అది 2009 ఫిబ్రవరి 2, ఉదయం 7 దాటింది. అమెరికా, న్యూ మెక్సికో రాష్ట్రంలోని, వెస్ట్ మేసాలో అల్‌బుకర్‌కీ ప్రాంతమంతా సందడిగా ఉంది. సమీపంలో నివాసముండే క్రిస్టీన్ రాస్ అనే అమ్మాయి ఎప్పటిలానే ఆరోజు ఉదయం తన పెంపుడు కుక్క రుకాను తీసుకుని వాకింగ్‌కి బయలుదేరింది. తిరిగి వచ్చేటప్పుడు రుకా నోట్లో మనిషి ఎముక చూసి క్రిస్టీన్ హతాశురాలై, వెంటనే పోలీసులకు సమాచారమిచ్చింది.
వెస్ట్ మేసా అనే ప్రాంతం గురించి అప్పటి వరకూ ఆ దేశానికే కాదు, ఆ రాష్ట్రానికి కూడా పెద్దగా తెలియదు. ఆరోజు తర్వాత ప్రపంచమే ఉలిక్కిపడి వెస్ట్ మేసా వైపు చూడటం మొదలుపెట్టింది.
రుసా తెచ్చిన ఎముక ఎక్కడిది? ఎవరిది? అనే కోణంలో దర్యాప్తు మొదలైంది. అధికారుల దృష్టి సమీపంలోని విస్తారమైన మెట్ట ప్రాంతం మీద పడింది. న్యూ మెక్సికో, సౌత్ వ్యాలీలో బెర్నెలీయో కౌంటీకి ఉత్తరాన ఉన్న అరోయో అనే నదీ పరివాహక ప్రాంతమది. అయితే ఆ నది కొన్నేళ్ల క్రితమే ఎండిపోయింది. అలాంటి చోట ఎముక దొరకడంతో తవ్వకాలు మొదలయ్యాయి. తవ్వగా తవ్వగా ఓ అస్థిపంజరం దొరికింది. ఇంతలో ఆ పక్కనే మరో అనుమానాస్పదమైన గుంత దర్శనమిచ్చింది. వెంటనే క్రైమ్ టేప్స్ వేలాడదీసిన అధికారులు, తమ బలగాలను దించారు. ఇంతలో మరో అస్థిపంజరం దొరికింది. దాంతో చుట్టూ విస్తృతంగా తవ్వకాలు జరిపించారు. ఈలోపు మీడియా చుట్టుముట్టింది.
అలా ఒకటి కాదు రెండు కాదు, మొత్తం 11 అస్థిపంజరాలు దొరికాయి. అన్నీ ఆడవారివే! బాధితుల్లో 15 ఏళ్ల బాలిక దగ్గర నుంచి 32 ఏళ్ల మహిళ వరకూ చాలా వయసులవారు ఉన్నారు. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే మృతులలో నాలుగు నెలల గర్భవతి కూడా ఉంది. వీరంతా 2001 నుంచి 2005 మధ్య అదృశ్యమైనవారేనని తేలింది. దీని వెనుక సీరియల్ కిల్లర్ ఉన్నాడని కొందరు, సెక్స్ రాకెట్ ఉందని మరికొందరు ఊహించడం మొదలుపెట్టారు. సీరియల్ కిల్లర్ అని భావించిన వారంతా ‘ది బోన్ కలెక్టర్’ అని పేరుపెట్టారు. మీడియా ఎక్కువ శాతం ఆ వాదనకే ఓటేసింది.ఇడా లోపెజ్ అనే మహిళా డిటెక్టివ్ అప్పటికే అల్‌బుకర్‌కీకి చెందిన సుమారు 19 మంది మహిళలు కనిపించడం లేదని లిస్ట్ తయారు చేసింది.
వారంతా సెక్స్‌వర్కర్స్, డ్రగ్స్ వంటి వ్యసనాలు కలిగినవారే కావడంతో పోలీసులు పెద్దగా దృష్టిపెట్టలేదు. అయితే వెస్ట్ మేసా తవ్వకాల్లో బయటపడిన పదకొండు మందిలో, పదిమంది ఆ లిస్ట్‌లోని వారే కావడంతో ఈ కేసు ఉత్కంఠగా మారింది. ఇడా లిస్ట్‌లో మరో తొమ్మిది మంది ఏమయ్యరో తెలియకపోవడంతో, లిస్ట్‌లో లేని అభాగ్యులు చాలామందే ఇలా ఖననమై ఉంటారని అంచనాకొచ్చారు. ఇక పదకొండో అమ్మాయి, ఓక్లహోమాకి చెందిన 15 ఏళ్ల సిలానియా టెరెన్ (ఆఫ్రికన్ అమెరికన్) అని తేలింది. ఆమె 2003లో ఇంటి నుంచి పారిపోయింది. దొరికిన అస్థిపంజరాలు ఎవరివో తేల్చారు కాని, ఇంతటి ఘాతుకానికి పాల్పడిందెవరో గుర్తించలేకపోయారు.
ఈ కేసులో అనుమానితులు చాలామందే ఉన్నా లోరెంజో మోంటోయా, జోసెఫ్ బ్లీ అనే నేరగాళ్లు ప్రధాన అనుమానితులుగా నిలిచారు. లోరెంజో అనే వ్యక్తి పదకొండు మందిని ఖననం చేసిన ప్రదేశానికి చాలా సమీపంగా నివసించేవాడు. సెక్స్ వర్కర్లపై హింసాత్మక దాడులకు తెగబడి రెండుసార్లు అరెస్టయ్యాడు. అతడు 2006లో 19 ఏళ్ల సెక్స్ వర్కర్ షెరికా హిల్‌ను చంపి, ఆమె శవాన్ని కారు డిక్కీలో పెట్టి తీసుకెళ్లబోతుంటే, షెరికా ప్రియుడు ఫ్రెడరిక్.. లోరెంజోను తుపాకీతో కాల్చి చంపాడు. అతడు షెరికాను చంపిన తీరు చూస్తే అది, అతడి మొదటì హత్య అయి ఉండదని అప్పట్లోనే చాలామంది డిటెక్టివ్స్ భావించారు. అయితే 2009లో వెస్ట్ మేసా తవ్వకాల తర్వాత ఆ రోజు షెరికా బాడీని లోరెంజో వెస్ట్ మేసాలో కప్పెట్టడానికే తీసుకెళ్లబోయాడేమో? అనే అనుమానం కలిగింది. నిజానికి లోరెంజో మరణం తర్వాతే వెస్ట్ మేసా హత్యలు ఆగిపోయి ఉంటాయని అధికారులు నమ్మారు.
2010 డిసెంబర్ 9న అల్‌బుకర్‌కీ పోలీసులు.. గుర్తుతెలియని ఆరుగురు మహిళల ఫొటోలను మీడియాకు విడుదల చేశారు. వారిలో కొందరు అపస్మారక స్థితిలో (ఎవరో కిల్లర్‌కి చిక్కినట్లుగా) ఉన్నారు. అయితే ఆ ఫొటోలు ఏ నేరగాడి కెమెరా నుంచి సేకరించారో అధికారులు చెప్పలేదు కాని, ఇదంతా వెస్ట్ మేసా కేసు దర్యాప్తులో భాగమని వివరించారు. ఆ ఆరుగురిలో ఇద్దరు అమ్మాయిలు సజీవంగా ఉన్నట్లు సమాచారం ఉందని, వారు దొరికితే కిల్లర్ వివరాలు తెలిసే అవకాశం ఉందని వారు చెప్పారు. అయితే ఆ ఇద్దరమ్మాయిలూ దొరకలేదు. ఆ ఆరుగురిలో ఆ ఇద్దరూ ఎవరో కూడా తెలియలేదు.
2015 నాటికి జోసెఫ్ బ్లీ అనే రేపిస్ట్ కూడా వెస్ట్ మేసా కేసులో అనుమానితుడిగా మారాడు. 1980–82 మధ్యకాలంలో అల్‌బుకర్‌కీ సమీపంలోని ఇళ్లలోకి దూరి, 13 నుంచి 15 ఏళ్ల బాలికలపై అత్యాచారాలు చేసి తప్పించుకుని తిరుగుతున్న బ్లీ.. 2015లో ఓ సెక్స్ వర్కర్ హత్యకేసులో అరెస్ట్ అయ్యాడు. డీఎన్‌ఏ నమూనాతో నేరం నిరూపితమైంది. గత నేరాలను కూడా కలిపి బ్లీకి 36 ఏళ్లు జైలు శిక్ష పడింది. పైగా ఈ పదకొండు అస్థిపంజరాలు దొరికిన చోట, క్లూ మాదిరి ఒక నర్సరీ ట్యాగ్ లభించింది.
ఆ నర్సరీని గుర్తించిన అధికారులు.. బ్లీ రెగ్యులర్‌గా అక్కడే మొక్కలు కొనేవాడని తెలుసుకున్నారు. అయితే ఒకసారి బ్లీ.. తన సెల్‌మేట్ ముందు వెస్ట్ మేసా బాధితులను ‘నేను వాడి పడేసిన చెత్త’ అని సంబోధించాడట. కానీ విచారణలో బ్లీ నోరువిప్పకపోవడంతో, కేసు తేలలేదు. మొత్తానికీ ఈ హత్యలన్నీ ఒక్కడే చేశాడా? లేక ఈ ఉదంతం వెనుక ఏదైనా మాఫియా ఉందా? అనేది నేటికీ మిస్టరీనే!
∙సంహిత నిమ్మన
Comments
Please login to add a commentAdd a comment