‘జీవితం విలువైన బహుమతి, ఒక్కసారి మీ కుటుంబం గురించి ఆలోచించండి. దయచేసి ఒంటరిగా ఇక్కడ తిరగొద్దు.. వెంటనే క్షేమంగా తిరిగి వెళ్లిపోండి’ ఇవి ఔకీగహారా సమీపంలో కనిపించే ప్రమాద హెచ్చరికలు. ‘పో.. దూరంగా పో.. తిరిగి వెళ్లిపో.. బతుకు..’ అంటూ గమనిక బోర్డులనిండా రాతలు. అవి స్పష్టంగా కనిపిస్తున్నా.. అడవి మాత్రం ‘రా.. ఇటువైపు రా.. ఇక్కడే, ఈ క్షణమే చచ్చిపో’ అని పిలుస్తుందట.
టోక్యోకు పశ్చిమంగా దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో.. ఫుజి అనే ఎత్తైన పర్వతానికి ఆనుకుని.. ఔకీగహారా అనే ఫారెస్ట్ ఉంది. అక్కడ ప్రతి మొక్కలో, ప్రతి మలుపులో విషమ గీతమే వినిపిస్తుంది. ఏదో తెలియని క్రూరత్వం రారమ్మంటూ వల విసురుతున్నట్లుగా ఉంటుంది. ‘అవన్నీ ఆత్మహత్యలకు ఆహ్వానాలే’ అంటుంటారు చాలామంది. ఈ అడవి భూమ్మీద అత్యంత భయంకరమైన ప్రదేశాల్లో ఒకటి. ప్రపంచంలోనే ఆత్మహత్యల రేటులో ఈ అడవిది రెండో స్థానం. ఏటా ఇక్కడి నుంచి సుమారు వందకు పైగా మృతదేహాలను వెలికితీస్తుంటారు. ఇది ఇంత ప్రమాదకరమైన ప్రదేశమని తెలిసి కూడా కొందరు .. ఇక్కడికే హైకింగ్‌కి వస్తుంటారు.
పురాణ కథనం పురాణాల ప్రకారం.. కొన్నేళ్ల క్రితం కొంతమంది పేదలు ఇక్కడ ఆకలితో మరణించి ఆత్మలుగా మారారని ఒక కథనం. ఆ ఆత్మలు కొత్త ఆత్మల కోసం వెదుకుతూ ఉంటాయని.. అందుకే అవి అడవి సమీపానికి వచ్చిన మనుషుల్ని ఆత్మహత్యలకు ప్రేరేపిస్తుంటాయని చాలామంది నమ్ముతారు. అయితే ఈ అడవిలో చనిపోయిన శవాలు కదులుతాయని.. భీకరంగా కేకలు వేస్తుంటాయని స్థానికులు చెబుతుంటారు.
మరో కథనం ప్రకారం.. పూర్వం స్థోమత లేని కుటుంబాల్లోని వృద్ధులు లేదా అనారోగ్యంతో బాధపడే బంధువులను ఈ అడవికి తీసుకొచ్చి వదిలేసేవారని.. వారంతా అక్కడే ఆకలితో చనిపోయేవారని.. వారి ఆత్మఘోషే ఈ విషాదానికి కారణమని మరో కథనం.
'సీచో మాట్సిమోటో' అనే రచయిత.. 1961లో రచించిన ‘ది టవర్ ఆఫ్ వేవ్స్’ అనే నవల వల్ల.. ‘ఔకీగహారా’ అడవి విశేషాలు బాగా పాపులర్ అయ్యాయని కొందరి అభిప్రాయం. అప్పటి నుంచే ఈ అడవి మిస్టరీని కథాంశంగా తీసుకుని.. అనేక చిత్రాలు, కథనాలు పుట్టుకొచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది.
శాస్త్రవేత్తల మాట్లలో.. కొందరు శాస్త్రవేత్తలు మాత్రం.. ‘ఇక్కడి ఇనుప నిక్షేపాల కారణంగా అవి దిక్సూచిగా మారి దారి తప్పించడంతో అడవిలోనే చనిపోతున్నారు. అందుకే ఈ అడవిలోకి వెళ్లాలి అనుకునే హైకర్స్.. టేప్ లేదా స్ట్రింగ్‌ని ఉపయోగించడం మంచిది’ అని సూచిస్తున్నారు. అడవి ప్రాంతం విస్తారంగా, దట్టంగా ఉండటంతో.. ఇక్కడ అడుగుపెట్టిన చాలామంది శవాలు కూడా దొరకట్లేదు. మిస్ అయిన వాళ్లని కనిపెట్టడంలో రెస్క్యూ టీమ్ కూడా ఫెయిల్ అవుతూ వచ్చింది. దాంతో ఆత్మహత్యలను, మిస్సింగ్‌లను నివారించడానికి.. అటవీ ద్వారాల ముందు భద్రతా కెమెరాలతో పాటు.. సెక్యూరిటీనీ పెంచారు.
నిర్మానుష్యమైన ఈ అడవిలో.. నిర్ఘాంత పోయే దృశ్యాలు భయపెడుతూ ఉంటాయి. చెల్లాచెదురుగా పడి ఉన్న షూలు, బట్టలు, టోపీలతో పాటు భీతికలిగించే బొమ్మలు కూడా ఉంటాయి. అవన్నీ చెట్టు కొమ్మలతో తాళ్లు మెలిపెట్టి బొమ్మల్లా అల్లినట్లు ఉంటాయి. చూడటానికి రాక్షసుల్లా కనిపిస్తూ ఉంటాయి. అయితే వాటిని ఎవరు అలా పెట్టారో ఎవరికీ తెలియదు. మనిషి పుర్రెలు, ఎముకలు అక్కడక్కాడా అగుపిస్తూ హడలెత్తిస్తుంటాయి. చనిపోయిన వారి శవాలు కూడా దిష్టిబొమ్మల్లా.. ఊడలమర్రిపై దయ్యాల్లా వేలాడుతూ భయపెడుతూ ఉంటాయి. ఏదిఏమైనా ఈ అడవి.. మనుషుల్ని ఆత్మహత్యలకు ఎలా ప్రేరేపిస్తోంది? అక్కడ తాళ్లతో రాక్షసుల రూపాలను ఎవరు తయారు చేశారు? వంటివన్నీ మిస్టరీలుగానే మిగిలిపోయాయి.
- సంహిత నిమ్మన
Comments
Please login to add a commentAdd a comment