
అజిత్‌కుమార్ లండన్‌లో ఫార్మసిస్ట్. అతడి భార్య, ఆమె కుటుంబసభ్యులు హైదరాబాద్‌లో ఉంటారు. అతడు లండన్‌లో ఉంటూనే, హైదరాబాద్‌లో ఉంటున్న భార్య కుటుంబసభ్యులపై 2023లో విషప్రయోగం చేశాడు. విషప్రయోగానికి అతడి అత్త మరణించింది. అత్తవారి కుటుంబంలోని మరో ఐదుగురు అస్వస్థులయ్యారు. ఈ సంఘటనపై మియాపూర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు తొమ్మిదిమందిని అరెస్టు చేశారు. అజిత్‌పై ఇక్కడి కోర్టు అరెస్టు వారంట్ జారీ చేయడంతో ఇటీవల లండన్ పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అతడిని హైదరాబాద్ తీసుకురావడానికి సైబరాబాద్ పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.
మియాపూర్ గోకుల్‌ప్లాట్స్‌కు చెందిన హనుమంతరావు, ఉమామహేశ్వరి దంపతుల కుమార్తె డాక్టర్ శిరీషకు 2018 జూన్ 23న అజిత్‌కుమార్‌తో పెళ్లి జరిగింది. భార్యాభర్తలు లండన్‌లో స్థిరపడ్డారు. వారికి ఒక కూతురు పుట్టింది. కొన్నాళ్లకు ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. భర్త వేధింపులపై శిరీష లండన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి ఇద్దరూ లండన్‌లోనే వేర్వేరుగా ఉంటూ, అక్కడి కోర్టులో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసుకున్నారు. దీంతో అజిత్ తన భార్యపైన, ఆమె కుటుంబసభ్యులపై కక్ష పెంచుకున్నాడు. వారందరినీ అంతంచేయాలని నిశ్చయించుకుని, 2023 ఫిబ్రవరిలో ఇక్కడకు వచ్చి వెళ్లాడు. తన వద్ద పనిచేసే వినోద్‌కుమార్‌కు ఈ పనిని పర్యవేక్షించే బాధ్యత అప్పగించి, మేలో అతడిని హైదరాబాద్ పంపాడు. అతడి ద్వారా నగరానికి చెందిన భవానీశంకర్, అశోక్, గోపీనాథ్‌లతో పాటు తన స్నేహితులను రంగంలోకి దించాడు.
అత్తింటివారు ఉండే ఫ్లాట్స్ వాచ్‌మెన్ కొడుకు రమేష్‌కు డబ్బు ముట్టజెప్పి, అతడి ద్వారా అత్తింటివారి కదలికలను తెలుసుకోసాగాడు. శిరీష సోదరుడు పూర్ణేందర్‌కు 2023 జూన్‌లో పెళ్లి నిశ్చయమైంది. ఈ పెళ్లి కోసం శిరీష తన కూతురితో పాటు వచ్చింది. రమేష్ ద్వారా అజిత్ ఈ సంగతి తెలుసుకుని, అత్తింటివారిని అంతం చేయడానికి ఇదే అదనుగా భావించాడు. అందరూ పెళ్లి హడావుడిలో ఉండగా, విషపు ఇంజెక్షన్లతో వారిని చంపాలనుకున్నాడు. శిరీష వాళ్ల పైఫ్లాట్‌లో ఉండే పూర్ణచందర్‌ను తనవైపు తిప్పుకున్న అజిత్, అతడి సాయంతో ఈ పథకాన్ని అమలు చేయాలనుకున్నాడు. భవానీశంకర్, అశోక్, గోపీనాథ్‌లకు విషపు ఇంజెక్షన్లు ఇచ్చి, జూన్ 25న తన అత్తవారింటికి పంపాడు. ఈ పథకం పారకపోవడంతో పథకాన్ని మార్చుకున్నాడు. ఫార్మసిస్టుగా తన పరిజ్ఞానంతో స్లోపాయిజనింగ్ చేయాలని భావించాడు.
అజిత్ సోదరి నగరంలోని ఒక పాఠశాలలో ఉపాధ్యాయురాలు. తన స్కూలు అవసరాల కోసం కొన్న ఆర్సెనిక్‌ను ఆమె ద్వారానే భవానీశంకర్ తదితరులకు అందేలా చేశాడు. అజిత్ సలహాపై ఈ ముగ్గురూ డెలివరీ బాయ్స్ అవతారమెత్తారు. ఆర్సెనిక్ కలిపిన పసుపు, కారం, మసాలా పొడులను శిరీష ఇంట్లోని వారికి అందించారు. పెళ్లి హడావుడిలో ఉన్న వాళ్లు వాటిని తీసుకుని, వంటల్లో వినియోగించారు. ఆ వంటకాలు తిన్న శిరీష, ఆమె తల్లిదండ్రులు, ఆమె సోదరుడు, అతడి భార్య సహా ఆరుగురు అస్వస్థులై, ఆస్పత్రి పాలయ్యారు. వారిలో శిరీష తల్లి ఉమామహేశ్వరి చికిత్స పొందుతూ జూలై 5న మరణించింది. ఎందరు వైద్యులను సంప్రదించినా, ఎన్ని ఆస్పత్రుల్లో చికిత్స పొందినా ఎవరూ ఏం జరిగిందో గుర్తించలేకపోయారు.
పూర్ణేందర్ తన భార్యతో కలసి 2023 ఆగస్టు మొదటివారంలో ఆమె స్వస్థలమైన గుంటూరు వెళ్లాడు. అక్కడ ఒక సీనియర్ వైద్యుడిని ఈ దంపతులు సంప్రదించారు. దాదాపు నలభై ఏళ్ల కిందట ఇలాంటి రోగులకు చికిత్స చేసిన ఆయన, వారిపై ఆర్సెనిక్ పాయిజనింగ్ జరిగినట్లు గుర్తించారు. ఆయన సూచనపై జరిపించిన పరీక్షల్లో విషప్రయోగం జరిగినట్లు తేలడంతో, వారికి చికిత్స చేశారు. శిరీష దీని వెనుక తన భర్త అజిత్ పాత్రను అనుమానించి, 2023 ఆగస్టు 17న మియాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసి, ప్రాథమిక ఆధారాలను అందించింది.
శిరీష కుటుంబం నివసించే అపార్ట్‌మెంట్ సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలను పరిశీలించిన పోలీసులు, వాటిలో బయటపడ్డ అంశాల ఆధారంగా వాచ్‌మన్ కొడుకు రమేష్‌ను అదుపులోకి తీసుకుని, విచారించారు. అతడి ద్వారా గుట్టు బయటపడటంతో పూర్ణచందర్, భవానీశంకర్, అశోక్, గోపీనాథ్‌లను అరెస్టు చేశారు. తన అత్తింటివారంతా చనిపోలేదని తెలుసుకున్న అజిత్‌కుమార్ మరో కుట్రకు తెరలేపాడు. దీని అమలుకు వినోద్‌ను మళ్లీ హైదరాబాద్‌కు పంపాడు. ఇది తెలుసుకున్న పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఈ కేసులో అజిత్ సహా మొత్తం పది మంది నిందితులు ఉన్నట్లు తేల్చారు.
ఈ కేసులో 2023 ఆగస్టులోనే తొమ్మిది మందిని అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. అజిత్ అరెస్టు కోసం కోర్టు ఉత్తర్వులు పొంది, కేంద్ర విదేశాంగ శాఖ ద్వారా లండన్ పోలీసులను సంప్రదించారు. కేసు వివరాలను, అజిత్‌పై అరెస్టు వారంట్‌ను వారికి పంపారు. ఈ ఏడాది జనవరి రెండోవారంలో లండన్ పోలీసులు అజిత్‌ను అరెస్టు చేశారు. అజిత్ తన బెయిల్ కోసం లండన్ కోర్టులో వేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. ప్రస్తుతం లండన్ జైలులో ఉన్న అతడిని ఇక్కడకు తీసుకురావడానికి సైబరాబాద్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
∙శ్రీరంగం కామేష్
Comments
Please login to add a commentAdd a comment