ప్రపంచంలోని చూడచక్కని దీవుల్లో ఇదొకటి. ఈ దీవి చుట్టూ అందమైన పగడపు దిబ్బలు కనువిందు చేస్తాయి. దీవి తీరం దాటి లోపలకు వెళితే, పచ్చని చెట్లు, రకరకాల అరుదైన పక్షులు ఆహ్లాదం కలిగిస్తాయి. ఇక్కడ ఎలాంటి కట్టడాలూ కనిపించవు. పసిఫిక్ సముద్రంలో ఉన్న ఈ దీవి పేరు ‘పామీరా’ దీవి.
ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన దీవి. అయితే, ఇది ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో లేదు. ప్రస్తుతం ఇది అమెరికా అధీనంలో ఉంది. ఈ దీవి గురించి న్యాయపోరాటాలు కూడా జరిగాయి. చివరకు అమెరికా ప్రభుత్వం 2000 సంవత్సరంలో 27.26 మిలియన్ డాలర్లు (రూ.228.49 కోట్లు) చెల్లించి దీనిని సొంతం చేసుకుంది.
ఈ దీవి అమెరికా ప్రభుత్వం అధీనంలోకి వచ్చినా, ఇక్కడ మనుషులెవరూ ఉండరు. దీనికి గల చీకటి చరిత్రే అందుకు కారణం. ఈ దీవి అందానికి ముగ్ధులైన కొందరు ఔత్సాహికులు ఇదివరకు అప్పుడప్పుడూ వచ్చేవారు. వారిలో కొందరు అంతుచిక్కని కారణాలతో మరణించారు. మరికొందరు ఎలాంటి ఆచూకీ లేకుండా గల్లంతైపోయారు. అందువల్ల ఈ దీవి ఎంత అందంగా ఉన్నా, ఇక్కడి వాతావరణం ఎంత ఆహ్లాదభరితంగా ఉన్నా ఇక్కడ అడుగుపెట్టాలంటేనే జనాలు భయంతో వణికిపోతారు. అయితే, అప్పుడప్పుడు కొందరు శాస్త్రవేత్తలు బృందాలుగా ఇక్కడకు వచ్చి, పరిశోధనలు జరిపి వెళుతుంటారు. వారు కూడా ఇక్కడ రాత్రివేళల్లో బస చేయరు.
ఇది కిరీటం కాదు.. లైటర్!
చూడటానికి కిరీటం పైభాగంలా కనిపిస్తోంది గాని, నిజానికి ఇది సిగార్ లైటర్. ఇందులో విశేషమేంటనేగా మీ అనుమానం? ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సిగార్ లైటర్. మిగిలిన లైటర్ల మాదిరిగా ఇదేమీ తేలికపాటి లైటర్ కాదు. దీని బరువు దాదాపు అరకిలో ఉంటుంది. దీని తయారీకి 400 గ్రాముల మేలిమి బంగారం, 41 కేరట్ల బరువు గల 152 అరుదైన నీలాలను ఉపయోగించారు.
ఫ్రెంచ్ లగ్జరీ బ్రాండ్ ‘ఎస్.టి.డ్యూపాంట్’ ఈ సిగార్ లైటర్‌ను ‘లూయీ గీఐఐఐ ఫ్లర్ డి పార్మ్’ పేరుతో హాంకాంగ్ వ్యాపారవేత్త స్టీఫెన్ హంగ్ ఆర్డర్‌పై 2013లో ప్రత్యేకంగా తయారు చేసింది. దీని తయారీ కోసం ఎనబై మంది నిపుణులైన స్వర్ణకారులు ఆరునెలల పాటు అహర్నిశలు శ్రమించారు. దీని ధర 5 లక్షల డాలర్లు (సుమారు రూ.4.19 కోట్లు).
అయితే, షోకేసులో అలంకరించుకోవడానికే తప్ప తేలికగా వాడుకోవడానికి అనువుగా లేకపోవడం దీని లోపం. అందుకే, ఇదే కంపెనీ వాడుకోవడానికి అనువుగా ఉండే పరిమాణంలో ఇదే నమూనాలో నీలాలు పొదిగిన బంగారంతో తయారు చేసిన చిన్న లైటర్లను కూడా మార్కెట్‌లోకి విడుదల చేసింది. వీటి ఖరీదు ఒక్కొక్కటి 15,900 డాలర్లు (రూ.13.33 లక్షలు)
Comments
Please login to add a commentAdd a comment