mystery
-
యూట్యూబ్‌లో ఫ్రీగా ‘మిస్టరీ’
ఓటీటీల వాడకం పెరిగిన తర్వాత ప్రేక్షకుడు థియేటర్స్‌కి వెళ్లడం తగ్గించాడు. సినిమాలో స్పెషల్ కంటెంట్ ఉంటే తప్ప థియేటర్స్‌కి వెళ్లడం లేదు. అందుకే రిలీజ్‌కు ముందే కొత్త కొత్త పంథాలో ప్రమోషన్స్ చేస్తూ సినిమాను జనాల్లోకి తీసుకెళ్తున్నారు. అయితే కొన్ని చిన్న చిత్రాలు బాగున్నప్పటికీ సరైన ప్రమోషన్స్ లేకపోవడంతో థియేటర్లో ఆశించిన స్థాయిలో ఆడడం లేదు. కానీ ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత మంచి స్పందన లభిస్తుంది. అందుకే కొంతమంది చిన్న నిర్మాతలు ఓటీటీ కోసమే సినిమాలను నిర్మిస్తున్నారు. అయితే ఇటీవల ఓటీటీ సంస్థలు కూడా అన్ని సినిమాలను కొనడం లేదు. ముఖ్యంగా చిన్న సినిమాల విషయంలో పరిస్థితి దారుణంగా ఉంది. థియేటర్లో మోస్తరుగా ఆడినా కూడా ఓటీటీకి అమ్ముడు పోవడం లేదు. అందుకే కొన్ని సినిమాలను డైరెక్టుగా యూట్యూబ్‌లో రిలీజ్ చేస్తున్నారు. ఫ్రీగా ‘మిస్టరీ’తల్లాడ సాయి కృష్ణ దర్శకత్వం చేస్తూ నటించిన కామెడీ థ్రిల్లర్ సినిమా "మిస్టరీ". సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమాను య్యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. నేటి(జనవరి 13) నుంచి ఈ సినిమా యూట్యూబ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తనికెళ్ళ భరణి, అలీ, సుమన్, తల్లాడ సాయికృష్ణ, స్వప్న చౌదరి, వెంకట్ దుగ్గిరెడ్డి , రవి రెడ్డి, సత్య శ్రీ, ఆకెళ్ల, గడ్డం నవీన్, శోభన్ బొగరాజు, ఎం.ఎస్ నాయుడు , లు ఇలా ప్రముఖ తారాగణం తో తెరకెక్కిన ఈ సినీమా థియేటర్లలో విడుదలైన చాలా రోజులకి ఓటీటీలోకి వచ్చేసింది. తన సినిమా యూట్యూబ్‌లో స్ట్రీమింగ్ అవుతున్నట్లు తల్లాడ సాయికృష్ణ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.‘మిస్టరీ’ కథేంటి?ఒక మర్డర్ జరగడం, అసలు ఎలా ఆ క్రైం జరిగిందీ అనే కోణం లో సినిమా మొదలు అవుతుంది.కామెడీ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో మంచి స్క్రీన్ ప్లే తో సినిమా సాగుతోంది.మల్టీ లినియర్ స్క్రీన్ ప్లే ని ఈ సినిమా కి ఉపయోగించారు. మ్యూజిక్ షాప్ మూర్తి సినిమా కి సంగీతం అందించిన పవన్ ఈ సినిమా కి బ్యాక్రౌండ్ సంగీతం అందించారు. ఒక గంట 50 నిమిషాలు నిడివిగల ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా నేటి నుంచి యూట్యూబ్‌లో స్ట్రీమింగ్ అవుతుందని, సినిమా చివర వరకు ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ పొందుతారని సాయికృష్ణ అన్నారు. -
Mystery: రక్తబంధం
‘జీవితంలో ఎన్ని అబద్ధాలైనా ఆడవచ్చు. ఎన్ని నిజాలైనా దాచవచ్చు. ఏ తప్పయినా చేయవచ్చు, కానీ ఏదో ఒక రోజు కాలానికి సమాధానం చెప్పాల్సిందే!’ అన్నమాటకు ‘ఫాదర్ ఆఫ్ కాథలీన్ బెల్చర్’ గాథ అద్దం పడుతుంది. సాధారణంగా పుట్టుక తర్వాత కన్నవారి పరిచయంతోనే నమ్మకమనే జీవనప్రయాణం మొదలవుతుంది. కానీ, కాథలీన్ అనే అమ్మాయి జీవితంలో 30 ఏళ్ల తర్వాత ఆ నమ్మకం ముక్కలైపోయింది. నాన్న ఒక అబద్ధమయ్యాడు. అమ్మ ఆ నిజానికి సాక్ష్యమైంది. చివరికి, రక్తపాశం కోసం వెంపర్లాడే పరిస్థితి వచ్చింది. కాథలీన్ ఆనాడే గెలిచి ఉంటే, ఈ కథను ఈనాడు మనం చెప్పుకునే వాళ్లమే కాదు. ఇరవయ్యో శతాబ్దంలో ఫ్లోరిడా ప్రజల మానవసంబంధాలపై ఆలోచింపజేసిన వాస్తవ గాథ ఇది. కాథలీన్ బెల్చర్ డ్యూటీలో ఉండగా, ఒకరోజు తన తల్లి మిరియం టెర్రీ నుంచి ఫోన్ వచ్చింది. ‘మీ నాన్న, ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. ఆసుపత్రిలో చేర్పించాను. డాక్టర్స్ వెంటనే రక్తం ఎక్కించాలంటున్నారు. నువ్వూ, అక్క మియా కలిసి వస్తారా?’ అంది మిరియం.‘సరే అమ్మా! నాన్నది ఏ బ్లడ్ గ్రూప్?’ అడిగింది కాథలీన్ . ‘ఓ’ అని చెప్పింది మిరియం. ‘నాది ‘‘ఏ’’ బ్లడ్ గ్రూప్ కదా?’ అని మనసులో అనుకుంటూ, ‘అవును నీ బ్లడ్ గ్రూప్ ఏంటమ్మా?’ అని తల్లిని అడిగింది అనుమానంగా. ‘బీ’ అంది మిరియం. నిజానికి ఓ, బీ బ్లడ్ గ్రూప్‌లు కలిగిన తల్లిదండ్రులకు, ఆ రెండు గ్రూప్స్‌లో ఏదో ఒక బ్లడ్ గ్రూప్ ఉన్న పిల్లలు మాత్రమే పుడతారు. కాథలీన్ వృత్తిపరంగా నర్స్ కావడంతో తన బ్లడ్ గ్రూప్ పేరెంట్స్‌తో కలవడం లేదంటే, తన పుట్టుక వెనుక ఏదో రహస్యం దాగి ఉందని వెంటనే గుర్తించింది. ఆ ఊహించని చేదు నిజం తెలుసుకోవడానికి తల్లిని నేరుగా కలిసింది. సూటిగా ఆమె కళ్లలోకి చూస్తూ ‘నేను ఎవరి బిడ్డని?’ అంటూ నిలదీసింది. ఇన్నేళ్లుగా ఏ నిజాన్ని అయితే దాచాలని మిరియం తపిస్తోందో అదే ప్రశ్న కూతురు కాథలీన్ నోటి నుంచి రావడంతో ఆమె నిర్ఘాంతపోయింది. తప్పించుకోలేని స్థితిలో నోరువిప్పింది. ‘35 ఏళ్లక్రితం ఆలివర్ బడ్‌తో నా జీవితం ముడిపడింది. అప్పట్లో బడ్ సిన్సియర్ సోల్జర్. రెండో ప్రపంచ యుద్ధంలో ఫ్లోరిడా తరపున పోరాడి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాతి నుంచి తాగుడికి బానిసై, ఆర్మీకి దూరమయ్యాడు. ఆర్మీలో ఉంటేనైనా దారిలో పడతాడని భావించిన బడ్ పేరెంట్స్, అతణ్ణి ఒప్పించి, తిరిగి ఆర్మీకి పంపించారు. కానీ అతడిలో పెద్దగా మార్పు రాలేదు. నన్నూ, మీ అక్క మియాను కొన్నిరోజులు బాగా చూసుకునేవాడు, మరికొన్ని రోజులు పట్టించుకునేవాడే కాదు. మధ్యమధ్యలో వచ్చి తనకు నచ్చినంత కాలం ఉండి వెళ్లిపోయేవాడు. నా జీవితం గురించి ఆలోచించిన బడ్ పేరెంట్స్ నన్ను మరో జీవితం చూసుకోమని నచ్చజెప్పారు. అమెరికా, కోవింగ్టన్ లోని బార్టెండర్ చెట్ నోరిస్ని నాకు పరిచయం చేశారు. అతడు బాక్సర్. అతడితో స్నేహం తర్వాత బడ్‌తో విడిపోవాలనే ఆలోచన మొదలైంది. చెట్తో చనువు పెరిగింది. అతడి కారణంగా తల్లినయ్యాను. అప్పుడే నువ్వు నా కడుపులో పడ్డావు. నీ తండ్రి చెట్ అని నాకు తెలియగానే, ఆ శుభవార్తను అతడితో పంచుకున్నాను. అయితే విడాకుల కోసం బడ్ను కలవడానికి ప్రయత్నించినప్పుడు అతడు జైల్లో ఉన్నాడని తెలిసింది. సైన్యంలో ఉంటూ అక్రమ చర్యలకు పాల్పడటంతో అతణ్ణి జైల్లో పెట్టారు. మొత్తానికి జైల్లోనే అతణ్ణి కలసి విడాకులు కావాలని కోరాను. బడ్ అందుకు మొదట ఒప్పుకోలేదు. తర్వాత ఒప్పుకున్నాడు కాని, మియాను తనకే పూర్తిగా ఇచ్చెయ్యాలని రూల్ పెట్టాడు. అందుకు నేను సిద్ధంగా లేను. దాంతో మీ నాన్న చెట్ను దూరం పెట్టాను. అతడికి నేను గర్భవతిని కాదని, ఏదో పొరబడ్డానని అబద్ధం చెప్పాను. అయినా ఫర్వాలేదు మనం కలిసి జీవిద్దాం అన్నాడు. అతడితో జీవితం కంటే మియాతో అనుబంధమే ముఖ్యమనిపించింది. అందుకే చెట్కి నిర్దాక్షిణ్యంగా బ్రేకప్ చెప్పేశాను. ఆ తర్వాత చెట్ ఏమయ్యాడో ఎక్కడికి వెళ్లాడో నాకు తెలియదు, బడ్ జైలు నుంచి విడుదలైన కొన్ని నెలలకు నువ్వు పుట్టావు. నిన్ను తన బిడ్డే అనుకున్నాడు బడ్’ అని జరిగిందంతా చెప్పుకొచ్చింది మిరియం. అంతా విని అక్కడే కూలబడింది కాథలీన్ . కన్నతండ్రి కోసం ఆమె ఏడవడం మిరియం మనసును మెలిపెట్టింది. నీ అసలు తండ్రిని వెతకడానికి నేను సాయం చేస్తానని మాటిచ్చింది.కాథలీన్ పుట్టాక బడ్ కొన్నాళ్లు భార్యాపిల్లలతో ప్రేమగానే ఉన్నాడు. తాగుడు, చెడు వ్యసనాలు అతణ్ణి ఎక్కువ కాలం మంచివాడిగా ఉండనివ్వలేదు. దాంతో కాథలీన్కి 19 ఏళ్లు వచ్చేనాటికి మిరియం అతడికి విడాకులిచ్చింది. కానీ బడ్ ఆరోగ్యం క్షీణించిన తర్వాత ఆసుపత్రిలో చేర్పించి, ట్రీట్మెంట్ చేయించడంలో మిరియం బాధ్యతగా వ్యవహరించింది. ఏది ఏమైనా కాథలీన్ కన్నతండ్రి చెట్ అని చెప్పడంతో పాటు, గతంలో చెట్తో తాను దిగిన ఒక ఫొటోని కాథలీన్ చేతికి అందించింది మిరియం. పుట్టాక ఒక్కసారి కూడా కన్నతండ్రిని చూడలేకపోయానన్న అసంతృప్తి కాథలీన్ ని తీవ్రంగా వేధించింది. అతడి వివరాలతో ఎన్నో క్లాసిఫైడ్ ప్రకటనలు ఇప్పించింది. మీడియా సమక్షంలో పలు రివార్డులను ప్రకటించింది. తల్లి ఇచ్చిన ఏకైక ఫొటోను ఎన్నో ప్రింట్స్ వేయించి, విస్తృత ప్రచారం చేయించింది.1988లో ఈ నిజం కాథలీన్ కి తెలిసినప్పటి నుంచి, నేటికీ ఆమె తన తండ్రి సమాచారం కోసం వెతుకుతూనే ఉంది. ‘నీ గుర్తుగా నేను ఈ లోకంలో పుట్టాను నాన్నా!’ అని చెప్పడానికి తపించింది. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే, కాథలీన్ అనే కూతురుందన్న నిజం కూడా చెట్కి తెలియదు. ప్రస్తుతం చెట్కి 80 ఏళ్లు దాటి ఉంటాయని అంచనా. చెట్ 1940లో గోల్డెన్ గ్లోవ్స్ బాక్సర్ అనే సమాచారాన్ని కూడా కాథలీన్ వాడుకుంది. కానీ ఫలితం లేదు. మొత్తానికి ఒక తొందరపాటు, ఒక నిస్సహాయత, ఒక పేగుబంధం కలగలసి సృష్టించిన ఈ కథనంలో ఒక కూతురు తండ్రి కోసం పడిన రుణానుబంధం అంతవరకే కాబోలు. అందుకే చెట్ ఏమయ్యాడో నేటికీ మిస్టరీగానే మిగిలింది! ∙సంహిత నిమ్మన -
కామారెడ్డి కేసులో అవన్నీ ఊహాగానాలే!
సాక్షి, కామారెడ్డి: జిల్లాలో కలకలం సృష్టించిన ఎస్ఐ, కానిస్టేబుల్, మరో యువకుడి మృతి కేసులో సస్పెన్స్ వీడలేదు. ఘటన జరిగిన ఏడు రోజులు కావొస్తున్న ట్రై యాంగిల్ సూసైడ్ మిస్టరీ ఇంకా పురోగతి సాధించలేదు. ఎస్ఐ సాయికుమార్, మహిళా కానిస్టేబుల్ శృతి, ఆపరేటర్ నిఖిల్ మృతిపై ఎన్నో అనుమానాలున్నాయి. ముగ్గురు మృతి కేసులో విభిన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతి ఘటనను ప్రత్యక్షంగా చుసినవారు ఐ విట్ నెస్ లేదని ఎస్పీ సింధు శర్మ స్పష్టం చేశారు.ముందుగా ఒకరు చెరువులో దూకడంతో మరో ఇద్దరు కాపాడేందుకు వెళ్లి మృతి చెందారని పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిఖిల్ ప్రాణహాని ఫిర్యాదు విషయంలో కూడా విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. మరో వైపు కామారెడ్డి(Kamareddy) పోలీసులపై కేసు పురోగతిపై ఒత్తిడి పెరుగుతుంది. సైబర్ ఫోరెన్సిక్ రిపోర్టు కీలకంగా మారనుంది. కేసు దర్యాప్తులో అంతా ఊహగానాలే వ్యక్తమవుతున్నాయి.ఈ కేసులో వారి ఫోన్‌కాల్, వాట్సాప్ చాటింగ్ డేటా కీలకంగా మారింది. చనిపోయే రోజు భిక్కనూరు ఎస్ఐ సాయికుమార్, బీబీ పేట కానిస్టేబుల్ శ్రుతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ ఫోన్ లో గంటలకొద్దీ మాట్లాడుకున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరు ముగ్గురు ఈ నెల 25న కామారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలోని అడ్లూర్ ఎల్లారెడ్డి పెద్ద చెరువులో నీటమునిగి చనిపోయిన విషయం తెలిసిందే.ఇదీ చదవండి: ఎస్సై ఐ ఫోన్ వాట్సాప్ చాటింగ్‌లో ఏముందో..బుధవారం వేకువజాము నుంచే వీరు ఫోన్లో మాట్లాడుకున్నట్లు కాల్ డేటా ద్వారా స్పష్టమైంది. సాయికుమార్ రెండు ఫోన్లలో కలిపి మూడు సిమ్‌లు వాడగా, నిఖిల్ రెండు ఫోన్లు వాడాడు. శ్రుతి ఒక ఫోన్ వాడుతుండేది. చనిపోయే వారం రోజుల ముందు నుంచి ఎక్కువ సార్లు ఫోన్లో మాట్లాడుకు న్నట్లు తెలుస్తోంది. బుధవారం ఉదయం నుంచి ఒక్క చోటు కి చేరుకునేదాకా వీరు ఫోన్లో మాట్లాడినట్టు గుర్తించారు. జిల్లా అధికారులతో ఫోన్ కాన్ఫరెన్స్‌లో ఉన్న సమయంలో తప్ప.. మిగతా సమయమంతా శ్రుతి(Shruthi), నిఖిల్‌తో సాయికుమార్ ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నట్టు తెలుస్తోంది.శ్రుతి, నిఖిల్ వాట్సాప్(Whatsapp) మెసేజ్‌లను పోలీసులు పరిశీలించారు. వీరి మధ్య ప్రేమ వ్యవహారం ఉన్నట్టు వాట్సాప్ మెసేజ్ లు స్పష్టం చేస్తున్నాయని పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే, వీరి ప్రేమ వ్యవహారంలో సాయికుమార్ ఎందుకు తలదూర్చాడన్నది ఇప్పుడు కీలకంగా మారింది. నిఖిల్, శ్రుతి పెళ్లి చేసుకోవాలనుకున్నారని.. కానీ విభేదాలు తలెత్తి పెళ్లి వాయిదా వేయడం వల్లే గొడవ ముదిరింది అన్న ప్రచారం కూడా జరుగుతోంది. -
ఈతరాక.. ఊపిరాడక..
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువులో ఎస్సై, కానిస్టేబుల్, మరో యువకుడు మునిగి చనిపోయిన సంఘటనకు సంబంధించి పోలీసు అధికారులు విచారణ ముమ్మరం చేశారు. వారి మరణానికి గల కారణాలతో పాటు ఆ రోజు ఏం జరిగిందన్న దానిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. చెరువు నీటిలో ముగ్గురు పడిపోవడంతో జాలర్ల సాయంతో గాలించి వారి మృతదేహాలను బయటకు తీసిన విషయం తెలిసిందే. కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్‌లను పరిశీలించిన అధికారులు.. శ్రుతి, నిఖిల్‌లు పెళ్లి చేసుకోవాలనుకున్నారని గుర్తించారు. తర్వాత వారి మధ్య విభేదాలు ఎందుకు వచ్చాయోనన్న దాని గురించి ఆరా తీస్తున్నారు. వారు చెరువు వద్దకు వెళ్లి అక్కడ చర్చించుకున్న సమయంలో, చెరువులో దూకినపుడు ప్రత్యక్ష సాక్షులు ఎవరూ లేకపోవడంతో అక్కడ ఏం జరిగిందన్నది ఎవరికీ అంతుచిక్కడం లేదు. దాదాపు రెండు కిలోమీటర్ల పొడవైన చెరువు కావడంతో ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు కూడా ఎక్కడా లేవు. ఆ రోజు చేపల వేటకు ఎవరూ ఆ ప్రాంతానికి వెళ్లకపోవడంతో ఈ ఘటన ఎవరి కంటా పడలేదని భావిస్తున్నారు.ఎస్సై ఐ ఫోన్ వాట్సాప్ చాటింగ్‌లో ఏముందో..వివిధ కోణాల్లో దర్యాప్తుముగ్గురి మరణాలపై పోలీసులు వివిధ కోణాల్లో విచారణ చేస్తున్నారు. కాల్‌డేటాను పరిశీలించిన అధికారులు వాట్సాప్ చాటింగ్‌లపై దృష్టి సారించారు. అయితే ఫోన్లు లాక్ అయి ఉండడంతో వాటిలో నుంచి సమాచారం తీసుకోవడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఎస్పీ సింధుశర్మ కేసు పరిశోధన గురించి అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఉన్నతాధికారులు కూడా కేసు దర్యాప్తు గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. సాక్ష్యాధారాలు లేకపోవడంతో సాంకేతిక అంశాల ఆధారంగా కేసును కొలిక్కి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. కేసు కొలిక్కి రావడానికి మరికొన్ని రోజుల సమయం పట్టవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.నీరు మింగి..భిక్కనూరు ఎస్సై సాయికుమార్, కానిస్టేబుల్ శ్రుతి, అలాగే నిఖిల్ నీట మునిగింది లోతైన ప్రదేశంలో కావడంతో అందులో పడగానే లోపలికి వెళ్లిపోయి ఉంటారని భావిస్తున్నారు. ముగ్గురి మృతదేహాలు దొరికిన ప్రదేశం దాదాపు పదిమీటర్ల లోతు ఉంటుందని అంటున్నారు. ముందు ఎవరో ఒకరు దూకి ఉంటారని, వారిని కాపాడే క్రమంలో మి గతా ఇద్దరూ ఒకరి వెంట ఒకరు దూకి ఉంటారని అంచనా వేస్తున్నారు. అయితే ముగ్గురికీ ఈత రాదని తెలుస్తోంది. లోతైన ప్రాంతంలో దూక డంతో ముగ్గురూ నీట మునిగి చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టుల్లో నీళ్లు మింగే చనిపోయారని వెల్లడైంది.ఆత్మహత్యలా.. హత్యలా? -
కామారెడ్డి మిస్టరీ డెత్స్ కేసులో కొత్త కోణాలు.. జరిగింది ఇదేనా?
సాక్షి, కామారెడ్డి జిల్లా: ట్రిపుల్ డెత్ కేసులో సస్పెన్స్ కొనసాగుతోంది. ఎస్ఐ సాయి, మహిళా కానిస్టేబుల్ శ్రుతి మరో యువకుడు నిఖిల్ మృతదేహాలు చెరువులో ఒకే చోట లభ్యం కాగా, ముగ్గురు కుటుంబాల నుంచి ఘటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మృతుల బంధువులు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు.ఎస్ఐ సాయి ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని మహిళా కానిస్టేబుల్ శ్రుతి, నిఖిల్‌లు ట్రాప్ చేసి పిలిచి ఉంటారంటూ ఎస్ఐ సాయి బంధువుల ఆరోపిస్తున్నారు. మరోవైపు, శ్రుతి ధైర్యవంతురాలని ఆమెను చంపి ఉంటారని కానిస్టేబుల్ బంధువులు ఆరోపిస్తున్నారు. నిఖిల్ బంధువుల నుంచి కూడా ఎస్ఐ, కానిస్టేబుల్ వైపు ఆరోపణలు చేస్తున్నారు. అసలు వారు చెరువు వద్దకు ఎందుకు వచ్చారు? ఆత్మహత్య నేపథ్యంలో కాపాడబోయి చనిపోయారా? లేక ముగ్గురివి ఆత్మహత్యలేనా అనే కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు.ఎస్ఐ సాయి, కానిస్టేబుల్ శ్రుతి మరో వ్యక్తి నిఖిల్ మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేయించిన పోలీసులు.. మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు.. జిల్లా ఎస్పీ సింధు శర్మ ఆధ్వర్యంలో శాఖాపరమైన దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు.. మరోవైపు.. మృతులు ముగ్గురి కాల్ లిస్ట్‌లు, సిగ్నల్స్ ఆధారంగా ఎప్పటినుంచి మాట్లాడుతున్నారు.. ఎక్కడ కలిశారు.. ఎటువైపు నుంచి ఎక్కడెక్కడికి వెళ్లారనే కోణంలో ఎంక్వైరీ చేపట్టారు. పోస్టుమార్టం నివేదిక అనంతరం వివరాలు బయటకు వస్తాయని కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ వెల్లడించారు.. కాగా, భిక్కనూరులో పనిచేస్తున్న ఎస్ఐ సాయికుమార్, బీబీపేటలో పనిచేస్తున్న కానిస్టేబుల్ శృతితో పాటు బీబీపేటకు చెందిన యువకుడు నిఖిల్ చెరువులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కామారెడ్డి జిల్లాలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. జిల్లా కేంద్రానికి సమీపంలోని 44వ నంబరు జాతీయ రహదారిపై అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువు సమీపంలో ఎస్ఐ కారు లభ్యం కావడం, చెరువు వద్ద చెప్పులు ఉండడంతో ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసు అధికారులు భావించారు. బుధవారం సాయంత్రం నుంచి శవాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్లు, ఫైర్ సిబ్బంది చెరువులో దిగి మృతదేహాలను బయటకు తీశారు.అర్ధరాత్రి 12.30 గంటలకు కానిస్టేబుల్ శృతి, యువకుడు నిఖిల్ మృతదేహాలు దొరికాయి. గురువారం ఉదయం ఎస్ఐ మృతేదేహాన్ని వెలికితీశారు. ఇక, ఎస్ఐ, మహిళా కానిస్టేబుల్‌తో పాటు యువకుడు కలిసి చెరువు వద్దకు చేరుకున్నారా? వారి మధ్యన ఉన్న గొడవలేంటి? ఎందుకు ఆత్మహత్య చేసుకుని ఉంటారు? అన్నది ఎవరికీ అంతుబట్టడం లేదు. ఎస్ఐ సాయికుమార్ గతంలో బీబీపేట పోలీసు స్టేషన్లో విధులు నిర్వహించారు. అక్కడ కానిస్టేబుల్‌గా శృతి పనిచేసేది. ఇప్పుడు కూడా అక్కడే విధులు నిర్వహిస్తోంది.బీబీపేటకు చెందిన నిఖిల్ సొసైటీలో ఆపరేటర్‌గా పనిచేస్తూనే, కంప్యూటర్లు మరమ్మతులు చేస్తుంటాడని తెలుస్తోంది. పోలీసు స్టేషన్‌లోని కంప్యూటర్లకు ఏదైనా సమస్య వస్తే నిఖిల్ వచ్చి సరి చేసి వెళతాడని చెబుతున్నారు. అయితే ఈ ముగ్గురి మధ్యన ఉన్న గొడవలేంటి అన్నది సస్పెన్స్‌గా మారింది. -
ప.గో.: పార్శిల్ మృతదేహాం కేసులో వీడిన మిస్టరీ!
పశ్చిమ గోదావరి: ఉండి మండలం యండగండి గ్రామంలో మృతదేహం పార్శిల్ కేసు మిస్టరీ దాదాపుగా వీడినట్లే కనిపిస్తోంది. మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు.. నిందితుడి కోసం గాలింపు ముమ్మరం చేశారు. అలాగే ఆస్తి తగాదాల కోణంలోనూ ఈ కేసును విచారణ జరుపుతున్నారు.మృతదేహాన్ని కాళ్ల మండలం గాంధీనగర్‌కు బర్ల పర్లయ్యదిగా గుర్తించారు. అలాగే.. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న సిద్ధార్థ్ వర్మ కోసం గాలింపు ముమ్మరం చేశారు.సాగి తులసి అనే మహిళకు ప్రభుత్వం నుంచి స్థలం మంజూరు కాగా ఇల్లు నిర్మిస్తోంది.. ప్రస్తుతం ఆ ఇల్లు ప్లాస్టింగ్ స్టేజ్‌లో ఉంది. ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం కోసం క్షత్రియ సేవా సమితికి ఆమె దరఖాస్తు చేసుకుంది. మొదటి విడతలో సేవా సమితి టైల్స్ అందజేసింది. మరోసారి ఆర్థిక సాయం కోసం మహిళ దరఖాస్తు చేసుకోగా.. పార్శిల్లో విద్యుత్ సామగ్రికి బదులు మృతదేహం వచ్చింది. పార్శిల్లో ఒక ఉత్తరం కూడా ఉన్నట్లు గుర్తించారు. అందులో రూ.1.30 కోట్లు చెల్లించాలని, లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొంటారని పేర్కొన్నారు. దీంతో ఆ మహిళ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పార్శిల్ పెట్టెలో సుమారు 45 సంవత్సరాల వయసున్న గుర్తు తెలియని మగ వ్యక్తి మృతదేహం సగ భాగం ఉన్నట్లు గుర్తించారు.ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. జిల్లా ఎస్పీ నయీం అస్మి ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించగా.. అందులో హత్య జరిగిందని తేలింది. దీంతో.. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే.. విచారణలో కృష్ణాజిల్లా మల్లంపూడి గ్రామానికి చెందిన సిద్థార్థ వర్మపైకి అనుమానం మళ్లింది.మూడు పేర్లు.. ముగ్గురు భార్యలుఈ కేసులో ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్నవ్యక్తికి ఏకంగా మూడు పేర్లు.. ముగ్గురు భార్యలు ఉన్నట్టు తెలిసింది. కృష్ణాజిల్లా మల్లంపూడి గ్రామానికి చెందిన తిరుమాని సుధీర్ వర్మకు ముందుగా కాళ్ల మండలం ఎస్సీ బోస్ కాలనీ ఇస్కులంక గ్రామానికి చెందిన మహిళతో వివాహమైంది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. సుధీర్ వర్మ తన పేరును శ్రీధర్ వర్మగా మార్చుకుని యండగండికి చెందిన రేవతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. అనంతరం సిద్ధార్థవర్మగా పేరు మార్చుకుని మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. వీరికి పదేళ్ల వయసున్న కుమార్తె ఉంది.ఇన్ని పెళ్లిళ్లు చేసుకున్న శ్రీధర్‌వర్మకి రెండో భార్య రేవతికి అక్క అయిన సాగి తులసితో ఆస్తి కోసం తగాదా ఏర్పడింది. ఈ క్రమంలోనే ఆమెకు మృతదేహాన్ని పంపించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అయితే.. బర్ల పర్లయ్య ఎందుకు చంపాడు?.. ఎలా చంపాడు? ఆ మృతదేహాన్ని తులసికి ఎందుకు పంపాడనే విషయాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది. -
కంకాళాల కలకలం
అది 2009 ఫిబ్రవరి 2, ఉదయం 7 దాటింది. అమెరికా, న్యూ మెక్సికో రాష్ట్రంలోని, వెస్ట్ మేసాలో అల్బుకర్కీ ప్రాంతమంతా సందడిగా ఉంది. సమీపంలో నివాసముండే క్రిస్టీన్ రాస్ అనే అమ్మాయి ఎప్పటిలానే ఆరోజు ఉదయం తన పెంపుడు కుక్క రుకాను తీసుకుని వాకింగ్‌కి బయలుదేరింది. తిరిగి వచ్చేటప్పుడు రుకా నోట్లో మనిషి ఎముక చూసి క్రిస్టీన్ హతాశురాలై, వెంటనే పోలీసులకు సమాచారమిచ్చింది.వెస్ట్ మేసా అనే ప్రాంతం గురించి అప్పటి వరకూ ఆ దేశానికే కాదు, ఆ రాష్ట్రానికి కూడా పెద్దగా తెలియదు. ఆరోజు తర్వాత ప్రపంచమే ఉలిక్కిపడి వెస్ట్ మేసా వైపు చూడటం మొదలుపెట్టింది.రుసా తెచ్చిన ఎముక ఎక్కడిది? ఎవరిది? అనే కోణంలో దర్యాప్తు మొదలైంది. అధికారుల దృష్టి సమీపంలోని విస్తారమైన మెట్ట ప్రాంతం మీద పడింది. న్యూ మెక్సికో, సౌత్ వ్యాలీలో బెర్నెలీయో కౌంటీకి ఉత్తరాన ఉన్న అరోయో అనే నదీ పరివాహక ప్రాంతమది. అయితే ఆ నది కొన్నేళ్ల క్రితమే ఎండిపోయింది. అలాంటి చోట ఎముక దొరకడంతో తవ్వకాలు మొదలయ్యాయి. తవ్వగా తవ్వగా ఓ అస్థిపంజరం దొరికింది. ఇంతలో ఆ పక్కనే మరో అనుమానాస్పదమైన గుంత దర్శనమిచ్చింది. వెంటనే క్రైమ్ టేప్స్ వేలాడదీసిన అధికారులు, తమ బలగాలను దించారు. ఇంతలో మరో అస్థిపంజరం దొరికింది. దాంతో చుట్టూ విస్తృతంగా తవ్వకాలు జరిపించారు. ఈలోపు మీడియా చుట్టుముట్టింది. అలా ఒకటి కాదు రెండు కాదు, మొత్తం 11 అస్థిపంజరాలు దొరికాయి. అన్నీ ఆడవారివే! బాధితుల్లో 15 ఏళ్ల బాలిక దగ్గర నుంచి 32 ఏళ్ల మహిళ వరకూ చాలా వయసులవారు ఉన్నారు. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే మృతులలో నాలుగు నెలల గర్భవతి కూడా ఉంది. వీరంతా 2001 నుంచి 2005 మధ్య అదృశ్యమైనవారేనని తేలింది. దీని వెనుక సీరియల్ కిల్లర్ ఉన్నాడని కొందరు, సెక్స్ రాకెట్ ఉందని మరికొందరు ఊహించడం మొదలుపెట్టారు. సీరియల్ కిల్లర్ అని భావించిన వారంతా ‘ది బోన్ కలెక్టర్’ అని పేరుపెట్టారు. మీడియా ఎక్కువ శాతం ఆ వాదనకే ఓటేసింది.ఇడా లోపెజ్ అనే మహిళా డిటెక్టివ్ అప్పటికే అల్బుకర్కీకి చెందిన సుమారు 19 మంది మహిళలు కనిపించడం లేదని లిస్ట్ తయారు చేసింది. వారంతా సెక్స్వర్కర్స్, డ్రగ్స్ వంటి వ్యసనాలు కలిగినవారే కావడంతో పోలీసులు పెద్దగా దృష్టిపెట్టలేదు. అయితే వెస్ట్ మేసా తవ్వకాల్లో బయటపడిన పదకొండు మందిలో, పదిమంది ఆ లిస్ట్‌లోని వారే కావడంతో ఈ కేసు ఉత్కంఠగా మారింది. ఇడా లిస్ట్‌లో మరో తొమ్మిది మంది ఏమయ్యరో తెలియకపోవడంతో, లిస్ట్‌లో లేని అభాగ్యులు చాలామందే ఇలా ఖననమై ఉంటారని అంచనాకొచ్చారు. ఇక పదకొండో అమ్మాయి, ఓక్లహోమాకి చెందిన 15 ఏళ్ల సిలానియా టెరెన్ (ఆఫ్రికన్ అమెరికన్) అని తేలింది. ఆమె 2003లో ఇంటి నుంచి పారిపోయింది. దొరికిన అస్థిపంజరాలు ఎవరివో తేల్చారు కాని, ఇంతటి ఘాతుకానికి పాల్పడిందెవరో గుర్తించలేకపోయారు.ఈ కేసులో అనుమానితులు చాలామందే ఉన్నా లోరెంజో మోంటోయా, జోసెఫ్ బ్లీ అనే నేరగాళ్లు ప్రధాన అనుమానితులుగా నిలిచారు. లోరెంజో అనే వ్యక్తి పదకొండు మందిని ఖననం చేసిన ప్రదేశానికి చాలా సమీపంగా నివసించేవాడు. సెక్స్ వర్కర్లపై హింసాత్మక దాడులకు తెగబడి రెండుసార్లు అరెస్టయ్యాడు. అతడు 2006లో 19 ఏళ్ల సెక్స్ వర్కర్ షెరికా హిల్‌ను చంపి, ఆమె శవాన్ని కారు డిక్కీలో పెట్టి తీసుకెళ్లబోతుంటే, షెరికా ప్రియుడు ఫ్రెడరిక్.. లోరెంజోను తుపాకీతో కాల్చి చంపాడు. అతడు షెరికాను చంపిన తీరు చూస్తే అది, అతడి మొదటì హత్య అయి ఉండదని అప్పట్లోనే చాలామంది డిటెక్టివ్స్ భావించారు. అయితే 2009లో వెస్ట్ మేసా తవ్వకాల తర్వాత ఆ రోజు షెరికా బాడీని లోరెంజో వెస్ట్ మేసాలో కప్పెట్టడానికే తీసుకెళ్లబోయాడేమో? అనే అనుమానం కలిగింది. నిజానికి లోరెంజో మరణం తర్వాతే వెస్ట్ మేసా హత్యలు ఆగిపోయి ఉంటాయని అధికారులు నమ్మారు.2010 డిసెంబర్ 9న అల్బుకర్కీ పోలీసులు.. గుర్తుతెలియని ఆరుగురు మహిళల ఫొటోలను మీడియాకు విడుదల చేశారు. వారిలో కొందరు అపస్మారక స్థితిలో (ఎవరో కిల్లర్‌కి చిక్కినట్లుగా) ఉన్నారు. అయితే ఆ ఫొటోలు ఏ నేరగాడి కెమెరా నుంచి సేకరించారో అధికారులు చెప్పలేదు కాని, ఇదంతా వెస్ట్ మేసా కేసు దర్యాప్తులో భాగమని వివరించారు. ఆ ఆరుగురిలో ఇద్దరు అమ్మాయిలు సజీవంగా ఉన్నట్లు సమాచారం ఉందని, వారు దొరికితే కిల్లర్ వివరాలు తెలిసే అవకాశం ఉందని వారు చెప్పారు. అయితే ఆ ఇద్దరమ్మాయిలూ దొరకలేదు. ఆ ఆరుగురిలో ఆ ఇద్దరూ ఎవరో కూడా తెలియలేదు.2015 నాటికి జోసెఫ్ బ్లీ అనే రేపిస్ట్ కూడా వెస్ట్ మేసా కేసులో అనుమానితుడిగా మారాడు. 1980–82 మధ్యకాలంలో అల్బుకర్కీ సమీపంలోని ఇళ్లలోకి దూరి, 13 నుంచి 15 ఏళ్ల బాలికలపై అత్యాచారాలు చేసి తప్పించుకుని తిరుగుతున్న బ్లీ.. 2015లో ఓ సెక్స్ వర్కర్ హత్యకేసులో అరెస్ట్ అయ్యాడు. డీఎన్ఏ నమూనాతో నేరం నిరూపితమైంది. గత నేరాలను కూడా కలిపి బ్లీకి 36 ఏళ్లు జైలు శిక్ష పడింది. పైగా ఈ పదకొండు అస్థిపంజరాలు దొరికిన చోట, క్లూ మాదిరి ఒక నర్సరీ ట్యాగ్ లభించింది. ఆ నర్సరీని గుర్తించిన అధికారులు.. బ్లీ రెగ్యులర్‌గా అక్కడే మొక్కలు కొనేవాడని తెలుసుకున్నారు. అయితే ఒకసారి బ్లీ.. తన సెల్‌మేట్ ముందు వెస్ట్ మేసా బాధితులను ‘నేను వాడి పడేసిన చెత్త’ అని సంబోధించాడట. కానీ విచారణలో బ్లీ నోరువిప్పకపోవడంతో, కేసు తేలలేదు. మొత్తానికీ ఈ హత్యలన్నీ ఒక్కడే చేశాడా? లేక ఈ ఉదంతం వెనుక ఏదైనా మాఫియా ఉందా? అనేది నేటికీ మిస్టరీనే!∙సంహిత నిమ్మన -
‘స్నేహాపై ఇలాంటి అపవాదులను ఆపండి’
చరిత్ర మిగిల్చిన చీకటి రోజుల్లో అమెరికా వణికిన రోజు 2001 సెప్టెంబర్ 11. నాడు ఉగ్రవాదులు ట్విన్ టవర్స్‌పై చేసిన దాడి యావత్ ప్రపంచాన్ని ఉలికిపడేలా చేసింది. అయితే నిజానికి ఆ విధే పనికట్టుకుని, స్నేహా ఫిలిప్ అనే భారతీయ డాక్టరమ్మ కథను, నాటి అమెరికావాసుల వ్యథలతో ముడిపడేలా ముందే లిఖించింది కాబోలు!అది సెప్టెంబర్ 11, సాయంత్రం 5 అవుతోంది, రోడ్లపై లక్షల్లో జనాలు, వేలల్లో పోలీసులు. ఇంకా అమెరికా షాక్ నుంచి తేరుకోలేదు. ఒకవైపు బాధిత కుటుంబాల రోదనలు, మరోవైపు ఆగకుండా మోగుతున్న అంబులెన్స్ సైరన్లు. ఆ సమయంలో ఎటు చూసినా విలాపమే, ఏం విన్నా విషాదమే! చాలామంది అధికారులు కనిపించకుండా పోయిన వారి వివరాలను నమోదు చేసుకునే పనిలో పడ్డారు. అప్పుడే అన్సు, ఫిలిప్ అనే కేరళ దంపతులు తమ అమెరికన్ అల్లుడు రాన్ లైబర్మాన్ని వెంటబెట్టుకుని కన్నీళ్లతో పోలీస్ స్టేషన్‌కి వచ్చారు. ‘పేరు స్నేహా ఫిలిప్, భారత మహిళ, ఆమె డాక్టర్, బ్లాక్ హెయిర్, బ్రౌన్ ఐస్, హైట్ 5.6, వయసు 31, గత ఏడాదే పెళ్లైంది, నిన్నటి (సెప్టెంబర్ 10) నుంచి కనిపించడం లేదు’ అంటూ వారు.. ఒక్కొక్కటిగా వివరాలిచ్చారు. స్నేహా కేరళలో పుట్టింది. తన చిన్నప్పుడే, ఆ కుటుంబం న్యూయార్క్‌లో సెటిల్ అయ్యింది. స్నేహా మెడిసిన్ చదువుతున్నప్పుడు రాన్ ఆమెకు జూనియర్‌గా పరిచయమయ్యాడు. ఆ పరిచయం ప్రేమగా మారిన తర్వాత, అతడి కోసం స్నేహా ఏడాది చదువు ఆపుకుని, రాన్తో కలసి పట్టభద్రురాలైంది. మెడిసిన్ ఇంటర్న్‌షిప్‌కి ఆహ్వానం అందుకోగానే, 2000 సంవత్సరంలో పెళ్లితో ఒక్కటయ్యారు. అదే ఏడాది ట్విన్ టవర్స్‌కి 5 నిమిషాల దూరంలో ఉన్న బ్యాటరీ పార్క్‌లో అపార్ట్మెంట్ కొనుక్కుని అక్కడికి షిఫ్ట్ అయిపోయారు. ఇద్దరూ డాక్టర్స్, కావాల్సినంత డబ్బు, రోజుకో పార్టీ, వారానికో ట్రీట్. ఆనందకరమైన జీవితానికి తామే ఉదాహరణ అన్నట్లుండేది ఆ జంట. డ్యూటీకి వెళ్లాలంటే అరగంటలోపు.. బంధువులు, స్నేహితులతో పాటు ఫిలిప్ ఇంటికి వెళ్లాలన్నా గంటలోపు ప్రయాణం చేస్తే సరిపోయేది. షాపింగ్స్‌కి, పార్టీస్‌కి వెళ్లడాన్ని బట్టి ఎవరిల్లు దగ్గర్లో ఉంటే వాళ్లింట్లో రాత్రుళ్లు ఉండిపోవడం, మరునాడు డ్యూటీస్‌కి అటునుంచే వెళ్లడం స్నేహా, రాన్లకు అలవాటైపోయింది.సెప్టెంబర్ 10న స్నేహా డ్యూటీకి లీవ్ పెట్టింది. ‘ఎల్లుండి మనింట్లో ఫ్యామిలీ పార్టీ ఉంది కాబట్టి ఇల్లంతా క్లీన్ చేస్తా. షాపింగ్ చేస్తా, అందుకే సెలవు పెట్టా’ అని భర్తతో చెప్పింది స్నేహా. ఆ రోజు ఉదయం భర్తతో కలసి బయటికి వెళ్లి, 11 అయ్యేసరికి అతడితో బ్రేక్‌ఫాస్ట్ చేసి, తిరిగి ఇంటికి బయలుదేరింది. రాన్ అటు నుంచి అటే డ్యూటీకి వెళ్లిపోయాడు. అయితే అదే రాత్రి రాన్ డ్యూటీ నుంచి ఇంటికొచ్చేసరికి స్నేహా ఇంట్లో లేదు. అత్తింటికో, స్నేహితుల ఇంటికో వెళ్లుంటుందిలే అనుకున్న రాన్.. ఆ రాత్రి ప్రశాంతంగానే నిద్రపోయాడు. మరునాడు (సెప్టెబర్ 11) ఉదయం ఆరు గంటలకే లేచి, రెడీ అయ్యి డ్యూటీకి వెళ్లిపోయాడు. అయితే ఆ రోజు 8.40 దాటేసరికి వరల్డ్ ట్రేడ్ సెంటర్లోని నార్త్ టవర్ (ట్విన్ టవర్స్‌లో ఒక బిల్డింగ్)లో ఉగ్రవాదులు విమానాన్ని కూల్చారన్న వార్త అతడ్ని వణికించింది. వెంటనే స్నేహాకు కాల్ ట్రై చేస్తే, కలవలేదు. మరో పావుగంటలో పక్కనే సౌత్టవర్లో మరో విమానం కూలిందని తెలియగానే రాన్‌కు స్నేహా గురించి భయం మొదలైంది. అప్పుడు కూడా స్నేహా ఫోన్ కలవకపోయేసరికి ఆమె కోసం తెలిసినవారికి, అత్తింటివారికి వరసగా కాల్స్ చేశాడు. ముందురాత్రి స్నేహా మా ఇంటికి రాలేదంటే మా ఇంటికి రాలేదన్నారంతా. దాంతో రాన్ కంగారుగా తమ అపార్ట్మెంట్కి వెళ్లాడు. అప్పటికే కుప్పకూలిన ట్విన్‌టవర్స్ నుంచి దట్టమైన పొగ కమ్మేయడంతో అక్కడ ఎక్కువసేపు ఉండొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. దాంతో వారిని రిక్వస్ట్ చేసి, అపార్ట్మెంట్ సెక్యూరిటీ సాయంతో బిల్డింగ్ సీసీ ఫుటేజ్‌ని పరిశీలించాడు. ముందురోజు ఫుటేజ్‌లో సాయంత్రం 5:30కి స్నేహా ఇంటి నుంచి బయటికి వెళ్లడం కనిపించింది. మరో 2 గంటలకు ట్విన్ టవర్స్ సమీపంలోని డిజైనర్ స్టోర్‌లో స్నేహా తనకోసం షూస్, ఇన్నర్ వేర్స్ కొనుక్కొన్నట్లు పరిచయమున్న సేల్స్‌మన్ ఒకరు రాన్తో చెప్పాడు. ‘నిన్న రాత్రి ఏడున్నరకు స్నేహా మేడమ్ మరో భారతీయురాలితో కలసి మా స్టోర్‌కి వచ్చింది. ఇద్దరూ మంచి స్నేహితుల్లా కనిపించారు. ఆ మహిళను అంతకు ముందెప్పుడూ నేను చూడలేదు’ అని వివరించాడు. వెంటనే రాన్.. ఫిలిప్స్ ఇంటికి వెళ్లి విషయం చెప్పాడు. రాన్ మాటలకు స్నేహా తల్లి అన్సు షాక్ అయ్యింది. ‘అదేంటి నిన్న మధ్యాహ్నం ట్విన్ టవర్స్, హోటల్లో తింటూనే నాతో చాలా సేపు చాటింగ్ చేసిందిగా?’ అంది అయోమయంగా. ‘నిన్న రాత్రి వేరే ఇండియన్ మహిళతో కలిసి షాపింగ్ కూడా చేసిందట ఆంటీ, పోనీ రాత్రి ఆమెతో పాటు ఉందనుకుంటే, మరునాడైనా ఇంటికి రావాలి కదా? ఒకవేళ ట్విన్ టవర్స్ దాడిలో ఇరుక్కుని..?’ మాట పూర్తి చేయలేకపోయాడు రాన్. ఆ అనుమానమే స్నేహా కుటుంబాన్ని పోలీస్ స్టేషన్ దాకా రప్పించింది.స్నేహా డాక్టర్ కాబట్టి.. 11న జరిగిన మొదటి దాడిలో గాయపడిన వారికి సేవలు చేయడానికి వెళ్లినప్పుడు ఇతర దాడుల్లో ఆమె ప్రాణాలు కోల్పోయి ఉంటుందని చాలామంది నమ్మారు. అయితే ఈ కేసు కోర్టుకెక్కినప్పుడు ఎన్నో అభిప్రాయాలు వినిపించాయి. రాన్తో స్నేహాకున్న పర్సనల్ తగాదాల దగ్గర నుంచి ఆల్కహాల్, డ్రగ్స్ వంటి చెడు అలవాట్లు ఉన్నాయా? అనేంత వరకూ ప్రతిదీ ఆరా తీసిన అధికారులు.. స్నేహా లెస్బియన్ అయ్యుండొచ్చని అనుమానించారు.డిజైనర్ స్టోర్‌లో స్నేహాతో ఉన్న అజ్ఞాత భారతీయ మహిళతో కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి, పేరు మార్చుకుని, మిస్సింగ్ డ్రామా ఆడుంటుందని భావించిన న్యాయస్థానం 2004లో.. 9/11 మిస్సింగ్ జాబితా నుంచి స్నేహా పేరును తొలగించేసింది. అయితే ఫిలిప్ దంపతులతో పాటు రాన్ కూడా ఆ తీర్పును ఖండించాడు. ‘స్నేహాను వెతికిపెట్టండి’ అనే పోరాటాన్ని పక్కన పెట్టి.. ‘స్నేహాపై ఇలాంటి అపవాదులను ఆపండి’ అనే పోరాటం మొదలుపెట్టాల్సి వచ్చింది ఆ కుటుంబానికి. నిజానికి ట్విన్ టవర్స్ దాడిలో కొన్ని వందల మంది క్షణాల్లో కాలి బూడిదైపోయారు. వారిలో చాలామంది వివరాలు నేటికీ తేలలేదు.చివరికి 2008లో న్యూయార్క్ కోర్టు స్నేహాపై వచ్చిన వదంతులను కొట్టి పారేస్తూ, 9/11 దాడుల బాధితురాలిగా స్నేహా పేరును ఆ జాబితాలో చేర్చింది. అయితే నేటికీ ఆమె అవశేషాలు దొరక్కపోవడంతో ఈ కేసు మిస్టరీగానే మిగిలిపోయింది.∙సంహిత నిమ్మన -
Mystery: షార్ట్ కుటుంబాన్ని చంపినదెవరు?
ఉదయం తొమ్మిదయ్యేసరికి క్రిస్ థాంప్సన్ తన ఓనర్ మైకేల్ షార్ట్ కోసం రోడ్డుపక్క నిలబడి ఎదురు చూస్తున్నాడు. పదే పదే టైమ్ చూసుకుంటున్నాడు. ఎంతసేపటికీ మైకేల్ రాకపోయేసరికి, ‘ఇదేంటి? తొమ్మిదికల్లా క్రిస్టియన్స్‌బర్గ్‌లో డెలివరీకి బయలుదేరదామన్న మనిషి ఇంకా రాలేదు? ఇల్లు దగ్గరే కదా, వెళ్లి చూద్దాం’ అనుకుని మైకేల్ ఇంటి వైపు అడుగులేశాడు క్రిస్.క్రిస్ వెళ్లేసరికి మైకేల్ ఇంటి తలుపులు తెరిచే ఉన్నాయి. హాల్లో కాస్త దూరంలో సోఫాలో నిద్రపోతున్నట్లు కనిపించిన తన ఓనర్ని మొదట ‘సార్.. సార్!’ అని బయట నుంచే పిలిచాడు. ఎంత పిలిచినా ఇంట్లో ఎవరూ పలుకకపోయేసరికి, దగ్గరకు వెళ్లి లేపుదామన్నట్లు ఇంటి లోపలికి అడుగులేశాడు. సోఫా దగ్గరకు వెళ్లేసరికి మైకేల్ ప్రాణాలతో లేడు. అతడి నుదుటిపైన తుపాకీతో కాల్చిన గాయం క్రిస్‌ని గజగజ వణికించేసింది. పైగా ఇల్లంతా ఆవహించిన నిశ్శబ్దం అతడ్ని మరింతగా భయపెట్టింది. వెంటనే బయటికి పరుగుతీసి, పోలీసులకు సమాచారమందించాడు.క్రైమ్ టేప్స్ చుట్టి, ఇల్లంతా తమ అధీనంలోకి తెచ్చుకున్న పోలీసులు. ఆ ఇంట్లో మైకేల్ మృతదేహంతో పాటు మరో శవాన్ని గుర్తించారు. అది మైకేల్ భార్య మేరీ షార్ట్ది. ఆమెను కూడా పైన బెడ్రూమ్లో నిద్రలో ఉండగానే ఎవరో కాల్చి చంపేశారు. అంటే ఒకేరాత్రి జంట హత్యలు జరిగాయి. మరి కిల్లర్ ఎవరు? అనే దిశగా విచారణ మొదలైంది. ఆ సమయంలో అధికారులకు క్రిస్ కీలక సాక్షిగా మారాడు.‘మైకేల్ సార్‌ది మొబైల్ హోమ్ మూవింగ్ బిజినెస్. నాలానే చాలామంది వర్కర్స్ అతని దగ్గర పనిచేస్తున్నారు. ముందురోజు రాత్రి పది దాటే వరకూ డెలివరీ పని మీద సార్ నాతోనే ఉన్నాడు. ఈరోజు ఉదయాన్నే తొమ్మిదికిక్రిస్టియన్స్బర్గ్లో డెలివరీకి వెళ్దాం, రెడీగా ఉండు అన్నాడు. ఎప్పుడూ పది నిమిషాలు ముందుండే మనిషి ఎంతకూ రాకపోయేసరికి డౌట్ వచ్చి ఇంటికి వెళ్లాను’ అని క్రిస్ చెప్పాడు. నిజానికి మైకేల్ శవాన్ని మొదటిగా చూసిన వ్యక్తి, మైకేల్ సజీవంగా ఉన్నప్పుడు చివరిసారిగా చూసిన వ్యక్తి క్రిస్ మాత్రమే!‘అసలు రాత్రికి రాత్రి మైకేల్ ఇంట్లో ఏమైంది?’ అనే ప్రశ్నతో పోలీసులు తలలు పగలగొట్టుకుంటుంటే.. మైకేల్, మేరీల బంధువులంతా ‘జెన్నిఫర్ ఎక్కడ?’ అని ప్రశ్నించారు. విచారణ అధికారులంతా తెల్లబోయారు. వారి నుంచి ‘జెన్నిఫర్ ఎవరు?’ అనే ప్రశ్న అప్రయత్నంగానే వచ్చింది.జెన్నిఫర్.. మైకేల్, మేరీల ఏకైక కుమార్తె. తొమ్మిదేళ్ల పాప. లేకలేక పుట్టిన సంతానం. చాలా అందంగా, క్యూట్‌గా ఉండే తెలివైన పిల్ల. ‘జంట హత్యల తర్వాత పాప కనిపించడం లేదంటే, కిల్లర్ టార్గెట్ జెన్నిఫర్‌ని ఎత్తుకెళ్లడమేనా?’ అనే ప్రశ్న అందరిలోనూ తలెత్తింది.నిజానికి ఆ రాత్రి మైకేల్ పది దాటాక ఇంటికి వెళ్లాడని క్రిస్ చెప్పాడు. అదే రాత్రి పదిన్నరకు మేరీ డిన్నర్ ఐటమ్స్ కొని ఇంటికి తీసుకెళ్లిందని ఇంటి సమీపంలోని ఫాస్ట్ ఫుడ్ దుకాణదారుడు చెప్పాడు. ‘సాధారణంగా రాత్రి సమయంలో తన గురక కారణంగా మేరీ నిద్ర చెడిపోకూడదని చాలాసార్లు అదే సోఫాలో నిద్రపోతుంటాడట మైకేల్. పైన బెడ్రూమ్లో మేరీ నిద్రపోతుంది. ఆ రాత్రి అదే జరిగినట్లుంది’ అని క్లారిటీ ఇచ్చింది మేరీ సోదరి.ఇంట్లో అంతా నిద్రపోయాక దుండగుడు.. మైకేల్, మేరీలను చాలా సులభంగా చంపి, పాపను ఎత్తుకుపోయాడనేది అప్పటికే స్పష్టమైంది. అంటే బహుశా ఆ కిల్లర్ ఆ ఇంటికి అతిథిగా వచ్చి ఉంటాడా? ఆ దంపతులకు సుపరిచితుడేనా? ఇలా చాలా అనుమానాలు తలెత్తాయి.మైకేల్ ఇంటి సమీపంలో ఆ రాత్రి ఎప్పుడూ చూడని తెల్లటి కారు ఒకటి చూశామని కొందరు సాక్ష్యం చెప్పారు. అదే తెల్లటి కారులో మరునాడు తెల్లవారుజామున (మృతదేహాలను చూసిన రోజు) 40 ఏళ్ల అపరిచిత వ్యక్తి వెళ్లడం చూశామని మరికొందరు ఇరుగు పొరుగువారు చెప్పారు. దాంతో కిల్లర్ ఊహాచిత్రాన్ని గీయించే పనిలో పడ్డారు అధికారులు. పాప కోసం దగ్గర్లోని అడవిని, చుట్టుపక్కల ప్రదేశాలను జల్లెడపట్టారు. అయినా ఆచూకీ దొరకలేదు.2002 ఆగస్ట్ 15న వర్జీనియా, హెన్రీ కౌంటీలో జరిగిన ఈ ఉదంతం అమెరికా వ్యాప్తంగా సంచలనంగా మారింది. హత్యలు జరిగిన ఆరు వారాల తర్వాత మైకేల్ ఇంటికి సుమారు 35 మైళ్ల దూరంలో ఉన్న స్టోన్ విల్ క్రీక్ అనే ప్రాంతంలోని అల్బర్ట్ అనే వ్యక్తి ఇంటి ముందు కుళ్లిన దవడ భాగం దొరికింది. మొదట దాన్ని గమనించిన అల్బర్ట్ ఫ్యామిలీ ఏదో జంతు కళేబరాన్ని కుక్కలు తెచ్చి పడేసి ఉంటాయని భావించారు. పరిశీలనగా చూస్తే అది పిల్లల దవడ అని తేలడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. డీఎన్ఏ టెస్ట్‌లో అది జెన్నిఫర్దని తేలింది. వెంటనే మృతదేహం కోసం సమీపంలో వెతికించారు. పాడుబడిన ఒక వంతెన కింద కుళ్లిపోయిన పాప శవం కనిపించింది. అయితే స్టో¯Œ విల్ క్రీక్కి గతంలో మైకేల్ చాలా మొబైల్ హోమ్స్ డెలివరీ చేశాడని తేలింది. పైగా అక్కడ చాలామంది డీలర్స్‌తో అతడికి స్నేహ సంబంధాలున్నాయి.పాప మృతదేహం దొరికిన చోట క్షుణ్ణంగా పరిశోధన చేసినా, ఎలాంటి ఆధారమూ దొరకలేదు. అయితే ఆ విచారణలో గ్యారిసన్ బౌమన్ అనే ఒక నేరచరిత కలిగిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. చివరికి సరైన ఆధారాలు లేకపోవడంతో అతణ్ణి విడిచిపెట్టారు. రాత్రికి రాత్రి ఎవరైనా సీరియల్ కిల్లర్ రహస్యంగా ఇంట్లోకి దూరి ఈ ఘాతుకానికి ఒడిగట్టాడా? లేక నిజంగానే ఆ క్రూరుడు పథకం ప్రకారం మైకేల్ ఫ్యామిలీని మోసం చేసి మట్టుపెట్టాడా? అనేది తేలలేదు. దాంతో ఇరవై రెండేళ్లు గడచిపోయినా ఈ ఉదంతం నేటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. ∙సంహిత నిమ్మన -
అసలు ఈ కియా కారు కథేంటి..
ఆత్మకూరురూరల్: ఆత్మకూరు పోలీస్‌స్టేషన్‌లో ఓ ఖరీదైన కారు ఏడాదిగా మూలన పడి వాడకానికి పనికి రాకుండా పోతోంది. కారును సీజ్ చేసిన అధికారితో పాటు మరో ముగ్గురు కూడా బదిలీ అయి వెళ్లిపోయారు. పోలీస్ స్టేషన్ కూడా అప్‌గ్రేడ్ అయ్యింది. అయినా కారు కథ కంచికి చేరడం లేదు.దిక్కుమొక్కు లేక..ఏడాది కిందట ఆత్మకూరు మండలం నల్లకాల్వ – బాపనంతాపురం మధ్య జంబులమ్మ ఆలయం వద్ద తెలుపు రంగు కియా కారు మూడు రోజులుగా ఉండడంతో అనుమానం కలిగిన స్థానికులు అప్పటి ఎస్ఐకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి పరిశీలించగా కారుకు నంబర్ ప్లేట్ లేదు, విండో షీల్డ్స్ పగులగొట్టి ఉన్నాయి. ఛాసిస్ నంబరు ఆధారంగా కారు యజమానిని గుర్తించారు. కారు మహారాష్ట్రలో రిజిస్ట్రేషన్ కాగా యజమాని కర్ణాటక వ్యక్తిగా తేలింది. పోలీసులు అతనికి ఫోన్ చేసి కారును తీసుకెళ్లమని చెప్పగా ఇంతవరకు రాలేదు.అసలు ఈ కియా కారు కథేంటి..ఏడాది కిందట జాతీయ రహదారి – 44లో కారులో వెళుతున్న వ్యక్తులను కొందరు దుండగులు అటకాయించి బలవంతంగా అదే కారులో తీసుకెళ్లిపోయారు. ఓ చోట వారిని దింపేసి వెళ్లిపోయారు. దీనిపై బాధితులు డోన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దుండగులు తీసుకెళ్లిన కారు ఆత్మకూరు ప్రాతంలో దొరికింది. అప్పటినుంచి స్థానిక పోలీస్ స్టేషన్లోనే మగ్గుతోంది.కారు హైజాక్ వెనుక హవాలా ముఠా?పెద్ద మొత్తంలో హవాలా సొమ్ము చేతులు మారే సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు గుసగుసలాడుకుంటున్నారు. ఈ కేసుపై ఎవరైనా అడిగితే.. డోన్‌లో కిడ్నాప్ కేసు నమోదై ఉన్నందున వారికి హ్యాండోవర్ చేయాల్సి ఉందని, అయితే వారు పట్టించుకోవడం లేదని చెప్పి తప్పించుకుంటున్నారు. -
అయ్యో గజరాజా.. 48 గంటల్లో ఎనిమిది అనుమానాస్పద మృతి
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని బాంధవ్‌ఘర్ టైగర్ రిజర్వ్‌లో 48 గంటల్లో ఎనిమిది ఏనుగులు మృతి కలకలం రేపుతోంది. ఇప్పటికే మంగళవారం ఏడుగురు మృతి చెందగా, నిన్న (బుధవారం)మరో ఏననుగు మృతదేహం లభించినట్లు అధికారులు తెలిపారు. మృతిచెందిన ఏనుగుల్లో ఏడు ఏనుగులు.. ఒక్కొక్కటి మూడు ఏళ్ల వయస్సు గలవి ఉన్నాయి. ఎనిమిదో ఏనుగ ఐదేళ్ల మగ ఏనుగుగా అధికారులు గుర్తించారు. మొత్తం 13 మంది ఏనుగుల్లో తొమ్మిదో ఏనుగు పరిస్థితి విషమంగా ఉందని వన్యప్రాణి అధికారులు పేర్కొన్నారు. వైద్యసేవలు పొందిన పదో కోలుకున్నట్లు తెలిపారు. ఇక.. మిగిలిన మూడు ఏనుగుల నిశితంగా పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఏనుగుల మృతిపై.. ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్‌లతో కూడిన ఐదుగురు సభ్యుల బృందం స్వతంత్ర విచారణను చేపట్టింది. విచారణ నివేదికను 10 రోజుల్లో సమర్పించనుంది. ఏనుగుల మృతికి ప్రాథమిక కారణం విషంగా అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏనుగు కళేబరాలు ఉన్న ప్రాంతంలోని ఐదుగురి వ్యక్తులను వన్యప్రాణి అధికారులు ప్రశ్నిస్తున్నారు. దర్యాప్తు ప్రాంతం ఐదు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉందని తెలిపారు. కుక్కల స్క్వాడ్‌తో సహా 100 మంది అటవీ అధికారులు ఏనుగులు మృతి చెందిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు. కోడో మిల్లెట్ గింజలను ఏనుగులు తిన్నాయా అనే విషయంపై అధికారులు విచారణ జరుపుతున్నారు. కోడో మిల్లెట్ గింజలు ఫంగస్‌తో కలుషితమైతే సైక్లోపియాజోనిక్ యాసిడ్ అనే విష పదార్థాన్ని ఉత్పత్తి చేస్తుంది.అందుకే.. మృతిచెందిన ఏనుగుల మలం నమూనాలను సేకరించినట్లు అధికారులు తెలిపారు. -
మిస్టరీ.. రసెల్ ఎవాన్స్
అర్ధరాత్రి పన్నెండున్నర దాటేసరికి జాన్ ఎవాన్స్ ఇంట్లో ల్యాండ్ ఫోన్ మోగింది. లిఫ్ట్ చేసి హలో అనగానే, ‘డాడ్! ఫ్రెండ్ ఇంట్లో ఉన్నా, బయలుదేరుతున్నా. కాసేపట్లో ఇంటికి వచ్చేస్తా’ అన్నాడు రసెల్. ‘సరే నాన్నా జాగ్రత్త!’ అని ఫోన్ పెట్టేశాడు జాన్. గంట దాటేసరికి, మళ్లీ ఫోన్ మోగింది. ఈసారి కాల్ చేసింది సేక్రడ్ హాస్పిటల్ రిసెప్షనిస్ట్. తమ ఆసుపత్రి వివరాలన్నీ చెప్పి, ‘మీ అబ్బాయి రసెల్ పరిస్థితి సీరియస్‌గా ఉంది. త్వరగా రండి’ అంది. జాన్ కి కాళ్ల కింద భూమి కదిలినట్లు అనిపించింది. ‘ఏమంటున్నావ్?’ అని గట్టిగా అరిచాడు. వెంటనే రిసెప్షనిస్ట్ చేతిలోంచి ఫోన్ అందుకున్న రసెల్ స్నేహితురాలు శాండీ.. ‘అంకుల్! మన రసెల్ కోమాలోకెళ్లాడంటున్నారు త్వరగా రా అంకుల్’ అంటూ ఏడ్చేసింది. దాంతో జాన్ వెంటనే భార్య స్యూ ఎవాన్స్ని తీసుకుని ఆ ఆసుపత్రికి పరుగు తీశాడు.ఆసుపత్రిలో ఓ పక్క పోలీసుల ఫార్మాలిటీస్, మరో పక్క ఆసుపత్రి సిబ్బంది పరుగులు జాన్ దంపతుల్ని వణికించేశాయి. ఏం జరిగిందో చెప్పడానికి రసెల్ స్పృహలో లేడు. ఏమైందో తెలుసుకోవడానికి గుండెధైర్యం చాలట్లేదు. అయినా ఏడుస్తూనే పోలీసుల్ని ఆరా తీస్తే, హిట్ అండ్ రసెల్ కేసన్నారు. శాండీ మాత్రం అందుకు విరుద్ధంగా చెప్పింది. ‘అంకుల్! నేను ఇందాకే వ¯Œ అయ్యేసరికి పార్ట్‌టైమ్ జాబ్ ముగించుకుని నడుస్తూ ఇంటికొస్తుంటే, మన అపార్ట్మెంట్కి సమీపంలో రోడ్డు మీద రసెల్ కదల్లేని స్థితిలో పడున్నాడు. ‘బ్రియాన్! బ్రియాన్!’ అని గట్టిగా అరుస్తున్నాడు. దగ్గరకెళ్లి చూస్తే ఒళ్లంతా రక్తం, భయమేసి అంబులెన్స్ కి కాల్ చేసి, ఆసుపత్రికి తీసుకొచ్చాం. రాగానే కోమాలోకి వెళ్లిపోయాడు. కానీ నేను రసెల్‌ని గుర్తించిన సమయంలో అక్కడ పొదల్లో ఎవరో ఉన్నట్లనిపించింది. ఎవరా? అని నేను వంగి చూసేసరికి, తెల్ల చొక్కా వేసుకున్న ఒక అబ్బాయి మన అపార్ట్మెంట్స్ వెనకున్న కొండలవైపు పారిపోయాడు. కానీ మన రసెల్‌కి బ్రియాన్ అనే స్నేహితుడున్నాడు కదా. తను అప్పటిదాకా రసెల్తోనే ఉన్నాడేమోనని నా అనుమానం. ఇదంతా పోలీసులకు చెప్పినా, హిట్ అండ్ రసెల్ అనే రాసుకున్నారు’ చెప్పింది శాండీ.జాన్ కుటుంబానికి శాండీ కుటుంబం ఫ్యామిలీ ఫ్రెండ్సే. అంతా ఒకే బ్లాక్‌లో ఉండేవారు. రసెల్, శాండీలు మంచి స్నేహితులు. ఎనిమిదో తరగతి చదువుతున్న రసెల్‌కి 13 ఏళ్లు. శాండీ అతడికంటే రెండేళ్లు పెద్దది. రసెల్‌కి డయానా అనే ఐదేళ్ల చెల్లెలు కూడా ఉంది. చదువులో ముందుండే రసెల్ బెస్ట్ బాస్కెట్‌బాల్ ప్లేయర్‌గా పేరు తెచ్చుకున్నాడు. టీన్స్‌లోకి వచ్చేసరికి స్నేహితులు పెరగడంతో ఇంట్లో కంటే బయటే ఎక్కువ గడిపేవాడు. గతంలో స్యూ ఎవాన్స్ నర్స్‌గా, జాన్ కార్డియో పల్మనరీ టెక్నాలజిస్ట్‌గా పనిచేయడంతో వైద్యరంగంపై వారికి బాగానే అనుభవముంది. శాండీ మాటలు విన్న వెంటనే, తమ గత అనుభవాన్ని ఆ ఆసుపత్రి వైద్యులకు వివరించి, రసెల్ పరిస్థితిని గమనించడానికి చికిత్స జరుగుతున్న గదికెళ్లారు. రసెల్‌ని ఒక పెద్ద వాహనం ఢీ కొట్టినమాట నిజమే కాని, దానికంటే ముందు అతన్ని ఎవరో బ్యాట్‌లాంటి బలమైన వస్తువుతో కొట్టినట్లు అతడి ఒంటిపై ఆనవాళ్లున్నాయి. అదే విషయం పోలీసులకు చెప్పి వాపోయారు. అయినా అధికారుల్లో చలనం లేదు. దురదృష్టవశాత్తు ఉదయం తొమ్మిదయ్యేసరికి రసెల్ చనిపోయాడు. కొడుకు మరణంతో అల్లాడిపోతున్న ఆ దంపతులకు అప్పుడే ఆ ఆసుపత్రి రిసెప్షనిస్ట్ మరో క్లూ ఇచ్చింది. రసెల్ ఆసుపత్రిలో జాయిన్ అయిన ఒక గంటకే బ్రియాన్ అనే వ్యక్తి కాల్ చేసి, రసెల్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశాడని చెప్పింది. వెంటనే రసెల్ స్నేహితుడు బ్రియాన్‌ని పిలిపించాడు జాన్. మొదటి నుంచి ‘నాకేం తెలియదు’ అన్నట్లే మాట్లాడాడు బ్రియాన్. జాన్ అడిగిన చాలా ప్రశ్నలకు సమాధానాలిస్తూ, రసెల్‌పై దాడి జరిగిన రాత్రి వైట్ కలర్ షర్ట్ వేసుకున్నానని అసంకల్పితంగా చెప్పేశాడు. అదే విషయాన్ని జాన్ పోలీసులకు చెప్పాడంతో బ్రియాన్‌ని అదుపులోకి తీసుకుని నిలదీశారు. అయితే బ్రియాన్ తనకసలు వైట్ షర్టే లేదని మాట మార్చేశాడు. దాంతో రసెల్ కుటుంబం ఈ విషాదంలో ప్రత్యక్ష సాక్షి బ్రియాన్ అని నమ్మడం మొదలుపెట్టింది.ఈలోపు పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్ వచ్చింది. దానిలో రసెల్‌ని ఏదో వాహనం గుద్దేయడంతోనే మరణం సంభవించిందని అందులో ఉంది. ఇంతలో రసెల్ చనిపోయాడని తెలియగానే, ఆరోన్ అనే స్నేహితుడు ముందుకొచ్చాడు. ‘ఆ రాత్రి తొమ్మిది అయ్యేసరికి మేమిద్దరం దగ్గర్లోని పార్క్‌కి వెళ్లాం. అక్కడ నాకు గతంలో నా గర్ల్‌ఫ్రెండ్‌ని ఏడిపించిన ఒక అబ్బాయి కనిపించాడు. వాడికి వార్నింగ్ ఇచ్చేక్రమంలో నా పక్కనే ఉన్న రసెల్ వాడ్ని కొట్టాడు. అయితే ఆ అబ్బాయి కోపంగా తన వాళ్లని తీసుకొస్తానని పరుగెత్తాడు. పార్క్‌లో మా గొడవ చూసిన కొందరు పెద్దవాళ్లు ‘ఆ అబ్బాయి బ్యాక్‌గ్రౌండ్ మాకు తెలుసు. వాళ్లతో గొడవ మంచిది కాదు, ఇక్కడి నుంచి త్వరగా వెళ్లిపోండి’ అని సలహా ఇచ్చారు. దాంతో మేము అక్కడి నుంచి వచ్చేశాం. రసెల్ తన బాస్కెట్‌బాల్ ఫ్రెండ్ ఇంటికి వెళ్తాననడంతో నేను మా ఇంటికి వెళ్లిపోయా. బహుశా ఆ పార్క్‌లో అబ్బాయిగానీ రసెల్‌పై పగ తీర్చుకున్నాడేమో?’ అని తన మనసులో అనుమానాన్ని పోలీసుల ముందు బయటపెట్టాడు.దాంతో దేశంలోనే ప్రముఖ డాక్టర్ విలియం ఎకెర్ట్ని నియమించి, మరణానికి అసలు కారణం తేల్చమన్నారు జాన్ దంపతులు. విలియం మళ్లీ శవపరీక్ష చేసి, యాక్సిడెంట్‌కి ముందే రసెల్‌పై తీవ్రమైన దాడి జరిగిందని, అంటే ఎవరో కావాలనే ఆ యాక్సిడెంట్ చేశారని క్లారిటీ ఇచ్చాడు. రెసెల్ పడి ఉన్న ప్రదేశానికి 86 అడుగుల ముందే అతని షూస్, సాక్స్ రక్తం మరకలతో దొరికాయి. బహుశా మనిషిని కింద పడేసి, బండితో ఈడ్చి పారేసి ఉంటారని విలియం అంచనా వేశాడు.1996 జూన్ 3న అర్ధరాత్రి ఒంటిగంటకు వాషింగ్టన్, స్పోకాన్లో ర సెల్ అపార్ట్మెంట్కి చేరువలో రోడ్డుపై.. చావు బతుకుల మధ్య శాండీ అనే స్నేహితురాలికి కనిపించాడు. సుమారు 8 గంటలు కోమాలో ఉన్న రసెల్, జూన్ 4న ఉదయం 9 గంటలకు చనిపోయాడు.ఆ రాత్రి పార్క్‌లో గొడవపడిన కుర్రాడితో పాటు అతడి గ్యాంగ్‌ని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. కానీ నిజాలు బయటికి రాలేదు. కొడుకు చనిపోయాడన్న బెంగతోనే జాన్ 1998లో మరణించాడు. మరో పదమూడేళ్ల న్యాయపోరాటం తర్వాత రసెల్ తల్లి స్యూ చనిపోయింది. ఇప్పటికీ అతని సోదరి డయానా తన అన్నను చంపిందెవరో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంది. ఏది ఏమైనా, కొన ఊపిరితో ఉన్న రసెల్ తన స్నేహితుడు బ్రియాన్ పేరెందుకు పిలిచాడు? ఆసుపత్రికి కాల్ చేసింది ఎవరు? నిజంగానే పార్క్‌లో కుర్రాడికి, అతని గ్యాంగ్‌కి ఆ రాత్రి రసెల్ ఒంటరిగా దొరికేశాడా? ఇలా ఎన్నో ప్రశ్నలు నేటికీ మిస్టరీనే!∙సంహిత నిమ్మన -
మైక్ ఎమర్ట్
వాషింగ్టన్ , రెడ్‌మండ్‌లో నివసించే రియల్ ఎస్టేట్ ఏజెంట్ మైక్ ఎమర్ట్ 2001లో స్టీవెన్ అనే కస్టమర్‌కి వుడిన్విల్ శివార్లలో ఉన్న గెయిల్ ఇంటిని చూపించడానికి వెళ్లి, అక్కడే హత్యకు గురయ్యాడు. స్టీవెన్ ఇల్లు చూడటానికి వచ్చినప్పుడు ఉత్తర కాలిఫోర్నియా నుంచి మకాం మారుతున్నట్లు చెప్పాడట! 2011లో కీలక ఆధారాలు దొరికినా, ఫలితం లేకుండా పోయింది. న్యాయపోరాటం చేసీ చేసీ చివరికి మేరీ 2024 జనవరిలో ఈ కే సును క్లోజ్ చేయాలని అధికారులను కోరారు. ‘మైక్! మైక్! ఎక్కడున్నావ్? చాలాసేపటి నుంచి నీ ఫోన్ మోగుతోంది, ఏదో అన్నోన్ నంబర్’ అంటూనే అతడి ఫోన్ పట్టుకుని బెడ్రూమ్లోకి వచ్చింది మేరీ. ‘హా వస్తున్నా మేరీ! టూ మినిట్స్. స్నానం అయిపోయింది’ అని బాత్రూమ్లోంచి బదులిచ్చాడు మైక్. ‘సరే అయితే ఫోన్ బెడ్ మీద పెడుతున్నా. బ్రేక్‌ఫాస్ట్ చేసే వెళ్లు, రెడీ అయిపోయింది’ అని చెప్పి మళ్లీ కిచెన్‌లోకి వెళ్లిపోయింది మేరీ. వారిది ప్రేమ వివాహం. ఇరువురూ సంపన్నులే కావడంతో పెళ్లికి ముందే రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెట్టారు. పిల్లలు మేరీ తల్లి దగ్గర పెరగడంతో చాలా డీల్స్ ఇద్దరూ కలిసే చేస్తుండేవారు. మైక్ రెడీ అయ్యి ఫోన్‌ను మెడకు, భుజానికి మధ్య నొక్కిపెట్టి మాట్లాడుకుంటూ, చేతి షర్ట్ బటన్ పెట్టుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. ఇంతలో మేరీ తింటూనే అతడికీ బ్రేక్‌ఫాస్ట్ అందించింది. ‘అయ్యో, స్టీవెన్ గారు! మీకు నచ్చడమే మాకు కావాలి. మీరు కోరుకున్నట్లే అదే ఇల్లు, మళ్లీ ఒకసారి మొత్తం చూపిస్తా. నచ్చితే బయానా మాట్లాడుకుందాం. ఓనర్ ఎలాగో ఆఫీస్‌కి వెళ్లుంటారు, సెకండ్ కీ నా దగ్గరే ఉంది, సో మనం వెళ్లొచ్చు. ఇబ్బందేమీలేదు. మీరు కొనుక్కునేవాళ్లు, మేము అమ్ముకునేవాళ్లం. ఒకటికి పదిసార్లు చూసుకోవడం మీ హక్కు. ఓకే సార్! మీరు చెప్పిన∙టైమ్‌కి కిర్క్లాండ్ షాపింగ్ మాల్కి వచ్చేస్తా’ అనేసి ఫోన్ పెట్టేశాడు మైక్.అంతా విన్న మేరీ తింటూనే, ‘ఎవరు మైక్? స్టీవెనేనా? అంటే, ఆరోజు కుంటుకుంటూ వచ్చాడే అతనేనా?’ అంది ఆత్రంగా. ‘అవును మేరీ! అతనే, మళ్లీ వచ్చాడు. మనం చూపించిన అన్ని ఇళ్లల్లోనూ గెయిల్ ఇల్లు అతనికి బాగా నచ్చిందట. నన్ను కిర్క్లాండ్ మాల్కి రమ్మన్నాడు. ఇద్దరం కలసి ఆ ఇంటికి వెళ్తాం. ఈ బేరం కుదిరేలానే ఉంది’ అన్నాడు మైక్. మరి నేనూ రానా అంది మేరీ. ‘వద్దు. చూపించడమే కదా! బేరం ఓకే అయితే అప్పుడొద్దువుగానిలే’ అన్నాడు మైక్.అదే రోజు మధ్యాహ్నం పన్నెండున్నర అయ్యేసరికి గెయిల్ ఆఫీస్ నుంచి భోజనానికి తన ఇంటికి వచ్చింది. పైన బాత్రూమ్లో ఏకధారగా నీళ్లుపోతున్న శబ్దం విని, ఇంట్లో ఎవరో ఉన్నారనిపించింది. ధైర్యం చేసి మెట్లు ఎక్కి బెడ్రూమ్ నుంచి బాత్రూమ్కి నడుస్తుంటే, దారిపొడవునా రక్తం చారలు ఆమెను వణికించాయి. బాత్ టబ్‌లో మనిషి శవం నీళ్లల్లో మునిగి ఉంది, పైన షవర్ నుంచి నీరు ధారగా పడి, బాత్ టబ్ పొంగుతోంది. టబ్‌లో నిండిన నీళ్లు రక్తంతో కలసి పారుతున్నాయి. అది చూసి అప్రయత్నంగా కెవ్వుమంది గెయిల్. కాస్త తేరుకుని, గజగజ వణుకుతూ మరోసారి ఆ శవం ఎవరిదా? అని పరికించి చూసింది. తన ఇల్లు అమ్మకానికి తీసుకున్న రియల్ఎస్టేట్ వ్యాపారీ మైక్దని గుర్తించి నిర్ఘాంతపోయింది.రంగంలోకి దిగిన పోలీసులు బాడీని పోస్ట్‌మార్టమ్‌కి పంపించి, మేరీకి సమాచారం అందించారు. మైక్ ఒంటి మీద 19 కత్తిపోట్లు ఉన్నాయని రిపోర్ట్‌లో తేలింది. అతడి ఖరీదైన వాచ్, డైమండ్ రింగ్, పర్స్ కనిపించడం లేదని దర్యాప్తులో తెలిసింది. వాటిని కిల్లర్ దోచుకెళ్లాడని నమ్మారు. వేలిముద్రల వంటి ఆధారాలను నాశనం చేయడానికే మైక్‌ని బెడ్రూమ్లో చంపి, బాత్‌టబ్‌లో ముంచాడని స్పష్టత వచ్చింది.‘ఉదయం స్టీవెన్ అనే పెద్దాయన మైక్‌కి కాల్ చేసి, కిర్క్లాండ్ మాల్కి రమ్మన్నాడు. అక్కడి నుంచే గెయిల్ ఇంటికి వెళ్లాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. స్టీవెన్ మొదటిసారి గెయిల్ ఇంటిని చూడటానికి వచ్చినప్పుడు మైక్‌తో పాటు నేను కూడా అతణ్ణి చూశాను. అతడికి 50 ఏళ్లుపైనే ఉంటాయి. అతను కుంటివాడు, కర్ర సాయంతో నడవడం చూశాను’ అని చెప్పింది మేరీ. వెంటనే మేరీ చెప్పిన మాల్కి వెళ్లారు అధికారులు. అక్కడ పార్కింగ్‌లో మైక్ కారు దొరకడంతో స్టీవెనే కిల్లర్ అనే క్లారిటీ వచ్చేసింది.అయితే స్టీవెన్ అనే పేరు అబద్ధం కావచ్చని, స్టిక్ పట్టుకుని నడవడమనేది నాటకం కావచ్చని, ఆ స్టిక్లోనే పదునైన కత్తి దాచి ఉంటాడని, కేవలం దొంగతనమే అతడి టార్గెట్ కాకపోవచ్చని అంచనాలు మొదలయ్యాయి. స్టీవెన్ ప్రొఫెషనల్ హిట్మెన్ అయ్యి ఉంటాడని, మైక్‌ని చంపడానికి ఎవరితోనో సుపారీ మాట్లాడుకుని వచ్చి ఉంటాడని అధికారులు నమ్మసాగారు. అందుకే మైక్‌ను హత్య చేయడానికి జనసంచారానికి దూరంగా ఉండే గెయిల్ ఇంటినే కిల్లర్ ఎంచుకుని ఉంటాడని భావించారు. అయితే మైక్‌ని చంపాలనుకునేంత శత్రువులు ఎవరూ లేరని మేరీ చెప్పింది. బంధుమిత్రులూ అదే మాటన్నారు.సరిగ్గా పదేళ్లకి టెక్నాలజీ సాయంతో నేరం జరిగిన ప్రదేశంలో ఒక డీఎన్ఏని గుర్తించారు. అది గ్యారీ క్రూగేర్ అనే మాజీ పోలీస్ అధికారిదని రుజువైంది. అతడు అప్పటికే చనిపోయాడు. అతడికి మైక్ మర్డర్ కేసులోనే కాదు, మరో మూడునాలుగు మర్డర్ కేసులతో సంబంధం ఉందని తేలింది. పైగా రిటైర్మెంట్ తర్వాత గ్యారీ రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా కూడా పని చేశాడు. రియల్ ఎస్టేట్ ఏజెంట్లు జిమ్ బారీ హత్య కేసులోనూ, బ్రాడ్షా మిస్సింగ్లోనూ గ్యారీకి సంబంధం ఉంది.ఏది ఏమైనా గ్యారీ, స్టీవెన్ ఇద్దరూ ఒక్కరేనా? మైక్‌ని చంపింది ఒక వ్యక్తేనా? అతడితో పాటు ఇంకెవరైనా ఉన్నారా? గ్యారీ రియల్ఎస్టేట్ రంగంలో తనకు పోటీ లేకుండా చేసుకోవడానికి మైక్‌తో పాటు మిగిలిన హత్యలు చేశాడా? లేదంటే ఎవరైనా మైక్ శత్రువులు గ్యారీతో బేరం కుదుర్చుకున్నారా? అనే ప్రశ్నలు నేటికీ మిస్టరీనే! ∙సంహిత నిమ్మన -
బ్యాంకాక్‌లో సంచలనం.. ఆరుగురు టూరిస్టుల మిస్టరీ డెత్
బ్యాంకాక్: టూరిస్టుల స్వర్గధామం థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఆరుగురు విదేశీయులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది. ఆరుగురు మంగళవారం(జులై 16) నగరంలోని ఓ హోటల్ గదిలో విగత జీవులుగా పడి ఉన్నారు. వీరంతా వియత్నాం దేశస్తులని సమాచారం.అయితే వీరిలో ఇద్దరికి అమెరికా పాస్పోర్టులుండటం గమనార్హం. మృతి చెందిన వారిలో ముగ్గురు మహిళలు. వీరు శని, ఆదివారాల్లో వేరువేరుగా బ్యాంకాక్‌లోని ఓ ప్రముఖ హోటల్‌కు వచ్చి రెండు గదులు తీసుకున్నారు. అనంతరం మంగళవారం వారంతా ఒకే గదిలో చనిపోయి ఉండటం మిస్టరీగా మారింది. విదేశీయులు అనుమానాస్పదంగా మృతి చెందిన హోటల్‌ను ప్రధాని స్రెత్తా తవిసిన్ పరిశీలించారు. పర్యాటక రంగంపై ఎలాంటి ప్రభావం పడకుండా ఉండేందుకుగాను ఈ ఘటనపై వేగవంతమైన దర్యాప్తు జరపాలని ప్రధాని ఆదేశించినట్లు పోలీసులు తెలిపారు. ఆరుగురితో పాటు వేరే ఎవరైన వ్యక్తి వచ్చారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. -
ఆకాశం నుంచి పడిన వింత వస్తువు
వేలూరు: ఆకాశం నుంచి ఏదో వస్తువు పడి పేలిన పెద్ద శబ్ధం వచ్చి, ఆ ప్రాంతంలో ఐదు అడుగుల మేర గుంత ఏర్పడింది. వివరాల్లోకి వెళితే.. తిరుపత్తూరు జిల్లా జోలార్‌పేట సమీపంలోని అచ్చమంగలం కోట గౌండర్ ప్రాంతానికి చెందిన రైతు రవి. ఇతని వ్యవసాయ భూమిలో గత రెండు రోజుల క్రితం పెద్ద పేలుడు శబ్దం వచ్చింది. దీంతో స్థానికులు గమనించి వ్యవసాయ భూమి వద్దకు వెల్లి పరిశీలించగా ఐదు అడుగుల లోతు, రెండు అడుగుల వెడల్పుతో కూడిన గుంత ఏర్పడి ఉండడాన్ని గమనించారు. అలాగే ఈ గుంత నుంచి అధికంగా వేడి గాలి వచ్చినట్లు స్థానికులు గుర్తించిన ఆకాశం నుంచి ఏదైనా వస్తువు పడిందా? లేక వేరే ఏమైనా పడిందా? అనే కోణంలో స్థానికులు జోలార్‌పేట తహసీల్దార్‌కు సమాచారం అందజేశారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ దర్పకరాజ్, తహసీల్దార్ ఆనంద క్రిష్ణన్, రెవెన్యూ అధికారులు ఆ ప్రాంతానికి వెళ్లి, విచారణ జరిపారు. వీటిపై కలెక్టర్ దర్పకరాజ్ మాట్లాడుతూ వ్యవసాయ పొలంలో పెద్ద శబ్దంతో కూడిన వస్తువు పడినట్లు స్థానికులు తెలపడంతో వాటిని తనిఖీ చేశామని, అయితే వీటిపై పరిశోధన కేంద్రం అధికారులకు సమాచారం అందజేయడంతో వీటిని నిపుణులు పరిశోధన చేయనున్నారని, ఇప్పటికే గుంటలోని మట్టిని పరిశోధనకు పంపామన్నారు. దీనిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మంగళవారం ఉదయం వే లూరులోని పరిశోధన కేంద్రం అధికారుల బృందం నేరుగా వచ్చి తనిఖీ చేశారని పల్లంలోని మట్టితోపాటు బాగా కాలిన బూడిదను పరిశోధనకు తీసుకెళ్లినట్లు తెలిపారు. పల్లం చుట్టూ ఎవరూ దగ్గరకు వెళ్లకుండా ట్రంచ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. -
16 మంది మాయం.. మంజుమ్మెల్ బాయ్స్ ‘గుణ గుహ’ గురించి తెలుసా?
మళయాలంలో చిన్న చిత్రంగా రిలీజ్ అయ్యి.. టోటల్ సౌత్‌నే ఊపేస్తోంది మంజుమ్మెల్ బాయ్స్. వాస్తవ ఘటన ఆధారంగా తెరకెక్కింది ఈ సర్వైవల్ డ్రామా. అత్యంత ప్రమాదకరమైన గుహల్లో చిక్కుకున్న తన మిత్రుడ్ని రక్షించుకునేందుకు ఓ యువకుడు చేసిన సాహసమే ఈ చిత్రానికి స్ఫూర్తి. అయితే ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ.. గుణ గుహలు, ఆ గుహ చుట్టూ అల్లుకున్న మిస్టరీ నేపథ్యం. ఆ మిస్టరీ ఏంటి? ఆ గుహలోకి వెళ్లి అదృశ్యమైన 16 మంది ఏమైపోయారు?.. ఇంతకీ ఈ గుహలకు డెవిల్ కిచెన్ అనే పేరు ఎందుకు పెట్టారో తెలుసుకుందాం. తమిళనాడు కొడైకెనాల్లో గుణ గుహలు ఉన్నాయి. 1821లో బీఎస్ వార్డ్ అనే బ్రిటిష్ అధికారి ఈ గుహల గురించి తొలిసారి వెలుగులోకి తెచ్చారు. ఆ గుహకు డెవిల్స్ కిచెన్ అని పేరు పెట్టాడాయన. లిఖితపూర్వక రికార్డులు కూడా లేకపోయేసరికి అసలు ఆయన వాటికి ఆ పేరు ఎందుకు పెట్టాడో అనేదానికి చాలా ఏండ్లు స్పష్టత లేకుండా పోయింది. ఈలోపు.. 1991లో కమల్ హాసన్ నటించిన గుణ చిత్రం విడుదలైంది. ఆ చిత్రం మేజర్ పోర్షన్ ఈ గుహల పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ చేసుకుంది. గుణ చిత్రం సూపర్ హిట్ కావడంతో.. ఈ గుహలకు ‘గుణ గుహలు’ అనే పేరొచ్చింది. అప్పటి నుంచి పర్యాటకులు క్యూ కట్టడం ప్రారంభించారు. అయితే.. తర్వాతి కాలంలో ఆ గుహల పేరు చెబితేనే జనాలు వామ్మో అనుకోవడం ప్రారంభించారు. అందుకు కారణం.. ఆ గుహలోని అగాథం, ఆ అగాథాన్ని అన్వేషించేందుకు వెళ్లిన కొందరిని అది మింగేయడం. పైగా గుహ ఏకరీతిలో కాకుండా అసాధారణ రీతిలో ఉండడంతో.. అందులో పడిపోయినవాళ్ల మృతదేహాల్ని సైతం బయటకు తీయలేకపోయారు. దీంతో.. వార్డ్ అందుకే డెవిల్స్ కిచెన్ అని దానికి పేరు పెట్టి ఉండొచ్చనే అంచనాకు వచ్చారు. అలా.. గుణ గుహలకు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన గుహల్లో ఒకటిగా పేరు వచ్చింది. పోలీసుల రికార్డుల ప్రకారం.. 2016 దాకా 16 మంది ఈ గుహలోకి వెళ్లిన వాళ్లు కనిపించకుండా పోయారు. అలా.. అదృశ్యమైన వాళ్లలో ఓ కేంద్రమంత్రి బంధువు కూడా ఉన్నారు. వీళ్లలో కొన్ని సూసైడ్ కేసులు కూడా ఉన్నాయి. అయితే.. ఓ వ్యక్తి మాత్రం సజీవంగా బయటకు రాగలిగాడు. అదే మంజుమ్మెల్ బాయ్స్ కథకు మూలమైంది. 2006లో కేరళ కొచ్చి మంజుమ్మెల్ ప్రాంతానికి చెందిన కొందరు స్నేహితులు ఈ గుహ సందర్శనకు వెళ్లారు. అందులో సుభాష్ అనే వ్యక్తి గుహ అగాథంలోకి పడిపోయాడు. దీంతో అతని మీద ఆశలు వదిలేసుకున్న సమయంలో.. సిజూ డేవిడ్ అనే అతని స్నేహితుడు ధైర్యం చేశాడు. పోలీసులు, అధికారులు హెచ్చరించి వారించినా వినకుండా స్థానికుల సాయంతో అతికష్టం మీద తన స్నేహితుడ్ని రక్షించుకున్నాడు. అలా ఆ వాస్తవ గాథ ఆధారంగా తెరకెక్కిన మంజుమ్మెల్ బాయ్స్ చిత్రం.. ఇప్పుడు సౌత్ ఆడియెన్స్‌ను అలరిస్తోంది. 2000 సంవత్సరం చాలా ఏళ్లపాటు సందర్శకులను అనుమతించకుండా ఈ గుహను శాశ్వతంగా మూసేశారు. అయినా కూడా హెచ్చరికలను పట్టించుకోకుండా కొందరు ఆ గుహ పరిసరాలకు వెళ్లే ప్రయత్నం చేస్తూ ప్రమాదంలో పడుతూ వచ్చారు. మంజుమ్మెల్ బాయ్స్ చిత్రం సూపర్ హిట్ కావడంతో గుణ గుహలకు సందర్శకులను అనుమతించడం ప్రారంభించింది తమిళనాడు టూరిజం శాఖ. కానీ, గుహ ప్రధాన ద్వారం మాత్రం ఇంకా మూసే ఉంచారు. గుహకి ఉన్న భయాకన నేపథ్యంతో మంజుమ్మెల్ బాయ్స్ చిత్రం షూటింగ్ చాలావరకు సెట్స్‌లోనే నిర్వహించారు. కొంత భాగం మాత్రం గుహల పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించారు. అలాగే కమల్ హాసన్ గుణ చిత్రం.. తాజా మెంజుమ్మెల్ బాయ్స్ సినిమాలే కాకుండా.. ఈ మధ్యలో మోహన్‌లాల్ నటించిన షిక్కర్(2010) చిత్రం కొంత భాగం డెవిల్స్ కిచెన్ గుహల పరిసరాల్లోనే షూటింగ్ చేసుకుంది. Video Credits: Pyramid Glitz Music -
అసలు టార్గెట్ ట్యాపింగ్ కాదా?
సాక్షి, హైదరాబాద్: స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) కార్యాలయం కేంద్రంగా డీఎస్పీ ‘ప్రణీత్‌రావు అండ్ కో’ అప్పటి ప్రతిపక్ష నేత, ఇప్పటి సీఎం రేవంత్‌రెడ్డి సహా అనేక మంది ఫోన్లను ట్యాప్ చేశారు... ఈ నెల తొలి వారం నుంచి పోలీసులు లీకుల రూపంలో చెబు తున్న అంశం ఇది. అయితే పంజగుట్ట ఠాణాలో నమోదైన ప్రణీత్ కేసు, ఆయన రిమాండ్ రిపోర్టులో ఎక్కడా ట్యాపింగ్ నేరానికి సంబంధించిన చట్టం ప్రస్తావన లేకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో సిట్ దర్యాప్తు టార్గెట్ వేరే ఉందా? అనే అనుమానాలు కలు గుతున్నా యి. ప్రణీత్ వారం రోజుల కస్టడీ దేనికోసమో అంతు చిక్క ట్లేదు. కేసులో ఒక్కటి మినహా అన్నీ బెయిలబుల్ సెక్షన్లే. ఏపీలో నమోదైన ‘స్కిల్డెవల ప్మెంట్’ కేసులో చంద్రబాబు జైలుకు వెళ్లడానికి కారణమైన ఐపీసీలోని 409సెక్షన్ ఈ కేసులోనూ ఉండటంతో ప్రణీత్ జ్యుడీషియల్ రిమాండ్‌కు వెళ్లాడని నిపుణులు చెప్తున్నారు. సస్పెన్షన్ ఉత్తర్వుల్లో అస్పష్టంగా.. ఎస్ఐబీలో అంతర్భాగమైన స్పెషల్ ఆపరే షన్స్ టార్గెట్ (ఎస్ఓటీ) బృందానికి నేతృత్వం వహించిన ప్రణీత్.. ప్రభుత్వం మారిన తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లా డిస్ట్రిక్ట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోకు బదిలీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఎస్ఐబీ అంతర్గత విచారణలో ఆయన చేసిన అవక తవకలు వెలుగులోకి వచ్చాయి. ఈ విభాగాధిపతి ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రణీత్‌ను సస్పెండ్ చేస్తూ డీజీపీ ఈ నెల మొదటి వారంలో ఉత్తర్వులు జారీ చేశారు. వీటిలో కొంత వరకు ట్యాపింగ్‌కు సంబంధించిన ఆరోపణలున్నాయి. ఎస్ఓ టీకి ఉద్దేశించిన లీజ్డ్ లైన్, ఇంటర్నెట్ కనెక్షన్లను ప్రణీత్ దుర్వినియోగం చేశారని అందులో ఆరోపించారు. అందులోనే 42 హార్డ్‌డిస్క్‌లు మార్చేయడం, ధ్వంసం చేయడం అంశాన్నీ ప్రస్తావించారు. ఈ సస్పెన్షన్ జరిగిన వారం తర్వాత ఎస్ఐబీ ఏఎస్పీ ఫిర్యాదు మేరకు పంజగుట్ట పోలీసుస్టేషన్లో ప్రణీత్, ఇతరులపై కేసు నమోదైంది. ఆ రెంటిలో కనిపించని ప్రస్తావన... ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్లో పోలీసులు మూడు చట్టాల్లోని 9 సెక్షన్ల కింద అభియోగాలు చేశారు. ఐపీసీ, ఐటీ, ప్రజా ఆస్తుల విధ్వంసాల నిరోధక (పీడీపీపీ) చట్టంలోని సెక్షన్లు వాడారు. ఈ నెల 13న అధికారులు న్యాయస్థానంలో రిమాండ్ కేసు డైరీని సమర్పించారు. ఇందులో ఓ సెక్షన్ తగ్గించి ఎనిమిదింటి కిందే ఆరోపణలు చేశారు. ఎఫ్ఐఆర్లో ఐపీసీలోని 120బీ (కుట్ర) ఉండగా... రిమాండ్ రిపోర్టులో ఈ సెక్షన్ కనిపించలేదు. సెక్షన్ 34 చేర్చినప్పుడు 120బీ ఉండాల్సిన అవసరం లేదని, ఈ నేపథ్యంలోనే రిమాండ్ రిపోర్టులో తొలగించి ఉంటారని కొందరు చెబుతున్నారు. అయితే ఓ నిందితుడిపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేయాలంటే కచ్చితంగా టెలిగ్రాఫిక్ యాక్ట్‌ను జోడించాలి. అయితే ఎఫ్ఐఆర్, రిమాండ్ కేసు డైరీ రెండింటిలోనూ ఎక్కడా ప్రత్యక్షంగా ట్యాపింగ్ ప్రస్తావన, ఈ యాక్ట్ కనిపించకపోవడం గమనార్హం. ఆ అధికారులూ బాధ్యతులే అవుతారు... ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అధికారులు అంగీకరిస్తున్నప్పటికీ కేసులో దీన్ని ప్రస్తావించకపోవడం వెనుక బలమైన కారణాలున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఫోన్లను అనధికారికంగా ట్యాప్ చేయడం చాలా ఖరీదుతో కూడిన అంశం. అధికారికంగా ట్యాప్ చేయాలంటే సంబంధిత సర్వీస్ ప్రొవైడర్ సహకారం అనివార్యం. దీనికోసం పోలీసు విభాగం వారికి లేఖ రాయాల్సి ఉంటుంది. ఇది డీఎస్పీ ప్రణీత్ వద్ద నుంచే వచ్చి... ఎస్పీ సహా కొందరు ఉన్నతాధికారులు ఫార్వర్డ్ చేయాలి. ఈ లేఖలు సర్వీస్ ప్రొవైడర్ వద్ద నిర్ణీత కాలం వరకు భద్రంగా ఉండాలి. ట్యాపింగ్ కోణంలో దర్యాప్తు చేస్తే ఆధారాలు సేకరించడం, తదుపరి చర్యలు తీసుకోవడం తేలికే అయినప్పటికీ... అప్పట్లో లేఖలు ఫార్వర్డ్ చేసి, ప్రస్తుతం ఉన్నత స్థానంలో ఉన్న కొందరు అధికారులకు నోటీసులు జారీ చేయాల్సి ఉంటుంది. అసలు లేఖలే లేకుండా లేదా ప్రాపర్ చానల్లో రాకుండా ట్యాపింగ్‌కు సహకరిస్తే సర్వీస్ ప్రొవైడర్ తీవ్ర ఇబ్బందుల్లో పడతాడు. ఈ నేపథ్యంలోనే పోలీసులు అధికారికంగా ఎక్కడా ట్యాపింగ్ ప్రస్తావన నేరుగా తీసుకురాకుండా కేసు దర్యాప్తు చేస్తున్నారు. దీని టార్గెట్ వేరేది ఏదో ఉంటుందని, అది తెలియాలంటే మరికొన్నాళ్లు పడుతుందని కొందరు అధికారులు చెబుతున్నారు. -
ఆ వాటర్ ఫాల్ 'ఓ కన్నతల్లి గుండె కోత'!
కొన్ని పుకార్లు ఎంతగా భయపడతాయంటే..తరాలు మారిన ఆ భయం వెన్నాడుతూనే ఉంటుంది. ఎందువల్ల అనేది అర్థంకానీ మిస్టరీలా ఉండిపోతుంది. తెలుసుకుందామంటే..కల్పిత భయం నీడలా తెలియకుండా భయాలను కలగజేస్తుంది. ఆ భయమే ఆ చేధనలో కనిపించి వామ్మో! ఎందుకులే అనిపించేలా ఉంటాయి. అలా నేటికీ అంతు చిక్కని మిస్టరీలా మిగిలిపోయిన వాటర్ ఫాల్ గాథ ఇది!. ఇప్పటికీ ఆ వాటర్‌ఫాల్ వద్దకు రాత్రుళ్ల వెళ్లాలంటే హడలే..! అది మేఘాలయలోని ‘రంగ్జిర్తెహ్’ గ్రామం. ఇది ‘లికాయి’ అనే స్త్రీ కథ. లికాయికి యుక్తవయసులో పెళ్లి చేసి పంపించారు తల్లిదండ్రులు. ఆ బంధానికి ప్రతీకగా ఆమెకు అందమైన ఆడపిల్ల పుట్టింది. అయితే కొన్నిరోజులకే.. అనుకోని విషాదం ఆమె జీవితాన్ని మోడుగా మార్చింది. విధి ఆడిన ఆటలో భర్తను కోల్పోయింది. ఉన్న ఒక్కగానొక్క కూతుర్ని పెంచటం ఆమెకు కష్టమైంది. దాంతో లికాయి.. మళ్లీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. కొన్ని నెలలకు.. తన జీవితం గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తినే ఎన్నుకుని రెండో పెళ్లి చేసుకుంది. రోజులు సంతోషంగా గడుస్తున్నాయి. రెండో భర్త తనపై చూపించే ప్రేమకు.. ప్రతిరోజు దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకునేది లికాయి. ఒకరోజు అతడు ఆమెకు మాంసం కూర వండి పెట్టాడు. ఆనందంతో కడుపునిండా తినేసింది. తిన్న వెంటనే తమలపాకులు, వక్క వేసుకుని తృప్తిగా తేన్చాలి అనుకుంది. కానీ తమలపాకుల పక్కనే రక్తం ఓడుతున్న చిన్న వేలు ఆమెని భయపెట్టింది. అది తన కూతురుదని గుర్తించి నిర్ఘాంతపోయింది. కాసేపటికే మరో ఘోరం ఆమెకు అర్థమైంది. తాను తిన్నది మాంసం కూర కాదని, తన కూతురు శరీరాన్ని అని గ్రహించి.. పిచ్చిదానిలా కేకలుపెట్టింది. తన రెండవ భర్తే ఇంతటి ఘోరానికి ఒడికట్టాడని తెలిసి వాకిట్లో కూలబడి పొట్టను బాదుకుంటూ పెద్దపెద్దగా ఏడ్చింది. ఆ కఠోర సత్యాన్ని జీర్ణించుకోలేక సమీపంలోని జలపాతం దగ్గరకు పరుగుపెట్టి అందులో దూకేసింది. ఈ విషాద గాథ.. మేఘాలయలోని ‘నోహ్కలికాయి వాటర్ ఫాల్స్’ ముందుండే పెద్ద బోర్డ్ మీద.. ఓ పురాణ గాథలా కనిపిస్తుంటుంది. ఈ ఉదంతం తెలిసిన వాళ్లంతా.. ఆ జలపాతం ‘ఓ కన్నతల్లి గుండె కోత’ అని భావిస్తుంటారు. స్థానికుల్లో చాలామంది మాత్రం రాత్రి పూట ఇక్కడికి వెళ్లడానికి భయపడుతూ ఉంటారు. లికాయి.. ఆత్మగా మారి ఆ సమీపంలోనే తిరుగుతోందని, తన బిడ్డను వెతుక్కుంటోందని నమ్మేవాళ్లంతా.. ఈ కథకు హారర్ టచ్‌ని ఇచ్చి.. మరింతమందిని వణికిస్తుంటారు. అయితే లికాయి నిజంగానే ఆత్మగా మారిందా? లికాయి వ్యథ సరిగ్గా ఏ కాలంలో జరిగింది? ఆమె రెండో భర్త ఏమయ్యాడు? లాంటి వివరాలేమీ తెలియవు. అందుకే ఈ వాటర్ ఫాల్స్ వెనుకున్న ఈ గాథ నేటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. -సంహిత నిమ్మన (చదవండి: 'రా.. ఇటువైపు రా.. ఇక్కడే, ఈ క్షణమే చచ్చిపో..' కథ కాదు నిజం..) -
విలాసవంతమైన భవనం కట్టడం డ్రీమ్!..సడెన్‌గా మర్డర్ కేసులో..
అలికిడిలేని ఇళ్ల చుట్టూ హడలెత్తించే కథలల్లుకోవడం కొత్తేం కాదు. అందుకే చాలా పాడుబడిన భవనాలు ఇప్పటికీ మిస్టరీలుగా ప్రపంచాన్ని వణికిస్తుంటాయి. థాయ్‌లండ్ రాజధాని బ్యాంకాక్‌లో 49 అంతస్తులతో అసంపూర్ణంగా మిగిలిపోయిన ‘ఘోస్ట్ టవర్’ కూడా అలాంటిదే! దీని అసలు పేరు సాథోర్న్ యూనిక్ టవర్. ఇదొక దయ్యాల భవనంగా 1997 నుంచి 2014 వరకూ పుకార్లతో షికార్లు చేసింది. ఈ భవంతిలోని 43వ అంతస్తులో 2014 డిసెంబర్ 5న స్వీడిష్ టూరిస్ట్ మృతదేహం..ఈ పుకార్లకు సాక్ష్యాన్నిచ్చింది. 2014లో.. అప్పటికే 17 ఏళ్లుగా మూసే ఉంటున్న ఈ టవర్‌లో.. స్వీడిష్ టూరిస్ట్ ఉరి తాడుకు వేలాడటం స్థానికులను హడలెత్తించింది. ప్రపంచ మీడియాను కదిలించింది. నథాపత్ అనే 33 ఏళ్ల ఫొటోగ్రాఫర్.. మొదటగా ఈ భవనంలో స్వీడిష్ టూరిస్ట్ మృతదేహాన్ని గుర్తించాడు. 30 ఏళ్ల స్వీడిష్ టూరిస్ట్ జేబులో దొరికిన డ్రైవింగ్ లైసెన్స్ సాయంతో నవంబర్ 10 థాయిలండ్కు వచ్చాడని.. అక్కడే ఓ గెస్ట్‌హౌస్‌ను అద్దెకు తీసుకున్నాడని తేలింది. మృతదేహం దొరికిన్నాటికే అతడు చనిపోయి ఐదు రోజులు అయ్యుండొచ్చని వైద్యనిపుణులు అంచనా వేశారు. కానీ మరణానికి అసలు కారణం స్పష్టం కాలేదు. అతని కలే ఈ భవనం.. 1990లో రంగ్సన్ టోర్సువాన్ అనే ప్రముఖ థాయ్ వాస్తుశిల్పి.. విలాసవంతమైన ‘కండోమినియం కాంప్లెక్స్’ కట్టాలని కలగన్నాడు. అతడు స్వయంగా డెవలపర్ కావడంతో ఆశపడినట్లే దీని నిర్మాణాన్ని అనుకున్న సమయానికి ప్రారంభించాడు. అయితే అనుకోకుండా 1993లో థాయ్ సుప్రీంకోర్టుకు చెందిన ఓ న్యాయమూర్తి మర్డర్ కేసులో ఇరుక్కున్న టోర్సువాన్.. జైలుకెళ్లాల్సి వచ్చింది. ఆర్థిక కష్టాలు మొదలుకావడం, యజమాని జైల్లో ఉండటంతో 1997లోనే ఈ నిర్మాణం ఆగిపోయింది. అప్పటికే 80 శాతం పూర్తయిన ఈ టవర్.. అసంపూర్ణంగానే మూలపడింది. నాటి నుంచి నేటికీ ఆ భవనంలో ప్రేతాత్మలున్నాయని చాలామంది నమ్ముతారు. ఆ నమ్మకానికి స్వీడిష్ డెత్ మిస్టరీ మరింత బలం చేకూర్చింది. చివరికి టోర్సువాన్.. 2010లో నిర్దోషిగా బయటికి వచ్చాడు. దయ్యాలు, మూఢనమ్మకాల చుట్టూ తిరిగే కొందరు మాత్రం ఈ పాడుబడిన భవనం గురించి మాట్లాడుకునేటప్పుడు.. టోర్సువాన్ పతనానికి ఈ భవననిర్మాణమే కారణమని భావిస్తుంటారు. ఎందుకంటే ఆ స్థలంలో గతంలో శ్మశానవాటిక ఉండేదని, దాన్ని పూర్తిగా పూడ్చేసి టోర్సువాన్ ఈ టవర్ కట్టాడని చెప్పుకుంటారు. ఒకప్పుడు ఈ టవర్‌పైకి ఎక్కడానికి అడ్డదార్లను వెతికే ఔత్సాహికులు కొందరు ఇక్కడి సెక్యూరిటీ గార్డులకు లంచం ఇచ్చి మరీ లోపలికి వెళ్లి సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో పెట్టేవారు. కానీ స్వీడిష్ టూరిస్ట్ మరణం తర్వాత సెక్యూరిటీ మరింత పెరిగింది. అలాగే 2015 నుంచి రంగ్సాన్ టోర్సువాన్ వారసుడు పన్సిత్ టోర్సువాన్.. టవర్‌పైకి ఎక్కి ఆన్లైన్లో ఫొటోలు షేర్ చేసేవారిపై కేసులు పెట్టడం మొదలుపెట్టాడు. దాంతో ఈ టవర్‌లోకి అడుగుపెట్టే సాహనం ఎవరూ చేయడం లేదు. ఏది ఏమైనా ఈ టవర్‌లో దయ్యాలు ఉన్నాయా? స్వీడిష్ టూరిస్ట్ ఎలా చనిపోయాడు? ఎవరైనా అతన్ని చంపి, అక్కడ ఉరితాడుకు కట్టేసి నేరం నుంచి తప్పించుకున్నారా? లేక దయ్యాలే దాడి చేశాయా? వంటివన్నీ నేటికీ మిస్టరీనే! ∙సంహిత నిమ్మన (చదవండి: అక్కడ కవి పుట్టిన రోజు ‘బర్న్స్ నైట్’ పేరుతో ఓ పండుగలా ..!) -
పోలీసులకు సవాల్‌గా మారిన ఆదిభట్ల హత్య కేసు
సాక్షి, హైదరాబాద్: ఆదిభట్ల ఠాణా పరిధిలో జరిగిన హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. హతుడు బతికుండగానే నోటికి ప్లాస్టర్ వేసి, కాళ్లు, చేతులు తాళ్లతో కట్టేసి బలవంతంగా గోనె సంచిలో కుక్కారని, గాలి కూడా చొరబడకుండా మూట గట్టిగా కట్టేయడంతో లోపల ఊపిరాడక మరణించి ఉంటాడని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఈనెల 16న బొంగుళూరు టోల్గేట్ నుంచి 1.5 కి.మీల దూరంలో బ్రాహ్మణపల్లి సమీపంలో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని పోలీసులు గుర్తించిన సంగతి తెలిసిందే. తెలిసిన వాళ్ల పనే.. హత్య అనంతరం మృతదేహాన్ని ఎక్కడ పారేయాలో కూడా దుండగులు ముందుగానే ప్లాన్ చేశారని, ఈ క్రమంలోనే సంక్రాంతి సెలవుల్లో జాతీయ రహదారులలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఎవరూ గుర్తించలేరని నిందితులు భావించి ఉంటారని పోలీసులు పేర్కొన్నారు. హతుడికి తెలిసిన వాళ్లే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై సంచిలో మూటకట్టిన మృతదేహాన్ని తీసుకొచ్చి ఓఆర్ఆర్ సరీ్వస్ రోడ్డులో పడేసి ఉంటారని వివరించారు. అయితే ఆ ప్రాంతంలో ఎలాంటి వాహన టైర్ల గుర్తులు లభించలేదని, రోడ్డు పైన ఎర్రటి మరకలు ఉండడంతో రక్తం కావచ్చని అనుమానించి..నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించామని చెప్పారు. సాంకేతిక ఆధారాలతోనే ముందుకు.. హతుడి ఎవరనేది తేలితేనే కేసు దర్యాప్తు సులువవుతుందని భావించిన పోలీసులు.. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన వందలాది అదృశ్యం కేసుల వివరాలను సేకరించారు. ఘటనాస్థలంలో మృతదేహంపై లభ్యమైన వస్తువులు, హతుడి వయసు, పోలికలతో యువకుల అదృశ్యం కేసుల వివరాలను పోలుస్తున్నారు. ఘటనాస్థలం, పరిసర ప్రాంతాలలో ఎలాంటి సీసీటీవీ కెమెరాలు లేకపోవడంతో పాటు మృతదేహంపై ఎలాంటి కత్తిపోట్లు, గాయాలను పోలీసులు గుర్తించలేదు. శరీరంలో విష ప్రయోగం ఆనవాళ్లు సైతం ఫోరెన్సిక్ పరీక్షలలో వెల్లడికాలేదు. దీంతో కేసు దర్యాప్తు పూర్తిగా సాంకేతిక ఆధారాల పైనే ఆధారపడి ఉందని ఓ పోలీసు అధికారి తెలిపారు. మృతదేహం కుళ్లిన స్థితిని బట్టి హత్య ఈనెల 8–10 తేదీలలో జరిగి ఉండొచ్చని, దీంతో ఆయా తేదీలలో ఓఆర్ఆర్ మీద ప్రయాణించిన సుమారు 12 లక్షల వాహనాలను, లక్షల కొద్ది ఫోన్ కాల్స్‌ను జల్లెడ పడుతున్నామని తెలిపారు. లక్షల్లో ఉన్న డేటా వందల్లోకి వస్తేనే దర్యాప్తు కొలిక్కి వస్తుందని చెప్పారు. -
మనిషి నిద్రపోతుంటే..ఆత్మ లక్ష్యం కోసం ఎంత దూరమైన వెళ్తుందా?
‘బజ్‌ఫీడ్’ అనే అమెరికాకు చెందిన మీడియా సంస్థకు.. నెట్టింట మంచి క్రేజ్ ఉంది. ‘అన్ సాల్వ్డ్ మిస్టరీస్’ పై ప్రత్యేక కథనాలు చేసే ఈ సంస్థ.. ఆసక్తి కలిగించే స్టోరీలను ప్రజలకు అందించడంలో దిట్ట! ‘మీ జీవితాల్లోని విచిత్రమైన సంఘటనలు, భయానక అనుభవాలను రాసి మాకు పంపించండి’ అని ప్రకటించింది. దాంతో బజ్ఫీడ్కి సంబంధించిన మెయిల్స్ అన్నీ అజ్ఞాత వ్యక్తుల నుంచి వచ్చిన కథనాలతో నిండిపోయాయి. అందులోనిదే ఇదొకటి. ‘నేను హైస్కూల్ రెండవ సంవత్సరం చదువుతున్నప్పుడు, ఒకరోజు ఉదయాన్నే విపరీతమైన జ్వరంతో నిద్రలేచాను. అది గమనించిన మా మమ్మీ.. నన్ను ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకోమని చెప్పింది. కానీ ఆ రోజు నాకు ముఖ్యమైన పరీక్ష ఉండటంతో.. స్కూల్‌కి వెళ్తానని చాలాసేపు మారాం చేశాను. కానీ మా మమ్మీ వినిపించుకోలేదు. ‘‘అవసరం అయితే జ్వరం తగ్గాక స్కూల్‌కి వచ్చి ప్రిన్సిపాల్‌తో నేను మాట్లాడతాను’’ అని సర్దిచెప్పింది. దాంతో టాబ్లెట్స్ వేసుకుని.. సోఫాలోనే నిద్రపోయాను. సరిగ్గా మధ్యాహ్నం మూడు అయ్యేసరికి నాకు మెలకువ వచ్చింది. అంటే సుమారు 10 గంటల పాటు నేను నిద్రపోయాను. అప్పటికి నాకు జ్వరం పూర్తిగా తగ్గింది. దాంతో ‘‘నేను.. స్కూల్‌కి వెళ్తాను, కొన్ని క్లాసులకైనా అటెండ్ అయినట్లుంటుంది కదా’’ అని.. మళ్లీ మా మమ్మీని బతిమాలాను. ఈసారి తను అంగీకరించింది. చివరికి నేను స్కూల్ క్యాంపస్‌లో అడుగుపెట్టేసరికి.. నా క్లాస్మేట్స్ చాలామంది క్లాస్ రూమ్ బయటున్నారు. వాళ్లంతా నన్ను చూసి.. ‘‘ఎక్కడి నుంచి వస్తున్నావ్’’ అని అడిగారు. ‘‘ఇంటి నుంచి! ఉదయం నుంచీ జ్వరం.. అందుకే ఉదయం రాలేకపోయాను’’ అని చెప్పాను. అంతా వింతగా చూశారు. కొందరైతే.. ‘‘అదేంటీ నువ్వు ఫస్ట్ అవర్ నుంచి ఇక్కడే ఉన్నావ్ కదా?’’ అని అడిగారు. ఆశ్చర్యపోయాను. మా టీచర్స్ కూడా అదే మాట చెప్పారు. ప్రతి ఒక్కరూ నన్ను ఆ రోజు స్కూల్లో మొదటి అవర్‌లో క్లాస్‌కి రావడం చూశామని అనడంతో నాకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. సాధారణంగా నాకు మొదటి బెంచ్‌లో కూర్చునే అలవాటు ఉండటంతో వాళ్లు పొరబడే అవకాశం లేదని తేలింది. అయితే ఆ సమయంలో క్లాసుకైతే వచ్చాను కానీ యాక్టివ్‌గా లేనట. ఫస్ట్ అవర్‌లో నాతో కొందరు మాట్లాడటానికి ట్రై చేస్తే.. నేను మాట్లాడలేదని.. చాలా గంభీరంగా ఉన్నానని గుర్తు చేసుకున్నారు. ‘‘నేను మా ఇంట్లో నిద్రపోతే.. ఇక్కడి ఎలా వచ్చాను?’’ అనేది నాకు ఏమాత్రం అర్థం కాలేదు. ‘‘ఎంతసేపటి క్రితం కనిపించాను? ఎక్కడెక్కడ తిరిగాను?’’ అంటూ నా స్నేహితుల్ని చాలా ప్రశ్నలు వేశాను. ‘‘చాలాసేపు క్లాసులో ఎవరితోనూ మాట్లాడకుండా కూర్చున్నావ్.. తర్వాత క్లాస్ పూర్తి అయ్యాక ఎప్పటిలానే.. బుక్స్ లాకర్స్ దగ్గరకు వెళ్లాం. ఆ తర్వాత నుంచి నువ్వు కనిపించలేదు. మేము కూడా అంతగా గమనించలేదు’’ అని చెప్పారు. నేను కనిపించని సమయం ఏమిటని ఆరా తీస్తే.. అది సరిగ్గా ఇంట్లో సోఫాలోంచి నేను నిద్ర లేచిన సమయం అని తేలింది. అసలు ఇది ఎలా సాధ్యం? నేను ఇంట్లో నిద్రపోవడం నిజమా? లేక స్కూల్‌కి వెళ్లడం నిజమా? క్లాస్మేట్స్ మాత్రమే కాకుండా టీచర్స్ కూడా నన్ను చూశామని చెప్పడమే నాకు ఆశ్చర్యంగా తోచింది. ఈ అస్పష్టమైన సంఘటన గురించి ఎంత ఆరా తీసినా నాకు సమాధానం దొరకలేదు. పైగా ఆ వయసులో దీని గురించి నేను కూడా అంతగా ఆలోచించలేదు. ఇదే నా జీవితంలో మరచిపోలేని వింత అనుభవం’ అని రాసుంది ఆ మెయిల్లో. అసలు ఆ వ్యక్తి ఎవరు? అది ఏ స్కూల్? ఏ ఇయర్లో ఇలా జరిగింది? రాసిన వారు అమ్మాయా? అబ్బాయా? తనకు ప్రస్తుతం ఎంత వయసు? తను రాసింది నిజమా అబద్ధమా? ఒక మనిషి నిద్రపోతుంటే.. ఆ మనిషి ఆత్మ లక్ష్యాలను ఛేదించడానికి ఎంతదూరమైనా ప్రయాణిస్తుందా? ఏదైనా చేయగలుగుతుందా? కోరిక బలాన్ని బట్టి ఇలా జరిగే అవకాశం ఉందా? అసలు ఇది ఎలా సాధ్యం? లాంటి వేటికీ సమాధానాల్లేవు. దాంతో ఈ కథనం మిస్టరీగానే మిగిలిపోయింది. అయితే ఈ స్టోరీ మాత్రం రకరకాల పూకార్లను మోసుకుంటూ.. వైరల్ అవుతోంది. సంహిత నిమ్మన (చదవండి: నడిచే చెట్లను ఎప్పుడైనా చూశారా? చూస్తే షాకవ్వాల్సిందే!) -
ఆ ఊరిలో నాలుగొందలకుపైగా ఇళ్లు ఉన్నాయ్! కానీ సడెన్‌గా..
కొన్ని చూడటానికి చాలా విచిత్రంగా ఉంటాయి. ఎంతలా అంటే అప్పటిదాక మాములుగా ఉన్నది కూడా సడెన్‌గా వింతగా మారిపోతుంది. ఏంటన్నది కూడా తెలియదు. అచ్చం అలాంటిదే ఈ ఊరిలో జరిగింది. చుట్టూ జనసంచారం ఉన్నా అక్కడ జనం ఎవరూ ఎందుకు ఉండరో తెలియదు. పైగా అక్కడ వందలకు పైగా ఇళ్లు అన్ని వనరులు ఉండి ఉండకపోవడం ఏంటీ? అనిపిస్తోంది కదా. ఈ గమ్మతైన ఘటన ఎక్కడ జరిగిందంటే.. ఆ ఊళ్లో నాలుగువందలకు పైగానే ఇళ్లు ఉన్నాయి. అయినా ఆ ఊళ్లో ఇప్పుడు ఉంటున్నది నలుగురు మనుషులు మాత్రమే! స్కాట్లండ్‌లో గ్లాస్గో నగరానికి చేరువలో ఉన్న ఈ ఊరి పేరు క్లూన్ పార్క్. నిజానికి ఇది ఒక టౌన్షిప్. రేవులో పనిచేసే కార్మికుల వసతి కోసం దీనిని 1918–20 కాలంలో నిర్మించారు. ప్రస్తుతం నిర్మానుష్యంగా మారిన ఈ ఊరు ‘స్కాట్లండ్ చెర్నోబిల్’గా పేరుమోసింది. అలాగని ఇక్కడేమీ అణు ప్రమాదమేదీ జరగలేదు. అప్పట్లో రేవు కార్మికుల కోసం ఇక్కడ 430 ఫ్లాట్లతో 45 అంతస్తుల భవన సముదాయాన్ని నిర్మించారు. వారి సౌకర్యం కోసం ఒక బడి, చర్చ్, షాపింగ్ కాంప్లెక్స్ వంటివి కూడా నిర్మించారు. స్టీవ్ రోనిన్, కైల్ ఉర్బెక్స్ అనే వ్లాగర్లు రెండేళ్ల కిందట ఈ విచిత్రమైన ఊరి గురించి వెలుగులోకి తెచ్చారు. ఈ ఫ్లాట్లలోంచి బయటకు చూస్తే మాత్రం సమీపంలోని రోడ్లపై వాహనాల సంచారం మామూలుగానే కనిపిస్తుంది. ఈ టౌన్షిప్ ప్రాంతంలోనే జనసంచారం కనిపించదు. ‘ప్రస్తుతం ఈ ఫ్లాట్లలో నలుగురం మాత్రమే మిగిలున్నాం. నేనైతే ఇక్కడి నుంచి వెళ్లాలనుకోవడం లేదు. ఇటీవలే ఒకరు తన ఫ్లాట్‌ను 7000 పౌండ్లకు (రూ. 7.39 లక్షలు) అమ్ముకుని వెళ్లిపోయారు’ అని ఇక్కడ చాలాకాలంగా ఉంటున్న మార్షల్ క్రేగ్ తెలిపాడు. చాలాకాలంగా ఈ ఫ్లాట్లు ఖాళీగా పడి ఉండటంతో భూతగృహాల్లా తయారయ్యాయి. కొందరు దుండగులు ఈ టౌన్‌షిప్‌లోని బడి, చర్చ్ వంటి ఉమ్మడి కట్టడాలకు నిప్పుపెట్టారు. క్లూన్పార్క్ టౌన్‌షిప్‌లోని పాతబడిన కట్టడాలను పూర్తిగా పడగొట్టి, ఇక్కడ కొత్త భవంతులను నిర్మించడానికి గ్లాస్గోకు చెందిన ఇన్వర్సైకిల్ కౌన్సిల్ 2011లో ప్రతిపాదనలను సిద్ధం చేసినా, ఇప్పటికీ ఆ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు. (చదవండి: బొటానికల్ వండర్! మానవ పెదవులు పోలిన మొక్క! ఎక్కడుందంటే..?) -
గంపెడు సంతానం దీర్ఘాయుష్షుకు గ్యారెంటీ కాదు!
ఎక్కువ సంతానం ఉంటే అంత దీర్ఘాయువు ఉంటుందని విశ్వసించేవారు మన పెద్దవాళ్లు. కానీ అది వాస్తవం కాదని శాస్త్రవేత్తలు జరిపిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. త్వరితగతిన పునరుత్పత్తిని ప్రోత్సహించే జన్యువులు మనిషి ఆయుర్దాయాన్ని తగ్గిస్తాయని చెబుతున్నారు. ఈ పరిశోధన మనిషి వృధాప్య రహస్యాన్ని అర్థం చేసుకునే మార్గాన్ని సుగమం చేసిందన్నారు. ఇక్కడ పునరుత్పత్తిని ప్రోత్సహించే జన్యువులు మనిషి జీవితకాలంపై ఎలా బలంగా ప్రభావం చూపిస్తున్నాయో అనేదాని గురించి చాలా ఆసక్తికర విషయాలు వెల్లడించారు. పునురుత్పత్తి మనిషి జీవితకాలం తగ్గిపోవడానికి లింకప్ చేయబడి ఉంటుందన్న సరికొత్త విషయాన్ని కనుగొన్నారు శాస్త్రవేత్తలు. త్వరితగతిన పిల్లలను కనడాన్ని ప్రోత్సహించే జన్యువులు తక్కువ జీవిత కాలన్ని సూచిస్తాయని అన్నారు. ఈ మేరకు మిచిగాన్ విశ్వవిద్యాలయం నేతృత్వంలో శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనంలో తొందరగా తల్లిదండ్రులుగా మారిన వారి జీవితకాలం సుమారు 76 ఏళ్ల వరకే ఉంటున్నట్లు వారి సంభావ్యత జన్యువుల సంబంధం ఆధారంగా నిర్థారించారు. ఈ ఆవిష్కరణ వృధాప్య రహస్యన్ని చేధించే పరిశోధనను సులభతరం చేస్తోందన్నారు శాస్త్రవేత్తలు. అలాగే ఈ సృష్టి మానవుడికి ఇచ్చే జీవిత దశలు చాలా ఆశ్చర్యకరంగానూ, సంక్లిష్టంగానూ ఉంటాయన్నారు. ఈ అధ్యయనంలో దాదాపు 2 లక్షల మంది పైగా వ్యక్తులు పాల్గోన్నారు. వారందరి జన్యువులు, పునరుత్పత్తి, వారి జీవిత కాలాన్ని సేకరించి ఆ డేటా ఆధారంగా ఈ కొత్త విషయాన్ని కనుగొన్నామని అన్నారు. జీవశాస్త్రవేత్త జియాంజీ జాంగ్ మనషి జీవిత కాలన్ని జన్యుపరంగా పునురుత్పత్తి చాలా బలంగా పరస్పర సంబంధం కలిగి ఉందన్నారు. అంటే ఇక్కడ పునరుత్పత్తిని ప్రోత్సహించే జన్యు పరివర్తనలే జీవితకాలాన్ని తగ్గిస్తాయి. ఇది కాస్త హాస్యస్పదంగా అనిపిస్తున్నా కాస్త నిశితంగా గమనిస్తే గర్భ నిరోధకం, గర్భస్రావం, తదితరాల ఆరోగ్య సంరక్షణపై ప్రభావం చూపుతాయన్నది వాస్తవం. కాబట్టి పునరుత్పత్తి అనేది మనిషి ఆయుర్దాయంపై ప్రభావం చూపుతుందన్నది పరిశోధకులు వాదన. అదే సమయంలో ఇక్కడ జన్యు సంసిద్ధత తోపాటు కొంత పర్యావరణ కారకాలు కూడా మనిషి జీవితకాలం తగ్గిపోయేందుకు కారణమని చెబుతున్నారు. ఇక్కడ పునురుత్పత్తి, జీవితకాలం మద్య జరగుతున్న జన్యు ఉత్ఫరివర్తనాలకు సంబంధించిన సంక్లిష్ట చర్యను అర్థం చేసుకుంటే వృద్ధాప్య రహస్యాన్ని సులభంగా చేధించగలమని అన్నారు. ఈ అధ్యయనాలు వృధాప్యం(వయసు) అనేది సహజ ప్రక్రియ అని, అది పునరుత్పత్తి అనే అంశంపైనే బలంగా ఆధారపడి ఉందని చెబుతున్నాయన్నారు. ఎందుకంటే? మన ఫిట్నెస్ అనేది పునురుత్పత్తి ఆధారంగానే సెట్ చేసి ఉంటుంది. అందువల్ల పునరుత్పత్తి ప్రక్రియ పూర్తవ్వడం పైనే లైఫ్ స్పాన్ నిర్ణయించబడిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. (చదవండి: కలవరపెడుతున్న 'జాంబీ డీర్ వ్యాధి'! మనుషులకు కూడా వస్తుందా?) -
ప్రేతాత్మలను ప్రత్యక్షంగా చూడటానికి ఎగబడుతున్న జనాలు!
చిమ్మచీకటి వణికిస్తుంది. కానీ కొన్ని సార్లు.. ఆ చీకటిని చీల్చే వెలుతురు కూడా వణికిస్తుంది. అమాంతం ప్రత్యక్షమై.. అర్ధాంతరంగా మాయమై.. గజగజ వణికిస్తోన్న ఆ మిస్టరీ ఏంటీ? అది దక్షిణ అమెరికా, ఆర్కన్సా (Arkansas) రాష్ట్రంలో గుర్డాన్ సిటీ. చీకటిపడేవరకు ఆత్రంగా ఎదురుచూసిన.. ఓ నలుగురు చిన్నారులు నక్కి నక్కి.. పాత రైల్రోడ్ ట్రాక్ వైపు అడుగులు వేశారు. కాళ్లకు చెప్పులుంటే అలికిడి అవుతుందని ఒట్టికాళ్లతో మెల్లమెల్లగా నడుస్తూ.. ఓ బండకు ఆనుకుని ఒకరి తల మీంచి మరొకరు తల పెట్టి తొంగి తొంగి చూస్తున్నారు. చీకట్లో నల్లరాయిలా.. వాళ్లు ఎవరికీ కనిపించడం లేదు. వాళ్లకీ ఏమీ కనిపించడం లేదు.‘ఏది వచ్చిందా? ఎక్కడ నుంచి వస్తోంది? ఎలా వస్తోంది? వచ్చేసిందా?’ అనే గుసగుసలు.. వారి గుండె అలికిడి కంటే చిన్నగా వినిపిస్తున్నాయి. ‘అదిగో’ అన్న మాట ఆ నలుగురిలో ఎవరి నుంచి బయటికి వచ్చిందో తెలియదు కానీ.. కాస్త గట్టిగానే వచ్చింది. నిదానిస్తే అది వాళ్ల వైపే దూసుకొస్తోంది. అది, గుండ్రంగా, చిన్నబంతిలా మెరుస్తోంది. దగ్గరకు వచ్చేసరికి వాలీబాల్ అంత పెద్దదైపోయింది. కెవ్వుమనే కేకలతో వణుకుతూ నలుగురూ నాలుగు దిక్కులకు పరుగెత్తారు. ఆ అతీంద్రియశక్తికి ‘గుర్డాన్ లైట్’ అని పేరు పెట్టిన రిపోర్టర్స్.. ఈ మిస్టరీని ప్రపంచానికి పరిచయం చేశారు. అదో కాంతి. ఓ దీపం ప్రకాశించినట్లుగా.. మిలమిలా మెరిసిపోతుంది. అది తరుముతూ వెనుకే వస్తుంటే.. పరుగెత్తే వారికి చీకట్లో తోవ కనిపించడమే ఇక్కడ గమ్మత్తైన విషయం. సీన్ కట్ చేస్తే.. ఆ నలుగురు పిల్లలకు నాలుగు రోజులు నిద్ర లేవలేదు. అది ఆ నలుగురి అనుభవం మాత్రమే కాదు. చాలా ఏళ్లుగా గుర్డాన్ వాసుల్లో చిన్న పెద్ద అనే తేడా లేకుండా చాలామందికి కలిగిన వింత అనుభవం. ఈ హడలెత్తించే కథనాలను విన్న వారంతా దీని వెనుకున్న ఉదంతాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించినవారే. అయితే పోలీస్ రికార్డుల్లో నిక్షిప్తమైన ఆ వ్యథ.. విన్నవారిని ఇంకాస్త బెదరగొడుతుంది. 1931 డిసెంబరు 10న విలియమ్ మెక్‌క్లెయిన్ అనే వ్యక్తిని తన కింద పనిచేసే 38 ఏళ్ల లూయీ మెక్‌బ్రైడ్.. గుర్డాన్ రైల్రోడ్ ట్రాక్ సమీపంలో నరికి చంపేశాడు. అయితే మొదట అనుమానితుడిగా అరెస్ట్ అయిన లూయీ.. చివరికి స్వయంగా తన నేరాన్ని అంగీకరించాడు. దాంతో కోర్టు ఉరిశిక్ష విధించింది. అక్కడితో లూయీ కథ కూడా ముగిసింది. అయితే మెక్‌క్లెయిన్ హత్య జరిగిన చోట దాదాపు పావు మైలు పొడవున రక్తపు అడుగుజాడలు ఉన్నాయని.. లూయీ దాడి నుంచి తప్పించుకోవడానికి మెక్‌క్లెయిన్ చాలా ప్రయత్నించాడని.. చేతిలో లాంతరు పట్టుకుని.. ప్రాణాలు నిలుపుకోవడానికి పరుగులు తీశాడని.. పోలీస్ క్రైమ్ రికార్డ్‌లో ఉంది. తల తెగిన కారణంగానే మరణం సంభవించిందని పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్ తేల్చింది. అయితే మెక్‌క్లెయిన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు.. అతడి పిడికిలి పట్టులో లాంతరు ఉండటమే కీలకంగా మారింది. నాటి నుంచి ఆ సమీపంలో గుర్డాన్ ఘోస్ట్లీ లైట్.. స్థానికులను పరుగులెత్తిస్తోందనేది చాలామంది నమ్మకం. తెగిపడిన తన తలను వెతుక్కోవడానికే మెక్‌క్లెయిన్ ఆత్మ లాంతరు పట్టుకుని.. ఆ పరిసరాల్లోనే తిరుగుతోందనే ప్రచారం మొదలైంది. ఈ దయ్యం కాంతి.. భూమి నుంచి 3 అడుగుల ఎత్తులో ఉరకలేస్తుందని.. ముందుకు వెనక్కు కదులుతుందని, కొన్ని సార్లు పసుపు, నారింజ, నీలం, ఎరుపు రంగుల్లో కనిపిస్తోందని సాక్షులు చెప్పారు. అయితే ఇది ఏంటి అనేది మాత్రం ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు. గుర్డాన్ నివాసి మార్తా రామీ అనే ప్రత్యక్ష సాక్షి.. ‘నేను కూడా చిన్నప్పుడు ఆ దీపాన్ని చూడటానికి రాత్రి పూట స్నేహితులతో వెళ్లాను. అది నన్ను తరమడం నాకు ఇప్పటికీ గుర్తుంది’ అని చెప్పుకొచ్చింది.ఈ లైట్ దయ్యం కాదని.. పీజో ఎలక్ట్రిక్ ప్రభావం అంటూ కొందరు వాదన లేవదీశారు. స్ఫటికాలు, సిరామిక్స్ వంటి కొన్ని పదార్థాలకు తేమగాలులు సోకినప్పుడు ఒత్తిడికి గురై.. విద్యుదుత్పత్తి జరుగుతుందని.. ఆ వెలుతురుని చూసి చాలామంది భయపడుతున్నారని వారు తేల్చేశారు.బాబ్ థాంప్సన్ అనే క్లార్క్ కౌంటీ హిస్టారికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్.. దీనిపై ఎన్నో పరిశోధనలు చేశాడు. ‘మేము ఒక రకమైన ఎర్రటి, బంగారు కాంతిని చాలాసార్లు చూశాం. అది చూడటానికి ఎవరో ఒక బేస్‌బాల్ క్యాప్‌తో ఫ్లాష్‌లైట్‌ని కలిగి ఉన్నట్లు అనిపిస్తుంది. కాసేపటికి అదృశ్యమైపోతుంది. కొన్నిసార్లు ఆ బాల్ లాంటి కాంతి.. స్వింగ్ అవుతున్నట్లుగా వలయాల్లా కనిపిస్తుంది. ఎంతటి ధైర్యవంతులైనా అది చూసి భయపడతారు’ అని చెప్పుకొచ్చారు. అయితే ప్రేతాత్మలను ప్రత్యక్షంగా చూడాలనుకునేవారు మాత్రం ఇక్కడకు ఎగబడుతూ ఉంటారు.ఇప్పటికీ చాలామంది ఆ వెలుగును చూసి జడుసుకుంటూంటారు. ఏదేమైనా ఈ కాంతికి అసలు కారణం తేలియకపోవడంతో ఈ ఘోస్ట్ లైట్ మిస్టరీగానే మిగిలిపోయింది. -సంహిత నిమ్మన -
ప్రపంచంలో ఇప్పటివరకు వర్షం కురవని ఊరు!ఎక్కడ ఉందంటే..
ఈ భూమ్మీద ఒక్కో చోట ఒక్కో వాతావరణం కనిపిస్తుంది. కొన్ని చోట్ల ఎండలు మండిపోతే, మరికొన్ని చోట్ల నెలల తరబడి వర్షం కురుస్తుంది. ఇంకొన్ని చోట్ల అయితే విపరీతంగా చలి కమ్మేస్తుంది. ఇలా ఒక్కో ప్రాంతంలో వాతవరణ పరిస్థితి ఒక్కోలా ఉంటుంది. కానీ అసలు వర్షమే కురవని గ్రామం ఈ భూమ్మీద ఉంటుందని మీకు తెలుసా? మరి ఆ గ్రామం ఎక్కడ ఉంది? అన్నది తెలియాలంటే ఈ స్టోరీ చదివేయండి. వర్షం మానవాళి మనుగడకు ఎంతో ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏది ఎక్కువైనా, ఏది తక్కువైనా కష్టమే. కానీ ఈ ఊర్లో మాత్రం ఇప్పటివరకు అసలు వర్షం ఊసే లేదు. ప్రపంచంలో వర్షం పడని ప్రాంతం ఇదే. ఆ గ్రామం పేరు ‘అల్-హుతైబ్’. ఇది యెమెన్ రాజధాని సనాకు పశ్చిమాన ఉంది. భూ ఉపరితలానికి 3,200 మీటర్ల ఎత్తులో ఎర్రటి రాతి కొండపై ఉంది. ఈ గ్రామం ఉంది. ఇక్కడ ఉదయం సూర్యుడు ఉదయించగానే వాతావరణం వేడుక్కిపోతుంది. సాయంత్రం కాగానే విపరీతమైన చలి కమ్మేస్తుంది. ఈ ఊర్లో అసలు ఎప్పుడూ వర్షం పడకపోవడానికి కారణం.. గ్రామం మేఘాలు పేరుకుపోని ఎత్తులో ఉండడమే. సాధారణంగా ఘాలు భూమి నుంచి రెండు కిలోమీటర్ల ఎత్తులో ఉంటాయి. ఈ ఊరు ఏకంగా భూమికి మూడు కిలో మీటర్ల ఎత్తులో ఉంటుంది. మేఘాల కన్నా ఎత్తులో ఈ గ్రామం ఉంది కాబట్టే ఇక్కడ ఎప్పుడూ వర్షం కురవదు.అందుకే ప్రపంచంలోనే ‘డ్రై సిటీ’గా దీనికి పేరుంది. ఇక్కడ అల్ బోహ్రా ( అల్ ముఖర్మ ) తెగలకు చెందిన ప్రజలు ఎక్కువగా ఉంటారు. వీరిని యెమెన్ కమ్యూనిటీస్‌గా పిలుస్తారు. మరి వర్షం లేకుండా అక్కడి ప్రజలు ఎలా బతుకున్నారు అని సందేహమా? ఇక్కడి నీటి సమస్యలు తీర్చడానికి మొబైల్ ట్యాంకర్లతో ప్రతిరోజూ నీటిని సరఫరా చేస్తారట. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. ఈ ప్రాంతానికి ఎక్కువగా టూరిస్టులు వస్తుంటారు. మేఘాల కంటే ఎత్తులో ఉండటంతో ఈ వింతైన గ్రామం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. కొండ కింది భాగంలో చిన్న చిన్న జలపాతాలు కూడా ఎంతో ఆకట్టుకుంటాయి. చేతికి తాకే దూరంలో మేఘాలు, ఇక్కడి ప్రజల లైఫ్‌స్టైల్ టూరిస్టులను ఆకట్టుకుంటున్నారు. అంతేకాకుండా అల్ హుతైబ్ కొండపై ‘క్వాట్’ అనే ఆకర్షణీయమైన మొక్కలను ఎక్కువగా పండిస్తారు. Hutaib village in Haraz. Some of the best #Yemen coffee made here. Sipping on hot cup to the sound of birds and literally being above the clouds..priceless. So much to lose, and next to nothing to gain by current ugly war. Need cooler heads and compromise for any chance of peace. pic.twitter.com/264McKUgaF — Hisham Al-Omeisy هشام العميسي (@omeisy) September 18, 2019