అది 1986 ఏప్రిల్ 29.. ఉదయం పది నలభై దాటింది. అమెరికా, ఓక్లహోమాలోని లాటన్ హైవే పక్కన పాడుబడిన వంతెనపైన మంటలు ఎగసిపడుతున్నాయి. కాస్త దూరం నుంచి వాటిని గమనించిన ఓ రైతు.. వెంటనే ఫైరింజిన్‌కి, పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సరిగ్గా 20 నిమిషాల్లో ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు మంటలు ఆర్పి.. పరిశీలనగా చూసేసరికి.. కారు డ్రైవింగ్ సీట్‌లో ఓ అస్థిపంజరం కలవరపరచింది.
కారు అదుపు తప్పి.. క్రాష్ అయ్యిందని భావించిన అధికారులు.. కారు ఎవరిది? కారులో ఉన్నది ఎవరు? లాంటి ప్రశ్నలతో, క్లూ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. కాసేపటికి ఆ కారు పాత్ కాన్వే అనే 33 ఏళ్ల వివాహితుడిదని గుర్తించారు. దాంతో చనిపోయింది అతడి భార్య ఐలీన్ కాన్వే అని తేలడానికి ఎంతో సమయం పట్టలేదు. ఆ హైవే.. వాళ్ల ఇంటికి కేవలం పదిహేను మైళ్ల దూరంలో ఉంది. తాను మంటల్ని గుర్తించే సమయానికి ఏ అరుపులు వినిపించలేదని రైతు చెప్పడంతో అధికారులు.. అప్పటికే ఐలీన్ ప్రాణం పోయి ఉంటుందని భావించారు. కేవలం ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా కేసు నమోదు చేసుకున్నారు. యాక్సిడెంట్ జరిగే సమయానికి కారు స్పీడ్ 50 నుంచి 60 లోపే ఉందని అధికారులు అంచనా వేశారు.
ఆ మాత్రం వేగానికి అంత పెద్ద ప్రమాదం ఎలా జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. అయితే ప్రమాదం జరిగిన కొన్ని గంటలకు పాత్.. ఇంటికి వెళ్లి, అక్కడ పరిస్థితి చూసి మరింత ఆశ్చర్యపోయాడు. ఆ రోజు ఇంట్లో.. ఐలీన్ మాత్రమే ఒంటరిగా ఉందని తనకు బాగా తెలుసు. కానీ అక్కడ కొన్ని ఆనవాళ్లు అతడ్ని గజగజ వణికించాయి. ఇంటి ముందు గార్డెన్‌లో వాటర్ పైప్ చాలా సేపటి నుంచి పొంగడంతో ఆ నీళ్లు స్మిమ్మింగ్ పూల్లోకి పోవడం గమనించాడు. వెంటనే దాన్ని ఆఫ్ చేసి ఇంట్లోకి నడవబోయాడు. అయితే ఇంటి తలుపులు తెరిచే ఉండటంతో.. అతడిలో అనుమానం మొదలైంది. దానికి తోడు హాల్లో ఐరన్ బాక్స్ కాలిపోయి ఉంది. బట్టలు ఇస్త్రీ చేయడానికి స్విచ్ ఆన్ చేసి ఎన్నో గంటలైందని అక్కడ పరిస్థితి చూస్తే ఇట్టే అర్థమైపోతుంది.
పాత్ అడుగులు.. ఆందోళనగా ముందుకు కదిలాయి. మాస్టర్ బాత్‌రూమ్‌లో బాత్ టబ్ పక్కనే ఉన్న టెలీఫోన్ రిసీవర్ పక్కకు తీసి, దాని హుక్ లాగినట్లుగా కనిపించింది. వెంటనే పాత్ కంగారు కంగారుగా ఇల్లంతా వెతికాడు. ఓ చోట భార్య డ్రైవింగ్ లైసెన్స్, కళ్లజోడు ఉన్న హ్యాండ్‌బ్యాగ్ కనిపించింది. హ్యాండ్‌బ్యాగ్ కూడా వదిలిపెట్టి.. కారులో ఎక్కడికి బయలుదేరింది? ఆమెకు డ్రైవింగ్ అనుభవం ఉన్నాకూడా ఎందుకు యాక్సిడెంట్ అయ్యింది? పాత్ దగ్గర అన్నీ ప్రశ్నలే మిగిలాయి. వెంటనే పోలీస్ స్టేషన్‌కి వెళ్లి.. తన భార్య మరణమై అనుమానాలు ఉన్నాయని.. కంప్లైంట్ ఇచ్చాడు. యాక్సిడెంట్ అయిన చోటును పాత్ కానీ, ఐలీన్ కానీ అంతకుముందు ఎప్పుడూ చూసింది లేదు. వెంటనే జిల్లా న్యాయవాది కార్యాలయంలోని రే ఆండర్సన్‌ని సంప్రదించాడు.
మొదట ఆండర్సన్.. పాత్ వాదనను నమ్మలేదు. తన భార్య మరణాన్ని జీర్ణించుకోలేక లేనిపోని అనుమానాలు పెట్టుకుంటున్నాడని భావించాడు. అయినా పాత్.. తన ప్రయత్నాలు ఆపలేదు. యాక్సిడెంట్ జరిగిన చోటే క్లూ కోసం వెతకడం మొదలుపెట్టాడు. కారు కాలిపోయిన చోటికి 200 అడుగుల దూరంలోని చర్చి బులెటిన్ కనిపించింది. అది ఐలీన్ హాజరైన చర్చ్‌కి సంబంధించిందే. పాత్.. దాన్ని చివరిగా కారు డాష్‌బోర్డ్‌లో చూశాడు. ఐలీన్‌కి ఎప్పుడూ కారు విండోస్ క్లోజ్ చేసి.. ఎయిర్ కండిషనింగ్ ఆన్‌తో డ్రైవింగ్ చేయడం అలవాటు.
అలాంటప్పుడు చర్చి బులెటిన్ కదులుతున్న కారు నుంచి బయటకు రావడం అసాధ్యం. అంటే ఆ కారులో ఐలీన్‌తో పాటు కిల్లర్ ఉన్నాడని పాత్ ఊహించాడు. ప్రాణాలతో లేని / సృహలో లేని ఐలీన్‌ని కారు డ్రైవింగ్ సీట్‌లో కూర్చోబెట్టి.. యాక్సిలేటర్‌ని పెంచేసి, కారు ముందుకు పోయేలాచేసి ఉంటారని పాత్ బలంగా నమ్మాడు. యాక్సిడెంట్ అయిన తర్వాతే కారుకు నిప్పు పెట్టి ఉంటారని భావించాడు. తన అనుమానాలను అధికారులకు బలంగా వినిపించి.. కేసు హిస్టరీలో ప్రమాదవశాత్తు అనే పదానికి బదులు అనుమానాస్పద మృతి అని మార్పించాడు. ఏది ఏమైనా ఆమె మరణానికి అసలు కారణం మాత్రం తేలలేదు.
ఊహాగానాలు..
ఐలీన్ మరణానికి వారం క్రితం ఆ పరిసరప్రాంతాల్లో దొంగలు పెట్రేగిపోయారు. ఎవరూ లేని ఇళ్లపై దోపిడీలు చేసిన కేసులు చాలానే నమోదయ్యాయి. ఐలీన్ ఇంట్లో ఉందనే విషయం తెలియక.. ఆ దొంగల ముఠా ఆ ఇంటిపై దాడిచేసి ఉంటారని.. ఐలీన్ వాళ్లను చూడడంతో ఆమెను చంపేసి యాక్సిడెంట్‌లా క్రియేట్ చేసి ఉంటారని పాత్‌తో పాటు చాలామందే నమ్మారు. అయితే ఐలీన్ హెల్త్ హిస్టరీ తెలిసిన కొందరు.. ఆమెకు ఆ సమయంలో తీవ్రమైన తలనొప్పి వచ్చి ఉంటుందని.. ఆ మెడికల్ ఎమర్జెన్సీతో ఇంటి పనులన్నీ మధ్యలోనే వదిలిపెట్టి ఆసుపత్రికి తనంతట తానే కారులో బయలుదేరి ఉంటుందని.. దారిలో అనుకోకుండా ప్రమాదం జరిగి ఉంటుందని భావించారు.
అయితే న్యాయపోరాటం చేస్తున్న పాత్ దురదృష్టవశాత్తు 2013లో.. నిజం తెలుసుకోకుండానే మరణించాడు. అనంతరం అతడి కుమారుడు ఫ్రైడ్ కూడా ఆ పోరాటాన్ని కొనసాగించాడు. 2018లో అతడు కూడా కన్నుమూయడంతో ఈ కేసు కోల్డ్ కేసుల సరసన చేరి.. అపరిషృతంగానే మిగిలిపోయింది. నిజానికి ఆ రోజు ఆ ఇంట్లో ఏం జరిగింది? ఐలీన్ ఎలా చనిపోయింది? అనే ప్రశ్నలకు నేటికీ సమాధానాలు లేవు.
∙సంహిత నిమ్మన
Comments
Please login to add a commentAdd a comment