ఇది ఓ చిట్టి గుండెకు, స్వచ్ఛమైన నవ్వుకు జరిగిన అన్యాయం. కాలం సైతం మాన్చలేని గాయం. మూర్ఖత్వానికి, క్రూరత్వానికి.. నిర్దాక్షిణ్యంగా బలైన నిండు జీవితం. కుయుక్తులు, కుతంత్రాలు తెలిసిన ఈ ప్రపంచానికి ఎదురీదలేక.. నీరుగారిన పోరాటం.
1995 ఏప్రిల్ 23 రాత్రి, దగ్గరదగ్గరగా తొమ్మిది కావస్తోంది. ఫ్లోరిడా, న్యూ స్మిర్నా బీచ్ అంతా ఆటుపోట్లతో ఎగసిపడుతోంది. కారుచీకటిని చీల్చుకుంటూ ఓ బ్యాటరీ లైట్.. స్థిమితం లేకుండా అటూ ఇటూ కదలాడుతోంది. ‘మూర్.. మూర్.. మూర్’ అనే అరుపు.. హోరుహోరుమనే సముద్రగాలికి.. గమ్యం లేకుండా ఎదురీదుతోంది. ‘నాన్నా మూర్ .. బాగా చీకటి పడిందిరా ఎక్కడున్నావ్, వింటున్నావా’ అనే కేక.. క్రమక్రమంగా ఆ పరిసరాల్లో అల్లకల్లోలాన్నే సృష్టిస్తోంది. ఆ అలజడంతా ఓ కన్నపేగుది. ఏదో కీడు శంకిస్తున్న ఓ తల్లి మనసుది.
‘ఓరా లీ’ తన ఎనిమిదేళ్ల కొడుకు డిమీట్రీక్ మూర్‌ని.. మూడు నాలుగు గంటలు ఊరంతా వెతికీ వెతికీ.. చివరికి సముద్రతీరానికి చేరుకుంది. అక్కడ కూడా ఏ జాడ లేకపోయేసరికి.. పోలీస్ స్టేషన్ కి పరుగుతీసింది. ‘ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు.. ఆడుకుని వస్తానంటూ బయటికి వెళ్లిన నా కొడుకు మూర్ తిరిగి రాలేదు. ఏమయ్యాడో తెలియదు. నా బిడ్డను ఎలాగైనా వెతికిపెట్టండి సారు’ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మరునాడు ఉదయం నుంచి బాబును వెదకడం మొదలుపెట్టారు. స్థానికుల్లో కొందరు మూర్‌ని వెతకడంలో సాయం చేశారు.
ఆ రోజు సాయంత్రం 4 అయ్యేసరికి మూర్.. ఓరా కారు డిక్కీలోనే శవమై కనిపించాడు. ఒంటి మీద బట్టలు కూడా లేవు. మొదట బాబు.. తెలియక ఆ డిక్కీలోకి తనంతట తానే వెళ్లి ఇరుక్కుని చనిపోయాడేమో అనుకున్నారంతా. కానీ పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్‌లో.. హత్య అని తేలింది. బాడీపై వేలిముద్రలు లేకుండా కడిగినట్లు ఆనవాళ్లున్నాయి. ప్రాణం పోయి 18 నుంచి 24 గంటలు కావస్తోందని నిర్ధారించారు. తడిసిన బాబు బట్టలు కూడా ఆ పరిసరల్లోనే దొరికాయి. తెలివిగా.. వాటిని ఉతికి శుభ్రం చేసి పెట్టారని స్పష్టమైంది. శవం.. తల్లి కారులోనే దొరికింది కాబట్టి కేసు ఓరా మెడకే చుట్టుకుంది. ఆమెను పలుమార్లు.. గంటలు గంటలు విచారించారు పోలీసులు. అరెస్ట్ కూడా చేశారు.
‘ఆ రోజు 8 లోపే మూర్ ఇంటికి వచ్చేశాడు. అయితే రెండు గంటలకు వెళ్లిన మూర్ అన్ని గంటల తర్వాత.. బట్టల్నీ మురికి చేసుకుని వచ్చేసరికి ఓరా.. మూర్‌పై తీవ్రంగా కోప్పడింది. ఆ ఆవేశంలో బాబుని బాగా కొట్టింది. ఆ అరుపులు, ఏడుపులు మేము విన్నాం.. ఆ సమయంలోనే మూర్ చనిపోయి ఉంటాడు. అందుకే ఓరా.. తెలివిగా కేసుని పక్కదోవ పట్టించడానికి కారులో శవాన్ని దాచి.. ఊరంతా వెతికి ఉంటుంది’ అంటూ కొందరు సాక్షులుగా నిలిచారు. దాన్ని నమ్మిన పోలీసులు.. ఓరాను అరెస్ట్ చేశారు. అయితే ఓరా అలాంటిది కాదని మరికొందరు వాదనకు దిగారు.
కేసు కోర్టుదాకా పోయింది. వాద, ప్రతివాదాల మధ్య నలిగిన ఓరా.. 1996 జూన్ కల్లా నిర్దోషిగా విడుదలైంది. ఆ తర్వాత కొన్ని నెలల్లోనే కేసును క్లోస్ చేశారు పోలీసులు. అయినా సరే ఓరా ఆగలేదు. తన బిడ్డ మూర్ మరణానికి కారణమెవరో తేల్చాలంటూ న్యాయపోరాటం మొదలుపెట్టింది. ఆ పోరాట ఫలితంగా 1997 ఫిబ్రవరిలో కేసు రీ ఓపెన్ అయ్యింది. ఈసారి రూట్ మార్చారు అధికారులు. ఆ రోజు మూర్‌తోపాటు ఆడుకోవడానికి వెళ్లిన ఇరుగుపొరుగు పిల్లలను విచారించారు. అయితే అందులో కొందరు ఆ రోజు మూర్‌ను కలవనేలేదని, చూడనేలేదని చెప్పారు.
అప్పుడే మూర్ స్నేహితుడొకడు.. కీలక సాక్ష్యమయ్యాడు. ‘మూర్‌తో కలసి ఆడుకునే స్థానిక పిల్లలంతా అతని కంటే పెద్దవాళ్లే. దాంతో చాలామంది పిల్లలు మూర్‌ని చిన్నదానికీ పెద్దదానికీ బెదిరించేవారు. ఏదో ఒక కారణంతో ఏడిపించేవారు. గతంలో ఒకసారి ఒక పెద్ద కుర్రాడు మూర్‌ని నేలపై పడేసి.. బలవంతంగా మట్టి తినిపించడం నేను కళ్లారా చూశాను’ అని మూర్ స్నేహితుడు చెప్పాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. అప్పటికే విచారణలో ‘మూర్‌ని ఆరోజు చూడనేలేదు’ అని చెప్పినవారే.. అతని దృష్టిలో నిందితులు. దాంతో పరిశోధకులు.. మూర్‌ని తోటి స్నేహితులే అనవసరంగా గొడవపడి, ప్రమాదవశాత్తూ చంపేసి ఉంటారని.. కేసు మీదకు రాకుండా తమ తల్లిదండ్రుల సాయం తీసుకుని మూర్ శరీరాన్ని, దుస్తుల్ని శుభ్రం చేసి ఉంటారని అంచనాకొచ్చారు.
ఇంతలో ఓరాకు మరో సంగతి గుర్తొచ్చింది. అసలు కారులోకి శవం ఎలా వచ్చింది? అని ఆలోచిస్తే.. ఒక అనుమానాస్పద సన్నివేశం ఆమె కళ్లముందు కదలాడింది. ఓరా ఆ రోజు బాబుని వెతుకుతుంటే.. ఇద్దరు ఆడవాళ్లు వచ్చి.. ‘మూర్ రైలు పట్టాల దగ్గర ఎవరితోనో గొడవ పడుతున్నాడు’ అని చెప్పారు. తీరా ట్రాక్ దగ్గరకు.. ఓరా పరుగుతీస్తే అక్కడంతా ప్రశాంతంగానే కనిపించింది. అంటే.. తను రైలు పట్టాల దగ్గరకు వెళ్లినప్పుడే.. ఎవరో బాబు శవాన్ని లాక్ చేయని తన కారు డిక్కీలో పెట్టి ఉంటారని నమ్మింది ఓరా.
మరోవైపు మూర్ కనిపించకుండా పోయిన మరునాడు మధ్యాహ్నం, శవం దొరక్కముందు.. ‘స్టెఫానీ వాషింగ్టన్’ అనే పొరుగు నివాసి.. ఓరాకు ఓ అబద్ధం చెప్పాడట. ‘మూర్‌తో ఆడుకున్న అబ్బాయిల్లో ఒకరిని.. ఎవరో కొట్టి చంపి.. రైలు పట్టాల దగ్గర వేశార’ని ఆ వ్యక్తి చెప్పడంతో మూర్‌కు ఏమై ఉంటుందోనని మరింత భయపడిందట ఓరా. నిజానికి.. ఆ సమయంలో మూర్ మృతికి ముందు కానీ తర్వాత కానీ.. ఏ పిల్లలూ మిస్ అవ్వలేదు. మరి ఇరుగుపొరుగు ఎందుకలా అబద్ధం చెప్పారో తెలియదు. ఏది ఏమైనా మూర్ మృతికి.. అతడి తోటి స్నేహితులే కారణమని నమ్మేవాళ్లు ఎక్కువయ్యారు. కానీ, సరైన ఆధారాలు దొరకలేదు.
మొత్తానికి మూర్ మృతికి అసలు కారకులు ఎవరు? పొరుగువారైయ్యుండి ఎందుకు ఓరాని తప్పుదారి పట్టించారు? మూర్ బాడీని.. అతని తల్లి ఓరా కారులో ఎవరు పెట్టారు? ఇలా ఎన్నో ప్రశ్నలు నేటికీ మిస్టరీనే! – సంహిత నిమ్మన
Comments
Please login to add a commentAdd a comment