పాలిన్‌ చనిపోయిందంటున్నారు.. ఇంటికి వచ్చిందెవరు? | Death Mystery The Strange Story Of Pauline Picard Dissappeared | Sakshi
Sakshi News home page

Pauline Death Mystery: పాలిన్‌ చనిపోయిందంటున్నారు.. ఇంటికి వచ్చిందెవరు?

Published Sun, Sep 18 2022 8:31 AM | Last Updated on Sun, Sep 18 2022 9:07 AM

Death Mystery The Strange Story Of Pauline Picard Dissappeared - Sakshi

అది 1922, ఏప్రిల్‌ నెల. నార్త్‌–వెస్ట్‌ ఫ్రాన్స్‌.. బ్రిటనీ ప్రాంతంలోని గోవాస్‌ అల్‌ లూడూ. ఆ గ్రామంలో ఊహించని అలజడి మొదలైంది. వందల మంది సందుగొందుల్లో పరుగులు తీస్తున్నారు. గుంతల్నీ, చెట్టు తొర్రల్నీ వేటినీ వదిలిపెట్టకుండా అణువణువు వెతుకుతున్నారు. ‘పాలిన్‌.. పాలిన్‌..’ ఇదే పేరు ప్రతి ఒక్కరి నోట. పక్కనే ఉన్న అడవినీ జల్లెడ పట్టేశారు. ఎటు చూసినా పాలిన్‌ పేరే మారుమోగసాగింది. కానీ పాలిన్‌ మాత్రం దొరకలేదు.

పాలిన్‌ పికార్డ్‌.. రెండేళ్ల చిన్నారి. పొలంలో ఆడుతూ ఆడుతూ ఉన్నట్టుండి మాయమైంది. అడవివైపు వెళ్లిందా? అక్కడ తప్పిపోయి.. చలికి తట్టుకోలేక ఎక్కడైనా పడిపోయిందా? లేక అడవి పందులేమైనా లాక్కెళ్లాయా? అనుకుంటూ పాలిన్‌ కుటుంబంతో పాటు చుట్టుపక్కల జనమంతా వెతుకుతూనే ఉన్నారు. లాభం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులతో పాటు సైనిక బృందం కూడా రంగంలోకి దిగింది. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా.. పాలిన్‌ ఆచూకీ దొరకలేదు.

దాంతో ‘ఎవరైనా ఎత్తుకెళ్లారా?’ అనే అనుమానాలు బలపడ్డాయి. ఆ దిశగా విచారణ మొదలుపెడితే.. పాలిన్‌ మిస్‌ అయిన రోజు.. పొలానికి సమీపంలో ఇద్దరు అపరిచితుల్ని చూశామంటూ పొరుగువారు గుర్తుచేసుకున్నారు. మరోవైపు కెరమాన్‌ అనే గొడుగులు అమ్మే వ్యక్తిని అరెస్ట్‌ కూడా చేశారు. పాలిన్‌ అంటే కెరమాన్‌ చాలా ఇష్టంగా ఉండేవాడని.. పాలిన్‌ అదృశ్యమైన రోజు అతడు పాపని కలిశాడని తేలడంతో అతడ్ని గట్టిగానే విచారించారు. సరైన ఆధారాలు లేక విడిచిపెట్టారు.

గోవాస్‌ అల్‌ లూడూ గ్రామంలో పాలిన్‌ కుటుంబం ఉండే ఇల్లు ఊరికి దూరంగా  సింగిల్‌గా ఉండేది. మే నెల చివర్లో పోలీసులు ఒక చిన్న పాప ఫొటోతో వచ్చి.. పాలిన్‌ కుటుంబాన్ని కలిశారు. ‘ఈమేనా మీ పాప?’ అని అడిగారు. ఫొటోని బాగా పరికించి చూసిన పికార్డ్‌ దంపతులు.. ‘అవును’ అంటూ ఏడ్చేశారు. ‘ఈ పాప రూ కోయ్పెల్‌లో దొరికింది. చినిగిన బట్టలతో ఉన్న ఓ మహిళ ఈ పాపని వదిలేసి పారిపోయింది, పాపని షెర్బోర్గ్‌లోని ధర్మశాలకు తరలించారు’ అంటూ జరిగింది చెప్పుకొచ్చారు పోలీసులు.

నిజానికి పాప దొరికిన ప్రాంతం.. గోవాస్‌ అల్‌ లూడూ గ్రామానికి 217 మైళ్ల (350 కిమీ) దూరంలో ఉంది. అంత దూరం పాలిన్‌ ఎలా వెళ్లిందో? ఎవరికీ అంతుపట్టలేదు. పోలీసులు చెప్పింది విన్న వెంటనే పాలిన్‌ పేరెంట్స్‌ షెర్బోర్గ్‌కు రైలెక్కారు. పాప ఉన్న ధర్మశాలకు వెళ్లారు. అక్కడ పాపని చూస్తే.. గుర్తుపట్టలేనంతగా  చిక్కిపోయింది. తనే పాలిన్‌ అంటే.. పాప తల్లిదండ్రులు నమ్మలేకపోయారు. అయితే అదే జుట్టు, అవే నీలి కళ్ళు కావడంతో ఏడుస్తూ గుండెలకు హత్తుకున్నారు.

‘ఇన్నిరోజులుగా సరైన ఆహారం అందకపోవడం వల్లే పాలిన్‌ అలా అయ్యింది’ అని వైద్యులు చెప్పారు. పాప పోషకాహార లోపంతో బాధపడుతోందని, వైద్యపరమైన ఎలాంటి సమస్యలు లేవని తేల్చేశారు. తల్లిదండ్రులు పాపతో స్థానిక భాషలో మాట్లాడటానికి ప్రయత్నించినప్పుడు.. పాప వాళ్లని గుర్తుపట్టలేదు. మొత్తానికీ పాపని ఇంటికి తెచ్చుకున్నారు.

పాప దొరికిన రోజు పాప ఒంటి మీదున్న దుస్తులు పాలిన్‌వి కాకపోవడంతో.. బహుశా పాపని ఎత్తుకెళ్లినవాళ్లు దుస్తులు మార్చి ఉంటారని అనుకున్నారు. రావడం రావడమే పాపను చూసిన తోబుట్టువులు ఆమెను పాలిన్‌గానే గుర్తించారు. అయితే పాప మాత్రం మౌనంగానే ఉండేది. తినడానికి రొట్టెలు అడుగుతుందని, స్థానిక భాషలో పెంపుడు పిల్లిని పిలుస్తుందని నెమ్మదిగా.. పాత పాలిన్‌ లా యాక్టివ్‌ అవుతుందని కుటుంబసభ్యులంతా నమ్మడం మొదలుపెట్టారు.

కొన్ని రోజులకు.. గోవాస్‌ అల్‌ లూడూలో మరో అలజడి రేగింది. పాలిన్‌ ఇంటికి మైలు దూరంలో ఉన్న పొలంలో.. ఓ రైతుకు.. తల, చేతులు, కాళ్లు లేని కుళ్ళిపోయిన చిన్న శరీరం కనిపించింది. ఆ పక్కనే పొందిగ్గా మడతపెట్టిన బట్టలు కనిపించాయి. వెంటనే ఆ రైతు పోలీస్‌ స్టేషన్‌ కి పరుగుతీశాడు. పోలీసులు వచ్చి పరిశీలించగా ఆ బట్టలు పాలిన్‌ వేనని తేలాయి. దాంతో అది పాలిన్‌ శవమని గుర్తించారు. డెడ్‌ బాడీకి కాస్త దూరంలో పూర్తిగా రూపురేఖలు లేని తల కనిపించింది. అయితే అప్పటికే పాలిన్‌ని వెతికే క్రమంలో.. మృతదేహం దొరికిన ఆ ప్రాంతాన్ని పోలీసులు, ప్రజలు పలుమార్లు వెతికారు. అప్పుడు దొరకని మృతదేహం, బట్టలు ఇప్పుడు దొరికాయంటే.. ఎవరో కావాలనే వాటిని అక్కడ వేశారని అర్థమైంది.

అది కచ్చితంగా పాలిన్‌ ని మాయం చేసిన నేరస్తుల పనేనని తేలిపోయింది. కానీ నేరగాడు మాత్రం పట్టుబడలేదు. తీరా వైద్యపరీక్షలు చేస్తే.. ఆ తల, శరీరం ఒకే వ్యక్తివి కావని.. శరీరం చిన్న పాపదే కానీ తల మాత్రం ఒక పురుషుడిదని, తలను నక్కలు పాక్షికంగా తినడం వల్లే అలా తయారైదని తేలింది. కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు కనిపిస్తుండడంతో పోలీసులు తలలు పట్టుకున్నారు.

పాలిన్‌  శరీరంలో కాళ్లు, చేతులు, తల ఏమయ్యాయి? తల మాత్రమే దొరికిన పురుషుడు ఎవరు? అతడి శరీరం ఏమైంది? అసలు ధర్మశాల నుంచి తెచ్చుకున్న పాప ఎవరు? ఇలా అన్నీ ప్రశ్నలే మిగిలాయి. మరణానికి గల సరైనకారణం వైద్యపరీక్షల్లో తేలలేదు. అయితే పాలిన్‌ని కిడ్నాప్‌ చేసిన వారు.. పాపను దాచిపెట్టి కేసును తప్పుదోవ పట్టించడానికే ఇలా మృతదేహాలతో ఆడుకుంటున్నారని నమ్మడం మొదలుపెట్టారు కొందరు.

షెర్బోర్గ్‌లో దొరికిన పాప.. పారిపోయిన ఆ మహిళ కూతురేనని.. పోషించలేకే పాపను వదిలి, ఆమె తన భర్తతో కలసి అమెరికా వలసపోయిందని ఊహాగానాలు వచ్చాయి. ఇక జూన్‌ నెల మధ్యలో పికార్డ్‌ దంపతులు.. ఆ పాపను దత్తత తీసుకోవడానికి సిద్ధపడ్డారు. కొన్ని రోజులకు  వైవ్స్‌ మార్టిన్‌ అనే మతి చలించిన వ్యక్తి.. పికార్డ్‌ దంపతుల్ని కలసి.. వారి దగ్గరున్న చిన్నపాపను చూపిస్తూ.. ‘ఇది పాలిన్‌ అని మీరు నమ్ముతున్నారా? దేవుడా నన్ను క్షమించు, నేను దోషిని’ అని పెద్దగా నవ్వుతూ అడవిలోకి పారిపోయాడు.

ఆ మరుసటి రోజు అతణ్ణి పిచ్చి ఆసుపత్రికి తరలించారు. అతడే పాలిన్‌ను హత్య చేసి ఉంటాడని చాలా మంది నమ్మారు. ఏది ఏమైనా పాలిన్‌ కథలో అసలు నేరగాడు ఎవరు? ఆ మృతదేహాలు ఎవరివి? అక్కడకి ఎలా వచ్చాయి? మతిచలించిన ఆ వ్యక్తే నేరం చేశాడా? వంటివన్నీ మిస్టరీగానే మిగిలాయి.
 - సంహిత నిమ్మన 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement