Six members died
-
కన్నీటి ధార
నగరంలో రెండు ఉదంతాల్లో ఆరుగురి మృతి : సంతానాన్ని అల్లారుముద్దుగా పెంచుకుంటూ.. వారే తమ లోకంగా బతుకుతున్న కన్నవారు కడుపుకోతకు ఒడిగట్టారు. చంటిపాపల కంటిరెప్పలను శాశ్వతంగా మూసేశారు. పేగు బంధాన్ని తుంచేసుకున్నారు. కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు ఆరుగురి ప్రాణాలను బలిగొన్నాయి. నగరంలో శుక్రవారం చోటుచేసున్న రెండు వేర్వేరు ఉదంతాల్లో నలుగురు చిన్నారులు సహా ఓ తల్లి, ఓ తండ్రి అసువులు బాయడం తీవ్ర విషాదాన్ని నింపింది. రహమత్ నగర్ పరిధి బోరబండలో ఓ తల్లి తన ఇద్దరు కుమారులకు విషమిచ్చి.. ఆ తర్వాత తాను ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇద్దరు పిల్లలు, భార్య చనిపోవడంతో ఇంటిపెద్ద ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కంటోన్మెంట్ పరిధిలోని ఓల్డ్ బోయిన్‌పల్లిలో ఓ తండ్రి తన ఇద్దరు కూతుళ్లకు నిద్రమాత్రలు ఇచ్చి.. తాను విషం తాగి బలవన్మరణానికి ఒడిగట్టాడు. ఒకేరోజు ఆరుగురు వ్యక్తులు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. – రహమత్‌నగర్/కంటోన్మెంట్ ఆమె ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. కష్ట పడి చదివి ఉద్యోగం సాధించారు. పెద్దలు కుదిర్చిన మేనరికం పెళ్లి చేసుకుంది. సొంత మేనబావనే మనువాడింది. వారికి ఇద్దరు మగ పిల్లలు. మేనరికం కారణంగా ఒక బాబుకు బుద్ధిమాంద్యం, మరోబాబుకు అంగవైకల్యం ఏర్పడింది. తమ పిల్లల దీనస్థితి చూసి చలించిపోయేవారు. మేనరికం మూలంగా జరిగిన అనర్థం తలుచుకుంటూ దిగులు చెందేవారు. ఈ క్రమంలోనే ఇటీవల ఇంట్లో గొడవ జరగడం ఆమెను మరింత కలచి వేసింది. తాను మరణిస్తే.. తమ పిల్లలు దిక్కులేని వారవుతారని భావించి.. పిల్లలను ముందు చంపి.. ఆ తర్వాత తానూ తనువు చాలించిన విషాద ఘటన రహమత్ నగర్ పరిధిలోని బోరబండ డివిజన్ రాజ్‌నగర్‌లో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది.నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దూరుకు చెందిన జ్యోతికి ఆరున్నరేళ్ల క్రితం నగరంలోని బోరబండ డివిజన్ రాజ్‌నగర్‌కు చెందిన ఆమె మేనబావ విజయ్ (కాంట్రాక్టర్)తో వివాహమైంది. కాగా.. జ్యోతి (34) బంజారాహిల్స్ ఎంబీటీనగర్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు అర్జున్ (4), ఆదిత్య (2) ఉన్నారు. మేనరికపు వివాహం..పిల్లలకు బుద్ధిమాంద్యం.. మేనరికపు పెళ్లి కారణంగా పెద్దబ్బాయికి బుద్ధిమాంద్యం, చిన్న అబ్బాయికి అంగవైకల్యం ఏర్పడింది. వీరికి చికిత్స సైతం అందిస్తున్నారు. మేనరికం మూలంగా తమ పిల్లలు ఇలా అనారోగ్యం బారిన పడటం జ్యోతిని మానసిక క్షోభకు గురిచేసేది. ఈ క్రమంలోనే మూడు రోజుల క్రితం జ్యోతితో ఆమె మామ గొడవకు దిగాడు. ఈ ఘటన ఆమెను మరింత కలచి వేసింది. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో అప్పటికే ఇంట్లో ఉంచిన విషాన్ని పిల్లలకు పాలల్లో తాగించి.. తాను కిటికీకి ఉరి వేసుకుంది. అప్పటికే జ్యోతి మృతి చెందగా, ఇరుపొరుగు వారు పిల్లలను స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. భార్య, ఇద్దరు కుమారులు చనిపోవడంతో జ్యోతి భర్త ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. అతని పరిస్థితి విషమంగా ఉందని కుటుంబ సభ్యులు చెప్పారు. ఒకే కుటుంబంలో ముగ్గురు బలవర్మణం చెందడంతో బస్తీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఇన్స్పెక్టర్ కామల్ల రవికుమార్ పేర్కొన్నారు. స్రవంతి, శ్రావ్య మృతదేహాలు కంటోన్మెంట్ పరిధి ఓల్డ్ బోయిన్పల్లి భవాని నగర్లో ఇద్దరు కూతుళ్లకు నిద్రమాత్రలు ఇచ్చి తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రీకాంతాచారి అనే వ్యక్తికి భార్య అక్షయ, ఇద్దరు కుమార్తెలు స్రవంతి (8), శ్రావ్య (7) ఉన్నారు. సికింద్రాబాద్‌లో సిల్వర్ వర్క్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం రాత్రి భోజనాలు చేసిన తర్వాత శ్రీకాంతా చారి, భార్య కూతుళ్లతో మేడపై ఉన్న గదిలో నిద్రపోయారు. వేకువ జామున 4 గంటల సమయంలో శ్రీకాంతా చారి తన భార్య అక్షయకు సైతం నిద్రమాత్రలు కలిపిన నీళ్లు తాగించేందుకు యత్నించాడు. విషపు నీళ్లను తాగేందుకు ఆమె నిరాకరించింది. కానీ.. అప్పటికే ఆమె నోట్లోకి ఆ నీళ్లు చేరిన కారణంగా స్పృహ కోల్పోయింది. ఉదయం 5 గంటల సమయానికి ఆమెకు మెలకువ వచ్చి చూడగా భర్త, చిన్న కూతురు బెడ్‌పై, చిన్న కూతురు బాత్రూమ్లో విగత జీవులుగా పడి ఉన్నారు. వెంటనే కింది పోర్షన్లో ఉండే అత్త, ఆడపడుచులను నిద్ర లేపి విషయం తెలిపింది. వారంతా పైకి వెళ్లి చూసే సరికే ముగ్గురూ పడిపోయి ఉన్నారు. పోలీసులకు సమాచారం అందడంతో ఘటనా స్థలికి వెళ్లి పంచనామా నిర్వహించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులే కారణమా? సిల్వర్ వర్క్ చేస్తూ జీవనం సాగించే శ్రీకాంతా చారికి ఇటీవల బిజినెస్ సరిగా నడవడం లేదని తెలుస్తోంది. ఇదే విషయమై తరచూ బాధపడుతూ ఉండేవాడని మృతుడి భార్య, తల్లి జయమ్మ తెలిపారు. భార్యాభర్తల మధ్య కూడా ఎలాంటి వివాదాలు లేవని తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆయన మృతి చెందినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఇద్దరు కూతుళ్లు, తండ్రి మృతదేహాలను చూసిన స్థానికులు సైతం కన్నీటిపర్యంతమయ్యారు. -
పిడుగుపాటు: తెలుగు రాష్ట్రాల్లో విషాదం
సాక్షి, పశ్చిమగోదావరి/జోగులాంబ/కామారెడ్డి: తెలుగు రాష్ట్ర్రాల్లో వేర్వేరు ప్రాంతాల్లో పిడుగుపాటుకు గురై ఆరుగురు మృత్యువాత పడ్డారు. దీంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది. పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలం చింతపల్లి సమీపంలోని అటవీప్రాంతంలో విద్యుత్ షాక్‌కు గురై ఇద్దరు పాస్టర్లు మృతి చెందారు. మృతులను నరసాపురానికి చెందినవారిగా గుర్తించారు. కామారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు చోట్ల పిడుగులు పడి ఇద్దరు దుర్మరణం చెందగా.. ఇద్దరు గాయపడ్డారు. పిట్లం గ్రామ శివారులో జాతీయ రహదారి విస్తరణలో విద్యుత్ స్తంభాల వద్ద పనులు చేస్తుండగా పిడుగుపాటుకు గురై ఒక వ్యక్తి మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. కామారెడ్డి మండల కేంద్రంలో పిడుగు పాటుకు గురై దేమె రవి(23) అనే వ్యక్తి దుర్మరణం చెందాడు. మృతునికి 9 నెలల కుమారుడు ఉన్నారు. వీరి కుటుంబాల్లో విషాదం నెలకొంది. తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండల పరిధిలోని ఖమ్మంపాడు గ్రామంలో పిడుగుపాటుకు గురై ఓ రైతుకు చెందిన రెండు గేదెలు మృతి చెందాయి. గొర్రెలపైకి దూసుకెళ్లిన బస్సు.. జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం వెంకటాపురం గ్రామం దగ్గర పెట్రోల్ బంకు సమీపంలో గద్వాల్ డిపో ఆర్టీసీ బస్సు గొర్రెల పైకి దూసుకెళ్లిడంతో 15 గొర్రెలు మృతిచెందాయి. విద్యుత్‌షాక్‌తో ఇద్దరు మృతి.. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం గడ్కోల్ లో విద్యుత్ కంచె తగిలి విద్యుత్ షాక్ తో ఇద్దరి మృతి చెందారు. మృతుల్లో ఒకరు రైతుకాగా, మరొకరు కూలీగా గుర్తించారు. అడవి పందుల కోసం కంచెకు రైతులు విద్యుత్ అమర్చడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. -
మృత్యు ప్రయాణం
► ఆరుగురి బతుకులను చిదిమేసిన ఆటో ►మండుటెండవేళ మృత్యుశకటమైన లారీ ►రెప్పపాటులో గాలిలో కలసిపోయిన ప్రాణాలు ►నాతవలస – విజయనగరం రహదారిలో ఘోర రోడ్డు ప్రమాదం ►ఆరుగురు మృతి– నలుగురికి తీవ్ర గాయాలు ►భయానకంగా మారిన సంఘటనా స్థలం మిట్ట మధ్యాహ్నం సరిగ్గా 1.45 అవుతోంది. ప్రచండ భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. మండుటెండలో త్వరత్వరగా ఇంటికి చేరుకుందామనుకున్న వారి ప్రాణాలు అకస్మాత్తుగా గాలిలో కలసిపోయాయి. కలకాలం జీవిద్దామని గూడు కట్టుకునే సామగ్రి కొనుగోలు కోసమని ఒకరు... అక్క పెళ్లికి చేసిన అప్పు తీరుద్దామని మరొకరు... ఉపాధినిచ్చే కంపెనీలో విధులు ముగించుకుని ఇంటికి పయనమైన మరికొందరు... వ్యవసాయం చేస్తూ బ్యాంకు పని మీద వచ్చిన ఇంకొకరు... ఇలా ఒక్కొక్కరిదీ ఒక్కో అవసరం... కానీ పొంచి ఉన్న మృత్యువుది మాత్రం ఒకే దారి. పాపం వారికి తెలియదు ఇదే తమ చివరి ప్రయాణమని. తామెక్కే ఆటోయే తమ బతుకులను చిదిమేస్తుందని. మరో పదిహేను నిమిషాల్లో గమ్యం చేరుతామని ఆటో ఎక్కిన వారంతా అర్ధంతరంగా మృత్యు పాశానికి బలయ్యారు. విజయనగరం: డెంకాడ మండలం చందకపేట సమీపంలో నాతవలస వైపు నుంచి విజయనగరానికి వస్తున్న ప్రయాణికుల ఆటోను విజయనగరం నుంచి నాతవలస వైపుగా వెళ్తున్న పశ్చిమ బెంగాల్‌కు చెందిన లారీ ఢీకొంది. మితిమీరిన వేగంతో వచ్చిన లారీదే తప్పు అని స్పష్టంగా తెలుస్తోంది. పరిమితికి మించి ప్రయాణికులతో ఎదురుగా వస్తున్న ఆటో ఎటూ తప్పించుకోలేక ప్రమాదానికి గురైంది. విజయనగరం– నాతవలస రహదారి పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇప్పుడున్న తారు రోడ్డుపై మరో లేయర్ వేస్తున్నారు. ప్రస్తుతానికి రోడ్డుపై ఒకవైపు లేయర్ వేసే పని పూర్తయ్యింది. ఈ క్రమంలో కొత్త లేయర్ ఉన్న రోడ్డుపై వెళ్లాల్సిన లారీ కింద నుంచి వెళ్లింది. రాంగ్ రూట్లోనే మితివీురిన వేగంతో లారీ డ్రైవర్ నడుపుతున్నాడు. అదే సమయంలో పరిమితికి మించిన ప్రయాణికులతో ఆటో ఎదురుగా వచ్చింది. వేగంతో వేస్తున్న లారీని తప్పించేందుకు ఆటో డ్రైవర్ అటు ఇటుగా తిప్పాడు. ఎడమవైపు వెళ్తే పక్క నున్న వాహనాలొచ్చి ఢీకొంటాయని భయంతో రోడ్డు మధ్యలో వెళ్లాడు. కానీ, లారీ డ్రైవర్ అదేమి గమనించలేదు. ఆటో డ్రైవర్ హారన్‌ను వినిపించుకోలేదు. ఆటోలో ఉన్న వారు చేతులు ఊపి సైగలు చేస్తున్నా పట్టించుకోలేదు. వేగంగా వచ్చి సరాసరి ఢీకొన్నాడు. ఆటో గాల్లోకి తేలిపోయింది. రెండు మూడు పల్టీలు కొట్టి కిందకి పడింది. ఆటోలో ఉన్న ప్రయాణికుల్లో కొందరు తుళ్లిపోయారు. నిర్జీవమై రహదారిపైనా, రహదారి పక్కనున్న తుప్పల్లో విసిరేసినట్టు పడిపోయారు. మరికొందరు తీవ్ర గాయాలతో రక్తమోడుతూ విలవిలలాడారు. మరికొన్ని మృతదేహాలు ఆటోలోనే చిక్కుకుపోయి వేలాడుతూ కనిపించాయి. అంతే ఊహించని ఈ పరిణామంతో ఆ స్ధలం బీతావహంగా మారింది. మిట్ట మధ్యాహ్నం, మండు టెండలో ప్రమాదం చోటు చేసుకోవడంతో క్షతగాత్రులను తక్షణం ఆదుకునేందుకు వీల్లేని పరిస్థితి ఏర్పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న వారు వివిధ ప్రాంతాలకు చెందిన వారు కావటంతో మృతదేహాలను గుర్తింçచటానికి కూడా చాలా సమయం పట్టింది. సంఘటనాస్థలంలోనే ఐదుగురి మృతి సంఘటనా స్థలంలోనే ఐదుగురు మృత్యువాత పడగా... ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు ప్రాణాలు కోల్పోయారు. నలుగురు ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతున్నారు. విశాఖపట్నం అక్కయ్యపాలేనికి చెందిన ఆటోడ్రైవర్ ముక్కు బంగార్రాజు పైడిభీమవరం స్టాండ్ నుంచి ఆటో నడుపుతున్నాడు. మంగళవారం మధ్యాహ్నం కొందరు ప్రయాణికులను ఎక్కించుకుని విజయనగరానికి బయలుదేరారు. అనుకోని ఈ సంఘటనలో పూసపాటి రేగ మండలం గులివిందపేటకు చెందిన గులివింద అప్పలనాయుడు(45), అదే మండలం చోడమ్మ అగ్రహారానికి చెందిన ఆవాల శంకరరావు(48), భోగాపురం మండలం మాల నందిగాంకు చెందిన మిరప గోవింద(37), రణస్థలం మండలం పాతర్లపల్లికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ నెల్లిమర్ల అప్పారావు(30), డెంకాడకు చెందిన బంగారి సూరి(34), విజయనగరం పట్టణంలోని కోరాడ వీధికి చెందిన ఆర్.రాజేష్(23) మృతి చెందారు. గాయపడిన వారిలో డెంకాడకు చెందిన బంగారి అప్పారావు, పి.శ్రీను, ఆటో డ్రైవర్ ముక్కు బంగార్రాజు, విజయనగరానికి చెందిన ఆర్.రాజశేఖర్ ఉన్నారు. ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ ఎల్.కె.వి.రంగారావు, ఆర్డీఓ శ్రీనివాసమూర్తి పరిశీలించగా, జిల్లా కేంద్రాస్పత్రిలో ఉన్న క్షతగాత్రులను, మృతుల కుటుంబీకులను కలెక్టర్ వివేక్ యాదవ్ పరామర్శించారు. కాగా, క్షతగాత్రులు చూస్తుండగానే ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్, క్లీనర్ అక్కడి నుంచి పరారయ్యారు. ఆసుపత్రిలో హాహాకారాలు డెంకాడలో జరిగిన ఘోర దుర్ఘటనలో తీవ్ర గాయాల పాలైన వారిని విజయనగరం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. అక్కడ వారికి అవసరమయిన ప్రాధమిక చికిత్స చేసి ప్రమాదకర పరిస్థితిలో ఉన్నవారిని వెంటనే కేజీహెచ్ లేదా ఇతర ఆస్పత్రులకు తరలించాలని సిబ్బంది సూచించాల్సి ఉంది. అయితే ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యుల హాహాకారాలు, ప్రమాద ఘటనలో గాయాలైనవారి అరుపులతో ఆసుపత్రి ప్రాంగణమంతా మార్మోగిపోయింది. వారికి కట్టు కట్టి ఇతర రికార్డులు రాసుకునే పనిలో సిబ్బంది నిమగ్నమయ్యారు తప్ప వారిని వెంట వెంటనే మెరుగైన వైద్యం కోసం తరలించే ప్రయత్నం చేయలేదు. తలకు తీవ్రగాయాలైన కోరాడ వీధికి చెందిన ఆర్.రాజశేఖర్(21) పెద్దగా కేకలు వేస్తూ రక్షించండి. కాపాడండి అంటూ జనరల్‌వార్డులో అరుసూ్తనే ఉన్నాడు. దాదాపు గంటకు పైగా ఆయన కేకలు వేసినా ఎవరూ పట్టించుకోలేదు. మరో క్షతగాత్రుడు పి.శ్రీనివాసరావు షాక్‌కు గురై క్షణానికోకారణం చెబుతున్నాడు. తాను సినిమాకు వెళ్లివస్తున్నాననీ, ఆస్పత్రికి వెళ్లాననీ, తనకు తానుగా పడిపోయానంటూ రోదించాడు. ఇతనికి దెబ్బ బాగా తగిలిందనీ చెప్పిన వైద్య సిబ్బంది కనీసం మెరుగయిన వైద్యం కోసం ఎక్కడికయినా తరలిద్దామన్న ప్రయత్నం చేయలేదు. -
నట్టేట ‘ముంచిన’ టీ!
ఐదుగురు చిన్నారులు, తల్లి జల సమాధి వరద నీటిలో కొట్టుకుపోయిన కుటుంబం కారులో ఆస్పత్రికి వెళుతుండగా దుర్ఘటన తడ్కల్‌లో విషాద ఘటన ఇంటికి నేనెలా వెళ్లేది: పిల్లల తండ్రి రాజు రోదన కంగ్టి: చిన్నారుల కేరింతలతో ఆ ఇల్లు ఎంతో సందడిగా ఉంది.. తల్లి వంటింట్లో పిల్లల కోసం టీ చేస్తోంది.. ఇంట్లోని ఐదుగురు చిన్నారులు ఆటపాటల్లో మునిగారు. తల్లి టీ వేడివేడిగా తీసుకువచ్చి గ్లాస్‌ల్లో పోస్తోంది.. పిల్లలంతా ఒకే చోటుకుచేరుకున్నారు.. అంతలోనే తొట్లెలో ఉన్న 13 నెలల పసికందు టీ గిన్నెపై పడటంతో శరీరం కాలింది.. తల్లి తల్లడిల్లింది.. చేసేదిలేక ఉన్న పళంగా కారులో పిల్లలందరినీ తీసుకుని ఆస్పత్రికి బయలుదేరింది.. మార్గమధ్యంలో నిజామాబాద్ జిల్లా పిట్లం మండలంలోని పిల్లివాగులో నీటి ఉధృతికి తల్లి, ఐదుగురు పిల్లలు కొట్టుకుపోయారు. తీరని శోకం మిగిలింది. కంగ్టి మండలం తడ్కల్‌కు చెందిన రాజు విద్యుత్ శాఖలో లైన్మెన్గా రేగోడ్ మండలంలో పనిచేస్తున్నారు. అతని భార్య భార్య రాజమణి(35), ఐదుగురు కూతుళ్లు ప్రియా(7) జ్యోతి(6), జ్ఞాన హంసిక (3), జ్ఞాన సమిత (3)(కవలలు), దీపాంక్ష(13 నెలలు) ఈ దుర్ఘటనలో జలసమాధి అయ్యారు. నేనవరి కోసం ఇంటికి వెళ్లాలి ‘పిల్లలను గారాబంగా పెంచుతున్నాను.. వారి కోసమే కారు తెచ్చాను .. అదే కారు పిల్లలతో పాటు భార్యను తీసుకెళ్లింది’.. అంటూ జంగం రాజు శోకం అందరిని కలిచి వేసింది. నా పిల్లలు లేని ఇంట్లోకి ఎలా వెళ్లాలంటూ రాజు రోదించసాగాడు. విద్యుత్ బకాయిల వసూళ్లకోనం తాను విధి నిర్వహణలో ఉండగా నా కుటుంబం మొత్తం వరద నీటిలో కొట్టుకుపోయినట్లు తెలిసిందని తెలిపాడు. దుర్మరణం చెందిన ప్రియ, జ్యోతి స్థానికంగా ప్రైవేటు పాఠశాలల్లో చదువుకొంటున్నారు. మిగతా ఇద్దరు కవలలు. మా పిల్లల్ని తెచ్చియ్యండి సారు బాధితులను పరామర్శించడానికి వచ్చిన జిల్లా బీసీ కార్పొరేషన్ ఈడీ, మండల ప్రత్యేకాధికారి కాళ్లపై పడి నా పిల్లల్ని తెచ్చియ్యండి సారు అంటూ రాజు వేడుకున్నాడు. అధైర్య పడవద్దని పై అధికారులకు తెలిపి అందరిని అప్రమత్తం చేయడం జరిగిందని ప్రత్యేకాధికారి వారికి తెలిపారు. ఇద్దరు పిల్లల్ని ఇంటి దగ్గరే ఉంచమన్నాను ఇద్దరు పిల్లలను ఇంట్లో ఉంచమని చెప్పాను. చావు వారిని వెంటాడి పిలిచిందని పిల్లల నాన్నమ్మ జంగం లచ్చవ్వ తల బాదుకొంటూ ఏడ్చింది. దిక్కుమాలిన వర్షాలు మా అంతం కోసమే వచ్చాయని ఏడ్వడంతో కాలనీ ప్రజలు దుఃఖంలో మునిగిపోయారు. చెల్లెలు ఓ కూతురిని దత్తత అడిగినా ఇవ్వలేదని.. ఇస్తే కనీసం ఒక్క కూతురైన బతికి ఉండేదేమోనని పలువురు మాట్లాడుకున్నారు. కాగా, డ్రైవర్ నిర్లక్ష్యమే ఆరుగురి ఉసురు తీసిందని ప్రత్యేక్షసాక్షులు తెలిపారు. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ ఉపద్రవాన్ని పట్టించుకోకుండా నడపడం వల్లే ఈ ఘోరం జరిగిందని వారు చెప్పారు. -
భానుడి ప్రతాపానికి ఆరుగురి బలి
సిద్దిపేట రూరల్/పెద్దశంకరంపేట/కల్హేర్ /రేగోడు/జోగిపేట/దౌల్తాబాద్ : జిల్లాలోని వేర్వురు ప్రాంతాల్లో వడదెబ్బకు గురై ఆరుగురు మృత్యువాత పడ్డారు. వివరాలిలా ఉన్నాయి. సిద్దిపేట మండలం గ్రామానికి చెందిన రోమాల చిన్నోళ్ల పోచయ్య (75) గురువారం ఉదయం వ్యవసాయ పొలం వద్దకు వెళ్లాడు. దీంతో ఇంటికి వచ్చి ఆయాస పడుతూ ఇబ్బందికి గురయ్యాడు. ఇది గమనించిన కుటుంబీకులు అతడిని కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పోచయ్య మృతి చెందాడు. మృతుడికి భార్య బాలవ్వ ఉంది. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని గ్రామ సర్పంచ్ కుంబాల లక్ష్మి, గ్రామస్తులు కోరారు. పెద్దశంకరంపేట మండలం టెంకటి గ్రామానికి చెందిన కమలాని అంజమ్మ (52) గురువారం సాయంత్రం తనకున్న 10 గుంటల చేనులో మక్క కొయ్యలు వేరడానికి వెళ్లి తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో కుటుంబీ కులు ఆమెను శుక్రవారం ఉదయం 108లో జోగిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం మృతి చెందింది. మృతురాలికి ఒక కుమారుడు ఉండగా.. అతను హైదరాబాద్‌లో ఆటో నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. కల్హేర్ మండలం బీబీ పేట గ్రామానికి చెందిన గుండు లచ్చవ్వ (60) గురువారం తన సొంత వ్యవసాయ పొలంలో వరి కోత పని చేసేందుకు వెళ్లింది. ఎండ తీవ్రతతో వడ దెబ్బకు గురైంది. పనులు చేసుకుని ఇంటికి వచ్చిన లచ్చవ్వ వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురైంది. కుటుంబీకులు రాత్రి స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్య చికిత్స చేయించారు. అయినా కోలుకోలేదు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం సాయం అందించాలని స్థానిక జెడ్పీటీసీ గుండు స్వప్న అధికారులను కోరారు. రేగోడు మండలం కొత్వాన్పల్లికి చెందిన అంజమ్మ (45) ఎల్లమ్మ జాతర ఉత్సవాల్లో పాల్గొని ఇంటికి వెళుతుం డగా వడదెబ్బ తగిలి స్పృహ కోల్పోయింది. అక్కడ ఉన్న వారు నీళ్లు తాగించే ప్రయత్నం చేయగా అప్పటికే అంజమ్మ మృతి చెందింది. జోగిపేట మండలం నేరడిగుంటకు చెందిన తుక్కపురం మల్లేశం (35) రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న మిషన్ కాకతీయ పనుల్లో భాగంగా సంగాయని చెరువులో ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అయితే శుక్రవారం ఉదయం నుంచి ట్రాక్టర్ ద్వారా రైతుల పొలాల్లోకి మట్టిని తరలిస్తున్నాడు. కాగా.. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో అస్వస్థతకు గురైన మల్లేశం ఒకేసారి కుప్పకూలాడు. దీంతో తోటి కూలీలు ఆటోలో అతడిని జోగిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్సలు పొందుతూ మృతి చెందాడు. మల్లేశం మృతితో గ్రామంలో విషాద చ్ఛాయలు అలుముకున్నాయి. ప్రభుత్వ పథకం పనుల్లో పాల్గొని మరణించిన మల్లేశం కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. దౌల్తాబాద్ మండలం సూరంపల్లికి చెందిన బొల్లం లక్ష్మి (45) 20 రోజులు గా గజ్వేల్ - సిద్దిపేట రహదారిలో జరుగుతున్న తారు రోడ్డు మరమ్మతుల పనికి కూలీగా వెళుతోంది. శుక్రవారం కూడా కూలీ పనికి వెళ్లింది. అయితే మధ్యాహ్నం ఎండ వేడికి తాళలేక పనిచేస్తున్న చోటే సొమ్మసిల్లి పడిపోయింది. తీటి వారు ఆమెకు సపర్యాలు చేస్తుండగానే మృతి చెందింది. కాగా మృతురాలి భర్త పోచయ్య నాలుగునెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. లక్ష్మికి నలుగురు కుమార్తెలు కాగా.. వీరిలో ముగ్గురికి పెళ్లిళ్లు కాగా.. చిన్న కుమార్తె మమత అనాథగా మారింది. -
రెప్పపాటులో నెత్తురోడిన రహదారి
►లారీ, ఆటో ఢీకొనడంతో దారుణం ►ఆరుగురు దుర్మరణం ►ముగ్గురికి గాయాలు ►ఐదు నిమిషాలైతే గమ్యానికి.. ►చెల్లాచెదురుగా మృతదేహాలు ►లారీ డ్రైవర్‌కు దేహశుద్ధి ►ఘట నా స్థలాన్ని సందర్శించిన కలెక్టర్ ►ఆసుపత్రిలో మిన్నంటిన రోదనలు ►ఒకే కుటుంబంలో ఇద్దరు మృతి రెప్పపాటులో ఘోరం జరిగిపోయింది.. మరో ఐదు నిమిషాలు గడిస్తే వారంతా క్షేమంగా గమ్యస్థానానికి చేరే వారు...ఈ లోగానే ఓ పెద్ద కుదుపు. మృత్యుశకటం రూపంలో వచ్చిన లారీ ఆటోను ఢీకొంది. క్షణాల్లో చుట్టూ చెల్లాచెదురుగా పడిన మృతదేహాలు... రక్తమోడిన రోడ్డు.. ఆరుగురు దుర్మరణం.. ముగ్గురికి గాయాలు.. అక్కడి భీతావహ దృశ్యాలు ప్రతిఒక్కరిని కంటతడిపెట్టించింది. ఆగ్రహించిన జనం లారీ డ్రైవర్‌ను చితక బాదారు. సంగారెడ్డి, క్రైం : సంగారెడ్డి మండలం కంది సమీపంలో జాతీయ రహదారిపై మంగళవారం లారీ- ఆటో ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మరణించగా మరొకరు ఆసుపత్రిలో ప్రాణాలు వదిలారు. పుల్కల్ మండలం శివ్వంపేటకు చెందిన బుర్ర నిరూప(35), బుర్ర నవీన్‌కుమార్ చనిపోయారు. వీరు స్వయాన వదిన మరిది. అశోక్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స కోసం నిరూప తన మరిది బుర్ర నవీన్‌కుమార్(28)తో కలిసి వెళ్లింది. తిరుగు ప్రయాణంలో వీరద్దరు పటాన్చెరులో స్టీరింగ్ ఆటో ఎక్కారు. సదాశివపేట మండలం సిద్దాపూర్ గ్రామానికి చెందిన (ప్రస్తుత నివాసం కవలంపేట) ప్రకాష్‌గౌడ్(28), రామచంద్రాపురం మండలం బండ్లగూడకు చెందిన రెడ్డిపల్లి యాదమ్మ(35), పటాన్చెరు పట్టణం అంబే ద్కర్ కాలనీకి చెందిన అక్కా చెల్లెళ్లు దుర్గమ్మ, సావిత్రి కూడా ఇదే ఆటోలో పయనమయ్యా రు. ఈ ఆటో సంగారెడ్డి సమీపంలోని కంది గ్రామ శివారుకు చేరుకున్న క్రమంలో వెనుక నుంచి అతివేగంగా దూసుకొచ్చిన ఓ లారీ ఆటోను ఢీకొంది. ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా ఒకరు ఆసుపత్రిలో మరణించారు. మరో ముగ్గురు గాయపడగా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బండ్లగూడకు చెందిన రెడ్డిపల్లి యాదమ్మ వద్ద సంగారెడ్డిలోని మణప్పురం గోల్డ్ లోన్‌కు సంబంధించిన పత్రాలు లభించాయి. ప్రకాష్‌కుమార్ ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుండగా కవలంపేటలో నివాసముంటున్నాడు. ప్రయాణికుల ఆగ్రహం.. ప్రమాద స్థలంలో రహదారి వెంట వె ళ్లే ప్రయాణికులు ఒక్కసారిగా ఆగ్రహానికి లోనయ్యారు. మృతదేహాలు చెల్లాచెదురుగా పడివుండటంతో వారంతా ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ కె.మురహరిని చితకబాదారు. రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని చక్కదిద్ది లారీ డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. మిన్నంటిన రోదనలు జిల్లా కేంద్ర ఆసుపత్రి వద్ద మృతులు కుటుం బీకుల రోదనలు మిన్నంటాయి. పుల్కల్ మండలం శివ్వంపేటకు చెందిన బుర్ర నిరూప, నవీన్‌కుమార్‌లు ఒకే కుటుంబానికి చెందిన వారు (వదిన, మరిది) కావడంతో గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆసుపత్రికి తరలిచ్చారు. మృతురాలు నిరూప భర్త రామలింగం సంగారెడ్డిలోని డ్వామా కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తుండటంతో సహచర ఉద్యోగులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో అక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనా స్థలాన్ని సందర్శించిన కలెక్టర్.. విషయం తెలుసుకున్న కలెక్టర్ రాహుల్ బొజ్జా ఘటనా స్థలాన్ని సందర్శించారు. ఆయనతోపాటు సంగారెడ్డి డీఎస్పీ ఎం.తిరుపతన్న, ఆర్డీఓ మధుకర్‌రెడ్డి, తహశీల్దార్ గోవర్ధన్, సీఐలు శ్యామల వెంకటేష్, ఎస్.ఆంజనేయులు కూడా అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీలో ఆరు మృతదేహాలకు బుధవారం వైద్యులు పోస్టుమార్టం నిర్వహించనున్నారు.