
రాజేంద్రనగర్: దౌర్జన్యంగా డబ్బులు లాక్కోవడమేగాక తన డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగినందుకు ఓ వ్యక్తి దినసరి కూలీపై డ్రైనేజీ పై కప్పుతో దాడి చేసి హత్య చేసిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ మామిడి కిషోర్‌కుమార్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బుద్వేల్ ప్రాంతానికి చెందిన సాయికుమార్(35) దినసరి కూలీగా పని చేసేవాడు.
ఆదివారం అదే ప్రాంతంలో కూలీ పనులు పూర్తి చేసుకుని యజమాని వద్ద డబ్బులు తీసుకుని ఇంటికి బయలుదేరాడు. మార్గమధ్యలో అతను బుద్వేల్ కల్లు కంపౌండ్‌లో కల్లు తాగిన అనంతరం తన వద్ద ఉన్న డబ్బులను తీసి లెక్కిస్తున్నాడు. అదే సమయంలో కల్లు కంపౌండ్ నుంచి బయటికి వచ్చిన బుద్వేల్‌కు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి సాయికుమార్ నుంచి రూ.500 బలవంతంగా లాక్కున్నాడు. దీంతో సాయికుమార్ తన డబ్బులు తిరిగి ఇవ్వాలని శ్రీనివాస్‌ను కోరాడు. అయితే అతను డబ్బులు ఇవ్వకుండా వెళ్లిపోతుండటంతో ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
దీంతో సాయికుమార్ శ్రీనివాస్‌ను తోసివేయడంతో కింద పడిన అతను పక్కనే ఉన్న డ్రైనేజీ పై కప్పు మూతను తీసి సాయికుమార్ తలపై మోదడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న రాజేంద్రనగర్ పోలీసులు కొన ఊపిరితో ఉన్న సాయికుమార్‌ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.