అది 1983 జూలై 24, అమెరికా, లాస్‌ఏంజెలెస్ శివార్లలో డంప్‌యార్డ్‌లో అదే ఏడాదికి చెందిన ఒక డైరీ చెత్తకుప్పలో తెరిచినట్లుగా పడుంది. దానిలోని పేజీలు గాలికి రెపరెపలాడుతున్నాయి. అటుగా వచ్చిన అటెండెంట్ అప్రయత్నంగా ఆ డైరీ తీసి, పేజీలు తిప్పుతుంటే, అతడి చూపు ఒక వాక్యం దగ్గర ఆగిపోయింది. ‘ఈ అమెరికన్స్ సహృదయులు. వీరి మనసులు ఎంతో స్వచ్ఛంగా ఉన్నాయి’ అనే లైన్ చదివి అతడు గర్వంగా నవ్వుకున్నాడు. ఆ డైరీలోని రాతలు జూలై 21తో ఆగిపోయాయి. వెంటనే అతడు తలెత్తి చుట్టూ చూశాడు. అప్పుడే కాస్త దూరంలో చెత్తకుప్పల మధ్య ఒక హ్యాండ్ బ్యాగ్ కనిపించింది. దానిలో రెండు పాస్‌పోర్టులు, అంతకుముందు ట్రావెల్ చేసిన కొన్ని టికెట్స్ ఉన్నాయి.
ఒక పాస్‌పోర్ట్, డైరీ రాసిన మారియా వాహిన్స్ అనే 25 ఏళ్ల అమ్మాయిది, రెండవ పాస్‌పోర్ట్ ఆమె స్నేహితురాలు మేరీ లిలియన్‌బర్(23)ది. ఇద్దరూ స్వీడిష్ యువతులే! ‘పొరబాటున వారెక్కడో వీటిని పారేసుకుంటే, ఇక్కడికి చేరి ఉంటాయి’ అని భావించిన ఆ అటెండెంట్ వాటిని పోలీసులకు ఇచ్చి, ఆ అమ్మాయిలకు అందించాలని కోరాడు.అయితే పదిరోజులు గడిచేసరికి మేరీ, మారియాలు ఏమయ్యారో తెలియడంలేదని స్వీడన్స్ నుంచి వారి పేరెంట్స్ అమెరికాకి వచ్చి, కాలిఫోర్నియా అధికారులకు కంప్లైంట్ ఇవ్వడంతో, పత్రికలు మొదటిపేజీ వార్తకు సిద్ధమయ్యాయి. అప్పటికే వారి వివరాలు రికార్డ్స్‌లో ఉండటంతో విచారణను డంప్‌యార్డ్ నుంచి మొదలుపెట్టారు.
స్వీడన్ నుంచి వచ్చిన మేరీ, మారియా.. కొలరాడో, వైల్‌లోని ఒక రిసార్ట్ హోటల్‌లో చాంబర్ మెయిడ్స్‌గా పని చేసేవారు. ఒకే దేశానికి చెందినవారు కావడంతో స్నేహితులుగా మారడానికి ఎంతోకాలం పట్టలేదు. వారి స్నేహం ఇరు కుటుంబాలకు.. ఒకరికొకరు ఉన్నారన్న ధైర్యానిచ్చేది. అయితే వారిద్దరికీ పర్యాటకంపై ఆసక్తి ఉండటంతో, వారిలో హిచ్ హైకింగ్ (అపరిచితులను లిఫ్ట్ అడుగుతూ, పలు ప్రాంతాలను సందర్శించడం) చేయాలనే ఆశ మొదలైంది. హిచ్ హైకింగ్‌తో కాలిఫోర్నియా మొత్తం తిరగాలని ఇద్దరూ ప్లాన్స్ చేసుకున్నారు. పర్వతాలు, అడవులు ఉండే చోట హిచ్ హైక్ చేయడం అమ్మాయిలకు అసలు సురక్షితం కాదని తోటి స్వీడిష్ స్నేహితులతో పాటు పలువురు అమెరికన్లు కూడా వారిని హెచ్చరించారు.
లాంటి ప్రమాదాన్నైనా, ఎవరి మోసాన్నైనా ముందే గ్రహించే శక్తి, తెలివి తమకున్నాయని వారు సమాధానమిచ్చేవారు. ఆత్మరక్షణ కోసం కత్తి కూడా ఉందని తీసి చూపించేవారు. అలాంటి ట్రిప్స్‌కి పోవద్దని మేరీని ఆమె తండ్రి ఓవ్ ఫోన్స్ లో బతిమాలాడు. ‘ఈ ఒక్క సారికే’నని మేరీ మాటివ్వడంతో ఓవ్ ఒప్పుకున్నాడు. జూలై 12 నుంచి వారి ట్రిప్ మొదలైంది.పోలీసుల విచారణకు మారియా డైరీ చాలా ఉపయోగపడింది. ఏరోజు ఎక్కడ తిరిగారో డైరీలో పరిశీలిస్తూ, చాలామంది డ్రైవర్స్‌ని అధికారులు ప్రశ్నించారు. వారిలో కొందరు మేరీ, మారియాల ఫొటోలు చూసి గుర్తుపట్టారు. మార్క్ అనే ఒక ట్రక్ డ్రైవర్.. ‘వీళ్లకు నేను శాన్స్ డియాగో నుంచి లాస్ ఏంజెలెస్‌లోని కాంప్టన్స్ వరకు లిఫ్ట్ ఇచ్చాను.
ఇలాంటి ప్రయాణాలు అమ్మాయిలు చేయడం మంచిది కాదని సలహా కూడా ఇచ్చాను’ అని చెప్పాడు. అలా రకరకాల ఆధారాలను సేకరించిన పోలీసులు.. శాంటా మారియా సమీపంలో హైవే 166పై ఒకచోట వారి బట్టలు, ఇతర వస్తువులను కనుగొన్నారు. మరో 4 వారాల తర్వాత శాంటా బార్బరా సమీపంలో వేటగాళ్లకు కుళ్లిన రెండు మృతదేహాలు కనిపించాయి. సమాచారం అందగానే అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహాలను డీఎన్‌ఏ పరీక్షలకు పంపించారు. అవి మేరీ, మారియాలవేనని, వారిపై లైంగిక దాడులు జరిగాయని, ఆపై కత్తితో పొడిచి చంపేశారని తేలింది. కానీ కేసు అంతకుమించి ముందుకు పోలేదు.
సుమారు ఏడెనిమిదేళ్ల తర్వాత(1991లో) కాలిఫోర్నియాలోని శాన్స్ డియాగోలో ఉన్న స్వీడిష్ కాన్సులేట్‌కి ఒక అజ్ఞాత వ్యక్తి కాల్ చేసి.. ‘మేరీ, మారియాలను చంపిన కిల్లర్ ఎవరో నాకు తెలుసు!’ అనడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ‘కిల్లర్ పేరు లోరెన్స్ , అతడు కెనడాకు చెందినవాడు. ఆరడుగులుంటాడు. ప్రతి ఏడాది శీతకాలం అమెరికాలోని శాన్స్ డియాగో మీదుగా మెక్సికోకు తన వ్యాన్స్ లో ట్రెక్కింగ్‌కి వచ్చేవాడు. అలా వచ్చినప్పుడే నాకు పరిచయమయ్యాడు.
అతడు తీవ్రమైన స్త్రీ ద్వేషి. సుమారు ఆరేళ్ల క్రితం తాను నన్ను కలిసినప్పుడు ఇద్దరు స్వీడిష్ అమ్మాయిలకు తన వ్యాన్స్ లో లిఫ్ట్ ఇచ్చానని చెప్పాడు. మేరీ, మారియాల మర్డర్ కేసు గమనిస్తుంటే.. లోరెన్ లిఫ్ట్ ఇచ్చిన స్వీడిష్ అమ్మాయిలు వీరే కావచ్చనిపిస్తోంది. అతడు స్త్రీ ద్వేషి కాబట్టి అతడే వారిని ఏమైనా చేసి ఉండొచ్చు’ అని అజ్ఞాత కాలర్ చెప్పాడు. అయితే అధికారులు అతడ్ని ‘మీ పేరేంటి?’ అని ఆరా తీయడంతో భయపడి ఫోన్ పెట్టేశాడు. కొంతకాలానికి అధికారులు టెక్నాలజీని ఉపయోగించి ఆ కాల్ చేసిన అజ్ఞాత వ్యక్తిని కనిపెట్టగలిగారు. మరోసారి ఆరా తీసి, అతడు అబద్ధం చెప్పడం లేదని నిర్ధారించుకున్నారు. అయితే అది కేవలం అతడి అనుమానం కావచ్చని భావించారు.
1999లో స్పీడ్ ఫ్రీక్ కిల్లర్స్‌గా కాలిఫోర్నియాను వణికించిన ఇద్దరు నరరూప రాక్షసులను వేరే పలు కేసుల్లో అరెస్ట్ చేసి, నేర నిర్ధారణ చేయడంతో వారిద్దరికీ జీవిత ఖైదు పడింది. వారిద్దరూ కలిసి సుమారు 15 హత్యలు చేసినట్లు తేలింది. అయితే ఆ ఇద్దరు కిల్లర్స్‌లో ఒకడి పేరు లోరెన్స్ (అజ్ఞాత కాలర్ చెప్పిన పేరు). పూర్తి పేరు లోరెన్స్ హెర్జోగ్. ఇతడే మేరీ, మారియాలను చంపి ఉంటాడని అధికారులు నమ్మడం మొదలుపెట్టారు. అయితే ఈసారి సాక్ష్యమివ్వడానికి.. ఆ అజ్ఞాత కాలర్ అధికారులకు చిక్కలేదు. మరోవైపు అరెస్ట్ అయిన మూడేళ్లకే లోరెన్ జైల్లో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. దాంతో ఈ కేసు మిస్టరీగానే మిగిలిపోయింది.
ఏదేమైనా పెద్దలు, శ్రేయోభిలాషుల హెచ్చరికలను పక్కనపెట్టి, సరదా కోసం మొండితనంతో మేరీ, మారియాలు జీవితాలనే పోగొట్టుకున్నారు. ‘ఈ అమెరికన్స్ చాలా స్నేహస్వభావులు’ అని మేరీ చాలాసార్లు తన తండ్రి ఓవ్‌తో చెప్పేదట. మారియా అవే మాటలు డైరీలో రాసుకుంది. నిజానికి వారి నమ్మకం అపనమ్మకమైన క్షణాల్లో.. వారి జీవితాన్ని మట్టుబెట్టిన అమెరికన్ క్రూరులెవరో నేటికీ ప్రపంచం తెలుసుకోలేకపోయింది. అసలు డైరీ, హ్యాండ్‌బ్యాగ్ డంప్‌యార్డ్‌లో ఎందుకు పడున్నాయి? హైవేపై బట్టలు, అడవిలో మృతదేహాలు దొరికాయంటే.. వారికి, కిల్లర్‌కి మధ్య ఎంతటి ఘర్షణ జరిగుంటుందో? అతడి నుంచి తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నించి ఉంటారో?! ఇలా వేటికీ సమాధానాలు లేవు.
∙సంహిత నిమ్మన
Comments
Please login to add a commentAdd a comment