
సముద్రంలో ఉన్న మృత్యుసరోవరం ఇది. సముద్రంలోకి దిగి చూస్తే, ఇది మామూలుగానే కనిపిస్తుంది గాని, ఇందులో ఈత కొట్టాలని సరదా పడితే మాత్రం, చావును కోరి కొనితెచ్చుకున్నట్లే! వంద అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ మడుగులోని అత్యంత లవణీయత కలిగిన నీరు, మీథేన్, హైడ్రోజన్ సల్ఫైడ్ వంటి ప్రాణాంతక విషవాయువులు దీనిని మృత్యుసరోవరంగా మార్చాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
దీనిని తొలిసారిగా 2015లో కనుగొన్నారు. ఇందులో ఈదులాడేందుకు దిగి మరణించిన జంతువుల కళేబరాలను శాస్త్రవేత్తలు పరిశోధనల కోసం సేకరించి, భద్రపరచారు. గల్ఫ్ ఆఫ్ మెక్సికో వద్ద సముద్రంలోకి దిగి పరిశోధనలు సాగిస్తున్న శాస్త్రవేత్తలకు సముద్రం లోపలి భాగంలో ఈ మడుగులాంటి ప్రదేశం కనిపించింది. దాదాపు వంద అడుగుల విస్తీర్ణంలో బురదనీటితో నిండిన ఈ మడుగులోకి వెళ్లే పీతలు, మొసళ్లు వంటి జీవులు నిమిషాల్లోనే ప్రాణాలు కోల్పోవడాన్ని వారు గమనించారు.
సాధారణంగా సముద్రపు నీటిలో ఉండే ఉప్పదనం కంటే, ఈ మృత్యుసరోవరం నీటి ఉప్పదనం నాలుగురెట్లు ఎక్కువని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అతి కొద్ది జలచరాలు మాత్రమే ఇందులోని పరిస్థితులను తట్టుకుని మరీ బతకగలవని, మిగిలినవి ఇందులోకి దిగితే నిమిషాల్లోనే మరణిస్తాయని చెబుతున్నారు. దీనిని ‘హాట్ టబ్ ఆఫ్ డిస్పెయిర్’ అని, ‘జకూజీ ఆఫ్ డిస్పెయిర్’ అని అభివర్ణిస్తున్నారు.
ఇవి చదవండి: గ్యాప్ ఇవ్వలా... వచ్చింది
Comments
Please login to add a commentAdd a comment