ను గుర్తు పట్టింది. నేను భయపడి పోయాను. పాప..అమ్మా..! అని పిలువబోతుంటే..గట్టిగా నోరు మూశాను. పాప కనుగుడ్లు తెరిసే సరికి వణికిపోయాను. వెంటనే ఏర్పడకుండా తాళం వేసి తాళంచెవి మళ్ళీ పూల కుండీ కింద పెట్టి వచ్చాను సర్’’ అంటూ కన్నీళ్ళ పర్యంతమయ్యాడు రాజు. ఉదయబాబు నివ్వెర పోయాడు. రాజు చెప్పేది నిజమని నిర్ధారణ చేసుకున్నాడు. గోరుతో పోయే సమస్యకు భరణి గొడ్డలి వాడడం అవివేకమనుకున్నాడు. భరణి, రాజుల స్టేట్మెంట్స్ తీసుకొని కేసు ఫైల్ చేశాడు ఉదయబాబు. - చెన్నూరి సుదర్శన్ -
రైల్వే ట్రాక్.....చర్చి గంటలు
అర్ధరాత్రి పన్నెండు కావస్తోంది. మాలతి ఆందోళనగా కూతురు కోసం ఎదురు చూస్తోంది. రోజూ రాత్రి పది గంటలకల్లా ఇంటికి చేరుకునే పరిమళ ఈ రోజు అర్ధరాత్రి అవుతున్నా ఇంటికి రాలేదు. ఆమె నంబరుకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచాఫ్ అనే వినిపిస్తోంది. మాలతికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. మాలతి ఇల్లు నగరం పొలిమేరల్లోని బృందావన్ కాలనీలో ఉంది. పరిమళ నగరం నడిబొడ్డున ఉన్న ఒక బట్టల షాపులో సేల్స్‌గర్ల్‌గా పనిచేస్తోంది. రోజూ ఉదయం ఎనిమిది గంటలకే లంచ్‌బాక్స్ తీసుకుని ఇంట్లోంచి బయలుదేరి పక్కనే ఉన్న హైవేలో షేరింగ్ ఆటో ఎక్కుతుంది. పదిహేను నిమిషాల తర్వాత మెట్రో స్టేషన్ వద్ద ఆటో దిగి మెట్రోరైలు ఎక్కుతుంది. ఇరవై నిమిషాల తర్వాత గాంధీనగర్ వద్ద మెట్రో దిగి పది నిమిషాలు నడిచి తను పనిచేసే బట్టల దుకాణానికి చేరుకుంటుంది. ఈ ఉద్యోగం మానేసి చీకటి పడేలోగా ఇంటికి చేరుకునే మరేదైనా ఉద్యోగం చూసుకోమని మాలతి చాలాసార్లు కూతురికి చెప్పింది. కాని బట్టలషాపు వారు ఇచ్చే జీతం ఆకర్షణీయంగా ఉండటంతో ఆమె ఆ ఉద్యోగాన్ని వదులుకోవడానికి ఇష్టపడలేదు. ఇరవైరెండేళ్ల పరిమళ చూడటానికి హీరోయిన్లా అందంగా ఉంటుంది. అందమైన సేల్స్‌గర్ల్ ఉంటే గిరాకీ పెరుగుతుందనే ఆశతోనే ఆ బట్టలషాపు వారు పరిమళకు మంచి జీతం ఇస్తున్నారు. పరిమళ కూడా ఆ జీతానికి ఆశపడి రాకపోకలకు కష్టమవుతున్నా ఆ ఉద్యోగాన్ని వదులుకోలేక పోయింది. మాలతికి పరిమళ ఏకైక సంతానం. ఐదేళ్ల కిందట మాలతి భర్త హఠాత్తుగా గుండెపోటుతో మరణించాడు. మాలతి ఇంట్లోనే బట్టలు కుడుతూ, ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తూ కష్టపడి కూతురిని డిగ్రీ వరకు చదివించింది. అవసరార్థం కొన్ని అప్పులు చేసింది. ఇప్పుడు పరిమళ ఉద్యోగం చేస్తూ ఆ అప్పులు తీరుస్తోంది. హఠాత్తుగా టేబుల్‌పై పెట్టిన సెల్‌ఫోన్ మోగడంతో మాలతి ఉలిక్కిపడి ఫోన్ అందుకుంది. స్క్రీన్‌పై ఏదో కొత్త నంబరు కనిపించడంతో కంగారుగా ఫోన్ ఆన్‌చేసి ‘హలో’ అంది. అవతలి వైపు పరిమళ భోరున ఏడవటం వినిపించింది. భయంతో మాలతి గుండె ఆగినంత పనైంది. ‘‘ఏమైందమ్మా? ఎందుకేడుస్తున్నావ్?’’ కంగారుగా అడిగింది. ‘‘మమ్మీ! నేను ప్రమాదంలో చిక్కుకున్నాను. నేను ఆటోలో వస్తుంటే దారిలో ఆటో డ్రైవర్ సడన్‌గా ఆటో ఆపి నా మొహమ్మీద ఏదో మత్తుమందు స్ప్రే చేశాడు. నాకు వెంటనే స్పృహతప్పింది. స్పృహ వచ్చాక చూస్తే నేనొక చీకటి గదిలో ఉన్నాను. నన్ను తాళ్లతో కుర్చీకి కట్టేసి నోటికి గుడ్డ చుట్టారు. నా సెల్‌ఫోన్ ఉన్న హ్యాండ్‌బ్యాగ్ కూడా కనబడలేదు. గది బయట ఆ ఆటోడ్రైవర్ ఎవరితోనో ఫోన్లో మాట్లాడటం వినిపించింది. వాడి మాటలను బట్టి వాడు ఆడపిల్లలను కిడ్నాప్ చేసి ఎవరికో అమ్ముతాడని అర్థమైంది. వాడితో ఫోన్లో మాట్లాడినవారు వాణ్ణి తమ దగ్గరకు పిలిచారు కాబోలు. వాడు ఇప్పుడే వస్తున్నాను అంటూ ఇంకేదో మాట్లాడుతుండగా సడన్‌గా బ్యాటరీ డౌన్ కావడంతో ఫోన్ స్విచాఫ్ అయింది. వాడు ఫోన్‌ని కిటికీలో పెట్టి గది బయటి నుంచి తాళం వేసి హడావుడిగా ఆటో స్టార్ట్ చేసి వెళ్లిపోయాడు. నేను నాకు కట్టిన తాళ్లు విప్పుకోవడానికి ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. చివరకు కుడిచేతికి కట్టిన తాడు కొద్దిగా వదులైంది. నేను తలకాయ వంచి ఎలాగోలా నోటికి కట్టిన గుడ్డను కొద్దిగా పక్కకు జరపగలిగాను. తర్వాత కుర్చీతో సహా నేలపై కొద్ది కొద్దిగా జరుగుతూ కిటికీ దగ్గరకు చేరుకున్నాను. బయట చీకటిగా ఉంది. సాయం కోసం ఎన్ని కేకలేసినా ఎవరూ రాలేదు. అప్పుడే ఆటోవాడు కిటికీలో పెట్టి మర్చిపోయిన సెల్‌ఫోన్ కనిపించింది. కుడిచేత్తో ఎలాగోలా దాన్ని అందుకుని ఆన్‌చేసి నీతో మాట్లాడుతున్నాను. నువ్వు వెంటనే పోలీసులను పిలుచుకొచ్చి నన్ను విడిపించు’’ అంది. ‘‘నువ్వు ఎక్కడున్నావో చెప్పు. ఇప్పుడే పోలీసులను పిలుచుకొస్తాను’’ ఆత్రంగా అంది మాలతి. ‘‘నేనెక్కడున్నానో నాకే తెలీదు మమ్మీ. పోలీసులకు ఈ ఫోన్ నంబరిస్తే వాళ్లు లొకేషన్ తెలుసుకుని ఇక్కడికొస్తారు. నువ్వు వెంటనే..’’ పరిమళ మాటలు ముగియకుండానే బ్యాటరీ డౌన్ కావడంతో ఫోన్ స్విచాఫ్ అయిపోయింది. మాలతి ‘‘హలో.. హలో..’’ అంటూ ఫోన్ పట్టుకుని పిచ్చిదానిలా అరవసాగింది. ఆమె అరుపులు విని పక్కింటి సుబ్బారావు పరుగెత్తుకొచ్చాడు. ‘‘ఏమైంది మాలతిగారు?’ అని అడిగాడు. మాలతి ఏడుస్తూ జరిగినదంతా చెప్పింది. ఆయన వెంటనే మాలతిని తన బైకుపై పోలీస్‌స్టేషన్‌కి తీసుకెళ్లాడు. నైట్ డ్యూటీలో ఉన్న ఎస్సై విజయ్‌కుమార్ మాలతి చెప్పినదంతా విన్నాడు. వెంటనే టెక్నికల్ ఎక్స్పర్ట్ ద్వారా మాలతికి వచ్చిన ఫోన్ నంబర్ లొకేషన్ ట్రేస్ చేయడానికి ప్రయత్నించాడు. సాంకేతిక సమస్య వల్ల లొకేషన్ తెలుసుకోవడానికి కొంత సమయం పడుతుందని తెలిసింది. ‘‘ఆలస్యమైతే ప్రమాదం. మీ అమ్మాయి తనను బంధించిన ప్రాంతం గురించి చూచాయగా కూడా చెప్పలేదా?’’ మాలతిని అడిగాడు విజయ్. ‘‘ఒక నిర్జన ప్రాంతంలో చీకటి గదిలో ఉన్నానని మాత్రమే చెప్పింది’’ అంటున్న మాలతి ఉన్నట్టుండి ఏదో గుర్తువచ్చి ‘‘నా ఫోన్లో అన్ని కాల్స్ రికార్డవుతాయి. పరిమళ కాల్ కూడా రికార్డయి ఉంటుంది’’ అని చెప్పి‘‘మీరు కూడా వినొచ్చు’’ అంటూ తన ఫోన్లోని పరిమళ కాల్ రికార్డింగ్‌ను వినిపించింది. విజయ్ దాన్ని సావధానంగా విన్నాడు. రెండోసారి కూడా విన్నాడు. అతని భృకుటి ముడిపడింది. ‘‘మీ అమ్మాయి క్లూ ఇవ్వకపోయినా ఈ ఫోన్ మాకు క్లూ ఇచ్చింది. ఒకటి కాదు, రెండు క్లూస్! మీ అమ్మాయి ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు లీలగా ఒక శబ్దం వినిపించింది. అది ట్రైన్ వెళుతున్న శబ్దం. అంటే మీ అమ్మాయి ఉన్న చోటుకు దగ్గర్లో రైల్వే ట్రాక్ ఉందని తెలుస్తోంది. తర్వాత ఎక్కడో గంటలు మోగుతున్న చప్పుడు కూడా వినిపించింది. నేను లెక్కపెట్టాను. సరిగ్గా పన్నెండుసార్లు గంటలు మోగాయి. అప్పుడు సమయం కూడా సరిగ్గా పన్నెండు గంటలు. మామూలుగా ఇలాంటి గంటలు చర్చిల్లో మోగుతాయి. అంటే మీ అమ్మాయి ఉన్న ప్రాంతంలో ఒక చర్చి కూడా ఉందని తెలుస్తోంది’’ విజయ్ మాటలు విని కానిస్టేబుల్ కిరణ్ ఆత్రంగా లేచి నిల్చున్నాడు. ‘‘సార్! ఈ ప్రాంతం ఎక్కడుందో నాకు తెలుసు. హైవేలోంచి కుడిపక్క ఫర్లాంగు దూరం లోపలికి వెళితే ఒక క్రైస్తవుల శ్మశానం వస్తుంది. దాని పక్కన ఒక చర్చి ఉంది. ఇంకాస్త దూరంలో రైల్వే ట్రాక్ కూడా ఉంది’’ అన్నాడు కిరణ్ ఉత్సాహంగా. ‘‘వెరీగుడ్! మనం వెంటనే అక్కడికెళ్లాలి’’ అంటూ విజయ్ లేచి నిల్చున్నాడు. మాలతి, సుబ్బారావులను అక్కడే ఉండమని చెప్పి కిరణ్‌తో కలసి మోటార్బైకుపై హైవే వైపు దూసుకెళ్లాడు. ఆగమేఘాల మీద శ్మశానం దగ్గరకు చేరుకున్నాడు. చర్చి దాటి ముందుకెళ్లాక పాడుబడిన ఎన్నో బిల్డింగులు కనిపించాయి. పరమిళను ఏ బిల్డింగులో బంధించారో కనుక్కోవడం కష్టమనిపించింది. అంతలో హైవే వైపు నుంచి ఒక ఆటో వస్తున్న శబ్దం వినిపించింది. విజయ్ వెంటనే బైకును ఒక గోడచాటున నిలబెట్టి, కిరణ్‌తో కలసి చీకట్లో నక్కి ఆటో కోసం ఎదురు చూడసాగాడు. కాసేపట్లో ఆటో అక్కడికొచ్చింది. ఒక పెద్ద బిల్డింగ్ ముందు గేటులోంచి లోపలకు వెళ్లింది. విజయ్, కిరణ్‌లు చప్పుడు కాకుండా నడుస్తూ ఆటోని అనుసరించారు. లోపల ఖాళీ స్థలంలో వరుసగా కొన్ని గదులు ఉన్నాయి. తాళం వేసి ఉన్న ఒక గది ముందు ఆటో ఆగింది. డ్రైవర్‌తో పాటు మరో ముగ్గురు వ్యక్తులు కిందకు దిగారు. అందరూ తాగి వచ్చారని వారి మాటల బట్టి తెలుస్తోంది. ‘‘ఈసారి నేను పట్టుకొచ్చిన పిల్ల హీరోయిన్లా ఉంది. బ్లూఫిల్మ్ తీసి బెదిరిస్తే చాలు, మనం కోరినప్పుడల్లా వచ్చి మన కోరిక తీరుస్తుంది’’ హుషారుగా అన్నాడు ఆటో డ్రైవర్. అతను జేబులోంచి తాళంచెవి తీసి గది తాళం తెరవగానే విజయ్ హఠాత్తుగా వారిపై టార్చి వెలిగించి ‘‘ఖబడ్దార్! కదిలితే కాల్చేస్తాం. మిమ్మల్ని పోలీసులు చుట్టుముట్టారు. మర్యాదగా లొంగిపోండి’’ అని హెచ్చరిస్తూ రివాల్వర్ తీసి గాల్లోకి పేల్చాడు. నలుగురూ అదిరిపడ్డారు. డ్రైవర్ హఠాత్తుగా పారిపోవాలని ప్రయత్నించాడు. విజయ్ వెంటనే రివాల్వర్ పేల్చాడు. తూటా కాలికి తగలడంతో డ్రైవర్ విరుచుకుపడ్డాడు. అది చూసి మిగతా ముగ్గురూ ప్రాణభయంతో చేతులు పైకెత్తారు. కానిస్టేబుల్ కిరణ్ వెంటనే వారికి బేడీలు వేశాడు. ‘‘మీ మేలు జన్మలో మర్చిపోలేం సార్! మా అమ్మాయి బతుకు బజారుపాలు కాకుండా కాపాడారు’’ పరిమళను క్షేమంగా అప్పగించిన విజయ్‌కు చేతులు జోడిస్తూ అంది మాలతి. ‘‘మా డ్యూటీ మేం చేశాం. మీ అమ్మాయి చేసిన కాల్ మీరు రికార్డు చెయ్యడం వల్లనే ఇదంతా సాధ్యమైంది’’ అంటూ విజయ్ అంతలోనే ఏదో గుర్తొచ్చి ‘‘నువ్వు స్విచాఫ్ అయిన ఫోన్లో ఎలా మాట్లాడగలిగావమ్మా?’’ అని పరిమళను అడిగాడు. ‘‘ప్రతి సెల్‌ఫోన్ బ్యాటరీలోనూ కొంత రిజర్వ్ బ్యాటరీ ఉంటుందని నాకు తెలుసు సార్. స్టార్ త్రీత్రీ సెవెన్ జీరో హ్యాష్ కొడితే బ్యాటరీ కొద్దిగా చార్జ్ అవుతుంది. అప్పుడు కొద్ది నిమిషాలు ఫోన్లో మాట్లాడవచ్చు. నేను అలాగే చేసి అమ్మతో ఫోన్లో మాట్లాడాను’’ చెప్పింది పరిమళ. ‘‘చాలా మంచిపని చేశావు. అయితే ముందుగా మా హెల్ప్‌లైన్‌కి ఫోన్‌చేసి ఉంటే ఇంకా బాగుండేది. ఏదేమైనా ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రతి ఆడపిల్ల ధైర్యం కోల్పోకుండా అందుబాటులో ఉన్న ఏదో ఒక సాధనాన్ని వాడుకుని పోలీసుల సాయం పొందే ప్రయత్నం చెయ్యాలి. చిన్న క్లూ దొరికినా చాలు.. మేం మిమ్మల్ని కాపాడతాం’’ అన్నాడు ఎస్సై విజయ్. -
ఈస్టర్ ఎగ్
ఐదంతస్తుల దియా అపార్ట్మెంట్ కాంప్లెక్స్ అది. సెకండ్ ఫ్లోర్‌లోని ఓ ఫ్లాట్ లో రాత్రి దొంగలు పడి నగలు, నగదు, వెండిసామాను, పట్టుచీరలు వగైరాలు ఎత్తుకుపోయారు. ఆ ఫ్లాట్ లో నివసించే కుటుంబం గత సాయంత్రం ఓ ఫ్రెండ్ ఇంట్లో పార్టీకి వెళ్ళి, తెల్లవారు జామున తిరిగివచ్చేసరికి ఆ దొంగతనం జరిగింది. యథావిధిగా పోలీసులు రంగప్రవేశం చేశారు. వారితోపాటే పోలీసుకుక్క కూడా. ఫోరెన్సిక్ నిపుణులు వేలిముద్రల కోసం వెదుకుతూంటే పోలీసుకుక్క ఇల్లంతా వాసనచూస్తూ మెట్ల మీదుగా సెల్లార్‌కి దారి తీసింది. అక్కడంతా తిరిగి వెనుక పక్కనున్న ప్రహరీగోడ దగ్గర ఆగిపోయింది. దొంగలు ఆ గోడ దూకి పారిపోయి ఉంటారని గ్రహించారు పోలీసులు. గోడబైటకు వెళ్ళారు. నేలపైన బూట్ల జాడలు, త్రిచక్ర వాహనపు టైర్ల జాడలూ అస్పష్టంగా గోచరించాయి. కాంప్లెక్స్ వాచ్ మేన్ కథనం ప్రకారం– రాత్రి తొమ్మిది గంటలకు ఫ్లోర్స్ అన్నీ తిరిగి వచ్చాడు అతను రోజూలాగే. తరువాత కొంతసేపటికి సెకండ్ ఫ్లోర్లో ఎవరో ఆర్డర్ చేశారంటూ పిజ్జా బాయ్ వచ్చాడు. మరో పావుగంటకు థర్డ్ ఫ్లోర్ కంటూ మరో ఫుడ్ డెలివరీ బాయ్ వచ్చాడు. ఇద్దరూ యూనిఫామ్స్‌లో ఉన్నారు. అక్కడది సామాన్యమే కావడంతో పెద్దగా పట్టించుకోలేదు. ఆ తరువాత తను వాష్‌రూమ్‌కి వెళ్ళాననీ, డెలివరీ బాయ్స్ తిరిగివెళ్ళడం చూడలేదనీ చెప్పాడు. అయితే ఆ రాత్రి సెకండ్, థర్డ్ ఫ్లోర్స్‌లోని వాళ్ళెవరూ పిజ్జాకానీ, ఫుడ్ కానీ ఆర్డర్ చేయలేదని విచారణలో తేలింది. డెలివరీ బాయ్స్ రూపంలో వచ్చింది దొంగలేనని తేల్చారు పోలీసులు. నెలరోజులుగా నగరంలోని కాంప్లెక్స్‌లలో పదిహేను చోరీలు జరిగాయి. దొంగల టార్గెట్ – తాళం వేసున్న ఫ్లాట్స్. పోలీసుల నైట్ పెట్రోల్ ముమ్మరమయింది. అయినా పరిస్థితి మెరుగుకాలేదు. ఒక్క కేసులోనూ ‘బ్రేక్ త్రూ’ లేకపోవడంతో పోలీసులు ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పలేదు. ఇటు ప్రజల నుంచి, అటు ప్రభుత్వం నుంచి ఒత్తిడి పెరగడంతో పోలీస్ కమీషనర్ ఆ కేసులను క్రై మ్బ్రాంచ్ కి అప్పగించాడు. దియా కాంప్లెక్స్‌లో దొంగతనం జరిగిన రెండోరోజున పోలీస్ స్టేషన్ కి వచ్చాడు నలభయ్యేళ్ళ అంబయ్య. అక్కడికి నాలుగు వీధులవతలనున్న సృజనా కాంప్లెక్స్‌లో వాచ్‌మేన్‌గా పనిచేస్తున్నాడు. సెంట్రీ దగ్గరకు వెళ్ళి, ‘‘సార్! రెండురోజుల క్రితం దియా కాంప్లెక్స్‌లో జరిగిన దొంగతనం నేనే చేశాను’’ అన్నాడు. సెంట్రీ వాడివంక ఎగాదిగా చూసాడు. దొంగ తనంతట తానుగా వచ్చి కన్ఫెస్ చేయడం వింతే మరి! అదే సమయంలో లోపలి నుంచి బైటకు వచ్చిన ఏఎస్సై విషయం ఆలకించి, ‘‘వీణ్ణి లాకప్‌లో పడెయ్. నేను తిరిగొచ్చాక చూద్దాం’’ అన్నాడు బైక్ దగ్గరకు నడుస్తూ. ఏదో కేసు విషయంలో ఎంక్వైరీకి బయలుదేరాడు అతను. సెంట్రీ అంబయ్యను లాకప్‌లోకి తోసి తలుపు మూస్తూంటే, ‘‘మరి మందు ఎప్పుడు పోయిస్తారు నాకు?’’ అనడిగాడు అంబయ్య. వాడి చెంపమీద ఒకటి ఇచ్చుకున్నాడు సెంట్రీ. మొగుణ్ణి లాకప్‌లో పెట్టారని ఆలకించి పరుగెత్తుకొచ్చింది అంబయ్య పెళ్ళాం గౌరమ్మ. ‘‘నామొగుడు తాగుబోతే కానీ దొంగనాయాల కాదు సారూ! మందు పడకపోతే బుర్ర గీరెక్కిపోద్ది ఈడికి. రెండురోజులుగా మందుకు డబ్బుల్లేక ఒడ్డునపడ్డ చేపపిల్లలా గిలగిలా కొట్టుకుంటూ తిక్కతిక్కగా ప్రవర్తిస్తున్నాడు’’ అంటూ మొత్తుకుంది. మొగుడు పనిచేస్తున్న కాంప్లెక్స్‌లోని ఇళ్ళలో పనిచేస్తుందామె. తన జీతమంతా తాగుడుకు పోసేసి, మందుకు డబ్బులు ఇవ్వమంటూ పెళ్ళాన్ని వేధిస్తుంటాడు అంబయ్య. గౌరమ్మ డబ్బులివ్వకపోవడంతో రెండురోజులుగా మందు బంద్ అయిపోయింది వాడికి. ‘‘మొన్నామధ్య పోలీసోళ్ళు స్టేషన్‌కి తీసుకెళ్ళి మందు పోయించి పంపారని మస్తాన్ చెప్పాడు. అందుకే’’ అన్నాడు అంబయ్య. రెండువారాల క్రితం తన సెల్ ఫోన్ పోయిందని కస్టమర్ ఒకడు కంప్లెయింట్ ఇవ్వడంతో అనుమానం మీద మటన్ కొట్లో పనిచేసే మస్తాన్‌ను తీసుకొచ్చి ఒళ్ళంతా కుళ్ళబొడిచారు పోలీసులు. చివరికి అతను నిర్దోషి అని తేలడంతో ఒళ్ళునొప్పులు తగ్గడానికి ఫూటుగా మందు కొట్టించి ఇంటికి పంపేసారు. అదీ కథ! గౌరమ్మతోపాటు వచ్చిన సృజనా కాంప్లెక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పోలీసులతో మాట్లాడి అంబయ్యను విడిపించాడు. ‘‘ఇంకోసారి ఇలా స్టేషన్‌కి వచ్చి పోలీసులతో ఆడుకున్నావంటే ఎన్కౌంటర్ చేసిపడేస్తాం, జాగ్రత్త!’’ అంటూ స్టేషన్ రైటర్ వార్నింగ్ ఇచ్చాడు. ‘‘ఎన్ కౌంటర్ చేశాక మందు పోయిస్తారా సార్?’’ అనడిగాడు అంబయ్య ఆశగా. గౌరమ్మకు ఒళ్ళు మండిపోయింది. ‘‘నీకు శ్రాద్ధం పెడతారు! పద, తాగుబోతు సచ్చినోడా!’’ అంటూ రెండు తగిలించి మొగుణ్ణి బైటకు తోసుకుపోయింది. బాబీకి పదేళ్ళుంటాయి. అయిదవ తరగతి చదువుతున్నాడు. సజనా కాంప్లెక్స్ లో ఉంటాడు. రాత్రి భోజనాల దగ్గర స్కూలు విశేషాలు, స్నేహితుల కబుర్లూ చెబుతూ గలగల మాట్లాడే బాబీ ఆ రోజు మౌనంగా ఉండడం చిత్రంగా అనిపించింది వాడి తల్లిదండ్రులకు. ‘‘ఏరా బాబీ, ఈరోజు విశేషాలేవీ లేవా?’’ నవ్వుతూ అడిగాడు తండ్రి భాస్కర్‌రావు. బాబీ బదులు ఇవ్వలేదు. ఏదో కారణం ఉన్నదని గ్రహించిన శకుంతల, ‘‘ఏరా కన్నా! ఇవాళ అదోలా ఉన్నావెందుకు?’’ అనడిగింది కొడుకును. ‘‘మమ్మీ! రాత్రి నా ఫ్రెండ్ సతీష్ ఇంట్లో దొంగలు పడ్డారట. బంధువుల ఇంట్లో బర్త్ డే పార్టీకి వెళ్ళొచ్చేలోపున అన్నీ ఎత్తుకుపోయారట’’ చెప్పాడు బాబీ విచారంగా. ‘‘ఈ మధ్య సిటీలో దొంగలబెడద ఎక్కువయిపోయింది. బైటకు వెళ్ళేప్పుడు కాస్త చూసుకోమని పక్కింటివాళ్ళకు చెప్పుండాల్సింది’’ అంది శకుంతల. ‘‘పోలీసులు దొంగల్ని పట్టుకోలేరా, డాడీ?’’ అడిగాడు బాబీ. ‘‘ఎందుకు పట్టుకోరూ? కాకపోతే కొంత టైమ్ పడుతుందంతే’’ అన్నాడు భాస్కర్‌రావు. ‘‘మనింట్లో కూడా దొంగలు పడతారా, డాడీ?’’ కొడుకు హఠాత్తుగా అడగడంతో చిన్నగా ఉలిక్కిపడ్డాడు అతను. ‘‘ఛ ఛ... మనింట్లో ఎందుకు పడతారు? మనం ఇల్లు వదలి ఎక్కడికీ వెళ్ళం కదా! తాళం వేసిన ఇళ్ళనే దోచుకుంటారు దొంగలు’’ అన్నాడు. అయితే తన ఆలోచన ఎంత తప్పో తెలుసుకునే పరిస్థితి త్వరలోనే ఎదురవబోతోందన్న సంగతి ఎరుగడు అతను! తెల్లవారు జామున మూడు గంటలకు డోర్ బెల్ మోగడంతో, ఎవరు వచ్చారా అనుకుంటూ, నిద్రకళ్ళ తోనే వెళ్ళి తలుపు తెరిచాడు భాస్కర్‌రావు. ముఖాలకు ముసుగులు, చేతులకు గ్లవ్సూ ఉన్న ఆగంతకులు ఇద్దరు లోపలకు చొరబడ్డారు. వారి చేతుల్లో కత్తులు ఉన్నాయి. నిద్రపోతూన్న శకుంతలను, బాబీనీ కూడా లేపి, ముగ్గురినీ కుర్చీలకు కట్టేసి. నోళ్ళలో గుడ్డలు కుక్కేసారు వాళ్ళు. కత్తులతో బెదిరించి బీరువా, లాకర్ల తాళపుచెవులను తీసుకుని నగలు, డబ్బు, వెండిసామానూ దోచుకుపోయారు. ఆ ఆపరేషన్ అంతా పావుగంటలో పూర్తయిపోయింది. పోతూ పోతూ వీధి తలుపులు బయట గెడపెట్టేసారు. ఉదయం ఆరుగంటలకు పాలప్యాకెట్స్ తెచ్చే కుర్రాడు వచ్చినప్పుడు కానీ, ఆ దొంగతనం బైటపడలేదు. ఆ కుర్రాడి కేకలకు ఇరుగుపొరుగులు పరుగెత్తుకు రావడం, ఆ కుటుంబసభ్యులను బంధవిముక్తులను చేయడం, పోలీసులకు ఫోన్ చేయడం జరిగాయి. అరగంట తరువాత క్రై మ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శివరామ్ సిబ్బందితో వచ్చాడు. యథావిధిగా దర్యాప్తు తతంగం ఆరంభమయింది. దంపతులను ఏవేవో ప్రశ్నలు వేశాడు ఇన్స్పెక్టర్. చివరగా, ‘‘దొంగలను మళ్ళీ చూస్తే గుర్తుపట్టగలరా?’’ అనడిగాడు. వారి ముఖాలకు ముసుగులు ఉన్నందున సాధ్యంకాదని చెప్పారు వాళ్ళు. వారికి సంబంధించిన ఏ చిన్న విషయమైనాసరే గుర్తుచేసుకోవడానికి ప్రయత్నించమనీ, రెండురోజుల్లో ఐడెంటిఫికేషన్ పెరేడ్ ఏర్పాటుచేస్తాననీ చెప్పాడు ఇన్స్పెక్టర్ గుమ్మంవైపు నడుస్తూ. ‘‘అంకుల్! ఆగండి’’ అని అరిచాడు బాబీ హఠాత్తుగా. బాబీ క్లోజ్ ఫ్రెండ్ రాజు ఇల్లు సృజనా కాంప్లెక్స్‌కి పక్కవీధిలోనే ఉంది. ఇద్దరూ ఒకరి ఇంటికి ఒకరు వెళ్ళి ఆడుకుంటుంటారు. ఒక్కోసారి రాజు బాబాయి జార్జ్ వారితో చేరతాడు. జార్జ్ బ్యాచిలర్. ఉద్యోగం చేస్తున్నాడు. రాబోయే ఈస్టర్ పండుగకు బాబీకి ‘ఈస్టర్ ఎగ్’ గిఫ్ట్‌గా ఇస్తానని చెప్పాడు రాజు. ఈస్టర్ ఎగ్ ఎలా ఉంటుందని అడిగాడు బాబీ కుతూహలంతో. అది ‘సర్ప్రైజ్’ అన్నాడు రాజు. జార్జ్ ని అడిగాడు బాబీ. ‘ఈస్టర్’ పండుగకు క్రై స్తవ సోదరులు కోడిగ్రుడ్డును రంగులతో డెకొరేట్ చేసి బంధుమిత్రులకు బహూకరించడం కద్దు. దాన్నే ‘ఈస్టర్ ఎగ్’ అనీ వ్యవహరిస్తారు. జార్జ్ ఆ సంగతులు చెప్పబోతే, రాజు చెప్పొద్దని సైగచేసాడు బాబాయికి. అది గమనించిన బాబీ, ‘‘ప్లీజ్, అంకుల్! చెప్పండి’’ అన్నాడు. ‘‘నీ ఫ్రెండ్ నిన్ను సర్ప్రైజ్ చేయాలనుకుంటున్నాడు. కనుక నువ్వు ఈస్టర్ వరకు ఆగవలసిందే’’ నవ్వుతూ అన్నాడు అక్కడే ఉన్న దేవా. జార్జ్ ఫ్రెండ్ అతను. ఇంచుమించు జార్జ్ వయసే వుంటుంది. ఎప్పుడూ ఖరీదైన దుస్తులు ధరిస్తూ స్టైలిష్ గా ఉంటాడు. పల్సర్ బైక్ లో వస్తాడు. కించిత్తు నిరుత్సాహం చెందాడు బాబీ. ఆ తరువాత దాని సంగతే మరచిపోయాడు. ‘‘అంకుల్! దొంగల్లో ఒకణ్ణి నేను గుర్తుపట్టగలను’’ అన్న బాబీ వంక ఇన్స్పెక్టర్ ఉత్సాహంతో చూస్తే, వాడి తల్లిదండ్రులు తెల్లబోయి చూశారు. బాబీ మదిలో దోపిడీ ఘటన మెదిలింది. దొంగలు దోపిడీ సొమ్ములతో నిష్క్రమిస్తూండగా, వారిలో ఒకడు వెనక్కి తిరిగి బాబీ దగ్గరకు వచ్చాడు. ‘‘హే! ఈస్టర్ ఎగ్ బోసిపోయిన మీ బీరువా లాకర్లా ఉంటుంది!’’ అని ఫకాలున నవ్వి వెళ్ళిపోయాడు. తన ఫ్రెండ్ రాజు తనకు ఈస్టర్ ఎగ్ ని ప్రెజెంట్ చేస్తాననడం, దాని గురించి తాను అతని బాబాయిని అడగడం మొదలుకుని, దొంగల్లో ఒకడు వెళుతూ చేసిన కామెంట్ వరకు వివరంగా ఇన్స్పెక్టర్తో చెప్పాడు బాబీ. ఇన్స్పెక్టర్కి తీగ దొరికింది. ‘‘వెల్ డన్, మై బాయ్!’’ అంటూ బాబీని మెచ్చుకుని బైటకు నడిచాడు, డొంకను కదలించడానికి. ఇన్స్పెక్టర్ శివరామ్ కన్ఫ్రంట్ చేయడంతో కంగారుపడ్డ జార్జ్ దొంగతనాల గురించి తనకేమీ తెలియదని మొత్తుకున్నాడు. అతని గురించి రహస్యంగా ఎంక్వైరీ చేసిన శివరామ్‌కి అతని మాటలపై నమ్మకం కలిగింది. బాబీ ఈస్టర్ ఎగ్ గురించి అడిగినప్పుడు వున్న తన స్నేహితుడు దేవా ఏడాది క్రితం తనకు ఫేస్బుక్లో పరిచయమయ్యాడనీ, అతని గురించి పెద్దగా వివరాలేవీ తెలియవనీ చెప్పాడు జార్జ్. పోలీసులు దేవాని పికప్ చేసుకోవడానికి వారం రోజులు పట్టింది. అదీ – చెన్నయ్ లో! థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ చవిచూశాకగానీ దేవా నేరం ఒప్పుకోలేదు. బీటెక్ డ్రాపవుట్ననీ, ఉద్యోగం లేదనీ, గాళ్ ఫ్రెండ్స్, పబ్‌లు, పార్టీలతో విలాసవంతమైన జీవితానికి అలవాటుపడి డబ్బుల కోసం దొంగతనాలకు పాల్పడుతున్నట్టు చెప్పాడు. రహీం అనే ఆటోడ్రైవర్ తనకు పార్ట్నర్గా ఉన్నాడనీ, ఫేస్ బుక్ పరిచయమనీ కూడా చెప్పాడు. తన ‘అత్యుత్సాహమే’ బాబీకి తనను పట్టియిచ్చిందని చింతించాడు. ఇటీవల నగరంలో సంచలనం కలిగించిన దొంగతనాలలో చాలమటుకు తామిద్దరూ కలసి చేసినవేనని ఒప్పుకున్నాడు దేవా. దొంగిలించిన సొత్తును అమ్మడానికీ చెన్నయ్ వెళ్ళినట్టు చెప్పాడు. రెండురోజుల తరువాత రహీం కూడా అరెస్ట్ అయ్యాడు. క్రైమ్ సీన్‌ని రీక్రియేట్ చేయడం కోసమని నిందితుల్ని సృజనా కాంప్లెక్స్‌కి తీసుకువెళ్ళారు పోలీసులు. దేవాని చూసి పరుగెత్తుకొచ్చాడు వాచ్‌మేన్ అంబయ్య. ‘‘ఏం సార్? ఎప్పుడు కనిపించినా అడక్కుండానే మందుకు డబ్బులిచ్చేవారు. ఆ రోజు నేను వెంటపడ్డా చూడనట్టు వెళ్ళిపోయారేం మీరు?’’ అనడిగాడు. ‘‘ఇతను నీకు తెలుసా?’’ అంటూ ఆరా తీశాడు ఇన్స్పెక్టర్ శివరామ్. ఎప్పుడైనా బాబీ చెబితే రాజును పిలుచుకురావడానికి వాళ్ళింటికి వెళ్ళేవాడు అంబయ్య. అక్కడ దేవా కనిపించేవాడు. మందుకు డబ్బులు ఇచ్చేవాడు. బాబీ ఇంట్లో దొంగతనం జరిగిన రోజు తెల్లవారు జామున సృజనా కాంప్లెక్స్ బైట సూట్ కేసుతో వెళుతూన్న దేవాని గుర్తించి డబ్బులు అడుగుదామని వెంటపడ్డాడు అంబయ్య. దేవా పట్టించుకోకుండా రోడ్ అవతల ఆగి ఉన్న ఆటోలో ఎక్కి వెళ్ళిపోయాడు. అంబయ్య అదే చెప్పాడు ఇన్స్పెక్టర్తో. అంబయ్య మాటలు బాబీ సాక్ష్యాన్ని బలపరచాయి. దేవా, రహీంల సాయంతో దొంగసొత్తును విక్రయించిన షాపులు, వ్యక్తులపైన దాడి చేసి సొత్తును రికవర్ చేసుకుని వారిపైన కేసులు పెట్టారు పోలీసులు. ఫేస్బుక్ పరిచయాలతో జాగ్రత్తగా ఉండాలంటూ జార్జ్‌కి క్లాస్ తీసుకున్నాడు ఇన్స్పెక్టర్ శివరామ్. నగరంలో వరుసగా జరుగుతున్న దొంగతనాల సూత్రధారులకు సంబంధించిన క్లూ అందించడంలో కీలకపాత్ర వహించిన బాబీని అభినందించి వాడికి తగు బహుమతి ఇవ్వవలసిందిగా డిపార్ట్మెంట్కు సిఫారసు చేశాడు. ‘‘ఈస్టర్ ఎగ్ దొంగల్ని కూడా పట్టిస్తుందన్నమాట!’’ అన్న జార్జ్ పలుకులకు ఫక్కున నవ్వారు రాజు, బాబీలు. -
ఒప్పంద పత్రం
తెల్లవారుఝాము నాలుగు కావస్తోంది. ఊరంతా లేచి వ్యవసాయ పనుల్లో తలదూర్చడానికి సమాయత్తమవుతోంది. ఇంతలో రాంసింగ్ ఇంట్లో నుండి ఏడ్పులు, పెడబొబ్బలు వినరావడంతో జనమంతా అటువైపు పరుగులు తీశారు. రాంసింగ్ నేల మీద నిద్ర పోతున్నట్లు పడిపోయి ఉన్నాడు. అతని గుండెలమీద తల వాల్చి అడ్డంగా అచేతనంగా పడివుంది అతని అర్ధాంగి జానకమ్మ. బహుశా రాత్రి నిద్దట్లోనే ఇద్దరి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసి పోయి ఉంటాయని.. ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం వెలిబుచ్చసాగారు. అక్కడి దృశ్యం చూస్తుంటే రాంసింగ్ చనిపోగానే, జానకమ్మ గుండె హఠాత్తుగా ఆగిపోయి ఉండవచ్చనే నిర్ణయం అందరిలో బలపడింది. మద్దనపల్లి గిరిజన తాండా. రాంసింగ్ ఊళ్ళో ఎవరికీ ఎలాంటి కష్టమొచ్చినా ఆదుకుంటాడు. రాంసింగ్, జానకమ్మలకు ఒక కుమారుడు ధరంసింగ్. ఒక కూతురు యమునాబాయి. ఉన్నత చదువులు చదువుకొని ఉద్యోగాలు చేస్తూ హైదరాబాదులో స్థిరపడ్డారు. ఆ రోజు తాండా వాసులంతా పనులకు స్వస్తి చెప్పి రాంసింగ్ పిల్లలు వచ్చే వరకు వాళ్ళ వంశానుసారం అంతిమ సంస్కారానికి అన్ని ఏర్పాట్లు చెయ్యాలని చేయీ, చేయీ కలుపసాగారు. తాండాకు ఉత్తరాన శ్మశానవాటికలో ఖననం చేయడానికి వీలుగా రెండు గోతులు ప్రక్క, ప్రక్కనే తవ్వించారు. ధరంసింగ్, యమునాబాయి కలిసి కారులో మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో వచ్చారు. రాంసింగ్ దంపతుల అంతిమ సంస్కారం ముగిసే సరికి సాయంత్రం దాదాపు ఆరయ్యింది. ధరంసింగ్, యమునాబాయిలను ఓదార్చుతూ మరో గంట సేపు గడిపి అంతా వెళ్లి పోయారు. ధరంసింగ్ మనసు శూన్యమయ్యింది. తల్లిదండ్రులిద్దరూ ఒకేసారి పరమపదించడం జీర్ణించుకోలేక పోతున్నాడు. అదే విషయం చెల్లెలు యమునాబాయితో చాలా సేపు చర్చించాడు. రాత్రంతా ఉన్న ఒక్క చెక్క బీరువా సర్దుతూ ఏమైనా ఆధారాలు దొరుకుతాయేమోనని ఆశగా వెదికాడు. ఆమధ్య తనతో సంప్రదించి ఎస్టీ కార్పోరేషన్ బ్యాంకులో అప్పు తీసుకుని కొన్న ట్రాక్టరు కాగితాలు ఒక నల్లని హ్యాండు బ్యాగులో ఉన్నాయి. అవి తప్ప మరేవీ లేవు. ‘ట్రాక్టరు అమ్మేశానన్నాడే..కాగితాలన్నీ కొన్నవాడు తీసుకోలేదా..’ అని ఆలోచిస్తూ మంచం మీద నడుం వాల్చాడు ధరంసింగ్. ఆ మరునాడు ఉదయమే తన అనుమానం తీరక మళ్ళీ నల్లబ్యాగు తెరచి చూశాడు ధరంసింగ్. అందులో ఒక రహస్యపు అర వుంది. దాని జిప్ లాగి చూడగానే.. ట్రాక్టరు దేవదాసుకు అమ్మి కుదుర్చుకున్న ఒప్పంద పత్రం కనబడింది. అందులో దేవదాసు ఒక లక్ష రూపాయలు నగదు అడ్వాన్సుగా ఇచ్చినట్లు, మిగతా కిస్తులు తాను కట్టుకునే విధంగా రాసి వుంది. అయితే కిస్తులన్నీ కట్టడం పూర్తయ్యాక కాగితాలు తీసుకునే వాడేమో! అనుకున్నాడు. కాని రెండు కిస్తులు కట్టనట్లు బ్యాంకు నుంచి వచ్చిన నోటీస్ ఉంది. కిస్తులు కట్టుకుంటానన్న దేవదాసు ఎందుకు కట్టలేదు. ఇందులో ఏమైనా తిరకాసు వుందా? అని ఆలోచించసాగాడు. కిస్తులు కట్టకుంటే ఒప్పందపత్రం ప్రకారం నలుగురు పెద్దమనుషుల ముందు అడిగించే ధైర్యం నాన్న చేస్తాడే తప్ప ఇలా మనోవేదనతో గుండె ఆగి మరణించడం నమ్మబుద్ధి కావడం లేదు. వెంటనే యమునాబాయికి చెప్పి ములుగు బయలుదేరాడు. నేరుగా పోలీసు స్టేషన్‌కు వెళ్ళాడు ధరంసింగ్. ధరంసింగ్‌ను చూసి హడావుడిగా బయటకు వెళ్ళబోతున్న పోలీసు ఇన్స్పెక్టర్ విజయశేఖర్ ఆగిపోయాడు. ‘‘సర్..నా పేరు ధరంసింగ్. మీతో కొంచెం మాట్లాడాలని వచ్చాను’’ అంటూ రెండు చేతులు కట్టుకుని వినయంగా అన్నాడు ధరంసింగ్. ‘‘చెప్పండి’’ అన్నాడు ఇన్స్పెక్టర్. ‘‘సర్..మాది మద్దనపల్లి. మా నాన్న పేరు రాంసింగ్. మా అమ్మ పేరు జానకమ్మ. నిన్న రాత్రి హఠాత్తుగా ఇద్దరూ చనిపోయారు’’ అంటూ కన్నీళ్లు పెట్టుకోసాగాడు ధరంసింగ్. ‘‘సారీ ధరంసింగ్.. ఆ వార్త విని నేనూ బాధపడ్డాను. మీ నాన్న నాకు బాగా తెలుసు. చాలా అమాయకుడు’’ ‘‘అవును సార్. నాన్న అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని ఎవరైనా మోసం చేశారా అనే అనుమానం వుంది’’ అంటూ కర్చీఫ్‌తో కళ్ళుతుడుచుకోసాగాడు. ‘‘మోసమా! ఈ మధ్య మీ నాన్న ఏమైనా లావాదేవీలు చేశాడా?’’ ‘‘ఒక ట్రాక్టరు బ్యాంకు లోనుతో కొన్నాడు సర్. దాన్ని దేవదాసుకు అమ్మాడు. అతను మిగతా కిస్తులు కట్టుకుంటానని ఒప్పందపత్రం రాసిచ్చాడు. రెండు కిస్తుల తరువాత మరో రెండు కిస్తులు కట్టలేదు. బ్యాంకు నోటీసు వచ్చింది. ఆ కోణంలో ఆలోచించి మీ దగ్గరకు వచ్చాను’’ ‘‘అంటే దేవదాసు మీద అనుమానమున్నదా?’’ అంటూ అడిగాడు విజయశేఖర్. ‘‘అవును సర్. వారిది సహజ మరణం కాదేమోనని అనుమానంగా వుంది’’ ‘‘అయితే శవాలను పోస్ట్‌మార్టం చేస్తే గాని విషయం బయటపడదు. అప్పుడే కేసు పరిశోధనకు వీలవుతుంది. పోస్ట్‌మార్టం చెయ్యాలంటే నువ్వు కంప్లైంట్ ఇవాల్సి ఉంటుంది’’ అంటూ టేబుల్ పై ఉన్న బెల్ కొట్టి ఒక రైటర్ రమణయ్యను పిలిచాడు. పోలీసు ఫార్మాలిటీస్ పూర్తీ కాగానే ధరంసింగ్‌ను, మరో ఇద్దరు కానిస్టేబుల్స్‌ను ఇంకా పోలీసు డిపార్ట్మెంటు ఫోటోగ్రాఫర్‌ను తీసుకుని జీపులో మద్దనపల్లి తాండాకు బయలుదేరాడు విజయశేఖర్. పోలీసులు వచ్చారని తెలియగానే తాండా అంతా అట్టుడికి పోయింది. గ్రామ సర్పంచ్ బిక్కు బిక్కు మంటూ శ్మశాన గడ్డకు పరుగులు తీశాడు. కాసేపట్లోనే తహసిల్దారూ వచ్చాడు. ఇన్స్పెక్టర్ ఆదేశాలతో శవాలను బయటికి తీయడం, పంచనామా జరపడం, పోస్ట్‌మార్టం కోసం ములుగు హాస్పిటల్‌కు తరలించడం జరిగింది. మరునాడు ఉదయం ధరంసింగ్ పోలీసు స్టేషన్లో అడుగు పెట్టగానే విజయశేఖర్ పోస్ట్‌మార్టం రిపోర్ట్స్ అప్పుడే చదవడం పూర్తి చేశాడు. ‘‘ధరంసింగ్.. నీ అనుమానం నిజమేనని తేలింది’’ అన్నాడు విజయశేఖర్. ధరంసింగ్ విస్తుపోయి చూస్తూండగా ‘‘మీ పేరంట్స్ది సహజమరణం కాదు. ఆత్మహత్యా కాదు. హత్య. వాళ్ళ మీద పొటాషియం సైనైడ్ విషప్రయోగం జరిగింది’’ అనగానే కుప్ప కూలిపోయాడు ధరంసింగ్. కానిస్టేబుల్ ఓబయ్య గబుక్కున గ్లాసుతో మంచినీళ్ళు తీసుకువచ్చి, ధరంసింగ్ ముఖం మీద చిలకరించాడు. ‘‘నువ్వు ధైర్యంగా ఉండు. హంతకులను పట్టుకుని శిక్ష వేయించే పూచీ నాది’’ అంటూ ధరంసింగ్‌ను ఓదార్చాడు విజయశేఖర్. ‘ఈ హత్యలు చేసిన వాణ్ణి పట్టుకోవాలంటే ముందుగా సైనైడ్ విషయం తేలాలి’ అంటూ కొద్ది సేపు ఆలోచించి ‘‘పద వెళ్దాం..’’ అంటూ లేచి జీపు తీయమంటూ డ్రైవర్‌ను ఆదేశించాడు విజయశేఖర్. ములుగులో ఉన్నది ఒకే ఒక కాశీనాథం కంసాలి షాపు. అందులో కస్టమర్ల అభిరుచి మేరకు బంగారు నగలు వర్కర్లతో తయారు చేయించడం, అమ్మడం కాశీనాథం వ్యాపారం. సైనైడ్ అతని షాపులో తప్ప మరో చోట దొరకడం అసాధ్యం. నేరుగా కాశీనాథం షాపు ముందు ఆగింది పోలీసు జీపు. ‘‘నమస్కారం సర్. రండి.. రండి..’’ అంటూ రెండుచేతులా నమస్కరిస్తూ ఆహ్వానించాడు కాశీనాథం. ‘‘మీతో ఒక ముఖమైన కేసుకు సంబంధించిన వివరాలు తెలుసుకుందామని వచ్చాను’’ అంటూ విజయశేఖర్ తనకు కావాల్సిన విషయం అడిగాడు. ‘‘అలాగే సర్..’’ అంటూ లోపలి గదిలోకి ఇద్దరినీ తీసుకెళ్ళాడు. సీసీ కెమెరాలో గతవారం రికార్డయిన దృశ్యాలపై దృష్టి సారించాడు విజయశేఖర్. రెండు రోజుల క్రితం తాలూకు దృశ్యాలలో ఒకతను సైనైడ్ దొంగిలిస్తున్నాడు. ‘‘నగలు దొంగతనం చెయ్యడం రివాజు. కాని వీడేమో సైనైడ్ దొంగిలించడం.. చావడానికా సర్..’’ అంటూ వ్యంగ్యంగా అడిగాడు కాశీనాథం. ‘‘చావడానికి కాదు చంపడానికి. అయినా అత్యంత భద్రంగా దాచాల్సింది అంత నిర్లక్ష్యంగా ఎందుకు బయట పెట్టావు?’’ అంటూ చిరుకోపం ప్రదర్శించాడు. ‘‘వాణ్ణి గుర్తుపట్టగలవా?’’ అంటూ ప్రశ్నించాడు . ‘‘మన ఊరి వాడే సర్. దేవదాసు..’’ ‘‘అతనే సర్.. ’’ అంటూ ధరంసింగ్ చిన్నగా కేక వేసినంత పని చేశాడు. విజయశేఖర్ ఆదేశం మేరకు దాన్ని కాపీ చేసిచ్చాడు కాశీనాథం. వీడియో కాపీని తీసుకొని స్టేషన్‌కు బయలుదేరారు. స్టేషన్లోకి అడుగు పెడ్తూనే కానిస్టేబుల్ ఓబయ్యను పిలిచి దేవదాసును అర్జంటుగా తీసుకు రమ్మని హుకుం జారీ చేశాడు విజయశేఖర్. ధరంసింగ్ ఇచ్చిన చిరునామాతో ఓబయ్యకు దేవదాసు ఇల్లు కనుక్కోవడంలో పెద్ద కష్టమేమీ కాలేదు. నెమ్మదిగా వెళ్ళి తలుపు తట్టాలనుకున్నాడు ఓబయ్య. ఇంతలో ఎవరో ట్రాక్టరు గురించి లోన మాట్లాడుకోవడం వినరావడంతో నెమ్మదిగా కిటికీ పక్కకు వెళ్ళాడు. హాల్లో నుంచి వాళ్ళ మాటలు స్పష్టంగా వినవస్తున్నాయి. వెంటనే వారి మాటలను తన దగ్గరి సెల్‌ఫోన్‌తో రికార్డు చెయ్యసాగాడు. వారి సంభాషణ ఆగిపోయింది. వారు బయటికి వస్తున్నట్లు గమనించి చటుక్కున తిరిగి వీధిలో పడ్డాడు ఓబయ్య. వెళ్తున్నది బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్. ఓబయ్యకు బాగా తెలుసు. అప్పులు కావాలంటే ఆతనే శరణ్యం. ఆతను వెళ్ళిపోయేదాకా చూసి దేవదాసు ఇంటి తలుపు తట్టాడు ఓబయ్య. కానిస్టేబుల్‌ను చూడగానే కంగు తిన్నాడు దేవదాసు. ‘‘ఎస్సైగారు మిమ్మల్ని అర్జంటుగా తీసుకురమ్మన్నారు’’ అని చెప్పాడు. ‘‘ఎందుకు?’’ గంభీరంగా అడిగాడు దేవదాసు. లోలోన భయమనిపించినా బయటకు కనపడకుండా– ‘‘నాకేం తెలుసు సర్. పెద్దల వ్యవహారం’’ నింపాదిగా సమాధానిమిచ్చాడు ఓబయ్య. ‘‘సరే..బట్టలు మార్చుకుని వస్తాను’’ అంటూ లోనికి వెళ్ళాడు దేవదాసు. ఇద్దరూ పోలీసు స్టేషన్ చేరుకున్నారు. అక్కడి వాతావరణం చూసే సరికి దేవదాసుకు ఒంట్లో వణుకు పుట్టింది. పోలీసుస్టేషన్ హాల్లో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేయబడి వుంది. ఓబయ్య నేరుగా విజయశేఖర్ దగ్గరికి వెళ్లి తాను రికార్డు చేసిన విషయం వినమని తన సెల్‌ఫోన్ ఇచ్చాడు. అది వినగానే విజయశేఖర్లో మరింత ఉత్సాహం పెల్లుబికింది. దేవదాసును తన గదిలోకి తీసుకెళ్ళాడు. అతడి గుండె వేగం తగ్గింది. అయినా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ. ‘‘సర్.. ఎందుకో పిలిచారట’’ అన్నాడు రెండు చేతులతో నమస్కరిస్తూ. ‘‘అతను రాంసింగ్ కొడుకు ధరంసింగ్. రాంసింగ్ దంపతులు చనిపోవదానికి నువ్వే కారణమని నీ మీద కంప్లైంట్ ఇచ్చాడు..’’ అంటూ బయట నిలబడ్డ ధరంసింగ్‌ను చూపించాడు విజయశేఖర్. ‘‘నాకేమీ తెలియదు సర్. దేవుని మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. నాకు ఎలాంటి సంబంధం లేదు’’ అంటూ దేవదాసు భయం, భయంగా అన్నాడు. ‘‘చూడు దేవదాసు. అనవసరంగా నా లాఠీకి పని చెప్పకు. నా దగ్గర ఆధారాలన్నీ ఉన్నాయి. నిజం చెప్పలేదనుకో లాఠీ దెబ్బలు రుచి చూడాల్సి వస్తుంది’’ అంటూ గద్దించాడు విజయశేఖర్. దేవదాసు మెడపై చెయ్యి వేసి హాల్లోకి తోశాడు. ‘‘అటు చూడు’’ అంటూ గద్దిస్తూ కాశీనాథం షాపులో రికార్డు అయిన క్లిప్పింగులు తెరపై ప్రదర్శించమని రమణయ్యను ఆదేశించాడు. అందులో సైనైడ్ తస్కరిస్తున్నట్లు కనబడేసరికి కనుగుడ్లు తేలేశాడు దేవదాసు. ‘‘సైనైడ్ రాంసింగ్ దంపతుల మీద ప్రయోగించావు. ఇదిగో పోస్ట్‌మార్టం రిపోర్ట్స్’’ అంటూ దేవదాసు ముఖమ్మీద టప టపలాడించి విలేఖరుల ముందుంచాడు విజయశేఖర్. ‘‘నాకేం అవసరం సర్. వాళ్ళనెందుకు చంపుతాను’’ బింకంగా అన్నాడు దేవదాసు. ‘‘ఎందుకా..ఇది విను’’ అంటూ ఓబయ్య వంక చూశాడు విజయశేఖర్. దేవదాసు ఇంటికి వెళ్ళినప్పుడు తాను బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్‌ను చూసిన విషయం చెబుతూ సెల్‌ఫోన్ స్పీకర్ ఆన్ చేశాడు ఓబయ్య. ‘‘దేవదాసూ, చిన్న పొరబాటు చేశావు. రాంసింగ్‌కు రాసిచ్చిన ఒప్పందపత్రం తీసుకోవాల్సింది’’ ‘‘దాని సంగతి వదిలేయండి సార్. ధరంసింగ్ నుండి ఎలాగోలా నేను సంపాదిస్తాను కాని ముందుగా ఈ విషయం చెప్పండి, రాంసింగ్ పోయాడు కదా... ఇక కిస్తులు కట్టాల్సిన పనిలేదు కదా!’’ ‘‘కాని డెత్ సర్టిఫికేట్ తీసుకుని ఇన్సూరెన్స్ వాళ్లకు సబ్మిట్ చెయ్యాలి. వాళ్ళు క్లియరెన్స్ ఇవ్వాలి. మా బ్యాంకుకు ఒక కాపీ వస్తుంది. కొంత సమయం పడ్తుంది’’ ‘‘సమయం పట్టనివ్వండి. కిస్తులు కట్టాల్సిన అవసరం లేదని నాకు తెలుసు గాని..ఆమాట మీ నోట వినాలని..’’ ‘‘కిస్తులు కట్టాల్సిన అవసరం లేదు..’’ ‘‘అయితే రాత్రికి పార్టీ ఇస్తాను. ఘనంగా బక్షీసు ఇస్తాను. మనవారందరినీ తీసుకుని రావాలి’’ ఓబయ్య సెల్‌ఫోన్ ఆగి పోయింది. ‘‘ఇప్పటికైనా వాస్తవం ఒప్పుకో.. లేకుంటే..’’ అంటూ వీరావేశంతో లాఠీ ఝళిపించాడు విజయశేఖర్. దేవదాసుకు నోరు విప్పక తప్పలేదు. ‘‘సర్..నిజం చెబుతాను’’ అంటూ తాను చేసిన నిర్వాకం వివరించసాగాడు.... ‘‘రాంసింగ్‌తో నమ్మకంగా మెలిగేవాణ్ణి. లక్ష రూపాయలిచ్చి ట్రాక్టర్ తీసుకున్నాను. మిగతా కిస్తులన్నీ నేనే కట్టుకుంటానని ఒప్పంద పత్రం రాసి ఇచ్చాను. రెండు కిస్తులు సకాలంలో కట్టాను. ఆతరువాత డబ్బులకు ఇబ్బంది వచ్చింది. బాగా ఆలోచించాను. ట్రాక్టరు ఇంకా నా పేరు మీద బదిలీ కాలేదు. రాంసింగ్ ఇన్సూరెన్స్ చేశాడు కనుక అతడు చనిపోతే కిస్తులు కట్టాల్సిన అవసరం ఉండదని ప్లాను వేశాను. ఎవరికీ అనుమానం రాకుండా సైనైడ్ తస్కరించాను. దాన్ని విస్కీలో కలుపుకొని వారి ఇంటికి వెళ్లాను. తాండా అంతా నిర్మానుష్యంగా ఉంది. మూడు గ్లాసుల్లో విస్కీ నీళ్ళు కలిపి వారికి ఇచ్చాను. నేను తాగుతున్నట్లు నటించాను. వాళ్ళు క్షణాల్లో చనిపోయారు. ఎవరికీ అనుమానం రాకుండా మందు బాటిల్ గ్లాసులు అన్నీ సర్దుకుని బయటపడ్డాను’’ అంటూ భోరుమన్నాడు దేవదాసు. ధరంసింగ్ ఆవేశంగా లేచి దేవదాసును కొట్టబోయాడు. ఓబయ్య అడ్డుకున్నాడు. ‘తగిన శాస్తి నేను చేస్తాగా’ అన్నట్టు ధరంసింగ్ వంక చూశాడు ఇన్స్పెక్టర్ విజయశేఖర్. -
సెక్షన్ 411
నేనొక దొంగని. అందరు దొంగలమాదిరి నేను డబ్బు బంగారం కొట్టెయ్యను. సంవత్సరానికి ఒకటో రెండో దొంగతనాలు చేస్తాను. అంతే హాయిగా సంవత్సరం అంతా బతికెయ్యొచ్చు. నేను దొంగతనం చేసేది పురాతన విగ్రహాలు. చారిత్రక విలువ గల వస్తువులు, పాత పెయింటింగులు.. దొంగతనం చేసిన వాటిని ముంబైలో ఉన్న కాంతిలాల్‌కు చేరుస్తాను. వాటిని పరిశీలించి అతడు నాకు బోలెడు డబ్బు ఇస్తాడు. అతను వాటిని విదేశాలకు అమ్ముకుని డబ్బు చేసుకుంటాడు. నేను పక్కాగా రెక్కీ నిర్వహించి మ్యూజియంలు, కోటలు, పాత దేవాలయాల్లో విలువైన వస్తువులు, విగ్రహాలు, పెయింటింగులను చాకచక్యంగా దొంగతనం చేసి డబ్బు చేసుకుంటుంటాను. సాధ్యమైనంత వరకు రద్దీ లేని, అంతగా ప్రాచుర్యం లేని మ్యూజియంలు నా టార్గెట్! ఆ మ్యూజియంల వెతుకులాట కోసం ఇండియా అంతా తిరిగాను. అలా రాజస్థాన్‌లోని జైపూర్‌కి వెళ్లి ‘రాజా గోపాల్ సింగ్’ మ్యూజియం పరిశీలించాను. అదేమంత ప్రసిద్ధి చెందింది కాదు. మ్యూజియంలో రకరకాల పింగాణీ పాత్రలు, రాజా గోపాల్ సింగ్ ఉపయోగించిన కత్తులు, చిన్న తుపాకులు ప్రదర్శనలో ఉంచారు. లత‘ఉస్తాద్ మయ్యార్’ వేసిన ఆయిల్ పెయింటింగ్ నా దృష్టిని ఆకర్షించింది. రెండు అడుగుల వెడల్పు.. రెండు అడుగుల పొడవుతో అత్యద్భుతంగా పక్షులు, ప్రకృతి ఆకర్షణీయమైన పూలతో కూడిన ఆయిల్ పెయింటింగ్ అది. ఏది ఏమైనా ఆ పాత పెయింటింగ్ మీద అరబ్బీలో ఉస్తాద్ మన్యూర్ అనే సంతకం, దాని కింద 1674 సంవత్సరం వేసి ఉంది. ఆ మాత్రం చాలు నాకు ఆ పెయింటింగ్ నన్ను ఒక్క సంవత్సరం పోషించడానికి. మ్యూజియం చుట్టూ తిరిగి లోనికి రహస్యంగా పోవడానికి మార్గాలు వెతికాను. ఎక్కెడెక్కడ సీ.సీ కెమెరాలు ఉన్నాయో వెతికాను. నా జాగ్రత్తలో నేను ఉండాలి కదా! మ్యూజియంకు కాపలా కూడా తక్కువగానే ఉంది. కాపలా వాళ్లు ముసలి వాళ్లు. వెతగ్గా వెతగ్గా మ్యూజియం వెనుక తలుపు చెక్కది పైగా పాతది. అక్కడక్కడా పగిలిపోయి కనబడుతున్నాయి. నా అదృష్టానికి అదే దారి అన్నట్లు ఆ పాత తలుపు కనబడింది. ఆ రాత్రే నేను పెయింటింగ్ దొంగలించడానికి పక్కగా ప్లాన్ చేశాను. రాజస్థాన్ వాళ్లలాగ తలపాగా, పెద్ద మీసాలు, గడ్డం తయారు చేసుకున్నాను. ఎందుకంటే ఒక వేళ ఏ సీసీ కెమేరాలో నేను కనబడితే అది రాజస్థాన్ వాళ్ల పనే అని పోలీసుల్ని పక్కదారి పట్టించడానికి! తలుపును తక్కువ చప్పుడుతో విరగొట్టడానికి తగిన పనిముట్లు సేకరించాను. రాత్రి పదిన్నరకి మ్యూజియం ప్రాంతానికి వెళ్లి ఒక రహస్య ప్రదేశంలో నక్కాను. కాబట్టి అనుకున్నట్టుగానే గట్టిగా హారన్ మోగించుకుంటూ పోలీస్ వ్యాన్ వెళ్లిపోయింది. అంతే, నేను మ్యూజియం కాంపౌండ్ వాల్‌ను చాకచక్యంగా ఎక్కి లోపలికి దూకి, అక్కడ ఎవరూ లేరని నిర్ధారణ చేసుకున్నాక వెనుక తలుపు వద్దకు వెళ్లి నా నైపుణ్యాన్ని అంతా ఉపయోగించి పగిలిన తలపు సందులో సన్నటి రాడ్డు ఉంచి శక్తినంతా ఉపయోగించాను. తలుపు పాత పడిపోయి ఉండటం వలన సులభంగానే చప్పుడు లేకుండా విరిగిపోయింది! అలా.. అలా.. తలుపు చాలా భాగం విరిచేశాను. నా పని సులభం అయిపోయింది. అడుగులో అడుగు వేసుకుంటూ ఉస్తాద్ మమ్యార్ పెయింటింగ్ వద్దకు వెళ్లి సులభంగానే దానిని గోడ నుంచి తొలగించాను. గోడ నుంచి పెయింటింగ్ తియ్యగానే ఆ ఖాళీ ప్రదేశం ఏదో దుఃఖపూరితంగా నాకు కనబడసాగింది. అయినా చిరునవ్వుతో నేను చేసిన పనికి గర్విస్తూ పెయింటింగ్‌ని నేను తెచ్చిన గుడ్డలో చుట్టి మెల్లగా అడుగులు వేసుకుంటూ మరలా విరిగిన తలుపు వద్దకు వెళ్లి బయటపడ్డాను. అటు ఇటు చూచుకుని జాగ్రత్తగా దగ్గరలోనే ఉన్న నా లాడ్జీకి వెళ్లాను. లాడ్జి బాయ్ నిద్రమత్తులో ఉన్నాడు. వాడు నా చేతిలో ఏముందో చూడకుండా తలుపు తీశాడు. అదీ నా మేలు కొరకే అనుకుని దానిని రూముకి తీసుకువెళ్లి జాగ్రత్తగా పరుపు కింద పెట్టి దిండు, దుప్పటిని నేల మీద పరచుకొని పడుకున్నాను. అర్ధగంటలోనే మంచి నిద్రపట్టింది. పొద్దున ఏడు గంటలకు టి.వి. ఆన్ చేశాను. అనుకున్నట్టుగానే మ్యూజియంలో జరిగిన దొంగతనం గురించి చెబుతున్నారు. మ్యూజియంలో పని చేసే వాళ్లందరూ అక్కడ గుమి గూడినట్టు చూపిస్తున్నారు. పోలీసులు ఏదో చర్చిస్తున్నట్లు కనబడ్డారు. ‘దొంగని పట్టుకోవడానికి ఏమైనా క్లూస్ దొరికాయా?’ అని విలేఖర్లు అడుగుతున్నారు. ‘తప్పు చేసినవాడు తప్పించుకోలేడు త్వరలోనే పట్టుకుంటాం’ అని పోలీస్ అధికారి చెప్పాడు. అతని మాటలు విని నాకు నవ్వు వచ్చింది. ఎందుకంటే మరో గంటలో పెయింటింగ్‌తో సహా ట్రైన్లో ముంబై వెళ్లిపోబోతున్నాను. టిఫిన్, కాఫీ అయ్యాక నా చిన్న సూట్ కేసు, పెయింటింగ్ మీద అనుమానం రాకుండా తగిన విధంగా ప్యాక్ చేశాను. లాడ్జీ బిల్లు పే చేశాను. మరలా రూమ్‌కి వెళ్లి సూట్ కేసు, పెయింటింగ్ తీసుకువెడదామని.. సూట్ కేసు పట్టుకొనేసరికి తలుపు దగ్గర ఆరడుగుల పోలీసు ఆఫీసర్ అతనితో పాటు నలుగురు పోలీసులు. ఒక్కసారి నా గెండె దడదడలాడింది! ‘ఏం కావాలి సార్?’ అడిగాను. ఆ పోలీసు ఆఫీసర్ ఏం మాట్లాడకుండా నా చెంప చెళ్లు మనిపించాడు. నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ‘పెయింటింగ్ తీయరా’ అని హిందీలో కర్కశంగా అడిగాడు. ‘ఏ పెయిటింగ్ సార్?’ అని హిందీలో బుకాయించబోయాను. మరలా నా చెంప చెళ్లుమంది. ఇక లాభం లేదని పెయింటింగ్ ప్యాక్ విప్పి అతనికి ఇచ్చి వెర్రి చూపులు చూస్తూ.. ‘ఎలా కనిపెట్టారు’ అని ఆలోచిస్తున్నాను. నా చూపుల్లో అర్థం గమనించిన ఆ పోలీస్ ఆఫీసర్.. తన జేబులో నుంచి సెల్‌ఫోన్ లాంటి పరికరం తీశాడు. అది గూగుల్ మ్యాప్ చూపిస్తూ ఎర్రటి చుక్కను లాడ్జీలోని నా రూమ్ చూపించింది. ‘అరేయ్.. పెయింటింగ్‌కి సీక్రెట్ చిప్ ఉంది. నీలాంటి బద్మాష్‌లు దొంగలిస్తారని ఇప్పుడు దొంగతనం నుంచి రక్షించడానికి ఎలక్ట్రానిక్ చిప్స్ అమరుస్తున్నాం. ఇక నీ ఆట కట్టింది. ఏమేం వస్తువులు, పెయింటిగ్స్ ఇంతకు ముందు దొంగలించావో అన్నీ స్టేషన్లో కక్కిస్తాం పదా’ అని నా చేతులకు బేడీలు వేశారు. ‘నీకు ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 411 ప్రకారం మూడేళ్ల కఠిన కారగార శిక్ష, పది వేల జరిమానా పడుతుంది. నీ తోడు దొంగ లెవరో కూడా నీ చేతనే కక్కిస్తాం’ అని మెడ పట్టుకుని జీపులో ఎక్కించాడు. నాకు లోకమంతా అంధకార బంధురంగా కనిపించసాగింది. మరొక అర్థగంటలో ముంబైలో కాంతి లాల్ అరెస్ట్ జరిగిపోయింది. స్టేషన్‌కు వచ్చిన విలేఖర్ల ప్రశ్నలు బాణాల్లా నన్ను గుచ్చుకుంటున్నాయి. నీరసంతో నా కాళ్లుచేతులు చచ్చుబడిపోయాయి. -
శ్మశానం
నదీతీరంలో శ్మశానం. అదొక పెద్ద మైదానం. మరుభూమి. నల్లమట్టి గడ్డకట్టిన నెత్తురులాగా. శ్మశానానికి పక్కగా కొన్ని చెట్లున్నాయి. అక్కడ ఎప్పుడూ శిశిరరుతువే. ఆ చెట్టుశాఖలు క్షామపీడితులైన మనుషుల్లాగా ఎల్లప్పుడూ మేఘాల వంక చూస్తూ ఉండేవి. ఆ చెట్ల మీద అదేమి కారణమో, కాకులు, గద్దలు తప్ప మరింకొక పక్షి ఏదీ వాలేదేకాదు, అక్కడక్కడ ఎముక ముక్కలు, పుర్రెలు దొర్లుతూ ఉండేవి. నది మెల్లగా ప్రవహించిపోతూ అప్పుడప్పుడు ఉత్సాహం కలిగితే వరదగా వచ్చి శ్మశానంలో వ్యాపించి ఉన్న నిరాశా భావాన్ని చూసి, నాకెందుకని తన దారిని తాను తల వంచుకొని వెళ్ళిపోయేది. ఒకనాడు కొంతమంది అక్కడికి ఒక శవాన్ని తీసుకొని వచ్చారు. శవాన్ని చితి మీద పెట్టారు. ఒక వృద్ధుడు చితి మీద నెయ్యి పోశాడు. ఒక చిన్న పిల్లవాడు ఆ చితికి నిప్పంటించాడు. బీదవాడి గుడిసెలాగా చితి భగభగ మండడం ఆరంభించింది. మొగవాళ్లంతా ఒకవైపున ఉదాసీనంగా కూర్చున్నారు. ఆడవాళ్లు ఇంకొక వైపున గుండెలు బాదుకొని ఏడుస్తున్నారు. చితి భగ్గున మండుతున్నది. ఇద్దరు మనుషులు పెద్ద పెద్ద కర్రలతో శవాన్ని అదుముతున్నారు. సగం కాలిన మాంసం ముక్కలు అటూ ఇటూ ఎగిరి పడుతున్నవి. మంటలు కుక్కలలాగా ఎముకలను పళ్ళకు కరుచుకొని కటకటలాడిస్తున్నవి. చీకటిపడింది. నక్షత్రాలు ప్రకాశించడం ఆరంభించినవి. ఎటు చూచినా ప్రశాంతత వ్యాపించి ఉన్నది. ఎముకల కటకటలు తప్ప ఇంకే ధ్వని వినపడడం లేదు. శవంతో వచ్చిన అజబీలోహార్ చితిలో నుండి నిప్పు తీసి చిలుము ముట్టించాడు. రెండు మూడు దమ్ములు పీల్చి తనతో మాట్లాడే వాళ్ళెవళ్లయినా ఉన్నారా? అని అటూ ఇటూ చూశాడు. అందరూ ఉదాసీనంగా కనపడ్డారు. మళ్ళీ రెండు దమ్ములులాగి ఆకాశం వంక చూసి అజ్ఞాతమిత్రుడితో సంభాషణ ప్రారంభించాడు. ‘‘తుపాకీగుండు సరీగా గుండెల్లో తగిలింది. సైడ్ కాలువలో దాక్కొని నేను అన్నీ చూస్తూనే ఉన్నాను. మనవాడు జెండా తీసుకొని ముందున్నాడు. ఉత్సవం చౌకు వరకు అడ్డు లేకుండానే పోయింది. కాని, అక్కడ పోలీసువాళ్ళు అడ్డగించారు. ముందుకు పోకూడదన్నాడు పోలీసు ఇన్స్పెక్టర్. మిగతా వాళ్ళంతా వెనకడుగు వేశారు. కాని మనవాడు మాత్రం ‘మేము ముందుకే పోతామ’న్నాడు. ‘‘కొంతమందయినా పారిపోవడానికి అవకాశం ఎక్కడ ఇచ్చారు? పోలీసులు రావడం, మీద బడడం రెండూ ఒకేసారి జరిగినవి. జనం పరుగెత్తుతూ కొంతమంది గుర్రాల కాళ్ల క్రిందా, కొంతమంది పక్క కాలవల్లోనూ పడ్డారు. లాఠీదెబ్బలకు ఎంతమంది కాళ్లూ చేతులూ విరిగాయో లెక్కేలేదు’’ అన్నాడు ఛోటూ. అజబీలోహర్ ‘‘అవును. నిజమే. అయినా అతడు వీరుడు. జెండాను కిందకు దింపకుండా అలాగే నిలబడ్డాడు. ఇంతలో అటు నుండి జనం రాళ్లు విసిరారు. ఇటునుండి పోలీసులు తుపాకీ గుండ్లు పేల్చారు. తుఫానుకు మామిడిచెట్టులాగా అంత బలవంతుడైన వాడూ ఒక్కడు గుండు దెబ్బకు నేల మీద పడిపోయాడు. అందరూ శాంతంగా ఆ చితిలో కాలుతున్న వీరుని కళేబరం వంక చూశారు. ‘‘అందరితో పాటుగా అతను పారిపోతే బతికేవాడు. అంత అదృష్టం లే’’ అన్నాడు నాయకుడు. లక్కూ మేస్త్రీ అందుకున్నాడు– ‘‘నాయకుడా! నువ్వన్నది తప్పు. ఈవిధంగా మాట్లాడితే అతని ఆత్మకు కూడా అపచారం చేసినట్లవుతుంది. అతడు అజ్ఞాని అయితే కావచ్చును. కాని ఇతర్ల వలే పిరికివాడు మాత్రం కాడు. జాతీయ జెండా గౌరవాన్ని రక్షించాడు’’ ‘‘అయితే ఈ మూడుమూళ్ల జెండా మీదనే దేశగౌరవం అంతా ఆధారపడి ఉన్నదన్నమాట. భార్యాపిల్లలూ ఉన్నారు. ముసలి తల్లిదండ్రులు మీరున్నారు. అతను చనిపోయాడు. మీ అందరికీ దేశం అన్నం పెడుతుందా? మీ గతి ఏమిటి?’’ అన్నాడు నాయకుడు. లక్కూ దీర్ఘంగా నిట్టూర్చాడు. నాయకుడు అన్నమాట కూడా నిజమే. దేశం ధనవంతులకేగాని, బీదవాళ్లకు కాదు. నేలకు బాడుగా, నీళ్లకు పన్నూ, దీపానికి టాక్సూ, చస్తే శ్మశానంలో కాపరికి నజరానా....అంతా డబ్బవుతుంది. పోనీ భగవంతుడున్నాడు కదా అనుకుంటే కానుకలు నజరానాలు ఉంటేనే గాని ఆ దేవుడి దర్శనం కూడా లభించదు. బీదవాళ్లు డబ్బెక్కడ తెస్తారు? ‘‘అయితే పిల్లవాడు మాత్రం మూర్ఖుడా? తన ప్రాణాలను ఎందుకు బలి ఇచ్చాడు?’’ అని లక్కూ ఆలోచించడం ఆరంభించాడు. పిల్లవాడు నేటి ఉదయం వరకు ఆరోగ్యంగానే ఉన్నాడు. ఒక్కొక్క సమ్మెట దెబ్బకు ఇనుపకమ్ముల్ని కూడా నీరుగా చేసి పారేశాడు. కాని ఒక చిన్న తుపాకీగుండు అంతటి బలశాలి అయిన అతని గుండెల్లో జొరబడి, ఎముకల్ని విరగగొట్టి, మాంసాన్ని చీరి లోపలకు జొరబడింది. అతను చచ్చిపోయినాడు. బతకడం ఎంత కష్టం. చావడం ఎంత తేలిక! ‘‘పోనీ దేశం కోసం ప్రాణాల్ని అర్పించాడు. పేరూ, ప్రశస్తీ ఉంటుందనుకుంటే ఇలాంటి వాళ్లను అడిగేదెవరు? పేరు ప్రశస్తులు పెద్దవాళ్ళకూ నాయకులకూను, బీదవాళ్లు బలి అయితే మాత్రం వాళ్ళకు ఊరేమిటి? పేరేమిటి? కొద్దిరోజులు అతని దగ్గరి బంధువులు మాత్రం జ్ఞాపకం పెట్టుకుంటారు. సమయం గడిచినకొద్దీ వాళ్లు కూడా మరచిపోతారు’’ లక్కూ అలాగే కూర్చొని ఆలోచిస్తూనే ఉన్నాడు. రకరకాల భావాలు అతని స్మతిపథంలోకి వస్తున్నవి. ‘‘ఉత్సవ ప్రారంభంలో తన కుమారుడి చేతికి జెండా ఇచ్చిన పెద్దమనుçష్యులెక్కడున్నారు? శ్మశానం దగ్గరకైనా రారేం? వారంతా పెద్దవారు. ఈ శూద్రుల శ్మశానంలోకి వస్తారా? రారు’’ అయితే, పిల్లవాడు తప్పు చేసినట్లేనా? జెండా గౌరవాన్నీ, దేశ గౌరవాన్నీ కాపాడడానికి తుపాకీగుండుకు ఎదురు రొమ్మును సమర్పించాడు, అతనికప్పుడు ఎవ్వరూ జ్ఞాపకం వచ్చి ఉండరా? భార్యా, పిల్లలూ... ఇంతలో ఆడవాళ్లు ఏడుపు చాలించారు. వాచిన కళ్లతో శవం వంక చూశారు. శవం కాలి బూడిదైపోయింది. కొద్దికొద్దిగా అక్కడక్కడ మంట మండుతున్నది. లక్కూకు మహాకోపం వచ్చింది, ‘‘ప్రపంచం స్వార్థాంధం, తన కుమారుడు దేశం కొరకు తన జీవితాన్నే బలి చేస్తే–ఇతర్ల కొరకు తన ఎదురురొమ్మును తుపాకీగుండుకు ఎరగా సమర్పిస్తే–చచ్చిపోయిన వాడి భార్యాపిల్లల్నీ, ముసలి తల్లిదండ్రుల్నీ ఓదార్చేవారు కూడా ఎవ్వరూ లేరు’’ కోపమంతా దిగమింగు కొన్నాడు. ఎవరి మీద కోపం? ‘‘అజబీ! ఇంకా ఎంతసేపు పడుతుందో చూడు, ఆకలికి ప్రాణం పోతుంది’’ అన్నాడు నాయకుడు. ఛోటూ ఏదో మరిచిపోయిన మాట జ్ఞాపకానికి వచ్చినట్లు ముఖం పెట్టి ‘‘చెప్పడం మరిచిపోయాను. నేను వచ్చేటప్పుడు హవల్దార్ కరీమ్‌ఖాన్ శవంతో శ్మశానందాకా పోయిన వాళ్ల పేర్లు కూడా ప్రభుత్వం వారు రాసుకుంటారని చెప్పాడు’’ అన్నాడు. ‘‘ఆ! అదేమిటి?’’ ‘‘చనిపోయిన వాడు ప్రభుత్వం వారికి విరోధి కింద లెక్క. అతను గుండు పేల్చకపోయినా గుండు దెబ్బ తిన్నాడు. అందువల్ల ప్రభుత్వానికి అతనంటే ద్వేషం’’ ‘‘నిజమేనోయి ఛోటూ’’ అంటూ నాయకుడు భయంగా అటూ ఇటూ చూడడం ప్రారంభించాడు. ‘‘కరీమ్‌ఖాన్ హవల్దార్ సామాన్యుడా? పెద్ద పెద్ద షావుకార్లలాంటి వాళ్లు కూడా అతన్ని చూసి అదిరిపోతున్నారు. వాడు తలుచుకుంటే ఇళ్లు దోపిడి కూడా చేయించగలడు’’ అన్నాడు అజబీలోహర్. శ్మశానంలో ఉన్న మిగతా వాళ్ళందరూ కూడా కరీమ్‌ఖాన్ పేరు వినడంతోనే అదిరిపోయినారు. అంధకారపూరితమైన అర్ధరాత్రిని చెట్లు బిచ్చమడుగుతున్నట్లుగా నక్షత్రప్రకాశంలో కనిపించసాగినవి. లక్కూ మోకాళ్ళ మీద అర్ధచేతనావస్థలో కూర్చొని ఉన్నాడు. సహాయానికి వచ్చిన వారంతా మెల్లమెల్లగా ఒక్కరొక్కరే జారుకున్నారు. కరీమ్‌ఖాన్ ఏమి చేస్తాడోనని భయం. చివరకు నలుగురో అయిదుగురో మిగిలారు. లక్కూ క్షణకాలం లోలోపలనే కుళ్ళికుళ్ళి ఏడ్చాడు. కుమారుడు చనిపోయినందుకు కాదు. సోదరదేశస్థుల పిరికితనానికి. ఒకరోజున అందరూ ఈ చితి మీదకు చేరేవారే. అయినా ఎంత భయం! ఎంత స్వార్థం!! మళ్ళీ ఆలోచనలు– ‘‘కరీమ్‌ఖాన్ మాత్రం సామాన్యుడా? పరమ దుర్మార్గుడు. ‘‘ప్రతాపసింహుడు కాంగ్రెస్ సంఘ కార్యదర్శి. దేశభక్తుడు. కరీమ్‌ఖాన్ అత్యాచారాలు చేస్తే నన్ను రక్షించలేడూ?’’ ‘‘సేuŠ‡ చజ్జూమల్–కాంగ్రెస్ అధ్యక్షుడు. నా కుమారుడు దేశం కోసం ప్రాణాలను ఇచ్చాడు కనుక నేను ఆయనకు ఇవ్వవలసిన రుణాన్ని రద్దు చెయ్యడూ?’’ ‘‘వర్షాకాలం వస్తున్నది. ఇంటికప్పు లేచిపోయింది. కప్పుకోవాలి. ఇంటిగోడ పడిపోయింది. బాగు చేయించుకోవాలి. కొలిమి చెడిపోయింది. బాగు చేయించుకోవాలి, చేతుల్లో శక్తి లేదు. డబ్బు లేదు. ఎవరు సహాయం చేస్తారు?’’ సాటి కూలివాడు – తోటి కూలివాడు చేసిన తుపాకి గుండుదెబ్బకు చనిపోయాడు. ఆశ్చర్యం! చితి చల్లారింది. ఆడవాళ్ళు కుండతో నీళ్ళు తెచ్చి చితి మీద పోశారు. మొగవాళ్ళు చితి మీద వేడి కన్నీళ్ళు కార్చారు. ‘‘నారాయణ, నారాయణ’’ అని అందరూ భగవన్నామ స్మరణ చేశారు. నక్కలు దూరన్నుండి ‘‘హువా, హువా’’ అని జవాబిచ్చినయి. అందరూ ఇళ్ళకు బయలుదేరారు. లక్కూ కూడా బయలుదేరాడు. కాళ్ళ దగ్గర అతనికేదో వస్త్రం కనిపించింది. దాన్ని ఎత్తి చూశాడు. చిరిగి పోయిన మూడురంగుల జెండా. మృతవీరుడు–దేశభక్తుడు... చని పోయేటప్పుడు హృదయానికి కప్పుకున్న జెండా! అంత అందమైన జెండా ఇప్పుడు ఎంత అందవిహీనమైపోయింది! కాని, ఇప్పుడది రక్తంలో తడిసి ఎర్రనైపోయింది. ఎరుపు–జీవితానికి, మృత్యువుకూ సంబంధించిన రంగు!! ఆ జెండాలో ఏమి మహత్యం ఉన్నదో. జనం నవ్వుతూ నవ్వుతూ దాని కోసం ప్రాణాలను అర్పిస్తారు. మామూలు దూది, మగ్గం మీద నేశారు, పచ్చి రంగులు వేశారు. దానిలో ఏ విశేషమైనా ఉండనీ, ఇప్పుడది ఒక మనుష్యుని రక్తంతో రంజితమయింది. ఆ రక్తం కూడా వసంతరుతువులోని పుష్పంలాగా, మండుతూ ఉండే అగ్నిలాగా తాజాగా ఉన్నది. తన ఇంట్లో గూట్లో ఉన్న రాతిబొమ్మను తీసివేసి దాని స్థానంలో తన కుమారుని రక్తంతో సిక్తమైన జెండాను ప్రతిష్ఠించ నిశ్చయించుకున్నాడు. ఏడుస్తూ స్త్రీలు ఇంటికి వెళ్ళారు. తేలికగా గాలి వీచింది. రాత్రి కాంత పమిటచెరుగు మంచు వల్ల తడిసిపోయింది. దూరాన్నుండి నది గాయపడిన పక్షిలాగా దీర్ఘంగా మూలిగింది. భూమి మీద అగ్ని చల్లారిపోయింది. కాని ఆకాశంలో నక్షత్రాలు ప్రకాశిస్తూనే ఉన్నవి. -
అజ్ఞాత వ్యక్తి
తెల్లతెల్లవారుతుండగా ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్‌కి స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది. డ్యూటీలో ఉన్న ఎస్సై మాట్లాడుతూ.. ‘సార్ గుండమ్మ కాలనీలో ఓ హత్య జరిగిందని కంప్లయింట్ వచ్చింది. మిలటరీలో పని చేసే మహేష్ అనే వ్యక్తి సెలవు మీద ఇప్పుడే ఇంటికి తిరిగొచ్చాడట. ఇంట్లో భార్య శవం చూసి ఫోన్ చేశాడు’ అన్నాడు ఎస్సై. ‘నువ్వు వెంటనే ఫోరెన్సిక్ టీమ్‌ని తీసుకుని అక్కడికి వెళ్లు. నేను కూడా నేరుగా అక్కడికే వచ్చేస్తాను’ అంటూ ఎస్సైకి సూచనలిచ్చి ఫోన్ కట్ చేశాడు విజయ్. అప్పుడే గోడ గడియారం ఆరు గంటలు కొట్టింది. విజయ్ లేచి గబగబా ముఖం కడుక్కుని యూనీఫాం ధరించి వాహనంలో ఘటనా స్థలానికి బయలుదేరాడు. గుండమ్మ కాలనీలో ప్రవేశించినప్పుడు కాలనీ చివర విసిరేసినట్టున్న ఓ ఇంటి ముందు జనం గుమిగూడి ఉండటం కనిపించింది. అదే సిపాయి మహేష్ ఇల్లు అని విజయ్‌కి అర్థమైంది. ఇంటి ముందు వాహనం ఆపి కిందికి దిగాడు. మిలటరీ దుస్తుల్లో విచారంగా నిలుచున్న ఓ యువకుడు విజయ్ దగ్గరికొచ్చి నిలబడ్డాడు. ‘సార్, మాలతి భర్త, మహేష్‌ని నేనే’ అన్నాడు. విజయ్ అతని వెంట ఇంట్లోకి ప్రవేశించాడు. విజయ్ కన్నా ముందే అక్కడికి చేరుకున్న పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు తమ తమ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. బెడ్ రూమ్‌లోని మంచం పక్కన నేలపై ఓ ముప్ఫై ఏళ్ల యువతి మృతదేహం ఉంది. విజయ్ కొద్దిగా వంగి మృతదేహాన్ని పరిశీలించాడు. ఆ యువతి శరీరంపై ఎక్కడా గాయమైన ఆనవాళ్లు లేవు శరీరం రంగు మారలేదు. గొంతు నులిమిన గుర్తులు కూడా లేవు. ఆమె ఎలా చనిపోయిందో విజయ్‌కి అంతుపట్టలేదు. ‘ఏం జరిగిందో వివరంగా చెప్పు’ పక్కనే నిల్చున్న మహేష్‌ని అదిగాడు విజయ్. ‘సార్, నేను ఆర్మీలో పని చేస్తున్నాను. మాదొక పల్లెటూరు. రెండేళ్ల క్రితం మాలతితో నా పెళ్లి అయ్యింది. ఆమెకు పల్లెలో ఉండటం ఇష్టం లేదు. అందుకే పట్నంలో ఈ ఇల్లు అద్దెకు తీసుకున్నాను. నాకు సెలవు దొరికినప్పుడల్లా ఇంటికి వస్తాను. ఈ రోజు కూడా అలాగే వచ్చాను. ఐదు గంటలకు ట్రైన్ దిగాను. మాలతికి సర్ఫ్రెయిజ్ ఇద్దామనుకుని ముందే ఫోన్ చేయ్యలేదు. మా కాలనీ రైల్వేస్టేషన్‌కి దగ్గర కావడంతో కాలినడకన వచ్చాను. కాలనీకి సమీపించినప్పుడు ఓ యువకుడు వడివడిగా కాలనీలోంచి బయటికి వెళ్లడం కనిపించింది. నేనతడ్ని పట్టించుకోకుండా ఇంటికి వచ్చాను. ఇంటి తలుపు తెరచి ఉంది. లోపలికొచ్చి చూస్తే ఈ దృశ్యం కనిపించింది. వెంటనే స్టేషన్‌కి కాల్ చేశాను’ అన్నాడు మహేష్. ఫోరెన్సిక్ నిపుణులు శవం ఫొటోలు తీసి ఘటనా స్థలంతో పాటు ఇల్లంతా అధారాలు, వేలిముద్రలు సేకరించారు. ఇంటి వరండాలో వారికి కాల్చి పారేసిన రెండు సిగరెట్ పీకలు దొరికాయి. గ్లౌజ్ ధరించిన చేత్తో వాటిని సేకరించి ప్లాస్టిక్ బ్యాగ్‌లో వేసుకున్నారు. ‘నువ్వు సిగరెట్లు కాలుస్తావా?’ మహేష్‌ని అడిగాడు విజయ్. ‘నాకు పొగ తాగే అలవాటు లేదండీ’ అన్నాడు మహేష్. ‘ఈ సిగరెట్ పీకలు ఫ్రెష్‌గా ఉన్నాయి. అంటే ఎవరో రాత్రి ఇక్కడ సిగరెట్లు కాల్చారు. మీ బంధుమిత్రులెవరైనా నీ ఇంటికి వస్తుంటారా?’ మహేష్‌ని అడిగాడు విజయ్. ‘నాకు తెలిసినంత వరకూ ఎవరూ రారు. మాలతికి ఎవరితోనూ సత్సంబంధాలు లేవు’ కాలనీవాసుల్లో సిగరెట్ కాల్చేవాళ్లు ఎవరైనా మీ ఇంటికొస్తుంటారా?’ మహేష్ ఓ క్షణం ఆలోచించాడు. ‘ఆ.. గుర్తొచ్చింది సార్. కాల్సెంటర్లో పని చేసే అశోక్ రంగనాథం గారింటిపైన గదిలో అద్దెకు ఉంటున్నాడు. అతడు అప్పుడప్పుడూ మా ఇంటికి వచ్చి పేపర్ అడిగి తీసుకెళ్లేవాడు. అతడికి సిగరెట్లు తాగే అలవాటు ఉంది’ ‘నీ భార్య మెడలో ఉన్న బంగారం పోలేదు. ఇంట్లో వస్తువులేవీ చోరీ కాలేదు. దీన్ని బట్టి చూస్తే ఈ హత్య దొంగతనం కోసం జరగలేదని తెలుస్తోంది. పైగా హంతకుడు..నీ భార్యకు తెలిసినవాడే. అందుకే నిన్న రాత్రి అతనొచ్చినప్పుడు ఆమె తలుపు తెరిచింది. హంతకుడు అశోక్ కావచ్చు. అతడికి సిగరెట్లు కాల్చే అలవాటు కూడా ఉందిగా’ అన్నాడు విజయ్ కాస్త బలంగా. ‘సందేహం లేదు సార్. ఇది వాడి పనే. ఇప్పుడు గుర్తొస్తోంది. నేను కాలనీలోకి వస్తున్నప్పుడు చూసిన యువకుడు వాడే అనిపిస్తోంది. కాస్త ముందు వచ్చి ఉంటే పట్టుకునేవాడ్ని’ ఆవేశంగా అన్నాడు మహేష్. ఇన్స్పెక్టర్ విజయ్ వెంటనే అశోక్‌ని పిల్చుకురమ్మని రంగనాథం ఇంటికి కానిస్టేబుల్ని పంపించాడు. కాసేపటి తర్వాత కానిస్టేబుల్ తిరిగొచ్చాడు. ‘సార్, అశోక్ గదికి తాళం వేసుంది. రంగనాథం దగ్గర అశోక్ సెల్ నంబర్ తీసుకుని ఫోన్ చేస్తే..స్విచాఫ్ అని వచ్చింది.అశోక్ రాగానే మాకు ఫోన్ చెయ్యమని చెప్పి వచ్చాను’ అన్నాడు. ఫింగర్ ప్రింట్ రిపోర్ట్స్ ప్రకారం మహేష్ ఇంట్లో ముగ్గురు వ్యక్తుల వేలిముద్రలు లభించాయి. మహేష్, మాలతితో పాటు ఓ అజ్ఞాత వ్యక్తి వేలిముద్రలు దొరికాయి. ఆ అజ్ఞాత వ్యక్తి వేలిముద్రలే సిగరెట్ పీకలపై కూడా ఉన్నాయి. ఆ అజ్ఞాత వ్యక్తే మాలతిని చంపిన హంతకుడని విజయ్ ఓ ప్రాథమిక నిర్ధారణకొచ్చాడు. ఈ కేసులో ఏకైక అనుమానితుడైన అశోక్‌ని అతను పని చేసే కాల్‌సెంటర్‌కి వెళ్లి పట్టుకొచ్చారు పోలీసులు. ‘నిన్న రాత్రంతా ఎక్కడున్నావ్?’ అతన్ని ప్రశ్నించాడు విజయ్. ‘నిన్న రాత్రి బస్సు దొరక్క బాగా ఆలస్యమైంది. అర్ధరాత్రి దాటాక గదికొచ్చాను. కానీ గది తాళం చెవి ఆఫీసులోనే మరిచిపోయాను.అందుకే నెహ్రూ పార్కుకెళ్లి పడుకున్నాను’ అన్నాడు అశోక్. ‘నీ ఫోన్ ఎందుకు స్విచాఫ్ చేశావ్?’ ‘బ్యాటరీ డౌన్ కావడం వల్ల స్విచాఫ్ అయింది. గదిలో ఉంటే చార్జింగ్S పెట్టేవాడ్ని’ అనుభవంతో తల పండిన ఇన్స్పెక్టర్ విజయ్‌కి అశోక్ ఏదో దాస్తున్నాడనిపించింది. వెంటనే అతన్ని ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పిలుచుకెళ్లాడు. అక్కడ అతని వేలిముద్రల్ని మహేష్ ఇంట్లో దొరికిన అజ్ఞాత వ్యక్తి వేలిముద్రలతో పోల్చి చూశాడు. వేలి ముద్రలు మ్యాచ్ అయ్యాయి. వెంటనే విజయ్ అశోక్‌ని అదుపులోకి తీసుకొని థర్డ్ డిగ్రీ ప్రయోగించాడు. అప్పుడతను జరిగినదంతా వివరించాడు. ‘సార్, హత్యారోపణ నాపైన వస్తుందనే భయంతో అబద్దం చెప్పాను. నిన్న రాత్రి నేను మాలతి ఇంట్లోనే పడుకున్నాను. గది తాళం చెవి పోగొట్టుకున్నానని చెబితే మాలతి తన ఇంటి వరండాలో పడుకోమని నాకు పరుపు ఇచ్చింది. పడుకొనే ముందు రెండు సిగరెట్లు కాల్చాను. ఆ పీకలే మీకు దొరికాయి. తెల్లవారుజామున ఐదు గంటలకే మాలతి నన్ను నిద్ర లేపి బయటికి పంపేసింది. అప్పుడు పార్కుకెళ్లి పడుకున్నాను. బాగా పొద్దెక్కాక లేచి నేరుగా ఆఫీసుకెళ్లిపోయాను. నేను మాలతిని చంపలేదు సార్. నేనామె ఇంట్లోంచి బయటికొచ్చినప్పుడు ఆమె ప్రాణాలతోనే ఉంది. ఎలా చనిపోయిందో నాకు తెలీదు’ అన్నాడు. ‘కట్టుకథ చెబుతున్నావ్. నీకూ మాలతికి అక్రమసంబంధం ఉంది. నిన్న రాత్రి ఏదో విషయంలో ఆమె నీతో గొడవపడినట్టుంది. ఆవేశంలో నువ్వు ఆమె చంపేశావ్. తర్వాత ఏమీ ఎరగనట్టు పార్కుకెళ్లి పడుకున్నావ్ జరిగింది ఇదే’ ‘లేదు సార్, మాలతి నాకు సోదరి లాంటిది. నేనామెను చంపలేదు’ రోదిస్తూ అన్నాడు అశోక్. అతను చెప్పేది నిజమో, అబద్ధమో విజయ్‌కి అర్థం కాలేదు. మరుసటి రోజు పోస్టుమార్టం రిపోర్టు వచ్చింది. రిపోర్టు ప్రకారం మాలతి హత్య ఆ రోజు తెల్లవారుజామున ఐదు, ఐదున్నర మధ్య జరిగిందని తెలిసింది. మాలతి చావుకి కారణ మేమిటో రిపోర్టులో స్పష్టంగా పేర్కొనబడింది. దాని గురించి ఇన్స్పెక్టర్ విజయ్ నిపుణులతో చర్చించాడు. అప్పుడు హంతకుడు ఎవరో విజయ్‌కి అర్థమైపోయింది. వెంటనే మాలతి భర్త మహేష్‌ని అదుపులోకి తీసుకున్నాడు. ‘నా భార్యను నేనెందుకు చంపుతాను? ఆ అశోక్ గాడే హంతకుడు. మాలతిని వాడుకుని మోజు తీరాక అడ్డు తొలగించుకున్నాడు’ ఆవేశంగా అన్నాడు మహేష్. ‘పోస్ట్‌మార్టం రిపోర్ట్ ప్రకారం తెల్లవారు జాము ఐదు, ఐదున్నర మధ్య మాలతి హత్య జరిగింది. నువ్వు తెల్లవారుజాము ఐదు గంటలకు ట్రైన్ దిగానని అబద్ధంం చెప్పావ్. కాని ఆ రోజు ట్రైన్ సరిగ్గా నాలుగున్నరకే స్టేషన్‌కి వచ్చిందని మా ఎంక్వైరీలో తెలిసింది. అంటే నువ్వు ఐదు గంటలకల్లా నీ ఇంటి దగ్గరికి చేరుకున్నావ్. అదే సమయంలో అశోక్ కాలనీలోంచి బయటికెళుతూ నీకు కనిపించాడు. ఐదు గంటల తర్వాత అశోక్ నీ ఇంట్లో లేడు గనుక అతను హత్య చేయ్యలేదు. హత్య చెయ్యడానికి నీకు మాత్రమే అవకాశముంది’ అన్నాడు ఇన్స్పెక్టర్ విజయ్. ‘నా భార్యని నేనెందుకు చంపుతాను? టైమ్ చెప్పటంలో నేను పొరబడి ఉండొచ్చు. మాలతికి నిద్రాభంగం కలిగించకూడదనే ఉద్దేశంతో నేను స్టేషన్ నుంచి నిదానంగా నడుస్తూ ఇంటికొచ్చాను.అందువల్ల నేను కాలనీ దగ్గరికొచ్చేసరికి సమయం ఐదున్నర అయ్యి ఉండవచ్చు. ఆలోగా అశోక్ హత్య చేసి ఇంట్లోంచి బయటపడ్డాడు’ అన్నాడు మహేష్. ‘అశోక్ ఈ హత్య చెయ్యలేదు’ శాంతంగా అన్నాడు విజయ్. ‘ఎందుకు చెయ్యలేదు? అంత కచ్చితంగా ఎలా చెప్పగలరు? అతడికి చేతుల్లేవా?’ హేళనగా అడిగాడు మహేష్. ‘అతనికి చేతులైతే ఉన్నాయి కానీ ఆ చేతులతో సరైన చోట దెబ్బ కొట్టి మనిషిని చంపగలిగే విద్య అతనికి లేదు’ నర్మగర్భంగా అన్నాడు విజయ్. ‘మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు’ మహేష్ ఆందోళనగా అడిగాడు. ‘పోస్ట్‌మార్టం రిపోర్ట్ ప్రకారం మృతురాలి గొంతు వద్ద ఉండే థైరాయిడ్ కార్టిలేజ్ విరిగిపోవడం వల్ల చావు సంభవించింది. థైరాయిడ్ కార్టిలేజ్ ఎక్కడుంటుందో, దానిపై ఎలా వేటు వేయాలో శిక్షణ పొందినవారికే సాధ్యం. నిజానికి ఈ విద్య సైనికులకి శిక్షణలో భాగంగా నేర్పిస్తారు. ఏమరుపాటుగా ఉన్న శత్రువుపై ఎలాంటి ఆయుధం వాడకుండా వెనుక నుంచి అతని మెడ పక్క భాగంలో మెరుపు వేగంతో కొడితే అతను కిక్కురుమనకుండా చనిపోతాడని రిటైర్డ్ మిలటరీ అధికారుల ద్వారా నాకు ఈ విషయం తెలిసింది. శత్రువులపై ప్రయోగించాల్సిన విద్యను నువ్వు అమాయకురాలైన నీ భార్యపై ప్రయోగించావ్. ఎందుకిలా చేశావ్?’ కోపంగా అడిగాడు విజయ్. ‘నా భార్య అమాయకురాలు కాదు.. ఆమెకు ఆ అశోక్గాడితో అక్రమసంబంధం ఉంది. ఆ విషయం తెలుసుకోవడానికే ఈసారి సెలవు దొరకగానే మాలతికి ఫోన్ కూడా చేయకుండా ఊరు వచ్చేశాను. ఓ చెట్టు చాటున నిల్చొని అశోక్ నా ఇంట్లోంచి బయటికెళ్లడం కళ్లారా చూశాను.ఆవేశం పట్టలేక ఇంట్లో కెళ్లి ఒక్క వేటుతో మాలతిని చంపేశాను. ఆమెను హత్య చేసిన నేరంతో అశోక్‌ని ఇరికించాను’ ‘అనవసరంగా నీ భార్యను చంపావ్. ఆమెకి అశోక్‌తో అక్రమ సంబంధం లేదు’ ‘ఆ మాట మీరెలా చెప్పగలరు?’ ‘పోస్ట్‌మార్టం రిపోర్ట్ ప్రకారం ఆ రోజు రాత్రి మీ భార్య మాలతి ఎవరితోనూ గడపలేదు. దీని బట్టి ఆమెకు అశోక్‌తో అక్రమ సంబంధం లేదని తెలుస్తోంది’ ఇన్స్పెక్టర్ విజయ్ మాటలు వినగానే మహేష్ దిగ్భ్రాంతికి గురై నిలుచున్న చోటనే కుప్పకూలిపోయాడు. -
కల్పన
పదేళ్ల తర్వాత నాగార్జునసాగర్ రిజర్వాయర్ నిండింది. 590 అడుగుల లెవల్‌కి చేరువకాబోతోంది. ఇంకా శ్రీశైలం నుంచి మూడు లక్షల క్యూసెక్కుల నీళ్లు వస్తున్నాయి. నాగార్జునసాగర్ డ్యామ్ 26 గేట్లు ఎత్తారు. దశాబ్దం తర్వాత డ్యామ్ నుంచి వాటర్ ఓవర్ ఫ్లో అవుతోంది. ఒకేసారి ఇరవై ఆరు జలపాతాలు నదిలోకి దూకుతున్న దృశ్యం కనువిందు చేస్తోంది. ఆ రోజు ఆదివారం కావడంతో రెండు రాష్ట్రాల ప్రజలు నాగార్జున సాగర్‌కి పోటెత్తారు. అటు హైదరాబాద్, నల్లగొండ నుంచి వస్తున్న జనం, ఇటు గుంటూరు నుంచి మాచర్ల మీదుగా వస్తున్నవారితో రోడ్లన్నీ కిటకిటలాడుతున్నాయి. వెహికల్స్‌ని కంట్రోల్ చేయలేక పోలీసులు చేతులెత్తేశారు. అసలే రోడ్లన్నీ వెహికల్స్‌తో నిండిపోయి ట్రాఫిక్ కదలడం లేదు. సిద్ధార్థ హోటల్ ముందు రోడ్డు పక్కన ఎరుపు రంగు మారుతి ఆల్టో కారు పార్క్ చేసి ఉంది. ఎస్సై అన్వర్‌కి మండుకొచ్చింది. ‘ఎవడో బద్మాష్.. కారు ఇక్కడ పార్కు చేశాడు’ అనుకుంటూ కారు దగ్గరికి వెళ్లాడు. ఫ్రెంట్ సీటు ఖాళీగా ఉంది. డ్రైవింగ్ సీట్లో స్టీరింగ్ మీద తలవాల్చి ఉంది ఒక యువతి. ‘మేడమ్! హలో మేడమ్!’ అని డోర్ తడుతూ పిలిచాడు ఎస్సై. ఆమె నుంచి రెస్పాన్స్ రాలేదు. ‘నిద్రపోతుందా ఏంటీ’ అనుకున్నాడు. వాచీ వైపు చూస్తూ ‘ఇంకా రాత్రి ఎనిమిది కూడా కాలేదు. అప్పుడే నిద్రేంటీ? మందుకొట్టి మత్తులో ఉందా?’ అని అనుమానపడుతూ డోర్ తీశాడు. డోర్ ఓపెన్ అయ్యింది. ఆమెను తట్టి లేపడానికి ప్రయత్నించాడు. ఐతే ఆమె పక్కకి ఒరిగిపోయింది. ‘ఓ మైగాడ్’ అనుకున్నాడు. చెయ్యి పట్టుకుని చూశాడు. చల్లగా ఉంది. ఆమె చనిపోయింది. బ్యాక్ సీటులో కూడా ఎవరు లేరు. హిల్ కాలనీలో ఉన్న కమలా నెహ్రూ హాస్పిటల్‌కి ఆమె డెడ్ బాడీ తరలించారు. కారుని పోలీస్ స్టేషన్లో ఉంచారు. ఆమె వయసు పాతికేళ్లు ఉండొచ్చని పోలీసులు అంచనా వేశారు. కారు డ్రైవ్ చేస్తున్న సమయంలో హార్ట్ స్ట్రోక్ వచ్చి ఉండొచ్చు. రోడ్డు పక్కన కారు ఆపి చనిపోయి ఉంటుంది అనుకున్నారు. ఆమె ఒంటరిగా టూర్‌కి ఎందుకొచ్చిందో అర్థం కాలేదు. ‘ఆమె ఎవరు?’ అంటూ టీవీ ఛానల్స్‌లో బ్రేకింగ్ న్యూస్ వస్తోంది. ఆమె డెడ్ బాడీని చూపిస్తున్నారు. రాత్రి పదింటికి ట్రాఫిక్ తగ్గుముఖం పట్టడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. మిర్యాలగూడ నుంచి వచ్చిన డీఎస్పీ రత్నాకర్ హాస్పిటల్ మార్చురీలో ఉన్న ఆమె బాడీని చూసి వచ్చాడు. పోస్ట్‌మార్టమ్ రిపోర్టు వస్తే కానీ ఆమె చావుకు కారణాలు తెలియవు. హాస్పిటల్ ఆర్ఎమ్ఓ పోస్ట్ మార్టమ్ రిపోర్టు మర్నాటికి ఇస్తామని తెలియజేశాడు. కారులో ఏ విధమైన ఆధారాలు దొరకలేదు. ఆమె వాలెట్ కనిపించలేదు. అది ఉంటే కనీసం సెల్‌ఫోన్ అయినా వుండేది. డాష్ బోర్డులో కారుకి సంబంధించిన డాక్యుమెంట్లు గానీ, ఆమె లైసెన్స్ గానీ కనిపించలేదు. ఆమె ఎవరో తెలుసుకోవడానికి ఏ ఆధారం దొరకలేదు. మర్నాడు కారు నంబర్ హైదరాబాద్‌లోని ఆర్టీవో ఆఫీసుకి పంపారు. ఆ వెహికల్ గురించిన వివరాలు మెయిల్లో వచ్చాయి. ఆమె పేరు కల్పన. డాటర్ ఆఫ్ రాఘవేంద్రరావు అని మాదాపూర్‌లో ఉన్న రాయల్ రెసిడెన్సీ అడ్రస్ ఉంది. ఆమె ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు ఊహాగానం. పోస్ట్‌మార్టమ్ రిపోర్టులో ఆమె విషం కలిపిన కూల్ డ్రింక్ తాగడం వల్ల మరణించిందని ఉంది. నిన్న సాయంకాలం ఆరు గంటలకు ఆమె ప్రాణం పోయింది. ఆమె ఫోటో, అడ్రస్ హైదరాబాద్‌లోని స్పెషల్ బ్రాంచి పోలీసులకు పంపించాడు మిర్యాలగూడా డీఎస్పీ రత్నాకర్. ఆమె ఎవరో తెలిస్తే వారి కుటుంబ సభ్యులకు బాడీని హ్యాండోవర్ చేయవచ్చు. ఆమె ఎవరో మిస్టరీగా ఉంది. ఒంటరిగా కారులో వచ్చి నాగార్జున సాగర్‌లో ఎందుకు ఆత్మహత్య చేసుకుందో తెలియడం లేదు. ఆమె గురించి వివరాలు తెలిసే వరకూ కల్పన బాడీని హిల్ కాలనీలోని కమలా నెహ్రూ హాస్పిటల్ మార్చురీలో భద్రపరిచారు పోలీసులు. క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ మాదాపూర్‌లోని రాయల్ రెసిడెన్సీకి వెళ్లాడు. సెక్యూరిటీ వాళ్లకి ఆమె ఫోటో చూపించగానే గుర్తుపట్టారు. ‘ప్లాట్ నం. 303లో ఉంటుంది కల్పన మేడమ్!’ అని చెప్పారు. ఇప్పుడు ఆ ఫ్లాట్‌కి లాక్ చేసి ఉంది. ఆమె ఒంటరిగా ఉంటున్నదని అపార్ట్మెంట్ సెక్రటరీ తెలియజేశాడు. ఆమె తండ్రి రాఘవేంద్రరావు ఎవరో తమకు తెలియదన్నాడు. నాగార్జునసాగర్‌కి కల్పన ఒంటరిగా వెళ్లి ఉండదు. ఆమెతో పాటు ఎవరో వెళ్లారు. ఆమెకు విషం కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి, ఆమె చనిపోయిందని నిర్ధారణకు వచ్చాక ఆమె వ్యాలెట్, కారుకి సంబంధించిన డాక్యుమెంట్లు తీసుకుని వెళ్లిపోయారనేది పోలీసుల అంచనా. ఐతే హైదరాబాద్‌లో ఆమె ఉంటున్న ఫ్లాట్ లాక్ చేసి ఉంది. ఆమె తాలూక ఎవరూ అపార్ట్మెంట్ వాళ్లకు తెలియకపోవడంతో కేసు మిస్టరీగా మారింది. మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ రామ్ సింగ్ బిజీగా ఉన్న సమయంలో సెంట్రీ ఒక విజిటింగ్ కార్డు తెచ్చి టేబుల్ మీద వుంచి వెళ్లిపోయాడు. రామ్ సింగ్ విజిటింగ్ కార్డ్ చేతిలోకి తీసుకుని చూశాడు. సునీత కోబాడ, ఎమ్.టిక్. సీఈఓ గ్లోబల్ టెక్నాలజీస్ అని గచ్చిబౌలి అడ్రస్ ఉంది. సెంట్రీని పిలిచి ఆమెను తీసుకురమ్మన్నాడు ఇన్స్పెక్టర్ రామ్ సింగ్. సునీత వస్తూనే విష్ చేసింది. ఆమెను కూర్చోమని... ‘చెప్పండి మేడమ్’ అన్నాడు. ‘సార్ టీవీలో కల్పన నాగార్జునసాగర్‌లో ఆత్మహత్య చేసుకుందని న్యూస్‌లో చూసి వచ్చాను’ అంది సునీత. ‘కల్పన మీకు తెలుసా?’ ‘ఆమె నాకు బాస్ సార్.. గ్లోబల్ టెక్నాలజీస్‌లో ఆమె పార్టనర్. అఫ్కోర్స్ నాకూ చిన్న షేర్ ఉందనుకోండి’ ఆ కేసు క్రైమ్ బ్రాంచ్ వాళ్లు టేకప్ చేశారు మేడమ్. వాళ్లకి మీరు వివరాలు చెప్తే ఉపయోగంగా ఉంటుంది. క్రైమ్ బ్రాంచి ఇన్స్పెక్టర్ ప్రభాకర్‌ని పిలిపిస్తాను. ప్లీజ్ వెయిట్ చేస్తారా?’ సునీత వెళ్లి విజిటర్స్ హాల్లో కూర్చుంది. పావు గంటలో క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ వచ్చి ఆమెను కలుసుకున్నాడు. ‘మేడమ్! కల్పన ఎవరో తెలియక డైలమాలో ఉన్నాం. ఈ సమయంలో మీరొచ్చి వివరాలు చెబుతున్నందుకు థ్యాంక్స్’ అన్నాడు ప్రభాకర్. ‘ఇన్స్పెక్టర్ గారూ! కల్పన నాగార్జున సాగర్ వెళ్లి సూసైడ్ చేసుకుందని తెలిసి షాక్ తిన్నాను. టీవీ న్యూస్‌లో చూసి ఇక్కడికి వచ్చాను’ అంది సునీత. ‘మంచి పని చేశారు మేడమ్.. చెప్పండి ఆమె గురించి వివరాలు?’ ‘కల్పన గ్లోబల్ టెక్నాలజీస్ స్థాపించింది కొందరు లైక్ మైండెడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లతో. అది ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతోంది’ ‘అది ఓకే. ఆమె సూసైడ్ చేసుకోవడానికి కారణాలు ఏవైనా మీరు చెప్పగలరా? కంపెనీ అప్పుల్లో కూరుకుపోయి ఉండటం, అప్పులు ఇచ్చిన వాళ్లు ఒత్తిడి చేయడం వంటివి ఏమైనా ఉన్నాయా?’ ‘నో సార్! కంపెనీ బాగానే నడుస్తోంది. మాకు అప్పులు ఏం లేవు. అసలు కల్పన సూసైడ్ చేసుకునేంత పిరికి మనస్తత్వం ఉన్నది కాదు. చాలా కరేజ్ గలది’ ‘ఆమె రాయల్ రెసిడెన్సీలో ఒంటరిగా ఉంటున్నదని తెలిసిందే. మరి ఆమెకు పెళ్లి కాలేదా?’ ‘లేదు సార్!’ ‘పేరెంట్స్?’ ‘సార్ ఆమెకు పేరెంట్స్ లేరు. మియాపూర్‌లో ఆమెకు ఒక అన్న ఉన్నాడు. అతను కెమికల్ ఫ్యాక్టరీలో సైట్ ఇంజనీర్’ ‘అతని ఫోన్ నంబర్ మీకు తెలుసా?’ ‘అతని పేరు గోపీకృష్ణ..’ అని ఫోన్ నంబర్ ఇచ్చింది సునీత. ‘హలో గోపీకృష్ణ గారేనా?’ ‘ఎస్ మీరెవరూ?’ ‘క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్‌ని మాట్లాడుతున్నాను. హైదరాబాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ నుంచి’ ‘చెప్పండి సార్!’ ‘మీ సిస్టర్ కల్పన నాగార్జునసాగర్ దగ్గర సూసైడ్ చేసుకుంది. ఆమె బాడీ కమలా నెహ్రూ హాస్పెటల్ మార్చురీలో ఉంది. మీరు అర్జెంట్‌గా రావాలి. మీకు బాడీ అప్పగిస్తాం’ ‘వాట్? కల్పనా సూసైడ్ చేసుకుందా? ఎందుకు సార్?’ ‘ఏమో తెలీదు. మీరు వెంటనే రండి’ ‘సార్ నేను తిరుపతిలో ఉన్నాను. ఇప్పుడే బయలుదేరి వస్తాను’ అన్నాడు గోపీకృష్ణ. మర్నాడు ఉదయం గోపీకృష్ణ హైదరాబాద్ వచ్చాడు. క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్‌ని కలుసుకున్నాడు. ‘సార్! ఇలా జరుగుతుందనుకోలేదు’ అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. దుఃఖం ఆపుకోలేకపోయాడు. ‘ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్.. ప్లీజ్’ అంటూనే.. ‘చెప్పండి.. కల్పన సూసైడ్ చేసుకోవడానికి గల కారణాలు ఏమైనా మీకు తెలుసా?’ ‘సార్! నిజం చెప్పాలంటే తను కంపెనీ వర్కుతోనే చాలా బిజీగా ఉంటుంది. ఏం జరిగిందో ఊహించలేకుండా ఉన్నాను’ ‘నాకు ఓ విషయం అర్థం కావట్లేదు. సూసైడ్ చేసుకోవడానికి అంత దూరం వెళ్లాల్సిన అవసరం ఏంటీ.? అదీ డ్రైవింగ్ సీటులో కూర్చుని ప్రాణాలు వదలడమేంటీ? ఆమె వాలెట్ లేదు. సెల్‌ఫోన్ లేదు. కారుకు సంబంధించిన డాక్యుమెంట్స్ లేవు. దీని బట్టి చూస్తే నాగార్జునసాగర్ వరకు ఆమెతో పాటూ మరెవరో వెళ్లారు. ఆమెకు కూల్ డ్రింక్‌లో విషం కలిపి తాగించి, చనిపోయిన తర్వాత ఆధారాలు మాయం చేసుంటారు. కేవలం కారు నంబర్ ఆధారంగా ఆర్టీఓ ఆఫీస్ నుంచి వివరాలు తెలుసుకోగలిగాం’ అన్నాడు ప్రభాకర్. ‘ఆమె కంపెనీలో పని చేస్తున్న వాళ్లతోనే వెళ్లి ఉంటుంది సార్! నాగార్జునసాగర్ టూర్ వెళ్తుందని మాకు తెలియదు. మేము తిరుపతి వెళ్లాం’ అన్నాడు గోపీకృష్ణ. కల్పన సూసైడ్ గురించి ఆమె అన్నకు ఏం తెలియదని నిర్ధారణకు వచ్చిన క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్, నాగార్జున సాగర్ పోలీసులకు కల్పన బాడీ ఆమె అన్న గోపీకృష్ణకు అప్పగించేయాలని కాల్ చేసి చెప్పాడు. గోపీకృష్ణ నాగార్జున సాగర్ బయలుదేరి వెళ్లిన తర్వాత ఓ వ్యక్తిని వెంట బెట్టుకుని వచ్చింది సునీత. ‘సార్.. ఈయన మోహన్ కుమార్.. కల్పనకు »ñ స్ట్ ఫ్రెండ్. ఇద్దరూ మ్యారేజ్ చేసుకోవాలని కూడా అనుకున్నారు. ఈ లోపు ఇలా జరిగింది’ అంది సునీత. ‘సార్! కల్పన సూసైడ్ చేసుకుందని న్యూస్‌లో తెలుసుకుని సునీతను కాంటాక్ట్ చేశాను. ఆమె మిమ్మల్ని కలిసినట్లు చెప్పింది’ అన్నాడు మోహన్ కుమార్. ‘మిస్టర్ మోహన్ కుమార్! కల్పన సూసైడ్ చేసుకుందని మీరు నమ్ముతున్నారా?’ అడిగాడు ఇన్స్పెక్టర్. ‘నో సార్.. తను అలా చేయదు. ఆమె మర్డర్ చేయబడింది’ అన్నాడు మోహన్ కుమార్ ఆవేశపడుతూ.. ‘ఆర్ యూ ష్యూర్?’ ‘ఎస్ సార్..!’ ‘మీకు తెలిసింది చెప్పండి’ ‘సార్.. కల్పన నన్ను పెళ్లి చేసుకోవడం వాళ్ల అన్న గోపీకృష్ణకు ఇష్టం లేదు. ఈ విషయమై చాలాసార్లు గొడవ పడ్డాడు’. ‘ఎందుకు ఇష్టం లేదు?’ ‘ఇక్కడ మీకొక విషయం చెప్పాలి. కల్పన ట్రాన్స్‌జెండర్. గోపీకృష్ణ తమ్ముడు కరుణాకర్ ఆపరేషన్ చేయించుకుని కల్పనగా మారాడు. కల్పనగా మారిన కరుణాకర్‌కి పిల్లలు పుట్టే ఛాన్స్ లేదు. సంపాదనంతా తమ కుటుంబానికే చెందుతుందని గోపీకృష్ణ ఊహాగానం చేశాడు. అతడు ఊహించని విధంగా కల్పన నన్ను ప్రేమించింది. మేము పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అవ్వడంతో షాక్ తిన్నాడు. పెళ్లి వద్దనీ, కావాలంటే లివిన్ రిలేషన్లో ఉండమని కోరాడు. పెళ్లయితే భర్తగా నాకు ఆస్తి హక్కులు వస్తాయని తెలుసుగా. అందుకే తీవ్రంగా వ్యతిరేకరించాడు’ అని చెప్పుకొచ్చాడు మోహన్ కుమార్. ‘అయితే మోహన్ కుమార్! మీరు గోపీకృష్ణను అనుమానిస్తున్నారా?’ ‘అవును సార్! కానీ కల్పన నాగార్జున సాగర్ వెళ్లిన రోజున గోపీకృష్ణ తిరుపతి వెళ్లానంటున్నాడుగా?’ ‘సార్ అదంతా అబద్ధం సార్! కల్పన, గోపీకృష్ణ, అతడి భార్య రాజేశ్వరీ అంతా కలిసి కారులో నాగార్జునసాగర్ వెళ్లారు. ఆ విషయం నాకు కల్పన ఫోన్ చేసి చెప్పింది సార్! కల్పన ఒంటరిగా నాగార్జునసాగర్ వెళ్లలేదు. ఐ యామ్ ష్యూర్ సార్! కావాలంటే నా కాల్ లిస్ట్ చెక్ చేయండి. బయలుదేరే ముందే కల్పన నాకు కాల్ చేసింది’ చెప్పాడు మోహన్ కుమార్. అతని స్టేట్మెంట్తో కేసు చిక్కుముడి విడిపోయింది. పోలీసులు గోపీకృష్ణను, అతడి భార్యను అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసు మర్యాదలు రుచి చూపించేసరికి చేసిన పాపం ఒప్పుకున్నారు ఇద్దరూ. నాగార్జునసాగర్ వెళ్లి తిరుగు ప్రయాణంలో సాయంకాలం సిద్దార్థ హోటల్ ముందు కారు ఆపి.. స్నాక్స్ తిన్నారు. కల్పనకు విషం కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చారు. ఆమె పడిపోయిన తర్వాత వాలెట్, కారు డాక్యుమెంట్స్ తీసుకుని, కల్పనని కారులోనే వదిలేసి.. నల్లగొండ నుంచి మాచర్ల వెళ్లున్న బస్సులో ఎక్కి మాచర్ల వెళ్లారు. ఆ రాత్రి పన్నెండు గంటలకు మాచర్లలో కె.పి.హెచ్.బి వెళ్లే బస్సులో హైదరాబాద్ వెళ్లారు. పోలీసులు ఐ.పి.సి 302 సెక్షన్ కింద కేసు పెట్టి గోపీకృష్ణను, రాజేశ్వరిని కోర్టులో హాజరు పరిచారు. కల్పన కేసు ఆ విధంగా ముగిసింది. -
హంతకుడు దొరికాడు
అది రాజగోపాలంపేట పోలీసు స్టేషన్. నగర శివారు ప్రాంతంలో ఉంది. చుట్టుప్రక్కల ప్రాంతాల వారికి ఏమాత్రం భంగం వాటిల్ల కుండా చూసుకునే స్టేషన్ ఇన్స్పెక్టర్ రవీంద్ర అంటే సామాన్య ప్రజలకు ఎనలేని గౌరవ భావం. అతను వచ్చినప్పటి నుంచి ఆ ప్రాంతంలో నేరాలు తగ్గుముఖం పట్టాయి. ఆ పోలీసు స్టేషన్ ప్రాంతంలోనే ఒక ప్రైవేట్ డిగ్రీ కళాశాల ఉంది. ఆ కళాశాలలో చదివే భరత్ ఆర్ట్స్ గ్రూప్‌లో ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. బైక్ మీద కాలేజీకి వెళ్ళిన అతను రాత్రయినా ఇంటికి రాక పోయేసరికి ఇంట్లో కంగారు మొదలయ్యింది. అతని తండ్రి రాఘవరావుకు మరీను! సెల్‌కు ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుండటంతో రాఘవరావు మనసు ఏదో కీడు శంకిస్తోంది. భరత్ స్నేహితులకు ఫోన్ చేసినా ఫలితం లేకపోయింది. ఆ రాత్రంతా ఎవరూ ఇంట్లో నిద్రపోలేదు. తెల్లవారింది. అయినా భరత్ జాడ కానరాలేదు. ఇక లాభం లేదని రాఘవరావు నేరుగా రాజగోపాలంపేట పోలీసు స్టేషన్‌కు దారి తీశాడు. ఇన్స్పెక్టర్ రవీంద్ర కంప్లైంట్ రాయించుకొన్నాడు. భరత్ ఫొటో అడిగి తీసుకున్నాడు. నిశితంగా ఒకసారి ఫోటోను పరిశీలిస్తూ... దిగులు పడకండని రాఘవరావుకు భరోసా ఇచ్చాడు. తన సహాయకుడు శ్రీధర్‌ను పిలిచి భరత్ ఫోటో ఇచ్చి అతను చదివే కాలేజీకి పంపించాడు రవీంద్ర. మధ్యాహ్నం దాదాపు రెండు గంటలు కావస్తోంది. రవీంద్ర అప్పుడే భోజనం చేసుకుని వచ్చి కాలేజీ తాలూకు ఫిర్యాదులేమైనా ఉన్నాయా అని పాత ఫైళ్ళు తిరగేస్తున్నాడు. ఇంతలో టేబుల్ మీదున్న లాండ్ ఫోన్ మ్రోగింది.’’హలో’’ అన్నాడు రవీంద్ర. ‘‘నా పేరు చంద్రయ్య సార్! రాజగోపాలంపేట ఊరవతల దిగుడు బావిలో మెట్లమీద ఎవరో ఒకతను పడి ఉన్నాడు. ఎంత పిలిచినా పలకడం లేదు. మీరు వెంటనే రావాలి సార్!’’ అన్నాడు. ఇంతలో శ్రీధర్ రావడంతో జీపు తీయమంటూ పురమాయించాడు తరువాత అంబులెన్స్‌కు ఫోన్ చేశాడు. ఘటనా స్థలానికి పోలీస్ జీపు చేరుకుంది. ‘‘నేనే సార్! చంద్రయ్యను... పశువుల కాపరిని. ఒక కుక్క ఎప్పుడూ నాతో పాటూ ఉంటుంది. అది అటూ ఇటూ తిరుగుతూ బావి దగ్గరకు వచ్చి ‘భౌ.. భౌ’మని అరవసాగింది ఏమిటా అని నేను తొంగి చూశాను. ఎవరో ఒకతను మెట్లమీద రక్తపు మడుగులో పడి ఉండడం చూసి, చాలాసార్లు పిలిచాను. అతను పలకలేదు. వెంటనే మీకు ఫోన్ చేశాను’’ అన్నాడు. చంద్రయ్య ముందుగా బావిలోకి దిగుతూ శ్రీధర్ దిగడానికి సహకరించాడు. ఇద్దరూ కలిసి ఆగంతకుణ్ణి బయటకు తీశారు. రవీంద్ర భృకుటి ముడిపడింది. అతను భరత్. భరత్ శ్వాసను శ్రీధర్ పరీక్షిస్తుండగా, రవీంద్ర తన మొబైల్‌తో వీడియో తీయసాగాడు. ‘‘సర్... శ్వాసాడుతోంది’’ అన్నాడు శ్రీధర్. అంతా ఆశ్చర్యపోయారు. ఇంతలోనే అంబులెన్స్ చేరుకుంది. చంద్రయ్య సహాయంతో భరత్‌ను అంబులెన్స్‌లోకి ఎక్కించాడు శ్రీధర్. రవీంద్ర సూచనలతో అంబులెన్స్ సిటీ హాస్పిటల్‌కు వాయువేగంగా బయలుదేరింది. రాఘవరావుకు ఫోన్ చేసి హాస్పిటల్ చిరునామా ఇచ్చాడు రవీంద్ర. తరువాత చంద్రయ్యతో మెప్పుకోలు వచనాలు పలుకుతూ భరత్ బైకు గురించి ఆరా తీశాడు. తనకేమీ తెలియదన్నాడు చంద్రయ్య. రవీంద్ర రావడం చూసి రాఘవరావు దంపతులు.. వారి కూతురు భూమిక కన్నీరు మున్నీరయ్యారు. ‘‘సర్ భరత్‌ను ఐసీయూలో చేర్చారు. రక్తం ఎక్కిస్తున్నారు. ఇరవై నాలుగు గంటలు దాటితే గానీ ఏమీ చెప్పలేమంటున్నారు డాక్టర్లు’’ అంటూ రెండు చేతులా దండం పెట్టసాగాడు రాఘవరావు. ‘‘నిన్న అనగా బావిలో పడ్డ మనిషి బతికి ఉండడమే గొప్ప అదృష్టం. చంద్రయ్య చూశాడు గనుక సరిపోయింది. అధైర్య పడకండి సర్. మిమ్ముల్ని చూసి మీ వాళ్ళు మరింత ఇదైపోతారు’’ అని ఓదార్చుతూ... బైకు మాత్రం కనబడలేదని దాని గురించిన సమాచారం ఇతర పోలీసు స్టేషన్లకు కూడా ఇచ్చామని చెప్పాడు రవీంద్ర. భరత్ సంఘటన తరువాత ఆ కాలేజీ లెక్చరర్ భాస్కర్, స్టూడెంట్ రాధిక కాలేజీకి రావడం లేదని శ్రీధర్ ఫోన్లో రవీంద్రకు చెప్పాడు. రవీంద్రకు అనుమానం కలిగింది. తన పోలీసు బుర్రకు పదును పెట్టి వారిద్ధరి వ్యవహార శైలి కనుక్కోమని శ్రీధర్‌కు కోడ్ భాషలో చెప్పాడు. ∙∙ ‘‘సర్! గుడ్ ఆఫ్టర్ నూన్ ...’’ అంటూ భాస్కర్, రాధికల గురించి తను సేకరించిన విషయాలు చెప్పాడు శ్రీధర్. రవీంద్ర గబగబా అడుగులు వేసుకుంటూ హాస్పిటల్ ఆవరణలోకి ప్రవేశించగానే భాస్కర్ గుండె ఝల్లుమంది. ‘పోలీసులు సామాన్యులు కారు’ అని మనసులో అనుకుంటూ... పెదవులపై చిరునవ్వు అద్దుకుని రవీంద్రను విష్ చేస్తూ... ‘‘సార్!...నేనే మీకు ఫోన్ చేద్దామనుకుంటున్నాను ఇంతలో మీరే వచ్చారు. రాధికను ఐసీయూ నుంచి వార్డులోకి మార్చారట. నేనూ ఇప్పుడే వచ్చాను’’ అంటూ రాధిక బెడ్ దగ్గరకు ఇద్దరూ కలిసి వెళ్ళారు. ‘‘నౌ షీ ఈజ్ ఔట్ ఆఫ్ డేంజర్’’ అంటున్నాడు రాధిక తండ్రితో డాక్టర్. ‘‘ఏం జరిగింది’’ అన్నాడు రవీంద్ర. ‘‘సార్! నా పేరు సత్యనారాయణ. భరత్ మా అమ్మాయి వెంట పడటం గమనించాను. ‘నాకు ప్రేమ పట్ల ఆసక్తి లేదు మనం స్నేహితులుగానే ఉందామ’ని సున్నితంగా తిరస్కరించింది మా అమ్మాయి. అయినా అతను వినకపోవడంతో ఈ విషయాన్ని భాస్కర్ గారికి చెప్పిందట. భరత్‌ను బుద్ధిగా చదువుకోవాలని, ఇష్టంలేని అమ్మాయిని మానసికంగా వేధించరాదని, పద్ధతి మార్చుకోకుంటే ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లి తగిన చర్య తీసుకోవాల్సి వస్తుందని మందలించాట్ట’’ ‘‘మరి రాధిక ఆత్మహత్యకు ఎందుకు ప్రయత్నించింది?’’ అంటూ అతని మాటల మధ్యలోనే అడిగాడు రవీంద్ర. ‘‘అదే నేను చెప్పబోతున్నాను సార్! భరత్ పూర్తిగా మారిపోయినట్టు... మంచి స్నేహితులుగా ఉందామని మా అమ్మాయిని నమ్మించాడు. నిన్న స్పెషల్ క్లాస్ అయ్యాక మా అమ్మాయిని తీసుకుని భరత్ బైక్ మీద బయలుదేరాడు. దారిలో భరత్ మళ్లీ ప్రేమ ప్రస్తావన తెచ్చాడట. అలాంటి ఉద్దేశం లేదని ఇంతకు ముందే చెప్పాకదా అందట. అతను బండిని వేగంగా పోనిస్తూ ఘర్షణకు దిగాడట. మళ్ళీ మొదటికి వచ్చావా నీవు మారావని నీ బైక్ ఎక్కాను. బైక్ ఇక్కడే ఆపు... దిగిపోతానని వేడుకుందట మా అమ్మాయి. ‘నీ ప్రేమను పొందలేక పోయాను... నాకు దక్కని నిన్ను ఎవ్వరికీ దక్కనివ్వను. ఇద్దరం కలిసే చద్దాము’ అని బైక్‌ను అతి వేగంగా దిగుడు బావి వైపు పోనిచ్చాడట. అది గమనించి రాధిక పక్కకు దూకేసిందట. రాధిక చిన్న చిన్న గాయాలతో మెల్లగా లేచి బావి వద్దకు వెళ్లి చూసిందట. బైక్ బావి గట్టుకు ఆనుకుని పడిపోయి ఉందట. భరత్ రక్తపు మడుగులో బావి మెట్ల మీద పడి ఉండటం చూసి పలుమార్లు పిలిచిందట. భరత్‌లో ఉలుకూ పలుకూ లేకపొయ్యేసరికి భయపడి గాబరాగా ప్రధాన రోడ్డు వరకు లేని ఓపికను కూడదీసుకొని పరుగెత్తి, అక్కడ ఒక ఆటో పట్టుకుని ఇల్లు చేరుకుంది. అమ్మాయి పరిస్థితి చూడగానే మేము గాబరా పడిపోయాం. వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లి గాయాలకు కట్లు కట్టించాను. భరత్ చనిపోయి ఉంటాడనుకుని... నేరం తన మీద వస్తుందేమోనని... నా పిచ్చితల్లి నేను వాడే నిద్ర మాత్రలు మింగింది’’ అంటూ భోరుమన్నాడు సత్యనారాయణ. ‘‘రాధికను రక్షించే క్రమంలో మీరు చెప్పింది అబద్ధమని ఎందుకు అనుకోకూడదు?’’ అడిగాడు రవీంద్ర పోలీసు ఆఫీసరు తరహాలో. మౌనంగా రోదించసాగాడు సత్యనారాయణ. ‘‘భరత్ ఇప్పుడు కొన ఊపిరితో ఉన్నాడు అతనికి çస్పృహ వస్తే కాని నిజం బయటపడదు’’ అన్నాడు రవీంద్ర. రవీంద్ర జీపు స్టార్ట్ చెయ్యబోతుంటే సెల్ ఫోన్ మోగింది. ఆన్ చేశాడు, అది శ్రీధర్ ఫోన్. ‘‘హలో సార్... భరత్ బైక్ దొరికింది. కానీ దొంగిలించిన వాడికీ ఈ కేసుకూ ఎలాంటి సంబంధం లేదు ’’ అంటూ సమాచారమిచ్చాడు శ్రీధర్. ‘‘రాధిక విషయం ఎవ్వరికీ తెలియనీయకండి సార్! భరత్ కోలుకున్నాక అన్నీ చక్కబడతాయి. నేను కూడా మీ వెనకాలే వస్తున్నాను పదండి’’ అని సత్యనారాయణ గారికి చెప్పి బైక్ మీద బయలుదేరాడు భాస్కర్. రవీంద్ర సిటీ హాస్పిటల్ చేరే సరికి భాస్కర్ కూడా అక్కడకు చేరుకున్నాడు. ఐసీయూలో ఉన్న భరత్‌ను చూడడానికి వెళ్లాడు. అతనికి రక్తం ఎక్కిస్తున్నారు. భారత్‌ను చూసేందుకు డాక్టరు అనుమతి లభించలేదు. భరత్ తల్లిదండ్రులు రాఘవరావు దంపతులను, చెల్లెలు భూమికను పరామర్శించి ధైర్యం చెప్పి భాస్కర్ వెనుదిరిగాడు. రవీంద్ర కూడా చేసేదేమీ లేక స్టేషన్ బయలుదేరాడు. మూడు రోజులు గడిచాయి. ప్రమాదం నుంచి భరత్ బయటపడినట్లు ఆసుపత్రి వర్గాల ద్వారా తెలుసుకున్నాడు రవీంద్ర. వెంటనే ఆసుపత్రికి వెళ్ళి భారత్‌ను చూసి వచ్చాడు. కానీ మరుసటి రోజు తెల్లవారు ఝామున హాస్పిటల్ నుంచి భరత్ చనిపోయాడు అంటూ ఫోన్ వచ్చింది. రవీంద్ర నిశ్చేష్టుడయ్యాడు. వెంటనే హాస్పిటల్‌కు వెళ్ళాడు. రవీంద్రను చూడగానే ‘‘సారీ ఇన్సె్పక్టర్! మా ప్రయత్నమంతా చేశాం. అనుకోకుండా గుండెలో అవాంతరమేర్పడింది. అది గమనించి ట్రీట్మెంట్ మొదలు పెడుతుండగానే... హీ ఈజ్ నో మోర్’’ అంటూ ఆవేదన వ్యక్తపరిచాడు డాక్టర్. ‘‘అలా ఎందుకు జరిగిందంటారు?’’ అని ఆరా తీశాడు రవీంద్ర. ‘‘పోస్ట్‌మార్టం రిపోర్ట్ వస్తే గానీ తెలియదు. ముందు మీకు ఇన్ఫాం చేయాలి కదా అని ఫోన్ చేశాను. ఇంకా అతని పేరెంట్స్‌కు చెప్పలేదు’’ అంటూ పెదవి విరిచాడు డాక్టర్. ‘‘సరే డాక్టర్... సాయంత్రానికల్లా పోస్ట్‌మార్టం రిపోర్ట్ వస్తుంది కదా’’ అడిగాడు రవీంద్ర. ‘‘వస్తుంది’’ అన్నాడు డాక్టర్. రవీంద్ర నేరుగా స్టేషన్‌కు వెళ్ళి తల పట్టుకుని కూర్చున్నాడు. అలా ఎందుకయ్యింది? ఆరోగ్యం మెరుగవుతున్న భరత్ అకస్మాత్తుగా పోవడమేమిటీ..! ఇందులో ఏదైనా తిరకాసు ఉందా...? అని మదిలో ఆలోచన చెలరేగగానే ఏదో జ్ఞప్తికి వచ్చిన వాడిలా చటుక్కున లేచి కార్యోన్ముఖుడయ్యాడు. అనుకున్నట్టుగానే సాయంత్రానికల్లా పోస్ట్‌మార్టం రిపోర్ట్ వచ్చింది. అందులో భరత్ పై విషప్రయోగం జరిగిందని తేలింది. ‘అడ్రినలిన్’ అనే మందును ఎక్కువ మోతాదులో ఇంజెక్ట్ చెయ్యడం వల్ల భరత్ గుండెకు ప్రమాదం వాటిల్లిందని వివరణ ఉంది. రవీంద్ర అనుమానం ధ్రువపడింది. కేసు తేలిపోయిందని తన మనసులోకి రాగానే పెదవులపై చిరునవ్వు మొలిచింది. వెంటనే శ్రీధర్‌ను పిలిచి, మరో ఇద్దరు కానిస్టేబుల్స్‌ను తీసుకుని వెళ్ళి జరగాల్సిన పనులను పురమాయించాడు. తాను నేరుగా సిటీ హాస్పిటల్‌కు వెళ్ళి హాస్పిటల్ చైర్మెన్‌ను కలిశాడు. విషయం వివరించి దానికి సంబంధించిన సాక్ష్యాలు తన సెల్ఫోన్లో చూపించాడు. ఆ రాత్రి ఐసీయూ దగ్గర ఉన్న కాపలాదారును పిలిచి అడిగేసరికి నిజం బయట పడింది. ఇక మిగిలింది శ్రీధర్ తీసుకు రావాల్సిన మనిషిని ఇంటారాగేట్ చేస్తే సరిపోతుందని మనసులో అనుకుంటూ తిరిగి స్టేషన్ చేరుకున్నాడు రవీంద్ర. అప్పటికే రాధిక తండ్రి సత్యనారాయణను తీసుకు వచ్చాడు శ్రీధర్. సత్యనారాయణను చూడగానే ఎక్కడ లేని ఆవేశంతో ఊగిపోయాడు రవీంద్ర. తనదైన శైలిలో లాఠీ ఊపుకుంటూ... కళ్ళలో నిప్పులు కురిపించుకుంటూ... వస్తున్న రవీంద్రను చూడగానే సత్యనారాయణకు ముచ్చెమటలు పోశాయి. గజగజ వణకసాగాడు. లాఠీ గాలిలోకి లేచింది. సత్యనారాయణ నోరు భయంతో విప్పుకుంది. చేతులను లాఠీకి అడ్డు పెడుతూ... సార్.. జరిగింది చెబుతాను’’ అంటూ భోరుమన్నాడు. ఇంతలో విషయం తెలుసుకొని విలేఖరులు వచ్చారు. ‘‘భరత్ చనిపోయాడని, సాక్ష్యం లేదని... ఏమీ కాదని... నేను మా అమ్మాయికి ఎంతో ధైర్యం చెప్పాను. అయినా మా అమ్మాయి నిద్రమాత్రలతో ఆత్మహత్యకు పూనుకుంది. మీకు తెలిసిందే... అదృష్టవశాత్తు అమ్మాయి ప్రాణాపాయం నుంచి బయట పడింది. కానీ ఇంతలో భరత్ కోలుకుంటున్నాడన్న విషయం నన్ను భయపెట్టింది. నా బిడ్డను రక్షించుకోవాలనే తండ్రి పాశం నన్ను హంతకునిగా మార్చేసింది’’ అంటూ భోరుభోరున ఏడ్వసాగాడు సత్యనారాయణ. ‘‘ఎలా హత్య చేశావు?’’ అంటూ ఒక విలేఖరి అడగ్గానే... ‘‘అదంతా నేను చెబుతాను’’ అంటూ రవీంద్ర కుర్చీలో కూర్చొని నింపాదిగా కేసు విప్పసాగాడు. ‘‘కోలుకుంటున్న భరత్ చనిపోయాడన్న విషయం నాకు అనుమానమేసింది. హాస్పిటల్‌కు వెళ్లి సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించాను. సత్యనారాయణ ఆ రాత్రి దాదాపు రెండు గంటల ప్రాంతంలో హాస్పిటల్ వాచ్‌మాన్‌కు డబ్బులిచ్చి భరత్ బెడ్ వద్దకు వెళ్ళాడు. తాను ఉబ్బసం కోసం వాడే అడ్రినలిన్ మందును ఎక్కువ మోతాదులో భరత్‌కు ఇంజెక్ట్ చేశాడు. గతంలో సత్యనారాయణ మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పని చేయడం వల్ల ఇది సాధ్యమయ్యిందని శ్రీధర్ దర్యాప్తులో తేలింది’’ సత్యనారాయణ తల దించుకుని... హాస్పిటల్ వాచ్‌మాన్‌ను వేసిన సెల్‌లోకి దారి తీశాడు. -యు.విజయశేఖర రెడ్డి -
నేలమాళిగలో లిటిల్ డెవిల్
ఎందుకో హఠాత్తుగా మెలకువ వచ్చింది నాకు. నైట్ ల్యాంప్ వెలుగుతోంది. నా బెడ్ పక్క కాళ్ళ దగ్గర ఎవరో ఉన్నట్టు అనిపించింది! కన్నులు నులుముకుని చూశాను. ఓ చిన్నపాప! అయిదేళ్ళు ఉండవచ్చును! తెల్లటి ఫ్రాక్‌లో ఉంది. ఉలికిపడి, ‘‘ఎవరది?’’ అనడిగాను. జవాబు లేదు. రెప్పవేయకుండా నన్నే చూస్తోంది. గోడవైపు తిరిగి స్విచ్ నొక్కడంతో గదిలో ట్యూబ్ లైట్ వెలిగింది. వెనక్కి తిరిగేసరికి పాప అక్కడ లేదు! గతుక్కుమన్నాను. తలగడ పక్కనున్న సెల్ ఫోన్ తీసి ఆన్ చేసి టైమ్ చూశాను. అర్ధరాత్రి కావస్తోంది. నిద్రపోతూన్న నన్ను ఎవరో తట్టిలేపినట్టయి మెలకువ వచ్చింది. ఆ చిన్నారి ఎవరు? ఆ వేళప్పుడు గదిలోకి ఎలా వచ్చింది? అంతలోనే ఎలా అదృశ్యమయింది?... అన్నీ ప్రశ్నలే! జవాబులు దొరకడంలేదు. ఒకవేళ అది కలఅయ్యుంటుందేమోనని చేతి మీద గిల్లుకున్నాను. నొప్పిపుట్టింది. అంటే, అది వాస్తవ చిత్రమేనన్నమాట! భ్రమ కూడా కాదు. బెడ్ దిగి గదంతా చూశాను. ఎవరూ లేరు. గది తలుపులు మూసినవి మూసినట్టే ఉన్నాయి. కిటికీ వద్ద నిలుచుని బయటకు చూశాను. పరిసరాలు నిశ్శబ్దంగా ఉన్నాయి. దూరంలో ‘జింజీ ఫోర్ట్’ లీలగా కనిపిస్తోంది. మళ్లీ బెడ్ మీద వాలిపోయాను. ఎంత ప్రయత్నించినా నిద్రపట్టడంలేదు. ఆ పసిపాప ఆకారమే కళ్ళ ఎదుట కనిపిస్తోంది. మూసి ఉన్న గదిలోకి ఆ పాప ఎలా వచ్చింది? ఎలా మాయమయింది? అసలు ఆ పాప ఎవరు? మనిషేనా??– ఆ తలంపే ఉలికిపాటుకు గురిచేసింది నన్ను. ఆర్కిటెక్చర్లో పీహెచ్డీ చేస్తున్నాను నేను. ప్రాజెక్ట్ వర్క్‌లో భాగంగా వివిధ ప్రాచీన దుర్గాలు, కోటలను దర్శించి వాటి ఆర్కిటెక్చర్‌ని అధ్యయనం చేసి థీసిస్ రాయాల్సి ఉంది. ఆ పనిమీదే రెండు రోజుల క్రితం తమిళనాడులో విల్లుపురం జిల్లాలో ఉన్న ‘జింజీ ఫోర్ట్’కి వచ్చాను. సమీపంలో ఉన్న ‘సెంజి’ టౌన్ ని బట్టి దాన్ని ‘సెంజీ ఫోర్ట్’ అని వ్యవహరించడం కూడా కద్దు. ఫోర్ట్ దిగువను ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కు చెందిన వసతిగృహం ఉంది. అలనాటి రాజదుర్గానికి చెందిన పురాతన కట్టడం అది. కొద్ది మార్పులతో టూర్స్‌లో వచ్చే డిపార్ట్మెంట్ సిబ్బందికి బసగా మార్చబడింది. రెండే రెండు పోర్షన్స్ నివాసయోగ్యంగా ఉన్నాయి. ఒక్కో పోర్షన్లోనూ రెండు గదులు, ఓ హాలూ ఉన్నాయి. ఆ బిల్డింగ్ వెనుకనున్న గదిలో వుండే ముసలి వాచ్‌మేన్ దాన్ని కనిపెట్టుకుని వుంటాడు. అతని కుటుంబం గ్రామంలో ఉండడం వల్ల ఒంటరిగానే ఉంటున్నాడు. ఇటీవలి కాలంలో అక్కడ దిగకుండా సమీపంలో ఉన్న ‘తిండివనం’ టౌన్‌లోని హోటల్స్‌లో బసచేయనారంభించారట డిపార్ట్ మెంట్ సిబ్బంది. హైదరాబాదులో బైలుదేరినప్పుడే అక్కడ బసచేయడానికి ఆ డిపార్ట్మెంట్ నుంచి అనుమతి సంపాదించాను. కనీసం రెండు వారాల పాటైనా అక్కడ ఉండవలసివస్తుంది. వాచ్‌మేన్‌కి డబ్బులు ఇచ్చి మూడు పూటలా వండిపెట్టేటట్టు ఏర్పాటు చేసుకున్నాను. ఉదయం లేచి, కాలకృత్యాలు తీర్చుకుంటూంటే రాత్రి సంఘటన మదిలో మెదిలింది. నా మనసంతా ఆశ్చర్యంతో, రకరకాల ఆలోచనలతో నిండిపోయింది. గబగబా బ్రేక్ ఫాస్ట్ ముగించి ఫోర్ట్ కి బయలుదేరాను. అక్కడ నేను అధ్యయనం చేయవలసినవి పలు అంశాలు ఉన్నాయి. అప్పటికే పర్యాటకుల సందడి మొదలయింది. మెట్లు, రాతిగుట్టలూ అధిరోహించి కోటను చేరుకునేసరికి చాలా సమయం పట్టడమేకాక, అలసట కూడా ఆవరించుకుంది. సాయంత్రం ఐదు గంటలు అయేసరికి కోట ప్రాంతాన్ని ఖాళీ చేయవలసి వుంటుంది. పరిసరాలను పర్యవేక్షిస్తూ, పర్యాటకులతో సంభాషిస్తూ పైకి ఎక్కసాగాను నేను. జింజీ ఫోర్ట్ అద్భుతమైన పురాతన రాజదుర్గం. తొమ్మిదవ శతాబ్దంలో చోళరాజుల కాలంలో నిర్మింపబడ్డ ఓ చిరుదుర్గాన్ని, పదమూడవ శతాబ్దిలో కురుంబార్ మోడిఫై చేయడమూ, అనంతరం పదిహేను–పదహారు శతాబ్దాలలో ‘జింజీ’ నాయక్స్ దాన్ని విస్తరింపజేయడమూ జరిగాయి. మూడు పెద్ద గుట్టల పైన పదకొండు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఆ కోటను బ్రిటిష్ వారు ‘ట్రాయ్ ఆఫ్ ద ఈస్ట్’ అని పిలిచేవారు. ఆ హెరిటేజ్ ఫోర్ట్ ప్రస్తుతం – వాతావరణపు ఆటుపోట్లకు గురయి, పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా శిథిలావస్థలో రాతిగుట్టల నడుమ రెక్కలు తెగిపడ్డ పక్షిలా మిగిలి ఉంది. కోట భవంతులు పూర్వవైభవాన్ని కోల్పోయినా చూడచక్కగా ఉన్నాయి. గ్రానైట్ స్టోన్, లైమ్ మోర్టార్ ల కలయిక అవి. వాటి ఆర్కిటెక్చరల్ బ్యూటీ ఆకట్టుకుంటూ విస్మయానికి గురిచేస్తుంది. సాయంత్రం వరకూ ఆ శిథిలాలలో తిరుగాడుతూ అవసరమైన నోట్స్ రాసుకుంటూ, వీడియో, ఫొటోలు తీస్తూ గడిపేశాను. బసకు చేరుకుని ఫ్రెషప్ అయి, వాచ్‌మేన్ తాత ఇచ్చిన టీ తాగుతూంటే గతరాత్రి అనుభవాన్ని అతనితో పంచుకుందామా అనిపించింది. అంతలోనే మనసు మార్చుకున్నాను, నవ్విపోతాడేమోనని. ఆ రాత్రి మెలకువగా ఉండి ఆ పాప మళ్ళీ వస్తుందేమో చూడాలనుకున్నాను. కానీ, రోజంతా అలసిసొలసి ఉండడంతో మంచం ఎక్కగానే గాఢంగా నిద్రపట్టేసింది. ఆ రాత్రి పాప వచ్చిందో లేదో తెలియదుగానీ, నాకు మాత్రం అసలు మెలకువే రాలేదు. అయితే, ఆ మర్నాటి రాత్రి మళ్ళీ మెలకువ వచ్చేసింది. ఎవరో కాలు పట్టుకుని కదుపుతున్నట్టయి కళ్లు తెరచాను. అదే పాప! తెల్లటి ఫ్రాక్ లో. కాళ్ళ దగ్గర. నన్నే చూస్తోంది. అయితే, నేను ట్యూబ్ లైట్ వెలిగించేసరికి అదృశ్యమయిపోయింది! మూసి ఉన్న గదిలోకి ఆ చిన్నారి ఎలా వస్తోంది? ఎలా మాయమవుతోంది?... నాలో అయోమయం అధికమయింది. మర్నాడూ అదే అనుభవం! ఆ రోజు సాయంత్రం నేను ఫోర్ట్ నుంచి తిరిగివచ్చేసరికి వాచ్ మేన్ కూతురట – నలభయ్యేళ్ళ స్త్రీ. పేరు కర్పగం అట. నాకు ఎదురువచ్చింది. ‘‘ఇంద గెస్ట్ హౌస్ లో ఇరకరది నీంగె దానా?’’ (ఈ గెస్ట్ హౌస్ లో ఉంటున్నది మీరేనా?) అనడిగింది అరవంలో. తమిళం కొంతవరకు అర్థంచేసుకోగలను నేను. ఔనన్నాను. పేరు అడిగితే చెప్పాను. ‘‘ఇంద కోటత్తిలే పేయి ఇరుకుదని సొల్లువాంగ. ఉన్నోడె వేలై శీఘ్రమా ముడుచికిటు పోయిడు. అంద తొల్లై నమ్మకెన్నదుకు!’’ (ఈ కోటలో దయ్యాలు ఉన్నాయంటారు. నీ పని త్వరగా పూర్తిచేసుకుని వెళ్ళిపో. ఆ గొడవ మనకెందుకు!) అంది. ఆమె ‘కోటలో దయ్యాలు’ అనేసరికి నా గుండె గతుక్కుమంది. ‘నా గదిలో కనిపించేది దయ్యమా!? కోట నుంచి నన్ను వెన్నంటి వచ్చిందా??’ అన్న తలంపు హఠాత్తుగా మదిని తాకడంతో గుండె ఝల్లుమంది. ఆ రాత్రి పడుకుంటే అదే ఆలోచన మదిని తొలిచేస్తూంటే నిద్ర పట్టలేదు. ఏదో తెలియని భయం కమ్ముకుంది. నిజానికి దయ్యాలు, భూతాల ఉనికి పట్ల నాకు నమ్మకంలేదు. అదంతా పురాతన కాలపు ఫాంటసీ అని నా అభిప్రాయం. అయితే, నాలుగు రోజులుగా అవుతూన్న నా అనుభవానికి సంజాయిషీ ఏమిటి? పగటివేళ కోటలో తిరుగుతూ నోట్స్ రాసుకుంటూ బిజీగా ఉన్నా, మధ్యలో ఆ చిన్నారి గుర్తుకు రాకమానడంలేదు. కోటలో దయ్యాలు తిరగడం గురించి ఫోర్ట్ వాచ్‌మేన్‌ని కదిపాను. అది నిజమేననీ, నైట్ డ్యూటీలో ఉన్నప్పుడు అప్పుడప్పుడు వాటిని చూస్తాననీ చెప్పాడు. వాళ్ళు చెబుతున్నది నిజమైతే, ‘కోటలోని దయ్యాలు గెస్ట్ హౌస్ వరకు వస్తాయా!?’. ఆ సంగతి ఏమిటో తేల్చుకోవాలన్న పట్టుదల కలిగింది నాలో. ఆ రోజు రాత్రి –మనిషి పడుకున్నట్టు తలగడలను పక్కమీద పేర్చి పైన దుప్పటి కప్పేసాను. నైట్ ల్యాంప్ వెలిగించి, మంచం పక్కన దాక్కున్నాను. అర్ధరాత్రి అయేసరికి – ఆ ‘లిటిల్ డెవిల్’ బెడ్ దగ్గర ప్రత్యక్షమయింది. దీక్షగా బెడ్ మీది శాల్తీ వంక చూసింది. తరువాత తన బుల్లి చేత్తో మెల్లగా కుదిపింది. అంతలోనే ఏదో అనుమానం వచ్చినట్టుంది, కప్పిన దుప్పటిని లాగేసింది. మంచం మీద ఉన్నది మనిషి కాదని తెలియడంతో అక్కణ్ణుంచి వెళ్ళిపోబోయింది. చటుక్కున బయటకు వచ్చి ఆ చిన్నారి చేయి పట్టుకున్నాను. ‘‘ఎవరు నువ్వు? మనిషివా, దయ్యానివా?’’ అనడిగాను. ఏడుపు లంకించుకుంది ఆ పిల్ల, ‘‘నాన్ పేయి ఇల్లే, అక్కా!’’ అని అరవంలో అంటూ. ట్యూబ్ లైట్ వేసి, బెడ్ మీద నా పక్కన కూర్చోబెట్టుకుని దాని ఏడ్పు ఆపడానికి ప్రయత్నించాను. బిస్కెట్స్ ఇచ్చి తినమన్నాను. కుదుటపడ్డాక ఆ పిల్ల చెబుతూన్న సంగతులు వింటూంటే నా బుర్ర గిర్రున తిరిగిపోయింది. ఆ చిన్నారి పేరు జయంతి. మదురైకి చెందిన అరవపిల్ల. యూకేజీ చదువుతోంది. బయట ఆడుకుంటూంటే ఎవరో ‘ఆంటీ’ ఐస్ క్రీమ్ ఇప్పిస్తానంటూ తీసుకువెళ్ళి, ఎత్తుకువచ్చేసింది. ఆ బిల్డింగులో నేలమాళిగలో ఉన్న ఓ గదిలో బంధించి ఉంచింది. తనలాంటి పిల్లలు మరికొందరు ఉన్నారక్కడ. ఓ పురుషుడు, స్త్రీ రోజూ రాత్రివేళ వచ్చి తమకు చాలీచాలని తిండి పెట్టి వెళ్ళిపోతారు. అమ్మనాన్నలు కావాలని ఏడిస్తే కొడతారు. తాము అక్కడ ఎన్ని రోజులుగా ఉన్నారో ఆ పిల్లలకు తెలియదు. ‘జయంతి స్మార్ట్ గాళ్. పిల్లలందరూ పడుకున్నాక నేలమాళిగను పరిశీలిస్తూంటే, గోడలో ఉన్న రహస్యపు మీట చేతికి తగలడమూ, అక్కడ ఉన్న రహస్యమార్గం తెరచుకోవడమూ జరిగాయి. ఆ మెట్లగుండా ధైర్యంగా పైకి వెళ్ళిందా పిల్ల. పైన ద్వారం వద్ద కప్పబడి ఉన్న డోర్ మ్యాట్ ని ఎలాగో తొలగించి గదిలో ప్రవేశించింది. అది నేను ఉన్న గదే కావడం విశేషం. నిద్రిస్తూన్న నా వద్దకు వచ్చి, నన్ను లేపాలనీ, బూచోళ్ళ గురించి చెప్పాలనీ అనుకునేది. కానీ, నేను కూడా వాళ్ళ మనిషినేమోనన్న భయంతో పారిపోతోంది. పూర్వం రాజుల కాలంలో సెక్యూరిటీ కోసం ప్రతి కట్టడంలోనూ ఓ రహస్యమార్గాన్ని ఏర్పాటుచేసుకోవడం కద్దు. ఆ రహస్యమార్గం గురించి ఎవరికీ తెలిసినట్టులేదు. నన్ను నా పోర్షన్లోని యాంటీరూమ్కి తీసుకువెళ్ళింది జయంతి. ఆ గదిలో ఓ పెద్ద, పాత చెక్కబీరువా ఉంది. అందులో సామాన్లు పెట్టుకోవడమే తప్ప దాని వెనుకపక్క ఎప్పుడూ చూళ్ళేదు నేను. బీరువాకీ, గోడకూ మధ్య తగినంత ఖాళీస్థలం ఉంది. అక్కడ ఓ డోర్ మ్యాటూ, దాని క్రింద రహస్యమార్గమూ కనిపించాయి! జయంతిని తీసుకుని సెల్ ఫోన్ టార్చ్ సాయంతో ఆ ఇరుకు మార్గం గుండా క్రిందకు దిగాను. నేలమాళిగలోని ఆ హాల్లో నేలపైన పరచియున్న జంబుఖానా మీద పడుకుని నిద్రపోతున్నారు సుమారు డజనుమంది చిన్నారులు. బాలబాలికలు – రెండు నుండి ఎనిమిదేళ్ళ వయసులవాళ్ళు అంతా. ఓ మూలగా బాత్ రూమ్ ఉంది. చెక్కస్టాండు పైన పిల్లల బట్టలు, తువాళ్ళూ ఉన్నాయి. ఓ బల్ల మీద ఏవో తినుబండారాలు ఉన్నాయి. హాల్లోంచి ఉన్న సన్నటి నడవా ఓ చిన్న గదికి దారితీసింది. ఆ గదిలో ఓ మూల చెక్కబీరువా, రెండు మడతమంచాలూ తప్ప ఇంకేమీ లేవు. ఆ గదికి తలుపు ఉంది. అది బైటనుండి మూసివున్నట్టు తెలుస్తోంది. ‘బూచోళ్ళు’ ఆ గదిలోంచే వచ్చి వెళతారని చెప్పింది జయంతి. అలికిడికి నిద్రలేచిన పిల్లలు నన్ను చూసి భయంతో ఏడుపు లంకించుకున్నారు. అందరూ అరవపిల్లలే. తమిళనాడులోని వివిధ ప్రాంతాల నుండి ఎత్తుకురాబడ్డవాళ్ళు. వారిని సముదాయించి, భయం పోగొట్టి, నా గదికి చేర్చాను. అమ్మనాన్నల దగ్గరకు చేర్చుతానని చెప్పడంతో వారి వదనాలు వెలిగిపోయాయి. నాదగ్గర ఉన్న బిస్కెట్స్, బ్రెడ్, పళ్ళూ ఇస్తే ఆవురావురుమంటూ తిని మంచినీళ్ళు తాగారు. వాళ్ళను పడుకోమని చెప్పి, ‘హండ్రెడ్’ కి ఫోన్ చేసి పోలీసులను ఎలర్ట్ చేసాను. పోలీసులు వెంటనే వచ్చి వాచ్ మేన్‌ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ’కొన్ని నెలల క్రితం ఓ దంపతులు వచ్చి తనతో పరిచయం చేసుకున్నారనీ, పైన ఫోర్ట్‌లో ఏదో పనిచేస్తున్నట్టు చెప్పారనీ, వచ్చినపుడల్లా డ్రింక్ బాటిల్స్ తెచ్చిచ్చి తనచేత బాగా తాగించేవారనీ, అంతకు మించి తాను ఏ పాపమూ ఎరుగననీ’ చెప్పాడు అతను. నేలమాళిగ సంగతి తాను ఎరుగననీ, వెనుకపక్క పాడుబడ్డ తలుపుకు ఎప్పట్నుంచో తాళంకప్ప వ్రేలాడుతుంటుందనీ, దాని విషయం తాను ఎన్నడూ పట్టించుకోలేదనీ అన్నాడు. పిల్లల్ని నా గదిలోనే ఉంచి, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది కిడ్నాపర్స్ కోసం నేలమాళిగలో ఓ రోజంతా మాటువేసారు. రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో వచ్చి తాళం తెరచి లోపల ప్రవేశించిన ‘దంపతులను’ పట్టుకున్నారు. నలభైలలో ఉంటారు ఇద్దరూ. భార్యాభర్తలేనని తెలిపారు. మొదట తమకేమీ తెలియదంటూ బుకాయించినా, పోలీసులు తమదైన శైలిలో ఇంటారాగేట్ చేయడంతో నిజం కక్కకతప్పలేదు వాళ్ళు... అంతర్రాష్ట్ర కిడ్నాపర్స్ గ్యాంగ్‌కు అనుబంధంగా పనిచేస్తూన్న తమిళనాడుకు చెందిన గ్యాంగ్ సభ్యులు వాళ్ళు. చిన్నపిల్లలను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఎత్తుకువచ్చి, పోలీసుల గాలింపు సద్దుమణిగే వరకు అక్కడ దాచి వుంచుతారు. ఆ తరువాత ఒక్కొక్కరిగా వారిని అక్కణ్ణుంచి తరలించి అంతర్రాష్ట్ర ముఠాకి అప్పగిస్తారు. ఆ దంపతులు ఇచ్చిన సమాచారంతో, పోలీసులు ఆ చిన్నారులను వారి వారి తల్లిదండ్రులకు అప్పగించడం, ఇతర ముఠాసభ్యులను, అంతర్రాష్ట్ర ముఠాకి చెందిన కొందరినీ అరెస్ట్ చేయడమూ జరిగిపోయాయి. చిన్నారి జయంతి ధైర్యసాహసాలను మెచ్చుకుని, ప్రభుత్వం ఆమె పేరును ‘బ్రేవరీ అవార్డ్’కు కేంద్రానికి సిఫారసు చేసింది. ‘పెద్దయ్యాక నువ్వు ఏమవుతావమ్మా?’ అనడిగితే, ‘పోలీసునవుతాను’ అంటూ జయంతి తడుముకోకుండా జవాబిచ్చింది. దాంతో, ప్రభుత్వపు ఖర్చుతో ఆ చిన్నారిని చదివించి, పోలీస్ ఆఫీసర్ ని చేస్తామంటూ హోమ్ మినిస్టర్ ప్రకటించారు. డాక్టరేట్‌ని పొందడం కంటే ఎక్కువ ఆనందం కలిగింది నాకు. ‘షి ఈజ్ రియల్లీ ఎ లిటిల్ డెవిల్!’ అనుకున్నాను మురిపెంగా, జయంతిని తలచుకుంటూ. - తిరుమలశ్రీ -
తిక్క కుదిరింది
ట్రైన్ కదులుతుండగా ఖాళీగా కనిపించిన రిజర్వేషన్ బోగీలోకి హడావుడిగా ఎక్కేసింది ఆమె. కిటికీ పక్కన కూర్చున్న ఒక యువకుడు తప్ప ఆ బోగీలో ఇంకెవరూ లేరు. తన అదృష్టానికి మురిసిపోతూ ఆ యువకుడి ఎదురుగా ఉన్న సీటులో కూర్చుంది. అతనికి ముప్పయ్యేళ్లు ఉంటాయి. చూడ్డానికి అమాయకుడిలా కనిపిస్తున్నాడు. తలవంచుకుని న్యూస్‌పేపర్ చదువుకుంటున్నాడు. ఆమె అతన్ని పలకరించింది. ‘‘హేయ్ మిస్టర్! మీ పేరు తెలుసుకోవచ్చా?’’ ‘‘తెలుసుకోవచ్చు’’ అతను తలెత్తకుండానే బదులిచ్చాడు. ఆమె ఫక్కున నవ్వింది. ‘‘తమరు రోబోలా? అడిగిన ప్రశ్నకు మాత్రమే జవాబిస్తారా?’’ అడిగింది. ‘‘నా పేరు తెలుసుకుని మీరు చేసేదేముంది?’’ అతను ఎదురు ప్రశ్నించాడు. ‘‘నాకు గడగడా వాగే రోగముంది. ఎక్కువసేపు నోరుమూసుకుని ఉండలేను. జర్నీలో బోర్ కొట్టకుండా మీతో సరదాగా మాట్లాడాలనుకుని మీ పేరడిగాను’’ అందామె. ‘‘ముందు మీ పేరు చెప్పండి?’’ ‘‘నా పేరు శూర్పణఖ!’’ అందామె చిలిపిగా. ‘‘అలాగైతే నా పేరు లక్ష్మణరావు!’’ అతను కూడా చిలిపిగా బదులిచ్చాడు. ఆమె మరోసారి కిలకిలా నవ్వింది. ‘‘ఇక నిజం పేరు చెప్పేస్తాను బాబూ!.. నా పేరు హేమమాలిని. మా అమ్మ సినిమా నటి హేమమాలిని ఫ్యాన్. అందుకే నాకా పేరు పెట్టింది.’’ అందామె. ‘‘మా నాన్న ధర్మేంద్ర ఫ్యాన్ కాదు కాబట్టి నా పేరు ధర్మేంద్ర కాదు అశోక్!’’ అన్నాడతను. ‘‘గ్లాడ్ టు మీట్ యూ అశోక్’’ ‘‘సేమ్ టు యూ డ్రీమ్‌గర్ల్ హేమమాలిని’’ ‘‘మీరలా పొగుడుతుంటే నాకు సిగ్గేస్తోంది బాబు!’’ వయ్యారాలు పోతూ అందామె. ‘‘నేను పొగిడింది మిమ్మల్ని కాదు, హేమమాలినిని.’’ ‘‘అయినా నన్ను కూడా పొగిడినట్టే భావిస్తాను. ఇంతకీ మీరెక్కడికెళుతున్నారు?’’ ‘‘సికింద్రాబాద్’’ ‘‘థ్యాంక్‌గాడ్! నేనూ అక్కడికే! ఒంటరిగా జర్నీ బోర్ కొడుతుందనుకున్నాను. ఇప్పుడు మీరు జతయ్యారు కాబట్టి ఇద్దరం ఒకరికొకరు కంపెనీ ఇచ్చుకోవచ్చు.’’ ‘‘నిజానికి నేను ఒంటరిగా లేను. అరగంట ముందు వరకు నా భార్య కూడా నాతోపాటు బోగీలో ఉంది. అరగంట ముందు ఆగిన స్టేషన్లో పళ్లు తీసుకొస్తానని చెప్పి కిందకు దిగింది. ఆమె పళ్లు తెచ్చేలోగా రైలు కదిలింది. ఆమె ఎక్కలేకపోయింది. ఈ ట్రైన్ వెనకే వస్తున్న మరో ట్రైన్లో ఎక్కి నాకు ఇందాకే ఫోన్ చేసింది. ఇద్దరం సికింద్రాబాద్‌లో కలుసుకుంటాం.’’ ‘‘ఫర్వాలేదు. మీ భార్యకు బదులు నేను మీకు తోడుగా వచ్చేశాను. ఇక సికింద్రాబాద్ వరకు మీకు కంపెనీ ఇస్తాను. ప్రయాణం సరదాగా గడుస్తుంది’’ ఉత్సాహంగా అందామె. ‘‘సారీ! నేను మితభాషిని. మాట్లాడకుండా పేపర్ చదువుతూ కాలక్షేపం చేస్తా.’’ ‘‘పేపర్ చదవడం బోర్ కాదా? వార్తలన్నీ స్మార్ట్‌ఫోన్‌లో చూసుకోవచ్చు కదా!’’ ‘‘పేపర్ స్థానాన్ని స్మార్ట్‌ఫోన్ భర్తీ చేయలేదు. ఫోన్లో చూసినవి గుర్తుండవు. కాని పేపర్లో చదివినవన్నీ బాగా గుర్తుంటాయి. పేపర్లో ఉండే ప్రత్యేకత అది.’’ ‘‘పేపర్లో మీరేం చదువుతుంటారు?’’ ‘‘రాజకీయ వార్తలు, క్రీడలు, సినిమా, క్రైమ్ కథలు వంటివి చదువుతుంటాను.’’ ‘‘క్రైమ్ కథలు చదివితే ఏమైనా ప్రయోజనం ఉంటుందా?’’ ‘‘ఎందుకుండదు? దేశంలో జరుగుతున్న రకరకాల నేరాల గురించి తెలుస్తుంది.’’ ‘‘జరగబోయే నేరాల గురించి ముందే తెలుస్తుందా?’’ ‘‘తెలియదు. ఎందుకలా అడుగుతున్నారు?’’ ‘‘ఎందుకంటే ఇప్పుడొక నేరం జరగబోతోంది. దాన్ని మీరు పసిగట్టలేకపోయారు.’’ ‘‘ఏమిటా నేరం?’’ అశోక్ ఆశ్చర్యంగా అడిగాడు. ‘‘నేను మిమ్మల్ని దోచుకోబోతున్నాను.’’ నర్మగర్భంగా చెప్పింది హేమ. ‘‘గుడ్ జోక్!’’ ‘‘జోక్ కాదు మిస్టర్! సీరియస్‌గానే చెబుతున్నాను. మర్యాదగా మీ పర్సులో ఉన్న డబ్బంతా ఇచ్చెయ్యండి’’ కటువుగా అందామె. ‘‘ఇవ్వకపోతే?’’ ‘‘మీ పరువు తీస్తాను. చెయిన్ లాగి ట్రైన్ ఆపుతాను. నా దుస్తులు చించుకుని కేకలేస్తాను. మీరు నాపైన బలాత్కార ప్రయత్నం చేశారని అందరికీ చెబుతాను. జనం మిమ్మల్ని దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగిస్తారు. చెప్పండి. తన్నులు తిని జైలుకెళతారా? లేక మర్యాదగా మీ పర్సు నాకిస్తారా?’’ కఠినంగా పలికిందామె. ‘‘ఓహో! నీ వృత్తి బ్లాక్‌మెయిలింగ్ అన్నమాట!’’ ‘‘యస్. ఇంతవరకు ఇలా తొమ్మిది మందిని నేను వేర్వేరు ప్రాంతాల్లో బ్లాక్మెయిల్ చేశాను. వారిలో ఎనిమిది మంది బుద్ధిగా నాకు డబ్బు ఇచ్చి పరువు కాపాడుకున్నారు. ఒక్కడే నాకు ఎదురు తిరిగాడు. ఫలితంగా జనం చేతిలో చావు దెబ్బలు తిన్నాడు. మీకూ ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే బుద్ధిగా డబ్బు ఇచెయ్యండి’’ అందామె. ‘‘నాకు ఆ పరిస్థితి రాదు. కావాలంటే పరీక్షించి చూసుకో!’’ నిర్లక్ష్యంగా అన్నాడతను. ‘‘ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు మిస్టర్. నా మాట వింటే క్షేమంగా గమ్యం చేరుతారు. లేదంటే పరువు పోగొట్టుకుని జైలుకెళతారు.’’ ‘‘జైలుకెళ్లేది నేను కాదు, నువ్వు!’’ ‘‘చివరిసారి హెచ్చరిస్తున్నాను. డబ్బు ఇస్తారా, లేదా?’’ కోపంగా లేచి నిలబడిందామె. ‘‘ఇవ్వను. నీకు చేతనైంది చేసుకో..’’ అశోక్ నిర్లక్ష్యంగా అన్నాడు. హేమకు చిర్రెత్తుకొచ్చింది. వెంటనే చెయ్యెత్తి చెయిన్ లాగింది. తర్వాత ఒంటి మీద బట్టలు చింపుకుంది. రైలు ఆగగానే ‘‘రక్షించండి... రక్షించండి...’’ అంటూ పెద్దగా కేకలు వేయసాగింది. పక్కబోగీల వారందరూ అక్కడకు పరుగెత్తుకు వచ్చారు. వాళ్లను చూడగానే హేమ చిరిగిన తన దుస్తులు చూపిస్తూ ‘‘బోగీలో ఎవరూ లేకపోవడం చూసి ఈ దుర్మార్గుడు నన్ను బలాత్కారం చేయబోయాడు. నా బట్టలు చించేశాడు..’’ అంటూ గట్టిగా ఏడవసాగింది. జనం ఆవేశంగా అశోక్‌ని చుట్టుముట్టారు. రైల్వేగార్డు అశోక్ కాలర్ పట్టుకున్నాడు. ‘‘ఏరా కళ్లు నెత్తికెక్కాయా? ఒంటరిగా ఉన్న ఆడపిల్లపై చెయ్యేస్తావా?’’ గద్దించాడు. ‘‘ఆమె చెప్పేది అబద్ధం. నేనామెను ముట్టుకోలేదు’’ అశోక్ శాంతంగా బదులిచ్చాడు. ‘‘నువ్వు నిజం చెబుతున్నావని రుజువేమిటి?’’ గార్డు నిలదీశాడు. ‘‘నేను చెప్పింది నిజమని ఒక్క క్షణంలో రుజువు చేస్తాను’’ అంటూ అశోక్ కిందకు వంగి బెర్తు కింద ఉన్న ఊత కర్రను బయటకు లాగాడు. దాని సాయంతో అతి కష్టంమీద లేచి నిల్చున్నాడు. అందరూ అతని కాళ్లవైపు చూసి ఉలిక్కిపడ్డారు. అతనికొక కాలు లేదు. ‘‘నేను ఆర్మీ సోల్జర్ని. ఆరునెలల కిందట బాంబ్ బ్లాస్ట్‌లో కుడికాలు పోగొట్టుకున్నాను. ఊతకర్ర లేకుండా ఒక్క అడుగు కూడా కదల్లేను. చేతుల్లోనూ బలం లేదు. అలాంటప్పుడు నేను బలాత్కార ప్రయత్నం ఎలా చెయ్యగలను?’’ అన్నాడు అశోక్. తన బండారం బయటపడటంతో హేమ అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించింది. కాని ప్రయాణికులు చుట్టుముట్టడంతో పారిపోలేక పాలిపోయిన ముఖంతో తలదించుకుని నిల్చుండిపోయింది. గార్డు అశోక్‌ని అభినందిస్తూ ‘‘ఒక మోసగత్తెను చట్టానికి పట్టించి మంచి పని చేశారు. ఈమె పట్టుబడకపోతే ఇంకెంతోమందిని ఇలాగే దోచుకుని ఉండేది. అయినా మీరు తోడు లేకుండా ఒంటరిగా ప్రయాణించడం మంచిది కాదు’’ అన్నాడు. అశోక్ తన భార్య పళ్ల కోసం ఇదివరకు ఆగిన స్టేషన్లో దిగిన సంగతి గార్డుకి చెప్పాడు. ‘‘అదృష్టవశాత్తు ఈ మోసగత్తె దృష్టి నా కాళ్లపై పడలేదు. నాకొక కాలు లేదని తెలిస్తే ఈమె నా పర్సుతో పాటు నా మెడలోని గొలుసు లాక్కున్నా నేనేమీ చెయ్యలేకపోయేవాణ్ణి.’’ ‘‘మీ భార్య మీ వెంట ఉంటే ఇదంతా జరిగేది కాదు కదా’’ అన్నాడు గార్డు ‘‘నా భార్య ఉంటే ఈమె ఈ బోగీ ఎక్కేది కాదు. బ్లాక్మెయిల్ చేసేది కాదు. పట్టుబడేది కాదు. నా భార్య రైలు దిగడం వల్లనే ఈమె పట్టుబడింది. అందుకే అంటారు పెద్దలు ఏది జరిగినా మన మంచికే అని..’’ అన్నాడు అశోక్. -
ఓ క్యూట్ బేబీ..!
పక్కనున్న బార్బర్ షాపు నుంచి తెచ్చుకున్న తెలుగు దినపత్రికను చదివిందే చదువుతున్నాడు డిటెక్టివ్ డీలక్స్. అతని అసిస్టెంట్ అయోమయం భూతద్దంతో గది గోడల మీదున్న దోమల్ని వెదుకుతున్నాడు, చంపడం కోసమని! బాస్ ఓవర్ స్మార్ట్ ఐతే, అసిస్టెంట్ సార్థకనామధేయుడు. ఈలోగా అడుగుల చప్పుడు వినిపించడంతో, ‘క్లయెంట్స్ ఎవరో వస్తున్నారేమో!’ అన్నాడు డీలక్స్. ‘రెంట్ బకాయి కోసం ఇంటి యజమానేమో!’ అనుకున్నాడు అయోమయం భయంగా. డీలక్స్ న్యూస్ పేపర్ పక్కన పడేసి, కాలు మీద కాలు వేసుకుని, ఏదో డిక్టేట్ చేస్తూన్నవాడిలా పోజు పెడితే... అయోమయం టేబుల్ మీదున్న నోట్ బుక్ దుమ్ము దులిపి, పెన్ తీసుకుని, నిల్చునే నోట్స్ రాసుకుంటున్నట్లు అభినయించాడు. ‘డిటెక్టివ్ డీలక్స్ గారు కావాలి’ అంటూ గదిలోకి అడుగు పెట్టింది ఓ ఆంగ్లో–ఇండియన్ యువతి. పాతికేళ్ళుంటాయి ఆమెకు. సన్నగా, చామన చాయలో ఉంది. లైట్ బ్లూ కలర్ చుడీదార్ ధరించింది. తన పేరు మిస్ రీటా అని చెప్పింది. ‘సార్! మా బేబీ తప్పిపోయింది... మీరు వెదికి పట్టుకోవాలి!’ అందామె. ‘బేబీ వయసు ఎంత ఉంటుంది?’ ప్రశ్నించాడు డిటెక్టివ్. ‘వన్ ఇయర్’ చెప్పిందామె. ప్రశ్నల వర్షం కురిపించాడు డీలక్స్– ‘తప్పిపోయినప్పుడు ఏం దుస్తులు తొడిగారు?’... ‘ఆరెంజ్ కలర్ జుబ్బా‘. ‘నడుస్తుందా?’... ‘పరుగు కూడా పెడుతుంది.’ ‘మాటలు వచ్చా?’ ‘మన మాటలు అర్థం చేసుకుంటుంది’ చెప్పిందామె. ‘బేబీ పేరేమిటి?’ అడిగాడు. ‘పేరే బేబీ...’ అందామె, ‘క్యూట్ పమరేనియన్.’ ఉలికిపడ్డారు గురుశిష్యులు. ‘పమరేనియనా?’ అడిగాడు డిటెక్టివ్ ఆశ్చర్యంగా. ‘మీరు మాట్లాడేది మనిషి పిల్ల గురించేగా?’ ‘కాదండి. కుక్కపిల్ల గురించి!’ కూల్‌గా జవాబిచ్చిందామె. ‘అంటే, తప్పిపోయింది కుక్కపిల్లా?’... ఔనని తల ఊపిందామె. వెంటనే ముఖం గంభీరంగా పెట్టేసి, ‘హత్య కేసుల్ని, బ్యాంక్ దోపిడీలనూ పరిశోధించే మేము... ఆఫ్టరాల్ ఓ కుక్క పిల్ల...’ ‘బేబీ...’ అందించిందామె. ‘ఓకే. ఇలాంటి పెట్టీ కేసుల్ని చేపడతామని ఎలా అనుకున్నారు మీరు?’ అన్నాడు – ‘కొంపదీసి మాకు కేసులేవీ లేవన్న సంగతి పక్కనున్న షాపువాడు ఈమెకు చెప్పేయలేదు కదా!’ అని మనసులో అనుకుంటూ. ‘ప్లీజ్, సార్! ఈ కేసు మీరే టేకప్ చేయాలి...ఫీజు ఎంతైనా పరవాలేదు’ అందామె. ‘నో!’ అన్నాడు డీలక్స్ బింకంగా. ‘మా ప్రిస్టేజ్ ఏం కాను?’ ‘ప్లీజ్! అలా అనకండి...బేబీ నా ప్రాణం’... బతిమలాడిందామె. ఆర్నెల్ల తరువాత వచ్చిన ఈ ఒక్క కేసూ, ఓవరేక్షన్ తో గురుడు ఎక్కడ చెడగొడతాడోనని భయమేసింది అయోమయానికి. ‘బాస్! కుక్కపిల్లలంటే మనకూ ఇష్టమే కదా! ఈవిడ ఇంతగా ప్రాధేయపడుతుంటే... మనకిది చిన్న కేసైనా సరే...తిరస్కరించడం భావ్యం కాదేమో!’ అన్నాడు చటుక్కున కలుగజేసుకుని. ‘ఓకే. నా అసిస్టెంట్ చెప్పాడు కనుక ఈ కేసును టేకప్ చేస్తున్నాం’ దర్పంగా అన్నాడు డీలక్స్. ఆమె చెప్పిన వివరాలివి... ఆమెకు కుక్కపిల్లలంటే అమిత ఇష్టం. ఏడాది క్రితం ఓ పమెరేనియన్ కుక్కపిల్లను తెచ్చుకుని, దానికి ’బేబీ’ అని పేరు పెట్టుకుని, అల్లారుముద్దుగా పెంచుకుంటోంది. మూడు రోజుల క్రితం బేబీ అదృశ్యమయింది. నెల కిందట ఆమె వద్దకు ఓ వ్యక్తి వాకింగ్ కు వెళుతున్నప్పుడు బేబీని చూశాడనీ, తనకు బాగా నచ్చిందనీ, దాన్ని తనకు అమ్మమనీ అడిగాడు. ఆమె నిరాకరించింది. ఆలోచించుకుని చెప్పమంటూ, తన చిరునామా ఆమెకు ఇచ్చి వెళ్ళాడు. ఇప్పుడు బేబీ మాయం కావడంతో అది అతని పనే అయివుంటుందని అనుమానంగా ఉంది. అతని ఇంటికి వెళ్లి అడిగితే, పప్పీ సంగతి తనకు తెలియదన్నాడు. కాని, అతనే బేబీని దొంగిలించి ఉంటాడన్నది ఆమె అనుమానం... ‘సార్! నా బేబీ కనిపెట్టి తెచ్చారంటే... పాతికవేలు ఇస్తాను మీకు. ఖర్చులు అదనం’ అందామె. ఇటీవల అంత పెద్ద మొత్తం ఎప్పుడూ చూసి ఉండలేదేమో... పాతికవేలనే సరికి మదిలోనే ఆనందంతో డిస్కో చేశారు గురుశిష్యులు. ఎగై్జట్‌మెంట్ ను కప్పిపుచ్చుకుంటూ, ‘బేబీ ఫోటో ఉందా?’ అనడిగాడు డీలక్స్. పప్పీ ఫోటోను, అనుమానితుడి చిరునామాను డిటెక్టివ్ కి ఇచ్చిందామె. ‘మీ చిరునామా, ఫోన్ నంబరూ ఇవ్వండి. పప్పీ – సారీ – బేబీ దొరకగానే ఫోన్ చేస్తాం’ అన్నాడు డీలక్స్. ‘అవసరంలేదు. మూడు రోజుల తరువాత నేనే వస్తాను’ అంటూ, పదివేలు అడ్వాన్స్ ఇచ్చి, ‘థాంక్స్’ చెప్పి బయటకు నడచిందామె. మిస్ రీటా ఇచ్చిన చిరునామా ఓ రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్ మేజర్ సూర్యకాంత్ నివాసం. ఇల్లు పెద్దదే. ఇంటి ముందు పోర్టికో. చుట్టూ ప్రహరీ గోడ. కాంపౌండ్ లోపల పూల మొక్కలు, పళ్ళ చెట్లూను... లోపలికి వెళ్దామా వద్దా అని డిటెక్టివ్ లు తచ్చాడుతూండగానే, గోల్డ్–బ్రౌన్ కలర్ కుక్కపిల్ల ఒకటి గుమ్మం దగ్గరకు వచ్చి, వారిని చూసి మొరిగింది. జేబులోంచి ఫోటో తీసి చూసిన అయోమయం, ‘గురూ! బేబీ!!’ అన్నాడు ఆనందంగా. ‘మిస్ రీటా అనుమానం నిజమే నన్నమాట. వెళ్ళి పట్టుకొచ్చెయ్ దాన్ని’ అన్నాడు డీలక్స్. దొంగోడిలా అటు ఇటు చూస్తూ గేటు వైపు అడుగులు వేశాడు అయోమయం. అదే సమయంలో– ఓ ముసలాయన, ‘బేబీ! కమిన్’ అంటూ బయటకు వచ్చాడు. ఎత్తుగా, దృఢంగా, మీసాలతో భయంకరంగా ఉన్నాడు. అతన్ని చూడగానే భయంతో అప్రయత్నంగానే చేతులు ఎత్తేశారు డిటెక్టివ్ లు. వారిని చూసి, ‘పట్టపగలే ఇల్లు దోచుకోవడానికి వచ్చారా? కదలకుండా అక్కడే నిల్చోండి. గన్ తీసుకొస్తాను’ అంటూ లోపలికి వెళ్ళాడు అతను. అంతవరకు బిగుసుకుపోయిన డిటెక్టివ్ ద్వయం, అతను కనుమరుగవగానే క్షణంలో అక్కడ నుంచి అదృశ్యమైపోయారు. బేబీని దొంగిలించింది ఆర్మీ మేజరేనని తేలినా, డైరెక్ట్ గా అతన్ని ఎదుర్కొనే సాహసం చేయలేకపోయారు డిటెక్టివ్ లు. పప్పీని కిడ్నాప్ చేయాలని నిశ్చయించుకున్నారు. అర్థరాత్రి – మేజర్ సూర్యకాంత్ ఇంటికి వెళ్ళారు. పరిసరాలు నిశ్శబ్దంగా ఉన్నాయి. ఆ ఏరియా వాచ్ మాన్ ఎక్కడా కనిపించలేదు. మెయిన్ గేట్ కు తాళం వేసుంది. కాంపౌండ్‌ను ఆనుకుని పేవ్మెంట్ మీద గుబురు వృక్షం ఒకటి ఉంది. ఆ చెట్టు మీంచి ప్రహరీ గోడ ఎక్కి అటువైపుకు దిగారు గురు శిష్యులు. లోపల చీకటిగా ఉంది. పెన్ టార్చ్ వెలుతురులో జాగ్రత్తగా మొక్కల మధ్య నడుస్తూ, ఓ సారి ఇంటి చుట్టూ ప్రదక్షిణం చేసి వచ్చారు. ఇంటికి పక్క వైపు పై అంతస్తులో ఓ గది కిటికీ తలుపులు, గాలి కోసం కాబోలు తెరచి ఉన్నాయి. అయోమయాన్ని క్రిందనే ఉంచి, డ్రైనేజ్ పైప్ ఆధారంగా పైకి ఎగబాకాడు డీలక్స్. కిటికీ పైన ఎక్కి కూర్చుని, గదిలోకి చూశాడు. బెడ్ ల్యాంప్ వెలుగుతోంది. బెడ్ మీద మిలిటరీ ముసలాయన పడుకుని ఉన్నాడు. మరో మంచం మీద– అతని భార్య కాబోలు, ఓ ముసలావిడ, ఓ ఐదేళ్ళ పాప నిద్రిస్తున్నారు. ఓ మూలగా నేలపైన వేసిన పక్క మీద ‘బేబీ’ పడుకుని ఉంది. నిక్కరు, జుబ్బా తొడిగారు దానికి... మెల్లగా గదిలోకి జారాడు డీలక్స్. చటుక్కున కళ్ళు తెరచింది బేబీ. అది నోరు తెరచే లోపునే జేబులోంచి బిస్కెట్ తీసి దాని ముందు వేశాడు డీలక్స్. ఓ క్షణం అతని వంక అదోలా చూసి, బిస్కెట్ అందుకుందది. అందులో మత్తు మందు కలిసిందేమో, తినగానే కళ్ళు మూసేసింది. బేబీని చంకలో పెట్టుకుని, వచ్చిన దారినే బయటపడ్డాడు డీలక్స్. చెప్పినట్టే మూడో రోజున డిటెక్టివ్ ఆఫీసుకు వచ్చింది మిస్ రీటా. గదిలో పప్పీని చూడగానే, ‘ఓ బేబీ’ అంటూ ఆనందంతో అరిచింది. పప్పీ కూడా ఆమెను చూడగానే తోక ఊపుకుంటూ ఆమె దగ్గరకు పరుగెత్తింది. దాన్ని చేతుల్లోకి తీసుకుని ముద్దాడిందామె. డిటెక్టివ్లకు మిగతా ఫీజు చెల్లించి, ‘థాంక్స్’ చెప్పుకుని, పప్పీతో నిష్క్రమించింది. వారం రోజుల తరువాత – దినపత్రికలో వెలువడిన ఓ ప్రకటన డిటెక్టివ్ లను ఆకట్టుకుంది. అందులో ‘బేబీ’ ఫొటో ఉంది. దాని క్రింద ఇలా రాసివుంది – ’ఈ ఫొటోలోని పమెరేనియన్ పప్పీ పేరు ‘బేబీ’. గోల్డ్–బ్రౌన్ కలర్లో ముద్దుగా ఉంటుంది. ఏడాది వయసు. వారం రోజుల కిందట పప్పీని ఎవరో దొంగిలించుకుపోయారు. అదంటే ఐదేళ్ళ మా మనవరాలు సిరికి ప్రాణం. పప్పీ కనిపించకపోవడంతో సిరి అన్నపానీయాలు మానేసి, బెంగతో మంచం పట్టింది. వెంటనే పప్పీని తెచ్చి చూపించకపోతే పాప ప్రాణానికే ముప్పు అంటున్నారు డాక్టర్లు. పప్పీని ఎత్తుకువెళ్ళినవారికి ఇదే మా విజ్ఞప్తి!... దయచేసి పప్పీని వాపసు చేసేయండి. ఓ చిన్నారి ప్రాణాలను కాపాడండి. వారిపైన ఎటువంటి కేసూ పెట్టమని హామీ ఇస్తున్నాము. పప్పీని తెచ్చి ఇచ్చిన వారికి ఐదులక్షల రూపాయల బహుమతి కూడా ఇవ్వబడుతుంది.... ఇట్లు, మేజర్ సూర్యకాంత్. మొబైల్ నంబర్ –’ ఆ రోజు రాత్రి గదిలో ముసలావిడ పక్కలో నిద్రిస్తూన్న పాప అమాయక వదనం డీలక్స్ మదిలో మెదిలింది. ‘మిస్ రీటా బేబీ, ఈ పప్పీ ఒకటే కదా? మనం పొరబడ్డామనుకున్నా, ఆమెను చూడగానే పప్పీ తోక ఊపుకుంటూ దగ్గరకు పరుగెత్తింది కదా!’ అన్నాడు. అయోమయం బుర్ర గోక్కున్నాడు. ‘మరైతే, ఈ ప్రకటనకు అర్థం ఏమిటి?’ సాలోచనగా అన్నాడు డీలక్స్. ‘పోనీ, మనం పప్పీని మిస్ రీటా దగ్గర నుండి తీసేసుకుని మేజర్ కు అప్పగించేస్తేనో? ఐదు లక్షల బహుమతి కూడా లభిస్తుంది మనకు!‘ అన్నాడు అయోమయం. ‘కానీ, మిస్ రీటా అడ్రెస్ మనకు తెలియదుగదా?’ నాలుగు రోజులపాటు ఆ ప్రకటన గురించే ఆలోచిస్తూ, తర్జన భర్జనలు పడ్డారు డిటెక్టివ్ లు.. ఐదో రోజున – ‘రాత్రులు ఆ పాపే కలలో ఉంటోంది నాకు. ఓసారి మనం మేజర్ సూర్యకాంత్‌ను కలవడం మంచిదనిపిస్తోంది’ అన్నాడు డీలక్స్. ∙∙∙ డిటెక్టివ్స్ వెళ్ళేసరికి మేజర్ ఇంటి వద్దే ఉన్నాడు. డీలక్స్ తమను తాము పరిచయం చేసుకుని, ‘పత్రికలలో మీ ప్రకటన చూశాం. పాప స్థితికి విచారిస్తున్నాం. పాప కోసం బేబీని వెదకాలనుకుంటున్నాం’ అన్నాడు. మేజర్ నవ్వి, ‘మీ కన్సర్న్ కి థాంక్స్! బేబీ నిన్ననే దొరికింది’ అంటూ, వారిని ఓ గదిలోకి తీసుకువెళ్ళాడు. అక్కడ నీరసంగావున్న ఐదేళ్ళ సిరి పప్పీతో ఆడుకుంటోంది! ’గత సాయంత్రం మా సర్వెంట్ మెయిడ్ బాయ్‌ఫ్రెండ్ కి, ఎవరి దగ్గరో కనిపించిందంట పప్పీ. వాళ్ళతో పోట్లాడి దాన్ని తీసుకువచ్చేశాడట! ప్రకటించిన ప్రకారం అతనికి బహుమతి ఇవ్వబోతున్నాం’ చెప్పాడు మేజర్. అదే సమయంలో– ‘సాబ్!’ అంటూ అక్కడికి వచ్చింది ఓ యువతి. ఆమెను చూసి ఉలికిపడ్డారు డిటెక్టివ్ లు. ‘మిస్ రీటా...!’ అన్నపలుకులు వారి నోటి నుండి అప్రయత్నంగా వెలువడ్డాయి. ‘మా సర్వెంట్ మెయిడ్ అంజలి’ పరిచయం చేశాడు మేజర్. ‘పప్పీని తెచ్చింది ఈమె బాయ్ ఫ్రెండే.’ డిటెక్టివ్‌లను చూసి కంగారుగా లోపలికి వెళ్ళిపోబోయిందామె. డీలక్స్ బుర్రలో హఠాత్తుగా ఫ్లడ్ లైట్ వెలిగింది. ‘ఆగు!’ అంటూ ఆమెకు అడ్డు వెళ్ళాడు. ‘చెప్పు, నీ అసలు పేరేమిటి? అంజలా? మిస్ రీటాయా?’ తెల్లబోయిన మేజర్, ‘ఈమె మీకు ముందే తెలుసా?’ అనడిగాడు. జరిగిందంతా వివరించాడు డిటెక్టివ్, మేజర్ ముఖంలో రంగులు మారుతూంటే. ఆమె వంక గుడ్లురిమి చూశాడు మేజర్. ‘చెప్పు, ఎందుకు చేశావు ఇదంతా?’ భయపడిపోయింది ఆమె. ఏడుస్తూ అసలు సంగతి చెప్పేసింది. ‘పాపకు పప్పీ అంటే ప్రాణం. యాక్సిడెంట్లో తల్లిదండ్రులను కోల్పోయిన పాపంటే ఆ వృద్ధ దంపతులకు ప్రాణం. వారి ప్రేమానురాగాలను క్యాష్ చేసుకుందామన్నాడు అంజలి బాయ్‌ఫ్రెండ్. పప్పీని దొంగిలించి కొద్ది రోజులపాటు దాచిపెడితే, దానికోసం పాప బెంగ పెట్టుకుని తిండి తినదనీ, అప్పుడు పప్పీని తెచ్చి ఇచ్చిన వారికి ధనవంతులైన ఆ దంపతులు పెద్దబహుమానమే ప్రకటిస్తారనీ, పప్పీని కనిపెట్టి తెచ్చినట్టు చెప్పి ఆ బహుమతిని తాము కొట్టివేయవచ్చుననీ పథకం వేశాడు అతను. దాని ప్రకారమే మారుపేరుతో, కట్టుకథతో పప్పీని దొంగిలించడంలో డిటెక్టివ్‌ల సాయం కోరిందామె. తాము ఆశించినట్లే జరిగిందంతా. కానీ, అనుకోకుండా డిటెక్టివ్ లు రంగప్రవేశం చేయడంతో కుట్ర బయటపడింది. ఇది విని నివ్వెరపోయారంతా. మేజర్ ఆమె చెంప పగులగొట్టాడు. ‘ఆడపిల్లవై బ్రతికిపోయావు. అదే మగాడైతే నమ్మకద్రోహానికి గన్‌తో షూట్ చేసి పారేసేవాణ్ణి’... ఆవేశంతో ఊగిపోయాడతను. క్షమించమంటూ యజమాని కాళ్ళ మీద పడిందామె ఏడుస్తూ. ‘ఇవాళ పప్పీతో సరిపోయింది. రేపు ర్యాన్సమ్ కోసం పాపనే కిడ్నాప్ చేయవన్న నమ్మకమేమిటి?’ అరిచాడతను. ‘నేను మనసు మార్చుకుని నిన్ను పోలీసులకు అప్పగించకముందే... ఇంటి నుంచి వెళ్ళిపో!’ ‘బ్రతుకు జీవుడా!’ అనుకుంటూ బయటకు పరుగెత్తిందామె. ‘సారీ, మేజర్! దాని మాయమాటలు నమ్మి పప్పీని ఎత్తుకుపోయాం మేము. కైండ్లీ ఎక్స్క్యూజ్ అజ్!’ అన్నాడు డీలక్స్. ‘ఇట్స్ ఓకే, మేన్! మీ మూలంగానే ఈ ఫ్రాడ్ బైటపడింది’ అన్నాడు మేజర్ సూర్యకాంత్. ‘అంతేకాదు, ఆ దొంగ మూలంగా మున్ముందు సంభవించబోయే అనర్థాలను కూడా అరికట్టారు మీరు. ఐ మస్ట్ థాంక్ యూ.’ ‘నేను ప్రకటించిన బహుమతి మీదే! ఇదిగో చెక్కు. మీ పేరు రాసుకోండి’ అంటూ ఐదులక్షలకు చెక్ రాసి సంతకం చేసి, డీలక్స్ చేతిలో పెట్టాడు అతను. -తిరుమల శ్రీ -
నిజం బయటపడింది, కటకటాల్లోకి వెళ్లింది..
రాజమోహనరావు హడావుడిగా పోలీస్ స్టేషన్లోకి వచ్చాడు. ఇన్స్పెక్టర్ని కలవాలని అంటే, సెంట్రీ అతని కార్డు అడిగి తీసుకుని సీఐకి ఇచ్చి వచ్చాడు. స్టేషన్ ముందున్న రావిచెట్టు చప్టా మీద కూర్చున్నాడు రాజమోహనరావు. కాసేటికి అతనికి సీఐ నుంచి పిలుపు వచ్చింది. ‘‘సార్! నా పేరు రాజమోహనరావు..’’ అని చెప్పబోతుండగా– ‘‘కార్డులో చూశాను. ప్లీజ్ కూర్చోండి’’.. అన్నాడు సీఐ. రాజమోహనరావు సీఐ ఎదురుగా చైర్లో కూర్చున్నాడు. అతని ముఖంలో ఆందోళన కనిపిస్తోంది. ‘‘చెప్పండి. ఏం జరిగింది?’ అడిగాడు సీఐ. ‘‘నా కొడుకు సిద్ధార్థ కనిపించడం లేదు సార్! రాత్రి ఇంటికి రాలేదు. ఫోన్ స్విచ్చాఫ్ చేసి ఉంది. ప్రతిరోజూ మాదాపూర్‌లోని గ్లోబల్ టెన్నిస్ అకాడమీలో ప్రాక్టీస్ చేసి రాత్రి తొమ్మిదింటికల్లా ఇంటికి వచ్చేవాడు’’ అంటూ సిద్ధార్థ ఫొటో సీఐకి ఇచ్చాడు రాజమోహనరావు. సిద్ధార్థ రాజమోహనావుకి ఒక్కడే కొడుకు. బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ చేశాడు. విదేశాలకు వెళ్లి చదువుకోవాలనే ఆసక్తి లేదు. తండ్రి ఆటో స్పేర్‌పార్ట్స్ ఇండస్ట్రీలోనే కొనసాగుతున్నాడు. ఇండస్ట్రీని విస్తరించాలని ప్లాన్ చేస్తున్నాడు. వాళ్ల ఇండస్ట్రీ బాలానగర్‌లో ఉంది. నివాసం జూబ్లీహిల్స్ రోడ్ నం:38లో ఉంది. సిద్ధార్థ ఉపయోగించే స్కోడా కారు నంబరు నోట్ చేసుకుని మిస్సింగ్ కంప్లయింట్ తీసుకున్నాడు ఇన్స్పెక్టర్ అజయ్‌కుమార్. సిద్ధార్థ ఫొటో, అతడు ఉపయోగించే కారు నంబర్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పోలీస్స్టేషన్లన్నింటికీ పంపబడింది. రెండు రోజుల తర్వాత తుర్కుయాంజాల్ దగ్గర బ్రాహ్మణపల్లి వెళ్లే రోడ్డులో ఒక పక్కగా దొరికింది స్కోడా కారు. పోలీస్ స్టేషన్ నుంచి కాల్ రావడంతో వెళ్లాడు రాజమోహనరావు. అతన్ని చూస్తూనే ప్రశ్నించాడు ఇన్స్పెక్టర్ అజయ్‌కుమార్. ‘‘మీవాడు డైలీ ఈవెనింగ్ బాలానగర్ నుంచి మాదాపూర్‌లో టెన్నిస్ అకాడమీకి వెళ్లి ఇంటికి వస్తాడని చెప్పారు కదా? మరి సాగర్రోడ్డులోకి ఎందుకు వెళ్లి ఉంటాడు?’’ ‘‘నాకు ఐడియా లేదు సార్! ఆ ఏరియాలో ఏదైనా పార్టీకి వెళ్లి ఉంటాడేమో?’’ ‘‘మీకేం చెప్పలేదన్నమాట. పార్టీకి వెళ్తుంటే రాత్రి డిన్నర్‌కి రానని మీకుగాని, మీ మిసెస్కిగాని చెప్పాలి కదా?’’ ‘‘నాకు మిసెస్ లేదు సార్! పదేళ్ల కిందటే చనిపోయింది. ఇంట్లో కుక్ ఉంటుంది. మావాడు నైట్ పార్టీకి వెళితే లేటుగా వస్తాడుగాని ఆ సంగతి నాకూ చెప్పడు, కుక్కీ చెప్పడు. వాడికి అలాంటి అలవాటు లేదు.’’ చెప్పాడు రాజమోహనరావు. ‘‘ఆ రాత్రి ఏదైనా పార్టీ జరిగిందేమో మీ వాడి ఫ్రెండ్స్‌ని ఎంక్వైరీ చేశారా?’’ ‘‘ఆ.. మావాడి క్లోజ్ ఫ్రెండ్ నిఖిల్‌ని అడిగాను. పార్టీ ఏమీ జరగలేదని చెప్పాడు.’’ ‘‘నిఖిల్ ఏం చేస్తాడు?’’ ‘‘మాదాపూర్‌లోని ఒక కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్’’ ఇన్స్పెక్టర్ నిఖిల్ సెల్ నంబరు అడిగి తీసుకున్నాడు. ‘‘ఏం జరిగి ఉంటుంది? మీ వాడిని ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారని అనుమానిస్తున్నారా?’’ ‘‘మావాడిని కిడ్నాప్ ఎవరు చేస్తారండీ? మాకు శత్రువులు ఎవరూ లేరు. ఒకవేళ డబ్బు కోసం ఎవరైనా కిడ్నాప్ చేసినా, ఈపాటికి డిమాండ్ చేస్తూ నాకు కాల్ రావాలి కదా?’’ ‘‘మీరు చెప్పింది నిజమే! కిడ్నాప్ డబ్బు కోసం జరగలేదు. మీవాడికి లవ్ ఎఫైర్స్ ఏమైనా ఉన్నాయా?’’ ‘‘నాకు తెలిసి అటువంటివేమీ లేవు. వాడు వర్క్ మైండెడ్. మా ఇండస్ట్రీలోనే ఎక్కువ టైమ్ ఉంటాడు.’’ ‘‘సార్! ఈకాలంలో పిల్లల సంగతులు మనదాకా రావు. ఊళ్లో అందరికీ తెలిసిన సంగతులు మనకు చివరకు తెలుస్తాయి. అది కూడా ఏదైనా బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు. అందువల్ల మీవాడికి ఎఫైర్స్ లేవని గ్యారంటీ లేదు. మీకు తెలియదు అంతే!’’ అన్నాడు ఇన్స్పెక్టర్ అజయ్‌కుమార్. ‘‘మే బీ యూ ఆర్ కరెక్ట్’’ అని పేలవంగా నవ్వాడు రాజమోహనరావు. రాజమోహనరావు కొడుకు సిద్ధార్థ కనిపించడం లేదని ఆయన సన్నిహితులకు, బంధువులకు తెలిసింది. ఆయన తన ఇండస్ట్రీకి కూడా వెళ్లడం లేదు. ఇంట్లోనే ఉంటున్నాడు. చాలామంది ఇంటికి వచ్చి పరామర్శిస్తున్నారు. అంతా మిస్టరీగా ఉంది. సిద్ధార్థకి ఇరవయ్యారేళ్లు. చిన్నపిల్లాడేం కాదు కిడ్నాప్ చేయడానికి. వ్యక్తిగత కక్షలతో ఏదైనా అఘాయిత్యం చేసినా అది బయటపడక తప్పదు. ఒక్కోసారి పార్టీల్లో తాగుడు ఎక్కువై మత్తులో యువకులు దాడులు చేసుకుంటారు. అటువంటిది జరిగి సిద్ధార్థను ఎవరైనా హత్య చేశారా? అనే కోణంలో దర్యాప్తు చేశారు. ఎక్కడా క్లూ దొరకలేదు. సిద్ధార్థ క్లోజ్‌ఫ్రెండ్ నిఖిల్‌ని పోలీస్ స్టేషన్‌కి పిలిపించారు. ‘‘నిఖిల్ చెప్పు? నువ్వు సిద్ధార్థకి క్లోజ్ఫ్రెండ్వి. నీకు తెలియని వ్యక్తిగత విషయాలు ఉండవు. సిద్ధార్థ మిస్ కావడం నీకు ఎలా అనిపిస్తోంది?’’ అడిగాడు సీఐ. ‘‘సార్! నాకూ అదే వండర్‌గా ఉంది. ఏదైనా పార్టీకిగాని, ఫంక్షన్కిగాని వెళ్లాల్సి వచ్చినప్పుడు నన్ను తప్పకుండా తీసుకెళ్తాడు. ఆ రోజు ఏ పార్టీ జరగలేదు. అసలు ఆరోజు నాకు వాడి నుంచి కాల్ కూడా రాలేదు.’’ ‘‘పార్టీలు సరే! సిద్ధార్థకి ఏదైనా లవ్ ఎఫైర్ ఉందా? ఏ అమ్మాయినైనా ప్రేమించడం, తర్వాత బ్రేకప్ కావడం వంటివి... ఈ రోజుల్లో కామన్ కదా?’’ ‘‘వాడికి లవ్ ఎఫైర్ ఏమీ లేదు సార్! వాడి దృష్టి అంతా వాళ్ల ఇండస్ట్రీని డెవలప్ చేయడం మీదే... బాలానగర్ యూనిట్ డెవలప్ చేయడానికి ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేశాడు. ఆ తర్వాత కాకినాడ ఇండస్ట్రియల్ కారిడార్‌లో కొత్త యూనిట్ స్టార్ట్ చేయాలి అనేవాడు. వాడికి టెన్నిస్ ఇష్టం. గ్లోబల్ టెన్నిస్ అకాడమీ మెంబర్..’’ ‘‘సిద్ధార్థని ఎవరూ కిడ్నాప్ చేయలేదు.. ఓకే! పోనీ తనంటత తానే అండర్‌గ్రౌండ్‌కి వెళ్లి ఉంటాడా? ఫాదర్‌తో ఏవైనా గొడవలు ఉండి ఉంటాయా?’’ నిఖిల్ ఆలోచనలో పడిపోయాడు. కాసేపు కళ్లు మూసుకున్నాడు. తర్వాత కళ్లు తెరిచాడు. ‘‘సార్! ఫాదర్‌తో విభేదాలు అంటే గుర్తొచ్చింది... రాజమోహనరావుకి మంజులాదేవితో ఎఫైర్ ఉంది. అసలు ఆమెను రెండో పెళ్లి చేసుకోవాలనుకున్నాడనీ, ఇంటర్ చదువుతున్న కొడుకుని ఇంట్లో పెట్టుకుని ఇప్పుడు పెళ్లేంటని ఫ్రెండ్స్, రిలేటివ్స్ మందలిస్తే ఆ ప్రపోజల్ నుంచి డ్రాప్ అయ్యాడని చెప్పుకున్నారు. మంజులాదేవితో ఇప్పటికీ ఎఫైర్ కొనసాగిస్తున్నాడు. ఎక్కడికి వెళ్లినా కలిసే వెళతారు. లివ్ ఇన్ రిలేషన్షిప్ అనుకోండి. అయితే ఒకే ఇంట్లో కలసి ఉండరు. రాజమోహనరావు జూబ్లీహిల్స్‌లో ఉంటే, మంజులాదేవి సాగర్‌రోడ్‌లోని ఫామ్‌హౌస్‌లో ఉంటుంది. అది రాజమోహనావు కొనిపెట్టినదే. ఆమెకు శ్రావ్య అనే మేనకోడలు ఉంది. మంజులాదేవిలాగానే ఆమె కూడా క్లాసిక్ డ్యాన్సర్..’’ చెప్పడం ఆపాడు నిఖిల్. ‘‘ఊ.. తర్వాత?’’ ‘‘సిద్ధార్థకి శ్రావ్యనిచ్చి పెళ్లి చేయాలని రాజమోహనరావును కోరింది మంజులాదేవి. శ్రావ్య మంచి అమ్మాయి. అందగత్తె. సీఏ చదివింది. ఇండస్ట్రీకి సంబంధించిన అకౌంట్ లావాదేవీలు చూసుకుంటుందని రాజమోహనరావు కూడా పెళ్లికి ఓకే చెప్పాడు. సిద్ధార్థ కూడా మొదట ఒప్పుకున్నాడు. తర్వాత ఆమెను చేసుకోనని అడ్డం తిరిగాడు’’ చెప్పాడు నిఖిల్. ‘‘ఏం? ఎందుకని?’’ ప్రశ్నించాడు సీఐ అజయ్‌కుమార్. ‘‘అనైతికం అని..’’ ‘‘అంటే?..’’ ‘‘శ్రావ్య మంజులాదేవి మేనకోడలు కాదు, ఆమె కన్నకూతురేనన్న నిజం సిద్ధార్థకు తెలిసింది. పెళ్లి కాకపోయినా మంజులాదేవి తల్లి స్థానంలో ఉంది. తండ్రికి సహచరి అనేది జగమెరిగిన సత్యం. ఆమె కూతురిని తాను భార్యగా చేసుకోవడం అనైతికం అని సిద్ధార్థ పెళ్లికి తిరస్కరించాడు..’’ చెప్పాడు నిఖిల్. అజయ్‌కుమార్‌కి ఏదో క్లూ దొరుకుతున్నట్లుగా అనిపించింది. మంజులాదేవి, రాజమోహనరావుకి శ్రావ్య పుట్టకపోవచ్చు. ఆమె భర్తకే కలిగి ఉండొచ్చు. తన వయసు బయటపడకూడదనో, గ్లామర్ దెబ్బతింటుందనో కన్నకూతురిని చెల్లెలనీ, మేనకోడలనీ చెప్పుకునే వారిని తాను చూశాడు. మంజులాదేవి ఆ కోవకు చెందిందే. తన కన్నతూరుని ప్రియుడి కొడుక్కిచ్చి పెళ్లి చేయడం, కోట్ల ఆస్తులకు యజమానురాలిని చేయడం మంజులాదేవికి తప్పుగా అనిపించకపోవచ్చు. ఆమెకు అది చిన్న విషయమే కావచ్చు. నైతిక విలువల దృష్ట్యా అది అనైతికం. సిద్ధార్థ దానికే కట్టుబడ్డాడు. ‘‘వెల్ మిస్టర్ నిఖిల్.. మంచి సమాచారమే చెప్పావు..’’ అన్నాడు సీఐ అజయ్‌కుమార్. తర్వాత పోలీసులు మంజులాదేవి ఫామ్‌హౌస్ మీద రెయిడ్ చేశారు. ఒక గదిలో నిర్బంధించబడ్డాడు సిద్ధార్థ. శ్రావ్యను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోమని అక్కడ బంధించి చిత్రహింసలు పెడుతోంది మంజులాదేవి. సిద్ధార్థ మిస్సింగ్ కేసు విడిపోయింది. మంజులాదేవి కటకటాలు లెక్కపెడుతోంది పోలీస్‌స్టేషన్‌లో.. -వాణిశ్రీ -
అర్థరాత్రి 12 గంటలకు రహస్యంగా..
ఆకాశానికీ భూమికీ మధ్య వేలాడే అద్భుత కట్టడంలా నగర వాతావరణానికి దూరంగా వున్న సెవెన్ విల్లా ప్రపంచంలోని ఏడు వింతలనూ తలదన్నేలా కనిపిస్తోంది. మొన్నమొన్నటి వరకు కళాకాంతులతో ఒకనాటి వైభవానికి గుర్తుగా నిలిచిన సెవెన్ విల్లా ఇప్పుడు ఒక ప్రశ్నార్థకంగా నిలిచింది. వందల ఎకరాల్లో విస్తరించి వున్న ఆ ప్రాంతం నడిబొడ్డున వున్న సెవెన్ విల్లా ప్రత్యేకతలు వింటే ఆశ్చర్యంతో కళ్లు పెద్దవవుతాయి. కొన్ని దశాబ్దాలకు పూర్వమే నిర్మించిన ఆ విల్లాలో రాజా స్వరణేంద్ర భూపతి రాచరికానికి నిలువెత్తు సంతకం. అలాంటి రాజవంశానికి సంబంధించిన రాజా స్వరణేంద్ర భూపతి అనుమానాస్పద రీతిలో మరణించాడు. రివాల్వర్‌తో ఆత్మహత్య చేసుకున్నాడన్న వాదనకు సరైన అన్వేషణలో వున్నారు పోలీసులు. కాదు అతని మీద విషప్రయోగం జరిగిందని రాజా స్వరణేంద్ర భూపతి బంధువులు ఆరోపిస్తున్నారు. రాజా స్వరణేంద్ర భూపతికి పెళ్లికాకపోవడం, వారసులు ఎవరూ లేకపోవడం వల్ల ఇప్పుడు ఆ విల్లా హక్కుదారులు లేక వెలవెల పోతోంది. అందులోని విలువైన వస్తువులు కోట్లాది డబ్బు అదృశ్యమవుతోంది. ఆ విల్లాలో పనిచేసిన వారు శవాలవుతున్నారు. ఇప్పుడా విల్లాలోకి ఒక అపరిచితుడు ప్రవేశించాడు. తలెత్తి చూసినా కనిపించనంత ఎత్తులో వున్న సెవెన్ విల్లా వైపు చూసి వీపుకు వేలాడుతోన్న ఎయిర్ బాగ్‌ను తీశాడు. జిప్ ఓపెన్ చేశాడు. అందులో నుంచి ఓ ప్రాణి కదులుతూ బయటకు వచ్చింది. ఒళ్ళు గగుర్పొడిచేలా. అది ఉడుము...దాన్ని చాలా క్యాజువల్‌గా చేతుల్లోకి తీసుకున్నాడు. దానికి ఒక వైరులాంటి తాడు చుట్టబడి వుంది. రెండు చేతులతో గిరగిరా తిప్పుతూ బలమంతా చేతుల్లోకి తెచ్చుకుని పైకి విసిరాడు. ఆ ఉడుం తన ఉడుం పట్టును చూపించింది. ఆ తాడును గట్టిగా లాగి చూశాడు. ఆ తాడు సాయంతో పైకి ఎక్కుతున్నాడు. సరిగా మూడురోజుల ముందే ఆ విల్లా వాచ్‌మన్ హత్యకు గురయ్యాడు. ఆ విల్లాలో వున్న సొత్తును దోచుకోవడానికి వచ్చిన దోపిడీదొంగల పనే అని పోలీసుల అనుమానం. ఆ విల్లాను పోలీస్‌లు సీజ్ చేశారు. పరిసర ప్రాంతంలో గస్తీ పెంచారు. స్వరణేంద్ర భూపతికి వున్న పేరు ప్రతిష్టల రీత్యా ఈ కేసును సవాలుగా తీసుకుంది ప్రభుత్వం. అపరిచితుడు విల్లాపై భాగానికి చేరుకున్నాడు. తాను ఎంతటి సాహసానికి ఒడికడుతున్నాడో తెలుసు. విల్లా పై అంతస్తు నుంచి లోపలి ప్రవేశించాడు. ఆ విల్లాకు సంబంధించిన బ్లూ ప్రింట్ అతని దగ్గర వుంది. అతని జేబులో శక్తివంతమైన టార్చిలైట్ వుంది. స్వరణేంద్ర భూపతి మరణించాక ముందు జాగ్రత్తగా ఆ విల్లా ఎలక్ట్రిసిటీని కట్ చేసింది పోలీస్ శాఖ. ఆ అపరిచితుడు.. అక్కడి నుంచి రాజా స్వరణేంద్ర భూపతి పడగ్గదికి వెళ్ళాడు.. ఆ పడగ్గది లక్షల విలువ చేసే ఫర్నిచర్‌తో నిండి వుంది. ఎక్కడ చూసినా ఖరీదైన సామగ్రి... విశాలమైన మంచం. జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్న మంచం అది. ఆ పడగ్గదిలో క్రైమ్ సీన్.. ఈజీ చైర్లో కూర్చొని రివాల్వర్‌తో కాల్చుకున్నట్టు విల్లా కేర్ టేకర్ చెప్పాడు. రాజా స్వరణేంద్ర భూపతి పడగ్గది నుంచి రివాల్వర్ పేలిన శబ్దం విన్నట్టు చెప్పాడు. ఆ గదిని నిశితంగా పరిశీలిస్తూ మిర్రర్ వైపు చూశాడు. ఒకేసారి ఏడు ప్రతిబింబాలు కనిపించే ఆ మిర్రర్ లో ఎనిమిదవ ప్రతిబింబం కనిపించినట్టు అనిపించి ఉలిక్కిపడి చూశాడు. అక్కడ ఎవరో తచ్చాడుతున్నట్టు అనిపించింది. అక్కడి నుంచి ఆ విల్లాలో వున్న గదులను వరుసగా చూస్తూ వెళ్ళాడు. సరిగ్గా ముప్పై నిమిషాల తర్వాత ఆ అపరిచితుడు ఆ విల్లాలో నుంచి బయటకు వచ్చాడు. ఉడుమును ఆ పరిసరాల్లోన వదిలేశాడు. విల్లాను దాటి వెళ్తుండగా అతని తలమీద బలమైన దెబ్బ పడింది. అలానే నేలమీద కూలబడిపోయాడు. ముఖ్యమైన పోలీసు అధికారులు ఆ హాలులో సమావేశమయ్యారు. ఆ హాలులో వారికి ఎదురుగా సెవెన్ విల్లా కేర్ టేకర్ వున్నాడు. అతను భయంతో వణికిపోతున్నాడు. ‘‘విల్లాకు కాపలాగా వాచ్‌మన్ చనిపోయిన కేసులో దోపిడీదొంగల్లో ఒకడి ఆచూకీ దొరికింది. పలు దోపిడీ కేసుల్లో ప్రధాన నిందితుడు. అతని పేరు వడియప్ప’’... పోలీసులు ఈ విషయాన్నీ మీడియాకు చెప్పి మిగితా నిందితులను త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. పత్రికలో వార్త వచ్చిన ఎనిమిది గంటల్లోనే దోపిడీదొంగ వడియప్ప బార్లో హత్యకు గురయ్యాడు. పోలీసులు ఈ మిస్టరీని చేధించారు... వడియప్పతో బంగారు నగల వ్యాపారి కుమ్ముౖక్కై దోపిడీకి ప్లాన్ చేయించినట్టు ఆధారాలు సేకరించారు. ఆ బంగారు నగల వ్యాపారిని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమైంది. అప్పుడే ఒక షాకింగ్ న్యూస్ తెలిసింది. గుడికి వెళ్లి ప్రసాదం తిని ఇంటికి వస్తున్న బంగారు నగల వ్యాపారి కారులోనే మరణించాడు. అతను తిన్న ప్రసాదంలో విషం కలిపి వుంది. వెంటనే పూజారిని విచారించడానికి సిద్ధమైంది పోలీస్ శాఖ. గుడికి వెళ్లేసరికి గుడి వెనుక పూజారి హత్య చేయబడి వున్నాడు. పూజారి దగ్గర రాజా స్వరణేంద్ర భూపతి చేతి బంగారు కడియం దొరికింది. అయితే అతను నకిలీ పూజారి అని ఆ రోజు అసలు పూజారిని దారిలో కొందరు దుండగులు అడ్డగించి కొట్టి పడేసి వెళ్లారని తెలిసింది. భక్తులు కొత్త పూజారి అని భ్రమపడ్డారు. సెవెన్ విల్లాలో అనుమానితులు ఒక్కరొక్కరు మరణిస్తున్నారు. హత్యల మిస్టరీ అలానే ఉండిపోయింది. ఆ హాలులో వున్న పోలీసులు కేర్ టేకర్ సిద్దప్ప వైపు చూసి కుచోమన్నారు. ‘‘మీరు భయపడవలిసిన అవసరం లేదు. ఈ హత్యల మిస్టరీ తేలిపోయింది’’ చెప్పారు. ‘‘ఎవరు...? ముందు అతణ్ణి అరెస్ట్ చేయండి.. నమ్మకంగా మా యాజమాని దగ్గర నలభై సంవత్సరాలుగా పని చేస్తున్నాను... నా మీద ఎన్నో బాధ్యతలు పెట్టారు. ఎన్నో ట్రస్టులు వున్నాయి... రాజా స్వరణేంద్ర భూపతిగారి మరణంతో నేను ఒంటరివాడిని అయ్యాను... ఖరీదైన వస్తువులు చోరీ అవుతున్నాయి. వరుస హత్యలు జరుగుతున్నాయి’’ భయంగా చెప్పాడు. ‘‘మీకు కాళిదాసు గురించి తెలుసా..?’’ అడిగాడు ఓ పోలీస్ అధికారి సూటిగా సిద్దప్ప వైపు చూస్తూ.. ‘‘తెలియదు...’’ అయోమయంగా చెప్పాడు. ‘‘మేము సేకరించిన వివరాల ప్రకారం... రాజా స్వరణేంద్ర భూపతి మిమ్మల్ని కూడా నమ్మకుండా గత కొన్నేళ్లుగా కాళిదాసును తన వ్యక్తిగత సహాయకుడిగా నియమించుకున్నాడు. కేవలం ఫోన్స్ ద్వారానే సంప్రదింపులు చేసుకున్నారు. రెండురోజుల క్రితం కాళిదాసు విల్లాలో అడుగుపెట్టినట్టు సాక్ష్యాలు వున్నాయి. బహుశా రాజా స్వరణేంద్ర భూపతికి వున్న వేలకోట్ల ఆస్తిని కాజేయడానికి అతను కుట్రపన్ని ఉంటాడు.. నమ్మకద్రోహానికి ఒడికట్టి ఉంటాడు... ఇదే అతని ఫొటో అంటూ ఓ ఫొటోను అతని ముందు ఉంచారు. ఆ ఫొటోను చూడగానే సిద్దప్ప కళ్లు పెద్దవయ్యాయి. బలవంతంగా కళ్లు తెరిచాడు అతను. అంతా చీకటి... తన కళ్లకు ఎవరో గంతలు కట్టారని అర్థమైంది అతనికి. అంతేకాదు అతనికి మరో విషయం కూడా అర్థమైంది.. తన చేతులు వెనక్కి విరిచి కట్టేశారని. అతను గింజుకోలేదు.. ఆలోచిస్తున్నాడు.. తానెక్కడున్నాడో గెస్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అతను తన ఎడమచేతిని మణికట్టు వరకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. అప్పటికే తనను బంధించి ఎంత కాలమైందో తెలియడం లేదు... కానీ ఒక్క విషయం స్పష్టమైంది.. కేవలం కొన్ని గంటల వ్యవధి మాత్రమే... ఎందుకంటే రోజుల తరబడి తనను మత్తులో ఉంచడం సాధ్యం కాదు కనుక. అతని చేయి మణికట్టును తాకింది అతి కష్టంమీద. రిస్ట్ వాచ్ తగిలింది. రిస్ట్ వాచ్ కీ రాడ్... బొడిపెను గట్టిగా ప్రెస్ చేసాడు. వాచ్ ముందు భాగం నుంచి చిన్న రెండు అంగుళాల కత్తి బయటకు వచ్చింది. ఆతని మొహానికి చెమటలు పడుతున్నాయి... క్షణాలు గడుస్తున్నాయి... అతని చేతి కట్లు విడిపడ్డాయి... మణికట్టు ఎర్రగా కందిపోయింది. తల మీద రక్తపు చారికలు. సెవెన్ విల్లా బయట తనను తల వెనగ్గా కొట్టడం గుర్తొచ్చింది. ఎక్కడో పాము బుస.... మెల్లిమెల్లిగా అతనికి ఆ పాము తను వున్న ప్రాంతంలోనే ఉందన్న విషయం తన కళ్ళకు గంతలు విప్పాక అర్థమైంది. అంతా చీకటి... అతని కళ్ళు ఆ చీకటికి అలవాటు పడడానికి కొంత సమయం పట్టింది. మెల్లగా చేతులు మెడ రుద్దుకుంటూ లేచాడు. అలానే గోడను తడుముకుంటూ లైట్ వేయడానికి స్విచ్ బోర్డు దగ్గరికి వెళ్ళాడు. స్విచ్ వేశాడు.. లైట్ వెలుగలేదు... పాము పాకుతూ వస్తున్నట్టు అతని పాము చెవులకు అనిపించింది. ఇలాంటి వాటిలో అతను తర్ఫీదు పొందినవాడు కాబట్టి... ‘‘ఆ లైట్ వెలుగదు మిస్టర్ కాళిదాస్’’ అన్న మాటలు వినిపించాయి. ‘‘ఈ లైట్ వెలుగకపోయినా నా బ్రెయిన్ లైట్ వెలిగింది మిస్టర్ సిద్దప్పా...’’ అన్నాడు ఆ అపరిచితుడు. అవతలి వైపు నుంచి క్షణకాలం నిశ్శబ్దం ‘‘నేను సిద్దప్పనా? ఎలా కనిపెట్టావ్?’’ ‘‘ఎలా కనిపెట్టావ్? అని అన్నావ్ కానీ ‘నేను కాదు’ అనలేదు... అదీ కాకుండా నీ గొంతు నా మైండ్ లో రిజిస్టర్ అయిపోయింది’’ అతను చెప్పాడు. ‘‘ఎలా? ఎప్పుడు? అయినా నువ్వు ఎప్పుడు రాజా స్వరణేంద్ర భూపతి దగ్గర చేరావ్? నన్నెలా కనిపెట్టావ్?’’ ‘‘నువ్వు నన్నెలా కనిపట్టావో... అలా’’ నవ్వుతూ అన్నాడు. ‘‘అంటే...’’ అర్థం కానట్టు అడుగుతూ... సెల్లో వున్న ఫ్లాష్ ఆన్ చేశాడు. ఆ విశాలమైన గదిలో వెలుతురు వచ్చేసింది. ‘‘సిట్–స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఆఫీసర్ని ఆ మాత్రం తెలుసుకోలేనా? ఎప్పుడైతే రాజా స్వరణేంద్ర భూపతి ఆత్మహత్య వార్త బయటకు వచ్చిందో... నా ఇన్వెస్టిగేషన్ అడ్వెంచర్ మొదలైంది. దోపిడీ దొంగలు పథకం ప్రకారం దొంగతనం చేయడంలో నీ హ్యాండ్ ఉందని అర్థమైంది. కేసును పక్కదారి పట్టించడానికే నువ్వు దొంగతనం ప్లాన్ చేశావని. దోపిడీ దొంగ వడియప్పతో నువ్వు చేయించిన దొంగతనం బయటపడుతుందని అతడిని చంపేశావు.. ఆ విషయం తెలిసిన వాచ్మన్ని హత్య చేశావు... మా అనుమానం బంగారునగల వ్యాపారి మీదికి వెళ్లిందని తెలియగానే పూజారితో ప్రసాదంలో విషం పెట్టి చంపించావ్.. ఆ పూజారి మీద మాకు అనుమానం కలిగిందని తెలియగానే అతడిని చంపి, బంగారుకడియాన్ని అక్కడ వదిలి మా అనుమానాన్ని పూజారి మీదికి మళ్లేలా చేశావు.. కానీ నువ్వు చేసిన పొరపాటు... బం...గా...రు...క...డి...యం ...రాజా స్వరణేంద్ర భూపతి చనిపోయిన సమయంలో ఆ బంగారుకడియం నీ చేతికి ఉండడం టీవీలో స్పష్టంగా వుంది. అన్నింటి కన్నా రాజా స్వరణేంద్ర భూపతి ఆత్మహత్య కథ... పాయింట్‌బ్లాంక్‌లో ఆయుధం పేలగానే ఆపోజిట్ డైరెక్షన్లో గానీ, పక్కకుగానీ పడిపోవాలి. ఎడమ కణతపై పిస్టల్‌తో కాల్చుకుంటే.. బుల్లెట్ కుడి కణత నుంచి బయటకు వెళ్లి గోడకు తగలాలి. అప్పుడు ఆపోజిట్ సైడ్ నుంచి రక్తం రావాలి. రాజా స్వరణేంద్రభూపతిది ఎడమ చేతి వాటం... అతని మీద విషప్రయోగం కొన్నినెలలుగా జరుగుతూనే వుంది. నన్ను నువ్వు బంధించిన రోజు ఈ విషయాలు గమనించాను..అంతే కాదు అద్దంలో ఓ పక్కన వున్న నిన్ను నా బటన్ కెమెరా బంధించింది. అందుకే కాళిదాసు డ్రామా ఆడాను... నువ్వు నన్ను ఇక్కడే బంధిస్తావని తెలుసు.. ఇది సెవెన్ విల్లా అని తెలుసు’’...‘అన్నాడు అతను ‘‘ఎలా తెలుసుకున్నావు?’’ ‘‘పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడ పవర్ తీయించింది కదా.. దానితో పాటు సీక్రెట్ కెమెరాలు నేను పెట్టాను... రాజా స్వరణేంద్ర భూపతి అతి ప్రమాదకరమైన డివోచి అనే దక్షిణాఫ్రికా విషసర్పాన్ని పెంచుకుంటున్నాడు... తొమ్మిది అడుగుల విషసర్పం... దానికి రోజూ ఆహారాన్ని స్వయంగా అందించేవాడు... ఆ విషయం ఎవరికీ తెలియదు.. నీతో సహా... ఈ ఇంట్లోకి వచ్చినప్పుడు అతని డైరీలో చదివాను. నువ్వు రాజా స్వరణేంద్ర భూపతిని బంధించి విషప్రయోగంతో చంపేసి.. ఎవరినీ విల్లాలోకి అడుగుపెట్టకుండా చేశావు... అనుమానం వున్న ప్రతీవాళ్లను ఆనవాలు లేకుండా చేశావు... నిన్ను నమ్మినందుకు విషసర్పమే సిగ్గుపడేలా కాటువేసి నీ స్వార్థమనే విషంతో రాజా స్వరణేంద్ర భూపతిని చంపేశావు’’... అన్నాడు సిట్ ఆఫీసర్ కార్తికేయ.. ‘‘ఇన్ని తెలిసిన నిన్ను వదిలేస్తే నాకు ప్రమాదం కదా’’ అన్నాడు రివాల్వర్ తీసి కార్తికేయ వైపు గురిపెట్టి. అప్పుడే సెల్ ఫ్లాష్ లో కార్తికేయ కాళ్ళ దగ్గర తొమ్మిది అడుగుల ప్రమాదకరమైన విషం వున్న డివోచి విషసర్పం ప్రత్యక్షమైంది. కార్తికేయ భయపడలేదు.. దాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు.. చిత్రంగా అది కార్తికేయను చుట్టేసింది. ఏమీ చేయకుండానే... ‘‘డియర్ డివోచి... నీ యజమానిని చంపిన వాడి మీద ప్రతీకారం తీర్చుకుంటావా? నన్ను మింగేస్తావా..’’ ఛాయిస్ నీదే అన్నాడు నవ్వుతూ. కార్తికేయ ఆ విషసర్పం వైపు చూస్తూ. సిద్దప్ప పగలబడి నవ్వాడు ‘‘అది విషసర్పం.. దానికి కాటేయడం.. మింగేయడమే తెలుసు.. నా రివాల్వర్‌లో తూటా కూడా వేస్ట్ అది నిన్ను చంపే ..’’ ఇంకా అతని మాటలు పూర్తి కాకుండానే కార్తికేయను చుట్టేసిన డివోచి విషసర్పం గాలిలోకి లేచింది.. దాని పడగ క్షణములో వెయ్యో వంతులో సిద్దప్ప తలను తాకింది... పాము తలలోకి సిద్దప్ప శరీరం వె...ళ్తోం...ది... తన యజమానిని చంపిన దృశ్యం కనిపించినంత కసిగా.... పైశాచిక స్వార్థంతో ప్రాణంలా నమ్మిన నమ్మినబంటు విశ్వసఘాతుకానికి విషపు కోరలున్న విషసర్పం ప్రతీకారం తీర్చుకుంది. తన యజమానికి విశ్వాసాన్ని చూపించింది. తనకు ప్రతీరోజు ఆహారాన్ని అందించి తనను పెంచుకున్నందుకు కృతజ్ఞతా చూపించింది. కొన్నివేల కోట్లు.. ఏమీ తీసుకువెళ్లని రాజా స్వరణేంద్ర భూపతి. కొన్నివేల కోట్లు.. స్వార్థంతో ప్రాణాలు కోల్పోయిన సిద్దప్ప... కార్తికేయ బయటకు వచ్చేసరికి... తెల్లవారుతోంది.. ఒక చీకటిలోని నిజం వెలుగులోకి వచ్చినట్టు.... డివోచి సర్పాన్ని తన రెండు చేతుల్తో అతి కష్టంమీద తీసుకుని సెవెన్ విల్లా బయటకు వచ్చి అడవిలో వదిలేశాడు... ‘‘మా మనుషుల్లో వున్న విషం కన్నా నీ విషం ప్రమాదకరమైంది కాదు.. వెళ్ళు ఫ్రెండ్.... నీ సాహసం నేను గుర్తుంచుకుంటాను.. ఈ రహస్యం నాలోనే ఉండిపోతుంది’’ అంటూ ముందుకు నడిచాడు కార్తికేయ. ఈ రహస్యం నాలోనే ఉండిపోతుంది’’ అంటూ ముందుకు నడిచాడు కార్తికేయ. - విజయార్కె -
‘మా నాన్నని నేనే చంపాను’
కాలుష్యాన్ని కర్కశంగా వెదజల్లుతున్న సిమెంట్ ఫ్యాక్టరీలో ఎర్రన్న కళాసీగా పనిచేస్తున్నాడు. ఉద్యోగం చిన్నదైనా అది ప్రభుత్వ ఉద్యోగం కావడంతో డబ్బులకేమీ లోటు లేదు. భవిష్యత్తుకు సంబంధించిన చింత లేదు. ప్రారంభంలో లేదు గాని ఈ మధ్యే ఎర్రన్న తాగుడుకు అలవాటుపడ్డాడు. మందు కొట్టడమనేది నిత్యకృత్యమైపోయింది. ఇంటికి రావడం రావడమే విపరీతంగా తాగి రావడం, అల్లరి చేయడం రోజూ మామూలైపోయింది. ఎప్పటిలాగే తాగి వచ్చి, ఇంట్లో కోడికూర, మేకకూర లేదని రభస చేసి, మేడపైకి వెళ్లి పడుకున్నాడు. వేసవిలో మేడపైన ఓపెన్‌లో నిద్రపోవడం ఆ ప్రాంతంలో అందరికీ అలవాటే. ఎర్రన్నతో పాటు ఇతర కుటుంబ సభ్యులు కూడా వరుసగా దుప్పట్లు పరుచుకుని, తలగడలు పేర్చుకుని నిద్రకు ఉపక్రమించారు. చల్లనిగాలి వీస్తుండటంతో తొందరగానే నిద్రాదేవత వారినందరినీ గట్టిగా ఆవహించేసింది. మత్తుగా నిద్రపోయారంతా! ఉదయం నాలుగింటికి లేవటం ఎర్రన్న భార్య బంగారమ్మకి అలవాటు. ఉదయమే పిల్లలకీ, మొగుడికీ టిఫిన్లూ, భోజనం క్యారియర్లు సిద్ధం చేయటం ఆమె దినచర్యలో భాగమే! ఆ రోజు కూడా యథావిధిగా పెందలాడే లేచింది. లేచిన వెంటనే భర్త ముఖం చూడటం ఆమెకి సెంటిమెంట్... అలాగే ఎర్రన్న వైపు చూసింది. ఎర్రన్న కనిపించలేదు. ఆశ్చర్యపోయింది. బాత్రూమ్లో ఉన్నాడేమోనని వెదికింది. అక్కడ కూడా లేడు. గాభరా పడింది. ఆతృతగా ఇంట్లో నుంచి వాకిట్లోకి పరుగులు తీసింది. ఎదురుగా ఎర్రన్న! వాకిట్లో బోర్లా పడున్నాడు. ముఖాన్ని వెనక్కు తిప్పి చూసింది. మత్తులో ఉన్నాడేమోనని ముఖంపై నీళ్లు చల్లింది. ఎర్రన్న అచేతనంగా పడి ఉన్నాడని, ప్రాణం ఎప్పుడో పోయిందని ఆమె తెలుసుకోవడానికి అట్టే సమయం పట్టలేదు. పట్టరాని దుఃఖం ముంచుకొచ్చింది. భోరున విలపించింది. ఆమె ఏడుపు విని ఎదురింటి వారు, ఇరుగు పొరుగు వారు, మేడపై నిద్రపోతున్న కొడుకు రమేష్, కూతురు సీత పరుగెత్తుకు వచ్చారు. ఎలా చనిపోయాడో ఎవరికీ అర్థం కావట్లేదు. కిందికొచ్చి కుప్పకూలిపోయాడా, మేడపైనుంచి పొరపాటున జారిపడ్డాడా– అంతా అయోమయంగానే ఉంది. అందరికీ సమాచారం పంపారు. ఈలోగా అందరితోపాటు సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికసంఘ నాయకుడు మసేన్‌రాజు కూడా వచ్చాడు. ‘‘జరిగిందేదో జరిగిపోయింది. పోయినవాడిని తిరిగి బతికించలేము. వాడితోపాటు మనమూ చావలేము. ఇప్పుడు ఎర్రన్న కుటుంబం అనాథలైంది. ఆ ఉద్యోగం మీద వచ్చే జీతం మీద బతికే ఆ కుటుంబం వీధిన పడింది. పిల్లలు కూడా ఇంకా ఏరకంగానూ స్థిరపడలేదు. ఎర్రన్న ఉద్యోగం వారి పిల్లల్లో ఎవరో ఒకరికో లేదా అతని భార్యకో వస్తే ఆ రకంగా వాళ్లు నిశ్చింతగా బతకగలుగుతారు. అందుకు నా దగ్గర ఒక ఉపాయం ఉంది. మీకిష్టమైతే ఆ రకంగా చేద్దాం...’’ కుటుంబ సభ్యులకీ, కొందరు ముఖ్యులకీ విషయం చెప్పాడు. అందరూ అందుకు సరేనన్నారు. ఎర్రన్న అంత్యక్రియలకు చెయ్యాల్సిన ఏర్పాట్లను నిలిపివేశారు. అంబాసిడర్ కారును రప్పించారు. కారు డిక్కీలో ఎర్రన్న శవాన్ని పడేశారు. ఆ తర్వాత కారు సరాసరి సిమెంట్ ఫ్యాక్టరీలోనికి దూసుకెళ్లింది. యంత్రాలు చకచకా తిరుగుతున్నాయి. దాంట్లో కన్వేయర్ బెల్ట్ వద్దకు శవాన్ని మోసుకెళ్లి దానిపై పడేశారు. సిమెంట్ బూడిదతో పాటు ఎర్రన్న శవం కూడా నేలమీద ముక్కలు పడింది. ‘‘విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన, ప్రమాదవశాత్తు యంత్రంలోకి జారిపడిన ఎర్రన్న కుటుంబానికి న్యాయం జరగాలి.. వారింట్లోని ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. కామ్రేడ్ ఎర్రన్న అమర్ రహే..’’ నిరసన ధ్వనులు మిన్నంటాయి. ఈ విషయమై కార్మికులంతా ధర్నాకు దిగారు. ఉత్పత్తి స్తంభించిపోయింది. దాంతో యాజమాన్యం చర్చలకు పిలిచింది. ‘‘కంపెనీ రూల్స్ ప్రకారం ఏం చెయ్యగలమో అదంతా చేస్తాం. వారి కుటుంబానికి తప్పకుండా న్యాయం చేస్తాం. శవం ఇంకా అక్కడే ఉంటే కార్మికులు భయపడే వాతావరణం, భీతావహ స్థితి ఏర్పడుతుంది. దాన్ని అధిగమించేందుకు దయచేసి వెంటనే శవాన్ని అక్కడి నుంచి తీసుకెళ్లిపోండి..’’ సానుకూలంగా యాజమాన్యం ప్రతిపాదన తీసుకు రావడంతో.. అంతా అక్కడినుంచి నిష్క్రమించారు. ఉత్పత్తి యథావిధిగా ప్రారంభమైంది. ఇలాంటి సంఘటనలు ఈమధ్య తరచు జరగటం, ఫ్యాక్టరీలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, భద్రత లోపించిందని– ఉన్నత యాజమాన్యం దృష్టికి వచ్చింది. దాంతో రహస్యంగా నిఘా ఏర్పాటు చేసింది. ఆ విషయం ఇంకా ఉద్యోగులకుగాని, కార్మిక నాయకులకుగాని తెలియదు. నిఘా బృందం పరిశీలనలో నమ్మలేని నిజాలు బయటికొచ్చాయి. వెంటనే యాజమాన్యం రంగంలోకి దిగింది. ఇంకా ఉపేక్షించడం మంచిది కాదనే నిర్ణయానికొచ్చింది. ఈ కేసు విషయమై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు డిటెక్టివ్ సాయంతో విచారణ ప్రారంభించారు. తమదైన శైలిలో పరిశోధన చేశారు. ఎర్రన్న భార్యను అదుపులోకి తీసుకోగానే గడగడా విషయమంతా చెప్పేసింది. ఎర్రన్న చనిపోయాక ఏడుస్తుంటే, కార్మిక నాయకుడు మసేన్‌రాజు ఇచ్చిన సలహా, దాని ప్రకారం ఫ్యాక్టరీ లోపలికి శవాన్ని మోసుకురావడం పూసగుచ్చినట్లు చెప్పేసింది. ‘‘ఇదంతా సరే... అసలు ఎర్రన్నను చంపిందెవరు? ఆ విషయమే నిజం చెప్పు...’’ పోలీసు లాఠీ బంగారమ్మ తల చుట్టూ తిరగసాగింది. గిరగిరా తిప్పుతున్న ఎస్సైని చూస్తేనే పైప్రాణం పైనే పోయేలాగుందన్న భయం కలుగుతోంది. ‘‘నా భర్తని చంపారా? ఎవరు?..’’ ఆశ్చర్యపోతూ అడిగింది. ‘‘ఇంకెవరు? నువ్వే..’’ కర్కశంగా నవ్వాడు ఎస్సై. కడుపులో పిడిగుద్దులు గుద్దింది మహిళా కానిస్టేబుల్. నొప్పిని తట్టుకోలేక భీకరంగా అరిచింది బంగారమ్మ. ‘‘నేనా.. ఎంత ఘోరం! నా భర్తను చంపుకుంటానా? ఏమైనా న్యాయంగా ఉందా?’’ వలవలా ఏడ్చేసింది మహిళా కానిస్టేబుల్ మరోసారి పిడిగుద్దులు కురిపించింది. భరించలేని బాధతో బంగారమ్మ నేలమీద వాలిపోయింది. ఇదంతా ఎర్రన్న పిల్లల ఎదురుగానే జరిగింది. ఎర్రన్న కొడుకు రమేష్ రక్తం లావాలా పొంగుతోంది. తన తల్లిని కొడుతున్న కానిస్టేబుల్ని కసితీరా కొట్టాలనిపించింది. తన శక్తి మేరకు సినిమాలో హీరోలా వాళ్లందరినీ చావబాదాలనిపించింది. కాని ఎదురుగా డజనుకుపైగా పోలీసులు. తానొక్కడూ ఏమీ చేయలేడు. ఏ పాపమూ ఎరుగని తల్లిని హింసిస్తుంటే చూడలేకపోతున్నాడు. తానే ఆ తప్పు చేశానన్న విషయాన్ని ఒప్పేసుకోవాలనుకున్నాడు. పోలీసుల ముందుకొచ్చి లొంగిపోయాడు. ‘‘అవును! మా నాన్నని నేనే చంపాను. రోజూ తాగొచ్చి ఇంట్లో గొడవ చేసేవాడు. అమ్మని కొట్టేవాడు. మేం అందరిలా ప్రశాంతంగా చదువుకుందామనుకుంటే రోజూ ఏదోరకంగా డిస్టర్బ్ చేసేవాడు. ఈ మధ్య జీతం కూడా ఇంటికి ఇవ్వకుండా, పూర్తిగా తాగేస్తున్నాడు. స్కూలు ఫీజులు కూడా కట్టలేకపోతున్నాం. ఇంట్లో తిండికి కూడా డబ్బుల్లేక అమ్మ ఇబ్బంది పడుతోంది. పొరుగింటి వాళ్ల ముందు చులకన అవుతున్నాం. నాన్న చనిపోతే ఉద్యోగం వచ్చినా, రాకపోయినా కంపెనీ నుంచి లక్షల్లోనే సొమ్ము చేతికొస్తుంది. దాంతో బాగా చదివి, మంచి ఉద్యోగంలో సెటిల్ కావచ్చనే ఇంత పనీ చేశాను. ఆరోజు రాత్రి అందరూ మత్తుగా నిద్రపోయారు. నేను మాత్రం నిద్రపోలేదు. సరిగ్గా అర్ధరాత్రి దాటాక రెండు గంటల సమయంలో నిద్రపోతున్న నాన్న ముఖంపై తలగడతో అదిమాను. ఊపిరాడక కాసేపు గింజుకున్నాడు. ఆ తర్వాత ప్రాణం వదిలాడు. మా మేడపై శ్లాబ్‌కి పిట్టగోడ లేదు. అందుకే సులువుగా నాన్నను బయటకు లాగి, కిందకు తోసేశాను. నిద్రమత్తులో జారిపడి ఉంటాడని అందరూ అనుకుంటారని నమ్మాను. కాని ఈ రకంగా జరుగుతుందని ఊహించలేకపోయాను. ఇది పూర్తిగా నా నిర్ణయం. ఈ చర్యతో మా కుటుంబ సభ్యులెవరి ప్రమేయమూ లేదు. మా అమ్మకు అసలేమీ తెలీదు..’’ రమేష్ నేరం ఒప్పుకోవడంతో చేతికి బేడీలు పడ్డాయి. భర్తనీ, కొడుకునీ దూరం చేసుకున్న బాధతో బంగారమ్మ మరోసారి మూర్ఛపోయి ఆస్పత్రి పాలైంది. రమేష్‌తో పాటు, కార్మిక నాయకుడిని కూడా అరెస్టు చేశారు. - డా.ఎం.వి.జె.భువనేశ్వరరావు -
మిస్టర్ డూప్లికేట్
ఎదురింట్లోకి కొత్తగా ఎవరో వచ్చారని తెలిసి వారితో పరిచయం చేసుకోవాలని వెళ్ళింది మృదుల, భర్త సలీమ్ ఆఫీసుకు వెళ్ళిపోయాక. తలుపు తెరిచిన వ్యక్తిని చూసి ఉలిక్కిపడింది. తన భర్త సలీమ్! ‘‘మీరు...ఇక్కడ...!?’’ అంది తెల్లబోతూ. నొసలు చిట్లించి, ‘‘మీరు...?’’ ప్రశ్నార్థకంగా చూశాడతను. అవాక్కయిందామె. అప్పుడే అక్కడకు వచ్చిన ఇంటి ఓనర్ తంగవేలు మృదులను పలుకరించాడు. ‘ఈ తమాషా చూస్తివా, మృదులమ్మా? ఇతనుదా అచ్చు నీ పురుషన్ మాదిరి ఉండాడుకదూ?‘ అన్నాడు నవ్వుతూ. ‘‘ఇతనుదా గణేష్. బేచ్లర్. కాల్ సెంటర్లో పనిచేస్తుండు. నమ్మ వీటికి పుదుసా బాడుగకు వచ్చిండు’’ గణేష్ వంక పరిశీలనగా చూసింది మృదుల... తన భర్త వయసే ఉంటుందతనికి. ఒడ్డూ, పొడవూ, రంగూ–సలీమ్‌కు ట్విన్ బ్రదర్‌లా ఉన్నాడు. కాకుంటే సలీమ్ ది గంభీర వదనమైతే, గణేష్ పెదవులు నవ్వుతూంటాయి. మృదుల ఇంటికి తిరిగివచ్చిందేకాని మనసంతా ఆలోచనలే... మనిషిని పోలిన మనుషులు ప్రపంచంలో ఏడుగురు ఉంటారని ఆలకించింది. అంతగా అచ్చు గుద్దినట్లుంటారని ఊహించలేదు. ముస్లిమ్ అయిన సలీమ్‌కి, జంధ్యం వేసుకున్న గణేష్‌కీ పోలికలు ఎలా వచ్చాయా అని అబ్బురపడింది... మృదులకు ఇరవయ్యేళ్ళుంటాయి. అందం, ఆకర్షణ ఆమె సొత్తులు. డిగ్రీ చదువుతూండగా తనకంటె దాదాపు ఐదేళ్ళు పెద్దవాడైన సలీమ్‌తో పరిచయమైందామెకు. అది ప్రేమగా మారింది. హ్యాండ్సమ్గా ఉండే సలీమ్ అప్పటికే ఓ ఫార్మాస్యుటికల్ కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. మతాలు వేరు కావడంతో పెద్దలతో పెద్ద గొడవే అయింది. లేచిపోయి వచ్చి రిజిస్టర్డ్ మేరేజ్ చేసుకున్నారు. అది జరిగి ఏడాది అవుతుంది. సలీమ్ భార్యను అపురూపంగా చూసుకుంటాడు... అచ్చు తన పోలికలో ఉండే గణేష్ అనే వ్యక్తి ఎదురింట్లో దిగాడని ఆలకించిన సలీమ్ అమితాశ్చర్యం చెందాడు. అతన్ని చూడాలనిపించింది. కాని, నెల్లాళ్ళైనా వారు కలుసుకోవడం జరుగలేదు. అందుక్కారణం– కాల్ సెంటర్లో పనిచేసే గణేష్‌ది నైట్ డ్యూటీ కావడమే. సాయంత్రం ఐదు గంటలకు ఇల్లు విడిస్తే మర్నాటి ఉదయం పది తరువాత గాని తిరిగిరాడు. అప్పటికి సలీమ్ ఆఫీసుకు వెళ్ళిపోతాడు. ‘‘ఎందుౖMðనా మంచిది, కొంచెం జాగ్రత్తగా ఉండు. నేననుకుని అతన్ని కౌగలించుకున్నావంటే నా కొంప కొల్లేరౌతుంది’’ అంటూ టీజ్ చేసిన సలీమ్‌ను, చిరుకోపంతో ‘యూ...నాటీ!’ అంటూ ఛాతీ మీద పిడికిళ్ళతో కొట్టి, ‘‘నాకు ఆమాత్రం ఆనవాలు తెలుసులెండి... మీది మధ్య పాపిడైతే, అతనిది పక్క పాపిడి. టిపికల్ అయ్యర్ అతను’’ అంది. పగలంతా ఇంటి వద్దనే ఉంటాడేమో, గణేష్‌కు మృదులతో పరిచయం పెరిగింది. ‘భాభీ’ అని పిలుస్తాడు ఆమెను. ఏ అవసరం వచ్చినా ఆమె ఇంటికే వెళ్తాడు. అది చూసిన ఇరుగు పొరుగులు ఒక్కోసారి అతన్ని సలీమ్‌గా పొరబడడం కద్దు... సలీమ్, గణేష్‌లు రూపంలో ఒకేలా ఉన్నా, మనస్తత్వాలు భిన్నంగా కనిపిస్తాయి. సలీమ్ ముభావంగా ఉంటే, గణేష్ కలుపుగోరు మనిషి. అంతే కాదు – సలీమ్ది పురచేయి వాటమైతే, గణేష్ అందుకు వ్యతిరేకం. గణేష్ పక్కింట్లో ఉంటున్న టీనేజ్డ్ పాప గజలక్ష్మికి అతని పట్ల ఆకర్షణ కలిగింది. ‘గజం’ పేరులోనే కాని దేహంలో లేనందున సన్నగా ఉంటుంది. ఇంటర్మీడియట్ చదువుతోంది. తెలియని పాఠాలు చెప్పించుకునే వంకతో తరచు గణేష్ దగ్గరకు వెళ్తుంది. ఆ రోజు సాయంత్రం బ్రీఫ్ కేసుతో ఆటో దిగిన సలీమ్, ఇంటి ముందు జనాన్ని చూసి కంగారుగా లోపలికి వెళ్ళాడు... మృదుల చచ్చిపోయింది. కాదు, ఎవరో చంపేశారు! బెడ్ రూమ్‌లో డబుల్ కాట్ మీద వెల్లకిలా పడుంది శవం. కడుపులో కత్తి దిగబడి ఉంది. బెడ్ మీద పరచిన లైట్ బ్లూ బెడ్ షీట్ రక్తసిక్తమైంది... వెడల్పుగా తెరచుకుని ఉన్న ఆమె కన్నులలో విభ్రాంతి ద్యోతకమవుతోంది. సలీమ్ షాక్‌తో బిగుసుకుపోయాడు. అతని ముఖం మీద నీళ్ళు చల్లారెవరో. భోరున ఏడుస్తూ భార్య శవం మీద వాలిపోయాడు... మెల్లగా అతన్ని లేవదీశాడు క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శివరామ్. దుఃఖిస్తూ ఉన్న సలీమ్‌ను పక్క గదిలోకి తీసుకువెళ్ళి ఓదార్చడానికి ప్రయత్నిస్తున్నారు ఇరుగు పొరుగులు. ఆ దంపతుల అన్యోన్యత గురించి ఎరిగిన వారందరికీ దుఃఖం ఆగడం లేదు. ఇన్స్పెక్టర్ తన విధులను చకచకా నిర్వర్తించుకుపోతున్నాడు. గదిలో సెంటు వాసన గుప్పుమంటోంది. శవం దుస్తులనూ, బెడ్ నీ వాసన చూశాడు. సువాసన వాటి నుంచి రావడం లేదు. నేల మీద పరీక్షించాడు. అక్కడక్కడ ఫెయింట్గా నీటి మరకలవంటివి కనిపించాయి. అవి సెంటు మరకలు కావచ్చనిపించింది. గదిలో ఎవరో సెంటు చల్లినట్టు అర్థమైపోయింది... శవాన్నీ, గదినీ వివిధ కోణాల నుంచి ఫొటోలు తీయించాడు. హత్యా ప్రదేశం వీడియో తీయబడింది. శవం కడుపులోంచి చేతిరుమాలుతో కత్తిని బైటకు తీసాడు ఇన్స్పెక్టర్. శవ పంచాయతీ జరిపించి, శవాన్ని ఆంబులెన్స్‌లో హాస్పిటల్‌కు తరలించాడు పోస్ట్ మార్టెమ్ కోసమని. నిపుణులు వేలిముద్రలు సేకరిస్తూంటే, తాను క్లూస్ కోసం వెదకనారంభించాడు. బెడ్ కింద ‘పాన్ పరాగ్’ ఖాళీ పొట్లం కనిపిస్తే, దాన్ని తీసుకుని జేబులో వేసుకున్నాడు. సలీమ్, పెంటమ్మల వేలిముద్రలు తీసుకునేసరికి పోలీస్ డాగ్ వచ్చింది... గదంతా కలయదిరిగి వాసన చూసింది స్నిఫ్ఫర్ డాగ్. సెంట్ స్మెల్ వల్ల కాబోలు ఇతర వాసనలను పసిగట్టలేకపోతోంది అది. నిస్సహాయంగా నిలుచుండిపోయింది. సలీమ్ ఉన్న గదిలోకి వెళ్ళాడు ఇన్స్పెక్టర్. కన్నీళ్ళు ఆగకుండా సలీమ్ చెక్కిళ్ళను తడిపేస్తున్నాయి... ఇన్స్పెక్టర్ చెబుతున్న వివరాలను నిస్తేజంగా వింటూ ఉండిపోయాడు... ఆ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రాంతంలో మృదుల ఎండలో ఆరవేసిన బట్టల్ని తీసుకుంటూంటే పక్కింటావిడ చూసి పలుకరించింది. మృదులను ఎవరైనా చూడడం అదే ఆఖరుసారి. సాయంత్రం ఐదు గంటలకు ఆ కాలనీలో పనిచేసే పెంటమ్మ మృదుల ఇంటికి వెళ్ళింది. తన కొడుక్కు ఒంట్లో బావుండనందున, మందులు కొనడానికి మృదులను డబ్బులు ఆడగాలనుకుంది. వీధి తలుపు దగ్గరగా మూసి ఉంది. పిలిస్తే జవాబు లేకపోవడంతో, చనువుగా లోపలకు వెళ్ళింది. మృదుల వంటింట్లో కనిపించకపోతే, పడగ్గదిలోకి తొంగిచూసింది. బెడ్ మీద రక్తపుమడుగులో పడి ఉన్న మృదులను చూసి, భయంతో కేకలు పెడుతూ బైటకు పరుగెత్తింది. ఇరుగు పొరుగులు పరుగెత్తుకు వచ్చి, మృదుల పరిస్థితి చూసి పోలీసులకు ఫోన్ చేసారు. పోలీసులతో వచ్చిన డాక్టర్, ఆమె చనిపోయినట్టు నిర్ధారించాడు. రిగర్ మార్టిస్‌ను బట్టి ఆమె మరణించి మూడు గంటలు కావచ్చునన్నాడు. ‘‘ఈ స్థితిలో మిమ్మల్ని ఇబ్బందిపెట్టక తప్పడంలేదు. విధి నిర్వహణ!’’ అన్నాడు ఇన్స్పెక్టర్ శివరామ్. ‘‘మీకు గాని, మీ భార్యకు గాని శత్రువు లెవరైనా ఉన్నారేమో చెప్పగలరా?’’ లేరన్నాడు సలీమ్. అంతలోనే ఏదో జ్ఞప్తికి వచ్చినట్టు, ‘‘ఇది ఆ కాఫిర్ పనే అయిఉంటుందనిపిస్తోందిప్పుడు’’ అన్నాడు పళ్ళు కొరుకుతూ. అలా అంటూంటే అతని ముఖంలో కండరాలు బిగుసుకున్నాయి. ‘‘అదే నిజమైతే... ఐ విల్ కిల్ దట్ బాస్టర్డ్!’’ ... ఇన్స్పెక్టర్ భృకుటి ముడివడింది– ‘ఎవరతను?‘ ‘‘మా బాబాయి కరీముద్దిన్’’ జవాబిచ్చాడు సలీమ్. పెద్దల్ని కాదని తాను మృదులను పెళ్ళాడినందుకు జరిగిన గొడవలో, ‘‘మావాణ్ణి మాకు కాకుండా చేశావ్. నిన్ను ప్రాణాలతో ఉండనివ్వను!’’ అంటూ అతను మృదులను బెదిరించినట్లు చెప్పాడు... కరీమ్ అడ్రెస్సూ, వివరాలూ నోట్ చేసుకున్నాడు ఇన్స్పెక్టర్... సలీమ్ దాంపత్య జీవితం గురించి ప్రశ్నించాడు. తమకు ఒకరంటే మరొకరికి ప్రాణమని చెప్పాడు సలీమ్. పర్సనల్ వర్క్ మీద రెండు రోజుల క్రితం తాను విశాఖపట్నం వెళ్ళినట్టూ, ఆ రోజు సాయంత్రం ఈస్ట్ కోస్ట్‌లో తిరిగివచ్చినట్టూ చెప్పాడు. అంతలోనే ఆ ఘోరం జరిగిపోయిందంటూ ముఖం చేతుల్లో కప్పుకుని భోరుమన్నాడు. జాలి వేసింది ఇన్స్పెక్టర్కు. హత్యకు ఉపయోగించిన కత్తి, తాము పళ్ళు కోసుకునేందుకు ఉపయోగించేదేనని చెప్పాడు సలీమ్. పాన్ పరాగ్ నమలడం తామిద్దరికీ అలవాటు లేదన్నాడు. ‘‘బెడ్ రూమ్‌లో సెంట్ వాసన ఘుమఘుమలాడిపోతోంది. మీరు ఏ సెంట్ వాడతారేమిటీ?’’ అనడిగాడు ఇన్సె్పక్టర్. ‘‘నాకు సెంటంటేనే ఎలర్జీ. నేను కాని, నా భార్య కాని సెంటు వాడం’’ అన్నాడు సలీమ్. అతని స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నాక, పెంటమ్మను ప్రశ్నించాడు ఇన్స్పెక్టర్. భయపడుతూనే తన వంతు కథనం చెప్పిందామె. ‘‘మృదులను ఎందుకు చంపావ్?’’ అంటూ దబాయించాడు ఆమెను. ‘‘నేను ఏ పాపమూ ఎరగను. మృదులమ్మ శానా మంచి మనిషి. ఆయమ్మను చంపినోడు పురుగులు పట్టి పోతాడు. పిల్లలున్నదాన్ని, నన్ను అన్నేయంగా ఇందులో ఇరికించొద్దు దొరా!’’ అంటూ ఏడుస్తూ అతని కాళ్ళ మీద పడిపోయిందామె. ‘‘నిజంగానే నువ్వు నిర్దోషివైతే నీకేమీ భయం లేదు, పైకి లే’’ అన్నాడు. ఆమె దగ్గర స్టేట్మెంట్ తీసుకుని పంపేశాడు. ఇరుగు పొరుగులను ప్రశ్నిస్తే మృదుల మంచితనం గురించీ, ఆ దంపతుల అన్యోన్య దాంపత్యం గురించే చెప్పారంతా. అడపాదడపా ఒకరిద్దరు స్నేహితులు తప్పించి బంధువులెవరూ ఆ ఇంటికి వచ్చేవారు కాదని చెప్పారు... సలీమ్ పోలికలో ఉండే గణేష్ గురించి ఆలకించి విస్తుపోయాడు ఇన్స్పెక్టర్. అతను మృదులతో స్నేహంగా ఉండేవాడనీ, ఆ ఇంటికి వస్తూండేవాడనీ తెలుసుకున్నాడు... అతని గురించి సలీమ్‌ను ప్రశ్నిస్తే, గణేష్ గురించి భార్య ద్వారా ఆలకించడమే కాని అతన్ని ఎప్పుడూ చూడడం జరగలేదని చెప్పాడు. గణేష్ ఇంటికి తాళం వేసి ఉండడంతో అతన్ని కలుసుకోవాలన్న ఇన్స్పెక్టర్ ప్రయత్నం ఫలించలేదు. మర్నాడు అతను డ్యూటీ నుంచి రాగానే క్రై మ్ బ్రాంచ్ కి వచ్చి తనను కలుసుకోవలసిందిగా తంగవేలు దగ్గర మెసేజ్ వదిలాడు. పోస్ట్ మార్టమ్ పూర్తికాగానే మృదుల శవం భర్తకు అప్పగించబడింది. ఆమె మరణ వార్త అందిందో లేదో కాని – అటు మృదుల తరపువారు కాని, ఇటు సలీమ్ వైపు వారు కాని ఎవరూ రాలేదు. కాలనీ వాసులు, స్నేహితుల సాయంతో భార్య కర్మకాండ జరిపించేశాడు సలీమ్. సలీమ్ తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళాడు ఇన్స్పెక్టర్. సలీమ్‌కు తండ్రి లేడు. బాబాయి కరీముద్దీనే అతని తల్లినీ, చెల్లినీ చూసుకుంటున్నాడు. నెల క్రితం స్కూటర్ యాక్సిడెంట్లో కాలు విరగ్గొట్టుకుని పుత్తూరు కట్టుతో మంచం ఎక్కాడతను. ఇన్స్పెక్టర్ చెప్పేంతవరకు మృదుల హత్యావార్త వారికి తెలిసినట్లు లేదు. తెలిసి మిక్కిలి బాధపడ్డారు. కరీముద్దీన్‌ను ప్రశ్నించిన ఇన్స్పెక్టర్కు సలీమ్ అనుమానంలో అర్థం లేదనిపించింది. ఏడాది క్రితం తాను కోపంలో మృదులను చంపుతానన్నమాట నిజమే అయినా, తాను అంతటి దుర్మార్గుణ్ణి కానన్న అతని పలుకుల పైన విశ్వాసం కలిగింది. అతని వేలిముద్రలు తీసుకుని అక్కణ్ణించి మృదుల పుట్టింటికి వెళ్ళాడు. న్యూస్ పేపర్ ద్వారా కూతురి హత్యావార్త అప్పటికే తెలుసుకున్నారు వాళ్ళు. ఆమె మరణం వారిని బాధించినట్లు లేదు. ‘‘మా పరువు గంగలో కలిపింది. ఆనాడే దానికి తిలోదకాలు వదిలేశాం మేము’’ అన్నాడు మృదుల తండ్రి కోపంగా. ఆమె పోయాక కూడా అతనలా మాట్లాడం శివరామ్‌కి బాధనిపించింది... కొన్ని ప్రశ్నలు వేసి, అతని వేలిముద్రలు తీసుకుని వచ్చేశాడు. రెండు రోజులైనా గణేష్ తన దగ్గరకు రాలేదన్న సంగతి గుర్తుకొచ్చింది ఇన్స్పెక్టర్కి. ఆ కాలనీకి వెళ్ళాడు... తంగవేలు ఎదురొచ్చి, ‘‘గణేష్ పయ్యన్ దా రెండు నాళ్ళుగా ఇంటికే వర్లే, సామీ!’’ అన్నాడు. ‘‘పక్కవీటి పొణ్ణు సెబుతూండును, వాండుదా మొన్ననే ట్రావెల్ బ్యాగ్‌తో ఆటోలో పూడ్చిండట’’... గజలక్ష్మి గణేష్‌తో చనువుగా ఉండేదని తెలుసుకుని, ఆమెను కలుసుకున్నాడు ఇన్స్పెక్టర్. ఆమె కథనం ప్రకారం – గణేష్ మృదులతో చనువుగా ఉండేవాడు. సలీమ్ ఇంట్లో లేనప్పుడు ఆ ఇంటికి వెళ్ళి వస్తూండేవాడు. మృదుల హత్య జరిగిన రోజు మధ్యాహ్నం అతను సలీమ్ ఇంటినుంచి రావడం చూసింది తాను. కొంతసేపటికి అతను డ్రెస్ మార్చుకుని ట్రావెల్ బ్యాగ్‌తో ఆటోలో వెళ్ళిపోవడం కనిపించింది. ‘‘ఆ రోజు మృదుల ఇంట్లోంచి బైటకు వచ్చినప్పుడు గణేష్ ఎలా ఉన్నాడు? అతని ముఖంలో కంగారు కాని, భయం కాని కనిపించిందా?’’ అడిగాడు ఇన్స్పెక్టర్. లేదందామె. గణేష్ గురించి ఆ పిల్ల చెప్పిన మరిన్ని విషయాలు ఇన్స్పెక్టర్ అనుమానానికి దారితీశాయి... గణేష్‌కు పాన్‌పరాగ్ తినే అలవాటుంది. కాని, అతను సెంటు వాడగా ఎప్పుడూ చూళ్ళేదామె. ఓ సారి ఆమె వెళ్ళేసరికి నిక్కర్‌తో ఉన్నాడతను. అప్పుడు చూసిందాపిల్ల, అతని ఎడమ మోకాలి వెనుక భాగంలో ఉన్న బఠాణీ గింజంత నల్లటి పుట్టుమచ్చ. అతనిది కుడిచేతి వాటం. అక్షరాలు పట్టి పట్టి రాస్తాడనీ, చిన్న పిల్లల దస్తూరీలా ఉంటుందనీ చెప్పి నవ్వింది. అతను తనకు పాఠాలు చెబుతూ తన నోట్ బుక్‌లో రాసిన మేటర్ కూడా చూపించింది... ఆ నోట్ బుక్‌ను ఇన్స్పెక్టర్ స్వాధీనం చేసుకున్నాడు. గజలక్ష్మి సహకారానికి ఆమెను అభినందించి, వంద రూపాయల నోటొకటి ఆమె చేతిలో పెట్టాడు ఇన్స్పెక్టర్ గాజులు కొనుక్కోమని చెప్పి... అక్కడ నుండి సలీమ్ ఇంటికి వెళ్ళాడు. సలీమ్ ఇంట్లోనే ఉన్నాడు. సలీమ్ చెప్పిన సమాచారం ఇన్స్పెక్టర్ని చకితుణ్ణి చేసింది... ఆ కాలనీ వాచ్‌మేన్ నర్సిమ్ములు రెండు బంగారు గాజులు మార్వాడీ కొట్లో అమ్మబోతే పోలీసులు పట్టుకున్నారు. రెండు తగిలించేసరికి, తాను వాటిని మృదుల శవం నుంచి దొంగిలించినట్లు ఒప్పుకున్నాడట. పోలీసులు వచ్చి ఆ విషయం చెప్పేవరకు భార్య చేతి గాజుల్లో రెండు మిస్సయినట్టు దుఃఖంలో ఉన్న సలీమ్ గమనించలేదు. ఆ కొత్త మలుపు ఇన్స్పెక్టర్ ఆలోచనలకు ఇంధనం అయింది. వెంటనే లోకల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్ళి లాకప్‌లో ఉన్న నర్సిమ్ముల్ని కలుసుకున్నాడు. నలభై ఏళ్ళుంటాయి వాడికి. నల్లగా, సన్నగా, పొడుగ్గా ఉంటాడు. ఆ కాలనీలో ఐదేళ్ళుగా నైట్ వాచ్ మేన్‌గా పనిచేస్తున్నాడు. తాగుబోతన్న విషయం వాడి కళ్ళూ, ముఖమే చెబుతున్నాయి... మృదుల హత్య జరిగిన రోజున తాగుడుకు డబ్బులు దొరక్కపోవడంతో ఎవరినైనా అడగాలని కాలనీకి వచ్చాడు నర్సిమ్ములు. ఒకరిద్దరిని అడిగితే తిట్టి పొమ్మన్నారు. అప్పుడప్పుడు అతని చేత చిన్నా చితకా పనులు చేయించుకుని డబ్బులు ఇస్తూండేది మృదుల. ఆమెను అడగాలని వెళ్ళాడు. ఆ సమయంలో ఇంట్లోంచి బయటకు వచ్చిన వ్యక్తిని చూసి సలీమ్ అనుకుని దాక్కున్నాడు. కాని, అతను తిన్నగా ఎదురింట్లోకి వెళ్ళడంతో గణేష్ అని గ్రహించాడు... పిలుపుకు లోపలి నుంచి జవాబు రాకపోవడంతో చొరవగా తలుపు తోసుకుని లోపలికి వెళ్ళాడు నర్సిమ్ములు. బెడ్ రూమ్‌లో చచ్చిపడున్న మృదులను చూడగానే గుండె ఝల్లుమంది. అంతలోనే వాడి దృష్టి ఆమె చేతి గాజుల పైన పడింది. హడావిడిగా వాటిని తీసుకోబోతే రెండే వచ్చాయి. ఎక్కువసేపు అక్కడ ఉండడానికి భయం వేసి వాటితో పారిపోయాడు. వాటిని వెంటనే అమ్మడానికి ధైర్యం చాల్లేదు. రెండు రోజులపాటు ఊరుకుని మూడో రోజున అమ్మబోయి పోలీసులకు పట్టుబడ్డాడు... అంతకు మించి తాను ఏ పాపమూ ఎరుగననీ, మృదులను తాను చంపలేదనీ అంటూ, ఇన్స్పెక్టర్ పాదాల మీద పడి ఏడుస్తూ...పెళ్ళాం పిల్లల మీద ఒట్లు కూడా వేశాడు నర్సిమ్ములు. గణేష్ జాడ లేదు. మృదుల హత్యకు సంబంధించిన రిపోర్ట్స్ అన్నీ వచ్చాయి. వాటిని జాగ్రత్తగా పరిశీలించాడు ఇన్స్పెక్టర్ శివరామ్... పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ ప్రకారం మృదుల హత్య మధ్యాహ్నం రెండున్నర ప్రాంతంలో జరిగినట్లు తెలుస్తోంది. గజలక్ష్మి, నర్సిమ్ములూ మృదుల ఇంటి నుంచి గణేష్ బైటకు రావడం చూసినట్లు చెబుతూన్న టైమ్‌కు అది దాదాపు సరిపోతోంది. టైమింగూ, వేలిముద్రల రిపోర్టులూ, గణేష్ అదృశ్యమూ వంటి సర్కమ్స్టన్షియల్ ఎవిడెన్సూ ఆ హత్య చేసింది గణేషేనని తెలుపుతున్నాయి. కాని మోటివ్ మాత్రం ఊహకు అందకుండా ఉంది. మృదులతో గణేష్‌కు మంచి పరిచయం ఉంది. తరచు ఆమె ఇంటికి వెళ్ళివస్తూంటాడు. సలీమ్ పోలికను కలిగి ఉండటం మరో ఎడ్వాంటేజ్. మృదుల అందగత్తె. ఆమె పైన కన్నేసి ఉంటాడు. అతని ఓవర్ చ్యూర్స్ని ఆమె ప్రతిఘటించి ఉంటుంది. భర్తకు ఫిర్యాదు చేస్తానని బెదిరించి వుంటుంది. తనకు చిక్కలేదన్న కోపంతోనో, తన విషయం బైటపెడుతుందన్న భయంతోనో ఆమెను చంపడానికి నిశ్చయించుకుని ఉంటాడు... ఆ రోజు మధ్యాహ్నం ఆమె రెస్ట్ తీసుకుంటూన్న సమయంలో లోపల ప్రవేశించి ఉంటాడు. సరాసరి బెడ్ రూమ్ లోకి రావడంతో భర్త అనుకుని ఉండొచ్చునామె. హఠాత్తుగా అక్కడే ఉన్న పళ్ళు కోసుకునే కత్తిని తీసి అతడు తనను పొడవబోవడం ఆమెకు విభ్రాంతి కలిగించి ఉంటుంది. ఆ సంగతి ఆమె కన్నుల్లో, వదనంలో వ్యక్తమవుతోంది.. పాన్ పరాగ్ తినే అలవాటు సలీమ్ దంపతులకు లేదు. గణేష్‌కు ఉంది. హత్య చేశాక టెన్షన్ రిలీజ్ చేసుకోవడానికి పాన్ పరాగ్ తిని ఖాళీ పొట్లం గదిలో పడేసుంటాడు. గదిలో సెంట్ చిలకరించి ఖాళీ బాటిల్‌ను తనతో తీసుకుపోయాడు. అది అతని గదిలో దొరికింది. పోలీసులను తప్పుదారి పట్టించడానికే దాన్ని ఉపయోగించాడని తెలుస్తోంది. హత్యా ప్రదేశంలో తీసిన ఫోటోలను, వీడియోనీ మళ్ళీ పరిశీలించాడు మాధవ్. మృదుల అందగత్తె అనడంలో సందేహం లేదు. ఆమె కోసం సలీమ్ తన కుటుంబాన్ని వదులుకోవడంలో వింత లేదనిపించింది... వెడల్పైన శవం కన్నులు విభ్రాంతిని ద్యోతకం చేస్తున్నాయి. ఆమె ప్రతిఘటించిన సూచనలు కూడా లేవు. అంటే హంతకుడు ఆమెకు తెలిసినవాడేననీ, అతని చర్య ఆమెకు విభ్రాంతి కలిగించిందనీ స్పష్టమవుతోంది. హత్యకు ముందు గణేష్ ఆమెను అనుభవించి ఉంటాడనుకుంటే, అటువంటిదేమీ లేదని అటాప్సీ రిపోర్ట్‌లో తేలింది... ఆ హత్యకు మోటివ్ ఏమిటి? లస్టా? జెలసీయా? లేక, పగా??... ఒకవేళ గణేష్‌ను పట్టుకుని హత్యానేరం పైన అతన్ని న్యాయస్థానంలో నిలబెట్టినా, ‘మోటివ్’ను రుజువు చేయలేకపోతే కేసు నిలవదు. హఠాత్తుగా గుర్తుకొచ్చింది ఇన్సె్పక్టర్కి – హత్య జరిగినప్పుడు హంతకుడి దుస్తుల పైన రక్తం చింది ఉండాలనీ, ఆ గుడ్డలు గణేష్ ఇంట్లో కూడా దొరకలేదనీను!... ఆ రోజు మధ్యాహ్నం మృదుల ఇంటికి వెళ్ళొచ్చాక గణేష్ దుస్తులు మార్చుకున్నాడని గజలక్ష్మి చెప్పింది. అంతకుముందు ధరించిన దుస్తుల పైన రక్తపు మరకలేవీ చూసిన గుర్తు లేదంది... గణేష్‌ను పట్టుకుంటే కాని ఆ కేసు ఓ కొలిక్కి రాదనిపించింది. తన మనుషులు ఆ పనిమీదే ఉన్నారు... ఫింగర్ ప్రింట్స్ రిపోర్ట్స్‌ను స్టడీ చేస్తూంటే హఠాత్తుగా ఇన్స్సెక్టర్ మెదడులో మెరుపు మెరిసింది. నివ్వెరపాటుతో దాని వంకే చూస్తూ ఉండిపోయాడు. అదే సమయంలో ఎస్సై వచ్చి శాల్యూట్ చేసాడు. గణేష్ ఆచూకీ ఇంకా దొరకలేదు. కాని, అతను తెలుసుకున్న కొత్త సమాచారాన్ని కుతూహలంతో వింటూండిపోయాడు శివరామ్. ఎస్సై వెళ్ళిపోయాక ఏవేవో ఫోన్ కాల్స్ చేశాడు. ఆ తరువాత మరోసారి రిపోర్ట్స్‌ను తిరగేస్తూ చాలాసేపు దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండిపోయాడు... క్రమంగా ఆ మర్డర్ మిస్టరీ సూర్యకాంతి సోకిన పొగమంచులా విడిపోనారంభించింది... పోలీస్ జీప్ చూసి పరుగెత్తుకొచ్చాడు తంగవేలు. ‘‘వణక్కం, సారూ!’’ అంటూ ఇన్స్పెక్టర్ శివరామ్‌ని విష్ చేశాడు. ‘‘ఆ గణేష్ వాండు దొరికిండా? పొరికి పయ్యన్ నా ఇంట్లో చేరి నా టెనెంట్నే కొల్ల పణ్ణిటు పూడ్చిండు. నాకుదా దొరకాలి వాండు, ఏం చేస్తునో చూడు’’ అన్నాడు కోపంగా పళ్ళు కొరుకుతూ. ఇరుగు పొరుగులు కూడా అక్కడకు వచ్చి చేరారు కుతూహలంతో. జీప్ శబ్దం ఆలకించి కాబోలు సలీమ్ తలుపు తెరచుకుని బైటకు వచ్చాడు. లుంగీలో ఉన్నాడు. సలీమ్ వెనుకే లోపలికి నడుస్తూన్న ఇన్స్పెక్టర్ ట్రిప్పయి ముందుకు తూలి అతని మీద పడ్డాడు. చేతికందిన లుంగీ పట్టుకుని క్రింద పడకుండా ఆపుకున్నాడు. ఆ ప్రాసెస్ లో లుంగీ ఊడిపోయి అండర్ వేర్ తో నిలిచాడు సలీమ్. ఇన్స్పెక్టర్ చూపులు క్షణంలో సగంలో సలీమ్ కాళ్ళ పైన పడ్డాయి. ‘బలిష్ఠమైన తొడలు!’ అనుకోకుండా ఉండలేకపోయాడు. ‘సారీ’ చెప్పి లుంగీ అందించాడు. సలీమ్ కూడా ఎంబరాసింగ్ గా ‘సారీ!’ అంటూ గబగబా లుంగీ చుట్టబెట్టుకున్నాడు. ఇన్స్పెక్టర్కు ఆసనం చూపించి, ‘గణేష్ దొరికాడా, సార్?’ అనడిగాడు. ‘ఎస్’ అన్నాడు కూర్చుంటూ. ‘ఎక్కడా?’ ఆత్రుతగా అడిగాడు సలీమ్. ‘ఇక్కడే!’ అతను జనంలో వెదుకుతూంటే, ‘యు ఆర్ అండర్ అరెస్ట్, మిస్టర్ సలీమ్ ఉరఫ్ గణేష్!’ అన్నాడు ఇన్సె్పక్టర్. సలీమ్ ఉలిక్కిపడితే... తంగవేలు తదితరులు తెల్లబోయి చూశారు. ‘ఏమిటి మీరంటున్నది?’ కోపంగా అడిగాడు సలీమ్. ‘‘నీ భార్య మృదులను హత్య చేసినందుకు నిన్ను అరెస్ట్ చేస్తున్నాను’’ జవాబిచ్చాడు ఇన్స్పెక్టర్. ‘‘నాన్సెన్స్! ప్రేమించి పెళ్ళాడిన భార్యను నేను చంపుకోవడమేమిటి?’’ తీక్షణంగా అన్నాడు సలీమ్. ‘‘అందుకు మీ దగ్గరున్న సాక్ష్యాలేమిటి?’’ ‘‘ప్లెంటీ’’.. అన్నాడు ఇన్స్పెక్టర్. పాలిపోయిన వదనంతో సలీమూ... ఆశ్చర్యమూ, అయోమయమూ కమ్ముకున్న ముఖాలతో తంగవేలు తదితరులూ చెవులు రిక్కించి ఆలకిస్తూంటే ఆ కేసు యొక్క పూర్వాపరాలను వివరించాడు ఇన్స్పెక్టర్. మృదుల అందం చూసి సలీమ్ ఆమెను ప్రేమించి పెళ్ళాడిన మాట వాస్తవమే అయినా, ఫాస్ట్ మనీ మీద మోజు కలగడంతో అతని బుద్ధి వక్రమార్గం పట్టింది. ఆర్నెల్ల క్రితం మృదుల పేరిట కోటి రూపాయలకు జీవిత బీమా చేశాడు అతను. కొన్నాళ్ళ తరువాత ఆమెను చంపి ఇన్సూరెన్సు సొమ్ముతో చేసుకుని దుబాయ్ వెళ్ళిపోవాలనుకున్నాడు. భార్య హత్యను గూర్చి అనుమానం తనపైకి రాకుండా తెలివిగా ప్లాన్ చేసాడు. గణేష్ అన్న పేరుతో తన డూప్లికేట్లా ఓ నకిలీ మనిషిని సృష్టించి ఎదురింట్లో దిగాడు. ఆకారంలో, స్వభావంలో, చివరకు మతంలో కూడా మార్పులు చేసుకుని తామిద్దరూ నిజంగానే వేర్వేరు వ్యక్తులన్న నమ్మకం కలిగించాడు... సలీమ్లా పగలు ఆఫీసుకని బయలుదేరి వెళ్ళి, నైట్ డ్యూటీ గణేష్ తిరిగి వచ్చినట్టు ఎదురింటికి వెళ్ళేవాడు. పగలు ఆఫీసుకు వెళ్ళొచ్చి రాత్రికి ఇంటికి చేరుకునే సలీమ్‌నూ, నైట్ డ్యూటీ చేసి వచ్చి పగలంతా ఇంట్లోనే ఉండే గణేష్‌నూ చూసి ఇద్దరూ వేర్వేరు వ్యక్తులేనని నమ్మారంతా. సలీమ్, గణేష్లిద్దరూ ముఖాముఖీ కలుసుకోకపోవడానికి కారణం కూడా అదే. అయితే సలీమ్ ఆ నెల్లాళ్ళూ ఆఫీసుకు సెలవు పెట్టాడన్న విషయం ఎవరికీ తెలియదు. రొటీన్‌గా అతని కాండక్ట్ గురించి ఎంక్వయిరీ చేయడానికి అతని ఆఫీసుకు వెళ్తే ఈ సంగతులు తెలిసివచ్చాయి. దాంతో అనుమానం వచ్చి లోతుగా ఆరా తీసేసరికి ఇన్సూ్యరెన్స్ విషయమూ, ఆ సొమ్ము కోసం మృదుల నామినీగా అతను అప్పుడే క్లెయిమ్ సబ్మిట్ చేయడమూ, దుబాయ్ వెళ్ళడానికి వీసా కోసం అప్లయ్ చేసిన సంగతీ బైటపడ్డాయి... ‘‘అంతా అబద్ధం! హంతకుణ్ణి పట్టుకోలేక నన్నిందులో ఇరికించాలని చూస్తున్నారు మీరు...’’ అరిచాడు సలీమ్. ‘‘షటప్!’’ గర్జించాడు ఇన్సె్పక్టర్. ‘‘ఆ రోజు మధ్యాహ్నం నువ్వు గణేష్‌లా వచ్చి నీ భార్యను కత్తితో పొడిచి చంపేశావు. తనతో స్నేహంగా ఉండే గణేష్ అకారణంగా తనను పొడుస్తూంటే షాక్‌కు గురయిందామె. ఆ సంగతి ఆమె కన్నులూ, వదనమూ స్పష్టం చేస్తున్నాయి. పోలీసుల్ని తప్పుదారి పట్టించడానికి గణేష్ గా వాడే పాన్ పరాగ్ పొట్లాన్ని హత్యా ప్రదేశంలో పడేశావు. ఆ తరువాత గణేష్‌ను మాయం చేశావు. అనుమానం గణేష్పైకి నెట్టడమే నీ ఉద్దేశం. లేని గణేష్ కోసం వెదుకుతూ పోలీసులు నిన్ను అనుమానించరనుకున్నావు... గణేషూ, నువ్వూ ఒకరే ననడానికి నిదర్శనం– గణేష్ ఇంట్లో దొరికిన వేలిముద్రలు నీ వేలిముద్రలతో టాలీ కావడమే...’’ తంగవేలు తదితరులు అవాక్కై వింటూ ఉండిపోయారు. ‘‘అడె పావీ! తంగమాన పొణ్ణు – మృదులమ్మను చంపడానికి నీకుదా చేతులెలా వచ్చినయ్ డా!?’’ అన్నాడు తంగవేలు ఆవేశంగా. ‘‘అంతా కుట్ర! నాకేం తెలియదు...’’ బుకాయిస్తూ లేవబోయాడు సలీమ్. ఇన్స్పెక్టర్ చేత్తో వెనక్కి తోయడంతో మళ్ళీ కుర్చీలో కూలబడ్డాడు. ‘‘నేరస్థుడు ఎంత తెలివిగా నేరం చేసినా ఏదో ఒక పొరపాటు చేయకమానడు, సలీమ్! అందుక్కారణం – నేరం చేసేప్పుడు అతని మనసు స్థిమితంగా ఉండకపోవడమే!’’ ఇన్సె్పక్టర్ అన్నాడు. ‘‘నీది పురచేతి వాటమైనా, గణేష్ గా కుడిచేతి వాటంలా చలామణీ అయ్యావు. ఆ సంగతి మరచిపోయి అలవాటు ప్రకారం మృదులను ఎడం చేత్తో పొడిచావు. అందుకే హత్యాయుధం పైన ఎడం చేతి వేలిముద్రలున్నాయి. అవి నీ వేలిముద్రలతో సరిపోయాయి...’’ సలీమ్ ఉలికిపడ్డాడు. ‘‘నువ్వు చేసిన మరో పొరపాటు ఏమిటో తెలుసా?’’ మళ్ళీ అన్నాడు ఇన్సె్పక్టర్. ‘‘ఆ రోజు విశాఖపట్టణం నుంచి సాయంత్రం ఈస్ట్ కోస్ట్‌లో వచ్చానన్నావు. ఆ ట్రెయిన్ ఆ రోజు రైట్ టైమ్‌కు వచ్చిందో లేదో చెక్ చేసుకోకపోవడమే నీ పొరపాటు. ఆ రోజున పొలిటికల్ పార్టీ ఒకటి ఏలూరులో రైల్ రోకో నిర్వహించింది. అప్పటికే రెండు గంటలు లేట్ రన్నింగ్ లో ఉన్న ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్, ఆ నిరసన కార్యక్రమం మూలంగా మరో రెండు గంటలు ఆలస్యమైంది. సికిందరాబాద్ కు రాత్రి పది గంటలకు చేరుకుంది. కాని నువ్వు ఏడు గంటలకే ఇంటికి చేరుకున్నావు... సో, నువ్వసలు విశాఖపట్టణమే వెళ్ళలేదనీ, సిటీలోనే ఉన్నావనీ తేలిపోయింది’’... సలీమ్ ముఖం పాలిపోయింది. ఇన్స్పెక్టర్ మందహాసం చేసాడు. ‘‘అంతే కాదు, మేన్! ఇంతకుముందు తూలిపడినట్టు నటించి నీ లుంగీ లాగేశాను, ఎందుకో తెలుసా? నీ ఎడమ మోకాలి వెనుకనున్న పుట్టుమచ్చను చూడ్డానికి! గణేష్‌కు అదే చోటులో గజలక్ష్మి చూసిన పుట్టుమచ్చా, ఆమె నోట్ బుక్‌లో వున్న నీ కుడిచేతి దస్తూరీ కూడా గణేష్ ఎవరూ లేరనీ, ఆ నకిలీ మనిషి నువ్వేననీ రుజువు చేస్తాయి...’’ ‘‘ఓరి దుర్మార్గుడా! నీలాంటివాడే మరొకడున్నాడంటూ ఇన్నాళ్ళూ మమ్మల్నందర్నీ ఫూల్ చేసిందే కాక, నిక్షేపంలాంటి పిల్లను అన్యాయంగా పొట్టను పెట్టుకున్నావు కదరా!’’ అంటూ ఆవేశంతో అతన్ని కొట్టడానికి వచ్చారు అక్కడ చేరినవారంతా. ఇన్స్పెక్టర్ వారిని వారించి సలీమ్ చేతులకు సంకెళ్ళు తగిలించాడు. ‘‘కొసమెరుపేమిటంటే... ఇన్సూ్యరెన్స్ పాలిసి రిస్క్ కవరేజ్ నుంచి మర్డర్ ఎలిమెంట్‌ను తొలగించిన విషయం నీకు తెలియకపోవడమే!’’ అన్నాడు ఇన్స్పెక్టర్. ‘‘తెలిసుంటే.. బహుశా మృదుల ప్రాణాలతో ఉండేదేమో!’’ కుర్చీలో కుప్పలా కూలిపోయాడు సలీమ్... - తిరుమలశ్రీ -
గెల్చుకున్న డబ్బు దాచుకోవడమూ కష్టమే
ఆ రోజు కేవలం వినోదం కోసం, నేనొక గాంబ్లింగ్ హౌస్‌లోకి వెళ్ళాను. ఒక గేమింగ్ టేబుల్ దగ్గరకెళ్ళి, అక్కడ ఆట ఆడడం మొదలుపెట్టాను. నా అదృష్టమో లేక దురదృష్టమో! అనూహ్యంగా, అద్భుతంగా, నమ్మశక్యంగాని విధంగా డబ్బూ, బంగారం గెలుచుకున్నాను. ఎరుపు నలుపు రంగుల గుర్తులపైన పందెమొడ్డి, టేబుల్‌పై ఆడే పేకాట అది. లోపలా బైటా- లాంటి ఆట అది. గెలిచేకొద్దీ ఇంకా ఆడాలనే పట్టుదల క్షణక్షణానికీ అధికమవసాగింది. పిచ్చిపట్టినట్లుగా ఆడసాగాను. నన్ను అదృష్టదేవత కరుణించడంతో ఎక్కువసార్లు నేనే గెలిచాను. ఫలితంగా పెద్ద బంగారు నాణేలరాశి నా సొంతమైంది. అయినా ఇంకా ఆడాలనే ఆశ నాలో చావలేదు. అంతలో, ఒక బొంగురు గొంతు నా వెనక నుంచి వినిపించింది. ‘‘అద్భుతం సార్! అద్భుతం! నా జీవితంలో మీలాంటి అదృష్టయోగుల్ని నేనింతవరకూ చూడలేదు సార్! ఆడండి, ఆడండి! ధైర్యంగా ఆడండి. ఇక్కడున్న నిధిని మొత్తం కొల్లగొట్టండి!’’ అలా ఉత్సాహపరచిందెవరా? అని నేను వెనక్కి తిరిగి చూశాను. నా వైపు చిరునవ్వుతో చూస్తున్న అతని మొహంలో నాగరికత ఉట్టిపడుతూ వుంది. ధరించిన దుస్తుల్ని బట్టి అతడొక మాజీ సైనికుడని చెప్పవచ్చు. అతనికళ్ళు వెడెల్పుగా, జేగురు రంగులోవున్నాయి. మీసాలు మురికి పట్టి అసహ్యంగా వున్నాయి. ముక్కు వెనక్కి వంగింది. నయవంచన నిండిన కంఠస్వరమతనిది. అంత గలీజైన చేతులు ఫ్రాన్స్ దేశంలోనే ఎవ్వరికీ వుండవని ఘంటాపథంగా చెప్పగలను. నేను జూదక్రీడా వ్యసనమత్త చిత్తుడనై ఉన్న కారణంగా, అతన్ని అనుమానాస్పదుడుగా భావించ లేదు. ఈ స్వల్ప విషయాలు నా మీద ప్రతికూల ప్రభావం చూపలేదు. నరాలుతెగే ఉత్కంఠభరిత క్షణాలలో, కళ్ళునెత్తికొచ్చిన విజయోత్సాహ మైకంలో, ఆ క్రీడలో నన్నెవరైతే వెన్నుతట్టి ప్రోత్సహిస్తారో, అటువంటి వాళ్ళతో స్నేహం చేయడానికి నేను సిధ్ధపడ్డాను. అందుకే ఆ మాజీ సైనికుడిచ్చిన నశ్యాన్ని పీల్చాను. అతణ్ణి ఈ ప్రపంచంలో అత్యంత విశ్వాసపాత్రుడైన వ్యక్తిగా అంగీకరించాను. ‘‘మిత్రమా విజృంభించు! ప్రతిసారీ నువ్వే గెలవాలి. జయం నీదే. ఈ రోజు అదృష్టదేవత నిన్నే వరిస్తుంది... ఇక్కడున్న ధనాన్ని మొత్తం కొల్లగొట్టు. గెలుపు నీదే. దూసుకెళ్ళు! ..’’ నేను పందేలు కడుతూనే వున్నాను. గెలుస్తూనే ఉన్నాను. ఇంకో పావుగంటలో, ‘‘మహాశయులారా! ఇక మా వద్ద ధనం లేదు. ఇవాల్టితో ఆట ముగిస్తున్నాను’’ అని ఆ గ్యాంబ్లింగ్ హౌస్ నిర్వాహకుడు ప్రకటించాడు. గ్యాంబ్లింగ్ హౌస్‌లో పెట్టిన పెట్టుబడి మొత్తం- కరెన్సీ నోట్ల రూపంలోనూ, బంగారు రూపంలోనూ, నా ముందర కుప్పబోసి ఉన్నాయి. ‘‘మీ చేతిరుమాల్లో పెట్టి మూట కట్టండి సార్’’- అని ముసలి మాజీ ఆర్మీ స్నేహితుడు సలహా ఇచ్చాడు. అంతటితో ఆగక మళ్ళీ ఇలా అన్నాడు. ‘‘సార్! మీరు సాధించిన విజయం సామాన్యమైంది కాదు సార్! కనీ వినీ ఎరుగనిది. మీరు చాలా డబ్బు సంపాదించారీరోజు. ఉండండి సార్! ఒక బంగారు నాణెం కిందపడింది. నేను తీసిస్తాను. ఈ మూటకు రెండు బలమైన ముడులు వేయాలి సార్!... అప్పుడే డబ్బు భద్రంగా ఉంటుంది... ఆహా! ఏమదృష్టం సార్! ఏమదృష్టం! ఈ శుభసందర్భంగా మీరు నాతో కలసి షాంపేన్ తాగవలసినదిగా కోరుతున్నాను.’’ అభ్యర్థించాడు ముసలి మాజీ ఆర్మీగాడు. ఒప్పుకున్నాను. ఒక బాటిల్ ఖాళీ చేశాము. అతను మరొక బాటిల్ తెప్పిస్తానన్నాడు. నేనతన్ని వారించి, ‘‘ఇప్పుడు నా ఖర్చుతో మరొక బాటిల్ ఇప్పిస్తాను’’ అన్నాను. రెండో బాటిల్ పూర్తిచేశాము. నా గొంతులోనుంచి సలసలా మరుగుతున్న నిప్పులద్రావణం దిగినట్లుంది. నా మెదడు అగ్నిలో పడి మండుతున్నట్లైంది. ఇంతకుముందు ఇంతకంటే ఎక్కువ తాగినా, ఇలాంటి అనుభూతి కలుగలేదెప్పుడూ. నేను అధిక మానసిక ఒత్తిడికి గురైన కారణంచేత నా శరీర వ్యవస్థలో మార్పులు కలిగాయా? నా కడుపులో ఏదైనా జబ్బు మొదలైందా? లేక షాంపెయిన్ అంత ఘాటైనదా? అంతుబట్టలేదు నాకు. అంతలో నేను ‘‘ఫ్రెండ్! అగ్నిగుండంలో పడినట్లుంది నాకు. నీకెలా వుంది.ఈ అగ్ని చల్లబడాలంటే మనం మూడవ బాటిల్ తప్పక తాగాల్సిందే’’ అని ఉద్వేగంగా, ఉఛ్చస్వరంతో అరిచాను. ఆ ముసలి మాజీ తల ఆడించాడు. ‘కాఫీ’ అని గట్టిగా అరుస్తూ లోపలి గదిలోకి పరుగెత్తాడు. ఆ పదం ఉఛ్చరించిన విధానం అసాధారణంగా వుంది. అది అక్కడున్న వారందరిపై మంత్రంలా పనిచేసింది. విపరీతమైన మైకం తలకెక్కిన నా పరిస్థితిని ఆసరాగా చేసుకొని లబ్ధి పొందాలని చూస్తున్నారని నాకనుమానం కలిగింది. అక్కడికీ ముసలి మాజీ ఆర్మీ మిత్రుడు, నన్ను అతిగా తాగనీయకుండా నిజాయతీగా ప్రయత్నించాడు. వారి ఉద్దేశం ఏమైనా గానీ, అందరూ అక్కడ్నుంచి క్రమశిక్షణ కలిగిన సైనికుల్లా నిష్క్రమించారు. ముసలి మిత్రుడు మళ్ళీ వెనక్కొచ్చాడు. నా ఎదురుగా టేబుల్ ముందు కూర్చున్నాడు. మేమిద్దరమే ఉన్నామా గదిలో. గాంబ్లింగ్ హౌస్ నిర్వాహకుడు పక్క గదిలో ఒక్కడే కూర్చొని భోజనం చేస్తున్నాడు. భరించరాని భయంకర నిశ్శబ్దం ఆక్రమించుకొంది ఆ ప్రదేశాన్ని. ఉన్నట్టుండి ఆ మాజీ సోల్జర్ వైఖరిలో మార్పు కనబడింది. అతని చూపుల్లో ఏదో అవ్యక్త వంచనభావం దాగి ఉన్నట్టనిపించింది. అతని మాటల్లో అతిశయోక్తులు, అతిమర్యాద ధోరణి ఇప్పుడు లేదు. ఏదో రహస్యం చెబుతున్నట్టు తగ్గుస్వరంతో అతనిలా చెప్పాడు. ‘‘ఈ ముసలి సోల్జర్ చెప్పే చిన్న మాట వినండి సార్! ఈ ఇంటి యజమానురాలు వంట బహుదివ్యంగా, రుచికరంగా చేస్తుంది. మనకోసమే రుచికరమైన, స్ట్రాంగ్ స్పెషల్ కాఫీ తయారుచేయమని అభ్యర్థించి వచ్చానిప్పుడే. ఆ కాఫీ మీరు తప్పక తాగాలి.ఇంటికి వెళ్ళే ముందు ఇది సేవిస్తే మీ మనసులో పేరుకొని ఉన్న గ్లాని అంతా మటుమాయమైపోతుంది. మనసు తేలికవుతుంది. మీరు తప్పక దీన్ని స్వీకరించాలి మిత్రమా! ఇప్పుడు నువ్వు గెలుచుకొన్న సొమ్మంతా ఈ రాత్రికే మీ ఇంటికి తరలించుకెళ్ళడమనేది నీవు నిర్వర్తించాల్సివున్న పవిత్ర విద్యుక్త ధర్మం. కానీ నువ్వు ఇంత భారీ డబ్బును గెలుచుకొన్నావని ఇప్పటికే చాలామందికి తెలిసిపోయింది. ఇక్కడున్న వాళ్ళంతా పెద్దమనుషులే. ఉత్తమగుణాలు కలిగిన వారే. కానీ వాళ్ళు కూడా మానవమాత్రులే కదా. ఎంత మంచివాళ్ళకైనా కొన్ని బలహీనతలుంటాయి. ఇంతకంటే నేను వివరంగా చెప్పాలా మిత్రమా?.. ఇప్పుడు నేను చెప్పబోయేది జాగ్రత్తగా విను. నీవు మళ్ళీ ఈ మత్తు నుంచి తేరుకున్న తరువాత, అవసరమైతే పైకప్పు తెరవడానికి వీలయ్యేటటువంటి కారుకోసం పిలవనంపు. కారు ఎక్కగానే కిటికీ తలుపులన్నీ మూసేయాలి. విశాలంగా వుండి, మంచి వెలుతురున్న రహదారుల మీదనే నడపాలని డ్రైవరుకు కచ్చితమైన సూచనలివ్వాలి. ఈ విధంగా చేస్తే నీ డబ్బుతో భద్రంగా ఇల్లు చేరుకుంటావు. నిజాయితీగా ఇట్లాంటి సలహా ఇచ్చిన ఈ ముసలి మాజీ సోల్జరుకు మాత్రం కృతజ్ఞతలు తెలపడం మాత్రం మరువకు’’ దాదాపు కన్నీళ్ళు పెట్టుకొన్నట్లుగా చెప్పాడతడు. అంతలో రెండు కప్పుల్లో కాఫీ వచ్చింది. ఒక కప్పు నాకందించాడు నమ్రతగా తలవంచి. అప్పటికే నా నాలుక దాహంతో పిడుచకట్టుకుపోయి వుంది. ఒక్క గుక్కలో తాగేశాను. ఆ వెంటనే నా తల గిర్రున తిరిగసాగింది. ఇంతకుముందెన్నడూ లేని మత్తు ఆవరించింది నన్ను. ఆ గదంతా గుండ్రంగా పరిభ్రమించసాగింది. ముసలి సోల్జరు- స్టీం రైలింజను పిస్టన్ కిందికీ, పైకీ కదిలే విధంగా ఎగురుతున్నట్టు కనిపించసాగాడు. నా చెవులు సగం వినిపించకుండా పోయాయి. భయ విహ్వలత, నిస్సహాయత, తెలివితక్కువతనం- నా గుండెల్ని ఊపేస్తున్నాయి. టేబుల్‌ను పట్టుకొని బ్యాలెన్స్ చేసుకుంటూ పైకి లేచాను. ఆ పరిస్థితిలో నేనెలా ఇంటికి పోవాలో తెలియక నాలో నేనే ఏదేదో గొణుక్కుంటున్నాను. ‘‘మిత్రమా!...’’ అని ముసలి సోల్జర్ తిరిగి చెప్పనారంభించాడు. ‘‘నీవున్న ఈ స్థితిలో ఇంటికి పోవడం పిచ్చితనమనిపించుకొంటుంది. కచ్చితంగా డబ్బు పోగొట్టుకుంటావు. దొంగలు దోచుకొని నిన్ను హత్య కూడా చేస్తారు. నేనీరాత్రి ఇక్కడే పడుకొంటాను. నువ్వుకూడా ఇక్కడే నిద్రపో. ఇక్కడ మంచి మంచాలు దొరుకుతాయి. హాయిగా నిద్రపో. మద్యం మత్తు వదిలించుకొని ఉదయమే- పట్టపగలు, సూర్యుని వెలుగులో నిశ్చింతగా ఇల్లు చేరుకుంటావు. నా మాట విను.’’ నేను రెండు పనులు తప్పకచేయాల్సిన అవసరముంది. ఒకటి- నా డబ్బంతటినీ వుంచి కట్టివున్న చేతిరుమాలు మూటను చేజారనివ్వకుండా చూసుకోవడం. రెండు- ఏదో ఒక చోటు చూసుకొని తక్షణం మేనువాల్చి, హాయిగా నిద్రపోవడం. కాబట్టి మంచం ప్రతిపాదనకొప్పుకున్నాను. నా వైపు చాపిన మాజీ సోల్జరు చేతిని ఒకచేత్తో పట్టుకున్నాను. ఇంకో చేత్తో నిధిని బంధించిన మూటను గట్టిగా పట్టుకున్నాను. జూదగృహనిర్వాహకుడు ముందు నడవగా, కొన్ని మలుపులు తిరిగి, కొన్ని మెట్లెక్కిన తరువాత నేను నిద్రించబోయే గదికి చేరుకున్నాను. మాజీ సోల్జరు నాకు కరచాలనం చేస్తూ, మరుసటి ఉదయం అతనితో కలసి బ్రేక్ ఫాస్ట్ చేయాలని కోరాడు. తరువాత నాతో శెలవు తీసుకొని, జూదగృహ నిర్వాహకునితో పాటు నిష్క్రమించాడు. వెంటనే నేను వాష్ బేసిన్ వద్దకు పరుగెత్తాను. జగ్గులో వున్న నీటిని తాగి, మిగతావి వాష్ బేసిన్‌లోకి కుమ్మరించాను. చల్లనినీళ్ళల్లోకి నా తలను ముంచివుంచాను కాస్సేపు. తరువాత కుర్చీలో కూలబడి నన్ను నేను సుధారించుకొనడానికి ప్రయత్నించాను. కొన్ని క్షణాల అనంతరం కొంచెం ఉపశమనం కలిగినట్లైంది. గాంబ్లింగ్ హౌస్‌లో తిష్ట వేసిన దుర్గంధభూయిష్టమైన వాయువులను పీల్చి ఖరాబైన నా ఊపిరితిత్తుల్లోనికి- ఆ గదిలోకి వీస్తున్న సహజ తాజాశీతల సమీరాలు ప్రసరించి , ఎనలేని హాయిని చేకూర్చాయి. చల్లని నీటిస్పర్శ మనశ్శాంతిని కలిగించింది. తలతిరుగుడు తగ్గింది. మళ్ళీ మామూలు మనిషినయ్యాను. నా మనసులో మెదిలిన మొట్టమొదటి పథకమేమంటే... ఆ రాత్రికెలాగో ఒకలాగు గాంబ్లింగ్ హౌస్‌లోనే కాలక్షేపం చేయడం. తరువాత అక్కడి నుంచి బయటపడి చల్లగా బైటకు జారుకోవడం. అందుకే లోపల గడియ బిగించుకొని, తలుపుకేవైనా బరువైన వస్తువుల్ని అడ్డంగా పెట్టి, మరుసటి ఉదయం వరకూ అవకాశం కోసం ఎదురు చూడాలనుకొన్నాను. అదొక రిస్కుతో కూడుకున్న పని. అనుకున్న ప్రకారంగా, ఎవరూ గదిలోకి చొరబడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను. షర్ట్ విప్పేసి, పరుపుమీదకు చేరాను. నిధిని కట్టి ఉంచిన చేతిరుమాలమూటను తలగడకింద ఉంచుకున్నాను. ఎంత ప్రయత్నించినా నిద్రరాలేదు. నాలోని ఇంద్రియాలన్నీ కొత్త ఉత్తేజాన్ని పుంజుకున్నాయి. పరుపుమీద ఊరికే అటూ ఇటూ కదులుతున్నాను. ఒకసారి లేచి కూర్చుంటున్నాను. కాస్సేపు మోచేతుల్ని పరుపుపై ఆనించి పడుకున్నాను. రకరకాల విన్యాసాలను ప్రదర్శిస్తున్నాను. అయినా నిద్ర రావడం లేదు. ఏం చేయాలి నేను? చదువుకుందామంటే పుస్తకం లేదు. ఊరికినే ఆ గదిలోని వస్తువులను లెక్కించసాగాను. భయంగొలిపే ఆలోచనలతో నా బుర్ర బద్దలవుతుందేమోనని సందేహం తలెత్తింది. వాటిని మళ్లించుకుంటే తప్ప ఆ రాత్రి గడపలేననిపించింది. భయంకరమైన చెలరేగుతూనే వున్నాయి. పరుపుమీద లేచి కూర్చొని ఆ గదిని మొత్తం పరిశీలించాను. కిటికీలోంచి వెన్నెల కిరణాలు ప్రసరించి గదిని కాంతిమయం చేస్తున్నాయి. ఆ వెలుగులో అలంకారం కోసం గదిగోడలకు తగిలించిన బొమ్మలేమైనా కనిపిస్తాయేమోనని చూశాను. వాష్ బేసిన్లోంచి నీళ్ళుబొట్లు బొట్లుగా కారుతున్నాయి. రెండు చిన్న కుర్చీలు, వాటి చేతులమీద నా కోటు, ట్రౌజర్స్. పొడవు చేతుల కుర్చీ మీద మాసిన నా చొక్కా. డ్రెస్సింగ్ టేబుల్. ఆ తరువాత కిటికీ. చాలాపెద్ద కిటికీ అది. దానితరువాత చాలా పురాతనమైన బొమ్మ. క్యాండిల్ వెలువరిస్తున్న మసక వెలుతురులో అది అస్పష్టంగా కనిపిస్తూ ఉంది. చిత్రంలోని వ్యక్తి- ఎత్తైన పక్షి ఈకల గుఛ్చంతోనున్న స్పానిష్ టోపీని కిరీటంలా ధరించివున్నాడు. నల్లనిముఖంతో, దౌష్ట్యదృక్కుల వాలకంతో దర్శనమిస్తూ, అరచేతిని కళ్ళకడ్డుపెట్టి, దేనివంకో అదేపనిగా పైకి చూస్తున్నాడు. బహుశా అతని చూపులు, అతన్ని ఉరితీయబోయే ఉరికొయ్యమీద నిలిచివుంటాయి. అతని వైఖరి కూడా అందుకు తగినట్టే వుంది. ఆ పిక్చరు నన్ను పైకి చూసేలా చేసింది. అప్పుడు పందిరి మంచానికున్న చప్పరం (మంచం పైభాగం)కేసి దృష్టిసారించాను. చప్పరం మబ్బుమబ్బుగా కనబడుతూవుంది. దాన్ని చూడడానికి ఆసక్తి కలగకపోవడంతో, వెనక్కి తిరిగి పిక్చర్ వంక చూశాను. ఆ బొమ్మలోని శాల్తీ ధరించిన కిరీటానికున్న ఈకలు లెక్కపెట్టాను. మూడు తెల్లవి, రెండు ఆకుపచ్చవి. అతని కిరీటాన్ని కూడా పరిశీలించాను. శంఖు ఆకారంలోఎత్తుగా ఉంది. ఆ వ్యక్తి ఏ కారణంచేత పైకి చూస్తున్నాడో అర్థం కాలేదు. నక్షత్రాల వైపా? అంతటి సాహసికుడు జ్యోతిష్యుడో లేక ఖగోళ శాస్త్రజ్ఞుడో కావడానికి వీల్లేదు. తప్పకుండా అతను ఎత్తులో వున్న ఉరికొయ్యకేసే చూస్తుంటాడు. ఇప్పుడు తలారి వచ్చి ఆ వ్యక్తి కిరీటాన్నీ, ఈకలనూ స్వాధీనం చేసుకొంటాడా? మరొకసారి ఈకలను లెక్కపెట్టాను. మూడు తెల్లవి, రెండు ఆకుపచ్చవి. నా జ్ఞాపకాలు ఇంగ్లాండ్ లో గడిపిన వెన్నెల రాత్రుల వెంట వెనక్కి పరుగెత్తాయి. కొంతసేపటికి నా జ్ఞాపకాల దారం తెగిపోయింది. మళ్ళీ వెంటనే ఈ లోకానికూడిపడ్డాను. కానీ, నేను మళ్ళీ మళ్ళీ ఎందుకు ఆ బొమ్మవైపు చూస్తున్నానో అర్థం కాలేదు. నా కళ్ళముందు- నా ఊహకందనిదేదో జరుగుతూ వుంది. ఏమది?... కనీకనిపించనట్టు...ఏదో చిన్న కదలిక.. చాలా చిన్న కదలిక... అరే! ఏమిటీమాయ! ఇప్పుడు ఆ బొమ్మలోని మనిషి తలమీది టోపీ కనబడలేదు. ఎక్కడికిపోయింది? శంఖాకార కిరీటమేది? అదీ కనబడలేదే! ఆ రెండూ ఎక్కడికెళ్ళాయి? మూడు తెల్లవి, రెండు ఆకుపచ్చ రంగు ఈకలేమయ్యాయి? అక్కడ లేవే! నేను చూస్తూండగానే ఎలా మాయమయ్యాయి.?... అతని నుదురును కప్పివేస్తూ వచ్చిన ఆ వస్తువేమిటీ? అంటే.. మంచం కదులుతూ వుందా? భయంతో గుండె వొణికింది. మంచం తలవైపు వీపు ఆనించుకొని కూర్చున్న నేను వెనక్కి తిరిగి పైకి చూశాను. ఆశ్చర్యపోయాను. నాకు పిచ్చిగానీ పట్టలేదు కదా? తాగుడు మైకం ఇంకా తగ్గలేదా నాకు? కలగంటున్నానా? మళ్ళీ తల తిరుగుతోందా? పందిరి మంచానికి నాలుగుమూలలా వున్న చిన్నపాటి కొయ్యనిలువుల ఆసరాగా నిలబడిఉన్న చప్పరం (పందిరిమంచం పైభాగం) కిందకు దిగుతూ వుంది- నెమ్మదిగా... అతి నెమ్మదిగా. నేను పరుపు మీద పడుకొని ఉండగానే నిదానంగా, క్రమపధ్ధతిలో, నిశ్శబ్దంగా- కింద పరుపు ఏ కొలతలతో వుందో, సరిగ్గా అవే కొలతలతోవున్న దీర్ఘచతురస్రాకార చప్పరం - నేరుగా నా మీదకు దిగుతూ వుంది. అలా దిగి అప్పచ్చిలా నన్ను నలిపేయదు కదా? నా రక్తం గడ్డకట్టినట్లైంది. చల్లని మంచుకణికలు- పాములుగా మారి- నా వెన్నెముక మీద పాకినట్లైంది. దిండు మీదున్న తల గుండ్రంగా తిప్పి- నిజంగా చప్పరం కిందకు దిగుతూ వుందా లేదా అని ధ్రువీకరించుకోవడానికి- బొమ్మలోవున్న వ్యక్తివైపు చూశాను. మరోసారి చూడనవసరం లేకపోయింది. అప్పటికే నల్లని, కంపుకొడుతున్న చప్పరం తాలూకు దీర్ఘచతురస్రాకార బయటి అంచులు - బొమ్మలోని వ్యక్తి నడుముకు సమాంతర దూరం పరిధిలోకి రావడానికి ఒక అంగుళం దూరంలో మాత్రం వున్నాయి. నేను ఊపిరి పీల్చడం కూడా మరచిపోయి చూస్తున్నాను. నెమ్మదిగా, చాలానెమ్మదిగా- ఆ చప్పరం ఫ్రేము అంచులు బొమ్మను దాటి కిందకు రావడం చూశాను. నేనాసమయంలో మనోనిశ్చలత కోల్పోలేదు. మంచం పందిరి పైభాగం కిందకు దిగి నన్ను నొక్కెయ్యబోతుందనే భయంకర నిజాన్ని మనసులో ధ్రువీకరించుకున్నాక, ఇక నేను ఆలస్యం చేయలేదు. ఈ లోపల పందిరి పైభాగం, మారణాయుధం రూపంలో నేను పడుకొన్న పరుపుకేసి ఇంకా కిందకు వస్తూనే వుంది. నేను భయంతో బిగుసుకు పోయాను. ఆ చప్పరం ఫ్రేం తాలూకు దుర్గంధం నా నాసికాపుటాల్లోనికి చొరబడి ఇంకా కంపరం పుట్టించింది. నేను ఇక ఆలస్యం చేస్తే ప్రాణాలు పోతాయనే స్పృహ మెరుపువేగంతో నన్ను కదిలేలా చేసింది. నిశ్శబ్దంగా పరుపుమీద నుంచి పక్కకు పొర్లి, నేలమీదకు పడిపోయాను. నేనలా కిందకు పొర్లడమేమిటీ, చప్పరం మొత్తం- అవే దీర్ఘచతురస్రాకార కొలతలున్న మంచం నాలుగుమూలలకు అతుక్కుపోవడమేమిటీ, రెండుచర్యలూ ఏక కాలంలో జరిగిపోయాయి. అంటే వెంట్రుకవాసిలో మృత్యువు నుంచి తప్పించుకున్నానన్నమాట! అక్కడికీ చివర్లో ఆ పందిరిమంచపు అంచు నా భుజానికి తగలనే తగిలింది. ఊపిరి పీల్చడానిక్కూడా వ్యవధి ఇవ్వకుండా, ముఖం మీద ధారగా కారుతున్న చెమటను కూడా తుడుచుకోకుండా, మోకాళ్ల మీద నిలబడి పందిరి పైభాగాన్ని పరికించాను. నా శరీరంలోని సర్వశక్తుల్నీ కూడదీసుకొని, నా కళ్ళలోనికే కేంద్రీకరించగలిగాను కాబట్టి, ఆఖరిక్షణాన, వెంట్రుకవాసిలో అపాయం నుండి తప్పించుకోగలిగాను. నా ప్రాణాల్ని రక్షించుకోగలిగాను. చప్పరం తాలూకు దీర్ఘచతురస్రాకారపు ఫ్రేము, దానిచుట్టు వున్న అంచులతో సహా పరుపుమీద పూర్తిగా దిగి ఆగిపోయింది. ఇప్పుడు పరుపూ, చప్పరం ఫ్రేము అంచుల మధ్య చిటికెన వేలు దూర్చడానిక్కూడా సందులేదు. మంచం పక్కన నిల్చుని పరిశీలిస్తే ఏం జరిగిందో అర్థమైంది. నాలుగు స్తంభాలమీద మోయబడుతున్న చప్పరం కింద నుంచి చూస్తే తేలికగా వుందనిపిస్తుంది. కానీ అది చాలా బరువైనది. దాన్ని ఏ పదార్థంతో చేశారో తెలియకుండా వుండేందుకు, కొన్ని అంగుళాల మేర కిందకు దిగిన చప్పరం అంచులు కనబడకుండా ఆకర్షణీయమైన రంగుల గుడ్డతెరలు అమర్చబడ్డాయి. నేను పైకి చూశాను. మంచం నాలుగు మూలలకు అమర్చిన లోహపుకడ్డీలు- కింద నుంచి పైకి పొడుచుకెళ్ళాయి-భయంకరంగా. నాలుగు స్థంభాలమీద, ఎత్తులో వుండాల్సిన మంచపు పైభాగం పూర్తిగా కిందకు దిగి, కిందున్న మంచపు అంచులను హత్తుకొని వుంది. మంచపు పైభాగం మధ్యలో చెక్కతో తయారుచేసిన భారీ స్క్రూ ఒకటి, సీలింగ్ కు తొలిచిన రంధ్రం ద్వారా కిందకు దిగేలా ఏర్పాటు చేయబడింది. అది సాధారణ ప్రింటింగ్ ప్రెస్సులలో ఉపయోగించే కంప్రెషర్‌ను తయారు చేసే పదార్థంతో తయారుచేయబడింది. భయంకరమైన సదరు మారణాయుధం అతిస్వల్ప శబ్దంకూడా వెలువరించలేదు. పైనుంచి కిందకు దిగుతున్నప్పుడు కనీసం కిర్రుమనలేదు. పదమూడో శతాబ్దంలో, ఇంక్విజిషన్ కాలంలో, ఇటువంటి మారణాయుధాలను ప్రయోగించి, దైవదూషణకు, మతధిక్కారానికి పాల్పడిన వ్యక్తులను ఊపిరాడకుండా చేసి చంపేవారు. ఇప్పటికీ ఈ పందొమ్మిదో శతాబ్దంలో కూడా నాగరిక ఫ్రాన్స్‌లో ఇటువంటి ప్రాణాల్ని హరించే యంత్రాన్ని కట్టెదుట నా కళ్ళముందే చూస్తూవుంటే నా గుండెలు గజగజా వొణికిపోయాయి. కదలలేని, ఊపిరికూడా తీసుకోలేని స్థితిలో వున్నాను. అయితే, వెంటనే కోల్పోయిన ఆలోచనాశక్తిని తిరిగి కూడగట్టుకున్నాను. నన్ను హత్య చేయడానికి కుట్ర జరిగిందనే భయంకర సత్యాన్ని తెలుసుకున్నాను. నా డబ్బుకోసం నన్ను ఇంత కిరాతకంగా, గురితప్పని రీతిలో నిద్రలోనే హత్య చేయడానికి కుట్రపన్నిన ఆ ఇద్దరినీ గుడ్డిగా నమ్మి, ఆ గదిలోకి వెళ్ళాను. ఇంతకుముందు ఎంతమందిని- గెలుచుకున్న డబ్బు కోసం- ఈ విధంగా మభ్యపెట్టి చంపారో! నేను తాగిన కాఫీలో మాదక ద్రవ్యం మోతాదు మించలేదు. పైగా నేను నిద్రపోకుండా వుండడం వల్ల నా ప్రాణాన్ని కాపాడుకున్నాను. నేను ఊహించినట్లు, ఆ చప్పరం పదినిముషాలపాటు మంచం మీద నిశ్చలంగా వున్న తరువాత, మరలా పైకి కదలడం ప్రారంభించింది. పైన వుండి ఘోర ఘాతుక కార్యం నిర్వహించిన దుర్మార్గులు- వారి కార్యాచరణ విజయవంతమైందని నమ్మివుంటారు. చప్పరం- నాలుగు కడ్డీలను దాటి, పైకప్పును చేరి యథాతథంగా అతుక్కుపోయివుంది. ఇంతకుముందు కనబడిన స్క్రూ లేదు. రంధ్రం లేదు. ఇప్పుడు మంచం-నిద్రకుపయోగపడే- సాధారణ మంచం లాగానే కనిపిస్తూ ఉందే గానీ, ఇంతకుముందటిలా మృత్యుతల్పంలా కనిపించలేదు. నేను మోకాళ్ళమీద లేచాను. చిన్న శబ్దమైనా- కుట్ర విఫలమైందని వాళ్ళకు తెలిసిపోతుంది. తరువాత నన్ను ఏమాత్రం వదలరు. ఏదోవిధంగా నన్ను హత్యచేసి తీరుతారు. తలుపు దగ్గర అడుగుల చప్పుడు వినిపిస్తుందేమోనని చెవులు రిక్కించి విన్నాను. ఎలాంటి చప్పుడూ లేదు. లోపలి నుంచి గడియ బిగించుకోవడమే కాక, వాకిలికడ్డంగా ఒక పాత చెక్కపెట్టెను ఉంచాను. దాన్ని- చప్పుడు కాకుండా కదిలించడం అసాధ్యమే అనిపించినా, కష్టపడి జాగ్రత్తగా ఆ పని పూర్తిచేయగలిగాను. ఇక అక్కడ్నుంచి తప్పించుకుపోవడమెలా అని ఆలోచించాను. కిటికీ కనబడింది. పిల్లిలా నడిచాను కిటికీ దగ్గరకు. కుట్రదారులు- పై అంతస్తులో కాపువేసి వేయికళ్ళతో చూస్తుంటారు. మెల్లగా కిటికీ తెరిచి కిందకు చూశాను. అబ్బో! అంతెత్తునుంచి దూకితే సున్నంలోకి ఎముక కూడా మిగలదు. ఇంటి పక్కలకు చూశాను. నీళ్ళపైపు కనబడింది- కిటికీకి దగ్గరలోనే. స్కూల్లో చదువుతున్నప్పుడు వ్యాయామం చేసేవాడిని. ఇప్పుడది అక్కరకొస్తూవుంది. అప్పుడు జ్ఞాపకమొచ్చింది- చేతిరుమాలలో కట్టివుంచిన బంగారమూ, డబ్బు. నేను దాన్ని అక్కడే వదలి పోదామనుకున్నాను. కానీ, ఆ దుర్మార్గులకు, అంతటి కుట్రదారులకు- ఎంతో విలువైన సొమ్ము దక్కనివ్వకూడదని కసితో అనుకున్నాను. నేను మరలా వెనక్కెళ్ళి, చేతిరుమాలు మూటను తెచ్చాను. దాన్ని నా షర్ట్ మెడపట్టీకి భద్రంగా కట్టుకొని , కిటికీమీదకు చేరుకొని, పైపుద్వారా- పిసరంత శబ్దం కూడా అవకుండా- కిందకు జారిపోయాను. ఆ పరిసరప్రాంతంలో పోలీస్ స్టేషన్ ఉన్నట్లు నాకు తెలుసు. బుల్లెట్ వేగంతో అక్కడికి చేరుకొన్నాను. గుక్క తిప్పుకోకుండా ఆ పోలీసు ఆఫీసరుకు జరిగిందంతా పూసగుచ్చినట్లు వివరించాను. నా వాలకం, నా మాటల్లోని నిజాయితీని గుర్తించి ఆ పోలీసు ఆఫీసరు గాంబ్లింగ్ హౌస్ మీద, బలగంతో ఒక్కుమ్మడిగా దాడిచేశాడు. అందరూ లొంగిపోయారు. తరువాత తెలిసిందేమంటే.. ఆ ముసలి మాజీ సోల్జరు ఆ గాంబ్లింగ్ హౌస్ నాయకుడని, ఇంతకు ముందు ఆర్మీ నుంచి డిస్మిస్ చేయబడ్డాడని, అక్కడున్నవారందరూ ఏదో విధంగా గాంబ్లింగ్ హౌస్‌లో జరిగే మోసాలలో, హత్యా దోపిడీలలో సంబంధం కలిగున్న వారేనని తేలింది. నాకిచ్చిన కాఫీలో మాదకపదార్థం కలిపినట్లు పట్టుబడిన స్త్రీ ఒప్పుకొంది. నేను పడుకొన్న గది పైకెళ్ళారు పోలీసులు. నన్ను ఊపిరాడనీయకుండాచేసి చంపాలని ప్రయోగించిన యంత్రాన్ని కనుగొన్నారు. గాంబ్లింగ్ హౌస్‌లో నిధిని గెలుచుకున్న వారందరినీ ఏదోవిధంగా మభ్యపెట్టి, పందిరిమంచం మీద నిద్రపోయేట్లు చేసి, గట్టిలోహంతో తయారు చేసిన మంచం మీద, కనీ కనబడనట్టి మెత్తని, పల్చటి పరుపు పరచేవారు. డబ్బుగెలిచిన వ్యక్తి అమాయకంగా నిద్రపోయిన తరువాత, తల్పం సైజులోనే చుట్టూ ఏర్పరిచిన లోహపు అంచులుగల చప్పరాన్ని పైకప్పు నుంచి కిందకి దించేవారు. మంచానికీ, పైనుంచి దిగిన చప్పరానికీ మధ్య ఏర్పడిన ఖాళీ స్థలంలో చిక్కుకున్న ఆ వ్యక్తి ఊపిరాడక గిల గిలా కొట్టుకొంటూ, దుర్భరమైన మరణయాతన అనుభవించి మరణించేవాడు. ఒకవేళ మధ్యలో ఆ వ్యక్తికి మెలకువ వచ్చినా, తప్పించుకోవడం అసాధ్యం. తరువాత ఆ గాంబ్లింగ్ హౌస్ గ్యాంగు, శవాన్ని గుట్టుచప్పుడు కాకుండా నదిలో విసిరేస్తుంది. నేను చేసిన ఈ నా సాహసకృత్యం పుణ్యమాని- సరదా కోసంగానీ, వినోదం కోసంగానీ - ఆ ఎరుపు నలుపు కార్డుల ఆట జోలికి ఇంకెప్పుడూ పోలేదు. పందిరిమంచం ఊహ-మదిలో మెదిలితేనే నా గుండెలు దడదడలాడిపోతుంటాయి- ఇప్పటికీ. - ఇంగ్లిష్ మూలం : విలియం విక్కీ కాలిన్స్ - అనువాదం: శొంఠి జయప్రకాష్ -
బిడ్డను భర్తే అపహరించాడు..!
‘క్రికెట్ క్రీడకు సంబంధించి పందెం కాయడం చట్ట విరుద్ధం’ అని ముకుందరావుకు తెలిసిన సంగతే..! అయినప్పటికీ తన వ్యసనం మానుకోలేకపోతున్నాడు అతడు. ఈసారి ముకుందరావు వంటి బెట్టింగ్ రాయుళ్ల మీద పోలీసులు ఉక్కుపాదం మోపారు. ముకుందరావునూ, అతడితో పాటు మరో నలుగురినీ పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. న్యాయస్థానంలో వాళ్లను ప్రవేశపెట్టారు. తదుపరి రిమాండ్ కు తరలించారు. ఈ ఘట్టం చిన్న విషయం కాదు. యుద్ధ పిపాసి అయిన ఉత్తర కొరియా ‘కిమ్’ అనుచర వర్గంలోని ఒకడితో ముకుందరావు వ్యసనం ముడిపడిపోయింది. సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ భారతి తన ప్రయోగశాల నుండి బయటికి వచ్చింది. సెక్యూరిటీ గార్డుల పలకరింపులు వింటూనే వారికి తగిన రీతిలో స్పందిస్తోంది భారతి. పార్కింగ్ స్థలంలోని తన కారును నడుపుతూ ఆమె బయలుదేరింది. ప్రయోగశాలల సముదాయపు ఆవరణ దాటింది కారు. మెయిన్ గేట్ వద్ద కూడా ఇద్దరు సెక్యూరిటీ జవాన్లు తమ తుపాకులతో అప్రమత్తంగా ఉన్నారు. కాన్వెంట్ ఆవరణంలో ఆగింది కారు. తన కొడుకును కారులో ఎక్కించుకుని తిరిగి ఇంటికి బయలుదేరింది భారతి. ఆమె కారును మరో రెండు కార్లు వెంబడించడం మొదలుపెట్టాయి. ఆ రెండు కార్లలో విదేశీయులు ప్రయాణిస్తున్నారు. ఒక విదేశీయుడు కారు నడుపుతూ ఉంటే మరొకడు అతడి ప్రక్కనే కూర్చున్నాడు. వాళ్ల చూపులన్నీ భారతి కారు మీదే ఉన్నాయి. రెండు కార్లలో ఒకటి వేగంగా ముందుకు వెళ్లింది. భారతి కారుకు అడ్డంగా తీసుకువచ్చి తన కారుని ఆపాడు విదేశీయుడు. తన కారును చప్పున ఆపింది భారతి. ఆ కారులోంచి ఇద్దరు విదేశీయులు దిగారు. వారిలో ఒకడు చురుకుగా భారతిని సమీపించాడు. భారతి తన కారు తలుపు తెరిచి దిగబోయింది. ఏం జరిగిందో వాళ్లను అడిగి తెలుసుకోవాలని భావించింది ఆమె. అయితే కారును సమీపించిన విదేశీయులు చటుక్కున బాబును అందిపుచ్చుకుని కన్ను మూసి తెరిచేటంతలో తన కారులోకి పోయి కూర్చున్నాడు. రెండోవాడు కూడా డ్రైవింగ్ సీటులోకి చేరి కారును అతి తొందరగా బయలుదేరదీశాడు. భారతి తన కళ్లను తానే నమ్మలేకపోయింది. తీరా సంఘటన అర్థం అయ్యాక ఆమెకు తన గుండె బద్దలైన అనుభూతి కలిగింది. ఇప్పుడు తన ప్రయాణం ఎటు? పోలీస్ స్టేషన్కా? బాబుని ఎత్తుకుపోతున్న కారు వైపా? ఆమె ఆలోచించుకునేలోపుగానే ఆమె మొబైల్ ఫోన్ మోగింది. స్టీరింగ్ వీల్ ప్రక్కనే ఉంది మొబైల్ ఫోన్‌ను పరిశీలించిన భారతి. పరిచయమైన నంబర్. ఫోన్ ఆన్ చేసింది. అవతల నుండి విచిత్రమైన ఇంగ్లీష్ యాసలో మాటలు వినిపిస్తున్నాయి. వాటి సారాంశం మాత్రం ఆమె బిడ్డను అపహరించిన ముఠాలోని మనిషే మాట్లాడాడు. బిడ్డ తమ వద్దే క్షేమంగా ఉన్నట్లు చెప్పాడు వాడు. తమకు కావలసిన రక్షణ సమాచారాన్ని అందించి బిడ్డను తిరిగి పొందవలసిందిగా హెచ్చరించాడు వాడు. ‘‘మీకేం కావాలి?’’ అడిగింది భారతి బొంగురు గొంతుతో.. ఆమెకు గుండెలో కలుక్కుమంటోంది. తన కొడుకు అపహరణ ఆమె మెదడు మీద షాక్ ఇస్తోంది. మనిషి నీరుగారిపోతోంది. ‘‘రాత్రి ఎనిమిది గంటలకు మా సాంకేతిక నిపుణుడు మీ దగ్గరకు వస్తాడు. అతడు చెబుతాడు.. ఏం కావాలో!’’ అన్నాడు ఆ వ్యక్తి. భారతికి అర్థమైపోయింది. వాళ్లకు కావలసింది సామాన్యమైన సమాచారం కాదని. దేశ భద్రతకు సంబంధించిన అంశం. తనను వాళ్లు లక్ష్యంగా చేసుకుని తన బిడ్డను ఎత్తుకుపోయారు. రక్షణ రహస్యాలను వారికి తానెందుకు ఇవ్వాలి? అవి తన ఆస్తి కావు. తన మీద చాలామంది పెద్ద అధికారులు, రక్షణ శాఖా మంత్రీ, ప్రధాన మంత్రీ ఉన్నారు. పరిశోధనాశాలలో తాను ఒక చిన్న పనిముట్టు మాత్రమే. అవతలి ఫోన్ ఆగిపోయింది. స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇంటికి చేరుకున్నదన్న మాటేగానీ భారతికి కన్నీళ్లు ఆగడం లేదు. రక్షణ శాఖలోని తన ఉద్యోగమే తన బిడ్డ ప్రాణాల మీదకు తెచ్చిందా? ఇప్పటికిప్పుడు తాను రాజీనామా చేసినా, తన బిడ్డను దుండగులు క్షేమంగా విడిచిపెట్టరుగాక విడిచిపెట్టరు. ‘‘డార్లింగ్’’ అంటూ వచ్చింది షీలా. ముకుందరావుకు ఆమె అలా పిలిచినప్పుడల్లా శరీరం కంపరమెత్తుతోంది. పోలీస్ రిమాండ్‌లో ఉన్న తనను ఆమె మనుషులు విడిపించారు. తనకు కూడా ఆ సమయంలో వాళ్లు ఆపద్బాంధవులు మాదిరిగానే కనిపించారు. షీలా ఇంట్లో తనను ప్రవేశపెట్టారు. అవమాన భారంతో తాను కూడా తన ఇంటికి వెళ్లలేకపోయాడు. ఏమైతేనేం, ముకుందరావును ముగ్గులోకి దించింది షీలా. దుండగులు సామాన్యులు కారు. తిగిరి ఆమెతో సన్నిహితంగా ఉన్న ఫోటోలను తీసి బెదిరించారు. తమకు ఏం కావాలో వారు చెప్పారు. రెండోనాటి సాయంకాలానికే.. భారతి నుండి వాళ్లు తన కొడుకును ఎత్తుకువచ్చి.. తనకే చూపించారు. ఆ బిడ్డడిని షీలా ఒక తల్లిలాగా కాపాడుతుందని కూడా హామీ ఇచ్చారు దుండగులు. తన బెట్టింగ్ పాపం తనను ఏ స్థాయికి దిగజార్చిందీ ముకుందరావుకు అర్థమవుతోంది. షీలాతో తన సాన్నిహిత్యం, తన బిడ్డ అపహరణ... ఇదంతా అమాయకురాలైన తన భార్య భారతి ఎలా ఎదుర్కోగలుగుతుంది? అతడి ఆలోచనకంటే మరింత ఇబ్బందిలో ఉంది భారతి. క్షిపణి రహస్యాలనూ, డిజైన్లనూ అడిగారు శత్రువులు. ఆకాశ మార్గాన రెండువేల ఐదు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను సాధించే క్షిపణులను ఉత్తర కొరియా ప్రయోగించింది. అంతకంటే మరో ఐదు వందల కిలో మీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను సాధించే నైపుణ్యం సంపాధించింది భారతదేశం. కేవలం శత్రు మూకలను అటకాయించడానికే తప్ప భారతదేశం ఏ దేశం మీదా తన ప్రతాపాన్ని ప్రదర్శించాలని అనుకోదు. అయితే అటువంటి శాంత స్వభావం కూడా ఉత్తర కొరియా వంటి దేశాలకు కంట్లో నలుసుగా తయారైంది. ఉత్తర కొరియా వాడి కన్ను మన పరిశోధనల మీద పడింది. వాడి మనుషులే భారతిని వేధిస్తున్నారు. తన భర్త కూడా ఇటువంటి విపత్కర సమయంలోనే ఎక్కడికి పోయాడో, ఏమైపోయాడో తెలియని స్థితిలో ఉంది భారతి. తనపై అధికారికి తన మీద జరుగుతున్న దాడి గురించి వివరించింది భారతి. క్షిపణుల రహస్యాలకు ప్రత్యేక డిజైన్లకు సంబంధించిన సాప్ట్వేర్ తెరవాలంటే పాస్వర్డ్ ఆ పై అధికారి వద్దే ఉంటుంది. ‘‘పాస్ వర్డ్ ఇస్తాను’’ అన్నాడు పై అధికారి. తరువాత పావుగంట పాటు కంప్యూటర్ ద్వారా నెట్ ద్వారా ఏం చెయ్యాలో, ఎలాంటి కమాండ్స్ ఇవ్వాలో చెప్పాడు పై అధికారి. కొరియా వాడి కళ్లు మెరిశాయి. క్షిపణుల డిజైన్లూ, సాంకేతిక వివరాలూ అంతా కలసి యాభై పేజీల డేటా అతడి కంప్యూటర్‌కి భారతి వద్ద నుంచి అందింది. ముకుందరావు తాను రిమాండ్ నుండి బయట పడినట్టు భారతితో నిజం చెప్పుకుని ఇల్లు చేరాడు. మరో గంటకు అపహరించబడిన బాబు కూడా క్షేమంగా ఇల్లు చేరుకున్నాడు. బాబుని దింపిన వాహనం వీధి మలుపు తిరుగుతుండగానే అటకాయించబడింది. పోలీస్ వాహనాలు ఆ కారును చుట్టుముట్టాయి. కారులో ఉన్న నలుగురు కొరియా మనుషులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. తన కంప్యూటర్లో క్షిపణుల సమాచారం తెరిచాం, తెలుకున్నాం అనే సంతోషంలో కొరియా మనుషులు ఉన్నారే తప్ప, ఆ పని జరగగానే స్థావరం వివరాలు పోలీసులకు తెలిసిపోయినట్టు వాళ్లు గుర్తించలేకపోయాడు. మొత్తం ముఠా సులువుగా పట్టుబడిపోయింది. అయినప్పటికీ భారతికి ఒక అసంతృప్తి మిగిలిపోయింది. తన భర్త క్రికెట్ క్రీడా పందాలలో పాల్గొన్నప్పుటికీ.. షీలా అనే యువతితో లైంగిక సంబంధం కలిగి ఉన్నప్పటికీ.. ఆమె సహించింది. తన బిడ్డను తన భర్తే అపహరణ ప్రయత్నానికి ఊతం కల్పించడం ఆమెకు ఎంతమాత్రం నచ్చలేదు. ‘వ్యసనపరుడికి యుక్తాయుక్త విచక్షణా నశిస్తుందా?’ ఆమె కళ్లలో చాలాసేపటి వరకూ చెమ్మ అలాగే ఉండిపోయింది. - ఎమ్.వి.వి. సత్యనారాయణ -
నేరం దాగదు..
ఆ రోజు ఆదివారం. సెలవు కాబట్టి వీరభద్రరావు కూరగాయలు తేవడానికి రైతుబజారుకు బయల్దేరాడు. స్కూటర్ స్టార్ట్ చేస్తుండగా జేబులో సెల్ మోగింది. ‘‘హలో..’’ అన్నాడు. ‘‘వీరభద్రం నేను సుమన్ మాట్లాడుతున్నాను శాంతినగర్ నుంచి..’’ ‘‘సుమన్! చెప్పు ఏంటి విశేషం?’’ ‘‘మీ కాలనీలో ఉన్నది కదా మా చెల్లెలు రాజకుమారి..’’ ‘‘ఔను! వాళ్ల గృహప్రవేశానికి నేనూ వచ్చాను. గుర్తుంది.’’ ‘‘కాల్ చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చెయ్యడం లేదు. మా మేనకోడలు చిత్ర కూడా ఫోన్ ఎత్తడం లేదు. కొంచెం వాళ్లింటికి వెళ్లి చూస్తావా? ఇద్దరూ ఫోన్ ఎత్తకపోవడంతో కంగారుగా ఉంది. ఈరోజు సండే కదా వాళ్లిద్దరినీ లంచ్‌కి పిలుద్దామంది మా ఆవిడ. ఫోన్ చేస్తుంటే రింగవుతోంది కాని లిఫ్ట్ చెయ్యడం లేదు..’’ చెప్పాడు సుమన్. వీరభద్రరావు వాచీ చూసుకున్నాడు. తొమ్మిది కావస్తోంది. స్కూటర్ రాజకుమారి వాళ్లింటి వైపు తిప్పాడు. సచివాలయనగర్ కాలనీలో ఇండిపెండెంట్ డాబా ఇల్లు అది. స్కూటర్ గేటు ముందు ఆపి లోపలకు వెళ్లాడు. కాలింగ్ బెల్ నొక్కాడు. రెండు నిమిషాలు ఎదురు చూశాడు. రెస్సాన్స్ లేదు. తలుపు నెట్టాడు. బార్లా తెరుచుకుంది. ‘‘హలో..! రాజకుమారిగారూ!’’ అంటూ హాల్లోకి వెళ్లాడు. అక్కడ ఎవరూ లేరు. ఇంట్లో చప్పుడు లేదు. బెడ్రూమ్ తలుపు నెడితే తెరుచుకుంది. బెడ్ మీద రాజకుమారి అపస్మారక స్థితిలో ఉంది. ముక్కు దగ్గర వేలు పెట్టి చూసి, బతికే ఉందని నిర్ధారించుకున్నాడు. ఈమె తెలివితప్పి పడి ఉంది. లోపల బోల్టు వేసుకోలేదు. ఈమె కూతురు ఎక్కడ? ఏం జరిగింది? ఇంకొక బెడ్రూమ్ దగ్గరకు వెళ్లాడు. తలుపు నెడితే తెరుచుకుంది. హడలిపోయాడు వీరభద్రరావు. బెడ్ మీద రక్తపు మడుగులో పడి ఉంది చిత్ర. బీరువా తెరిచి ఉంది. అందులో ఉన్న సామాన్లన్నీ నేల మీద చిందరవందరగా పడి ఉన్నాయి. చూస్తుంటే ఇదంతా దొంగల పని అయి ఉంటుందనుకున్నాడు. హడావుడిగా వీధిలోకి వెళ్లాడు. ఇరుగు పొరుగువారిని పిలిచాడు. రాజకుమారి ఇంట్లో దొంగతనం జరిగిందని, చిత్రను హత్య చేశారని చెప్పాడు. వీరభద్రరావు జరిగినదంతా సుమన్‌కు ఫోన్ చేసి చెప్పాడు. తాను వెంటనే బయల్దేరి వస్తున్నానన్నాడు. సుమన్ అక్కడకు చేరుకునే సరికే సమాచారం అందుకున్న పోలీసులు ఉన్నారు. అంబులెన్సులో రాజకుమారిని హాస్పిటల్‌కి పంపించినట్లు చెప్పారు. ‘‘సార్! నేను రాజకుమారి అన్నను. శాంతినగర్‌లో ఉంటాను. ఈరోజు సండే అని నా భార్య నా చెల్లెలిని, మేనకోడలిని లంచ్‌కి పిలుద్దాం అంటే కాల్ చేశాను. ఇద్దరూ లిఫ్ట్ చేయకపోవడంతో నా కొలీగ్ వీరభద్రరావుకి కాల్ చేసి ఏం జరిగిందో చూడమని రిక్వెస్ట్ చేశాను’’ అని ఇన్స్పెక్టర్ నాగిరెడ్డితో చెప్పాడు. ఎస్సై హుస్సేన్ ఇల్లంతా కలియదిరిగాడు. చిత్ర బెడ్రూమ్ క్షుణ్ణంగా పరిశీలించాడు. చిత్ర గుండెల్లో కత్తితో పొడిచి చంపారు. హత్యకు ఉపయోగించిన ఆయుధం దొరకలేదు. చిత్ర మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం హాస్పిటల్‌కి పంపించారు. ఇంటిని లాక్ చేసి సీల్ చేశారు. పోలీసులు రాజకుమారి, చిత్రల గురించి ఇరుగు పొరుగు వారిని విచారించారు. వెంకట్రామయ్య భార్య రాజకుమారి. ఆయన సెక్రటరియేట్లో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తూ మూడేళ్ల కిందట గుండెపోటుతో చనిపోయాడు. ఇరుగు పొరుగుతో ఇద్దరూ సఖ్యంగానే ఉంటారని, మంచిమనుషులేనని చెప్పారు. ‘‘సుమన్‌గారు! మీ చెల్లెలి కుటుంబానికి ఎవరితోనైనా శత్రుత్వం ఉందా?’’ అడిగాడు ఇన్స్పెక్టర్ నాగిరెడ్డి. ‘‘లేదండీ! నా చెల్లెలు కలుపుగోలు మనిషి. చిత్ర కూడా మంచిదే. ఈ ఏడాది చిత్రను నా కొడుకు సుదర్శన్కిచ్చి పెళ్లి చేద్దామనుకున్నాం కూడా. ఇంతలోనే ఈ ఘోరం జరిగిపోయింది’’ విచారంగా చెప్పాడు సుమన్. ‘‘మీ అబ్బాయి ఏం చేస్తాడు?’’ ‘‘మావాడు డిగ్రీ చదివాడు. ఎక్కడా జాబ్ చెయ్యనని స్వయంగా ఆటో సీటు కవర్లు తయారు చేసే ఇండస్ట్రీని నడుపుతున్నాడు.’’ కాసేపటికి హాస్పిటల్ నుంచి కాల్ వచ్చింది. రాజకుమారికి తెలివి వచ్చింది, మాట్లాడుకోవచ్చంటూ... ఇన్స్పెక్టర్ నాగిరెడ్డి, ఎస్సై హుస్సేన్‌లతో పాటు పోలీసు వెహికల్లో వెళ్లాడు సుమన్. అందరినీ చూసి రాజకుమారి బెడ్ మీద నుంచి లేస్తుంటే ఇన్స్పెక్టర్ వారించాడు. ‘‘ఫర్వాలేదమ్మా! పడుకోండి. చెప్పండి రాత్రి ఏం జరిగింది?’’ అడిగాడు ఇన్స్పెక్టర్. ‘‘రాత్రి మేం భోజనాలు చేసిన తర్వాత కాలింగ్ బెల్ మోగితే వెళ్లి తీశాను. బురఖాలో ఉన్న ఒక అమ్మాయి వచ్చింది. ‘‘ఆంటీ నేను చిత్ర ఫ్రెండును. అర్జంటుగా కలవాలని వచ్చాను’’ అంది. సరేనని చిత్ర బెడ్రూమ్ తలుపు తెరిచాను. ఆమె చిత్రతో మాట్లాడుతుంటే, నేను హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చుని టీవీ ఆన్ చేశాను. ఇంతలో ఎవరో నా ముక్కు మీద కర్చీఫ్‌తో అదిమారు. తియ్యటి వాసన వేసింది. తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. మెలకువ వచ్చేసరికి ఇదిగో ఇక్కడున్నాను. ఏం జరిగిందో చెప్పరూ..’’ అంటూ రాజకుమారి ఏడ్చింది. ‘‘కుమారీ! ఏడవకు..’’ అన్నాడు సుమన్. ‘‘అన్నయ్యా! ఏమైంది? నువ్వయినా చెప్పు..’’ అంది రాజకుమారి వెక్కిళ్లు పెడుతూ.. ‘‘కుమారీ! ఘోరం జరిగిపోయింది. రాత్రి వచ్చింది దొంగలు. చిత్రను చంపారు. డబ్బు, నగలు దోచుకున్నారు’’ చెప్పాడు సుమన్. ‘‘సార్! రాజకుమారి ఇంట్లో జరిగిన దొంగతనం గురించి అనుమానంగా ఉంది. దొంగతనానికి వచ్చిన వాళ్లు ముందు రాజకుమారి తలుపు తియ్యగానే అటాక్ చెయ్యాలి. అలా జరగలేదు. బురఖాలో వచ్చిన అమ్మాయి చిత్ర గదిలోకి వెళ్లింది. ఆ తర్వాత తనకు ఎవరో మత్తుమందు వాసన చూపించారంటోంది రాజకుమారి. కేవలం దొంగతనానికి వస్తే చిత్రకూ క్లోరోఫాం వాసన చూపించి, ఆ తర్వాత దోచుకోవచ్చు. హత్య చేయడం దేనికి?’’ అనుమానం వ్యక్తం చేశాడు ఎస్సై. ఆలోచనలో పడ్డాడు ఇన్స్పెక్టర్. రాజకుమారి సెల్ కాల్ డేటా తెప్పించారు. అందులో ఎక్కువగా ఒక నంబర్‌కే కాల్స్ వెళ్లాయి. ఆ నంబర్ నుంచే ఆమె సెల్‌కి కాల్స్ వచ్చాయి. ఆ నంబర్ రాఘవరావుది. ఆయన సెక్రటరియేట్లో సెక్షన్ ఆఫీసర్. రాఘవరావుని పోలీస్‌స్టేషన్‌కి పిలిపించి ఇంటరాగేట్ చేశారు. ‘‘చెప్పండి రాఘవరావుగారూ! రాజకుమారి నుంచి మీకు ఎక్కువగా కాల్స్ వచ్చాయి. మీ సెల్ నుంచి ఆమెకు కాల్స్ వెళుతున్నాయి. మీ ఇద్దరికీ ఏంటి సంబంధం?’’ ప్రశ్నించాడు ఇన్స్పెక్టర్. ఉలిక్కిపడ్డాడు రాఘవరావు. భయపడినట్లు కనిపించాడు. ‘‘అబ్బే సంబంధం ఏమీ లేదండీ. ఆమె భర్త వెంకట్రామయ్య నా సెక్షన్లోనే పనిచేసేవాడు. అతను చనిపోయాక వాళ్లకు రావాల్సిన గ్రాట్యుటీ, పీఎఫ్, ఇన్సూరెన్స్ డబ్బు గురించి హెల్ప్ చేశాను. వాళ్లమ్మాయికి జాబ్ ఇప్పించాను. వాటి గురించి మాట్లాడుకుంటాం. అంతే!’’ ‘‘వెంకట్రామయ్య పోయి మూడేళ్లయింది. డబ్బులన్నీ వచ్చేశాయి. పాత ఇల్లు పడగొట్టి కొత్తది కట్టుకున్నారు. ఇంకా ఏముంది మీరు రోజూ మాట్లాడుకునేది?’’ కఠినంగా ఉంది ఇన్స్పెక్టర్ కంఠం. రాఘవరావు ముఖం నల్లబడింది. తలవంచుకుని కూర్చున్నాడు. ‘‘నేను చెప్తాను వినండి. మీకు రాజకుమారితో అక్రమసంబంధం ఏర్పడింది. మీరు ఇంటికి రావడం పోవడం చిత్రకు ఇష్టం లేదు. తల్లితో ఘర్షణ పడుతోంది. మీ సంబంధం కొనసాగాలంటే చిత్రను అడ్డు తొలగించుకోవాలనుకున్నారు. దొంగతనం ప్లాన్ వేసి, చిత్రను హత్య చేశారు.’’ హడలిపోయాడు రాఘవరావు. ‘‘సార్! రాజకుమారితో సంబంధం నిజమే. నా పిల్లల మీద ఒట్టేసి చెబుతున్నా.. ఈ హత్యతో నాకే సంబంధం లేదు..’’ ఏడవడం మొదలుపెట్టాడు అంత లావు మనిషి రాఘవరావు. ‘‘మీరు హత్య చేయించి ఉండకపోతే మీకేమీ కాదు. నిజం దాగదు. బయటపడితే జైలుకు పోతారు’’ అని హెచ్చరించాడు ఇన్స్పెక్టర్. తర్వాత సుమన్‌ని ప్రశ్నించాడు. ‘‘మీ చెల్లెలు కూతురు చిత్రను మీ అబ్బాయికిచ్చి పెళ్లి చెయ్యాలనుకున్నామని అన్నారు. అందుకు చిత్ర ఒప్పుకుందా?’’ ‘‘అయ్యో! మావాడంటే చిత్రకు ప్రాణం. చిన్నప్పటి నుంచి కలసిమెలసి తిరిగారు. అప్పుడప్పుడు సినిమాలకు, షికార్లకు పోతుంటారు కూడా..’’ ‘‘అలాగా! చిత్రకు మీవాడితో పెళ్లి ఇష్టమేనన్న మాట’’ అన్నాడు ఇన్స్పెక్టర్. ‘‘ఔనండీ! దురదృష్టం. చిత్ర మా కోడలు కాలేకపోయింది. దేవుడు అన్యాయం చేశాడు’’ అన్నాడు సుమన్. ‘‘సుదర్శన్! చెప్పు.. మీ మేనత్త కూతురు చిత్ర నువ్వు చిన్నప్పటి నుంచి కలసిమెలసి తిరిగేవాళ్లని, ఒకరంటే మరొకరికి ప్రాణమని చెప్పాడు మీ నాన్న..’’ ‘‘ఔనండీ! మా పెళ్లి ఈ ఏడాదే చెయ్యాలనుకుంటున్నారు..’’ ‘‘చిన్నప్పటి నుంచి అంటే చిత్రకు మూడు నాలుగేళ్ల నుంచి తెలుసా?’’ ‘‘ఔనండీ! అది పుట్టినప్పటి నుంచి తెలుసు. పదేళ్ల వయసొచ్చినప్పటి నుంచి నాతో ఆడుకునేది. నేనంటే ప్రాణం..’’ చెప్పాడు సుదర్శన్. అంతే! చెంప పేలిపోయింది. ఎస్సై నాలుగువేళ్లూ అచ్చుపడ్డాయి దవడ మీద. ‘‘బద్మాష్! చెప్పరా! ఎందుకు చంపావు చిత్రని?’’ అరిచాడు ఎస్సై హుస్సేన్. వణికిపోయాడు సుదర్శన్. ‘‘చిత్రకి పదేళ్ల వయసప్పుడు తల్లి చనిపోయింది. వెంకట్రామయ్య మీ మేనత్త రాజకుమారిని రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు పిల్లలు లేరు. మొగుడుపోయిన మీ మేనత్త రాఘవరావుని తగులుకుంది.’’ థర్డ్ డిగ్రీ టార్చర్‌కి ఏడవసాగాడు సుదర్శన్. ‘‘చిత్రని నీకిచ్చి పెళ్లి చేస్తే మీ మేనత్తకి ఎదురుండదు. వెంకట్రామయ్య పోయాక ఒంటరితనం వల్ల రాఘవరావుతో అక్రమసంబంధం కొనసాగాలంటే, అల్లుడి కుటుంబం సహకారం అవసరం. అందుకే చిత్రను నీకిచ్చి పెళ్లి చెయ్యాలనుకుంది. అందుకు చిత్ర ఒప్పుకోకపోవడం లేదు. నువ్వు చిత్రను కొట్టడం బ్యూటీపార్లర్ నడిపే శ్రావ్య చెప్పింది. నువ్వంటే ఇష్టంలేదని శ్రావ్య దగ్గర వాపోయింది చిత్ర. ఆమె దారికి రాకపోవడంతో ఇక హత్య చేసి అడ్డు తొలగించుకోవాలనుకుంది మీ మేనత్త. తర్వాత ఆస్తి అంతా నీకు రాసిస్తానని ఆశ పెట్టింది. నువ్వు చిత్రను హత్య చేశావు..’’ ఏడవసాగాడు సుదర్శన్. ‘‘నేరం దాగదు. తెలుసుకోరా బద్మాష్! అనవసరంగా చెప్పుడు మాటలు విని నీ జీవితం నాశనం చేసుకున్నావు. మీ ఫ్యామిలీ మొత్తం జైలుపాలు కావాల్సిందే!’’ అన్నాడు ఇన్స్పెక్టర్. - వాణిశ్రీ -
ఫస్ట్ టైమ్ రాబరీ..!
క్యాష్ కౌంటర్ నుంచి జీతం తీసుకు వెళ్ళిన సన్యాసిరావు కాసేపటికే తిరిగి వచ్చి, ‘వెయ్యి రూపాయలు ఎక్కువ ఇచ్చేశావు నాకు,’ అంటూ క్యాషియర్‌కు డబ్బు తిరిగి ఇచ్చేశాడు. తనకు డబ్బులు ఎక్కువ వచ్చేశాయంటూ సన్యాసిరావు అలా తిరిగి ఇవ్వడం అది మొదటిసారి కాదు. ఒక్కోసారి క్యాష్ బ్యాలన్స్ చెక్ చేసుకున్న జగదీష్, తన దగ్గర షార్టేజ్ కనిపించకపోవడంతో, సన్యాసిరావు పొరబడ్డాడేమోనని ఆ సొమ్ము వాపసు చేయబోతే – ‘బహుశా ఎవరికో తక్కువ ఇచ్చుంటావు. వాళ్లు వచ్చి అడిగితే ఏం చేస్తావ్? ఉంచు’ అంటూ, తీసుకోకుండా వెళ్ళిపోయేవాడు. అతని నిజాయితీకి ఆ బ్యాంకులో మెచ్చుకోనివారంటూ లేరు. సన్యాసిరావు అదే బ్యాంక్‌లో లెడ్జర్ క్లర్క్‌గా పనిచేస్తున్నాడు. రంగరాజుకు పిచ్చి పిచ్చిగా ఉంది – ఎక్కడా అప్పు పుట్టకపోవడంతో. అర్జెంటుగా పాతిక వేలు కావాలి అతనికి. రెండు రోజులలో గుర్రపు పందేల సీజను ఆరంభమవుతుంది. రంగరాజు కూడా సన్యాసిరావు పనిచేసే బ్యాంక్‌లోనే పనిచేస్తున్నాడు. ఐదేళ్ళ సర్వీసుతో జీతం బాగానే వస్తోంది. రంగరాజు, సన్యాసిరావును పాతిక వేలు అప్పు అడిగాడు. అతను లేవన్నాడు. క్యాషియర్ జగదీష్‌ను అడిగితే, క్లాస్ తీసుకుని తల వాచేలా చీవాట్లు పెట్టాడు. రంగరాజు కంటే ఐదేళ్లు సీనియర్ అతను. అదే ఆఖరుసారంటూ బతిమలాడడంతో ఐదువేలు ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. ఆ రోజు వీకెండ్ కావడంతో బ్యాంక్‌లో క్యాష్ ట్రాన్జాక్షన్ హెవీగా ఉంది. కౌంటర్లో యమ బిజీగా ఉన్నాడు జగదీష్. ముందురోజు రాత్రి డిన్నర్ పార్టీకి వెళ్ళి వచ్చాడు అతను. దాంతో కడుపులో అలజడి మొదలైంది. అర్జెంటుగా టాయ్‌లెట్‌కు వెళ్ళవలసివచ్చింది. క్యాషంతా నేలపైన కుప్పలుగా పడి ఉంది. లెడ్జర్ క్లర్క్ సన్యాసిరావును పిలిచి కౌంటర్లో కూర్చోమని రిక్వెస్ట్ చేశాడు. రెండు నిమిషాల తరువాత రంగరాజు కౌంటర్ దగ్గరకు వచ్చాడు. ‘జీవితంలో ఎదగాలంటె కొన్ని రిస్కులు తీసుకోక తప్పదు గురూ! అందులోంచి ఓ కట్ట నా మొహాన కొడితే...రేపు ఈపాటికి కోట్లు గుర్రం మీద తెచ్చి గుమ్మరించనూ?’ అన్నాడు. ‘ఇంకాసేపు నీ మాటలు విన్నానంటే, నా బుద్ధి కూడా గుర్రమెక్కి రేస్ చేసేటట్టుంది. జగదీష్ తిరిగి రాకముందే నువ్విక్కడి నుండి కదలడం మంచిది’ అన్నాడు సన్యాసిరావు చిరాకుగా. రంగరాజు నవ్వేశాడు. అదిగో, అప్పుడే జరిగింది ఆ సంఘటన – ముసుగు మనిషి ఒకడు హఠాత్తుగా లోపలకు చొరబడి, రివాల్వర్‌తో సీలింగ్‌కు గురిపెట్టి వార్నింగ్ షాట్ పేల్చాడు. మెయిన్ డోర్ మూసేసి, ‘డోంట్ మూవ్!’ అంటూ అరిచాడు. ఓ లేడీ కస్టమర్‌ని హాస్టేజ్ గా దొరకబుచ్చుకుని ఆమె తలకు రివాల్వర్ గురిపెట్టాడు. ‘ఛుప్! నోరు మూయకపోతే, ఇందులోని బుల్లెట్సన్నీ నీ నోట్లోకే షూట్ చేస్తా జాగ్రత్త!’ అంటూ గదిమాడు. ఠక్కున నోరు మూసేసింది ఆమె. మిగతావారితో, ‘మీరేంటీ గుడ్లప్పగించి చూస్తున్నారూ? ఇది హోల్డప్. హ్యాండ్సప్ చేయండంతా!’ అన్నాడు. ఇమ్మీడియట్‌గా చేతులు పైకెత్తేసి స్టాచ్యూస్ అయిపోయారంతా. ‘కదిలితే కాలుస్తా!’ బెదిరించాడు ముసుగు మనిషి. సిబ్బంది అంతా టేబుల్స్ క్రిందా, డెస్కుల వెనుకా, కుర్చీల చాటునా దాక్కున్నారు. వాష్ రూమ్‌కి వెళ్ళొచ్చిన జగదీష్ తల వంచుకుని కౌంటర్ వైపు నడిచాడు. ట్రాన్జాక్షన్స్తో సందడిగా ఉండే వాతావరణం హఠాత్తుగా స్తబ్దత సంతరించుకున్న సంగతి అతను గమనించలేదు. కౌంటర్ వెనుక చెరో మూలా నిలుచున్న సన్యాసిరావు, రంగరాజులను చూసి, ‘ఏమైంది? దొంగాట ఆడుతున్నారా?’ అనడిగాడు ఆశ్చర్యంగా. ఏమయిందో వాళ్ళు చెప్పలేదు. ముసుగు మనిషి చెప్పాడు. అదీ – రివాల్వరుతో! హాల్లోని గందరగోళం ఆలకించి తన ఛాంబర్లోంచి బయటకు వచ్చిన మేనేజర్ ముకుందరావ్, విషయం గ్రహించి, చటుక్కున జేబులోంచి మొబైల్ తీశాడు, పోలీసులకు ఫోన్ చేయడానికని. అది గమనించిన ముసుగు మనిషి మెరుపులా షూట్ చేయడంతో మొబైల్ ఎగిరిపడింది. మేనేజర్ చేయి రక్తం క్రక్కింది. చేతిని పట్టుకుని గిలగిలలాడుతూ ముందుకు వాలిపోయాడు అతను. అదిరిపడ్డ జగదీశ్, అప్పుడు చూశాడు – అక్కడి దృశ్యాన్ని! పరిస్థితి అర్థం కావడానికి ఎంతోసేపు పట్టలేదు అతనికి. ‘క్యాషంతా మూట కట్టి ఇక్కడ పెట్టు!’ జగదీష్‌ను ఆదేశించాడు ముసుగు మనిషి. అతను తటపటాయిస్తూంటే వార్నింగ్ షాట్ పేల్చాడు. ‘ప్రాణాలతో ఉంటే...బోడి క్యాషియర్ ఉద్యోగ మేమిటీ, ఏ స్కామో చేసుకుని బతకొచ్చును!’ అనుకుంటూ కౌంటర్‌లోను, నేలపైనా ఉన్న క్యాషంతా ఏరి, హ్యాండీగా కనిపించిన ఓ బ్లూ క్లాత్ లో మూట కట్టి కౌంటర్ బయట బల్ల మీద పెట్టాడు జగదీష్. ‘స్ట్రాంగ్ రూమ్, లాకర్ సంగతి నెక్ట్స్ టైమ్ చూసుకుందాం. టైమ్ ఈజ్ వెరీ టైట్...’ అంటూ మూట అందుకున్నాడు ముసుగు మనిషి. ‘ఇంకెప్పుడూ వీకెండ్స్‌లో బ్యాంక్‌కి రాకు. వచ్చినా ఇలా అందుబాటులో ఉండకు’ అంటూ లేడీ హాస్టేజ్ను ముందుకు ఒక్క తోపు తోసి, వెళ్తూ వెళ్తూ మళ్లీ రివాల్వర్ పేల్చి, క్షణాలలో అక్కణ్ణుంచి అదృశ్యమైపోయాడు. ఆ రోజు రాత్రి – టీవీలోని న్యూస్ ఛానెల్స్‌లో ఆ బ్యాంక్ దోపిడీ వార్తే ప్రముఖమయింది... ముసుగు మనిషి ఎవరో – బ్యాంక్ సిబ్బందినీ, కస్టమర్స్నూ రివాల్వర్‌తో బెదిరించి అరవై లక్షల రూపాయలు దోచుకుపోయిన వైనం చెబుతూ ఆ కేసును క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శివరామ్ పరిశోధిస్తున్నట్టూ...ఆ రాబర్ ఆచూకీ గాని, క్లూస్ గాని తెలిపినవారికి యాభై వేల రూపాయల బహుమతి ఇవ్వబడుతుందనీ ప్రకటించారు. ఇన్స్పెక్టర్ మొబైల్ నంబరూ, క్రైమ్‌బ్రాంచ్ ఫోన్ నంబర్లూ స్క్రోలింగ్‌లో ఇచ్చారు. టీవీలోని ఆ వార్తను కుతూహలంగా చూస్తున్న ఆ వ్యక్తి, ‘నాన్సెన్స్!’ అంటూ పట్టరాని ఆగ్రహంతో చేతిలోని డ్రింక్ గ్లాస్‌ను నేలకేసి కొట్టాడు. మొబైల్ అందుకుని ఇన్స్పెక్టర్ శివరామ్‌కు ఫోన్ చేశాడు. అటువైపు నుంచి రెస్పాన్స్ రాగానే, ‘ఇన్సె్పక్టర్! యూ ఆర్ లయింగ్! ఆ బ్యాంక్ దోపిడీలో పోయిన సొమ్ము అరవై లక్షలు కాదు, యాభై లక్షలే. ఓన్లీ ఫిఫ్టీ లాక్స్!’ అంటూ అరిచాడు. ‘హౌ డూ యూ నో?’ ప్రశ్నించాడు శివరామ్. ‘మీ పోలీసులు బ్యాంక్ మేనేజర్‌తో కుమ్మక్కయి పది లక్షలు నొక్కేసిన నిజం ఎరిగినవాణ్ణి!’ పళ్లు నూరాడు అతను. ‘ఎవరు నువ్వు? అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నావ్?’ అడిగాడు ఇన్సె్పక్టర్. ‘బ్యాంక్‌ను దోచుకున్న ఆ రాబర్ నేనే కనుక!’ అనేసి ఫోన్ కట్ చేసేశాడు అతను. మరో గ్లాస్ అందుకుని, సీసాలోని డ్రింక్‌ను అందులో పోసుకుని, కసిగా అంతా ఒకేసారి గొంతుకలోకి ఒంపేసుకున్నాడు, ఏదో తిట్టుకుంటూ. ఇన్స్పెక్టర్ శివరామ్ బ్యాంక్‌కి వెళ్లి మేనేజర్ ముకుందరావ్ను కలిశాడు. గత రాత్రి ‘బ్యాంక్ రాబర్’నంటూ అజ్ఞాత వ్యక్తి చెప్పిన విషయం చెప్పి, ‘దొంగ తీసుకు వెళ్లినది యాభై లక్షలే ఐతే, మిగతా పది లక్షలూ ఏమైనట్టు?’ అని ప్రశ్నించాడు. మేనేజర్ తెల్లమొహం వేశాడు. ‘నా పిల్లల మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. నాకేం తెలియదు. పోయిన సొమ్ము లెక్కలు వేసి చెప్పింది క్యాషియరే’ అన్నాడు కంగారుగా. ‘క్యాషియర్ పేరేమిటి? అతను ఎలాంటివాడు?’ అడిగాడు ఇన్సె్పక్టర్. ‘అతని పేరు జగదీష్. మనిషి మంచివాడు, నమ్మకస్తుడు. మూడేళ్లుగా ఆ సీట్లో ఉంటున్నాడు’ చెప్పాడు మేనేజర్. జగదీష్‌ను పిలిపించి విడిగా ఇంటరాగేట్ చేశాడు ఇన్స్పెక్టర్. ఆ రోజు తాను డ్యూటీలోకి వచ్చింది మొదలు జరిగినదంతా వివరించాడు జగదీష్. తాను ఏ పాపమూ ఎరుగనన్నాడు. తాను వాష్ రూమ్‌కి వెళ్లినప్పుడు పది నిముషాలపాటు లెడ్జర్ క్లర్క్ సన్యాసిరావును కౌంటర్లో కూర్చోబెట్టినట్టు చెప్పి, ‘సన్యాసిరావు చాలా నిజాయితీపరుడు. ఎప్పుడైనా పేమెంటులో పొరపాటున వెయ్యి, ఐదు వందలూ నేను ఎక్కువ ఇచ్చేస్తే, ప్రామ్ట్గా తెచ్చి వాపసు చేసేస్తూంటాడు’ అంటూ లోగడ అలా ఎన్ని సార్లు జరిగిందీ వివరంగా చెప్పుకు వచ్చాడు. తర్వాత ఇన్స్పెక్టర్ సన్యాసిరావును ప్రశ్నించాడు. తాను డబ్బు ముట్టుకోలేదన్నాడు సన్యాసిరావు. మరో కొలీగ్ రంగరాజు కూడా తనతోనే ఉన్నట్టు చెప్పి, ఆ సమయంలో నోట్ల కట్టలను చూసి అతను చేసిన కామెంట్స్ గురించి కూడా చెప్పాడు. అతన్ని పంపేసి, రంగరాజు కోసం కబురుపెట్టాడు ఇన్స్పెక్టర్. అతను ఆ రోజు డ్యూటీకి రాలేదని తెలిసింది. మేనేజర్‌ను అతని గురించి వాకబు చేస్తే, ‘గుర్రపు పందేల పిచ్చి తప్పిస్తే మనిషి నమ్మకస్తుడే’ అని చెప్పాడు. ‘మిస్టర్ ముకుందరావ్! బ్యాంకును దోచుకున్నది తానేనని ధైర్యంగా ఒప్పుకున్న మనిషి, దోచుకున్న సొమ్ము విషయంలో అబద్ధం చెప్పడు... సమ్ థింగ్ ఈజ్ రాంగ్ సమ్ వేర్!’ అన్నాడు ఇన్స్పెక్టర్ బయటకు వెళుతూ. మేనేజర్ టేబుల్ మీది టెలిఫోన్ మ్రోగింది. రిసీవర్ తీసి, ‘స్పృహలో!’ అన్నాడు ముకుందరావ్. ‘ఒరేయ్ చీటర్! పది లక్షలు కొట్టేసి నా అకౌంట్ లో కలిపేశావు కదురా?’ అరిచాడు అవతలి వ్యక్తి. ‘ఏయ్, ఎవరు నువ్వు?’ కోపంగా అడిగాడు మేనేజర్. ‘నీ బ్యాంక్‌ను దోచుకున్న రాబర్ని! నువ్వు నొక్కేసిన పది లక్షలూ వెంటనే నాకు అందజేయకపోయావంటే... నీ ప్రాణాలు దక్కవ్!’ కర్కశంగా అన్నాడు ఆ వ్యక్తి. ‘ఎక్కడ, ఎలా అందజేయాలో ఆలోచించుకుని మళ్ళీ ఫోన్ చేస్తాను. ఈ లోపున పోలీసులకు చెప్పావో... ఆనక కోర్ట్‌లో సాక్ష్యం చెప్పడానికి నువ్వుండవ్!’ మేనేజర్ ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. డిస్కనెక్ట్ అయిన ఫోన్ వంక వెర్రి చూపులు చూస్తూ ఉండిపోయాడు కొద్ది క్షణాలపాటు. చేతిరుమాలు తీసి ముఖం తుడుచుకుని, తన మొబైల్లో ఎక్కడికో రింగ్ చేశాడు. టీవీలో న్యూస్ చూసిన బ్యాంక్ రాబర్ ఆవేశంలో ఇన్స్పెక్టర్కు ఫోన్ చేశాడు. అయితే, తాను చేసిన ఆ ఘోరమైన పొరపాటును అతను గ్రహించేసరికి ఆలస్యమైపోయింది. పోలీస్ లాకప్‌లో ల్యాండ్ అయ్యాడు! అతని మొబైల్ నంబర్ ట్రాక్ చేసిన ఇన్స్పెక్టర్ శివరామ్, అతని చిరునామాను తెలుసుకుని, తెల్లవారు ఝామున అతని ఇంటిపైన రెయిడ్ చేశాడు. హ్యాంగోవర్ నుంచి అతను బయటపడే సరికే చేతులకు అరదండాలు పడ్డాయి. అతను దోచుకుని దాచుకున్న యాభై లక్షలూ పైసా తగ్గకుండా పోలీసులు రికవర్ చేసుకున్నారు. రాబర్కి హ్యూమర్ కాస్త ఎక్కువే. ‘సార్! ఇదే నా ఫస్ట్ ఎటమ్ట్. ప్చ్! పురిట్లోనే సంధి కొట్టేసింది. నా ధైర్యానికి బ్రేవరీ అవార్డ్ ఒద్దు కానీ, ఓ పది లక్షలు నా ముఖాన కొట్టకూడదూ?’ అన్నాడు ఇన్స్పెక్టర్తో. ‘షటప్!’ అంటూ ముఖం మీద కొట్టి సెల్‌లోకి తోశాడు ఇన్స్పెక్టర్. దవడ మీద చేత్తో రాసుకుంటూ, ‘ఎక్కడ పొరపాటు జరిగిందబ్బా!?’ అనుకుంటూ, లాకప్ తలుపులకు ఉన్న ఊసలు లెక్కించడం ఆరంభించాడు అతను. దోపిడీ సొమ్ము విషయంలో రాబర్ చెప్పింది కరెక్ట్ అని తేలడంతో, ‘మిగతా పది లక్షలూ మాయం చేసిన ఆ ఇంటి దొంగ ఎవరు చెప్మా!’ అన్న ప్రశ్న ఇన్స్పెక్టర్ బుర్రలో ముల్లులా గుచ్చుకుంది. పిల్లలకు వేసవి సెలవులు కావడంతో ‘అతని’ కుటుంబం పుట్టింటికి వెళ్ళింది. అందువల్ల హోటల్ తిండీ, ఒంటరి నిద్రా అయింది అతనికి ఆ వారం రోజులుగానూ. ఆ రోజు రాత్రి హోటల్లో డిన్నర్ చేసి, కొత్త సినిమా ఏదో రిలీజైతే సెకండ్ షోకి వెళ్ళివచ్చాడు. హుషారుగా ఈల వేసుకుంటూ ఇంటి తాళం తెరిచాడు. డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ అది... తలుపు తెరచి, లైట్ వేసి, లోపల అడుగు పెట్టిన అతను ఉలిక్కిపడ్డాడు. హాల్లో ఫర్నిచర్ స్థానభ్రంశం చెంది ఉంది. బెడ్ రూమ్‌లో అడుగు పెట్టాడు. గదంతా చిందరవందరగా ఉంది. బీరువాలు, టేబుల్ సొరుగులూ, సూట్ కేసులూ, కిచెన్‌లోని స్టీల్ డబ్బాలు, స్టోర్ రూమ్‌లోని వస్తువులూ–అన్నీ నేలపాలయ్యాయి. నిశ్చేష్టుడయ్యాడు అతను...ఇంట్లో ఎవరో ప్రవేశించారు! ఇల్లంతా ర్యాన్సాక్ చేశారు!! ఎవరు? ఎందుకు??... హఠాత్తుగా ఏదో జ్ఞప్తికి రావడంతో తుళ్లిపడ్డాడు. ఒక్క ఉరుకులో స్టోర్ రూమ్‌లోని అద్దాల స్టీల్ బీరువా వైపు పరుగెత్తాడు. అందులోని పుస్తకాలు, వస్తువులు చాలామటుకు నేల మీద పొర్లాడుతున్నాయి. లోపల మిగిలి ఉన్న కొద్దిపాటి వస్తువులు కూడా గబగబా తీసి కింద పడేశాడు. తరువాత ఖాళీ బీరువాను జాగ్రత్తగా నేల పైన బోర్లించాడు. బీరువా అడుగున పొడవుగా ఉన్న పోలిథీన్ ప్యాకెట్ ఒకటి సెల్లోటేప్ తో అతికింపబడియుంది. దాన్ని చూడగానే అతని కన్నులు మెరిశాయి. టేప్ ఊడదీసి, ప్యాకెట్ ను బైటకు తీసాడు. దాన్ని తెరిస్తే, లోపల రెండువేలరూపాయల నోట్లతో కూడిన కరెన్సీ కట్టలు ఐదు ఉన్నాయి! మొత్తం పది లక్షలు! తేలిక పడ్డ మనసుతో ఆ డబ్బును ప్రేమగా ముద్దు పెట్టుకున్నాడు అతను. అదే క్షణంలో– ‘వెల్, వెల్! దట్స్ వాట్ ఐ వాంటెడ్ మేన్!’ అంటూ దాక్కున్న చోటు నుంచి బయటకు వచ్చాడు ఇన్స్పెక్టర్ శివరామ్. మర్నాడు బ్యాంక్‌లో ప్రెస్ మీట్ ఏర్పాటైంది. మేనేజర్, సిబ్బందితో పాటు కొందరు కస్టమర్స్ కూడా హాజరయ్యారు. ‘ఇన్సె్పక్టర్ గారూ! ఎంతో నిజాయితీపరుడనుకున్న సన్యాసిరావు ఈ నేరం చేశాడంటే నమ్మలేకపోతున్నాను’ అన్నాడు మేనేజర్. ఇన్స్పెక్టర్ నవ్వాడు. ‘క్యాషియర్ అతన్ని నమ్మి అప్పుడప్పుడు క్యాష్ కౌంటర్‌ను తనకు అప్పగిస్తూండడంతో, వీలు చూసి సొమ్ము దొంగిలించేందుకు లాంగ్ టెర్మ్ స్కీమ్ ఒకటి వేసుకున్నాడు సన్యాసిరావు. నిజాయితీపరుడిగా మిమ్మల్ని నమ్మించి మీ విశ్వాసం చూరగొనే పథకంలోని భాగమే... అతను తరచు తనకు ఎక్సెస్ పేమెంట్ జరిగిందంటూ డబ్బులు వాపసు చేయడం. ఐతే, ఎక్సెస్ రానప్పుడు కూడా అతను బలవంతంగా వాపసు చేసేవాడని క్యాషియర్ చెప్పిన విషయం నన్ను ఆలోచింపజేసింది. నేను అనుమానిస్తున్నట్టు సన్యాసిరావే ఆ సొమ్మును దొంగిలించి ఉంటే, వెంటనే ఖర్చు చేసే ధైర్యం చేయడు. కొన్నాళ్లపాటు దాచి ఉంచుతాడు...సో, ముందుగా అతను సొమ్ము దాచిన చోటును కనిపెట్టాలనుకున్నాను. హ్యూమన్ సైకాలజీని బేస్ చేసుకుని చిన్న నాటకం ఆడాను...ఓ రాత్రి వేళ అతని ఇంట్లో చొరబడి, ఎవరో దేనికోసమో వెదికినట్లు ఇల్లంతా చిందర వందర చేసేశాను.నేను ఎదురు చూసినట్టే, దాచుకున్న సొమ్ము పోయిందేమోనని కంగారుపడ్డాడు సన్యాసిరావు. దాన్ని దాచిన చోటు నుంచి బయటకు తీసి, రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు’ నవ్వాడు ఇన్స్పెక్టర్. ‘రాబరీ సమయంలో టెన్షన్‌తో అందరి చూపులూ దొంగ వైపు ఉన్న తరుణంలో లక్ష రూపాయల కట్టలు ఐదు తీసుకుని షర్ట్ లోపల పడేసుకున్నాడు సన్యాసిరావు. రాబర్ నిష్క్రమించాక ఏర్పడిన గందరగోళంలో ఆ సొమ్ముతో సునాయాసంగా జారుకున్నాడు...ఇంటరాగేషన్‌లో ఆ సంగతి స్వయంగా అంగీకరించాడు.’ మేనేజరు, సహోద్యోగులూ తన వంక అసహ్యంగా చూడటంతో తలవంచుకున్నాడు, చేతులకు అరదండాలతో కానిస్టేబుల్స్ మధ్య కూర్చున్న సన్యాసిరావు. ‘అయితే, సన్యాసిరావు చర్య వల్ల తెలియకుండానే ఓ మేలు జరిగింది’ అన్నాడు ఇన్స్పెక్టర్ మందహాసంతో. ‘ఇతనే కనుక డబ్బు దొంగిలించి ఉండకపోతే, రాబర్ అంత సులభంగా బయటపడేవాడూ కాదు, దోపిడీ సొమ్ము అంత త్వరగా రికవర్ అయ్యేదీ కాదు!’ - తిరుమలశ్రీ -
ఆత్మహత్య కానే కాదు...
సుకన్య వేడి వేడి కాఫీ తీసుకొస్తుందని ఎదురు చూస్తున్నాడు జయప్రకాష్ రెడ్డి. ప్రభుత్వం వారిచ్చిన బంగ్లాకు బయట ఆహ్లాదకరంగా ఉన్న లాన్లో తాపీగా కూర్చుని పేపర్ తిరగేస్తున్నాడు.. ఉదయం ఆరు గంటలకే జాగింగ్ పూర్తి చేసుకొచ్చి లేలేత సూర్యకిరణాలు తాకుతుండగా.. కాఫీ తాగడం ఆయనకు ఒక అలవాటు. రాష్ట్ర వాణిజ్య రాజధాని లాంటి విశాఖ నగరానికి జయప్రకాష్ రెడ్డి పోలీస్ కమిషనర్‌గా విధుల్లో ఉన్నారు.. ఉదయం పేపర్లలో ముందుగా క్రైం పేజీ తిరగేసి, రోడ్డు ప్రమాదాలు, హత్యలూ, ఆత్మహత్యలూ అన్నింటి గురించి చదివి, తన పోలీస్ బుర్రతో వాటి వెనకున్న కథేంటో ముందుగానే ఒక అవగాహనకొచ్చి కొన్ని కేసులపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, వాటిని ఒక కొలిక్కి తేవడం కోసం తన విభాగపు ఇతర అధికారులనూ, సిబ్బందినీ సిద్ధం చేస్తుంటారు. ’’కైలాసగిరి కొండపై ఇద్దరు ప్రేమికుల ఆత్మహత్యాయత్నం..’’ ’’ప్రియుడు మృతి.. ప్రాణాపాయస్థితిలో ప్రియురాలు...’’ పోలీసు కమిషనరు జయప్రకాష్ రెడ్డిని విశేషంగా ఆకర్షించింది ఈ వార్త. ప్రేమికులిద్దరూ రాత్రంతా వెన్నెల వెలుగులో గడిపి, స్వస్థలం నుండి తెచ్చుకున్న పురుగుల మందును కూల్ డ్రింక్‌లో కలుపుకొని త్రాగినప్పుడు ఇద్దరూ చనిపోవాలి కదా..? ప్రియుడు మాత్రమే చనిపోయాడు. ప్రియురాలు ప్రాణాపాయ స్థితిలో ఉంది.. అంటే ఇంకా చనిపోలేదు.. ప్రియుడికన్నా ప్రియురాలు బలమైనదా..? లేదంటే ప్రియురాలి కన్నా ప్రియుడు బలహీనుడా..? ఇదే ఆయనను గందరగోళానికి గురి చేస్తోంది.. స్పస్థలం నుండి పురుగుల మందు తెచ్చుకున్నారంటే.. వారిది రైతు కుటుంబ నేప«థ్యమేనని అర్థమౌతోంది. మీడియా ఛానల్స్ హడావుడి అప్పటికే మొదలైంది. పత్రికలలో కూడా వార్త పతాక శీర్షికల్లో వచ్చేసింది.. ప్రేమికులిద్దరి కుటుంబాల నుండి ఫిర్యాదు ఇంకారాలేదు.. అయినా ఆలస్యం చేయకుండా.. ఎస్సై, సి.ఐలని రంగంలోకి దించాడు జయ ప్రకాష్ రెడ్డి. ప్రేమికులిద్దరూ ఒక ఊరి వారే. మిగతా వివరాల సేకరణలో ఎస్సై నిమగ్నమై ఉంటే, పోస్ట్‌మార్టమ్, హాస్పిటల్ వ్యవహారాలన్నీ సీ.ఐ. చూస్తున్నాడు.. ప్రేమికులిద్దరిదీ కులం కూడా ఒక్కటే. పైగా దగ్గర బంధువులు, వరసకి బావా, మరదళ్లు కూడా.. ఇరుప్రక్కల కుటుంబ పెద్దలకీ వారి పెళ్లి విషయమే ఎటువంటి అభ్యంతరమూ లేదు. ఆ కారణంగానే వాళ్లిద్దరిపైనా ఎటువంటి ఆంక్షలూ పెట్టలేదు. బస్సులో నూట ఎభై కిలోమీటర్లు ప్రయాణం చేసి.. కైలాసగిరి దాకా వచ్చారంటే కుటుంబాల మద్దతు ఉండటమే కారణం... రెండురోజుల తర్వాత పోస్ట్‌మార్టమ్ రిపోర్టు కూడా వచ్చింది.. ప్రియుడిది ఆత్మహత్యగానే తేలింది.. కూల్‌డ్రింక్, పురుగులమందు డబ్బాలపైనున్న వేలిముద్రలు ప్రేమికులిద్దరివేనని కూడా ఫలితం వచ్చింది.. పోలీసులకేమీ అర్థం కాలేదు.. కేసు అపరిష్కృతంగానే మిగిలిపోతుందా అనే దిగులు మొదలైంది. ప్రియురాలు క్షేమంగా, ఆరోగ్యంగా మూడు రోజుల తర్వాత ఆసుపత్రి నుండి డిశ్చార్జీ అయ్యింది.. జయ ప్రకాష్‌రెడ్డికి సైతం ఈ కేసు విషయం మింగుడు పడటం లేదు.. తలబద్దలు కొట్టుకునేంతగా ఆలోచించేసరికి తళుక్కున ఆలోచనొకటి మెదిలింది.. వెంటనే అమలులోకి పెట్టాడు. చివరి ప్రయత్నంగా ప్రియురాల్ని కస్టడీలోనికి తీసుకున్నారు పోలీసులు. ‘‘ఇది చాలా అన్యాయం అసలు నన్ను దేనికోసం అరెస్ట్ చేస్తున్నారో మీకేమైనా అర్థమవుతోందా..? నా లవర్ అయిన నా బావని పోగొట్టుకున్న బాధలో ఉన్న నన్నే తిరిగి అరెస్ట్ చేస్తారా?’’ అని ఏడుపందుకుంది ఆ అమ్మాయి. పోలీసులు కూడా ఊరుకోలేదు.. ‘‘మీరు చనిపోవాలనుకుని.. ఆత్మహత్యాయత్నం చేశారు కదా.. ఆత్మహత్యకు ప్రయత్నించడం నేరం... అందుకు శిక్ష అనుభవించక తప్పదు...’’ అసలు విషయం చెప్పారు.. ‘‘...అందుకని మీ పైన తగిన సెక్షన్ల క్రింద.. కేసు నమోదు చేస్తున్నాం..’’ పోలీసులు చెప్పింది వినగానే... ఒక్కసారిగా గట్టిగా నవ్విందామె... ‘‘నేను ఆత్మహత్యకు ప్రయత్నించాననటానికి మీ వద్దనున్న సాక్ష్యాలేమిటి..?’’ బిగ్గరగా అరిచింది రమ్య. ‘‘...అంటే మీరు ఆత్మహత్యకు ప్రయత్నించలేదా..’’ పోలీస్ బుర్ర వెంటనే ప్రశ్నించింది... ‘‘...నో... నెవ్వర్’’ ఆమె సమాధానం విని ఆశ్చర్యపోయారు పోలీసులు. ’’...మరయితే నీ ప్రియుడు ఉరఫ్ బావ ఉరఫ్ శ్రీరామ్.. కూడా ఆత్మహత్యకు ప్రయత్నించలేదా..?’’ పోలీసుల ప్రశ్నకు ఏం జవాబు చెప్పాలో అర్థం కాలేదామెకు. ‘‘....నో...శ్రీరామ్ది ఆత్మహత్య కానేకాదు...’’ అని చెప్పి ఒక్కసారిగా బిగ్గరగా ఏడవసాగిందామె.. ఇక మిగిలిన వివరాలు రాబట్టడానికి , నిజాలు చెప్పించటానికి పోలీసులకి ఎంతో సమయం పట్టలేదు.. పోలీసులు తమదైన శైలిలో విచారించి, పూర్తి వివరాలు తెలుసుకున్నాక, ఒకటికి రెండుసార్లు నిర్ధారించుకున్నాక శేఖర్ని అరెస్ట్ చేసి, రిమాండ్‌కి పంపించారు. ‘‘కైలాసగిరి శివపార్వతుల విగ్రహాల వెనకున్న దట్టమైన చెట్ల క్రింద.. ఏకాంతంగా ఉన్న మా ఇద్దరి వద్దకీ వచ్చాడు శేఖర్ బావ. శేఖర్ మా చిన్నత్త కొడుకు. నేనంటే చచ్చేంత ఇష్టం.. నాకేమో శ్రీరామ్ బావంటే ఇష్టం.. శ్రీరామ్‌ని గట్టిగా బెదిరించి, క్లాత్ చుట్టి తను తీసుకొచ్చిన పురుగుల మందుని, కూల్‌డ్రింక్ సీసాలో కలుపుకోమని చెప్పి, బలవంతంగా తాగించేశాడు. నా చేత కూడా ఓ కూల్‌డ్రింక్ తాగించాడు. దాంట్లో కూడా విషం కలిపించాడు కానీ చాలా తక్కువ.. తాగిన కొన్ని నిమిషాల్లోనే శ్రీరామ్ నురగలు కక్కుతూ నేలపై పడిపోయాడు. నాకు కళ్లు తిరిగినట్లై, మత్తు ఆవహించి, చెట్టు మొదలుపై వాలిపోయాను.. తర్వాత జరిగిందంతా మీకు తెలిసిందే’’ రమ్య స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నాడు పోలీస్ హెడ్ కానిస్టేబుల్. చాకచక్యంగా కేసును చేధించగలిగినందుకు సంతోషించాడు కమీషనర్ జయప్రకాష్ రెడ్డి. - డా. ఎమ్.వి.జె. భువనేశ్వరరావు -
మరణానికి ముందే శ్రద్ధాంజలి ప్రకటన
పొద్దుటే బాల్కనీలో కూర్చుని కాఫీ త్రాగుతూ దినపత్రికను తిరగేస్తూన్న గుర్నాథం, ఆబిచ్యువరీ పేజీలోని ఆ ప్రకటనను చూసి ఉలిక్కిపడ్డాడు – శ్రద్ధాంజలి! ‘‘ప్రముఖ వ్యాపారవేత్త దివంగత శ్రీ విన్నబోయిన గుర్నాథం గారి సంతాప సభ ఎల్లుండి (ఆదివారం) సాయంత్రం టౌన్హాల్లో జరుగుతుందని తెలియపరచడమయినది. ఇట్లు – కుటుంబసభ్యులు’’ అందులో అతని ఫొటో కూడా ఉంది! పక్కనే ఉన్న భార్య అది చూసి తెల్లబోతూ, ‘‘ఇదేం అన్యాయమండీ? ఇలాంటి ప్రకటన వేయించుకున్నారేమిటీ?’’ అంది నొసలు చిట్లిస్తూ. ‘‘ఇవాళ ఏప్రిల్ ఫస్ట్ కదా! నన్ను ఫూల్ చేయడానికి నా ఫ్రెండ్స్ చేసిన ప్రాంక్ అయ్యుంటుంది’’ అన్నాడు గుర్నాథం. ‘‘ఎంత స్నేహితులైతే మాత్రం, ఇలాంటి అమంగళకరపు ప్రాంక్స్ ఏమిటీ?’’ అందామె కోపంగా. గుర్నాథం నగరంలోని ప్రముఖ న్యాపారవేత్తలలో ఒకడు. మిత్రులకు ఫోన్ చేశాడు. ఆ ప్రకటన తాము వేయలేదన్నారంతా. పత్రిక కార్యాలయానికి ఫోన్ చేసి, ఆ ప్రకటనను ఇచ్చినవారి వివరాలు తీసుకుని విచారిస్తే ఆ వ్యక్తి, ఫామ్‌లో పేర్కొన్న చిరునామా నకిలీ అని తేలింది. అయితే – ఆ రాత్రి స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ ఆఫీసు నుంచి తిరిగివస్తూన్న గుర్నాథం కారు బ్రేకులు ఫెయిలయ్యి అదుపుతప్పి రోడ్ డివైడర్ ని గుద్దుకోవడము, అతను అక్కడికక్కడే మరణించడమూ విశేషం!! రెండు వారాల తరువాత నగరంలో అలాంటిదే మరో సంఘటన జరిగింది. ఈసారి ఫిల్మ్ ప్రొడ్యూసర్ దయాకర్ ‘మృతి’ కి ‘శ్రద్ధాంజలి’ ప్రకటన ప్రచురితమైంది! అంతకు మునుపులాగే, ఈసారీ ప్రకటన ఇచ్చిన వ్యక్తీ, చిరునామా ఫేక్ అని తేలింది. ‘‘తన శ్రద్ధాంజలి ప్రకటనే బుర్రలో మెదులుతూండడంతో గుర్నాథం భయంతో చచ్చుంటాడు. నాకు అలాంటి భయంలేదు. ఎందుకంటే, నేను తొంభయ్ ఏళ్ళు బతుకుతానని జ్యోతిష్కుడు చెప్పాడు’’ అన్నాడు దయాకర్ భార్యతో. అయితే, అదే రోజు రాత్రి నిదట్లోనే చనిపోయాడు అతను!! అప్పుడప్పుడు నిద్ర పట్టకపోతే మాత్రలు వేసుకోవడం అలవాటు అతనికి. ఆ రోజు పొరపాటున డోస్ ఎక్కువ తీసుకోవడంతో మరణం సంభవించినట్టు తేలింది! ఆనందవర్మ రేసుగుర్రాల యజమాని. గత నెల్లాళ్లుగా కుటుంబంతో యూరప్ టూర్లో ఉన్న ఆనందవర్మ వారం క్రితమే స్వదేశానికి తిరిగి వచ్చాడు. గుర్నాథం, దయాకర్‌ల మృతిని గురించి, చావుకు ముందే వారి శ్రద్ధాంజలి ప్రకటనలు వెలువడటం గురించి ఆలకించి నివ్వెరపోయాడు. ఆ రోజు ఉదయం దినపత్రికలో సెక్రెటరీ చూపించిన ప్రకటనను చూసి బిగుసుకుపోయాడు ఆనందవర్మ. అది అతని ‘శ్రద్ధాంజలి’ ప్రకటన! వెరిఫై చేయకుండా ఆ ప్రకటనను అంగీకరించి, ప్రచురించినందుకుగాను ఆ దినపత్రికపై పరువునష్టం దావా వేస్తానంటూ ఫోన్ లోనే చిందులు తొక్కాడు అతను ప్రతి ఆదివారం సాయంత్రం స్విమ్మింగ్ పూల్‌కి వెళతాడతను. ఆ రోజు ఆదివారం కావడంతో ఎప్పటిలాగే స్విమ్మింగ్ పూల్‌కి వెళ్ళాడు. ఈతకొడుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. బ్యాక్‌స్ట్రోక్ చేస్తూంటే ఉన్నట్టుండి ఎవరో కాలు పట్టి లాగినట్టు నీటిలోకి జారిపోయాడు. ఆనందవర్మ శవం స్విమ్మింగ్ పూల్‌లో తేలింది!!... ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి చనిపోయినట్టు పోలీస్ పంచనామాలో నమోదు చేయబడింది. బతికుండగానే ‘శ్రద్ధాంజలి’ ప్రకటింపబడ్డవాళ్లంతా ఇరవై నాలుగ్గంటలలో మృతి చెందుతున్నారన్న వార్త దావానలంలా పాకడంతో, నగరంలో గొప్ప సంచలనం రేగింది. దాంతో పోలీసులు రంగంలోకి దిగక తప్పలేదు. క్రైమ్‌బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శివరామ్ పరిశోధనకు పూనుకున్నాడు. గుర్నాథం, దయాకర్, ఆనందవర్మల ఇళ్లకు వెళ్లాడు. వారి కుటుంబాలను, సంబంధిత డాక్టర్స్‌ను కలుసుకుని మాట్లాడాడు. గుర్నాథం కారు కొత్తది. సడెన్‌గా బ్రేకులు ఫెయిలయ్యే అవకాశం తక్కువ. ఎవరో కావాలనే వాటిని ట్యాంపర్ చేస్తే తప్ప! దయాకర్‌కి నిద్రమాత్రలు అతని భార్యే అతని బెడ్ పక్కన పెట్టింది. సీసాలో మాత్రలు సగం వరకు ఉండాలనీ, అతను పత్రికలో వచ్చిన ప్రకటన గురించే ఆలోచిస్తూ పొరపాటున ఎక్సెస్ డోసేజ్ తీసుకుని వుంటాడనుకున్నామనీ చెప్పింది ఆవిడ. ఇకపోతే, ఆనందవర్మ ఎక్స్పర్ట్ స్విమ్మర్. అంత సులభంగా నీటిలో మునిగిపోతాడంటే నమ్మలేకపోతున్నారు ఎవరూను. అలాగని, ఫౌల్ ప్లేని కూడా అనుమానించలేకపోతున్నారు. పత్రికలో ప్రకటన వెలువడిన అనంతరమే మరణాలు సంభవించినా, అవి సహజంగానో లేదా ప్రమాదవశాత్తూనో సంభవించినవిగా మెడికల్ సర్టిఫికేట్స్ చెబుతున్నాయి. ఎవరినీ అనుమానించడానికి అవకాశంలేదు. ప్రకటనల సోర్స్‌ని కనిపెట్టగలిగితే ఆ మిస్టరీ వీడొచ్చును అనుకున్నాడు శివరామ్. ఆనాటి దినపత్రికలో మాజీ ఎంపీ కనకరాజు ‘శ్రద్ధాంజలి’ ప్రకటన వెలువడింది. క్రైమ్‌బ్రాంచ్‌కి పరుగెత్తాడు కనకరాజు. ‘‘ఇన్స్పెక్టర్! ప్రజాసేవకులను కాపాడవలసిన బాధ్యత మీ పోలీసులదే. నేను ప్రజాసేవకుణ్ణి!’’ అన్నాడు. ‘‘ఇది ప్రాంక్ అయ్యుండవచ్చునేమో ఆలోచించారా?’’ అన్నాడు ఇన్స్పెక్టర్ శివరామ్, ‘‘నీ బండ పడ! ఇది ప్రాంకూ కాదు, ప్రాక్టికల్ జోకూ కాదయ్యా బాబూ!’’ కనకరాజు చిన్నగా నుదురు బాదుకున్నాడు. ‘‘ఆ సంఘటనలన్నీ నా క్లోజ్ ఫ్రెండ్స్ సర్కిల్లోనే జరుగుతున్నాయి మరి!’’. ఆశ్చర్యపోయాడు శివరామ్. ‘‘మీరు ఎవరినైనా అనుమానిస్తున్నారా?’’. ‘‘ఎవరిని అనుమానించాలో తెలిసి చావడంలేదే!’’ అన్నాడు కనకరాజు సాలోచనగా. ‘‘ఐ వాంట్ పోలీస్ ప్రొటెక్షన్’’. కనకరాజు చెప్పిన క్లోజ్ ఫ్రెండ్స్ సర్కిల్ గురించి ఆరా తీసాడు ఇన్స్ పెక్టర్ శివరామ్. గుర్నాథం ఓ బిజినెస్ మేన్. దయాకర్ ఓ ఫిల్మ్ ప్రొడ్యూసర్. ఆనందవర్మకు రేసుగుర్రాలు ఉన్నాయి. సన్యాసిరావుది రియల్ ఎస్టేట్. కనకరాజు ప్రతిపక్షానికి చెందిన మాజీ ఎంపీ. అందరూ నలభయ్యో పడిలోనివారే. వీకెండ్స్‌లో సికిందరాబాద్‌లో ఉన్న ఓ క్లబ్లో కలుసుకుంటారు. కనకరాజు అనుమానిస్తున్నట్టు ఆ ఆబిచ్యువరీ ప్రకటనలకు, వారి చావులకు నిజంగానే సంబంధం ఉన్నట్లయితే, వాళ్ళెవరో ఆ ప్రకటనల ద్వారా ముందుగానే చెప్పి మరీ చంపుతున్నట్టు అర్థమవుతోంది! అందుకు పెద్ద ‘మోటివ్’ ఏదో ఉండాలనిపించింది. ఏడాది కిందట స్నేహితులు ఐదుగురూ కలసి బిజినెస్ టూర్ అంటూ మలేషియా వెళ్లారనీ, ఫ్యామిలీస్‌ని తీసుకువెళ్ళలేదనీ ఎంక్వైరీలో తెలిసింది. వారి మలేషియా ట్రిప్‌కీ ఆ చావులకూ ఏదైనా లింక్ ఉందా అనిపించింది. వాళ్ల మలేషియా ట్రిప్‌కి ఏర్పాటు చేసిన ట్రావెల్ ఏజెంట్ వివరాలు, వారి ద్వారా టూర్ కి సంబంధించిన వివరాలూ సేకరించాడు. శివరామ్‌కి డిటెక్టివ్ భగీరథ గుర్తుకొచ్చాడు. హాలిడేయింగ్కి అసిస్టెంట్ భావనతో కలసి రెండు రోజుల కిందట సింగపూర్ వెళ్ళాడతను. ఆ కేసులో అతని సాయం తీసుకోవాలనుకున్నాడు. ఆ కేసు పూర్వాపరాలను వివరిస్తూ, తాను సంపాదించిన మిత్రుల జాయింట్ ఫోటోగ్రాఫ్ని జతచేసి భగీరథకు మెయిల్ పంపించాడు. అక్కడ ఆ మిత్రబృందం యాక్టివిటీస్ గురించి విచారించి తెలియపరచవలసిందిగా కోరాడు. కనకరాజు భయంతో ఆ రోజంతా ఇల్లు కదల్లేదు. అతని ఇంటి ముందు మఫ్టీలో కానిస్టేబుల్స్ కాపలా ఉన్నారు. అదేరోజు బంధువుల ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉంది. బయటకు వెళ్లడానికి ధైర్యం చాలని కనకరాజు, కుటుంబాన్ని పంపించి తాను ఇంట్లోనే ఉండిపోయాడు. రాత్రికి పిజ్జా ఆర్డర్ చేసుకున్నాడు. పిజ్జా డెలివరీ బాయ్‌ని ఆపి చెక్ చేసి లోపలికి పంపించారు మఫ్టీలోని కానిస్టేబుల్స్. పిజ్జా తిని, మంచినీళ్లు తాగి పడుకున్నాడు కనకరాజు. తెల్లవారేసరికి చనిపోయి ఉన్నాడు!! నిద్దర్లోనే మాసివ్ హార్ట్ ఎటాక్ వచ్చి చనిపోయినట్టు డాక్టర్ సర్టిఫై చేశాడు. కనకరాజు భయాలు నిజమైనందుకు ఇన్స్పెక్టర్ విచారించాడు. కుటుంబసభ్యులు అభ్యంతరం చెబుతున్నా లెక్కచేయకుండా, ‘అనుమానాస్పదపు మృతి’ అంటూ కనకరాజు శవాన్ని పోస్ట్‌మార్టమ్‌కి పంపించాడు. ఆ రిపోర్టులోని విషయం శివరామ్‌ని నిర్ఘాంతపరచింది. ‘గతరాత్రి కనకరాజు తిన్న ఆహారంలో ‘ఆంఫెటామైన్స్’ డ్రగ్ హెవీ డోస్ కలసింది. అతను హైపర్ టెన్షన్ పేషెంట్ కావడంతో, అది హార్ట్ ఎటాక్ని ఇండ్యూస్ చేసుంటుంది’! మూడు రోజుల తరువాత డిటెక్టివ్ భగీరథ పంపించిన రిపోర్ట్ అందింది ఇన్స్పెక్టర్కి. శివరామ్ అభ్యర్థన అందగానే సింగపూర్ నుంచి మలేషియాకి వెళ్ళారు డిటెక్టివ్స్. అక్కడ తమ పరిశోధనలో వెలుగులోకి వచ్చిన విషయాలను అతనికి మెయిల్ చేశారు. ఆ నివేదిక సారాంశం ఇది – ‘మిత్రపంచకం కౌలాలంపూర్‌లో పెట్రినాస్ ట్విన్ టవర్స్‌కి చేరువలోనున్న మాండరిన్ ఓరియంటల్ హోటల్లో బస చేశారు. ఒరిజినల్ బుకింగ్ రెండు వారాలకైనా, ఐదు రోజులకే ఖాళీచేసేశారు. మలేషియాలోని ‘బాటూ కేవ్స్’ వద్దనున్న 140 అడుగుల ‘మురుగన్’ విగ్రహం ప్రపంచంలోనే ఎత్తయినది. అక్కడే పరిచయమయింది కుముదం వారికి. ఆమె ఓ అరవపిల్ల. తెలుగు మాట్లాడుతుంది. ఇరవయ్ మూడేళ్ళ అందగత్తె. టూరిస్ట్ గైడ్. ఆమె అందానికి ఫ్లాట్ అయిపోయిన మిత్రబృందం ఆమెను తమ గైడ్ గా నియమించుకున్నారు. ఆమెతో ‘రెడాంగ్’ ఐలెండ్ కి వెళ్ళారు. తొమ్మిది దీవుల సముదాయం అది. ఆహ్లాదకరమైన బీచ్ రిసార్ట్. కోరల్స్‌తో రమణీయంగా ఉండే రెడాంగ్లో స్నార్కెలింగ్, డైవింగ్, క్లిస్టర్ క్లియర్ వాటర్స్ ప్రధాన ఆకర్షణలు. అక్కడ ఏర్పోర్ట్ కూడా ఉండడం వల్ల ఇటు కౌలాలంపూర్ లోని ‘సుబాంగ్’ ఏర్పోర్ట్ నుంచి, అటు సింగపూర్‌లోని ‘చాంగీ’ ఏర్ పోర్ట్ నుంచి డెయిలీ ఫ్లైట్స్ ఉన్నాయి. ఆ దీవిలో రోజంతా సరదాగా గడిపిన మిత్రపంచకం, ఆ రాత్రి తప్పతాగి కుముదంపైన అత్యాచారం జరిపింది. ఆమె చనిపోవడంతో శవాన్ని సముద్రంలో పడేశారు. కౌలాలంపూర్ తిరిగి వెళ్లి, హడావిడిగా రూమ్స్ ఖాళీ చేసేసి ఇండియాకి చెక్కేశారు. కుముదం బాయ్ ఫ్రెండు, ఫియాన్స్ నిఖిల్ తెలుగు కుర్రాడు. ఇరవయ్ ఎనిమిదేళ్లుంటాయి. సింగపూర్‌కి చెందిన ఓ మర్చెంట్ షిప్లో పనిచేస్తున్నాడు. త్వరలో వారి వివాహం జరుగనుంది. మూడు నెలల కిందట అతని షిప్ సింగపూర్‌కి తిరిగి వచ్చింది. తరచు తనకు ఫోన్ చేసే కుముదం నుంచి ఫోన్ కాల్స్ ఆగిపోవడంతో ఆందోళనకు గురైన నిఖిల్ మలేషియా వెళ్ళాడు. కుముదం కొన్ని నెలలుగా కనిపించడంలేదని తెలిసింది. ఆమె ఇండియన్ టూరిస్టులతో రెడాంగ్ వెళ్లిందనీ, ఆ తరువాత కాంటాక్ట్‌లో లేదనీ ఆమె స్నేహితురాళ్ల ద్వారా తెలిసింది. రెడాంగ్ ఐలెండ్‌కి వెళ్లాడతను. అక్కడ వారికి బీర్ బాటిల్సవీ సప్లయ్ చేసిన పన్నెండేళ్ళ ఫిషర్ మెన్ కుర్రాడి ద్వారా ఆమెకు జరిగిన అన్యాయం గురించి తెలుసుకున్నాడు. రెండు రోజుల తరువాత కుముదం శవం ఒడ్డుకు కొట్టుకువచ్చిందనీ, తాను భయపడి ఆ సంఘటన గురించి ఎవరితోనూ చెప్పలేదనీ అన్నాడు ఆ కుర్రాడు. వారితో కలిసి తీసుకున్న ‘సెల్ఫీ’ ని చూపించాడు. నిఖిల్ దాని కాపీ తీసుకుని కౌలాలంపూర్ వెళ్ళాడు. మిత్రపంచకం బసచేసిన హోటల్ని కనిపెట్టి, దాని రిజిస్టర్ నుంచి వారి వివరాలను, ఇండియాలోని వారి అడ్రెస్లనూ సంపాదించాడు. ఆ మర్నాడే అతను ఇండియాకి ఫ్లైట్ ఎక్కాడు.’ ఇన్స్పెక్టర్ శివరాం నివ్వెరపోయాడు. సమాజంలో పెద్దమనుషుల్లా చలామణీ అవుతూ విదేశంలో అంతటి ఘాతుకానికి పాల్పడ్డ ఆ మిత్రపంచకం పట్ల ఆగ్రహం, అసహ్యం కలిగాయి. ఆ దుర్మార్గులను వెదుక్కుంటూ ఇండియాకి వచ్చిన నిఖిల్ వారిని కనిపెట్టి ‘శ్రద్ధాంజలి’ ప్రకటనలతో హెచ్చరించి మరీ వారిని తుదముట్టిస్తున్నాడని అర్థమయింది. ఎవరి సహకారమూ లేకుండా ఆ చావులను సహజమైనవిగా, ప్రమాదాలుగా ఎలా సృష్టించగలిగాడా అని అచ్చెరువందాడు. వారిలో మిగిలి ఉన్నది రియాల్టర్ సన్యాసిరావు ఒక్కడే. డిటెక్టివ్ పంపిన ఆధారాలతో సన్యాసిరావును అరెస్ట్ చేయాలనుకున్నాడు ఇన్స్పెక్టర్. అందువల్ల కుముదానికి జరిగిన అన్యాయానికి అతనికి శిక్ష పడేలా చూడడమేకాక, ‘శ్రద్ధాంజలి’ ఎఫెక్ట్ నుంచి కాపాడాలన్న ఆలోచన కూడాను. కోర్టు నుంచి వారెంట్ తీసుకునే ముందు అతనితో మాట్లాడాలని ప్రయత్నించి విఫలుడయ్యాడు. సన్యాసిరావును గూర్చిన ‘శ్రద్ధాంజలి’ ప్రకటనను గురించి తెలుగు దినపత్రికలను అలెర్ట్ చేసివుంచాడు. అయితే, వారం తిరక్కుండానే సన్యాసిరావు ‘శ్రద్ధాంజలి’ ప్రకటన ఓ ఆంగ్ల దినపత్రికలో వెలువడింది! ఎప్పటిలాగే ఆ ప్రకటనదారుడి పేరు, చిరునామా ఫేక్ అని తేలింది. సన్యాసిరావు ఇంటికి వెళ్ళాడు శివరామ్. అతను బయటకు వెళ్లాడనీ, ఎక్కడికి వెళ్లిందీ తెలియదనీ చెప్పారు. స్వయంగా డ్రైవ్ చేసుకుని వెళ్లినట్టు తెలిసింది. సన్యాసిరావు ఆఫీసుకు వెళ్ళిన ఇన్స్పెక్టర్, అతనికి వికారాబాద్ లో ఓ ఫామ్‌హౌస్ ఉందనీ, అప్పుడప్పుడు అక్కడికి వెళుతూంటాడనీ తెలుసుకున్నాడు. శివరామ్ వికారాబాద్ పోలీసులకు ఫోన్ చేసి సన్యాసిరావు ఫామ్‌హౌస్ గురించి చెప్పి, వెంటనే మఫ్టీలో మనుషులను అక్కడికి పంపి అతనికి రక్షణ కల్పించవలసినదిగా కోరాడు. హైదరాబాదు నుంచి వికారాబాద్ కు కారులో రెండు గంటల ప్రయాణం. వెంటనే బైలుదేరాడు. ఊరు సమీపిస్తూండగా పోలీసుల నుంచి మెసేజ్ వచ్చింది, సన్యాసిరావు ఫామ్‌హౌసుకు రాలేదని. ఉదయం ‘శ్రద్ధాంజలి’ ప్రకటనను చూడడంతో సన్యాసిరావుకు భయం పట్టుకుంది. వికారాబాద్ లోని ఫామ్ హౌస్‌కి బయల్దేరాడు ఎవరికీ చెప్పకుండా. తీరా టౌన్లో ప్రవేశించాక, అనంతగిరి హిల్స్‌కి వెళ్లి శ్రీ అనంత పద్మనాభస్వామికి అర్చన చేయించుదామనిపించింది. తిన్నగా ఆలయానికి వెళ్లాడు. ఆరోజు గుళ్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉందడంతో చాలా సమయమే పట్టిందక్కడ. అర్చనానంతరం తీర్థప్రసాదాలు తీసుకుని ఫామ్‌హౌస్‌కి వెళ్ళాడు. తలుపులు తెరిచే వున్నాయి. కేర్ టేకర్ కనిపించలేదు. తాను వస్తున్నట్టు ముందస్తు సమాచారం అందినట్టైతే కారుకు ఎదురొచ్చేవాడతను. హాల్లోంచే ‘సాయీ!’ అని పిలుస్తూ, మేడమీదున్న తన గదికి వెళ్ళిపోయాడు సన్యాసిరావు. దుస్తులు మార్చుకుని, టీవీ ఆన్ చేస్తూంటే గుమ్మం దగ్గర అలికిడయింది. ‘‘వచ్చావా, సాయీ!’’ అంటూ వెనుదిరిగిన సన్యాసిరావు, ఆగంతకుణ్ణి చూసి అదిరిపడ్డాడు. ఆ వ్యక్తి చేతిలో పిస్టల్ ఉంది. అది సన్యాసిరావుకు గురిపెట్టబడింది! ఫామ్ హౌస్ చేరుకున్న ఇన్స్పెక్టర్ శివరామ్, సన్యాసిరావు కారును చూసి తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. గబగబా లోపలికి పరుగెత్తాడు. అదే సమయంలో వినవచ్చాయి రెండు పిస్టల్ షాట్స్! ఉలికిపడి, అవి పైనుంచి వచ్చినట్టు గ్రహించి మేడమీదకు పరుగెత్తాడు. గదిలో కనిపించిన దృశ్యం అతన్ని నిర్ఘాంతపరచిందిం గది మధ్యగా సన్యాసిరావు, గుమ్మం దగ్గర ఓ ఆగంతకుడూ నెత్తురుమడుగులో పడున్నారు!! సన్యాసిరావు గుండెలో బులెట్ దూరితే, ఆగంతకుడి కుడి కణతలో గుండు దూరింది. ఆగంతకుడి కుడిచేతిలో పిస్టలూ, ఎడమచేతిలో సెల్‌ఫోనూ ఉన్నాయి. ప్రాణాలు కోల్పోయారు ఇద్దరూ. సెల్ ఫోన్‌ని తీసి చూశాడు శివరామ్. వీడియో ఆన్‌లో ఉంది. దాన్ని రీప్లే చేశాడు – ‘‘నా పేరు నిఖిల్. మలేషియాలోని రెడాంగ్ ఐలెండులో నా ఫియాన్సీ కుముదంపైన మూకుమ్మడి అత్యాచారం జరిపి అతి దారుణంగా చంపేశారు సమాజంలో పెద్దమనుషులుగా చలామణీ అవుతూన్న గుర్నాథం, దయాకర్, ఆనందవర్మ, కనకరాజు, సన్యాసిరావులు. ‘శ్రద్ధాంజలి’ ప్రకటనలతో హెచ్చరించి మరీ చంపేశాను వాళ్ళను. కుముదానికి జరిగిన అన్యాయం గురించి ఆలకించి ఆ దుష్టపంచకం పైన అసహ్యంతో, మామీద సానుభూతితో వారి సన్నిహితులు కొందరు నా మిషన్‌లో సహకరించడం విశేషం. వారందరికీ నా కృతజ్ఞతాభివందనాలు. కుముదం నా ప్రాణం. తాను లేని జీవితాన్ని ఊహించుకోలేను. అందుకే నేనూ తన దగ్గరకు వెళ్లిపోతున్నాను.’’ - తిరుమలశ్రీ -
ఉత్తమ విలన్స్
ఉదయిస్తున్న సూర్యుడి నులివెచ్చటి కిరణాలు భూమిని తాకుతున్న వేళ. నేలపై రక్తపు మడుగుల్లో పడి ఉన్న భార్య శవాన్ని ఒళ్లోకి తీసుకున్నాడతను. గుండె బద్ధలయ్యే బాధను పంటి బిగువన నొక్కిపట్టి, గట్టిగా భార్య శవాన్ని గుండెలకు హత్తుకున్నాడు. ‘‘నిన్ను నా నుంచి దూరం చేసిన వాళ్లను వదిలిపెట్టను! వదిలిపెట్టను!!’’ అతడి అరుపులతో ఆ ప్రాంతం మార్మోగింది. ‘‘కట్!.. షాట్ ఓకే!’’ అన్న అరుపు వినపడగానే కెమెరా ముందు నుంచి పక్కకు వచ్చాడు అనురాగ్. ‘‘షాట్ అద్భుతంగా వచ్చింది. వెల్డన్ అనురాగ్!’’ మెచ్చుకోలుగా అన్నాడు డైరక్టర్ సురేంద్ర. అనురాగ్ చిరునవ్వుతో అక్కడ నుంచి పక్కకు వచ్చి, సెల్ఫోన్లోకి తల దూర్చాడు. ’’ఏం కొత్త పెళ్లికొడుకా!’’ అన్న మాటలు వినపడగానే తలపైకెత్తి చూశాడు. ఎదురుగా ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రవీంద్ర నిల్చుని ఉన్నాడు. ఇద్దరిదీ పదేళ్ల స్నేహం! ఒరేయ్! అని పిలుచుకునే చనువు. ‘‘పెళ్లై ఆరునెలలు దాటింది! ఇంకా కొత్తపెళ్లి కొడుకునేనా?’’ నవ్వుతూ అడిగాడు అనురాగ్. ‘‘కాదా మరి!... ఎంతైనా నీలాంటి భర్త దొరకటం నీ భార్య నిశిత అదృష్టంరా!’’ ‘‘ఏం? ఎందుకు?’’ ‘‘పెళ్లైన నెల రోజులకే భార్యల నుంచి దూరంగా పరిగెత్తే మొగుళ్లను చాలామందిని చూశాను. నువ్వు అలా కాదు! పెద్ద పెద్ద ఆఫర్లను కాదని, భార్యతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తున్నావ్. పెళ్లైన తర్వాత అసలు కొత్త సినిమాలకు సైన్ చేయటమే మానేశావు. మొత్తానికి భార్య కొంగుచాటు కృష్ణుడివయ్యావు’’ అన్నాడు రవీంద్ర. అనురాగ్ నవ్వుతూ ‘‘భార్యంటే వస్తువు కాదు! వాడుకుని, అవసరం తీరాక దూరంగా పడేయటానికి! కన్నవాళ్లను వదిలి, మనల్ని నమ్మి వచ్చిన భార్య మన నుంచి ఆశించేది విలువైన బహుమతులు కాదు, ప్రేమగా నాలుగు మాటలు.. ఆమెతో సరదాగా గడపటానికి నాలుగు నిమిషాలు. అదే నేను చేస్తున్నాను’’ అన్నాడు. ఇంతలో ఫోన్ రింగ్ అవటంతో లిఫ్ట్ చేసి, ‘హలో..’ అన్నాడు. ఆవతలి వ్యక్తి చెప్పిన విషయం వినగానే నిశ్చేష్టుడయ్యాడు. కొద్దిసేపటి తర్వాత తేరుకుని, ‘‘ఎప్పుడు జరిగింది? ఎలా? సరే నేను వస్తున్నాను’’ అంటూ కళ్లనిండా నీళ్లతో హుటాహుటిన అక్కడి నుంచి బయలుదేరాడు. అనురాగ్ ఇంటి ముందు జనం గుమిగూడి ఉన్నారు. అతడలా ఇంట్లోకి నడుచుకుంటూ వెళుతుంటే అందరూ అతని వైపే జాలిగా చూస్తున్నారు. అనురాగ్ భయం భయంగా బెడ్ రూమ్‌లోకి అడుగుపెట్టాడు. రక్తపు మడుగులో అచేతనంగా పడిఉన్న భార్యను చూసిన వెంటనే గుండెలు బాదుకున్నాడు. ∙∙ హత్య జరిగిన మరుసటి రోజు.. ప్రముఖ నటుడి భార్య దారుణ హత్య ‘‘చూశారా సార్! ఫ్రంట్ పేజీ, రెండు కాలాల వార్త, అదృష్టవంతురాలు. మనం ఎంతమంది క్రిమినల్స్‌ను పట్టుకుని ఉంటాం. ఏనాడైనా మన గురించి సింగిల్ కాలమ్ వార్త రాశారా. పాస్‌పోర్టు సైజ్ ఫోటోయైనా వేశారా? దేనికైనా పెట్టిపుట్టుండాలి సార్!’’ వార్తా పత్రికను ఎస్ఐ అంజన్‌కు చూపిస్తూ.. తన గోడు వెళ్లబోసుకున్నాడు హెడ్ కానిస్టేబుల్ వీరభద్రం. ఎస్ఐ అంజన్ పేపరువైపు ఒక్కక్షణం చూసి, గట్టిగా ‘‘భద్రం..’’ అనగానే గమ్మునుండిపోయాడు అతను. అంజన్ కారు నడుపుతున్నా! అతడి ఆలోచనలు మాత్రం నిశిత హత్య కేసు మీదే ఉన్నాయి. ఎస్ఐ అంజన్‌కు.. పోస్టుమార్టమ్ రిపోర్టు రాకముందే చాలా కేసులను ఛేదించిన అనుభవం ఉంది. ఎటువంటి కేసునైనా నెలరోజుల్లోగా సాల్వ్ చేయగలడని డిపార్ట్మెంట్లో మంచి పేరుంది. ఈ కేసును కూడా వీలైనంత తొందరగా ముగించేయాలన్న ఆలోచనలో ఉన్నాడతను. కొద్దిసేపట్లోనే వాళ్లు ప్రయాణిస్తున్న కారు అనురాగ్ ఇంటి ముందు ఆగింది. ఇద్దరూ ఇంటి లోపలికి నడిచారు. సోఫాలో కూర్చుని, ఇంగ్లీష్ పేపరు చదువుతున్నాడు అనురాగ్. అడుగుల చప్పుడు వినపడి, పేపరులోంచి తల పైకెత్తి చూశాడు. ఎదురుగా పోలీసులు కన్పించటంతో పైకి లేచాడు. ‘‘ఇక పాయింట్‌కు వద్దాం మిస్టర్ అనురాగ్! మీ భార్య హత్య జరిగిన రోజు రాత్రి మీరెక్కడున్నారు?’’ ప్రశ్నించాడు అంజన్. అతడలా సూటిగా ప్రశ్నించే సరికి మొదట కంగారుపడినా, సర్దుకుని, ‘‘ఆ రోజు, అంతకు క్రితం రోజు నేను ఇంట్లో లేను, షూటింగులతో బిజీగా ఉండి ఇంటి వైపు రావటమే కుదరలేదు’’ చెప్పాడతను. ‘‘ఈ నెంబరు ప్లేటు గల కారు మీదేనా?’’ ప్రశ్నించాడు వీరభద్రం. ‘‘ఆ! నాదే, ఏమైంది?’’ అమాయకంగా తిరిగి ప్రశ్నించాడు అనురాగ్. ‘‘హత్య జరిగిన రాత్రి నువ్వు కారులో ఈ ఏరియాలోకి రావటం వీధి చివరన ఉన్న సీసీ కెమరాల్లో రికార్డైంది. నీ సెల్‌ఫోన్ సిగ్నల్స్ కూడా నువ్వు ఆ రాత్రి ఈ ఏరియాలోనే ఉన్నావని చెబుతున్నాయి. అంటే ఆ రాత్రి నువ్వు ఇక్కడికి వచ్చావు. మర్యాదగా ఆ రోజు ఏం జరిగిందో చెప్పు! లేదంటే మా స్టైల్లో విచారించాల్సి ఉంటుంది. జాగ్రత్త!’’ హెచ్చరిస్తున్నట్లు అన్నాడు అంజన్. ‘‘నా భార్యంటే నాకు ప్రాణం. అలాంటిది తనను నేనెందుకు చంపుతాను’’ అన్నాడు. ‘‘నీది నంది అవార్డు నటనని మాకు తెలుసు! మేము ఇక్కడికి వచ్చే ముందు నిశిత తల్లిదండ్రులు మా స్టేషన్‌కు వచ్చారు. నీ మీద కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ల కూతుర్ని తరుచూ హింసించే వాడివని, కన్నవాళ్లతో మాట్లాడటానికి కూడా ఫోన్ ఇచ్చేవాడివి కాదని, నువ్వో అనుమానపు పిశాచివి.. కలియుగ కీచకుడివని, నిశితను నువ్వే చంపుంటావని ఆ కంప్లైంట్ సారాంశం’’ వెటకారంగా అన్నాడు వీరభద్రం. ఇక తప్పించుకోవటానికి ఎటూ దారిలేని పరిస్థితుల్లో చేసిన నేరం ఒప్పుకున్నాడు అనురాగ్. ఏం జరిగిందో చెప్పటం ప్రారంభించాడు.. ‘‘నిశితకు ఎఫైర్ ఉందని, పెళ్లిచూపుల టైమ్‌లోనే తెలిసినా డబ్బు కోసం తనను పెళ్లి చేసుకున్నాను. పెళ్లైన తర్వాతైనా మారుతుందని అనుకున్నాను. కానీ ఏ మార్పు రాలేదు! మరీ బరితెగించింది. నేను ఇంట్లో లేని సమయంలో ఆమె ప్రియుడు ఇంటికి వచ్చిపోతున్నాడనిపించింది. అందుకే షూటింగులు మానుకుని మరీ! ఇంటి దగ్గర ఉండేవాణ్ని. ఈ మధ్య నా భార్య నిశిత ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. నా మీద ఎప్పుడులేని ప్రేమ ఒలకబోస్తోంది. ఓ రోజు ఉదయం ఇంటి బయట ఎవరితోనో నవ్వుతూ మాట్లాడటం చూసి, నిలదీస్తే! అలాంటిదేమీ లేదని బుకాయించింది. అందుకే మరుసటి రోజు రాత్రి ఫుల్లుగా మందు కొట్టివచ్చి! నిశితను కసితీరా పొడిచినప్పుడు ఏదో తెలియని ఆనందం కలిగింది నాకు...’’ ∙∙ రెండవ రోజు సాయంత్రం పోలీస్ స్టేషన్లో.. తన చాంబర్లో కూర్చుని, విశ్రాంతిగా క్రైమ్ మ్యాగజైన్ చదువుతున్నాడు అంజన్. ఇంతలో వీరభద్రం! ఓ సీల్డ్ కవర్ తెచ్చిచ్చాడతనికి. కవర్లో ఉన్న కాగితాలు బయటకు తీసి, అంజన్ చదవటం ప్రారంభించాడు. కొద్దిసేపటికే అతడి ముఖం తెల్లగా పాలిపోయింది. అంజన్ ముఖంలో చోటు చేసుకున్న మార్పులను గమనించిన వీరభద్రం ‘‘ఏంటి సార్! ఏమైంది’’ అని అడిగాడు కంగారుగా. అంజన్ ఆ కాగితాలను అతడి చేతికందించాడు. కొద్దిసేపటి తర్వాత అతడి పరిస్థితి కూడా అదే! బుర్ర గోక్కుంటూ ‘‘ఇదేంటి సార్! పోస్టుమార్టమ్ రిపోర్టు ఇలా వచ్చింది’’ అన్నాడు. ఊహించని ట్విస్ట్‌తో ఆలోచనల్లో పడ్డ అంజన్ పోస్టుమార్టమ్ రిపోర్టు ప్రకారం అనురాగ్! నిశితను హత్య చేయలేదు. ఆమెను ఇంకెవరో గొంతు నులిమి చంపేశారు. అనురాగ్! నిశితను.. అదే ఆమె డెడ్‌బాడీని పొడిచింది రాత్రి 8గంటల ప్రాంతంలో.. కానీ! ఆ హత్య అంతకు 5 గంటలముందు.. అంటే! మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో జరిగినట్లు రిపోర్టు చెబుతోంది. నిశిత గొంతుపై హంతకుడి 9 వేలి ముద్రలే దొరికాయి. ఎడమ చేతి బొటనవేలి ముద్రలు దొరకలేదు. దానర్థం ఆ హంతకుడికి ఎడమ చేతి బొటన వేలు లేకుండా అన్న ఉండాలి లేదా బొటన వేలి ముద్రలు పడక పోవడానికి వేరే కారణమేదైనా ఉండాలి. ఎవరా హంతకుడు?’’ అంటూ భద్రం వైపు చూశాడు. ‘‘సార్! నిశితకు ఓ లవర్ ఉన్నాడని అనురాగ్ చెప్పాడుగా! బహుశా అతడే ఈ హత్య చేసుంటాడేమో!’’ అనుమానం వ్యక్తం చేశాడు వీరభద్రం. ∙∙∙ ‘‘ఎంబీఏ చదువుతున్నపుడు నేను, నిశిత ప్రేమించుకున్న మాట నిజం! కానీ పెద్దలు మా పెళ్లికి ఒప్పుకోకపోవటంతో మేము కూడా స్నేహపూర్వకంగానే విడిపోయాము. తర్వాత కొద్దిరోజులకు ఆమెకు పెళ్లైందని తెలిసింది. ఈలోగా నేను ఈ రెడ్ అండ్ రెడ్ రెస్టారెంట్లో ఉద్యోగంలో చేరాను. పని ఒత్తిడిలో ఆమె సంగతే మర్చిపోయాను. మొన్న ఓ రోజు అనుకోకుండా రోడ్డుమీద కనిపిస్తే దగ్గరకెళ్లి పలకరించాను. కొద్దిసేపు మాట్లాడుకున్నాం. తర్వాత నేనే తనను కారులో ఇంటిదగ్గర దింపాను. అర్జంట్ ఫంక్షన్ ఉండటంతో ఆ ఇంట్లోకి కూడా వెళ్లకుండా రెస్టారెంట్‌కు వచ్చేశాను. బర్త్‌డే ఫంక్షన్ ఈవెంట్ పనుల్లో బిజీగా ఉండటంతో నేను ఆ పనిలో మునిగిపోయాను. రాత్రి పది వరకు రెస్టారెంట్లోనే ఉన్నాను. ఆ రాత్రే తను హత్యకు గురైంది! ఆ విషయం ఉదయం పేపర్లో చదివి తెలుకున్నాను. మీకు నా మీద అంత అనుమానం ఉంటే మా కోలీగ్స్‌ను నా గురించి విచారించుకోండి’’ ధీమాగా అన్నాడు సంజయ్. సంజయ్ మాట్లాడుతున్నంతసేపు ఇద్దరూ అతడి ఎడమచేతివైపే పరిశీలనగా చూస్తున్నారు. అతడు మాట్లాడుతూ ఎడమ చేత్తో జేబులో ఉన్న సెల్‌ఫోన్‌ను తీసి, టేబుల్ మీద పెట్డాడు. అతడి ఎడమ చేతి బొటనవేలు స్పష్టంగా కనపడుతోంది. అప్పుడప్పుడూ బొటనవేలితో ముఖంపై ఉన్న చింతపిక్కంత పుట్టుమచ్చను స్టైల్‌గా గోక్కుంటున్నాడు. పైగా అతడి మాటల్లో ఎలాంటి బెరుకూ, తప్పుచేశానన్న భయం లేదు. అంజన్‌కు.. ఇక అతన్ని విచారించటం వృథా అనిపించింది. ఓ కన్ఫర్మేషన్కోసం వీరభద్రాన్ని అతని వెంట పంపి, అతడు రెస్టారెంట్ బయటకు వచ్చేశాడు. కాసేపట్లో తిరిగొచ్చిన వీరభద్రం! సంజయ్ చెబుతున్నది నిజమేనని ధ్రువపరిచాడు. ∙∙ కేసు మళ్లీ మొదటికొచ్చింది... ఇరవై రోజులు గడిచినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉంది కేసు పరిస్థితి. కేసును ముందుకు నడిపించే బలమైన ఆధారమేదీ దొరకటం లేదు. అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరినీ విచారిస్తున్నారు. వారం రోజుల నుంచి హత్య జరిగిన ఇంటి ముందు గస్తీ కాస్తున్నారు. ఓ రోజు మధ్యాహ్నం అనురాగ్ ఇంటి దగ్గరలో అంజన్! వీరభద్రం మఫ్టీలో నిల్చుని ఉండగా ఓ ముసలి బిచ్చగాడి ప్రవర్తన ఆశ్చర్యంగా తోచింది. ఆ ఇంటి దగ్గర కొచ్చిన బిచ్చగాడు దాదాపు 15 నిమిషాలు అక్కడే కదలకుండా నిలబడ్డాడు. ఇంటివైపు చూస్తూ ఏడవటం ప్రారంభించాడు. దీంతో అనుమానం వచ్చిన అంజన్, వీరభద్రం అతణ్ణి విచారించారు. ఆ ముసలి బిచ్చగాడు తరుచూ ఆ వీధిలోకి అడుక్కోవటానికి వచ్చేవాడు. ఎవరు అన్నంపెట్టినా పెట్టకపోయినా అనురాగ్ భార్య నిశిత తప్పక పెట్టేది. పండగరోజు ఇంట్లో చేసుకున్న వంటకాలన్నీ అతడికి పెట్టేది. ఆరోగ్యం బాగాలేకపోతే డబ్బు సహాయం చేసిన రోజులున్నాయి. హత్య జరిగిన రోజు మధ్యాహ్నం బిచ్చగాడు ఇంటి బయట నిలబడి, చాలాసార్లు నిశితను పిలిచాడు. ఆమె రాలేదు! కొద్దిసేపటి తర్వాత ఓ వ్యక్తి కంగారుగా, చెమటలు పట్టి తడిసిన బట్టలతో ఇంట్లో నుంచి బయటకు రావటం అతడు చూశాడు. అదే సంగతి వాళ్లకు చెప్పాడు. ‘‘తాతా! నువ్వు ఆ వ్యక్తిని చూస్తే గుర్తుపట్టగలవా?’’ అడిగాడు అంజన్ ‘‘ఖచ్చితంగా!.. బాబు! ఆ మనిషి ఫోటో ఇందాకే పేపర్లో చూశాను’’ అన్నాడు ముసలాయన. నిమిషాల మీద అతడు చెప్పిన పేపర్ తెప్పించారు. ఆ ముసలాయన! ఆ రోజు తను చూసిన మనిషి ఇతనేనంటూ ఓ వ్యక్తి ఫోటో చూపించాడు. ఆ ఫోటో చూడగానే అంజన్, వీరభద్రాల కళ్లు పెద్దవయ్యాయి. అతడు అనురాగ్ మిత్రుడు, ప్రముఖ క్యారక్టర్ ఆర్టిస్ట్ రవీంద్ర. బిచ్చగాడు ఇచ్చిన సమాచారంతో సినిమా షూటింగ్ కోసం దుబాయ్ వెళుతున్న రవీంద్రను ఎయిర్‌పోర్టులోనే అదుపులోకి తీసుకున్నారు.ఇంటరాగేషన్ సెల్‌లోని కుర్చీలో కూర్చుని ఉన్నాడు రవీంద్ర. అతడి ముందు నిలబడి ఉన్న అంజన్! రవీంద్ర ఎడమ చేతి బొటనవేలికి కట్టి ఉన్న బ్యాండేజీని చూస్తూ ‘‘ఆ వేలికి ఏమైంది?’’ అని ప్రశ్నించాడు. ‘‘నెల రోజుల క్రితం షూటింగ్లో ప్రమాదం జరిగి, వేలు బాగా చితికిపోయింది. అందుకే ఇది’’ వేలు పైకి చూపిస్తూ సమాధానమిచ్చాడు రవీంద్ర. అంజన్! నిశిత ప్రస్తావన తేగానే అప్పటి వరకు మామూలుగా ఉన్న అతను కంగారుపడ్డాడు. మెల్లగా చెమటలు పట్టడం ప్రారంభమైంది. మొదట నిశిత తనకు అనురాగ్ భార్యగానే పరిచయమన్నాడు. ఆమెను ఎప్పుడూ పర్సనల్‌గా కలవలేదని, అలాంటిది ఆమెను చంపాల్సిన అవసరం తనకు ఏముంటుందని ఎదురు ప్రశ్నించాడు. గట్టిగా నాలుగు తగిలించేసరికి అసలు ఏం జరిగిందో చెప్పటం ప్రారంభించాడు. ‘‘చాలా రోజులుగా నాకు నిశిత మీద కన్నుంది. ఎలాగైనా ఆమెను నాదాన్ని చేసుకోవాలనుకున్నాను. అందుకే అనురాగ్ ఇంట్లోలేని సమయంలో ఆమె దగ్గరకు వెళ్లేవాణ్ని. ఆమెను మంచి చేసుకోవటానికి శతవిధాలా ప్రయత్నించేవాణ్ని. ఆ రోజు మధ్యాహ్నం కూడా అక్కడికి వెళ్లాను. అప్పటికే ఆమె చనిపోయి ఉంది. నాకు భయం వేసింది! హత్యానేరం నామీద కొస్తుందని భావించి వెంటనే అక్కడి నుంచి వచ్చేశాను’’ అన్నాడు రవీంద్ర. కొద్దిసేపటి తర్వాత ఇంటరాగేషన్ సెల్‌లోకి వచ్చిన వీరభద్రం! రవీంద్ర వేలి ముద్రలు హంతకుడి వేలిముద్రలతో మ్యాచ్ అవ్వలేదని అంజన్‌తో చెప్పాడు. ఆ వార్త వినగానే అంజన్ దిమ్మ తిరిగిపోయింది. కేసును ఎలా దర్యాప్తు చేయాలో అర్థంకాక తల పట్టుకున్నాడు. ఓ రోజు సాయంత్రం అంజన్ స్టేషన్లో ఉన్న సమయంలో అనురాగ్ అక్కడికి వచ్చాడు. అతడు నిన్న ఉదయమే బెయిల్ మీద రిలీజ్ అయ్యాడు. మళ్లీ పోలీస్ స్టేషన్ వైపు ఎందుకొస్తున్నాడా అని అంజన్ ఆలోచనల్లో పడ్డాడు. పెరట్లో మొక్కలకు నీళ్లు పోస్తున్న సమయంలో తనకు పొదల మధ్య ఓ వస్తువు దొరికిందని, అది తప్పకుండా హంతకుడిదే అయ్యుంటుందని, తన భార్యను హత్య చేసిన వాణ్ని ఎలాగైనా పట్టుకోండని చెప్పి, ఓ కవర్ అంజన్ చేతిలోపెట్టి వెళ్లిపోయాడతను. అనురాగ్ ఉద్దేశంలో హంతకుడిని పట్టుకోవటం అంటే భార్యకు అక్రమ సంబంధం ఉందని నిరూపించటం. ఇన్డైరక్టుగా నిశితను అతడు చంపాలనుకోవటం తప్పుకాదని చెప్పటం. అనురాగ్ ఇచ్చిన కవర్లో ఓ కీచైన్ ఉంది. దానికి బైక్ తాళం చెవి బిగించి ఉంది. ఆ కీచైన్‌కు ఉన్న పొడవాటి ప్లాస్టిక్ దబ్బపై ఓ వైపు లవ్ యూ గీత అని, మరో వైపు ఓ ఫోన్ నంబర్ అచ్చువేసి ఉంది. ఫోన్ నంబర్ ఆధారంగా అడ్రస్ సేకరించి, వీరభద్రాన్ని వెంటబెట్టుకుని అక్కడికి బయలుదేరాడు అంజన్. అడ్రస్‌లో ఉన్న ఇంటి వద్దకు చేరుకున్నారిద్దరూ. ఇంటికి తాళం వేసి ఉండటంతో ఇంటికి ఎదురుగా కొద్ది దూరంలో నిల్చున్నారు. కొద్దిసేపటి తర్వాత ఓ కుర్రాడు ఆ ఇంటి దగ్గరకు వచ్చాడు. పోలీస్ డ్రస్‌లో ఉన్న ఇద్దరినీ చూసి, పరుగు లంకించుకున్నాడు. ఆ కుర్రాడిని వెంబడించి పట్టుకోవటానికి అంజన్, వీరభద్రాలకు తల ప్రాణం తోకలోకి వచ్చింది. అప్పటికే సగం బిక్కచచ్చిపోయి ఉన్న ఆ కుర్రాడు! అంజన్ గట్టిగా గదమాయించేసరికి ఏడ్చుకుంటూ ‘‘సార్! నాపేరు ప్రేమ్‌సాగర్. బీటేక్ ఫైనలియర్ చదువుతున్నాను. అవసరాల కోసం చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటాను. కొన్ని రోజులు ఆ ఇంటి ముందు రెక్కీ నిర్వహించాక, ఇంట్లో ఎవరూ లేరని తెలిసి, ఆ రోజు మధ్యాహ్నం దొంగతనానికి వెళ్లాను. బెడ్రూమ్లోని బీరువాను ఓపెన్ చేస్తుండగా చప్పుడై పక్కనే ఉన్న బాత్రూంలో దాక్కున్నాను. తలుపు సందులోనుంచి బయట ఏం జరగుతుందో చూస్తుండగా.. ఓ ఆడమనిషి లోపలికి వచ్చింది! ఆ వెంటనే ఓ మగమనిషి వచ్చి, ఆమె గొంతు నులిమి చంపేశాడు. ఆ మగమనిషి వెళ్లిపోగానే నేను పారిపోయి వచ్చేశాను’’ చెప్పాడతను. ‘‘అతను ఎలా ఉంటాడో కొంచెం చెప్పగలవా?’’ ఆ కుర్రాడిని అడిగాడు అంజన్ ‘‘సార్! అతడి ఎడమ చేతి బొటన వేలు సగం కట్అయి ఉంది... ఆ!! అతడి ముఖంపై చింత పిక్కంత పుట్టుమచ్చ ఉంది సార్!’’ ‘‘చింతపిక్కంత పుట్టుమచ్చా!!’’ అంజన్ భృకుటి ముడిపడింది. హత్య జరిగిన 30వ రోజు అర్ధరాత్రి పోలీసు జీపు ఓ ఇంటి ముందు ఆగింది. అంజన్, వీరభద్రం, ఆ కుర్రాడు గేటు తీసుకుని ఇంట్లోకి నడిచారు. ఇంటి తలుపు తట్టగానే బయటకు వచ్చిన అతను! వాళ్ల వైపు ఆశ్చర్యంగా చూస్తూ ‘‘ఏంటి సార్! మళ్లీ వచ్చారు. నా మీద అనుమానం వచ్చిందా ఏంటి?’’ అన్నాడు నవ్వుతూ. అతడిని చూడగానే ఆ కుర్రాడు ‘‘ఆ!! ఈయనే సార్! ఆమె గొంతు నులిమి చంపింది. ఈయనే!’’ అన్నాడు అరుస్తూ. ‘‘చెప్పు సంజయ్! నిశితను ఎందుకు హత్య చేశావ్? తప్పించుకోవాలని చూడకు. నువ్వు హత్యచేయటం ఈ కుర్రాడు కళ్లారా చూశాడు. చేసిన నేరం మర్యాదగా ఒప్పుకుంటే మంచిది! దెబ్బలైనా తప్పుతాయ్’’ బూతులు తిడుతూ ఊగిపోయాడు అంజన్. ‘‘అవును నిశితను నేనే చంపాను. డబ్బుకోసమే నేను తనను ప్రేమించాను. కోట్ల ఆస్తి నా సొంతం అవుతుందని కలలు కన్నాను. మా పెళ్లికి వాళ్ల పెద్దవాళ్లు ఒప్పుకోలేదు! లేచిపోయి పెళ్లిచేసుకుందాం అన్నాను. తను ఒప్పుకోలేదు. కన్నవాళ్లను కష్టపెట్టలేనని ఓ డైలాగ్ చెప్పి, వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వెళ్లిపోయింది. తర్వాత నా ఫోనుక్కూడా దొరకలేదు. ఆ రోజు మధ్యాహ్నం రెస్టారెంట్‌కు వెళుతున్న దారిలో తను రోడ్డుపై కనిపించింది. నిశితను చూడగానే నాలో నిద్రపోతున్న రాక్షసుడు మేల్కొన్నాడు. నేనే తన దగ్గరకు వెళ్లి పలకరించాను. ఇద్దరం కొద్దిసేపు అలా రోడ్డుపై నడుస్తూ మాట్లాడుకున్నాం. మా ప్రేమ సంగతులేవీ గుర్తులేనట్లు మాట్లాడింది. నా కోపం రెట్టింపైంది. నన్ను తన ఇంటికి తీసుకెళ్లేలా కన్విన్స్ చేసి, ఇంట్లోకి వెళ్లాక గొంతునులిమి చంపేశాను’’ అంజన్ ఆవేశాన్ని గుర్తించిన సంజయ్ నిజం చెప్పక తప్పలేదు. ‘‘మరి ఆ బొటనవేలు సంగతి’’ అడిగాడు వీరభద్రం. బొటనవేలు తీసి, వీరభద్రం చేతిలో పడేస్తూ ‘‘ప్రాస్థటిక్ ఫింగర్.. హత్య చేసిన తర్వాత కొన్నా’’ చెప్పాడు సంజయ్. ♦ బండారు వెంకటేశ్వర్లు(వెబ్ డెస్క్)