దెయ్యాల కథలు సృష్టించే ప్రకంపనాలకు సాక్ష్యాలు తక్కువ. నిజమా? అబద్ధమా? అనే సంశయం నుంచి పుట్టే ఆత్రానికి.. వాదోపవాదాలు ఎక్కువ. అందుకే ‘పుట్టుకకు ముందు.. చావు తర్వాత..’ అనే ఆత్మాన్వేషణ కథలెప్పుడూ మిస్టరీలుగానే మిగిలిపోతాయి. అలాంటిదే సరిగ్గా 34 ఏళ్ల క్రితం.. ఓ నాలుగేళ్ల అమ్మాయి జీవితంలో జరిగింది.
అది 1989. ఫిబ్రవరి మొదటి వారం. ఆండ్రూ వైరిక్, లీసా దంపతులు తమ నాలుగేళ్ల కూతురు హెడీతో కలసి.. కొత్తింట్లోకి అడుగుపెట్టారు. రావడం రావడమే హెడీ ఆడుకోవడానికి పరుగులు తీస్తే.. భార్యభర్తలు మాత్రం ఇల్లంతా సర్దుకునే పనిలో పడ్డారు. ఆ ఇల్లు అమెరికా, జార్జియాలోని ఎల్లెర్స్‌లీలో ఉంది. హెడీకి ఆ ఇల్లు బాగా నచ్చేసింది. అక్కడున్న ఓ పెద్దాయన కూడా. ఆ ఇంటికి రావడం రావడమే పెరట్లో ఉన్న ఆయనతో ఆటలాడటం మొదలుపెట్టింది. పనుల హడావిడి నుంచి తేరుకున్న హెడీ తల్లి లీసా.. ఆ పెద్దాయన సంగతులన్నీ హెడీ నోట విని షాక్ అయ్యింది. అతడి పేరు గోర్డీ అని హెడీ చెప్పింది. అసలు లీసా.. ఆ ఇంటి చుట్టు పక్కల హెడీ చెప్పిన పోలికలతో ఎవరినీ చూసింది లేదు.
‘హెడీని కిడ్నాప్ చేయడానికి ఎవరైనా నాటకం ఆడుతున్నారా?’ అనే అనుమానం లీసాని కుదురుగా ఉండనివ్వలేదు. వెంటనే భర్తకు విషయం చెప్పింది. హెడీని బయటికి పోనీకుండా జాగ్రత్త పడ్డారు. ఆ తర్వాత హెడీ ప్రవర్తనపై దృష్టిపెట్టిన లీసా.. ఆమె ఎవరితోనో మాట్లాడుతోందని.. ఆమె చేతిని ఎవరో పట్టుకుని నడుస్తున్నారని గుర్తించింది. పైగా అర్ధరాత్రులు ఊయల ఊగడం, నిద్రలో లేచి నడవడం ఇలా చాలానే చేసేది హెడీ. లీసాకి ఏం అర్థం కాలేదు. కానీ వెన్నులో కాస్త భయం మొదలైంది. హెడీకి స్నేహితులు లేకపోవడంతో అలా ఏదో ఊహించుకుని ఆడుకుంటోందని సరిపెట్టుకుంది. అయితే హెడీ.. గోర్డీతో పాటు లోన్ అనే మరో ముసలాయన పేరు చెప్పడం మొదలుపెట్టింది. లోన్ ఎడమ చేతికి రక్తంతో కట్టు ఉందని.. అతడి షర్ట్ నిండా రక్తం ఉందని చెప్పేది హెడీ.
వెంటనే లీసా.. తన భర్తతో కలసి.. ‘హెడీ చెబుతున్న పేర్లతో ఎవరైనా ఉన్నారా?’ అంటూ ఆ చుట్టూ వెతకడం మొదలుపెట్టింది. లోన్, గోర్డీ ఇద్దరు కాదేమో.. ఒకే వ్యక్తి అయ్యి ఉంటాడని వాళ్లు నమ్మారు. ‘లోన్ గోర్డీ అనే పేరు ఎప్పుడైనా విన్నారా?’ అంటూ అందరినీ ఆరా తీశారు. ఆ ప్రయత్నంలోనే లోన్ గోర్డీ గురించి పక్కింట్లో ఉండే తన సోదరితో చర్చించింది లీసా. అయితే.. లీసా చెప్పింది విని లీసా సోదరి షాక్ అయ్యింది. అతడి పూర్తి పేరు జేమ్స్ ఎస్. గోర్డీ అని.. అతడు తమ ఇంటి మాజీ యజమాని అని, అతడు చనిపోయి చాలా ఏళ్లు అయ్యిందని చెప్పింది ఆమె. సాక్ష్యం కోసం తన ఇంటి దస్తావేజులు కూడా చూపించింది. అది చూడగానే లీసాకి చెమటలు పట్టేశాయి. వెంటనే ఇద్దరూ.. గోర్డీ బంధువైన కేథరీన్ లెడ్‌ఫోర్డ్ అనే స్థానికురాలి దగ్గరకి పరుగుతీశారు.
జేమ్స్ గోర్డీ 1974లోనే మరణించాడని, అతడికి కొలంబస్‌లో రియల్ ఎస్టేట్ కంపెనీ ఉండేదని, చాలా సంవత్సరాలు అతను జార్జియాలో ఎల్లెర్స్‌లీలో ఉండే ఎల్లిసన్ మెథడిస్ట్ ^è ర్చ్‌లో సండే స్కూల్ సూపరింటెండెంట్‌గా పనిచేశాడని వివరాలిచ్చింది కేథరీన్. అచ్చం హెడీ చెప్పినట్లే.. గోర్డీ మెరిసిన జుట్టుతో.. సూట్, టై, నల్లటి బూట్లు వేసుకుని ఎప్పుడూ నీట్‌గా ఉండేవాడని నిర్ధారించింది. వెంటనే హెడీని కేథరీన్ ఇంటికి తీసుకుని వెళ్లిన లీసా.. తన పాపకి ఆ ఇంట్లోని పాత ఫొటోలన్నీ చూపించమని కోరింది. ఆశ్చర్యకరంగా ఆ ఫొటోల్లో లోన్ ఫొటోని గుర్తుపట్టింది హెడీ. ‘ఎడమ చేతికి కట్టుతో ఉన్న ముసలాయన ఇతడే’ అంటూ లోన్ ఫొటోని చూపించింది. అతడ్ని హెడీ గుర్తు పట్టగానే బిత్తరపోయింది కేథరీన్.
వరుసగా లీసా, ఆండ్రూ, హెడీ, జోర్డాన్, జోయిస్ (హెడీ మేనత్త)
‘ఇతడు మా అంకుల్ లోన్’ అంది షాక్‌లో. లోన్ 20 ఏళ్ల యువకుడిగా ఉన్నప్పుడు ఎక్కువగా ఇక్కడే గడిపేవాడని, అతడు 1957లో క్యాన్సర్‌తో చనిపోయాడని, అతడు ఓ ప్రమాదంలో తన ఎడమ చేతిని పోగొట్టుకున్నాడని చెప్పింది. దాంతో లీసాకి.. హెడీ మాట్లాడే గోర్డీ, లోన్‌లు కల్పితపాత్రలు కాదని.. వారు నిజంగా చనిపోయిన వ్యక్తులని స్పష్టమైంది. (హెడీ విషయంలో హెడీ మేనత్త జోయిస్ కూడా లీసాకు చాలా సాయం చేసింది).అలా గోర్డీ, లోన్‌లతో హెడీ సంభాషణ సుమారు నాలుగేళ్ల పాటు సాగింది. 1993లో హెడీ తల్లి గర్భవతి అయింది. అప్పుడొచ్చింది మరో ఆత్మ. అది చీకట్లో బొమ్మల రూపంలో కదలడం హెడీని తీవ్రంగా భయపెట్టింది. కొన్నిసార్లు ఆ ఆత్మ చేసిన హింసకు హెడీ చాలా ఏడ్చేది. అప్పుడప్పుడు హెడీ ముఖంపైన రక్తపు చార లు కనిపించేవి.
1994 ఫిబ్రవరి 3న హెడీకి జోర్డాన్ అనే చెల్లెలు పుట్టింది. 2 వారాల తర్వాత, హెడీ మరింతగా వణకసాగింది. అయితే ఆ ఆత్మ గురించి.. హెడీ తండ్రి ఆండ్రూ మొదట్లో నమ్మలేదు. కానీ కొన్ని రాత్రుల తర్వాత ఆండ్రూ కూడా ఆ ఆత్మ దాడికి గురయ్యాడు. ఆ సమయంలోనే హెడీ ఒంటి మీద గోళ్ల చారికలు తీవ్రమైన నొప్పిని కలిగించేవి. వెంటనే పారా సైకాలజిస్ట్ డాక్టర్ విలియం రోల్‌ని ఇంటికి పిలిపించింది లీసా. హెడీ చెప్పే మాటలు నిజమేనన్న నిర్ధారణకు వచ్చిన రోల్.. చనిపోయిన వారితో కమ్యూనికేట్ చేయడానికి హెడీ.. ఏదైనా రహస్యమైన శక్తిని కలిగి ఉందా? అంటూ హెడీపై ఎన్నో ప్రయోగాలు చేయడానికి ప్రయత్నించాడు.
కానీ ఏ విషయాన్నీ తేల్చలేకపోయాడు. కొన్నేళ్లకు హెడీ కుటుంబం ఆ ఇంటికి దూరంగా వెళ్లిపోయింది. ఆ తర్వాత గోర్డీ, లోన్ ఆత్మలు హెడీకి కనిపించడం మానేశాయి. కానీ ఇప్పటికీ హెడీని చీకటి బొమ్మలు, వికృత రూపాలు, జంతు ఆత్మలు భయపెడుతూనే ఉన్నాయట. హెడీకి సాధారణమైన జీవితం గడపాలనే ఆశే ఆమెని ప్రపంచానికి దూరంగా బతికేలా చేస్తోంది. కానీ హెడీకి ఆత్మలు, దుష్టశక్తులు కనిపించడం మాత్రం ఆగలేదు. దురదృష్టవశాత్తూ హెడీ తండ్రి ఆండ్రూ 45 ఏళ్ల వయసులో 2012లో మరణించాడు.
అసలు హెడీ చెప్పింది నిజమేనా? అబద్ధమైతే అంత చిన్ని పిల్ల గోర్డీ, లోన్‌ల ఆత్మల కథలను ఎలా ఊహించగలిగింది? చనిపోయిన వారితో మాట్లాడే శక్తి హెడీకి నిజంగానే ఉందా? ఇలా వేటికీ సమాధానాల్లేవు. పైగా ఆ కుటుంబం మీడియాకి దూరంగా ఉండేందుకు ప్రయత్నించడంతో సమగ్ర సమాచారమూ దొరకలేదు. ఈ కథ ఆధారంగా ఎన్నో నవలలు, డాక్యుమెంటరీలు, సినిమాలు పుట్టుకొచ్చాయి. అయితే హెడీ చెప్పింది నిజమే అనేవాళ్లు ఎంతమందో.. అబద్ధమని కొట్టిపారేసేవాళ్లూ అంతేమంది. అందుకే ఈ కథ ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది.
హెడీ మాటల్లో..
ఎప్పుడైతే దుష్ట ఆత్మలు కనిపించడం మొదలయ్యాయో అప్పటి నుంచి సమస్యలు మొదలయ్యాయి. ప్రతిరోజూ ఇలా జరగకూడదని నేను కోరుకుంటున్నాను, ఎందుకంటే నా జీవితం చాలా భిన్నంగా ఉంటుంది. నేను ఇలాంటి వాటితో పేరు పొందాలనుకోను.. ప్రజలు కొంతమంది విశ్వసిస్తారు, కానీ మరికొంత మంది మమ్మల్ని పిచ్చివాళ్లుగా భావిస్తారు. ఇప్పటికీ పరిస్థితిని అర్థం చేసుకోవడానికి.. ధైర్యంగా ఉండటానికి నేను ప్రయత్నిస్తూనే ఉంటాను.
∙సంహిత నిమ్మన
Comments
Please login to add a commentAdd a comment