సాక్షి, హిమాయత్‌నగర్: కలిసి ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో ఉంచి వివాహితను వేధిస్తున్న ఓ వ్యక్తిపై సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల సమాచారం మేరకు ఖైరతాబాద్‌కు చెందిన దంపతులు గొడవల కారణంగా కోర్టు అనుమతితో వేర్వేరుగా ఉంటున్నారు. ఒంటరిగా ఉంటున్న వివాహితకు సోషల్ మీడియా వేదికగా పంజాబ్‌లోని లుథియానాకు చెందిన 40 ఏళ్ల వ్యక్తితో పరిచయం ఏర్పడింది. నెలకు రూ. 2 లక్షల సంపాదన అని, బాగా చూసుకుంటానంటూ వివాహితను నమ్మించాడు. దీంతో వివాహిత అనుమతితో నగరానికి వచ్చిన అతగాడితో ఇద్దరూ కలసి కొంతకాలం సాన్నిహిత్యంగా తిరిగారు.
ఫొటోలు, వీడియోలు కూడా తీసుకున్నారు. ఈ క్రమంలో తనకు కొన్ని అవసరాలు ఉన్నాయంటూ వివాహిత నుంచి రూ. 80 వేలు డబ్బు కూడా తీసుకున్నాడు. ఇతడిని వివాహం చేసుకోవాలనే ఆలోచనతో వివాహిత లూధియానాలోని ఇంటికి వెళ్లింది. వ్యక్తి తండ్రి బీఎస్‌ఎన్‌ఎల్ రిటైర్డ్ ఉద్యోగి, తండ్రికి వస్తున్న పింఛన్‌తోనే కుటుంబ పోషణ నడుస్తుంది. ఒకరిని హత్య చేసి పదేళ్లు జైలులో ఉండి ఇటీవలే విడుదలై వచ్చాడని, మా వాడికి నువ్వంటే ఇష్టమని, నువ్వు పోషించుకునేట్టు అయితే ఇద్దరూ పెళ్లి చేసుకోమనే సమాధానం తల్లిదండ్రులను నుంచి వచ్చింది.
దీంతో షాక్‌కు గురైన మహిళ అతగాడిని దూరం పెట్టింది. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని అతగాడు ఇద్దరూ కలసి ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. బాధితురాలు బుధవారం సిటీ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment