ప్రభాకర్ ఏమీ తెలియని వాడిలా చదువుతున్నట్లు నటిస్తూ...హఠాత్తుగా రామారావు మీదకు లంఘించాడు. అనుకోని పరిణామానికి రామారావు కనుగుడ్లు తేలేశాడు. మంచం మీద కూర్చున్న రామరావును వెల్లకిల తోసేసి ముఖంపైన దిండును గట్టిగా అదిమి పట్టాడు.
టేబుల్ పైన ల్యాండ్ ఫోన్ మోగడంతో ఇన్‌స్పెక్టర్ సుదర్శన్ ఎత్తాడు.
‘‘నమస్తే సార్! నేను శంషాబాద్ లోటస్ ఫామ్‌హౌస్ నుండి శంకరయ్యను మాట్లాడుతున్నాను... మా అయ్యగారు ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నారు... మీరు వెంటనే రావాలి’’
‘‘నేను మరో పదినిమిషాల్లో అక్కడుంటాను. ఎవరూ శవాన్ని ముట్టుకోవద్దు’’ అని కానిస్టేబుల్ సూర్యంను తీసుకొని జీపులో బయలుదేరాడు సుదర్శన్.
దారిలో అతని సూచనల మేరకు సూర్యం క్లూస్ టీమ్‌కు, అంబులెన్స్‌కు సమాచారమిచ్చాడు.
పోలీస్ జీపు ఆగడం చూసి, శంకరయ్య గేటు తెరచుకుని పరుగు, పరుగున వచ్చాడు.
‘‘ఇందాక తమరికి ఫోన్ చేసిన శంకరయ్యను నేనే సార్!’’ అంటూ ఫామ్‌హౌస్ లోకి దారి తీశాడు. సుదర్శన్, సూర్యంలు అతణ్ణి అనుసరించారు.
బెడ్ రూంలోకి ప్రవేశించే సరికి లుంగీతో ఫ్యానుకు వెళ్ళాడుతున్న దృశ్యం కనబడింది. సూర్యం తన అనుమానాన్ని వ్యక్తం చేశాడు. సుదర్శన్ తలూపుతూ... శవాన్ని మరింత దగ్గరగా వచ్చి పరిశీలించాడు.
ఇంతలో క్లూస్ టీమ్ వచ్చి తమ పనిలో తాము నిమగ్నమయ్యారు. విషయం తెలుసుకుని వచ్చిన గ్రామ పెద్దల సమక్షంలో పంచనామా చేసి, శవాన్ని అంబులెన్స్‌లో పోస్ట్‌మార్టం కోసం తరలించారు.
సుదర్శన్ అడిగిన ప్రశ్నలతో శంకరయ్య చనిపోయిన తన యజమాని పేరు రామారావని చెబుతూ... ‘‘సార్...నిన్న రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో అయ్యగారు క్యాబ్‌లో వచ్చారు. విశాఖపట్టణం నుండి విమానంలో వచ్చానని చెప్పారు. అక్కడ అయ్యగారికి సొంతంగా పెద్ద బట్టలషాపు ఉంది. దాని బ్రాంచి ఒకటి బంజారాహిల్స్‌లో ఉంది. అప్పుడప్పుడు అయ్యగారు వచ్చి పనులు చూసుకొని తిరిగి విశాఖకు వెళుతుంటారు.
‘‘ఎంత కాలం నుండి ఇక్కడ పనిచేస్తున్నావు?’’ అడిగాడు సుదర్శన్.
‘‘నేను ఇక్కడ పనిలో చేరి దాదాపు సంవత్సరం దాటింది సార్... నేను నా భార్య ఈ ఫామ్‌హౌస్‌ను చూసుకుంటాం. సాధారణంగా అయ్యగారికి మేమే వంట చేస్తాం... కానీ నా భార్య అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరింది. అయ్యగారికి హోటల్ నుండి భోజనం తెచ్చి వడ్డించి... తిరిగి ఉదయం వస్తానని ఆసుపత్రికి బయలుదేరాబోతుంటే...’’ అంటూ కంట తడిపెట్టసాగాడు శంకరయ్య.
కొద్ది క్షణాల్లో తేరుకుని తిరిగి చెప్పసాగాడు.
‘‘అయ్యగారు ధర్మ ప్రభువులు. అవసరానికి ఉంచమని ఐదు వేలిచ్చారు. ఉదయం వచ్చేప్పుడు కాఫీ, టిఫిన్ తెమ్మని మరో వంద రూపాయలు కూడా ఇచ్చారు. నేను ఉదయం ఏడు గంటలకు టిఫిన్, కాఫీ తెచ్చి తలుపు తట్టాను. అయ్యగారు ఎంతకూ తలుపు తీయలేదు. కిటికీలో నుంచి చూస్తే... ఫ్యాన్‌కు వెళ్ళాడుతూ కనిపించారు అయ్యగారు. నేను గట్టిగా ఏడుస్తుంటే... రోడ్డుకెదురుగా గుడిసెల్లో ఉన్న వాళ్ళు కొందరు పరుగెత్తుకు వచ్చారు. వారి సాయంతో తలుపులు బద్దలు కొట్టి లోనికి వెళ్ళాను. అయ్యగారిని రక్షిద్దామని కాళ్లు పట్టుకుని పైకి లేపుదామనుకు న్నాను. కాళ్లు చల్లగా తగిలాయి. చనిపోయారని నిర్ధారించుకుని మీకు ఫోన్ చేశాను’’ అంటూ కండువా ముఖానికి పెట్టుకుని కుమిలిపోసాగాడు శంకరయ్య. క్లూస్ టీమ్ గదిలోను, కాంపౌండ్ లోపల అణువణువు జల్లెడ పట్టారు. ఒక చోట మూలగా మామిడి చెట్టు మొదట్లో...కాలిపోయిన పేపర్లు కనిపించాయి. అవి నుసి గాకుండా జాగ్రత్తగా చిన్న చేటలో సేకరించారు. జర్మన్ సాంకేతికతతో రసాయనాన్ని స్ప్రే చేశారు. అవి ఒరిజినల్ రూపంలోకి మారాయి. ఆ ముక్కలను తమ మేధాశక్తితో జతపరుస్తూ...కొంత వరకు సమాచారాన్ని సేకరించారు. అది విశాఖలో చేసుకున్న అగ్రిమెంట్ దస్తావేజు. దానిపై ఉన్న వేలి ముద్రలు సేకరించారు.
హాల్లోని అటాచ్డ్ బాత్ రూంలో, వెంటిలేటర్‌కు ఐరన్ గ్రిల్ లేదు. కేవలం వుడ్ ఫ్రేమ్‌లో నాలుగు గ్లాసెస్ బిగించారేమో...! అన్నీ ముక్కలయ్యాయి. ఒక గ్లాస్ చిన్న ముక్క చెక్కకు బిగుసుకు పోయి ఉంది. అందులో నుండి ఎవరో దూరి వచ్చి, వెళ్ళినట్లుగా సంకేతాలున్నాయి. గ్లాస్ ముక్క మీద రక్తపు మరక స్పష్టంగా కనిపిస్తోంది. దానిని కూడా చెక్క నుండి వేరు చేసి క్లూస్ టీమ్ భద్రం చేసింది. క్లూస్ టీమ్‌తోపాటు అవసరమైన ఫోటోలను సెల్‌ఫోన్‌లో బంధించి, టీ పాయ్ పైన ఉన్న రామారావు సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నాడు సూర్యం.
సెల్ ఫోన్ ఆధారంగా షాపుకు ఫోన్ చేశాడు. రామారావు విషయం వారి కుటుంబానికి తెలియజేయమన్నాడు సూర్యం.
‘‘పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్ వచ్చాక విషయాలు తెలుస్తాయి. ఫామ్‌హౌస్‌కు మీ అయ్యగారిని కలవడానికి ఎవరైనా వస్తుంటారా?’’ అడిగాడు సుదర్శన్.
‘‘ఎవ్వరూ రావడం చూడలేదు సార్!’’ అంటూ చేతులు కట్టుకున్నాడు శంకరయ్య.
‘‘నీ కంటే ముందు ఇక్కడ ఎవరు పనిచేసే వారు?’’ అంటూ అడిగి అతని వివరాలు తీసుకుని సూర్యానికి సైగ చేశాడు సుదర్శన్.
అర్థమయ్యిందన్నట్టు తలూపాడు సూర్యం.
‘‘మేము ఎప్పుడు పిలిచినా మాకు అందుబాటులో ఉండాలి’’ అంటూ శంకరయ్యను చూస్తూ...హెచ్చరించాడు సుదర్శన్.
‘‘అలాగే సార్!’’ అంటూ వినమ్రంగా తలూపాడు శంకరయ్య.
విశాఖపట్టణం నుండి రామారావు భార్య సుమతి, కొడుకు రమేష్ ఫ్లైట్‌లో బయలుదేరి హైదరాబాద్‌లో దిగి క్యాబ్‌లో పోస్ట్‌మార్టమ్ జరుగుతున్న ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడ సుదర్శన్, సూర్యాన్ని కలిశారు. సూర్యం విషయమంతా చెప్పాడు.
వారు కన్నీరుమున్నీరు అయ్యారు, వారిని ఓదార్చడం ఇద్దరి తరం కాలేదు. కాసేపటికి పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్స్ వచ్చాయి.
‘‘ఊహించినట్లే జరిగింది. రామారావును ఊపిరి ఆడకుండా చేసి చంపారు. తరువాత అతను ఉరి వేసుకున్నట్టు చిత్రీకరించారు’’ అన్నాడు సుదర్శన్.
అది విని తట్టుకోలేక పోయింది సుమతి. విశాఖపట్టణంలో రామరావు షాపు వివరాల గురించి రమేష్‌ను అడిగాడు సూర్యం.
‘‘నాన్న గారు జగదాంబ సెంటర్‌లో, పది సంవత్సరాల క్రితం ఐదు లక్షలతో చిన్న రెడీ మేడ్ షాప్ ఓపెన్ చేశారు...తక్కువ సమయంలో వ్యాపారం బాగా పుంజుకుంది. దానిని పెద్దగా విస్తరింపజేసి ఐదు కోట్లకు చేరుకునేలా చేశారు’’ అన్నాడు రమేష్.
‘‘భాగస్వాములు ఉన్నారా...లేక ఒక్కరే చూసుకుంటున్నారా?’’ అంటూ ఆరా తీశాడు సుదర్శన్.
‘‘మాకు దూరపు చుట్టం ప్రభాకర్ పెట్టుబడి పెట్టారు’’
‘‘మీ వ్యాపార లావాదేవీలు ఎవరు చూస్తుంటారు?’’
‘‘ఆంజనేయులు గారు చూస్తుంటారు’’
అతని సెల్ నెంబర్ తీసుకున్నాడు సుదర్శన్.
ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని డెడ్ బాడీనీ ఆసుపత్రి వర్గం అప్పగించింది. రమేష్ కోరిక మేరకు డెడ్ బాడీని అంబులెన్స్‌లో విశాఖపట్టణం తీసుకెళ్లడానికి ఏర్పాటు చేసి–
‘‘సాధ్యమైనంత త్వరలో దోషులను పట్టుకుంటాము’’ అని సుమతి,రమేష్‌ను ఓదార్చి పంపారు సుదర్శన్.
దినపత్రికలన్నీ ‘ప్రముఖ వ్యాపార వేత్త రామారావు హత్య...’ అని తాటికాయంత అక్షరాలతో వార్త ప్రచురించాయి.
కేసును ఒక సవాలుగా తీసుకున్నాడు సుదర్శన్. సూర్యం అత్యంత కీలకమైన సమాచారం సేకరించే సరికి కేసు మూడు రోజుల్లోనే సులభంగా ఛేదించబడింది. వేలిముద్రలు, రక్తపు మరకల ఆధారాలతో నిందితులను అరెస్ట్ చేసుకుని వచ్చాడు సూర్యం. రాత్రంతా ఇంటరాగేట్ చేసి వారి నుంచి స్టేట్మెంట్స్ తీసుకుని కేసు నమోదు చేశాడు సుదర్శన్. ఆ మరునాడు రామారావును హత్య చేసిన హంతకులు దొరికారు. వివరాలు వెల్లడిస్తానని పత్రికల వారితో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాడు సూర్యం. కేసు వివరాలు చెప్పసాగాడు సుదర్శన్....
‘‘సాధారణంగా ఒక వ్యాపారి హత్యకు భాగస్వాముల ప్రమేయం ఉంటుందని ఆ కోణంలో దర్యాప్తు ప్రారంభించాను. రామారావు గారి వ్యాపారంలో మరో భాగస్వామి ప్రభాకర్ నలభై లక్షల పెట్టుబడితో చేరాడు. ప్రభాకర్ బంజారాహిల్స్ లోని షాప్‌ను, ఇతర వ్యవహారాలను చూసుకునే వాడు. అనతి కాలంలోనే సంస్థ కోట్లకు పడగెత్తడంతో అతనిలో దుర్భుద్ది మొదలయ్యింది. సంస్థను ఎలాగైనా తన హస్తగతం చేసుకుని రామరావును తరిమెయ్యాలనుకున్నాడు. దానికి పథకాలు రచించసాగాడు. కాని అతని దురదృష్టం వెన్నంటసాగింది. అనుకోని ఖర్చులు వచ్చాయి.
స్వగ్రామంలో అతను చేసిన అన్యాయాలకు ఫలితంగా అతని ఆస్తి కోర్టుకు అటాచ్ చేయబడింది. దాని నుండి విముక్తి కోసం ఇరవై లక్షలు రామారావు వద్ద అప్పుగా తీసుకున్నాడు. మరో దఫా కొడుకును పై చదువుల కోసం విదేశాలకు పంపాలని, కూతురు పెళ్లి చెయ్యాలనే నెపంతో మరో ఇరవై లక్షలు అప్పుగా తీసుకున్నాడు.
సంవత్సరాలు గడుస్తున్నా అప్పు సంగతి దాటవేస్తున్నాడు ప్రభాకర్. లాభాలలో వాటా మాత్రం అప్పు కింద కొంతైనా జమచేయడం లేదు.
ప్రభాకర్ నుండి డబ్బు రాబట్టడం అంతా తేలికైన పని కాదని...రామారావు న్యాయవాదితో సంప్రదించాడు. అతని సలహా మేరకు ప్రభాకర్ భాగస్వామ్యాన్ని రద్దు చేస్తున్నట్లు అగ్రిమెంట్ చేయించాడు. ‘‘హైదరాబాద్‌కు రెండు రోజుల్లో వస్తున్నాను. మనం ఫామ్‌హౌస్‌లో కలుసుకుందాం’’ అని ప్రభాకర్‌కు సమాచారమిచ్చాడు రామారావు.
ప్రభాకర్‌కు అర్థం కాలేదు. పది రోజుల క్రితమే వెళ్లిన వాడు తిరిగి అకస్మాత్తుగా వస్తూండడం ప్రభాకర్‌కు అనుమానమేసింది. వారి మేనేజర్ ఆంజనేయులుకు ఫోన్ చేసి అసలు విషయం తెలుసుకున్నాడు. వెంటనే తన బుర్రకు పదును పెట్టి పథకం రచించాడు. ఆరాత్రి రామారావు శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో దిగి ఫామ్‌హౌస్ చేరుకునేసరికి రాత్రి ఎనిమిది గంటలయ్యింది. భోజనం చేసి కాసేపు నడుం వాల్చాడు. శంకరయ్య వెళ్ళిన కాసేపటికి ప్రభాకర్ ఫామ్‌హౌస్‌కు వచ్చాడు.
కాసేపు విషయం చర్చించుకున్నాక అతని ధోరణితో సంతృప్తి చెందని రామారావు...
‘‘ప్రభాకర్..నీ పెట్టుబడి మొత్తం అప్పుగా తీసుకున్న దానికి సరిపోయింది. దానికి సంబంధించిన దస్తావేజులు అన్నీ మా లాయరు దగ్గర పెట్టాను. నువ్వు భాగస్వామి అర్హత కోల్పోయావు. నేటి వరకు లెక్కలు చూసి లాభాలలో నీ వంతు వాటా ఇస్తున్నాను కాని ముందుగా ఈ దస్తావేజులపై సంతకాలు చెయ్యి’’ అంటూ అగ్రిమెంటు దస్తావేజులు ఇచ్చాడు రామారావు.
ప్రభాకర్ ఏమీ తెలియని వాడిలా చదువుతున్నట్లు నటిస్తూ...హఠాత్తుగా రామారావు మీదకు లంఘించాడు. అనుకోని పరిణామానికి రామారావు కనుగుడ్లు తేలేశాడు. మంచం మీద కూర్చున్న రామరావును వెల్లకిల తోసేసి ముఖంపైన దిండును గట్టిగా అదిమి పట్టాడు, అప్పటి వరకూ బాత్‌రూంలో, ఈ క్షణం కోసమే అన్నట్టుగా వేచి చూస్తున్న మల్లయ్య అనే ఫామ్‌హౌస్ పూర్వపు కాపాలాదారు పరుగెత్తుకుంటూ వచ్చి రామారావు కాళ్ళను అదిమి పట్టుకున్నాడు. కొన్ని నిమిషాల్లో రామారావు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. తరువాత మల్లయ్య సాయంతో రామారావు లుంగీ ఊడ దీసి మెడకు తగిలించాడు. మరో చివర ఫ్యాన్‌కు కట్టి రామరావును మంచం మీద నుండి నిలబెట్టి మంచాన్ని పక్కకు తోశాడు. వెంటనే లుంగీ రామారావు మెడకు బిగుతుగా బిగుసుకుంది.
ప్రభాకర్ ఆదుర్దాగా అగ్రిమెంటును తీసుకొని గదిలో నుండి బయటకు వచ్చాడు. మల్లయ్య లోపలి నుండి తలుపు గడియపెట్టి, బాత్రూమ్‌లోని వెంటిలేటర్ గుండా ఎలా వచ్చాడో...అలాగే తిరిగి వెళ్ళాలనే ప్రయత్నంలో ఇబ్బంది పడసాగాడు. బయట అతని కోసం ఆతృతగా చూస్తున్న ప్రభాకర్...మల్లయ్య రెండు చేతులు పట్టుకుని కిందకు లాగాడు. మల్లయ్యకు గాజు ముక్క గాయం చేసింది. ఆ రక్తపు మరక మల్లయ్యదేనని తేలింది. మల్లయ్యకు పాతిక వేలున్న సంచినిచ్చాడు. మళ్ళీ ఈ ఛాయలకు రావద్దని హెచ్చరిస్తూ...పారిపొమ్మన్నాడు ప్రభాకర్. తరువాత అగ్రిమెంట్ పేపర్లను తునాతునకలు చేసి ప్రక్కనే ఉన్న మామిడి చెట్టు కింద అగ్గిపుల్లతో తగులబెట్టాడు. ఎవరూ తనని చూడలేదని నిర్ధారించుకుని...అక్కడ నుండి నిష్క్రమించాడు ప్రభాకర్. అగ్రిమెంట్ దస్తావేజు మీద ప్రభాకర్ వేలి ముద్రలు సరి పోయాయి’’ అంటూ కాసిన్ని మంచి నీళ్ళు తాగి సూర్యానికి సంకేతాలిస్తూ ...తిరిగి చెప్పసాగాడు సుదర్శన్...
‘‘ఇంతకూ...మల్లయ్య గురించి చెప్పలేదు. వాడొక తాగుబోతు. గతంలో రామారావు ఫామ్ హౌస్‌లో మల్లయ్యని నియమించింది ప్రభాకరే. నిత్యం సారా మత్తులో ఉండే మల్లయ్య ఫామ్‌హౌస్‌ను పట్టించుకోక పోవడం వల్ల పనిలో నుండి రామారావు తొలగించాడు. ఆ కక్షతో రామరావును హత్య చేయడానికి మల్లయ్య పనికొస్తాడని అతని సహకారం తీసుకున్నాడు ప్రభాకర్. మల్లయ్య ఇంట్లో ప్రభాకర్ ఇచ్చిన రొక్కం...రక్తం మరక అంటిన చొక్కా దొరికాయి’’
ఇంతలో సూర్యం...ప్రభాకర్,మల్లయ్య ముఖాలపై నల్ల గుడ్డ తొడుగులు తొడిగి బయటకు నెట్టుకుంటూ వచ్చాడు.
-యు.విజయశేఖర రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment