Mystery About Murder Case Of Reyna Angelica Marroquin In 1969 In Telugu - Sakshi
Sakshi News home page

54 ఏళ్ల క్రితం హడలెత్తించిన 'డ్రమ్ములో శవం'

Published Wed, Feb 1 2023 1:52 PM | Last Updated on Wed, Feb 1 2023 3:45 PM

Mystery About Murder Case of Reyna Angelica Marroquin In 1969 - Sakshi

కలల ప్రపంచాన్ని సృష్టించుకునే ముందు.. ఆ ప్రపంచంలోకి అడుగుపెట్టే వ్యక్తుల వ్యక్తిత్వంపై స్పష్టమైన అవగాహన ఉండి తీరాలి. లేదంటే జీవితమే తారుమారు అవుతుంది. సరి చేసుకునే అవకాశం, సమయం రెండూ దొరక్కుండానే బతుకు ఛిద్రమవుతుంది. సుమారు 54 ఏళ్ల క్రితం ముగిసిన ఓ యువతి ఉదంతం.. ఆ పాఠాన్నే బోధిస్తోంది.

అది 1999, సెప్టెంబర్‌ 2. న్యూయార్క్‌లోని నాసా కౌంటీ, జెరిఖోలోని ఒక ఇంట్లో.. జనాలు విపరీతంగా గుమిగూడారు. ‘డ్రమ్ములో శవమట’ అనే వార్త.. ఆ చుట్టుపక్కల చాలా వేగంగా పాకిపోయింది. పోలీసుల కంటే ముందుగా మీడియానే అక్కడికి చేరుకుంది. క్రాల్‌ స్పేస్‌ (ఇంటికి నేలకు మధ్య.. పిల్లర్స్‌ ఉండే ఇరుకైన స్థలం)లో ఓ డ్రమ్ము బయటపడిందని.. అందులో బూడిద, ఓ మహిళ శవం, ఏవో కొన్ని వస్తువులు కనిపిస్తున్నాయని చెప్పుకొచ్చారు అక్కడివాళ్లు. ‘తప్పుకోండి.. తప్పుకోండి’ అంటూ వచ్చిన కానిస్టేబుల్‌ హడావుడితో అక్కడ సీన్‌ మొత్తం మారిపోయింది.

క్రైమ్‌ టేప్‌తో ఆ చోటుని సీజ్‌ చేయించారు అధికారులు. డ్రమ్మును.. అందులోని వస్తువుల్ని, శవాన్ని అన్నింటినీ స్వాధీనం చేసుకుని విచారణ మొదలుపెట్టారు. శవాన్ని డ్రమ్ము నుంచి బయటికి తీసేసరికే అర్థమైంది ఆమె నిండు గర్భిణీ అని. ఆ శవం సుమారు ఇరవై ఏళ్లు పైబడిన యువతిదని, ఆమె ఐదు అడుగుల పొడవు ఉండే అవకాశం ఉందని.. తలకు బలమైన గాయం తగలడం వల్లే చనిపోయిందని అంచనాకు వచ్చారు వైద్యులు. ఆ డ్రమ్ములో ఆమెకు సంబంధించిన రెండు ఉంగరాలు, ఒక లాకెట్, గ్రీన్‌ డైతో పాటు.. ప్లాస్టిక్‌ మొక్క, పాలీస్టైరిన్‌ గుళికలు, సగం కాలిన పుస్తకం దొరికాయి. ఆ పుస్తకంలోని ఓ అడ్రస్‌.. ఓ ఫోన్‌ నంబర్‌.. కీలక ఆధారాలను పోగుచేశాయి.

ఆమె పేరు రేనా ఏంజెలికా మారోక్విన్‌ అని, ఎల్‌ సాల్వడార్‌ నుంచి  జెరిఖోకి వలస వచ్చిన యువతి అని, ఆమె.. మాన్‌హటన్‌ , ఈస్ట్‌ 34 స్ట్రీట్‌లో ఉన్న ఒక కర్మాగారంలోని కృత్రిమ పువ్వుల తయారీ విభాగంలో మూడేళ్ల పాటు పనిచేసిందని, తన 28వ ఏట.. 1969 నుంచి కనిపించకుండా పోయిందని తెలిసింది. అంటే ఆమె చనిపోయి.. శవం దొరికే నాటికి 30 ఏళ్లు గడిచిందనే వార్త సంచలనమై.. పత్రికల మొదటి పేజీలను కవర్‌ చేసింది. అయితే ఆ పుస్తకంలోని ఫోన్‌ నంబర్‌.. రేనా ప్రాణస్నేహితురాలు క్యాథీ ఆండ్రేడ్‌దే కావడంతో మరింత సమాచారం బయటపడింది.

రేనా కనిపించకుండా పోయిన కొన్నినెలల ముందు.. తన స్నేహితురాలు క్యాథీతో ‘నేను ఒక వివాహితుడితో ప్రేమలో పడ్డాను. అతడి కారణంగా తల్లినయ్యాను. ఇప్పుడేమో అతను తన భార్యని వదిలిపెట్టేందుకు సిద్ధపడట్లేదు. ఆ నిజాన్ని అతడి భార్యకి చెప్పాలని ప్రయత్నిస్తుంటే.. అతడు వ్యతిరేకిస్తున్నాడు’ అని చెప్పిందట. అయితే అతడి పేరు మాత్రం చెప్పలేదట. రేనా కనిపించకుండా పోయాక.. తన గురించి పోలీసుల్ని కలసి కంప్లైంట్‌ ఇవ్వడానికి ట్రై చేసిందట క్యాథీ.

అయితే రేనాకి, క్యాథీకి రక్తసంబంధం లేకపోవడం.. ఆ వివాహితుడి పేరు తెలియకపోవడంతో.. కేసు దాఖలు చేయడానికి నిరాకరించారట పోలీసులు.
మొత్తానికి.. ఆమె వివరాలైతే తెలిశాయి కానీ ఆమె జీవితంలోని నయవంచకుడు ఎవరనేది తేలలేదు. దాంతో రేనా పనిచేసిన కర్మాగారంలో అప్పటి ఉద్యోగుల్ని విచారించడం మొదలుపెట్టారు. ఈ లోపు శవం దొరికిన డ్రమ్ము మీద పడింది పోలీసుల దృష్టి. ఆ డ్రమ్ము 1963లో.. జెరిఖోలోని కృత్రిమ పూల తయారీ సంస్థ ‘మెల్రోస్‌ ప్లాస్టిక్స్‌’కు సరుకులు రవాణా చేసిన డ్రమ్ము అని తేలింది. ఆ కంపెనీ యజమాని పేరు ఎల్కిన్స్‌ అని, అతడికి ఒక యువతితో వివాహేతరసంబంధం ఉండేదని కొంత సమాచారం బయటపడింది.

అయితే అతడు 1972లోనే తన కంపెనీని, ఇంటిని అమ్మేసి.. భార్యతో పాటు మకాం మార్చాడని తెలిసింది. వెంటనే ఎల్కిన్స్‌ కోసం పోలీసులు వేట మొదలుపెట్టారు. ఎట్టకేలకు ఫ్లోరిడాలోని బోకా రాటన్‌ లో... 70 ఏళ్ల ఎల్కిన్స్‌ పోలీసులకు చిక్కాడు. కానీ పోలీసులు.. రేనా గురించి ఎన్ని విధాలుగా అడిగినా అతడు ఒక్క విషయం కూడా చెప్పలేదు. దాంతో అధికారులు అతడి డీఎన్‌ఏ తీసుకుని.. రేనా కడుపులోని బిడ్డ డీఎన్‌ ఏతో సరిపోలుతుందో లేదో తేల్చాలని నిర్ణయించుకున్నారు. అందుకు సిద్ధంగా ఉండమనీ ఎల్కిన్స్‌కి చెప్పారు.

సరేనన్న ఎల్కిన్స్‌.. కొన్నిగంటల్లోనే తుపాకీ కొనుక్కుని.. తనని తాను కాల్చుకుని చనిపోయాడు. చివరికి డీఎన్‌ఏ రిపోర్ట్స్‌లో.. రేనా బిడ్డకు ఎల్కిన్సే తండ్రని తేలింది. అంటే రేనాని చంపింది ఎల్కిన్సేనని అర్థమైపోయింది. అందుకే.. తను చేసిన పాపానికి తనే బలయ్యాడు. రేనా మరణ వార్త.. తన 95 ఏళ్ల తల్లిని చాలా కుంగదీసింది. సాల్వడార్‌లో రేనా శవాన్ని ఖననం చేసిన ఒక నెల తర్వాత ఆమె కూడా మరణించింది. దాంతో ఆమెను కూడా రేనా సమాధి పక్కనే ఖననం చేశారు.

ఈ కథలో అసలు ట్విస్ట్‌ ఏంటంటే.. సగం కాలిన పుస్తకంలో.. ఒక స్లిప్‌ మీద  ‘డోంట్‌ బీ మ్యాడ్‌.. ఐ టోల్డ్‌ ద ట్రూత్‌ (పిచ్చివేషాలేయొద్దు.. నేను నిజమే చెప్పాను)’ అని రాసి ఉంది. ఆ రాత  ఈ కథ తెలిసిన ప్రతి ఒక్కరినీ నివ్వెరపరచింది. ఆ రైటింగ్‌ కూడా పిల్లలు రాసినట్లు అడ్డదిడ్డంగా ఉంది. అసలు అది రాసింది ఎవరు? ఎందుకు అలా రాశారు? కాలిన పుస్తకంలో అది అంత స్పష్టంగా, భద్రంగా ఎలా ఉంది? జరగబోయేది నిజంగా తెలిసే రాశారా? అనేది ఇప్పటికీ మిస్టరీనే. అది రాసింది రేనా ఆత్మేనని కొందరు.. కాదు రేనా కడుపులోని బిడ్డేనని మరికొందరు నమ్ముతుంటారు.
- సంహిత నిమ్మన 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement