1999 జూలై 3 – ఆరోజు మధ్యాహ్నం వేళ. బిహార్ రాజధాని పట్నాలోని ఫ్రజేర్ రోడ్– నగరంలోని రాజకీయ ప్రముఖులు ఉండే ప్రదేశం. ఆ వీథి గల్లీల్లో పిల్లలు ఆటలాడుకుంటూ ఉన్నారు. దాగుడు మూతలు ఆడుకుంటూ ఒక చిన్నారి బుడతడు, ఒక చిన్నారి పాప వీథిలో నిలిపి ఉన్న కారు పక్కన దాగుందామని, కారు వద్దకు చేరుకున్నారు. తెరిచి ఉన్న కారు కిటికీలోంచి కనిపించిన దృశ్యం వాళ్లను భయభ్రాంతులను చేసింది. గుక్కపట్టి ఏడుస్తూ పరుగు తీశారు. దారినపోయే ఒక పెద్దమనిషి వాళ్లను ఆపి, ‘ఎందుకు ఏడుస్తున్నారు?’ అని అడిగాడు.‘మరేమో, ఆ కారులో ఒక అన్న, ఒక అక్క చచ్చిపోయి ఉన్నారు’ వెక్కిళ్లు పెడుతూ, ఆ కారుకేసి వేలితో చూపిస్తూ, బదులిచ్చాడు బుడతడు.
ఆ కారు ఎమ్మెల్యే సాధు యాదవ్ క్వార్టర్‌కు చేరువలో నిలిపి ఉంది. సాధు యాదవ్ సాక్షాత్తు బిహార్ ముఖ్యమంత్రి రబ్డీదేవి సోదరుడు, ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ బావమరిది. ఆర్జేడీ పార్టీలో పలుకుబడిగల నాయకుడు. బుడతడి సమాచారంతో ఆ పెద్దమనిషి కనిపించిన అందరికీ సంగతి చెబుతూ, దాదాపు పరుగు పెడుతున్నట్లే కారు వద్దకు చేరుకున్నాడు. కారులో ఒక యువతి, ఒక యువకుడు విగతజీవులై ఉన్నారు. యువతి శరీరంపై దుస్తులు సగం తొలగి ఉన్నాయి. కారు వద్ద గుమిగూడిన జనంలోంచి ఎవరో పోలీసులకు ఫోన్ చేశారు.
క్వార్టర్ సమీపంలో కలకలం గమనించిన ఎమ్మెల్యే అనుచరులు పోలీసుల కంటే ముందే కారు వద్దకు చేరుకున్నారు. కొద్దిసేపట్లో పోలీసులు వచ్చారు. ఆర్జేడీ కార్యకర్తలు కూడా పెద్దసంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. మృతులను శిల్పీ జైన్, గౌతమ్ సింగ్‌గా గుర్తించారు. ముందురోజు ఇంటి నుంచి బయలుదేరిన వారిద్దరూ తిరిగి ఇంటికి చేరుకోలేదని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. శిల్పీ తండ్రి ఉజ్వల్‌కుమార్ జైన్. పట్నాలోని ప్రముఖ వస్త్రదుకాణం కమలా స్టోర్ యజమాని. గౌతమ్ తండ్రి డాక్టర్ బి.ఎన్.సింగ్. లండన్‌లో ఆయన సొంత క్లినిక్ నడుపుకుంటున్నాడు. శిల్పీ, గౌతమ్ ఒకరినొకరు ఇష్టపడ్డారు.
వారిద్దరికీ త్వరలోనే పెళ్లి చేయాలని పెద్దలు కూడా అనుకున్నారు. శిల్పీ చదువు పూర్తయ్యాక పెళ్లికి ముహూర్తాలు పెట్టించుకోవాలని ఇరువురి కుటుంబాలూ ఒక నిర్ణయానికి వచ్చాయి. ఈలోగానే ఈ దుర్ఘటన జరిగింది. ఈ సంఘటనపై దర్యాప్తులో పట్నా పోలీసులు చేయరాని పొరపాట్లన్నీ చేశారు. రాజకీయ ఒత్తిడి వల్లనే వారు ఉద్దేశపూర్వకంగా అలా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాల సేకరణ కోసం ఎలాంటి ప్రయత్నాలూ చేయలేదు. పైగా, ఉన్నతాధికారుల ఆదేశాలతో ఒక కానిస్టేబుల్ ఆ కారును డ్రైవ్ చేసుకుంటూ పోలీస్ స్టేషన్‌కు తీసుకుపోయాడు. ఈ చర్యతో స్టీరింగ్‌పై వేలిముద్రలు సేకరించే అవకాశం లేకుండాపోయింది.
కనీసం మృతదేహాలకు శవపంచనామా గాని, పోస్ట్‌మార్టం గాని జరగకముందే, కొందరు పోలీసులు అత్యుత్సాహంతో ఈ సంఘటనను జంట ఆత్మహత్యలంటూ మీడియా ముందు ప్రకటించారు. ఆర్జేడీ కార్యకర్తలు మధ్యలో కలగజేసుకుని, మృతదేహాలకు పోస్ట్‌మార్టం జరిపించడానికి కూడా నిరాకరించారు. పోలీసులు ఎలాగోలా వాళ్లకు సర్దిచెప్పి, మృతదేహాలను పోస్ట్‌మార్టంకు తరలించారు. అనుమానాస్పద పరిస్థితుల్లో మృతదేహాలు దొరికితే, పోస్ట్‌మార్టం రిపోర్టు రాకుండానే, పోలీసులు ఆత్మహత్యలంటూ ప్రకటించడంపై కొన్ని మీడియా సంస్థలు తీవ్రంగా విమర్శలు చేశాయి. తర్వాత పోస్ట్‌మార్టం రిపోర్టు వచ్చాక, విషం పుచ్చుకోవడం వల్లనే వారు మరణించారని పోలీసులు ప్రకటించారు. ఈలోగా వారు హడావుడిగా గౌతమ్ మృతదేహాన్ని దహనం చేసేశారు.
శిల్పీ జైన్ పట్నా విమెన్స్ కాలేజీకి అందాలరాణి. కాలేజీ అందాల పోటీలో కిరీటాన్ని అందుకుంది. ఎప్పుడూ చిరునవ్వులు చిందిస్తూ ప్రశాంతంగా ఉండేది. కాలేజీలో ఆమె సన్నిహితులకు గౌతమ్ గురించి కూడా తెలుసు. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న వారిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారంటే ఎవరూ నమ్మలేకపోయారు. సంఘటన తర్వాత పోలీసులు వ్యవహరించిన తీరుపై చాలామంది అనుమానాలు వ్యక్తం చేశారు. సంఘటన జరిగిన ఆరు రోజులకు శిల్పీ తల్లిదండ్రులు తమ కూతురిది, ఆమె సహచరుడిది ఆత్మహత్య కాదని, ఎవరో వారిని హత్యచేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తూ, కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో పట్నా పోలీసులు వ్యవహరించిన తీరుపై కూడా వారు అనుమానాలు వ్యక్తం చేశారు.
కోర్టు జోక్యం చేసుకోవడంతో ఈ కేసు పట్నా పోలీసుల నుంచి సీబీఐ చేతికి వెళ్లింది. సీబీఐ అధికారులు శిల్పీ మృతదేహం నుంచి సేకరించిన నమూనాలను డీఎన్‌ఏ పరీక్షల కోసం హైదరాబాద్ లాబొరేటరీకి పంపారు. హైదరాబాద్ లాబొరేటరీ రిపోర్టులో దిగ్భ్రాంతికరమైన వాస్తవం వెలుగులోకి వచ్చింది. మరణానికి ముందు శిల్పీపై పలువురు అత్యాచారం జరిపారని, ఆ హింస తట్టుకోలేకనే ఆమె మరణించి ఉండవచ్చని ఆ రిపోర్టు స్పష్టం చేసింది. ఆమె సహచరుడు గౌతమ్ మృతికి కారణాలు తెలుసుకుందామనుకుంటే, అప్పటికే అతడి మృతదేహాన్ని దహనం చేయడంతో కనీసమైన ఆధారాలు కూడా లేకుండాపోయాయి.
ఈ సంఘటనలో సీబీఐ అధికారులు సాధు యాదవ్‌ను అనుమానితుడిగా గుర్తించారు.
దర్యాప్తు కోసం రక్త నమూనాలు అడిగితే, ఆయన నిరాకరించాడు. నాలుగేళ్ల పాటు దర్యాప్తు సాగదీసిన సీబీఐ, ఈ కేసులో ఏమీ తేల్చలేకపోయింది. ఒక్క నిందితుడినైనా పట్టుకోలేకపోయింది. చివరకు ఏమీచేయలేక కేసు మూసేసింది. సీబీఐ ఎటూ తేల్చకుండా కేసును మూసివేయడంపై శిల్పీ జైన్ కుటుంబం బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇది జరిగిన కొద్దిరోజులకు శిల్పీ సోదరుడు ప్రశాంత్ జైన్‌ను కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు. అయితే, కొద్దిరోజుల తర్వాత అతడిని విడిచిపెట్టారు. అతడి కిడ్నాప్ కేసులో కూడా పోలీసులు నిందితులను పట్టుకోలేకపోయారు.
Comments
Please login to add a commentAdd a comment