కథ: ఋణశేషం.. 30 లక్షలకే ఇల్లు! ఐదేళ్ల క్రితం చనిపోయిన శీనును ఇప్పుడు కలిశావా? | Funday: Runa Shesham By Ranjan Telugu Interesting Story | Sakshi
Sakshi News home page

కథ: ఋణశేషం.. 30 లక్షలకే ఇల్లు.. అప్పుడే ఆలోచించాల్సింది! ఆ దెయ్యం శీను కాదు కదా!

Published Wed, Sep 14 2022 4:36 PM | Last Updated on Wed, Sep 14 2022 5:02 PM

Funday: Runa Shesham By Ranjan Telugu Interesting Story - Sakshi

చెన్నై, తాంబరాన్ని దాటి ఇరవైకిలోమీటర్ల దూరంలోనున్న ఆ ఇంటిని కొనుక్కునేటప్పుడే కాస్తంత ఆలోచించి ఉండాల్సింది. ‘రెండు గ్రౌండుల ఇంటిని ముప్పై లక్షల రూపాయలకు, ఇంత చౌకగా అమ్ముతున్నాడేమిటి ఈ కళ్ళజోడువాడు?!’ అంటూ ఇరుగుపొరుగువాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడే వెనక్కి తగ్గివుండాల్సింది.

‘అమెరికాలో సెటిల్‌ అవుదామనుకుంటున్నామండీ. డబ్బు ప్రధానం కాదు, మనుషులే ప్రధానం’ అంటూ అతను గడగడమని వాగుతున్నప్పుడే వెనక్కి తగ్గివుండాల్సింది. తక్కువ ధరకు ఇల్లు దొరుకుతోంది కదాని తొందరపడ్డందుకు బాగానే ఏడ్వాల్సి వస్తోంది. కారణం.. ఆ ఇంట్లో తిరుగాడుతున్న దెయ్యం. దాన్ని ఇంట్లో నుంచి తరిమేందుకు దెయ్యంలా చక్కర్లు కొడుతోన్న నేను సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ని. 

ఈ ఇంటిని చూసిన వెంటనే నా భార్య సీతకు, నా సుపుత్రుడు హరికి బాగా నచ్చింది. రెండు పడకగదులతో చిన్న ఇల్లు. ఇంటి చుట్టూ విశాలమైన ప్రదేశం. భవిష్యత్తులో చేతికి తగినన్ని డబ్బులు అందితే విశాలమైన ఇంటిని మరింత పెద్దగా కట్టుకోవచ్చు. తోటను పెంచవచ్చు. ఇంటిముందున్న వేపచెట్టుకు ఊయలను కట్టొచ్చు. ఆడొచ్చు.. పాడొచ్చు.. అరవొచ్చు.. పరుగెత్తొచ్చు! ఇలా అనేక విధాల ‘వచ్చు’లతో అంతా బాగానే ఉంది. ఆ ఇంట్లో మొదటిరాత్రి గడిపేంతవరకు. 

ఉదయాన్నే పూజాకార్యక్రమాలన్నీ చక్కగా జరిగాయి. భోజనాలనంతరం.. సాయంకాలం  వరకు వచ్చిన వాళ్లంతా నెమ్మది నెమ్మదిగా వెళ్లిపోగా.. రాత్రికి నేనూ, నా భార్య, మా అబ్బాయి, ఇంకా నా భార్య కాలేజ్‌ తమ్ముడు మాత్రం మిగిలిపోయాం. రాత్రి భోజనం.. నాలుగు కిలోమీటర్ల దూరంలోనున్న ఓ హోటల్లో. ఇంటికి సంబంధించిన ప్రత్యేకతలను మాట్లాడుకుంటూనే భోంచేశాం. 

‘ఇది నా సొంతిల్లు’అని కాలర్‌ను ఒక అంగుళం పైకి లేపి, ఇంటికి చేరుకుని తలుపు తాళం తీయగానే బెదిరిపోయేంతటి పని. ఒక బూడిదరంగు ఆకారం గభాల్న వంటగదివైపు వెళ్తున్నట్లుగా అనిపించింది. అది నిజమా? లేక భ్రమా? ఒక ఆకారమా? లేక కదలికనా? ఒక మిల్లీసెకండ్‌ మాత్రమే. లైట్‌ స్విచ్‌ వేశాను.

మల్లెపూల వాసన. పొద్దున్నే పూజ చేసిన ఇల్లు. పూజకు విచ్చేసిన చాలామంది మహిళలు పట్టు చీరలు, మల్లెపూలతో వచ్చి వెళ్ళినందుకు గుర్తుగా ఈ మల్లెపూల వాసన. నన్ను నేను సమాధాన పరచుకున్నాను. హరి, సీత లోపలిగదిలో పడుకోగా.. నేనూ, మా బావమరిది హాల్లో పడుకున్నాం.

కిటికీలు తెరిచే ఉన్నాయి. పక్కనే కట్టడాలు లేనందున కాస్తంత గాలివాటంగా అనిపించింది. గేటు దగ్గర లైట్లను ఆర్పేయలేదు. అలసటతో వెంటనే గాఢ నిద్రలోకి జారుకున్నాం. 

అర్ధరాత్రి. మెదడులోని నరాలను దడదడలాడించిన ఒక పెద్ద అరుపు. ‘ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ...!’ అరిచింది మా బావమరిది. అదిరిపోయి లేచాను. ‘ఏయ్, ఏమైయ్యింది?’ అంటూ నిద్రలోనున్న తనను కుదిపాను. 

‘ఎవరో నా మీద కూర్చుని గొంతు నులుముతున్నారు’ తను మాట్లాడలేక పోతున్నాడు. దీర్ఘశ్వాస తీసుకుంటున్నాడు. చెమటతో తడిసి ముద్దయిపోయాడు. ఆలోపు కేకలను విన్న సీత పరుగుపరుగున హాల్లోకి వచ్చింది. లైట్లన్నీ వెలిగించాం. 

‘గొంతు నులుముతున్నారా? ఎవరు? నేను నీ పక్కనే పడుకున్నాను కదా?’అంటూ నేను మాట్లాడుతుండగా, కిటికీవైపు ఓ చిన్న సంచలనం. అటువైపు తీక్షణంగా చూస్తే, వేపచెట్టు గాలికి అటు ఇటు ఊగుతుండటం కనిపించింది. ఆ క్షణంలో వేపచెట్టుపై పొగలు.. నిజంగా అది పొగేనా లేక నా భ్రమా అని ఆలోచించేలోపు, గదిలో ఒక

విచిత్రమైన వాసన వ్యాపించి, క్షణంలో మాయమైపోయింది.  
‘రోజంతా కంప్యూటర్లో మనుషులను నరకడం, పొడవటం వంటి గేమ్స్‌ ఆడటం, రాత్రిపూట కేకలు పెట్టడం..’ తమ్ముడి కేకలకు తగిన కారణాన్ని చెప్పింది సీత.

సీత ధైర్యవంతురాలు. తన తండ్రిది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కావడం వలన పలు ప్రాంతాల్లో, పలువిధాలైన ఇళ్ళల్లో నివసించింది. కొత్త ప్రదేశాలు, కొత్త ముఖాలు, కొత్త పరిస్థితులు ఆమెనేమాత్రం ఇబ్బంది పెట్టవు. నాకైతే రాత్రిపూట కిటికీలోంచి చూసేందుకే భయంగా ఉంది. 

‘ఏం లేదు. ఏదో కల. లైట్‌ ఆఫ్‌ చేసి నిద్రపోండి’అంటూ మా భయాన్ని వెనక్కి నెట్టేసింది సీత. అయినప్పటికీ, ఆ తరువాత ఎవ్వరికీ నిద్రపట్టలేదు. ఇంటి చుట్టూ ఏదో తిరుగాడుతున్నట్లుగానే భావించాం. పొద్దున్నే పాలు కొనుక్కొచ్చేందుకు మెయిన్‌ రోడ్డు దుకాణానికి వెళ్ళినప్పుడు, ఎంతో ఆసక్తిగా అడిగాడు ఆ దుకాణాదారుడు.

‘నాలుగోవీధి ఇంట్లోకి కొత్తగా వచ్చారా?’
‘అవును’
‘రేటు తక్కవనగానే వెంటనే కొనేశారా?’ ఆ ప్రశ్నలో ‘మోసపోయారులే!’అనే ధోరణి. 
‘లేదు, ఇల్లు మాకు బాగా నచ్చింది.’

‘ఆ ఇంట్లో ఉండేవాళ్ళు ఒక్కరోజు కూడా ప్రశాంతంగా నిద్రపోయింది లేదని చెబుతుండేవారు. చాలామంది ఆ ఇంటిని ఖాళీ చేసి వెళ్ళిపోయారు’ అంటూ ఆ దుకాణాదారుడు పాలప్యాకెట్‌ను అందించేలోపు, ఆ ఇంటి స్థల పురాణాన్ని వివరించాడు. 

‘అలాంటిదేమీ లేదే!’ అని చెప్పి, పాలప్యాకెట్‌తో అక్కడ్నుంచి బయటపడ్డాను. ఇంటికి చేరుకోగానే ఆ దుకాణాదారుడు చెప్పిన విషయాన్ని సీతకు చెప్పాను. ఆమె ఏమాత్రం చలించలేదు. ‘ఇళ్ళ ధరలను తగ్గించేందుకు బ్రోకర్లు చేసే మాయాజాలం ఇది. దెయ్యం లేదు, గియ్యం లేదు. మీరు ఏకాలంలో ఉన్నారు?’ అంటూ ప్రశ్నల వర్షాన్ని కురిపించింది. 

‘ఈరోజు రాత్రి కూడా ఇక్కడే నిద్రపోదాం’అని సీత గట్టిగా చెప్పడంతో, ‘నేను కాలేజ్‌కు వెళ్తున్నాను’అంటూ బావమరిది బయలుదేరాడు. 
రాత్రయ్యింది. దేవుళ్ళ పటాలకు స్పెషల్‌ పూజలు చేసింది సీత. లోపలిగదిలో పడుకోకుండా హాల్లోనే పడుకున్నాం. జీరోవాట్‌ బల్బ్‌ వెలుగుతూనే ఉంది.

తల పక్కన చీపురును, చెప్పులను పెట్టుకున్నాం. దెయ్యాన్ని తలచుకుంటూ పడుకోవడం వలన భయంతో కూడిన కలత నిద్ర. ఏదో ఒక క్షణంలో నిద్రలోకి జారుకుంటుండగా, పక్కన అటు ఇటు కదిలిన మోతలను విని, క్రీగంట చూడగా, సీత లోపలి గదిలోని బాత్రూమ్‌కు వెళ్తుండటం కనిపించింది.

ఆమె మరలా వచ్చి పడుకుంది. కళ్ళు మూసుకోవడానికి ప్రయత్నించాను. కళ్ళు పూర్తిగా మూతబడలేదు. అంతలోపు.. అదేంటి?! ఒక ఆకారం. నలుపా, తెలుపా, బూడిద రంగా.. తెలియడం లేదు. గదిలో ఒక మూల నిలబడి ఉంది. క్షణంలో సదరు ఆకారం అక్కడ్నుంచి మాయమైపోయింది. ఒకవిధమైన వేడిగాలి నన్ను రాసుకుంటూ వెళ్ళినట్లనిపించింది. 

‘సీతను లేపుదామా?’అని అనుకుంటున్నంతలో...
‘ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..’ సీత పెద్దగా కేకలు పెట్టింది. ‘ఎవరో గొంతు నులుముతున్నారు.. నులుముతున్నారు.. ’ అంటూ కేకలు. అంతకుమించి మాట్లాడలేక పోతోంది. కిటికీవైపు ఏదో ఆకారం కదులుతోన్న విషయాన్ని ఇద్దరం గమనించాం.

కిటికీ తలుపులు మెల్లగా కదిలాయి. గభాల్న ట్యూబ్‌లైట్‌ స్విచ్‌ వేశాను. సీత కూర్చుని ఉంది. ఒళ్ళంతా చెమటలు. తెల్లగా పాలిపోయి నట్లనిపించింది. కిటికీలోంచి ఎవరో మమ్మల్ని చూస్తున్నట్లుగా ఓ భావన. కిటికీ తలుపులు మూయడానికి భయంగా అనిపించింది. 

‘వద్దు, ఈ ఇల్లు మనకొద్దు’ సీత వణుకుతూనే చెప్పింది. 
ఆ రాత్రంతా జాగారమే. సూర్యోదయం కోసం కాచుకుని కూర్చున్నాం. ఆ రోజే పాత ఇంటికి చేరుకున్నాం (ఆ ఇంటిని ఖాళీ చేయకపోవడం వల్ల). ఆ తరువాత నా జీవితమే మారిపోయింది. నా ముఖపుస్తకం స్నేహితుల పట్టికలో జ్యోతిష్యులు, పూజారులు, స్వామీజీల సంఖ్య పెరిగింది.

కొత్త ఇంట్లో దెయ్యాలను తరిమే పూజలు వరుసగా చేయబడ్డాయి. ఒక్కో పూజా కార్యక్రమం ముగియగానే ‘దెయ్యం పారిపోయిందా?’ అనుకుంటూ, ఆరోజు రాత్రి ఆ ఇంట్లో బసచేసి పరీక్షించడం వాడుకగా మారిపోయింది. ముప్పైలక్షల రూపాయలు లోను తీసుకున్నందుకు నెలకు ముప్పైవేలు ఇన్‌స్టాల్‌మెంట్‌ కట్టాల్సి వస్తోంది. 

ఏదో ఒకటి చేయమని మనస్సు గొడవపెడుతుండటంతో నాకు శీను గుర్తుకొచ్చాడు. నేను చదువుకున్న కాలేజ్‌ హాస్టల్లోని ఒక గదిలో ఓ దెయ్యం ఉండేది. ఆ గదిలోకి ఎవరు వెళ్ళినా మెడపట్టుకుని బయటకు నెట్టేస్తుండేదట. నాకు ఆ అనుభవం లేదు. కానీ ఆ గదిలో పడుకున్నవారు, అర్ధరాత్రి దాటగానే గడప దగ్గరకొచ్చి పడిపోతుండేవారు. దాంతో గదివైపు వెళ్ళేందుకు ఎవ్వరూ సాహసించేవారు కాదు. 

అయితే ఆ గదిలో ఒకడు బస చేశాడు. అతడే శీను. మా క్లాస్‌మేటే. తరగతులకు హాజరయ్యేవాడు కాదు. బోల్డన్ని అరియర్స్‌. ఆ విషయమై ఏమాత్రం కలత చెందేవాడు కాదు. ఒకరోజు నుదుటిపై నామాలతో దర్శనమిచ్చేవాడు.

ఇంకోరోజు మెడలో రుద్రాక్షమాలతో. వేరొకరోజు మెడలో శిలువతో. ఒకరోజు భుజానికి వేలాడే సంచి, ఇంకోరోజు చేతిలో చిన్న బ్రీఫ్‌కేస్‌. తను, ఏరోజు, ఎలా దర్శనమిస్తుంటాడనేది ఎవ్వరికీ తెలియదు. చొక్కాజేబులో ఒక అమ్మాయి ఫొటో తెలిసీతెలియనట్లుగా కనబడుతుండేది. ఎవరు అని అడిగితే, ‘నేను పెళ్ళి చేసుకోబోతోన్న అమ్మాయి, ఊర్లో ఉంది’ అని చెప్పేవాడు. 

ఒకరోజు.. ‘సినిమాకెళ్దాం, వస్తావా?’అని అడిగినంత ఈజీగా ‘ఈ రాత్రి శ్మశానానికి వెళ్తున్నా.. వస్తావా?’ అంటూ క్యాంటిన్‌లో టీ తాగుతోన్న నన్ను అడిగాడు. 
‘శ్మశానమా?’
‘ఏం భయపడనక్కర్లేదు. ఒక దారాన్ని టెస్ట్‌ చేయబోతున్నాను.’

‘దారమా?!’ అని నేను అడుగుతుండగానే జేబులోనుంచి రకరకాల రంగుల్లోనున్న దారాన్ని తీశాడు. దానికి ఒక చివర ఒక చెట్టు ఆకును కట్టి, ఇంకొక చివర గోరును కట్టాడు. ‘దీనిని నేపాల్లో ఒక స్వామిజీ దగ్గర తీసుకున్నాను. మెడలో వేసుకుని చూస్తే, దెయ్యాలు మన కళ్ళకు కనబడుతాయట, చూద్దాం, వస్తావా?’

‘సరే’నంటూ ఊరకనే తలాడించాను. అయితే ఆ రాత్రి తనూ రాలేదు, నేనూ తనకోసం వెదకలేదు. మరసటిరోజు అందరం క్యాంటిన్లో‌ టీ తాగుతుండగా వచ్చాడు. రాత్రి శ్మశానంలో ఒక దెయ్యంతో మాట్లాడానని చెప్పాడు. జేబులో బూడిదను చూపించాడు. వెంటనే తన మాటలను విన్న రఘు, ‘పొయ్యిలోని బూడిదను తీసుకొచ్చి సినిమా చూపిస్తున్నావా?’ అంటూ శీనుని ఎగతాళి చేశాడు.

శీనుకి కోపం పొంగుకొచ్చింది. ‘వానస చూడు, ఇది పొయ్యిలో బూడిదా?’ అంటూ ఆ బూడిదను ముక్కు దగ్గర పెట్టగానే, గాడ్‌ ప్రామిస్‌గా అది పొయ్యిలో బూడిద వాసన కాదు. శ్మశానంలో శవాలను కాల్చుతున్నప్పుడు వచ్చే వాసన. వెంటనే అక్కడ్నుంచి ముందుకు కదిలాం. 

అయితే రఘు వదల్లేదు. ‘ నువ్వు నిజంగా దెయ్యంతో మాట్లాడి ఉంటే.. మన హాస్టల్‌ రూములోనున్న దెయ్యంతో కూడా మాట్లాడి, దాన్ని అక్కడ్నుంచి వెళ్ళిపోమ్మని చెప్పు మరి’ అన్నాడు. 

హాస్టల్లోని దెయ్యం సంగతి శీనుకి అప్పటిదాకా తెలియదు.  విన్నవెంటనే, రాత్రికి రాత్రే దెయ్యాన్ని తరిమేస్తానని చెప్పాడు. చెప్పినట్లుగానే ఆరోజు రాత్రి ఓ సంచితో దెయ్యం గదిలో బసచేశాడు. పొద్దున్నే నవ్వుతూ బయటకు వచ్చాడు. ‘దెయ్యాన్ని వెళ్ళిపొమ్మన్నాను. ఇకమీదట ఆ గదిలోకి రాదు. పాపం, తల దాచుకునేందుకు చోటులేక ఈ రూముకు వచ్చిందట’ అంటూ శీను  చెబుతోన్న మాటలు విన్న హాస్టల్‌ నోరెళ్ళబెట్టింది.

ఆ తరువాత స్టూడెంట్స్‌కు కొంచెం ధైర్యం కలగి ఆ గదిలో బస చేయసాగారు.  అప్పటి నుంచి ‘వాడికి మంత్రవిద్యలు తెలుసు. చేతబడులు చేస్తాడు’ అంటూ శీను గురించి రకరకాల కథనాలు సర్వత్రా వ్యాపించసాగాయి. తనని చూస్తేనే చాలు, స్టూడెంట్స్‌ అందరూ  పక్కకు తొలగిపోవడం మొదలెట్టారు.

కాస్తోకూస్తో నేనే మాట్లాడేవాడిని. పరీక్షలప్పుడు నోట్స్‌ ఇవ్వడం, తను చెప్పే చిత్రమైన కథలను ఆస్తకిగా వినడం చేస్తుండేవాడిని. నన్నొక్కడినే తన స్నేహితుడిగా భావిస్తుండేవాడు.  

అలా హాస్టల్లోని దెయ్యాన్ని తరిమేసిన శీను ఇంట్లోని దెయ్యాన్ని తరిమేయలేడా?! శీనుని వెదకాలి! అతనికి సంబంధించిన ఎటువంటి కాంటాక్ట్స్‌ లేవు. ఫేస్బుక్‌లో వెదికాను. దెయ్యం శీను తప్ప ఎంతోమంది శీనులున్నారు. ఫ్రెండ్స్‌ను అడిగినా ‘తెలియదు’అనే చెప్పారు. నమ్మకాన్ని కోల్పోతోన్న సమయంలో ఓ చిన్న జ్ఞాపకం.

ఈ–మెయిల్‌ వాడుకలోకి వచ్చిన కొత్తలో తనకొక మెయిల్‌ను పంపించాను. జి–మెయిల్‌ రాని హాట్‌మెయిల్‌ కాలమది. వెదికాను. దొరికింది. 
‘డియర్‌ శీనూ, నేను గుర్తున్నానా? ఎలా ఉన్నావ్‌? ఎక్కడున్నావ్‌? నీ సాయం కావాలి..’ నాలుగే వాక్యాలు నా నుంచి. మరుసటిరోజే శీను నుంచి జవాబు స్పష్టమైన ఆంగ్లంలో.. ‘నిన్ను మరచిపోగలనా? సెమిస్టర్‌ పరీక్షలప్పుడు నువ్వు సాయం చేయకపోయుంటే పాసయ్యేవాడినే కాదు. ఏం హెల్ప్‌ కావాలి?’ అంటూ!

నా దయనీయమైన పరిస్థితి వివరిస్తూ మరొక మెయిల్‌ పంపించాను. దానికీ జవాబు వచ్చింది.. ‘వచ్చే శనివారం చెన్నైకి వస్తున్నాను. కలుద్దాం. మీ దెయ్యం ఇంటి అడ్రసు పంపించు’ అంటూ. 
∙∙ 
శీను వస్తానన్న రోజు వచ్చేసింది. కొత్త ఇల్లున్న వీధిలో ఎదురు చూడసాగాను అతని కోసం. దూరంగా ఒక ఆకారం వస్తూ కనిపించింది. శీనూ!! పెద్దగా మారలేదు. భుజానికి ఒక సంచి వేలాడుతోంది. ‘శీనూ, బాగున్నావా? ఎక్కడ ఉంటున్నావ్‌? అడగ్గానే వచ్చినందుకు థ్యాంక్స్‌’ ఉత్సాహంగా పలకరించా. 

‘థ్యాంక్స్‌గీంక్స్‌ ఎందుకు రామ్‌! ఈ ఇల్లేనా?’
‘అవును. కొని రెండు నెలలైంది. ఒకటే గొడవ. నువ్వే ఆ దెయ్యాన్ని తరిమేయాలి’
నవ్వుతూ ‘నో ప్రాబ్లం. ఈ రాత్రే తరిమేస్తాను. నువ్వు ఇంటికెళ్ళి పొద్దున్నేరా. నేనిక్కడే పడుకుంటాలే’ అన్నాడు. 

‘నీకేమైనా హెల్ప్‌ కావాలంటే, నేను ఉండాలి కదా’ మనస్సులో భయంగా ఉన్నప్పటికీ అడిగాను.  
‘అవసరం లేదులే’ అని శీను చెప్పగానే  ఊపిరి పీల్చుకుంటూ ‘రా.. హోటల్‌కెళ్ళి తినొద్దాం’ అన్నాను. ‘నో థ్యాంక్స్‌. నేను తినే బయలుదేరాను. ఒక పూజ చేయాలి. నువ్వెళ్ళు’ అన్నాడు.

‘ఓకే. రేప్పొద్దున్నే వస్తాను’ అంటూ ఇంటికి బయలుదేరాను. మరుసటిరోజు ఉదయం నేను వచ్చేసరికే ఇంట్లో శీను లేడు. తలుపు మీద మాత్రం ఓ చీటీ అతికించి ఉంది.. ‘రామ్, నన్ను మన్నించు. నువ్వు వచ్చేంతవరకు వేచివుండలేకపోయాను.

వేరే పనిమీద వెళ్తున్నాను. ఇకమీదట ఈ ఇంట్లో దెయ్యం గొడవే ఉండదు. నీ ఋణశేషాన్ని తీర్చుకున్నట్లయ్యింది. – ప్రేమతో..  శీనూ’ అంటూ.

‘అయ్యో శీను మొబైల్‌ నంబర్‌ కూడా తీసుకోలేదే’ అని నొచ్చుకున్నాను. తను వెళ్ళడం కంటే, దెయ్యం పారిపోయిందా? లేదా? అన్నదే నా అనుమానం. ఆరోజు రాత్రి బంధువులతోపాటు ఆ ఇంట్లో బస చేశాం. మల్లెపువ్వుల వాసన, వేడిగాలులు లేవు. విచిత్రమైన కదలికలూ లేవు.

నెలరోజుల నుంచి ఆ ఇంట్లోనే ఉంటున్నాం. ప్రశాంతంగా గడవసాగింది ఓరోజు నా కాలేజ్‌మేట్‌ను కలిసేంతవరకు. ఐదు నిమిషాల సంభాషణ తరువాత, శీనుని కలుసుకున్న సందర్భాన్ని గురించి చెప్పాను. 

‘ఏ శీనూ?!’.. ‘రేయ్, శీనూనే మరిచిపోయావా? మన హాస్టల్లో దెయ్యాన్ని తరిమిన శీనూ’
‘వాడా?’.. ‘అవును’.. ‘ఎప్పుడు కలిశావు?’.. ‘పోయిన నెల ఇక్కడకు వచ్చాడు!’
‘ఏందీ.. పోయిన నెలా? వాడు చచ్చిపోయి ఐదారు సంవత్సరాలవుతుందే?! ప్రేమించిన పిల్ల దొరకలేదని ఆత్మహత్య చేసుకున్నాడు!’  
-రంజన్‌
చదవండి: కథ: చివరి ప్రయాణం.. నేను ఇంకెంతో కాలం బతకనని డాక్టర్లన్నారు! గొప్ప క్షణాలు
కథ: భార్య, ఇద్దరు పిల్లలతో కేరళ టూర్‌.. అశ్వతితో నాకున్నది ప్రేమ కాదు! ఐతే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement