Hyderabad Formar IAS Officer Steal Rs 13 Lakh Case - Sakshi
Sakshi News home page

వీడు మహా కేటుగాడు.. అసలు పేరేంటో కూడా తెలీదు..

Published Wed, Jul 14 2021 7:34 AM | Last Updated on Wed, Jul 14 2021 3:18 PM

HYD: Former IAS Officer Worker Steal Rs 13 lakh Case Updates - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరానికి చెందిన ఓ మాజీ ఐఏఎస్‌ అధికారి ఇంట్లో పని చేస్తూ ఆయన సిమ్‌కార్డు కాజేసి, బ్యాంకు ఖాతా నుంచి రూ.13 లక్షలు కాజేసిన కేటుగాడు ప్రస్తుతం నేపాల్‌లో ఉన్నట్లు సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అనుమానిస్తున్నారు. బోగస్‌ ఆధార్‌ కార్డుతో పనిలో చేరిన ఇతగాడు సదరు మాజీ అధికారి అనుమతి లేకుండా ఆయన ఇంటి చిరుమానాతో ఇంకో ఆధార్‌ కార్డు దరఖాస్తు చేసుకున్నట్లు తేలింది. గతంలో మరో ప్రముఖుడి ఇంట్లోనూ ఇతడు పని చేసినట్లు ఆధారాలు సేకరించారు. ఈ మాయగాడి వలలో పడి మోసపోయిన వారి సంఖ్య భారీగా ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు.

ఈ మోసగాడి అసలు పేరు ఏమిటనేది ఎవరికీ తెలియట్లేదు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా డోన్‌ నుంచి పొందినట్లు ఉన్న ఆధార్‌ కార్డును వినియోగించి ఇతగాడు ఓ కన్సల్టెన్సీ ద్వారా నగరంలో ఉద్యోగాల్లో చేరాడు. అందులో ఇతడి పేరు సురేందర్‌రావుగా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. సురేందర్‌రావుకు ఉద్యోగం ఇప్పించిన కన్సల్టెన్సీలోనూ పోలీసులు ఆరా తీశారు. ఈ నేపథ్యంలోనే అతడు మాజీ ఐఏఎస్‌ ఇంట్లో సహాయకుడిగా ఉద్యోగంలో చేరడానికి ముందు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఓ ప్రముఖ నాయకుడి వద్ద దాదాపు రెండు నెలల పాటు పని చేసినట్లు వెలుగులోకి వచ్చింది. మాజీ ఐఏఎస్‌ వద్ద పని చేస్తున్నప్పుడే ఆయన కొంత కాలంగా వినియోగించని సిమ్‌కార్డు తస్కరించిన అతగాడు తన ఫోన్‌లో వేసుకున్నాడు.

దాని ఆధారంగా కొన్ని యూపీఐ యాప్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని యాక్టివేట్‌ చేసుకున్నాడు. వీటి ఆధారంగా దఫదఫాలుగా మొత్తం రూ. 13 లక్షలు కాజేశాడు. దాదాపు ఆరు నెలల పాటు ఈ మాజీ అధికారి వద్ద పని చేసిన సురేందర్‌రావు ఆయన ఇంటి చిరునామాతో, తన పేరిట కొత్తగా ఆధార్‌ కార్డుకు దరఖాస్తు చేసుకున్నాడు. డబ్బు కాజేసిన తర్వాత తన తల్లిదండ్రులకు కరోనా వచ్చిందంటూ చెప్పి పని మానేశాడు. అతగాడు పరారైన తర్వాతే డబ్బు పోయిన విషయం యజమాని గుర్తించారు. సురేందర్‌రావుగా చెప్పుకొన్న అతడు తెలుగు, హిందీ మాట్లాడే వాడని బాధిత కుటుంబం చెబుతోంది.

అతడు కొత్తగా దరఖాస్తు చేసుకున్న ఆధార్‌ కార్డు ఇటీవలే పోస్టులో మాజీ అధికారి ఇంటికి వచ్చింది. ఈ విషయాన్ని వాళ్లు సైబర్‌ క్రైమ్‌ పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు. సురేందర్‌ రావు కాల్‌ లిస్ట్‌ను పరిశీలించిన పోలీసులు తరచుగా బిహార్‌కు చెందిన తన ప్రియురాలితో మాట్లాడినట్లు గుర్తించారు. కర్నూలు, హైదరాబాద్‌ల్లో ఉన్న వారితో చాలా తక్కువగా సంభాషించినట్లు తేల్చారు. అతడు కన్సల్టెన్సీలో ఇచ్చిన ఆధార్‌ కార్డులోని చిరునామా బోగస్‌దిగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఈ నేరగాడితో పాటు బిహార్‌కు చెందిన అతడి ప్రియురాలు కూడా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. సాంకేతిక ఆధారాలను బట్టి వాళ్లు ప్రస్తుతం నేపాల్‌లో ఉన్నట్లు పోలీసుల భావిస్తున్నారు. ఇతగాడు గతంలో చేసిన నేరాలపై కూడా దృష్టి పెట్టిన అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement