కన్నీటి ధార | Six Persons including Four Children Die in Hyderabad | Sakshi
Sakshi News home page

కన్నీటి ధార

Oct 14 2023 4:01 AM | Updated on Oct 14 2023 6:34 AM

Six Persons including Four Children Die in Hyderabad - Sakshi

నగరంలో రెండు ఉదంతాల్లో ఆరుగురి మృతి : సంతానాన్ని అల్లారుముద్దుగా పెంచుకుంటూ.. వారే తమ లోకంగా బతుకుతున్న కన్నవారు కడుపుకోతకు ఒడిగట్టారు. చంటిపాపల కంటిరెప్పలను శాశ్వతంగా మూసేశారు. పేగు బంధాన్ని తుంచేసుకున్నారు. కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు ఆరుగురి ప్రాణాలను బలిగొన్నాయి. నగరంలో శుక్రవారం చోటుచేసున్న రెండు వేర్వేరు ఉదంతాల్లో నలుగురు చిన్నారులు సహా ఓ తల్లి, ఓ తండ్రి అసువులు బాయడం తీవ్ర విషాదాన్ని నింపింది.

రహమత్‌ నగర్‌ పరిధి బోరబండలో ఓ తల్లి తన ఇద్దరు కుమారులకు విషమిచ్చి.. ఆ తర్వాత తాను ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇద్దరు పిల్లలు, భార్య చనిపోవడంతో ఇంటిపెద్ద ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కంటోన్మెంట్‌ పరిధిలోని ఓల్డ్‌ బోయిన్‌పల్లిలో ఓ తండ్రి తన ఇద్దరు కూతుళ్లకు నిద్రమాత్రలు ఇచ్చి.. తాను విషం తాగి బలవన్మరణానికి ఒడిగట్టాడు. ఒకేరోజు ఆరుగురు వ్యక్తులు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది.    – రహమత్‌నగర్‌/కంటోన్మెంట్‌ 

ఆమె ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. కష్ట పడి చదివి ఉద్యోగం సాధించారు. పెద్దలు కుదిర్చిన మేనరికం పెళ్లి చేసుకుంది. సొంత మేనబావనే మనువాడింది. వారికి ఇద్దరు మగ పిల్లలు. మేనరికం కారణంగా ఒక బాబుకు బుద్ధిమాంద్యం, మరోబాబుకు అంగవైకల్యం ఏర్పడింది. తమ పిల్లల దీనస్థితి చూసి చలించిపోయేవారు. మేనరికం మూలంగా జరిగిన అనర్థం తలుచుకుంటూ దిగులు చెందేవారు.

ఈ క్రమంలోనే ఇటీవల ఇంట్లో గొడవ జరగడం ఆమెను మరింత కలచి వేసింది. తాను మరణిస్తే.. తమ పిల్లలు దిక్కులేని వారవుతారని భావించి.. పిల్లలను ముందు చంపి.. ఆ తర్వాత తానూ తనువు చాలించిన విషాద ఘటన రహమత్‌ నగర్‌ పరిధిలోని బోరబండ డివిజన్‌ రాజ్‌నగర్‌లో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది.నాగర్‌కర్నూల్‌ జిల్లా పెద్దూరుకు చెందిన జ్యోతికి ఆరున్నరేళ్ల క్రితం నగరంలోని బోరబండ డివిజన్‌ రాజ్‌నగర్‌కు చెందిన ఆమె మేనబావ విజయ్‌ (కాంట్రాక్టర్‌)తో వివాహమైంది. కాగా.. జ్యోతి (34) బంజారాహిల్స్‌ ఎంబీటీనగర్‌ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు అర్జున్‌ (4), ఆదిత్య (2) ఉన్నారు.  

మేనరికపు వివాహం..పిల్లలకు బుద్ధిమాంద్యం.. 
మేనరికపు పెళ్లి కారణంగా పెద్దబ్బాయికి బుద్ధిమాంద్యం, చిన్న అబ్బాయికి అంగవైకల్యం ఏర్పడింది. వీరికి చికిత్స సైతం అందిస్తున్నారు. మేనరికం మూలంగా తమ పిల్లలు ఇలా అనారోగ్యం బారిన పడటం జ్యోతిని మానసిక క్షోభకు గురిచేసేది. ఈ క్రమంలోనే మూడు రోజుల క్రితం జ్యోతితో ఆమె మామ గొడవకు దిగాడు. ఈ ఘటన ఆమెను మరింత కలచి వేసింది.

ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో అప్పటికే ఇంట్లో ఉంచిన విషాన్ని పిల్లలకు పాలల్లో తాగించి.. తాను కిటికీకి ఉరి వేసుకుంది. అప్పటికే జ్యోతి మృతి చెందగా, ఇరుపొరుగు వారు పిల్లలను స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. భార్య, ఇద్దరు కుమారులు చనిపోవడంతో జ్యోతి భర్త ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. అతని పరిస్థితి విషమంగా ఉందని కుటుంబ సభ్యులు చెప్పారు. ఒకే కుటుంబంలో ముగ్గురు బలవర్మణం చెందడంతో బస్తీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఇన్‌స్పెక్టర్‌ కామల్ల రవికుమార్‌ పేర్కొన్నారు.  

స్రవంతి, శ్రావ్య మృతదేహాలు 
కంటోన్మెంట్‌ పరిధి ఓల్డ్‌ బోయిన్‌పల్లి భవాని నగర్‌లో ఇద్దరు కూతుళ్లకు నిద్రమాత్రలు ఇచ్చి తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రీకాంతాచారి అనే వ్యక్తికి భార్య అక్షయ, ఇద్దరు కుమార్తెలు స్రవంతి (8), శ్రావ్య (7) ఉన్నారు. సికింద్రాబాద్‌లో సిల్వర్‌ వర్క్‌ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం రాత్రి భోజనాలు చేసిన తర్వాత శ్రీకాంతా చారి, భార్య కూతుళ్లతో మేడపై ఉన్న గదిలో నిద్రపోయారు. వేకువ జామున 4 గంటల సమయంలో శ్రీకాంతా చారి తన భార్య అక్షయకు సైతం నిద్రమాత్రలు కలిపిన నీళ్లు తాగించేందుకు యత్నించాడు.

విషపు నీళ్లను తాగేందుకు ఆమె నిరాకరించింది. కానీ.. అప్పటికే ఆమె నోట్లోకి ఆ నీళ్లు చేరిన కారణంగా స్పృహ కోల్పోయింది. ఉదయం 5 గంటల సమయానికి ఆమెకు మెలకువ వచ్చి చూడగా భర్త, చిన్న కూతురు బెడ్‌పై, చిన్న కూతురు బాత్రూమ్‌లో విగత జీవులుగా పడి ఉన్నారు. వెంటనే కింది పోర్షన్‌లో ఉండే అత్త, ఆడపడుచులను నిద్ర లేపి విషయం తెలిపింది. వారంతా పైకి వెళ్లి చూసే సరికే ముగ్గురూ పడిపోయి ఉన్నారు. పోలీసులకు సమాచారం అందడంతో ఘటనా స్థలికి వెళ్లి పంచనామా నిర్వహించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

ఆర్థిక ఇబ్బందులే కారణమా? 
సిల్వర్‌ వర్క్‌ చేస్తూ జీవనం సాగించే శ్రీకాంతా చారికి ఇటీవల బిజినెస్‌ సరిగా నడవడం లేదని తెలుస్తోంది. ఇదే విషయమై తరచూ బాధపడుతూ ఉండేవాడని మృతుడి భార్య, తల్లి జయమ్మ తెలిపారు. భార్యాభర్తల మధ్య కూడా ఎలాంటి వివాదాలు లేవని తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆయన మృతి చెందినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఇద్దరు కూతుళ్లు, తండ్రి మృతదేహాలను చూసిన స్థానికులు సైతం కన్నీటిపర్యంతమయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement