‘అమీ చెప్పు.. నా తిమొతీ ఎక్కడున్నాడు.. చెప్పు ప్లీజ్..’ భార్య అమీ పిట్జన్ భుజాలను కదుపుతూ నిలదీస్తున్నాడు జేమ్స్ పిట్జన్ . అమీ మౌనంగానే ఉంది. ఆమె నోరు విప్పకపోవడంతో అతడికి ఇంకా దుఃఖం ముంచుకొచ్చింది. ‘దయచేసి నిజం చెప్పు.. నా కొడుకును నేను చూడాలి.. చెప్పు ప్లీజ్..!’ అని అరుస్తూ తన కలవరింతలకు తనే ఉలికిపడి లేచాడు. సుమారు పన్నెండేళ్లుగా అదే కల అతడ్ని వెంటాడుతూ ఉంది. ఎందుకంటే నిజంగా నిలదీయడానికి అతడి భార్య అమీ పిట్జన్ ప్రాణాలతో లేదు.
2011 మే 11 ఉదయాన్నే.. అమెరికాలోని అరారోలో ‘గ్రీన్ మన్ ఎలిమెంటరీ స్కూల్’లో తన ఆరేళ్ల కొడుకు తిమొతీని డ్రాప్ చేసి.. అటు నుంచి అటే ఆఫీస్‌కి వెళ్లిపోయాడు జేమ్స్. తన కొడుకుని కళ్లారా చూసుకోవడం అదే చివరిసారని అప్పుడు అతడికి తెలియదు. యథావిధిగా ఆ రోజు సాయంత్రం బాబును ఇంటికి తీసుకెళ్లడానికి స్కూల్‌కి వచ్చినప్పుడు.. తిమొతీ ఎప్పుడో వెళ్లిపోయాడనే సమాధానం అతణ్ణి చాలా కంగారుపెట్టింది. అయితే తీసుకుని వెళ్లింది తన భార్యేనని తెలిసి కాస్త రిలాక్స్ అయ్యాడు. ఆ తర్వాత నుంచి అమీకి చాలాసార్లు ఫోన్ ట్రై చేశాడు. కలవలేదు. పైగా స్కూల్ టీచర్‌కి అమీ.. బాబుని తీసుకుని వెళ్లేటప్పుడు ‘ఫ్యామిలీ ఎమర్జెన్సీ’ అని ఎందుకు అబద్ధం చెప్పింది? అదే ప్రశ్న జేమ్స్‌ని కుదురుగా ఉండనివ్వలేదు. అమీ తీరుపై అవగాహన ఉన్న జేమ్స్ వెంటనే పోలీసుల్ని ఆశ్రయించాడు.
విచారణ మొదలైంది. మూడు రోజులు గడచినా.. ఎలాంటి సమాచారం రాలేదు. సరిగ్గా మూడోరోజు (మే 13) మధ్యాహ్నం 2 అయ్యేసరికి.. అమీ తన తల్లికి, చెల్లికి, బావమరిదికి కాల్ చేసి.. ‘మేము క్షేమంగానే ఉన్నాం, కంగారు పడొద్దు’ అని చెప్పింది. ఆ సమయంలో చెల్లెలు కారా.. ఫోన్‌లో అమీ మాటతో పాటు తిమొతీ మాట కూడా విన్నది. కొడుకు క్షేమమేనని తెలియడంతో జేమ్స్ ఊపిరి పీల్చుకున్నాడు. వెంటనే పోలీసులు.. అమీ ఫోన్ సిగ్నల్స్ ట్రేస్ చేసి.. అరారోకి 14 మైళ్ల దూరంలో ఉన్న ఇల్లినాయీ ప్రాంతాన్ని నిఘాలోకి తీసుకున్నారు. అక్కడున్న ప్రధాన సీసీ ఫుటేజ్‌లను ఒక్కొక్కటిగా పరిశీలించడం మొదలుపెట్టారు. కానీ ఈ లోపే జరగరాని అనర్థం జరిగిపోయింది. ఇల్లినాయీ లోని రాక్‌ఫోర్డ్‌లోని రాక్‌ఫోర్డ్ ఇన్ హోటల్‌లో మే 14న మధ్యాహ్నం 12 దాటేసరికి అమీ శవమై కనిపించింది. మణికట్టు, మెడ కోసుకుని ఆత్మహత్య చేసుకుంది.
తను రాసిన సూసైడ్ నోట్‌లో.. ‘అంతా నన్ను క్షమించండి.. తిమొతీ ప్రాణాలతో ఉన్నాడు.. తనను కంటికిరెప్పలా చూసుకునే వారి దగ్గర సురక్షితంగా ఉన్నాడు. తన కోసం వెతకొద్దు.. వెతికినా మీకు ఎప్పటికీ దొరకడు’ అని రాసి పెట్టింది. జేమ్స్ గుండెలవిసేలా ఏడ్చాడు. పంచప్రాణాలైన కొడుకు ఏమయ్యాడో తెలియదు. నిజం తెలిసిన భార్య ప్రాణాలతో లేదు. ఆరేళ్ల బాబును ఎక్కడని వెతికాలి? ఎవరినని అడగాలి? తెలియక గుండెలు బాదుకున్నాడు. పోలీసులు తక్షణమే తిమొతీ కోసం వెతకడం మొదలుపెట్టారు. మే 11 నుంచి మే 14 లోపు అమీ కదలికలు స్పష్టంగా ఉన్న సీసీ ఫుటేజ్‌లు సేకరించారు. మే 11న ఉదయం 8 తర్వాత అమీ.. స్కూల్ నుంచి తిమొతీని తీసుకుని బయలుదేరింది. పది అయ్యేసరికి తన కారుని ఒక మెకానిక్ షాప్‌లో రిపేర్‌కి ఇచ్చి.. సమీపంలోని బ్రూక్‌ఫీల్డ్ జూకి తీసుకువెళ్లింది.
మధ్యాహ్నం 3 అయ్యేసరికి తిరిగి వచ్చి కారు తీసుకుని.. తిమొతీతో పాటు గుర్నీలోని కీలైమ్ కోవ్ రిసార్ట్‌కి వెళ్లింది. అక్కడ నుంచి మరునాడు (మే 12న) విస్కాన్సిన్ డెల్స్, విస్కాన్సిన్ లోని కలహారీ రిసార్ట్‌కి వెళ్లారు. ఆ రోజంతా అక్కడే ఉండి.. ఆ మరునాడు (మే 13న) ఉదయం పది గంటలకు అక్కడి నుంచి చెకౌట్ చేశారు. ఆ తర్వాత తిమొతీ ఏ ఫుటేజ్‌లోనూ కనిపించలేదు. (అదే రోజు మధ్యాహ్నం అమీ తన చెల్లెలికి కాల్ చే సినప్పుడు తిమొతీ స్వరం విన్నానని చెప్పింది.) అయితే ఆ రోజు రాత్రి 11 అయ్యేసరికి రాక్‌ఫోర్డ్ ఇన్ హోటల్‌కి అమీ ఒంటరిగా వచ్చినట్లు కెమెరాలు తేల్చాయి. అంటే మే 13న ఉదయం పది నుంచి రాత్రి 11 లోపు ఏం జరిగింది? అమీ ఎవరిని కలిసింది? తిమొతీని ఏం చేసింది? ఎవరికి అప్పగించింది? అనేది మాత్రం మిస్టరీగా మారింది.
నిజానికి 2008 నుంచి అమీకి, జేమ్స్‌కి మధ్య చాలా పొరపొచ్చాలున్నాయి. ఆమె చనిపోయేనాటికి విడాకుల కేసు కోర్టులో నడుస్తోంది. మొదటి నుంచి మానసిక సమస్యలతో బాధపడుతున్న అమీ.. తిమొతీ సంరక్షణకు అనర్హురాలనేది జేమ్స్ తరపు లాయర్ వాదన. అందుకే తను చనిపోతూ.. తిమొతీని జేమ్స్‌కి దక్కకుండా చేసిందని కొందరి అభిప్రాయం. మరోవైపు అమీ కారులో తిమొతీ బ్లడ్ శాంపిల్స్ దొరకడంతో.. తిమొతీని చంపి ఎక్కడైనా పారేసి.. హోటల్‌కి వచ్చి తాను ఆత్మహత్య చేసుకుని ఉంటుందని అంచనా వేశారు అధికారులు. అయితే దాన్ని అమీ కుటుంబం ఖండించింది. కొడుకుని చంపేంత క్రూరత్వం అమీకి లేదని.. కారులో దొరికిన బ్లడ్ శాంపిల్స్ కేవలం అప్పుడెప్పుడో తిమోతికి దెబ్బ తగిలినప్పుడు కారిన రక్తమని వాదించారు. ఆ వాదనను జేమ్స్ ఇప్పటికీ నమ్ముతున్నాడు.
ఇక 2019లో బ్రియాన్ మైకేల్ అనే వ్యక్తి ‘నేనే తిమొతీ’నని సంచలనం రేపి యావత్ ప్రపంచాన్నే తనవైపు చూసేలా చేశాడు. అయితే డీఎన్‌ఏ పరీక్షల్లో కాదని తేలడంతో అతడికి రెండేళ్లు జైలు శిక్షపడింది. ఇప్పటికీ జేమ్స్.. తిమొతీ గురించి ఎదురు చూస్తూనే ఉన్నాడు. తనతో గడిపిన వీడియోలు, జ్ఞాపకాలుగా మిగిలిన ఫొటోలను చూసుకుంటూ జీవిస్తున్నాడు. ఏదేమైనా తిమొతీ ప్రాణాలతో ఉన్నాడో లేదో నేటికీ మిస్టరీనే. ప్రాణాలతో ఉంటే ఇప్పటికి ఆ బాబుకి 18 ఏళ్లు నిండి ఉంటాయి. తనవాళ్లని ఎప్పటికీ కలవనని.. ఆనాడే తల్లికి మాట ఇచ్చి అజ్ఞాతంలో మిగిలిపోయాడా? తండ్రి ఆశల్ని నిజం చేయడానికి ఏరోజుకైనా తిరిగి వస్తాడా? కాలమే సమాధానం చెప్పాలి.
ఇది నాలుగో పెళ్లి..
అమీ చిన్నప్పటి నుంచి ఎన్నో మానసిక ఒత్తిళ్లను ఎదుర్కొంది. జేమ్స్‌ని కలవక ముందు చనిపోవడానికి రైల్వే ట్రాక్ మధ్యలో కారు ఆపి.. చివరి నిమిషంలో నిర్ణయం మార్చుకుని తిరిగొచ్చింది. ఆ తర్వాత కూడా కౌన్సెలింగ్, ట్రీట్‌మెంట్ అంటూ మందులు వాడేది. తనకంటే ముందు ముగ్గురితో విడాకులు తీసుకుందన్న విషయం జేమ్స్‌కి తర్వాత తెలిసింది. ఇక జేమ్స్‌తో డేట్‌లో ఉన్నప్పుడు కూడా ఉద్యోగం రాలేదని డ్రిప్రెషన్‌తో ఆత్మహత్యాయత్నం చేసింది. తర్వాత నుంచి మానసిక వైద్యులు ఇచ్చిన టాబ్లెట్స్ వాడుతూ ఉండేది.
మొదట వాళ్లు డేట్‌లో ఉన్నప్పుడు అమీ ఉన్న మానసిక సమస్య తీరే వరకూ పిల్లలు వద్దు అనుకున్నారు. కానీ ఏడాది తర్వాత పిల్లల కోసం కలలు కనడం మొదలుపెట్టారు. 2004లో అమీ నాలుగో నెల కడుపుతో ఉన్నప్పుడు జేమ్స్ తనని పెళ్లి చేసుకున్నాడు. ఇక తిమొతీ చాలా చలాకీ పిల్లాడు. చాలా తెలివిగా ఆలోచించేవాడు. ఎప్పుడూ సరదగా నవ్వుతూ ఉండేవాడు. తండ్రితో అతడికి మంచి అనుబంధం ఉండేది.
ఎప్పుడైనా ఆడుకోవడానికి వెళ్లి కాస్త లేటుగా తిరిగి వస్తే.. ‘నన్ను మిస్ అయ్యావా డాడీ’ అని అడిగేవాడట! అమీ కూడా కొడుకుని ప్రాణంగా చూసుకునేది. అలాంటి తల్లి కొడుకు ప్రాణాలు తీస్తుందంటే నేను నమ్మలేను. నిజానికి జేమ్స్ విడాకులు అనేసరికి అమీ మానసిక పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చిందని నాకు అర్థమైంది. పైగా మందులు కూడా సరిగా వేసుకునేది కాదు. దానికి తోడు ఆర్థిక సమస్యలు కూడా ఎక్కువ అయ్యాయి.
కారా జాకబ్స్, అమీ సోదరి
-∙సంహిత నిమ్మన
Comments
Please login to add a commentAdd a comment