ప్రధాన నిందితుడు వినీత్ (ఫైల్)
సాక్షి, సిటీబ్యూరో: ఓ వ్యాపారవేత్త కూతురి నగ్న చిత్రాలు తన ఉన్నాయని, అవి బయటపెట్టకుండా ఉండాలంటే రూ.5 కోట్లు డిమాండ్ చేసిన ఈవెంట్ మేనేజర్ వినీత్.. పోలీసుల విచారణలో ఆసక్తికరమైన అంశాలు బయటపెట్టాడు. గతంలో ఎలాంటి కేసులు లేకున్నా అతడు నేరం చేసిన తీరు పోలీసులనే ఆశ్చర్య పరుస్తోంది. ఓ ఛానల్‌లో వచ్చే ‘క్రైమ్ పెట్రోల్’ కథనాలు క్రమం తప్పకుండా చూస్తానని, అవిచ్చిన స్ఫూర్తితోనే బెదిరింపు దందాకు దిగి, పథకాన్ని అమలు చేశానని చెప్పుకొచ్చాడు. ఈ కేసులో మొత్తం ముగ్గురు నిందితుల అరెస్టు క్రైమ్ థ్రిల్లర్‌ను తలపించేలా సాగింది. వీరిని పట్టుకోవడంలో సైబర్ క్రైమ్ ఎస్సై యు.మదన్ కీలకపాత్ర పోషించారు.
జల్సాల కోసం అప్పులు చేసి..
కామారెడ్డి ప్రాంతానికి చెందిన వినీత్ బంజారాహిల్స్‌లోని ఓ ఈవెంట్ మేనేజ్‌మెంట్ శిక్షణ సంస్థలో శిక్షణ పొందాడు. ఆపై జూబ్లీహిల్స్‌లో ఎం3 ఈవెంట్స్ పేరుతో సొంతంగా సంస్థను ఏర్పాటు చేశాడు. దిల్‌సుఖ్‌నగర్‌లో నివసించే ఇతగాడికి స్నేహితులు చాలా మందే ఉన్నారు. గొప్పలకు పోయిన వినీత్ నిత్యం వారితో కలిసి జల్సాలు, విందు వినోదాలకు భారీగా ఖర్చు చేసేవాడు. ఈవెంట్ మేనేజ్‌మెంట్ ద్వారా వచ్చే మొత్తం ఈ ఖర్చులకు చాలకపోవడంతో దాదాపు రూ.25 లక్షల వరకు అప్పులు చేశాడు. ఓపక్క వ్యాపారం తగ్గడంతో పాటు మరోపక్క అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరిగిపోవడంతో వీటి నుంచి బయటపడటానికి మార్గాలు అన్వేషించాడు.
‘కిడ్నాప్ కథనాలు’ చూసి ప్లాన్..
నిందితుడు వినీత్ ఓ జాతీయ ఛానల్‌లో వచ్చే క్రైమ్ పెట్రోల్‌ను క్రమం తప్పకుండా చూస్తుంటాడు. పోలీసులకు చిక్కకుండా బాధితుల నుంచి డబ్బు తీసుకోవడం కోసం దీన్ని ఫాలో అయ్యాడు. ఈ క్రమంలో ధనవంతురాలైన తన స్నేహితురాలి ఫొటోలు మార్ఫింగ్ చేసి.. నగ్న చిత్రాలు ఉన్నాయంటూ వాట్సప్‌లో పంపాడు. అవి బయటపకుండా ఉండాలంటే రూ.5 కోట్లు ఇవ్వాలంటూ ఆమె తండ్రిని బెదిరించాడు. ఆయన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు నిందితుడిని ట్రాప్ చేయాలని నిర్ణయించుకున్నారు. బాధితురాలి తండ్రితో రూ.20 లక్షలకు బేరం సెట్ చేయించి డబ్బు ఎక్కడకు తీసుకురావాలని అడిగించారు. దీంతో శుక్రవారం çకొంపల్లి ప్రాంతానికి రమ్మని చెప్పిన అతగాడు.. డబ్బు తీసుకోవడం కోసం తన స్నేహితులైన గణేష్, మహేష్‌ను రంగంలోకి దింపాడు.
సుచిత్ర వద్ద చిక్కిన ఇద్దరు..
సీరియల్‌లో కిడ్నాపర్లు బాధితుని తరఫు వారి నుంచి డబ్బు తీసుకోవడానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో గమనించాడు. తన స్నేహితులు ఇద్దరినీ ఓ బైక్‌పై ఆ ప్రాంతంలో సిద్ధంగా ఉంచిన ఇతగాడు మాత్రం తూప్రాన్‌లో తిష్టవేశాడు. క్షణక్షణం ఫోన్ చేస్తూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తూ వచ్చాడు. డబ్బు బ్యాగ్ తీసుకుని వెళ్తున్న బాధితురాలి తండ్రి కారు డిక్కీలో దాక్కున్న ఎస్సై యు.మదన్ కొంపల్లిలో వారిని పట్టుకోవాలని భావించారు. అయితే నేరుగా రాని ఆ ఇద్దరూ కారును వివిధ ప్రాంతాల్లో తిప్పి సుచిత్ర వద్ద హైవే మీదికి ఎక్కించారు. దీంతో చాకచక్యంగా కారు దిగిన మదన్.. డబ్బు తీసుకోవడానికి వచ్చిన గణేష్, మహేష్‌ను పట్టుకున్నారు. ‘స్పాట్ ఇంటరాగేషన్’ ఫలితంగా తమ వెనుక వినీత్ ఉన్నాడంటూ బయటపెట్టారు.
చిన్న మాటనూ పక్కాగా పట్టేసి..
వీరితోనే ఫోన్ చేయించి వినీత్‌ను రప్పించడం ద్వారా పట్టుకోవాలని భావించారు. ఈలోపు వినీత్ నుంచే గణేష్‌కు ఫోన్ కావడంతో మాట్లాడించారు. అతడి ఫోన్ లిఫ్ట్ చేసిన ప్రతిసారీ ‘మచ్చ’ అంటూ సంబోధించే గణేష్.. కంగారులో ‘అన్న’ అంటూ విషయం చెప్పాడు. ఈ మాటను పట్టేసిన వినీత్ అలా ఎందుకు పిలిచావని, పోలీసులకు చిక్కావా? అంటూ ప్రశ్నించాడు. అలాంటిదేమీ లేదంటూ పోలీసులు చెప్పించినప్పటికీ నమ్మని వినీత్.. డబ్బు తీసుకుని రామాయంపేట వైపు రమ్మన్నాడు. దీంతో అతడితో కలిసి ఎస్సై మదన్ ద్విచక్ర వాహనంపై అతడు చెప్పిన ప్రాంతాలకు వెళ్తూనే ఉన్నాడు. ఫోన్‌కాల్స్‌లోని అంశాలనూ నిశితంగా పరిశీలించిన వినీత్ ఓ సందర్భంలో వాహనంపై ప్రయాణిస్తుంటే గాలి శబ్ధం ఎందుకు రావట్లేదంటూ ప్రశ్నించాడు. ఆపై గణేష్‌తో ప్రతి కాల్‌నూ వాహనంపై వెళ్తూనే పోలీసులు మాట్లాడించారు. ఇలా 70 కి.మీ ప్రయాణం సాగింది.
దాబా వద్ద యాక్షన్ సినిమా
గణేష్, మహేష్‌ను డబ్బు తీసుకుని రామాయంపేట చౌరస్తాలో ఉన్న దాబా వద్దకు రమ్మని వినీత్ చెప్పాడు. నిందితులతో అక్కడి వెళ్లిన పోలీసులు.. దాబాలో భోజనం చేస్తున్నామని ప్రధాన నిందితుడికి చెప్పించారు. వినీత్ తెలివితేటల్ని అంచనా వేసిన ఎస్సై మదన్ నిందితులను ఓ చోట కూర్చోబెట్టి, తన టీమ్‌తో మరోచోట కూర్చున్నారు. రోడ్డు అవతలి వైపు ఉన్న పొదల్లో నక్కిన వినీత్.. దాబా వద్ద సీన్‌ను గమనించాడు. ఆపై గణేష్ ఒక్కడినే బయటకు రమ్మని అతడి వద్దనున్న డబ్బు ప్యాకెట్ తీసుకుని పారియాడు. ఈలోపు స్థానికుడైన ఓ యువకుడి సహాయం తీసుకున్న ఎస్సై మదన్ అతడి బైక్‌పై వినీత్‌ను వెంబడించి పట్టుకున్నారు. ఇతడి వ్యవహారశైలిని చూసి గతంలోనూ ఎన్నో నేరాలు చేసిన ఘరానా నేరగాడిగా సైబర్ క్రైమ్ పోలీసుల అనుమానించినా.. విచారణలో ‘క్రైమ్ పెట్రోల్’ విషయం తెలుసుకుని అవాక్కయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment